ఆ రహస్యం తరువాత చెబుతా!
ఇంటర్వ్యూ జైపాల్‌రెడ్డి
సోనియాను తెలంగాణకు ఒప్పించాను
ఎలాగన్నది ఎన్నికలయ్యాక చెబుతా
కేసీఆర్ విశ్వసనీయత అడుగంటింది
మోడీకి బలం తక్కువ, ఆర్భాటమెక్కువ
తెలంగాణ ఇచ్చేందుకు సోనియాగాంధీ మొదట్లో ఒప్పుకోలేదని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి చెప్పారు. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని ప్రకటించిన కేసీఆర్ మాట తప్పారని, ఆయన విశ్వసనీయత అడుగంటిందని వ్యాఖ్యానించారు. చాలాకాలం తర్వాత తిరిగి సొంత జిల్లా మహబూబ్‌నగర్ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న జైపాల్ ‘సాక్షి’తో ముచ్చటించారు. వివరాలు
ఆయన మాటల్లోనే..
సోనియాగాంధీ మొదట్లో తెలంగాణకు ఒప్పుకోలేదు. టీడీపీ, బీజేపీ, వైఎస్సార్‌సీపీ... ఇలా ఎన్నో పార్టీలు తెలంగాణకు అంగీకరించాయి. ‘కాంగ్రెస్ వాళ్లు బిల్లు పెట్టనీయండి, మేం మద్దతిస్తాం’ అంటూ వ్యంగ్యంగా, హేళనగా మాట్లాడాయి. దాంతో, సీమాంధ్ర నాయకులే అడుగుతున్నారు గనుక అంత సమస్య కాదేమోనని భావించి తెలంగాణ ఇచ్చేందుకు సోనియా ఒప్పేసుకున్నారు. కానీ వీళ్లంతా ఆ తర్వాత వెనుదిరిగారు. అయినా ఆమె అప్పటికే ముందడుగు వేశారు గనుక ధైర్యంతో, త్యాగ నిరతితో తెలంగాణ కోసమే నిలబడ్డారు. సోనియా పట్టుదల వల్లే తెలంగాణ సాధ్యమైంది.
ఆమె తెలంగాణకు అనుకూలంగా మారడంలో నేనొక సున్నితమైన, నిర్ణయాత్మకమైన పాత్ర పోషించా. అదేమిటో మొత్తం వివరించాలంటే కొన్ని రాజ్య రహస్యాలు వివరించాలి. వాటిని గోప్యంగా ఉంచడమే రాజ్యధర్మం. చట్టానికిచ్చే కనీస మర్యాదను ఉల్లంఘించకూడదు. కాబట్టి ఎన్నికల తర్వాత తాపీగా చెప్తాను. నేనిప్పుడే ఆ రహస్యం బయట పెడితే ప్రస్తుత ఎన్నికల్లో నాకు సొంత ప్రయోజనం ఎక్కువగానే ఉంటుంది. అయినా ఎన్నికల్లో ప్రయోజనాల కోసం కనీస మర్యాదలు ఉల్లంఘించి ఆ రహస్యాల్ని బయట పెట్టదలచుకోలేదు.
విశ్వసనీయుత లేని టీఆర్‌ఎస్
టీఆర్‌ఎస్‌కు తొలి నుంచీ విశ్వసనీయత తక్కువ. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందాక కేసీఆర్ ఆనంద పారవశ్యం లో మునిగితేలారు. ప్రధాని వున్మోహన్‌సింగ్, సోనియా, రాహుల్‌గాంధీ, దిగ్విజయ్‌సింగ్‌లతో పాటు నన్ను బిగ్ ఫైవ్‌లో పెట్టి కలిశారు. టీఆర్‌ఎస్‌ను బేషరతుగా కాంగ్రెస్‌లో కలిపేస్తానని అప్పుడు చెప్పారు. ఆయన నా దగ్గరకు వచ్చినప్పుడు ఇద్దరు సాక్షులు కూడా ఉన్నారు. వారిని కేసీఆరే వెంట తెచ్చుకున్నారు. కానీ హైదరాబాద్‌కు చేరగానే వైఖరి మార్చారు.
ఢిల్లీలో లే ని పరిజ్ఞానం హైదరాబాద్‌లో కలిగిందట. విడ్డూరం! ఆంక్షల్లేని, సంపూర్ణ తెలంగాణ ఇవ్వలేదని ఇప్పుడంటున్నారు. మరి కేసీఆర్ సోనియాను కలిసింది బిల్లు పాసయ్యాకే కదా! మొత్తంగా కేసీఆర్‌కు ప్రస్తుతం విశ్వసనీయత అడుగంటింది. ఆయన పట్ల విశ్వసనీయత కంటే కూడా గ్రామ స్థాయి గ్రూపుల వల్లే టీఆర్‌ఎస్ మనుగడ సాగిస్తోంది.
మోడీ నాయకుడు కాలేడు
టీడీపీ-బీజేపీ ఎన్నికల కూటమి సుహద్భావంతో, గట్టిగా పనిచేయడం లేదు. నరేంద్ర మోడీకి బలం తక్కువ, ప్రచార ఆర్భాటమెక్కువ. ప్రభావం తక్కువ. అందుకే ఎన్డీఏకు మెజారిటీ వస్తుందని గానీ, మోడీ నాయకుడవుతాడని గానీ నేననుకోను. కాంగ్రెస్‌కే మెజారిటీ వస్తుంది. తెలంగాణ బిల్లును ఆమోదించకుంటే తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు అసాధ్యమే అయ్యేది. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు వూ వెంటే ఉంటారు.
ఢిల్లీలో మార్గం చూపుతా
నేను తెలంగాణ ముఖ్యమంత్రి పదవి చేపడతానా, లేదా అన్నది కాల్పనిక ప్రశ్న. పార్టీలో నా కంటే చిన్నవాళ్లయినా, చాలామంది సమర్థులున్నారు. వారిలో ఒకరిని మా అధిష్టానం ఎంపిక చేస్తుంది. నేను ఢిల్లీలో ఉండి తెలంగాణ అభివృద్ధిపై మా నాయకత్వానికి మార్గం చూపుతాను. టికెట్ల కేటాయింపులో నా అసంతృప్తి అవాస్తవం. మేం సోనియా మాట వింటాం. మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మాత్రం ఒక అసెంబ్లీ స్థానానికి నేను ఒకరిని సూచిస్తే, అధిష్టానం మరొకరికిచ్చింది. అది కూడా నన్నడిగాకే. ప్రతి సీట్లోనూ నేను చెప్పిందే వినాలంటే అది ప్రాంతీయ పార్టీ అవుతుందే తప్ప జాతీయ పార్టీ అనిపించుకోదు.
ఇతరులను ఇబ్బంది పెట్టొద్దనే వలస
నేను 1999లో తిరిగి కాంగ్రెస్‌లో చేరా. అప్పటికే తెలంగాణలో బలమైన బీసీ నాయకుడు మల్లికార్జున్ మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా కూడా చే సిన ఆయనను తప్పించడం సరికాదని రెండుసార్లు మిర్యాలగూడ నుంచి పోటీ చేశా. 2009లో మరో బీసీ నాయకుడు విఠల్‌రావు మహబూబ్‌నగర్ సిటింగ్ ఎంపీగా ఉండటంతో కొత్తగా ఏర్పడ్డ చేవెళ్ల నుంచి లోక్‌సభకు వెళ్లా. సొంత జిల్లా నుంచి పోటీ చేయాలనే తాపత్రయంతోనే ఇప్పుడు పాలవుూరు వచ్చా.
ఎంపీగా కేసీఆర్ ఏం చేశారు?
కేసీఆర్ మహబూబ్‌నగర్ ఎంపీగా ఏం చేశారో చెప్పాలి. గతంలో మేం సిద్ధం చేసిన ప్రతిపాదనల వల్లే ఇక్కడి తాగునీటి, సాగునీటి ప్రాజెక్టులకు మోక్షం లభించింది. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంతో తెలంగాణ విషయమై నాకు మాటల్లేవు. రాబోయే ప్రభుత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తా. జైపాల్‌ను విమర్శిస్తే స్థాయి పెరుగుతుందని, పెద్దవాళ్లం అవుతామని కొందరు అనుకుంటున్నారు. 45 ఏళ్ల రాజకీయు జీవి తంలో నాకెప్పుడూ గ్రూపుల్లేవు. వర్గాలకు, ముఠాలకు అతీతుడిని. సిద్ధాంతవాదినే తప్ప రాద్ధాంతవాదిని కాను.