వాట్సాప్‌ విజేతలు | Some Women In Nellore Are Doing Business Through WhatsApp Very Fast | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ విజేతలు

Published Wed, Dec 18 2019 12:09 AM | Last Updated on Wed, Dec 18 2019 12:09 AM

Some Women In Nellore Are Doing Business Through WhatsApp Very Fast - Sakshi

వాట్సాప్‌లో దగ్గరివాళ్లంతా కలిసి ఒక గ్రూప్‌ క్రియేట్‌ చేసుకోవడం ఒక ఆత్మీయ బంధం. వాట్సాప్‌లో ఒక గ్రామం పేరుతో గ్రూప్‌ క్రియేట్‌ చేసుకుని అభివృద్ధి వివరాలను తెలియ చేసుకోవడం ఓ సామాజిక బంధం. అలాగే వాట్సాప్‌ను చక్కగా వినియోగించుకుని వ్యక్తిగత నైపుణ్యాలకు మార్కెటింగ్‌ కల్పించుకోవడం ఒక వ్యాపార బంధం. ఈ బంధంతో వ్యాపారవేత్తలుగా రాణిస్తున్న గృహిణులు ఎందరో ఉన్నారు. వారిలో కొందరి గురించి తెలుసుకుందాం. వారి నుంచి  స్ఫూర్తిని పొందుదాం.

నెల్లూరు పట్టణంలో చీరల షోరూమ్‌ నడుపుతున్న తుంగా భారతినే తీసుకోండి. ఆమె బిజినెస్‌ వాట్సాప్‌ ద్వారా చాలా వేగంగా జరిగిపోతోంది. ‘‘మొదట్లో నేను హాబీగా ఫ్రెండ్స్‌కు, బంధువులకు వాళ్లకు నప్పే విధంగా డ్రస్‌లు డిజైన్‌ చేయించి ఇచ్చేదాన్ని. నా పిల్లలు సెటిల్‌ అయిపోయిన తర్వాత రోజంతా ఖాళీ అనిపించేది. దాంతో రెండేళ్ల కిందట పూర్తి స్థాయిలో ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాను. ఇప్పుడు ‘విఆర్‌కే’ నుంచి ఫ్రాంచైజీ తీసుకున్నాను. నా కస్టమర్‌లు ఎక్కువమంది విదేశాల్లో ఉన్నారు. అందరం వాట్సాప్‌ గ్రూప్‌తో కనెక్ట్‌ అయి ఉన్నాం.

కొత్త స్టాక్‌ వచ్చినప్పుడు ఆ రోజే ఫొటోలు, వీడియోలు వాట్సాప్‌లో షేర్‌ చేస్తే, తెల్లవారి నిద్ర లేచేసరికి ఆర్డర్‌లు రెడీగా ఉంటాయి. వాళ్ల సందేహాలు కూడా. వాటన్నింటికీ ఓ గంటలో మా టీమ్‌ రిప్లయ్‌ ఇచ్చేస్తుంది. ఆర్డర్‌లుగా వచ్చిన చీరలకు వర్క్‌ బ్లవుజ్‌ కూడా రెడీ చేయించి సోమవారం కొరియర్‌ చేస్తే గురువారానికి అమెరికాకు చేరిపోతాయి. ఆ వీకెండ్‌ పార్టీకి కట్టేసుకుంటారు. మొత్తం టాస్క్‌ పది రోజుల నుంచి రెండు వారాల్లో పూర్తయిపోతుంది’’ అని చెప్పారు భారతి.

ఢిల్లీలో మరాఠా భోజనం
అభిలాష ఐదేళ్ల కిందట ఇంట్లో వంటలు చేసి ఢిల్లీలోని మరాఠీయులకు సప్లయ్‌ చేయడం మొదలు పెట్టాలనుకుంది. మెల్లిగా దాన్నే వ్యాపారంగా మలుచుకుంది. పెద్ద పెద్ద క్యూజిన్‌లు, కాంటినెంటల్‌ ఫుడ్‌ రెస్టారెంట్‌ల కాలంలో కూడా అభిలాష ఫుడ్‌ బిజినెస్‌ విస్తరించింది. వాట్సాప్‌ అనే లాంచింగ్‌ పాడ్‌ మీదనే తన వ్యాపారం సాగుతోందని చెప్పింది అభిలాష. ‘‘నేను గృహిణిగా ఉన్నప్పుడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండేదాన్ని. చాలా మంది మహిళలు ఏదో ఒక అభిరుచితో ఉండడాన్ని గమనించాను.

నేను ఖాళీగా రోజు గడిపేస్తున్నాననిపించింది. ఏదైనా చేద్దామంటే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు వంట చేయడం ఇష్టం. కాబట్టి తెలిసిన పని, ఇష్టమైన పనిలోనే ప్రవేశించాలనుకుని ఓ రోజు నా కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న వాళ్లందరికీ ‘సంప్రదాయ మార్వాడీ భోజనాన్ని వండుతాను’ అని మెసేజ్‌ పెట్టాను. ‘మాకు కావాలంటే మాక్కావాలంటూ..’ అని నేను ఊహించనంత రెస్పాన్స్‌ వచ్చింది. అలా మొదలైన నా భోజన వ్యాపారం ఇప్పుడు పది వాట్సాప్‌ గ్రూపులతో నడుస్తోంది. ఒక్కో గ్రూప్‌కి 250 మంది లెక్కన నా ఫుడ్‌ కస్టమర్లతో పది గ్రూపులున్నాయిప్పుడు. డెబ్బై శాతం వ్యాపారం వాట్సాప్‌ ఆర్డర్‌ల ద్వారానే సాగుతోంది. అన్నీ ‘టేక్‌ అవే’నే!

ఇలానే మరికొందరు
షబ్రి హోమ్‌ డెకోర్‌ ఉత్పత్తుల వ్యాపారం చేస్తున్న గుంజన్‌ది కూడా ఇదే బాట. ఫేస్‌బుక్, వాట్సాప్‌లోనే వ్యాపారం జరుగుతోంది. వాట్సాప్‌ ద్వారా కస్టమర్‌ ప్రశ్నలకు బదులిస్తూ వారిని సమాధానపరచడం ద్వారా నిశ్శబ్దంగా జరిగిపోతోందని చెప్తోంది గుంజన్‌. పన్నెండేళ్ల పాటు ముంబయిలో అడ్వరై్టజ్‌మెంట్‌ ఫర్మ్‌లో పని చేసిన ఆమె ఇతర ఉద్యోగాలకంటే ఇదే బాగుందని చెప్పింది. ‘యునిక్‌ త్రెడ్స్‌’ షణ్ముఖ ప్రియది కూడా వాట్సాప్‌ విజయమే. చంటి బిడ్డను చూసుకునే వాళ్లు లేక ఈ తమిళమ్మాయి ఉద్యోగం వదిలేయాల్సి వచ్చింది. జీవితాన్ని నిరుపయోగంగా గడుపుతున్నాననే భావన వేధించినంత కాలం వేధించిందామెను.

పాపాయి పెద్దయిన తర్వాత ముప్పై వేలతో మొదలైన వస్త్ర వ్యాపారం ఇప్పుడు పదహారు వాట్సాప్‌ గ్రూపులతో నడుస్తోంది. హైదరాబాద్‌లో ఉంటున్న ప్రీతి సిన్హా అయితే బిడ్డ పుట్టినప్పుడు తాను పెరిగిన బరువు తగ్గడానికి అనుసరించిన మార్గంలోనే వ్యాపారాన్ని ఎంచుకుంది. ‘గ్రీన్‌ అండ్‌ మోర్‌’ పేరుతో ఫుడ్‌ బిజినెస్‌ మొదలు పెట్టింది. బరువు తగ్గడానికి, శక్తి పెరగడానికి డాక్టర్లు సూచించిన ఆహారాన్ని కస్టమర్‌ ఆరోగ్యానికి తగినట్లు వండి సప్లయ్‌ చేస్తోందీమె. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంది. మీలోనూ ఏదో చేయాలన్న తపన ఉంది. భారతి, అభిలాష, ప్రియాంక, గుంజన్, షణ్ముఖ ప్రియ, ప్రీతీ సిన్హా.. ఆ తర్వాతి పేరు మీదే ఎందుకు కాకూడదు?  
– వాకా మంజులారెడ్డి

సరిహద్దు దాటిన కళ  ప్రియాంక తన వస్త్ర వ్యాపారాన్ని వాట్సప్‌ యుగానికి ముందే మొదలు పెట్టింది. గర్భిణిగా ఉన్నప్పుడు ఆమెకు పూర్తి బెడ్‌ రెస్ట్‌ అవసరమైంది. రోజంతా నాలుగ్గోడల మధ్య ఉంటూ, ఏ పనీ చేయకుండా గడపడం ఆమెకు దుర్భరంగా తోచింది. చదువుకునే రోజుల్లో హాబీగా నేర్చుకున్న ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌నే ప్రవృత్తిగా మార్చుకుంది. పిల్లలతో పాటే ఆమె వ్యాపారమూ ఎదిగింది. పెయింటింగ్‌ చేయడానికి అనువుగా చీరల ప్యాటర్న్‌లు చేనేతకారులకు ఇచ్చి మరీ తయారు చేయించేది. ఇందుకోసం తరచూ ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు వాట్సప్‌ ద్వారా ప్యాటర్న్‌లు పంపించడంతో శ్రమ తగ్గిపోయింది. సమయం, డబ్బు ఆదా అవుతున్నాయి. గుర్‌గావ్‌లోనే ఉంటూ బెంగాల్‌ నుంచి న్యూ జెర్సీ వరకు తన క్లయింట్లతోనూ, తనకు పని ఇస్తున్న చేనేతకారులతోనూ కాంటాక్ట్‌లో ఉంటోంది. షో రూమ్‌ ద్వారా జరిగే వ్యాపారం కంటే వాట్సప్‌ ఆర్డర్‌లు, విక్రయాలే ఎక్కువ అంటోంది ప్రియాంక.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement