ప్లాన్ | "It is not suicide ... murder ' | Sakshi
Sakshi News home page

‘ఇది ఆత్మహత్య కాదు... హత్య’

Published Sat, Nov 12 2016 11:04 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

ప్లాన్ - Sakshi

ప్లాన్

పట్టుకోండి చూద్దాం

జానకిరామయ్య కోటీశ్వరుడు. ఆయన ఒక్కగానొక్క కూతురు శృతి. కూతురిని పూలల్లో పెట్టి చూసుకుంటాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శృతి పెళ్లీడుకొచ్చిన తరువాత... జానకిరామయ్యలో అభద్రతలాంటిదేదో బయలుదేరింది. ‘శృతి అత్తవారింటికి వెళితే నా పరిస్థితి ఏమిటి? ఈ లంకంతా కొంప ఎంత బోసి పోతుంది!’ ఇలా ఏవేవో ఆలోచిస్తూ తనలో తాను బాధ పడుతుండేవాడు.

‘‘రోజు రోజుకూ మీరు చాదస్తంగా తయారవుతున్నారు. ఆడపిల్ల అన్నాక ఏదో ఒకరోజు అత్తావారింటికి వెళ్లాల్సిందే కదా. ఎందుకు ప్రాక్టికల్‌గా ఆలోచించరు?’’ అని జానకిరామయ్యను  మందలించింది భార్య అన్నపూర్ణ. నిజానికి జానకిరామయ్య సున్నిత మనస్కుడేమీ కాదు. వ్యాపారంలో  ఎన్నో ఆటు పోట్లు తట్టుకొని రాటు తేలాడు.  ‘ఇతని హృదయం  ఏ స్పందన లేని రాయి’ అని జానకిరామయ్యను ఉద్దేశించి చాలామంది అనేవాళ్లు.  అలాంటి జానకిరామయ్య కాస్త... కూతురు పుట్టాక మారిపోయాడు. బంధాలలోని తీయదనానికి అలవాటు పడ్డాడు. ఇరవై నాలుగు గంటలూ కూతురు గురించే ఆలోచించేవాడు.  కూతురు లేకుండా తాను బతకలేననుకొని...ఇల్లరికపు అల్లుని కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాడు.  ఈలోపే శృతి ఒక యువకుడిని ఇంటికి తీసుకువచ్చి తండ్రికి పరిచయం చేసింది. ‘‘డాడీ... ఈయన అభి. గత కొంత కాలంగా మేము ప్రేమించుకుంటున్నాము. మీరు ఆశీర్వదిస్తే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం’’ అంది  శృతి.

జానకిరామయ్య షాక్ అయ్యాడు... మాట్లాడుతుంది తన కూతురేనా? అని! ఎందుకంటే తన కళ్లకు... శృతి ఎప్పుడూ చిన్న పిల్లే!‘‘పెళ్లైన తరువాత శృతి, నువ్వు ఈ ఇంట్లోనే ఉంటే మంచిదనుకుంటున్నాను. నాకు కూడా అమ్మాయి తప్ప ఎవరూ లేరు కదా. నీకేమైన అభ్యంతరమా?’’ అభిని చూస్తూ అడిగాడు జానకిరామయ్య.‘‘సారీ అండీ... మా అమ్మానాన్నలకు నేనొక్కగానొక్క కొడుకును. నన్ను ఒక్కరోజు  చూడకుండా ఉండలేరు’’ అంటూనే  కొద్దిసేపట్లో  ప్లేటు ఫిరాయించి... ‘‘శృతి కోసం ఈ మాత్రం చేయలేనా? ఇక్కడే మీతో పాటు  ఉంటాను’’ అన్నాడు అభి. జానకిరామయ్యకు గాల్లో తేలి పోయినట్లు అనిపించింది.అభిని దేవుడే తన దగ్గరికి  పంపించాడు అనుకున్నాడు.

పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈలోపే ఒక వార్త జానకిరామయ్య గుండెలో గునపంలా గుచ్చుకుంది.అభి మోసగాడనే విషయం బయటపడింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. పెద్దింటి అమ్మాయిలను వలలో వేసుకొని మోసం చేయడం అతని అలవాటు. జానకిరామయ్య ఏ జన్మలో చేసుకున్న అదృష్టమోగానీ... అభి మోసగాడనే విషయం పెళ్లికి ముందే బయటపడింది.శృతి డిప్రెషన్‌లాంటి స్థితిలోకి వెళ్లిపోయింది.కూతురు పరిస్థితి చూసి తట్టుకోలేకపోయాడు జానకిరామయ్య. గాలి మార్పు కోసం భార్యాబిడ్డలను అమెరికాలోని అన్న కూతురి దగ్గరకు పంపాడు. రెండు మూడు నెలలు శృతి అక్కడ ఉంటే మళ్లీ మామూలు మనిషి అయిపోతుందనుకున్నాడు.

ఒకరోజు పోలిస్‌స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది.‘‘వాడు బెయిల్‌పై విడుదలయ్యాడు. మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి’’ అని జానకిరామయ్యకు జాగ్రత్తలు చెప్పాడు ఇన్‌స్పెక్టర్. జానకిరామయ్య ఇంట్లో శ్రీను అనే కుర్రాడు చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు. అతని పనితీరు, వినయం జానకిరామయ్యకు బాగా నచ్చాయి. శ్రీను అంటే గురి ఏర్పడింది.శ్రీను బయటికి వెళితే చాలు... తన యాజమాని భద్రతను దృష్టిలో పెట్టుకొని బయట తాళం వేసి వెళ్లేవాడు. అది శతృదుర్భేద్యమైన తాళం.

ఆరోజు కూడా...
‘‘మీరు పుస్తకం చదువుతూ ఉండండి. నేను కూరగాయలు తీసుకొనివస్తాను’’ అని బయట తాళం వేసి వెళ్లాడు. కొద్దిసేపటి తరువాత...‘‘మా అయ్యగారు తుపాకితో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు’’ అని గట్టిగా ఏడుస్తున్నాడు శ్రీను. కూతురి గురించి ఆలోచిస్తూ... మానసిక బాధతోనే జానకిరామయ్య ఆత్మహత్య చేసుకున్నాడనుకున్నారు అందరూ. అయితే... ఇన్‌స్పెక్టర్ నరసింహ మాత్రం ‘ఇది ఆత్మహత్య కాదు... హత్య’ అని ప్రకటించాడు. కిటికీలు లోపలి నుంచి వేసి ఉన్నాయి. బయట గట్టి తాళం వేసి ఉంది. ఏ రకంగా చూసినా... బయటి వ్యక్తి ఇంట్లోకి దూరి జానకిరామయ్యను హత్య చేసే ఛాన్సే లేదు. మరి ఆయన ఎలా హత్యకు గురయ్యాడు?

క్లూ: ఎడమవైపు కిటికీ ఫ్రేమ్ దగ్గర కొన్ని నీళ్లు కనిపించాయి.

శ్రీను హంతకుడు. శ్రీను ఇంట్లో నుంచి బయటికి వెళ్లే ముందు ఎడమ వైపు ఉన్న కిటికీని తెరిచి ఫ్రేమ్‌లో ఐస్‌క్యూబ్‌లను పెట్టి... కిటికీ ఓపెన్‌గా ఉండేలా చూసుకున్నాడు. బయట తాళం వేసి తెరిచిన కిటికీ నుంచి జానకిరామయ్యను షూట్ చేశాడు. కొద్దిసేపటి తరువాత... ఐసుముక్కలు కరిగి కిటికీ దానికదే క్లోజ్ అయిపోయింది. ఐస్ కరిగి నీళ్లు మిగిలాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement