కాంగ్రెస్‌ది గోబెల్స్ ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పనులు సీఎం కేసీఆర్ సొంత వ్యవహారమా అంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నోరు పారేసుకుంటున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రాణహితపై చర్చించడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని, అసెంబ్లీలో కూడా చర్చిస్తామని పేర్కొనారు. ప్రాణహిత-చేవెళ్ల పథకంపై గాంధీభవన్‌లో జరిగిన సదస్సులో కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై మంత్రి స్పందించారు. ఈమేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని ప్రభుత్వం రద్దు చేయలేదని, ఆదిలాబాద్ జిల్లాకు అక్కడి నుంచే నీరివ్వనున్నామని ప్రకటించినా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మేడిగడ్డ వద్ద మరో బ్యారే జీ అవసరం ఎందుకు కలిగిందో ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు వివరించిందని, ఆ వివరాలు కాంగ్రెస్ నేతలకు తెలియకపోవడం తమ తప్పుకాదన్నారు. గతంలో నీటిపారుదల మంత్రిగా పనిచేసిన సుదర్శన్‌రెడ్డి, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ పూర్తయిందని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. వాస్తవంగా ఇక్కడ ఒక్క ఎకరం భూసేకరణ జరగలేదన్నారు.
అన్ని రకాల అధ్యయనాలు జరిగాకే మేడిగడ్డ వద్ద మరో బ్యారేజీ నిర్మించాలని ప్రభుత్వం భావించిందని, సమగ్ర సర్వే జరిపిన తర్వాతే ముంపు, కాల్వల పొడవు, ఎంత కరె ంటు అవసరం.. తదితర వివరాలు తెలుస్తాయని అన్నారు. ఎవరో మిడిమిడి జ్ఞానంతో ఇచ్చిన సమాచారంతో మాట్లాడడం కాంగ్రెస్ నేతలకు విజ్ఞత అనిపించుకోదని మంత్రి హితవు పలికారు. తుమ్మిడిహెట్టి వద్ద అధిక విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని కొందరు పదే పదే అంటున్న విషయాల్ని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, సుదర్శన్‌రెడ్డి వంటి నేతలు నమ్మడం విచిత్రంగా ఉందన్నారు. ఇక్కడ 152 మీటర్ల వద్ద ఒక్క మెగావాట్ కరెంటుకు కూడా ప్రతిపాదనలు లేవని, మరి విద్యుత్ ఉత్పత్తి కోల్పోతున్నట్లు గోబెల్స్ ప్రచారం చేయడం ఎవరిని మోసం చేయడానికని ప్రశ్నించారు.
ముడుపులు బొక్కింది మీరు కాదా?
‘మహారాష్ట్ర ప్రభుత్వాన్ని 152 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌కు ఒప్పించలేక పోయిన వైఫల్యం మీది కాదా..? విభజన చట్టంలో ప్రాణహితకు జాతీయ హోదా ఇప్పించలేక పోయారు... పైగా పోలవరానికి జాతీయ హోదా కట్టబెడుతుంటే చేష్టలుడిగి చూస్తూ కూర్చుంది మీరు కాదా..? ప్రాజెక్టును సమస్యల వలయంలో పడేసి కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు బొక్కింది మీరు కాదా..’ అని మంత్రి హరీశ్ కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ బ్యారేజీలు, మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు కాలువ వివరాలు నిర్ధారణ అయ్యాక అసెంబ్లీ వేదికగా అన్ని వివరాలూ తెలియజేస్తామన్నారు.