రూ.80 కోట్ల ఆస్తిపై కన్ను!
అనర్హుల సిఫార్సుకు సర్కారు అంగీకారం
ఎయిడెడ్ కాలేజీ యాజమాన్య మార్పునకు పచ్చజెండా
హడావుడిగా సంతకాలు చేసిన మంత్రి, ముఖ్య కార్యదర్శి
రూ.10కోట్ల ముడుపులు చేతులు మారినట్టు ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో కర్మన్‌ఘాట్ సమీపంలోని చైతన్య జూనియర్ కాలేజీ (ఎయిడెడ్)కి చెందిన రూ.80 కోట్ల విలువైన ఆస్తులను కాజేసే కుట్రకు సర్కారు కళ్లు మూసుకుని పచ్చజెండా ఊపింది. స్పెషలాఫీసర్ అధీనంలో నడుస్తున్న కాలేజీని విద్యార్థుల సొమ్ము కాజేసి సస్పెండైన మేనేజ్‌మెంట్ సిఫార్సు ఆధారంగా మరో మేనేజ్‌మెంట్‌కు అప్పగించేందుకు అంగీకరించింది. ఒక మంత్రి, మరో ఐఏఎస్ అధికారి కీలక పాత్ర పోషించిన ఈ తతంగంలో రూ.10 కోట్ల దాకా చేతులు మారినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
1975లో ఏర్పా టైన ఈ కాలేజీకి 5.5 ఎకరాల స్థలం, ఆస్తులున్నాయి. 1981 నుంచి ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇస్తోంది. అయితే యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా ఆస్తులను 2001కి ముందు చార్మినార్ బ్యాంకులో రూ.99 లక్షలకు తనఖా పెట్టింది. పైగా రూ.4.95 లక్షల మేరకు విద్యార్థుల స్పెషల్ ఫీజులను, స్కాలర్‌షిప్‌లను దుర్వినియోగం చేసింది. మేనేజ్‌మెంట్, కరస్పాండెంట్ ఈ అవకతవకలకు పాల్పడటం నిజమేనని ఇంటర్ విద్యా శాఖ విచారణలో తేలడంతో వారిని సస్పెండ్ చేసి 2001లో స్పెషలాఫీసర్‌ను నియమించింది. ఇప్పటికీ కాలేజీ ఆయన అధీనంలోనే ఉంది. కేసు ఇంకా పరిష్కారం కాలేదు. అయినా సరే, ఆస్తులను ఎలాగైనా దక్కించుకునే ఆలోచనతో కాలేజీని మరో యాజమాన్యానికి అప్పగించాలంటూ పాత మేనేజ్‌మెంట్ తీర్మానం చేసి సర్కారును ఆశ్రయించింది. అది కూడదని ఇంటర్ విద్యా కమిషనర్ స్పష్టం చేశారు. ‘‘విద్యార్థుల సొమ్ము దుర్వినియోగం వ్యవహారం ఇంకా పరిష్కారం కాలేదు.
మేనేజ్‌మెంట్, కరస్పాండెంట్ సస్పెన్షన్‌లో ఉన్నారు. విద్యా చట్టం-1982 ప్రకారం సస్పెండైన మేనేజ్‌మెంట్‌కు ఎలాంటి అధికారమూ ఉండదు. అది సర్వసభ్య సమావేశం పెట్టినా, మరో మేనేజ్‌మెంట్‌ను ఎన్నుకుంటూ తీర్మానం చేసినా చెల్లదు’’ అంటూ ప్రభుత్వానికి ఆయన నివేదించారు. అయినా సర్కారు పట్టించుకోలేదు. స్పెషలాఫీసర్ పాలనను తొలగించి కొత్త మేనేజ్‌మెంట్‌కు బాధ్యతలు అప్పగించాలంటూ ఫిబ్రవరి 21న మెమో (నంబరు 14381/ఐఈ.2-2/2012) జారీ చేసింది!