సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కిడ్నాప్... దారుణ హత్య
అనుమానాస్పద స్థితిలో 35 రోజుల క్రితం నాచారం పోలీసు స్టేషన్ పరిధిలో అదృశ్యమైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఒకరు దారుణ హత్యకు గురైనట్లు ఆలస్యంగా వెలుగు చూసింది. నిందితులు పోలీసులకు చిక్కడంతో హతుడి మృతదేహాన్ని పోలీసులు అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలో స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ వ్యవహార నేపథ్యంలో ప్రియురాలి కుటుంబ సభ్యులే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. నాచారం పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉ న్నాయి.
మల్లాపూర్ కెఎల్ రెడ్డినగర్‌కు చెందిన రత్నేష్ మిశ్రా(22) హైటెక్ సిటీలో రహేజా కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అదే సంస్థలో పనిచేస్తున్న తోటి మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను ప్రేమించాడు. ఇద్దరు సన్నిహితంగా ఉండేవారు. ఈ క్రమంలోనే రత్నేష్ తన స్నేహితుడితో కూడా సన్నిహితంగా ఉండాలని కోర గా ఆమె అంగీకరించింది. ఆ తరువాత తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి రత్నేష్‌పై ఒత్తిడి తెచ్చింది. ఇద్దరితో ప్రేమ వ్యవహారం ఉన్నందున పెళ్లి చేసుకోవడం కుదరదని రత్నేష్ చెప్పాడు. దీంతో మొత్తం విషయం ఆమె తన సోదరుడికి చెప్పింది.
పథకం ప్రకారమే హత్య
ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన ఆమె సోదరుడు రత్నేష్‌ను చంపాలని పథకం పన్నా డు. ఈ క్రమంలోనే తన స్నేహితులైన వినోద్, ఆకాశ్‌లను ఇందుకు పురమాయించాడు. ముగ్గురూ కలిసి హత్యకు పథకం పన్నారు. ఏప్రిల్ 25న ముగ్గురు మద్యం సేవించి హత్య చేసేందుకు ఏకంగా రత్నేష్ ఇంటికే వెళ్లారు. అయితే అప్పటికే రత్నేష్ జాబ్‌కు వెళ్లడంతో వారి పథకం నెరవేరలేదు. మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకు రత్నేష్‌కు వినోద్ ఫో న్ చేసి నాచారం వద్దకు రమ్మనడంతో అతను వచ్చాడు. అనంతరం వినోద్ బైక్‌పై రత్నేష్‌ను ఓ ప్రదేశంలోకి తీసుకెళ్లి అందరూ కలిసి మద్యం సేవించారు. ఆ తరువాత రత్నేష్‌ను అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలోని కౌకూర్ ముళ్ల పొదల వద్దకు తీసుకెళ్లి బండరాయితో మోది చంపారు. ఆ తరువాత లారీ టైర్లతో అతని మృతదేహాన్ని పూర్తిగా కాల్చారు.
పట్టుబడ్డ నిందితులు
ఏమి తెలియనట్లుగానే నిందితులు తమ పనిలో మునిగిపోయారు. అయితే తన కుమారుడు అదృశ్యమయ్యాడని రత్నేష్ తండ్రి ఫిర్యాదు చేయడంతో నాచారం ఎస్‌ఐ రవి మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. తన కుమారుడికి ప్రేమ వ్యవహ రం ఉందని తండ్రి ఇచ్చిన చిన్న క్లూ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా రత్నేష్ హత్య గుట్టు రట్టయ్యింది. నిందితులను బుధవారం రిమాండ్‌కు తరలించే అవకాశాలు ఉన్నాయి. రత్నేష్ మృతదేహాన్ని గుర్తించేందుకు వారి కుటుంబ సభ్యులకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తామని పోలీసులు అంటున్నారు.