ఎదురులేని ట్రంప్.. దూసుకుపోతున్న హిల్లరీ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచే దిశగా డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. వరుసగా సౌత్ కరోలినాలోనూ ఆయన భారీవిజయం సాధించారు. శనివారం జరిగిన సౌత్ కరోలినా ప్రైమరీలో గెలుపొందిన ట్రంప్.. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ దాదాపు సాధించినట్టు భావిస్తున్నారు. మొదటినుంచి రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందంజలో ఉన్న ట్రంప్.. సౌత్ కరోలినాలోనూ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇన్నాళ్లు బుష్ కుటుంబానికి గట్టి పట్టున్న ఈ రాష్ట్రంలోనూ ట్రంప్ భారీ ఆధిక్యం సాధించడంతో జేబ్ బుష్ రిపబ్లికన్ రేసు నుంచి తప్పుకొన్నారు.
నెవెడాలో క్లింటన్ హవా
డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి రేసులో గట్టిపోటీ ఎదుర్కొంటున్న హిల్లరీ క్లింటన్ నెవెడా ప్రైమరీలో విజయం సాధించారు. న్యూ హ్యాంప్‌షైర్ ప్రైమరీలో ప్రత్యర్థి బెర్నీ సాండర్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన ఆమె.. ఎంతో కీలకమైన నెవెడాలో గెలుపు ద్వారా తిరిగి రేసులోకి వచ్చారు. త్వరలో జరుగనున్న సౌత్ కరోలినా ప్రైమరీలోనూ హిల్లరీదే విజయమని విశ్లేషకులు భావిస్తున్నారు. నెవెడాలో విజయంతో ప్రత్యర్థులు బెర్నీ సాండర్స్, వెర్మంట్ సేన్ లపై పైచేయి సాధించిన హిల్లరీ సౌత్ కరోలినాలో విజయం సాధిస్తే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిత్వాన్ని ఆమె సొంతం చేసుకునే అవకాశముంది. అదే జరిగితే.. ఇటు డెమొక్రటిక్ పార్టీ నుంచి హిల్లరీ, అటు రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ అగ్రరాజ్యం అధ్యక్ష పదవి కోసం పోటీపడే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.