ఇక ముందూ ఎండల మంటలు
హమ్మయ్యా.. ఈ ఏడాది వేసవి గడిచిపోయిందని నిశ్చింతగా ఉన్నారా? ఈసారికి అయిపోయిందిగానీ వచ్చే ఏడాది మరింత మంటెక్కించనుంది. ఆ తర్వాత మరింత ఘోరంగా ఉండనుంది. వచ్చే 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో భానుడు భగభగ మండిపోనున్నాడని అమెరికా నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ (ఎన్‌సీఏఆర్) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని బౌల్డర్ కొలరాడోలో ఉన్న ఈ కేంద్రం భూతాపోన్నతి కారణంగా వస్తున్న వాతావరణ మార్పులపై ఒక అధ్యయనం చేపట్టింది. అందుబాటులో ఉన్న రెండు రకాల కంప్యూటర్ సిమ్యులేషన్ల ద్వారా భూమి వేడెక్కె అంశంపై పరిశోధన చేసింది.
శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం ఇప్పుడు ఉన్నట్టుగానే కొనసాగితే 2061-80 మధ్యకాలంలో అత్యధిక వేసవి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. కార్బన్‌డయాక్సైడ్ వంటి విష వాయువుల విడుదలను గణనీయంగా తగ్గిస్తే మాత్రం పరిస్థితి కొంత మెరుగు కావచ్చని అభిప్రాయపడింది. వేసవి ఎండలు తెచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావని.. అటు పంటలతోపాటు మానవ ఆరోగ్యంపై కూడా దుష్ర్పభావం ఉంటుందని ఎన్‌సీఏఆర్ శాస్త్రవేత్త ఫ్లావియో లెహ్‌నర్ అంటున్నారు.