పిస్టోరియస్‌కు బెయిల్ మంజూరు
బ్లూమ్‌ఫోంటేన్: దక్షిణాఫ్రికా బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్‌కు కోర్టులో ఊరట లభించింది. పిస్టోరియస్ దేశం విడిచిపోకుండా ఉంటాడన్న అతని తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవించిన జడ్జి లెడ్వాబా 500 యూరోల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేశారు. ఎలక్ట్రికల్ టాగ్ను అతనికి అమర్చి ఇంటికి 20 కిలో మీటర్లో దూరంలో మాత్రమే వెళ్లే అవకాశం కల్పించారు. అతని పాస్ పోర్టును కూడా స్వాధీనం చేకసుకోవాలని కోర్టు సూచించింది.
అయితే పిస్టోరియస్ను దోషిగా తేలుస్తూ సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును కాన్సిట్యూషనల్ కోర్టులో అప్పీల్ చేయనున్నట్టు అతని తరఫు న్యాయవాది తెలిపారు. పిస్టోరియస్ ఉద్దేశపూర్వకంగానే తన ప్రియురాలు రీవా స్టీన్‌కాంప్‌ను హత్య చేసినట్టుగా ఆదేశ సుప్రీం కోర్టు తేల్చింది. బాత్‌రూమ్‌లో తలుపు వెనకాల స్టీన్‌కాంప్ కానీ ఆగంతకుడు కానీ ఎవరున్నా తుపాకీతో కాల్చితే కచ్చితంగా మరణిస్తారని పిస్టోరియస్‌కు తెలుసని జడ్జి అభిప్రాయపడ్డారు. అతడికి తొలుత స్థానిక కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష మాత్రమే విధించిన విషయం తెలిసిందే. అయితే ఆ తీర్పు దోషపూరితంగా ఉందని, అతడికి కఠిన శిక్ష వేయాల్సిందేనని స్పష్టం చేస్తూ కేసును ట్రయల్ కోర్టుకు తిప్పి పంపింది. దీంతో 15 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశాలుండటంతో పిస్టోరియస్ తిరిగి సుప్రీం కోర్టు తీర్పును సవాలు చేస్తూ కాన్సిట్యూషనల్ కోర్టులో అప్పీల్ చేయనున్నాడు.
స్థానిక కోర్టు విధించిన జైలు శిక్షలో ఏడాది కాలం పూర్తి చేసుకున్న తను అక్టోబర్‌లో పెరోల్‌పై విడుదలై గృహ నిర్భందంలో ఉండేందుకు కోర్టు అనుమతించింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఆస్కార్‌కు కఠిన శిక్ష పడలేదని గట్టిగా నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో కేసును సుప్రీం కోర్టు తిరిగి విచారించి కఠిన శిక్ష విధించాలని తెలిపింది.