- తక్షణమే దృష్టి పెట్టాల్సిన 7 ప్రధాన సవాళ్లు
- వీటి పరిష్కారం ఆప్ తక్షణ లక్ష్యం
- విద్యుత్, తాగునీరు, మహిళల భద్రత కీలకం
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి 54% ఓట్లు, 95% సీట్లు ఇచ్చారు. ఈ భారీ అభిమానం వెనుక వారి చిన్నచిన్న ఆశలు, పెద్దపెద్ద సమస్యలు అనేకం ఉన్నాయి. వాటిని తీర్చాల్సిన బాధ్యత ఫిబ్రవరి 14న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేజ్రీవాల్‌పై ఉంది. పరిమిత అధికారాలున్న ఢిల్లీ సీఎంగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కేజ్రీవాల్‌కు కత్తిమీద సామే. అసెంబ్లీ ఎన్నికల్లో తాను మట్టికరిపించిన కేంద్రంతో సయోధ్య చేసుకుని ఎన్నికల హామీలను నెరవేర్చడం ఈయన ముందున్న ప్రధాన లక్ష్యం. ఈనేపథ్యంలో ఢిల్లీలోని ప్రధాన సమస్యలపై కథనం.
ఆ(నా)రోగ్య రంగం
దేశ రాజధానిలో నివసిస్తున్న ప్రజల్లో దాదాపు 60% మంది సగటు నెలవారీ సంపాదన కేవలం రూ.13,500. ఇది నిత్యావసర ఖర్చులకే సరిపోదు. అకస్మాత్తుగా వచ్చే ఆరోగ్య సమస్యలకు ఖరీదైన కార్పొరేట్ వైద్యం పొందడం వారికి గగన కుసుమం. ప్రభుత్వ ఆసుపత్రులే వారికి దిక్కు. కానీ అధికారిక గణాంకాల ప్రకారం ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్స్ సంఖ్య గత మూడేళ్లలో 8% తగ్గింది. కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏకంగా 47% తగ్గింది. ప్రమాణాల పరంగానూ ఆ ఆసుపత్రుల్లో అందుతున్న సేవలు నాసిరకమే. అందువల్ల, కేజ్రీవాల్ మొట్టమొదట ఢిల్లీలోని ప్రభుత్వ ఆరోగ్యరంగానికి అత్యవసర చికిత్స చేయాల్సిన అవసరం ఉంది.
కాలుష్య కాసారం
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరిత నగరంగా ఢిల్లీ (అప)ఖ్యాతి మూటగట్టుకుంది. ఓటర్లపై ఇది ప్రత్యక్ష ప్రభావం చూపనప్పటకీ.. కాలక్రమేణా వారి ఆరోగ్యంపై భారీ ప్రభావమే చూపుతుంది. పెరుగుతున్న జనాభా, భారీగా పెరుగుతున్న వాహనాల సంఖ్య, హానికారక కాలుష్యాన్ని పెంచే ఉపకరణాల వినియోగంలో పెరుగుదల.. ఇవన్నీ ఢిల్లీని కాలుష్య కాసారంగా మారుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజా రవాణాను మరింత మెరుగుపర్చడం, కాలుష్య కారకాలను నియంత్రించడం తదితర కార్యక్రమాలతో దేశ రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అలాగే, ట్రాఫిక్ సమస్యకూ పరిష్కారం వెతకాల్సి ఉంది.
(అ)విద్య
గత ఐదేళ్లలో ఢిల్లీలో పెరిగిన ప్రభుత్వ పాఠశాలల సంఖ్య కేవలం 8%. అక్కడి బోధన నాణ్యత కూడా అంతంతమాత్రమే. కేజ్రీవాల్‌ను నమ్ముకున్న సామాన్యుల పిల్లల్లో చాలామంది చదువుకునేది ఆ స్కూళ్లలోనే. దేశ రాజధానిలోని పాఠశాలలే అయినా, వేరే రాష్ట్రాల్లోని కుగ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న విద్యానాణ్యతతో అవి పోటీ పడుతుంటాయి. భవిష్యత్ తరాల మెరుగైన భవిత కోసం విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాల్సి ఉంది.
నిరుద్యోగం
నిరుద్యోగం ఢిల్లీని వేధిస్తున్న మరో కీలక సమస్య. గత ఆరేళ్లలో ఇక్కడి మహిళల్లో నిరుద్యోగం రెట్టింపైంది. ఉపాధి నమోదు కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకుంటున్నవారి సంఖ్య 2009లో 93 వేలుండగా, అది 2013 నాటికి 71% పెరిగి 1.59 లక్షలకు చేరింది. ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్‌ల్లో రిజిస్టర్ చేసుకోని వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. మరిన్ని ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడం కేజ్రీవాల్ ముందున్న కీలక సవాలు.
ప్రజలకు సహనం తక్కువ అన్నది ఈ ఎన్నికలతో తేటతెల్లమైంది. అందువల్ల కీలక సమస్యల పరిష్కారానికి కేజ్రీవాల్ తక్షణమే నడుం బిగించాల్సి ఉంది. అలాగే, కేంద్రంలో గత 8 నెలల బీజేపీ పాలనలో క్షేత్రస్థాయి ప్రయోజనాలేం ప్రజలకు అందకపోవడం బీజేపీని దారుణంగా దెబ్బతీసిన విషయం కేజ్రీవాల్ అనుక్షణం గుర్తుంచుకోవాలి.
విద్యుత్ మోత
విద్యుత్ వినియోగంలోనూ, కరెంటు చార్జీల్లోనూ ఢిల్లీ ముందు వరుసలో ఉంది. వివిధ వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీలో విద్యుత్ వినియోగం ఎక్కువ. అలాగే, దేశవ్యాప్తంగా చూస్తే కరెంటు చార్జీలు ఢిల్లీలోనే అత్యధికం. మొత్తం వినియోగంలో దాదాపు 86% కరెంటును ఢిల్లీలోని విద్యుత్ సరఫరా సంస్థలు బయటి రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయడం అందుకు ప్రధాన కారణం. విద్యుత్ చార్జీల తగ్గింపును మేనిఫెస్టోలోనే పేర్కొన్న కేజ్రీవాల్ ఆ దిశగా తక్షణమే చర్యలు తీసుకోవాల్సి ఉంది.
నీటి కటకట
ఇటీవలి ఎన్నికల ప్రచారంలో తాగునీరు ఒక ప్రధానాంశం. గతంలో 49 రోజలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ కేజ్రీవాల్ ఈ సమస్యపై ప్రధానంగా దృష్టి పెట్టి, ప్రతీ ఇంటికీ ఉచితంగా తాగునీరందించేందుకు ప్రయత్నించారు. ఢిల్లీలో ప్రతీ వ్యక్తికి సగటున అందుతున్న నీరు కేవలం 3.82 లీటర్లు మాత్రమే. దీన్నిబట్టి దేశ రాజధానిలో నీటి కటకటను అర్థం చేసుకోవచ్చు. అలాగే, పైపుల ద్వారా సురక్షిత నీటి సరఫరా సదుపాయం నగరంలోని దాదాపు 32 లక్షల మందికి లేదు. మరోసారి కేజ్రీవాల్ దృష్టి సారించాల్సిన సమస్య ఇది.
(అ)భద్రత
మహిళలపై అత్యాచారాలకు, అఘాయిత్యాలకు ఢిల్లీ నెలవైంది. మహిళల భద్రత విషయానికి వస్తే ఢిల్లీ అత్యంత ప్రమాదకర నగరమని పలు సర్వేల్లో తేలింది. మహిళలపై నేరాల సంఖ్య ఇక్కడ ప్రతీ లక్ష మందికి 147గా ఉంది. వీధులు, బస్టాండ్‌లు, గృహాలు, టాక్సీలు, బస్సులు, కార్యాలయాలు.. అన్నీ మహిళలపై అఘాయిత్యాలకు వేదికలుగానే నిలుస్తున్నాయి. ఈ పరిస్థితిని మార్చి, దేశ రాజధానిని మహిళలకు సురక్షిత ప్రదేశంగా తీర్చిదిద్దాల్సిన బృహత్తర బాధ్యత కొత్త సీఎంపై ఉంది.