ఆ బిల్లు ‘రియాలిటీ’ ఏమిటి?
- స్థిరాస్తి బిల్లుపై రాహుల్ ఆందోళన.. కేవలం రాజకీయమేనా?
- యూపీఏ తెచ్చిన బిల్లుకు ఎన్‌డీఏ సర్కారు సవరణలు సరైనవేనా?
న్యూఢిల్లీ: ఎన్‌డీఏ సర్కారు తీసుకువచ్చిన స్థిరాస్తి (రియల్ ఎస్టేట్) బిల్లు కొనుగోలుదారుడి కన్నా నిర్మాణదారుడికే (బిల్డర్‌కే) ప్రయోజనం కలిగిస్తుందంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. మధ్య తరగతి పట్టణ గృహ కొనుగోలుదారు కష్టాలకు సంబంధించిన అంశాన్ని రాజకీయ అస్త్రంగా మలచుకున్నారు.
యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులో పారదర్శకత నిబంధనలను తొలగించిందని.. మధ్యతరగతి ప్రజలు దోపిడీకి గురయ్యేందుకు అవకాశం కల్పిస్తోందని ఆరోపించారు. లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లును ఈ నెల 5వ తేదీన రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించగా.. బిల్లును రాజ్యసభ ఎంపిక కమిటీ పరిశీలనకు పంపించాలని విపక్షాలు పట్టుపట్టటం.. ప్రభుత్వం అందుకు అంగీకరించి ఆ కమిటీకి పంపించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థిరాస్తి బిల్లులోని అంశాలు, బీజేపీ చేసిన సవరణలు, వాటిపై ఆందోళనలు, రాజకీయాల వివరాలివీ...
బిల్లు ఏమిటి..? ఏం చేస్తుంది..?
ప్రతి రాష్ట్రంలో నియంత్రణ సంస్థలను నెలకొల్పటం ద్వారా స్థిరాస్తి ప్రాజెక్టులను పర్యవేక్షించటం లక్ష్యంగా స్థిరాస్తి (నియంత్రణ, అభివృద్ధి) బిల్లును యూపీఏ ప్రభుత్వం 2013 ఆగస్టు 14న రాజ్యసభలో ప్రవేశపెట్టింది. బిల్డర్లు వినియోగదారులతో లావాదేవీలు జరిపేటపుడు నిర్దిష్ట ప్రమాణీకృత నిబంధనలను పాటించేలా చూడటం ఈ సంస్థల లక్ష్యం. తొలి బిల్లు లోని కొన్ని ముఖ్య నిబంధనలివీ...
- స్థిరాస్తి ప్రాజెక్టులను నియంత్రణ సంస్థ వద్ద రిజిస్టరు చేయాలి. లేదంటే బిల్డర్లు స్థిరాస్తులను విక్రయించజాలరు.
- బిల్డర్లు ప్రాజెక్టు లేఔట్ ప్రణాళిక, షెడ్యూలు, విస్తీర్ణం వివరాలను నియంత్రణ సంస్థకు వెల్లడించాలి.
- కొనుగోలుదార్ల నుంచి వసూలు చేసిన మొత్తంలో కొంత శాతాన్ని ప్రత్యేక బ్యాంకు ఖాతాలో ఉంచి.. దానిని కేవలం నిర్మాణానికి మాత్రమే వినియోగించాలి. యూపీఏ ప్రభుత్వం దీనిని 70 శాతంగా నిర్ణయించింది. ఇది.. బిల్డర్లు ఒక ప్రాజెక్టు పేరుతో డబ్బు తీసుకుని, ఆ మొత్తాన్ని వేరొక ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టటాన్ని నిరోధిస్తుంది. రాష్ట్రాలు కావాలనుకుంటే దీనిని తగ్గించుకోవచ్చని పేర్కొంది.
ఈ బిల్లు ఎందుకు అవసరమైంది..?
జనం తమ డబ్బును పెట్టుబడులుగా పెడుతున్న ప్రధాన రంగం స్థిరాస్తి రంగం. నిజానికి దేశంలో నల్లధనం వినియోగించటానికి ఈ రంగం తేలికైనది, అతి పెద్దది కూడా. అయినా స్థిరాస్తి రంగంపై నియంత్రణ లేదు. అధిక విలువ గల ఆస్తుల కన్నా.. అతి చిన్న పెట్టుబడి రంగాలైన కంపెనీల్లో షేర్లు, బీమా వంటి రంగాలపై ప్రభుత్వ నియంత్రణ ఎక్కువగా ఉంటుంది.
దేశంలో కోట్ల రూపాయల విలువ గల స్థిరాస్తిని కొనుగోలు చేయటం కన్నా.. బ్యాంకులో పొదుపు ఖాతా ప్రారంభించటానికి ఎక్కువ పత్రాలు, వివరాల నమోదు అవసరమవుతాయని నిపుణులు చెప్తున్నారు. స్థిరాస్తి కొనుగోలుకు నేరుగా డబ్బు చెల్లించేటపుడు పర్యవేక్షణా ఉండదు. నల్లధనం ఉన్నవారికి ఈ పెట్టుబడులు ప్రయోజనం. కానీ.. మధ్యతరగతి వేతన జీవిని.. నియంత్రణ లేని రంగంతో వ్యవహరించటం దెబ్బతీస్తోంది.
ఎన్‌డీఏ చేసిన సవరణలు ఏమిటి?
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎన్‌డీఏ ప్రభుత్వం ఈ స్థిరాస్తి బిల్లుకు ఏకంగా 118 సవరణలు చేసింది. ఈ సవరణల్లో సమస్యాత్మకమైనవి...
- ప్రబ్యాంకు ఖాతాలో ఉంచి, నిర్మాణ ఖర్చుకు మాత్రమే వినియోగించటానికి పక్కన పెట్టాల్సిన కొనుగోలుదారుడి సొమ్ము శాతాన్ని 70 శాతం నుంచి 50 శాతానికి తగ్గించారు.
- తొలి బిల్లులో ‘కార్పెట్ ఏరియా’కు స్పష్టమైన నిర్వచనం ఉంది. బీజేపీ తెచ్చిన బిల్లులో ‘కార్పెట్ ఏరియా’ నిర్వచనాన్ని.. జాతీయ నిర్మాణ నియమావళి (నేషనల్ బిల్డింగ్ కోడ్)లో ఉపయోగించిన విధంగా ‘రెంటబుల్ ఏరియా’ నిర్వచనంగా చూపారు. ఈ నియమావళిని ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టకుండానే సవరించవచ్చు. దీనివల్ల.. ఆ తర్వాత కొనుగోలుదారుడికి వ్యతిరేకంగా ఉండేలా త్వరగా మార్పులు చేయటానికి అవకాశం ఉంటుంది.
- తొలి బిల్లులోని నిబంధనల ప్రకారం.. బిల్డరు ప్రాజెక్టు ప్రణాళికకు నియంత్రణ సంస్థ నుంచి అనుమతి పొందిన తర్వాత దానిని మార్చటానికి అవకాశం లేదు. కొత్త బిల్లు.. బిల్డరు ప్రాజెక్టు ప్లాన్‌కు ‘స్వల్ప మార్పులు’ చేసుకోవటానికి అవకాశం అందిస్తోంది.
- ఆలస్యమైన ప్రాజెక్టులు.. ‘పూర్తయినట్లు ధృవీకరణ పత్రం, అనుమతులు’ తదితర కారణాల వల్ల ఆలస్యమైనట్లయితే శిక్ష నుంచి తప్పించుకునేందుకు కొత్త బిల్లు అవకాశమిస్తోంది.