రాజధానిపై నిజాలు చెప్పండి | Tell the facts on capital | Sakshi
Sakshi News home page

రాజధానిపై నిజాలు చెప్పండి

Published Wed, Nov 2 2016 1:14 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

రాజధానిపై నిజాలు చెప్పండి - Sakshi

రాజధానిపై నిజాలు చెప్పండి

రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశం
- నిజాలు దాయాలని చూస్తే అన్నిటిపైనా విచారణ
- రైతులకు జీవనోపాధి ఏం కల్పించారు...
- కొండవీటి వాగు ప్రవాహదిశ  మార్చడం ఎందుకు?
- అది పర్యావరణ అనుమతులను ఉల్లంఘించడం కాదా?
- వరద ముంపు ఉన్న లింగాయపాలెంలో రోడ్డు నిర్మాణాలేమిటి?
- ఇష్టానుసారంగా చేస్తే ప్రణాళిక తలకిందులవుతుంది..
- రాజధానికి సంబంధించి అన్ని వివరాలనూ మా ముందు ఉంచండి
 
 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ భూముల్లో రాజధాని నిర్మాణాన్ని చేపడుతుండటం స్పష్టంగా తెలుస్తోంది. రైతుల జీవనోపాధి అయిన వ్యవసాయ భూమిని తీసుకొని వారికి ఏ విధంగా జీవనోపాధిని కల్పిస్తున్నారు? నష్టపరిహారం ఎలా చెల్లిస్తున్నారు? పర్యావరణ అనుమతులను ఉల్లంఘిస్తూ కొండవీటి వాగు ప్రవాహ దిశ మార్పునకు చేపడుతున్న చర్యలు.. వరదముంపు ఉన్న లింగాయపాలెంలో రోడ్డు నిర్మాణాలు.. దేనికి సంకేతం? రాజధాని నిర్మాణం విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే.. ప్రణాళిక తలకిందులు అవుతుంది.. తరువాత మేం ఏం చేయగలమో అది చేస్తాం.. రాజధాని నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అన్ని చర్యలను మా ముందు ఉంచాలి.. నిజాలను దాయాలని చూస్తే ఇతర అన్ని విషయాలపై విచారణ జరపాల్సి వస్తుంది..
     - జాతీయ హరిత ట్రిబ్యునల్
 
 సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ - ఎన్జీటీ)లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని నిర్మాణాలకు సంబంధించి తీసుకుంటున్న అన్ని చర్యలను, స్పష్టమైన వివరాలను తమ ముందు ఉంచాలని, నిజాలను దాచాలని చూస్తే అన్ని విషయాలపైనా తాము విచారణ జరపాల్సి ఉంటుందని ఎన్జీటీ హెచ్చరించింది. వరద ముంపు ప్రాంతంలో పర్యావరణ అనుమతులను ఉల్లంఘిస్త్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందంటూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం జరిగిన వాదనల నేపథ్యంలో ఎన్జీటీ ఈ విధంగా స్పందించింది. రాజధాని ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ ఎన్జీటీలో దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది.

 అధికారం చేతిలో ఉంది కదా అని...
 పర్యాటక అభివృద్ధి పేరిట రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులను ఉల్లంఘిస్తూ ద్వీపాల్లో వాణిజ్య నిర్మాణాలు చేపడుతోందని, అలాగే వరద ముంపు ప్రాంతమైన గుంటూరు జిల్లా లింగాయపాలెంలో రోడ్డు నిర్మాణాలను ప్రారంభించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది సంజయ్ పరీఖ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ధర్మాసనం వివరణ కోరగా రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది గుంటూరు ప్రమోద్ స్పందిస్తూ .. ‘వారసత్వ సంపద అభివృద్ధి, వినోదం, పర్యాటక రంగంలో మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఎలాంటి నివాస సంబంధ నిర్మాణాలు చేపట్టడం లేదు..’ అని వివరణ ఇచ్చారు. దానిపై పిటిషనర్ తరపు న్యాయవాది స్పందిస్తూ ‘రాష్ట్ర ప్రభుత్వం కేవలం అధికారం ఉంది కదా అని సహజ వనరుల ధ్వంసానికి పాల్పడుతోంది.

కొండవీటి వాగుకు వరదలొస్తే ప్రతిపాదిత రాజధాని ప్రాంతలోని 10,600 ఎకరాల విస్తీర్ణంలో ప్రభావం ఉంటుందని తెలిసినప్పటికీ.. వాగు ప్రవాహ దిశను మార్చడానికి ప్రయత్నాలు చేస్తోంది..’ అని వివరించారు. వాగు ప్రవాహ దిశను మార్చడం వల్ల నీటి ప్రవాహం ఎక్కువైనప్పుడు ప్రవాహ వేగంపై ఒత్తిడి పెరిగి వరదలు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. కొండవీటి వాగు భారీ పరీవాహక ప్రాంతాన్ని కలిగి ఉందని, దీని వల్ల తరచుగా వచ్చే వర్షాల వల్ల వరద ముంపు ఎక్కువగా ఉంటుందని వివరించారు.

 రైతులకు జీవనోపాధి ఎలా?
 ఏటా మూడు పంటలు పండే వ్యవసాయ భూముల్లో రాష్ర్ట ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేపడుతోందని, ధాన్యాగారంగా పేరుగాంచిన ప్రాంతాన్ని నాశనం చేస్తోందని సంజయ్ పరీఖ్ వాదించారు. 20 రకాల పంటలు ఏటా మూడు సార్లు పండే ప్రాంతాన్ని ప్రభుత్వం సీడ్ క్యాపిటల్ అభివృద్ధికి ఎంపిక చేసిందని పేర్కొన్నారు. దీని వల్ల రాష్ట్రానికే కాకుండా దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. రాజధానికి తాము వ్యతిరేకం కాదని, ప్రతిపాదిత ప్రాంతాన్నే తాము వ్యతిరేకిస్తున్నట్టు ఆయన చెప్పారు. తీవ్ర వరద ముప్పు ఉందని తెలిసి కూడా పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడుతూ రాజధాని నిర్మాణాన్ని చేపట్టాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ ‘రాజధాని నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం వ్యవసాయ భూముల్లో చేపడుతుండడం స్పష్టంగా తెలుస్తోంది.

రైతుల జీవనోపాధి అయిన వ్యవసాయ భూమిని తీసుకొని వారికి ఏ విధంగా జీవనోపాధిని కల్పిస్తున్నారు? నష్టపరిహారం ఎలా చెల్లిస్తున్నారు?’ అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘పర్యావరణ అనుమతులను ఉల్లంఘిస్తూ కొండవీటి వాగు ప్రవాహ దిశ మార్పునకు చర్యలు తీసుకోవడం, వరద ముంపు ఉన్న లింగాయపాలెంలో రోడ్డు నిర్మాణాలు చేపట్టడం దేనికి సంకేతం?’ అని ప్రశ్నించింది. ‘రాజధాని నిర్మాణం విషయంలో ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తే.. ప్రణాళిక తలకిందులు అవుతుంది..’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ‘తరువాత మేం ఏం చేయగలమో అది చేస్తాం..’ అని పేర్కొంది. ‘రాజధాని నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అన్ని చర్యలను మా ముందు ఉంచాలి.. నిజాలను దాయాలని చూస్తే ఇతర అన్ని విషయాలపై విచారణ జరపాల్సి వస్తుంది..’ అని హెచ్చరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement