మొహాలి: తొలి వన్డేలో ఎదురైన పరాభవానికి టీమిండియా బదులు తీర్చుకుంది. రెండో వన్డేలో శ్రీలంకను చిత్తుగా ఓడించి విజయబావుటా ఎగురవేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించి ప్రత్యర్థిని చిత్తు చేసింది. బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో లంకను 141 పరుగుల తేడాతో ఓడించింది. రోహిత్ సేన నిర్దేశించిన 393 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 251 పరుగులు సాధించింది.
సీనియర్ ఆటగాడు మాథ్యూస్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా లంకను ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. ఏ ఒక్కరూ అతడికి తోడుగా నిలబడలేకపోయారు. 122 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసి ఓటమి అంతరాన్ని తగ్గించాడు. వన్డేల్లో అతడికిది రెండో సెంచరీ. 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో చాహల్ 3, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు.
టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 392 పరుగులు చేసింది. రోహిత్ శర్మ చెలరేగి ఆడి అజేయ డబుల్ సెంచరీ(208) సాధించాడు. శ్రేయస్ అయ్యర్(88), శిఖర్ ధవన్(68) అర్ధసెంచరీలు చేశారు. రోహిత్ శర్మకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మక మూడో వన్డే ఆదివారం విశాఖపట్నంలో జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment