టీమిండియా వన్డే సిరీస్ డైరెక్టర్గా రవిశాస్త్రి
న్యూఢిల్లీ : ఇంగ్లండ్పై ఘోర వైఫల్యం చవిచూసిన టీమిండియా తాత్కాలిక ప్రక్షాళనకు బీసీసీఐ నడుం బిగించింది. ఇందులో భాగంగానే మాజీ కెప్టెన్ రవిశాస్త్రిని ఇంగ్లండ్ వన్డే సిరీస్కు డైరెక్టర్గా నియమించింది. రవిశాస్త్రికి సహాయంగా సంజయ్ బంగర్, భరత్ అరుణ్లు సహాయక కోచ్లుగా వ్యవహరించనున్నారు. అలాగే ఫీల్డింగ్ కోచ్గా హైదరాబాద్‌కు చెందిన ఆర్.శ్రీధర్ నియమితుడయ్యాడు. మరోవైపు టీమిండియా బౌలింగ్ కోచ్ జో డేవిస్, ఫీల్డింగ్ కోచ్ ట్రివర్ పెన్నీలకు విశ్రాంతినిచ్చింది. హెడ్ కోచ్‌గా డంకన్ ఫ్లెచర్ కొనసాగనున్నాడు.
కాగా ఇంగ్లండ్‌లో భారత జట్టు చెత్త ప్రదర్శనను సగటు అభిమానితో పాటు మాజీ క్రికెటర్లు, సారథులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కెప్టెన్ ధోని చెత్త సారథ్యం, కోచ్ ఫ్లెచర్ చేతకానితనంతో పాటు జట్టు సహాయక సిబ్బంది పూర్తిగా నామమాత్రంగా మారారనే విమర్శలు వచ్చాయి.
బోర్డు చొరవ తీసుకుని వీళ్లందరినీ తప్పించేకంటే ముందే... వీళ్లే గౌరవంగా తప్పుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని పలువురు అభిప్రాయపడిన విషయం తెలిసిందే. ఇక ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ విజయం తర్వాత గారీ కిర్‌స్టెన్ స్థానంలో కోచ్‌గా ఫ్లెచర్ బాధ్యతలు స్వీకరించాడు. అతని పర్యవేక్షణలో భారత్ 44 వన్డేలు ఆడగా, 25 విజయాలు సాధించింది. 16 పరాజయాలను చవిచూసింది.