మీ నాన్న లేడమ్మా... | Civilian killed in BSF firing | Sakshi
Sakshi News home page

మీ నాన్న లేడమ్మా...

Published Sat, Oct 18 2014 4:05 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 PM

మీ నాన్న లేడమ్మా...

మీ నాన్న లేడమ్మా...

  • దేశ సరిహద్దులో పాక్ దళాల కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ జవాను మృతి
  •  స్వగ్రామం తూపల్లిలో విషాద చాయలు
  •  కన్నీరు మున్నీరైన భార్య అపర్ణ
  •  రెండేళ్ల కూతురును పట్టుకుని గుండెలవిసేలా రోదన
  • కదిరి: ‘మా నాన్న వస్తాడు.. నాకు కొత్త బట్టలు తెస్తాడు.. టపాకాయలు తెస్తాడు.. ఊరందరికీ పంచుతానని చెప్పావే.. ఇంకెక్కడ మీ నాయన తల్లీ.. మీ నాన్న చచ్చిపోయాడంట.. ఇంగ మనకు దిక్కెవరు? నీకు నేను.. నాకు నువ్వు.. మనిద్దరమే మిగిలిపోతిమి.. మా నాన్న తుపాకీ పట్టుకుని దొంగోళ్లను తరిమేస్తాడని ముద్దు ముద్దుగా చెప్పితివి కదే.. ఇపుడు ఆ పాకిస్తాన్ దొంగేళ్లే దొంగచాటున కాల్చేశారే.. ఓరి దేవుడా.. మాకు ఇంత అన్యాయం చేశావేమిరా..’ అంటూ భారత్-పాక్ సరిహద్దుల్లో పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన అనిల్‌కుమార్‌రెడ్డి(31) భార్య అపర్ణ తన రెండేళ్ల చిన్నారి త్రిపురను పట్టుకొని కన్నీరు మున్నీరుగా విలపించింది. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులంతా కంటతడి పెట్టారు. తలుపుల మండలం తూపల్లికి చెందిన ఇంద్రావతమ్మ, నాగేంద్రరెడ్డి దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కొడుకు ధనుంజయ్‌రెడ్డి, రెండో కొడుకు సుదర్శన్‌రెడ్డి వీరిద్దరూ స్వగ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటున్నారు.

    మూడో కొడుకు అనిల్‌కుమార్‌రెడ్డి చిన్నప్పటి నుండి తాను సైన్యంలో చేరి దేశం కోసం పోరాటం చేయాలంటుండేవాడు. తాను అనుకున్నట్లు గానే 2003లో బీఎస్‌ఎఫ్ జవానుగా చేరారు. విధి నిర్వహణలో అందరికంటే ముందుండే వాడని సహచరులు చెప్పారు. గురువారం అర్ధరాత్రి పూంచ్ సెక్టార్‌లో ఉన్నట్లుండి పాకిస్తాన్ వైపు నుంచి కాల్పులు ప్రారంభం కావడం.. అనిల్ దేహంలో బుల్లెట్లు చొచ్చుకు పోవడం ఊహించని రీతిలో జరిగిపోయిందని తోటి జవాన్‌ల ద్వారా కుటుంబ సభ్యులకు తెలిసింది. ‘జై భారత్.. జైజై భారత్’ అని బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు వదిలాడని వారు చెప్పారు.

    ఇతను నాలుగేళ్ల క్రితం ధర్మవరం మండలం కనంపల్లికి చెందిన అపర్ణను వివాహం చేసుకున్నాడు. వీరికి రెండున్నర సంవత్సరాల త్రిపుర అనే కుమార్తె ఉంది. ‘దీపావళి పండుగకు సెలవు దొరికింది. నేను ఊరికి వస్తాను. నిన్ను, నా కూతురును, మా అమ్మా, నాన్నను చూడాలని ఉంది’ అని రెండు రోజుల క్రితమే అతను భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. ఇంతలోనే ఇలా జరగడంతో వారి బాధ వర్ణణాతీతం. మృతదేహాన్ని శనివారం స్వగ్రామానికి తీసుకురానున్నారు.

    మృతదేహం చేరుకునే సమయాన్ని బట్టి శనివారం లేదా ఆదివారం అంత్యక్రియలు ని ర్వహిస్తారని బంధువులు తెలిపారు. అనిల్ మృతిపై కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు డా.సిద్దారెడ్డి, తలుపుల సింగిల్ విండో అధ్యక్షుడు పూల శ్రీనివాసరెడ్డి, పలువురు స్థానిక ప్రముఖులు సంతాపం తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement