న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల ప్రచారం కోసం అన్ని రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాలను సైతం వాడుకుంటున్నాయి. వాటిద్వారా యువతను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు తమకు పడేలా చేసుకునేందుకు తమ తమ పార్టీలకు చెందిన సామాజిక మాధ్యమ విభాగాలకు ఈ బాధ్యతను అప్పగించాయి. ఈ విషయమై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సోషల్ మీడియా కన్వీనర్ అంకిత్‌లాల్ మాట్లాడుతూ ‘నగరంలో మాకు 16 మంది కీలక సభ్యులున్న బృందం ఉంది.
వీరంతా సోషల్ మీడియాను పర్యవేక్షిస్తుంటారు. దేశంతోపాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మరో 55 మంది ఈ బాధ్యతల్లో పాలుపంచుకుంటారు. మాకు 200 మంది క్రియాశీలురైన వాలంటీర్లు కూడా ఉన్నారు.’ అని అన్నారు. ట్వీటర్, ఫేస్‌బుక్‌లలో నగరానికి చెందిన ప్రధాన పార్టీల మధ్య ప్రచార యుద్ధం జరుగుతోంది. ‘ప్రతిరోజూ ఈ రెండు సామాజిక మాధ్యమాల్లో సందేశాలను అన్ని పార్టీలు పోస్టు చేస్తున్నాయి. ఇంకా వీడియోలు ట్వీట్లతో ముందుకు సాగుతున్నాయి. ఎప్పటికప్పుడు తమ వ్యూహాన్ని మార్చుకుంటున్నాయి. ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు విభిన్నంగా ముందుకు సాగుతున్నాయి. అనేక రకాల విన్యాసాలు చేస్తున్నాయి.
బీజేపీకి వె య్యిమంది వాలంటీర్లు
సామాజిక మాధ్యమాల్లో బీజేపీ తరఫున వెయ్యిమంది పనిచేస్తున్నారు. వీరంతా ఐటీ, బీపీఓ సంస్థల్లో ఉద్యోగులు. బీజేపీ చేపట్టిన ఆన్‌లైన్ ప్రచారానికి అంకితభావంతో పనిచేస్తున్నారు. వివిధ సామాజిక మాధ్యమాలద్వారా తమ పార్టీ అభ్యర్థులు, నాయకుల సందేశాలను వాటిలో ఉంచుతున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సమాచార విభాగం కన్వీనర్ ఖేమ్‌చంద్ శర్మ వెల్లడించారు. కిరణ్‌బేడీ, నరేంద్రమోదీ, అమిత్‌షాల సందేశాలను పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లోనూ వీరు పోస్టు చేస్తుంటారు.
వ్యూహాత్మంగా ఆప్ ముందుకు
ఇక ఆన్‌లైన్ ప్రచారానికి సంబంధించి ఆప్‌వద్ద సూక్ష్మబుద్ధితో కూడిన వ్యవస్థ ఉంది. ఈ కారణంగా ఫేస్‌బుక్‌లో 23 లక్షలు, ట్వీటర్‌లో 11 లక్షల లైక్‌లు నమోదవుతున్నాయి. ఆ పార్టీ ఆన్‌లైన్ ప్రచారం విషయంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ ఎన్నికల్లో తమ పార్టీ విజయపతాకం ఎగురవేస్తుందని గుజరాత్‌కు చెందిన మరో నాయకుడు ధీమా వ్యక్తం చేశారు. తగినంత మెజారిటీ రావడం తథ్యమన్నారు. త్వరలో గుజరాత్‌లో జరగనున్న ఎన్నికలకు ఇది మార్గదర్శి అవుతుందన్నారు.
సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచార పర్వం
Published Mon, Feb 2 2015 10:22 PM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM
Advertisement