పరిమళించిన మానవత్వం
- కుక్కల దాడిలో గాయపడిన
- కోతిని రక్షించిన వైద్య విద్యార్థులు
బళ్లారి (తోరణగల్లు):విమ్స్ ప్రాంగణంలోని అనాటమీ విభాగం వద్ద చెంగుచెంగున ఎగురుతూ ఆకట్టుకొంటున్న ఓ కోతిపై నాలుగు కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి పట్టుకొన్నాయి. అయితే ఆ కోతికి అంగవైకల్యం ఉన్నందున తప్పించుకొని చెట్టు ఎక్కలేక పోయింది. దీంతో ఆ నాలుగు కుక్కలు తీవ్రంగా కొరికి గాయపరిచాయి. వెంటనే లైబ్రరీ వద్ద ఉన్న వైద్యవిద్యార్థులు కుక్కలను రాళ్లతో కొట్టితరిమారు. కాని తీవ్రంగా గాయపడిన కోతి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. స్పందించిన వైద్యవిద్యార్థులు, వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. మూగజీవాలను రక్షించే సంస్థ పెట్స్ ఆర్గనైజేషన్‌కు సమాచారం అందించారు. వెంటనే ఆర్గనైజేషన్ సభ్యురాలు నిఖిత కోతిరక్షణకు పూనుకొంది. వెటరినరీ వైద్యుడు డాక్టర్ వసంత్, డాక్టర్ బిందు, డాక్టర్ మల్లికార్జున, విమ్స్ వైద్యవిద్యార్థులు మేఘన, గౌతమిలతో పాటు జంతుప్రదర్శనశాల అధికారి మంజులు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 వరకు కష్టించి కోతికి సర్జరీ చేసి ప్రాణాలను కాపాడారు. మెరుగైన చికిత్స కోసం జంతు ప్రదర్శనశాల అధికారులు బెంగుళూరుకు తరలించారు. మానవత్వంతో కోతి ప్రాణాలను రక్షించిన నిఖిత, విమ్స్ వైద్యవిద్యార్థులకు ప్రజలు అభినందనలు తెలిపారు.