నష్టాల్లో ఉంటే మూసేయండి | State Road Transport Corporation Madras High Court | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ఉంటే మూసేయండి

Published Fri, Mar 20 2015 3:11 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM

State Road Transport Corporation Madras High Court

 రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాల్లో ఉందని పదే పదే చెప్పడం కన్నా ఒకే సారి మూసేయండి అని ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు చురకలు అంటించింది. 700 బస్సులు జప్తులో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం రూ.1.72 కోట్ల మేరకు టోల్ చార్జీల్ని ప్రైవేటు సంస్థలకు గురువారం చెల్లించింది.
 
 సాక్షి, చెన్నై: ఇటీవల మద్రాసు హైకోర్టులో రోడ్ల దుస్థితిపై ఓ పిటిషన్ దాఖలు అయింది. జాతీయ రహదారుల్లో టోల్ చార్జీల మోత మోగిస్తున్నా, రోడ్లు అక్కడక్కడ అధ్వానంగా ఉన్నాయని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. ప్రధానంగా బెంగళూరు జాతీయ రహదారిలో అయితే, మూడు చోట్ల టోల్ బాదుతున్నా, రోడ్ల నిర్వహణ సక్రమంగా లేదని వివరించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పయనిస్తున్న ప్రయాణికుడి నెత్తిన టోల్ చార్జీ మోపుతున్నా, ఆయా టోల్ వసూళ్ల  సంస్థలు రోడ్లను సక్రమంగా  ఎందుకు పర్యవేక్షించడం లేదో ప్రశ్నించి, చర్యలు తీసుకోవాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సుందరేషన్ నేతృత్వంలోని బెంచ్ విచారించి ఆయా టోల్ వసూళ్ల సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఇందుకు వివరణ ఇచ్చిన ఆ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వమే కోట్లాది రూపాయల మేరకు టోల్ బకాయి ఉంచినప్పుడు, తాము ఎలా రోడ్లను సక్రమంగా పర్యవేక్షించ గలమన్న ప్రశ్నను లేవ దీశారు. దీనిపై స్పందించిన బెంచ్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
 
 గురువారం ఆ పిటిషన్ మళ్లీ విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ సోమయాజులు హాజరై తన వాదనను వినిపించారు. వాదన సమయంలో పదే పదే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీవ్ర నష్టాల్లో ఉందని గుర్తు చేశారు. తాము నష్టాల్లో ఉన్నా ప్రజలకు సేవల్ని అందిస్తున్నామని, నష్టం భర్తీ చేసుకోవడం తీవ్ర కష్టంగా ఉందని వాదన వినిపించారు. ఈ వాదనను విన్న బెంచ్ పదే పదే నష్టాల్లో ఉన్నామని చెప్పుకోవడం కన్నా ఒకేసారి మూసేయండి ఓ పనై పోతుందని ప్రభుత్వానికి చురకలు అంటించారు. టోల్ సంస్థలకు చెల్లించాల్సిన రూ.కోటి 72 లక్షలకు గాను ఐదు చెక్కులను కోర్టు ద్వారా అందజేశారు. అనంతరం రవాణా సంస్థకు వ్యతిరేకంగా దాఖలైన కేసుల గురించి వివరించండంటూ బెంచ్ ప్రశ్నించగా, ఇప్పటి వరకు 700 బస్సులు జప్తుల్లో ఉన్నాయంటూ అడ్వొకేట్ జనరల్ పేర్కొనడంతో తదుపరి విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement