- నాల్గవ జాతీయ రహదారి దిగ్బందం
- కార్మికులపై విరిగిన లాఠీ
- ప్రతిగా రాళ్లు రువ్విన ఆందోళనకారులు
- ఇద్దరు ఇన్‌స్పెక్టర్లతో సహా నలుగురు సిబ్బందికి గాయాలు
సాక్షి, బెంగళూరు :ఇసుక రవాణాకు సంబంధించి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పాలసీ ఇద్దరు భవన నిర్మాణ రంగ కార్మికుల పాలిట వృత్యు పాశమైంది. ఈ విషయాన్ని ప్రశ్నించిన వందలాది సహచర కార్మికులపై బెల్గాం పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. వివరాలు... ఇసుక రవాణ, సేకరణ, క్రయవిక్రయాలకు సంబంధించి నాలుగు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీని తీసుకువచ్చింది. దీని ప్రకారం చాలా ప్రాంతాల్లో ఇసుక సేకరణ మందగించింది. ముఖ్యంగా బెల్గాం జిల్లాలో ఇసుక రవాణ, సేకరణ రంగంలోని వందలాది మంది కూలీలు ఉపాధి కోల్పోయారు. ఇసుక లభ్యం కాకపోవడంతో భవన నిర్మాణ రంగ కార్మికులు కూడా ఉపాధి కోల్పోయారు.
ఈ నేపథ్యంలో కుటుంబ పోషణ భారమై రెండ్రోజుల క్రితం బెల్గాంలో ఇద్దరు కట్టడ కార్మికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషయంపై అధికారులు, స్థానిక నేతలు స్పందించకపోవడంతో భవన నిర్మాణ కార్మికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వందలాది మంది కార్మికులు సోమవారం నాల్గవ జాతీయరహదారిని దిగ్బందించారు. దాదాపు రెండు గంటల పాటు రోడ్డుకు ఇరువైపులా వాహనాలు వందల సంఖ్యలో నిలిచిపోయాయి. కార్మికులకు నచ్చచెప్పేందుకు పోలీసులు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆఖరుకు లాఠీ చార్జి చేసి, ఆందోళనకారులను చెదరగొట్టారు.
పోలీసుల వైఖరి నిరసిస్తూ కార్మికులు రాళ్లు రువ్వారు. ఇద్దరు ఇన్‌స్పెక్టర్లతో సహ నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అదనపు బలగాలను రప్పించి ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. లాఠీచార్జిలో గాయపడిన కార్మికులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్సలు అందిస్తున్నారు. పరిస్థితి అదుపులో ఉందని పోలీస్ అధికారులు వెల్లడించారు.