కలెక్టర్ దివ్యదేవరాజన్, ఎస్పీ విష్ణు ఎస్. వారియర్ గత కలెక్టర్ జ్యోతిబుద్ధప్రకాశ్, గత ఎస్పీ శ్రీనివాస్
సాక్షి, ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా విభజన జరిగి నేటితో రెండేళ్లు పూర్తవుతుంది. 2016 అక్టోబర్ 11వ తేదీన దసరా పండగ నాడు ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపట్టిన విషయం తెలిసిందే. అప్పటివరకు ఒక్కటిగా ఉన్న ఆదిలాబాద్ విభజనతో నాలుగు జిల్లాలుగా విడిపోయింది. దీంతో ఆయా జిల్లాలో పరిపాలనా వ్యవస్థ, పాలనా యంత్రాంగం ప్రజలకు చేరువైంది. విభజనకు ముందు ప్రజలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేవారు. జిల్లా విస్తీర్ణం దృష్ట్యా ఉన్నతాధికారులు ఉమ్మడి జిల్లాలో పర్యటించడానికి ఇబ్బందులు పడేవారు. ఉదయం వెళ్లినవారు రాత్రయ్యే వరకు పర్యటించినా కొన్ని గ్రామాలు మాత్రమే తిరిగివచ్చే పరిస్థితి ఉండేది.
ఆదిలాబాద్ నుంచి చెన్నూర్, మంచిర్యాల, కోటపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే ఒక రోజు సమయం పట్టేది. జిల్లాల విభజనతో అధికారులు మధ్యాహ్నంలోగానే ఆయా ప్రాంతాలను సందర్శించడంతో పాటు పాలనపరంగా ప్రజలకు చేరువయ్యారు. అయితే ఆయా శాఖల ఉద్యోగులను నాలుగు జిల్లాలకు విభజించడంతో ఉన్న ఉద్యోగులపై పనిభారం పడింది. ఇంకా చాలా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. జిల్లాల విభజన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా ఉన్న సమయంలో ఏ కార్యాలయంలో చూసినా ప్రజలతో కిక్కిరిసిపోయి కనిపించేది. ప్రస్తుతం పరిస్థితి దానికి భిన్నంగా మారింది.
గతంకంటే కొంత మేలు...
ఉమ్మడి జిల్లాగా ఉన్న ఆదిలాబాద్ వెనుకబాటుకు గురైంది. జిల్లాల విభజన తర్వాత ప్రభుత్వ పథకాలు ప్రజలకు కొంత మేరకు చేరువయ్యాయి. దీంతో పాలన ప్రగతిపథం వైపు సాగుతోంది. చిన్న జిల్లాలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ.. ప్రభుత్వ శాఖల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, ఉద్యోగుల భర్తీ విషయంలో ఇంకా వెనుకబడే ఉన్నారు. కొత్త పాలనకు రెండేళ్లు గడుస్తున్నా ఆయా శాఖల్లో ఇన్‌చార్జీలతోనే నెట్టుకొస్తున్నారు. మరికొన్ని కార్యాలయాల్లో సిబ్బంది కొరతతో పనుల్లో జాప్యం జరుగుతోంది. జిల్లా విభజన తర్వాత ప్రజలకు కొంత మేలు జరిగిందనే చెప్పుకోవచ్చు. పలు కార్యక్రమాల్లో జిల్లా ముందడుగు వేస్తోంది. అనుభవం ఉన్న అధికారులు ఉండడంతో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికారుల అనుభవం తోడైంది. దీంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి పథకం అమలులో జిల్లాకు మొదటిస్థానం రావడంతో కలెక్టర్ అవార్డు అందుకున్న విషయం విదితమే.
ఉద్యోగుల కొరతతో ఇబ్బందులు...
జిల్లాల విభజన ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల కొర త ఎదురైంది. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ప్రభు త్వ కార్యాలయాలన్ని ఉద్యోగులతో కలకలలాడే వి. కానీ ప్రస్తుతం ఏ కార్యాలయంలో చూసిన వెలవెలబోతున్నాయి. ఇటు పనుల్లో సైతం జాప్యం జరుగుతుండగా.. ఉన్న సిబ్బం దిపై పనిభారం పెరిగిపోతోంది. ప్రజలకు సకాలంలో పని కాకపోవడంతో ఉన్న అధికారులపైనే భారం పడుతోంది. ఇలా పలు ప్రభుత్వ కార్యాయాల్లో ఇదే పరిస్థితి ఉంది. జిల్లాలో వెయ్యి పోస్టుల వర కు ఖాళీగా ఉన్నాయి. రెవెన్యు విభాగం, పంచాయతీరాజ్, సంక్షేమ శాఖల్లో పలు ముఖ్యమైన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా జిల్లా విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఐదు మండలాల్లోని ఆయా కార్యాలయాల్లో సౌకర్యాలు కనిపించడం లేదు. సిబ్బంది కొరతతో పాటు కంప్యూటర్ వంటి యంత్రాలు, ఫర్నీచర్, తదితర సదుపాయలు పూర్తిస్థాయిలో కల్పించలేదు.
శాంతిభద్రతలు అదుపులో...
చిన్న జిల్లా ఏర్పాటు కావడంతో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జిల్లాలో నేరాలు అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇటు నేరాల అదుపుతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ గుర్తింపు పొందుతున్నారు. ముఖ్యంగా పట్టణంలోని ప్రధాన వీధుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీసుల విధుల్లో సాంకేతికత వంటి అంశాలపై దృష్టి సారించారు. మహిళలకు రక్షణగా ఉట్నూర్, ఇచ్చోడలో సైతం షీ టీంలు ఏర్పాటు చేశారు.
మట్కా నిర్వహణపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో నిఘా వేసి అరెస్టు చేస్తున్నారు. దీంతోపాటు మహారాష్ట్ర నుంచి అక్రమంగా జిల్లాకు రవాణా చేసే దేశీదారును అబ్కారీ శాఖ అధికారులతో కలిసి అడ్డుకట్ట వేసే పనుల్టో నిమగ్నమయ్యారు. గుడుంబా, గుట్కా స్వాధీనం చేసి పలువురిపై కేసులు నమోదు చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేయడంతో జరిమానాలు విధిస్తున్నారు. దీంతోపాటు పోలీసు వాట్సాప్ ద్వారా ప్రజలకు చేరువయ్యారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందేలా చర్యలు చేపట్టారు.
మారిన కలెక్టర్, ఎస్పీ..
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు కలెక్టర్‌గా జ్యోతి బుద్ధప్రకాశ్, ఎస్పీగా విక్రమ్‌జిత్ దుగ్గల్ వ్యవహరించారు. జిల్లాల విభజన తర్వాత కూడా కలెక్టర్‌గా జ్యోతి బుద్ధప్రకాశ్ కొనసాగగా, విక్రమ్‌జిత్ దుగ్గల్ నూతనంగా ఏర్పడిన రామగుండం పోలీస్ కమిషనర్‌గా నియామకం అయ్యారు. దీంతో ఆదిలాబాద్ ఎస్పీగా ఎం.శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. ఆదివాసీ ఉద్యమం నేపథ్యంలో వీరిద్దరిని బదిలీ చేసిన సర్కారు నూతన కలెక్టర్‌గా దివ్య దేవరాజన్, ఎస్పీగా విష్ణు ఎస్.వారియర్‌లను నియమించింది. ప్రస్తుతం వీరిద్దరు తమ పనితీరుతో జిల్లా ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారు.
కొత్త జిల్లాలతో పాలనా సౌలభ్యం
కొత్త జిల్లాలు ఏర్పడడం వల్ల పాలన సౌలభ్యంగా మారింది. ఆదిలాబాద్ జిల్లా విశాలంగా ఉండడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. జిల్లా అధికారులకు సమస్యలను విన్నవించడానికి అష్టకష్టాలు పడేవారు. ప్రస్తుతం జిల్లాలు చిన్నగా ఏర్పడడంతో ప్రజల వద్దకే అధికారులు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఆయా శాఖల్లో ఖాళీలు ఉండడంతో ఉద్యోగులపై కొంత అదనపు భారం పడుతోంది. – వనజారెడ్డి, తహసీల్దార్, భీంపూర్
Comments
Please login to add a commentAdd a comment