లాక్‌డౌన్‌తో రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లు సైతం మూతపడడం, ఫంక్షన్లు, పెళ్లిళ్లు వాయిదాపడడంతో గ్రేటర్‌లో బాస్మతి బియ్యం వినియోగం భారీగా త గ్గింది. దీంతో 80 శాతం విక్రయాలు పడిపోయాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.
సాక్షి, సిటీబ్యూరో: గాలిలోంచి తేలియాడుతూ వచ్చే ఆ సుమధుర ఘుమఘుమల సువాసనలు ముక్కుపుటాలను సమ్మోహనపరుస్తాయి. ఆ రుచి జిహ్వను మైమరిపించేలా చేస్తుంది. నోటిలో అలా ఓ ముద్ద పెట్టుకోగానే గొంతులోంచి జారిపోవాల్సిందే. ఆ బియ్యంతో వంట ఇంటిల్లిపాదినీ.. శుభకార్యాల్లోనైతే బంధు, మిత్రులకు బ్రహ్మాండమైన విందు భోజనమే. ప్రస్తుతం ఆ రుచికి కరోనా రూపంలో అడ్డుకట్ట పడింది. బాస్మతి బియ్యానికి డిమాండ్ కరువయ్యింది. బాస్మతి బియ్యం మార్కెట్ నష్టాల రుచులను చవిచూస్తోంది. వందల కోట్ల రూపాయల మేర ఆదాయానికి గండి పడింది.
20 శాతానికి పడిపోయాయ్..
కోవిడ్‌కు ముందు గ్రేటర్ పరిధిలో రోజుకు 32 వేల క్వింటాళ్ల సాధారణ బియ్యం వినియోగమయ్యేవి. ఇందులో బాస్మతి బియ్యం దాదాపు 8వేల క్వింటాళ్ల వరకూ ఉంటుందని వ్యాపారుల అంచనా. రిటైల్ మార్కెట్‌లో కిలో బాస్మతి బియ్యం రూ.60 నుంచి రూ.120 వరకు ఉండేది. అనధికారిక లెక్కల ప్రకారం జంట నగరాల్లో బాస్మతి బియ్యం వ్యాపారం రోజుకు దాదాపు రూ.15కోట్లకు పైనే ఉండేది. ప్రధాన మార్కెట్లయిన బేగంబజార్, కిషన్‌గంజ్, ఉస్మాన్‌గంజ్ టోకు మార్కెట్లు బాస్మతి బియ్యం అమ్మకాలకు ప్రధాన కేంద్రాలు. ఈ ఏడాది మార్చి నుంచి కరోనా ప్రభావంతో బాస్మతి విక్రయాలు 20 శాతానికి పడిపోయాయి. మూడు నెలలుగా వివాహాది శుభకార్యాలు లేకపోవడం, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు మూతపడటంతో బిర్యానీ వంటకాలకు ఫుల్‌స్టాప్ పడింది. దీంతో బాస్మతి బియ్యం వినియోగం భారీ స్థాయిలో పడిపోయింది.
కోలుకోలేని దెబ్బ..
కరోనా ప్రభావంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా బాస్మతి బియ్యం విక్రయాలపై తీవ్ర ప్రభావం పడింది. కొంత మంది వ్యాపారులు కొనుగోలు చేసిన ధరల కంటే తక్కువకు బాస్మతి విక్రయిస్తున్నారు. నష్టాల నుంచి గట్టెక్కడానికి ఈ పరిస్థితి తప్పడంలేదు. కిరాణా రంగంలో ఇతర వస్తువులతో పోలిస్తే బాస్మతి నష్టాలు భారీగా ఉన్నాయి. – రాజ్‌కుమార్ టాండన్,కశ్మీర్ హౌస్ యజమాని, బేగం బజార్
ప్రస్తుతం..అంతంత మాత్రమే..
లాక్‌డౌన్ సడలింపుల అనంతరం హోటళ్లతో పాటు తక్కువ సభ్యులతో ఫంక్షన్లు ప్రారంభం కావడంతో కొంత మొత్తంలో బాస్మతి విక్రయాలు జరుగుతున్నాయి. గతంలో రోజుకు ఐదు నుంచి పది క్వింటాళ్ల బాస్మతి బియ్యం విక్రయిస్తే.. ప్రస్తుతం రెండు క్వింటాళ్లకు పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. ఉత్తరాదిలో పంజాబ్, హరియాణా తదితర రాష్ట్రాల్లో గత రెండేళ్లలో బాస్మతి ఉత్పత్తి భారీగా ఉండడంతో నగరానికి సరఫరా పెరిగింది. అలా నాణ్యతను బట్టి ధరలు కూడా కొద్దిగా తగ్గడంతో అన్ని వర్గాలకు అందుబాటు ధరల్లోనే బాస్మతి లభించేది. అన్ని రకాల ఫంక్షన్లలో మామూలు బియ్యానికి బదులు బాస్మతి వినియోగించే వారు. దీంతోనూ నగర మార్కెట్‌కు భారీగానే వ్యాపారులు దిగుమతి చేసుకున్నారు. కానీ కరోనా ప్రభావంతో బాస్మతి బియ్యం విక్రయాలు జరగకపోవడంతో భారీ నష్టాల్లో కూరుకుపోయామని వ్యాపారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment