కాంగ్రెస్ ధర్నా ఉద్రిక్తం.. | Congress staged a kept its calm | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ ధర్నా ఉద్రిక్తం..

Published Sat, Oct 18 2014 12:18 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్ ధర్నా ఉద్రిక్తం.. - Sakshi

కాంగ్రెస్ ధర్నా ఉద్రిక్తం..

కరీంనగర్ కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు నేతల యత్నం
పోలీసులు అడ్డుకోవడంతో తీవ్రంగా తోపులాట
జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం సహా పలువురు నేతల అరెస్టు
పోలీసుల వాహనాన్ని అడ్డుకున్న కార్యకర్తలు
లాఠీచార్జి చేసిన పోలీసులు..
నిరసనగా రోడ్డుపై బైఠాయింపు
సీఎం కేసీఆర్‌పై పొన్నాల, జానా, డీఎస్, షబ్బీర్ ఫైర్

 
కరీంనగర్: వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేయాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ నేతలంతా ఒక్కసారిగా కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్రంగా తోపులాట జరిగింది. దీంతో పలువురు నేతలు కింద పడిపోయారు. పోలీసుల తీరును నిరసిస్తూ జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తదితర నేతలు, కార్యకర్తలు అక్కడే బైఠాయించారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు కదిలేది లేదంటూ భీష్మించి.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా ఎత్తుకెళ్లి జీపులో ఎక్కించారు. కానీ ఆ వాహనాన్ని కదలనీయకుండా కాంగ్రెస్ కార్యకర్తలు, పలువురు రైతులు అడ్డుకున్నారు. పోలీసులు వారిని పక్కకు తప్పించడానికి లాఠీచార్జి చేశారు. దీనిని నిరసిస్తూ.. జీవన్‌రెడ్డి జీపులోంచి దూకి రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ఆయన కు మద్దతుగా పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు తదితరులు అక్కడే బైఠాయించారు.

కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య తక్షణమే అక్కడికి వచ్చి ప్రభుత్వం తరపున క్షమాపణ  చెప్పాలని డిమాండ్ చేశారు. చివరకు వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని.. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కాగా.. తొలుత పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, రైతులతో కలసి ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ నాయకులు కరీంనగర్ సర్కస్ గ్రౌండ్ నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ వద్దకు చేరుకున్నా రు. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్, షబ్బీర్‌అలీ, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, జి.వివేక్, కటకం మృత్యుంజయం, ఆరెపల్లి మోహన్ ధర్నాలో పాల్గొన్నారు.

బుద్ధి చెబుతాం: డీఎస్

‘‘కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనను శాసనసభ, శాసనమండలిలో నిలదీస్తాం. కేసీఆర్‌కు బుద్ధి చెబుతాం. కేసీఆర్ మోసాలు రైతులు, ప్రజలకు అర్థమయ్యాయి.  వారి తో కలసి కాంగ్రెస్ కార్యకర్తలంతా విజృంభించండి. మేమంతా అండగా ఉంటాం.’’

కనీవినీ ఎరగని పాలనంటే ఇదేనా?: షబ్బీర్‌అలీ

‘‘ప్రపంచంలో కనీవినీ ఎరుగని పాలన అందిస్తానని కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతుండు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కేసీఆర్ నాలుగు నెలల పాలనలో 250 మంది  రైతులు ఆత్మహత్య చేసుకున్నరు. కనీవినీ ఎరుగని పాలనంటే ఇదేనా? కేసీఆర్.. కరెంటు అడిగిన పాపానికి రైతులపై లాఠీచార్జి చేస్తావా? బంగారు పాలనంటే ఇదేనా?’’

రెండు గంటలూ దిక్కులేదు: జీవన్‌రెడ్డి

 ‘‘తెలంగాణ వస్తే కష్టాలన్నీ తీరుతాయంటే పెనం మీదనుంచి పొయ్యిలో పడ్డట్లయింది. 8 గంటల ఉచిత కరెంటు ఇస్తానన్న కేసీఆర్.. ఇప్పుడు రెండు గంటలు కూడా సరఫరా చేయడం లేదు. ఎండిపోతున్న పంటలకు, రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.’’
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement