జార్ఖండ్‌లో ఉద్యోగాలిప్పిస్తామని మోసం..! | fraud reasons for jobs | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌లో ఉద్యోగాలిప్పిస్తామని మోసం..!

Published Wed, Jul 23 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 10:42 AM

fraud reasons for jobs

మరికల్: వేరే రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ కొందరు దళారులు నిరుద్యోగ యువకులకు మాయమాటలు చెప్పి  అక్క డకు తీసుకెళ్లిన తర్వాత నానా ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
 బాధితుల కథనం ప్రకారం.. కోయిల్‌కొండ మండలానికి చెందిన పి.నరేష్‌కు ధన్వాడ మండలం తీలేర్‌కు చెందిన రాజుతో కొంతకాలం క్రితం పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి పల్లెగడ్డలోని నిరుద్యోగులైన ఆంజనేయులు, రాఘవేంద్ర, మోహన్‌కు జార్ఖండ్ రాష్ట్రం లోని ప్రోడెక్ట్ కంపెనీలో ఉదోగ్యం కల్పిస్తామని, కంపెనీ నుంచి నెలకు 12 వేల రూపాయల వేతనం చెల్లిస్తామంటూ నమ్మబలికి వారి నుంచి (బ్యాంకు ఖాతా నం.62157561841కు) రూ.తొమ్మిది వేల చొప్పున డీడీ కట్టించుకుని ఈనెల 8న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైల్లో జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి 90 కిలోమీటర్ల దూరంలోని హజరాబాగ్‌కు తరలించి ఓ గదిలో బంధించి తమ కంపెనీలో చేరిన ప్రతి ఒక్కరూ మరో నలుగురితో డీడీ కట్టించాలని ఒత్తిడితెచ్చారు. ఇలా 16 మందిని చేర్పిస్తే ఉన్నతమైన ఉదోగ్యం ఇస్తామంటూ ఆశలు రేపారు. శిక్షణ పొందిన తర్వాత కంపెనీ నుంచి సరఫరా చేసే సబ్బులు, షాంపులు, టూత్‌పేస్ట్‌లపై ఎంఆర్‌ఎఫ్ స్టిక్కర్లు వేయాలని ఉచిత సలహాలిచ్చారు.
 
  ప్రతిరోజూ ఒకేపూట అన్నం పెట్టడమేగాక కుంటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడినా బెదిరించేవారు. తమ సెల్ తీసుకోవడంతో అనుమానం వేసిన బాధితులు ఆంజనేయులు, రాఘవేంద్ర వారి నుంచి ఎలాగో తప్పించుకుని ఈ నెల 15న స్వగ్రామానికి చేరుకోవడంతో అసలు విషయం బయటపడింది. కోయిల్‌కొండ మం డలం కొత్లాబాద్, మక్తల్ మండలం జవ లాపూర్, దేవరకద్ర మండలం గూర కొండకు చెందిన కొందరు నిరుద్యోగు లు ఉన్నారని మంగళవారం ఇక్కడ విలేకరులకు బాధితులు తెలిపారు. కాగా, వారి బారి నుంచి తమ బిడ్డలు ప్రాణాలతో బయటపడటమే తమకు సంతోషంగా ఉందని బాధిత తల్లిదండ్రులు చెప్పారు.
 
 వారం రోజులు నరకం చూపారు
 వారంరోజుల పాటు కంపెనీ వారు మాకు నరకం చూపారు. సరైన సమయానికి అన్నం పెట్టే వారుకాదు. కడుపు కాల్చుకుని బిక్కు, బిక్కుమంటూ కాలం వెళ్లదీశాం. ఇది నకిలీ కంపెనీ అని తెలిసిన తర్వాత ఎలాగోలా వారం రోజులక్రితం తప్పించుకుని స్వగ్రామం చేరుకున్నాం. మాతోపాటు వివిధ జిల్లాలకు చెందినవారు సుమారు 200మంది ఉన్నారు. రోజూ ఒకరిద్దరు వచ్చి మరో నలుగురితో డబ్బులు చెల్లించి ఈ కంపెనీలో చేర్పించేలా చూడాలని ఒత్తిడి చేసేవారు. కుంటుంబ సభ్యులతో మాట్లాడితే సెల్‌ఫోన్ లాక్కునేవారు. బయటకు వెళితే వెంబడి ఏడుగురిని కాపాలా పంపిస్తుండేవారు.
 - ఆంజనేయులు, బాధితుడు, పల్లెగడ్డ
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement