తెలంగాణలో నియంత పాలన!
* కేసీఆర్ తీరుపై మావోయిస్టు ప్రధాన కార్యదర్శి గణపతి ఆగ్రహం
* ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్రకటన విడుదల
* ప్రభుత్వ విధానాలపై తిరగబడితే ఉక్కుపాదం మోపుతున్నారు
* విద్యుత్ సరిగా ఇవ్వకపోవడంతో 400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు
* వారి కుటుంబాలకు పది లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి
* ప్రజా ఉద్యమాలను అణచడానికే పోలీసులకు కోట్లలో నిధులు
* వరవరరావు ఇంటిపై దాడిని ఖండిస్తున్నట్లు ప్రకటనలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని తాము బలంగా నమ్ముతున్నామని మావోయిస్టు ప్రధాన కార్యదర్శి గణపతి విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను నిర్బంధంలో ఉంచుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరు, రైతుల ఆత్మహత్యలు తదితర అంశాలపై గణపతి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘సాక్షి’కి అందిన ఆ ప్రకటనలోని వివరాలు.. ‘‘మావోయిస్టు పార్టీ ఎజెండానే తమ ఎజెండా అని, అధికారంలోకి వస్తే దళితుడే సీఎం అన్న మాటను పెక్కన పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను నిర్బంధంలో ఉంచుతోంది.
ప్రభుత్వ విధానాలపై తిరగబడే సామాన్య ప్రజలపై, మీడియాపై ఉక్కుపాదం మోపుతోంది. ప్రజల నిరసనను, ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి పోలీసుస్టేషన్ల ఆధునీకరణ పేర రూ. 343 కోట్లు విడుదల చేశారు. మావోయిస్టులతో ప్రాణహాని ఉందని మంత్రులకు రూ. 100 కోట్లతో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రైతులకు సరిపడా కరెంటు సరఫరా చేయక రాష్ట్రవ్యాప్తంగా 400 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తెలంగాణలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి.. విత్తనాలు, పురుగుల మందులు ఉచితంగా అందించాలి. మావోయిస్టులకు భయపడి ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ టవర్లు నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదంటూ అసత్య ప్రచారం జరుగుతోంది. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉన్న గిరిజన ప్రాంతాల్లో నిత్యం పోలీసులతో ప్రభుత్వం దాడులు చేయిస్తోంది. ఇందులో భాగంగానే విరసం నాయకుడు వరవరరావు ఇంటిపై గిరిజనుల పేరుతో పోలీసులతో దాడిచేయించినట్లు భావిస్తున్నాం. ఈ చర్యను ఖండిస్తున్నాం.
కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. సీమాంధ్ర పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతూ టీఆర్‌ఎస్ నేతలు గ్రానైట్ వ్యాపారంలో మునిగి తేలుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో బహుళ జాతి కంపెనీలు రియల్ ఎస్టేట్, చిట్‌ఫండ్‌తో పాటు రకరకాల పెట్టుబడులతో ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్నాయి. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం..’’ అని మావోయిస్టు ప్రధాన కార్యద ర్శి గణపతి, సీపీఐ(ఎంఎల్)-నక్సల్‌బరి కార్యద ర్శి అజిత్ ఆప్రకటనలో పేర్కొన్నారు.