నిమ్స్‌లో పోస్టుల భర్తీపై వివాదం! | On NIMS post replacement disputes | Sakshi
Sakshi News home page

నిమ్స్‌లో పోస్టుల భర్తీపై వివాదం!

Published Mon, May 11 2015 1:36 AM | Last Updated on Sun, Sep 3 2017 1:48 AM

నిమ్స్‌లో పోస్టుల భర్తీపై వివాదం!

నిమ్స్‌లో పోస్టుల భర్తీపై వివాదం!

- ఎయిమ్స్ నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపణలు
- వైద్యుల నియామకాలపై ఫ్యాకల్టీ అసోసియేషన్ అభ్యంతరం
సాక్షి, సిటీబ్యూరో:
ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(నిమ్స్)లో రూల్స్‌కు విరుద్ధంగా పోస్టుల భర్తీ చేపడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై సర్వత్రా అభ్యంతరం వ్యక్తమవుతోంది. అర్హులకు పదోన్నతులు కల్పించకుండా, కనీసం సమాచారం ఇవ్వకుండా నిమ్స్ నిబంధనలను సడలించి ఖాళీ పోస్టులు భర్తీ చేయడం ఏమిటని ఫ్యాకల్టీ అసోసియేషన్ ప్రశ్నిస్తుంది. ఆస్పత్రిలో ప్రస్తుతం 30 డిపార్ట్‌మెంట్స్ ఉండగా, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అడిషినల్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ కేడర్‌లో 175 మంది పని చేస్తున్నారు. మరో 60-70 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.

సరైన ఫ్యాకల్టీ, మౌలిక వసతులు లేని కారణంగా కార్డియాలజీ, రుమటాలజీ, ఆంకాలజీ విభాగాల్లోని సీట్లను ఎంసీఐ రెండేళ్ల క్రితం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆయా విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసి చేజారిపోయిన సీట్లను మళ్లీ తెచ్చుకో వాలని నిమ్స్ యాజమాన్యం భావించింది. ఆ మేరకు రుమటాలజీ, మెడికల్ ఆంకాలజీ విభాగాల్లో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టు భర్తీకి, కార్డియాలజీ, ఆంకాలజీ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకు ఎయిమ్స్ నిబంధనల మేరకు ఫ్యాకల్టీ భర్తీ జరిగేది. ఖాళీ పోస్టుల భర్తీకి తాము వ్యతిరేకం కాదు. ఖాళీలను భర్తీ చేయాల్సిందే. కానీ ఇష్టానుసారం నిబంధనలను మార్చడంపైనే మా అభ్యంతరమని ఫ్యాకల్టీ అసోసియేషన్ స్పష్టం చేస్తుంది.

సీనియార్టీ కోల్పోతాం:ఫ్యాకల్టీ అసోసియేషన్ ఉస్మానియా, గాంధీ ప్రభుత్వ వైద్య కళాశాలలతో పోలిస్టే నిమ్స్ కొంత భిన్నమైంది. గాంధీ, ఉస్మానియాలు పూర్తిగా ప్రభుత్వ సం స్థలైతే నిమ్స్ మాత్రం స్వయం ప్రతిపత్తి కలిగినది. డెరైక్టర్ ఎంపిక, వైద్యులు, ఇతర సిబ్బంది భర్తీ, ఆస్పత్రి నిర్వహణ, వైద్యసేవలు అందించే అంశంపై ఎయిమ్స్‌కు దీటుగా ప్రత్యేక గైడ్‌లైన్స్‌ను రూపొందించారు. గాంధీ, ఉస్మానియా ఫ్యాకల్టీలో మూడంచల వ్యవస్థ(అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్) కేడర్ ఉండగా, నిమ్స్‌లో ఇందుకు భిన్నంగా అసిస్టెంట్ ప్రొఫెసర్, అ సోసియేట్ ప్రొఫెసర్, అడిషినల్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ అనే నాలుగు అంచల వ్యవస్థ ఉంది. ఇప్పటి వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా జాయిన్ అయిన వ్యక్తి ప్రొఫెసర్ కేడర్‌కు చేరుకోవాలంటే కనీసం 12 ఏళ్లు పట్టేది.

తాజాగా అడిషినల్ ప్రొఫెసర్ కేడర్‌ను రద్దు చేసి మూడంచల పద్ధతిపై ఖాళీలు భర్తీ చేయడంతో ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్ కేడర్‌లో జాయిన్ అయిన వ్యక్తి ఐదేళ్లలోనే ప్రొఫెసర్ కేడర్‌కు చేరుకునే అవకాశం ఉంది. అయితే ఏళ్ల తరబడి పదోన్నతులు కల్పించక పోవడంతో చాలా మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ కే డర్‌కే పరిమితమయ్యారు. తాజా సడలింపు వల్ల వీరంతా తమ సీనియార్టీని నష్టపోయే ప్రమాదం ఉందని నిమ్స్ ఫ్యాకల్టీ అసోసియేషన్ వాదిస్తుండగా, నిమ్స్ యాజమాన్యం మాత్రం తాము ఎంసీఐ నిబంధనల మేరకే పోస్టుల భర్తీ చేస్తున్నట్లు స్పష్టం చేస్తుంది.  

నేడు ఇంటర్వూలు..
నిమ్స్‌లోని రుమటాలజీ, మెడికల్ ఆంకాలజీ విభాగాల్లో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టు భర్తీకి, కార్డియాలజీ, ఆంకాలజీ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి సోమవారం ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement