అన్నీ ఉన్నా..
- ప్రైవేటు కంటే ప్రభుత్వ బడుల్లోనే వసతులు
- అనుభవమున్న టీచర్లు సర్కారు స్కూళ్లలోనే
- 60 శాతం ప్రభుత్వ స్కూళ్లకు ఆటస్థలాలు
- అయినా ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో నీరసం
- టీచర్లలో చిత్తశుద్ధి లేకపోవడమే కారణం
సాక్షి, సిటీబ్యూరో : అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్న చందాన ఉంది సర్కారీ స్కూళ్ల పరిస్థితి. పక్కా భవనాలు.. ఆడుకునేందుకు ఆటస్థలాలు.. అనుభవమున్న టీచర్లు.. ఇలా అన్నీ ఉన్నాయి. అయినా చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే నగరంలో ప్రభుత్వ విద్యావ్యవస్థ రోజురోజుకూ నీరుగారుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఉన్నత విద్యలో హైదరాబాద్ జిల్లా వెనుబడుతుండటం ప్రభుత్వ పాఠశాలల పై తల్లిదండ్రులకు నమ్మకం సన్నగిల్లేలా చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో వసతులను ఓమారు పరిశీలిస్తే.. సర్కారు పాఠశాలలు ఏమాత్రం తీసిపోవని ఇట్టే అర్థమవుతోంది.
అపార్ట్‌మెంట్లలోనే ‘ప్రైవేటు’ బడులు..!
నగరంలోని ప్రైవేటు పాఠశాలల్లో అరవై శాతం అపార్ట్‌మెంట్లలోనే నడుస్తున్నాయి. తొంభై శాతం ప్రైవేటు స్కూళ్లకు ఆటస్థలాలు లేవు. యాభై శాతం స్కూళ్లలో శిక్షణ పొందిన టీచర్లు లేరు. అయినా ఎనభై శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటుకే ఓటు వేస్తున్నారు. ఇబ్బడిముబ్బడిగా ఫీజులు పెంచుతున్నా తలవంచి కడుతున్నారు. దీనికంతటికీ కారణం ప్రభుత్వ స్కూళ్లమీద నమ్మకం లేకపోవడమే. కానీ ప్రైవేటు స్కూళ్లతో పోల్చుకుంటే ఏ విషయంలోనూ నగరంలోని ప్రభుత్వ స్కూళ్లు తక్కువ కాదు. ఎంతో చరిత్ర కలిగిన పాఠశాలలు, మరెంతగానో అనుభవజ్ఞులైన టీచర్లు ప్రభుత్వ రంగంలో ఉన్నారు. అయితే కాస్తంత చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రభుత్వ స్కూళ్ల ముందు ప్రైవేటు ఫలితాలు ఎందుకూ కొరగావని నిరూపించుకోవచ్చు.
ప్రభుత్వ స్కూళ్లలో అన్నీ ప్రత్యేకతలే
నగరంలో అన్ని మాధ్యమాల్లో కలిసి 802 పాఠశాలలున్నాయి. వీటిలో 615 ప్రాథమిక పాఠశాలలు, 10 ప్రాథమికోన్నత, 177 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో 1,07,507 మంది విద్యార్థులున్నారు. నగరంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పాఠశాలలూ ఉన్నాయి. విద్యాశాఖ లెక్కల ప్రకారం 436 ప్రాథమిక పాఠశాలలకు, 10 ప్రాథమికోన్నత పాఠశాలలకు, 138 హైస్కూళ్లకు తాగునీటి వసతి వుంది. 442 ప్రాథమిక, 10 ప్రాథమికోన్నత, 142 ఉన్నత పాఠశాలలకు మరుగుదొడ్ల వసతి ఉంది. 221 ప్రాథమిక, 10 ప్రాథమికోన్నత, 115 ఉన్నత పాఠశాలలకు విద్యుత్ వసతి వుంది. వీటిలో అరవై శాతం స్కూళ్లకు ఆటస్థలాలు ఉన్నాయి.
టీచర్లంతా సుశిక్షితులే..
నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 5,300 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరంతా విద్యాబోధనలో శిక్షణ పొందిన వారే. 40 శాతం టీచర్లు పదేళ్లకు పైగా, 20 శాతం మంది టీచర్లు ఇరవై ఏళ్లకు పైగా అనుభవం గడించినవారున్నారు. వీరం తా డీఎస్సీ పోటీ పరీక్షల్లో ఎంపికైన వారు. ఇక్కడ ఎంపిక కాని వారే ప్రస్తుతం ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్నారు. విశేషమేమంటే 70 శాతం మంది ఉపాధ్యాయులు తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో చెప్పగలిగే సమర్థులు. పలు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు, ఆంగ్లం, హిందీ, తమిళ్, మరాఠీ, ఉర్దూ తదితర మాధ్యమాల్లో చదివేందుకు అవకాశం వుంది. ఇక్కడ చదివే విద్యార్థులందరికీ ఉచితంగా పాఠ్యపుస్తకాలు ప్రభుత్వమే ఇస్తుంది. ఫీజుల భారం అసలే వుండదు.
వెనుకబాటు ఎందుకు..?
ప్రైవేటు స్కూళ్లతో ఏ రకంగా పోల్చుకున్నా.. ప్రభుత్వ పాఠశాలలు మెరుగైనవే. అయితే ఫలితాల్లో ఎందుకు వెనకబడుతున్నాయి? ఇక్కడి విద్యార్థులు ఎందుకు రాణించలేకపోతున్నారు. దశాబ్ద కాలంగా ఫలితాలు మెరుగ్గా లేకపోవడానికి కారణాలేంటి? ఈ ప్రశ్నలన్నింటికి ఉపాధ్యాయుల్లో చిత్తశుద్ధి లోపించడం మొదటి కారణంగా చెప్పుకోవచ్చు. స్వీయ క్రమశిక్షణ లే కపోవడంతో, నైపుణ్యం ఉండి కూడా పిల్లలను మోటివేట్ చేయడంలో టీచర్లు వెనుకబడుతున్నారు.
ప్రభుత్వ పాఠ శాలల్లో చాలామంది ఉపాధ్యాయులు సమయానికి స్కూళ్లకు రావడం లేదు. ముఖ్యంగా విద్యాశాఖాధికారుల పర్యవేక్షణ లోపభూయిష్టంగా వుందని ఆరోపణలున్నాయి. కొందరు ఉపాధ్యాయులు యూనియన్ గొడవల్లో తలదూర్చుతూ విద్యార్థులకు న్యాయం చేయలేకపోతున్నారనేది మరో వాదన. ఎవరెన్ని చెప్పినా నగరంలోని విద్యావ్యవస్థపై ఉన్నతాధికారుల పర ్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త ప్రభుత్వమైనా నగరంలో విద్యావ్యవస్థ మెరుగుకు తగిన చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు.