Board of Control for Cricket in India
-
‘పాకిస్తాన్లో ఆడేదే లేదు’
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది పాకిస్తాన్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భారత్ పాల్గొనే విషయంపై స్పష్టత వచ్చింది. టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్తాన్‌కు భారత జట్టు వెళ్లడం లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తేల్చి చెప్పింది. పాక్ వేదికగా 2025 ఫిబ్రవరి–మార్చిలో ఎనిమిది జట్లతో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. అయితే ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారత్ అక్కడికి వెళ్లే విషయంపై చాలా రోజులుగా సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు దీనిని నిజం చేస్తూ బీసీసీఐ తమ నిర్ణయాన్ని ఖరాఖండీగా చెప్పేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ గడ్డపై తాము క్రికెట్ ఆడలేమని ప్రకటించింది. ఈ విషయాన్ని అధికారికంగా లేఖ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి తెలియజేసింది. తాము పాకిస్తాన్‌కు వెళ్లవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించినట్లుగా భారత బోర్డు సమాచారం అందించింది. తాజా పరిణామంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రత్యామ్నాయ వేదికలను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్‌తో పాటు భారత్‌కు ప్రత్యరి్థగా ఉండే జట్లు కూడా పాక్ వెలుపల ఉండే వేదికలో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుది. పాక్‌తో పాటు దేశం బయట మరో వేదికను ఎంచుకొని ‘హైబ్రిడ్ మోడల్’లో టోర్నీని నిర్వహించే ఆలోచనే లేదని పీసీబీ చైర్మన్ మొహసిన్ నక్వీ శుక్రవారం కూడా చెప్పారు. అయితే ఒక్కరోజులో పరిస్థితి అంతా మారిపోయింది. భారత మ్యాచ్‌లకు యూఏఈ వేదికగా మారే అవకాశాలు ఉన్నాయి. తాము సిద్ధమంటూ శ్రీలంక బోర్డు చెబుతున్నా... పాక్ కోణంలో వారికి అనుకూల, సౌకర్యవంతమైన వేదిక కాబట్టి యూఏఈకే మొగ్గు చూపవచ్చు. 2023లో భారత్‌లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ జట్టు వచ్చి ఆడినా... భారత్ మాత్రం అలాంటిదేమీ లేకుండా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకే కట్టుబడింది. నేటి నుంచి సరిగ్గా 100 రోజుల్లో చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. -
BCCI: దేశవాళీ క్రికెట్లో ప్రోత్సాహకాలు
ముంబై: దేశవాళీ క్రికెట్లో ఆటగాళ్ల ప్రదర్శనకు మరింత ప్రోత్సాహం అందించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై విజయ్ హజారే వన్డే టోర్నీ, ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచే ఆటగాళ్లకు ప్రైజ్‌మనీ కూడా ఇవ్వనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ రెండు టోరీ్నలలో నాకౌట్ మ్యాచ్‌లలో మాత్రమే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ను ప్రకటించేవారు. వీరికి కూడా మొమెంటో ఇస్తుండగా ప్రైజ్‌మనీ మాత్రం లేదు. లీగ్ దశ మ్యాచ్‌లలోనైతే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ను ప్రకటించే సంప్రదాయం లేదు. ఇకపై దీనిలో మార్పు రానుంది. మరోవైపు మహిళల క్రికెట్‌కు సంబంధించిన అన్ని టోరీ్నల్లోనూ, జూనియర్ క్రికెట్ టోర్నమెంట్లకు కూడా తాజా ‘ప్రైజ్‌మనీ’ నిర్ణయం వర్తిస్తుందని షా వెల్లడించారు. మంచి ప్రదర్శనకు తగిన గుర్తింపు ఇచ్చే వాతావరణాన్ని తాము నెలకొల్పుతున్నామని... బోర్డు అపెక్స్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. -
IPL 2024- BCCI: అభిమానులకు బ్యాడ్‌న్యూస్!
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా ఎడిషన్ నిర్వహణ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2024 ద్వితీయ అర్ధభాగ మ్యాచ్‌ల వేదికను మార్చనున్నట్లు సమాచారం. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ మేరకు బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఐపీఎల్ పదిహేడో సీజన్‌ను పూర్తిగా భారత్‌లోనే నిర్వహించడం ఖాయమైనట్లు లీగ్ చైర్మన్ అరుణ్ ధూమల్ గతంలోనే నిర్ధారించారు. ఫలితంగా... లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారత్ బయట మ్యాచ్‌లు జరిపే అవకాశాలపై జరిగిన చర్చకు తెర పడినట్లయింది. తొలుత 15 రోజుల మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల చేసి... ఆ తర్వాత మిగతా మ్యాచ్‌ల తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. అంతేకాదు.. అన్ని మ్యాచ్‌లు భారత్‌లోనే నిర్వహించడం ఖాయమని అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు. ఇందుకు తగ్గట్లుగానే ఫిబ్రవరి 22న తొలి 17 రోజుల మ్యాచ్‌ల(21)కు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. మార్చి 22 నుంచి లీగ్ ఆరంభం కానున్నట్లు తెలిపారు నిర్వాహకులు. అయితే, సెకండాఫ్ నిర్వహణ విషయంలో మాత్రం బీసీసీఐ తాజాగా నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు బీసీసీఐ సన్నిహిత వర్గాలు తెలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది. ‘‘భారత ఎన్నికల సంఘం ఈరోజు(శనివారం) మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎన్నికల నిర్వహణ షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఆ తర్వాతే ఐపీఎల్ సెకండాఫ్ ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. వేదికగా దుబాయ్‌ను ఎంచుకోవాలా లేదంటే ఇక్కడే అన్ని మ్యాచ్‌లను నిర్వహించాలా అన్న విషయం తేలుతుంది. అయితే, బీసీసీఐలోని కొంతమంది పెద్దలు మాత్రం ఇప్పటికే దుబాయ్ వైపు మొగ్గుచూపుతున్నారు’’ అని తెలిపింది. ఒకవేళ ఐపీఎల్-2024 మిగిలిన మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించడం ఖాయమైతే.. దేశంలోనే మ్యాచ్‌లు(ఖర్చుల దృష్ట్యా) వీక్షించాలనుకున్న అభిమానులకు షాక్ తగిలినట్లే మరి!! చదవండి: ICC- T20WC: ఎడాపెడా దంచేసినా పర్లేదు కానీ.. ఇకపై అలా కుదరదు! -
Asian Games 2023: బోణీలోనే బంగారం
హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో గతంలో రెండుసార్లు (2010, 2014) మాత్రమే క్రికెట్ క్రీడాంశంగా ఉంది. అయితే ఆ రెండుసార్లూ భారత క్రికెట్ జట్లు బరిలోకి దిగలేదు. దాంతో మహిళల విభాగంలో పాకిస్తాన్ రెండుసార్లు స్వర్ణం సాధించగా... పురుషుల విభాగంలో బంగ్లాదేశ్ (2010), శ్రీలంక (2014) ఒక్కోసారి బంగారు పతకం గెల్చుకున్నాయి. మూడోసారి మాత్రం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మనసు మార్చుకొని ఆసియా క్రీడల్లో భారత జట్లను పంపించాలని నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ నిర్ణయం సరైందేనని నిరూపిస్తూ భారత మహిళల జట్టు బరిలోకి దిగిన తొలిసారే బంగారు పతకాన్ని తమ ఖాతాలో జమ చేసుకుంది. టి20 ఫార్మాట్లో జరిగిన ఈ పోటీల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు చాంపియన్‌గా అవతరించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శ్రీలంకతో సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 19 పరుగుల తేడాతో గెలిచింది. రెండు మ్యాచ్‌ల నిషేధం ముగియడంతో ఫైనల్లో రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సారథ్యంలో భారత్ పోటీపడింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరించింది. స్వర్ణ పతకం నెగ్గిన భారత జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బారెడ్డి అనూష సభ్యురాలిగా ఉంది. అయితే ఆమెకు మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. టిటాస్ సాధు కట్టడి... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు సాధించింది. స్మృతి మంధాన (45 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా రోడ్రిగ్స్ (40 బంతుల్లో 42; 5 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 97 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. భారత టీనేజ్ పేస్ బౌలర్ టిటాస్ సాధు 4 ఓవర్లలో 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బ తీసింది. మరోవైపు బంగ్లాదేశ్ జట్టుకు కాంస్య పతకం లభించింది. కాంస్య పతక మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి) ప్రబోధని (బి) రణవీర 46; షఫాలీ వర్మ (స్టంప్డ్) సంజీవని (బి) సుగంధిక 9; జెమీమా (సి) విష్మీ (బి) ప్రబోధని 42; రిచా ఘోష్ (సి) సంజీవని (బి) రణవీర 9; హర్మన్‌ప్రీత్ కౌర్ (సి) సంజీవని (బి) ప్రబోధని 2; పూజ వస్త్రకర్ (సి) విష్మీ (బి) సుగంధిక 2; దీప్తి శర్మ (నాటౌట్) 1; అమన్‌జోత్ కౌర్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 116. వికెట్ల పతనం: 1–16, 2–89, 3–102, 4–105, 5–108, 6–114, 7–116. బౌలింగ్: ఒషాది 2–0–11–0, ఉదేశిక ప్రబోధని 3–0–16–2, ఇనోషి 3–1–11–0, సుగంధిక 4–0–30–2, చమరి ఆటపట్టు 2.5–0–19–0, కవిశ 1.1–0–7–0, ఇనోక రణవీర 4–0–21–2. శ్రీలంక ఇన్నింగ్స్: చమరి ఆటపట్టు (సి) దీప్తి (బి) టిటాస్ సాధు 12; అనుష్క సంజీవని (సి) హర్మన్ (బి) టిటాస్ సాధు 1; విష్మీ (బి) టిటాస్ సాధు 0; హాసిని పెరీరా (సి) పూజ (బి) రాజేశ్వరి 25; నీలాక్షి (బి) పూజ 23; ఒషాది (సి) టిటాస్ సాధు (బి) దీప్తి 19; కవిశ (సి) రిచా (బి) దేవిక 5; సుగంధిక (స్టంప్డ్) రిచా (బి) రాజేశ్వరి 5; ఇనోషి (నాటౌట్) 1; ఉదేశిక ప్రబోధని (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 97. వికెట్ల పతనం: 1–13, 2–13, 3–14, 4–50, 5–78, 6–86, 7–92, 8–96. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–25–1, పూజ 4–1–20–1, టిటాస్ సాధు 4–1–6–3, రాజేశ్వరి 3–0–20–2, అమన్‌జోత్ కౌర్ 1–0–6–0, దేవిక వైద్య 4–0–15–1. ఆసియా క్రీడల్లో సోమవారం భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. జాతీయ గీతం రెండుసార్లు మోగింది. షూటింగ్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో... మహిళల క్రికెట్లో టీమిండియా స్వర్ణ పతకాలతో సత్తా చాటుకుంది. భారత్‌కు షూటింగ్‌లోనే రెండు కాంస్యాలు, రోయింగ్‌లో మరో రెండు కాంస్యాలు లభించాయి. ఓవరాల్‌గా రెండోరోజు భారత్ ఖాతాలో ఆరు పతకాలు చేరాయి. ఈ మూడు క్రీడాంశాల్లో మినహా ఇతర ఈవెంట్స్‌లో భారత క్రీడాకారులు నిరాశపరిచారు. -
ప్రపంచంలోనే సంపన్న బోర్డు.. వేలకోట్లు! ప్రభుత్వానికి చెల్లించేది ఎంతంటే!
BCCI's Income Tax: ప్రపంచంలోనే సంపన్న క్రికెట్ బోర్డుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రసిద్ది పొందింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి నుంచి అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న జాబితాలోనూ అగ్రస్థానంలో ఉంది. క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతూ మీడియా హక్కులు, స్పాన్సర్లతో భారీ ఒప్పందాలు తదితర కార్యకలాపాలతో దండిగా సంపాదిస్తోంది బీసీసీఐ. ఐసీసీ నుంచి అత్యధికంగా ఇక 2024-27 కాలానికి గానూ ఐసీసీ నుంచి.. బీసీసీఐ తమ వాటాగా ఏడాదికి 230 మిలియన్ యూఎస్ డాలర్లు(సుమారు రెండు వేల కోట్లు) పొందనున్నట్లు బోర్డు కార్యదర్శి జై షా ఇటీవలే వెల్లడించారు. మరి వేల కోట్ల సంపాదనతో రిచెస్ట్ బోర్డుగా ఘనతకెక్కిన బీసీసీఐ ప్రభుత్వానికి ఎంత మేర పన్ను చెల్లిస్తుందో తెలుసా?! వేలకోట్ల ఆదాయం అక్షరాలా పదకొండు వందల నూట యాభై తొమ్మిది కోట్లు! 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ బీసీసీఐ ఈ మేర ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లించినట్లు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో వెల్లడించారు. అదే విధంగా.. గత ఐదేళ్లలో బీసీసీఐ చెల్లించిన టాక్స్ వివరాలను సభలో వినిపించారు. ఇక 2017-18లో 596.63 కోట్లు, 2019-20లో 882.29 కోట్లు, 2020-21లో 844.92 కోట్లు పన్ను చెల్లించినట్లు తెలిపారు. 2021-22లో బీసీసీఐ ఆదాయం 7,606 కోట్ల రూపాయలుగా ఉందన్న మంత్రి.. ఖర్చుల రూపంలో 3064 కరిగిపోయినట్లు వెల్లడించారు. ప్రధాన వనరు అదే! అదే విధంగా.. 2020-21 ఏడాదికి గానూ రికార్డు స్థాయిలో 4735 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించగా.. 3080 వ్యయమైనట్లు బీసీసీఐ తెలిపిందని పేర్కొన్నారు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా బీసీసీఐ భారీ ఎత్తున ఆదాయం ఆర్జిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: మరీ ఇంత స్వార్ధమా.. ధోనిని చూసి నేర్చుకో! ఏంటి హార్దిక్ ఇది? మా కెప్టెన్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు.. అదే నా మెదడును తొలిచేసింది! అందుకే.. -
67 వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి! టీమిండియాతో ‘బంధం’: భావోద్వేగ ట్వీట్
Team India sponsorship Who Is Harsh Jain: టీమిండియా కొత్త స్పాన్సర్‌గా డ్రీమ్11ను ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. దేశంలోనే అతిపెద్ద ఫాంటసీ స్పోర్ట్స్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ను తమ భాగస్వామిగా చేసుకున్నట్లు శనివారం వెల్లడించింది. మూడేళ్ల పాటు భారత ఆటగాళ్లు తమ జెర్సీలపై డ్రీమ్11 లోగోతో బరిలోకి దిగనున్నట్లు తెలిపింది. నిజానికి క్రికెట్ ప్రేమికులకు డ్రీమ్11 గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిన్నగా మొదలై.. 15 ఏళ్ల కాలంలో ఎన్నో కష్టనష్టాలకోర్చి నేడు భారత జట్టు ప్రధాన స్పాన్సర్‌గా ఎదిగింది ఈ గేమింగ్ ప్లామ్ఫామ్. ఇందులో ఈ సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ హర్ష్ జైన్‌ది కీలక పాత్ర. 150 సార్లు తిరస్కరణ ముంబైలో జన్మించిన హర్ష్ జైన్ అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించాడు. తన కాలేజీ స్నేహితుడు భవిత్ సేత్తో కలిసి డ్రీమ్11ను ఏర్పాటు చేయాలని భావించాడు. అయితే వీరికి అడుగడుగునా అవాంతరాలే ఎదురయ్యాయి. నిధుల సమీకరణ కోసం ప్రయత్నించగా ఏకంగా 150 సార్లు ‘నో’ అనే సమాధానమే వచ్చింది. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా హర్ష్, భవిత్ సవాళ్లను అధిగమించి 2008లో డ్రీమ్11ను ఏర్పాటు చేశారు. క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ, బాస్కెట్‌బాల్ వంటి ఫాంటసీ గేమ్‌లు ఆడుకునేందుకు వీలుగా ఉన్న గేమింగ్ ప్లాట్‌ఫామ్‌కు దాదాపు 150 మిలియన్ మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ప్రస్తుతం డ్రీమ్11 విలువ దాదాపు 67 వేల కోట్లు ఉంటుందని అంచనా. భావోద్వేగ ట్వీట్‌తో ఇదిలా ఉంటే.. బీసీసీఐతో మరోసారి జట్టుకట్టడం పట్ల హర్ష్ జైన్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘‘డ్రీమ్11 ఇండియా. గత 15 ఏళ్ల కాలంలో మేము ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం. అయితే, ఈసారి భారత క్రికెట్ జట్టు జెర్సీపై మా లోగో చూడబోతున్నాం. వ్యక్తిగతంగా నాకు అత్యంత గర్వకారణమైన విషయం ఇది. మా ప్రయాణంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అని హర్ష్ జైన్ భావోద్వేగ ట్వీట్ చేశాడు. క్రికెట్ ప్రేమికుడైన తన కల ఇలా నెరవేరినందుకు హర్షం వ్యక్తం చేశాడు. ప్రపంచంలోని సంపన్న బోర్డుతో ఐపీఎల్-2020 సందర్భంగా ప్రపంచంలోని అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐతో తొలిసారి జట్టుకట్టింది డ్రీమ్11. ఆ సీజన్లో టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఈసారి ఏకంగా జెర్సీ స్పాన్సర్‌గా లీగ్ స్పాన్సర్ అవతారమెత్తింది. ఇక వెస్టిండీస్ పర్యటనలో భాగంగా జూలై 12 నుంచి ఆరంభం కానున్న టెస్టు సిరీస్‌లో డ్రీమ్11 లోగోలతో కూడిన జెర్సీలను భారత ఆటగాళ్లు ధరించనున్నారు. చదవండి: రవీంద్ర జడేజాలా అతడు కూడా త్రీడీ క్రికెటర్.. డేంజరస్ హిట్టర్! కాబట్టి.. సచిన్, గంగూలీ, వీరూకు కలిసి రాలేదు! కానీ ధోని రూటే సపరేటు కదా! DREAM11 INDIA. In the last 15 years of running @Dream11 we've had many highs and lows, but seeing THIS on our Indian Cricket team jersey will be the PROUDEST moment for me personally! 🇮🇳🇮🇳🇮🇳 Thank you everyone for all your ❤️ and support always! 🙏🏼https://t.co/Ft8Qh9mA0d — Harsh Jain (@harshjain85) July 1, 2023 -
భారత క్రికెట్ జట్టు కిట్ స్పాన్సర్‌గా అడిడాస్
చెన్నై: జర్మనీకి చెందిన ప్రముఖ క్రీడా ఉత్పాదనల సంస్థ అడిడాస్ భారత క్రికెట్ జట్టు కిట్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ప్రస్తుత స్పాన్సర్ ‘కిల్లర్ జీన్స్’తో కాంట్రాక్టు గడువు ఈ నెలాఖరుతో ముగియనుండటంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త స్పాన్సర్షిప్ ఇచ్చింది. దీనిపై బోర్డు కార్యదర్శి జై షా మాట్లాడుతూ ‘దేశంలో క్రికెట్ అభివృద్ధి అంచనాలను మించుతుంది. కాబట్టి ప్రపంచశ్రేణి సంస్థ మాతో జట్టు కట్టడంపై పెద్దగా ఆశ్చర్యమేమీ లేదు’ అని అన్నారు. జర్మన్ స్పోర్ట్స్ బ్రాండ్ అయిన అడిడాస్‌తో ఒప్పందం ఎన్నేళ్లు, ఎంత మొత్తానికి స్పాన్సర్షిప్ పొందిందనే వివరాలేవీ ఆయన వెల్లడించలేదు. విశ్వసనీయ వర్గాల ప్రకారం రూ. 350 కోట్లతో అడిడాస్ కిట్ స్పాన్సర్షిప్ దక్కించుకున్నట్లు తెలిసింది. టీమిండియా వచ్చే నెల 7 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో తలపడుతుంది. ఆ జెర్సీలపై అడిడాస్ లోగో కనిపించనుంది. టీమ్ స్పానర్ బైజుస్ కూడా మారుతున్నట్లు తెలిసింది. ఈ నవంబర్ వరకు గడువున్నప్పటికీ సదరు సంస్థ ముందుగానే వైదొలగనుండటంతో త్వరలోనే బిడ్లను ఆహ్వానిస్తారు. -
WC 2023: సర్వ సన్నద్ధం కోసం... బీసీసీఐ సమావేశం! 20 మందితో ప్రపంచకప్ సైన్యం
ముంబై: ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా క్రికెటర్ల ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమివ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. ఆదివారం బోర్డు ఉన్నతస్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆటగాళ్లకు కఠిన పరీక్ష పెట్టే యో–యో ఫిట్నెస్ టెస్టును తిరిగి ప్రవేశ పెట్టనున్నారు. ప్రత్యేకించి ఈ ఏడాది వరల్డ్‌కప్‌తో పాటు, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ కూడా ఉండటంతో భారత ప్రపంచకప్ సైన్యంపై అదనపు ఒత్తిడి, క్రికెట్ భారం లేకుండా పక్కా ప్రణాళికతో సిరీస్‌లకు ఎంపిక చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. ► బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో బోర్డు కార్యదర్శి జై షా, భారత కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్, చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ పాల్గొన్నారు. బిన్నీ మాత్రం వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరయ్యారు. ► కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్ ఇలా గత కొంతకాలంగా భారత కెప్టెన్లను మార్చినప్పటికీ పూర్తిస్థాయి సారథిగా రోహిత్ శర్మనే కొనసాగించాలని తీర్మానించారు. తద్వారా సారథ్య మార్పు ఉండదని స్పష్టం చేశారు. ► మెగా టోర్నీ, మేటి జట్లతో సిరీస్‌ల నేపథ్యంలో జట్టు సెలక్షన్ కోసం యో–యో టెస్టు, డెక్సా (ఎముకల పరిపుష్టి పరీక్ష) టెస్టుల్ని నిర్వహిస్తారు. ఎంపికవ్వాలంటే ఈ టెస్టులు పాసవ్వాలి. ► ఎమర్జింగ్ ప్లేయర్లు ఐపీఎల్‌తో పాటు ప్రాధాన్యత గల దేశవాళీ టోర్నీల్లో ఆడి ఫిట్నెస్ నిరూపించుకున్న వారిని జాతీయ జట్టుకు ఎంపిక చేస్తారు. ► ప్రపంచకప్‌కు ఎంపికయ్యే క్రికెటర్లంతా పూర్తి ఫిట్నెస్తో మెగా ఈవెంట్‌కు అందుబాటులో ఉండేలా చూడటమే ప్రాధాన్య అంశంగా భేటీ జరిగింది. ఆటగాళ్లపై బిజీ షెడ్యూల్ భారం, ఒత్తిడి, మెంటల్ కండిషనింగ్, ఫిట్నెస్ అంశాల్ని ఇందులో చర్చించారు. ► మంచి ఆల్‌రౌండర్ అవుతాడనుకున్న దీపక్ చహర్, భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తరచూ గాయాల పాలవడంపై చర్చించిన మీదట ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ► అవసరమైతే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలతో కూడా బోర్డు పెద్దలు మాట్లాడతారు. ఈ ఏడాది భారత క్రికెట్‌కు అత్యంత కీలకం కాబట్టి ఆయా ఫ్రాంచైజీలు ఐపీఎల్ టోర్నీ సమయంలో తమ స్టార్ ఆటగాళ్లపై పెనుభారం మోపకుండా చూస్తారు. ► గతంలో కోహ్లి కెప్టెన్సీ హయాంలో యో–యో టెస్టు వార్తల్లో నిలిచింది. అయితే ఇది స్టార్, ఎలైట్ ఆటగాళ్లను కష్టపెట్టడంతో తాత్కాలికంగా యో–యో టెస్టును పక్కన పెట్టారు. ► ఆస్ట్రేలియాలో జరిగిన టి20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్ వైఫల్యం దరిమిలా తొలగించిన సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ ఈ కీలక మీటింగ్‌లో పాల్గొనడం గమనార్హం. 20 మందితో ప్రపంచకప్ సైన్యం... సొంతగడ్డపై ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో జరిగే ప్రపంచకప్ కోసం 20 మందితో కూడిన జాబితాను సిద్ధం చేశారు. మెగా టోర్నీ జరిగేదాకా వీరందరూ కూడా ఒకే టోర్నీలో బరిలోకి దిగరు. రొటేషన్ పద్ధతిలో ఆడతారు. కొందరికి విశ్రాంతి... ఇంకొందరు బరిలోకి అన్నట్లుగా ఈ పద్ధతి సాగుతుంది. గాయాల పాలవకుండా, మితిమీరిన క్రికెట్ భారం పడకుండా ఉండేందుకు బోర్డు ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
Roger Binny: గంగూలీకి బైబై! బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ
BCCI New President: భారత క్రికెట్ నియంత్రణ మండలి 36వ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ రోజర్ బిన్నీ ఎంపికయ్యారు. భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్థానంలో బీసీసీఐ బాస్‌గా పగ్గాలు చేపట్టారు. ముంబైలోని తాజ్ హోటల్లో మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశం తర్వాత బోర్డు ఈ మేరకు ప్రకటన వెలువరించింది. కాగా ఈ సమావేశంలో సౌరవ్ గంగూలీ సహా బీసీసీఐ కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ ధుమాల్ తదితరులు పాల్గొన్నారు. ఇక బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగాలని గంగూలీ భావించినప్పటికీ విముఖత వ్యక్తం కావడంతో నామినేషన్ వేయలేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పదవి కోసం నామినేషన్ దాఖలు చేసిన ఏకైక వ్యక్తిగా ఉన్న 67 ఏళ్ల రోజర్ బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ ఘనత బిన్నీకే దక్కింది! భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన తొలి ఆంగ్లో ఇండియన్ రోజర్ బిన్నీ. ఆయన స్వస్థలం కర్ణాటకలోని బెంగళూరు. 1983 ప్రపంచకప్ గెలిచిన జట్టులో రోజర్ బిన్నీ సభ్యుడిగా ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో మొట్టమొదటిసారి భారత్ విశ్వవిజేతగా నిలవడంలో ఈ రైట్ ఆర్మ్ మీడియం పేసర్‌ది కీలక పాత్ర. ఆ ఎడిషన్‌లో 18 వికెట్లు తీసి వెలుగులోకి వచ్చారు. కాగా భారత్ తరఫున 27 టెస్టులాడి 47 వికెట్లు తీసిన రోజర్ బిన్నీ.. 72 వన్డేల్లో 77 వికెట్లు కూల్చారు. దేశవాళీ క్రికెట్లో కర్ణాటకు ప్రాతినిథ్యం వహించిన రోజర్ బిన్నీ.. ఆ రాష్ట్ర బోర్డు ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు. చదవండి: అధ్యక్షుడిగా రోజర్ బిన్నీనే ఎందుకు?.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? -
బీసీసీఐ ఎన్నికలు: ముహూర్తం ఖరారు
ముంబై: ప్రపంచ క్రికెట్లో అత్యంత ధనిక బోర్డులో ఎన్నికలకు నగారా మోగింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లోని పదవుల కోసం అక్టోబర్ 18న ఎన్నికలు జరపనున్నట్లు బోర్డు ఎన్నికల అధికారి ప్రకటించారు. అదే రోజు బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) కూడా నిర్వహిస్తారు. భారత ఎలక్షన్ కమిషన్ మాజీ చీఫ్ కమిషనర్ ఏకే జోటి దీనికి ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు. నోటిఫికేషన్ జారీ చేసిన ఆయన ఈ వివరాలను ఇప్పటికే బీసీసీఐ పరిధిలోని రాష్ట్ర క్రికెట్ సంఘాలకు అందించారు. వీరంతా తమ సంఘం తరఫు నుంచి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలను బోర్డుకు పంపించాలని ఆయన కోరారు. గతంలో ఎన్నికల ప్రక్రియలో వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం అమలులో ఉన్న అన్ని నిబంధనల ప్రకారం అర్హత ఉన్నవారే బరిలోకి దిగాలని కూడా ఎన్నికల అధికారి ప్రత్యేకంగా సూచించారు. బోర్డు నియమావళి ప్రకారం ఐదు కీలకమైన ఆఫీస్ బేరర్ పదవులకు (అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి) ఎన్నికలు జరుగుతాయి. దీంతో పాటు ఒక అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిని, ఇద్దరు గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులను కూడా ఎన్నుకుంటారు. అక్టోబర్ 11, 12 తేదీల్లో దరఖాస్తులు స్వీకరించనుండగా... 18న ఎన్నికలు జరిపి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఇప్పటికే బీసీసీఐ ఎన్నికల ప్రక్రియ ముగియాల్సి ఉన్నా... వివిధ అంశాలపై సుప్రీం కోర్టు నుంచి స్పష్టత కోరుతూ బోర్డు ఇప్పటి వరకు ఆగింది. ఇటీవల సుప్రీం కోర్టులో దీనికి సంబంధించి కీలక ఆదేశాలు రావడంతో మార్గం సుగమమైంది. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులుగా ఉన్న సౌరవ్ గంగూలీ, జై షా అదే పదవుల కోసం బరిలో ఉంటారా... లేక వీరిలో ఒకరు ఐసీసీ వైపు వెళ్లి కొత్తవారు ఆ పదవిలో వస్తారా వేచి చూడాలి. -
బీసీసీఐ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 18న ఎన్నికలు జరగనుండగా, అదే రోజున ఫలితాలు వెలువడనున్నాయి. అక్టోబర్ 4వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ, సెక్రటరీగా జైషా కొనసాగుతున్నారు. -
టి20లకు కొత్త ‘మెరుపు’
ముంబై: టి20లు ఎక్కడ జరిగినా దానికున్న క్రేజే వేరు. భారత్‌లో అయితే మరీనూ! అందుకే పొట్టి ఆటకు మరో ‘మెరుపు’ జత చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గట్టి ప్రయత్నమే చేస్తోంది. విశేష ఆదరణ చూరగొన్న టి20 క్రికెట్ ప్రాచుర్యాన్ని మరింత పెంచాలని సరికొత్త ప్రయోగానికి బీసీసీఐ సిద్ధమైంది. ఇందులో భాగంగా ‘టాక్టికల్ సబ్‌స్టిట్యూట్’ను ప్రవేశ పెట్టనుంది. ముందుగా దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో అమలు చేసి... అందులో విజయవంతమైతే వెంటనే వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌లోనూ కొత్త సొబగుతో సరికొత్త ‘షో’కు శ్రీకారం చుట్టాలని బీసీసీఐ భావిస్తోంది. అక్టోబర్ 11 నుంచి జరిగే ముస్తాక్ అలీ టోర్నీలో ‘టాక్టికల్ సబ్‌స్టిట్యూట్’ నిబంధన తీసుకొస్తున్నట్లు బోర్డు ఇది వరకే అనుబంధ రాష్ట్ర సంఘాలకు సమాచారం ఇచ్చింది. ఏంటీ ఇంపాక్ట్ ప్లేయర్ కథ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ కొత్తేం కాదు. ఆటగాడు గాయపడితే సబ్‌స్టిట్యూట్‌ను ఎప్పటి నుంచో ఆడిస్తున్నారు. కానీ బ్యాటింగ్, బౌలింగ్ చేసేందుకు వీల్లేదు. ఫీల్డింగ్‌కే పరిమితం! తలకు గాయమైన సందర్భంలో కన్కషన్ అయితే మాత్రం బ్యాటింగ్, లేదా బౌలింగ్ చేసే వెసులుబాటు సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌కు ఉంది. అయితే ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ భిన్నమైంది. టాస్కు ముందు తుది జట్టుకు అదనంగా నలుగురు ఆటగాళ్ల జాబితా ఇస్తారు. ఇందులో ఒకరు సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా పూర్తిస్థాయి ఆటగాడి హక్కులతో ఆడతాడు. 14వ ఓవర్ పూర్తయ్యేలోపు తుది 11 మందిలో ఒకరిస్థానంలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ను బరిలోకి దింపొచ్చు. ఇది గేమ్ చేంజర్ కాగలదని బీసీసీఐ భావిస్తోంది. ఈ తరహా నిబంధన బిగ్‌బాష్ లీగ్‌లో కొన్ని షరతులతో ఉంది. అప్పట్లో... వన్డేల్లో! క్రికెట్లో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ ప్రయోగం కొత్తేం కాదు. 17 ఏళ్ల క్రితం వన్డేల్లో సబ్‌స్టిట్యూట్ ఆటగాడిని ఆడించారు. ఐసీసీ 2005లో ప్రవేశపెట్టిన నిబంధన ప్రకారం టాస్కు ముందు 12వ ఆటగాడిగా ఆ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌ను జట్లు ప్రకటించేవి. తుది జట్లకు ఆడించేవి. కారణాలేవైనా 2006 ఏడాది తర్వాత ఈ నిబంధనను ఎత్తేశారు. -
IND VS ZIM: జింబాబ్వేకు బీసీసీఐ ఇస్తున్న ‘ఆర్థిక బహుమతి’... మరో సిరీస్ వేటలో టీమిండియా!
India Tour Of Zimbabwe- హరారే: ఈ మధ్య విదేశానికెళ్లిన చోటల్లా విభిన్న కెప్టెన్లతో బరిలోకి దిగుతున్న టీమిండియా ఫలితాల్లో మాత్రం నిలకడగా సిరీస్ విజయాలను సాధిస్తోంది. ఇప్పుడు కూడా మరో ప్రయత్నం మరో సారథితో చేస్తోంది. జింబాబ్వే పర్యటనలో కేఎల్ రాహుల్ సారథ్యంలోని భారత్ నేడు తొలి వన్డే ఆడనుంది. ఈ పర్యటన జింబాబ్వేకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇస్తున్న ‘ఆర్థిక బహుమతి’. కేవలం ఈ మూడు వన్డేల సిరీస్‌తో వచ్చే రాబడితోనే జింబాబ్వే బోర్డు సగం ఏడాదికి సరిపడా ఖర్చుల్ని వెళ్లదీసుకుంటుందంట! ఈ నేపథ్యంలో ఇక్కడ సిరీస్ ఆసక్తికరమనే కంటే కూడా... ఆతిథ్య బోర్డుకు ఆర్థిక పుష్టికరమని చెప్పాలి. అందరి కళ్లు రాహుల్, చహర్లపైనే... ఇక సిరీస్ విషయానికొస్తే జట్టు కంటే కూడా... కొత్త కెప్టెన్ రాహుల్‌కు అగ్ని పరీక్షలాంటిది. ఎందుకంటే టీమిండియా ఇటీవల ఏ దేశమేగినా... ఎందుకాలిడినా గెలుస్తూనే వస్తోంది. ఎటొచ్చి ‘స్పోర్ట్స్ హెర్నియా’ సర్జరీతో రెండు నెలలుగా ఆటకు దూరమైన రాహుల్ ఫిట్‌నెస్‌కే ఇది టెస్ట్! ఇక్కడ ఈ టాపార్డర్ బ్యాటర్ త్రిపాత్రాభినయం చేయాల్సి వస్తుంది. 100 ఓవర్ల పాటు మైదానంలో ఫిట్నెస్ నిరూపించుకోవాలి. సారథిగా జట్టును నడిపించాలి. టాపార్డర్‌లో బ్యాట్‌తో సత్తా చాటాలి. అలాగే మరో ఆటగాడు కూడా సవాలుకు సిద్ధమయ్యాడు. గాయంతో ఫిబ్రవరి నుంచి అసలు మైదానంలోకే దిగని దీపక్ చహర్ సుమారు ఆరు నెలల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌ల కోసం అతన్ని పరిశీలించాలంటే అందుబాటులో ఉన్న ఈ కొద్ది మ్యాచ్‌ల్లోనే ఆల్‌రౌండర్‌గా నిరూపించుకోవాలి. ధావన్, గిల్, సామ్సన్ అంతా ఫామ్‌లోనే ఉన్నారు. బౌలింగ్‌లోనూ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్లతో భారత జట్టే బలంగా ఉంది. ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ తన వన్డే కెరీర్‌ను... అక్షర్ పటేల్, సంజూ సామ్సన్ తమ టి20 కెరీర్‌ను జింబాబ్వేలోనే ప్రారంభించారు. జోరు మీదుంది కానీ... ఈ నెలలోనే తమ దేశానికి వచ్చిన బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన జింబాబ్వే జోరుమీదుంది కానీ... భారత్‌లాంటి అసాధారణ ప్రత్యర్థితో ఎలా ఆడుతుందనేదే అసక్తికరం. ఏ రకంగా చూసినా కూడా టీమిండియాకు దీటైన ప్రత్యర్థి కాదు. కానీ సొంతగడ్డపై ఉన్న అనుకూలతలతో, ఇటీవలి విజయాలిచ్చిన ఆత్మవిశ్వాసంతో గట్టి పోటీ ఇచ్చేందుకు జింబాబ్వే తహతహలాడుతోంది. కెప్టెన్, వికెట్ కీపర్ రెగిస్ చకాబ్వా, సికందర్ రజా, ఇన్నోసెంట్ కయా చక్కని ఫామ్‌లో ఉన్నారు. అయితే బౌలింగ్ మాత్రం పేలవమనే చెప్పాలి. టీమిండియాలాంటి టాప్ ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే బౌలింగ్ విభాగం కూడా మెరగవ్వాలి. చదవండి: Vinod Kambli: ఏదైనా పని ఉంటే ఇప్పించండి.. చాలీచాలని జీతంతో బ్రతుకీడుస్తున్నా..! WI VS NZ 1st ODI: రెచ్చిపోయిన బౌలర్లు.. బోణీ కొట్టిన విండీస్ IRE VS AFG 5th T20: ఆఫ్ఘనిస్తాన్‌కు షాకిచ్చిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం -
భారత్ మాటే శాసనం.. వాళ్లేం చెబితే అదే జరుగుతుంది: ఆఫ్రిది
BCCI- IPL- ICC’s Future Tours Programme (FTP): క్రికెట్ ప్రపంచంలో సంపన్న బోర్డుగా పేరుగాంచింది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). ఇటీవల ముగిసిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలం విషయంలో 2023-27 కాలానికి గానూ 48 వేల కోట్ల రూపాయలు ఆర్జించి మరోసారి తన విలువను చాటుకుంది. ప్రపంచంలోనే అత్యంత విలువ కలిగిన స్పోర్ట్స్ ప్రాపర్టీ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఈ ఒక్క విషయం చాలు.. క్యాష్ రిచ్ లీగ్‌కు ఉన్న క్రేజ్, దీనిని నిర్వహిస్తున్న బీసీసీఐ సత్తా ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో భాగస్వామ్యమైన క్రికెటర్లు కొన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లకు కూడా దూరమవుతున్నారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఉన్న ఆదరణ దృష్ట్యా.. దీని కోసం ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్(ఎఫ్టీపీ) క్యాలెండర్లో భాగంగా రెండున్నర నెలల పాటు ప్రత్యేకంగా ఓ షెడ్యూల్ రూపొందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు. వివిధ దేశాల ఆటగాళ్లు ఇందులో భాగమైన నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ నిర్ణయం పాకిస్తాన్ క్రికెట్‌పై ప్రభావం చూపుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. క్రికెటేతర కారణాల వల్ల ఐపీఎల్లో పాకిస్తాన్ ఆటగాళ్లపై నిషేధం కొనసాగుతున్న విషయం విదితమే. ఇక ఇప్పుడు ఐసీసీ ఎఫ్టీపీ క్యాలెండర్(మ్యాచ్ షెడ్యూల్స్) విషయంలోనూ ఐపీఎల్ ప్రభావం చూపుతుందన్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ ఏం చెబితే క్రికెట్ ప్రపంచంలో అదే జరగుతుందని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు సామా టీవీ షోలో ఆఫ్రిది మాట్లాడుతూ.. ‘‘మార్కెట్ వ్యూహాలు, ఎకానమీలో ఇదంతా ఒక భాగం. క్రికెట్ ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్ ఇండియా. కాబట్టి వాళ్లేం చెబితే అదే ఇక్కడ జరుగుతుంది’’ అని పేర్కొన్నాడు. ఇక గతంలో ఐపీఎల్‌ను అతి పెద్ద బ్రాండ్ లీగ్‌గా అభివర్ణించిన ఆఫ్రిది.. ఇలాంటి మెగా టోర్నీలో పాకిస్తాన్ ఆటగాళ్లకు చోటు లేకపోవడం పెద్ద లోటు అని వ్యాఖ్యానించాడు. చదవండి: Carlos Braithwaite: 'చేసిన పాపం ఊరికే పోదు'.. బౌలర్ తిక్క కుదిర్చిన అంపైర్ ODI WC 1975: మొట్టమొదటి విజేత విండీస్.. సరిగ్గా ఇదే రోజు.. జట్టును గెలిపించింది ఎవరో తెలుసా? ఇతర విశేషాలు! -
IPL: అమెజాన్ అవుట్
న్యూఢిల్లీ: భారత కుబేరుడు ముకేశ్ అంబానీ, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్‌ల మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా ప్రసార హక్కుల పోటీ రసవత్తరం అవుతుందనుకుంటే... మరోకటి జరిగింది. ఈ రేసు నుంచి ఓటీటీ సంస్థ అమెజాన్ తప్పుకుంది. దీంతో రిలయన్స్‌కు చెందిన ‘వయాకామ్ 18’ మిగతా మూడు సంస్థలతో రేసులో నిలిచింది. అమెజాన్ సహా డిస్నీ స్టార్, వయాకామ్–18, సోనీ, జీ సంస్థలు ప్రాథమిక బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొన్నాయి. అయితే శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వైదొలగడంతో ఇప్పుడు టీవీ, డిజిటల్ హక్కుల పోటీ ప్రధానంగా నాలుగు సంస్థల మధ్యే నెలకొనే అవకాశముంది. నిజానికి అపర కుబేరుడికి చెందిన అమెజాన్ పోటీలో ఉన్నంతసేపూ ఈసారి ఐపీఎల్ మీడియా హక్కులకు ఎవరూ ఊహించని విధంగా రూ. 70 వేల కోట్ల మొత్తం రావొచ్చని బ్రాడ్‌కాస్టింగ్ వర్గాలు భావించాయి. కానీ కారణం లేకుండానే అమెజాన్ తప్పుకోవడంతో ముందనుకున్న అంచనాలు తప్పే అవకాశముంది. ‘అవును అమెజాన్ ఐపీఎల్ మీడియా ప్రసార హక్కుల ప్రక్రియ నుంచి వైదొలగింది. బిడ్ వేసేందుకు డాక్యుమెంట్లు తీసుకుంది. కానీ శుక్రవారం కీలకమైన సాంకేతిక బిడ్డింగ్‌లో వాటిని దరఖాస్తు చేయలేదు. గూగుల్‌కు చెందిన యుట్యూబ్ వాళ్లు కూడా డాక్యుమెంట్ కొనుగోలు చేశారు. కానీ వారు కూడా దరఖాస్తు సమర్పించలేదు. అయితే నాలుగు ప్రధాన టెలివిజన్, స్ట్రీమింగ్కు చెందిన మొత్తం 10 సంస్థలు పోటీలో ఉన్నాయి. ఆదివారం మొదలయ్యే ఇ–వేలం రెండు రోజులపాటు జరిగే అవకాశ ముంది.’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. నిజమా... రూ. 45 వేల కోట్లా? అమెజాన్ వైదొలగినప్పటికీ... పోటీలో ఉన్న సంస్థలన్నీ పెద్ద మొత్తం చెల్లించేందుకు సై అంటున్నాయి. ఐదారేళ్ల క్రితంతో పోల్చుకుంటే డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు అందరి ‘అరచేతి’ లో ఉండటమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిడ్ ప్రారంభ ధరే రూ. 32 వేల కోట్లు ఖాయమంటున్నాయి బీసీసీఐ వర్గాలు. ఇదే జరిగితే పోటాపోటీలో అక్షరాలా 45 వేల కోట్ల రూపాయాలు ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా రావొచ్చని అంచనా. అంటే గత మొత్తం రూ. 16,347.50 కోట్లకు రెండున్నర రెట్లు అధిక మొత్తం ఈసారి గ్యారంటీ! ఇ–వేలం సంగతేంటి? బీసీసీఐ టెండర్ల ప్రక్రియతో గత హక్కు లు కట్టబెట్టింది. ఇప్పుడు ఇ–ఆక్షన్ (ఎలక్ట్రానిక్ వేలం) నిర్వహించనుంది. ఆదివారం మొదలయ్యే ఈ ఇ–ఆక్షన్‌లో పోటీదారులంతా ఆన్లైన్ పోర్టల్‌లో బిడ్లు వేస్తారు. స్క్రీన్‌లో ఎక్కువ మొత్తం పెరుగుతున్న కొద్దీ పోటీలో ఉన్న సంస్థలు తప్పుకుంటాయి. చివరకు మిగిలిన సంస్థ విజేతగా నిలుస్తుంది. అయితే ఎంత మొత్తమో కనబడుతుంది కానీ ఎవరు వేసింది అనేది స్క్రీన్‌లో కనపడదు. ఎందుకంటే పలా నా సంస్థ వేసిందంటే దానికి ధీటుగా వేయా లని ఇతర సంస్థలు నిర్ణయించుకుంటాయి. నాలుగు ‘ప్యాకేజీ’లు నాలుగు ప్యాకేజీల్లో ఎ, బి, సి పూర్తిగా భారత ఉపఖండానికి సంబంధించినవి. ‘ఎ’ టీవీ హక్కులు, ‘బి’ డిజిటల్ రైట్స్. ‘సి’ ప్లే–ఆఫ్స్ సహా కొన్ని ప్రత్యేక మ్యాచ్‌లకు సంబంధించిన డిజిటల్ రైట్స్. ఇక ‘డి’ ఉపఖండం మినహా మొత్తం ప్రపంచానికి సంబంధించిన ఉమ్మడి టీవీ, డిజిటల్ రైట్స్. కొత్తగా ‘ప్రత్యేక’ హక్కులేంటంటే... సీజన్లో ఒక్కోసారి మ్యాచ్‌లు పెరిగితే దానికి సంబంధించిన ప్యాకేజీ అన్నమాట. ఒక సీజన్లో 74 ఉండొచ్చు. ఇవి మరో సీజన్లలో 84 లేదంటే 94కు పెరగొచ్చు. ఇవీ ప్రారంభ ధరలు... ‘ఎ’ టీవీ ప్యాకేజి కోసం ఒక్కో మ్యాచ్‌కు రూ. 49 కోట్లు ప్రారంభ బిడ్డింగ్ ధర కాగా... ‘బి’ డిజిటల్ కోసం మ్యాచ్‌కు రూ. 33 కోట్లు, ‘సి’లో ప్రాథమిక ధర రూ. 11 కోట్లు, ‘డి’లో రూ. 3 కోట్లకు తక్కువ కాకుండా బిడ్ వేయాల్సి ఉంటుంది. ఒక సంస్థ ఒకదానికే పరిమితమన్న నిబంధన లేదు. నాలుగు ప్యాకేజీలకూ ఒకే సంస్థ పోటీ పడొచ్చు. అయితే గతంలో ఏక మొత్తంలో ఒకే సంస్థకు కట్టబెట్టినట్లుగా కాకుండా ఈసారి ప్రతీ ప్యాకేజీలో ఎవరు ఎక్కువకు కోట్ చేస్తే వాళ్లకే హక్కులిస్తారు. గతంలో టీవీ హక్కులకు భారీ మొత్తం కోట్ చేసిన స్టార్ నెట్వర్క్ డిజిటల్‌కు తక్కువ కోట్ చేసింది. ఫేస్బుక్ డిజిటల్ కోసం రూ.3,900 కోట్లు కోట్ చేసినా... ఓవరాల్‌గా గరిష్ట మొత్తాన్ని పరిగణించి స్టార్‌కు హక్కులిచ్చారు. ఈసారి డిజిటల్ విభాగంలో టైమ్స్ ఇంటర్నెట్, ఫన్ఆసియా, డ్రీమ్11, ఫ్యాన్‌కోడ్... ఉపఖండం ఆవల హక్కుల కోసం స్కై స్పోర్ట్స్ (ఇంగ్లండ్), సూపర్‌స్పోర్ట్ (దక్షిణాఫ్రికా) కూడా బరిలో ఉన్నాయి. -
త్వరలోనే ‘మహిళల ఐపీఎల్’
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మహిళల కోసం పూర్తి స్థాయి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్‌ను నిర్వహించే ఆలోచనతో ఉన్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా వెల్లడించారు. ఈ ఏడాదికి మాత్రం ఎప్పటిలాగే మూడు జట్లతో మహిళల టి20 చాలెంజ్ మాత్రం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కరోనా కారణంగా గత ఏడాది మహిళల టి20 చాలెంజ్ టోర్నీని నిర్వహించలేదు. ‘మహిళల క్రికెట్‌కు సంబంధించి కూడా త్వరలోనే పరిస్థితులు మారతాయి. ఐపీఎల్ తరహాలో మహిళల టోర్నీ కూడా నిర్వహించాలనే ఆలోచనకు బీసీసీఐ కట్టుబడి ఉంది. అందుకు కావాల్సిన అన్ని ప్రయత్నాలు సాగుతున్నాయి. మహిళల టి20 చాలెంజ్ టోర్నీకి అభిమానులు, ఆటగాళ్ల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే త్వరలోనే ఐపీఎల్ సాధ్యమమవుతుందని అనిపిస్తోంది’ అని జై షా అన్నారు. 2022లో ఐపీఎల్‌ను పూర్తిగా భారత్‌లోనే నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని, కోవిడ్ పరిస్థితిని సమీక్షించిన తర్వాతే ఒక అంచనాకు వస్తామని ఆయన చెప్పారు. మరోవైపు నాలుగు పెద్ద జట్లతో టి20 టోర్నీ నిర్వహించాలనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రమీజ్ రాజా చేసిన ప్రతిపాదనపై కూడా జై షా స్పందించారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం ఆదాయంపైనే దృష్టి పెట్టే అలాంటి వాణిజ్యపరమైన ఆలోచనకంటే క్రికెట్‌ను అభివృద్ధి చేయడం ముఖ్యం. ఐపీఎల్ విస్తృతమవడంతో పాటు ప్రతీ ఏడాది ఐసీసీ టోర్నీలు ఉంటున్నాయి. పైగా టెస్టులపై దృష్టి పెడుతూ ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా ముఖ్యం. ఇలాంటి సమయంలో తాత్కాలిక ప్రయోజనాలకంటే ఆటకు ప్రాచుర్యం కల్పించడమే కీలకం’ అని షా అభిప్రాయపడ్డారు. -
రేసులో అదానీ, గోయెంకా
దుబాయ్: మళ్లీ పది జట్ల ఐపీఎల్‌కు నేడు అడుగు పడనుంది. రూ.వేల కోట్ల అంచనాలతో దాఖలైన టెండర్లను నేడు తెరువనున్నారు. సుమారు 22 కంపెనీలు రూ. 10 లక్షలు వెచ్చించి మరీ టెండర్ దరఖాస్తులు దాఖలు చేసినప్పటికీ పోటీలో ప్రధానంగా ఐదారు కంపెనీలే ఉన్నట్లు తెలిసింది. ఇందులోనూ ఎలాగైనా దక్కించుకోవాలనే సంస్థలు మూడే! దేశీయ దిగ్గజ కార్పొరేట్ సంస్థలైన అదానీ గ్రూప్, గోయెంకా, అరబిందో సంస్థలు ఐపీఎల్లో తమ ‘జెర్సీ’లను చూడాలనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ అదాయంపై గంపెడాశలు పెట్టుకుంది. ఒక్కో ఫ్రాంచైజీ ద్వారా రూ. 7,000 కోట్ల నుంచి రూ. 10 వేల కోట్లు ఆశిస్తోంది. అందుకే కనీస బిడ్ ధర రూ. 2,000 కోట్లు పెట్టింది. అయినాసరే 22 కంపెనీలు టెండర్ల ప్రక్రియపై ఆసక్తి చూపాయంటే ఐపీఎల్ బ్రాండ్విలువ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల మార్కెట్ ఏకంగా రూ.36 వేల కోట్లకు చేరింది. లీగ్‌కు సమకూరే ఈ ఆదాయాన్ని ఫ్రాంచైజీలకు పంపిణీ చేస్తారు. ఈ రకంగా చూసినా బోర్డు ఆశించినట్లు ఒక్కో జట్టుకు రూ. 7,000 కోట్లు కాకపోయినా రెండు కలిపి (రూ. 3,500 కోట్లు చొప్పున) ఆ మొత్తం గ్యారంటీగా వచ్చే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి. రేసులో అరబిందో గ్రూప్ ఉన్నప్పటికీ అదానీ, గోయెంకా కంపెనీలు ఫ్రాంచైజీలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అహ్మదాబాద్ లక్ష్యంగా అదానీ ఐపీఎల్లో ఇప్పుడు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, రాజస్తాన్, పంజాబ్ ఫ్రాంచైజీలున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో చేరే ఇంకో రెండు నగరాలేవో నేడు తేల్చేస్తారు. బరిలో అహ్మదాబాద్, లక్నో, ఇండోర్, గువాహటి, పుణే, ధర్మశాల, కటక్ ఉన్నప్పటికీ ప్రధానంగా అహ్మదాబాద్, లక్నోలే ఖరారు అవుతాయని ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. అయితే అహ్మదాబాద్, లక్నోలే ఫేవరెట్ నగరాలు. ముఖ్యంగా గుజరాత్‌కు చెందిన అదానీ గ్రూప్ అహ్మదాబాద్ లక్ష్యంగా టెండరు దాఖలు చేసింది. ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీ అనుభవమున్న ఆర్పీఎస్జీ (రాజీవ్ ప్రతాప్ సంజీవ్ గోయెంకా) గ్రూపు లక్నోను చేజిక్కించుకునే అవకాశముంది. ఐపీఎల్లో చెన్నై, రాజస్తాన్‌లు రెండేళ్ల నిషేధానికి గురైనపుడు పుణే (రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్)తో ఐపీఎల్‌లోకి ప్రవేశించింది. -
ద్రవిడ్ మాత్రమే దరఖాస్తు చేయడంతో...
న్యూఢిల్లీ: బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ‘హెడ్ ఆఫ్ క్రికెట్’ పదవికి దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ఒక్కడే మళ్లీ దరఖాస్తు చేసుకోగా ఇంకెవరు పోటీలో లేరు. దీంతో అతనే మరో సారి ఎన్సీఏ చీఫ్‌గా ఖాయమైనప్పటికీ విమర్శలకు తావివ్వరాదనే ఉద్దేశంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దరఖాస్తు గడువును పొడిగించింది. రెండేళ్ల క్రితం ఎన్సీఏ చీఫ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ద్రవిడ్ తనదైన ముద్ర వేశాడు. కుర్రాళ్లకు, పునరావాస శిబిరానికి వచ్చిన ఆటగాళ్లకు మార్గదర్శకుడిగా మారాడు. భారత్ ‘ఎ’, జూనియర్ జట్ల కోచ్‌గా రిజర్వ్ బెంచ్ సత్తా పెంచాడు. ఈ నేపథ్యంలో ద్రవిడ్‌కే అన్నివైపులా అనుకూలతలు, అర్హతలు ఉన్నాయని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మరో వైపు గాయాలతో బాధపడుతున్న యువ క్రికెటర్లు వరుణ్ చక్రవర్తి, కమలేశ్ నాగర్కోటి ఎన్సీఏ పునరావాస శిబిరానికి చేరగా, శుబ్‌మన్ గిల్ ఇప్పటికే ఇక్కడ ఉన్నాడు. ఈ ముగ్గురు ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్లంతా పూర్తిస్థాయి ఫిట్నెస్ సంతరించుకుంటే యూఏఈలో జరిగే ఐపీఎల్లో పాల్గొనే అవకాశముంది. -
నవంబర్ 16 నుంచి రంజీ ట్రోఫీ
ముంబై: కరోనా కారణంగా గత ఏడాది రంజీ ట్రోఫీతోపాటు పలు వయో పరిమితి విభాగం టోర్నీలను నిర్వహించలేకపోయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈసారి మాత్రం పూర్తిస్థాయిలో దేశవాళీ క్రికెట్ సీజన్‌ను నిర్వహించడానికి సిద్ధమైంది. 2021–2022 దేశవాళీ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ కార్యదర్శి జై షా శనివారం విడుదల చేశారు. ‘దేశవాళీ క్రికెట్ సీజన్ ఈ ఏడాది సెప్టెంబర్ 21న సీనియర్ మహిళల వన్డే లీగ్‌తో మొదలవుతుంది. 2022 ఏప్రిల్ 11న సీనియర్ మహిళల టి20 లీగ్‌తో ముగుస్తుంది’ అని జై షా తెలిపారు. ఇక ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ టోర్నీ నవంబర్ 16 నుంచి 2022 ఫిబ్రవరి 19 వరకు జరుగుతుంది. ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నీని అక్టోబర్ 20 నుంచి నవంబర్ 12 వరకు... విజయ్ హజారే ట్రోఫీ వన్టే టోర్నీని 2022 ఫిబ్రవరి 23 నుంచి మార్చి 26 వరకు నిర్వహిస్తారు. వీటితోపాటు అండర్–23 కల్నల్ సీకే నాయుడు ట్రోఫీని , అండర్–19 వినూ మన్కడ్ ట్రోఫీ, అండర్–16 కూచ్ బిహార్ ట్రోఫీ, విజయ్ మర్చంట్ ట్రోఫీ టోర్నీలు కూడా జరుగుతాయి. సీనియర్, జూనియర్ పురుషుల, మహిళల విభాగాల టోర్నీలన్నింటిలో కలిపి మొత్తం 2,127 మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఇరానీ కప్, దులీప్ ట్రోఫీ (ఇంటర్ జోనల్), దేవధర్ ట్రోఫీ మ్యాచ్‌లను నిర్వహించడం లేదు. మరోవైపు దేశవాళీ క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులు పెంచే అవకాశాన్ని బీసీసీఐ పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఫస్ట్‌క్లాస్ (మూడు లేదా నాలుగు రోజులు) మ్యాచ్‌ల్లో ఆడేవారికి మ్యాచ్‌కు రూ. లక్షా 40 వేలు.. లిస్ట్–ఎ, టి20 మ్యాచ్‌ల్లో ఆడేవారికి మ్యాచ్‌కు రూ. 35 వేలు లభిస్తున్నాయి. ఈ ఏడాది దేశవాళీ క్రికెట్ సీజన్ షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ -
2021- 22 సీజన్ ఇండియా డొమెస్టిక్ క్రికెట్ షెడ్యూల్ ఇదే!
న్యూఢిల్లీ: కరోనా అదుపులోకి వస్తున్న తరుణంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) 2021-22 సీజన్‌కు గానూ దేశవాళీ క్రికెట్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబరు 21న సీనియర్ వుమెన్ వన్డే లీగ్‌తో డొమెస్టిక్ క్రికెట్ ఈవెంట్లు ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. అదే విధంగా.. అక్టోబరు 20న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ మొదలుకానుందని, నవంబరు 12 ఇందుకు సంబంధించి ఫైనల్ మ్యాచ్ ఉంటుందని పేర్కొంది. వీటితో పాటు రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ ఈవెంట్లకు సంబంధించిన వివరాలను శనివారం విడుదల చేసిన తన ప్రకటనలో తెలిపింది. ఈ సీజన్లో మొత్తంగా మహిళా, పురుషుల క్రికెట్.. అన్ని ఫార్మాట్లలో 2127 దేశవాళీ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. 2021-2022 డొమెస్టిక్ క్రికెట్ షెడ్యూల్: ►సీనియర్ వుమెన్ వన్డే లీగ్: సెప్టెంబరు 21, 2021న ప్రారంభం ►సీనియర్ వుమెన్ వన్డే చాలెంజర్ ట్రోఫీ- అక్టోబరు 27, 2021 ►సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ: అక్టోబరు 20, 2021- నవంబరు 12, 2021 ►రంజీ ట్రోఫీ: నవంబరు 16, 2021- ఫిబ్రవరి 19, 2022 ►విజయ్ హజారే ట్రోఫీ: ఫిబ్రవరి 23, 2022- మార్చి 26, 2022 -
రూ. 4800 కోట్లు: బీసీసీఐకి బాంబే హైకోర్టులో భారీ ఊరట
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి బాంబే హైకోర్టులో బుధవారం భారీ ఊరట దక్కింది. గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీగా వ్యవహరించిన దెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి 4800 కోట్ల రూపాయలు చెల్లించాలన్న ఆదేశాలను తోసివేస్తూ ఏకసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. కాగా 2008లో ప్రారంభమైన క్యాష్‌రిచ్ లీగ్‌లో భాగంగా బీసీసీఐ, వివిధ ఫ్రాంఛైజీలతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డీసీహెచ్ఎల్ (దెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్) దెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ పేరిట జట్టును బరిలోకి దింపింది. ఈ సందర్భంగా... బీసీసీఐ, డీసీహెచ్ఎల్ మధ్య పదేళ్ల పాటు ఒప్పందం కుదిరింది. అయితే, బోర్డు నిబంధనలు ఉల్లంఘించిందన్న ఆరోపణలతో బీసీసీఐ 2012 సెప్టెంబరులో దెక్కన్ చార్జర్స్‌ను లీగ్ నుంచి తొలగించింది. అంతేగాక ఈ జట్టులోని ఆటగాళ్ల కాంట్రాక్టులు రద్దు చేసి వారిని వేలంలో నిలిపింది. ఈ క్రమంలో తమకు అన్యాయం జరిగిందంటూ డీసీహెచ్ఎల్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ సీకే థక్కర్ సమక్షంలో ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా సూచించింది. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ థక్కర్.. గతేడాది డీసీహెచ్ఎల్కు సానుకూలంగా తీర్పునిస్తూ... రూ. 4800 కోట్లు చెల్లించాల్సిందిగా బీసీసీఐని ఆదేశించారు. ఈ అంశంపై తాజాగా విచారణ చేపట్టిన జీఎస్ పటేల్ ధర్మాసనం.. బీసీసీఐకి ఊరట కల్పిస్తూ ఆర్బిట్రేటర్ ఆదేశాలను తోసివేస్తూ తీర్పునిచ్చింది. ఇక 2009లో ఆడం గిల్‌క్రిస్ట్ సారథ్యంలోని దక్కన్ చార్జర్స్ హైదరాబాద్ తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీని గెల్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సన్‌రైజర్స్ జట్టు హైదరాబాద్ నుంచి ఐపీఎల్‌కు ప్రాతినిథ్యం వహిస్తోంది. చదవండి: WTC Final: భారత జట్టు ఇదే.. వారికి నిరాశే! -
BCCI: 2 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల విరాళం
ముంబై: మహమ్మారి కరోనాపై పోరులో అండగా ఉండేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ముందుకు వచ్చింది. ప్రాణవాయువు కొరతతో కోవిడ్ బాధితులు అల్లాడుతున్న వేళ 10 లీటర్ల సామర్థ్యం గల 2 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయం గురించి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ... ‘‘వైరస్‌పై పోరాటంలో వైద్య సిబ్బంది పోషిస్తున్న పాత్ర మరువలేనిది. మనల్ని కాపాడటం కోసం ముందుండి పోరాడుతున్న వాళ్లు నిజమైన ఫ్రంట్‌లైన్ వారియర్లు. వైద్యారోగ్యం అంశానికి బీసీసీఐ ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది. ఇందులో భాగంగా ఆక్సిజన్ కొరతతో బాధ పడుతున్న వాళ్లు త్వరగా కోలుకునేలా తన వంతు తక్షణ సాయం ప్రకటించింది’’అని పేర్కొన్నారు. ఇక బీసీసీఐ కార్యదర్శి జై షా.. ‘‘కోవిడ్‌పై జాతి సమిష్టి యుద్ధంలో చేయి కలిపి నిలబడతాం. కరోనా సంక్షోభంతో అల్లాడుతున్న బాధితుల గురించి, వైద్య పరికరాల కొరత గురించి బీసీసీఐకి అవగాహన ఉంది. బోర్డు తన వంతు సహాయం చేస్తుంది. వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. మనం ధైర్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలి’’ అని విజ్ఞప్తి చేశారు. చదవండి: ఏడాది దాటిపోయింది.. ఇంతవరకు ప్రైజ్‌మనీ చెల్లించలేదు -
సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు భారత మహిళల క్రికెట్ జట్టు
న్యూఢిల్లీ: వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటన ముగించుకున్నాక భారత మహిళల క్రికెట్ జట్టు మరో విదేశీ పర్యటనకు సిద్ధం కానుంది. సెప్టెంబర్‌లో మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడేందుకు భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారికంగా ప్రకటించకపోయినా... ఆస్ట్రేలియా మహిళల జట్టు పేస్ బౌలర్ మేగన్ షూట్ ఈ విషయాన్ని ఒక కార్యక్రమంలో వెల్లడించింది. ‘సెప్టెంబర్ రెండో వారంలో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్‌కు ముందు ఆసీస్ జట్టుకు డార్విన్‌లో శిక్షణ శిబిరం ఉంది. భారత్‌తో సిరీస్ తర్వాత బిగ్‌బాస్ లీగ్, మహిళల నేషనల్ క్రికెట్ లీగ్, యాషెస్ సిరీస్, వన్డే వరల్డ్‌కప్, కామన్వెల్త్ గేమ్స్‌లతో ఆస్ట్రేలియా క్రికెటర్లు బిజీబిజీగా ఉండనున్నారు’ అని మేగన్ షూట్ తెలిపింది. 28 ఏళ్ల మేగన్ ఆస్ట్రేలియా తరఫున 65 వన్డేలు ఆడి 99 వికెట్లు... 73 టి20 మ్యాచ్‌లు ఆడి 96 వికెట్లు తీసింది. వాస్తవానికి భారత మహిళల జట్టు వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి సన్నాహకంగా ఈ ఏడాది జనవరిలోనే ఆస్ట్రేలియాలో పర్యటించాల్సింది. అయితే కరోనా కారణంగా భారత పర్యటన వాయిదా పడింది. -
విహారి, షమీ, జడేజా పునరాగమనం
-
విహారి, షమీ, జడేజా పునరాగమనం
ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత విజయం సాధించి, ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆటగాళ్లపైనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్టర్లు నమ్మకం ఉంచారు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడేందుకు 20 మందితో కూడిన జట్టును ప్రకటించారు. భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేయకపోవడం మినహా ఎలాంటి అనూహ్యత లేకుండా అంచనాల ప్రకారమే జట్టు ఎంపిక సాగింది. కరోనా నేపథ్యంలో అదనంగా మరో నలుగురు రిజర్వ్ ఆటగాళ్లు ప్రధాన జట్టుతో పాటు ఇంగ్లండ్‌కు వెళతారు. ముంబై: సుమారు మూడు నెలల పాటు సాగే ఆరు టెస్టు మ్యాచ్‌ల ఇంగ్లండ్ పర్యటన కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ శుక్రవారం భారత జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లి నాయకత్వంలోని ఈ టీమ్‌కు అజింక్య రహానే వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. మొత్తం 20 మందిని ఎంపిక చేసిన కమిటీ మరో నలుగురు ఆటగాళ్లను స్టాండ్‌బైలుగా ప్రకటించింది. ఈ టూర్లో జూన్ 18 నుంచి సౌతాంప్టన్‌లో న్యూజిలాండ్‌తో తొలి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో తలపడే టీమిండియా... ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో పోటీపడుతుంది. క్వారంటైన్ తదితర నిబంధనలు దృష్టిలో ఉంచుకొని భారత జట్టు జూన్ 2న ఇంగ్లండ్ బయలుదేరే అవకాశం ఉంది. ముగ్గురు వచ్చేశారు... ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ గాయపడగా... సిడ్నీ టెస్టులో హనుమ విహారి, రవీంద్ర జడేజా గాయపడ్డారు. ఈ ముగ్గురు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌కు దూరమయ్యారు. ఇప్పుడు వీరు తాజా పర్యటనతో టెస్టు టీమ్‌లోకి పునరాగమనం చేస్తున్నారు. విహారి ఇప్పటికే ఇంగ్లండ్‌లో ఉన్నాడు. వార్విక్షైర్ క్లబ్ జట్టు తరఫున అతను కౌంటీల్లో ఆడుతున్నాడు. ఉమేశ్‌కు మరో చాన్స్... పేస్ బౌలింగ్ విభాగంలో ప్రధాన బౌలర్లు ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, షమీలతో పాటు తాజా ఫామ్‌ను బట్టి మొహమ్మద్ సిరాజ్‌కు సహజంగానే చోటు లభించింది. మరో ఇద్దరు పేసర్లు కూడా టీమ్‌లో ఉన్నారు. మెల్బోర్న్ టెస్టు తర్వాత అవకాశం దక్కని ఉమేశ్ యాదవ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అతనితో పాటు బ్రిస్బేన్ టెస్టులో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చిన శార్దుల్ ఠాకూర్‌కు కూడా చోటు లభించింది. వీరిద్దరు కూడా స్వదేశంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లు ఆడలేదు. అయితే గాయం నుంచి కోలుకున్న భువనేశ్వర్ కుమార్‌ను మాత్రం సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఐపీఎల్‌కు ముందు అతను ఇంగ్లండ్‌తో టి20, వన్డేలు ఆడాడు. ఇంగ్లండ్‌లోని వాతావరణ పరిస్థితుల్లో భువీ తన స్వింగ్ బౌలింగ్‌తో మంచి ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అతనికి స్థానం ఖాయమనిపించింది. అయితే సెలక్టర్లు మరోలా ఆలోచించారు. పదే పదే ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న భువీపై సెలక్టర్లు నమ్మకం ఉంచలేకపోయారు. ఆసీస్ గడ్డపై రెండు టెస్టులు ఆడిన నవదీప్ సైనీని కూడా ఎంపిక చేయలేదు. కుల్దీప్ యాదవ్‌పై వేటు... ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ కోసం ఫిట్‌గా ఉంచేందుకే హార్దిక్ పాండ్యాతో ఎక్కువగా బౌలింగ్ చేయనీయడం లేదని కెప్టెన్ కోహ్లి పదేపదే చెబుతూ వచ్చాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో చివరి వన్డేలో మాత్రమే బౌలింగ్ చేసిన హార్దిక్ ఐపీఎల్లో ఒక్క బంతి కూడా వేయలేదు. అయితే చివరకు అతనికీ టెస్టు అవకాశం దక్కలేదు. తాజా ఫిట్నెస్తో హార్దిక్ బౌలింగ్ చేయడం కష్టమని సెలక్టర్లు భావించారు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌పై కూడా వేటు పడింది. గత రెండేళ్లలో ఒకే ఒక టెస్టులో ఆడే అవకాశం లభించిన కుల్దీప్ (ఇంగ్లండ్‌తో రెండో టెస్టు) మొత్తం కలిపి 12.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. టాప్ స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు ఉండగా అవసరమైతే ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తనను తాను నిరూపించుకున్న అక్షర్ పటేల్ (27 వికెట్లు) కూడా ఎంపికయ్యాడు. కాబట్టి కుల్దీప్కు తుది జట్టులో స్థానం కష్టం కాబట్టి పరిగణనలోకి తీసుకోలేదు. దేశవాళీలో పరిమిత ఓవర్ల టోర్నీలతో పాటు ఐపీఎల్లో కూడా చెలరేగినా... పృథ్వీ షాను టెస్టుల కోసం సెలక్టర్లు పరిశీలనలోకి తీసుకోకపోవడం గమనార్హం. ఫిట్నెస్ నిరూపించుకుంటేనే... బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కూడా 20 మంది సభ్యుల బృందంలోకి ఎంపికయ్యారు. అయితే వీరిద్దరు బయలుదేరేలోపు తమ ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. రాహుల్‌కు ఇటీవలే అపెండిసైటిస్ ఆపరేషన్ జరగ్గా... సాహా కరోనా వైరస్ బారిన పడ్డాడు. సాహాకు ప్రస్తుతం కరోనా చికిత్స కొనసాగుతోంది. అతను ఇంకా కోలుకోలేదు. ఆ నలుగురు... ప్రసిధ్ కృష్ణ: ఐపీఎల్లో కోల్‌కతా జట్టు తరఫున ఆడినప్పుడు ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్న ఈ కర్ణాటక బౌలర్ ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. 3 వన్డేల్లో కలిపి 6 వికెట్లు తీసిన అతను 9 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 20.26 సగటుతో 34 వికెట్లు పడగొట్టాడు. అవేశ్ ఖాన్: మధ్యప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల అవేశ్‌కు ఆరేళ్ల ఫస్ట్‌క్లాస్ కెరీర్ ఉంది. 26 మ్యాచ్‌లలో అతను 23.01 సగటుతో 100 వికెట్లు తీశాడు. ముఖ్యంగా గత రెండు సీజన్లలో అతని ఆట ఎంతో మెరుగుపడింది. తాజా ఐపీఎల్‌లోనూ అది కనిపించింది. అభిమన్యు ఈశ్వరన్: రంజీల్లో ప్రతీ సీజన్లో నిలకడగా రాణిస్తున్నా దురదృష్టవశాత్తూ ఈ బెంగాల్ ఓపెనర్‌కు ఇప్పటి వరకు టీమిండియా పిలుపు రాలేదు. 64 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో అతను 43.57 సగటుతో 4,401 పరుగులు సాధించాడు. ఇందులో 13 సెంచరీలు ఉన్నాయి. అర్జాన్ నాగ్వాస్వాలా: గుజరాత్‌కు చెందిన లెఫ్టార్మ్ పేస్ బౌలర్. 16 మ్యాచ్‌లలో 22.53 సగటుతో 62 వికెట్లు తీశాడు. 2019–20 రంజీ సీజన్లో 41 వికెట్లు తీసి అందరి దృష్టిలో పడ్డాడు. ప్రస్తుతం భారత దేశవాళీ క్రికెట్లో ఆడుతున్న ఏకైక ‘పార్సీ’ ఆటగాడు అతనే కావడం విశేషం. భారత జట్టు కోహ్లి (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), రోహిత్, గిల్, మయాంక్, పుజారా, విహారి, పంత్ (వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, అక్షర్, సుందర్, బుమ్రా, ఇషాంత్, షమీ, సిరాజ్, శార్దుల్, ఉమేశ్, రాహుల్, సాహా. స్టాండ్‌బై ఆటగాళ్లు: అభిమన్యు ఈశ్వరన్, ప్రసిధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, అర్జాన్ నాగ్వాస్వాలా