Bombay
-
పోలీస్ స్టేషన్లో రికార్డింగ్ నేరం కాదు: బాంబే హైకోర్టు
ముంబై: పోలీసు స్టేషన్లో అధికారులతో సంభాషణను రికార్డ్ చేయడం అధికారిక రహస్యాల చట్టం ప్రకారం నేరం కాదని బాంబే హైకోర్టు పేర్కొంది. పోలీస్ స్టేషన్లో బెదిరింపు సంభాషణను రికార్డ్ చేసినందుకు గూఢచర్యం ఆరోపణలతో ఇద్దరు సోదరులపై నమోదైన అభియోగాలను కొట్టివేస్తూ బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది.ఈ కేసు హైకోర్టుకు చేరిన దరిమిలా దీనిపై విచారణ జరిగింది. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) కింద వారిపై నేరపూరిత కుట్ర ఆరోపణలను రద్దు చేయడానికి నిరాకరిస్తూనే, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు సోదరులపై గూఢచర్యం ఆరోపణలను కోర్టు రద్దు చేసింది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) ప్రకారం ఈ రికార్డింగ్ పోలీస్ స్టేషన్లో జరిగిందని జస్టిస్ విభా కంకన్‌వాడి, జస్టిస్ ఎస్జీ చపాల్గావ్కర్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.అధికారిక రహస్యాల చట్టం- 1923లో నిషేధిత ప్రదేశం అంటే ఏమిటో తెలిపారు. అయితే దానిలో పోలీస్ స్టేషన్ అనేది లేదు. అందుకే వారిపై అధికారిక రహస్యాల చట్టం కింద మోపిన అభియోగాలు నిరాధారమైనవని తెలియజేస్తూ హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. మహారాష్ట్రకు చెందిన సోదరులు సుభాష్, సంతోష్ రాంభౌ అథారేలపై నేరపూరిత కుట్రతో పాటు, అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినట్లు 2022 జూలై 19న పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. సుభాష్ ఒక పోలీసు అధికారితో జరిపిన సంభాషణను రికార్డ్ చేసిన దరిమిలా వారిపై కేసు నమోదయ్యింది.2022, ఏప్రిల్ 21న ముగ్గురు వ్యక్తులు అథారే ఇంటిలోకి అక్రమంగా చొరబడి, వారి తల్లిపై దాడి చేసిన ఘటనపై ఆ సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిని నాన్-కాగ్నిజబుల్ (ముందస్తు కోర్టు అనుమతి లేకుండా పోలీసులు అరెస్టు చేయలేని నేరాలు) నేరంగా పోలీసులు నమోదు చేయడంపై అథారే సోదరులు అసంతృప్తితో పోలీసులను ప్రశ్నించారు. ఈ కేసులో ఇన్వెస్టిగేటింగ్ అధికారితో జరిగిన సంభాషణను వారు రికార్డ్ చేశారు. ఈ నేపధ్యంలో ఆ అధికారి వారితో ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని బెదిరించారు.కాగా ఈ రికార్డింగ్‌ను వారు పోలీసు డైరెక్టర్ జనరల్‌కు పంపారు. ఈ నేపధ్యంలో ఆ సోదరులపై అధికారిక రహస్యాల చట్టం- 1923 ఉల్లంఘన కింద కేసు నమోదయ్యింది. అయితే ఈ ఎఫ్ఐఆర్ ప్రతీకార చర్యలా ఉందని, కల్పిత సాక్ష్యాధారాల ఆధారంగా కేసు నమోదు చేశారని, అందుకే దానిని రద్దు చేయాలని ఆ సోదరుల తరఫు న్యాయవాది హైకోర్టులో వాదించారు. దీనిపై ప్రాసిక్యూషన్ తన వాదనలో వారు చేసిన రికార్డింగ్ పోలీసు సిబ్బందిని బెదిరించినట్లుగా ఉందని పేర్కొన్నారు.సెక్షన్ 2(8) కింద నిషేధించబడిన స్థలం అనే నిర్వచనంలో పోలీసు స్టేషన్ లేదని నొక్కి చెబుతూ, అధికారిక రహస్యాల చట్టం దీనికి వర్తించదని హైకోర్టు తెలిపింది. అలాగే ఈ ఉదంతంలో కుట్ర, నేరపూరిత బెదిరింపు ఆరోపణలకు సంబంధించి తదుపరి చర్యలకు సాక్ష్యాధారాలు అవసరమా కాదా అని నిర్ధారించే బాధ్యతను దిగువ కోర్టుకు అప్పగించింది. ఈ కేసులో అధికారిక రహస్యాల చట్టం కింద వచ్చిన ఆరోపణలను కోర్టు రద్దు చేసింది. అథారే సోదరుల తరఫున న్యాయవాది ఏజీ అంబేద్కర్ వాదనలు వినిపించగా, పోలీసు సిబ్బంది తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్ఆర్ దయామ వాదనల్లో పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: మరణశిక్షను ఆపిన సుప్రీంకోర్టు -
ఆయనతో సినిమా చేయలేదని రెండు నెలలు ఏడ్చా: హీరో
మణిరత్నం సినిమాలో నటించే ఛాన్స్ చేజారడంతో రెండు నెలలు ఏడ్చానంటున్నాడు హీరో చియాన్ విక్రమ్. బొంబాయి సినిమాలో నటించే ఛాన్స్ ఫస్ట్ తనకే వచ్చిందని, కానీ మిస్సయిందని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విక్రమ్ మాట్లాడుతూ.. నాకు బొంబాయి సినిమా ఆఫర్ వచ్చింది. ఆడిషన్‌కు కూడా వెళ్లాను. ప్రతి ఒక్కరి కలకాకపోతే అక్కడ ఒక వీడియో కెమెరాకు బదులు స్టిల్ కెమెరా ముందు పెట్టి నటించమన్నాడు. నీ ముందు ఒక అమ్మాయి పరిగెడుతుంది. తనను చూస్తూ ఉండిపోవాలన్నాడు. నాకేం అర్థం కాలేదు. అక్కడ వీడియో కెమెరానే లేనప్పుడు నేనెందుకు నటించాలన్నట్లు ఊరికనే నిలబడ్డాను. దీంతో ఆ మూవీలో నన్ను సెలక్ట్ చేయలేదు. మణిరత్నంతో సినిమా చేయాలన్నది ప్రతి ఒక్క నటుడి కల. ఇంకేం వద్దనుకున్నా..ఆయనతో ఒక్క సినిమా చేసి రిటైర్ అయిపోయినా చాలనుకున్నాను. అంతకంటే ఎక్కువ ఏదీ ఆశించలేదు. ఉదయం మనీషా కొయిరాలా ఫోటోషూట్, సాయంత్రం నాది. కానీ ఇంతలోనే అంతా బెడిసికొట్టింది. రెండునెలలపాటు ఏడుస్తూనే ఉన్నాను. అయ్యో, మణిరత్నం సినిమా చేజారిపోయిందేనని బాధపడుతూనే ఉన్నాను. ప్రతీకారం తీర్చుకున్నాతర్వాత బొంబాయి మూవీ పాన్ ఇండియా రేంజ్లో హిట్టయింది. అయితే తర్వాత మాత్రం ఆయనతో రెండు సినిమాలు తీసి ప్రతీకారం తీర్చుకున్నాను అని చెప్పుకొచ్చాడు. కాగా విక్రమ్ తర్వాత మణిరత్నం డైరెక్షన్లో రావన్, పొన్నియన్ సెల్వన్ సినిమాలు చేశాడు.చదవండి: పదేళ్లుగా ఆయన్ను ప్రేమిస్తూనే ఉన్నా: సాయి పల్లవి -
భార్యను సెకండ్ హ్యాండ్ అన్నందుకు.. రూ 3 కోట్లు జరిమానా విధించిన కోర్టు
కొన్ని భార్యభర్తల కేసులు కనువిప్పు కలిగిస్తాయి. ఎందుకంటే భార్యను తేలికగా చేస్తూ ఎలా పడితే అలా కించపరుస్తూ మాట్లాడే భర్తల ఆగడాలను ఎలా కట్టడి చేయాలో చెబుతాయి. అలాంటి గమ్మత్తైన ట్విస్టింగ్ కేసు ఇది! ఆ దంపతులిరువురిది సంపన్న కుటుంబ నేపథ్యం. ఇద్దరు ఉన్నత విద్యావంతులే. ఆ జంట వివాహం 1994 జనవరి 3వ తేదీన పెద్దల సమక్షంలో జరిగింది. ఆ తర్వాత ఇద్దరు అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగాలు చేశారు. అయితే అక్కడ చట్టాల ప్రకారం సెక్యూరిటీ కోసం అమెరికాలో మళ్లీ పెళ్లి చేసుకుంది ఆ జంట. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో వారి కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో 2005లో ఈ దంపతులు ముంబై తిరిగి వచ్చేశారు. ముంబైలోనే భార్య ఉద్యోగం సంపాదించింది. అయితే భర్తతో గొడవలు కారణంగా తల్లి ఇంట్లోనే ఉంటుంది. 2014లో భర్త తిరిగి అమెరికా వెళ్లిపోయాడు. 2017లో భార్యకు అమెరికా నుంచే విడాకుల నోటీసులు పంపాడు. అదే ఏడాది భార్య ఇండియాలోని ముంబై కోర్టులో గృహ హింస చట్టం కింద కేసు ఫైల్ చేసింది. ఏడాది తర్వాత అంటే 2018లో అమెరికా కోర్టు వారికి విడాకులు కూడా మంజూరు చేసింది. అసలు కథ ఇక్కడే మొదలైంది..ముంబై కోర్టులో భార్య దాఖలు చేసిన పిటీషన్ ఆసక్తికరంగా మారింది. సుదీర్ఘ విచారణకు దారితీసింది. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పెళ్లి తర్వాత హనీమూన్కని నేపాల్ వెళ్లిన తర్వాతే ఈ ఇరువురి మద్య గొడవలు ప్రారంభమయ్యాయి. భార్యను సెకండ్ హ్యాండ్ అంటూ పదేపదే కించపరిచే వాడు భర్త. అందుకు కారణం..అప్పటికే తన భార్యకు.. తన పెళ్లి కంటే ముందే నిశ్చితార్థం అయ్యి క్యాన్సిల్ కావటం. ఆ తర్వాత అతడితో పెళ్లి జరిగింది. దీంతో భర్త ఆమెను పదేపదే సెకండ్ హ్యాండ్ అని కించపరిచేవాడు. అలాగే అమెరికా వచ్చిన ఆమె తల్లిదండ్రును అత్యంత నీచంగా చూసేవాడు. పైగా ఆమె తండ్రికి గుండె ఆపరేషన్ జరిగితే మరో ఇంట్లో ఉంచమని గొడవ చేసేవాడని భార్య పిటిషన్లో స్పష్టం చేసింది. గృహ హింస తీవ్ర స్థాయిలో ఉందని.. అనేక మానసిక వేధింపులు, హింసకు గురైనట్లు భార్య తన పిటీషన్లో పేర్కొంది. భార్య వాదనలతో ఏకీభవించిన ముంబై కోర్టు.. 2017లో తీర్పు వెళ్లడించింది. భార్యకు ప్రతినెలా లక్షా 50 వేల రూపాయల భరణం, సెకండ్ హ్యాండ్ అంటూ కించపరిచినందుకు 3 కోట్ల రూపాయల పరిహారం, కోర్టు ఖర్చుల కింద 50 వేల రూపాయలు చెల్లించాలని భర్తను ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ..భర్త సెషన్స్ కోర్టుకు వెళ్లాడు. అక్కడ కూడా భార్యకు అనుకూలంగానే తీర్పు వచ్చింద. ఇక లాభం లేదని ఈ తీర్పులపై ముంబై హైకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేశాడు భర్త. సుదీర్ఘ విచారణ తర్వాత.. ముంబై హైకోర్టు కింది రెండు కోర్టుల తీర్పుని సమర్థిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. భార్యను సెకండ్ హ్యాండ్ అంటూ కించపరిచి.. మానసిక వేదనకు గురి చేసిన భర్త.. 3 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాల్సిందే అని ముంబై హైకోర్టు తీర్పు వెల్లడించింది. భార్య ఆత్మగౌరవాన్ని దెబ్బతిసే అధికారం భర్తకు లేదని స్పష్టం చేసింది. ఇరువురు ఉన్నత చదువులు చదువులు, మంచి ఉద్యగాల్లో స్థిరపడినవారు, పైగా సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు ఉన్నవారు.. అలాంటివారు మరోకరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడ సబబు కాదని పేర్కొంది. ముఖ్యంగా భార్యను సెకండ్ హ్యాండ్ అంటూ.. ఓ మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం అనేది సామాజిక రుగ్మతగా పరిగణించాలని స్పష్టం చేసింది. ఇలాంటి వాటిని ఉపేక్షించటం అనేది సహించరాని నేరం అని పేర్కొంది. ఉన్నత పదవుల్లో ఉండేవారు.. మరొకరికి మార్గదర్శకంగా ఉండాలని వక్కాణించింది. అస్సలు ఒక మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదు అంటూ మండిపడింది ముంబై హైకోర్టు. అందుకుగానూ భార్యకు రూ. 3 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందేనని భర్తను ఆదేశిస్తూ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఈ తీర్పు నిజంగా ఎందరో భర్తలకు కనువిప్పు అనే చెప్పాలి. ఎప్పుడూ భార్యను చులకన చేసి ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా భర్తలకు ఈ తీర్పు పెద్ద చెంపదెబ్బ అని చెప్పొచ్చు. (చదవండి: అందం కోసం పాము రక్తమా? ఎక్కడో తెలుసా!) -
సాయిబాబా నిర్దోషి
సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాతోపాటు మరో ఐదుగురు నిందితులను బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ నిర్దోషులుగా ప్రకటించింది. 2017లో సాయిబాబాతో పాటు ఇతరులను దోషులుగా నిర్ధారిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై నాగ్‌పూర్ బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ వినయ్ జోషీ, జస్టిస్ వాల్మికి మెనెజెస్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. నిందితులపై వచ్చిన ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని, అందుకే వారిపై అభియోగాలను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం తోసిపుచ్చింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, దేశంపై యుద్ధంపై చేసే కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ 2017 మార్చిలో సాయిబాబా, ఇతరులను మహారాష్ట్రలోని గడ్చిరోలీ సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. దీనిపై సాయిబాబా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 2022 అక్టోబరు 14న జస్టిస్ రోహిత్ నేతృత్వంలోని ధర్మాసనం సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి రోజు శనివారమైనప్పటికీ ప్రత్యేకంగా విచారించింది. హైకోర్టు ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. అనంతరం జస్టిస్ షా, జస్టిస్ రవికుమార్ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపి 2023 ఏప్రిల్ 19న బాంబే హైకోర్టు తీర్పును పక్కనపెట్టింది. ఈ తీర్పును మళ్లీ పరిశీలించాలని బాంబే హైకోర్టుకు పంపించింది. ఈ నేపథ్యంలో జస్టిస్ జోషీ, జస్టిస్ వాల్మికిల హైకోర్టు ధర్మాసనం విచారించి, సాయిబాబా, ఇతరులను నిర్దోషులుగా ప్రకటించింది. ప్రొఫెసర్ సాయిబాబా 2014లో అరెస్టయ్యారు. ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. పదేళ్ల పోరాటం తర్వాత ఊరట దక్కింది బాంబే హైకోర్టు తీర్పు పట్ల సాయిబాబా భార్య వసంత ఆనందం వ్యక్తం చేశారు. పదేళ్ల తర్వాత ఊరట లభించిందన్నారు. సాయిబాబాకు అండగా నిలిచిన లాయర్లకు, సామాజిక కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. తన భర్త పది సంవత్సరాలు జైలులో ఉన్నారని, ఆర్థికంగా, మానసికంగా తాము ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని చెప్పారు. సాయిబాబా గురించి ప్రజలకు వాస్తవాలు తెలుసని, ఆయన పట్ల వారికి సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో మహారాష్ట్ర సర్కారు పిటిషన్ మావోయిస్టులతో సంబంధాల కేసులో మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు మంగళవారం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. బాంబే హైకోర్టు తీర్పును కొట్టివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. సాయిబాబాతోపాటు ఇతరులను నిర్దోషులుగా నిర్ధారిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని మహారాష్ట్ర అడ్వొకేట్ జనరల్ బీరేంద్ర షరాఫ్ ఈ సందర్భంగా చెప్పారు. నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును కొంతకాలం నిలిపివేయాలని కోరుతూ హైకోర్టు ధర్మాసనం ముందు అప్లికేషన్ దాఖలు చేశారు. ధర్మాసనం స్పందిస్తూ.. న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని పునఃపరిశీలించే అధికారం ఉండదని, ఇది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయమని స్పష్టం చేసింది. అడ్వొకేట్ జనరల్ దాఖలు చేసిన అప్లికేషన్‌ను కొట్టివేసింది. -
న్యాయస్థానాల్లో ‘పెండింగ్’ భారం ఎంత?
దేశంలోని పలు కోర్టుల్లో లెక్కకుమించిన కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయనే విషయం విదితమే. అయితే నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ (ఎన్‌జేడీజి) అందించిన తాజా సమాచారం చూస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. దేశంలోని కోర్టుల్లో 4.47 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం 25 హైకోర్టుల్లో అలహాబాద్ హైకోర్టు 10.74 లక్షల కేసులతో ముందుంది. దీని తర్వాత బాంబే హైకోర్టులో 7.13 లక్షల కేసులు, రాజస్థాన్ హైకోర్టులో 6.67 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ (ఎన్‌జీడీజీ) అందించిన తాజా డేటాలో ఈ వివరాలు ఉన్నాయి. 2018 నుంచి పెండింగ్ కేసుల సంఖ్య పెరిగింది. అలహాబాద్ హైకోర్టులో పెండింగ్ కేసులు 50.95 శాతం మేరకు పెరిగాయి. బాంబే హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు 53.85 శాతం మేరకు పెరిగాయి. అన్ని హైకోర్టుల్లో మొత్తం 62 లక్షల కేసులు పెండింగ్‌లో ఉండగా, వీటిలో 71.6 శాతం సివిల్ కేసులు, 28.4 శాతం క్రిమినల్ కేసులు. 2018 నుంచి ఈ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య పెరిగింది. 24.83 శాతం కేసులు 5 నుంచి 10 ఏళ్ల క్రితం నాటివి. 24.83 శాతం కేసులు 5 నుంచి 10 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. 18.25 శాతం కేసులు 10 నుంచి 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. పలు నివేదికల ప్రకారం పెండింగ్‌లో ఉన్న కేసులకు న్యాయమూర్తుల సంఖ్య సరిపోకపోవడమే ప్రధాన కారణం. 2022 మే నాటికి దాదాపు 25,600 మంది న్యాయమూర్తులు నాలుగు కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్న కేసులను విచారించే లేదా తీర్పునిచ్చే పనిలో ఉన్నారు. -
ఓన్లీ సూపర్‌స్టార్
1970లలో బొంబాయి మొత్తంలో 10 ఇంపాలా కార్లు ఉంటే వాటిలో ఒకటి జూనియర్ మెహమూద్ది. 1960–70ల మధ్య సినిమాల్లో జూనియర్ మెహమూద్ ఒక సూపర్స్టార్లా వెలిగాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అతని ప్రాభవం వైరల్‌గా ఉండేది. శుక్రవారం జూనియర్ మెహమూద్ కన్నుమూశాడు. అభిమానులు అతని పాత పాటలను, సన్నివేశాలను మళ్లీ వైరల్ చేస్తున్నారు. ‘హమ్ కాలే హైతో క్యా హువా దిల్ వాలే హై’... పాట ‘గుమ్నామ్’ (1965)లో పెద్ద హిట్. కమెడియన్ మెహమూద్ ఈ పాటకు డాన్స్ చేశాడు. సరిగ్గా మూడేళ్ల తర్వాత 1968లో అదే పాటకు ‘బ్రహ్మచారి’లో జూనియర్ మెహమూద్ డాన్స్ చేశాడు. అతని అసలు పేరు నయీమ్ సయీద్. అప్పటికి అతనికి ఏడెనిమిదేళ్లు కూడా లేవు. తనను ఇమిటేట్ చేసిన నయీమ్ సయీద్‌కు మెహమూద్ ‘జూనియర్ మెహమూద్’ అనే బిరుదు ఇచ్చి ఆశీర్వదించాడు. చనిపోయే వరకూ నయీమ్ అసలు పేరుతో కాకుండా జూనియర్ మెహమూద్గానే గుర్తింపు పొందాడు. 1968–70ల మధ్యకాలంలో జూనియర్ మెహమూద్ సూపర్‌స్టార్‌గా వెలిగాడు. సినిమాకు లక్ష రూపాయలు తీసుకునేవాడు. 1969లో రోజుకు 3000 రూపాయలు చార్జ్ చేసేవాడు. రాజేష్ ఖన్నా, జితేంద్ర, సంజీవ్ కుమార్లాంటి పెద్ద పెద్ద హీరోలతో కలిసి పని చేశాడు. ఇంపాలా కారులో తిరిగేవాడు. ఇతను స్టార్ అయ్యే ముందు వరకూ కుటుంబం చాలా పేదరికంలో ఉండేది. అతని తండ్రి రైల్వే డ్రైవర్. కాని ఆ తర్వాత జూనియర్ మెహమూద్ సంపాదనతో అందరూ స్థిరపడ్డారు. రిలీజైన సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తే జూనియర్ మెహమూద్తో పాట తీసి యాడ్ చేసి ఆడించిన సందర్భాలున్నాయి. శుక్రవారం 67 ఏళ్ల వయసులో జూనియర్ మెహమూద్ ముంబైలో కన్నుమూశాడు. భారతీయ చలనచిత్ర చరిత్రలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్టార్‌డమ్‌ను చూసిన జూనియర్ మెహమూద్‌ను అభిమానులు తలచుకుని అతని సినిమా సన్నివేశాలను వైరల్ చేస్తున్నారు. -
జీఎస్టీ షోకాజ్ నోటీసులపై బొంబాయి హైకోర్టుకు డ్రీమ్ 11
న్యూఢిల్లీ: ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్ డ్రీమ్11 తన ప్లాట్‌ఫారమ్‌పై పెట్టిన పందాలపై రెట్రాస్పెక్టివ్ (గత లావాదేవీలకు వర్తించే విధంగా)గా 28 శాతం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధించడాన్ని సవాలు చేసింది. ఈ మేరకు జారీ అయిన షోకాజ్ నోటీసులపై బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 216.94 కోట్లు, 2018–19కిగాను రూ. 1,005.77 కోట్ల పన్ను డిమాండ్ ఉందని పిటిషన్లో డ్రీమ్11 పేర్కొంది. ‘‘అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చిన పలు తీర్పుల ప్రకారం.. ఇలాంటి షోకాజ్ నోటీసు జారీ తగదు. పిటిషనర్ (డీ11) అందించిన ఆన్లైన్ ఫాంటసీ స్పోర్ట్స్ గేమింగ్ ప్రధానంగా నైపుణ్యానికి సంబంధించినది. జూదం లేదా బెట్టింగ్‌కు సంబంధించినది కాదు’’ అని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా పన్ను డిమాండ్ నోటీసు రూ.40 వేల కోట్లని, రూ. 25 వేల కోట్లని మీడియాలో భిన్న కథనాలు రావడం గమనార్హం. గేమింగ్ రంగంపై రెవెన్యూశాఖ దృష్టి! పన్ను వసూళ్లకు సంబంధించి రెవెన్యూ వ్యవస్థ ప్రస్తుతం గేమింగ్ రంగంపై దృష్టి సారించినట్లు కనబడుతోంది. ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందాలపై నైపుణ్యం లేదా సంబంధిత అంశాలతో సంబంధం లేకుండా 28 శాతం పన్ను విధించడం జరుగుతుందని జీఎస్టీ మండలి ఇటీవల ఇచ్చిన వివరణ ఈ పరిణామానికి నేపథ్యం. రూ. 16,000 కోట్లకు పైగా జీఎస్టీ చెల్లింపుల్లో లోటుపై కాసినో ఆపరేటర్ డెల్టా కార్ప్, దాని అనుబంధ సంస్థలకు జీఎస్టీ అధికారులు గత వారం నోటీసులు జారీ చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో రూ. 21,000 కోట్ల జీఎస్టీ రికవరీ కోసం ఆన్లైన్ గేమింగ్ కంపెనీ గేమ్స్క్రాఫ్ట్కు ఇదే విధమైన షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై ఆ సంస్థ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. నోటీసులను హైకోర్టు కొట్టివేసింది. దీనిని రెవెన్యూశాఖ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. అక్టోబర్ 10వ తేదీన ఈ కేసు విచారణకు లిస్టయ్యింది. -
'ఆత్మ గౌరవంతో రాజీ పడలేను..' హైకోర్టు జడ్జీ అర్ధాంతరంగా రాజీనామా..
ముంబయి: బాంబే హైకోర్టు జడ్జి జస్టిస్ రోహిత్ డియో అర్దాంతరంగా రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు కోర్టు హాల్లోనే ఆయన పేర్కొన్నారు. ఈ రోజు నాగ్‌పూర్‌లోని కోర్టు హాల్లో ఈ మేరకు ప్రకటించారు. ఆత్మగౌరవంలో రాజీపడలేనని ఆయన చెప్పినట్లు హాల్లో ఉన్న ఓ లాయర్ ఈ విషయాన్ని తెలిపారు. 'కోర్టులో ఉన్నవారందరికీ క్షమించమని కోరుతున్నా. మెరుగుపడాలనే మిమ్మల్ని అప్పడప్పుడు తిట్టాను. నేను కూడా మెరుగుపడాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నాకు ఉండదు. ఎందుకంటే మీరంతా నా కుటుంబ సభ్యులే. చెప్పడానికి చింతిస్తున్నా.. నా రాజీనామాను ఇచ్చేశాను. నా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పనిచేయలేను. మీరంతా కష్టజీవులు' అని జడ్జి చెప్పినట్లు ప్రత్యక్షంగా ఉన్న ఓ లాయర్ చెప్పారు. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే క్రమంలో మాత్రం తన వ్యక్తిగత కారణాలతోనే దేశ అధ్యక్షురాలికి రాజీనామా ఇచ్చినట్లు జస్టిస్ రోహిత్ డియో చెప్పారు. కీలక తీర్పులు.. అయితే.. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే కేసులో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సాయిబాబాను 2022లో జస్టిస్ రోహిత్ డియో నిర్దోషిగా ప్రకటించారు. ఆయనకు విధించిన జీవత ఖైదు శిక్షను పక్కకు పెట్టారు. ఉపా చట్టం కింద చెల్లుబాటు అయ్యే అవకాశం లేనప్పుడు విచారణ అనేదే శూన్యం అని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టు నిలుపదల ఉత్తర్వులు ఇచ్చింది. ఆ కేసును మళ్లీ నూతనంగా విచారణ చేపట్టాలని నాగపూర్‌కు చెందిన హైకోర్టు బెంచ్‌కు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జస్టిస్ రోహిత్ డియో నాగపూర్‌కు చెందిన హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సభ్యునిగా ఉన్నారు. ఇదే కాకుండా నాగపూర్-ముంబయి సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేలో మైనర్ ఖనిజాల తవ్వకాల అంశంలో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కూడా జస్టిస్ రోహిత్ డియో స్టే విధించారు. 2017లో బాంబే హైకోర్టు జడ్జిగా నియమితులైన జస్టిస్ రోహిత్ డియో 2025 డిసెంబర్ వరకు కొనసాగనుండగా.. అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు 2016లో మహారాష్ట్ర ప్రభుత్వానికి అడ్వకేట్ జనరల్‌గా కూడా జస్టిస్ రోహిత్ డియో పనిచేశారు. ఇదీ చదవండి: జ్ఞానవాపి ముస్లిం కమిటీకి సుప్రీంలో చుక్కెదురు.. ASI సర్వేకు గ్రీన్ సిగ్నల్.. ఇటు పురావస్తు శాఖకు ఆదేశాలు -
గజాలు,ఎకరాల్లో కాదు..కిలోమీటర్లలో భూ కొనుగోళ్లు!
వివిధ దేశాలు, దీవులను కొన్న దేశాలు సాధారణంగా ఎక్కడైనా భూమిని చదరపు అడుగులు, చదరపు గజాలు లేదా ఎకరాల్లో కొంటారని అందరికీ తెలుసు. కానీ కొన్ని దేశాలు ద్వీపాలు లేదా వేరే దేశాలను కొనుగోలు చేశాయని తెలుసా? దాదాపు 20 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్‌ల్యాండ్‌ను కొనేందుకు అమెరికా పలుమార్లు విఫలయత్నం చేసిందని తెలుసా? అలా దేశాలను లేదా ద్వీపాలను ఇతర దేశాలు కొనాల్సిన అవసరం.. దాని వెనకున్న ఉద్దేశమేంటి? అందుకు ఎంత వెచ్చించాయి. ఇలాంటి వెరైటీ భూకొనుగోళ్లలో కొన్నింటి గురించి క్లుప్తంగా... అలాస్కా ఉత్తర అమెరికా ఖండం ఎగువ భాగాన 17 లక్షల చ.కి.మీ.పైగా విస్తీర్ణం మేర విస్తరించిన ఈ ప్రాంతాన్ని అమెరికా 1867లో రష్యా నుంచి కొనుగోలు చేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అప్పటి రష్యన్ చక్రవర్తి కేవలం 72 లక్షల డాలర్లకు ఈ ప్రాంతాన్ని అమ్మేశాడు. అమెరికా కొనుగోలు చేసిన అతిస్వల్పకాలంలోనే అలాస్కాలో అత్యంత విలువైన బంగారు గనులు బయటపడ్డాయి. అంతేకాదు.. ఆపై చమురు నిక్షేపాలతోపాటు అనేక ఖనిజాలు లభించాయి. ఇప్పుడు అలస్కాలో ఏటా 8 కోట్ల టన్నుల చమురును అమెరికా వెలికితీస్తోంది. సింగపూర్ బ్రిటన్ 1819లో సింగపూర్‌ను కొన్నది. ఈస్టిండియా కంపెనీ వాణిజ్య అవసరాల కోసం మలేసియాలోని జోహర్ రాజ్యం నుంచి సింగపూర్‌ను కొనుగోలు చేసింది. దీనికోసం జోహర్ సుల్తాన్ హుస్సైన్షాకు ఏడాదికి 5,000 స్పెయిన్ డాలర్లు అదే రాజ్యానికి సైన్యాధికారి అయిన అబ్దుల్ రహమాన్‌కు 3,000 డాలర్లు ఇచ్చేట్లు బ్రిటన్ ఒప్పందం చేసుకుంది. అయితే రెండో ప్రపంచ యుద్ధం ఫలితంగా బ్రిటన్ సింగపూర్‌ను వదుకోవాల్సి వచ్చింది. తిరిగి మలేసియాలో భాగమైన సింగపూర్ 1965లో స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ఫ్లోరిడా బ్రిటన్ సింగపూర్‌ను కొనుగోలు చేసిన 1819లోనే అక్కడ అమెరికా ఫ్లోరిడాను స్పెయిన్ నుంచి కొన్నది. దీనికోసం అమెరికా కేవలం 50 లక్షల డాలర్లను వెచ్చించింది. 1845లో ఫ్లోరిడా అమెరికా 27వ రాష్ట్రంగా అవతరించింది. ఫిలిప్పైన్స్ సుదీర్ఘ పోరాటం తరువాత స్వాతంత్య్రం సాధించిన ఫిలిప్పైన్స్‌ను ఒకప్పుడు స్పెయిన్ నుంచి అమెరికా కొనుగోలు చేసింది. 1898లో ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా 2 కోట్ల డాలర్లు వెచ్చించి అమెరికా ఫిలిప్పైన్స్‌ను సొంతం చేసుకుంది. గ్వదర్ బలూచిస్తాన్ రాష్ట్రంలో భాగమైన ఈ తీరప్రాంత పట్టణాన్ని పాకిస్తాన్ 1958లో ఒమన్ నుంచి కొనుగోలు చేసింది. దీనికోసం 550 కోట్ల పాకిస్తాన్ రూపాయలను వెచ్చించింది. చైనా బెల్ట్ అండ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా గ్వదర్ పోర్టును పాకిస్తాన్ 2013లో చైనాకు అప్పగించింది. అప్పట్లో ఈ పోర్టు విలువను 4,600 కోట్ల డాలర్లుగా విలువ కట్టారు. వర్జిన్ ఐలాండ్స్ అమెరికా 1917లో డెన్మార్క్ నుంచి వర్జిన్ ఐల్యాండ్స్‌ను కొనుగోలు చేసింది. దీనికోసం 2.5 కోట్ల డాలర్ల విలువైన బంగారాన్ని అమెరికా డెన్మార్క్‌కు అప్పగించింది. అప్పట్లోనే 10 కోట్ల డాలర్లతో గ్రీన్‌ల్యాండ్‌ను కూడా కొంటామని అమెరికా ప్రతిపాదించినా డెన్మార్క్ అంగీకరించలేదు. 1867 నుంచి 2019 వరకు అమెరికా పలుమార్లు గ్రీన్‌ల్యాండ్‌ను కొనే ప్రయత్నాలు చేసింది. కానీ గ్రీన్‌ల్యాండ్‌పై సార్వభౌమాధికారంగల డెన్మార్క్ మాత్రం ఈ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ వస్తోంది. ఆఖరి కొనుగోలు ప్రపంచంలో ఇతర దేశాలను లేదా ప్రాంతాలను కొనుగోలు చేసే ప్రక్రియ చివరగా సౌదీ అరేబియా ఈజిప్టు మధ్య జరిగింది. 2017లో ఎర్ర సముద్రంలోని రెండు చిన్నదీవులైన టీరన్, సనఫిర్లను సౌదీకి అప్పగించేందుకు ఈజిప్టు అంగీకరించింది. దీనికోసం 2 కోట్ల అమెరికన్ డాలర్లను సాయంగా ఇచ్చేందుకు సౌదీ ఒప్పందం చేసుకుంది. అయితే ఇప్పటికీ ఈజిప్టు పౌరులు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కట్నంగా నాటి బొంబాయి ప్రస్తుత ముంబై ఒకప్పటి బొంబాయిని బ్రిటన్ రాజు చార్లెస్–2 కట్నంగా పొందారు. ప్రస్తుత ముంబైలో ఉన్న అనేక ప్రాంతాలు, ద్వీపాలు అప్పట్లో పోర్చుగీసు రాజ్యం అదీనంలో ఉండేవి. చార్లెస్–2 పోర్చుగీసు యువరాణి కేథరీన్ను పెళ్లి చేసుకున్నందుకు కట్నంగా కింగ్ జాన్–4 బొంబాయిని కట్నంగా రాసిచ్చారు. అప్పట్లో పోర్చుగీసు వాళ్లు బొంబాయిని బోమ్బెహియాగా పిలిచేవారు. తరువాత ఆంగ్లేయులు బాంబేగా మార్చారు. కట్నంగా పొందిన బొంబాయిని చార్లెస్... బ్రిటన్‌కు చెందిన ఈస్టిండియా కంపెనీకి అప్పగించారు. నటోవతు ద్వీపం 2014లో ఫిజికి చెందిన నటోవతు అనే దీవిలో 5,000 ఎకరాలను కిరిబటి రిపబ్లిక్ 87 లక్షల డాలర్లకు కొనుగోలు చేసింది. రానున్న రోజుల్లో సముద్ర మట్టాలు పెరిగితే తమ దేశం మునిగిపోతుందని ముందుజాగ్రత్త చర్యగా కిరిబటి తన జనాభా సంరక్షణ కోసం ఈ భూమిని కొనుగోలు చేసింది. అమ్మకానికి మరెన్నో దీవులు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మానవరహిత దీవులు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ మాదిరిగానే దీవుల అమ్మకం, కొనుగోళ్ల కోసం ఏజెంట్లు, ఆన్లైన్ వెబ్సైట్లు కూడా సేవలు అందిస్తున్నాయి. ధనవంతులు వెకేషన్ల కోసం ఇలాంటి దీవుల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రదేశాన్ని బట్టి వాటి రేట్లు ఉంటాయి. మధ్య అమెరికాలో కొంత తక్కువగా... యూరప్ కొంత ఎక్కువగా ఈ దీవుల రేట్లు ఉన్నాయి. ప్రైవేట్ ఐలాండ్స్ వంటి ఆన్లైన్ వెబ్సైట్ల ప్రకారం దక్షిణ అమెరికాలో అతితక్కువగా మన కరెన్సీలో రూ. 5 కోట్లుగా ఓ దీవి విలువ ఉంటే యూరప్‌లో రూ. 7 కోట్లకు ఎంచక్కా దీవిని సొంతం చేసుకోవచ్చు. ఎందరో హాలీవుడ్ స్టార్లతోపాటు బాలీవుడ్ స్టార్లు ఇలాంటి దీవులను కొనుగోలు చేశారు. షారుక్‌ఖాన్ దుబాయ్ సమీపంలో 70 కోట్ల డాలర్లకు ఓ దీవిని సొంతం చేసుకోగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పాప్‌సింగర్ మీకా కూడా దీవులు కొనుగోలు చేసిన వారిలో ఉన్నారు. 30 భద్రత, ఆర్థిక లేదా వాణిజ్య అవసరాల కోసం ఓ దేశం మరో దేశాన్ని మొత్తంగా లేదా కొంత భాగాన్ని కొన్న ఉదంతాలు -
ఆమెపాటకు అరవై ఏళ్లు
వరలక్ష్మికి గాత్రం దేవుడిచ్చిన వరం. గురువులు లేరు... శిక్షణ లేదు. రేడియో ఆమెకుపాటలు నేర్పింది. రేడియో ఆమెచేతపాడించుకుంది. ఆలయాలు ఆమెపాటలకు వేదికనిచ్చాయి. ఇప్పుడామె ముంబయిలో తెలుగు స్వరం. వరలక్ష్మి నారాయణమ్ పుట్టిల్లు గుంటూరు జిల్లాలోని బ్రాహ్మణ కోడూరు. రేడియోలో వచ్చినపాటలు వింటూపాడడం నేర్చుకున్నారు. అందుకే కాబోలుపాటపాడాలనే అభిలాష ఉన్న వాళ్లను ఏర్చికూర్చి, వాళ్లకుపాడడంలో మెళకువలు నేర్పించి, వారిని ఒక వేదిక మీదకు తీసుకువచ్చిపాడించారు. ఘంటసాల జయంతి రోజున ఘంటసాలపాటలుపాడడానికి మహామహులైన గాయకులు పో టీ పడుతుంటారు. కరతాళ ధ్వనులలో ఉ΄÷్పంగిపో తుంటారు. జనం వారినే చూస్తారు, వారికే హారతులు పడుతుంటారు. కానీ...పాడాలనే తపన ఉన్న అనేక మంది ఆశావహుల ముఖాలను చూశారామె. వారిలో గృహిణులున్నారు. డాక్టర్లు, లాయర్లు, లెక్చరర్లు కూడా ఉన్నారు. ఇలాంటి గానాభిలాషులతో ఘంటసాల జయంతిని ప్రత్యేకంగా నిర్వహించేవారు వరలక్ష్మి. బీఈడీ చేసిన వరలక్ష్మిపాఠాలు చెప్పడంలో స్వరం మాధుర్యం కోల్పోతుందేమోనన్న భయంతోపాటల కోసంపాఠాల ఉద్యోగానికి దూరమయ్యారు.పాటపాడక పో తే తోచదు. ఇప్పుడు ముంబయిలో నివసిస్తున్నప్పటికీ అక్కడి తెలుగు వారిని ఒక చోటకు చేర్చడానికిపాటనే మాధ్యమంగా చేసుకున్నారామె. అరవై ఐదేళ్ల వరలక్ష్మి అరవై ఏళ్ల తనపాటల ప్రస్థానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ► పాట చాలా ఇచ్చింది! ‘‘నేనుపాట కోసం జీవితాన్ని అంకితం చేశాననే ప్రశంస సంతోషంగా ఉంటుంది. కానీపాటకు నేను చేసిన సేవకంటేపాట నాకిచ్చిన గుర్తింపు, గౌరవమే పెద్దది.పాట నాకెంతో ఇచ్చింది. ఐదేళ్ల వయసులో గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఘంటసాల గారితో కలిసి ‘ఆకాశవీథిలో అందాల జాబిలి’పాడాను. నాలో గాయని ఉందని గుర్తించిన స్కూల్ టీచర్లు ఏ కార్యక్రమం అయినా నాతోపాడించేవారు. ఇక కాలేజ్‌లో మ్యూజిక్ ఒక సబ్జెక్ట్‌గా తీసుకున్నాను. మా సరోజిని మేడమ్ ఎక్కడ పో టీలు జరిగినా నన్ను పంపేవారు. సినీనటి సుమలత మ్యూజిక్‌లో నా క్లాస్మేట్. ఆ పరిచయం ఉన్నప్పటికీ నేను సినిమా గానం వైపు వెళ్లలేదు. రేడియోలో ‘బి గ్రేడ్’ సింగర్‌గా సెలెక్ట్ అయ్యాను. ‘ఈ మాసపుపాట, లలిత గీతాలు’ లెక్కలేనన్నిపాడాను. టీవీలో తరిగొండ వెంగమాట కీర్తనలు, సమస్త దేవతా కీర్తనలనుపాడడంతోపాటు బాణీలు కూడా కట్టాను. ఆరు సొంత ఆల్బమ్‌లు చేశాను. మా రోజుల్లో ఇప్పుడున్నన్ని సౌకర్యాల్లేవు. చాలా మంది మహిళలకు తమపాటలను రికార్డు చేసుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ ఇంట్లో సహకారం లేక ఆశను చంపేసుకునేవారు. అలా నా దృష్టికి వచ్చిన వారందరి చేత సొంత ఆల్బమ్‌లు చేయించగలిగాను. పెళ్లి తర్వాత మా వారి ఉద్యోగరీత్యా మచిలీపట్నంలో ఉన్నంత కాలం నాపాటయానం ఇన్నర్ వీల్ సర్వీస్‌తో కలగలిసిపో యి సాగింది. మా అబ్బాయి చదువు కోసం తిరుపతికి మారాం. అప్పుడు మరో మలుపు తీసుకుంది. తిరుపతిలో ఉన్నంత కాలం ‘ఘంటసాల స్వరాభిషేకం’ కార్యక్రమంలో వందల మందితో అన్నమాచార్య కీర్తనలు, సాధారణపాటలుపాడించాను. వీటన్నింటిలో నాకు అత్యంత సంతోషాన్నిచ్చిన సంఘటన తిరుమలలో జరిగింది. ► గిరులు ప్రతిధ్వనించాయి తిరుమల రేడియో స్టేషన్ ్రపారంభోత్సవానికి ఆహ్వానించారు. వామన చరిత్రపారాయణం చేశాను. తిరుమలలోనే మరో సంఘటన వేదపాఠశాలలో జరిగింది. మా వదిన తిరుప్పావైపాటలను తెలుగులో రాశారు. ఆపాటలకు నేను ట్యూన్ కట్టాను. ముప్పైవపాట ట్యూన్ చేస్తున్నప్పుడు అనుకోకుండా తిరుపతిలోనే ఉన్నాను. వేదపాఠశాల నుంచి ఆహ్వానం వచ్చింది. గోవిందనామాలతో మొదలుపెట్టి తిరుప్పావైపాశురాలన్నీపాడాను. అప్పుడు వేదపాఠశాల గురువులు, ఐదు వందల మంది విద్యార్థులు గొంతుకల్లో పలికిన ఆశీర్వచనం తిరుమల గిరుల్లో ప్రతిధ్వనించింది.పాటను కమర్షియల్‌గా మార్చకుండా కళగా గౌరవిస్తే భగవంతుడు తనవంతుగా ఇనుమిక్కిలిగా ఇస్తాడని నమ్ముతాను. రెమ్యూనరేషన్ ఇవ్వలేని వాళ్ల కోసం సొంత ఖర్చులతో వెళ్లిపాడిన సందర్భాలున్నాయి. అందుకే నాకు ఆహ్వానాలు కూడా ఎక్కువే వస్తుంటాయి. తెలుగు నేల మీద ఆలయాలన్నీ నాపాటను ఆహ్వానం పలికాయనే చెప్పాలి. ఆర్కెస్ట్రాతో వెళ్తే తప్పనిసరిగా ఖర్చులుంటాయి. అందుకే చెన్నైకి వెళ్లి ట్రాక్‌లు రికార్డు చేయించుకున్నాను. నేను, నా ఫోన్ ఉంటే చాలు. ఎక్కడికైనా వెళ్లిపాడతాను. దేశవిదేశాల్లోనూ నా స్వరం వినిపించే అవకాశం వచ్చింది. ► మెండైన ప్రోత్సాహం పాట కోసం నేను టీచర్ ఉద్యోగాన్ని వదులుకుంటానంటే మా వారు రెండోమాటకు తావులేకుండా ్రపో త్సహించారు. ఆయన కెమిస్ట్రీ ప్రోఫెసర్‌గా రిటైరయ్యారు. మా అబ్బాయికి రిలయెన్స్‌లో ఉద్యోగం. తనుపాడతాడు కానీ వృత్తిగా కాదు. మనుమరాళ్లిద్దరికీ మంచి గొంతు ఉంది. వాళ్లకు నేర్పించాలనే ప్రయత్నం చేస్తున్నాను. కానీ పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదన్నట్లు నా దగ్గర క్రమశిక్షణగా కూర్చునిపాడలేకపో తున్నారు. రెండుపాటలుపాడి ‘ఇక ఆడుకుంటాం నానమ్మా’ అని వెళ్లిపో తారు’’ అన్నారామె నవ్వుతూ. అరవై ఐదేళ్ల వయసులో కూడా ఆమె స్వరంలో మాధుర్యం ఏ మాత్రం తగ్గలేదు. ‘పాట కోసం గొంతు సవరించుకోని రోజు నాకు అనారోగ్యం వచ్చినట్లు. ఇంత వరకు ఒక్కరోజు కూడా ముసుగుపెట్టి పడుకున్నది లేదు.పాటలోనే నా ఆరోగ్యం,పాటతోనే నా జీవితం’ అన్నారు వరలక్ష్మి నారాయణమ్. – వాకా మంజులారెడ్డి -
ఆ క్షణం నాకు వెన్ను నుంచి వణుకు పుట్టుకువచ్చింది..
ఇండియన్ పొలిటికల్ కార్టూన్ అంటే ప్రపంచం తల తిప్పి ఆర్కే లక్ష్మణ్ అనే సంతకం వైపు చూస్తుంది . అటువంటి మహా చిత్రకారుడు ఆర్కే లక్ష్మణ్ కథ బొమ్మలనే సాధనగా, సాధనే జీవితంగా సాగిన లక్ష్మణ్ జీవితంలో లైఫ్ స్కెచింగ్ చోటు చేసుకున్నంతగా మరే భారతీయ వ్యంగ చిత్రకారుడి జీవితంలో ఈ సాధన రక్తంలో రక్తంగా కలిసిపోవడాన్ని విని ఉండలేదు. లక్ష్మణ్ పార్లమెంట్‌ని ఫొటోల్లో చూసి తన బొమ్మల్లోకి దింపలేదు. పార్లమెంట్ ఎదురుగా కూచుని దానిని అన్ని కోణాల్లో బొమ్మగా మార్చుకున్నాడు. రాజకీయనాయకులని, బ్యాంక్ ఉద్యోగస్తులని, చెట్టు కింద చిలుక జ్యోతిష్కుడిని, మెరైన్ డ్రైవ్ రహదారి అంచున కూర్చున్న మనుషులని ఎవరిని కూడా ఊహించుకుని వేసిన బొమ్మలు కావవి. అందరిని చూసాడు, తనలో ఇంకించుకున్నాడు. బొంబాయి నగరాన్నంతా కట్టల కొద్దీ స్కెచ్ పుస్తకాల్లో నమోదు చేసుకున్నాడు . జీవిత నిరంతరం సాధన చేస్తూనే ఉన్నాడు. అందుకే తనది ఇక మరెవరూ దాటలేని నల్లని ఇంకు గీతల లక్ష్మణరేఖ ఐయింది. ఇరవైల ప్రాయంలో లక్ష్మణ్ జీవితంలోని కొన్నిపేరాల సంఘటనలు ఇక్కడ.. అప్పటికప్పుడు పత్రిక సంపాదకుడ్ని కలిసి నా గురించి ఆయనకు చెప్పుకున్నాను . అంతా విని ఆయన మరో మాట ఏమీ లేకుండా వెంటనే ‘కల్బాదేవి కాల్పులపై’ ఒక కార్టూన్ స్ట్రిప్ చిత్రించమని పని నాకు ఇచ్చాడు. కల్బాదేవి అనేది బొంబాయిలో బాగా పేరున్న ఒక ప్రముఖ వ్యాపార కేంద్రం. మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు జరిగిన అతి పెద్ద ఉగ్రవాద దాడికి, మారణకాండకు ఈ ప్రాంతమే కేంద్రం. 14 సెప్టెంబర్ 1946న ఇండియన్ ఆర్మీ క్యాంపునకు సంబంధించిన ఇద్దరు సైనికులు సైనిక లారీలో తమ యూనిట్ నుండి ఆయుధాలతో సహా తప్పించుకుని బైకుల్లా రైల్వే స్టేషన్ సమీపంలో ఒక టాక్సీని కిరాయికి తీసుకుని కల్బాదేవి వైపు వెళ్ళమన్నారు. ఆ టాక్సీ నారిమన్ అనే పార్సీ వ్యక్తికి చెందింది. ఆ సమయంలో ఆ టాక్సీలో అతనితో పాటు యుక్తవయస్కుడైన అతని కొడుకు కూడా ఉన్నాడు. హంతకులు నేరుగా టాక్సీని కల్బాదేవి వేపు తీసుకెళ్ళి, టాక్సీ నుండి దిగీ దిగగానే ఇద్దరూ తమ చేతిలో ఉన్న మెషిన్ గన్లతో రహదారిపై కాల్పులు జరపడం మొదలుపెట్టారు. ఇటువంటి దారుణాన్ని ఊహించని డ్రైవర్, అతని కొడుకు ఇద్దరూ భయాందోళనలకు గురై టాక్సీని వదిలి పారిపోజూశారు. ఆ హంతకులు ఈ తండ్రీ కొడుకులు ఇరువురిని కూడా చంపేశారు. ఈ దారుణకాండలో దుకాణంలో కూచుని ఉన్న ఒక నగల వ్యాపారి, ఉదయాన్నే బడికి బయలుదేరిన ఒక చిన్న పిల్లవాడు, రోడ్డు మీద కూరగాయలు అమ్మే ఒక మనిషి, టీ దుకాణంలో కూచుని టీ తాగుతున్న ఒక వ్యక్తి ఇంకా కొంతమంది పాదచారులతో సహా మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇరవైమంది తీవ్రంగా గాయపడ్డారు. నిందితులను బాంబే పోలీసులు సంఘటన జరిగిన రెండు నెలల్లో అరెస్టు చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి కొన్ని రోజుల ముందు కోర్టు వారిని విచారించి మరణశిక్ష విధించింది. ఇదంతా నేను బొంబాయి చేరుకునే సమయం ముందుగా జరిగింది. ఆ సమయంలో ఇది దేశ వ్యాప్తంగా చాలా పెద్ద సంచలన వార్త. బ్లిట్జ్ ఎడిటర్ నాకు ఈ కథను క్లుప్తంగా చెప్పాడు. ఈ సంఘటన విచారణకు సంబంధించిన కోర్ట్ కాగితాల ప్రతులను కూడా నాకు అందచేశాడు. ఈ ఇతివృత్తాన్ని ఒక బొమ్మల కథగా తయారు చేయాలని, ఆ కథ ప్రతీ వారం తమ పత్రికలో రావాలని, ఇందుకు గానూ ఆయన నాకు వెయ్యి రూపాయలు ఇస్తానని ఆఫర్ చేశాడు. పంతొమ్మిది వందల నలభైలలో వేయి రూపాయలంటే చాలా పెద్ద డబ్బు. ప్రస్తుతం నేను మద్రాసు నుండి వెలువడే స్వరాజ్య పత్రికవాళ్ళు నా కార్టూన్లకు పంపుతున్న డబ్బుతో బొంబాయిలో కాలం నెట్టుకొస్తున్నాను. ఇప్పుడు రాబోతున్న బ్లిట్జ్ డబ్బులు ఇవన్నీ కలుపుకుని బొంబాయిలో ఇంకొంత కాలం గడపవచ్చు కదా అని సంబరపడ్డాను. బొమ్మల కథకు అవసరమైన నేపథ్యాన్ని అధ్యయనం చేయడానికి కాల్పులు జరిగిన కల్బాదేవి ప్రాంతం గుండా నన్ను తీసుకెళ్లడానికి, కాల్పులు జరిగినపుడు అక్కడే ఉన్న కొంతమంది ప్రత్యక్ష సాక్షులను, బాధితులను నేను కలుసుకుని మాట్లాడ్డానికి , వారి ద్వారా జరిగిన సంఘటన తబ్సీలు ఎక్కించుకోవటానికి గాను నా కోసం ఆ ప్రాంతపు ఆనుపానులు తెలిసిన వారిని కొంతమందిని సహాయంగా కల్బాదేవి ప్రాంతానికి పంపించాడు బ్లిట్జ్ ఎడిటర్. కల్బాదేవి అనేది దాదాపు అరకిలోమీటరు పొడవునా రద్దీగా ఉన్న రహదారి మార్గం. రోడ్డుపై బస్సులు, కార్లు, సైకిళ్లు, తోపుడు బళ్ళు, మనుష్యులు అనేకులు బిలబిలమని కదులుతూనే ఉన్నారు. వీధికి రెండు వైపులా పుస్తకాలు అమ్మేవాళ్ళు, గడియారాలు రిపేర్లు చేసే చిన్న చిన్న కొట్లవాళ్ళు, మంగలి షాపులు, టీ షాపులు, వెండిపని చేసే కంసాలి దుకాణాలు, బట్టలు అమ్మే వ్యాపారులు, ఇలా ఎన్నో రకాల వ్యాపారాలు బారులు బారులుగా నడుస్తున్నాయి . వీధిలో అటూ ఇటూ చూసుకుంటూ నేను అక్కడ జరిగిన నరమేధం గురించి ఆలోచిస్తున్నాను. ముందస్తుగా ఎటువంటి ఘోరాన్ని ఊహించని ఒక ఉదయాన వీధి నడి బొడ్డున వచ్చి ఆగిన ఒక టాక్సీ నుండి నిప్పులు కక్కుతూ తుపాకులు సృష్టించిన భీకర మారణకాండని తలుచుకుంటే ఆ క్షణం నాకు వెన్ను నుండి వణుకు పుట్టుకువచ్చింది. కల్బాదేవి దారుణ సంఘటనను బొమ్మల కథగా మలచడానికి ఆ రహదారిలో నిలబడి నేనొక భ్రమను నా చుట్టూ అల్లుకున్నాను. ఆ సంఘటన జరిగిన రోజున ఆ నేరగాళ్ళు ప్రయాణించిన కారులో నేనూ అదృశ్యంగా ఉన్నట్టు, వారి సంభాషణ మొత్తం నా సమక్షంలోనే జరుగుతున్నట్టు, వారి తుపాకి నుండి వెలువడిన ప్రతి తూటా నా కళ్ళ ముందే దూసుకుపోయినట్టు – రవ్వలు కక్కే ఆ అంగుళమంత నిప్పుముక్క ఏ దుకాణపు తలుపును ఛేదించుకుంటూ పోయిందో! ఏ మనిషి కడుపును కుళ్ళపొడుస్తూ తన రక్తదాహం తీర్చుకుందో! మనుషులు ఆర్తనాదాలు చేస్తూ ఎలా కకావికలమయ్యారో, ఎలా కుప్పకూలిపోయారో! – అశరీరంగా నేను చూస్తున్నట్లు బొమ్మలు వేసేందుకు అనువయిన ప్రతి సన్నివేశాన్ని అనేకానేక కోణాల నుండి గమనించినట్లు ఒక అవాస్తవ భ్రాంతిని సృష్టించుకున్నాను . ఆ సమయంలో నేను మొదటి సారిగా కల్బాదేవి వీధిలో నడుస్తూ నిలువెల్లా వణికిపోయినవాడిని కాను. నా ఎరుక లేకుండా జరిగిపోయిన దానిని కూడా అవసరమైనపుడు ఊహాపోహలుపోయి కళ్ళముందుకు తెచ్చుకుని దానిని నల్లని గీతలతో పునఃప్రతిష్ట చేయగలిగిన చిత్రకారుడిని నేను. నేను లక్ష్మణ్‌ని. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి. -
చీరకట్టులో మారథాన్.. 80 ఏళ్లయినా తగ్గేదే లే.. బామ్మ వీడియో వైరల్
ముంబై: పట్టుదల ఉంటే వయసుతో సంబంధం లేకుండా ఏమైనా సాధించవచ్చని మరోమారు నిరూపించారు మహారాష్ట్ర ముంబైకి చెందిన ఓ బామ్మ. 80 ఏళ్ల వయసులో మారథాన్‌లో పాల్గొన్నారు. స్నీకర్స్ ధరించి చీరకట్టులో పరుగులు తీశారు. చేతిలో జాతీయ జెండా కూడా పట్టుకున్నారు. 51 నిమిషాల్లో 4.2కిలోమీటర్లు పరుగెత్తి శభాష్ అనిపించుకున్నారు. టాటా ముంబై మారథాన్ 18వ ఎడిషన్ ఆదివారం ఘనంగా జరిగింది. దాదాపు 55,000 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. 80 ఎళ్ల బామ్మ కూడా ఇందులో భాగమయ్యారు. ఆమె మనవరాలు ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. दुनिया में कोई काम असंभव नहीं, बस हौसला और मेहनत की जरूरत है।#thursdayvibes #ThursdayMotivation #marathon #mumbai #grandmother pic.twitter.com/dDzvGxmFG9 — Dr. Vivek Bindra (@DrVivekBindra) January 19, 2023 ఈ బామ్మ చాలా మందికి స్ఫూర్తి. వయసు అనేది కేవలం నంబర్ మాత్రమేనని ఈమె నిరూపించారు. అని కొందరు నెటిజన్లు ప్రశంసించారు. కాగా.. ఈ మారథాన్‌లో పాల్గొనడం తనకు ఇది ఐదోసారి అని బామ్మ తెలిపారు. తాను భారతీయురాలినని సగర్వంగా చెప్పేందుకే చేతిలో జాతీయ జెండా పట్టుకున్నట్లు వివరించారు. చదవండి: పేదలకు ప్రతి నెలా రూ.2,000.. కర్ణాటక మంత్రి కీలక ప్రకటన -
పౌర హక్కులకు... మేమే సంరక్షకులం
ముంబై: దేశంలో పౌరుల స్వేచ్ఛ తదితర హక్కులకు న్యాయస్థానాలే శ్రీరామరక్ష అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ పునరుద్ఘాటించారు. ప్రజలు కూడా ఈ విషయంలో న్యాయవ్యవస్థపైనే అపారమైన నమ్మకం పెట్టుకున్నారని స్పష్టం చేశారు. శనివారం బాంబే బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన జస్టిస్ అశోక్ హెచ్.దేశాయ్ స్మారకోపన్యాసం చేశారు. దేశంలో స్వేచ్ఛా దీపిక నేటికీ సమున్నతంగా వెలుగుతోందంటే దాని వెనక ఎందరో గొప్ప న్యాయవాదుల జీవితకాల కృషి దాగి ఉందన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తన మనోగతాన్ని కుండబద్దలు కొట్టారు. ‘‘ఏ కేసూ చిన్నది కాదు, పెద్దదీ కాదు. నిన్న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన ఒక సామాన్య కేసే ఇందుకు తాజా ఉదాహరణ. విద్యుత్ పరికరాల దొంగతనం కేసులో యూపీకి చెందిన ఒక వ్యక్తికి ట్రయల్ కోర్టు తొమ్మిది కేసుల్లో రెండేసి సంవత్సరాల చొప్పున జైలు శిక్ష విధించింది. కానీ అది ఏకకాలంలో, అంటే రెండేళ్లలోనే పూర్తి కావాలని స్పష్టమైన ఆదేశాలివ్వడం మర్చిపోయింది. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ తప్పిదాన్ని సరిదిద్దాల్సి వచ్చింది. లేదంటే చిన్న దొంగతనం కేసులో దోషి ఏకంగా 18 ఏళ్ల జైల్లో మగ్గాల్సి వచ్చేది. అందుకే మరోసారి చెప్తున్నా. జిల్లా కోర్టు మొదలుకుని హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా ఏ కోర్టుకైనా చిన్న కేసు, పెద్ద కేసు అని విడిగా ఏమీ ఉండవు. అన్ని కేసులూ ముఖ్యమైనవే’’ అన్నారు. పౌర హక్కుల్ని అంతిమంగా న్యాయవ్యవస్థే పరిరక్షిస్తుందని ఈ కేసుతో మరోసారి తేటతెల్లమైందని అభిప్రాయపడ్డారు. సదరు కేసులో అలహాబాద్ హైకోర్టు కూడా ట్రయల్ కోర్టు తీర్పునే సమర్థించింది. దాంతో శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ సీజేఐ సారథ్యంలోని ధర్మాసనమే శుక్రవారం తీర్పు వెలువరించడం తెలిసిందే. ‘‘మనిషి ప్రవర్తన సజావుగా ఉండేలా చూడటంలో చట్టంతో పాటు నైతికతది కూడా కీలక పాత్ర. మన బయటి ప్రవర్తనను చట్టం నియంత్రిస్తే మనోభావపరమైన లోపలి ప్రవర్తనను నైతికత దారిలో ఉంచుతుంది’’ అని ఈ సందర్భంగా సీజేఐ అభిప్రాయపడ్డారు. కోర్టుల వల్లే సుస్థిర ప్రజాస్వామ్యం ఎమర్జెన్సీ సమయంలో కోర్టుల స్వతంత్ర వ్యవహార శైలే దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు బాంబే హైకోర్టులో సత్కార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ‘‘ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొంటూ స్వతంత్రంగా, నిర్భీతిగా వ్యవహరించే న్యాయస్థానాలే నాడు దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాయి. మనకబారిన ప్రజాస్వామ్య స్వేచ్ఛా ప్రమిద పూర్తిగా కొడిగట్టిపోకుండా జస్టిస్ రాణే వంటి న్యాయమూర్తులే కాపాడారు. బార్ నుంచి వచ్చిన న్యాయమూర్తులు కూడా ఇందులో కీలక పాత్ర పోషించి ప్రజాస్వామ్య పతాకాన్ని సమున్నతంగా నిలిపారు. మన ప్రజాస్వామ్యం ఇప్పటికీ సుస్థిరంగా నిలిచి ఉందంటే అదే కారణం’’ అన్నారు. పలువురు న్యాయమూర్తులతో తాను పని చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. ‘‘యువత న్యాయవాద వృత్తిని చేపట్టేలా ప్రోత్సహించడంలో బాంబే బార్ అసోసియేషన్ చురుౖMðన పాత్ర పోషించాలి. ఈ విషయంలో న్యాయమూర్తులపైనా గురుతరమైన బాధ్యత ఉంది’’ అని అభిప్రాయపడ్డారు. -
జేఈఈ టాపర్స్ దృష్టి... ఐఐటీ బాంబే వైపే
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), బాంబే హవా కొనసాగుతోంది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్–2022లో టాప్–100 ర్యాంకర్లలో 93 మంది ఐఐటీ బాంబేను మొదటి ప్రాథామ్యంగా ఎంపిక చేసుకున్నారు. వీరిలో 69 మంది బాంబే ఐఐటీలో సీటు సాధించారు. ఇందులో 68 మంది మొదటి విడత కౌన్సిలింగ్లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కోర్సును ప్రథమ ప్రాథామ్యంగా ఎంపిక చేసుకోగా ఒక్కరు ఇంజినీరింగ్ ఫిజిక్స్‌ను తీసుకున్నారు. టాప్–100 ర్యాంకర్లలో 28 మంది ఐఐటీ ఢిల్లీలోనూ ముగ్గురు ఐఐటీ మద్రాస్‌లోనూ జాయినయ్యారు. జాయింట్ సీట్ ఎలొకేషన్ అథారిటీ ఈ వివరాలను అందించింది. గత ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో టాప్–100 ర్యాంకర్లలో 62 మంది, 2020లో 58 ఐఐటీ బాంబేలో ప్రవేశం పొందగా 2019లో టాప్–100 ర్యాంకర్లలో 62 మంది, 2018లో 59 మంది ఇక్కడే సీటు సాధించారు. టాప్–500 ర్యాంకర్లకూ బాంబే ఐఐటీనే మొదటి ప్రాథామ్యంగా ఉంది. టాప్–500 ర్యాంకర్లలో 173 మంది ఇక్కడ, 127 మంది ఢిల్లీ ఐఐటీలో స్థానం సంపాదించారు. టాప్–500 ర్యాంకర్లలో మద్రాస్, ఖరగ్‌పూర్, కాన్పూర్ ఐఐటీల్లో సీట్లు సాధించిన వారి సంఖ్య 50 మంది లోపే. -
అనధికార భవనాలను కూల్చేయండి! కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు
ముంబై: అనధికార భవనాలు కారణంగా ఒక్క అమాయకుడి ప్రాణాలు పోయిన ఉరుకోమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అటువంటి నిర్మాణాల వల్ల కలిగే ప్రమాదాలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. ముంబైలో అనేక కుటుంబాలు నివశిస్తున్న తొమ్మిది అనధికార భవనాలను కూల్చివేయాలంటూ... ధానేకి చెందిన ముగ్గురు నివాశితులు పిటిషిన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చీఫ్ జస్టీస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎంఎస్ కార్నిక్‌లతో కూడిన ధర్మాసనం విచారించిన సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. 1998 నాటి ప్రభుత్వ తీర్మానం ఇప్పటికీ అమలులో ఉందన్న విషయాన్ని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తుచేసింది. అయినా వర్షాల సమయంలో అనధికార నిర్మాణాలను పౌర అధికారులు ఎందుకు కూల్చివేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఐతే థానే మునిసిపల్ కార్పొరేషన్ (టిఎంసీ) అనధికార నిర్మాణాలకు అనేక కూల్చివేత నోటీసులు అందించినప్పటికీ, నివాసితులు అక్కడ నివశిస్తున్నారని పిటిషనర్ల తరుపు న్యాయవాది నీతా కర్ణిక్ పేర్కొన్నారు. ఈ మేరకు టీఎంసీ తరుఫు న్యాయవాది రామ్ ఆప్టే, తొమ్మిది భవనాలను కూల్చివేతలకు పౌర సంఘం అనేక నోటీసులు పంపిందని, అయితే నివాసితులు ఖాళీ చేయడానికి నిరాకరించారని ధర్మాసనానికి తెలిపారు. ఇదిలా ఉండగా సంబంధిత భవనాల తరుఫు న్యాయవాది సుహాస్ ఓక్ మానవతా దృక్పథంతో వ్యవహరించి కనీసం వర్షాకాలం ముగిసే వరకు భవనాలను కూల్చివేయకుండా టీఎంసీని ఆపాలని కోర్టును కోరారు. దీనికి ప్రతి స్పందనగా ధర్మాసనం ..." మేము మానవతా దృక్పథంతో వ్యవహరించే అనధికారిక భవనాల వల్ల ఒక్క అమాయకుడి ప్రాణం పోకూడదని అనుకుంటున్నాం. వారంతా సురక్షిత ప్రదేశంలో ఉండాలని ఆశిస్తున్నాం. అంతేకాదు ఒక్క భవనం కూలిపోతే అనేక ప్రాణాలు పోవడమే కాదు, పక్కనున్న భవనాలను కూడా నేలమట్టం చేయవచ్చు అని వెల్లడించింది. అదీగాక డిసెంబరు 2021లోనే ఈ కేసుని సుమోటాగా తీసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో ఉన్న అనధికార భవనాలన్నింటినీ కూల్చివేయాలని..ఒక ఉత్తర్వును కూడా జారీ చేసినట్లు ధర్మాసనం పేర్కొంది. అయినప్పటికీ నివాసితులు దీన్ని అర్థం చేసుకోవడం లేదంటూ చివాట్లు పెట్టింది. అంతేకాదు సంబంధిత భవనాల్లో ఉంటున్న నివాసితులందరూ ఆగస్టు 31లోగా ఖాళీ చేస్తామని హామీ ఇవ్వాలని కూడా స్పష్టం చేసింది. మరోవైపు టీఎంసీని కూడా ఆగస్టు 31 దాక భవనాలను కూల్చివేయద్దని ధర్మాసనం ఆదేశించింది. సాధ్యమైనంతవరకు ఈ ఉత్తర్వును త్వరితగతిన అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఐతే ఇలాంటి అనధికార భవనాలు ముంబైలో సుమారు 30 దాక ఉన్నట్లు సమాచారం. (చదవండి: ఆ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ చూసి షాక్ అయిన పోలీసులు: ఫోటోలు వైరల్) -
చైతన్య భారతి: జె.ఆర్.డి.టాటా / 1904–1993
1992 మార్చిలో జరిగిన ఓ సన్మాన సభలో జె.ఆర్.డి టాటా మాట్లాడుతూ.. ‘‘వచ్చే శతాబ్దంలో భారతదేశం ఆర్థిక అగ్రరాజ్యం అవుతుందని ఓ అమెరికన్ ఆర్థిక శాస్త్రవేత్త అన్నారు. దేశం ఆర్థికంగా అగ్రరాజ్యం అవాలని నేను కోరుకోవడం లేదు. ఇది ఆనందమయ దేశం కావాలని కోరుకుంటున్నా..’’ అని అన్నారు. ఆయన జీవితం దాదాపు 20వ శతాబ్దం మొత్తానికీ విస్తరించింది. రైట్ సోదరులు తొలిసారిగా విమానం కనిపెట్టిన తర్వాత కొద్ది రోజులకే ఆయన జన్మించారు. 1991లో మన్మోహన్ సింగ్ సరళీకరణను ప్రవేశపెట్టడాన్ని కూడా టాటా వీక్షించారు. గగన విహారమనేది ధనికులకే పరిమితమైన రోజుల్లో 1932లో ఆయన టాటా ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించారు. ప్రపంచంపై నాజీలు దౌర్జన్యాలు సాగిస్తున్న రోజుల్లో యుద్ధం తర్వాత దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆలోచించారు. జె.డి . బిర్లా, కస్తూర్భాయ్ లాల్‌భాయ్ లాంటి అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలను సమావేశపరిచి మాట్లాడారు. ఫలితంగా ‘బాంబే ప్లాన్’ సిద్ధమైంది. 1945లో ఆయన ‘టెల్కో’ను ప్రారంభించారు. దేశం కోసం ఓ ప్రతిష్ఠాత్మకమైన ఇంజనీరింగ్ సంస్థను ప్రారంభించాలని ఆయన ఆలోచన. జె.ఆర్.డి. 1948లో ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్‌ను ప్రారంభించారు. పాశ్చాత్య దేశాలకు వెళ్లిన తొలి ఏషియన్ ఎయిర్ లైన్ అదే! టాటా సంస్థతో భాగస్వామ్యం వహించాల్సిందిగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు. ప్రభుత్వం అందుకు సమ్మతించింది. భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు బండికి రెండు చక్రాల లాగా వ్యవహరించాలని ఆయన భావన. ‘‘మీరు ఎవరికైనా నాయకత్వం వహించాలీ అంటే వారి పట్ల ప్రేమతో ఆ పని చేయాలి’’ అని ఆయన అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో, హోమీ భాభా భారతదేశంలో చిక్కుబడిపోయారు. దాంతో కేంబ్రిడ్జిలో చేస్తున్న పనిని భారత్‌లోనే భాభా కొనసాగించుకునేందుకు వీలుగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ‘కాస్మిక్ ఎనర్జీ’ పేరిట ఒక ప్రత్యేక విభాగాన్ని టాటా ప్రారంభించిన సంగతి చాలామందికి తెలియదు. నాలుగేళ్ల తరువాత ‘టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్’ అనే భాభా ప్రణాళికకు ఆయన ఊతమిచ్చారు. చనిపోడానికి 20 నెలల ముందు టాటాకు భారత రత్న పురస్కారం లభించింది. – స్వర్గీయ ఆర్.ఎం.లాలా, టాటా వారసత్వ చరిత్రకారుడైన జర్నలిస్టు -
బాంబే సమాచార్.. రెండు శతాబ్దాల పయనం
హైదరాబాద్: మన దేశంలో మొట్టమొదట ప్రారంభమైన పత్రికల్లో ఒకటైన ‘బాంబే సమాచార్’ త్వరలో 200వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. 1822లో గుజ రాతీ వారపత్రికగా మొద లైన బాంబే సమాచార్.. 1832లోనే బైవీక్లీ (వారానికి రెండు రోజులు)గా, 1855 నాటికి దినపత్రికగా మారింది. దేశంలో ఆంగ్లేతర పత్రికల్లో బెంగాల్‌కు చెందిన సమాచార్ దర్పణ్ మొదటిది కాగా.. రెండోది ‘బాంబే సమాచార్’ కావడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో నడుస్తున్న పత్రికలన్నింటిలో సుదీర్ఘ కాలంగా కొనసాగు తున్నది తమ పత్రికేనని, ప్రపంచవ్యాప్తంగా చూసినా తమ పత్రిక నాలుగో స్థానంలో ఉందని ముంబై సమాచార్ డైరెక్టర్ హొర్ముస్జి ఎన్ కామా తెలిపారు. పాఠకుడు కేంద్రంగా సమాచారం అందించడమే తమ పత్రిక విజయ రహస్యమని చెప్పారు. ఈ సందర్భంగా బాంబే సమాచార్ డైరెక్టర్ హొర్ముస్జి ఎన్ కామాకు ఇండియన్ న్యూస్‌పేపర్స్ సొసైటీ (ఐఎన్ఎస్) అధ్యక్షుడు ఎల్.ఆదిమూలం అభినందనలు తెలియ జేశారు. 1933లో వివిధ కారణాలతో మూత పడే దశలో ఉన్న ఈ పత్రికను కామాజీల కుటుంబం టేకోవర్ చేసి నడిపించిందని గుర్తు చేశారు. పత్రికల మనుగడ కష్టతరంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఆ కుటుంబం ‘బాంబే సమాచార్’ను విజయవంతంగా, ఒక మోడల్లా నిలిపి నడిపిస్తోందని ప్రశంసించారు. ఈ పత్రిక ఇంత సుదీర్ఘకాలం విజయవంతంగా నడవడం ఆ పత్రికకే కాకుండా మొత్తం పత్రికా రంగానికే గర్వకారణమన్నారు. -
ఆ వార్తల్లో నిజం లేదు.. మణిరత్నం సినిమాలు భద్రపరుస్తాం
‘దళపతి’ (1991), ‘రోజా’ (1992), బొంబాయి (1995), ‘యువ’ (2004).. ఇలా ఎన్నో అద్భుత చిత్రాలను అందించారు దర్శకుడు మణిరత్నం. ఇప్పటివరకూ ఆయన 26 సినిమాలు తీశారు. వాటిలో ‘క్లాసిక్’ అనదగ్గవి చాలా ఉన్నాయి. ఆ క్లాసిక్స్‌ని భద్రపరిచే ప్రయత్నం జరుగుతోంది. ఈ విషయం గురించి ఈ ప్రాజెక్ట్‌తో అసోసియేట్ అయిన శివేంద్ర సింగ్ మాట్లాడుతూ– ‘‘క్లాసిక్ సినిమాలను ఇప్పటి సాంకేతికతో భద్రపరచడం, మెరుగులు దిద్దడం వంటి అంశాలపై 2017లో చెన్నైలో వర్క్‌షాప్ చేశాం. అప్పుడు మణిరత్నంతో మాట్లాడాను. ఆయన సినిమాల్లో కొన్ని ప్రింట్స్, నెగటివ్స్ మెరుగైన స్థితిలో లేవు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘దళపతి’, ‘రోజా’, ‘బొంబాయి’ వంటి ఆణిముత్యాలను ‘ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్’ (ఎఫ్‌హెచ్‌ఎఫ్)లో ఎలా భద్రపరుస్తామో వివరించాం. మణిరత్నం సానుకూలంగా స్పందించారు. సినిమాలను 8కె రిజల్యూషన్‌లో భద్రపరుస్తాం. ఇప్పుడు అందరూ 4కె రిజల్యూషన్‌ను మాత్రమే వినియోగిస్తున్నారు. పాత ప్రింట్స్, నెగటివ్‌లను జాగ్రత్తగా డీల్ చేస్తున్నాం. ఈ డిజిటలైజేషన్ ప్రాసెస్‌లో ప్రసాద్ కార్పొరేషన్ సహకారం ఉంది. అలాగే మేం ఒక ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ కోసం ఇలా చేస్తున్నామని వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని పేర్కొన్నారు. -
ఆ షేర్లకు ‘ఆక్సిజన్’!
న్యూఢిల్లీ: పేరులో ఏముంది అంటారు గానీ ఒక్కోసారి ఆ పేరే అదృష్టం తెచ్చిపెట్టవచ్చు. బాంబే ఆక్సిజన్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ (బీవోఐఎల్) అనే కంపెనీయే దీనికి తాజా ఉదాహరణ. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ పేషంట్ల ట్రీట్మెంట్కు ఆక్సిజన్ డిమాండ్ భారీగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ లాంటి వాయువుల తయారీ కంపెనీలకు మంచి ఆదాయాలు వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు గ్యాస్‌ల తయారీ సంస్థల షేర్లను కొనేందుకు ఎగబడుతున్నారు. బీవోఐఎల్కి కూడా ఇదే కలిసి వచ్చింది. కంపెనీ పేరులో ఆక్సిజన్ అని ఉండటంతో ఇన్వెస్టర్లు బీవోఐఎల్ షేర్ల కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. దీంతో గత కొద్ది రోజులుగా ర్యాలీ చేస్తున్న సంస్థ షేరు సోమవారం బీఎస్ఈలో అప్పర్ సర్క్యూట్ తాకింది. రూ. 24,575 దగ్గర ఆగింది. పేరులో ఆక్సిజన్ అని ఉన్నప్పటికీ తత్సంబంధ వ్యాపారాలేమీ చేయడం లేదంటూ కంపెనీ చెబుతుండటం గమనార్హం. ఆక్సిజన్ వ్యవహారం.. సందేహాస్పదం.. వాస్తవానికి కంపెనీ వెబ్‌సైట్‌లోని హోంపేజీ ప్రకారం 1960లో బాంబే ఆక్సిజన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే పేరుతో సంస్థ ప్రారంభమైంది. అయితే, 2018 అక్టోబర్ నుంచి కంపెనీ పేరు బాంబే ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ (బీఐఎల్)గా మారింది. ప్రధాన వ్యాపారం పారిశ్రామిక గ్యాస్‌ల తయారీ, సరఫరానే అయినప్పటికీ 2019 ఆగస్టు నుంచి దాన్నుంచి తప్పుకున్నట్లు ప్రస్తుతం షేర్లు, ఫండ్లు తదితర సాధనాల్లో పెట్టుబడుల ద్వారానే ఆదాయం ఆర్జిస్తున్నట్లు కంపెనీ తన వెబ్సైట్లో పేర్కొంది. అంతే కాకుండా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ (ఎన్బీఎఫ్సీ)గా ఆర్బీఐలో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నట్లు తెలిపింది. ఇక్కడిదాకా బాగానే ఉన్నప్పటికీ .. వెబ్‌సైట్‌లోని ’ఉత్పత్తులు’ సెక్షన్లో మాత్రం ఇప్పటికీ ఆక్సిజన్, ఇతర పారిశ్రామిక గ్యాస్‌ల పేర్లు అలాగే కొనసాగుతుండటం గమనార్హం. ఆ సెక్షన్లో కంపెనీ తనను తాను ఆక్సిజన్, నైట్రోజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్ వంటి పారిశ్రామిక గ్యాస్‌ల తయారీ సంస్థగాను, డీలర్గాను పేర్కొంటోంది. కానీ బీఎస్ఈలోని కంపెనీ పేజీలో మాత్రం సంస్థ ఎన్బీఎఫ్సీగానే నమోదై ఉంది. ఈ గందరగోళ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని, ఇన్వెస్టర్లకు లేటెస్ట్ సమాచారం అందించాలని కంపెనీకి బీఎస్ఈ ఏప్రిల్ 8న సూచించింది. సంస్థ మాత్రం తాము ఎప్పటికప్పుడు పూర్తి వివరాలను ఇస్తూనే ఉన్నామంటూ బదులిచ్చింది. ప్రత్యేక దృష్టి.. బాంబే ఆక్సిజన్ ఇన్వెస్ట్మెంట్ షేర్లు గత కొద్దిరోజులుగా భారీగా ర్యాలీ చేశాయి. మార్చి ఆఖరు నాటికి సుమారు రూ. 10,000 స్థాయిలో ఉన్న షేరు ధర కొన్నాళ్లలోనే ఏకంగా రెట్టింపయ్యాయి. కంపెనీ పేరులో ఆక్సిజన్ అన్న పదం ఉండటమే ఈ ర్యాలీకి కారణమని మార్కెట్ వర్గాలు అం టున్నాయి. దీనితో పాటు సంస్థ వ్యాపార వ్యవహారాలపై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో బీఎస్ఈ దీన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అదే సమయంలో దీనితో పాటు పాత, కొత్త పేర్లలో ’గ్యాస్’, ’ఆక్సిజన్’ అన్న పదాలుండీ, ఇటీవల ర్యాలీ చేసిన ఇతర షేర్లపైనా దృష్టి సారించినట్లు వివరించాయి. -
విప్లవారాధనకు వినాయకుడు
‘యాభై సంవత్సరాల కారాగార శిక్ష.... ఏకాంతవాసం... యాభై ఏళ్లు ఈ చీకటికొట్లోనే గడిచిపోతాయా! ఇలాంటి నరకం ఈ భూమ్మీద ఉంటుందా? అయితేనేం, బతకాలి...’ ఇవి ఒక యోధుడు రాసుకున్న తన కారాగార జ్ఞాపకాలలోని మాటలు.భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం (1857) ఆయనకు ఆదర్శం. ఇటలీ ఏకీకరణ యోధుడు, విప్లవ విధాత గ్లుసెప్పె మేజనీ అంటే ఆరాధన. ఫ్రెంచ్ విప్లవం అంటే గురి. అమెరికన్ స్వాతంత్య్ర పోరాటమంటే గౌరవం. ఇంగ్లండ్ మీద కత్తికట్టిన ఐర్లాండ్ విప్లవకారులంటే ప్రేమ. ఇవన్నీ చిన్నతనంలోనే ఆయనను విప్లవ పంథాలోకి నడిపించాయి. ఆయనే వినాయక్ దామోదర్ సావర్కర్. ఆయన మీద ఒక్కటే ఆరోపణ. అయినప్పటికీ భారత స్వాతంత్య్ర పోరాటంలో విప్లవ పంథాకీ, సంస్కరణోద్యమానికీ, అంటరాని తనం మీద పోరాటానికీ ఆయన అందించిన సేవలు అనన్య సామాన్యమైనవి. ఇవన్నీ ఒక ఎత్తయితే చరిత్ర రచనలో సావర్కర్ కృషి మహోన్నతమైనది. ఆయన యోధుడు. సంస్కర్త. వక్త, రచయిత. వినాయక్ దామోదర్ సావర్కర్ (మే 28, 1883–ఫిబ్రవరి 26, 1966) భాగూర్‌లో పుట్టారు. ఇది నాటి బొంబాయి ప్రెసిడెన్సీలోని నాసిక్ సమీపంలో ఉంది. తండ్రి దామోదర్ పంత్. తల్లి రాధాబాయి. ఆయనకు ఇద్దరు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. అన్నగారి పేరు గణేశ్, తమ్ముడు నారాయణ్. సోదరి మెయినిబాయి. తల్లి ఆయన పదో ఏటనే కలరాతో కన్నుమూశారు. తల్లి కన్నుమూసిన ఆరేళ్లకే ప్లేగు సోకి తండ్రి తుదిశ్వాస విడిచారు. అన్నగారు గణేశ్ (బాబారావ్) సంరక్షణలోనే వినాయక్ దామోదర్, నారాయణ్ పెరిగారు. ఆ ఇద్దరు కూడా స్వాతంత్య్ర సమరయోధులే. అన్నదమ్ములు ముగ్గురు కూడా సాయుధ సమరంతోనే దేశానికి స్వాతంత్య్రం వస్తుందని నమ్మినవారే. సావర్కర్ ప్రాథమిక విద్య స్థానికంగానే శివాజీ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఆరో ఏటనే ఆయన వార్తాపత్రికలు చదవడం అలవాటు చేసుకున్నారు. గ్రంథపఠనం కూడా మొదలుపెట్టారు. ఆ వయసులోనే అంటే 1899లోనే సావర్కర్ ‘మిత్ర మేళా’ అన్న సంఘాన్ని స్థాపించారు. తరువాత పూనాలో ఉన్న ఫెర్గూసన్ కళాశాలలో1902లో చేరారు. అక్కడే ఆయన జాతీయ భావాలకు, ఆ భావాలతో నడిచే ఉద్యమాలకు దగ్గరయ్యారు. 1904లో రెండు వందల మంది సభ్యులతో మిత్రమేళా సమావేశం ఏర్పాటు చేశారాయన. ఆ సమావేశంలోనే మిత్ర మేళా పేరును అభినవ భారత్ అని మార్చారు. ఈ సంస్థ ఉద్దేశం సాయుధ విప్లవం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వాన్ని తరిమివేయడమే. ఇంతలోనే బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం పెల్లుబుకింది. అక్టోబర్ 7, 1905న సావర్కర్ పూనాలో విదేశీ వస్తు సముదాయాన్ని దగ్ధం చేశాడు. బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ దేశమంతటా రాజకీయ చైతన్యాన్ని నింపిన లాల్ పాల్ బాల్ అంటే సావర్కర్‌కు వీరాభిమానం. విదేశీ వస్తు దగ్ధకాండ దేశంలో తొలిసారి సావర్కర్ నిర్వహించారన్న వాదన ఉంది. నిజానికి అప్పటికే ఆయన విదేశీ వస్తువులను బహిష్కరించాలనీ, మన దేశంలో మన నేతకారులు నేసిన బట్టలే ధరించాలని ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ చూసి కళాశాల నుంచి బహిష్కరించారు. కొన్ని ఇబ్బందులు పెట్టిన తరువాత మొత్తానికి బిఎ డిగ్రీ ఇచ్చారు. అప్పుడే ఇంగ్లండ్‌లో బారెట్లా చదవాలనుకునే వారికి విద్యార్థి వేతనాల కోసం దరఖాస్తులు కోరారు శ్యామ్‌జీ కృష్ణవర్మ. ఆయన లండన్‌లో ఉన్న ప్రముఖ భారతీయుడు. ధనవంతుడు. భారత స్వాతంత్య్రోద్యమానికి మద్దతుగా, నిలిచి విప్లవయోధులకు ఆశ్రయం ఇస్తున్నారు. సావర్కర్ దరఖాస్తు చేశారు. అందులో, ‘స్వేచ్ఛాస్వాతంత్య్రాలే ఒక జాతికి ఉచ్ఛ్వాసనిశ్వాసాలని నేను భావిస్తాను. నా కౌమారం నుంచి యౌవనం వరకు నా దేశం కోల్పోయిన స్వాతంత్య్రం గురించి, ఆ స్వాతంత్య్రాన్ని తిరిగి సాధించుకోవడం గురించే రేయింబవళ్లు యోచిస్తున్నాను’ అని రాశారని సావర్కర్ జీవితచరిత్ర (వీర్‌సావర్కర్)లో ధనంజయ్కీర్ నమోదు చేశారు. శ్యామ్‌జీ సాయంతోనే లండన్ చేరుకుని బారెట్లా కోసం గ్రేస్ ఇన్ లా కళాశాలలో 1906లో చేరారు. నివాసం ఇండియా హౌస్. ఇది పేరుకు భారతదేశం నుంచి చదువు కోసం ఇంగ్లండ్ వచ్చిన విద్యార్థులకు వసతిగృహం. వాస్తవంæ– భారత స్వాతంత్య్రమే లక్ష్యంగా సాగే విప్లవ కార్యకలాపాలకు ఇది కేంద్రం. దీనిని స్థాపించినవారే శ్యామ్‌జీ కృష్ణవర్మ. లండన్‌లోనే హైగేట్ ప్రాంతంలో ఉండేది. నిరంతరం పోలీసు నిఘా కూడా ఉండేది. అక్కడే ఫ్రీ ఇండియా సొసైటీ స్థాపించారు సావర్కర్. ఇండియా హౌస్‌లో ప్రతి ఆదివారం సమావేశాలు జరిగేవి. పండుగలు, దేశభక్తుల ఉత్సవాలు నిర్వహించేవారు. ఇక రాజకీయ చర్చలు సరేసరి. 1909లో ‘ది వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్’ అచ్చయింది. దీనిని వెంటనే నిషేధించారు. 1906లో ఒక హిందూ పండుగ సందర్భంలోనే గాంధీజీని ఇండియా హౌస్‌కు ఆహ్వానించారు. అక్కడే సావర్కర్ గాంధీజీని తొలిసారి కలుసుకున్నారు. 1907లో ప్రథమ స్వాతంత్య్ర సమరం యాభయ్ ఏళ్ల సందర్భాన్ని సావర్కర్ ఇంగ్లండ్‌లో నిర్వహించారు. భారతీయ విద్యార్థులు ‘ప్రథమ స్వాతంత్య్ర సమరయోధుల గౌరవార్ధం’ అని రాసిన బాడ్జీలను జేబులకు తగిలించుకున్నారు. ఏదో కారణంగా ఘర్షణ జరిగింది. పోలీసులు వచ్చారు. ఘర్షణకు కారణం శ్యామ్‌జీ కృష్ణవర్మ అన్న అనుమానంతో అరెస్టు చేయాలని చూశారు. ఆయన పారిస్ పారిపోయారు. దీనితో ఇండియా హౌస్ నిర్వహణ బాధ్యత సావర్కర్ మీద పడింది. అదే సమయంలో పూనాలో అభినవ్ భారత్ సభ్యుడు అనంత్ లక్ష్మణ్ కన్హారే ఆ జిల్లా కలెక్టర్ ఏఎంటీæ జాక్సన్‌ను ఒక నాటకశాలలో చంపాడు. ఎందుకంటే అతడు అభినవ్ భారత్‌ను అణచివేయడమే ధ్యేయంగా ఆ సంస్థ సభ్యుల మీద తీవ్రమైన అణచివేత చర్యలు చేపట్టాడు. పంజాబ్ నుంచి ఇండియా హౌస్‌కు వచ్చి, సావర్కర్ ప్రభావం పడినవాడు మదన్‌లాల్ థింగ్రా. ఇతడు కర్జన్‌ను చంపాలనుకుని కర్జన్వైలీని హత్య చేశాడు. థింగ్రాకు మరణశిక్ష విధించారు. అక్కడ ఉన్న భారతీయులు కూడా థింగ్రా చర్యను ఖండించారు. కానీ సావర్కర్ సమర్థించాడు. తరువాత సావర్కర్‌కు కూడా లండన్‌లో ఉండడం సమస్యగా మారింది. దీనితో ఆయన కూడా 1910 జనవరిలో పారిస్ వెళ్లిపోయారు. అక్కడ మేడమ్ కామా ఆశ్రయంలో ఉన్నారు. బారెట్లా పూర్తయింది. కానీ ఆ లా కాలేజీ పట్టా ఇవ్వడానికి అంగీకరించలేదు. కారణం– సావర్కర్ బ్రిటిష్ వ్యతిరేకత. రాజకీయోద్యమాలకు దూరంగా ఉంటానని రాసి ఇస్తే పట్టా ఇస్తామని అధికారులు చెప్పారు. సావర్కర్ తిరస్కరించారు. అప్పుడే భారత్‌లో వైస్రాయ్‌ని చంపడానికి బాంబుదాడి జరిగింది. ఇందులో సావర్కర్ సోదరుడు నారాయణ్‌ను అరెస్టు చేశారు. అలాగే లండన్‌లో ఉన్న సావర్కర్‌ను వెంటనే అరెస్టు చేయవలసిందని టెలిగ్రామ్ ఆదేశాలు వెళ్లాయి. లండన్‌లో సావర్కర్ మీద అరెస్ట్ వారెంట్ జారీ అయింది. 1910 మార్చిలో ఆయన ఇంగ్లండ్ రాగానే పోలీసులు అరెస్టు చేసి బ్రిక్స్టన్ జైలుకు తరలించారు. కొంత తర్జనభర్జన తరువాత ఆయనను భారతదేశంలోనే విచారించాలని భావించారు. దీనితో ఎస్ఎస్ మోరియా అన్న నౌకలో జూలై 1న ఎక్కించారు. ఆ నౌక మార్సెల్స్ రాగానే సావర్కర్ తప్పించుకుని ఫ్రెంచ్ భూభాగం మీద అడుగు పెట్టారు. అయినా ఇంగ్లండ్ పోలీసులు మళ్లీ పట్టుకుని తీసుకుపోయారు. ఈ చర్యను సావర్కర్ అభిమానులు అంతర్జాతీయ కోర్టులో సవాలు చేశారు. కానీ ఆయనకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో బొంబాయి తీసుకువచ్చారు. విచారణలో రెండు జీవితకాలాల శిక్ష పడింది. పైగా ప్రవాసం. ఇది అప్పట్లో అంతర్జాతీయ వార్త అయింది. ఒక మనిషికి యాభై ఏళ్లు శిక్ష ఏమిటన్నదే ప్రశ్న. అండమాన్‌జైలులో 1911 నుంచి 1921 వరకు ఉన్నారు. కఠిన కారాగార శిక్ష అనుభవించారు. నూనె గానుగను కూడా తిప్పించారు. అలాంటి దారుణమైన శిక్షలు అక్కడ ఉన్న అనేక మంది స్వాతంత్య్రం సమరయోధులు అనుభవించారు. అండమాన్‌లో ఉండగానే ‘హిందూయిజం’ పుస్తకం రాశారు. విఠల్‌భాయి పటేల్, గాంధీ వినతి మేరకు సావర్కర్‌ను బొంబాయి ప్రెసిడెన్సీకి తీసుకువచ్చారు. 1924 వరకు రత్నగిరి, యరవాడ జైళ్లలో ఉంచిన తరువాత విడుదల చేశారు. అయితే ఆయన రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనరాదన్న షరతుతోనే ఇది జరిగింది. అలాగే రత్నగిరి జిల్లా దాటి బయటకు రాకూడదు. కానీ ఆయన తనను విడుదల చేయవలసిందిగా నాలుగు సార్లు బ్రిటిష్ అధికారులకు విన్నవించాడు. అందులో క్షమాపణలు కోరారు. కానీ ఆ విన్నపాలు ఆయనకు ఉపయోగపడలేదు. రత్నగిరికే పరిమితమై స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనకుండా సావర్కర్ సంఘ సంస్కరణోద్యమాన్ని చేపట్టారు. అంటరానివారికి ఆలయ ప్రవేశం చేయించారాయన. అంటరానితనం మీద పోరాడారు. అందుకే సావర్కర్ వి«ధానాలను కొన్నింటిని వ్యతిరేకిస్తూనే, ఆయన సంస్కరణోద్యమానికి చేసిన సేవను అంబేడ్కర్ కూడా శ్లాఘించారు. స్వాతంత్య్రం పోరాటంలో గాంధీజీ మార్గాన్ని సావర్కర్ పూర్తిగా వ్యతిరేకించారు. హిందుత్వ ప్రాతిపదికగా ఉద్యమాలు, రాజకీయాలు నడవాలని ఆశించారు. అసలు హిందువులు సైన్యంలో చేరి సైనిక శిక్షణ తీసుకుని బ్రిటిష్ జాతి మీద పోరాటానికి సిద్ధంగా ఉండాలని కూడా ప్రబోధించారు. ఆయనను 1937లో హిందూ మహాసభకు అధ్యక్షుడిని చేశారు. 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమాన్ని ముస్లిం లీగ్, కమ్యూనిస్టులతో పాటు సావర్కర్ కూడా వ్యతిరేకించారు. సావర్కర్ రచయితగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఆయనకు ఆదర్శం మేజినీ. అందుకే మేజినీ జీవితచరిత్ర సావర్కర్ రాశారు. ఆయన అటు చరిత్ర రచనతో పాటు, సృజనాత్మక రచనలు కూడా చేశారు. ది వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ పుస్తకం అజరామరమైనది. ఇది 1909లో అచ్చయింది. కానీ ఈ రచనకు కావలసిన సమాచారమంతా అంతకు ఏడేళ్ల క్రితమే సేకరించి పెట్టుకున్నారు. అంటే ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం జరిగిన దాదాపు అరవై ఏళ్ల తరువాత. అప్పటికి ఆ మహా సంగ్రామాన్ని చూసినవారు కొందరు బతికి ఉన్నారు. ఆ ప్రదేశాలు తిరిగి, అలాంటి వారితో మాట్లాడి సావర్కర్ ఈ పుస్తకం రచించారు. ఆయన మరాఠీలో రచించగా, ఐసీఎస్ చదవడానికి ఇంగ్లండ్ వచ్చిన కొంతమంది యువకులు ఆంగ్లంలోకి అనువదించారు. ఆ పుస్తకాన్ని మేడం కామా అచ్చు వేయించారు. కానీ వెంటనే నిషేధానికి గురైంది. దీనితో చాలా జాగ్రత్తగా భారత్‌కు చేర్చారు. ఇది కాకుండా హింద్ పద్పద షాహి మరొక పుస్తకం. ఇందులో మరాఠీ ఔన్నత్యం గురించి ఎక్కువగా వర్ణించారాయన. సావర్కర్ మీద దు్రçష్పచారం చేసినట్టుగా ఆయన కాలాన్ని వెనక్కి తిప్పాలని తపన పడినవాడు కాదు. లొంగిపోవడం ఆయన నైజం కాదు. అదొక వ్యూహమనిపిస్తుంది.. కారాగారం నుంచి వచ్చాక రత్నగిరి జిల్లాలో సావర్కర్ చేసిన సామాజిక ఉద్యమం ఇందుకు నిదర్శనం.ఆయన హిందుత్వను నమ్మడం నిజం. కానీ భారత రాజకీయాలు, ఉద్యమాలు భారతీయ విలువల ఆధారంగా జరగాలని ఆయన కోరుకున్నారు. కానీ అవసరమైనప్పుడు ముస్లిం లీగ్‌తో కలసి కూడా పనిచేశారు. సంస్కర్తగా ఆయన జీవితం ఉత్తేజకరమైనది. అభినవ భారత్ సంస్థ తరఫున ఆయన రష్యా, ఐర్లాండ్, ఈజిప్ట్, చైనా విప్లవకారులతో సంప్రతింపులు కూడా జరిపారు. ఆనాడు విశ్వవ్యాప్తంగా విప్లవ సిద్ధాంతంతో ప్రభావితమైన వారిలో సావర్కర్ ఒకరు. వీరందరికీ ఆదర్శం మేజని. సావర్కర్ జీవిత చరమాంకం విస్తుగొలుపుతుంది. 1948లో గాడ్సే గాంధీని హత్య చేస్తే ఆ హత్య కుట్రలో సావర్కర్ భాగస్వామి అని భారత ప్రభుత్వం ఆయనను బోను ఎక్కించింది. ఎందుకంటే గాడ్సే హిందూ మహాసభ సభ్యుడు. కానీ ఆ కేసులో సావర్కర్‌ను నిర్దోషిగా తేల్చారు. వీర్ సావర్కర్ తన మరణాన్ని ముందుకు తెచ్చుకున్నారు. 1963లో ఆయన భార్య యమున మరణించారు. 1966 ఫిబ్రవరిలో ఆయన ఒక్కసారిగా మందులు, ఆహారం, నీరు కూడా ఆపేశారు. ఆత్మార్పణ చేసుకున్నారు. - డా. గోపరాజు నారాయణరావు -
పంచభూతాధికారి
ఇదేమిటి? సాయినాథునికున్న పంచవాయువుల ఆధిపత్యాన్ని గురించి వివరించుకుంటూ అపానమనే వాయువు మీద ఆధిపత్యం వరకూ ఉదాహరణపూర్వకంగా తెలియజేసుకున్నాం. ఆ వెంటనే వచ్చేది వ్యానవాయువు కదా! మరి ఉదానవాయువు గురించి చెప్పుకోవడమేమిటి? అనిపిస్తుంది మనకి. నిజమే! వ్యానవాయువు (సర్వ శరీరగః) శరీరం నిండుగా ప్రవహిస్తూ ఎక్కడ ఏ వాయువు తనకుండాల్సిన పరిమాణం కంటే తక్కువగా ఉంటుందో అక్కడ ఆ లోటుని పూరించే వాయువు కాబట్టి దాని ప్రయాణదూరం పరిమాణం మరింత కాబట్టి దాన్ని చివర్లో వివరించుకోవడం కోసం ఈ ఉదానవాయువుని గురించి చెప్పుకుంటున్నామన్నమాట! సాయి నాకు నచ్చడు! ఉదానః కంఠదేశస్థం అని శాస్త్రం. కంఠంలో నిలిచి ఉంటూ నిరంతరం వ్యక్తి మాట్లాడదలిచిన ప్రతి అక్షరానికీ శక్తిని సమకూర్చేది ఉదానవాయువని అనుకున్నాం. అదుగో ఆ ఉదానవాయువుని అదుపు చేయగల శక్తి సాయినాథునికి స్పష్టంగా ఉంది కాబట్టే ఏది అంటే అది జరిగిపోవడం, ఏది వద్దంటే అది జరక్కపోవడం, వద్దని తాను చెప్పిన పనిని మొండిగా చేయదలిస్తే అది విఘ్నాలపాలై పూర్తికాకపోవడం... వంటివన్నీ జరిగాయంటే సాయినాథుని శక్తి ఉదానవాయువు మీద ఆధిపత్య యుక్తీ సామాన్యం కాదని అనుకోవలసిందేగా. ఉదాహరణలని చూద్దాం! ఎంతగా ప్రకాశాన్నిచ్చే దీపమైనప్పటికీ దాని కింద మాత్రం నీడ ఉండక తప్పదు. అలాగే సాయినాథుడు ఎందరికో ఎంతో గొప్పవాడూ దైవాంశసంభూతుడూ మళ్లీ మాట్లాడితే దైవసమానుడూ అయినప్పటికీ కొందరి దృష్టిలో మాత్రం మరో తీరుగానే అనిపించేవాడు.ఇలాంటి సందర్భాల్లో ఆయన గురించి మరోలా అనుకున్నా, ఎవరో అనుకున్నవి విన్నా కళ్లు పోతాయనుకుంటూ లెంపలు వేసుకుని మౌనంగా ఉండిపోకూడదు. ఏమనుకున్నారో తెలుసుకోవాలి. దానికి ప్రతిస్పందనగా ఏం జరిగిందో తెలుసుకోవాలి. అప్పుడే ఒక స్థిరత్వం ఒక విషయాన్ని గూర్చీ ఒక మహనీయుని గూర్చీ తెలిసి వస్తుంది. షిర్డీకి సమీపంలోనే కొందరుండేవాళ్లు. వాళ్లందరూ ఒక వ్యక్తి చెప్పిన మాటలకే లోబడి ఉండేవాళ్లు. దానికి కారణం ఆ వ్యక్తి ఎంతో గొప్పవాడనే వాళ్లకున్న ఒక విశ్వాసం మాత్రమే. ఓ రోజున ఈ అందరూ ఒకచోట కూర్చుని ఓ చోట చర్చ ప్రారంభించారు. ‘మేం నిర్గుణోపాసకులం. అంటే దైవానికి ఓ రూపం ఉంటుందని అసలు భావించని వాళ్లం. దైవం అంటే ఒక అతీతశక్తి మాత్రమే. అంతేకాదు. ఫలానివాడు దైవం అనుకుంటూ అతడ్ని పూజించేవాళ్లని కూడా మేం గౌరవించం. దానికి కారణం భగవంతుడే చెప్పుకున్నాడుగా.. తనకి తానుగా ‘రూపం లేనివాడిని’ అని. ఆయనంతట ఆయనే తనకి రూపం లేదని స్పష్టంగా చెప్పేస్తే ఏ రూపమూ లేని ఆయన్ని రూపం ఉన్నవాడుగా భావిస్తూ, ఆ రూపానికి ప్రతిబింబం ‘ఫలానివాడు’ అనుకుంటూ ఒకాయన్ని (సాయి) దైవంగా కొలవడమంటే ఎంత అవివేకం! అని ఒకడన్నాడు.షిర్డీ గురించి ఎందరో ఎన్నెన్నో కథలని చెప్పేస్తూ వింత వింత ఆనుభవాలని వివరిస్తూ సాయినాథుడ్ని గురించిన ప్రచారాన్ని విశేషంగా చేసేస్తున్నారు. నిజనిర్థారణ కోసం మేం సాయినాథుని వద్దకెళ్లగానే ఆయన భక్తుల్ని దక్షిణ అడుగుతూ కనిపించాడు ఓ మారు. వెంటనే వచ్చేసాం. సాధువూ, సన్యాసీ, సర్వసంగపరిత్యాగీ అయిన వ్యక్తికి మనమేదైనా ఇయ్యాలి తప్ప... ఆయనకాయనే అడగడమేమిటి? మేం ఇయ్యలేదు. సాధువై ధనాన్ని అడిగి తీసుకోవడం ఎంతహేయం? నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే అసలు సాధువనేవాడు– (యధేచ్ఛాలాభ సంతృష్టః) ఏం లభిస్తే దానితో సంతృప్తి చెందాల్సినవాడు కావాలి.ఏదీ దొరకనివాడు దైవం తనని ఆ రోజున ఏదీ తినద్దన్నాడనే సంపూర్ణ విశ్వాసంతో జీవించాలి గానీ, తానే దక్షిణనీయవలసిందనడం ఎంతహేయం? అని మరొకడన్నాడు. అయినా ‘కామఠవిధానం’ అని లోకంలో ఒక మాట ఉంది. కమఠం అంటే తాబేలు. తాబేలు సముద్రపు ఒడ్డుకొచ్చి కెరటాల్లో కొట్టుకుపోడానికి వీల్లేని ప్రదేశంలోనూ, ఏ మాత్రమూ కూడా పక్షులకారణంగా ఏ ప్రమాదం జరిగే వీల్లేకుండానూ తన పిల్లల్ని అంటే గ్రుడ్లని ఒడ్డున ఇసుకని తవ్వి ఆ గోతిలో మెల్లగా మెల్లగా విడుస్తూ చిన్నపాటి దెబ్బకైనా పగిలిపోయే తీరుగా ఉన్న గుడ్లని ఒకటి పిమ్మట మరొకటి చొప్పున పైనుంచి జారవిడుస్తూ (కంటూ) మొత్తం అండాలని ఒకే గోతిలో పడేలా విడిచి మళ్లీ సముద్రంలోనికి వెళ్లిపోతుంది. అంత విశాలమైన సముద్రంలోకి వెళ్లిపోయిన కారణంగానూ పైగా ఈదుకుంటూ పోయే కారణంగానూ, సముద్రతరంగాలు తనని మరింత దూరంగానూ, ఎటువైపుకో తీసుకుపోయే కారణంగానూ, ఎక్కడ ఏ వైపున ఏ ఒడ్డున తన గుడ్లని ఇసుకతో కప్పెట్టేసిన కారణంగానూ గుడ్లని గుర్తించలేదు.అప్పుడది తన గుడ్లని ఒక్కసారిగా మనసులో తలుచుకుంటుంది. అంతే ఆ గుడ్లన్నీ కూడా పొదగబడినట్లుగా ఎప్పుడూ తన తల్లి తలుచుకుంటున్నప్పుడల్లా ఉంటే అప్పుడల్లా క్రమంగా ఎదుగుతూ ఒక్కసారిగా తమ పైనున్న ఇసుకని తొలిగించుకుంటూ పిల్లలుగా మారిపోయి అంతలోనే సముద్రంలోనికి వెళ్లిపోతాయి. దాన్నే ‘కామఠం’ అంటారు. అంటే తాబేలు తన గుడ్లని పిల్లలుగా చేసుకునే విధానమని దీని భావమన్నమాట. ఈ మాటనే సరిగా పలకడం రాకనో కాలక్రమంగా మరోలా మారిపోవడం వల్లనో ఆవిడకి కామఠం మరీ ఎక్కువ– అనే తీరుగా ‘కామఠం’గా మారిపోయింది. సరే! అలాంటి కామఠ పుత్రులం కాబట్టి మమ్మల్ని ఆ దైవమే నిరాకారరూపంగా ఉంటూ తలుచుకోవాలి గానీ.. మేమేమిటి? ఆ సాయిని దర్శించడమేమిటి? మీరు మాత్రం వేదాంతతత్వం తెలిస్తే వెళ్లనే వెళ్లరు అంటూ ఆ వ్యక్తులంతా గోష్ఠి చేసుకుంటూ ఉండేవాళ్లు. వ్యక్తి పూజ సరికాదంటూ తీవ్రంగా వాదాలు చేస్తూండే ఈ అందరికీ ఓ నాయకుడు లాంటి వ్యక్తి ఉండేవాడని అనుకున్నాం కదా! ఇలా ఉన్న కాలంలో ఓసారి సాయిభక్తులంతా షిర్డీకి వెళ్తూ ‘నువ్వు కూడా రాకూడదూ! స్నేహితుడివి కదా!?’ అన్నారు.దానికి ఆ వ్యక్తి బదులు పలుకుతూ ‘నాకు సాయి నచ్చడని ముందే చెప్పానుగా! అయినా స్నేహధర్మాన్ని ఇష్టపడతాను కాబట్టి వస్తాను. ఆయన్ని చూసినా నమస్కరించను. పాదాల మీద పడను. దక్షిణగా నా వద్ద సొమ్మున్నా ఇయ్యను. అడిగితే మరోలా చూస్తాను. మరి మీ మనోభావాలు దెబ్బతింటాయేమో ఆలోచించుకుని నన్ను రమ్మనండి’ అన్నాడు. వాళ్లంతా ఆ విషయాలన్నీ మాకనవసరం. మా భక్తి విశ్వాసాలు నువ్వెంతగా వారించినా, తీర్మానించినా చెడవు. వెడదాం అన్నారు. సరేనంటూ ఆ వ్యక్తి కూడా బయలుదేరాడు షిర్డీకి వాళ్లతో. షిర్డీ చేరారో లేదో ఈ భక్తులందరికీ సాయిని దర్శించాలనే ఆత్రుత మరింత పెరిగి నేరుగా మసీదుకెళ్లారు. ఆ మెట్లని ఎక్కుతూ ఉండగానే ఈ వ్యక్తితో సహా వచ్చిన భక్తులందర్నీ కొద్ది దూరం నుండి చూస్తూనే బాబా ‘అరెరే! వచ్చేశారే మీరు! మంచిది! రండి.. రండి!!’ అన్నాడు ఎదురుచూపుతో ఉన్న బంధువు వద్దకి ఆప్తబంధువు రాగానే పలికిన తీరులో.అందరు సాయి భక్తులూ ఒకరి పిమ్మట ఒకరు సాయి పాదాల మీద పడి నమస్కరించి పైకి లేచి ఆయన ముఖంలోనికి ఆర్థ్రంగా చూస్తూ వెళ్తూంటే, నమస్కరించను– దక్షిణని అడిగినా ఇయ్యనంటూ పూర్తి వ్యతిరేకభావంతో వచ్చిన ఆ వ్యక్తి మరింత భక్తితో సాయి పాదాల మీద తలని పెట్టాడు. శరీరం నిండుగా కంపనం వస్తూ ఉండగా సజలనయనాలతో ఆయన ముఖంలోనికి ముఖాన్ని పెట్టి చూస్తూ లేవనే లేదు. సాయి స్వయంగా అతని భుజాలని పట్టి పైకి లేపితే లేచి మరోమారు నమస్కరిస్తూ పాదాలమీద పడిపోయాడు. అతనితో వచ్చిన మిగిలిన అందరు దర్శనం ముగించుకుని వస్తూంటే మిత్రులు అడిగారు – ‘ఏమయింది నీకు?’ అని.సజలనయనాలతో హృదయపూర్వకమైన కంఠస్వరంతో ఆ వ్యక్తి చెప్పాడు. బాబా మాట్లాడిన ఆ గొంతు అచ్చం మా నాన్నదే. మా నాన్నంటే నాకు ఈ ప్రపంచంలో చెప్పలేనంత గౌరవం, భక్తీ, విశ్వాసం. ఆయన్ని పోగొట్టుకున్న దగ్గర్నుండి ప్రపంచమంతా శూన్యంగానే అనిపించసాగింది. ఏదో జీవిస్తున్నాను గానీ ఎప్పుడూ ఆ స్మృతిలోనే ఉంటూ ఉన్నాను. ఆ భావమేనేమో నాకు దైవం దైవవిశ్వాసం ఉన్న జనం ఇలా ఇందరి మీద ఓ విరక్తిని కలిగించడానికి కారణం. ఈ రోజున మీ అందరితో కలిసి వచ్చాక– అరెరే! వచ్చేసారే మీరు! రండి... రండి!!’ అనే ఆ మాటలు మా తండ్రే ఆయనలో చేరి నన్నూ, నాతో ఉన్న మిత్రులైన మిమ్మల్ని కలిపి ఉద్దేశించి పలికిన మాటల్లా అనిపించాయి. బాబా పలికిన ఆ వాక్యాన్ని మీరు ఒక్కమారు మాత్రమే విని ఉంటారేమో గానీ నేను మాత్రం ఆ వాక్యాలని, మా తండ్రి బాబాలో దాగి పలికిన వాక్యాలని, ఎన్నోమార్లు తిరిగి తిరిగి అనిపించుకుని విన్నానో నాకే తెలియదంటూ ఆనందబాష్పాలని పెట్టుకున్నాడు. గుర్తుంచుకోవాలి. ఉదానమనే వాయువు కంఠంలో ఉంటుందని అనుకున్నాం. ‘వాయో రగ్నీః’ వాయువు ఎప్పుడూ తనలో అగ్నిని కలిగి ఉంటుంది. ఆ అగ్ని తనలో దాగి ఉన్న కారణంగానే మాట్లాడదలిచిన వ్యక్తి కంఠం నుండి ధ్వని (నాదం) బయటికి వచ్చి మాటగా అవుతుంది. ఆ వచ్చే ధ్వనినే ఎంత గాలిని పూరించి ఏ అక్షరాన్ని పలకాలో, ఏ అక్షరానికి ఎంత గాలిని తగ్గించి తేల్చి పలకాలో... ఇలా నియమించుకుని పలికినప్పుడు మాటలో స్పష్టత వచ్చి ఎదుటివ్యక్తి మన మాటకి ఆకర్షితుడవుతాడు. అలా ఆకర్షించే తీరులో మాట్లాడగలిగేలా చేయగలిగినవి హనువులు(దౌడలు) అలాంటి హనువులున్నవాడు కాబట్టే ఆంజనేయుడ్ని ‘హనుమాన్’ (ప్రశస్తే హనూ యస్య సః) అన్నారు. ఆయనకిష్టమైన పేర్లు కల స్తోత్రంలో (హనుమానంజనాసూనుః... దశగ్రీవస్య దర్పహా) మొదట పేరు హనుమాన్ అనీ ఆ మీదట అంజనీ పుత్రుడనీ అర్థం గల నామాలు కనిపిస్తాయి. వాయువు నుండి అగ్ని వచ్చినప్పుడే ధ్వని బయటికొస్తుంది. ఆ అగ్ని లేనప్పుడు కంఠం నుండి కేవలం వాయువే రావడం మనకి అనుభవంలో ఉన్న విషయాలే. ‘గొంతుపోయింది’ అనే మాటని కూడా కేవలం వాయువునే కంఠం నుంచి విడుస్తూ చెప్తాం. ఈ వాయువునే మరింత నాదబద్ధంగా చేయడం వల్లనే అది సంగీతంగా రూపొందింది. సరే! ఇంతకీ సాయినాథుడేం చేసాడట? ఏ ఉదానవాయువనేది తన కంఠంలో ఉందో ఆ కంఠంలోని ధ్వని ఈ వచ్చిన వ్యక్తికి సంబంధించిన తండ్రి కంఠధ్వనిలా వినిపించేలానూ, ఆయనే తనలో అంతర్లీనుడై ఉన్నట్టుగానూ అనిపించేశాడు. ఇదేదో మాయ గారడీ వంచన తనని నమ్మింపజేసుకోవడానికి చేసిన చేష్టా అనుకోకూడదు. ఏ వ్యక్తికి ఎప్పుడు సంస్కారం ఫలిస్తుందో ఆ విషయాన్ని ఎవరూ గుర్తించలేరు.పరమనాస్తికధోరణితో ఉన్న వివేకానందుడు రామకృష్ణ పరమహంసని చూస్తూనే ఈ వెర్రిబాగులవాడూ ముక్కు నుంచి ద్రవం(చీమిడి) కార్చుకుంటున్నవాడూ మాట్లాడితే ఒకే అక్షరాన్ని రెండుమూడుమార్లు పలుకుతూ నత్తితో ఉన్న నోటివాడూ నాకు దైవాన్ని చూపిస్తానంటున్నాడా? పైగా నువ్వెప్పుడైనా దైవాన్ని చూశావా? అని అడిగితే నిన్ను చూస్తూన్నంత స్పష్టంగా చూసానని కూడా అంటున్నాడా? పోనీ ఆ ముఖంలో ఏ విధమైన వంచన అసత్యధోరణీ లేకుండా స్పష్టతతో పాటు సత్యశీలత కనిపిస్తోందా? అనుకుంటూ అర్థవిశ్వాసంతో (సగం నమ్మకం) ఆయన్ని చూస్తూ అక్కడే ఉండిపోయాడు మరి కొంతసేపు.ఆయన తన దగ్గరకి రమ్మని వివేకానందుడు రాగానే తన పాదాన్ని వివేకానందుని శిరసు మీద పెట్టాడో అప్పుడు వివేకానందునికి ప్రపంచమంతా గిర్రున తిరిగిపోయి క్షణకాలం అనంతరం రామకృష్ణుని గొప్పదనం అర్థమైంది. అంతే! ఇక ఆ పిమ్మట వివేకానందునికి మరో దైవమే కనపడలేదు. అంత ఆనందాన్ని అనుభవించిన వివేకానందునితో రామకృష్ణపరమహంస అన్నమాటలు ‘సంస్కారం ఫలించే రోజు రావాలి వివేకా!’ అని. సరిగ్గా అలాగే జరిగింది ఈ నాస్తికధోరణి కల వ్యక్తికి. మిగిలిన మిత్రులందరి కంటే నిజంగా గొప్పవాడెవరంటే ఈ వ్యక్తే. సాయిదర్శనం అయిపోయింది కదా! అని అందరూ వెళ్లిపోయారు కానీ ఈ వ్యక్తి అలాగే ఓ క్షణం నిలబడిన సందర్భంలో ‘కాకా మహాజని’ వచ్చాడు. ఆయనతో కలిసి బాబా వద్దకి వెళ్లగానే ‘కాకా! నాకు ఓ 17 రూపాయల దక్షిణనియ్యి’ అని అడిగాడు. ఈ వ్యక్తి తనని కూడా అడుగుతాడేమో ఇద్దామనే దృష్టితో ఉన్నాడు కానీ సాయి అడగనే లేదు. తీరా తనంత తానే దక్షిణగా అంతని గానీ అంతకు మించిన ద్రవ్యాన్ని గానీ ఇస్తేనో? అనే ఆలోచన వచ్చింది. ఒకవేళ సాయి వద్దని తిరస్కరిస్తేనో? ఈ కలిగిన ఆనందానుభూతి మొత్తం పల్చబడిపోవచ్చుననుకుంటూ మెట్లుదిగి కాకా మహాజనితో బసకి వచ్చేశాడు ఆ వ్యక్తి. మళ్లీ మధ్యాహ్నపువేళ– షిర్డీకి వచ్చిన భక్తులందరికీ ఉండే నియమం– బాబా అనుజ్ఞని కోరి తిరిగి ప్రయాణం కావడమనే దాని ప్రకారం మళ్లీ కాకామహాజనితో కలిసి సాయి వద్దకెళ్లాడు ఆనందంతో ఈ వ్యక్తి. ఆయన ఈ వ్యక్తిని చూస్తూ వెంటనే తన దృష్టిని కాకామహాజనిపైకి ప్రసరింపజేసి – కాకా! మరికొంత దక్షిణనివ్వు! అని అడిగాడు. దాన్ని ఓ మహా ప్రసాదంగా భావించిన కాకా మహాజని మళ్లీ దక్షిణ నిచ్చాడు సాయికి. వెంటనే ఈ వ్యక్తి కాకా మహాజనికి మరింత దగ్గరగా జరిగి అతనికి మాత్రమే వినిపించేలా! స్వామీ! ఇంతకు ముందూ ఇప్పుడూ కూడా అంటే 2 సార్లు సాయి నిన్ను మాత్రమే దక్షిణ నడిగాడు కదా! నేనిస్తే అది ఆయనకి అంగీకారం కాదా? నేనియ్యకూడదా? మరి నా మనసు ఇయ్యాలని అనుకుంటూ ఉవ్విళ్లూరుతోంది’ అన్నాడు రహస్యంగా. అంతలో సాయే కలిపించుకుంటూ ‘కాకా! ఏమిటి అంటున్నాడు అతను? ఏమిటి చెబుతున్నాడు?’ అన్నాడు. మళ్లీ ఆ కంఠస్వరాన్ని వింటూనే చలించిపోయాడు ఈ వ్యక్తి. కాకా చెప్పాడు సాయితో... ‘నీకు దక్షిణనీయాలనుకుంటూ తపించిపోతున్నాడు ఈ వ్యక్తి’ అని. సాయి చిరునవ్వు నవ్వుతూ ఈ వ్యక్తి ముఖంలోనికే చూస్తూ... నీకసలు సాయి దర్శనమే ఇష్టంలేదు. సాధువులూ సన్యాసులూ ఎవరేమిస్తామన్నా తీసుకోకూడని దృక్పథంలో మాత్రమే ఉండాలనుకునే మనస్తత్వం వాడివి కూడా. పైగా నేను నిన్ను అడిగి తీసుకోవడం కూడానా? అందుకే నిన్నడగలేదు’ అంటూ ముఖాన్ని కాకా మీదికి తిప్పబోతూ మళ్లీ ఆగి ఈ వ్యక్తి వైపుకే తలని తిప్పి’ అంతగా నీకియ్యాలని గనుక అనిపిస్తే ఇవ్వు’ అన్నాడు. సాధు సన్యాసులు దక్షిణని తీసుకుంటే తప్పుగానూ, అడిగి తీసుకున్న పక్షంలో మరింత తప్పుగానూ భావించే ఈ వ్యక్తి సాయిని అడిగించుకుని ప్రాధేయపడి మరీ దక్షిణని ఇస్తున్నాడా? అనుకుంటూ కాకా మహాజని మరింత ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఈ వ్యక్తి సాయి అడిగాడో లేదో ఆ జేబు ఈ జేబు వెదుకుతూ సొమ్ముని తీయబోతుంటే సాయి ‘అంత తొందరెందుకయ్యా? కొంపలేం మునిగిపోవడం లేదు. నువ్వియ్యదలిచావు. నేను తీసుకోదలిచాను కదా! ప్రశాంతంగా కూర్చో! ఆ మీదటనే ఇయ్యి!’ అన్నాడు. సాయి పలుకుతున్న ప్రతి పలుకూ తనని బంధించేస్తోంది. తప్పు చేశానని తనని హెచ్చరిస్తోంది. ఈ దశలో సాయి – ‘నీలో ఉన్న తైలవర్తకుడ్ని తొలగించు!’ అన్నాడు. పాపపు ఆలోచనలున్న వ్యక్తిని ‘తైలవర్తకుడు’ అనే పేరుతో పిలిచేవాడు సాయి. ఆ లోఅర్థం అర్థమైన ఈ వ్యక్తి సాయిముఖంలోనికే చూస్తుంటే సాయి స్వ–పరభేదదృష్టీ దానివ్లల కోల్పోయే మనశ్శాంతి ఆ కారణంగా కలిగే మానసిక అశాంతీ గురించి వివరిస్తూ చక్కని బోధ చేశాడు ఆ వ్యక్తికి. సాయి ఏది మాట్లాడుతున్నా అది ఓ పాయసం లాగా ద్రవంలాగా నేరుగా లోనికి వెళ్లిపోతూ ఉంటే తప్ప ఎక్కడా అర్థం కాని మాటా విషయం లేనే లేదనిపించింది ఆ వ్యక్తికి.ఉపదేశం ముగిసాక ఈ వ్యక్తి షిర్డీ విడిచి వెళ్లడానికి అనుజ్ఞని కోరకముందే ‘వెళ్లు వెళ్లు తొందరగా వెళ్లు’ అన్నాడు. అప్పటికే ఉరుములు ప్రారంభమయ్యాయి ప్రకృతిలో. మెరుపులు మెరుస్తున్నాయి. అందుకే వర్షం వచ్చేలోగా వెళ్లవలసిందిగా సాయి సూచిస్తున్నాడనుకుంటూ ఈ వ్యక్తి నావప్రయాణాన్ని భయం భయంగా చేశాడు. ఆశ్చర్యకరమైన అంశమేమంటే నావప్రయాణం ముగిసి రైలెక్కాడో లేదో కుంభవృష్టి కురిసింది. తన ప్రదేశమైన బాంబాయిలోని ఇంట్లోకి వెళ్లాడో లేదో ఒక పక్షి వేగంగా తలుపు తెరవగానే ఎగిరిపోయింది. మరో రెండు పక్షులు మరణించి కనిపించాయి. ఎంత తప్పు చేశాను! పక్షులున్నాయనే మాటని మరిచి తలుపులు మూసి బయలుదేరాను. కనీసం ఓ కిటికీని తెరిచినా ఈ నేరానికి పాత్రుడ్ని అయ్యుండేవాడ్ని కానే కాకపోయుండేవాడ్ని. తప్పు జరుగుతుందేమో, తప్పు చేస్తున్నానేమో అనే ధ్యాసతోనే ఉండాలనే బుద్ధిని సాయి తనకిచ్చాడనుకుంటూ ఇంటిలోనికి వెళ్లాడు. ఆ మూడో పక్షి కూడా మరణించకుండా రక్షించడానికే వర్షంలో తడవకుండా పోడానికీ సాయి తనని ‘వెంటనే వెళ్లు’ అన్నాడని అర్థం చేసుకున్నాడు.తన తండ్రి సాయి రూపంలో ఉన్నాడనీ, ఆయన మాటలో తండ్రి జీవించే ఉన్నాడనీ ఈ వ్యక్తి తన జీవితమంతా భావిస్తూ ప్రశాంతంగా ఉండిపోయాడు. సాయి ఉదానవాయు శక్తిని మరో ఉదాహరణం ద్వారా కూడా తెలుసుకుందాం! – సశేషం ∙డా. మైలవరపు శ్రీనివాసరావు -
ఆ రాత్రి నా జీవితంలో మర్చిపోలేనిది..
‘ఐకమత్యమే మహాబలం’...వినడానికి చాలా చిన్న మాటే కానీ చాలా విలువైనది. కలసికట్టుగా ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా తేలికగా పరిష్కరించవచ్చు. సినిమా ఇండస్ట్రీకి కూడా ఈ మాట వర్తిస్తుందిని..దీన్ని ఆచరిస్తే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయంటున్నారు బాలీవుడ్ మిస్టర్ పర్ఫేక్షనిస్ట్ ఆమిర్‌ఖాన్. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవని..సామాజిక అంశాల సంగతి అటుంచి స్వయంగా సొంత పరిశ్రమలో వ్యక్తులకు ఇబ్బందులు ఎదురయినప్పుడు కూడా అందరూ కలిసి రావడం లేదని ఆరోపించారు. ‘2014లో కరణ్ జోహర్ ‘యే దిల్ హై ముష్కిల్’ సినిమాలో పాకిస్తాన్ నటి ఫవాద్ ఖాన్‌ను హీరోయిన్గా తీసుకున్నందుకు ఆ చిత్రం విడుదలకు శివసేన అధ్యక్షుడు రాజ్ థాక్రే ఒప్పుకోలేదు. ఈ విషయంలో కరణ్‌కు మద్దతు ఇచ్చినవారిని వేళ్ల మీద లెక్కించవచ్చు. ఒక్క మహేష్ భట్ తప్ప మిగితా ఏ నిర్మాత కరణ్‌కు మద్దతుగా నిలబడలేదు. చివరకు కరణ్ రూ. 5 కోట్లను సైన్య సహాయ నిధిగా ఇస్తానని ఒప్పుకొవడంతో సమస్య సద్దుమణిగింద’న్నారు. ‘ఖాన్’ సినిమాలకు తప్పని తిప్పలు... కరణ్‌కే కాక ఖాన్ హీరోలకు కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయన్నారు. 2006లో వచ్చిన ఆమిర్ చిత్రం ‘ఫనా’కు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆమిర్ ‘నర్మదా బచావో’ ఆందోళనకు మద్దతివ్వడంతో ‘ఫనా’ సినిమాను గుజరాత్లో విడుదల చేయకుండా నిషేదిండమే కాక ఆమిర్‌ను క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. కానీ ఆమిర్ అందుకు ఒప్పుకోలేదు. ఆ సమయంలో ఇండస్ట్రీ నుంచి ఎవరూ కూడా ఆమిర్‌కు మద్దతివ్వలేదు. గతేడాది విడుదలయిన షారుక్ ఖాన్ చిత్రం ‘రాయీస్’ విషయంలో కూడా ఇలాంటి ఇబ్బందులే తలెత్తాయి. ఈ చిత్రంలో పాకిస్తాన్ నటి మహిరా ఖాన్‌ను హీరోయిన్గా తీసుకున్నారు. చిత్రం విడుదల సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్ధేశంతో షారుక్ ముందుగానే రాజ్‌థాక్రేను కలిసి మాట్లాడాడు. రాయీస్ చిత్ర ప్రచార కార్యక్రమంలో మహిరా ఖాన్ పాల్గొనదని హామీ ఇచ్చాడు. ఇలా ప్రతి సారీ సినిమా విడుదలకు ముందు రాజకీయ నాయకులను కలిసి వారికి సమాధానం చెప్పడం, లేదా క్షమాపణలు కోరడం పరిపాటి అయ్యింది. లేకపోతే వారు సినిమా విడుదలవ్వకుండా సమస్యలు సృష్టిస్తారన్నారు. ఆ రోజులను మర్చిపోలేము... అయితే ఒకప్పుడు పరిస్థితులు ఇలా ఉండేవి కావని, 1993 నాటి ‘ముంబయి అల్లర్ల’ విషయాన్ని గుర్తుచేసుకున్నారు ఆమిర్. అల్లర్ల సమయంలో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి మొత్తం చిత్ర పరిశ్రమ ముందుకొచ్చింది. బాంబేలో అల్లర్లు చెలరేగిన సమయంలో వ్యాపారాలు అన్ని మూతపడ్డాయి. ఎవరూ ఇళ్లు వదిలి బయటకు రావడం లేదు. ఈ పరిస్థితిలో మార్పు రావడం కోసం పరిశ్రమ నుంచి ఏమైనా చేయాలని సునీల్ దత్ భావించారు. నాతోపాట మరికొందరు పరిశ్రమ ప్రముఖులతో చర్చించి 40 మందితో ఒక కమిటీ వేసారు. వీరంతా అప్పటి మహారాష్ట్ర సీఎం సుధాకర్‌రావ్ నాయక్‌ను కలిసి బాంబేలో చెలరేగుతున్న హింసను ఆపాలని కోరారు. అంతటితోను తమ పని అయిపోయిందని అనుకోకుండా అల్లర్లకు నిరసనగా మంత్రాలయం దగ్గర ఉన్న మహాత్మగాంధీ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపట్టారు. అప్పట్లో మీడియ ఇంతగా లేకపోవడం వల్ల ఈ విషయానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు లేవు. అల్లర్లు ఆగేంతవరకూ నిరసన కొనసాగించాలని దత్ సాబ్ నిర్ణయించారు. కనుక వంతుల వారిగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాము. నిరసన తొలిరోజు రాత్రి సునీల్ దత్, యష్ చోప్రా, జానీ వాకర్‌తో పాటు నేను కూడా నిరసన ప్రదేశం వద్ద ఉన్నాను. ఆ రాత్రి నా జీవితంలో మర్చిపోలేని రాత్రి. రాత్రంతా అక్కడే ఉన్న మాకు మరుసటిరోజు ఉదయం కొందరు టీ, టిఫిన్ తీసుకువచ్చి మాతోపాటు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరకూ ముఖ్యమంత్రి దిగి వచ్చారు. మళ్లీ బాంబే మాములుగా అయిన తర్వాతే మా నిరసనను విరమించుకున్నాము. నిజంగా ఆ రోజులు ఎంతో బాగుండేవ’ని తెలిపారు. ప్రస్తుతం హీరోలకు స్టార్డమ్, సోషల్ మీడియా మద్దతూ ఇంత భారీగా ఉన్నప్పుడు మనం మన సమస్యల గురించి మరింత బాగా పోరాడవచ్చు. ఇండస్ట్రీలో అందరి మధ్య మంచి సంబంధాలు ఉండి ఐక్యంగా ఉంటే ఇలాంటి సమస్యలను సులువుగా పరిష్కరించవచ్చు. కానీ విషాదం ఏంటంటే ఇక్కడ(బాలీవుడ్లో) కోట్లు వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కానీ మారడానికి మాత్రం ఎవరూ సిద్ధంగా లేరు.’ అని ఆమిర్ వ్యాఖ్యలు చేశారు. -
భయపెట్టిన ‘బాంబే’...
బ్రిస్బేన్ : చిన్నపాటి అక్షర దోషాలే ఒక్కోసారి తీవ్ర పరిణామలకు కారణమవుతాయి. సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి ఆస్ట్రేలియా బ్రిస్బేన్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ప్రయాణికుల సామన్లలో ఒక బ్యాగు మీద ‘బాంబ్ టు బ్రిస్బేన్’ అని రాసి ఉంది. ఇది గమనించిన ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ ఆ బ్యాగ్‌లో ప్రమాదకరమైనదేదో ఉందని భావించి వెంటనే అందరిని అప్రమత్తం చేశాడు. బ్యాగ్‌ను తనిఖీ చేయవలసిందిగా భద్రతా సిబ్బందిని ఆదేశించాడు. ఇంతలో ఓ నడివయస్సు మహిళా ప్రయాణికురాలు ఆ బ్యాగ్ తనదేనంటూ పోలీసుల వద్దకు వచ్చింది. పోలీసులు ఆమెను ఒక గదిలోకి తీసుకెళ్లి విచారించారు. ముంబాయి నుంచి బ్రిస్బేన్ వెళ్తున్న ఆ ప్రయాణికురాలి పేరు వెంకటలక్ష్మి(65). పోలీసులు ఆమెను బ్యాగు తెరిచి చూపించాల్సిందిగా ఆదేశించారు. బ్యాగులో ప్రమాదకరమైనవి ఏమి లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. మరి బ్యాగ్ మీద ఎందుకు ‘బాంబ్’ అని రాసి ఉంది అని అడగ్గా తాను ‘బాంబే’ అని రాయాలనుకున్నాను, కానీ స్థలం లేకపోవడంతో ‘వై’ ని రాయకుండా వదిలేసాను. దాంతో ‘బాంబే’ కాస్తా ‘బాంబ్’ గా మారిందని వివరించింది. వెంకటలక్ష్మి తన పుట్టిన రోజును జరుపుకోవడానికి బ్రిస్బేన్‌లో ఉన్న తన కూతురు దగ్గరికి వెళ్తుంది. బ్యాగును మరిచిపోతానేమో అని దానిపై ‘బాంబే టు బ్రిస్బేన్’ అని రాయాలనుకుంది. కానీ స్థలం సరిపోక ‘బాంబ్ టు బ్రిస్బేన్’ అని రాసింది. ఒక్క అక్షరాన్ని రాయకపోవడంతో ఇంత గందరగోళం జరిగింది. విషయం తెలిసిన తర్వాత ప్రయాణికులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. -
ఫాక్స్‌కాన్ భారీ పెట్టుబడులు: వేల ఉద్యోగాలు
సాక్షి, ముంబై: ప్రపంచ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరర్ , తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ ఫాక్స్‌కాన్ భారీ ప్రణాళికలతో దూసకువస్తోంది. భారత్‌లో తాజాగా రూ. 6 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రడీ అవుతోంది. ఆపిల్ లాంటి దిగ్గజ సంస్థలకు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను సరఫరా చేస్తున్న సంస్థ దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని సెజ్‌లో ఒక ప్లాంట్‌ను నెలకొల్పేందుకు యోచిస్తోంది. తద్వారా వేలమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. తాజా సమాచారం ప్రకారం ఐ ఫోన్‌కు అతి పెద్ద సప్లయర్‌గా ఉన్న ఫాక్స్‌కాన్ ముంబైలోని జనహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్‌లో 200 ఎకరాల విస్తీర్ణంలో భారీ ప్లాంట్‌ను నిర్మించేందుకు యోచిస్తోంది. దీని ద్వారా దాదాపు 40వేలమంది ఉద్యోగ అవకాశాలు రానున్నాయని అంచనా. మరోవైపు ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఫాక్స్‌కాన్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ ధృవీకరించారు. జనహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ సెజ్‌కోసం దాదాపు 20, 30 కంపెనీలు ఇప్పటికే సంప్రదించాయని, దీని ద్వారా రెండు లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలను అంచనా వేస్తున్నామని గడ్కరీ తెలిపారు. కాగా చైనాకు సమాంతరంగా భారత్‌ను మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా రూపొందించాలనే యోచనలో భాగంగా ఫాక్స్‌కాన్ భారీ పెట్టుబడులు పెడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ శ్రీ సిటీ సెజ్‌లో ఐదు ప్లాంట్లు నిర్మించింది. ప్రస్తుతం భారత్‌లో ఫాక్స్‌కాన్ సంవత్సరానికి దాదాపు 15 మిలియన్ల మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేస్తోంది. ఇన్ఫోకస్, ఒప్పో, షావోమీ, నోకియా, జియోనీ తదితర కంపెనీలకు భారత్‌లోని ప్లాంట్లలో ఫాక్స్‌కాన్ మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేస్తోంది. -
లబ్ డబ్... లవ్ డబ్!!
లబ్ డబ్.. లబ్ డబ్.. గుండె చప్పుడు ఇది! మరి, ఆ గుండెకి ప్రేమ తోడైతే... లవ్ డబ్.. లవ్ డబ్... లవ్ డబ్... అంటుంది! తెలుగు అయినా.. హిందీ అయినా... తమిళ్ అయినా.. ప్రేమ.. ఇష్క్.. కాదల్... పిలుపు మారుతుందేమో కానీ గుండె చప్పుడు మారదు! లవ్ మీటర్ ఎక్కడైనా ఒక్కటే తెలుగు ప్రేక్షకుల హృదయాలను మీటిన డబ్బింగ్ లవ్వులు ఎన్నో... లబ్ డబ్.. లవ్ డబ్.. డబ్ డబ్ డబ్... చక్కనైన ఓ చిరుగాలి... ఒక్క మాట వినిపోవాలి! తెలుగు చిత్రాలే కాదు... ప్రేమ నేపథ్యంలో వచ్చిన అనువాదాలూ అదరగొట్టాయి. అందులో ముఖ్యమైనది ‘ప్రేమ సాగరం’. యువ తమిళ హీరో శింబు తండ్రి టి. రాజేందర్ ముఖ్య పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘ఉయిరుళ్ల వరై ఉష’. ఈ చిత్రమే ‘ప్రేమ సాగరం’ పేరుతో తెలుగులో విడుదలైంది. కాలేజీలో చదువుకుంటూ హీరో, హీరోయిన్ లవ్‌లో పడతారు. హీరోయిన్ అన్నయ్య వీళ్ల ప్రేమకు విలన్. చివరికి ప్రేమికులిద్దరూ ఎలా కలిశారు? అనే పాయింట్‌తో తీసిన సినిమా ఇది. ‘అందాలొలికే సుందరి రాత్రి..’, ‘హృదయమనే కోవెలలో...’, ‘చక్కనైన ఓ చిరుగాలి..’ వంటి సూపర్ హిట్ సాంగ్స్‌తో సినిమా మంచి మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. అప్పటి ప్రేక్షకులకు ప్రేమ మత్తు ఎక్కించింది. కథానాయిక నళినిని స్టార్‌ని చేసిన సినిమా ఈ ‘ప్రేమ సాగరం’. ‘అల్లరి వెన్నెల జల్లులు...’ ఎనభైలలో వచ్చిన ఘాటు ప్రేమకథల్లో ‘డార్లింగ్ డార్లింగ్’ ఒకటి. ఇందులో కె. భాగ్యరాజా హీరో. మామూలుగా భాగ్యరాజా చేసే సినిమాలన్నీ కామెడీ టచ్‌తోనే ఉంటాయి. ఈ సినిమాలో ఆ డోస్ తక్కువ ఉంటుంది. భాగ్యరాజాలో మరో యాంగిల్ చూపించిన సినిమా ఇది. చిన్నప్పుడే స్నేహంగా మెలిగిన ఓ అమ్మాయితో ్రపేమలో పడతాడు అబ్బాయి. ఆ అమ్మాయి కుటుంబం ఎక్కడికో వెళ్లిపోతుంది. కానీ, చిన్ని హృదయంలో నాటుకుపోయిన అమ్మాయి బొమ్మ అలా ఉండిపోతుంది. తాను పెరుగుతూ ఆ అమ్మాయి మీద ప్రేమను పెంచేసుకుంటాడు. అమ్మాయి పెద్దింటి పిల్ల. అబ్బాయి పేదవాడు. పెద్దయ్యాక ఊరు తిరిగొచ్చే ఆ అమ్మాయితో తన ప్రేమను చెప్పాలనుకుంటాడు. అమ్మాయి మాత్రం పనివాడిలానే చూస్తుంది. అక్కణ్ణుంచి అతను పడే నరక యాతన చూసేవాళ్ల హృదయాలను మెలిపెడుతుంది. భాగ్యరాజానే డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సుమన్ నెగటివ్ టచ్ ఉన్న పాత్ర చేశారు. ఎంత పెద్ద విలన్ అయినా ప్రేమ ముందు ఓడిపోవాల్సిందే. చివరికి ప్రేమ గెలుస్తుంది. అందరి మనసులకూ దగ్గరై ‘డార్లింగ్’ అనిపించుకుందీ సినిమా. ఇందులో ఉన్న ‘ఓ చెలీ ఈ నా భావగీతాలే.. కదలాడే నీటిపై తేలు దీపాలే...’, ‘అల్లరి వెన్నెల జల్లులు..’ అనే హిట్ సాంగ్స్‌ని మరచిపోవడం అంత సులువు కాదు. ‘హృదయమా.. హృదయమా..నీ మౌనమెంత వేదన... ఓ మెడికో తన జీవితాంతం ప్రేమను చెప్పలేక సతమతమయ్యి, చివరకు గుండెపోటుతో చచ్చిపోయే వినూత్నమైన కథతో వచ్చిన సినిమా ‘ఇదయం’. ఈ సినిమా ‘హృదయం’ పేరుతో తెలుగులో విడుదలైంది. ప్రేమకథా చిత్రాల్లో ‘హృదయం’ది ప్రత్యేకమైన స్థానం. సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకుల మనసులలో హీరో తన ప్రేమను హీరోయిన్ దగ్గర త్వరగా చెబితే బాగుండు అనే భావన కలుగుతుంది. హీరో మురళి అద్భుతంగా నటించారు. హీరోయిన్ హీరా రూపం మనసులో అలా నిలిచిపోతుంది. ‘ఊసులాడే ఒక జాబిలమ్మ... సిరిమువ్వలుగా నన్ను తాకెనా..’, ‘హృదయమా.. హృదయమా.. నీ మౌనమెంత వేదన...’ పాటలు ఎవర్గ్రీన్. ఈ ‘హృదయం’ ప్రేమ హృదయాలను మీటింది. ఓ చెలియా.. నా ప్రియ సఖియా ‘పేటా ర్యాప్..’, ‘ముక్కాలా.. ముక్కాబులా.. లైలా..’, ‘ఓ చెలియా.. నా ప్రియ సఖియా..’ 1990లలో విడుదలైన ‘కాదలన్’లోని ఈ పాటలు ఇప్పటికీ కొత్తగా ఉంటాయి. అదే సినిమాలో ‘ఊర్వశీ.. ఊర్వశీ..’ కూడా సూపర్ హిట్. సినిమా సూపర్ డూపర్ హిట్. ప్రేమ మహిమ అలాంటిది మరి. హీరోది మధ్యతరగతి కుటుంబం. హీరోయిన్ గవర్నర్ కూతురు. అందనంత ఎత్తు. ప్రేమకు తేడా తెలియదు కదా. కుర్రాడు చిన్నదాని మీద మనసు పారేసుకుంటాడు. పంజరంలో చిలకలా బతుకున్న చిన్నదానికి కుర్రాడు స్వేచ్ఛాప్రపంచాన్ని చూపిస్తాడు. తనూ ప్రేమలో పడుతుంది. గవర్నర్ మనసు ఊరుకుంటుందా? అబ్బాయిని జైల్లో పెట్టించి, చిత్రహింసలు పెట్టిస్తాడు. అయినా ప్రేమికుడు గెలుస్తాడు. ప్రేయసిని తనదాన్ని చేసుకుంటాడు. ఈ సినిమాలో ప్రభుదేవా, నగ్మా కెమిస్ట్రీ బాగుంటుంది. దర్శకుడు శంకర్ తీసిన ఈ లవ్‌స్టోరీ చాలా సై్టలిష్‌గా ఉంటుంది, ‘ప్రేమికుడు’ పేరుతో విడుదలై, ఇక్కడ కూడా ఘనవిజయం సాధించింది. ఉరికే చిలకా... ఆమె ముస్లిమ్.. అతను హిందు. ప్రేమకు కులమతాలతో పని లేదు. ఇద్దరూ ప్రేమలో పడతారు. పెద్దలను ఒప్పించడం కష్టమని తెలుసు.. అందుకే ఇద్దరూ వెళ్లిపోయి, పెళ్లి చేసుకుంటారు. బొంబాయి వెళ్లిపోతారు. కాపురం హాయిగా సాగుతుంది. ఇద్దరు బిడ్డలకు తల్లిదండ్రులవుతారు. ఉన్నట్టుండి మత ఘర్షణలు మొదలువతాయి. హిందువులు–ముస్లిమ్‌ల మధ్య చంపుకునేంత ద్వేషం. పెద్ద పెద్ద అల్లర్లు. ఈ అల్లర్లో పిల్లలు గల్లంతు. పిచ్చి పట్టినట్లు పిల్లల కోసం వెతుకుతారు. చివరికి దొరుకుతారు. కాపాడింది వేరే మతం వాళ్లు. అదే సమయంలో ఇద్దరి కుటుంబాలకు సంబంధించిన పెద్దవాళ్లు వీళ్లను వెతుక్కుంటూ బొంబాయి వస్తారు. వాళ్లకూ కనువిప్పు అవుతుంది. ఒక లవ్‌స్టోరీకి సామాజిక అంశాన్ని ముడిపెట్టి తీయడం మణిరత్నంలాంటి కొంతమంది దర్శకులకు మాత్రమే కుదురుతుందేమో. ఈ సినిమాలో ‘ఉరికే చిలకా వేచి ఉన్నాను నీ కొరకు...’, ‘కన్నానులే...’, ‘అది అరబిక్ కడలందం...’ వంటి ఎ.ఆర్. రహమాన్ పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇక, అరవింద్ స్వామి, మనీషా కొయిరాలా జంట పండించిన కెమిస్ట్రీని కూడా మరచిపోలేం. పిచ్చి ప్రేమ! పెళ్లికి ముందు భార్య ఒక వ్యక్తిని ప్రేమించిందని తెలిస్తే చాలామంది భర్తలు విడాకులు ఇచ్చేస్తారు. కానీ, తన భార్య మాజీ ప్రియుడికి పిచ్చి పట్టిందని తెలిసి, అతన్ని తీసుకొచ్చి చికిత్స చేయించే భర్త ఉంటాడా? తమిళనాడులో ఉన్నాడు. ఆ సంఘటన తెలిసి, దర్శకుడు బాలాజీ శక్తివేల్ సినిమాగా తీశారు. అదే ‘కాదల్’. భరత్, సంధ్య జంటగా నటించిన ఈ సినిమా తెలుగులో ‘ప్రేమిస్తే’గా విడుదలైంది. ఈ టీనేజ్ లవ్‌స్టోరీ యూత్‌కి బాగా పట్టేసింది. పెద్దవాళ్లకు తెలియకుండా ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకునే టీనేజ్ జంటను ఆ తర్వాత పెద్దవాళ్లే విడదీస్తారు. ఆ తర్వాత అమ్మాయికి పెళ్లి చేసేస్తారు. అబ్బాయి పిచ్చివాడైపోతాడు. ఈ ట్రాజెడీ లవ్‌స్టోరీకి బోల్డన్ని అభినందనలు అందాయి. అప్పటికే భరత్ ‘బాయ్స్’తో పాటు ఓ మూడు సినిమాల్లో నటించాడు. సంధ్యకి ఇది మొదటి సినిమా. ఈ ఒక్క సినిమాతో ఇద్దరికీ ఫుల్ పాపులార్టీ వచ్చేసింది. ప్రేమ పరీక్షలో... ఓ రోజు ఓ నిరుపేద విద్యార్థికి గొప్ప కాలేజీలో సీటొస్తుంది. గొప్పింటి అమ్మాయి మనసులో చోటూ దక్కింది. ఆ తర్వాతే జీవితంలో అసలైన సంఘర్షణ మొదలైంది. ఎక్కువశాతం ప్రేమకథలు చివరికి సుఖాంతం అవుతాయి. ‘ప్రేమికుల రోజు’లోనూ అంతే. కానీ, కథలో ట్విస్ట్ ఏంటంటే.. కాలేజీలో ఆ కుర్రాడికి సీటిచ్చిన ప్రిన్సిపాలే అమ్మాయి తండ్రి. ప్రేమ సంగతి గురువుకి చెప్పలేక నిరుపేద విద్యార్థి సంఘర్షణకు లోనయ్యే తీరు ప్రతి ఒక్కరి మనసులనూ మీటింది. చెప్పుకోవాలంటే ఇది మామూలు కథే. కానీ, దర్శకుడు ఖదీర్ కథకు అద్దిన మోడరన్ మెరుగులు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. ఇప్పుడంటే ఈ–మెయిల్స్, చాటింగ్ అందరికీ తెలుసు. పదిహేనేళ్ల క్రితం ఎవరికి తెలుసు? అప్పుడే ఇవన్నీ ఊహించి ఖదీర్ సినిమాలో చూపించారు. మెయిల్లో అమ్మాయి ఫొటో చూసి ప్రేమలో పడడం.. రైల్వే స్టేషన్లో కలుసుకోవడం... సినిమాలో ప్రతిదీ ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. ఈ సినిమాతో ప్రేమలో పడడానికి మరో ముఖ్య కారణం ఏఆర్ రెహమాన్ పాటలు. ‘వాలు కనులదానా..’, ‘దాండియా ఆటలు ఆడ..’, ‘రోజా రోజా..’ పాటలు సూపర్‌హిట్. ఇక, ‘ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని..’ పాట వన్‌సైడ్ లవర్స్ నోట ఇప్పటికీ మార్మోగుతోంది. మనిషికి ఆక్సిజన్ లేకపోతే ఊపిరాడదు. సినిమాకి ప్రేమ కథ లేకపోతే ఊపిరాడదు. ఇది సత్యం. ఇప్పుడైనా. అప్పుడైనా. ఎప్పటికి అయినా.