character artist
-
మాటలు చెప్పడం ఈజీనే.. ఆ పరిస్థితిలో నరకం..: సత్య
అక్క, వదిన పాత్రలతో గుర్తింపు సంపాదించుకుంది సత్య కృష్ణన్. ఆనంద్, బొమ్మరిల్లు వంటి చిత్రాలతో తెలుగువారికి దగ్గరైంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. 'మా అమ్మానాన్న ఇద్దరూ బ్యాంకు ఉద్యోగులే. అమ్మది రాజమండ్రి, నాన్నది గుంటూరు. నేను పుట్టిపెరిగిందంతా హైదరాబాద్‌లోనే! నాన్న చనిపోయాక మా స్నేహితులు, నాన్న ఫ్రెండ్స్ ఎంతో సపోర్ట్‌గా నిలబడ్డారు. ఆర్థికంగా కూడా సాయం చేశారు. సినిమాల్లోకి అనుకోకుండా వచ్చాను. నాకు ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఇన్నేళ్ల కెరీర్లో.. ఆనంద్ సినిమాలో చేసినటువంటి పాత్ర నాకు ఇంతవరకు మళ్లీ రాలేదు. బొమ్మరిల్లు సినిమా హిట్టయింది. కానీ అందులో నా పాత్ర నిడివి ఎక్కువుంటే బాగుండనిపించింది. ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉండటం అంటే అంత ఈజీ కాదు. ఇన్నేళ్ల కెరీర్లో నన్ను ఇబ్బంది పెట్టింది ఏమీ లేదు. అలా అని ఇండస్ట్రీ అంటే కేక్ వాక్ కాదు. పని చేసేటప్పుడు ఎవరైనా ఏమైనా అంటే అవి పట్టించుకోవద్దు. విసుక్కోవడం, తిట్టడం.. ఇలాంటివి సర్వసాధారణం. నేను మీతో ఎలా ఉన్నానో.. మీరు నాతో అలా ఉండంటి అని చెప్తూ ఉంటాను. నా లైన్లోకి రానివ్వను క్యాస్టింగ్ కౌచ్ విషయానికి వస్తే ఇది ప్రతిచోటా ఉంది. సముద్రంలో నీటితో పాటు ఉప్పు కూడా ఉంటుంది. ఇదీ అలాగే! నాకైతే అలాంటి అనుభవం ఎదురవలేదు. ఎవరైనా అలాంటి వైబ్స్ ఇచ్చినా నా లైన్లోకి రానివ్వను. ప్రపంచంలో ఎక్కువ అందంగా ఉండేది అమ్మాయిలే కదా.. అందుకే ఆడవాళ్లే ఇలాంటి సమస్యలు ఎక్కువ ఎదుర్కొంటున్నారు. మనం ఎలా ఉన్నాం, మనల్ని మనం ఎలా కాపాడుకున్నామనేదే ముఖ్యం. ఇలాంటి ఒత్తిడికి లొంగిపోతారు ఎవరైనా అతి చేస్తున్నట్లు అనిపిస్తే నీ లిమిట్స్‌లో నువ్వు ఉండు అని ధైర్యంగా చెప్పగలగాలి. ఇలా చెప్తే మనకు పాత్రలు ఇవ్వరేమో అని కెరీర్ గురించి భయపెడటం కరెక్ట్ కాదు. ఇది తప్ప ఇంకో ఛాన్స్ లేదనుకునేవాళ్లు ఇలాంటి ఒత్తిడికి లొంగిపోతారు. ఈ మాటలు చెప్పడం ఈజీనే కానీ ఆ పరిస్థితిలో ఉన్న వాళ్లు ఎంత నరకం చూసుంటారో ఊహించలేం. ఏదేమైనా సరే మాతో వర్కవుట్ కాదని ధైర్యంగా చెప్పగలగాలి' అని చెప్పుకొచ్చింది సత్య. -
రాధిక కొత్త ప్రయాణం
కథానాయికగా, ఆ తర్వాత క్యారెక్టర్ నటిగా, నిర్మాతగా చిత్రసీమలో రాధిక ఎన్నో విజయాలు చూశారు. ఇటు బుల్లితెరపైనా నటిగా, నిర్మాతగా ఆమె కెరీర్ హిట్. భారతీరాజా దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘కిళక్కే పోగుమ్ రైల్’ (1978) ద్వారా కథానాయికగా పరిచయం అయ్యారు రాధిక. ఆ తర్వాత తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నటించారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న రాధిక ఫ్రెంచ్‌లో తొలి చిత్రం అంగీకరించారు. ‘‘నా సినిమా కెరీర్లో కొత్త ప్రయాణం ఆరంభించాను. ఫ్రెంచ్ సినిమాలో నటించడం నాకో కొత్త అనుభూతి. ఈ కొత్త ప్రయాణానికి ప్రోత్సహించిన శరత్‌కుమార్ (రాధిక భర్త), రేయాన్ (కుమార్తె)లకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు రాధిక. ఈ చిత్రానికి లారెన్స్ వాలిన్ దర్శకుడు. -
ఒకప్పుడు హీరోలు.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు.. మళ్లీ హీరోలుగా!
టాలీవుడ్లో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు ఎవరంటే సీనియర్లలో రాజేంద్రప్రసాద్, వీకే నరేశ్, రావు రమేశ్, మురళీ శర్మ ఉంటారు. మంచి క్యారెక్టర్లు చేస్తున్న ఈ నటుల్లో రాజేంద్రప్రసాద్, నరేశ్ ఒకప్పుడు హీరోలుగా చేసిన విషయం తెలిసిందే. ఇన్నేళ్లూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అలరిస్తున్న రావు రమేశ్ ఇప్పుడు హీరోగా చేస్తున్నారు. ‘వీళ్లే చేయాలి’ అనే తరహా లీడ్ రోల్స్‌లో ప్రస్తుతం రాజేంద్రప్రసాద్, నరేశ్, రావు రమేశ్ నటిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మంచి పాత్రలు చేస్తున్న ఈ ముగ్గురూ ‘క్యారెక్టర్ హీరో’గా చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. రాజేంద్రప్రసాద్ షష్టిపూర్తి తెలుగులో హాస్య కథా చిత్రాల హీరో అనగానే రాజేంద్ర ప్రసాద్ గుర్తుకొస్తారు. హీరోగా ప్రేక్షకులపై వినోదాల జల్లులు కురిపించిన ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేతిలో అరడజనుకు పైగా చిత్రాలతో దూసుకెళుతున్నారు. అడపా దడపా లీడ్ రోల్స్ కూడా చేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్. ఆయన లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్‌కి జోడీగా అర్చన నటిస్తున్నారు. ‘లేడీస్ టైలర్’ (1986) తర్వాత ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. షష్టిపూర్తి కథాంశంతో న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో రూపేష్ కుమార్ చౌదరి మరో హీరోగా నటించడంతో పాటు నిర్మిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జూలైలో రిలీజ్ కానుంది. వీకే నరేశ్ మళ్ళీ పెళ్లి హీరోగా వీకే నరేశ్‌కి ప్రత్యేక గుర్తింపు ఉంది. తనదైన హాస్యం, నటనతో ప్రేక్షకులను అలరించిన ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ వైవిధ్యమైన పాత్రలతో బిజీగా ఉంటున్నారు. కాగా నరేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వీకే నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటించారు. విజయకృష్ణ మూవీస్ బ్యానర్‌పై వీకే నరేశ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ‘మళ్ళీ పెళ్లి’, కన్నడలో ‘మత్తే మధువే’ టైటిల్స్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. మేలో ఈ చిత్రం విడుదల కానుంది. అందులో భాగంగా సురేశ్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఉరిమే కాలమా..’ అంటూ సాగే పాటని గురువారం విడుదల చేశారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి పాడారు. మారుతీనగర్‌లో రావు రమేశ్ విలక్షణమైన డైలాగ్ డెలివరీతో తనదైన శైలిలో విలనిజాన్ని పండించిన గొప్ప నటుడు రావు గోపాలరావు. తండ్రి వారసత్వంతో తెలుగు చిత్ర పరిశ్రమకి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయమయ్యారు ఆయన తనయుడు రావు రమేశ్. విలన్, కమెడియన్, తండ్రి.. ఇలా పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి, విలక్షణ నటుడిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నారు రావు రమేశ్. ‘హ్యాపీ వెడ్డింగ్’ ఫేమ్ లక్ష్మణ్ కార్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రావు రమేశ్‌కి జోడీగా ఇంద్రజ నటిస్తున్నారు. పీబీఆర్ సినిమాస్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో నడి వయసులో ఉన్న ఒక మధ్య తరగతి నిరుద్యోగి పాత్రలో రావు రమేశ్ కనిపిస్తారు. ఆయన జీవితంలో క్షణ క్షణం జరిగే ట్విస్టులే చిత్ర కథాంశం. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను అలరిస్తున్న రావు రమేశ్ తొలిసారి కథను నడిపే నాయకునిగా చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఉన్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా చేస్తున్న ఈ మూడు చిత్రాలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా నిలిచాయి. -
కాఫీ, టీ మోశాను.. కన్నీళ్లు పెట్టుకున్న నటి ప్రగతి
Actress Pragathi Emotional Speech In F3 Success Meet: దగ్గుబాటి విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా మెహరీన్, సోనాల్ చౌహన్ హీరోయిన్స్‌గా నటించిన ఫన్ అండ్ ఫ్రస్టేషన్ మూవీ 'ఎఫ్ 3' (F3). అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ విజయవంతంగా దూసుకుపోతోంది. ఫ్యామిలీతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 27.55 కోట్లు కొల్లగొట్టిందని సమాచారం. సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా సోమవారం (మే 30) సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ మీట్లో చిత్రబృందం వారి అనుభవాలను పంచుకున్నారు. ఇందులో భాగంగానే నటి ప్రగతి వ్యక్తిగత విషయాలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 'కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో మంచి పాత్రలు చేశాను. కానీ నాకు తగ్గ పాత్రలు పడలేదన్న వెలితి ఎప్పుడూ ఉండేది. ఆ ఒత్తిడి తట్టుకోలేకే కొన్నిరోజులు బ్రేక్ కూడా తీసుకున్నాను. కాఫీ, టీ మోయడం దగ్గర నుంచి పెద్ద విలన్ పక్కన నిలోచవడం, అందమైన, యంగ్ అమ్మ పాత్ర వరకు చాలా సినిమాల్లో సెట్ ప్రాపర్టీలాగే పనిచేశాను. అవేవీ సంతృప్తి ఇవ్వలేదు. కానీ ఒక మంచి పాత్ర ఎఫ్ 2 రూపంలో ఒక బ్లెస్సింగ్ వచ్చింది. తర్వాత ఎఫ్ 3లో అవకాశంతోపాటు నా పాత్రకు ఎంతో గుర్తింపు వచ్చింది. ఈ సినిమా నాకెంతో సంతృప్తినిచ్చింది.' అని ఎమోషనల్ అయ్యారు ప్రగతి. చదవండి: నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి: అనిల్ రావిపూడి అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్ అలీ -
నటి ప్రగతి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మూవీ తెలుసా?
About Telugu Actress Pragathi: నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి.. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. సినిమాల్లో హీరోలకు తల్లి పాత్రలు పోషించి ఆమె బాగా గుర్తింపు పొందింది. ఇక ఈ మధ్య ఆమె సోషల్ మీడియాల్లో సైతం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ట్రెండింగ్ పాటలకు స్టెప్పులేస్తూ ఆ వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఈక్రమంలో ఆమె వీపరితమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌కు సంపాదించుకుంటోంది. ఈ రోజు(మార్చి 17) ఆమె బర్త్‌డే. ఈ సందర్భంగా ప్రగతి గురించిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. ప్రగతి 1976 మార్చి 17న ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు జిల్లాలో జన్మించింది. నటనపై మక్కువతో మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె తమిళ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ సరసన హీరోయిన్గా నటించే చాన్స్ కొట్టేసింది. ‘వీట్ల విశేశాంగ’ మూవీతో ప్రగతి హీరోయిన్గా తమిళ సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. అదే సమయంలో ఆమె 7 తమిళ సినిమాలతో పాటు ఒక మలయాళ మూవీలో కూడా నటించింది. కెరీర్ సాఫీగా సాగుతున్న క్రమంలో ఆమె పెళ్లి చేసుకుంది. కొంతకాలం నటనకు బ్రేక్ ఇచ్చిన ఆమె ఆ తర్వాత మహేశ్ బాబు బాబీ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఇలా క్యారెక్టర్ అర్టిస్ట్‌గా తెలుగులో అడుగుపెట్టిన ఆమె హీరోలకు తల్లి పాత్రలకు పోషిస్తూ ఒదిగిపోయింది. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇలా వరస ఆఫర్లు అందుకుంది ప్రగతి పరిశ్రమలో తల్లి పాత్రలకు పాపులరిటీని తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఆమె తెలుగులో 100కు పైగా చిత్రాల్లో నటించింది. ఉత్తమ నటిగా రెండు నంది అవార్డులు కూడా అందుకుంది. ఇక తమిళంలో 23, మలయాళంలో 2 చిత్రాలు చేసిన ప్రగతి ఈ మూడు భాషల్లో పలు పలు సీరియల్స్‌లో కూడా నటించింది. ఇక రీసెంట్గా ‘సూపర్ మచ్చి’ సినిమాలో కనిపించిన ప్రగతి ప్రస్తుతం ‘ఎఫ్ 3’, ‘భోళా శంకర్’ చిత్రాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న ప్రగతికి ఒక కుమారుడు ఉన్నాడు. -
మరో విషాదం: ప్రముఖ రంగ స్థల నటుడు కన్నుమూత
సాక్షి, చిలకలూరిపేట(గుంటురు): ప్రముఖ రంగ స్థల నటుడు, దర్శకుడు ఇందుపల్లి రాజ్‌కుమార్(67) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. 1954 జూన్ 16న జన్మించారు. తండ్రి రాజారత్నం అందించిన ప్రోత్సాహంతో విద్యార్థి దశలోనే నటుడుగా రంగ స్థలం ప్రవేశం చేశారు. హైస్కూల్ విద్యార్థిగా ‘నాటకం రేపనగా’ అనే నాటిక ద్వారా రంగప్రవేశం చేసిన ఆయన చీకటి తెరలు నాటికలో గుడ్డివాడి పాత్ర ధరించి చిన్న వయసులోనే విమర్శకుల ప్రశంసలు పొందారు. సీనియర్ దర్శకుడు ఎస్ఎం బాషా, రషీద్ ప్రోత్సాహంతో నటుడిగా కొనసాగారు. ప్రజా నాట్యమండలి కళాకారులు సీఆర్ మోహన్ తదితరులతో చైర్మన్ వంటి నాటకాల్లో నటించారు. వై.శంకరరావు దర్శకత్వం వహించిన జరుగుతున్న చరిత్ర నాటికను ప్రదర్శించి సినీనటులు రాజనాల, కాంతారావు ప్రశంసలు పొందారు. చరిత్ర హీనులు, నీరు పోయ్, చివరకు మిగిలేది, వందనోటు, మనుషులొస్తున్నారు జాగ్రత్త, సర్పయాగం వంటి నాటికలలో నటించి పలు బహుమతులు పొందారు. 1985లో ఎం.దివాకర్‌బాబు రచించిన కుందేటికొమ్ము నాటిక నటుడిగా, దర్శకునిగా రాజ్‌కుమార్ కీర్తి ప్రతిష్టలను తెలుగు నాటకరంగానికి చాటిచెప్పింది. ఈ నాటికలో రాజ్‌కుమార్ ధరించిన పాత్రకు 55 పరిషత్‌ల్లో ఉత్తమ నటుడు, క్యారెక్టర్ నటుడు బహుమతులతో పాటు 30 చోట్ల ఉత్తమ దర్శకుడిగా అవార్డులు పొందారు. కె.న్యూటన్ రచించిన దండమయా విశ్వంభర నాటికకు దర్శకత్వం వహించటంతో పాటు అందులో బాణం పాత్రను పోషించి పలు బహుమతులు సాధించారు. 1987లో సాగరి సంస్థను ప్రారంభించి మృగమైదానం, హళ్లికి హళ్లి, సాలభంజిక, మరణమంజీరం వంటి నాటికలు పలు పరిషత్తుల్లో ప్రదర్శించి బహుమతులు పొందారు. సంప్రదాయ శైలికి భిన్నంగా ప్రదర్శించిన ఖడ్గసృష్టి నాటిక రాజ్‌కుమార్ దర్శక ప్రతిభకు అద్దం పట్టడంతో పాటు ఎన్నో బహుమతులు సాధించి పెట్టింది. ఉత్తమ నటుడిగా, ఉత్తమ దర్శకునిగా 500 పైగా బహుమతులు సాధించటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారం లభించింది. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు రంగ స్థల ప్రముఖులు, రాజకీయ నాయకులు పట్టణంలో శారదా జెడ్పీ హైస్కూ ల్ సమీపంలోని ఆయన నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులర్పించారు. -
మాస్ స్టెప్పులతో ఊగిపోయిన నటి ప్రగతి.. వీడియో వైరల్
Actress Pragathi Teenmar Dance Video Viral: నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి టాలీవుడ్లో మదర్ రోల్స్‌తో గుర్తింపు పొందింది. అయితే సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువ. వర్కవుట్ వీడియోలతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన ఈమె తాజాగా తీన్మార్ స్పెప్టులతో అదరగొట్టింది. నడిరోడ్డుపై డప్పు సౌండ్స్‌కి హుషారుగా స్టెప్పులేసింది. చదవండి: పుష్ప: థర్డ్ సింగిల్ 'సామీ సామీ' సాంగ్ రిలీజ్ దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేస్తూ..'ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు అస్సలు మిస్ కావొద్దు. మీ పిచ్చిని బయటపెట్టాలి' అంటూ వీడియోనే షేర్ చేసింది.ప్రగతి డ్యాన్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 44 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌గా ఉంటూ ఇలా తీన్మార్ స్టెప్పులతో ఇరగదీశారు అంటూ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. చదవండి: ముంబైలో కొత్త ఇల్లు కొన్న పూజా హెగ్డే జార్జ్ ఎవరెస్ట్‌ను ఎక్కిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి View this post on Instagram A post shared by Pragathi Mahavadi (@pragstrong) -
టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత
Senior Actor Rajababu Passed Away : టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు(64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గతరాత్రి మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు. రాజబాబు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలోని నరసాపురపేట. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న ఆయన 1995లో ‘ఊరికి మొనగాడు’సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత సింధూరం, సముద్రం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రమ్మోత్సవం, భరత్ అనే నేను వంటి చిత్రాల్లో నటించారు. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో “స్వర్గం -నరకం “,“రాధమ్మ పెళ్లి ”అనే సినిమాలను సైతం నిర్మించారు. సినిమాతో పాటు వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, వంటి సీరియల్స్‌లోనూ నటించారు. ఆయన కెరీర్లో ఇప్పటి వరకు దాదాపు 48 సీరియల్స్‌లో నటించారు. -
సిస్టరాఫ్ ఆమిర్
ఆమీర్ ఖాన్ నటనలో సూపర్ స్టార్. పాత్ర పర్ఫెక్ట్గా రావడం కోసం ఎంతైనా శ్రమిస్తారు. ఇప్పుడు వాళ్ల ఫ్యామిలీ నుంచి ఒకరు యాక్టర్‌గా మారబోతున్నారు. ఆమిర్ సోదరి నిఖాత్ ఖాన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. తాప్సీ, భూమీఫెడ్నేకర్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘సాంద్ కీ ఆంఖ్’. షూటర్స్ చంద్రో తోమర్, ప్రకాషీ తోమర్ జీవితాల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో నిఖాత్ ఖాన్ మహారాణి పాత్రలో కనిపిస్తారు. సినిమాలో చిన్న పాత్రలా కాకుండా సినిమా మొత్తం కనిపించే పాత్ర ఇది అని బాలీవుడ్ సమాచారం. మరి సిస్టరాఫ్ ఆమిర్ ఆడియన్స్‌ను ఏ రేంజ్లో ఇంప్రెస్ చేస్తారో వేచి చూడాలి. -
వెలుగుతున్న క్యారెక్టర్లు
కొన్ని క్యారెక్టర్లు వెన్నముద్దల్లా తెల్లటి కాంతిలీనుతాయి.కొన్ని క్యారెక్టర్లు కలర్ అగ్గిపుల్లల్లా రంగులు చిమ్ముతాయి. కొన్ని పాముబిళ్లల్లా పైకి లేస్తాయి. కొన్ని విష్ణుచక్రాల్లా గిర్రున తిరిగి... భూచక్రాల్లా నేలంతా దున్ని...ఢామ్ ఢామ్మున పేలే హీరో హీరోయిన్లతోపాటు ఇలాంటి క్యారెక్టర్లూ ఉంటేనే దీపావళి. 2018 కొందరికి బెస్ట్ క్యారెక్టర్లు ఇచ్చి బ్లెస్ చేసింది. బ్రైట్‌గా వెలిగించింది. ఇదిగోండి ఆ బ్రైట్ స్టోరీ. సినిమా అంటేనే దీపావళి. తెర మీద వెలుగుల ఝరి. ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయడానికి దర్శక– నిర్మాతలు నటీనటులు, సాంకేతిక నిపుణులు అనే మందుగుండు సామగ్రిని తీసుకొని చీకటి నిండిన సినిమా హాళ్లలో వెలుగును నింపే ప్రయత్నం చేస్తుంటారు. సినిమా బాగా వెలగాలంటే హీరో అనే టెన్ థౌజండ్ వాలా, హీరోయిన్ అనే ఆకాశజువ్వతో పాటు సపోర్టు కోసం కాకరపువ్వొత్తులు, మతాబులు, భూచక్రాలు వంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉండాల్సిందే. హీరో హీరోయిన్ల గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాం. కానీ ఈసారి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వెలిగినవారిని చర్చిద్దాం. ఈ సంవత్సరం మంచి పాత్రలు చేసి నేల టపాకాయల్లా పేలి సందడి చేసిన వారు వీరంతా. వీళ్లు నవ్వించారు. ఏడ్పించారు. ఆలోచింప చేశారు. సినిమాలకు బలం చేకూర్చారు. కథకు ఒక క్యారెక్టర్ తెచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్టులు వీరు. భూమిక చక్రం ‘అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా’... అని కుర్రకారు భూమిక అందానికి ఐస్ అయ్యారు గతంలో. ‘ఒక్కడు’, ‘సింహాద్రి’, ‘వాసు’, ‘జై చిరంజీవ’ వంటి హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. ‘అనసూయ’ వంటి థ్రిల్లర్‌ను ఒంటి చేత్తో సక్సెస్ చేసిన నటి ఆమె. పెళ్లి తర్వాత కొన్నాళ్లు విరామం తీసుకున్నా తెలుగు ప్రేక్షకులు ఆమెను మర్చిపోలేదు. అందుకే నాని ‘ఎంసీఏ’తో కమ్‌బ్యాక్ ఇస్తే చప్పట్లు కొట్టారు. ఆ సినిమాలో భూమిక సీరియస్‌గా ఉండే ఆఫీసర్‌గా, మరిదిని అభిమానంగా చూసుకునే వదినలా నటించి మెప్పించారు. ఆమె ఇమేజ్ ఆ క్యారెక్టర్‌కు బలం అయ్యింది. ఆ తర్వాత ‘యూ టర్న్’లో ఘోస్ట్ పాత్రను పోషించారామె. తన జీవితాన్ని, తన బిడ్డ జీవితాన్ని కోల్పోయిన దుఃఖంలో దెయ్యంగా మారి ఆమె దుర్మార్గులను శిక్షిస్తారు. తాజాగా ‘సవ్యసాచి’లో నాగచైతన్య అక్క పాత్రను పోషించారు. భూచక్రం తక్కువ సేపు తిరిగినా ఎక్కువ స్పీడుతో వెలుగుతుంది. తాను ఉన్నది తక్కువ సేపే అయినా సినిమాలకు కావలసినంత వెలుగు ఇస్తున్నారు భూమిక. రావు రాకెట్ ‘వాణ్ణలా వదిలేయకండిరా... ఎవరికన్నా చూపించండిరా’ అనే రావు రమేష్ డైలాగ్ పెద్ద హిట్. ఇప్పుడు ఆయన తోటి నటులు తెర మీద ఆయన పండిస్తున్న పాత్రలను చూసి ‘అతడలా రెచ్చిపోతుంటే వదిలేయకండిరా... ఎలాగైనా ఆపండిరా’ అని అనుకుంటూ ఉంటారు. తండ్రి రావుగోపాలరావు పెద్ద నటుడే అయినా ఆ పేరు కంటే తన టాలెంటే ఎక్కువ ఉపయోగపడింది రావు రమేష్‌కు. ‘కొత్త బంగారు లోకం’, ‘పిల్ల జమీందార్’, ‘అత్తారింటికి దారేది’ సినిమాల్లో ఆయన వేసిన క్యారెక్టర్లు మెరిశాయి. ఆయన్నే దృష్టిలో పెట్టుకుని ‘సినిమా చూపిస్త మావా’ వంటి కథలు రాసుకున్నారు. ఈ ఏడాది ‘అజ్ఞాతవాసి’లో విలనిజమ్‌తో నవ్వులు పూయించి, ‘ఛల్ మోహన్ రంగా’, ‘రాజుగాడు’, ‘దేవదాస్’ సినిమాలతో ఎట్రాక్ట్ చేసి, నటుడిగా రాకెట్ వేగంలో దూసుకెళుతున్నారు. ‘ఆర్ఎక్స్ 100’, ‘అరవింద సమేత’ సినిమాల్లో ఆయన పాత్రలు ఆ సినిమాలకు కీలకంగా మారాయి. . ఇప్పుడీ బాంబుని తమిళనాడు దర్శకులు దిగుమతి చేసుకోవడానికి శ్రద్ధ చూపిస్తున్నారు. ‘సాగసం’ అనే తమిళ చిత్రంలో రావు రమేశ్ విలన్‌గా నటిస్తున్నారు. నవ్వుల మతాబు జంధ్యాల వెలిగించిన నవ్వుల మతాబు నరేశ్. ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘చిత్రం భళారే విచిత్రం’ వంటి సూపర్‌హిట్ కామెడీ సినిమాలు నరేశ్ ఖాతాలో ఉన్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాక కొంతకాలం ఆయన స్ట్రగుల్ అయినా రెండు మూడేళ్లుగా ఆయన కెరీర్ గ్రాఫ్ చాలా ఉత్సాహకరంగా ఉంది. ఈ ఏడాది ఎక్కువ శాతం నవ్వులు పూయించిన నటుడు నరేశ్ అనే అనొచ్చు. ‘సమ్మోహనం’ చిత్రంలో నట పిచ్చి ఉన్న హౌస్ ఓనర్ పాత్రలో నరేశ్ పేల్చిన నవ్వులకు థియేటర్ పకపకలాడింది. ‘ఛలో’, ‘తొలిప్రేమ’, ‘ఛల్‌మోహన్ రంగ’, ‘దేవ దాస్’, ‘అరవింద సమేత’లో ఆయన చేసిన పాత్రలన్నీ అలరించాయి. కేవలం నవ్వించడమే కాకుండా ‘రంగస్థలం’ సినిమాలో ఎమోషనల్ సీన్స్ చేసి ఆడియన్స్ కళ్లలో నీళ్లు తెప్పించారు నరేశ్. బిజీ బాంబ్ ఈ ఏడాది దాదాపు రెండు నెలలకోసారి స్క్రీన్ మీద కనిపించిన బాంబు మురళీ శర్మ. ఈ బాంబుని ఒక్కో దర్శకుడు ఒక్కోలా స్క్రీన్ మీద పేల్చారు. జనవరి టు నవంబర్ సుమారు పది సినిమాల్లో వెలుగు నింపారు మురళీ శర్మ. ‘అజ్ఞాతవాసి’లో కామెడీ శర్మగా, ‘భాగమతి’, ‘టచ్ చేసి చూడు’ చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్‌గా, ‘అ!’ చిత్రంలో మాంత్రికుడిగా, ‘విజేత’ సినిమాలో బాధ్యతగల తండ్రిగా, ‘శైలజా రెడ్డి అల్లుడు’, ‘దేవదాస్’ చిత్రాల్లోనూ మెప్పించారు. ఈ ఏడాది ఎక్కువగా దర్శక– నిర్మాతలు పేల్చిన టపాసుల్లో మురళీ శర్మ ఒకరు. – ఇన్పుట్స్: గౌతమ్ మల్లాది మా అమ్మ నా టార్చ్ బేరర్ ‘డీజే’లో రొయ్యలనాయుడు పాత్రను చూసి మా అమ్మగారు.. ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మీ నాన్న గారు చేసిన పాత్రను కంటిన్యూ చేసి శభాష్ అనిపించుకున్నావు. ఇక నీకు తిరుగులేదు’ అన్నారు. ఆ రోజు ఆమె ఆనందాన్ని చూసిన నేను ‘ఇక చాలు’ అనుకున్నాను. నా డైరెక్టర్స్ ఎన్నో మంచి పాత్రలను నాకిచ్చి ప్రోత్సహించారు. ‘అ ఆ’ చిత్రంలోని క్లైమాక్స్ చేసినప్పుడు దర్శకుడు త్రివిక్రమ్‌గారు ‘ఇది ఐకానిక్ సీన్ అవుతుందండి’ అన్నారు. ‘శత్రువులు ఎక్కడో ఉండరు.. మనతో పాటే మన చెల్లెళ్ల రూపంలో, కూతుళ్ల రూపంలో మన మధ్యే తిరుగుతుంటారు’ అన్న తర్వాత ‘ఇప్పుడేం చేద్దాం అంటే.. చేసేదేముంది ఇక పిసుక్కోవటమే..’ అనే సీన్లోని డైలాగ్ ఇది. ఇప్పటికీ ఎక్కడికెళ్లినా అందరూ పిసుక్కోవటమే అంటూ నేను చెప్పిన డైలాగ్‌ను నాకే చెప్తుంటారు. అలాగే శ్రీకాంత్ అడ్డాల అన్ని సినిమాల్లోనూ చాలా మంచి రోల్స్ చేశాను. హరీష్ శంకర్ తన సినిమాలలో చాలా స్పెషల్‌గా క్యారెక్టర్‌ను నా కోసం తయారు చేస్తారు. ఒక నటుడికి ఇంత కన్నా ఆనందం ఏముంటుంది. – రావు రమేశ్ డబుల్ సౌండ్ బాంబు హీరోగా తెలుగు, తమిళ రాష్ట్రాల్లో డబుల్ సౌండ్ చేస్తున్న నటుడు ఆది పినిశెట్టి. ఈ ఏడాది ‘రంగస్థలం’, ‘యు టర్న్’ సినిమా విజయాలలో భాస్వరం వత్తిలా కీలక పాత్రలు పోషించారు.. ‘రంగస్థలం’లో ఆయన మరణాన్ని చూసి రెండు తెలుగు రాష్ట్రాలు కళ్లల్లో నీళ్లు నింపుకున్నాయి. ‘యు టర్న్’లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుంటే జరుగుతున్న హత్యలను ఇతను ఛేదించగలడు అని ధైర్యం తెచ్చుకుంది. హ్యాపీ స్పేస్‌లో ఉన్నాను ఎన్ని పాత్రలు చేసినా ఆర్టిస్ట్ ఆకలి అనేది తీరదు. వచ్చిన పాత్రను సంతృప్తికరంగా చేయడంతో పాటు ఇంతకు ముందు రిపీట్ అయినట్టు కాకుండా చేసేందుకు జాగ్రత్త పడుతుంటాను. 2018 చాలా సంతృప్తికరమైన సంవత్సరం. సాధారణంగా నేను నా దర్శకులందరితో కలిసిపోతాను. తెలుగు ప్రేక్షకులు నా పాత్రలను ఆదరిస్తున్న తీరు చూస్తుంటే ఇంతకు మించి ఏం కోరుకోను? అనిపిస్తుంది. సంవత్సరానికి 10 సినిమాలు చేస్తున్నాను అంటే తీరిక లేకుండా పని చేయాలి. కానీ నేను పని చేసే టీమ్ వల్ల ప్రత్యేకమైన వెకేషన్ కూడా అవసరం ఉండటం లేదు. అంత బావుంటుంది పని చేసే వాతావరణం. మంచి మంచి పాత్రలు రాస్తున్నారు దర్శకులు. అన్నీ తిరస్కరించడానికి వీలు లేనటువంటి పాత్రలే. వచ్చే నెల విడుదల కానున్న శర్వానంద్ ‘పడిపడి లేచె మనసు’లో కూడా చాలా భిన్నమైన పాత్ర పోషిస్తున్నాను. నేను ఎప్పుడూ మిమ్మల్ని (ప్రేక్షకులు) ఆనందింపజేయాలి, నన్ను మీరు ఆదరించాలి. ఇదెప్పుడూ ఇలానే సాగాలని కోరుకుంటున్నాను. – మురళీ శర్మ ఇంటింటా ఈశ్వరీ రజనీకాంత్.. హైడ్రోజన్ బాంబ్. అలాంటి పెను పేలుడు పదార్థం పక్కన నిలబడి, ఫ్రేమ్‌లో గెలవడం చాలా కష్టం. కానీ ‘కాలా’లో రజనీతో సమానంగా కొన్నిసార్లు డామినేట్ చేసి మంచి మార్కులు కొట్టేశారు ఈశ్వరీ రావు. ఇరవై ఏళ్ల క్రితం ‘ఇంటింటా దీపావళి’ చిత్రంతో పరిచయమైన ఈశ్వరీ రావు బాపు దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ సరసన ‘రాంబంటు’ సినిమాలో హీరోయిన్గా నటించారు. తమిళంలోనూ ఆమె హీరోయిన్ వేషాలు వేశారు. అయితే అప్పుడు రాని గుర్తింపు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వచ్చింది. ‘కాలా’లో కరికాలన్ భార్య చిట్టెమ్మగా, ‘అరవింద సమేత వీర రాఘవ’లో ఫ్యాక్షనిస్ట్ బసిరెడ్డి భార్యగా కనిపించిన ఈ నటి ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్‌లో పని మనిషి పాత్ర చేశారు. తెలుగులో నిడివి తక్కువ ఉన్న ఈ పాత్రను తమిళంలో దర్శకుడు బాలా పెంచి ముఖ్యమైనదిగా మలిచారు. ఈశ్వరీ రావు ఇమేజ్ ఏ విధంగా ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. -
డాక్టర్నయ్యాకే యాక్టర్నయ్యా!
సింహాచలం (పెందుర్తి) : సినీ రంగంలోకి అనుకోకుండా వచ్చా.. సాధారణంగా డాక్టర్ కావాల్సిన వాడు యాక్టర్ అయ్యాడంటారు. నేను మాత్రం డాక్టర్నయ్యాకే యాక్టర్నయ్యానని ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రవిప్రకాష్ అన్నారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శుక్రవారం ఆయన కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈసందర్భంగా స్థానిక మీడియాతో కొంతసేపు మాట్లాడారు. విశాఖ మా సొంత ఊరని, లాసెన్స్‌బే కాలనీలో మా తల్లిదండ్రులు ఉంటున్నారని తెలిపారు. విద్యాభ్యాసం అంతా విశాలో జరిగిందన్నారు. విశాఖ వేలీ స్కూల్లో పన్నెండో తరగతి వరకు చదివానని, ఆ తర్వాత ఎంబీబీఎస్ మాస్కోలో చేశానని తెలిపారు. కొంతకాలం హైదరాబాద్‌లో ప్రాక్టిస్ చేశానన్నారు. ఆ తర్వాత స్నేహితులు, బంధువులు చెబితే అనుకోకుండానే సినీ రంగ ప్రవేశం చేశానన్నారు. అలా 2000 సంవత్సరంలో తేజ దర్శకత్వంలో వచ్చిన శుభవేళ చిత్రం ద్వారా పరిచయం అయ్యానన్నారు. అప్పటి నుంచి సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం ప్రేక్షకులు అందించారన్నారు. ఇప్పటివరకు దాదాపు 200 చిత్రాల్లో నటించానన్నారు. ప్రస్తుతం సమంత, ఆదిపినిశెట్టి జంటగా నటిస్తున్న యూటర్న్ సినిమాలోను, తాప్సి, ఆది పినిశెట్టి జంటగా నటిస్తున్న నీవెవరు అనే చిత్రంలోను, శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజే హీరోగా నటిస్తున్న అమర్ అక్బర్ ఆంథోని చిత్రంలోనూ నటిస్తున్నాన్నారు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం చిత్రం తనకు మంచి పేరు తెచ్చిందన్నారు. దర్శనార్థం వచ్చిన రవిప్రకాష్ దంపతులు కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అష్టోత్తరం పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. నాలుగు వేదాలతో అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదాన్ని అధికారులు అందజేశారు. -
నటుడు చంద్రమౌళి కన్నుమూత
సీనియర్ నటుడు, డబ్బింగ్ కళాకారుడు చంద్రమౌళి గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చిత్తూరు జిల్లా కుమ్మరి కండ్రిగలో జన్మించారు చంద్రమౌళి. ప్రముఖ నటుడు మోహన్‌బాబు తండ్రి నారాయణస్వామి వద్ద చంద్రమౌళి, ఆయన అన్నయ్య 5వ తరగతి వరకూ చదువుకున్నారు. మేనమామ ప్రేరణతో 20 ఏళ్లకే నాటకాలంటే ఆయనకు మక్కువ ఏర్పడింది. దాంతో 1971లో మద్రాసు వెళ్లిన ఆయనకు ‘అంతా మన మంచికే’ చిత్రంలో వేషం దొరికింది. అప్పటి నుంచి సుమారు 200 సినిమాల్లో నటించారాయన. 45 ఏళ్లకు పైబడిన తన సినీ ప్రస్థానంలో నటుడిగా విభిన్న పాత్రలు పోషిస్తూనే, డబ్బింగ్ కళాకారుడిగానూ పేరు తెచ్చుకున్నారు.పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించారు. సినిమాల్లో ఆయన చిన్న చిన్న పాత్రల్లో నటించినా తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజులతో పాటు నేటి అగ్ర నటులందరి సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు పాత్రలు పోషించి, తనదైన గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఎన్ని సినిమాలు చేసినా పేద, మధ్య తరగతి పాత్రల్లో నటించిన ఆయనకు ఒక్కసారి కూడా తెరపై కోటీశ్వరుడిగా చూసుకునే అవకాశం దక్కలేదట. అయితే.. అందుకు ఏ మాత్రం బాధగా లేదని పలు సందర్భాల్లో చెప్పారాయన. చంద్రమౌళికి ఇద్దరు కుమారులున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ, టీవీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
నటుడు వంకాయల సత్యనారాయణ మృతి
సాక్షి, విశాఖ : సినీ నటుడు వంకాయల సత్యనారాయణమూర్తి ( 78) సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన శ్వాస సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. దాదాపు 180కి పైగా సినిమాల్లో సహాయ నటుడిగా నటించారు. క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వంకాయల సత్యనారాయణమూర్తి సీతామహాలక్ష్మి, ఊరికిచ్చిన మాట, అర్థాంగి, శుభలేఖ, విజేత వంటి పలు చిత్రాల్లో నటించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. కాగా వంకాయల సత్యనారాయణమూర్తి మృతి పట్ల పలువురు నటులు సంతాపం తెలిపారు. -
బుల్లితెర పోలీస్
బెళుగుప్ప: బుల్లితెర సీరియల్స్, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాడు బెళుగుప్పకు చెందిన రాచర్ల హరినాథ్ గుప్తా. రైతు, ధాన్యం వ్యాపారి రాచర్ల కోటేశ్వరప్ప పెద్ద కుమారుడు హరినాథ్‌గుప్తా టీవీ సీరియల్స్‌లో ఎస్సై, కానిస్టేబుల్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. న్యాయవాది, ఎమ్మెల్యే తదితర పాత్రల్లోనూ తన అభినయాన్ని ప్రదర్శిస్తున్నాడు. హరినాథ్ గుప్తా తన మిత్ర బృందంతో కలిసి 1983లో గ్రామంలో ఒక వీధి నాటకం ప్రదర్శించారు. ఆ నాటకంలో ఎస్సైగా హరినాథ్ గుప్తా అభినయం అందరినీ ఆకట్టుకుంది. అప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్న ఆయన 2013లో హైదరాబాద్‌కు మకాం మార్చాడు. అక్కడ జరిగే అనేక ఆడిషన్స్‌లో పాల్గొన్నాడు. 2014లో తొలిసారిగా ‘ఈజీ మనీ’ అనే సినిమాలో కృష్ణభగవాన్, రాకెట్ రాఘవల కాంబినేషన్లో నటించే అవకాశం వచ్చింది. నటించిన సినిమాలు, సీరియళ్లు.. ఆడదేఆధారం, జాబిలమ్మ, మిస్సమ్మ, సౌభాగ్యవతి, కాంచనగంగ, స్వాతిచినుకులు, అగ్నిపూలు, శ్రావణ సమీరాలు, కెరటాలు తదితర 15 సీరియళ్లలో హరినాథ్‌గుప్తా నటించారు. వీటిలో కెరటాలు సీరియల్లో రాజుపాలెం ఎస్సై పాత్ర మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. పడ్డానండి ప్రేమలో మరి, ఊపిరి, శౌర్య, సింగం 123, భంభంబోలేనాథ్, వైరస్, మెంటల్ కృష్ణ తదితర సినిమాలలో నటించారు. ప్రస్తుతం విడుదల కానున్న ఆక్సిజన్, రూల్, కార్తీకా సినిమాలలోనూ నటించారు. రూల్ సినిమాలో ఎమ్మెల్యే పాత్ర పోషించారు. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలి నటనారంగంలో అవకాశాలు రావడమే కష్టం. వచ్చిన ఎలాంటి అవకాశాన్నీ వదులుకోకుండా సద్వినియోగం చేసుకోవాలి. అనంత జిల్లా వాసిగా నటనా రంగంలో రాణిస్తున్నందుకు సంతోషంగా ఉంది. జిల్లా నుంచి మరింత మంది నటనా రంగంలోకి రావాలి. అలాంటివారికి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నా. – హరినాథ్‌గుప్తా -
మనసుని చదువుతాడు!
క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, అప్పుడప్పుడు హీరోగా నటిస్తున్న అజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘స్పెషల్’ (ద స్టోరీ ఆఫ్ ఎ మైండ్ రీడర్). వాస్తవ్ దర్శకత్వంలో నందలాల్ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. వాస్తవ్ మాట్లాడుతూ– ‘‘ద స్టోరీ ఆఫ్ మైండ్ రీడర్ అనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది. ఒక ప్రత్యేక కథాంశంతో రూపొందుతున్న వైవిధ్యమైన ప్రయోగాత్మక చిత్రమిది. హాలీవుడ్ తరహా స్క్రిప్టుతో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో అజయ్ వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో ఒకటే పాట ఉంటుంది. కథ డిమాండ్‌ను బట్టి మాల్దీవుల్లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. మూడు రోజుల క్లైమాక్స్ చిత్రీకరణ మినహా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో టీజర్ రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అమర్, సంగీతం: మణ్యం యన్వియస్. -
జరిగేవన్నీ మంచికనీ...
నేను నా దైవం కొడుకు జారిపడితే.. మనకు నొప్పేస్తుంది. కొడుకు చేయిజారిపోతే.. కడుపు తరుక్కుపోతుంది. కొడుకే లేకపోతే... వాడి బదులు మనం పోతే బాగుండనిపిస్తుంది. తుపాన్‌ను భరించిన చెట్టు.. ఇంకా నిలబడే ఉందంటే దాని వేళ్ళలో దైవబలం ఉన్నట్టే! చెట్టంత కొడుకు జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ తోటలో మిగిలిన మొక్కలతో గడుపుతున్న కోటశ్రీనివాసరావు కన్నీళ్లలో జీవనవేదన కనిపించింది. ఆయన మాటల్లో.. ‘జరిగేవన్నీ మంచికనీ...’ అన్న స్పృహ ధ్వనించింది. నా కొడుకు పెద్ద దెబ్బ కొట్టాడండీ. ఏమిటో అంతా.. ఆత్రేయగారు అన్నట్టు.. ‘అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని. జరిగేవన్నీ మంచికనీ...’ అనుకోవడమే మన పని. సర్, ఈ విశ్రాంత సమయం దైవాన్ని తలచుకోవడానికి, జీవితాన్ని విశ్లేషించుకోవడానికి అవకాశంగా భావిస్తున్నారా? అంతేకదమ్మా! ఇంక మిగిలింది అదే కదా! దేవుడు ఓ వైపేమో పేరు ప్రఖ్యాతులు బోలెడన్ని ఇచ్చాడు. మరో వైపు జీవితకాలం భరించు.. అనే కష్టం ఇచ్చాడు. (కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ ఏడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు) దేవుడి గొప్పతనం ఏంటంటే ఈ రెండింటినీ తట్టుకునేంత (చేతిని చాతీ మీద పెట్టుకుంటూ) గుండెను ఇచ్చాడు. ఇంకొకరైతే ఏమైపోయేవారో... ఆ కుర్చీలో కూర్చుని (ఇంటి హాల్లో గోడ మీద కోట చేసిన సినిమా పాత్రల ఫొటోలు అతికించి ఉన్నాయి) ఆ ఫొటోల వంక చూస్తుంటాను. జీవితంలో చేసిన తప్పులు, ఒప్పులు అన్నీ జ్ఞాపకం వస్తుంటాయి. కాకపోతే నమ్మేదొకటే.. తప్పొప్పులు ఎక్కడికీ పోవు. ఇక్కడే ఆ ఫలితాన్ని చూస్తాం. మంచి చేస్తే మంచే చూస్తాం, చెడు చేస్తే చెడూ చూస్తాం. కొడుకును దూరం చేశాడని దేవుడి మీద కోపం తెచ్చుకుంటున్నారా? కోపమా?! ఆయన ముందు మనమెంతటి వారం. అయినా మన ఖర్మకు ఆయన మీద కోపం తెచ్చుకోవడం ఎందుకు? అలా ఎప్పుడూ జరగలేదు. కానీ, దుఃఖం. ఇలా రాసిపెట్టి ఉంది. ఏం చేస్తాం...? దైవం గురించి బాగా అర్థం చేసుకున్నట్టు కనిపిస్తోంది.. వృత్తే దైవంగా భావించాను. ఆ వృత్తిని అర్థం చేసుకుంటూ ఎదిగాను. అందులోని మంచి చెడులను ఇప్పుడు విశ్లేషించుకుం టున్నాను. మొదట్లో నేనీ రంగానికి వచ్చినప్పుడు ఉన్న వాతావరణం ఇప్పుడు లేదు. బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడూ సినిమాల కోసం ప్రయత్నించింది లేదు. నాటకాలు వేసేవాడిని. యాదృచ్చికంగా టి.కృష్ణ గారు నా నాటకం చూసి, ‘వందేమాతం’ సినిమాలో చిన్న అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత నటనే నా జీవితం అయిపోయింది. బ్యాంకులోనే ఉండి ఉంటే ఓ అధికారిని అయ్యేవాడినేమో. ఆ జీవితానికి ఈ జీవితానికీ ఎక్కడా పోలిక లేదు. ఇదంతా భగవంతుని దయ కాకపోతే మరేముంటుంది. నలుగురు అక్కచెల్లెళ్లు, ముగ్గురు అన్నదమ్ములం. అన్నగారు పోయారు. మిగతా అందరం ఎప్పుడైనా కలుస్తుంటాం. ఎవరి ప్రాప్తం వారిది. ఇంత జీవితాన్ని ఇచ్చినందుకు దేవునికి ఏవిధంగా కృతజ్ఞతలు తెలుపుకుంటారు? వేంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాను. ఉదయాన్నే నిద్రలేచినప్పుడు ఆయన్ని తలుచుకొని ఓ దణ్ణం పెట్టుకుంటాను. అంతకు మించి పూజలు ఏమీ చేయను. గుళ్లకు వెళుతుంటాను. దైవం అంటే నా ఒక్కడికే కాదు అందరికీ ఉన్నాడని గట్టిగా నమ్ముతాను. మనసుకు అలసటగా అనిపించినప్పుడు ఓ అరగంట మౌనంగా కూర్చుంటాను. దైవాన్ని తలుచుకుంటూ మౌనంగానే ప్రార్థిస్తుంటాను. మీ పిల్లలు సరే, మనవలకు దైవం గురించి ఎలాంటి విషయాలు చెబుతుంటారు? అప్పుడు పిల్లలకు చెప్పడానికి నాకు టైమ్ లేదు. ఇప్పటి పిల్లలు చాలా బిజీ! నేర్పడానికి, చెప్పడానికేమీ లేదు. పొద్దున ఏడింటికి వెళితే తిరిగి రాత్రి ఏడు దాటాకే వస్తారు. వాళ్ల పుస్తకాలు, వ్యాపకాలతోనే వారికి సరిపోతుంది. మనం ఏదైనా చెబితే చికాకు పడతారు. మార్పు ఎందుకొచ్చింది అని చెప్పలేం. అలా వచ్చిందంతే! వాళ్లకు సమయం దొరికినప్పుడు ‘ఏదో ఒకటి తెలుసుకోండిరా!’ అని అంటుంటాను. వింటే వింటారు, లేకపోతే లేదు. ఈ రోజు ఒకరో ఇద్దరో కాదు ప్రపంచమే అలా ఉంది. ఈ తరాన్ని మార్చండి అని చెప్పలేం. సమాజపరిస్థితులు అలా ఉన్నాయి. భగవంతుడే మార్పు తేవాలి. మీ జ్ఞాపకాలలో దైవం మీకిచ్చిన అదృష్టం గురించి తలుచుకుంటుంటారా? అదే ఇప్పుడు చేస్తున్నది. పుస్తకాలు చదివే అలవాటు లేదు. నా జీవితమే నాకు పెద్ద పుస్తకం. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకోవడం అంటే సాధారణ విషయంకాదు. నా కంటే ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. కానీ, ఆ అదృష్టం నన్ను వరించింది. ఇది భగవంతుడిచ్చిందే కదా! మంచైనా చెడైనా నేను చేసిన పాత్రలలో కనీసం 50 క్యారెక్టర్లయినా గుర్తుకు వస్తుంటాయి. అప్పటికీ ఇప్పటికీ నిలిచిపోయే క్యారెక్టర్ ‘అహ నా పెళ్లంట’ సినిమాలోనిది. మహానుభావుడు జంధ్యాలగారి ద్వారా ఆ అదృష్టాన్ని దక్కించాడు దేవుడు. ఎప్పుడైనా ఒక సినిమా గురించి బాధపడతాను. ‘పంజరం’ సినిమాలో యవ్వనంలో ఉన్న హీరోయిన్ని పెళ్లి చేసుకొని, అనుమానంతో ఆ పిల్లను పీడించే స్వభావమున్న పాత్ర అది. 102, 103 డిగ్రీల జ్వరంతో ఉండి కూడా ఆ సీన్ చేశాను. కానీ, ఆ సినిమా రెండు, మూడు రోజుల కన్నా మించి ఆడలేదు. ఇలా మంచి చెడులను తలుచుకుంటూ ఉంటాను. నేనిది కోల్పోయాను స్వామీ.. అని దేవుని ముందు చెప్పుకున్న సందర్భం? రెండున్నాయి. ఒకటి సరైన సమయంలో కుటుంబంతో గడపలేకపోయాను. షూటింగ్స్ ఉండి నెలకి, రెండు నెలలకు ఓసారి ఇంటికి వచ్చిన రోజులున్నాయి. నాకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. పిల్లల చిన్నతనంలో వారి అచ్చటా ముచ్చట పెద్దగా చూసుకుంది లేదు. వారి వెనకాల ఉండి సెట్ చేసింది లేదు. నా అదృష్టం ఏంటంటే పిల్లలు చదువుకుని, బుద్ధిమంతులుయ్యారు. రెండోది– జనరల్ నాలెడ్జి లేకుండా పోయింది. పొద్దున్న ఐదింటికో, ఆరింటికో వెళ్లిపోయేవాడిని. తిరిగి వచ్చేసరికి అర్ధరాత్రి దాటి ఏ రెండో అయ్యేది. ప్రపంచంలో ఏం జరుగుతుంది అని కూడా పట్టించుకోలేదు. ఈ రెండింటి గురించి తలుచుకొని నాలో నేను ఏడుస్తూ ఉంటాను. ఎట్లా అయిపోయిందంటే అప్పుడు తినడానికి టైమ్ లేదు. ఇప్పుడు తిందామంటే తినలేను. అప్పట్లో ఎవరు ఏం చేసేవారో కూడా తెలిసేది కాదు. పుట్టినరోజులు, పెళ్లిరోజులు.. ఏవీ పట్టేవి కావు. ఎవరికైనా టైమ్ వస్తే టైమ్ ఉండదని అర్థమైంది. ఆ రోజులు అలా గడిచిపోయాయి.నా కొడుకు పెద్ద దెబ్బ కొట్టాడండీ. ఏమిటో అంతా.. ఆత్రేయగారు అన్నట్టు.. ‘అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని. జరిగేవన్నీ మంచికనీ...’ అనుకోవడమే మన పని. జీవితం వెళ్లిపోయింది. వెళుతోంది. ఈ వయసులో పితృశోకం భరించవచ్చు. పుత్ర శోకం భరించలేం. తండ్రిగా ఆ బా«దను అనుభవిస్తున్నాను. ఈ దుఃఖాన్ని ఎవరూ పూడ్చలేరు. తెలిసినతను రోగంతో బాధపడుతూ ఇంకో రెండు నెలలో పోతాడనగా వెళ్లి చూసొచ్చాను. ఆయన్ను చూస్తూ ఒకాయన అన్నాడు ‘ఏంటయ్యా! ఇది.. ఇలా అయిపోయావు’ అన్నాడు. అప్పుడు అన్నాను ‘అనుభవించాడు కదా! ఇప్పుడు అనుభవిస్తున్నాడు’ అని. నేనూ అంతేగా! అన్నీ చూశాను. అర్థం చేసుకున్నాను. దేవుడు ఈ కష్టం ఇచ్చాడని ఏడుస్తూ కూర్చుంటే నన్ను నమ్ముకున్నవారు ఉన్నారు. వాళ్లేమై పోతారు. ఎలాగూ తప్పదు కాబట్టి.. నడిపించాలి అంతే! ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకోవడా నికి ఆశ్రమాలకు వెళ్ళాలనుకోవడం లేదా? ఇంతవరకు చేయలేదు. జనరేషన్ మార్పు కారణంగా ఇప్పుడు చాలా మటుకు పిల్లలు ఫారిన్లో ఉంటున్నారు. అక్కణ్ణుంచి డబ్బులు పంపిస్తుంటారు. ఇక్కడ అమ్మానాన్న ఏదో ఉన్నామంటూ దిక్కులేకుండా ఉంటారు. అదంతా విని, చూసి తట్టుకోవడం కష్టం అనిపిస్తుంది. రోజంతా ఎలా గడుపుతుంటారు? మనవలు, మనవరాలు ఉన్నారు. వారి బాగోగులు గమనించడం. కాసేపు టీవీ చూడడం, భోజనం చేయడం, నిద్రపోవడం.. తప్పదు. అంత తీరికలేకుండా ఉండి ఇప్పుడు ఇలా కూర్చోవడం అంటే ఏం చేయగలం... భగవంతుడు అలా రాసిపెట్టాడు. మనుషుల్లో దైవత్వాన్ని చూశారా? ఎదుటివాడికి సాయపడటం అంటే అక్కడ దైవం ఉన్నట్టే! కాలే కడుపుకి ఒక ముద్ద పెట్టినా చాలు కదా. అలాంటివారిని చూస్తూనే ఉంటుంటాం. మీరే దేవుడు అని ఎవరైనా అన్న సందర్భం...? ఎంతమాట. అలా అని మనం చెప్పుకోకూడదు. కొందరు అంటుంటారు కానీ అది నాకు నచ్చదు. నా దగ్గర పనిచేసేవాళ్లు, తెలిసినవాళ్లు కష్టం లేకుండా ఉన్నారా, లేరా! అని చూస్తాను. ఎవరైనా కష్టం ఉంది బాబూ అని వస్తే.. సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఇండస్ట్రీలో పది, పదిహేను లక్షలదాకా ఖర్చు పెట్టి ఉంటాను. అదంతా చెప్పుకోవడం నాకిష్టం లేదు. కష్టం ఉన్నదని వాళ్లు పది అడిగితే నేను పది ఇవ్వలేకపోవచ్చు. కానీ, మూడో నాలుగో ఇచ్చి ఉంటాను. ఈ రోజుకు కూడా ఒకరి ముందు చెయ్యి చాపే అవకాశం రానివ్వలేదు దేవుడు. అంతకు మించి ఏమున్నది. పిల్లలకూ అదే చెబుతుంటాను. మనం బతకాలి. పదిమందిని బతికించేలా ఎదగాలి అని. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
ఆ విషయం బాధ కలిగించింది
►ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీకి కొత్త పండగ ►ఆర్.నారాయణమూర్తి సినిమాకు థియేటర్లు లేకపోవడం బాధ కలిగించింది.. ►‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పృథ్వీరాజ్ ► పార్వతీ పురంలో సందడి చేసిన సినీ నటుడు పార్వతీపురం : తన చివరి శ్వాస వరకూ కళామతల్లి సేవలోనే ఉంటానని ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’గా తెలుగు సినిమా తెరపై పేరొందిన కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పృథ్వీరాజ్ అన్నారు. శనివారం స్థానిక కొత్తవలసలోని సువ్వాడ సీతయ్య ఇంటికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు. తన చివరి నిమిషం వరకు కళామతల్లికి సేవ చేసుకుంటానని స్పష్టం చేశారు. రాష్ట్రాలు విడిపోయినంత మాత్రాన తెలుగు సినిమాకు ఎటువంటి భంగమూ లేదన్నారు. ఒకే భాష మాట్లాడిన వారిని రెండు ముక్కలుగా రాజకీయాలు చేశాయన్నారు. ఈ ఏడాది పండగకు విడుదలైన మూడు సినిమాలు ఇండస్ట్రీకి పెద్ద పండగనే తెచ్చాయని చెప్పారు. ఆర్.నారాయణమూర్తి సినిమాకు థియేటర్లు లేకపోవడం బాధ కలిగించిందని తెలిపారు. ఇండస్ట్రీలో వారసత్వ నటులు, వర్గభేదాలు అనేవి లేవని స్పష్టం చేశారు. టాలెంట్ ఉన్నవారిని ఇండస్ట్రీ అక్కున చేర్చుకుంటుందన్నారు. వర్గాలు లేవనడానికి తానే ఒక ఉదాహరణనని చెప్పారు. అందరి వద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నానని తెలిపారు. తాను ప్రస్తుతం కాటమరాయుడు, ద్వాపర తదితర సినిమాలలో నటిస్తున్నానని వివరించారు. ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’తోనే గుర్తింపు తాను ఎక్కడికెళ్లినా అందరూ గుర్తు పట్టి, ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అంటున్నారని, ఆ సమయంలో ఎంతో ఆనందంగా ఉంటుందని పృథ్వీరాజ్ తెలిపారు. ఈ సంక్రాంతికి పార్వతీపురం రావడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఫ్లెక్సీలు, పూలతో స్వాగతం పలకడం ఆనందంగా ఉందన్నారు. సీతయ్య కొడుకు సురేష్ తనకు మిత్రుడని చెప్పారు. అందువల్లే విశాఖ వచ్చి, అక్కడ నుంచి పార్వతీపురం వచ్చానని తెలిపారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు, జూనియర్ ఆర్టిస్ట్‌లు హాయిగానే ఉన్నారని తెలిపారు. ఎగబడిన జనం పృథ్వీరాజ్ వచ్చారన్న విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. ఆయనతో సెల్ఫీలు, ఫొటోలు తీసుకుని ఆనందపడ్డారు. -
నాటకాల్లోనే కష్టం..
సినీ హాస్య నటుడు గుండు సుదర్శన్ వీరవాసరం : సినీ రంగం కంటే నాటక రంగంలో నటనే కష్టమని ప్రముఖ సినీ హాస్యనటుడు గుండు సుదర్శన్ తెలిపారు. వీరవాసరం కళా పరిషత్ నాటక పోటీల సభలకు విచ్చేసిన ఆయన బుధవారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. మాది పశ్చిమ గోదావరి జిల్లా మంచిలి గ్రామం, నాన్నగారు సూరంపూడి సుబ్బారావు తణుకులో అడ్వకేట్‌గా పనిచేసేవారు. అమ్మ కనకలత. నేను కర్ణాటకలో ఎంటెక్ పూర్తి చేశా. భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో 1983 నుంచి 1998 వరకూ లెక్చరర్‌గా పనిచేసా. బాపు-రమణలు దూరదర్శనలో తీసిన సీరియల్ ‘నవ్వితే నవ్వండి’ ద్వారా టీవీ రంగంలోకి ప్రవేశించాను. చిన్నతనం నుంచి అనేక నాటకాల్లో నటించాను. ‘మొండి గురువు- బండ శిష్యుడు’ నాటకం ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాను. 1992లో నందమూరి తారకరామారావు ప్రధాన పాత్ర పోషించిన కవి సార్వభౌమ శ్రీనాథుడు చిత్రంతో వెండితెర ప్రవేశం చేశాను. ఇప్పటి వరకూ సుమారు 365కు పైగా సినిమాల్లో కమెడియన్‌గా నటించాను. మిస్టర్ పెళ్లాం, చిత్రం, చిరునవ్వుతో, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, రాంబాబు, కబడ్డీకబడ్డీ, అతడు, మనం సినిమాలు గుర్తింపునిచ్చాయి. ప్రస్తుతం వెంకటేశ్, సాయిధరమ్‌తేజ్, మోహన్‌లాల్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాను. కామెడీ విలన్‌గా పేరు తెచ్చుకోవాలన్నదే నా అశ అని ముగించారు. -
తెరపై మణి జీవితం!
తెలుగు, తమిళ భాషల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితుడైన మలయాళ నటుడు ‘కళాభవన్’ మణి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అనుమానాస్పదమైన ఆయన మరణం వెనుక ఉన్న పూర్తి కారణాలు పోలీసులు పరిశోధించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడాయన జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందనుంది. ‘వసంతియుమ్ లక్ష్మియుమ్ పిన్నె న్యానుమ్’ అనే చిత్రంతో మణిని క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి హీరోగా మార్చిన దర్శకుడు వినయన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. మరో విశేషమేమిటంటే, ఈ చిత్రంతోనే మణి సోదరుడు రామకృష్ణన్ తెరంగేట్రం చేయనున్నారు. ఆటోడ్రైవర్ నుంచి మిమిక్రీ ఆర్టిస్టుగా మారి, అటుపై సినీ రంగంలో స్థిరపడిన మణి జీవితంలోని ప్రతి కోణాన్ని స్పృశించనున్నారట. మిస్టరీగా మారిన మణి జీవితం తెరపై రావడానికి సిద్ధం కావడం మలయాళ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. -
డెఫినెట్లీ.. మిసెస్ గోడ్బోలే!
బిరబిరా పారే నది... నదియా! ... జరీనా మొయిదు నుంచి నదియా దాకా... నదియా నుంచి మిసెస్ గోడ్బోలే దాకా... మిసెస్ గోడ్బోలే నుంచి ‘అత్తారింటికి దారేది’ దాకా... నదియా మలుపులు మన గుండెల్ని తట్టాయి. ఎన్ని మలుపులు తిరిగినా తనకు బాగా నచ్చిన పాత్ర... డెఫినెట్లీ... మిసెస్ గోడ్బోలే! * వెల్కమ్ బ్యాక్ టు ‘సుందరి ఆఫ్ సౌత్’! ఇంతకీ మీకు ఆ పేరెలా వచ్చింది? నదియా: తమిళ్లో తొలిచిత్రం ‘పూవే పూచూడవా’లో పాత్ర పేరు సుందరి. అంతకు ముందు మలయాళంలో పేరొచ్చినా, ఆ చిత్రంతో సౌత్‌లో పాపులరయ్యా. బహుశా, అందుకే ‘సుందరి ఆఫ్ సౌత్’ అని అంటారేమో. * క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంది? హీరోయిన్గా చేసిన ఫస్ట్ ఇన్నింగ్స్ కన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్నైన ఈ సెకండ్ ఇన్నింగ్స్నే ఆస్వాదిస్తున్నా. ‘అత్తారింటికి దారేది’ పుణ్యమా అని అందరూ మా అక్క, మా అత్త, మా అమ్మ ఇలా ఉంటే బాగుండుననుకుంటున్నారు. పురుషాధిక్యమెక్కువ, హీరోయిన్ల షెల్ఫ్‌లైఫ్ తక్కువ ఉండే సినీ రంగంలో నా లాంటి మిడిల్ ఏజ్డ్ ఉమెన్ విజయంగా దీన్ని భావిస్తున్నా. * ఇప్పటికీ మీరు అందంగా ఉన్నారు. హీరోయిన్గా కూడా చేయచ్చేమో? (నవ్వేస్తూ) ఆ మాట అన్నవాళ్ళందరితో ‘అలాగైతే, నన్ను దృష్టిలో పెట్టుకొని నాకు కథ రాయండి’ అని అడుగుతుంటా. ఒకప్పుడు హీరోయిన్ ఒరియంటెడ్ ఫిల్మ్స్ చాలా వచ్చేవి. ఇప్పుడెన్ని వస్తున్నాయి! వయసును బట్టి, మారిన కాలాన్ని బట్టి మనమూ మారాలి. హీరోయిన్గా మొదలెట్టాం కాబట్టి, పాతికేళ్ళ తర్వాతా అవే పాత్రలు చేస్తామంటే ఎలా? * మీ అమ్మా నాన్నల గురించి చెప్పండి. వాళ్ళతో మీది బలమైన బంధమట? మా నాన్న గారి పేరు - ఎన్.కె. మొయిదు. ముస్లిమ్. అమ్మ పేరు- లలిత. హిందువు. ఇద్దరూ మలయాళీలే. ‘టాటాస్’ సంస్థలో పనేచేసేవారు. మా అమ్మానాన్నకు ఇద్దరు పిల్లలం - నేను, చెల్లెలు హసీనా. నా అసలు పేరు జరీనా మొయిదు. సినిమాల్లోకి వచ్చాకా నా బాగోగులన్నీ నాన్న గారే చూసుకొనేవారు. స్క్రిప్ట్‌లు నేను, ఆయన కలసి వినేవాళ్ళం, నిర్ణయం తీసుకొనేవాళ్ళం. మరీ గ్లామరస్ పాత్రలు, వాన పాటలుంటే నో చెప్పేస్తుండేవాళ్ళం. ఒక్క మాటలో - మై ఫాదర్ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ మి! హి ఈజ్ వెరీ స్పెషల్ టు మి. మా అమ్మ మాకు పెద్ద సెలైంట్ సపోర్టర్! * మరి, హీరోయిన్గా పీక్‌లో ఉన్నప్పుడే పెళ్ళిచేసుకొని, స్టేట్స్ వెళ్ళిపోయారేం? ముంబయ్‌లో చదువుకుంటున్న రోజుల్లోనే నాకూ, మా ఆయన శిరీష్ గోడ్బోలేకూ పరిచయం. ప్రసిద్ధ దర్శకుడు ఫాజిల్ వాళ్ళ బ్రదర్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. నేను కాలేజ్‌లో చదువుకొంటున్నప్పుడే ఫాజిల్ ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తూ, నన్ను ఆ పాత్ర చేయమన్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్ కావడం వల్ల ఆయనను నమ్మి, ఈ రంగంలోకి వచ్చా. అయితే, వచ్చినప్పుడే తెలుసు... పెళ్ళి చేసుకొని, ఈ రంగానికి దూరంగా వెళ్ళిపోతానని! పద్ధెనిమిదేళ్ళ వయసులో మలయాళ చిత్రం ‘నోక్కెత్త దూరత్తు కన్నుమ్ నట్టు’ (1984)తో వచ్చా. తొలి సినిమాకే ‘ఉత్తమ నటి’గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు వచ్చింది. అయిదేళ్ళు హీరోయిన్గా చేశా. శిరీష్ నిలదొక్కుకోగానే, పెళ్ళి చేసుకొని స్టేట్స్ వెళ్ళిపోయా. పదిహేనేళ్ళ గ్యాప్ తర్వాత తమిళ ‘ఎం కుమరన్ సన్నాఫ్ మహాలక్ష్మి’ (2004)తో మళ్ళీ వచ్చా. * ఇంతకీ మీ పేరును నదియా అని మార్చిందెవరు? నేను సినిమాల్లోకి వస్తున్నప్పటికే హిందీ నటి జరీనా వహాబ్ ఫేమస్. అందుకని నా పేరు మార్చారు. ఫాజిల్ గారి సోదరుడి వరుసయ్యే ఆయన మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పా కదా! ఆయనకు ఒక సిస్టర్ ఉండేది. నేను సినిమాల్లోకి వస్తున్నప్పుడు నిరంతరం ప్రవహించే నదిలా నా ప్రయాణం సాగిపోవాలని ఆమే నా పేరు ‘నదియా’ అని మార్చింది. * పెళ్ళితో హీరోయిన్గా అన్నీ వదులుకొని వెళ్ళిపోవడం కఠిన నిర్ణయమేనే! జీవితంలో తీసుకున్న కీలకమైన, తెలివైన నిర్ణయమదే. ఎందుకంటే, కెరీర్లో ఎంత పేరు తెచ్చుకున్నా, ఎంత సంపాదించినా వ్యక్తిగత జీవితమూ బాగుండాలి. అయామ్ ప్రౌడ్ దట్ ఐ మేడ్ ఎ రైట్ ఛాయిస్. * మరి, సినిమాల్లోకి మళ్ళీ ఎలా? దర్శకుడు రాజా ఎలా ఒప్పించారు? ఒకసారి సెలవులకి ముంబయ్‌కి వచ్చా. ఎలా తెలిసిందో ఏమో దర్శకుడు ‘జయం’ రాజా వాళ్ళు ఫోన్ చేసి, ఆ పాత్ర ఆఫర్ చేశారు. ముంబయ్ వచ్చి, తెలుగు మాతృక ‘అమ్మ.నాన్న..ఒక తమిళమ్మాయి’ సీడీ ఇచ్చారు. అందులో హుందాగా ఉన్న తల్లి పాత్ర చూసి, ఒప్పుకున్నా. * సినిమాల్లో కొనసాగినప్పుడు నిజజీవితంలో తల్లిగా ఎలా బ్యాలెన్స్ చేశారు? ఇప్పుడు మేము ముంబయ్‌కి షిఫ్ట్ అయిపోయాం. సినిమాల్లో నటిస్తున్నా, సెట్స్‌లో లేనంటే, ముంబయ్‌లో అందరు అమ్మల్లాగే ఇంటా, బయట పనులు చేసుకుంటూ ఉంటా. ఇప్పటికీ చాలా సెలెక్టివ్. ఏడాదికి ఒకటో, రెండో ఫిల్మ్స్ చేస్తున్నా. త్రివిక్రమ్ ‘అ..ఆ..’ నా 41వ సినిమా. * పదిహేనేళ్ళ గ్యాప్ మాట అటుంచితే, 31 ఏళ్ళ కెరీర్లో ఇన్ని సినిమాలేనా? చేసినవి కొన్నే అయినా, టైటిల్ రోల్స్. రజనీకాంత్, మోహన్‌లాల్, మమ్మూట్టి లాంటి అగ్ర హీరోలతో, గుర్తుండిపోయే పాత్రలు చేశా. అప్పట్లో నా సమకాలీన హీరోయిన్లయిన రాధ, రాధిక, అంబిక, రేవతి వందల సినిమాలు చేశారు. అయామ్ స్టిల్ ఎ జూనియర్! (నవ్వులు) * హిందీ హీరోయిన్గా చాన్స వస్తే వదిలేశారట? సుభాష్ ఘయ్ సహా కొంతమంది సంప్రతించారు. సల్మాన్‌ఖాన్ తొలినాళ్ళ సూపర్‌హిట్ ‘మై నే ప్యార్ కియా’కు హీరోయిన్గా నన్ను అడిగారు. నిర్మాతలైన బర్జాత్యాలు మా ఇంటికి కూడా వచ్చారు. కానీ, పెళ్ళికి సిద్ధమవుతున్న నేను వద్దనేశా. ఇప్పటికీ ఆ విషయం మా పిల్లలతో సరదాగా చెబుతూ, ‘సల్మానా? మీ డాడీనా?’ అంటే, ‘మీ డాడీకి ఓటేశా’ అంటూ ఉంటా. ‘మైనే క్యా కియా’ అని ఆట పట్టిస్తుంటా. * శిరీష్ గోడ్బోలేతో మీ ప్రేమకథ చెప్పలేదు! మేము ముస్లిమ్‌లం. వాళ్ళు మహారాష్ట్ర బ్రాహ్మణులు. ముంబయ్‌లో మా ఇళ్ళు కొద్ది దూరంలోనే ఉండేవి. కామన్ ఫ్రెండ్స్ వల్ల మా ఇద్దరికీ ముందు నుంచే పరిచయం. అప్పటికి నాకు 17 ఏళ్ళు. ఆయనకు 20 ఏళ్ళు. నేనింకా చదువుకుంటున్నా. చదువు, ఉద్యోగం కోసం శిరీష్ అమెరికా వెళ్ళినా మా ప్రేమ, స్నేహం కొనసాగింది. అప్పట్లో మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇ-మెయిల్స్ లేవు. ట్రంక్ కాల్ బుక్ చేయాలి. లేదంటే, ఉత్తరాలు. అలా మేము చాలా ఉత్తరాలే రాసుకున్నాం. మా ప్రేమ రెండువైపులా తెలిసింది. మా పెళ్ళి అయింది. * కులమతాలు తేడా. రాజీపడాల్సి వచ్చిందా? నేను, ఆయన ముంబయ్‌లో పెరిగినవాళ్ళం. మెట్రోపాలిటన్ ఆలోచనా దృక్పథం, మా సోషల్ సెటప్ ఒకేలా ఉండేవి. అందుకే, కుటుంబాలు బాగా కలిసిపోయాయి. నేను మరాఠీ ధారాళంగా మాట్లాడతా. మావారి ఇంట్లో చేసే ప్రతి పండుగ మనస్ఫూర్తిగా చేస్తా. మా అత్తమామల్ని ‘మాయి’ (అమ్మ), డాడీ అనే పిలుస్తా. * మరి, ఇంతకీ మీరు ఏ దేవుణ్ణి ప్రార్థిస్తారు? మా నాన్న గారు ముస్లిమ్ అయినా, మాకు ముస్లిమ్ పేర్లు పెట్టినా, మేమెప్పుడూ ఒకే మత ధర్మాన్ని అనుసరించలేదు. ఇప్పటికీ రాత్రి నిద్రపోయే ముందు మా నాన్న గారు నేర్పిన ఖురాన్‌లోని ప్రార్థనలు, మా అత్త గారింట్లో నేర్చుకున్న గణేశ్ హారతి, చిన్నతనంలో పారసీ స్కూల్లో నేర్చుకున్న పారసీ ప్రార్థనలు చేసి కానీ పడుకోను. అల్లా బిజీగా ఉంటే వినాయకుడు, ఆయన బిజీగా ఉంటే మరో పారసీ దేవుడు కాపాడతారని మా వాళ్ళతో సరదాగా అంటుంటా. * అప్పటికీ, ఇప్పటికీ పెంపకంలో తేడా? అప్పట్లో పిల్లలం అమ్మానాన్న ఏం చెబితే అది, ప్రశ్నలు వేయకుండా వినేవాళ్ళం. కానీ, ఈ తరం పిల్లలు ప్రశ్నలడుగుతారు. వాళ్ళకు లాజికల్‌గా జవాబివ్వాలి. అప్పటి తల్లితండ్రులు మంచి వక్తలైతే, ఇప్పటివాళ్ళు మంచి శ్రోతలవాలి. పిల్లల కష్టసుఖాలు విని, జవాబివ్వాలి. * మీ అందం, ఆహార, వ్యాయామ సీక్రెట్స్? (నవ్వేస్తూ) అనేక అంశాల కలయిక. ప్రధానంగా అమ్మానాన్నల జీన్స్ నుంచి వచ్చింది. బాగా వండుతా. బాగా తింటా. అందుకు తగ్గట్లే వ్యాయామం చేస్తా.రోజూ వాకింగ్, వెయిట్ ట్రైనింగ్, యోగా - మూడూ చేస్తా. నెగటివ్ ఎనర్జీకీ దూరంగా ఉంటా. వాట్సప్ మినహా ఏ సోషల్ మీడియాలోనూ లేను. ఐ కీప్ మై లైఫ్ సింపుల్. * మీ తాజా సినిమా గురించేం చెబుతారు? త్రివిక్రమ్ ‘అ...ఆ...’లో చేస్తున్నా. ఆయన సూపర్డెరైక్టర్. ఇది ఆయన శైలి మంచి రొమాంటిక్ కామెడీ. సమంతకు తల్లిగా మహాలక్ష్మిపాత్ర కొత్తగా ఉంటుంది. * జరీనాకూ, తెర జీవిత నదియాకూ తేడా? నటినైనా నేల విడిచి సాము చేయను. అందరిలా మామూలు మనిషిలా ఉంటా. ఒక్క మాటలో జరీనా, మిసెస్ గోడ్బోలే- ఒరిజినల్ జీవితం. నదియా - తెరపై అందరినీ నమ్మించే కల్పన. - రెంటాల జయదేవ అమ్మ-నాన్న-ఇద్దరు మరాఠీ అమ్మాయిలు * మా ఆయన శిరీష్ గోడ్బోలే అమెరికాలో చదువుకున్నారు. ప్రస్తుతం అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ‘మోర్గాన్ స్టాన్లీ’కి మేనేజింగ్ డెరైక్టర్. మా పెద్దమ్మాయి సనమ్‌కి 19 ఏళ్ళు. యూనివర్సిటీ ఆఫ్ అమెరికాలో లిబరల్ ఆర్ట్స్, ఆంత్రొపాలజీతో డిగ్రీ చేస్తోంది. ఇక, జానాకి 14 ఏళ్ళు. నైన్త్ గ్రేడ్ చదువుతోంది. * పెద్దమ్మాయి వెస్ట్రన్ మ్యూజిక్ సింగర్. చాలా సంగీత నాటకాల్లో పాల్గొంది. చిన్నమ్మాయికి డ్యాన్స్ ఇష్టం. హిప్హాప్, జాజ్ డ్యాన్స్ చేస్తుంది. ప్రస్తుతానికైతే పిల్లల దృష్టి చదువు మీదే! -
అవకాశాలొస్తే నటిస్తా
నటి రాజశ్రీని తమిళసినిమా అంత తొందరగా మరిచిపోయి ఉంటుందనుకోలేము. కారణం ప్రముఖ దర్శకుడు భారతీరాజా పరిచయం చేసిన కథానాయికల్లో ఈమె ఒకరు. 1994లో కరుత్తమ్మ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయిన రాజశ్రీ తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా రాష్ట్రప్రభుత్వ అవార్డును అందుకున్నాను. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించిన ఈమె హీరోయిన్‌గానూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. సినిమాలతో పాటు టీవీ సీరియళ్లలోనూ నటించి తన ప్రత్యేకతను చాటుకున్న రాజశ్రీ 60కి పైగా చిత్రాలు, 50కిపైగా సీరియల్స్ చేశారు. అయితే వివాహానంతరం నటనకు గ్యాప్ ఇచ్చిన రాజశ్రీ తాజాగా రీఎంట్రీ అయ్యారు. ఇంతకు ముందు బాలా దర్శకత్వం వహించిన నందా చిత్రంలో సూర్యకు తల్లిగా నటించి మెప్పించిన రాజశ్రీ ఇప్పుడు అదే దర్శకుడు బాలా నిర్మిస్తున్న తాజా చిత్రం చండీవీరన్ చిత్రంలో నటుడు అధర్వకు అమ్మగా నటించడం విశేషం. తల్లీ కొడుకుల అనుబంధం ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడదలకు సిద్ధం అవుతోంది.ఈ చిత్రం మళ్లీ చిత్రపరిశ్రమ దృష్టిని తనపై తిప్పేలా చేస్తుందనే నమ్మకాన్ని రాజశ్రీ వ్యక్తం చేస్తున్నారు. అలాగే మంచి అవకాశాలు వస్తే నటించడానికి సిద్ధం అని అన్నారు. -
అప్పటి నుంచి... సలహాలివ్వడం మానేశా!
సినీ రంగంలో ఆయన ఎవరికీ వారసుడిగా రాలేదు... ఎవరినీ వారసులు గానూ తీసుకురాలేదు. తొలి చిత్రమైన బి.ఎన్. రెడ్డి గారి ‘రంగుల రాట్నం’ నుంచి ఇప్పటి దాకా ఈ 50 ఏళ్లలో ఆయన హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా... వందల సినిమాలు చేశారు. వందల రోజుల సినిమాల నటుడిగా ప్రజాదరణ పొందారు. ఆరడుగుల ఆజానుబాహుడు కాకపోయినా, పక్కన నటించిన ప్రతి హీరోయిన్నూ తారాపథానికి చేర్చిన సెంటిమెంటున్న ఆ వెర్సటైల్ ఆర్టిస్ట్ - చంద్రమోహన్. సినీ దిగ్గజాలు కె. విశ్వనాథ్, ఎస్పీబీలకు బంధువు. మధ్యతరగతి మల్లంపల్లి చంద్ర శేఖరరావు నుంచి ఈ స్థాయికి ఎదిగిన ఆయన మామూలుగా మీడియాకు దూరం. ఇంటర్వ్యూలకు ఇంకా... దూరం. సినీరంగానికొచ్చి 50వ ఏట అడుగిడిన చంద్రమోహన్ చాలా కాలం తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూ ఇదే. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మనసు విప్పి పంచుకున్న మాటలు... తెలియని కోణాలు... చేదు నిజాలు... తీపి కబుర్లు... ఈ ఆదివారం ‘సాక్షి ఫ్యామిలీ’ గిఫ్ట్. పులగం చిన్నారాయణ ఎలా ఉన్నారండీ? కులాసాగా ఉన్నా. గత నెల కొంత ఇబ్బందై, ఆసుపత్రిలో చేరా. మీడియాలో ఏవేవో వార్తలొచ్చాయి. అవన్నీ తప్పు. అయావ్‌ు ఆల్రైట్. మళ్ళీ ఉత్సాహంగా మేకప్‌తో కెమేరా ముందుకొచ్చా. మీరు ఫస్ట్ మేకప్ వేసుకుంది 1966 మార్చి 16న. అంటే, యాక్టర్‌గా 50వ ఏట ప్రవేశించారన్నమాట. (నవ్వేస్తూ...) అవును. నిజమే. సినీరంగానికొచ్చి, అప్పుడే 50 ఏళ్ళయిందా అనిపిస్తోంది. మేకప్ వేసుకున్న తొలి రోజుల్ని గుర్తు చేసుకుంటారా? నటుణ్ణి కావాలని నేనెప్పుడూ కలలు కనలేదు. కనీసం ప్రయత్నం చేయలేదు. రంగస్థలం మీద ఒక పాత్ర కూడా చేయలేదు. సినిమా రంగంలోకి అనుకోకుండానే ప్రవేశించా. నటుడు ముదిగొండ లింగమూర్తి గారికి మా బావ గారు బాగా తెలుసు. దర్శక - నిర్మాత బి.ఎన్. రెడ్డి గారు కొత్తవాళ్ళతో సినిమా ప్లాన్ చేస్తున్నారని లింగమూర్తి గారి ద్వారా మా బావ గారికి తెలిసి, నా ఫోటోలు ఇచ్చారు. అలా రెడ్డి గారికి నా గురించి తెలిసి, మద్రాసు రమ్మన్నారు. స్క్రీన్ టెస్ట్ చేసి, సెలక్ట్ చేశారు. అన్నీ ఒకదాని వెంట ఒకటి కాకతాళీయంగా జరిగిపోయాయి. కాకతాళీయంగా మొదలైనా కొన్ని వందల సినిమాలు విజయవంతంగా చేశారు. కానీ, ఈ మధ్య సినిమాలు చేయడం తగ్గించేసినట్టున్నారు? అవును. రెస్పెక్ట్ ప్రాబ్లమ్... రెమ్యూనరేషన్ ప్రాబ్లమ్. నాకే కాదు, నా లాంటి సీనియర్లు అందరిదీ ఇదే పరిస్థితి. అందుకే సినిమాలు తగ్గించుకోవడం ఉత్తమం అనిపించింది. ఓ జీవితం చూసేశాం. మిగిలిన కాలాన్ని సొంతానికి ఉపయోగించుకోవడం ఉత్తమమనిపించింది. ఒకప్పుడు చాలా బిజీగా ఉండి, ఇప్పుడు ఖాళీగా ఉండడమంటే కష్టం కాదా? ఆస్తుల వ్యవహారాలు, అకౌంట్స్ అన్నీ స్వయంగా చూసుకుంటా. వాటిల్లో పడి మధ్యాహ్నం నిద్ర పోవడానికి కూడా తీరిక దొరకడం లేదు. షూటింగ్స్ ఉంటేనే హైదరాబాద్ వస్తా. లేకపోతే నేను చెన్నైలో బిజీనే! మీ ఫ్యామిలీ గురించి చెప్పండి? నా సతీమణి జలంధర. ఆమె గురించి తెలుగు వాళ్లందరికీ తెలుసు. చాలా మంచి రచయిత్రి. ఎన్నో కథలు, నవలలు రాసింది. మా పెళ్లి కాకముందు నుంచే రచనలు చేస్తోంది. నాకు కోపమెంత ఎక్కువో, ఆమెకు సహనం అంత ఎక్కువ. దేవుడు ఆమెకు అంత సహనం ఇచ్చింది, నా కోపాన్ని తగ్గించడానికేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. మాకు ఇద్దరమ్మాయిలు. పెళ్లిళ్లయిపోయాయి. హ్యాపీ లైఫ్. పెద్దమ్మాయి మధుర మీనాక్షి సైకాలజిస్టు. ఆమె భర్త బ్రహ్మ అశోక్ ఫార్మసిస్టు. అమెరికాలో స్థిరపడ్డారు. చిన్నమ్మాయి మాధవి వైద్యురాలు. ఆమె భర్త నంబి కూడా డాక్టరే. చెన్నైలోనే ఉంటున్నారు. ఈ పిల్లల పెంపకం, వాళ్ల చదువులు, ఇంటి వ్యవహారాలు - అన్నీ నా భార్యే చూసుకుంది. అందుకే నా కెరీర్ హ్యాపీగా సాగిపోయింది. బంధువుల ఫంక్షన్లకు కూడా మా ఆవిడే వెళ్లేది. మరి ఇప్పుడైనా ఫంక్షన్లకు మీరు వెళ్తున్నారా? అప్పట్లో ఎక్కువ అవుడ్డోర్ షూటింగ్స్‌లో ఉండేవాణ్ణి కాబట్టి, ఫంక్షన్లకు వెళ్లడం కుదిరేది కాదు. ఇప్పుడు వెళ్తున్నాను. అలాగే జలంధరకు గుళ్లకూ, గోపురాలకూ వెళ్లడం ఇష్టం. నాకు పెద్ద ఆసక్తి ఉండదు. అయితే, ఆమె కోసం అప్పుడప్పుడూ వెళ్తుంటాను. మీ సొంత ఊరు పమిడిముక్కల (కృష్ణా జిల్లా) వెళుతుంటారా? అప్పుడప్పుడూ వెళుతుంటా. నాకో తమ్ముడున్నాడు. ఊళ్లో వ్యవసాయం చేస్తుంటాడు. వాడు కాక నాకు ఆరుగురు అక్కయ్యలు, ఇద్దరు చెల్లెళ్లున్నారు. అందులో ఇప్పుడు నలుగురే మిగిలారు. అసలు... మీ కుటుంబంలో ఎవరైనా నటులున్నారా? నా ముందెవరూ లేదు. నా తర్వాతా లేరు. శోభన్‌బాబు, నేను, మురళీమోహన్... మేం ముగ్గురం ఒకటే టైప్. మా ఫ్యామిలీల నుంచి ఎవరూ సినిమా వారసులు రాలేదు. శోభన్‌బాబు, మురళీ మోహన్‌లు వాళ్లబ్బాయిల్ని హీరోలుగా చేయాలనుకుంటే ఎంతసేపు చెప్పండి. నాకు మగ పిల్లలు లేరు కానీ, ఉన్నా వాళ్ళకు ఆసక్తి లేకపోతే రానిచ్చేవాణ్ణి కాదు. నటన మా ఫ్యామిలీలో నాతో మొదలైంది. నాతోనే ముగుస్తుంది! ఇంటర్వ్యూలివ్వడానికి ఎందుకని ఆసక్తి చూపించరు? కెరీర్ ప్రారంభంలో అయితే వాటి వల్ల కొంత హెల్ప్ ఉండేది. ఇప్పుడైతే అస్సలు అవసరం లేదు. వాటివల్ల ప్రపంచానికి కొత్తగా మా గురించి తెలిసేదీ లేదు. నాకు ఉపయోగం లేని పని నేనెప్పుడూ చేయను! పబ్లిక్ ఫంక్షన్లకూ వెళ్లను. మాట్లాడలేక కాదు. మాట్లాడితే నిజాలు మాట్లాడు కోవాలి. అది ఎవరూ భరించలేరు. ఎందుకు ఒకరినొకరు పొగుడుకోవడానికి వేదికలెక్కడం?! సినీసీమలో హిపోక్రసీ ఎక్కువ. మీరేమో అన్నీ మొహం మీదే.. దానివల్ల ఇబ్బంది పడ్డా. ముందొక మాట, వెనుక ఒక మాట మాట్లాడడం నాకు ఇష్టముండదు. ‘ఆ చెప్పేదేదో లౌక్యంగా చెప్పొచ్చుగా’ అని ఇంట్లో అనేవాళ్లు. కొన్నాళ్లు ట్రై చేసి, ఫెయిలయ్యా. మీపై కోపిష్ఠి అనే బ్రాండ్ కూడా ఉంది! అవును. నాకు చాలా టెంపర్ ఎక్కువ. అయితే ఆ కోపం అనవసరంగా రాదు. అకారణంగా రాదు. నా మంచితనాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుంటేనే కోపం వస్తుంది. అయినా నన్ను అర్థం చేసుకున్నవాళ్లు... నా కోపాన్నీ అర్థం చేసుకుంటారు. కొంచెం హైట్ ఉంటే బావుండేదని అనుకున్నారా? హీరోయిన్స్ పక్కన పొట్టిగా కనబడడం వల్ల కొన్ని అవకాశాలు కూడా పోయాయి. మొదట్లో ఫీలయ్యాను కానీ, తర్వాత దాని గురించి ఆలోచించడం మానేశా. ఎవరికి రావాల్సిన అవకాశాలు వాళ్లకు వస్తాయి. బేసిక్‌గా ఈ హైట్ నన్ను ఒక ఇమేజ్‌కి పరిమితం కాకుండా చూసింది. ‘శంకరాభరణం’ నాటికి మీరు పాపులర్ హీరో అయినా గెస్ట్‌గా చేశారేం? ‘శంకరాభరణం’లో నేను, ఒకరిద్దరు తప్ప మిగిలినవాళ్లంతా కొత్తవాళ్లే. మొదట నా పాత్రకు కొత్త కుర్రాణ్ణే అనుకున్నారు. కానీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు మాత్రం ఆ పాత్రను నాతో చేయించాలని ఉంది. నేను చేస్తే సినిమాకు ప్లస్ అవుతుంది. దానికి తోడు కె. విశ్వనాథ్ దర్శకత్వంలో అప్పటికే నేను ‘ఓ సీత కథ’, ‘సిరిసిరి మువ్వ’, ‘సీతామాలక్ష్మి’, ‘శుభోదయం’ సినిమాలు చేశాను. అన్నీ హిట్లే. అందుకే మా కాంబినేషన్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని నిర్మాత ఆశ. కె.విశ్వనాథ్ గారేమో కొత్తవాడయితేనే కరెక్ట్. ఇతను చేస్తే మైనస్ అవుతుందన్నారాయన. కానీ నిర్మాత బలవంతంగా ఒప్పించారు. నన్ననుకున్న తర్వాత ఐదారు సీన్లు పెంచారు. మళ్లీ విశ్వనాథ్ దర్శకత్వంలో చేయలేదెందుకని? ఈ ప్రశ్న మీరు విశ్వనాథ్‌ని అడగాలి. ‘స్వాతి ముత్యం’ మొదట నాతోనే చేద్దామనుకున్నారు. లైన్ కూడా చెప్పారు. అందులో నా పాత్రకి తోడుగా ఓ ఉడత కూడా ఉంటుంద న్నారు. నా బాధలన్నీ నేను ఉడతతో పంచుకుంటానన్న మాట. దాని కోసం నేను ఒక అడవి ఉడతను పెంచుకున్నాను కూడా! తర్వాత ఆ సినిమా కమల్ హాసన్‌తో తీశారు. అందులో హీరోకి కోపం వస్తే చెయ్యెత్తి కొట్టినట్టుగా ఓ మేనరిజం ఉంటుందిగా. అది నా ఆలోచనే. మా కజిన్‌కి ఆ అలవాటుంది. కథ చెబితే, ఈ మేనరిజమ్ నేనే చెప్పా... కానీ, కమల్ అద్భుతంగా చేశాడు. మీ పక్కన చేస్తే కథానాయికలు తారాపథానికి చేరుకుంటారని...! అవును. మొదట్లో సెంటిమెంట్, తర్వాత అలవాటుగా మారింది. వాణిశ్రీ, లక్ష్మి, చంద్రకళ, జయప్రద, శ్రీదేవి, రాధిక, జయసుధ, విజయశాంతి, రాధ, తులసి, పూర్ణిమ... ఇలా ఎందరో నా పక్కన నటించి, ఆ తర్వాత నాకే అందనంత ఎదిగిపోయారు. మీ కెరీర్లో ఎక్కడా గ్యాప్ రానట్టుంది? అవును. 50 ఏళ్లుగా నిర్విరామంగా నటిస్తున్నా. అప్పట్లో హీరో వేషాలు వేశా. ఇప్పుడు తండ్రి పాత్రలు చేస్తున్నా. ఈవీవీ గారి ‘ఆమె’లో ముగ్గురు పిల్లల తండ్రిగా చేశా. అప్పటికి నాకు హీరో వేషాలొస్తున్నాయి. కానీ నా పొజిషన్, నా మార్కెట్ గురించి నాకు అవగాహన ఉంది. గుమ్మడిగారు, కైకాల సత్యనారాయణగారు అప్పటికే పెద్దవాళ్లయి పోయారు. తండ్రి పాత్రలకు స్లాట్ ఖాళీగా ఉంది. శోభన్‌బాబు సినిమాలకు దూరంగా ఉన్నాడు. కృష్ణ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు. ఇక మిగిలింది నేను. మార్పు అవసరమని అర్థమైంది. మొదట ఇలాంటి ఆఫరిచ్చింది ముత్యాల సుబ్బయ్యగారు ‘కలికాలం’లో. తర్వాత ‘ఆమె’. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాక ఏమైనా మార్పులు కనిపెట్టారా? మా తరానికీ ఈ తరానికీ చాలా తేడాలున్నాయి. అప్పట్లో మేమంతా మా సీనియర్లను గౌరవించేవాళ్లం. ఇప్పుడలా లేదు. హీరోకి ఏమైనా సలహా ఇస్తే ‘నీ పని నువ్వు చూసుకోవయ్యా’ అంటున్నారు. ఒకసారి నాకలాంటి సందర్భం ఎదురైంది. అప్పట్నుంచీ సలహాలివ్వడం మానేశా. మీకు పారితోషికాలు ఎగ్గొట్టిన సందర్భాలున్నాయా? ఎగ్గొట్టేవాళ్లు కొందరైతే, మధ్యలో నొక్కేసేవాళ్లు మరికొందరు. అందుకే డబ్బులిస్తేనే చేస్తానని ముందే చెప్పేస్తుంటా. కొన్ని నేను మాత్రమే చేసేవి ఉంటాయి. అలాంటి వాటికి డబ్బు తక్కువైనా చేస్తాను. ఫైనల్‌గా సినిమా ఇండస్ట్రీలో డబ్బుకే ప్రాధాన్యం అంటారు? నేనేంటి... ప్రపంచమంతా అదే చెబుతుంది! కాంతారావుగారు ఎంత గ్రేట్ ఆర్టిస్టు! అలాంటాయన ఆఖరి స్టేజ్ ఎలా గడిచిందో తెలుసు కదా! ఓసారి కీసరగుట్టలో షూటింగ్ జరుగుతోంది. ఆయనకూ వేషం ఉంది. ఆయన్ని తీసుకొచ్చి అక్కడ పడేశారు కానీ, ప్రొడక్షన్ వాళ్లు పట్టించుకోలేదు. చివరకు నా రూమ్‌లో కూర్చోబెట్టుకున్నా. అలాగే నాగయ్యగారి ఉత్థాన పతనాలు చూశా. ఒకప్పుడు లక్ష రూపాయలు తీసుకున్న హీరో ఆయన. చివరకు 500 రూపాయలక్కూడా వేషం వేసేవారు. రాజనాల, పద్మనాభం... ఇలా చాలామందిని చూశా. అందుకే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటాను. ఉండాలి. ఇక్కడ వేషం ఉంటేనే డబ్బు. ప్రతిరోజూ పోరాడాలి. పెన్షనూ రాదు. గ్యారంటీ లేని లైఫ్. ఏ అసోసియేషనూ పట్టించుకోదు. కొంతమంది దహన సంస్కారాలకు చందాలేసుకోవాల్సి వస్తోంది. ఒకప్పుడు వాళ్ల ఆటో గ్రాఫ్‌ల కోసం ఎంతోమంది ఎగబడి ఉంటారు. అంటే, ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. కన్నాంబ, భానుమతి, ఎస్వీఆర్లను మించిన ఆర్టిస్టులున్నారా? వాళ్ల గురించి ఈ తరానికి తెలియదు. మా మనవరాళ్లకి నేనే సినిమా ఆర్టిస్టునని తెలియదు. అవార్డుల విషయంలో మీకు అన్యాయమే జరిగినట్టుంది? ‘పద్మశ్రీ’ ఎప్పుడైతే సావిత్రి, అంజలీదేవి, ఎస్.వి. రంగారావు, గుమ్మడి, కైకాలను వదిలేసి జూనియర్స్‌కి ఇచ్చారో అప్పుడే వాటి గురించి ఆలోచించడం మానేశా. మీ ఫేవరెట్ యాక్టర్లు ఎవరు? శివాజీ గణేశన్‌గారి యాక్టింగ్ అంటే నాకు బాగా ఇష్టం. ఆయనతో కలిసి ‘అండమాన్ కాదలి’ అనే సినిమా చేయగలగడం నా అదృష్టం. తెలుగులో ఈ సినిమాను ఏయన్నార్గాను ‘అండమాన్ అమ్మాయి’గా చేశారు. రెండింటిలోనూ నాది కొడుకు పాత్రే. శివాజీ గణేశన్‌గారితో కలిసి సీన్లు చేసినప్పుడు కొంత భయం వేసింది. తెలుగు లిపిలో తమిళ డైలాగులు రాసిస్తే చెప్పాను. ‘శ్రీ షిర్డీసాయిబాబా మహాత్మ్యం’లో నేను చేసిన నానావలి పాత్ర చూసి ‘ఊర్వశి’ శారద గారు ‘‘నీలో శివాజీ గణేశన్ కనిపిస్తున్నాడు’’ అన్నారు. ఆ నడక, ఆ డైలాగ్ డెలివరీ అచ్చం అలాగే అనిపించాయట. నాకు కూడా సినిమా చూస్తున్నప్పుడు అదే ఫీలింగ్ అనిపిం చింది. అది నాకు తెలియకుండానే వచ్చేసిన ట్టుంది. ఇమిటేట్ మాత్రం చేయలేదు. ఎమ్.జి. రామచంద్రన్ గారితో ఆయన తమ్ముడిగా ‘నాళై నమదే’లో చేశా. కన్నడంలో, మలయాళంలో ఒక్కో సినిమా చేశా. హిందీ చెయ్యలేదు. మీరు మంచి భోజన ప్రియులట? సినిమా ఫీల్డ్కొచ్చాకనే భోజన ప్రియుణ్ణి అయ్యా. ఇంట్లో అయితే ఒకటి, రెండు కూరలే ఉంటాయి. అదే షూటింగ్స్‌లో అయితే రకరకాలు పెడుతుంటారు. నేను ఇంట్లో నాన్ వెజ్ తినను కానీ, బయట తింటాను. ఫుడ్ కంట్రోల్ ఎప్పుడూ లేదు. ఇది తినాలి, ఇది తినకూడదనే నిబంధనలు ఎప్పుడూ లేవు. ఓసారి ఏయన్నార్‌గారు ‘‘ఈ తిండికి లావు అవ్వాలి. ఇలా బాడీ ఎలా మెయింటెయిన్ చేస్తున్నావు?’’ అనడిగారు. ఎంత తిన్నా అప్పట్లో బాడీ పెరగలేదు. ఎపుడైనా నిర్మాత అవ్వాలనే ఆలోచన రాలేదా? రాలేదు... రాబోదు. చాలామంది నిర్మాతల పరిస్థితి చూశా కదా. మీ ఫేవరెట్ యాక్టర్లు ఎవరు? శివాజీ గణేశన్‌గారి యాక్టింగ్ అంటే నాకు బాగా ఇష్టం. ఆయనతో కలిసి ‘అండమాన్ కాదలి’ అనే సినిమా చేయగలగడం నా అదృష్టం. తెలుగులో ఈ సినిమాను ఏయన్నార్గాను ‘అండమాన్ అమ్మాయి’గా చేశారు. రెండింటిలోనూ నాది కొడుకు పాత్రే. శివాజీ గణేశన్‌గారితో కలిసి సీన్లు చేసినప్పుడు కొంత భయం వేసింది. తెలుగు లిపిలో తమిళ డైలాగులు రాసిస్తే చెప్పాను. ‘శ్రీ షిర్డీసాయిబాబా మహాత్మ్యం’లో నేను చేసిన నానావలి పాత్ర చూసి ‘ఊర్వశి’ శారద గారు ‘‘నీలో శివాజీ గణేశన్ కనిపిస్తున్నాడు’’ అన్నారు. ఆ నడక, ఆ డైలాగ్ డెలివరీ అచ్చం అలాగే అనిపించాయట. నాకు కూడా సినిమా చూస్తున్నప్పుడు అదే ఫీలింగ్ అనిపిం చింది. అది నాకు తెలియకుండానే వచ్చేసిన ట్టుంది. ఇమిటేట్ మాత్రం చేయలేదు. ఎమ్.జి. రామచంద్రన్ గారితో ఆయన తమ్ముడిగా ‘నాళై నమదే’లో చేశా. కన్నడంలో, మలయాళంలో ఒక్కో సినిమా చేశా. హిందీ చెయ్యలేదు. మీరు మంచి భోజన ప్రియులట? సినిమా ఫీల్డ్కొచ్చాకనే భోజన ప్రియుణ్ణి అయ్యా. ఇంట్లో అయితే ఒకటి, రెండు కూరలే ఉంటాయి. అదే షూటింగ్స్‌లో అయితే రకరకాలు పెడుతుంటారు. నేను ఇంట్లో నాన్ వెజ్ తినను కానీ, బయట తింటాను. ఫుడ్ కంట్రోల్ ఎప్పుడూ లేదు. ఇది తినాలి, ఇది తినకూడదనే నిబంధనలు ఎప్పుడూ లేవు. ఓసారి ఏయన్నార్‌గారు ‘‘ఈ తిండికి లావు అవ్వాలి. ఇలా బాడీ ఎలా మెయింటెయిన్ చేస్తున్నావు?’’ అనడిగారు. ఎంత తిన్నా అప్పట్లో బాడీ పెరగలేదు. ఎపుడైనా నిర్మాత అవ్వాలనే ఆలోచన రాలేదా? రాలేదు... రాబోదు. చాలామంది నిర్మాతల పరిస్థితి చూశా కదా. -
నా జీవితమే ఓ పుస్తకం
బుల్లితెర నటి ప్రీతినిగమ్ ‘సంతోషం’, ‘స్టూడెంట్ నంబర్-1’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఖ్యాతిగాంచిన ప్రీతినిగమ్‌ను గుర్తుపట్టారా? వెండితెర కంటే బుల్లితెరపై తళుక్కున మెరిసిన తార ఆమె. అద్భుతమైన పాత్రలతో మహిళాభిమానులను సంపాదించుకున్న ప్రీతి తన జీవితమే ఒక పుస్తకం అంటున్నారు. కౌతవరంలో బుధవారం జరిగిన లఘు చిత్రాల షూటింగ్‌కు వచ్చిన ఆమె కొద్దిసేపు ‘సాక్షి’తో మాట్లాడారు. - కౌతవరం (గుడ్లవల్లేరు) తెలుగులో మీకు పేరు తెచ్చిన సీరియల్స్..? కస్తూరి, రుతురాగాలు, ఆడది, కావ్యాంజలి, ఎండమావులు, చక్రవాకం, చంద్రముఖి, శ్రావణ సమీరాలు, స్వాతి చినుకులు. సాక్షి : మీ జీవితంలో సాధించిన విజయాలు? ప్రీతి : మొదట్లో నాకు ఈత రాదు. 30ఏళ్ల వయసులో నేర్చుకున్నా. గుర్రపు స్వారీ నేర్చుకోవాలని ఉంది. వంట, ఇంటి పనులు కూడా అందరి మహిళల్లా చేస్తాను. న్యూస్‌రీడర్‌గా కూడా పనిచేశాను. లండన్, మారిషస్, పారిస్, యూఎస్ఏ వంటి దేశాల్లో నృత్యంలో వేలాది ప్రదర్శనలు ఇచ్చాను. విద్యార్థి దశలో ఎన్సీసీ, ఫొటోగ్రఫీ, టీటీసీలో కూడా శిక్షణ పొందాను. సాక్షి : సీరియల్స్‌లో లేడీ విలన్‌గా నటించడంపై మీ స్పందన.. ప్రీతి : ప్రేక్షకులు నన్ను తిట్టుకుంటేనే నేను బాగా నటించినట్లు. సాక్షి : మీ కుటుంబ నేపథ్యం ఏమిటీ? ప్రీతి : మాది హైదరాబాద్. అమ్మానాన్న ఇద్దరూ ఉపాధ్యాయులే. భర్త నగేష్‌ది అమలాపురం. ఆయన కూడా నాతో పాటు సీరియల్స్‌లో నటిస్తున్నారు. పాప అతిథిశ్రీ, బాబు ఆర్యన్. సాక్షి : బుల్లితెరలోకి ఎలా అడుగుపెట్టారు. ప్రీతి : నేను డ్యాన్సర్‌ని. సీరియల్స్‌లో నటులకు కూచిపూడి, కథక్, ఫోక్ డ్యాన్సులపై శిక్షణ ఇచ్చేదాన్ని. నా కళ్లు పెద్దవిగా ఉంటాయని సీరియల్స్‌లో నటించమని అడిగారు. తొలిసారిగా 1989లో ‘అంబేద్కర్ డాక్యుమెంటరీ’లో బాల్యంలో ఉన్న అంబేద్కర్‌కు అత్తగా నటించా. సాక్షి : డ్యాన్స్‌లో మీ గురువులు ఎవరు? ప్రీతి : కూచిపూడిలో అనిల్‌కుమార్, కథక్ ఏవీ శ్రీధర్ దగ్గర నేర్చుకున్నాను. సాక్షి : ఇప్పటివరకు ఎన్ని సీరియల్స్‌లో నటించారు? ప్రీతి : వందకుపైగానే. తొలి డైలీ సీరియల్ ‘రుతురాగాలు’. అప్పట్లో హిందీ సీరియల్లో కూడా చేశాను. సాక్షి : తొలి సినిమా? ప్రీతి : డెరైక్టర్ శ్యామ్‌బెనగల్‌తో నటించాలని ప్రతి బాలివుడ్ నటికీ ఉంటుంది. ఆయన డెరైక్షన్‌లో 20ఏళ్ల క్రితమే హిందీ ఆర్ట్ ఫిల్మ్‌లో నటించా. హరీబలీ, వెల్డనబ్బా, సంక్రాంతి హిందీ సినిమాల్లో నటించాను. తెలుగులో నా మొదటి సినిమా ‘స్టూడెంట్ నంబరు 1’ సాక్షి : ఇంకా ఏయే సినిమాలు చేశారు.. ప్రీతి : సంతోషం, శ్రీరామ్, ఔను వాళ్లిద్దరూ ఇష్ట పడ్డారు, సై, కబడ్డీ కబడ్డీ, ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమాల్లో నటించా. ఉర్దూలో ఇటీవల నటించిన ‘ఇన్కీ ఐసీకీతైసీ’ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ నెల 14న స్టెప్నీ అనే మరో సినిమా విడుదల కానుంది. అలాగే, ‘ఐలమ్మ’ పేరిట తెలంగాణలో ఓ సందేశాత్మక రియల్ స్టోరీతో సినిమా విడుదలైంది. సాక్షి : కొత్తనటులకు మీరిచ్చే సందేశం? ప్రీతి : అబద్ధంలో కాకుండా నిజంలో బతకాలి. సంస్కృతీ సంప్రదాయాల్ని మట్టు పెట్టే విధంగా నాగరికత పేరిట విచ్చలవిడిగా మారకూడదు. -
‘ముహూర్తం’ కుదిరింది.. క్యారెక్టర్ దొరికింది
సినిమాలు అంటే పిచ్చి. నటనంటే ప్రాణం. అందుకే ఆ యువకుడు హైదరాబాద్ రెలైక్కాడు. అవకాశం కోసం ఫిలింనగర్, జూబ్లీహిల్స్‌తో పాటు సినీస్టార్స, స్టూడియోలుండే ప్రతి చోటుకు వెళ్లాడు. అంతటా నిరాశే. ఇంటిబాట తప్పలేదు. కుటుంబ సభ్యులతో కొంత డబ్బు ఇప్పించుకుని మళ్లీ చలో భాగ్యనగరం. ఈ సారి ఓ ఫిలిం ఇన్సిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఇండస్ట్రీ వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. కట్ చేస్తే ఒక కెమెరామెన్ సాయంతో ముహూర్తం అనే సినిమాలో అవకాశం లభించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చాన్స కొట్టేశాడు. అలా మొదలైన సినీ ప్రయాణంలో ఎన్నో కష్టాలు.. అయినా ఎదురీదుతున్నాడు. * మంచి నటుడిగా స్థిరపడాలన్నదే నా లక్ష్యం * సినీ, టీవీ ఆర్టిస్ట్ వెంకట ఎమ్మిగనూరు టౌన్: వెంకట గోవిందురాజు అలియాస్ వెంకట 14 ఏళ్లక్రితం ఎమ్మిగనూరుకు ఎస్ఎంటీ కాలనీలో నివాసం ఉండేవారు. తల్లిదండ్రులు రంగయ్య, సుభద్రమ్మలు. తండ్రి చేనేత సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం (వైడబ్ల్యూసీఎస్)లో చిరుద్యోగి. స్థానిక వీవర్స్‌కాలనీ హైస్కూల్లో వెంకట పదో తరగతిదాకా చదివాడు. పుస్తకాల కన్నా సినిమా సీన్లే ఆయన కళ్లలో కదలాడేవి. అలా చదువుకు శుభం కార్డు పడింది. తర్వాత సినిమాల్లో నటించాలని హైదరాబాద్ బయల్దేరాడు. అవకాశాల కోసం ప్రారంభంలో నాలుగేళ్లు కడుపుకాల్చుకొని స్టూడియోలు, దర్శకుల చుట్టూ తిరిగారు. అయినా ఫలితం లేదు. దీంతో మళ్లీ ఊరికొచ్చాడు. కుటుంబ సభ్యులతో కొంత మొత్తాన్ని తీసుకువెళ్లి అభినయ ఫిలిం ఇన్సిట్యూట్‌లో ఆరు నెలలు పాటు శిక్షణ పొందాడు. అక్కడ కొద్ది మంది డెరైక్టర్లు, కెమెరామెన్లతో పరిచయం ఏర్పడింది. బంగారు చౌదరి అనే కెమెరామెన్ ‘ముహూర్తం’ అనే సినిమాలో దర్శకుడు మూర్తికి చెప్పి చిన్న వేషం ఇప్పించారు. తర్వాత సీతయ్య, బాబీలో జూనియర్ ఆర్టిస్టుగా నటించారు. ఆపై అవకాశాలు రాలేదు. టీవీ రంగం వైపు అడుగులు వేశారు. వివిధ టీవీ చానల్స్‌లో ప్రసారమైన లక్ష్యం, మిస్టర్ రోమియో, తూర్పుపడమర, ఏడు అడుగులు, శ్రీమతి శ్రీ దేవత తదితర సీరియల్స్‌లో క్యారెక్టర్ అర్టిస్టుగా నటించారు. కానీ తిరిగి సినిమా వైపు మనస్సు మొగ్గుచూపడంతో 1940 ఒక గ్రామంలో, అదేనీవు..అదేనేనులో హీరో శశాంక్‌కు మిత్రుడిగా, రైల్వేస్టేషన్, కోయిల, అమ్మనాన్న ఊరెళితే, తమాషా, నాకంటూ ఒకడు, శ్రీమతి కల్యాణం సినిమాల్లో నటించారు. ఇటీవల స్వాతి చినుకులు (ఈటీవీ), సీరియల్లో సేల్స్‌మెన్‌గా నటించారు. సినిమా అల్లుడు (జెమినీ టీవీ)లో ఫైనాన్సియర్‌గా నటించారు. డిసెంబర్ నుంచి ఆ సీరియర్ ప్రారంభం కానుంది. పస్తుతం కన్నడ, తెలుగులో నిర్మిస్తున్న దండు, కడప ముద్దుబిడ్డ సినిమాల్లో నటించానని, అవి రిలీజ్ కావాల్సి ఉందని వెంకట పేర్కొన్నారు. ఇప్పటి వరకు 20కు పైగా సినిమాల్లో చిన్నచిన్న వేషాల్లో నటించానని, మున్ముందు దర్శక, నిర్మాతలు అవకాశాలు ఇస్తే తన టాలెంట్‌ను నిరూపించుకుని క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలో స్థిరపడేందుకు శ్రమిస్తానని ఆయన తన మనసులో మాట చెప్పారు. -
నటరాజు.. ఈ గౌతంరాజు
ఇంటర్వ్యూ ఘరానామొగుడు, ఇంద్రుడు చంద్రుడు, శంకర్‌దాదా ఎంబీబీఎస్ వంటి సినిమాల్లో హాస్యం పండించటమే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో ప్రశంసలు అందుకున్న గౌతంరాజు.. విలక్షణ నటుడిగా పేరు సంపాదించారు. హాస్యమే కాదు.. బీభత్సం సృష్టించే ప్రతి నాయకుడి క్యారెక్టర్లోనూ ఆయన ఇట్టే ఒదిగిపోతారు. ప్రస్తుతం తనయుడు చిరంజీవి కృష్ణంరాజు (కృష్ణ)ను హీరోగా పరిచయం చేసే పనిలో నిమగ్నమయ్యూరు. కౌతవరంలో షూటింగ్ జరుపుకొంటున్న ‘ఈ నేల-ఈ గాలి’ సీరియల్లో మైనర్ బాబుగా నటిస్తున్న ఆయన ఆదివారం కొద్దిసేపు ‘సాక్షి’తో మాట్లాడారు. - గుడ్లవల్లేరు (కౌతవరం) 1980లో సినీ రంగప్రవేశం మాది తూర్పుగోదావరి జిల్లా రాజోలు. నాన్న కృష్ణంరాజుకు ఉన్న వ్యాపార సంబంధాల వల్ల కాకినాడలో స్థిరపడ్డాం. 1980లో శ్రీధర్, సంగీత తారాగణంతో నిర్మించిన ‘పుణ్యభూమి కళ్లు తెరిచింది’ అనే సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాను. నాల్గో తరగతి నుంచే నాటికలు, నాటకాలు వేసేవాళ్లం. స్త్రీ పాత్ర లేని నాటకల్ని ఎన్నుకునేవాళ్లం. నన్నంతా రాజేంద్రప్రసాద్‌లా నటిస్తున్నానంటారు. అవకాశాల కోసం అష్టకష్టాలు నుదిటిపై గీత బాగుంటేనే సినీ అవకాశాలు లభిస్తాయి. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడ్డాను. టాలెంట్‌కు తోడు అదృష్టం కూడా ఉండాలి. ఒకర్ని ఒకరు తొక్కేయటం అనేది కొంతకాలమే. ఎక్కువకాలం అది సాధ్యం కాదు. రెండు సినిమాల్లో విలన్‌గా.. హాస్యనటుడిగా మాత్రమే ప్రేక్షకులకు పరిచయమైన నేను ఈ మధ్యనే విడుదలైన ఉదయ్‌కిరణ్ సినిమా ‘జైశ్రీరామ్’లో ప్రతి నాయకుడిగా నటించా. ఆ వేషంలో నన్ను మా ఆవిడ కూడా గుర్తుపట్టలేదు. అలాగే, త్వరలో రాబోయే ‘వేరుు అబద్ధాలు’ సినిమాలో విలన్‌గా నటించనున్నా. హీరోగా మా అబ్బాయి మా అబ్బాయి చిరంజీవి కృష్ణంరాజు(కృష్ణ) రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. మంచి ఫిజిక్ ఉంది. డ్యాన్సర్‌గా బాగా తర్ఫీదు పొందాడు. ‘లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి’, ‘నాకైతే నచ్చింది’ సినిమాలు ఈ నెలాఖరున విడుదల కానున్నారుు. మరువలేని అక్కినేని మెచ్చుకోలు 1988లో స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు, రాధ కాంబినేషన్లో ‘వసంతగీతం’ అనే సినిమాలో వేషం వచ్చింది. షూటింగ్ స్పాట్లో ఏఎన్నార్‌ను చూడగానే డైలాగ్ బయటకు రాలేదు. ఆ సమయంలో ‘నీ వాయిస్ బాగుంది’ అని అక్కినేని మెచ్చుకోగానే నాలోని నటరాజు విజృంభించాడు. ఆయనే స్వయంగా చప్పట్లు కొట్టి అభినందించారు. పరోపకారమే ఆస్తి నాన్నకు 1987లో పక్షవాతం వచ్చింది. సినిమాలకు రెండేళ్లు దూరమయ్యా. ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. అన్ని ఇబ్బందుల్లో కూడా నాన్న నేర్పిన పరోపకారం చేసేవాడ్ని. ఇది చచ్చేంత వరకు అమలు చేస్తాను. ‘ఆగడు’లో కనిపిస్తా.. త్వరలో విడుదలకానున్న ఆగడు సినిమాలో నటించాను. అలాగే కరెంట్‌తీగ, ఎన్టీఆర్ ఆర్ట్స్ సినిమాల్లో చేస్తున్నాను. ఇప్పటివరకు 300కుపైగా సినిమాల్లో నటించాను. సీరియల్‌కు మాత్రం బెస్ట్ హీరోగా నంది అవార్డు వచ్చింది. హాస్యానికి రేలంగి అవార్డు లభించింది.