Chhattisgarh Elections 2018
-
ఛత్తీస్‌గఢ్‌లో మారిన సమీకరణలు? కాంగ్రెస్‌కు అనుకూలం?
దేశంలో లోక్‌సభ ఎన్నికల ఆరు దశల ఓటింగ్ ముగిసింది. ఇప్పుడు ఏడవ, చివరి దశకు జూన్ ఒకటిన ఓటింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో పలు రాజకీయ సమీకరణలు మారాయి. ఛత్తీస్‌గఢ్ విషయానికొస్తే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లోని 11 స్థానాలకు గాను 9 స్థానాను బీజేపీ దక్కించుకుంది. అయితే ఈసారి ఓటర్లు ఏ ప్రాతిపదికన ఓటువేశారనే అంశం బీజేపీకి అంతుచిక్కడం లేదని విశ్లేషకులు అంటున్నారు.ఛత్తీస్‌గఢ్‌లో మొదటి మూడు దశల్లో 11 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. దీంతో రాష్ట్రంలోని లోక్‌సభ సీట్లకు ఓటింగ్ పూర్తయింది. ఈ నేపధ్యంలో రాజకీయ విశ్లేషకులు రాష్ట్రంలోని ఓటర్ల మనోభావాలు ఇలా ఉన్నాయంటూ పలు అంశాలు చెబుతున్నారు. రాష్ట్రంలోని మహిళల ఓట్లు బీజేపీకి పడే అవకాశాలున్నాయని, అదే సమయంలో కాంగ్రెస్ హామీపై కూడా ఓటర్లు ఆలోచిస్తున్నారన్నారు. కొన్ని ప్రాంతాలలో ప్రజలు రిజర్వేషన్‌ను రద్దు, రాజ్యాంగాన్ని మార్చడం అనే అంశాలకు మద్దతు పలికారట. ఇది కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూరుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.2019లో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ 9 లోక్‌సభ స్థానాలు, కాంగ్రెస్ రెండు లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. అయితే ఈసారి కాంగ్రెస్‌కు కొంత మేలు జరిగేలా కనిపిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని 11 లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఈసారి కాంగ్రెస్‌కు మూడు సీట్లు రావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజ్‌నంద్‌గావ్‌లో భూపేష్ బఘేల్, బీజేపీ అభ్యర్థి సంతోష్ పాండే మధ్య గట్టి పోటీ నెలకొంది. అదే సమయంలో దుర్గ్, మహాసముంద్ స్థానాల్లో కులాల ప్రాతిపదికన ఓటింగ్ జరిగిందనే అంచనాలున్నాయి. దీంతో పాటు కోర్బా సీటులో సరోజ్ పాండే, జ్యోత్స్నా మహంత్ మధ్య స్వల్ప ఓట్ల తేడాతో గెలుపు ఓటములుండే అవకాశం ఉంది. -
బీజేపీకి పక్కలో బల్లెం!
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌లో నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ నేతలందరితో సుదీర్ఘంగా మంతనాలు జరిపిన పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీ.. సీనియర్ నేత భూపేశ్ బఘేల్(57)ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖరారు చేశారు. అనంతరం ఆదివారం నాడిక్కడ సమావేశమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బఘేల్‌ను శాసన సభాపక్ష(సీఎల్పీ) నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర పరిశీలకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ..‘నిజంగా ఇది కఠినమైన నిర్ణయమే. ఎందుకంటే బఘేల్, చరణ్‌దాస్ మహంత్, టి.ఎస్. సింగ్‌దేవ్, తామ్రధ్వజ్ సాహూ కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలకంగా వ్యవహరించారు. పార్టీలో ఈ నలుగురి హోదా సమానమే. వీరందరితో పలు దఫాలుగా చర్చించిన మీదట బఘేల్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాహుల్ ఎంపిక చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్ర శాసన సభ్యులకు తెలియజేశాం. వారంతా ఏకగ్రీవంగా బఘేల్‌ను సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. రాయ్‌పూర్‌లోని సైన్స్ కాలేజ్ మైదానంలో బఘేల్ సోమవారం సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. బఘేల్‌తో పాటు ఇంకెవ్వరూ మంత్రులుగా ప్రమాణం చేయడంలేదు’ అని తెలిపారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినందున తమముందు చాలా సవాళ్లు ఉన్నాయని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని నిలబెట్టుకుంటామనీ, బఘేల్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారని ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖరారైన బఘేల్‌కు కాంగ్రెస్ పార్టీ శుభాకాంక్షలు తెలిపింది. బఘేల్ ఎంపికకు ముందు కాంగ్రెస్ పార్టీలో హైడ్రామా నడిచింది. నలుగురు నేతలు సీఎం పదవి కోసం పోటీపడటంతో పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీ వీరితో పలు దఫాలుగా చర్చలు జరిపారు. చివరికి రాహుల్ ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తారో వారికే మద్దతు ప్రకటిస్తామని ఈ నెల 12న సీఎల్పీ చేత తీర్మానం చేయించారు. మొత్తం 90 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ 68 సీట్లతో ఘనవిజయం సాధించగా, బీజేపీ 15 స్థానాలకు పరిమితమైంది. రుణమాఫీపైనే తొలి సంతకం: బఘేల్ ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల రుణమాఫీపైనే తొలి సంతకం పెడతానని కాబోయే ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తెలిపారు. అలాగే 2013లో మావోయిస్టుల చేతిలో కాంగ్రెస్ నేతల ఊచకోతపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణకు ఆదేశిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని రైతులు, ఆదివాసీలు, యువత, మహిళలు, చిరువ్యాపారుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. దుర్గ్ జిల్లాలోని పతన్ నియోజకవర్గం నుంచి బఘేల్ గెలుపొందారు. 2013, మే 25న ఛత్తీస్‌గఢ్‌లోని జీరమ్ లోయ ప్రాంతంలో కాంగ్రెస్ నేతల కాన్వాయ్‌పై మావోయిస్టులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో సల్వాజుడుం వ్యవస్థాపకుడు, కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ, రాష్ట్ర పీసీసీ చీఫ్ నందకుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేశ్ సహా 25 మంది కీలక నేతలు, కార్యకర్తలు చనిపోయారు. బీజేపీకి పక్కలో బల్లెం ఛత్తీస్‌గఢ్ లో దాదాపు 15 ఏళ్ల బీజేపీ పాలనకు చరమగీతం పాడటంలో కీలకంగా వ్యవహరించిన భూపేశ్ బఘేల్ మధ్యప్రదేశ్‌లోని(ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్) దుర్గ్ జిల్లాలో ఓ సాధారణ రైతు కుటుంబంలో 1961, ఆగస్టు 23న జన్మించారు. చందూలాల్ చంద్రశేఖర్ ప్రోద్బలంతో 1980 దశకం ప్రారంభంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనంతరం ఐదేళ్లకే యూత్ కాంగ్రెస్‌లో చేరారు. 1994–95లో మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. క్రమంగా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. కుర్మి సామాజిక వర్గానికి చెందిన భూపేశ్‌కు రాష్ట్రంలో ఉన్న 52 శాతం మంది ఓబీసీల్లో మంచి పలుకుబడి ఉంది. దుర్గ్ జిల్లా పటాన్ నియోజకవర్గం నుంచి బఘేల్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1993లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి తొలిసారి ఎన్నికైన బఘేల్.. అజిత్ జోగీతో పాటు దిగ్విజయ్ సింగ్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. భూపేశ్ బఘేల్ సంఘ సంస్కర్తగా పేరుపొందారు. పేదలు ఆర్థికంగా చితికిపోకుండా ఉమ్మడి మధ్యప్రదేశ్(2000, నవంబర్ 1న మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ అనే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు)లో సామూహిక వివాహాలు జరిపించారు. అంతేకాకుండా బీజేపీ నేతలకు పక్కలో బల్లెంలా తయారయ్యారు. ప్రతీ సందర్భంలోనూ బీజేపీని ఇరుకున పెట్టేలా మాట్లాడటంతో పాటు ఓ బీజేపీ నేతకు సంబంధించిన అశ్లీల దృశ్యాల సీడీని విడుదల చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ వ్యవహారంలో బఘేల్ జైలుకు సైతం వెళ్లాల్సి వచ్చింది. ఆతర్వాత బఘేల్‌తో పాటు ఆయన భార్య భూకబ్జాలకు పాల్పడ్డారని రమణ్‌సింగ్ ప్రభుత్వం కేసులు పెట్టి వేధించింది. అంతేకాకుండా సొంత పార్టీలోనూ ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అన్నింటిని ఓపికగా సహించిన భూపేశ్ బఘేల్, నేడు ఛత్తీస్‌గఢ్ మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. బఘేల్‌కు ముందు అజిత్ జోగి(మూడేళ్లు), రమణ్‌సింగ్(15 సంవత్సరాలు) ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. -
ఛత్తీస్‌గఢ్ సీఎంగా భూపేశ్ బఘేల్
-
వీడిన ఉత్కంఠ.. చత్తీస్‌గఢ్ సీఎం ఖరారు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ సీఎం ఎవరనే దానిపై కొనసాగుతున్న ఉత్కంఠకు కాంగ్రెస్ పార్టీ ఆదివారం తెరదించింది. నేడు రాయ్‌పూర్‌లో జరిగిన సీఎల్పీ సమావేశంలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ భూపేశ్ బఘేల్‌ను పక్షనేతగా ఎన్నుకున్నారు. అనంతరం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా బఘేల్ పేరును కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. తాజా ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్.. సీఎం ఎంపిక విషయంలో మాత్రం నాలుగు రోజుల పాటు తీవ్ర కసరత్తు చేసింది. బఘేల్‌తోపాటు సీనియర్ నేతలు టీపీ సింగ్ దేవ్, తమరాథ్‌వాజ్ సాహు, చరణ్‌దాస్ మహంత్‌లు సీఎం రేస్‌లో ఉండటంతో పార్టీ అధిష్టానం ఎటూ తెల్చుకోలేకపోయింది. దశలు వారీగా పార్టీ సీనియర్ నేతలు ఆశావహులతో చర్చలు జరిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా శనివారం ఆశావహులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. తొలి నుంచి అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని సీఎం ఎంపిక ఉంటుందని తెలిపిన కాంగ్రెస్ అధిష్టానం.. ఛత్తీస్‌గఢ్‌లో పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన బఘేల్ వైపే మెగ్గు చూపింది. కాగా, బఘేల్ సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టుగా సమాచారం. ఛత్తీస్‌గఢ్ తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌కి 68, బీజేపీకి 15, జేసీసీకి 5, బీఎస్పీకి 2 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. 1961లో ఓ రైతు కుటుంబంలో జన్మించిన బఘేల్.. 1986లో యూత్ కాంగ్రెస్‌లో చేరడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1993లో పటాన్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బఘేల్ మధ్యప్రదేశ్ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచే విజయం సాధించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2003లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన అదే స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. తొలి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి బఘేల్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఓ మంత్రికి సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడనే ఆరోపణలపై ఆయనకు సీబీఐ కోర్టు 14 రోజుల జైలు శిక్ష విధించింది. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన బఘేల్ తన తరఫున వాదించడానికి ఓ లాయర్‌ను కూడా నియమించుకోలేదు. -
ముందు బఘేల్, తర్వాత దేవ్?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ సీఎం పదవిపై నాలుగు రోజుల ఉత్కంఠకు తెరపడనుంది. నలుగురు కీలక నేతలతో దోబూచులాడిన సీఎం పదవి చివరికి భూపేశ్ బఘేల్‌ను వరించే అవకాశాలు కన్పిస్తున్నాయి. రెండున్నరేళ్ల తర్వాత టీపీ సింగ్ దేవ్‌కు సీఎంగా అవకాశమిచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించిందని తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన కాంగ్రెస్..ముఖ్యమంత్రిని ఖరారు చేసేందుకు సుదీర్ఘ చర్చలు సాగించింది. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌తోపాటు రాష్ట్ర పరిశీలకుడు ఖర్గే, ఛత్తీస్‌గఢ్ వ్యవహారాల ఇన్చార్జి పీఎల్ పునియా ఈ చర్చల్లో పాల్గొన్నారు. తామ్రధ్వజ్ సాహును ఎంపిక చేస్తూ శనివారం మధ్యాహ్నం నిర్ణయం తీసుకున్నారు. తామ్రధ్వజ్ కేబినెట్లో తాము మంత్రులుగా కొనసాగబోమంటూ సీఎం రేసులో ఉన్న భూపేశ్ బఘేల్, టీపీ సింగ్ దేవ్, చరణ్‌దాస్ మహంత్ తిరుగుబాటు చేశారు. దీంతో సోనియా గాంధీ, ప్రియాంకా వాధ్రా గాంధీ రంగంలోకి దిగి రాజీ ఫార్ములాను తెరపైకి తెచ్చారని సమాచారం. దీని ప్రకారం.. బఘేల్ రెండున్నరేళ్లు, ఆ తర్వాత టీపీ సింగ్ దేవ్‌కు రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించేందుకు అధిష్టానం అంగీకరించింది. అయితే, నేడు రాయ్‌పూర్‌లో జరిగే సీఎల్పీ సమావేశం అనంతరం అంతిమ నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నారు. పలుకుబడి, మైనింగ్ లాబీ.. కుర్మి వర్గానికి చెందిన బఘేల్‌కు కొంత మేర ప్రజల్లో సానుకూలత ఉంది. గట్టి పలుకుబడి, ధనిక మైనింగ్ లాబీ మద్దతు బఘేల్‌కు పుష్కలంగా ఉంది. ఆయన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు రాజధానిలో భారీగా లాబీయింగ్ జరిగిందని సమాచారం. కాంగ్రెస్ రాజీ సూత్రం సాహు వర్గ నేతలకు గట్టి దెబ్బ అని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ వర్గం వారంతా బీజేపీని వదిలి ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ వెంట ఉన్నారు. ఈ ప్రభావం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎలా ఉంటుందనే దానిపైనే ప్రస్తుతం అందరి దృష్టీ ఉంది. అయితే, రాజాలు లేదా రాజ్‌పుత్ వర్గానికి చెందిన సింగ్ దేవ్ లాంటి వారికి బదులు గిరిజన నేతలకు ప్రోత్సాహమిచ్చి వృద్ధిలోకి తేలేకపోయిందనే భావం ప్రజల్లో కాంగ్రెస్‌పై ఉంది. -
ఛత్తీస్‌గఢ్ సీఎం ఖరారు రేపే!
సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో సీఎం అభ్యర్థులను ఖరారుచేసిన కాంగ్రెస్ అధిష్ఠానం.. ఛత్తీస్‌గఢ్‌పై దృష్టిపెట్టింది. ముఖ్యమంత్రిని నిర్ణయించేందుకు పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీ చేస్తున్న కసరత్తులు ఇంకా కొలిక్కిరాలేదు. పీసీసీ చీఫ్ భూపేశ్ బఘేల్, విపక్షనేత టి.ఎస్.సింగ్‌దేవ్, చరణ్‌దాస్ మహంత్, తామ్రధ్వజ్ సాహు సీఎం పదవికి పోటీపడుతున్నారు. కొత్తగా ఎన్నికైన 68మంది ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని ఇప్పటికే తెలుసుకున్న అధిష్ఠానం తుదినిర్ణయం తీసుకునేందుకు చర్చలు జరపుతోంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, యుపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, ఛత్తీస్‌గఢ్ పరిశీలకుడు ఖర్గే ఈ చర్చల్లో పాల్గొన్నారు. భూపేశ్ బఘేల్, టీఎస్ సింగ్‌దేవ్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఇద్దరిలో ఎవరనేది రాహుల్ ఆదివారం ప్రకటించనున్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం అభ్యర్థిని రేపు ప్రకటిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత PL పూనియా తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో 15ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికార పగ్గాలు దక్కించుకుంది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌కి 68, బీజేపీకి 15, జేసీసీకి 5, బీఎస్పీకి 2 సీట్లు వచ్చాయి. -
నా వల్లే బీజేపీ చిత్తుచిత్తుగా ఓడింది!
సాక్షి, విశాఖపట్నం: ‘నా వల్లే ఆ మూడు రాష్ట్రాల్లో(రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్) బీజేపీ చిత్తుచిత్తుగా ఓడింది. ఆ మూడు చోట్ల కాంగ్రెస్ విజయం వెనుక తెలుగుదేశం పార్టీ కృషి ఎంతో ఉంది..’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బీజేపీని ఇంటికి పంపేవరకూ నిద్రపోనని చెప్పారు. గురువారం విశాఖ పర్యటనలో భాగంగా కాపులుప్పాడ వద్ద ఏర్పాటు చేయనున్న ఐ–హబ్‌తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేశారు. సాయంత్రం తగరపువలస జూట్‌మిల్ గ్రౌండ్స్‌లో జరిగిన సభలో సీఎం ప్రసంగించారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారన్నారు. వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టించారని.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. మోదీ నుంచి దేశాన్ని కాపాడాలన్న సంకల్పంతోనే బీజేపీయేతర పార్టీలను ఏకం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పార్టీని బతికించుకునేందుకు కాంగ్రెస్‌తో ముందుకెళ్తే తప్పా! తెలంగాణ ఎన్నికల్లో నా వల్లే ఏదో జరిగిపోయిందంటూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తెలంగాణలోనే తెలుగుదేశం పార్టీ పుట్టిందన్నారు. అక్కడ పార్టీ కోసం 35 ఏళ్ల పాటు పోరాడిన కాంగ్రెస్‌తో కలిసి ముందుకెళ్లామని.. అందులో తప్పేముందని ప్రశ్నించారు. ‘టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా టీడీపీ నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. మీరు కూడా మోదీపై పోరాడుతున్నారు. ఇద్దరూ కలిసి ముందుకెళ్దామంటే ఆయన ఒప్పుకోలేదు. పార్టీని బతికించుకునేందుకు కాంగ్రెస్‌తో కూడా వెళ్లడానికి వీల్లేదని అడ్డుజెప్పారు. నేను అక్కడ పని చేయడం తప్పయినట్టు.. నాకేదో రిటర్న్ గిఫ్ట్ తిరిగి ఇస్తానంటున్నాడు. ఇది న్యాయమా?..’ అని చంద్రబాబు ప్రశ్నించారు. తానెవరికీ భయపడనన్నారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి రాష్ట్రానికి కేంద్రం రూ.75 వేల కోట్లివ్వాలన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని విమర్శించారు. మోదీని ఎలా బతిమిలాడానో అందరూ చూశారు.. మోదీ కంటే తనకు ఎంతో అనుభవముందని.. కానీ ఆయన అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు ‘సార్.. సార్..’ అంటూ ఎలా బతిమలాడానో అందరూ చూశారని చంద్రబాబు గుర్తుచేశారు. అయినా రాజధానికి నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. ‘మెడ్‌టెక్’తో విశాఖకు విశ్వఖ్యాతి సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్(ఏఎంటీజెడ్) ఏర్పాటుతో విశాఖపట్నానికి ప్రపంచ ఖ్యాతి లభిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలోని పెదగంట్యాడ వద్ద ఏర్పాటైన ఏపీ మెడ్‌టెక్ జోన్‌ను గురువారం ఆయన జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన నాలుగో గ్లోబల్ ఫోరం సదస్సులో ఆయన మాట్లాడారు. వైద్య పరికరాల తయారీలో అగ్రదేశాలతో సమాన స్థాయికి ఆంధ్రప్రదేశ్ చేరిందన్నారు. దేశంలోనే తొలి వైద్య పరికరాల తయారీ కేంద్రం ఇదేనన్నారు. ప్రపంచవ్యాప్తంగా 240 కంపెనీలు ఇక్కడ తమ ఉత్పత్తులను తయారు చేస్తాయన్నారు. -
బీజేపీ ఓటమి వెనక..
15 ఏళ్లుగా అధికారంలో కొనసాగడంతో ప్రభుత్వ వ్యతిరేకత తలెత్తడం సహజమే. కానీ ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఓటమికి గ్రామీణ జీవన సంక్షోభం, రైతు సమస్యలు, నక్సల్స్ సమస్య సహా పలు అంశాలు కారణమయ్యాయి. 2013లో కేవలం లక్ష ఓట్ల తేడాతో (0.7శాతం) మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈసారి భారీగా నష్టపోయింది. ► వ్యవసాయ సంక్షోభంపై దృష్టిసారించకపోవడం రమణ్‌సింగ్ సర్కారుపై వ్యతిరేకత పెంచింది. 2013లో రైతులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరుతూ.. 2017లో సీఎం నియోజకవర్గమైన రాజ్‌నంద్‌గావ్‌లో 50,000 మంది రైతులు ప్రదర్శన జరిపారు. ఎన్నికలకు రెండు నెలల ముందు (సెప్టెంబరులో) క్వింటాల్ వరికి రూ. 300 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ రైతులకు సర్కారుపై నమ్మకం కలగలేదు. మరోవైపు, తాము అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోగా రుణాలు మాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వాగ్దానం చేయడం, మద్దతు ధరలకు హామీ ఇవ్వడం వంటికి రైతాంగాన్ని ప్రభావితం చేశాయి. ► రూ.36000 కోట్ల పౌర సరఫరాల కుంభకోణంలో రమణ్‌సింగ్, ఆయన భార్యకు పాత్ర ఉన్నట్లు ఆరోపణలు రావడం, 60 మంది మరణానికి కారణమైన రూ.5000 కోట్ల చిట్‌ఫండ్ కుంభకోణ నిందితులపై ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం (310 ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి), పనామా పేపర్లలో సీఎం కుమారుడి పేరు ఉండటం, సహజ వనరుల్ని ధనికులకు కట్టబెట్టడం వంటి అంశాలు పాలక పార్టీని అపఖ్యాతి పాల్జేశాయి. కాంగ్రెస్‌కు ఇవే పెద్ద ప్రచారాస్త్రాలు అయ్యాయి. ► 2006లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టం అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు చేసిన వాగ్దానం పని చేసింది. ఈ చట్టాన్ని బీజేపీ నీరుగారుస్తుందనేది కాంగ్రెస్ ఆరోపణ. బీజేపీ హయాంలో అటవీ ఉత్పత్తుల కనీస మద్దతు ధర తగ్గిపోవడాన్ని కూడా కాంగ్రెస్ ప్రముఖంగా ప్రచారం చేసింది. ► రమణ్‌సింగ్ సర్కారులోని అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దీన్ని అధిగమించేందుకు కొత్త ముఖాలను బరిలోకి దింపాలన్న ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. టికెట్ల కేటాయింపులో అధిష్టానం మాటే చెల్లుబాటయ్యింది. ► నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరగడం (రాష్ట్రంలో ఇంచుమించు 40 లక్షల మంది నిరుద్యోగులున్నది ఒక అంచనా), ఆదివాసుల భూములను పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం, సాగునీటి వనరుల గురించి బీజేపీ సర్కారు పట్టించుకోకపోవడం వంటి అంశాలు కూడా కొంతమేరకు ప్రభావితం చూపాయి. నోట్ల రద్దు పర్యవసానాలు, జీఎస్టీ అమలు కూడా పాలక పార్టీపై కొంత వ్యతిరేకతకు కారణమైనట్టు విశ్లేషకులు చెబుతున్నారు. -
రమణ్‌సింగ్‌కు ఆశాభంగం
రాయ్‌పూర్: 18 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఛత్తీస్‌గఢ్‌కు ఆయనే గత 15 ఏళ్లుగా ముఖ్యమంత్రి. ఏ బీజేపీ సీఎం కూడా ఇంతకాలం అధికారంలో లేరు. ఛత్తీస్‌గఢ్ సీఎంగా రమణ్‌సింగ్(66) ప్రస్థానం ఇది. 2003, డిసెంబర్ 7న తొలిసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఆ తరువాత 2008, 2013లోనూ అధికారంలోకి వచ్చారు. ప్రధాని కాక ముందు నరేంద్ర మోదీ 4,610 రోజుల పాటు నిరంతరాయంగా గుజరాత్ సీఎంగా కొనసాగగా, రమణ్‌సింగ్ ఈ ఏడాది ఆగస్టులో సీఎంగా 5వేల రోజులు పూర్తిచేసుకున్నారు. మోదీ తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించిన తొలి బీజేపీ సీఎంగా గుర్తింపు పొందారు. మహిళలు, విద్యార్థులకు ఉచిత మొబైల్ ఫోన్లు ఇచ్చినందుకు ‘మొబైల్ వాలె బాబా’, ఉచిత బియ్యం పథకానికి ‘చౌర్ వాలె బాబా’, స్వతహాగా ఆయుర్వేద వైద్యుడైనందుకు ‘డాక్టర్ సాహెబ్’ అని రమణ్‌సింగ్‌ను ప్రజలు పిలుచుకుంటున్నారు. కాంగ్రెస్ రుణమాఫీ హామీనే మలుపు.. నాలుగోసారి సీఎం పీఠం అధిష్టించాలనుకున్న రమణ్‌సింగ్‌కు తాజా ఎన్నికల్లో ఆశాభంగం కలిగింది. ప్రజాకర్షక పథకాలకు పేరొందిన ఆయనకు ఎట్టకేలకు కాంగ్రెస్ చెక్ పెట్టింది. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు బంధుప్రీతి, అవినీతి ఆరోపణలు ఆయన పాలనకు చరమగీతం పాడాయి. అధికారంలోకి వస్తే రైతు రుణాల్ని మాఫీ చేస్తామన్న రాహుల్ ప్రకటనే కాంగ్రెస్‌కు ఓట్ల వర్షం కురిపించిందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు, వ్యవసాయ ఉత్పత్తుల ధరల పతనం, ఓబీసీ ఓటర్లు కాంగ్రెస్ వైపు మళ్లడం కూడా బీజేపీకి ప్రతికూలంగా మారాయి. 15 ఏళ్ల బీజేపీ పాలనలో మావోయిస్టుల సమస్య మరింత ముదిరిందని కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేయగా, నక్సలిజం ప్రాణాధార వ్యవస్థపై ఉందని త్వరలోనే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతి నెలకొంటుందని రమణ్‌సింగ్ చేసిన ప్రకటనలు ఫలితాలివ్వలేదు. విదూషకుడే గెలుచుకున్నాడు.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రచార సమయంలో రమణ్‌సింగ్ తరచూ వార్తల్లో నిలిచారు. రాష్ట్రంలో ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని విదూషకుడితో పోల్చారు. రుణమాఫీ చేస్తామని రాహుల్ చెబుతున్న మాటల్ని విని ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అజిత్ జోగి, మాయావతిల పొత్తును ఎగతాళి చేశారు. ‘నాగలి మోసే రైతు’ (జోగి పార్టీ గుర్తు)కు ఏనుగు(బీఎస్పీ చిహ్నం) అవసరం ఏంటని ప్రశ్నించారు. చివరకు రైతులు, గిరిజనులు ‘కమలాన్ని’ వద్దనుకుని ‘హస్తా’నికి పట్టంగట్టారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి ముందు రమణ్‌సింగ్.. తన కన్నా చిన్నవాడైన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాదాలకు నమస్కరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రమణ్‌సింగ్ రాజీనామా రాయ్‌పూర్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలవడంతో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపినట్లు తెలిపారు. పార్టీ ఓటమికి పూర్తి బాధ్యతను తానే తీసుకుంటానని, కేంద్ర నాయకత్వంపై మోపనని చెప్పారు. పార్టీ నాయకులతో కలసి ఫలితాలపై సమీక్ష జరుపుతామని వెల్లడించారు. రాష్ట్ర సమస్యలపైనే ఎన్నికలు జరిగాయని, వీటికి జాతీయ అంశాలతో సంబంధం లేదని పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలపై ఈ ఎన్నికల ప్రభావం ఉండదని నొక్కిచెప్పారు. ఛత్తీస్‌గఢ్ కోసం కొత్త పాత్రలో శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు. -
ఛత్తీస్కోట కాంగ్రెస్ వశం
రాయ్‌పూర్: 15 ఏళ్ల తర్వాత ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ వశమైంది. మంగళవారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ 67 సీట్లు గెలుచుకొని సంపూర్ణ మెజారిటీ సాధించింది. బీజేపీ 15 స్థానాలకు పరిమితమైంది. గత అసెంబ్లీలో బీజేపీకి 49 సీట్లు, కాంగ్రెస్‌కు 39 స్థానాలున్నాయి. ఈ ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని అంచనాలు రేపిన అజిత్ జోగి–మాయావతిల కూటమి 8 సీట్లకే పరిమితమై నామమాత్రంగా మిగిలిపోయింది. ఇప్పటికే 3సార్లు బీజేపీకి అధికారం అప్పగించిన ఛత్తీస్‌గఢ్ ప్రజలు ఈసారి మార్పు కోరుకుని హస్తానికి పట్టంగట్టారు. మొత్తం 90 సభ్యులున్న అసెంబ్లీలో అధికారం దక్కాలంటే కావల్సిన సభ్యుల సంఖ్య 46. కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ తప్పదన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని తలకిందులు చేస్తూ కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి హస్తం దూకుడు కొనసాగించింది. దీంతో పోటీ ఏకపక్షంగా మారింది. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ యూనిట్ చీఫ్ భూపేశ్ బాగెల్, మరో సీనియర్ నాయకుడు టీఎస్ సింగ్‌దేవ్‌లు సీఎం రేసులో ముందంజలో ఉన్నారు. సంప్రదాయ ఓటుబ్యాంకు అయిన ఎస్సీ, ఎస్టీల ఓట్లను కాపాడుకున్న కాంగ్రెస్..ఈసారి ఓబీసీలకు కూడా చేరువకావడంతో ఊహించనంత మెజారిటీ సాధించుకోగలిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలతో మసకబారిన రమణ్‌సింగ్ ప్రభుత్వంపై విసుగుచెందిన ప్రజలు కాంగ్రెస్‌కు ఓ అవకాశం ఇచ్చారని భావిస్తున్నారు. 2000లో మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఛత్తీస్‌గఢ్‌కు కాంగ్రెస్‌కు చెందిన అజిత్ జోగి మూడేళ్ల పాటు సీఎంగా పనిచేశారు. 2003లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన రమణ్‌సింగ్ 2008, 2013లోనూ అధికారాన్ని నిలబెట్టుకున్నారు. తాజా ఫలితాల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రమణ్‌సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అవినీతిమయమైన బీజేపీకి ఛత్తీస్‌గఢ్ ప్రజలు గట్టి జవాబు చెప్పారని ఫలితాలు వెలువడిన తరువాత బాగెల్ అన్నారు. బీజేపీ ఓటమిపై అజిత్ జోగి సంతోషం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వానికి సహకరిస్తూ అసెంబ్లీలో మూడో శక్తిగా కొనసాగుతామని చెప్పారు. హిందూ మధ్య ప్రాంతంలోని 28 సీట్లలో బీజేపీకి 7, కాంగ్రెస్‌కు 21 సీట్లు దక్కాయి. 2013 ఎన్నికల్లో బీజేపీకి ఇదే ప్రాంతంలో 18, కాంగ్రెస్‌కు 9, ఇండిపెండెంట్‌కు ఒక సీటు లభించాయి. వాయవ్య ఎస్సీల ప్రాంతంలోని 17 సీట్లలో బీజేపీకి 4, కాంగ్రెస్‌కు 8, జీజీపీకి ఒకటి, బీఎస్పీ–జేసీసీజే కూటమికి 4 సీట్లు దక్కాయి. 2013 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి 9, కాంగ్రెస్‌కు 8 సీట్లు లభించాయి. దక్షిణ ఆదివాసీ ప్రాంతంలోని 16 సీట్లలో బీజేపీ 1 , కాంగ్రెస్ 15 సీట్లు గెలుచుకున్నాయి. గత ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బీజేపీ 5, కాంగ్రెస్ 9 సీట్లు దక్కించుకున్నాయి. ఛత్తీస్ అసెంబ్లీకి 13 మంది మహిళలు ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి 13 మంది మహిళలు ఎన్నికయ్యారు. ఇందులో 9 మంది కాంగ్రెస్, ఒకరు బీజేపీకి చెందిన వారున్నారు. 2008లో మహిళా సభ్యుల సంఖ్య 10 కాగా, 2008లో ఈ సంఖ్య 11కు పెరిగింది. 2013లో కాంగ్రెస్ టికెట్‌పై గెలుపొందిన అజిత్ జోగి భార్య రేణు జోగి ఈసారి జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ తరఫున పోటీచేసి విజయం సాధించారు. హిందీ బెల్ట్‌లో కాంగ్రెస్ ఒంటరిగా పోరాడింది. ఈ ప్రాంతంలో కోల్పోయిన తన బలాన్ని తిరిగి పొందే ఉద్దేశంతోనే పకడ్బందీ వ్యూహాలు అనుసరించింది. ఆ విషయంలో విజయం సాధించింది. – స్మితా గుప్తా, రాజకీయ విశ్లేషకురాలు ఎన్డీయే రాజకీయ ఫ్రంట్. అలాగే యూపీఏ కూడా మరో ఫ్రంట్. ఎన్డీయేలో ఉన్న సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎదుర్కోవాలంటే యూపీఏ కూడా భాగస్వామ్య పార్టీలను సమైక్య పరిచి పోటీకి దిగాలి. – వినోద్ శర్మ, హిందూస్తాన్ టైమ్స్ పొలిటికల్ ఎడిటర్ బీజేపీ జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాల్లోని సామాన్యులపై ప్రభావం చూపించింది. నోట్ల రద్దు వంటి నిర్ణయాలు రాష్ట్రాలపై దుష్ప్రభావం చూపాయి. అవి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలనూ ప్రభావితం చేశాయి. –కపిల్ సిబాల్, కాంగ్రెస్ సీనియర్ నేత బీజేపీ ఈ ఎన్నికల్లో గొప్ప ఫలితాలు సాధించలేదు. ఈ విషయం పార్టీలో చర్చించి తప్పుల్ని సవరించుకోవాలి. మోదీ జనాదరణ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు. అది పెరుగుతూనే ఉంది. మరి మేము అనుకున్న ఫలితాలు రాకపోవడానికి కారణాలు ఏమిటో విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది – కె.జె. అల్ఫాన్స్, కేంద్ర టూరిజం మంత్రి రాహుల్ గాంధీని ఒక జోకర్లా తీసిపారేయడం ఇక మానుకోవాలి. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ తన శక్తివంచన లేకుండా కృషి చేశారు. చిత్తశుద్ధితో పనిచేశారు. ఒక సరికొత్త రాజకీయ నేతగా అవతరించిన రాహుల్‌తో బీజేపీ నేతలు తలపడగలగాలి – శేఖర్ గుప్తా, సీనియర్ జర్నలిస్టు దేశమంతా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇందుకు మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. మోదీ ప్రభుత్వ విధానాల మీద ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ ప్రభావం వచ్చే లోక్‌సభ ఎన్నికల మీద కచ్చితంగా ఉంటుంది. – అఖిలేష్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు రాజస్తాన్‌లో సీఎం పీఠంపై కూర్చునే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రధాన కర్తవ్యం బీజేపీ ఓటు శాతాన్ని ఎంతమేరకు తగ్గించగలుగుతారనేదే. బీజేపీ 38శాతం ఓట్లను నిలబెట్టుకోగలిగింది. కాంగ్రెస్ కొంత మేర ఓటు శాతాన్ని పెంచుకోగలిగినా వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి బీజేపీ ఓట్లను తగిన మొత్తంలో రాబట్టుకోవాలి. అప్పుడే కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది –రాజీవ్ గుప్తా, రాజకీయ విశ్లేషకులు -
ఓటమి షాక్ : రమణ్‌సింగ్ రాజీనామా
రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీకి ఘోరపరాజయం ఎదురైంది. 90 స్ధానాలకు గాను కాంగ్రెస్ పార్టీ ఏకంగా 65 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, బీజేపీ 17 స్ధానాలకే పరిమితమైంది. మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండగా, బీజేపీని ఓటమి భారం వెంటాడుతోంది. ఇక బీజేపీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రరమణ్ సింగ్ 15 సంవత్సరాలుగా చత్తీస్‌గఢ్ సీఎంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తన నాయకత్వంలో ఎన్నికలు వెళ్లినందున ఓటమికి తానే బాధ్యత వహిస్తానని, అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని రమణ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రజా తీర్పును తాము గౌరవిస్తామని కాంగ్రెస్‌కు అభినందనలు తెలిపారు. -
టీఆర్ఎస్ పాలన అబద్ధాలమయం: రమణ్‌సింగ్
హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లో మూడు సార్లు విజయం సాధించిన బీజేపీ నాలుగవ సారి కూడా విజయం సాధిస్తుందని ఛత్తీస్గడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఖైరతాబాద్ లైబ్రరీ చౌరస్తాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రమణ్‌సింగ్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అబద్ధాలతో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పాలన సాగిందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో 450 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా చింతల చేస్తున్న సేవా కార్యక్రమాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. ఇలాంటి సేవా ధృక్పథం కలిగిన వ్యక్తి చట్టసభల్లో ఉండాలన్నారు. ఎంపీ దత్తాత్రేయ మాట్లాడుతూ టీఆర్ఎస్కు ఓటేస్తే మజ్లిస్‌కు వేసినట్లే అని అన్నారు. అనంతరం చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఖైరతాబాద్ అభివృద్ధే లక్ష్యంగా పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు, రామన్‌గౌడ్, ప్రేమ్‌రాజ్ పాల్గొన్నారు. -
మోదీ-షా హవా; కొత్త ట్విస్ట్
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ-షా ద్వయం ముద్ర కనిపించడం లేదు. 2014లో ప్రధాని పీఠాన్ని నరేంద్ర మోదీ అధిష్టించినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో వీరి ముద్ర స్పష్టంగా కనిపించింది. బీజేపీలో అన్ని తామే వ్యవహరించి విజయాలను తమ ఖాతాలో వేసుకున్నారు. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో సీనియర్ నాయకులు ఎంతమంది ఉన్నప్పటికీ మోదీ-షా జోడీ ముందుండి నడిపించింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగుతున్న రమణ సింగ్, శివరాజ్ సింగ్, వసుంధర రాజే సొంత గొంతుక విన్పిస్తున్నారు. బీజేపీలో అగ్రస్థాయి వ్యూహకర్తల బృందంలో అమిత్ షా, మోదీకి సమానంగా పరిగణించబడుతున్న వీరు మోదీ-షా ద్వయంపై ఆధారపడకుండానే ముందుకు పోతున్నారు. మోదీ ప్రధాని పీఠమెక్కిన నాటి నుంచి ఇప్పటివరకు 22 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగ్గా 19 రాష్ట్రాల్లో కమలం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. 2014లో జరిగిన జార్కండ్, హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పాలక పగ్గాలు దక్కించుకుంది. హరియణాలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడంలో కాషాయ పార్టీ సఫలమైంది. ఇదే ఏడాది చివరి జరిగిన ఎన్నికల్లో జమ్మూకశ్మీర్లోనూ పాగా వేసింది. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)తో కలిసి అధికారాన్ని పంచుకుంది. బీజేపీకి 2015 కలిసిరాలేదు. అదే ఏడాది ఢిల్లీ, బిహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోరులో కమలం పార్టీకి చుక్కెదురైంది. అసోంలో గెలుపుతో 2016లో ఈశాన్య రాష్ట్రాల్లోకి అడుగుపెట్టిన కమలనాథులు, అదే సంవత్సరం జరిగిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ఎన్నికల్లో భంగపడ్డారు. 2017లో ఉత్తరప్రదేశ్‌లో భారీ విజయంతో పాటు ఉత్తరాఖండ్, హిమచల్‌ప్రదేశ్‌నూ తన ఖాతాలో వేసుకుంది. మేఘాలయా, నాగాలాండ్, మణిపూర్, త్రిపురలోనూ విజయఢంకా మోగించి ఈశాన్యంలో తిరుగులేని శక్తిగా మారింది. గట్టి పోటీ ఎదురైనప్పటికీ గుజరాత్లో అధికారాన్ని నిలబెట్టుకుంది. మోదీ-షా సొంత రాష్ట్రం కావడంతో ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బొటాబొటి మెజారిటీతో గట్టెక్కింది. అయితే ఈ ఏడాదిలో కర్ణాటక ఎన్నికల్లో కాషాయ పార్టీకి అనూహ్యంగా షాక్ తగిలింది. కాంగ్రెస్, జేడీ(ఎస్) కలిసి బీజేపీకి ఝలక్ ఇచ్చాయి. తాజాగా జరుగుతున్న ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో మోదీ-షా ముద్ర అంతగా కనిపించడం లేదు. ఈ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్న రమణ్ సింగ్, శివరాజ్ సింగ్, వసుంధర రాజె బలమైన నాయకులు. తమకు తామే సొంతంగా వ్యూహాలను అమలు చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీంతో మోదీ-షా జోడికి పెద్దగా పని లేకుండా పోయింది. ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటికే ఎన్నికలు ముగిశాయి. ఒకవేళ బీజేపీ ఇక్కడ మళ్లీ గెలిస్తే ఆ ఘనత అంతా రమణ్ సింగ్‌కే దక్కుతుంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఫలితం వచ్చే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి. అయినప్పటికీ రాజే వెనక్కు తగ్గడం లేదు. మోదీ-షా ముద్ర లేకుండానే తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఆమెను తప్పించే సాహసం చేయలేకపోతోంది బీజేపీ అధిష్టానం. ఈశాన్య రాష్ట్రం మిజొరంలోనూ మోదీ-షా ముచ్చట లేదు. ఇక్కడ హంగ్ వచ్చే అవకాశముందని సర్వేలు అంచనా వేశాయి. తెలంగాణలో బలమైన నాయకులు లేకపోవడంతో మోదీ-షా మ్యాజిక్ పైనే స్థానిక నేతలు ఆశలు పెట్టుకున్నారు. దీనికనుగుణంగానే మోదీ-షా ప్రచార పర్వాన్ని భారీస్థాయిలో నిర్వహించనున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోదీ-షా హవా నడిచింది. అభ్యర్థుల ఖరారు, ప్రచారం, ముఖ్యమంత్రి అభ్యర్థుల ఎంపిక విషయాల్లో వీరే ఆధిపత్యం చెలాయించారు. బలమైన ప్రాంతీయ నేతలు లేకపోవడంతో అన్ని విజయాలన్నీ వీరి ఖాతాలోకి వెళ్లిపోయాయి. ముఖ్యమంత్రి అభ్యర్థుల విషయంలోనూ అనూహ్య నిర్ణయాలు తీసుకుని తమ ప్రత్యేకత చాటుకున్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండటం ఈ ఎన్నికల్లోని విశేషం. ఇక్కడ బీజేపీకి సానుకూల ఫలితాలు వస్తే మోదీ-షా ‘ముద్ర’ మాయం కావడం ఖాయమన్నది విశ్లేషకుల అభిప్రాయం. -
పోలింగ్ బూత్‌లో పూజలు చేసిన ఛత్తీస్‌గఢ్ మంత్రి
-
ఛత్తీస్ రెండో దశలో 71.93% పోలింగ్
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం జరిగిన రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల సమయానికి అందిన సమాచారం ప్రకారం 71.93 శాతం ఓటింగ్ నమోదైందని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేశ్ సిన్హా తెలిపారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగగా మావోయిస్టుల ప్రభావిత గరియాబంద్ జిల్లా బృందానవ్‌గఢ్ నియోజకవర్గంలోని రెండు పోలింగ్ బూత్‌లలో మాత్రం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 3 గంటలకే ముగిసింది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, ఆయన భార్య వీణ, కుమారుడు అభిషేక్ కువర్థా నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌కు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. పలు ఫిర్యాదులు రావడంతో బిలాస్పూర్ జిల్లా మర్వాహి నియోజకవర్గంలోని ప్రిసైడింగ్ అధికారితోపాటు సిబ్బంది ఒకరిని విధుల నుంచి తప్పించినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి తెలిపారు. ఫలితాలు డిసెంబర్ 11న వెలువడనున్నాయి. -
పొలిటి'కలే?'
‘మహిళలకు ఓటు హక్కే కాదు..ఎన్నికల్లో నిలబడే హక్కు ఉన్నప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం’ అంటారు చిలీ మాజీ అధ్యక్షురాలు మిచెల్ బచెలెత్. మన దగ్గర స్త్రీలకు ఆ హక్కు ఉంది.. వినియోగించుకుని ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులూ అయినవారున్నారు.. అవుతున్నారు కూడా. అయితే, హక్కు ఉంటే సరిపోదు..ఆ వాతావరణం..స్వేచ్ఛ, స్వాతంత్య్ర ఉండాలి. ఇక్కడ స్వేచ్ఛా స్వాతంత్య్రాలంటే మహిళలు గడపదాట గలిగే వెసులుబాటు ఒక్కటే కాదు. ఇంటి బాధ్యతల నుంచి కూడా వెసులుబాటు. ఫలానా పనులు ఆడవాళ్లు మాత్రమే చేయాలి అన్న నియమనిబంధనల నుంచి వెసులుబాటు. కొన్ని సాంఘిక కట్టుబాట్ల నుంచి కూడా వెసులుబాటు చాలా అవసరం. మహిళలకు పాలనలో సమభాగస్వామ్యం కావాలంటే మిగిలిన బాధ్యతల నుంచి వెసులుబాట్లు తప్పనిసరి. దీన్ని ఇటీవలి ఎకనామిక్ సర్వే కూడా వెల్లడించింది. మరో కోణం రాజకీయాల్లో స్త్రీల భాగస్వామ్యం పెరగకపోవడానికి మరో కోణం కూడా కనిపిస్తుంది. రాజకీయాలంటే ఆసక్తి ఉన్న అబ్బాయిలు నచ్చిన పార్టీలో చేరి కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. అమ్మాయిలకు ఆ అవకాశం ఉండట్లేదు. చదువు తర్వాత ఉద్యోగం.. లేదంటే వెంటనే పెళ్లి తప్పనిసరి. కాదనుకొని వెళ్లినా రక్షణ సమస్యగా మారుతుంది. ఇప్పటికీ మన దేశంలో పాలిటిక్స్ అంటే మహిళలకు రిస్క్ అనే భావనే. మరి ఇప్పుడు ఉన్న మహిళా నేతలు వచ్చినా.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్లు చాలా తక్కువే. - తండ్రికి వారసురాలిగానో.. భర్తకు ప్రతినిధిగానో.. కుటుంబ రాజకీయ, వ్యాపార లావాదేవీలకు టూల్‌గానో మహిళలు చట్టసభల్లో అడుగుపెట్టడం మినహా.. ఆసక్తితో, లక్ష్యంతో, ప్రజాసంక్షేమ కాంక్షతో, విధాన నిర్ణయాల్లో భాగస్వామి కావాలనే తపనతో, పూర్తి అవగాహనతో వచ్చిన వాళ్లు చాలా తక్కువ. - మహిళలు రాజకీయాల్లో కీలకంగా ఉండుంటే.. ఈ రోజు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కోసం అడుక్కోవాల్సిన పరిస్థితే ఉండకపోయేది. మారిన ఎన్నికల చిత్రం రాజకీయాల్లోకి రావాలంటే ప్రజా సమస్యల మీద అవగాహన ఉండాలి. ప్రజాజీవితంతో మమైకమైన జీవనశైలిని పాటిస్తుండాలి. ప్రశ్నించే తత్వం కావాలి. ఇప్పుడు వీటన్నిటికన్నా.. డబ్బు ముఖ్యం. మనీతో పవర్.. పవర్‌తో మనీ.. రొటేట్ అవుతున్నాయి. కుటుంబ వారసత్వంతో వచ్చిన వారికి ఆర్థిక, నైతిక మద్దతుతోపాటు అంగబలమూ ఉంటోంది. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండిపెండెంట్‌గా రావాలనుకునే వారికే అన్ని ఇబ్బందులు. ప్రధాన పార్టీలూ అంత తర్వగా వీరిని ఆహ్వానించట్లేదు. మహిళల్లో రాజకీయ చైతన్యం పెరిగింది. ఏం చెప్పింది? 2017–18 సంవత్సరానికి నిర్వహించిన ఈ సర్వేలో 49 శాతం మహిళా జనాభా ఉన్న మన దేశంలో వాళ్ల రాజకీయ భాగస్వామ్యం కేవలం 15 శాతమేనని తేలింది. రువాండా లాంటి దేశంలో పార్లమెంట్లో 60 శాతం మహిళా ప్రాతినిధ్యం ఉంటే మనం 15 శాతంతో ఈజిప్ట్, బ్రెజిల్, మలేషియా, శ్రీలంక, థాయ్‌లాండ్ వంటి దేశాల సరసన ఉన్నాం. - ఇంటర్– పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ), యూఎన్ విమెన్ విభాగం ఇచ్చిన ‘విమెన్ ఇన్ పాలిటిక్స్ –2017’ అనే నివేదికను కూడా ఈ సర్వే ప్రస్తావించింది. - ఆ నివేదిక ప్రకారం 2016, అక్టోబర్ నాటికి దేశంలో ఉన్న 4, 118 మంది ఎమ్మేల్యేలలో మహిళల శాతం కేవలం తొమ్మిది. - 2010 నుంచి 2017 వరకు అంటే ఏడేళ్లలో చట్టసభల్లో (లోక్‌సభ)పెరిగి మహిళా భాగస్వామ్యం ఒక్క శాతమే. - ఇంటి బాధ్యతలు, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ భారం, కుటుంబం నుంచి మద్దతు లేకపోవడం తదితర కారణాల వల్లే మహిళలు రాజకీయాల్లోకి అడుగుపెట్టలేకపోతున్నారని సర్వే తేల్చింది. ఎంత మందికి అధికారం? ఇప్పుడు ఎన్నికైన వాళ్లకెంతమందికి అధికారం ఇచ్చారని మనం పార్టిసిపేషన్ గురించి మాట్లాడుకోవాలి? తెలంగాణ ప్రభుత్వంలో ఎంత మంది మహిళలకు పదువులున్నాయి? మహిళా కమిషన్ కూడా లేదు. వెల్ ఎడ్యూకేటెడ్, అవేర్నెస్, ఉత్సాహం ఉన్న సూరేపల్లి సూజాత లాంటి వాళ్లకు ఏ పార్టీలు టిక్కెట్లు ఇచ్చాయి? అసలు పొలిటికల్ పార్టీస్కే మహిళలకు టికెట్లు ఇవ్వడం ఇష్టం లేదు. ఇలా అయితే విమెన్ పొలిటికల్ పార్టిసిపేషన్ ఎలా పెరుగుతుంది.? – రమా మేల్కొటే, సామాజిక, రాజకీయ, ఆర్థిక విశ్లేషకురాలు కార్యకర్తలే అడ్డు చెప్తరు.. ఎలక్షన్లలో నిలబడ్డానికి ఆడవాళ్లు ఉత్సాహంగానే ఉన్నరు. అయితే టికెట్లిచ్చే దగ్గర పార్టీ పెద్దలు ఎంత పక్షపాతంగా ఉన్నరో, కార్యకర్తలూ అంతే ఉన్నరు. మగవాళ్లకే సీట్లివ్వాలని ఒత్తిడి చేస్తరు. వాళ్లను గెలిపించేందుకే కష్టపడ్తరు. ఎందుకంటే మగవాళ్లు వస్తే వాళ్లు తింటరు, వీళ్లకు తినిపిస్తరు అని. అదే ఆడవాళ్లయితే అంత అవినీతికి పాల్పడరు కదా. అందుకే కార్యకర్తలకు ఫాయిదా ఉండదు. అందుకే మహిళలకు సపోర్ట్ చేయరు. అయినా మహిళలు నిలబడాలే. – సి. బాలేశ్వరి,గృహిణి, హైదరాబాద్ వేరుగా ఓ పార్టీ పెట్టి.. రాజకీయ చైతన్యం మహిళ్లో పెరిగింది. కానీ.. భాగస్వామ్యం తగ్గింది. దీనికి మార్కెట్ సంస్కృతి ఒక కారణం. డబ్బు, పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం వల్ల ధైర్యంగా ముందుకొస్తున్నవాళ్లు మహిళల సంఖ్య తక్కువే. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలుపొందిన వారు సైతం ఇతరుల మీదనే ఆధారపడుతున్నారు. ఇవన్నీ ఎందుకు? మహిళలమే సపరేట్గా ఓ పార్టీ పెట్టాలనే ఆలోచన కూడా చేయట్లేదు. పార్టిసిపేషన్ పెరగాలంటే ఇవన్నీ అవసరమే. అన్నిరకాలుగా ప్రెషరైజ్ చేయాలి. – డాక్టర్ సమున్నత, అసిస్టెంట్ ప్రొఫెసర్, బిజినెస్ మేనేజ్మెంట్, ఓయూ ప్రయోజనాలెన్నో.... - మహిళలు రాజకీయాల్లోకి రావడం వల్ల సమాజ ప్రవర్తనలోనూ మార్పు వస్తుంది. సున్నితత్వం పెరుగుతుంది. - అవినీతి, దుబారాలకు తావుండదు. నేరాల, ఘోరాల నియంత్రణ జరుగుతుంది. - దేశానికి స్త్రీ కోణం అవసరం. ప్రజల పట్ల బాధ్యత, జవాబుదారీ తనం, ఖర్చులకు ఒక లెక్కా, పత్రం, మౌలిక సదుపాయల వసతి, అందరికీ ఉపాధి.. ఇవన్నీ అవలీలగా నిర్వహించగల సమర్థురాలు స్త్రీయే. - స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటుతున్నా మనం ఇంకా మౌలికసదుపాయాలు, అందరికీ ఉపాధి దగ్గరే ఆగిపోయాం. దీనికి కారణం.. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగకపోవడమే. - భవిష్యత్‌కి ఘనమైన చరిత్ర ప్రేరణ కావాలంటే వర్తమానం ఆరోగ్యంగా ఉండాలి. ఆలోచన ఉన్న స్త్రీలకు అవకాశం కావాలి. ఇప్పుడు చట్టసభల్లో ఉన్న మహిళలు ప్రశ్నించాలి. తమ సంఖ్య పెంచుకునేలా ప్రయత్నించాలి. రాజకీయాల్లోనూ మన ఉనికి చాటడానికి మరో ఉద్యమానికి ఊపిరి పోసైనా సాధించుకోవాలి. ధాయ్.. ది లవ్ డాక్టర్ శంకర్‌దాదా ఎంబీబీఎస్ గుర్తుందా? రోగులకు వైద్యం కన్నా ప్రేమపూర్వకమైన మాటలు అవసరమంటూ చిరంజీవి చెప్పిన మాటలు ఆకట్టుకున్నాయి. ఇలాంటి ఓ వైద్యుడు మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీలో నిలిచి ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. ధాయ్ అక్సర్ అనే డాక్టర్.. ప్రజాస్వామ్యాన్ని ప్రేమపూర్వకంగా మార్చాలన్న లక్ష్యంతోనే ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. జబల్పూర్(ఉత్తరం) నియోజకవర్గంలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రేమతంత్రమంటే అందరినీ ఏకం చేయడమేనని ఆయన నిర్వచిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన పదిసార్లు వివిధ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ.. డాక్టర్ గారి ప్రేమ మంత్రం ప్రజలకు పెద్దగా పట్టలేదు. పోటీ చేసిన ప్రతిసారీ ఆయనకు ధరావతు కూడా దక్కలేదు. ఇవేవీ ధాయ్‌లో ఉత్సాహాన్ని నీరుగార్చలేదు. ఎన్నికల్లో పోటీ చేయడం, ఓడిపోవడంపై పెద్దగా ఆందోళన లేదని, ప్రజల్లో ప్రేమను పెంచేందుకు పాతికేళ్లుగా కృషి చేస్తున్నానని చెప్పారు. ప్రస్తుతమున్నది నిజమైన ప్రజాస్వామ్యం కాదంటున్నారు ఈ అభినవ శంకర్‌దాదా. అసలు రాజకీయ పార్టీల అవసరం లేదని, అభ్యర్థులు సైతం నామినేషన్లు వేసి ఇంట్లో కూర్చోవాలని, ఎలాంటి ప్రచారాలను అనుమతించకూడదని, ప్రజలు ఎవరి ప్రభావం లేకుండా ఒకరిని ఎన్నుకోవాలని చెబుతున్నారు. ఎప్పటికైనా తన సిద్ధాంతాలకు ప్రాచుర్యం వస్తుందని ఆయన ప్రగాఢ నమ్మకం. ఈయనకు కొందరు శిష్యులు కూడా ఉన్నారు. వీళ్లకు ఆయన సిద్ధాంత ప్రవచనం చేస్తుంటారు. మరి ఇంటి ఖర్చులు ఎలాగంటారా? పెద్దవాళ్లిచ్చిన ఆస్తులపై అద్దెలతో డాక్టర్ సాబ్ కాలం వెళ్లబుచ్చుతున్నారు. మంగళవారం ఛత్తీస్‌గఢ్ తుదివిడత ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు బారులు తీరిన మహిళా ఓటర్లు పెళ్లిలో ఓటు సందడి! ప్రజాస్వామ్య మనుగడ ప్రజల భాగస్వామ్యంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రజాస్వామ్యంటూ ఊదరగొట్టే పలువురు మేధావులు ఎన్నికలు వచ్చే సరికి ఓటేయడానికి బద్ధకిస్తారు. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన అతహుల్లాఖాన్ అందరిలాగా కాదు. సామాజిక కార్యకర్తగా ప్రజలను చైతన్యం చేయడం తన బాధ్యతగా భావిస్తారు. తాజాగా తన కుమారుడి పెళ్లి వేడుకలో ఓటు ప్రాముఖ్యత గురించి పోస్టర్లు అతికించడం ద్వారా ఖాన్ వార్తల్లో నిలిచాడు. పెళ్లిలో విందులు, బహుమతులతో పాటు అతిథులకు ఓటేయాలంటూ కరపత్రాన్ని ఇచ్చారు. ‘ఓటు వేయడం ప్రతిఒక్కరి నైతిక బాధ్యత. నా నగరంలో ప్రజలకు ఆ బాధ్యత మరొక్కమారు గుర్తు చేశాను’ అని ఆయన వినమ్రంగా చెబుతున్నారు. సెంటిమెంట్ పాయింట్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు. నియోజకవర్గాల్లో ఎవరికివారు ప్రచారం ఉధృతం చేశారు. చాలామంది అభ్యర్థులు కేవలం ప్రచారంతో సరిపెట్టుకోకుండా సెంటిమెంటు, చిట్కాల ద్వారా అదృష్టాన్ని వెతుక్కుంటున్నారు. తమ అదృష్ట దీపాలుగా భావించే భార్యనో, చెల్లినో, కుమారుడినో ప్రచారంలోకి తీసుకుపోవడం, బియ్యాన్ని పంచడం, తులసి పూజలు చేయడం.. ఇలా ఒకటేమిటి గెలిచేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. సెంటిమెంట్ తమను గట్టెక్కించాలని మొక్కుకుంటున్నారు. ప్రధాన నిర్ణయాలు తీసుకునేముందు తల్లి కాళ్లకు నమస్కరించడం ఒక అభ్యర్థి అలవాటైతే, తులసి పూజ చేయకుండా బయటకు అడుగెయ్యకపోవడం మరొక అభ్యర్థి ఆచారం. తల్లి ఆశీర్వాదం తనకు ఎప్పుడూ కలిసివస్తుందని, ప్రతిరోజూ ఆమెకు నమస్కరించే ప్రచారం ఆరంభిస్తానని బీజేపీ అభ్యర్థి ఒకరు చెప్పారు. మరో కాంగ్రెస్ అభ్యర్థికి తన నియోజకవర్గంలోని ప్రతి గుడిని దర్శించిరావడం రివాజుగా మారింది. మహిళా అభ్యర్థుల్లో ఎక్కువమంది తులసి పూజకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ పూజతో తమకు పాజిటివ్ శక్తి వస్తుందని వారు నమ్ముతారు. మధ్యప్రదేశ్ ప్రజల్లో బియ్యం పంచితే అదృష్టం వరిస్తుందని నమ్మకం ఉంది. అందుకే ఒక అభ్యర్థి మూడురంగుల బియ్యాన్ని నియోజకవర్గ ప్రజలందరికీ పంచుతున్నాడు. ఏమాత్రం తగ్గనంటున్న ఆయన ప్రత్యర్థి ప్రజలందరికీ పసుపు బియ్యాన్ని పంచడం ప్రారంభించారు. బీజేపీ అభ్యర్థులు పార్టీ గుర్తయిన కమలం పువ్వును ఇస్తున్నారు. కొందరు కుటుంబసభ్యులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలు మాత్రం ఈ సెంటిమెంట్లకు నవ్వుకుంటున్నారు. ఆ నాలుగు రాష్ట్రాలు 12 శాతం! సీట్లలో మహిళల వాటా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు మహిళలకు ఇచ్చిన సీట్లు చాలా తక్కువే. గతంలో ఇచ్చి్చన సీట్ల కంటే తక్కువనే చెప్పుకోవాలి. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ 15 మంది, కాంగ్రెస్ 13 మంది మహిళలకు సీట్లు ఇస్తే.. రాజస్తాన్‌లో బీజేపీ 21 మంది, కాంగ్రెస్ 27 మంది అతివలను బరిలో దింపాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ 28, బీజేపీ 24 మంది మహిళలకు పార్టీ టికెట్లు ఇచ్చాయి. అయితే మిజోరంలో మాత్రం బీజేపీ ఆరుగురు మహిళలకు సీట్లివ్వగా.. కాంగ్రెస్ ఒక్కరినే బరిలో దింపింది. దేశవ్యాప్తంగా మహిళల ఓట్ల శాతం పెరుగుతోందని సర్వేల్లో వెల్లడవుతున్నప్పటికీ.. చట్టసభల్లో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్యలో పెరుగుదల అనుకున్నంత వేగంగా లేదు. ప్రస్తుతం పార్లమెంటులో మహిళా ఎంపీల సంఖ్య 68. ఇది మొత్తం ఎంపీల సంఖ్యలో 12% మాత్రమే. చట్టసభల్లో మహిళల సీట్లు పెంచేందుకు ఉద్దేశించిన 33% రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాల్చితే.. మనకు168 మంది మహిళా ఎంపీలు ఉంటారు. అయితే రాజకీయ ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే ఈ అంశం ఆలస్యమవుతోంది. -
ఛత్తీస్‌గఢ్‌లో 71.93 శాతం పోలింగ్
రాయిపూర్ : ఛత్తీస్‌గఢ్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 19 జిల్లాల్లో విస్తరించిన మొత్తం 72 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటల సమయానికి 71.93 శాతం పోలీంగ్ నమోదైంది. తొలి విడత పోలింగ్‌తో కలుపుకుంటే ఈసారి అసెంబ్లీ ఎన్నికల మొత్తం పోలింగ్ శాతం 74.17గా ఉందని డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేష్ సిన్హా తెలిపారు. పోలింగ్ సమయం ముగిసినప్పటికీ కొన్ని కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఉండడంతో వారిని పోలింగ్‌కు అనుమతిచ్చారు. కొన్ని చోట్ల పోలింగ్ కొనసాగుతోంది. క్యూలో ఉన్న ఓటర్లు ఓటు హక్కు వినియోగించిన అనంతరమే పోలింగ్ కేంద్రాలను మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ దృష్ట్యా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. మొత్తం 90 సీట్లలో 18 స్థానాలకు తొలి దశ పోలింగ్‌లో ఈ నెల 12న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 8 నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో తొలి దశలోనే పోలింగ్ పూర్తయింది. మిగిలిన మావో ప్రభావిత జిల్లాలైన గరియాబంద్, ధంతరి, మహాసముంద్, కబీర్దమ్, జష్పూర్, బల్రామ్పూర్ జిల్లాల్లో మంగళవారం పోలింగ్ జరిగింది. -
అజిత్ జోగి కోడలి విజయం ఖాయం
సాక్షి, న్యూఢిల్లీ : చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కోడలు రిచా జోగి విజయం సాధించడం నల్లేరు మీద నడకేనని అకల్తారా అసెంబ్లీ నియోజక వర్గం ప్రజలు భావిస్తున్నారు. అజిత్ జోగి కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి జనతా కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఆయన ఈసారి ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. ఈ కారణంగా ఆయన తన కోడలును బీఎస్పీ తరఫున ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజక వర్గంలో 45 శాతం మంది దళితులు, ఆదివాసీలు ఉండడమే కాకుండా బీఎస్పీకీ మంచి ప్రాబల్యం ఉండడమే అందుకు కారణం కావచ్చు. జాంజ్‌గిర్–చంపా జిల్లాలోని అకల్తారా నియోజక వర్గంలో 35 దళిత, ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి. వారంత ఈసారి అజిత్ జోగికే ఓటు వేయాలని ప్రతిజ్ఞ కూడా చేశారట. ఆ గ్రామాల గ్రామాల ప్రజలు రిచా జోగి ప్రత్యర్థులెవరిని తమ గ్రామాల్లో ప్రచారానికి అనుమతించడం లేదు. ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో గెలిచిన ప్రస్తుత కాంగ్రెస్ శాసన సభ్యుడు చున్నీలాల్ సాహు ఐదేళ్ల నుంచి తమ గ్రామాలకే రావడం లేదని, అక్కడక్కడ ఆయన పోస్టర్లు తప్ప ఆయన జాడ కనిపించడం లేదని ప్రజలు అంటున్నారు. అకల్తార పట్టణంలో ప్రజల సౌకర్యార్థం ఓ టాయ్‌లెట్ నిర్మంచమంటే కూడా ఆయన నిర్మించలేక పోయారని, అలాంటి వ్యక్తికి ఈసారి ఓటు ఎలా వేయగలమని చెబుతున్నారు. నియోజకవర్గంలోని ముర్లిది గ్రామంలో 1800 మంది ఓటర్ల ఉండగా 1600 మంది ఓటర్లు రిచా జోగికే ఓటు వేస్తున్నట్లు చెప్పారు. మిగతా 200 మంది ఓటర్లు బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సౌరభ్ సింగ్‌కు ఓటు వేస్తున్నట్లు చెప్పారు. ఈసారి ఈ నియోజకవర్గంలో బీజేపీ, బీఎస్పీకి మధ్యనే పోటీ ఉంటుందని, అయితే రిచా జోగిదే విజయమని చెబుతున్నారు. అకల్తారాలో మెజారిటీ ఇళ్లపై బీఎస్పీ జెండాలే కనిపిస్తోంది. ఆఖరికి చున్నీలాల్ సాహుకు మద్దతిస్తున్న కాంగ్రెస్ కౌన్సిలర్ పుణేశ్వర్ కుమార్ ఆనంద్ ఇంటిపై కూడా బీఎస్పీ జెండా ఎగరడం అందుకు నిదర్శనం. ఈ విషయమై ఆయన్నే ప్రశ్నించగా తన 10, 12 ఏళ్ల కొడుకులు తెలియక ఆ జెండాను ఎగరేశారని చెప్పుకున్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
-
ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న తుది దశ పోలింగ్
రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లో తుది దశ పోలింగ్ కొనసాగుతుంది. 19 జిల్లాలోని 72 నియోజకవర్గాలకు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 90 స్థానాలు ఉన్నా చత్తీస్‌గఢ్ అసెంబ్లీకి తొలి దశలో 18 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టుల పిలుపు నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఈసీ మొత్తం 19,296 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రమణ్‌సింగ్ ప్రభుత్వంలోని 9 మంది మంత్రులు, స్పీకర్‌తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ భూపేశ్ బఘేల్, అజిత్ జోగి సహా ఇరు పార్టీల కీలక నేతల భవిష్యత్ నేడు ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. ఛత్తీస్‌గఢ్‌లో నాలుగోసారి అధికారం చేపట్టాలని బీజేపీ, 15 ఏళ్లుగా కొనసాగుతున్న విపక్ష హోదాను అధికార పక్షంగా మార్చుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. బీఎస్పీ, అజిత్ జోగికి చెందిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్, సీపీఐల కూటమి కూడా విజయంపై ఆశలు పెట్టుకుంది. కాగా, 72 స్థానాల్లో 1,079 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
నేడు ఛత్తీస్ రెండో దశ
రాయిపూర్: ఛత్తీస్‌గఢ్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 19 జిల్లాల్లో విస్తరించిన మొత్తం 72 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. పోలింగ్ దృష్ట్యా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. లక్షమందికి పైగా భద్రతాబలగాలను మోహరించారు. మొత్తం 90 సీట్లలో 18 స్థానాలకు తొలి దశ పోలింగ్‌లో ఈ నెల 12న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 8 నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో తొలి దశలోనే పోలింగ్ పూర్తయింది. మిగిలిన మావో ప్రభావిత జిల్లాలైన గరియాబంద్, ధంతరి, మహాసముంద్, కబీర్దమ్, జష్పూర్, బల్రామ్పూర్ జిల్లాల్లో నేడు పోలింగ్ జరగనుంది. రమణ్‌సింగ్ ప్రభుత్వం లోని 9 మంది మంత్రులు, స్పీకర్‌తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ భూపేశ్ బఘేల్, అజిత్ జోగి సహా ఇరు పార్టీల కీలక నేతల భవిష్యత్ నేడు ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. ఈ 72 సీట్లలో 46 జనరల్, 9 ఎస్సీ, 17 ఎస్టీలకు కేటాయించారు. 2013లో ఈ 72లో 43 స్థానాలను బీజేపీ, 27 సీట్లకు కాంగ్రెస్ చెరో సీటును బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థి గెలుచుకున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కనీసం 65 స్థానాలు గెలుచుకుని వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టాలని బీజేపీ, 15 ఏళ్లుగా కొనసాగుతున్న విపక్ష హోదాను అధికార పక్షంగా మార్చుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. బీఎస్పీ, అజిత్ జోగికి చెందిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్, సీపీఐల కూటమి కూడా విజయంపై ఆశలు పెట్టుకుంది. -
జంగ్..మైదాన్ కా!
ఛత్తీస్‌గఢ్‌లో నేడు రెండో విడత పోలింగ్ జరగనుంది. మావోయిస్టుల ప్రాబల్యమున్న 18 నియోజకవర్గాల్లో తొలి విడతలో ఎన్నికలు జరగగా.. మిగిలిన 72 స్థానాల్లో మంగళవారం ఓటు పండగకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఛత్తీస్‌గఢ్‌లో అసలు రాజకీయానికి రెండో విడత వేదిక కానుంది. తొలి విడతలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ నెలకొంది. కానీ రెండో దశలో అజిత్ జోగి కారణంగా రెండు ప్రధాన పార్టీలకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. దీంతో రెండో విడతలో మూడుముక్కలాట ఖాయంగా కనబడుతోంది. ఈ విడత ఎన్నికలు జరిగే స్థానాల్లో జోగి–బీఎస్పీ ప్రభావముండే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలున్నాయి. దీనికితోడు బీఎస్పీకి సన్నిహితంగా ఉండే సత్నామీలు ఈ నియోజకవర్గాల్లో నిర్ణయాత్మకం ఓటర్లు. రాజకుటుంబాల ప్రభావం ఉండే 14 ఆదీవాసీ నియోజకవర్గాల్లోనే రెండో దశలోనే ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ఈ ప్రాంతంలో బీజేపీకి గట్టిపట్టుండగా.. ఈసారి వీటిని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. కాగా, అటు రమణ్‌సింగ్ అభివృద్ధి ఇమేజ్ కారణంగా మెరుగైన స్థానాలు సాధిస్తామని బీజేపీ భావిస్తుండగా.. కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతే తమకు సీఎం పీఠాన్ని అప్పగిస్తోందని అనుకుంటోంది. అటు, మొదటి విడతతో పోలిస్తే రెండో దశలో సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా లేనప్పటికీ.. భద్రతను కట్టుదిట్టం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనే 76.28% శాతం పోలింగ్ జరగడంతో మైదాన ప్రాంతాల్లో ఓటింగ్ శాతం మరింత ఎక్కువగా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బరిలో కోటీశ్వరులు, నేర చరితులు ఈ సారి ఎన్నికల బరిలో అదృష్టం పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో కోటీశ్వరులు, నేరచరితులు ఎక్కువగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ పడుతున్న 1,079 మంది అభ్యర్థుల్లో 130 మందికి నేరచరిత్ర ఉంది. వారిలో 90 మందిపై హత్యాయత్నం వంటి తీవ్రమైన కేసులున్నాయి. అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించిన వివరాల ప్రకారం కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ మంది నేరచరితులకు టికెట్లు ఇచ్చింది. ఆ పార్టీ నుంచి పోటీ పడుతున్న వారిలో 18 మందిపై తీవ్రమైన కేసులున్నాయి. 17 మంది అభ్యర్థులతో ఆమ్ ఆద్మీ పార్టీ రెండోస్థానంలో ఉండగా.. అజిత్ జోగి పార్టీ జేసీసీ నుంచి 15 మంది, బీజేపీ తరఫున ఆరుగురు నేరచరిత కలిగిన అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక కోట్లకు పడగలెత్తిన అభ్యర్థుల్లో బీజేపీ ముందు వరసలో ఉంది. బీజేపీ అభ్యర్థుల్లో 61 మంది కోటీశ్వరులుంటే, కాంగ్రెస్ 53 మందికి, జేసీసీ 35 మందికి టికెట్లు ఇచ్చింది. అంబికాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత (కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రచారం) టీఎస్ సింగ్‌దేవ్ రూ.500 కోట్లకు పైగా ఆస్తులతో అత్యంత ధనిక అభ్యర్థిగా నిలిచారు. హెల్ప్ అంటే రమణ్ రెండు నెలల క్రితం బస్తర్ ప్రాంతంలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలి కుమారుడికి పాము కరిస్తే, ఆమె సాయం కోసం ఫోన్ చేసింది సీఎం రమణ్ సింగ్‌కే. వెంటనే రమణ్ సింగ్ హెలికాప్టర్లో ఆ అబ్బాయిని తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారు. సరైన సమయానికి రాయపూర్ ఆస్పత్రిలో చికిత్స జరగడంతో ఆ అబ్బాయి బతికి బయటపడ్డాడు. ఈ ఒక్క ఘటన చాలు.. విపక్షాల్లోనూ సీఎం రమణ్‌సింగ్‌కు ఉన్న ఇమేజ్ గురించి చెప్పడానికి. కేవలం ఇదొక్క సంఘటనే కాదు ప్రజలతోనూ ఆయన మమేకమవుతారనడానికి ఉదాహరణలు కోకొల్లలు. ఆయనకున్న వ్యక్తిగత ఇమేజ్ కారణంగానే మళ్లీ అధికారంలోకి వస్తామని బీజేపీ భావిస్తోంది. ‘చావల్ బాబా’గా పౌరసరఫరా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచారు. సెల్ ఫోన్ విప్లవాన్ని తీసుకువచ్చి రాష్ట్రాన్ని సాంకేతికంగానూ పరుగులు పెట్టించారు. సుపరిపాలనతో.. అన్ని వర్గాలను కలుపుకొని పోవడంలో కూడా రమణ్సింగ్ది ప్రత్యేకమైన శైలి. మావో సమస్యను ఉక్కుపాదంతో అణిచేసిన జాతీయవాదిగా, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలతో సామాజికవాదిగా, పారిశ్రామికంగా రాష్టాన్ని పరుగులు పెట్టించిన అభివృద్ధి కారకుడిగా రమణ్ సింగ్‌కు రాష్ట్ర ప్రజల్లో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ప్రభుత్వ వ్యతిరేకతే ఆయుధంగా.. సరిగ్గా ఎన్నికల తేదీల ప్రకటనకు ముందు ప్రదేశ్ కాంగ్రెస్కమిటీ అధ్యక్షుడే బీజేపీలో చేరడంతో కాంగ్రెస్‌లో నాయకత్వలేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు నేతలు తమను తాము సీఎం అభ్యర్థులుగా ప్రకటించుకుంటున్నప్పటికీ.. లోటు మాత్రం స్పష్టంగా కనబడుతోంది. ఈ సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వ పగ్గాలు అందుకునేందుకు ప్రభుత్వ వ్యతిరేకతపైనే నమ్మకముంచింది. గత మూడుసార్లు స్వల్ప తేడాతోనే ఓడినందున ఈసారి ఆ తప్పులు చేయకుండా పట్టుబిగించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. రైతుల్లో ఉన్న అసంతృప్తిని గమనించిన రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పదిరోజుల్లో రుణమాఫీ చేస్తానని తొలిదశ పోలింగ్ ప్రచారం ముగిసే ముందు ప్రకటించారు. 15 ఏళ్ల పాలన కారణంగా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అందిపుచ్చుకునేందుకు.. రైతులు, మహిళలు, యువతను ఆకట్టుకునే విధంగా కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించింది. తొలిదశలో 76% పోలింగ్ జరగడంతో (ఎక్కువ పోలింగ్ జరిగితే అధికార పార్టీకి నష్టమనే భావనలో) దీని ప్రభావం రెండోదశలోనూ ఉంటుందని.. అది తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది. జోగి ఝలక్ ఎవరికి? ద్విముఖ పోరుంటే గెలిచేది నువ్వా–నేనా అనేది తేలిపోతుంది. మూడో పార్టీ/వ్యక్తి రంగంలో వస్తే.. విజయం ఎవరిని వరిస్తుందనేది ఊహించడం కష్టం. అదే పరిస్థితి ఛత్తీస్‌గఢ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందనుకున్న సమయంలో ఛత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్ (జేసీసీ) పేరుతో జోగి పోటీలోకి రావడం సమీకరణాలు మార్చేసింది. ఇది బీజేపీ, కాంగ్రెస్‌లకు ఇబ్బందికర పరిణామమే అయినా.. రెండు పార్టీలూ అవతలి పార్టీకే.. జోగితో నష్టమని ప్రచారం చేసుకుంటున్నాయి. 2013 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి బయటకు వచ్చి కేజేపీని స్థాపించిన యడ్యూరప్ప కారణంగా.. బీజేపీకి తీవ్ర నష్టం జరిగింది. ఇప్పుడు అదే సీన్ ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ విషయంలో పునరావృతం అవుతుందనే అంచనాలపై చర్చ జరుగుతోంది. నామమాత్ర తేడాతోనే.. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో ఓట్లు, సీట్ల పరంగా అత్యంత స్వల్ప తేడాతో బీజేపీ గట్టెక్కింది. ఇందుకు కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సంస్థాగత ఇబ్బందులే కారణమనేది సుస్పష్టం. అయితే ఈసారి గతంలోలాగా పొరపాట్లు చేయకుండా.. అధికార పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది. 15ఏళ్ల రమణ్‌సింగ్ పాలనతో విసిగిపోయిన జనాలు తమ విజయంలో కీలకమవుతారని భావించింది. ఈ ఆశలకు మాజీ సీఎం, గతంలో కరడుగట్టిన కాంగ్రెస్ వాదిగా ఉన్న అజిత్ జోగి రూపంలో ఎదురుదెబ్బ తగలనుంది. జోగి పార్టీ జేసీసీ కారణంగా కాంగ్రెస్ పార్టీనే ఎక్కువ ఇబ్బందులు పడుతోంది. కాంగ్రెస్‌కు పట్టున్న దళిత స్థానాల్లో బీఎస్పీతో జోగి దెబ్బకొట్టొచ్చని విశ్లేషణలున్నాయి. హిందీరాష్ట్రాల్లో 2003 నుంచి గణాంకాలు పరిశీలిస్తే కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐల ఓట్లు కలిపితే.. బీజేపీ కన్నా ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్, జోగి కలిసి పోటీ చేసుంటే.. బీజేపీ ఓటమి ఖాయమనే వాదన వినిపించింది. కానీ ఇందుకు ఇటు కాంగ్రెస్, అటు జోగి ఇద్దరూ అంగీకరించలేదు. ఇప్పుడు ఈ త్రిముఖ పోరులో జోగి కారణంగా అంతిమంగా బీజేపీకే మేలు జరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. బీఎస్పీ ఎంట్రీతో.. బీఎస్పీ యూపీ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కాకపోయినా.. గెలిచే పార్టీల అవకాశాలను మాత్రం దెబ్బతీస్తోంది. ఇది చాలా సందర్భాల్లో నిరూపితమైంది. అలాంటి బీఎస్పీ.. ఈసారి జోగితో జతకట్టడం ఎవరి ఓట్లకు నష్టమనేది చర్చనీయాంశమైంది. ఈ చర్చే జోగిని ఈసారి ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక వ్యక్తిగా మార్చింది. జోగి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినందున.. ఆయన వల్ల కాంగ్రెస్‌కే నష్టమనే వాదనలు వినబడుతున్నాయి. జోగి–బీఎస్పీ కూటమిలో సీట్ల పంపిణీ కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. రాష్ట్రంలో ఈ కూటమి తరఫున 55 సీట్లలో జేసీసీ బరిలో ఉంది. వీటిలో మెజార్టీ స్థానాల్లో 2008, 2013లో కాంగ్రెస్ మంచి ప్రదర్శన చూపింది. ఎస్సీ, ఎస్టీలే కీలకం రాష్ట్రంలో గణనీయంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ ఓటర్లు మాయావతి, జోగి జట్టుకట్టడంతో.. మూడో కూటమి వైపు మొగ్గు చూపుతారని అంచనా. 9 ఎస్సీ రిజర్వ్డ్, 17 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలున్నాయి. ఈ నియోజకవర్గాల్లో మూడో కూటమి ప్రభావం ఉండొచ్చు. కూటమితో పొత్తు ఉండుంటే.. ఈ సీట్లలో కాంగ్రెస్‌కు మేలు జరిగేది. పొత్తు లేకపోవడంలో ఈ త్రిముఖ పోటీలో బీజేపీ కష్టంమీద గెలిచే అవకాశాలున్నాయని అంచనా. ఈసారి ఎస్సీల్లోని సత్నామీ వర్గం ఓట్లను గెలిచేందుకు కాంగ్రెస్ కొత్త వ్యూహం పన్నింది. సత్నామీల గురువులు ముగ్గురిని చేర్చుకుని అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. నేటి రెండోదశే నిర్ణయాత్మకం! 72 నియోజకవర్గాల్లో మంగళవారం పోలింగ్ జరగనుంది. మైదాన ప్రాంతాల్లో జరిగే ఈ ఓటింగే ఎన్నికల్లో నిర్ణయాత్మకం కానుంది. అజిత్ జోగికి చెందిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జేసీసీ) ప్రభావం అత్యధికంగా ఉండే ఈ ప్రాంతాల్లో ముక్కోణపు పోటీ ఎవరికి లాభం చేకూరుస్తుందో? ఎవరు నష్టపోతారో? అనేది విశ్లేషకులకూ అంతుచిక్కడం లేదు. గత మూడు ఎన్నికల్లోనూ ముక్కోణపు, బహుముఖ పోటీల కారణంగా బీజేపీకే లాభం చేకూరింది. ఈ సారి బీఎస్పీతో జతకట్టి బరిలో దిగిన అజిత్ జోగి కూడా కాంగ్రెస్ ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి మేలుచేస్తారనే అంచనాలైతే బలంగా ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో 14% ఉన్న సత్నామీలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. జోగికి సత్నామీల్లో పట్టు ఉంది. ఈ వర్గం బీఎస్పీకి శాశ్వత ఓటు బ్యాంకు కూడా. బీఎస్పీ–జేసీసీ కూటమి బలమైన శక్తిగా అవతరించడానికి కారణం కూడా ఈ వర్గమే. మధ్య ఛత్తీస్‌గఢ్‌లో సత్నామీలు ఎక్కువగా ఉన్న 10 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో జోగి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బిలాస్పూర్, జంజీగర్ ప్రాంతాల్లో ఈ కూటమి తన ప్రభావాన్ని చూపిస్తుందన్న అంచనాలున్నాయి. జంజీగర్, చంపా వంటి స్థానాల్లో బీజేపీ నుంచి పార్టీ ఫిరాయించి బీఎస్పీలో చేరిన వారున్నారు. అలాంటి స్థానాల్లో గెలుపు ఎవరిదో అంచనా వేయడం సంక్లిష్టంగా మారింది. ఇలా మొత్తం 12 స్థానాల్లో గెలుపోటములు అంచనా వేయడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సత్నామీల గురువు గురు బాలదాస్.. కాంగ్రెస్‌తో చేతులు కలపడంతో ఆ సామాజిక వర్గం ఓట్లు ఎటు మళ్లుతాయనేది ఆసక్తికరంగా మారింది. అజిత్ జోగి, మాయావతి కూటమి 6–7% ఓట్లను కొల్లగొట్టగలరని అంచనాలున్నాయి. ఈ ఓట్ల చీలిక ఎవరికి నష్టం చేకూరుస్తుందో.. ఇప్పుడే చెప్పలేని స్థితి. రెండో దశలో ఓబీసీ ఓట్లు కూడా కీలకమే. జనాభాలో 45% ఓబీసీలుంటే వారిలో 22% మంది సాహులు ఉన్నారు. సాహులు సంప్రదాయంగా బీజేపీకే మద్దతు నిలుస్తున్నారు. కాంగ్రెస్‌తో పోల్చి చూస్తే బీజేపీయే సాహులకు ఎక్కువ టిక్కెట్లు ఇచ్చింది. రాజ కుటుంబీకులపై ఆశలు ఆదివాసీ ప్రాంతమైన సుర్గుజాల్లో మొత్తం 14 నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ రాజకుటుంబాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ కుటుంబాలను దగ్గర చేసుకోవడానికి కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఈ కుటుంబాల వారికే రెండు పార్టీలు కనీసం నాలుగేసి స్థానాల్లో బరిలో దింపాయి. 2000 సంవత్సరంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడినప్పటినుంచీ.. ఈ ప్రాంతంపై బీజేపీదే పట్టు. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ కూడా తన బలాన్ని పెంచుకుంటోంది. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రేసులో ఉన్న టీఎస్ సింగ్‌దేవ్ ఈ రాజ కుటుంబాలకు చెందినవారే. ఆయనపై బీజేపీ అదే రాజవంశానికి చెందిన అనురాగ్ సింగ్‌దేవ్‌ను బరిలో దింపింది. బీజేపీలో నేత దిలీప్ సింగ్ జుదావో కూడా ఇక్కడి జష్పూర్కి చెంది రాజ కుటుంబీకుడు. ఆయన కుమారుడు యుధవీర్ సింగ్ చంద్రపూర్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యుధవీర్ భార్య సంయోగిత సింగ్ ఈసారి చంద్రపూర్ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు. 2003 ఎన్నికల్లో 14 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 10 సీట్లను సాధించింది. 2013 ఎన్నికల్లో ఇరు పార్టీలు చెరిసగం సీట్లను పంచుకున్నాయి. -
మోసం ఆ పార్టీ రక్తంలోనే ఉంది
ఛింద్వారా/మహాసముంద్: మోసం కాంగ్రెస్ పార్టీ రక్తంలోనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘాటుగా విమర్శించారు. దళితుడైనందునే సీతారాం కేసరిని ఏఐసీసీ అధ్యక్ష పదవి నుంచి అర్ధంతరంగా తొలగించి సోనియాను అందలం ఎక్కించారని నిప్పులు చెరిగారు. ఆదివారం ఆయన మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా, ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. ‘కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. మోసం ఆ పార్టీ రక్తంలోనే ఉంది. కానీ, రాష్ట్ర ప్రజలు ఆ పార్టీని పట్టించుకోరు. గోవును కీర్తిస్తూ మధ్యప్రదేశ్ మేనిఫెస్టోలో పథకాలు కూడా ఆ పార్టీ ప్రకటించింది. కేరళలో మాత్రం ఆ పార్టీ నేతలు ఆవు దూడలను తింటూ పశుమాంసం తినడం తమ హక్కంటారా?’ అని ప్రజలను అడిగారు. ‘ఆధార్ ఆధారిత సాంకేతికతతో ప్రభుత్వ పథకాలను అనర్హుల పాలు కాకుండా చేసి ఏడాదికి 90 వేల కోట్ల రూపాయల దోపిడీని ఆపుతున్నా. అందుకే కాంగ్రెస్ నేతలు నన్ను తీవ్రంగా విమర్శిస్తున్నారని నాకు తెలుసు’ అని మోదీ అన్నారు. కేసరిని అర్ధంతరంగా తొలగించారు ఏఐసీసీ అధ్యక్షుడు(1996–98)గా ఉన్న సీతారాం కేసరి దళితుడైనందునే ఆ పార్టీ ఆయన్ను అర్ధంతరంగా పదవి నుంచి దించేసిందని మోదీ విమర్శించారు. పదవీ కాలం పూర్తి కాకుండానే సీతారాం కేసరిని పార్టీ ఆఫీసు నుంచి బయటకు నెట్టేసిన ఆ పార్టీ నేతలు సోనియా గాంధీని పదవిలో కూర్చోబెట్టారన్న విషయం అప్పట్లో దేశ ప్రజలకు కూడా తెలుసునని పేర్కొన్నారు. ‘ఆ ఒక్క కుటుంబం నాలుగు తరాలుగా అధికారంలో ఉంటూ లాభం పొందగా, వారి పాలనతో దేశానికి ఎటువంటి ప్రయోజనం కలగలేదు’ అని మోదీ అన్నారు. ఆ కుటుంబానికి చెందని సమర్థుడైన వ్యక్తిని అధ్యక్ష పదవికి ఎన్నుకోవాలని కాంగ్రెస్‌కు ఆయన సవాల్ విసిరారు. ‘రైతు రుణాలను రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు చేస్తోంది. కర్ణాటకలో ఇచ్చిన అలాంటి హామీని అక్కడి ప్రభుత్వం ఏడాదవుతున్నా అమలు చేయలేదు. పైపెచ్చు రుణగ్రహీతలైన అక్కడి రైతులకు వారంట్లు జారీ చేస్తూ అరెస్టులు చేయిస్తోంది’ అని ప్రధాని మోదీ ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లో బరిలో 1,101 మంది ఛత్తీస్‌గఢ్‌లో చివరి దశలో ఈనెల 20వ తేదీన 72 స్థానాలకు జరగనున్న ఎన్నికలకు ఆదివారంతో ప్రచారం ముగిసింది. పోటీలో 1,101 మంది అభ్యర్థులున్నారు. రాయ్‌పూర్ సిటీ దక్షిణ స్థానం కోసం అత్యధికంగా 46 మంది పోటీ పడుతున్నారు. మొదటి దశలో మావోయిస్టు ప్రభావిత బస్తర్ ప్రాంతంలోని 18 స్థానాలకు 12న ఎన్నికలు జరిగాయి. ఫలితాలు డిసెంబర్ 11న వెలువడనున్నాయి. కేసరి దళితుడు కాదు: కాంగ్రెస్ న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సీతారాం కేసరి దళితుడు అంటూ ప్రధాని చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కేసరి దళితుడు కాదు, ఇతర వెనుక బడిన కులాల(ఓబీసీ)కు చెందిన వ్యక్తి అని స్పష్టం చేసింది. ‘సీతారాం కేసరి బిహార్ ఓబీసీల్లోని బనియా కులానికి చెందిన వ్యక్తి. ఆయన దళితుడు కాదు. ఆయనకు పార్టీ తగు గౌరవం ఇచ్చింది. అయినా.. నిజాలు, సత్యాలను ప్రధాని మోదీ ఎన్నడైనా చెప్పారా?’అంటూ కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘కొత్తకొత్త అబద్ధాలు చెప్పడం మోదీకి అలవాటుగా మారింది. ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, కల్రాజ్ మిశ్రా, కేశూభాయ్ పటేల్‌లాంటి బీజేపీ ప్రముఖ నేతలను ఎలా గౌరవించారో ఆత్మవిమర్శ చేసుకోండి’ అంటూ మోదీని వ్యంగ్యంగా అన్నారు. -
పల్లే.. పట్టు!
మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల నియోజకవర్గాలే ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నాయి. భారత దేశంలో వ్యవసాయ రంగానికి సమస్యలు మొదట్నుంచీ తీవ్రంగానే ఉన్నప్పటికీ.. ఈ మధ్య కాలంలో రైతు ఆందోళనలు రాజకీయ రంగు పులుముకోవడం ఆయా రాష్ట్రాల్లో అధికార పక్షాలకు సవాల్‌గా మారింది. ఈ ఎన్నికల్లో రైతు సమస్యలను ççప్రసావిస్తూ వెళ్తేనే ఓట్లను ప్రభావితం చేయవచ్చని విపక్షాలు గుర్తించాయి. అందుకే ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల నియోజవకర్గాలు కీలకం కానున్నాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీకే అధికారం అందనుందనేది సుస్పష్టం. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను పూర్తిగా అమలుచేస్తేనే భారత వ్యవసాయ రంగ పునరుజ్జీవనం సాధ్యమవుతుందని ఈ రంగంలోని నిపుణులు కోరుతున్నారు. ఇది గత 15 ఏళ్లుగా దేశమంతా వినిపిస్తున్న డిమాండ్. కానీ.. ప్రభుత్వాలు మాత్రం ఈ కమిటీ సిఫార్సులను పూర్తిగా అమలు చేయలేమని చేతులెత్తేశాయి. తమ తమ రాష్ట్రాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధికి వీలున్నన్ని చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఇవేవీ అన్నదాతకు పూర్తి భరోసాను ఇవ్వలేకపోతున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పులు, చీడ పీడ పెరగడం– సరైన నీటి వనరులు లేకపోవడంతో వ్యవసాయ దిగుబడులు తగ్గడం వంటివి రైతును కుంగదీస్తున్నాయి. ఇవి ప్రభుత్వం తీసుకునే ఉపశమన చర్యల కంటే ఎక్కువ నష్టాన్ని కలగజేస్తుండడంతో దేశవ్యాప్తంగా రైతుల్లో అసహనం కట్టలు తెంచుకుంటోంది. పలుచోట్ల ఆత్మహత్యలు జరుగుతుండగా.. మరికొన్ని చోట్ల ఆందోళనలు, నిరసనలు మిన్నంటుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో గతేడాది జరిగిన రైతు ఆందోళనలు, తదనంతర పరిణామాల్లో ఆరుగురు రైతులు పోలీసు కాల్పుల్లో చనిపోవడం దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించాయి. ఇది శివరాజ్ ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచింది. దీనికితోడు.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు, జీఎస్టీ కారణంగా రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయనే విమర్శలున్నాయి. ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎంతో అభివృద్ధి చేశామని చెబుతున్నప్పటికీ.. రైతు సమస్యలే ప్రభుత్వ ఏర్పాటును శాసించబోతున్నాయనేది నిర్వివాదాంశం. అసంఘటిత రంగానికి దెబ్బ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు కారణంగా అసంఘటిత రంగ కార్మికులకు, చిరు వ్యాపారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వీరి సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. మార్కెట్లో చెలామణీకి సరిపోయేంతగా నగదు అందుబాటులో లేకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. కొనేవారి వద్ద, అమ్మేవారి వద్ద డబ్బుల్లేకపోవడంతో మార్కెట్ దెబ్బతింది. గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి తగ్గడంతో దీంతో నష్టం వచ్చింది. పట్టణ ప్రాంతాల్లోలాగా డిజిటల్ లావాదేవీలు.. గ్రామీణ ప్రాంతాలకు వెంటనే అందుబాటులోకి రాకపోవడం, ఇలాంటి లావాదేవీలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించకపోవడంతో సమస్యలు ఎక్కువగా కనిపించాయి. ఈ క్రమంలోనే వివిధ అంశాల కారణంగా దేశ వృద్ధిరేటు స్వల్పంగా తగ్గింది. ఆ తర్వాత ప్రభుత్వం ఉపశమన చర్యలు తీసుకున్నప్పటికీ.. చిరువ్యాపారులు, కార్మికరంగానికి జరిగిన నష్టం పూడ్చలేకపోయారు. అటు రైతుల విషయంలోనూ ప్రభుత్వం మద్దతు ధర (ఎమ్మెస్పీ) పెంచినప్పటికీ.. రైతులు పండించిన మొత్తాన్ని కొనుగోలు చేయకపోవడంతో సమస్య మొదటికే వచ్చింది. 200 జిల్లాల్లో కరువు ఈ ఏడాది గతం కన్నా రుతుపవనాలు సరిగ్గానే ఉన్నప్పటికీ.. దేశలోని 600 జిల్లాలకు గానూ 200 జిల్లాల్లో కరువు పరిస్థితులే ఉన్నాయి. వాటిల్లో మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో జిల్లాలు కూడా ఉన్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా అమలు చేయకపోవడంతో కూలీలు కూడా దుర్భర జీవితాన్నే గడుపుతున్నారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ మూడు రాష్ట్రాల్లోనూ కలిపి 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంత జనాభా 12.4 కోట్లు. వీళ్లంతా ఎన్నికల్లో కీలకంగా మారబోతున్నారనే అంచనాలున్నాయి. గత ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లోనూ గ్రామీణ నియోజకవర్గాల్లో బీజేపీపై పూర్తి పైచేయి సాధించింది. అయితే ఈ సారి వీరి దారెటు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రభుత్వంపై రైతులు, చిరువ్యాపారలు వ్యతిరేకతను పక్కనపెడితే.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన దానికన్నా.. తాము రైతులకు చేసిన మేలే ఎక్కువని బీజేపీ చెబుతోంది. అసంతృప్తి ఎదురైతే? 2004లో వాజపేయి ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సమయంలో కూడా గ్రామీణ భారతంలో పూర్తిగా పరిష్కారం కాని సమస్యలున్నాయి. రైతులు, రోజు కూలీలు, కార్మికుల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించింది. అయితే ఎన్డీయే సర్కారు మౌలిక సదుపాయాల రంగం పైనే ఎక్కువ దృష్టి సారించింది. భారత్ వెలిగిపోతోందని విశ్వసించింది. అదే నినాదంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. గ్రామీణ ప్రాంత ఓటరు నిర్ణయం కారణంగా.. బీజేపీ ఓడిపోయింది. 2019లో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రజా నిర్ణయానికి ఈ అసెంబ్లీ ఎన్నికలు గీటురాయిగా మారబోతున్నాయని రాజకీయ విశ్లేషకులంటున్నారు. బీజేపీ సంప్రదాయ ఓటర్లలో బ్రాండ్ మోదీ, బీజేపీ మధ్య స్పష్టమైన విభజన ఉంది. 2014 తర్వాత అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏకపక్షంగా గెలుస్తోందంటే.. దానికి మోదీ మ్యాజిక్ కారణం. మరి ఆ మోదీ మ్యాజిక్ ఈ సారి ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లను మెప్పిస్తుందో లేదో మరి కొద్దిరోజుల్లోనే తేలిపోనుంది. ‘గుజరాత్’లో మోగిన ఘంటికలు గతేడాది డిసెంబర్లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల సమస్యలే ఎన్నికల ప్రధాన అజెండాగా మారాయి. అప్పుడే బీజేపీకి ప్రమాద ఘంటికలు మోగాయి. మెజారిటీ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీపై విముఖత వ్యక్తమైంది. ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. గుజరాత్ జనాభాలో దాదాపుగా 43% పట్టణ ప్రాంతాల్లో నివసిస్తారు. వారంతా బీజేపీకి అండగా నిలవడంతో ఆ పార్టీ ఎన్నికల్లో గట్టెక్కింది. గుజరాత్‌తో పోలిస్తే మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పట్టణ ప్రాంత ఓటర్లు తక్కువ. మధ్యప్రదేశ్‌లో 28%, రాజస్తాన్‌లో 25%, ఛత్తీస్‌గఢ్‌లో 23% మాత్రమే పట్టణ ఓటర్లు ఉన్నారు. వీరి సాయంతోనే ఈ ఎన్నికల్లో గెలవడం బీజేపీకి అంత సులభం కాదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే మందసౌర్ ఘటనతో మేల్కొన్న శివరాజ్ సింగ్ ప్రభుత్వం మధ్యప్రదేశ్‌లో రైతుల్లో అసంతృప్తిని చల్లార్చేందుకు పలు ప్రయత్నాలు చేసింది. ‘భవాంతర్’ స్కీమ్ ద్వారా సోయా, మొక్కజొన్న వంటి పంటలపై క్వింటాల్‌కు మార్కెట్ రేటుకు అదనంగా రూ. 500 ఇవ్వాలని నిర్ణయించారు. ఇది కొంతమేర వ్యతిరేకతను తగ్గిస్తుందని అంచనా వేస్తున్నారు. రాజస్తాన్‌లో పరిస్థితి ఏమాత్రం ప్రభుత్వం చేతుల్లో లేకుండా పోయింది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు! రాజస్తాన్‌లో పాకిస్తాన్‌తో సరిహద్దు రేఖ వెంట గ్రామాల్లో రైతులకు అసెంబ్లీ ఎన్నికలు కొత్త చిక్కులు తెచ్చాయి. ఎన్నికల నేపథ్యంలో శ్రీగంగానగర్ జిలాల్లో సరిహద్దు గ్రామాల్లో రక్షణ ఏర్పాట్లు ముమ్మరం చేశారు. గ్రామస్తుల కదలికలపై పరిమితులు విధించారు. ఈ షరతులతో రైతులకు పొలం పనులు చేసుకోవడం కష్టంగా మారింది. ఈ జిల్లాలో దాదాపు 50 గ్రామాలు సరిహద్దు రేఖ వెంబడి ఉన్నాయి. వీటిలో ఐదు గ్రామాల్లో బీఎస్ఎఫ్ పోస్టులు కూడా ఉన్నాయి. విత్తడం నుంచి కాపు కోతవరకు ప్రతిపనికి రైతులు బీఎస్ఎఫ్ అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. ఏ పనైనా ఉదయం 9–4 గంటల మధ్యలోనే ముగించాలనడంతో ఇబ్బంది అవుతోందని రైతులంటున్నారు. దీనికితోడు మూడు అడుగులకు పైన పొడవు పెరిగే పంటలు వేయకూడదని ఆంక్షలున్నాయని వాపోయారు. దీంతో చెరకు లాంటి వాణిజ్య పంటలు కాదని కేవలం కూరగాయలను పండిస్తున్నామని చెప్పారు. కొంతమంది రైతులు ఈ ఆంక్షలకు జడిసి పొలంపనికి పోవడమే మానేశారు. సరిహద్దు కంచె నిర్మాణం కోసం 1982లో పలువురు రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చారు. వీరిలో చాలామందికి ఇంతవరకు పరిహారం దక్కలేదని అక్కడి ప్రజల ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇక్కడ సారవంతమైన భూముల కారణంగా పొలాలకు రేట్లు ఎక్కువ. అయితే ఈ ఆంక్షల కారణంగా పెద్దగా అమ్మకాలు, కొనుగోళ్లు జరగవు. అయితే.. ఇన్ని ఇబ్బందులున్నా ఇక్కడి ప్రజలకు మాత్రం బీఎస్ఎఫ్ వాళ్లంటే చాలా అభిమానం ఉండడం కొసమెరుపు. ఒట్టేసి చెబుతున్నా..! ఎన్నికల అనంతరం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో జట్టు కట్టబోనని ఛత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్ అధినేత అజిత్ జోగి బల్లగుద్ది చెబుతున్నారు. బీజేపీకి లబ్ది చేకూర్చటానికే జోగి బరిలో ఉన్నారన్న కాంగ్రెస్ విమర్శల నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. ‘బీజేపీకి మద్దతు ఇవ్వడంమో, బీజేపీ మద్దతు తీసుకోవడమో చేయను’అని భగవద్గీత, ఖురాన్, బైబిల్, గురుగ్రంథ్ సాహెబ్, షాడానీ ప్రకట్ తదితర ఎనిమిది మతాలకు చెందిన పవిత్ర గ్రంథాలపై మీడియా సమావేశం ఏర్పాటుచేసి మరీ ప్రమాణం చేశారు. ఇదంతా తనపై బురదజల్లేందుకు కాంగ్రెస్ చేస్తున్న కుటిల ప్రచారమని దుయ్యబట్టారు. బీజేపీతో జట్టు కట్టడం కన్నా చావడమే మేలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో సీజేసీ, బీఎస్పీ, సీపీఐ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ కూటమి కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని కాంగ్రెస్ భయపడుతోంది. ఇటీవల కాలంలో ఎస్సీ, ఎస్టీ ఓటర్లలో బీజేపీపై కొంత అసంతృప్తి కనిపిస్తోంది. ఈ అసంతృప్తిని జోగి వైపుకు మరలించి తద్వారా కూటమిని బలహీనపరచాలని కాంగ్రెస్ యోచిస్తోంది. -
ఛత్తీస్‌గఢ్: ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ