Chhota Rajan
-
హత్య కేసులో చోటా రాజన్‌కు ఊరట
ముంబై: ట్రేడ్ యూనియన్ లీడర్ దత్తా సామంత్ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌ను నిరపరాధిగా తేలుస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. 1997లో జరిగిన ఈ హత్యకు చోటా రాజన్ కుట్ర పన్నాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు వెల్లడించింది. సామంత్ తన జీపులో పంత్ నగర్ నుంచి ఘట్కోపర్ వెళుతుండగా మోటార్‌బైక్‌పై వచి్చన దుండగులు ఆయనపై 17 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో సామంత్ అక్కడికక్కడే మరణించాడు. ఈ హత్య వెనుక చోటా రాజన్ హస్తం ఉందంటూ ప్రాసిక్యూషన్ కేసు నమోదు చేసింది. అయితే అందుకు గల సాక్ష్యాధారాలను సమరి్పంచడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడంతో ప్రత్యేక న్యాయమూర్తి బి.డి.షెల్కె రాజన్‌కు కేసు నుంచి విముక్తి కలి్పంచారు. అతనిపై మరిన్ని కేసులు పెండింగ్‌లో ఉండడంతో విడుదలయ్యే అవకాశాల్లేవు. -
మళ్లీ జైలుకు: కరోనాతో కోలుకున్న గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్
ఢిల్లీ: కరోనా బారిన పడిన గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్ కోలుకున్నాడు. అతడు కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. అతడి ఆరోగ్యం మెరుగవడంతో అధికారులు ఢిల్లీ ఎయిమ్స్ నుంచి తిహార్ జైలుకు తరలించారు. ఏప్రిల్ 22వ తేదీన చోట రాజన్ కరోనా వైరస్ బారినపడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే ఆ నెల 24వ తేదీన ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతున్న సమయంలో ఒక్కసారిగా చోట రాజన్ మృతి చెందాడనే వార్తలు గుప్పుమన్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చోటా రాజన్ మృతి చెందారనే వార్త వైరల్‌గా మారింది. ఈ పుకార్లపై పోలీస్, ఆస్పత్రి అధికారులు స్పందించి ‘లేదు.. లేదు. చోట రాజన్ చనిపోలేదు. చికిత్స పొందుతున్నాడు’ అన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. చివరకు ఆయన కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యంతో తిహార్ జైలుకు తిరిగి వెళ్లాడు. చదవండి: మృత్యుఘోష: బాంబుల మోతతో దద్దరిల్లిన గాజా చదవండి: దారుణం.. వేశ్యను వాడుకుని డ్రైనేజీలో పారవేత -
జోతిర్మయి డే హత్య కేసు..చోటా రాజన్ దోషి
-
జే డే కేసులో ఛోటా రాజన్‌కు జీవిత ఖైదు
సాక్షి, ముంబై : ఏడేళ్ల కిందట దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రముఖ జర్నలిస్టు జే డే(జ్యోతిర్మయ్ డే) హత్య కేసులో ముంబై ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు(బుధవారం) తీర్పు వెలువరించింది. ఈ కేసులో గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్ని దోషిగా తేల్చిన కోర్టు ...అతడితో పాటు మరో ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. ముంబైకి చెందిన జే డే.. మిడ్ డే పత్రికలో క్రైమ్ ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2011 జూన్11న విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా సుబర్బన్ పొవాయ్ ప్రాంతంలో ఆయనపై మోటార్ సైకిళ్లపై వచ్చిన కొందరు వ్యక్తులు ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ జే డేని ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. ప్రముఖ క్రైమ్ రిపోర్టర్ అయిన జే డే ముంబైలో నేరచరిత్ర కలిగిన 20 మంది గ్యాంగ్స్టర్ల గురించి సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అతను హత్యకు గురయ్యారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న మహారాష్ట్ర పోలీసులు తొలుత మరో జర్నలిస్టు జిగ్నా వోరాను ఈ కేసులో నిందితురాలిగా అనుమానించి విచారణ చేపట్టారు. వృత్తి రీత్యా ఏర్పడిన శత్రుత్వంతోనే వోరా ఈ హత్య చేసి ఉంటారని భావించిన పోలీసులు ఆమె వద్ద నుంచి మరింత సమాచారం సేకరించారు. ఆ తర్వాత లోతైన విచారణ చేపట్టిన పోలీసులు ఛోటా రాజన్‌కు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించడంతోనే అతడు ఈ హత్య చేశాడనే నిర్ధారణకు వచ్చారు. సతీశ్ కాలియా అనే కాంట్రాక్టు కిల్లర్‌కు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఈ హత్య చేయించినట్టు పోలీసు విచారణలో వెలుగు చూసింది. ఈ హత్య తర్వాత అక్కడి నుంచి పరారైన సతీశ్‌ను పోలీసులు ఎట్టకేలకు రామేశ్వరంలో అరెస్ట్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ముంబై ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో తొలి నుంచి నిందితురాలిగా ఉన్న వోరాను కోర్టు నిర్ధోషిగా ప్రకటించింది. ఈ కేసులో ఛోటా రాజన్‌తో పాటు మరో పది మందిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం వీరికి రేపు శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది. నకిలీ పాస్‌పోర్టు కేసులో దోషిగా ఉన్న ఛోటా రాజన్ ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. -
చోటారాజన్ గ్యాంగ్ సభ్యుడు అరెస్ట్
లక్నో: మాఫియా డాన్ చోటరాజన్ గ్యాంగ్ సభ్యుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. చోటరాజన్ గ్యాంగ్‌లో షార్ప్ షూటర్ ఖాన్ ముబారక్‌ను ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతని దగ్గర నుంచి పెద్ద ఎత్తున తుపాకులు, బుల్లెట్లు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఆపరేషన్‌లో ఖాన్ ముబారక్ పట్టుబడ్డాడు. చోటా రాజన్ ముఠా సభ్యులు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారన్న దానిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతని నుంచి కూపీ లాగుతున్నారు. -
జైల్లోనే ఛోటా రాజన్ హత్యకు 'ఢీ' గ్యాంగ్ స్కెచ్!
న్యూఢిల్లీ: తీహార్ జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌ను హత్య చేసేందుకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఛోటా షకీల్ గ్యాంగ్ పన్నిన కుట్రను పోలీసులు మరోసారి చేధించారు. ఛోటా షకీల్ గ్యాంగ్ సభ్యుడు జునైద్ చౌదరిని ఈశాన్య ఢిల్లీలోని వజీరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. 21 ఏళ్ల జునైద్ చౌదరి ఇండియా మోస్ట్ వాంటెడ్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంలా టాప్ గ్యాంగ్‌స్టర్ కావాలనుకుంటున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. పాకిస్తాన్లో జన్మించి కెనేడియన్ రచయితగా స్థిరపడ్డ తారెక్ ఫతా హత్యకు కుట్రపన్ని జునైద్ చౌదరి పోలీసులకు చిక్కాడు. అయితే ఈ హత్యతోనే మరో హత్యకు కుట్రపన్నాడు జునైద్. ఇప్పటికే గత ఏడాది ఛోటా రాజన్‌ను కోర్టుకు తీసుకెళ్లే సమయంలో చంపాలని జునైద్ పథకం రచించి విఫలమయిన విషయం తెలిసిందే. రాజన్‌ను చంపేందుకు జునైద్‌తో పాటూ నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్లు రాబిన్సన్, యూనిస్, మనీశ్లను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అయితే ఈ సారి మాత్రం ముందుగా ఫతాను హతమార్చి పోలీసులకు చిక్కితే నేరుగా తీహార్ జైలుకెళ్లొచ్చని స్కెచ్ గీశాడు. దీంతో జైల్లోనే చోటా రాజన్ని మట్టుపెట్టొచ్చని ప్లాన్ వేశాడు. టెర్రరిజమ్ ఖండిస్తూ ఫతా పలుమార్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో ఫతాని అంతమొందిచాలని జునైద్ భావించాడని డీసీపీ(స్పెషల్ సెల్) పీఎస్ కుష్వా తెలిపారు. ఫతా ఢిల్లీ రానున్న నేపథ్యంలో జునైద్ రెక్కీ నిర్వహిస్తూ పోలీసులకు చిక్కాడు. ఈశాన్య ఢిల్లీలోని గోకాల్పురీ ప్రాంతంలోని భాగీరథి విహార్‌కు చెందిన ఓ పాల వ్యాపారి కుమారుడు జునైద్. -
ఛోటా రాజన్‌కు జైలు శిక్ష
న్యూఢిల్లీ: నకిలీ పాస్ట్ పోర్ట్ కేసులో గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌తో పాటు మరో ముగ్గురికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది. సోమవారం వీరిని దోషులుగా నిర్ధారించిన ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ రోజు (మంగళవారం) శిక్షలను ఖరారు చేసింది. వీరికి జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 15 వేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వీరేందర్ కుమార్ గోయల్ తీర్పు చెప్పారు. ఫోర్జరీ పత్రాలతో మారుపేరుతో ఛోటా రాజన్ పాస్ పోర్టు పొందినట్టు గతేడాది జూన్ 8న సీబీఐ కోర్టులో అతనిపై అభియోగాలు నమోదయ్యాయి. రాజన్‌తో పాటు పాస్ పోర్టు అధికారులు జయశ్రీ దత్తాత్రేయ్ రహతె, దీపక్ నట్వర్లాల్ షా, లలిత లక్ష్మణన్‌లపై కేసు నమోదైంది. 1998-99లో బెంగళూరులో ఛోటా రాజన్.. మోహన్ కుమార్ అనే పేరుతో నకిలీ పాస్ పోర్టు పొందాడని, ఇందుకు పాస్ట్ పోర్టు అధికారులు సహకరించారని సీబీఐ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. నేరం రుజువు కావడంతో రాజన్‌తో పాటు అతనికి సహకరించిన వారికి శిక్ష పడింది. 2015 అక్టోబర్‌లో ఇండోనేసియా పోలీసులకు పట్టుబడ్డ రాజన్‌ను ఆ ఏడాది నవంబర్‌లో భారత్‌కు అప్పగించారు. -
ఛోటా రాజన్‌కు మరో ఎదురు దెబ్బ
-
ఛోటా రాజన్‌కు మరో ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌కు మరో ఎదురుదెబ్బ తగలింది. నకిలీ పాస్ పోర్టు కేసులో సోమవారం ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు ఛోటా రాజన్‌ను దోషీగా ప్రకటించింది. రేపు (మంగళవారం) రాజన్‌కు శిక్షను ఖరారు చేయనున్నట్టు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వీరేందర్ కుమార్ గోయల్ ప్రకటించారు. ఫోర్జరీ పత్రాలతో మారుపేరుతో ఛోటా రాజన్ పాస్ పోర్టు పొందినట్టు గతేడాది జూన్ 8న సీబీఐ కోర్టులో అతనిపై అభియోగాలు నమోదయ్యాయి. రాజన్‌తో పాటు పాస్ పోర్టు అధికారులు జయశ్రీ దత్తాత్రేయ్ రహతె, దీపక్ నట్వర్లాల్ షా, లలిత లక్ష్మణన్‌లపై కేసు నమోదైంది. 1998-99లో బెంగళూరులో ఛోటా రాజన్.. మోహన్ కుమార్ అనే పేరుతో నకిలీ పాస్ పోర్టు పొందాడని, ఇందుకు పాస్ట్ పోర్టు అధికారులు సహకరించారని సీబీఐ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. నేరం రుజువు కావడంతో రాజన్‌తో పాటు అతనికి సహకరించిన వారిని కోర్టులో దోషులుగా ప్రకటించింది. హత్యలు, స్మగ్లింగ్, కిడ్నాప్ సహా రాజన్‌పై 85కు పైగా కేసులున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లతో అతనిపై దాఖలైన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2015 అక్టోబర్‌లో ఇండోనేసియా పోలీసులకు పట్టుబడ్డ రాజన్‌ను ఆ ఏడాది నవంబర్‌లో భారత్‌కు అప్పగించారు. -
మాజీ ఎంపీ వర్సెస్ మాఫియా డాన్
న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఇద్దరు కరడుగట్టిన నేరస్తుల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షహబుద్దీన్, అండర్ వరల్డ్ డాన్ చోటారాజన్ వ్యవహారం అధికారులకు తలనొప్పులు తెచ్చిపెట్టింది. తీహార్ జైలులో వీరిద్దరూ వేర్వేరు గదుల్లో ఉన్నారు. చోటారాజన్ ఉన్న గదిలో అధికారులు టీవీ ఏర్పాటు చేయడంపై షహబుద్దీన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. తనకు కూడా టీవీ కావాలని అధికారులకు లేఖ రాశాడు. టీవీలో లేకపోవడంతో బోర్ కొడుతోందని, ఒంటరిగా ఫీలవుతున్నానని పేర్కొన్నాడు. రాజన్ గది నుంచి వస్తున్న మ్యూజిక్ తనకు నిద్రాభంగం కలిగిస్తోందని తెలిపాడు. 45 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న షహబుద్దీన్ ను తీహార్ నంబరు వన్ జైలులో ఉంచారు. కరడుగట్టిన నేరస్తులు ఉండడంతో తమిళనాడు ప్రత్యేక పోలీస్ జవాన్లతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. షహబుద్దీన్ అభ్యర్థనపై జైలు అధికారులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. -
దావూద్ కా బెహన్... మాఫియా క్వీన్!
ముంబయ్ అంటే బాలీవుడ్డే కాదు, ఇండియా బిజినెస్ కాపిటల్ కూడా! అంతేనా... ముంబయ్‌లో భాయ్ కల్చర్ కూడా బాగా ఫేమస్. దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్... చీకటి ప్రపంచంలో తమకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్న మాఫియా ప్రముఖులు ముంబయ్ కేంద్రంగా పలు పనులు చేశారని అప్పుడప్పుడూ వార్తలు వినిపిస్తుంటాయి. దావుద్ చెల్లెలు హసీనా కొన్నాళ్లు మకుటం లేని మహారాణిలా ముంబయ్‌లో రాజ్యాధికారం చెలాయించారట! ఇప్పుడామె కథతో రూపొందుతున్న సినిమా ‘హసీనా’లో శ్రద్ధా కపూర్ టైటిల్ రోల్లో నటిస్తున్నారు. ఫొటోలో చూస్తున్నది సినిమాలో ఆమె ఫస్ట్ లుక్. ఎక్కువగా గ్లామరస్ పాత్రలు చేసే శ్రద్ధ... కళ్లలో కనబరుస్తున్న క్రూరత్వం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 17 ఏళ్ల వయసు నుంచి 40 ఏళ్ల వయసు వరకూ హసీనా జీవితంలో జరిగిన విషయాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. -
ఛోటా రాజన్ ఏం చేస్తున్నాడో తెలుసా?
మాజీ డాన్ ఛోటా రాజన్ ఏం చేస్తున్నాడో.. ఎలా ఉన్నాడో తెలుసా? అతడి ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, పూర్తిగా విషమించిందని అందువల్ల అతడికి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స చేయించాల్సి వస్తోందని తెలిసింది. ఏదైనా బాగా పెద్ద ఆస్పత్రిలో అతడికి కార్డియాలజీ, యూరాలజీ విభాగాల్లో చికిత్స చేయించాలని ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అక్కడి బోర్డ్ ఆఫ్ డాక్టర్స్ మొత్తం అతడి పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారని, ఆ తర్వాతే ఈ సలహా ఇచ్చారని చెబుతున్నారు. ప్రస్తుతం గుండె సమస్య, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో పాటు... ఛోటా రాజన్‌కు ఇన్సిషనల్ హెర్నియా, లాపరోటమీ, హైపర్‌టెన్షన్ కూడా ఉన్నాయి. ఒక్కోసారి అతడికి కడుపునొప్పి వస్తుందని, మరోసారి ముక్కులోంచి రక్తం వస్తుందని, ఇంకోసారి అసలు నిద్రపట్టకపోవడం లాంటివి ఉంటాయని.. అందువల్ల ఇప్పటివరకు పూర్తిగా ఏయే సమస్యలు ఉన్నాయో అనే సమగ్ర సమీక్ష కూడా ఇంకా జరగలేదని వైద్యులు అంటున్నారు. రాజన్‌కు తగిన చికిత్స అందించేందుకు వీలుగా పూర్తిగా అతడికి వైద్య పరీక్షలు చేయించాలని కోర్టు సూచించింది. -
ముంభాయ్ మూవీ
ముంబై గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్ అరెస్ట్ అయి అప్పుడే ఏడాది గడిచిపోయింది. 2015 అక్టోబర్ 26న ‘ఇంటర్‌పోల్’ పోలీసులు అతడిని ఇండోనేషియాలోని బాలి దీవిలో అరెస్టు చేసి నవంబర్ 6న ఇండియాకు తరలించారు. ముంబైలో అతడి ప్రాణాలకు ముప్పు ఉండడంతో ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉంచారు. అప్పటి నుండి అతడు జైల్లోనే ఉంటున్నాడు. మరోవైపు అతని పూర్వ మిత్రుడు ప్రస్తుత ప్రధాన విరోధి దావూద్ ఇబ్రహీమ్ పాకిస్తాన్లో తల దాచుకుంటూ భారత ప్రభుత్వ వేట నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. విశేషం ఏమంటే ఈ అండర్‌వరల్డ్ డాన్ల వెంట చట్టం ఎలా పరిగెత్తిందో బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా అంతే పరిగెత్తింది. వారి జీవితాల ఆధారంగా సినిమాలు తీస్తూనే ఉంది. డాన్లు లేని హిందీ సినిమాలను ఊహించడం కష్టం. మీట నొక్కితే తెరుచుకునే తలుపులు, క్లబ్ డాన్సులూ, హెలికాప్టర్లు ఇలాంటి సినిమాటిక్ డాన్లను నేల మీదకు దించి చూపిన తొలి సినిమా ‘నాయకన్’ (తెలుగులో ‘నాయకుడు’) అనే చెప్పాలి. ఆ తర్వాత విధు వినోద్ చోప్రా తీసిన ‘పరిందా’ డాన్ల వాస్తవిక జీవితాన్ని చూపించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ ప్రవేశంతో హిందీలో దాదాపుగా సూటూ బూటూ వేసుకునే డాన్లు అంతమై, నిజమైన డాన్ల కథలు తెర మీదకు వచ్చాయి. తాజాగా సోనాక్షి సిన్హా ‘హసీనా’ పేరున తయారయ్యే సినిమాలో దావూద్ ఇబ్రహీం చెల్లెలుగా నటించనుండగా అర్జున్ రాంపాల్ హీరోగా గ్యాంగ్స్ట్టర్ అరుణ్ గావ్లీ జీవిత కథ ఆధారంగా రూపొందనున్న సినిమా వచ్చే సంవత్సరం విడుదల కానుంది. ఈ నేపధ్యంలో బాలీవుడ్‌ను ప్రభావితం చేసిన డాన్లూ, వారి వల్ల వచ్చిన సినిమాలూ క్లుప్తంగా... ఛోటా రాజన్ అసలు పేరు రాజేంద్ర సదాశివ నికల్జే. 1970లలో బ్లాక్ టిక్కెట్లు అమ్ముతూ, అప్పటి ముంబై డాన్ రాజన్ నాయర్ (బడా రాజన్) అనుచరుడిగా చేరి, క్రమంగా గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగాడు. 1980, 90లలో ముంబైని ఛోటా రాజన్ గడగడలాడించాడు. రాజన్ని చంపిన ప్రత్యర్థి గ్యాంగ్‌పై పగ తీర్చుకుని ఛోటా రాజన్‌గా పేరుమోశాడు. కొన్నాళ్లు దావూద్ ఇబ్రహీంతో కలిసి పని చేసిన ఛోటా రాజన్ ముంబై పేలుళ్ల తర్వాత అతడి నుంచి విభేదించి, విడిపోయాడు. చివరకు ఇది ఒకరిని మరొకరు వేటాడే పరిస్థితికి తెచ్చింది. మహేశ్ మంజ్రేకర్ ‘వాస్తవ్’, రామ్ గోపాల్ వర్మ ‘సత్య’ సినిమాలు ఛోటా రాజన్ జీవితం నుంచి తీసుకున్న శకలాల ఆధారంగా తీసినవే. ఆ తర్వాత రామ్‌గోపాల్ వర్మ ‘కంపెనీ’ సినిమా తీసి దావూద్, ఛోటా రాజన్ల మధ్య ఉన్న వైరాన్ని కొంచెం కల్పిత కథ ఆధారంగా చూపించాడు. ఇందులో దావూద్‌ను పోలిన పాత్రలో అజయ్ దేవ్‌గణ్, ఛోటా రాజన్‌ను పోలిన పాత్రలో వివేక్ ఓబెరాయ్ నటించారు. కరీమ్ లాలా అసలు పేరు అబ్దుల్ కరీమ్ షేర్‌ఖాన్. ఆఫ్ఘనిస్థాన్‌లో పుట్టాడు. 1930లలో ఇండియా వచ్చి, తోటి పఠాన్లతో ఒక గ్యాంగ్‌ను ఏర్పరచుకుని, సెటిల్మెంట్లు మొదలుపెట్టాడు. జూద గృహాలు నడిపాడు. బంగారం, వెండి, ఎలాక్ట్రానిక్ వస్తువులు స్మగ్లింగ్ చేశాడు. డ్రగ్స్ అమ్మాడు. ఇలాంటి ఒక డాన్ని చూడడం బొంబాయికి అదే మొదటిసారి. అప్పటికే ఫీల్డులో ఉన్న హాజీ మస్తాన్, వరదరాజన్ ముదలియార్లతో సమానంగా నగరాన్ని తన చెప్పుచేతల్లోకి తీసుకున్నాడు. 1970లలో ఈ ముగ్గురి ధాటికి ముంబై తల్లడిల్లింది. అందుకే 1974లో వచ్చిన ‘జంజీర్’ సినిమాలో లాలాను పోలిన ‘షేర్ ఖాన్’ పాత్ర మనకు కనిపిస్తుంది. దానిని ధరించిన ప్రాణ్‌కు చాలా పేరు వచ్చింది. 1985లో లాలా మేనల్లుడు సమద్ఖాన్ని దావూద్ ఇబ్రహీం చంపేయడంతో లాలా ప్రాభవం తగ్గడం ప్రారంభమయింది. 2002లో తొంభై ఏళ్ల వయసులో కరీమ్ లాలా చనిపోయాడు. వరదరాజన్ ముదలియార్ కమలహాసన్ ‘నాయకన్’ సినిమా స్టోరీ ముదలియార్ జీవిత కథే. తమిళనాడు తీరప్రాంతం తూత్తుక్కుడి (ట్యుటికోరన్) నుంచి ముంబై వచ్చిన ముదలి యార్ ఓడరేవు కూలీగా జీవితం ప్రారంభించాడు. కొన్నాళ్లు హాజీ మస్తాన్ సహాయంతో రేవులోని రవాణా సామగ్రిని దొంగిలించేవాడు. ఆ తర్వాత గుడుంబా కాచి అమ్మాడు. ముంబైలోని మాతుంగ, ధారవి, సయాన్-కొలివాడ ప్రాంతాల్లోని తమిళుల నాయకుడిగా ముదలియార్ చాలా గట్టి పాత్ర పోషించాడు. 1980ల మధ్యలో అతడి గ్యాంగ్ కదలికలను ప్రభుత్వం బలంగా నియంత్రించడంతో ముంబై నుంచి చెన్నై వెళ్లిపోయాడు. 1988లో మరణించాడు. మణిరత్నం తీసిన ‘నాయకన్’ సినిమా చూశాక, ముదలియార్ మీద ప్రేమ పెరగడం, ‘కొంచెం ఎక్కువ గొప్పగానే చూపించారు’ అని కామెంట్ చేయడం ఖాయం. అబు సలేమ్ ఇతడి మీద నేరుగా బాలీవుడ్ సినిమా లేకపోయినా ఇతడు బాలీవుడ్‌ను గడగడలాడించేడమే కాదు బాలీవుడ్ నటి మోనికా బేడీని తన ప్రియురాలిగా చేసుకున్నాడు. ప్రస్తుతం జైల్లో ఉన్న సలేమ్ది ఉత్తర ప్రదేశ్‌లోని ఔరంగాబాద్. ఢిల్లీలో క్యాబ్ డ్రైవర్‌గా పని చేసి ముంబై చేరుకున్నాడు. అంధేరీలో ఒక టెలిఫోన్ బూత్ నడిపి, చిన్నాచితక నేరాల వల్ల పోలీసుల రికార్డుకు ఎక్కాడు. 1980లలో దావూద్ సోదరుడు అనీస్‌తో పరిచయం అయ్యాక ‘గన్ రన్నర్’గా మారాడు. గన్ రన్నర్ అంటే దేశంలోకి అక్రమంగా తుపాకులను తెప్పించేవాడని అర్థం. 1993 ముంబై పేలుళ్ల నిందితులలో సలేమ్ ఒకడు. సుభాష్ ఘయ్, రాజీవ్ రాయ్ వంటి వారిని డబ్బు కోసం బెదిరించాడు. టి-సీరీస్ యజమాని గుల్షన్ కుమార్ హత్య వెనుక సలేమ్ హస్తం ఉందంటారు. 1988లో దావూద్ గ్యాంగ్ నుంచి విడిపోయి దేశం విడిచిన సలేమ్ 2002లో మోనికా బేడీతో లిస్బన్లో అరెస్ట్ అయ్యాడు. 2005లో అతడిని ఇండియాకు రప్పించారు. హాజీ మస్తాన్ జీవితంలో ఎప్పుడూ బుల్లెట్ పేల్చని మాఫియా లీడర్‌గా హాజీమస్తాన్ ఒక వెలుగు వెలిగాడు. అసలు పేరు మస్తాన్ హైదర్ మీర్జా. ఊరు తమిళనాడులోని పణైకుళం. ‘దీవార్’లో అమితాబ్ క్యారెక్టర్, ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబయ్’లో అజయ్ దేవగణ్ క్యారెక్టర్... ఆ వెలుగును ఇప్పటికీ సన్నగిల్లకుండా ఉంచాయి! 1934లో ఎనిమిదేళ్ల వయసులో తండ్రితో కలిసి ముంబై వచ్చిన మస్తాన్ టీనేజ్ వచ్చాక ఓడ రేవులో కూలీగా చేరాడు. ఖరీదైన వాచీల స్మగ్లింగ్ మొదలు పెట్టి బంగారపు అచ్చులు, ట్రాన్సిస్టర్లు స్మగుల్ చేశాడు. ఆ తర్వాత గుడుంబాలోకి దిగాడు. అలా మస్తాన్ సంపన్నుడయ్యాడు. హిందీలో చాలా సినిమాలకు ఫైనాన్స్ చేసిన మస్తాన్ కొన్ని స్వయంగా నిర్మించాడు కూడా. మధుబాలకు గొప్ప ఫ్యాన్ అయిన హాజీ మస్తాన్ ఆమెను చేసుకోలేక, అచ్చు అలాగే ఉన్న సోనా అనే అమ్మాయిని వివాహం చేసుకుని ఆమెతోనే జీవితం గడిపాడు. 1970లలో అరెస్ట్ అయ్యాక మస్తాన్ క్షీణదశ మొదలైంది. 1994లో చనిపోయాడు. అరుణ్ గావ్లీ అరుణ్ గావ్లీ కుటుంబం మధ్య ముంబైలోని బైకులాలో ఉండేది. చుట్టుపక్కల ప్రాంతాలకు వీళ్ల కుటుంబం పాలు పోస్తుండేది. గావ్లీ నేర కార్యకలాపాలలో దిగాక ఇంటి నుంచి బయటికి వచ్చేశాడు. 1980లలో గ్యాంగ్‌స్టర్ రామ్ నాయక్ ద్వారా దావూద్ ఇబ్రహీమ్‌కి నమ్మకస్తుడయ్యాడు. ఆ తర్వాత సొంతంగా రాజకీయ పార్టీ పెట్టుకుని ఎమ్మెల్యే అయ్యాడు! 2012 నాటి ఒక నేరానికి సంబంధించి గావ్లీ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతని జీవితం ఆధారంగా అర్జున్ రామ్‌పాల్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతోంది. దావూద్ ఇబ్రహీం మోస్ట్ నొటోరియస్! పేరు మోసిన మాఫియా డాన్. దావూద్ తండ్రి ఓ పోలీస్ కానిస్టేబుల్. హాజీ మస్తాన్ తన తండ్రిని ఎంతగా అవమాన పరిచేవాడో కళ్లారా చూస్తూ పెరిగాడు. మస్తాన్‌పై కసి పెంచుకున్నాడు. పథకం ప్రకారం మస్తాన్‌ని మించిన డాన్ అయ్యాడు. మొదట పోలీసులతో సత్సంబంధాలు పెట్టుకుని వారి సహాయంతో కరీమ్ లాలా గ్యాంగ్‌లో ఒక్కొక్కరినీ హతమారుస్తూ వచ్చాడు. అలా హాజీ మస్తాన్ రెక్కలు కత్తిరించాడు. భారీ నేరాలకు పాల్పడ్డాడు. బలవంతపు వసూళ్లు, హవాలా వ్యాపారం చేశాడు. 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల వెనుక పథక రచన దావూదే అంటారు. ఎస్. హుస్సేన్ రాసిన ‘బ్లాక్ ఫ్రైడే’ ఈ పేలుళ్ల మీద వచ్చిన పుస్తకమే. అదే పేరుతో అనురాగ్ కాశ్యప్ సినిమా కూడా తీశారు. దావూద్ 1984లో దుబాయ్ పారిపోయాడు. ప్రస్తుతం అతడు పాకిస్తాన్లో ఉన్నట్లు పోలీసుల దగ్గర సమాచారం ఉంది. -
నాకు నకిలీ పాస్‌పోర్టు ఇచ్చింది అధికారులే: రాజన్
ఉగ్రవాదులపై పోరాడేందుకు వీలుగా భారత నిఘా వర్గాలే తనకు నకిలీ పాస్‌పోర్టు ఇప్పించాయని మాఫియా డాన్ ఛోటా రాజన్ కోర్టులో చెప్పాడు. బ్యాంకాక్‌లో 16 ఏళ్ల క్రితం నుంచి దావూద్ ఇబ్రహీం మనుషులు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని.. అందుకే తనకు మోహన్ కుమార్ అనే పేరుతో పాస్‌పోర్టు ఇచ్చారని ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరిగిన విచారణలో రాజన్ వెల్లడించాడు. ఉగ్రవాదులతోను, భారత వ్యతిరేక శక్తులతోను తాను పోరాడుతున్నానని, తనకు సాయం చేసిన వాళ్ల పేర్లు ఏంటో ఇప్పుడు బయట పెట్టలేనని అన్నాడు. దేశ ప్రయోజనాల కోసమే తాను ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడానని చెప్పాడు. దాదాపు పాతికేళ్ల నుంచి ఎవరికీ చిక్కకుండా తప్పించుకుంటున్న ఛోటా రాజన్‌ను గత సంవత్సరం ఇండోనేసియాలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ముందుగా అతడిపై నకిలీ పాస్‌పోర్టు కలిగి ఉన్నందుకు కేసు పెట్టారు. అతడితో పాటు మరో ముగ్గురు మాజీ పాస్‌పోర్టు అధికారుల మీద కూడా ఈ కేసు నమోదైంది. భారతీయ నిఘా సంస్థలకు 1993 ముంబై పేలుళ్ల నిందితుల గురించి తాను సమాచారం ఇస్తున్నట్లు తెలియడంతో దావూద్ మనుషులు తనను చంపేందుకు ప్రయత్నించారని విచారణలో రాజన్ తెలిపాడు. తన అసలు పాస్‌పోర్టును దుబాయ్‌లో వాళ్లు లాగేసుకున్నారని అన్నాడు. రాజన్ అసలు పేరు రాజేంద్ర సదాశివ్ నికల్జే. ఉగ్రవాదులపై పోరాటం సాగించేందుకే తాను తన గుర్తింపును రహస్యంగా ఉంచాల్సి వచ్చిందని తెలిపాడు. -
ఛోటా రాజన్ హత్యకు కుట్ర, నలుగురి అరెస్ట్
న్యూఢిల్లీ: తీహార్ జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌ను హత్య చేసేందుకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఛోటా షకీల్ గ్యాంగ్ పన్నిన కుట్రను పోలీసులు చేధించారు. రాజన్‌ను చంపేందుకు రంగంలోకి దింపిన నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్లు రాబిన్సన్, జునైద్, యూనిస్, మనీశ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఛోటా రాజన్‌ను కోర్టుకు తీసుకెళ్లే సమయంలో చంపాలని వీరు పథకం పన్నినట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఛోటా షకీల్‌తో నిందితులు ఫోన్ సంభాషణలు సాగించినట్టు గుర్తించామని, అనంతరం వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు స్పెషల్ పోలీస్ కమిషనర్ (స్పెషల్ సెల్) అరవింద్ దీప్ చెప్పారు. జూన్ 3వ తేదీన వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, 5 రోజులు పోలీసుల రిమాండ్‌కు అప్పగించారు. విచారణ అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా, జ్యుడిషియల్ కస్టడీకి అదేశించినట్టు అరవింద్ దీప్ చెప్పారు. ఓ నిందితుడి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. గతేడాది నవంబర్‌లో ఇండోనేసియాలో అరెస్ట్ అయిన ఛోటా రాజన్‌ను భారత్‌కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
జైల్లో ఉన్నా.. ఆ డాన్‌ను లేపేస్తామంటున్నారు?
న్యూఢిల్లీ: గత ఏడాది అక్టోబర్‌లో ఇండోనేషియాలో పట్టుబడ్డ అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ ప్రస్తుతం తీహార్ జైలులో అత్యంత భద్రత మధ్య ఉన్నాడు. అయినా అతడికి చావు బెదిరింపులు ఆగడం లేదు. ఛోటా రాజన్‌ను చంపేస్తామంటూ తాజాగా దావూద్ ఇబ్రహీం నమ్మిన బంటు, గ్యాంగ్‌స్టర్ ఛోటా షకీల్ తీహార్ జైలు సీనియర్ అధికారికి ఎస్సెమ్మెస్ చేశాడు. ఈ బెదిరింపు మెసేజ్ నేరుగా ఛోటా షకీల్ మొబైల్ ఫోన్ నుంచే వచ్చినట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజన్‌కు మంరిత అదనపు భద్రత కల్పించాలని జైలు అధికారులు నిర్ణయించారు. 971504265138 సెల్ నంబర్ నుంచి తీహార్ జైలు లా అధికారి సునీల్ గుప్తాకు ఇటీవల ఓ ఎస్సెమ్మెస్ వచ్చింది. ఛోటా రాజన్‌ను అతిత్వరలోనే అంతం చేస్తామని ఆ ఎస్సెమ్మెస్ బెదిరించింది. ఆ వెంటనే తీహార్ జైలు ల్యాండ్‌లైన్ నంబర్ ఓ కాల్ కూడా వచ్చింది. అందులోనూ రాజన్ ను చంపేస్తామని బెదిరించారు. ఈ నేపథ్యంలో రాజన్‌కు మరింత భద్రత పెంచిన జైలు సిబ్బంది.. ఈ బెదిరింపుల గురించి పోలీసులకు సమాచారమిచ్చారు. -
చోటా రాజన్‌పై సీబీఐ తొలి చార్జిషీటు
న్యూఢిల్లీ: నకిలీ పాస్‌పోర్టు కేసులో గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌పై తొలి చార్జిషీట్‌ను సీబీఐ మంగళవారం దాఖలు చేసింది. రాజన్ సహా ముగ్గురు మాజీ పాస్‌పోర్టు ఉద్యోగులనూ నిందితులుగా పేర్కొంది. బెంగళూరు పాస్‌పోర్టు ఆఫీసుఉద్యోగులు రాజన్‌కు తప్పుడు అడ్రస్‌తో పాస్‌పోర్టు మంజూరవడానికి సాయపడ్డారని సీబీఐ పటియాలా హౌస్ కోర్టులో వె ల్లడించారు. -
ఛోటారాజన్‌కు ప్రాణభయం.. వీడియో కాన్ఫరెన్సుతో విచారణ!
ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న మాఫియాడాన్ ఛోటా రాజన్‌కు ప్రాణభయం విపరీతంగా పట్టుకుంది. అతడిని తాము చంపేయడం ఖాయమని డి-గ్యాంగులోని నెం.2 ఛోటా షకీల్ బహిరంగంగా హెచ్చరించాడు. దాంతో ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నా కూడా.. తన ప్రాణాలకు గ్యారంటీ లేదని ఛోటా రాజన్‌కు అర్థమైపోయింది. కోర్టుకు వెళ్లే సమయంలోను, కోర్టు హాల్లో కూడా చంపడం ముంబై మాఫియా గ్యాంగులకు వెన్నతో పెట్టిన విద్య. అలాగే తనను కూడా హతమారుస్తారన్న భయంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని కోరాడు. దాన్ని జడ్జి కూడా ఆమోదించారు. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక జడ్జి వినోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మోకా కోర్టులో విచారణ సాగుతుండటంతో రాజన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించేందుకు అనుమతించాలని సీబీఐ కోరింది. తీహర్ జైలు సూపరింటెండెంట్ కూడా ఈ మేరకు ఇంతకుముందే సీబీఐకి ఓ లేఖ రాశారు. ఆర్థర్ రోడ్డు జైలు ప్రాంగణంలో ఉన్న మోకా కోర్టుకు రాజన్ హాజరు కావాల్సి ఉంది. అయితే అతడిని నేరుగా ప్రవేశపెట్టాలంటే ప్రాణాలకు ముప్పు కాబట్టి, వీడియో కాన్ఫరెన్సు ద్వారానే ప్రవేశపెట్టారు. ప్రస్తుతం నకిలీ పాస్‌పోర్టు కేసులో మాత్రమే ఛోటా రాజన్ అరెస్టయ్యాడు. ముంబైకి చెందిన ప్రముఖ జర్నలిస్టు జె డే హత్యకేసులో కూడా రాజన్‌పై ప్రొడక్షన్ వారంటు ఉంది. ఛోటా రాజన్ ఇప్పుడు చచ్చిన పాముతో సమానమని, అతడిని తాము ప్రత్యర్థిగా భావించడంలేదని ఇంతకుముందు దావూద్ ఇబ్రహీం పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఛోటా షకీల్ చెప్పాడు. అయితే అతడిని తీహార్ జైల్లోనే తాము లేపేయడం ఖాయమని స్పష్టం చేశాడు. ఇంతకుముందు కూడా రాజన్‌ను హతమార్చేందుకు ప్రయత్నించామని, అయితే అతడు తృటిలో తప్పించుకున్నాడని చెప్పాడు. -
ఛోటా రాజన్ ఎఫ్ఐఆర్ వివరాలివ్వలేం: సీబీఐ
న్యూఢిల్లీ: ఛోటా రాజన్ తప్పుడు ధ్రువపత్రాలిచ్చి అవినీతి మార్గంలో పాస్‌పోర్ట్ తీసుకున్న కేసులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ వివరాలివ్వడానికి సీబీఐ నిరాకరించింది. దీనికి ఆర్టీఐ నుంచి మినహాయింపుందని.. దరఖాస్తు చేసిన వెంకటేశ్ నాయక్‌కు తెలిపింది. అయితే ఆర్టీఐ నుంచి మినహాయింపు ఉన్నా.. అవినీతి ఆరోపణలొస్తే.. వివరాలు ఇవ్వాల్సిందేనని నాయక్ చెబుతున్నారు. -
సీబీఐకి జే.డే హత్యకేసు దర్యాప్తు
ముంబయి: మహారాష్ట్రకు చెందిన ప్రముఖ సీనియర్ పాత్రికేయులు జే. డే(జ్యోతిర్మయ్ డే) హత్య కేసు దర్యాప్తును సీబీఐ మంళవారం చేపట్టింది. ఛోటారాజన్ పై ఉన్న అన్ని కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించడంతో ఈ కేసు కూడా సీబీఐకి బదిలీ అయింది. జర్నలిస్ట్ జ్యోతిర్మయ్ డే హత్య కేసు సహా ఛోటారాజన్ పై 70 కేసులు నమోదయ్యాయి. వీటన్నింటినీ విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాన్ని బాంబే హైకోర్టు ఏర్పాటు చేసింది. జ్యోతిర్మయ్ డే హత్య కేసులో పది మంది నిందితులపై ప్రత్యేక కోర్టు అభియోగాలు నమోదు చేసింది. వీరిలో మహిళా జర్నలిస్టు జిగ్నా వోరా కూడా ఉన్నారు. 2011 జూన్ 11న సుబర్బన్ పొవాయ్ ప్రాంతంలో ఉదయం పూట రెండు మోటార్ సైకిళ్లపై వచ్చిన దుండగులు జ్యోతిర్మయి డేపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయారు. ఈ కేసులో జిగ్నా వోరాను అదే సంవత్సరం నవంబర్ నెలలో అదుపులోకి తీసుకొని విచారించగా కీలక ఆధారాలు బయటపెట్టింది. వాటి ఆధారంగా పదిమందిపై అభియోగాలు నమోదుచేశారు. మాఫియా డాన్ చోటా రాజన్ కు వ్యతిరేకంగా అనేక ఆర్టికల్స్ రాశారనే కారణంతో జేడేను హతమార్చినట్లు ప్రాథమిక దర్యాప్తు ద్వారా తెలుస్తోంది. మిడ్ డే అనే పత్రికకు జే డే ఎడిటర్‌గా పనిచేశారు. -
'జైల్లోనే ఛోటా రాజన్‌ను చంపేస్తాం'
మాఫియా డాన్ ఛోటా రాజన్‌ను తిహార్ జైల్లోనే హతమారుస్తామని మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుడిభుజం ఛోటా షకీల్ హెచ్చరించాడు. శనివారం దావూద్ 60వ బర్త్ డే సందర్భంగా ఛోటా షకీల్ ఓ జాతీయ వెబ్‌సైట్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. దావూద్ బర్త్ డే వేడుకలు, డి గ్యాంగ్ వ్యవహారాలు, ఛోటా రాజన్‌తో విరోధం తదితర విషయాల గురించి మాట్లాడాడు. ఛోటా రాజన్ చచ్చిన పాముతో సమానమని ఛోటా షకీల్ అన్నాడు. 'రాజన్‌ను మేం ప్రత్యర్థిగా భావించడం లేదు. మాకు వ్యతిరేకంగా అతను నిలబడలేడు. ప్రస్తుతం అతడు ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. రాజన్‌ను తిహార్ జైల్లోనే చంపేస్తాం. అతణ్ని చంపేందుకు గతంలో పలుమార్లు ప్రయత్నించాం. అయితే కొద్దిలో తప్పించుకున్నాడు. ఈ రోజు కాకపోతే రేపయినా రాజన్‌ను హతమారుస్తాం' అని ఛోటా షకీల్ చెప్పాడు. బాలిలో రాజన్‌ను అరెస్ట్ చేసిన ఇండోనేసియా పోలీసులు అతణ్ని భారత్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌లో రహస్య జీవితం గడుపుతున్న దావూద్ ఘనంగా బర్త్ డే వేడుకలు చేసుకుంటున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఛోటా షకీల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక డి గ్యాంగ్ నుంచి దావూద్ వైదొలిగి మరొకరికి బాధ్యతలు అప్పగించనున్నట్టు వచ్చిన వార్తలు కూడా వాస్తవం కాదని వెల్లడించాడు. 'దావూడ్ భాయ్ ఎప్పటికి రిటైర్ కాడు. ఎప్పటికి అతనే మాకు బాస్. అతడి స్థానాన్ని భర్తీ చేసే సత్తా ఎవరికీ లేదు' అని ఛోటా షకీల్ చెప్పాడు. -
'దావూద్‌ను పట్టుకోవడం అంత ఈజీ కాదు'
ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడం అంత సులభం కాదని, ఎందుకంటే అతను మన శత్రు దేశం రక్షణలో ఉన్నాడని ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్ నీరజ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఇటీవల అరెస్టైన దావూద్ బద్ధ విరోధి, గ్యాంగ్‌స్టర్ ఛోటారాజన్ కూడా చేసే సాయమేమీ లేదని ఆయన చెప్పారు. 'దావూద్ పట్టుకోగలమని మేం చెప్పలేం. ఎందుకంటే పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కనుసన్నలో అతను ఉండటం. అతన్ని పట్టితేవాలన్న రాజకీయ చిత్తశుద్ధి మన దేశానికి లేకపోవడం. శత్రుదేశం రక్షణలో ఉండటం వల్లే అతను ఇంకా మనకు పట్టుబడకుండా ఉండగలుగుతున్నాడు. పరారీలో ఉన్న అతన్ని పట్టుకోవడం అంత సులభమేమీ కాదు' అని ఆయన చెప్పారు. నీరజ్‌కుమార్ 'డయల్ ఫర్ డాన్' పేరిట రాసిన పుస్తకాన్ని ముంబైలో శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నీరజ్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా ప్రయత్నిస్తే దావూద్‌ను భారత్‌కు తీసుకొచ్చి శిక్షించే అవకాశముంటుందని చెప్పారు. 1990లలో దావూద్ లొంగిపోవడానికి ముందుకొచ్చాడని నీరజ్‌కుమార్ తన పుస్తకంలో వెల్లడించడం.. ఇటీవల మీడియా పతాక శీర్షికలకు ఎక్కిన సంగతి తెలిసిందే. దావూద్‌తో తాను మూడుస్లారు ఫోన్లో సంభాషించానని, చివరిసారిగా తాను రిటైర్మెంట్కు ముందు 2013లో అతని నాకు ఫోన్ చేశాడని ఆయన వివరించారు. -
తీహార్ జైలుకు భద్రత పెంపు
న్యూఢిల్లీ: మాఫియా డాన్ ఛోటా రాజన్ ను తరలించడంతో తీహార్ జైలుకు భద్రత పెంచారు. ఛోటా రాజన్ ను ఉంచిన తీహార్ జైలు 2 పరిసరాల్లో అసాధారణ భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి అంగుళం కవరయ్యేవిధంగా కెమెరాలు పెట్టారు. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో రాజన్ ను గురువారం తీహార్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో 10 మంది హెడ్ వార్డర్స్, 10 మంది వార్డర్స్, ఒక డిప్యూటీ సూపరిండెంటెంట్, ఇద్దరు అసిస్టెంట్ సూపరిండెంటెంట్స్ తో భద్రత ఏర్పాటు చేసినట్టు జైలు డీజీ తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి భద్రత ఉల్లంఘన జరిగినా సహించబోమని సిబ్బందిని హెచ్చరించినట్టు చెప్పారు. జైలు బయట ఐటీబీపీ, సీఆర్పీఎఫ్ బలగాలను మొహరించినట్టు వెల్లడించారు. ఛోటా రాజన్ పై నమోదైన 71 కేసులపై సీబీబీ దర్యాప్తు జరుపుతోంది. -
తీహార్ జైలుకు చోటా రాజన్
ఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ ను అధికారులు బుధవారం తీహార్ జైలుకు తరలించారు. సీబీఐ విచారణ అనంతరం ఛోటారాజన్‌కు కస్టడీని పొడిగించిన న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. తిరిగి డిసెంబర్ 3న కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా స్పెషల్ జడ్జి ఓపి సైనీ ఆదేశించారు. కాగా, ఫేక్ పాస్ పోర్టు కేసులో సుదీర్ఘకాలంగా తప్పించుకు తిరుగుతున్న మాఫియా డాన్ రాజేంద్ర సదాశివ్ నిఖల్జీ అలియాస్ చోటారాజన్‌పై హత్యకేసు, డ్రగ్స్, సహా 85 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా వున్నాడు. అయితే ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర గుజరాత్, పోలీసుల నుంచి 71 కేసులను సీబీఐ విచారణకు స్వీకరించింది. ఇండోనేషియాలో పట్టుబడ్డ చోటా రాజన్‌ను ఇంటర్‌పోల్ సహాయంతో ప్రత్యేక విమానంలో అధికారులు భారత్‌కు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. -
ఛోటా రాజన్ కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ: మాఫియా డాన్ ఛోటా రాజన్ అలియాస్ రాజేంద్ర సదాశివ నికల్జేను మరో నాలుగు రోజులు సీబీఐ కస్టడీకీ అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. గత అక్టోబర్ 25న ఇండోనేసియాలోని బాలీలో అరెస్టయిన ఛోటా రాజన్‌ను నవంబర్ 6న భారత్‌కు తరలించిన సీబీఐ అధికారులు ఢిల్లీలోనే ఉంచి విచారిస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం నాటికి కస్టడీ గడువు ముగియడంతో అధికారులు.. ఢిల్లీ సీబీఐ కోర్టు ఎదుట ఛోటాను హాజరుపర్చారు. ఈ నెల 19 వరకు రాజన్‌ను సీబీఐ కస్టడీకి అప్పగిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ప్రస్తుతం ఛోటా రాజన్ ను సీబీఐ ప్రధాన కార్యాలయంలోని ప్రత్యేక సెల్లో ఉంచి విచారిస్తున్నారు. కాగా, గత శుక్రవారం రాజన్‌ను ఆయన సోదరీమణులు కలుసుకున్నారు. 'భాయ్ దూజ్' పండుగ సందర్భంగా తమ సోదరుణ్ని కలుసుకునేందుకు అనుమతించాలని రాజన్ సోదరీమణులు కోర్టును అభ్యర్థించడంతో ఆమేరకు అనుమతి లభించింది. ముంబై, ఢిల్లీ నగరాల్లో చోటుచేసుకున్న 80 కేసుల్లో ప్రధాని నిందితుడిగా ఉన్న ఛోటా రాజన్.. భారత్ నుంచి పారిపోయి 27 ఏళ్లపాటు విదేశాల్లో తలదాచుకున్న సంగతి తెలిసిందే.