Debt distress
-
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
యాచారం: అప్పుల బాధతో మనస్తాపానికి గురైన రైతు వ్యవసాయ పొలంలోని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన యాచారం మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నక్కర్తమేడిపల్లి గ్రామానికి చెందిన మేకల సుధాకర్‌రెడ్డి(50)కి నాలుగెకరాల పొలం ఉంది. తన పొలంలో రెండేళ్లుగా రూ.4 లక్షలకు పైగా ఖర్చు చేసి బోరుబావులు తవ్వించాడు. కరువు పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయం కూడా సాగడం లేదు. దీంతో సాగుకు చేసిన అప్పులు, పెట్టుబడి అప్పులు విపరీతంగా పెరిగాయి. దీనికి తోడు ఏడాది క్రితమే సుధాకర్‌రెడ్డి భార్య యాదమ్మ మృతి చెందడంతో కొన్ని నెలలుగా తీవ్ర మనుస్తాపంతో కాలం వెల్లదీస్తున్నాడు. ఆదివారం ఉదయం తన వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి కొడుకు, కూతురు ఉన్నారు. అప్పుల బాధతో మృతి చెందిన సుధాకర్‌రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ బాషా డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లిక్కి కృష్ణంరాజు తెలిపారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
హసన్‌పర్తి : అప్పుల బాధ భరించలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ నగర శివారులోని వంగపహాడ్ గ్రామానికి చెందిన గండు కొమురయ్య (60) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం అతని కుమారుడు గండు రమేష్ స్థానికంగా వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు. అందుకు కొమురయ్య అప్పులు తీసుకొచ్చాడు. అప్పులు పెరిగిపోవడంతోపాటు డబ్బులు ఇచ్చిన వారు వేధింపులకు గురిచేశారు. దీంతో మానసిక వేదనకు గురైన కొ మురయ్య శుక్రవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగా డు. పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు ఎంజీఎంకు తరలించారు. కాగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి భార్య ఐలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. -
వేర్వేరుగా ముగ్గురి బలవన్మరణం
భీమ్‌గల్: అప్పుల బాధ తాళలేక ఓ యువ రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని బడాభీమ్‌గల్‌లో చోటు చేసుకుంది. ఎస్సై సుఖేందర్‌రెడ్డి కథనం మేరకు.. గ్రామానికి చెందిన రైతు లంక రమేశ్ (36)కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. రమేశ్ తనకున్న రెండెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తీవ్ర కరువు నేపథ్యంలో రెండేళ్లుగా సాగు చేస్తున్న పంటలు చేతికందక సుమారు ఆరు రూ.6 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. ఈ ఏడు కూడా వరి పంట సాగు చేశాడు. అయితే, నెల రోజులుగా వర్షాలు లేకపోవడంతో పంట ఎండిపోయింది. దీంతో అప్పులు తీర్చే మార్గం లేక తనకున్న రెండెకరాలలో అర ఎకరం పొలాన్ని సైతం అమ్మేశాడు. అయినా అప్పులు పూర్తిగా తీరకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. రెండ్రోజుల క్రితం తన పొలంలోనే క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన పరిసర పొలాల రైతులు హుటాహుటిన కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి, జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. కేసు దర్యాప్తులో ఉంది. మరో ఘటనలో వివాహిత.. డిచ్పల్లి: కడుపునొప్పి తాళలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. డిచ్పల్లి ఎస్సై నరేందర్‌రెడ్డి కథనం మేరకు.. మండలంలోని ఖిల్లా డిచ్పల్లికి చెందిన ఎర్ర లక్ష్మి (50) కొంతకాలంగా కడుపునొప్పితో బాధ పడుతోంది. నొప్పి మరీ ఎక్కువ కావడంతో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త నర్సయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జీవితంపై విరక్తి చెంది.. మద్నూర్: అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ వ్యక్తి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. మద్నూర్ పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని మేనూర్‌కు చెందిన సాబ్టె సాయిలు (33)కు భార్య, ఇద్దరు కుమారులు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన జీవితంపై విరక్తి చెంది, బుధవారం రాత్రి చెట్టుకు ఉరేసుకున్నాడు. గురువారం ఉదయం గమనించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మద్నూర్ ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. -
చిన్న వయసులోనే పెద్ద కష్టం
అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య వీధిన పడిన కుటుంబం జనగామ రూరల్ : 25 ఏళ్లకే నూరేళ్లు నిండాయి ఈ రైతుకు. తల్లిదండ్రుల నుంచి తనకు వచ్చిన రెండెకరాల్లో సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఎర్రగొల్లపహాడ్ గ్రామానికి చెందిన కొత్తపల్లి భాస్కర్(25) అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు రెండెకరాల భూమి తో పాటు ఉమ్మడి కుటుంబంలో చేసిన అప్పులో భాస్కర్ వాటాకు వచ్చిన రూ.3 లక్షల అప్పు కూడా ఉంది. అయితే రెండేళ్లుగా సరైన దిగుబడి లేక, అప్పు తీర్చే మార్గం లేక మనో వేదనకు గురవుతున్నాడు. వ్యవసాయం కాకుండా వేరే పని చేసుకుందామని కొన్ని రోజుల క్రితం కుటుంబంతో జనగామ వస్తే అక్కడా భం గపాటే ఎదురైంది. దీంతో మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. రెండేళ్ల క్రితమే పెళ్లయిన భాస్కర్‌కు భార్య మహాలక్ష్మి, ఆరునెలల కూతురు ఉన్నారు. ఇప్పుడు వారిద్దరూ వీధిన పడే పరిస్థితి ఏర్పడింది. -
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య
సుండుపల్లి: అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వైఎస్సార్ జిల్లా సుండుపల్లి మండలం అగ్రహారంలో శనివారం చోటుచేసుకుంది. రైతు రాజగోపాల్‌రెడ్డి (46) సొంతూరు రాయచోటి మండలం సుజ్జాల. సుండుపల్లి అగ్రహారానికి 15 ఏళ్ల క్రితం వచ్చాడు. అప్పటినుంచి యేటిగడ్డరాచపల్లి, నర్సరీ సమీపంలో ఉన్న 5 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి, కూరగాయలు, వేరుశనగ పంటలను సాగుచేసేవాడు. అయితే పంటల్లో దిగుబడి సరిగా రాక చేసిన అప్పులు తీరకపోవడంతో శనివారం తెల్లవారుజామున గుళికలమందు తిని పొలంవద్ద పడిపోయాడు. సమీపంలోని రైతులు గమనించి బంధువులకు తెలియజేయడంతో వారంతా వచ్చిచూసేసరికి అప్పటికే మృతిచెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజగోపాల్‌రెడ్డికి ప్రైవేటుగా, బ్యాంకుల్లో కలిపి రూ.10లక్షల వరకు అప్పు ఉంది. కుమారుడు కె. రమేష్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై మధుసూధన్‌రెడ్డి తెలిపారు. అనంతరం మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు తరలించారు. -
నలుగురు రైతుల ఆత్మహత్య
సాక్షి, నెట్వర్క్: అప్పులబాధ తాళలేక వేర్వేరు ప్రాం తాల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం పీచర గ్రామానికి చెందిన శివరాత్రి చిరంజీవి (35), ఇదే జిల్లా జఫర్‌గఢ్ మండలం రఘునాథపల్లికి చెందిన టేకుమట్ల కుమార్(30), ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వీఆర్ బంజర్‌కు చెందిన రైతు ధన్ సింగ్(48), కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మం డలం లచ్చనాయక్తండాకు చెందిన లావుడ్య తిరుపతి(38) బలవన్మరణాలకు పాల్పడ్డారు. -
అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య
* భార్యాపిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్న బాలరాజ్ * హైదరాబాద్ సీతారాంబాగ్‌లో విషాదం హైదరాబాద్: అప్పుల బాధకు ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో భార్యాభర్తలతో పాటు కవల పిల్లలు మృతిచెందారు. హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారాంబాగ్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి... సీతారాంబాగ్ అఫ్జల్‌సాగర్ పాలమూరు బస్తీ వాసి, పాత సామాన్ల వ్యాపారస్తుడైన బాలరాజ్(30), సురేఖ(24) భార్యాభర్తలు. వీరికి 13 నెలల కవలలు మేథ, మేఘన. బాలరాజ్ తల్లి మణెమ్మ, సోదరుడు ప్రేమ్‌తో కలసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. బాలరాజ్ వ్యాపారం దివాలా తీయడంతో అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకొస్తున్నాడు. రెండు నెలలుగా ఖాళీగా ఉండటంతో అప్పులు అధికమై, వడ్డీలు పేరుకుపోయాయి. బాకీల కోసం అప్పులవాళ్ల ఒత్తిడి పెరిగింది. వాటిని తీర్చే మార్గం లేక తీవ్ర మనోవేదనకు గురైన బాలరాజ్ ఆదివారం రాత్రి భోజనం చేసిన తరువాత తన కుటుంబంతో ఓ గదిలోకి వెళ్లారు. తొలుత భార్యకు కూల్‌డ్రింక్‌లో, పిల్లలకు పాలలో విషం కలిపి ఇచ్చి... అనంతరం అతను ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం 9 గంటలైనా గదిలో నుంచి ఉలుకూ పలుకూ లేకపోవడంతో అనుమానం వచ్చిన సోదరుడు.. తలుపులు పగులగొట్టాడు. పరుపు మీద సురేఖ, పిల్లలు.. ఫ్యాన్‌కు వేలాడుతూ బాలరాజ్ కనిపించారు. వారిని నిలోఫర్ ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. ఆర్థిక కారణాలే ఆత్మహత్యకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. గోషామహాల్ ఏసీపీ రాంభూపాల్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హృదయ విదారక దృశ్యం చూసి బస్తీవాసులు కన్నీటి పర్యంతమయ్యారు. -
చదువులు, పెళ్లిళ్లూ కారణమే
* రైతు ఆత్మహత్యలపై సర్కారు * వాటి వల్లే అప్పులంటూ హైకోర్టులో కౌంటర్ సాక్షి, హైదరాబాద్: రైతులు వారి పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చేర్చడానికి, పెళ్లిళ్లు చేయడానికి అధికంగా ఖర్చు చేస్తూ అప్పుల పాలవుతున్నారని...వారి ఆత్మహత్యలకు ఇదీ ఓ కారణమని రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. అలాగే విచక్షణారహితంగా బోర్లు తవ్వడం, భూముల లీజు, కుటుంబ తగాదాలు, దీర్ఘకాలిక అనారోగ్యాలు, ప్రైవేటు వ్యక్తుల రుణాల వల్ల కూడా అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపింది. రైతుల ఆత్మహత్యల నివారణకు తాము ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ దాఖలైన పలు ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు తాజాగా కౌంటర్ దాఖలు చేసింది. రైతుల ఆత్మహత్యల నివారణకు, వారి సంక్షేమం కోసం చేస్తున్న ప్రయత్నాలు, తీసుకుంటున్న చర్యలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం తమను నిందించడానికే పిటిషనర్లు ఈ వ్యాజ్యాలను దాఖలు చేశారని ప్రభుత్వం తరఫున వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తన కౌంటర్లో పేర్కొన్నారు. పిటిషనర్లు తమను నిందించే బదులు అర్థవంతమైన సలహాలు ఇస్తే బాగుండేదన్నారు. రైతుల సంక్షేమం విషయంలో తాము బాధ్యతల నుంచి పారిపోవట్లేదని వివరించారు. ఎప్పటినుంచో కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. 2014 జూన్ 2న అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు మరింత లబ్ది చేకూర్చేందుకు ప్రస్తుత పథకాలు సమర్థంగా అమలయ్యేలా చర్యలు ప్రారంభించామని అన్నారు. కౌంటర్లో ప్రభుత్వం ఏం చెప్పిందంటే... ‘‘రైతులను రుణ విముక్తులను చేయడమే లక్ష్యంగా పంట రుణాల మాఫీకి నిర్ణయం తీసుకున్నాం. 2014-15 ఆర్ధిక సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి రూ. లక్ష వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేయాలని నిర్ణయించి రూ. 4,250 కోట్లు విడుదల చేసి 35,29,944 రైతు ఖాతాల్లో రూ. 4,039.98 కోట్లు జమ చేశాం. 2015-16 ఆర్థిక సంవత్సరానికి రెండో దశ రుణ మాఫీ కింద రూ.4086 కోట్లు విడుదల చేశాం. ఇన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా రైతులు ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. 2015 సెప్టెంబర్‌లో జరిగిన రైతు ఆత్మహత్యల ఆధారంగా అధ్యయనం చేయగా 154 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు పత్రికలు, టీవీల్లో కథనాల ద్వారా వెల్లడైంది. ఇందులో 94 కేసులు వ్యవసాయ సమస్యలకు సంబంధించినవని జిల్లా అధికారులు పేర్కొన్నారు. కానీ 41 కేసులు వ్యవసాయానికి చెందినవి కావు, మరో 12 కేసులు ఆత్మహత్యలు కావు. మిగిలిన 7 కేసుల్లో ఫోరెన్సిక్ నివేదికల కోసం ఎదురుచూస్తున్నాం. ఆ ఆత్మహత్యలపై మేం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణ చేపడుతుంది. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర స్థాయిలో బృందాలను ఏర్పాటు చేసి జిల్లాలకు పంపుతున్నాం. గత రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు రాకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంతేకాక ప్రైవేటు అప్పులు, పెళ్లిళ్లు, చదువులు, బోర్ల తవ్వకాలపై విచక్షణారహితంగా ఖర్చు చేస్తున్నారు. దీర్ఘకాలిక అనారోగ్యాలు, కుటుంబ వివాదాలు, గల్ఫ్‌కు వెళ్లేందుకు భారీగా అప్పులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా రైతుల ఆత్మహత్యలకు కారణాలు’’ అని సర్కారు తన కౌంటర్లో పేర్కొంది. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తున్నాం... ‘‘రైతు సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం అలసత్వాన్ని ప్రదర్శించలేదు. చీప్ పబ్లిసిటీ కోసమే పిటిషనర్లు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. గతంలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని మేము రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచాం. లోన్ సెటిల్మెంట్ సీలింగ్‌ను రూ. 50 వేల నుంచి రూ. లక్ష చేశాం. దీనికితోడు పలు అదనపు ప్రయోజనాలు కూడా వర్తింప చేస్తున్నాం. గతేడాది రాష్ట్రంలో 1,347 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనడంలో వాస్తవం లేదు. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు 782 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందులో 342 కేసులు అసలైనవి. నేషనల్ క్రైమ్ రికార్డుల ప్రకారం గతేడాది 898 ఆత్మహత్యలు జరిగితే అందులో కేవలం 295 ఆత్మహత్యలు వ్యవసాయ సంబంధితమైనవి. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తున్నాం. ఏ సిఫారసును అమలు చేయలేదో పిటిషనర్లు నిరిష్టంగా చెప్పట్లేదు. కాబట్టి వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాలను కొట్టేయండి’’ అని ప్రభుత్వం కోర్టును కోరింది. -
అప్పులు తీర్చలేక..
అప్పలు ఇచ్చిన వారి బాధలు తట్టుకోలేక ఓ రైతు విద్యుత్ తీగలు పట్టుకొని ఆత్మహుతి చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం చిలకమర్తి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యాదయ్య చారీ(38) వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం గ్రామానికి చెందిన కొంత మంది వద్ద అప్పు తీసుకున్నాడు. పంట దిగుబడి లేక పోవడంతో చేసిన అప్పులు తీర్చలేకపోయాడు. దీంతో అప్పు ఇచ్చిన వాళ్లు వత్తిడి చేయడంతో.. రెండు రోజుల నుంచి ముభావంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇదే అంశం పై ఆదివారం ఉదయం భార్య భర్తల మధ్య గొడవ జరగడంతో.. బావి వద్దకు వె ళ్తున్నానని చెప్పి వెళ్లి అక్కడ మోటర్ దగ్గర ఉన్న విద్యుత్ తీగలను పట్టుకొని మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎద్దు ఏడ్చింది.. ఎవుసం ఎండింది..
అప్పుల బాధతో 10 మంది రైతుల ఆత్మహత్య ముస్తాబాద్/మంథని: ఎద్దు ఏడ్చిన ఎవుసానికి.. రైతు ఏడ్చిన రాజ్యానికి కష్టకాలమే మిగులుతుంది. ఇంటిల్లిపాదీ ఎండనకా, వాననకా రెక్కలు ముక్కలు చేసి కష్టపడ్డా.. వర్షాభావంతో పం ట లెండి, కనీసం పెట్టుబడి కూడా దక్కక.. అప్పులెలా తీర్చాలనే వేదనతో అన్నదాతలు ఉసురుతీసుకుంటున్నారు. పంట నష్టం, అప్పులబాధతో గురువారం తెలంగాణ జిల్లాల్లో 10 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మం డలం పోత్గల్‌కు చెందిన నీరటి రాములు(28), మంథని మండలం కూచిరాజ్‌పల్లికి చెందిన రైతు అంబటి సంపత్(35), మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లికి చెం దిన బి.రవీందర్‌రెడ్డి(45), వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లికి చెందిన నాగరబోయిన ఓదేలు(30), మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన నూనె వెంకన్న(55), రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం డబీల్‌పూర్ గ్రామానికి చెందిన యువరైతు సత్యనారాయణ(26), పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్ గ్రామానికి చెందిన కావలి తిరుమలయ్య(50), ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ముచ్చర్లకు చెందిన పత్తి రైతు రాయల వీరన్న(50), నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం గండిమాసానిపేట గ్రామానికి చెందిన రైతు కొడిపాక సాయిబాబా (37), కరీంనగర్ జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటలో శనిగరం మధునయ్య బల వన్మరణాలకు పాల్పడ్డారు. -
కౌలురైతు ఆత్మహత్య
అప్పులు భారంతో మరో అన్నదాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం తేడూరు గ్రామానికి చెందిన కౌలురైతు జానా గోపాల్(30) గురువారం ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే... గోపాల్ ఐదేళ్లుగా రెండెకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. పంటలు సరిగా పండక అప్పుల భారం పెరిగిపోవడంతో మనస్థాపం చెందిన గోపాల్ అందరూ పడుకున్న తర్వాత ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఐదుగురు రైతుల ఆత్మహత్య
సాక్షి నెట్వర్క్: అప్పుల బాధ తాళలేక తెలంగాణ జిల్లాల్లో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం వరకు ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బర్దిపూర్కు చెందిన రైతు మూడ నర్సింలు(38), ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలం దుగ్నేపల్లికి చెందిన రైతు వెన్నపురెడ్డి సంజీవరెడ్డి(45), రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీకి చెందిన సప్పిడి అశోక్(45), మర్పల్లి మండలం కోటమర్పల్లి గ్రామానికి చెందిన తుడుము పెంటయ్య(60), మహబూబ్‌నగర్ జిల్లా తాడూరు మండలం ఐతోల్ గ్రామానికి చెందిన కర్నె కృష్ణయ్య (48) బలవన్మరణాలకు పాల్పడ్డారు. కరెంట్ షాక్‌తో ఒకరు... పొలం వద్ద కాపలాగా ఉన్న కుక్కకు ఆహారం పెట్టడానికి వెళ్లిన ఓ రైతు కరెంట్ షాక్‌తో మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం అడవి లింగాలలో జరిగింది. గ్రామానికి చెందిన శివగారి బాలరాజు(46) పొలం వద్ద ఉన్న కుక్కకు ఆహారం పెట్టేందుకు మంగళవారం రాత్రి పొలానికి వెళ్లాడు. ఉదయం వరకు ఇంటికి రాకపోవడంతో బుధవారం కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా, బోరు మోటారు వద్ద కరెంట్ షాక్‌తో చనిపోయి కనిపించాడు. -
మహిళా రైతు ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక.. ఓ మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా రాయకల్ మండలం వడ్డెలింగాపూర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మహిళా రైతు మాలోవత్ సునిత(38) తనకున్న రెండెకరాల భూమితో పాటు గ్రామానికి చెందిన మరో రైతుకు చెందిన మూడున్నర ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో రెండేళ్లుగా పంటలు సరిగ్గా పండక అప్పులు ఎక్కువవడంతో.. వాటిని తీర్చేదారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
13 మంది రైతుల ఆత్మహత్య
- నల్లగొండలోనే నలుగురు సాక్షి నెట్వర్క్: తెలంగాణ జిల్లాల్లో అప్పుల బాధతో శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు మొత్తం 13 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావిగూడెంకు చెందిన అనిరెడ్డి హనుమారెడ్డి(62) తనకున్న మూడు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. రూ. 5 లక్షల వరకు అప్పు చేసి మొత్తం తొమ్మిది బోర్లు వేసినా చుక్కనీరు పడలేదు. అప్పు తీరే మార్గం కనిపించక మనస్తాపానికి గురైన హనుమారెడ్డి శనివారం ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగాడు. మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి.. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో రాత్రి మరణించాడు. ఇదే జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామానికి చెందిన రైతు పెండ్యాల లక్ష్మయ్య(45) తనకున్న 3 ఎకరాలతో పాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నాడు. రెండేళ్లుగా నష్టాలు రావడం తో రూ. 6 లక్షల మేరకు అప్పు అయ్యింది. ఈ ఏడాది పంట చేతికి వచ్చే పరిస్థితి లేక మనోవేదనకు గురై ఈ నెల 22న క్రిమిసంహారక మందు తాగాడు. వెంటనే హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా, ఏడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఆదివారం చనిపోయాడు. గుర్రంపోడు మండలానికి చెందిన రైతు ఇటికాల యాదయ్య(42) తనకున్న 3 ఎకరాలతో పాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నాడు. వరుస నష్టాలతో పాటు ఈ ఏడాదీ పంట చేతికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. సాగు కోసం చేసిన రూ. 6 లక్షల అప్పు ఎలా తీరుతుందనే బెంగతో ఆదివారం ఉదయం ఉరి వేసుకున్నాడు. ఇదే జిల్లా నల్లగొండ మండలం అప్పాజీపేటకు చెందిన గంగుల రాములు(55) ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నాడు. సాగు కోసం రూ. 3 లక్షల వరకు అప్పు చేశాడు. మనస్తాపానికి గురైన రాములు ఈ నెల 12న క్రిమిసంహారక మందు తాగాడు. ఆస్పత్రికి తరలించగా, ఆదివారం మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం మాచారూర్కు చెందిన రైతు బోదుకం గంగారాం(60)కు నాలుగు ఎకరాల భూమి ఉండగా, 6 బోర్లు వేసినా చుక్కనీరు పడలేదు. ఈ ఏడాది కేవలం 2 ఎకరాల్లో మాత్రమే మొక్కజొన్న వేశాడు. అదికూడా నీరు లేక ఎండిపోయింది. బోర్ల కోసం చేసిన అప్పులు రూ. 5 లక్షలు అయ్యాయి. అప్పు పై బెంగతో నిత్యం మథనపడేవాడు. ఆదివారం కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లగా, ఇంట్లో ఉన్న గంగారాం ఉరి వేసుకున్నాడు. ఇదే జిల్లా చొప్పదండి మండలం రాగంపేటకు చెందిన రైతు సుద్దాల గంగయ్య(42) తన మూడు ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. రూ. 5 లక్షల అప్పు అయ్యింది. అప్పు తీరే మార్గం కనిపించక శనివారం అర్ధరాత్రి వ్యవసాయ బావిలోకి దిగి పైపులకు ఉరి వేసుకున్నాడు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ధరిపల్లికి చెందిన రైతు సిద్ధిరాములు(23) తనకున్న ఎకరన్నరలో మొక్కజొన్న సాగు చేశాడు. పంట చేతికి రాక పోగా, వరుస నష్టాలతో అప్పు రూ. 3 లక్షల వరకు చేరుకుంది. కలత చెందిన సిద్ధిరాములు శనివారం వేకువ జామున ట్రాన్స్ఫార్మర్ వైర్లను పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే జిల్లా నాగాపూర్ గ్రామానికి చెందిన రైతు నీల పోచయ్య(65) తనకున్న రెండు ఎకరాల్లో 2 బోర్లు వేయించగా, ఒకదాంట్లో కొద్దిగా నీరుపడింది. దీంతో అర ఎకరం మాత్రమే వరిసాగు చేశాడు. నీరు లేక పంట ఎండుముఖం పట్టింది. బోర్లు వేసేందుకు, సాగు కోసం చేసిన అప్పు రూ. 2 లక్షల వరకు అయ్యింది. అప్పు తీరే మార్గం కనిపించక ఆదివారం ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన రైతు బాకారపు ప్రణీత్‌రెడ్డి(29) తనకున్న మూడు ఎకరాలతో పాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. సాగు కోసం రూ. 5 లక్షల వరకు అప్పు చేశాడు. కాలం కలిసి రాక పంటలు ఎండిపోవడంతో అప్పు తీరే మార్గం కనిపించక మనస్తాపానికి గురయ్యాడు. శనివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా దామరగిద్ద మండలం లోకుర్తికి చెందిన రైతు కుర్వ లక్ష్మయ్య(50) తనకున్న రెండు ఎకరాల్లో బోర్లు ఎండిపోవడంతో అర ఎకరం మాత్రమే వరి సాగు చేశాడు. బ్యాంకు నుంచి రూ. లక్ష, వడ్డీ వ్యాపారుల నుంచి మరో రూ. లక్ష అప్పు చేశాడు. అప్పు తీరే మార్గం కనిపించక శనివారం రాత్రి క్రిమిసంహారక మందు తాగాడు. ఇదే జిల్లా అచ్చంపేట మండలం పులిజాలకు చెందిన రైతు పిల్లి ఆనంద్(38) ఐదెకరాల్లో పత్తి సాగు చేశాడు. ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాలేదు. అప్పు తెచ్చిన రూ. మూడు లక్షలు ఎలా తీర్చాలని మనస్తాపానికి గురయ్యా డు. ఆదివారం సాయంత్రం ఇంటిలో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకున్నాడు. ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన చెరుకూరి బాబురావు(45) తన అర ఎకరంతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాడు. అప్పు తీరే మార్గం కనిపించక ఆదివారం క్రిమిసంహారక మందు తాగాడు. ఇదే జిల్లా పాల్వంచ మండలం పాయాకారి యానంబైల్ పరిధి పునుకులకు చెందిన రైతు నీరుడు మాధవరావు(40) తనకున్న ఎకరన్నరకు తోడు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. వర్షాలకు పత్తి దెబ్బతింది. దీంతో మనోవేదనకు గురైన మాధవరావు శనివారం రాత్రి క్రిమిసంహారక మందు తాగాడు. ఆగిన గుండెలు.. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం సంకాపూర్ గ్రామానికి చెందిన బెస్తనాగుల నర్సింహులు(55), వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం ఈదులపూసపల్లి శివారు సీత్లాతండాకు చెందిన రైతు అజ్మీర బాల్యా(48), పాలమూరు జిల్లా భూత్పూర్ మండలం వెల్కిచర్లకు చెందిన రైతు దాసరి జనార్దన్‌రెడ్డి(58) వర్షాభావ పరిస్థితుల్లో పంటపోయిందనే బెంగతో మనోవేదనకు గురై అప్పు తీరేమార్గం కనిపించక ఆదివారం గుండె ఆగి మరణించారు. కరెంట్ షాక్‌తో ఇద్దరు రైతులు మృతి ఆదిలాబాద్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రానికి చెందిన రైతు కొప్పుల చెతిర్ చిన్నభూమేశ్(38), మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలంలోని చారకొండ గ్రామపంచాయతీ పరిధిలోని బోడబండ తండాకు చెందిన రైతు లక్ష్మీపతి (40) ఆదివారం కరెంట్ షాక్‌తో చనిపోయారు. -
కాడిపట్టే రైతు.. కాటికి చేరుతున్నాడు
17 మంది అన్నదాతల ఆత్మహత్య సాక్షి నెట్వర్క్: తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు. కాడి పట్టి దుక్కి దున్నే రైతన్న సాగు భారమై.. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు వివిధ జిల్లాల్లో 17 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా... నర్వ మండలం కన్మనూర్‌కు చెందిన రైతు చిన్న కొండన్న(48) మూడున్నర ఎకరాల్లో వేసిన కంది పంట కళ్లముందే ఎండిపోయింది. సాగు కోసం చేసిన రూ. 4.5 లక్షల అప్పు తీర్చే మార్గం లేక ఉరి వేసుకున్నాడు. తలకొండపల్లి మండలం లింగరావులపల్లికి చెందిన రైతు పోతుగంటి వెంకట్‌రెడ్డి(40) 24 ఎకరాల్లో వేసిన పత్తి పంట ఎండిపోవడంతో మంగళవారం క్రిమిసంహారక మందు తాగాడు. పెద్దకొత్తపల్లిమండలం చెన్నాపురావుపల్లికి చెందిన రైతు పిట్టల వెంకటస్వామి(40) పంట చేతికి వచ్చే పరిస్థితి లేక ఉరి వేసుకున్నాడు. మల్దకల్ గ్రామానికి చెందిన రైతు సుందర్రాజు సాగు కోసం రూ.2 లక్షలు అప్పు చేశాడు. తీరేమార్గం కనిపించక బుధవారం ఉరి వేసుకున్నాడు. భూత్పూర్ మండలం పెద్దతాండకు చెందిన ఉడ్యావత్ పాండు (39) అప్పు తీర్చే మార్గంలేక మంగళవారం పురుగుమందు తాగాడు. మెదక్ జిల్లా.. పాపన్నపేట మండలం అన్నారం గ్రామానికి చెందిన జంగిడి పెంటయ్య(50) అప్పుల బాధ పెరగడంతో బుధవారం ఉరి వేసుకున్నాడు. దుబ్బాక మండలం పోతారెడ్డిపేటకు చెందిన మల్కనగిరి బాలయ్య(60) అప్పు తీర్చే మార్గం లేక ఉరేసుకున్నాడు. మెదక్ మండలం రాజ్‌పల్లికి చెందిన సార శంకర్‌గౌడ్(42) పంట కోసం 4 లక్షల అప్పు చేశాడు. తీరే మార్గంలేక మంగళవారం రాత్రి కరెంట్ వైర్లు పట్టుకున్నాడు. పటాన్చెరు మండలం ఐనోల్కు చెందిన రైతు చిట్టికింది ఎల్లయ్య(38) బుధవారం ఉరి వేసుకున్నాడు. వరంగల్ జిల్లా... గణపురం మండలం ధర్మారావుపేట శివారు జంగుపల్లికి చెందిన రైతు వేముల వీరారావు(40) అప్పుల బాధ తట్టుకోలేక గతంలో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ క్రమంలో బుధవారం ఉరి వేసుకున్నాడు. నర్సంపేట మండలం చంద్రయ్యపల్లికి చెందిన రైతు బాషబోయిన శ్రీను(35) అప్పులు పేరుకుపోవడంతో క్రిమిసంహారక మందు తాగాడు. నర్సంపేట మండలం మాధన్నపేటకు చెందిన రైతు మెంతుల సాంబరాజు(26) బుధవారం ఉరి వేసుకున్నాడు. గీసుకొండ మండలం శాయంపేటహవేలి గ్రామానికి చెందిన రైతు పంజాల రాజలింగం(65) పంటలు సరిగా పండకపోవడంతో రూ. 2 లక్షల వరకు అప్పు చేశాడు. ఈ నెల 19న ఆత్మహత్యాయత్నం చేశాడు. బుధవారం చనిపోయాడు. రంగారెడ్డి జిల్లా.. మేడ్చల్ మండలం రావల్‌కోల్‌కు చెందిన రైతు గడీల లక్ష్మణ్(28) మొక్కజొన్న, పత్తి సాగు చేస్తున్నాడు. పంట ఎండు ముఖం పట్టడంతో అప్పు చేసి రెండు బోర్లు వేయించాడు. అయినా, చుక్కనీరు రాలేదు. అప్పు రూ. 3 లక్షలకు చేరడంతో తీర్చే మార్గం కనిపించక మంగళవారం ఉరి వేసుకున్నాడు. శంషాబాద్ మండలం రషీద్గూడకు చెందిన రైతు కోడూరి వెంకటేష్(38) పంటలు సరిగా పండకపోవడంతో అప్పులు పెరిగాయి. దీంతో గతేడాది వెంకటేష్ భార్య చందన ఆత్మహత్యకు పాల్పడింది. సాగు కోసం చేసిన అప్పులు రూ. 2.5 లక్షలకు చేరాయి. దీంతో ఈ నెల 21న క్రిమిసంహారక మందు తాగాడు. చికిత్సపొందుతూ బుధవారం మృతి చెందాడు. షాబాద్ మండలం ఏట్ల ఎర్రవల్లికి చెందిన బేగరి విఠలయ్య(45) అప్పులు రూ. 5 లక్షలకు చేరడంతో మనోవేదనకు గురై బుధవారం సాయంత్రం పొలంలో ఉరివేసుకున్నాడు. మరోవైపు నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం చౌళ్లరామారం గ్రామానికి చెందిన రైతు మెట్టు కృపాకర్‌రెడ్డి(37) పెట్టుబడుల కోసం రూ. 7 లక్షల వరకు అప్పు చేశాడు. దిగుబడి సరిగా వచ్చే అవకాశం లేకపోవడంతో మనస్తాపానికి గురై మంగళవారం ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగాడు. హైదరాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, బుధవారం చనిపోయాడు. -
అన్నదాతలకు పరిహాసమే!
- 2014 జూన్ 2 నుంచి 1,115 మంది రైతుల ఆత్మహత్య - పరిహారం పెంచినా బాధిత కుటుంబాలకు వర్తించని వైనం - బలవన్మరణాలకు పాల్పడింది 409 మందేనని సర్కారు కాకిలెక్కలు సాక్షి, హైదరాబాద్: పంటనష్టం ఆవేదనతో, అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలను ఆదుకుంటామన్న రాష్ట్ర ప్రభుత్వం... పరిహారం ప్రకటనలో మాత్రం వారికి అన్యాయమే చేసింది. ఇప్పటికే తమ ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలకు... పెంచిన పరిహారం వర్తించదని చెప్పి మరింత నిర్వేదంలో కూరుకుపోయేలా చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (2014, జూన్ 2) నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 1,100 మందికి పైగా రైతులు బలవన్మరణం చెందగా... వారి కుటుంబాలను ప్రభుత్వం విస్మరించింది. శనివారం నుంచి జరిగే ఘటనలకు మాత్రమే రూ.6 లక్షల కొత్త పరిహారం వర్తిస్తుందని ప్రకటించింది. ఇందులో రూ.5 లక్షలు బాధిత కుటుంబాలకు అందజేసి, మిగతా రూ.లక్షతో వన్‌టైం సెటిల్మెంట్ కింద అప్పులు తీరుస్తామని పేర్కొంది. అయితే వన్‌టైం సెటిల్మెంట్లో ప్రైవేటు అప్పులు మాత్రమే కాకుండా బ్యాంకు రుణాలు కూడా తీర్చాలని బాధితులు కోరుతున్నారు. దీనిపై సర్కారు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అన్నీ తప్పుడు లెక్కలే! ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల సంఖ్యపైనా సర్కారు కాకిలెక్కలు చూపుతోంది. ఇటీవల సర్కారు వెల్లడించిన లెక్కల ప్రకారం 409 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 141 మంది మాత్రమే వ్యవసాయ సంబంధిత అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారించారు. మిగతా వారికి సంబంధించి విచారణ జరుపుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్య చేసుకుంటే దాన్ని వ్యవసాయ సంబంధిత అప్పుల కారణంగా ఆత్మహత్యగా ప్రభుత్వం పరిగణించడం లేదు. ఇలా అనేక కొర్రీలు పెడుతోంది. అయితే రైతు సంఘాలు వేసిన లెక్కల ప్రకారం ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల సంఖ్య 1,115కు పైనే. -
ముగ్గురు రైతుల బలవన్మరణం
సాక్షి నెట్వర్క్: రాష్ర్టంలో రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు. నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆదివారం ముగ్గురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా కోటగిరికి చెందిన రైతు ఎడ్డెడి పోశెట్టి(55) తనకున్న ఎకరంతో పాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొన్నాడు. అప్పు చేసి ట్రాక్టర్ కూడా కొన్నాడు. అయితే ఈసారి సరైన వర్షాలు లేక పంటలు ఎండిపోయాయి. దీంతో మార్కెట్ గోదాంలో వాచ్‌మన్‌గా చేరాడు. కాగా, గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన పోశెట్టి తిరిగి రాలేదు. ఆదివారం ఉదయం మృతదేహం కనిపించింది. అప్పుల బాధతోనే పోశెట్టి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వెంకటంపేటకు చెందిన రైతు రాసిక చినమల్లయ్య (55) తనకున్న ఐదున్నర ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. పెట్టుబడుల కోసం రూ.3 లక్షల వరకు అప్పు చేశాడు. వర్షాలు లేక పత్తి చేను వాడిపోయింది. దిగుబడి వచ్చే అవకాశం లేకపోవడంతో అప్పులు తీర్చే మార్గంలేక మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా మల్దకల్ మండలం మల్లెందొడ్డికి చెందిన కుర్వ బజారి గోపాల్(30)తనకున్న నాలుగు ఎకరాల్లో పత్తి, వేరుశనగ సాగు చేశాడు. వీటి కోసం రూ. లక్షకు పైగా అప్పు చేశాడు. అప్పు తీర్చలేనేమోనని మనస్తాపానికి గురై ఆదివారం ఉరేసుకున్నాడు. పంట ఎండిందని గుండెపోటు మాచారెడ్డి: పంట ఎండిందనే బెంగతో ఆదివారం నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం అంకాపూర్‌లో గుండెల్లి లింగయ్య(55) అనే రైతు గుండెనొప్పితో కుప్పకూలాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. కెనాల్లోపడి రైతు మృతి ధర్మసాగర్: గెదే తోక పట్టుకొని కాలువ దాటే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు అందులో పడి ఓ రైతు మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా ఎలుకుర్తిలో ఆదివారం జరిగింది. గుండవరపు వెంకట్రావు(65) ఆదివారం వ్యవసాయ బావికి వెళ్తున్న క్రమంలో కాలువను దాటేందుకు గెదే తోకను పట్టుకున్నాడు. ఈ క్రమంలో నీటిప్రవాహధాటికి పట్టుతప్పడంతో నీటిలో కొట్టుకుపోయి మృతి చెందాడు. -
ఆత్మస్థైర్యాన్ని నింపేదిశగా...
- రైతులకు వీడియో సందేశం - రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో అప్పుల బాధతో రైతన్నలు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేదిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇం దులో భాగంగానే రాష్ట్ర సమాచార శాఖ ఆ ధ్వర్యంలో ఓ వీడియో సందేశాన్ని రూపొం దించింది. ఐదు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో స్వయంగా ముఖ్యమంత్రి సిద్దరామ య్య ‘ఆత్మహత్యలకు పాల్పడకండి, ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండండి, ప్రభుత్వం ఎప్పుడూ మీకు అండగా ఉంటుంది’ అంటూ రైతులకు విన్నవించారు. ఈ వీడియో సందేశాన్ని అన్ని మీడియా సంస్థల్లో ప్రసారం చేయడంతో పాటు సామాజిక అనుసంధాన వెబ్సైట్లలో సైతం రాష్ట్ర ప్రభుత్వం పోస్ట్ చేసింది. ఈ చర్యల ద్వారా రైతుల్లో ఆత్మవిశ్వా సాన్ని నింపి, వారు ఆత్మహత్యలకు పాల్పడకుండా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వీడియోలో సీఎం ఏమన్నారంటే.... రాష్ట్ర సమాచార శాఖ ‘బదుకు- బేసాయ’ పేరిట రూపొందించిన ఈ వీడియోలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రైతులనుద్దేశించి మాట్లాడారు. ఈ వీడియోలో సీఎం ఏమన్నారంటే....‘ప్రియమైన రైతులారా, రాష్ట్రంలో ప్రతిరోజు చోటుచేసుకుంటున్న రైతుల ఆత్మహత్యలు నన్నెంతగానో బాధిస్తున్నాయి. బలవన్మరణానికి పాల్పడ్డ రైతుల కుటుంబాలను ఓదార్చేందుకు నాకు మాటలు కూడా రావడం లేదు. రాష్ట్రంలోని రైతులందరికీ చేతులు జోడించి నేను కోరుకునేది ఒక్కటే, ఒత్తిళ్లకు భయపడి ఎట్టి పరిస్థితుల్లోనూ, కలలో కూడా ఆత్మహత్య గురించి ఆలోచించకండి. నేను కూడా ఒక రైతు కుటుంబంలోనే పుట్టాను, పేదరికంలోనే పుట్టి పెరిగిన వాడిని, అందుకే రైతుల కష్టసుఖాల గురించి నాకు బాగా తెలుసు, ఏడాదంతా కష్టించి పండించిన పంటకు సరైన మద్దతు ధర లభించకపోతే రైతులు ఎంతగా కుంగిపోతారో నాకు బాగా తెలుసు, అయినా కూడా మీ ఆత్మస్థైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు, ఒక ఆత్మబంధువుగా, ఒక సన్నిహితునిగా, ముఖ్యంగా మీ అందరి ఆత్మీయ ముఖ్యమంత్రిగా నేను మిమ్మల్ని కోరేది ఇదే, రైతుల అప్పులకు సంబంధించి వారిపై ఒత్తిడి తీసుకురావద్దని ఇప్పటికే కమర్షియల్ బ్యాంకులతో పాటు ప్రభుత్వ రంగ, సహకార బ్యాంకులకు సైతం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మా ప్రభుత్వం ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుంది’. అని సిద్ధరామయ్య ఈ వీడియోలో వ్యాఖ్యానించారు. కాగా, మంత్రులు రోషన్‌బేగ్, డి.కె.శివకుమార్, కృష్ణబేరేగౌడ, ఎస్.ఆర్.పాటిల్, మహదేవ ప్రసాద్‌లు సైతం రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఈ వీడియోలో కోరారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
సిరుగుప్ప : తాలూకా పరిధిలోని బైరగామదిన్ని గ్రామానికి చెందిన రైతు వీరేష్ (45) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం రైతు తన ఇంటిలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ తాళ లేక రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మృతునికి బ్యాంకులు, ప్రైవేట్ వ్యక్తుల ద్వారా రూ.2 లక్షలకు పైగా అప్పులు ఉన్నట్లు తెలిపారు. రైతు ఆత్మహత్య ఉదంతం సిరుగుప్ప నియోజకవర్గంలో తీవ్ర విషాదం మిగిల్చింది. కుటుంబ పెద్ద దిక్కు అయిన రైతు ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తెతో పాటు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రైతు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న బళ్లారి జిల్లాధికారి సమీర్‌శుక్లా, ఇతర అధికారులు రైతు కుటుంబాన్ని పరామర్శించి రూ.25 వేల చెక్కును అందజేశారు. బళ్లారి జిల్లాలో రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం బాధాకరంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. -
బతుకు భారమై..
వ్యక్తి బలవన్మరణం - దుబాయికి పాస్‌పోర్ట్ సైతం తీసి.. - వెళ్లేందుకు చేతిలో డబ్బులు లేక... - ఆత్మహత్యకు పాల్పడిన వైనం మెదక్‌రూరల్: అటు అప్పుల బాధ.. ఇటు బతుకుదెరువు లేక ఓ వ్యక్తి తీవ్ర మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మగ్ధూంపూర్ పంచాయతీ మదిర గ్రామమైన మస్తాన్పూర్లో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బైకరి సాయిలు(43)కు ఎకరంన్నర వ్యవసాయ పొలం ఉండింది. ఏడాది క్రితం ఉన్న పొలాన్ని అమ్మి కూతురు పెళ్లి చేశాడు. అయితే అత్తారింటి వేధింపులు భరించలేక కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. నాటి నుంచి సాయిలు కుంగికుషించిపోయాడు. కంటికి రెప్పలా కాపాడుకున్న బిడ్డ లోకం విడిచిపోవడంతో ఎప్పుడూ మనోవేదనకు గురయ్యేవాడు. కాగా ఆసరా ఇచ్చిన పొలం పోగా, స్థానికంగా బతుకుదెరువు లేక అప్పులోళ్లను ఆశ్రయించాడు. సుమారు రెండు లక్షల వరకు అప్పులు అయ్యాయి. దుబాయి వెళ్లేందుకు పాస్‌పోర్టును సైతం తీశాడు. కాని అక్కడకు వెళ్లేందుకు డబ్బులు లేక నిత్యం దిగాలు చెందేవాడు. ఇక కుటుంబ పోషణకు అప్పులు పుట్టకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. ఇక చేసేది లేక తెల్లవారుజామున అదివరకే తెచ్చుకున్న కూల్‌డ్రింక్‌లో విష గుళికలు కలుపుకుని తాగాడు. ఉదయం లేచి చూసిన ఇంటి ఇల్లాలికి భ ర్త విగత జీవిగా పడిఉండటంతో బోరున ఏడ్చింది. విషయం తెలిసిన రూరల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరకుని శవాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. సాయిలుకు భార్య అంశవ్వ, పదోతరగతి చదువుతున్న కొడుకు ఉన్నారు. కొడుకు పైలం.. ఏన్నడు లేని తన భర్త బుధవారం రాత్రి భోజనం చేశాక కొడుకు భవిష్యత్తు పయిలమని, వాడిని ఉన్నత చదువులు చదివించాలని తన భర్త తనతో చెప్పాడని సాయిలు భార్య అంశవ్వ బోరున విలపించింది. పాస్‌పోర్ట్ వచ్చింది కాదా... విదేశాలకు వెళ్తాడేమే అనుకున్నాను గానీ... తిరిగిరాని లోకాలకు వెళ్తాడని ఊహించలేకపోయానని ఆమె గుండెలు బాదుకున్న తీరు గ్రామస్తులకు కంటనీరు తెప్పించింది. కుమారుడు శ్రీనివాస్ తన తండ్రి పాస్‌పోర్ట్‌ను చూపుతూ అయాయకపు చూపులతో చూడసాగాడు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని గ్రామసర్పంచ్ యాదమ్మ, ఎంపీటీసీ భిక్షపతి ప్రభుత్వాన్ని కోరారు. -
కుటుంబం ఆత్మహత్యాయత్నం
- భార్య మృతి - విషమ పరిస్థితిలో భర్త - ప్రమాదం నుంచి బయట పడిన చిన్నారులు - సంఘటనా స్థలాన్ని పరీశీలించిన డీసీ, ఎస్పి. మండ్య : పేద కుటుంబం అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు ప్రయత్నిం చింది. ఈ ఘటనలో భార్య మృతి చెం దగా, భర్త మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ సంఘటన జిల్లాలోని పాండవపుర తాలూకా చినకురళి గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది. పాండవపుర పోలీసులు కథనం మేరకు చినకురళి గ్రామానికి చెందిన దినేష్(30) కూలీ. ఈయనకు భార్య శ్వేత (27), కు మార్తె స్పందన(4), మోనిక(3)ఉన్నా రు. అయితే కుటుంబ అవసరాల కోసం దినేష్ పలుచోట్ల అప్పులు చేశాడు. రుణదాతల ఒత్తిళ్లు అధికం కావడంతో, అప్పుడు తీర్చలేక కుటుం బం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం ఉదయం కాలం చెల్లిన మాత్రలు తీసుకుని నీటిలో వేసుకుని మింగారు. మొదట భర్త దినేష్, భార్య శ్వేత ఆ నీటిని తాగారు. అనంతరం పెద్ద కుమార్తె స్పందనకు ఆ నీటిని తాపిస్తుండగా చిన్నకుమార్తె భయంతో ఏడచు కుంటూ పారిపోయింది. బయటికి వెళ్లిన చిన్నారి ఏడుస్తుండగా స్థానికులు గమనించి, బాలికతోపాటు ఇంటిలోకి వచ్చారు. అప్పటికే ఇంట్లో ముగ్గురూ కిందపడిపోయి విలవిల్లాడుతున్నారు. వెంటనే 108 వాహనానికి ఫోన్ చేసి కుటుంబం మొత్తాన్ని మైసూరు నగరంలోని కే.ఆర్.ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేయిస్తుండగా శ్వేత మృతి చెందింది. భర్త దినేష్ చావు బతుకుల మధ్యకొట్టుమిట్టాడుతున్నారు. అయితే చిన్నారికి ఎలాంటి ప్రాణ హాని లేదని డాక్టర్లు తెలిపారు. చికిత్స పొందుతున్న వారిని జిల్లా అధికారి డాక్టర్ అజయ్ నాగభూషన్, జిల్లా ఎస్పీ భూషన్ జీ బోరసే పరామర్శించారు. పాండవ పుర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ముగ్గురు అన్నదాతల ఆత్మహత్య
సాక్షి, నెట్వర్క్: అప్పుల బాధతో వేర్వేరు చోట్ల ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం జ్యోతినగర్‌కు చెందిన గిద్దె అబ్రహాం(65), మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచకు చెందిన ఎలికట్ట జంగయ్య(35) గురువారం ఉరేసుకున్నారు. కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మం డలం చిల్వకోడూర్‌కు చెందిన తొట్ల రాజయ్య(60) క్రిమిసంహారక మందు తాగాడు. విద్యుదాఘాతంతో.. నందిపేట: నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని కుద్వాన్పూర్కి చెందిన గుండు పోతన్న (62) కరెంటు కాటుకు బలయ్యాడు. చేనులోని బావి వద్ద మోటారుకు చెందిన సర్వీస్ వైరు కిం దపడిపోయింది. దానిని పక్కకు తొలగిస్తుండగా పోతన్న విద్యుదాఘాతానికి గురయ్యూడు. పిడుగుపాటుతో మరొకరు మృతి గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం ముత్నూర్‌కు చెందిన ఎం.కేశవ్(29) ధామన్గూడ శివారులోని తన చేను వద్దకు గురువారం వెళ్లాడు. సాయంత్రం వర్షం వస్తుం డగా పక్కనే ఉన్న మామిడి చెట్టు కిందికి వెళ్లగా పిడుగుపడి అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. -
దా‘రుణం’
⇒ అప్పుల బాధతో రైతన్న బలవన్మరణం ⇒ మూడు బోర్లు వేసినా చుక్కనీరు పడలేదు.. ⇒ బావిలో అత్తెసరు నీటితో పంటలసాగు.. ⇒ అవి ఎండిపోవడంతో మనోవేదన ⇒ అప్పులు తీరేమార్గం లేదని ఉరివేసుకొని ఆత్మహత్య ⇒ వికారాబాద్ మండలం కొటాలగూడ లాల్‌సింగ్ తండాలో ఘటన వికారాబాద్ రూరల్: వ్యవసాయాన్నే నమ్ముకున్న ఆయన అప్పులు చేసి మూడు బోర్లు తవ్వించినా చుక్కనీరు పడలేదు. ఓ బావి తవ్వించగా వచ్చిన అత్తెసరు నీటితో సాగుచేసిన పంటలు ఎండిపోయాయి. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి.. ఇక అప్పులు తీర్చేమార్గం లేదని మనోవేదనకు గురైన ఓ రైతు ఉరివేసుకొని తనువు చాలించాడు. ఈ విషాదకర సంఘటన వికారాబాద్ మండలం కొటాలగూడ అనుబంధ లాల్‌సింగ్ తండాలో గురువారం చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన రామవత్ తార్యా(35),చాందిబాయి దంపతులకు కుమారులు రమేష్, శంకర్, కూతుళ్లు లక్ష్మి, రోజాలు ఉన్నారు. ఇద్దరు కూతుళ్ల వివాహం జరిగింది. కుమారులిద్దరు వికారాబాద్‌లో ఉంటున్నారు.పెద్ద కొడుకు పనిచేస్తుండగా చిన్న కొడుకు శంకర్ చదువుకుంటున్నాడు. తార్యా దంపతులు తమకున్న మూడు ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గతంలో అప్పు లు చేసి పొలంలో మూడు బోర్లు వేయించినా చుక్కనీరు కూడా పడలేదు. దీంతో ఏడాది క్రితం అప్పు చేసి బావిని తవ్వించగా కొద్దిపాటి నీరు వచ్చింది. ఇటీవల రబీసీజన్‌లో సాగు చేసిన పూల తోట, వరిపంటకు సరిగా నీరు అందకపోవడంతో ఎండుముఖం పట్టా యి. తార్యా పెట్టుబడుల కోసం గొల్కోండ గ్రామీణ బ్యాంక్‌లో రూ. 80 వేలు తీసుకున్నాడు. బోర్లు, బావి తవ్వించేందుకు మొత్తం రూ. 3 లక్షల వరకు అప్పులు అయ్యాయి. పంటలు ఎండుముఖం పట్టడంతో ఇక అప్పులు తీరేమార్గం లేదని మనోవేదనకు గురైన ఆయన.. గురువారం మధ్యాహ్నం పొలంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీటిపర్యంతమయ్యారు. పోలీ సులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య చాందిబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శేఖర్ తెలిపారు. అప్పుల బాధతో వ్యవసాయకూలీ ఆత్మహత్య పరిగి: అప్పుల బాధతో మనస్తాపం చెం దిన ఓ వ్యవసాయకూలీ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పరిగి మండల పరిధిలోని సయ్యద్‌పల్లిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎదిరె సైదప్ప(48), భీమమ్మ దంపతులు తమకున్న ఎకరంన్నర పొలంలో వ్యవసాయం చేసుకుంటూ మిగతా సమయంలో కూలీపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. ఏడాది క్రితం సైదప్ప అప్పు చేసి కుమార్తె పెళ్లి చేశాడు. పరిగి ఏడీబీ బ్యాంకులో రూ.లక్ష అప్పు ఉండగా, కుటుంబ పోషణ ఇతర అవసరాలకు తెలిసిన వారి వద్ద మరో రూ. 3లక్షలు అప్పు చేశాడు. అప్పులు తీర్చేమార్గం లేకపోవడంతో మనస్తాపం చెందిన బుధవారం పొలానికి వెళ్లాడు. సాయంత్రం గ్రామానికి చెందిన రైతు మోహన్‌రెడ్డి బావిలో దూకాడు. కొద్దిసేపటికి గమనించిన గ్రామస్తులు సైదప్పను బయటకు తీయగా అప్పటికే మృతిచెందాడు. మృతుడి కుటుంబాన్ని బుధవారం రాత్రి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పరామర్శించారు. గురువారం పరిగి ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉందని ఎస్ఐ కృష్ణ పేర్కొన్నారు. -
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య
కోవెలకుంట్ల: వ్యవసాయ జూదంలో ఓ రైతు ఓడిపోయాడు. నాలుగేళ్లుగా వ్యవసాయం అచ్చిరాక పెట్టుబడుల కోసం చేసిన అప్పులు అన్నదాత ఊపిరి తీశాయి. అప్పుల బాధ తాళలేక కంటమనేని రాఘవేంద్ర(34) అనే యువరైతు మంగళవారం క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అందించిన సమాచారం మేరకు వివరాలు.... కృష్ణాజిల్లా అవనిగడ్డ ప్రాంతానికి చెందిన కంటమనేని వెంకట్రావు కుటుంబం 50 సంవత్సరాల క్రితం కోవెలకుంట్లకు వలస వచ్చింది. పట్టణ శివారులోని పేరా బిల్డింగ్స్ సమీపంలో నివాసం ఉంటూ వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయంలో కష్టపడి పని చేసి నాలుగెకరాల పొలం సంపాదించుకున్నారు. సొంతపొలంతోపాటు కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఈయనకు ఇద్దరు కుమారులు రాఘవేంద్ర, కృష్ణ సంతానం. కుమారులిద్దరూ త ండ్రిబాటలోనే నడిచి వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. పెద్దకుమారుడు రాఘవేంద్ర తండ్రికి తోడుగా వ్యవసాయం చేసేవాడు. సొంత పొలంతోపాటు ఎకరాకు 20 బస్తాల వడ్లలు చెల్లించేలా మరో 14 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వరిపంట పండిస్తున్నాడు. నాలుగేళ్ల నుంచి వాతావరణం అనుకూలించక పెట్టుబడులు పెరిగిపోయి, దిగుబడులు అంతంత మాత్రంగానే వచ్చాయి. మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టాల ఊబిలో కూరకుపోయాడు. పెట్టుబడుల కోసం ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ. 20 లక్షల మేర అప్పులు చేశాడు. వ్యవసాయం కలిసి రాకపోవడం, చేసిన అప్పులు పెరిగిపోవడం, అప్పు చెల్లించాలంటూ ఒత్తిళ్లు అధికం కావడంతో కొంతకాలం నుంచి రాఘవేంద్ర తీవ్ర మనోవేదనకు గురిఅయ్యాడు. అప్పులు చెల్లించేందుకు ఉన్న మార్గాలన్నీ మూసుకపోవడం, అప్పులు చెల్లించేందుకు మరో మార్గం లేకపోవడంతో క్రిమిసంహారక మందు తాగి తనువు చాలించాడు. మృతునికి భార్య పద్మ, నాల్గో తరగతి చదువుతున్న కుమార్తె మహాలక్ష్మి, రెండో తరగతి చదువుతున్న కుమారుడు తేజ ఉన్నారు. అప్పుల బాధతో రాఘవేంద్ర ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు, మున్నీరుగా విలపిస్తున్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
రామన్నపేట: అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి శుక్రవారం రాత్రి ఓ రైతు ఆత్యహత్యకు పాల్పడ్డాడు. నల్గొండ జిల్లా రామన్నపేట మండలం యెన్నారం గ్రామానికి చెందిన శ్రీరాములు రాజు(36) అనే రైతు ఈ ఏడాది 3 ఎకరాల్లో వరి పంట సాగుచేశాడు. పొలంలో మడులు కట్టడం, ఇతరత్రా పనుల కోసం రూ.4 లక్షల వరకు అప్పు చేశాడు. కానీ నీళ్లు లేక సాగుచేసిన పంట ఎండిపోయింది. గతేడాది సాగు కలిసి రాక పోవడం, ఇప్పుడు పంట ఎండిపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపం చెందాడు. దీంతో పంట కోసం తెచ్చిన మందు తాగి శ్రీరామలు పొలంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.