Department of Tourism
-
పర్యాటక ప్రాంతాలుగా తీర్చి దిద్దుతాం
సాక్షి, హైదరాబాద్: మూసీనది పరీవాహక ప్రాంతంలో చారిత్రక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు ముందుకురావాలని ఆయన పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతోపాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళుతోందని తెలిపారు. హైదరాబాద్‌లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు సీఐఐ(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ)తో రాష్ట్ర పర్యాటక శాఖ శుక్రవారం ఒప్పందం చేసుకుంది.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ మూసీ ప్రక్షాళనను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. ప్రస్తుతం పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరిస్తున్నామని, త్వరలోనే అందులో శాసనమండలి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం శాసనమండలి ఉన్న జూబ్లీహాలుకు చారిత్రక ప్రాధాన్యం ఉందని, ప్రత్యేక టెక్నాలజీతో ఆ భవనాన్ని నిర్మించారని, భవిష్యత్‌లో దాన్ని పరిరక్షించాల్సిన అవసరముందన్నారు. జూబ్లీహాలును కూడా దత్తత తీసుకొని పరిరక్షించాలని ఆయన సీఐఐకి సూచించారు.ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని పరిరక్షిస్తామని, ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్ స్టేడియానికి తరలిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. హైకోర్టు భవనం, హైదరాబాద్ సిటీ కాలేజ్ భవనంతో పాటు పురానాపూల్ బ్రిడ్జి వంటి కట్టడాలను కూడా పరిరక్షిస్తామని, ఇప్పటికే చారి్మనార్ పరిరక్షణ ప్రాజెక్ట్ కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీప్రసాద్, సీఐఐ తెలంగాణ చైర్మన్ సాయిప్రసాద్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు పాల్గొన్నారు. పురాతన మెట్ల బావులను దత్తత తీసుకున్న పారిశ్రామికవేత్తలు ⇒ నగరంలో పురాతన మెట్ల బావులను పునరుద్ధరించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. ఈ మేరకు సీఎం రేవంత్‌కు వారు ఒప్పందపత్రాలు అందజేశారు. ⇒ ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలఖా మెట్ల బావి పునరుద్ధరణకు ఇన్ఫోసిస్ సంస్థ ఒప్పందం చేసుకుంది. ⇒ సాయిలైఫ్ సంస్థ మంచిరేవుల మెట్ల బావిని దత్తత తీసుకుంది. ⇒ భారత్ బయోటెక్ సంస్థ సాలార్ జంగ్, అమ్మపల్లి బావులను పునరుద్ధరించనున్నది. ⇒ అడిక్‌మెట్ మెట్ల బావిని దొడ్ల డెయిరీ, ఫలక్‌నుమా బావిని ఆరీ్టసీ, రెసిడెన్సీ మెట్ల బావిని కోఠి ఉమెన్స్ కాలేజీ పునరుద్ధరించనుంది. -
బొర్రా గుహలకు మహర్దశ
అనంతగిరి (అల్లూరి సీతారామరాజు జిల్లా): విశ్వఖ్యాతి పొందిన బొర్రా గుహలను అతి సుందరంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసం రూ. 29.88 కోట్లను మంజూరు చేసింది. గురువారం ఈ పనులకు ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కాగా, 1807లో విలియం కింగ్ గుర్తించిన ఈ గుహల్లో సున్నపురాయి ఖనిజంతో ఏర్పాటయిన మానవమెదడు, శివలింగం, డైనోసార్, మొసలి, శివపార్వతి, తల్లీబిడ్డ, రుషి, సాయిబాబా, తేనెపట్టులాంటి వివిధ ఆకృతులు చూపరులను కనువిందు చేస్తున్నాయి. 1995 ముందు వరకు స్థానిక గిరిజనులు కాగడాలతో బొర్రాగుహలను నిర్వహించేవారు. తరువాత పర్యాటకశాఖ విద్యుత్ సౌకర్యం కల్పించి, లైట్లను ఏర్పాటు చేసింది. స్థానిక గిరిజనులకు టికెట్‌పై కమిషన్ ఇచ్చి నడిపేవారు. 2000 నుంచి పర్యాటకశాఖ నిర్వహిస్తోంది. వచ్చే ఆదాయంలో కొంతమేర గుహల అభివృద్ధికి కేటాయించింది. మూడు విభాగాల్లో.. కేంద్ర ప్రభుత్వం స్వదేశీ సందర్శన్ పథకంలో భాగంగా మంజూరు చేసిన రూ.29.88 కోట్లతో మూడు విభాగాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. మొదటి విభాగంలో రైల్వేస్టేషన్ నుంచి కొండప్రాంతంలోని పార్కింగ్ ప్రదేశం వరకు రోడ్డుమార్గంలోని దారిపొడవునా వీధి లైట్లు ఏర్పాటు చేస్తారు. పార్కింగ్ ప్రదేశాన్ని సుందరంగా అభివృద్ధి చేయడంతో పాటుగా పచ్చదనంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. రెండో విభాగంలో బొర్రాగుహలు ముఖద్వారం వద్ద తాత్కాలికంగా షాపింగ్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తారు. మూడో విభాగంలో బొర్రా ముఖద్వారం వద్ద పర్యాటకుల సౌకర్యార్థం క్యాష్ లెస్ టికెట్ విధానంలో అమలు చేస్తారు. సందర్శన టికెట్లు ఆన్లైన్, పేటీఎం ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఇప్పటివరకు బొర్రా గుహల్లో 40 వరకు బెల్జియం లైట్లు ఉండగా, మరో 60 అదనంగా ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకశాఖ ఈఈ రమణ మాట్లాడుతూ బొర్రాగుహల అభివృద్ధి పనులకు సంబంధించి, టెండర్ పూర్తి కాగానే పనులు మొదలు పెడతామని చెప్పారు. -
ఆలయ దర్శనం.. ఆధ్యాత్మిక పరవశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేవదాయ, పర్యాటక శాఖ సంయుక్తంగా భక్తులకు వ్యయప్రయాసలు లేనివిధంగా ఆలయ దర్శనాలు కల్పించనుంది. ఇందులో భాగంగా తొలి దశలో 20 ప్రముఖ, చారిత్రక ఆలయాలను అనుసంధానం చేస్తూ 18 సర్క్యూట్లను రూపొందించింది. స్పెషల్ దర్శనంతో పాటు భోజన, వసతి, రవాణా సౌకర్యాలతో కూడిన ఒకటి/రెండు రోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వేర్వేరుగా ఆధ్యాత్మిక సర్క్యూట్ల ప్రయాణాలను గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. నచ్చిన ప్యాకేజీల్లో నిత్య దర్శనం పిల్గ్రిమ్ పాత్‌వేస్‌కు చెందిన ‘బుక్ మై దర్శన్’ వెబ్సైట్ ద్వారా ఏపీటీడీసీ ప్రత్యేక ప్యాకేజీలను నిర్వహించనుంది. గతంలో సీజన్ల వారీగా నడిచే ప్యాకేజీ టూర్లను ఇకపై నిత్యం ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో సాధారణ ప్యాకేజీలో పాటు కో బ్రాండింగ్ ఏజెన్సీ అయిన బుక్ మై దర్శన్ ద్వారా భక్తులు కోరుకున్న (కస్టమైజ్డ్ సర్వీసు) ఆలయాల దర్శనాలకు, పర్యటనలకు, గైడ్, భోజన వసతుల (బ్యాకెండ్ సర్వీసుల)ను కల్పిస్తోంది. ఏపీటీడీసీ బస్సులతో పాటు.. ప్రస్తుతం రాష్ట్రంలో ఏపీటీడీసీకి చెందిన 21 బస్సులు, మరో రెండు వాహనాలు పర్యాటక సేవలు అందిస్తున్నాయి. వీటిలో 15 బస్సులు తిరుపతిలో, మరో 8 వాహనాలు విశాఖపట్నంలో నడుస్తున్నాయి. తాజాగా ఆధ్యాత్మిక సర్క్యూట్లను నిర్వహించేందుకు ట్రాన్స్‌పోర్టు, మార్కెటింగ్ సేవలను ‘బుక్ మై దర్శన్’ అందించేలా అగ్రిమెంట్ చేసుకుంది. ప్రస్తుత ప్యాకేజీల ద్వారా రోజుకు 1,500 నుంచి 2వేల మంది వరకు మాత్రమే పర్యాటకులు నమోదవుతున్నారు. ఈ సంఖ్యను 5వేల వరకు పెంచాలని ఏపీటీడీసీ యోచిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సర్వీసులను పెంచుతోంది. తొలి దశల్లో 18 సర్క్యూట్లను ప్రతిపాదించగా.. రెండో దశలో మరో 7 సర్క్యూట్లను తీసుకురానుంది. తిరుపతిలో బ్యాక్ ఎండ్ సర్వీసుల కింద ప్రతి పర్యాటకుడికి ఆర్ఎఫ్ఐబీ ట్యాగ్లు వేసి పక్కాగా దర్శనం కల్పించేలా సాంకేతిక వ్యవస్థను వినియోగించనుంది. ఒక రోజు ప్యాకేజీ ధరలు ఇలా (పెద్దలు/చిన్నారులు) ♦ విజయవాడ, అమరావతి, మంగళగిరి, పొన్నూరు, బాపట్ల, సూర్యలంక బీచ్ (రూ.970/రూ.780) ♦ హైదరాబాద్, శ్రీశైలం (రూ.1,960/రూ.1,570) ♦ కర్నూలు, శ్రీశైలం (రూ.1,560/రూ.1,250) ♦ విశాఖపట్నం సిటీ టూర్ (రూ.940/రూ.750) ♦ కర్నూలు, మంత్రాలయం (రూ.1,320/రూ.1,060) ♦ విశాఖపట్నం, అరసవల్లి, శ్రీకాకుళం, రామబాణం (రూ.1,650/రూ.1,320) ♦ విజయవాడ, అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, పిఠాపురం (రూ.1,470/రూ.1,180) ♦ విశాఖపట్నం, అరసవల్లి, శ్రీకూర్మం (రూ.1,560/రూ.1,250) ♦ రాజమహేంద్రవరం, ద్రాక్షారామం, పిఠాపురం, అన్నవరం(రూ.1,470/రూ.1,180) ♦ విజయవాడ, ద్వారకా తిరుమల, మద్ది ఆంజనేయస్వామి (రూ.1,610/రూ.1,290) ♦కడప, గండి, కదిరి, లేపాక్షి (రూ.1,840/1,470) 2 రోజుల ప్యాకేజీల ధరలు ఇలా ♦ కర్నూలు, అహోబిలం, మహానంది, శ్రీశైలం (రూ.4,020/రూ.3,220) ♦ విజయవాడ, గుంటూరు, శ్రీశైలం, త్రిపురాంతకం, కోటప్పకొండ (రూ.3,220/రూ.2,560) ♦ కర్నూలు, యాగంటి, మహానంది, శ్రీశైలం (రూ.4,020/రూ.3,220) ♦ విజయవాడ, శ్రీశైలం, యాగంటి, మహానంది (రూ.4,670/రూ.3,740) ♦ విశాఖపట్నం, అరకు (రూ.3,070/రూ.2,460) ♦ కడప, అహోబిలం, మహానంది, శ్రీశైలం (రూ.4,460/రూ.3,570) ♦ కడప, యాగంటి, మహానంది, శ్రీశైలం (రూ.4,520/రూ.3,610) -
నీటిలో ఆటలు.. ‘టూరిజం’ కళ్లకు గంతలు.!
సాక్షి, విశాఖపట్నం :అనుమతులు లేవు. అయినా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదేళ్లగా పైగా సాగరతీరంలో స్పీడ్ బోట్లు నడిపించేశారు. స్కూబా డైవింగ్ చేయించేశారు. అయినా టూరిజం శాఖ అధికారులకు గానీ, సిబ్బందికి గానీ ఈ విషయం తెలీదంట. వాటర్ స్పోర్ట్స్ పేరుతో ప్రభుత్వానికి రూపాయి చెల్లించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి. ఇప్పటికే స్పీడ్ బోట్ల నిర్వహణ ఒప్పందాన్ని కుదర్చుకున్న ఓ సంస్థ అండతోనే టూరిజం కళ్లుగప్పి నిర్వహించినట్లు తెలుస్తోంది. వాటర్‌స్పోర్ట్స్‌లో నడుస్తున్న దందా గురించి ఆలస్యంగా తెలుసుకున్న టూరిజం శాఖ ఉన్నతాధికారులు క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వాటర్ స్పోర్ట్స్‌కు కేంద్రబిందువుగా రుషికొండ తీరం మారింది. ప్రతిరోజూ వంద మందికి పైగా పర్యాటకులు స్పీడ్‌బోట్స్, స్కూబా డైవింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వీటి నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం రెండు సంస్థలకు మాత్రమే అప్పగించింది. వీటితో పాటు టూరిజం శాఖకు చెందిన స్పీడ్ బోట్స్ కూడా ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తూ.. పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఐదేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి వాటర్‌స్పోర్ట్స్ నిర్వహణ ప్రారంభించాడు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా స్పీడ్ బోట్స్, స్కూబాడైవింగ్ ఇలా ఇష్టం వచ్చినట్లు వాటర్ స్పోర్ట్స్ నిర్వహిస్తూ రూ.లక్షల్లో ఆర్జించాడు. కానీ పర్యాటక శాఖకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. తెలిసినా తెలియనట్లు.. ఈ గుర్తింపు లేని వాటర్‌స్పోర్ట్స్ వ్యవహారాన్ని ఏపీటీడీసీ డివిజనల్ స్థాయి అధికారులు, సిబ్బంది మూడేళ్ల క్రితమే గుర్తించారు. అయినా తమకేమీ తెలీదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలం క్రితం ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ నిర్వహించేందుకు ఒక సంస్థ పర్యాటక శాఖ నుంచి అనుమతులు తీసుకుంది. సదరు సంస్థకు చెందిన వ్యక్తి ద్వారా రుషికొండ బీచ్‌లోకి ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అనుమతిలేని వ్యక్తి ప్రవేశించినట్లు తెలుస్తోంది. చెల్లింపులు సైతం సదరు సంస్థకే అందజేస్తున్నారని వాటిలో కొంత భాగం డివిజనల్ కార్యాలయానికి చెందిన కొందరికి ముడుపులు ఇస్తున్నట్లు సమాచారం. ఆలస్యంగా ఉన్నతాధికారుల దృష్టికి.. ఇటీవల పర్యాటక శాఖ ఉన్నతాధికారులు రుషికొండలో జరుగుతున్న వాటర్‌స్పోర్ట్స్ వ్యవహారాలపై సమీక్ష నిర్వహించారు. మరో సంస్థ స్కూబా డైవింగ్ నిర్వహించేందుకు అనుమతులు కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో ఇవన్నీ బయటపడ్డాయి. దీంతో సదరు యూపీకి చెందిన వ్యక్తిని టూరిజం ఉన్నతాధికారులు ప్రశ్నించగా ఇప్పుడెందుకు అడుగుతున్నారు.? ఎప్పటినుంచో ఉంది కదా అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్న సంస్థపై కేసు పెట్టాలని డివిజన్ స్థాయి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. అయితే ఇంత జరుగుతున్నా తెర వెనుక ఉండి ప్రోత్సహించి తమ లాభాలే తప్ప పర్యాటక శాఖకు రూపాయి కూడా రాకుండా వ్యవహరించిన టూరిజం శాఖ సిబ్బందిని మాత్రం వెనకేసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
రుషికొండపై నిర్మాణాల నిలుపుదలకు హైకోర్టు నిరాకరణ
సాక్షి, అమరావతి: విశాఖపట్నం రుషికొండపై జరుగుతున్న పర్యాటక శాఖ రిసార్ట్ పునరుద్ధరణ పనులను, నిర్మాణాలను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో ప్రస్తుతం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. నిర్మాణాలకు సంబంధించి ఉల్లంఘనలను పరిశీలించేందుకు ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత ఏం చేయాలో చూస్తామంది. ఉల్లంఘనలు ఏం ఉన్నాయో తాము కమిటీకి చెబుతామన్న పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చింది. కమిటీకి మీరు చెప్పాల్సిన అవసరం లేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం తేల్చిచెప్పింది. రాజకీయ నేతల వ్యాజ్యాలు.. విశాఖ జిల్లా యండాడ గ్రామం సర్వే నంబర్ 19 పరిధిలోని కోస్టల్ రెగ్యులేషన్ జోన్లో చెట్ల నరికివేత, భూమి తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ (ఎంఓఈఎఫ్) నిబంధనలు, విశాఖపట్నం పట్టణ ప్రాంతాభివృద్ధి సంస్థ మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధమంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ గతంలో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఇదే వ్యవహారంలో ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది యజ్ఞదత్ స్పందిస్తూ.. ధర్మాసనం గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు హెచ్‌టూవో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీస్ సలహాదారు గౌరప్పన్ నేతృత్వంలో ఎంఓఈఎఫ్ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ కమిటీ డిసెంబర్ మొదటి వారంలో రుషికొండ నిర్మాణాలను పరిశీలించి నివేదిక ఇస్తుందని నివేదించారు. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. మూర్తి యాదవ్ తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ.. ఉల్లంఘనలను కమిటీకి వివరించేందుకు అనుమతివ్వాలని కోరగా.. ధర్మాసనం నిరాకరించింది. ఏం ఉల్లంఘనలు ఉన్నాయో కమిటీనే చూసుకుంటుందని, మీరు చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. కమిటీ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేసింది. ఇచ్చిన అనుమతులు ఏమిటి? నిర్మాణాలు అందుకు అనుగుణంగా ఉన్నాయా? ఉల్లంఘనలు ఏం ఉన్నాయి? తదితర వివరాలను కమిటీ స్వయంగా చూసుకుంటుందని తెలిపింది. నిర్మాణాలను నిలువరించేందుకు తగిన ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ కోరగా.. ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం చెప్పింది. తదుపరి విచారణను డిసెంబర్ 27కి వాయిదా వేసింది. -
మీరు సుద్దులు చెబితే ఎలా!?
సాక్షి, అమరావతి : విశాఖ అభివృద్ధి అంటే రామోజీరావును ఎక్కడలేని ఆవేశం ఆవహిస్తుంది. అంతేకాదు.. ఆందోళన, ఆవేదన.. అక్కసు కూడా. అందుకే ఈ మధ్య తరచూ ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై ఈ విషయంలో ఎక్కడలేని విషం కక్కుతున్నారు. విశాఖలో భూ కబ్జాలంటూ నిత్యం అడ్డగోలు రాతలు రాస్తున్నారు. ప్రభుత్వాన్ని, వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసి మరీ నానా రోత రాతలు రాసిపారేస్తున్నారు. ప్రతిరోజూ ఇలా పచ్చి అబద్ధాలు చెబితే ప్రజలు నమ్మేస్తారన్నది అయన గుడ్డి విశ్వాసం. ‘ఈనాడు’ ఆవిర్భావం నుంచి రామోజీరావు ఎంచుకున్న మార్గం కూడా ఇదే. కానీ, ఇప్పుడు ఆయన అనుకుంటున్న రోజులు కావు కదా.. ఆయన ఒకటంటే సోషల్ మీడియా ఆయన్ను పది అంటూ నగ్నంగా నిలబెడుతోంది. అయినా ఇవేవీ పట్టని ఆయన ఉత్తరాంధ్ర బాగుపడకూడదన్న దురుద్దేశంతో.. నిస్సిగ్గుగా విశాఖపై చెలరేగిపోతున్నారు. తాజాగా.. రుషికొండ మీద పర్యాటక శాఖ కట్టడాలపై రామోజీ బాధ వర్ణనాతీతం. తన ఆత్మబంధువు చంద్రబాబు హయాంలో అడ్డగోలుగా కబ్జాలు జరిగితే నోరెత్తని ఆయన.. ఇప్పుడు అన్ని అనుమతులతో రుషికొండలో పర్యాటక శాఖ నిర్మాణాలు చేస్తుంటే పెడబొబ్బలు పెడుతున్నారు. నిజానికి.. విశాఖలో భూకబ్జాలు చేసిందెవరు? ఆ భూముల్ని కబ్జాదారుల నుంచి కాపాడిందెవరు? రుషికొండపై రామోజీ చేస్తున్న రచ్చలో నిజమెంత? ఒకసారి చూద్దాం.. సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్ర సమగ్రాభివృద్ధి చెందడం రామోజీకి అస్సలు నచ్చడంలేదు. అందులోను కొన్ని దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన ఉత్తరాంధ్ర, విశాఖ నగరాభివృద్ధి అంటేనే ఆయన గుండెలు బాదుకుంటున్నారు. దీంతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి తన విషపత్రికలో అడ్డగోలు కథనాల పరంపరను అచ్చేస్తున్నారు. నిజానికి.. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సమీక్షా సమావేశాలు నిర్వహించడానికి, నిశిత పర్యవేక్షణకు ముఖ్యమంత్రి, ఇతర అధికారులకు క్యాంపు కార్యాలయాలు సహా వసతి ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ప్రభుత్వానికి తన సిఫార్సులను నివేదించింది. విశాఖ నగరంలోని అనేక ప్రభుత్వ, ప్రైవేటు, ఇతరత్రా భవనాలను పరిశీలించి కమిటీ తమ సిఫార్సులను అందజేసింది. ముఖ్యమంత్రికి భద్రత, పరిపాలనా అవసరాలు, క్యాంపు కార్యాలయం, వసతి ఒకే ప్రాంగణంలో ఉండడం, సరిపడా పార్కింగ్, సమీపంలోనే హెలిపాడ్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని రుషికొండ వద్ద నిర్మించిన టూరిజం రిసార్టులు సానుకూలంగా ఉన్నాయని కమిటీ తేల్చింది. పైగా.. ముఖ్యమంత్రి రాకపోకల కారణంగా నగర వాసులకు ఇబ్బందులు రాకుండా, ట్రాఫిక్‌కు ఆటంకం లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయానికి వచ్చామని కూడా తెలిపింది. ముగ్గురు సీనియర్ అధికారులు సభ్యులుగా ఉన్న కమిటీ ఇలా నివేదిక ఇచ్చిందో లేదోం రామోజీరావు వెంటనే తన పైత్యానికి పదును పెట్టారు. ‘వేదికపై సుద్దులు..ం తీరంలో ఘోరాలు’ అంటూ గురువారం ఈనాడులో గగ్గోలు పెట్టారు. రుషికొండ వద్ద పర్యాటక శాఖ నిర్మించిన భవనాలు అక్రమమని, నిబంధనలకు విరుద్ధమని తీర్పు కూడా ఇచ్చేశారు. అన్ని అనుమతులతో.. ♦ కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ నుంచి సీఆర్‌జెడ్ అనుమతులు తీసుకుంది.. ♦ ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ సిఫార్సులు తీసుకోవడంతో పాటు.. నిర్మాణంలో భాగంగా, అనుమతి ఉన్న ప్రాంతంలో చెట్లు తొలగించేందుకు, అంతకుమించి పెద్దసంఖ్యలో కొత్తగా మొక్కలు నాటేందుకు అటవీశాఖ అనుమతి నుంచి అనుమతులు సైతం ఉన్నాయి.. ♦ జీవీఎంసీ నుంచి ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ లభించడంతో పాటు, భవనాల డిజైన్లకు ఆమోదం ఉంది.. ..ఇలా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్‌మెంట్‌తో పాటు, చట్ట ప్రకారం నిబంధనలను అనుసరించి అన్ని రకాల అనుమతులతో పర్యాటక శాఖ భవనాలను నిర్మించింది. ♦ ఇక రుషికొండ వద్ద ప్రభుత్వ భూమిలో ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టు కోసం ప్రతిపాదించింది కేవలం 3 శాతం మాత్రమే. ♦ 61 ఎకరాల్లో నిర్మాణాలకు అనుమతులుంటే, 9.88 ఎకరాల్లోనే ప్రాజెక్టు కోసం ప్రతిపాదించారు. ఇందులో కూడా భవనాలు కట్టింది కేవలం 1.84 ఎకరాల్లో మాత్రమే.. ♦ అలాగే, ఏడు బ్లాకుల నిర్మాణానికి అనుమతులివ్వగా, కట్టింది నాలుగు బ్లాక్లే.. కట్టడాలు ఈరోజు ప్రారంభించినవేం కాదు.. రుషికొండ మీద కట్టడాలు 1984లోనే ప్రారంభమయ్యాయి. 1989 నాటికి క్రమంగా 12 బ్లాకులు నిర్మించారు. అంటే రుషికొండను తొలిచింది, నిర్మాణాల కోసం అక్కడ చెట్లను నరికివేసింది టీడీపీ ప్రభుత్వమే. సముద్రతీరంలో వాతావరణ పరిస్థితులతో సుమారు నాలుగు దశాబ్దాల క్రితం కట్టిన ఈ భవనాలన్నీ దెబ్బతిన్నాయి. అందుకే ఈ ప్రభుత్వం వాటిని తీసివేసి కొత్తగా రిసార్టులను నిర్మించింది. మరి 1984లో కట్టిన నిర్మాణాలతో పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేదా? అప్పుడు రుషికొండను తవ్వి, అక్కడున్న చెట్లను నరికి ఈ నిర్మాణాలు చేయలేదా? ఇప్పుడు ప్రశ్నిస్తున్న వాళ్లంతా అప్పుడేమయ్యారు? అంటే టీడీపీ ప్రభుత్వం చేస్తే కరెక్టు, వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తే తప్పు అవుతుందా.. రామోజీ? బాలకృష్ణ వియ్యంకుడి కబ్జాలపై మౌనం.. మరోవైపు.. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడుగా చంద్రబాబుకు బంధువైన మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి అడ్డగోలుగా విశాఖలో భూకబ్జాకు పాల్పడితే కనీసం ఒక్క ముక్క వార్త కూడా ఈనాడులో రాయలేదు. ఎందుకంటే ఎంవీవీఎస్ మూర్తి టీడీపీ పెద్దల బంధువు కావడమే. విశాఖ నగరంలో ఎండాడ, రుషికొండ గ్రామాల పరిధిలో అత్యంత విలువైన ప్రాంతంలో ఏకంగా 38.6 ఎకరాల ప్రభుత్వ భూమిని దర్జాగా మూర్తి స్వాహా చేసేశారు. అప్పటి సీఎం చంద్రబాబు సైతం నోరు మెదపలేదు. విశేషం ఏమిటంటే.. ఈ కబ్జా అంతా రుషికొండకు సరిగ్గా ఎదురుగానే.. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ కబ్జాలపై ఉక్కుపాదం మోపింది. మొదటి విడతలో 19.39 ఎకరాలను, రెండో విడతలో 4.74 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. మొత్తంగా 24.13 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. కోర్టు స్టే ఇవ్వడంతో మిగిలిన భూముల స్వాధీన ప్రక్రియకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. ఏ కొండ మీద ఏముంది? ♦ విశాఖ నగరంలో చాలా నిర్మాణాలన్నీ కూడా కొండల మీదే ఉన్నాయి. ఏఏ కొండ మీద ఏమేం ఉన్నాయంటే.. ♦ డాల్ఫిన్ హిల్ మీద పెద్ద సంఖ్యలో నేవీ సిబ్బంది క్వార్టర్లు నిర్మించారు. ఇవి పూర్తిగా కొండవీుదే ఉన్నాయి. ♦ సర్క్యూట్ హౌస్‌గా పిలిచే గవర్నర్ బంగ్లా కూడా కొండ మీదే ఉంది. ♦ ఐటీ హిల్స్ ప్రాంతాన్ని చూస్తే దాదాపు అన్ని భవనాలు కొండల మీదే ఉన్నాయి. మిలీనియం టవర్స్ ఉండేది ఈ కొండవీుదే. ♦ రామానాయుడు స్టూడియోస్ మొత్తం కొండల మీదే ఉంది. ♦ ఇక రుషికొండకు సమీపంలో ఉన్న పెమా వెల్నెస్ సెంటర్ కూడా పూర్తిగా కొండవీుదే నిర్మించారు. రామోజీ.. మీరుండేది కొండ మీదేనని మర్చిపోయారా!? రుషికొండ మీద ఏదో జరిగిపోతోందంటూ గగ్గోలు పెడుతున్న రామోజీరావు నిజానికి ఎక్కడుంటున్నారు? ఆయన కట్టిన ఫిల్‌్మసిటీ ఎక్కడుంది? ఆ ఫిల్మ్ సిటీలో వివిధ నిర్మాణాలు వేటి మీద చేశారు? వీటిని ఒక్కసారి పరిశీలిస్తే గురవింద సామెత గుర్తుకొస్తుంది. రామోజీరావు ఉంటున్న నివాసం పూర్తిగా కొండవీుదే కట్టారు. అవి పర్యావరణ ఉల్లంఘనలు కావా? ఫిల్‌్మసిటీ పేరిట ఈ పెద్ద మనిషి పదుల కొద్దీ అసైన్డ్, సీలింగ్ భూములు కబ్జాచేసిన వ్యవహారాలు మర్చిపోతే ఎలా? ఇక ఫిల్‌్మసిటీ నిర్మాణాలను పరిశీలిస్తే అన్నీ గుట్టల మీద కట్టినవే. కాదంటారా రామోజీ.. రుషికొండలో గీతం కాలేజీ పేరిట చేసిన భూముల కబ్జా ♦ గులాబీరంగులో ఉన్న 19.39 ఎకరాల కబ్జా భూమిని మొదటివిడతగా ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ♦ ఆకుపచ్చ రంగులో 4.74 ఎకరాల కబ్జా భూమిని రెండో విడతగా స్వాధీనం చేసుకుంది. ♦ ఎరుపు రంగు గళ్లతో ఉన్న భూమి ఇంకా కబ్జాలో ఉంది. కబ్జాచేసిన ఈ ప్రభుత్వ భూమిలో నిర్మాణాలను స్పష్టంగా చూడొచ్చు. -
నేడు విశాఖకు గవర్నర్ అబ్దుల్ నజీర్
సాక్షి, విశాఖపట్నం : గవర్నర్ అబ్దుల్ నజీర్ ఐదు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం విశాఖకు చేరుకోనున్నారు. విశాఖతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా పోర్టు గెస్ట్‌హౌస్‌కి వచ్చి రాత్రి బస చేయనున్నారు. శనివారం ఉదయం నోవాటెల్‌లో జరగనున్న సమాచార కమిషనర్ల జాతీయ సమాఖ్య సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం ఏయూ స్నాతకోత్సవంలో చాన్సలర్ హోదాలో పాల్గొననున్నారు. ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా అరకులోని రైల్వే గెస్ట్ హౌస్‌కు చేరుకోనున్నారు. 11వ తేదీ సాయంత్రం విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరాన్ని సందర్శిస్తారు. 12న రుషికొండలోని సాయిప్రియా రిసార్ట్‌లో జరిగే జైళ్ల శాఖ జాతీయ సదస్సుకు హాజరుకానున్నారు. మంగళవారం గన్నవరం చేరుకుంటారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. -
ఎవరెస్ట్: 53 ఏళ్ల వయసులో విజయవంతంగా 27వసారీ.. తన రికార్డు తానే
కఠ్మాండూ: నేపాల్‌కు చెందిన ప్రఖ్యాత పర్వతారోహకుడు కమీ రీటా షెర్పా మరోమారు ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి తన గత రికార్డును తానే చెరిపేసి కొత్త రికార్డ్‌ను లిఖించారు. 53 ఏళ్ల రీటా బుధవారం ఉదయం విజయవంతంగా 27వసారీ ఎవరెస్ట్‌ను ఎక్కారని నేపాల్ పర్యాటక శాఖ ప్రకటించింది. దీంతో నూతన ప్రపంచ రికార్డు ఆవిçష్కృతమైంది. గత ఏడాది రీటా 26వసారి ఎవరెస్ట్ పర్వతారోహణ విజయవంతంగా పూర్తిచేసి ప్రపంచ రికార్డును సృష్టించారు. ఆ రికార్డును మూడు రోజుల క్రితం మరో షెర్పా అయిన 46 ఏళ్ల పసంగ్ దవా సమం చేశారు. దీంతో రీటా బుధవారం మరోమారు పర్వతమెక్కి తన పేరిట రికార్డును లిఖించుకున్నారు. ఈయన 1994 మే 13న తొలిసారి ఈ పర్వతశిఖరాన్ని చేరారు. రీటా గతంలోనే ప్రపంచంలోని 8,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న పలు శిఖరాలను అధిరోహించారు. సీనియర్ మౌంటేన్ గౌడ్‌గా పనిచేస్తున్నారు. బుధవారంనాటి పర్వతారోహణకు అయిన ఖర్చులను కఠ్మాండూకు చెందిన ఒక వాణిజ్య సాహసయాత్రల నిర్వహణ సంస్థ భరించింది. ఈ స్ప్రింగ్ సీజన్లో ఇప్పటిదాకా మొత్తంగా 478 మందికి ఎవరెస్ట్ ఎక్కేందుకు అనుమతులు వచ్చాయి. -
అలలపై పడవ ప్రయాణం.. సహజ నీరా పానీయం
సాక్షి, హైదరాబాద్: సాగర తీరం మరో ఆతిథ్యానికి సన్నద్ధమైంది. సహజమైన నీరాతో పాటు తెలంగాణ రుచులను అందజేసే నీరా కేఫ్ ప్రారంబో త్సవానికి సర్వం సన్నద్ధమైంది. పర్యాటక, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న నీరా కేఫ్‌ను ఈ నెల 3వ తేదీన ప్రారంభించనున్నారు. హుస్సేన్‌సాగర్ ఒడ్డున ఏర్పాటు చేసిన నీరాకేఫ్ నగరవాసులకు సరికొత్త అనుభూతినివ్వనుంది. ఇక్కడి నుంచి సాగర్‌లో విహరించేందుకు పర్యాటకశాఖ బోటు షికారును కూడా అందుబాటులోకి తెచ్చింది. పీపుల్స్‌ప్లాజా వైపు వచ్చే సందర్శకులు నీరా సేవనంతో పాటు పడవ ప్రయాణం కూడా చేయవచ్చు. తాటి, ఈత చెట్ల నుంచి లభించే ప్రకృతి సిద్ధమైన నీరా పానీయాన్ని నగరవాసులకు అందించేందుకు ఎక్సైజ్ శాఖ సుమారు రూ.10 కోట్లతో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్‌ప్లాజా సమీపంలో ఈ కేఫ్‌ను నిర్మించింది. ఆకర్షణీయంగా భవనం.. నీరాభవనం తాటాకుతో చేసిన రేక ఆకృతిలో ఎంతో ఆకర్షణీయంగా నిర్మించారు. పల్లెల్లో తాటి, ఈత కల్లును తాటాకులతో చేసిన రేకలు, మోదుగాకు డొప్ప(దొన్నె)లలో సేవించడానికి ఇష్టపడతారు. ఇలా ఆకుల్లో తాగడం వల్ల పానీయం సహజత్వం ఏ మాత్రం కోల్పోకుండా ఉంటుంది. అలాంటి తాటాకు రేక కప్పినట్టుగా నీరా భవనాన్ని నిర్మించడం విశేషం. తెలంగాణ పల్లెలను తలపిస్తూ అందమైన మ్యూరల్స్, చేతివృత్తులను ప్రతిబింబించే శిల్పాలతో భవనం ప్రాంగణాన్ని రూపొందించారు. ఈ కేఫ్‌లో మొత్తం ఏడు కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఒక కౌంటర్‌ను పూర్తిగా నీరా కోసం కేటాయించగా మిగతా ఆరింటిలో వివిధ రకాల ఆహార పదార్ధాలు, ఐస్‌క్రీమ్‌లు, బిర్యానీలు లభిస్తాయి. హుస్సేన్ సాగర్ జలాలను, పోటెత్తే అలలను వీక్షిస్తూ నచ్చిన రుచులను ఆస్వాదించవచ్చు. ఇందుకనుగుణంగా సీటింగ్ సదుపాయం ఉంటుందని పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారి ఒకరు తెలిపారు. భవనం మొదటి అంతస్థులో ఉన్న విశాలమైన హాల్లో పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి వేడుకలు నిర్వహించుకోవచ్చు. విందులు ఏర్పాటు చేసుకొనే సదుపాయం కూడా ఉంటుంది. ఆరోగ్య ప్రదాయిని.... తాటి, ఈత చెట్ల నుంచి తెల్లవారుజామునే సేకరించే నీరాలోని సహజమైన పోషకవిలువలు ఏ మాత్రం పోకుండా శీతలీకరణ పద్ధతిలో నిల్వ చేసి విక్రయిస్తారు. ఇందుకోసం నీరా భవనంలో ప్రత్యేక శీతలీకరణ యంత్రాలను ఏర్పాటు చేశారు. భువనగిరి సమీపంలోని నందనం, కడ్తాల్ సమీపంలోని ముది్వన్లో ఏర్పాటు చేసిన తాటివనాల్లో నీరా కోసమే ప్రత్యేకంగా పెంచిన తాటి, ఈత చెట్ల నుంచి నీరా సేకరిస్తారు. దాంతోనే అనుబంధ ఉత్పత్తులను కూడా తయారు చేస్తున్నారు. ‘పానీయంలోని స్వచ్ఛతకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు.. తాటి చెట్ల నుంచి నీరాను సేకరించడం మొదలు.. దానిని వినియోగదారులకు చేర్చడంవరకు పూర్తిగా శాస్త్రీయమైన పద్ధతిని పాటిస్తున్నాం’అని నిర్వాహకులు తెలిపారు. నీరాలో శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఐరన్, పొటాషియం, కాల్షియం, విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. నీరాతో పాటు తాటి, ఈత చెట్ల నుంచి సేకరించిన నీరా ద్వారా తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను కూడా విక్రయించనున్నారు. ఆడ, మగ(పోద్దాడు, పరుపుదాడు) తాటి చెట్ల నుంచి సేకరించే రెండు రకాల తాటి బెల్లం కూడా ఇక్కడ లభించనుంది. ఆహార ఉత్పత్తులు ధర (సుమారుగా) 300 ఎంఎల్ తాటి నీరా రూ. 90 200 ఎంఎల్ తాటి నీరా రూ. 60 తాటిబెల్లం (కిలో) రూ.1000 తాటి చక్కెర (కిలో) రూ. 1050 తాటి బూస్ట్ రూ. 1100 తాటి తేనె (లీటర్) రూ.1200 ఈత బెల్లం (కిలో) రూ.900 ఈత తెనె (లీటర్) రూ.1000 -
భీమిలిలో ఒబెరాయ్ గ్రూపునకు 40 ఎకరాలు కేటాయింపు
తగరపువలస: విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం అన్నవరం గ్రామ పంచాయతీ వద్ద రాష్ట్ర పర్యాటక శాఖకు చెందిన 40 ఎకరాల స్థలాన్ని ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి లీజ్ కమ్ రెంట్ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ సందర్భంగా ఆ స్థలాన్ని ఆదివారం గ్రూప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) విక్రమ్ ఒబెరాయ్, సంస్థ కార్పొరేట్ వ్యవహారాల ప్రెసిడెంట్ రాజారామన్ శంకర్, ముఖ్య ఆర్థిక నిర్వహణాధికారి కల్లోల్ కుందులతో కలిసి కలెక్టర్ సందర్శించారు. రాబోయే రోజుల్లో విశాఖలో జరగనున్న పలు ప్రభుత్వ ప్రాజెక్టుల గురించి కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున వారికి వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మల్రెడ్డి, విశాఖ పర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్ శ్రీనివాస్ పాణి, భీమిలి ఆర్డీఓ భాస్కరరెడ్డి, తహసీల్దార్ వేణుగోపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పర్యాటకంలో సంక్రాంతి సందడి
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. ఈ ఏడాది పర్యాటక ప్రదేశాలు, శిల్పారామాల్లో సంక్రాంతి సంబరాలకు ఏపీ శిల్పారామం, ఏపీటీడీసీ ఏర్పాట్లు చేశాయి. విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తిరుపతి, కడప, పులివెందుల, అనంతపురం, పుట్టపర్తి శిల్పారామాల్లో 14 నుంచి 16వ తేదీ వరకు మూడు రోజులపాటు ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించనున్నారు. సందర్శకులను అలరించేలా ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. మహిళలకు ముగ్గుల పోటీలు, ‘సంక్రాంతి లక్ష్మి’ పేరుతో సంప్రదాయ వస్త్రధారణ పోటీలు నిర్వహించి బహుమతులు అందించనున్నారు. తెలుగు సంస్కృతికి అద్దం పట్టేలా హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, జానపద, సంప్రదాయ కళారీతుల ప్రదర్శనకు సర్వం సిద్ధంచేశారు. బుల్లితెర హాస్యనటులతో హాస్యవల్లరి, భోజనప్రియులకు నోరూరించేలా పల్లె రుచులతో ఫుడ్ కోర్టులను ఏర్పాటుచేస్తున్నారు. నేటి నుంచి భవానీ ద్వీపంలో.. దేశంలోనే అతిపెద్ద నదీ ద్వీపమైన విజయవాడ భవానీ ఐలాండ్‌లో బుధవారం నుంచి సోమవారం వరకు ఆరు రోజులపాటు ‘సంక్రాంతి ఫెస్ట్’ నిర్వహించనున్నారు. పల్లెటూరి సంప్రదాయ జీవనాన్ని ప్రతిబింబించేలా ఈ ఫెస్ట్‌లో వినూత్న కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. చేతివృత్తి కళాకారుల స్టాల్స్, ఎగ్జిబిషన్‌తోపాటు మహిళలు, చిన్నారులకు ముగ్గులు, వంటల పోటీలు, సంప్రదాయ వస్త్రధారణ, జానపద గీతాలు, డ్రాయింగ్, గాలిపటాల తయారీ పోటీలు నిర్వహించనున్నారు. చిన్నారులకు మన సంస్కృతిలోని సైన్స్ గొప్పదనాన్ని చాటిచెప్పేలా థీమ్స్‌ను రూపొందించారు. పాపికొండల యాత్రకు ఫుల్ డిమాండ్... సంక్రాంతి సందర్భంగా పర్యాటకులు పాపికొండల బోటింగ్‌కు క్యూకడుతున్నారు. ప్రస్తుతం భద్రాచలం వైపున పోచవరం, దేవీపట్నంలోని గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ల నుంచి 29 బోట్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పటికే చాలాబోట్లలో అడ్వాన్స్ బుకింగ్‌లు ఊపందుకున్నాయి. ఆదివారం, సోమవారాల్లో పర్యాటక శాఖ బోట్లు ముందస్తు బుకింగ్‌లతో నిండిపోయాయి. పోచవరం నుంచి పెద్దలకు రూ.950, చిన్నారులకు రూ.750, గండిపోచమ్మ నుంచి పెద్దలకు రూ.1,250, చిన్నారులకు రూ.1,050గా టికెట్ ధర ఉంది. ఇక పర్యాటక శాఖ హోటళ్లు, రిసార్టులు సైతం నిండిపోయాయి. పాపికొండల అందాలు -
జల పర్యాటకం, రవాణాకు పెద్దపీట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జల పర్యాటకాన్ని ప్రోత్సహించడంతోపాటు జలరవాణా అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం బోటింగ్ టూరిజాన్ని మెరుగుపరుస్తూనే కొత్త జలవనరుల అన్వేషణకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ సంయుక్తంగా పనిచేయనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ఫోర్సు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా నీటివనరులు, బీచ్‌లను పరిశీలించి పర్యాటక అభివృద్ధికి అనుకూలమైన ప్రాంతాలను గుర్తిస్తుంది. కొత్త నదీమార్గాల అన్వేషణ రాజమహేంద్రవరం, విజయవాడ, నాగార్జునసాగర్, శ్రీశైలంలో పర్యాటకశాఖ ఎక్కువగా బోటింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వీటితోపాటు ఇతర ప్రాంతాల్లోను అంతర్గత బోట్ల సామర్థ్యాన్ని పర్యవేక్షిస్తూ బోటింగ్ రక్షణకు పెద్దపీట వేయనుంది. మరోవైపు చిన్నచిన్న బోట్ల దగ్గర నుంచి హౌస్ బోట్లు, క్రూయిజ్లను సైతం నడిపేలా, తీర్థస్థలాలు, వారసత్వ ప్రదేశాలను కలుపుతూ ఉండే నదీమార్గాలను అన్వేషిస్తోంది. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన ఏపీలో బీచ్‌లను ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దనుంది. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీ ఇలా.. ఈ కమిటీకి ఏపీటీడీసీ ఎండీ చైర్మన్‌గా, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ ఈడీ కో–చైర్మన్‌గా, ఏడుగురు సభ్యులతో ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఏపీ టూరిజం అథారిటీ డిప్యూటీ సీఈవో, ఏపీటీడీసీ ఈడీ (ప్రాజెక్ట్స్), జలవనరులశాఖ చీఫ్ ఇంజినీర్, దేవదాయశాఖ జాయింట్ కమిషనర్, ఏపీటీడీసీ వాటర్ ఫ్లీట్ జీఎంలతో పాటు ఏపీటీడీసీ, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ నుంచి ఒక్కో నామినేటెడ్ వ్యక్తి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఇతర రాష్ట్రాలతో పాటు బెల్జియం, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో పర్యటించి అక్కడి జల పర్యాటకం, రవాణా సౌకర్యాలను పరిశీలిస్తుంది. సమగ్ర నివేదిక ప్రభుత్వానికి సమర్పిస్తుంది. గోదావరి, కృష్ణాలోను.. జలమార్గం చౌకైన రవాణా కావడంతో కేంద్రప్రభుత్వం జలమార్గాల అభివృద్ధిపై దృష్టి సారించింది. దేశంలో 50.1 శాతం రోడ్డు, 36 శాతం రైల్వే, 6 శాతం సముద్ర, 7.5 శాతం పైప్‌లైన్ రవాణా వ్యవస్థలున్నాయి. జలమార్గ రవాణా 0.4 శాతం మాత్రమే ఉంది. దేశవ్యాప్తంగా 680 మైళ్ల పొడవైన జలమార్గం జాతీయ రహదారులను కలుపుతోంది. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి మీదుగా ప్రయాణిస్తోంది. కోరమాండల్ తీరం వెంబడి కాకినాడ, ఏలూరు, కొమ్మమూరు, బకింగ్‌హామ్ కాలువలున్నాయి. ఏపీలో కృష్ణా, గోదావరి నదులు ఇందులో భాగంగా ఉన్నాయి. ఈ క్రమంలో జల పర్యాటకం, రవాణా ప్రోత్సాహకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయి. -
పర్యాటక ఏపీ.. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో మూడో ర్యాంకు
సాక్షి, అమరావతి: దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం సాధించింది. గత ఏడాది (2021) 9.32 కోట్లకు పైగా దేశీయ పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శించినట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో తమిళనాడు రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. 2021లో 11.53 కోట్ల మంది తమిళనాడును సందర్శించినట్లు ఆ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్ రెండో ర్యాంకులో ఉండగా, కర్ణాటక నాలుగో ర్యాంకు, మహారాష్ట్ర ఐదో ర్యాంకులో ఉన్నాయి. దేశం మొత్తం మీద దేశీయ పర్యాటకుల సందర్శనలో దాదాపు 65.41 శాతం ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. దేశీయ పర్యాటకుల్లో తమిళనాడును 17.02 శాతం, ఉత్తరప్రదేశ్‌ను 16.19 శాతం, ఆంధ్రప్రదేశ్‌ను 13.77 శాతం, కర్ణాటకను 12 శాతం, మహారాష్ట్రను 6.43 శాతం మంది సందర్శించినట్లు తెలిపాయి. 2021లో దేశీయ పర్యాటకుల వృద్ధి ఆంధ్రప్రదేశ్‌లో 31.69 శాతంగా గణాంకాలు వెల్లడించాయి. దేశం మొత్తం మీద దేశీయ పర్యాటకుల వృద్ధి 11.05 శాతమే ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించిన వారి సంఖ్య క్షీణించినట్లు నివేదిక స్పష్టం చేసింది. తెలంగాణలో 2021లో దేశీయ పర్యాటకుల్లో వృద్ధి –19.99 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది. దేశీయ పర్యాటకులను ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2019లో కూడా మూడో ర్యాంకులో ఉంది. అయితే 2020లో కోవిడ్ మహమ్మారి కారణంగా నాలుగో ర్యాంకు పొందింది. 2021లో మళ్లీ పుంజుకొని మూడో ర్యాంకులోకి వచ్చింది. 2019 నుంచి 2021 వరకు టాప్ ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంటోంది. 2019లో ఆంధ్రప్రదేశ్‌ను 23.70 కోట్ల మంది దేశీయ పర్యాటకులు సందర్శించారు. కోవిడ్ ఆంక్షలు కారణంగా 2020లో 7.08 కోట్ల మందే వచ్చారు. కోవిడ్ ఆంక్షల కారణంగా దేశవ్యాప్తంగా విదేశీ పర్యాటకుల సంఖ్య 2021లో గణనీయంగా తగ్గిపోయినట్లు పర్యాటక శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2020లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం విదేశీ పర్యాటకుల సంఖ్య 7.17 మిలియన్లు ఉండగా 2021లో 1.05 మిలియన్లకు తగ్గిపోయింది. 2020తో పోల్చి చూస్తే 2021లో దేశం మొత్తం మీద విదేశీ పర్యాటకుల సంఖ్య 85.29 శాతం క్షీణించింది. 2019లో ఏపీలో విదేశీ పర్యాటకుల సంఖ్య 0.89 శాతం వృద్ధి ఉండగా కోవిడ్ కారణంగా 2020లో ఏపీలో 70.12 శాతం మేర, 2021లో 59.24 శాతం మేర క్షీణించింది. -
68 ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులు
సాక్షి, విశాఖపట్నం: ప్రకృతి అందాలతో అలరారే రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో పర్యాటకరంగం కొత్తపుంతలు తొక్కేలా సరికొత్త ఆలోచనలతో పర్యాటకశాఖ ముందుకెళ్తోంది. పెట్టుబడుల రాకకు ప్రధాన అవరోధాలుగా ఉన్న నియమ నిబంధనలు మార్చి కొత్తదారుల్ని అన్వేషించింది. రాష్ట్రవ్యాప్తంగా 68 ప్రాంతాల్లో వాటర్ స్పోర్ట్స్, ట్రెక్కింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రాజెక్టులకు ప్రాధాన్యమిచ్చేందుకు నిబంధనల్ని మరింత సరళతరం చేసింది. కొత్తగా రాబోతున్న ప్రాజెక్టులకు కనిష్టంగా రూ.20 లక్షల నుంచి గరిష్టంగా రూ.70 లక్షల వరకు మాత్రమే పెట్టుబడులుగా నిర్దేశించింది. వాటర్ స్పోర్ట్స్‌లో బిడ్ వేయాలంటే ఐదేళ్ల అనుభవం ఉండాలనే నిబంధన ఉంది. దీన్ని ఏడాదికి తగ్గించింది. ఒకవేళ ఆసక్తి ఉండి అనుభవం లేని ఎవరైనా పాల్గొనాలని భావిస్తే కన్సోటియం తీసుకున్నా సరిపోతుంది. టూరిజం ప్రాజెక్టులకు బిడ్ ఫీజును రూ.లక్ష నుంచి రూ.10 వేలకు తగ్గించింది. దీంతోపాటు టెండర్లలో కనీస ఆదాయం వాటా వాటర్ స్పోర్ట్స్‌కు 15 శాతం, అడ్వెంచర్ స్పోర్ట్స్‌కు 25 శాతం, ట్రెక్కింగ్‌కు 10 శాతంగా నిర్ణయించింది. ఇందులో ఎవరు ఎక్కువగా టెండర్లలో కోట్‌చేస్తే వారికి అవకాశం కల్పించేలా నిబంధనల్ని మార్చింది. ఈ నేపథ్యంలో సోమవారం విజయవాడలో ప్రీ బిడ్డింగ్ సమావేశం నిర్వహిస్తోంది. టూరిజం ఎండీ కన్నబాబు ఆధ్వర్యంలో పర్యాటకశాఖ కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. -
పాపికొండలు పోదాం పద!
గోదారమ్మ పరవళ్లు..ప్రకృతి అందాలు..ఎత్తయిన కొండలు..పున్నమి వెన్నెల్లో ఇసుక తిన్నెలు..నైట్ హాల్ట్‌లు.. ఇలా పాపికొండలు విహారయాత్ర ఇచ్చే మజాయే వేరంటారు పర్యాటకులు. అలాంటి మధురానుభూతి జీవితంలో ఒక్కసారైనా పొందాలనుకుంటారు సందర్శకులు. ఈ ప్రకృతి అందాలను తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలివస్తుంటారు. ఈ విహార యాత్రకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంతో ఆదివారం నుంచి బోట్లు బయలుదేరనున్నాయి. రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా): పాపికొండలు విహారయాత్రకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంతో పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు, బోట్ల యజమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. దీనిపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది కుటుంబాలు ఆధారపడ్డాయి. గోదావరికి వరదలు రావడంతో గత నాలుగు నెలలుగా పాపికొండలు పర్యాటకం నిలిచిపోయింది. ఈనేపథ్యంలో నీటిమట్టం అనుకూలంగా ఉండటంతో ప్రభుత్వం పాపికొండలు విహారయాత్ర బోట్లకు శనివారం అనుమతి ఇచ్చింది. దీంతో పర్యాటకశాఖ అధికారులు పాపికొండలు విహార యాత్రకు ట్రయల్ రన్ నిర్వహించారు. తొలి రోజు ఒక్క బోటు మాత్రమే.. పాపికొండల విహారయాత్రకు తొలి రోజు ఆదివారం ఒక్క బోటుమాత్రమే వెళ్లే అవకాశం ఉంది. ఈ పర్యటనకు సంబంధించి ఏపీ టూరిజం, ప్రైవేట్ టూరిజం శనివారం నుంచి టికెట్లను అందుబాటులోకి తెచ్చాయి. విహారయాత్రకు బోట్లు బయలుదేరేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా పోశమ్మగండి వద్ద బోట్ పాయింట్, కంట్రోల్ రూమ్‌లో రెవెన్యూ, పోలీసు, పర్యాటక, ఇరిగేషన్ శాఖ అధికారులు, సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. బోట్ పాయింట్ వద్ద ఉన్న అన్ని బోట్లలో భద్రతా చర్యలను వారు పరిశీలించారు. పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ అనుమతులు మంజూరు చేసింది. పోశమ్మగండి బోట్ పాయింట్ నుంచి పర్యాటకులతో టూరిజం బోటు బయలుదేరడానికి ముందే పైలెట్ బోట్ వెళ్తుంది. ఇందులో శాటిలైట్ ఫోన్‌తోపాటు పర్యాటక సిబ్బంది ఒకరు, గజ ఈతగాడు ఉంటారు. వీరి వద్ద కూడా వాకీ టాకీ ఉంటుంది. పైలెట్ బోటు.. టూరిజం బోటు కంటే ముందుగా వెళ్తూ గోదావరిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి ఉన్నా వెంటనే కంట్రోల్ రూమ్‌తోపాటు వెనుక వస్తున్న బోటుకు వాకీ టాకీలో సమాచారం అందిస్తారు. ఇలా చేరుకోవాలి: ముందుగా ఏపీ పర్యాటక శాఖ వెబ్సైట్.. https:// tourism.ap.gov.in/లో పాపికొండలు విహారయాత్రకు టికెట్లు బుక్ చేసుకోవాలి. రూ.1,250 టికెట్ బుక్ చేసుకున్నవారు నేరుగా రాజమండ్రి చేరుకోవాలి. అక్కడ గోదావరి గట్టున ఉన్న పర్యాటక శాఖ కేంద్రానికి వెళ్లాలి. అక్కడ నుంచి బస్సులో పోశమ్మ గండి బోట్ పాయింట్ వరకు పర్యాటక శాఖ సిబ్బంది తీసుకొస్తారు. యాత్ర ముగిశాక మళ్లీ రాజమండ్రికి తీసుకొచ్చి వదిలిపెడతారు. ఇక రూ.1000 టికెట్ తీసుకున్నవారు నేరుగా బోట్లు బయలుదేరే అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మ గండికి చేరుకోవాల్సి ఉంటుంది. రెండు బోట్ పాయింట్ల వద్ద ఏర్పాట్లు పోశమ్మ గండి బోట్ పాయింట్ వద్ద మొత్తం 15 బోట్లు ఉండగా, వీటిలో ఎనిమిది బోట్లకు అనుమతి మంజూరు చేశారు. మరో ఏడు బోట్లకు ఫిట్నెస్ పరిశీలించి అనుమతి ఇవ్వాల్సి ఉందని అధికారవర్గాలు తెలిపాయి. వీఆర్ పురం మండలం పోచవరం బోట్ పాయింట్ వద్ద 17 బోట్లు ఉండగా వీటిలో 13 బోట్లకు ఫిట్నెస్ అనుమతి ఇచ్చారు. మరో నాలుగు బోట్లకు అనుమతి రావాల్సి ఉంది. -
త్వరలో ఐదు రూట్లలో టెంపుల్ టూరిజం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాలను, వివిధ ఆలయాలను కలుపుతూ ఐదు సర్క్యూట్లలో(రూట్లలో) టెంపుల్ టూరిజంను ప్రారంభించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ, చెప్పారు. బుధవారం సచివాలయంలో మంత్రి ఆర్కే రోజాతో కలిసి దేవదాయ, పర్యాటక శాఖల అధికారులతో టెంపుల్ టూరిజం అభివృద్దిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఇరువురు మంత్రులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలు ఆలయాలను ఆధ్యాత్మికంగా, పర్యాటకపరంగానూ ఆకర్షించే రీతిలో అభివృద్ధి చేసేందుకు రెండు శాఖలు చర్యలు తీసుకుంటున్నట్టు కొట్టు సత్యనారాయణ చెప్పారు. మొత్తం 16 సర్క్యూట్లకు ఆన్లైన్లో అభిప్రాయాలు సేకరించినట్టు తెలిపారు. విజయవాడ– పంచారామ యాత్ర, విజయవాడ – అష్టశక్తి యాత్ర, విజయవాడ – త్రిలింగ యాత్ర, తిరుపతి – కష్ణదేవరాయ యాత్ర, తిరుపతి– గోల్డెన్ ట్రయాంగిల్ యాత్ర సర్క్యూట్లకు అత్యధిక రేంటింగులు వచ్చాయని తెలిపారు. ఈ ఐదు సర్క్యూట్లలో తొలి విడతగా టెంపుల్ టూరిజంను అభివృద్ది చేస్తామన్నారు. మంత్రి రోజా మాట్లాడుతూ.. టెంపుల్ టూరిజం సర్క్యూట్లతో యాత్రికులు ఒకే సమయంలో ఆలయాలు, ఆ ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చన్నారు. దేశ విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా సౌకర్యాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. -
సింహగిరి నుంచి తిరునగరి వరకు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకం(టెంపుల్ టూరిజం) అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సారూప్యత కలిగిన దేవాలయాలను అనుసంధానం చేస్తూ యాత్రలకు శ్రీకారం చుడుతోంది. అలాగే పర్యాటకులు ప్రముఖ దేవాలయాలతో పాటు చిన్నచిన్న పుణ్యక్షేత్రాలు కూడా సందర్శించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా సుమారు 100 దేవాలయాలతో జాబితా రూపొందించింది. వీటిని 16 సర్క్యూట్లుగా విభజించి.. ఒక్కో సర్క్యూట్లో 3 నుంచి పదికి పైగా ఆలయాల దర్శనాన్ని కల్పించనుంది. దీనిని పైలట్ ప్రాజెక్టు కింద తొలుత 5 సర్క్యూట్లలో అమలు చేయనుంది. ఈ సర్క్యూట్ల ఎంపికపై ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరిస్తోంది. ప్రజలకు భగవంతుడిని మరింత చేరువ చేసేలా .. రాష్ట్రంలో ఎంతో చరిత్ర కలిగిన దేవాలయాలున్నాయి. వీటిని పర్యాటకంగా ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం రెలిజియస్ టూరిజం కింద ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్రవ్యాప్త సర్క్యూట్లతో పాటు జిల్లాల పరిధిలోనూ దర్శనీయ స్థలాలను చుట్టివచ్చేలా వీలు కల్పించనుంది. ఒకటి నుంచి మూడు రోజుల పాటు యాత్ర కొనసాగేలా ప్యాకేజీలను రూపొందిస్తోంది. రవాణా, వసతి సౌకర్యాలతో పాటు భగవంతుడి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తోంది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించేందుకు.. ఆలయాల వారీగా ప్రత్యేక వెబ్‌పోర్టల్స్, మొబైల్ అప్లికేషన్లను పర్యాటక శాఖ వినియోగించనుంది. భక్తులు, పర్యాటకులకు సమగ్ర సమాచారం ఇచ్చేందుకు ఎంపిక చేసిన ఆలయాల వద్ద రిలీజియస్ టూరిజం ఇన్ఫర్మేషన్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. సుమారు 500 నుంచి 1,000 చదరపు అడుగుల్లో భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా వీటిని నిరి్మంచనుంది. ఇందులో ప్రత్యేక డిస్ప్లేలు, కియోస్‌్కల ద్వారా రాష్ట్రంతో పాటు దేశవ్యాప్త ఆలయాల సమాచారం అందుబాటులో ఉంచుతారు. ఆలయాల విశిష్టతను వివరించేందుకు గైడ్లు కూడా ఉంటారు. భక్తులు ఆహ్లాదంగా, ఆనందంగా గడిపేలా.. మన రాష్ట్రంలో ఎన్నో విశిష్ట దేవాలయాలున్నాయి. వీటికి పర్యాటక ప్రాంతాలను అనుసంధానించి.. మన రాష్ట్రంతో పాటు దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. దైవ దర్శనానికి వచ్చే భక్తులు ఆహ్లాదంగా, ఆనందంగా గడిపే వాతావరణాన్ని అందించనున్నాం. ఇందులో భాగంగా రెలిజియస్ టూరిజాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ప్రజల అభీష్టానికి అనుగుణంగా దేవాలయాల సందర్శన యాత్రల ప్యాకేజీలను తీసుకొస్తాం. – ఆర్కే రోజా, పర్యాటక శాఖ మంత్రి -
‘కృష్ణా’లో బోటింగ్ బంద్
భవానీపురం(విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో టూరిజం శాఖ బోటింగ్ కార్యకలాపాలు మళ్లీ బంద్ అయ్యాయి. ఈ నెల 10వ తేదీ నుంచి నాలుగైదు రోజుల పాటు బోటింగ్ రాకపోకలను నిలిపివేసిన అధికారులు ఎగువ నుంచి వచ్చే వరద నీటి ఉధృతి తగ్గటంతో తిరిగి ప్రారంభించారు. శనివారం శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయడం, శుక్రవారం రాత్రి నుంచి 48 గంటల పాటు పశ్చిమ కనుమల్లో ప్రధానంగా కృష్ణా బేసిన్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయనే అంచనాల కారణంగా ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా కృష్ణా నదిలో బోటింగ్ కార్యకలాపాలన్నింటినీ నిలిపివేయాలని ఏపీటీడీసీ అధికారులను ఆదేశించారు. దీంతో భవానీపురంలో ఉన్న హరిత బరంపార్క్‌లోని బోటింగ్ పాయింట్ వద్ద బోట్లను నిలుపుదల చేశారు. భవానీ ద్వీపంలో కాటేజీల్లో ఇప్పటికే ఉన్న పర్యాటకుల రాకపోకలకు, అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కోసం బోట్లను పరిమితంగా నడుపుతున్నారు. జలవనరుల శాఖ అధికారులు తిరిగి ఆదేశాలు ఇచ్చిన తరువాతే బోటింగ్ కార్యకలాపాలను ప్రారంభిస్తామని ఏపీ టూరిజం అధికారులు వెల్లడించారు. -
ఒంపు సొంపుల ఏరులో.. మడ అడవుల మధ్యలో
చుట్టూ మనసులను కట్టిపడేసే ప్రకృతి సిద్ధ మడ అడవులు.. వంపుసొంపులతో హొయలు పోతూ..వడివడిగా పరవళ్లు తొక్కే కాలువ..చల్లగా తాకే చిరుగాలికి లయబద్ధంగా రాగాలు పోతున్నట్లు వినసొంపైన పక్షుల కిలకిలారావాలు.. వీటన్నింటి మధ్య లాహిరిలాహిరిలా హిరిలో.. అంటూ సాగే పడవ ప్రయాణం.. చదువుతుంటేనే మది అలలపై తేలి ఆడుతున్నట్లు ఉప్పొంగుతోంది కదూ.. ఈ మధురానుభూతులు ఆస్వాదించాలంటే నాగాయలంక మండలంలోని తీర ప్రాంతాన్ని సందర్శించాల్సిందే! నాగాయలంక (అవనిగడ్డ): కృష్ణా జిల్లా నాగాయలంక మండల పరిధిలోని గుల్లలమోద నుంచి సముద్ర ప్రాంతం వరకూ మడ అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో తెల్లమడ, నల్లమడ, పొన్న, దుడ్డుపొన్న వంటి రకాల మొక్కలున్నాయి. వీటిలో మడ అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. నీటిలో వేర్లు, మొదళ్ళు కనబడుతూ పైన పచ్చని మొక్కలతో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. మడ అడవుల నడుమ, నదీపాయలు, సింకుల్లో ప్రయాణిస్తూ సాగే ప్రయాణం సుందర్బన్ అడవుల అందాలను తలపిస్తుంది. రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా సహజ సిద్ధ ప్రకృతి సోయగాలకు నెలవు ఈ తీర ప్రాంతం. ప్రత్యేకమైన ఈ ప్రయాణం ప్రకృతి ప్రేమికులకు మరుపురాని అనుభూతినిస్తుంది. ఈ మడ అడవుల అందాలను తిలకించాలంటే నాగాయలంక, గుల్లలమోద, ఎదురుమొండి, సంగమేశ్వరం నుంచి ప్రత్యేక పడవల్లో వెళ్ళాల్సి ఉంటుంది.. రవాణా సదుపాయం కల్పిస్తే మరింతగా టూరిజం అభివృద్ధి ప్రస్తుతం ప్రత్యేక బోట్లను ఏర్పాటు చేసుకుని టూరిస్టులు ఈ లైట్‌హౌస్ సందర్శిస్తున్నారు. ఈ ప్రయాణం రిస్కుతో కూడుకోవడం, ఖర్చులు ఎక్కువ అవడం వల్ల లైట్‌హౌస్‌ని సందర్శించాలనే ఆసక్తి ఉన్నప్పటికీ చాలామంది ఈ ప్రాంతాన్ని సందర్శించలేక పోతున్నారు. దీనికితోడు లైట్‌హౌస్ ప్రాంతంలో ఏమీ దొరక్క పోవడం పర్యాటకులకు నిరాశే మిగులుతుంది. ఈ ప్రాంతానికి వెళ్లేందుకు పర్యాటకశాఖ ప్రత్యేక లాంచీలు, బోట్లను ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. లైట్‌హౌస్ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఆ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని దివిసీమ ప్రజలు కోరుతున్నారు. ప్రత్యేక ఆకర్షణగా లైట్‌హౌస్ ఓ వైపు పచ్చని మడ అడవులు, మరో వైపు కృష్ణా నది, ఇంకోవైపు బంగాళాఖాతం మధ్య ఉండే మడ అడవుల నడుమ ఉండే గుల్లలమోద లైట్‌హౌస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నాగాయలంక నుంచి 25 కి.మీ దూరంలో లైట్ హౌస్ ఉంది. బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ లైట్‌హౌస్‌ని 1972లో ఆధునీకరించారు. దీని ఎత్తు 135 అడుగులు. 9 అంతస్తులు కలిగి ఉంది. 1977 ఉప్పెనకు ఈ లైట్‌హౌస్ 5వ అంతస్తు వరకూ వరద నీరు వచ్చినట్లు రికార్డులో నమోదైంది. రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా పచ్చని మడ అడవులు, నదీపాయల నడుమ ఉండటం ఈ లైట్‌హౌస్ ప్రత్యేకత. (క్లిక్: ఎంత తిన్నా.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది..) -
విహార ప్రేమికుల కోసం విశాఖ నుంచి కార్డీలియా షిప్ ఫోటోలు చూస్తే వావ్ అంటారు
-
విశాఖలో క్రేజీ క్రూయిజ్
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): కార్డీలియా క్రూయిజ్ షిప్ ప్రారంభంతో విశాఖ ప్రజల కోరికే కాకుండా రాష్ట్ర ప్రజల కోరికా నేరవేరిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా అన్నారు. విశాఖ పోర్టు నుంచి పాండిచ్చేరి మీదుగా చెన్నైకి బయలుదేరిన మొదటి క్రూయిజ్ షిప్‌ను బుధవారం ఆమె ప్రారంభించారు. కోవిడ్ తర్వాత విహార యాత్ర కోసం ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలకు ఇదో మంచి అవకాశమన్నారు. నౌక లోపల చూస్తే అలలపై ఇంద్రభవనంలా ఉందన్నారు. నౌకలో ప్రయాణికులతో మాట్లాడుతున్న మంత్రి రోజా ఈ షిప్ మొదటి ట్రిప్‌నకు 1200 మంది బుక్ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. 786 క్యాబిన్స్ కలిగిన ఈ షిప్లో 600 మంది పనిచేస్తున్నారని, వారిలో 92 శాతం భారతీయులేనన్నారు. 900 సీట్లు కలిగిన పెద్ద థియేటర్, స్విమ్మింగ్ పూల్స్ చాలా బాగున్నాయన్నారు. రుషికొండను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ కోర్టులకు వెళ్లి స్టేల ద్వారా అడ్డుకుంటోందని మంత్రి రోజా విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరుద కల్యాణి, పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. కుటుంబంతో వెళ్తున్నా.. నా కుటుంబం మొత్తం 9 మంది ఈ నౌకలో విహార యాత్రకు వెళ్తున్నాం. ఎప్పుడు లోపలకు వెళ్తామా అని ఆత్రుతగా ఉంది. కుటుంబం మొత్తానికి రూ.1.8 లక్షలు వెచ్చించాం. – కాశీ, విశాఖ వాసి అన్ని సౌకర్యాలు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాం. అత్యవసర సమయంలో వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారు. ఈ నెల 22 మినహా సెప్టెంబర్ వరకూ ప్రతి బుధవారం విశాఖ నుంచి షిప్ బయలుదేరుతుంది. – అల్థాఫ్, నిర్వాహకుడు -
తెలంగాణకే తలమానికం.. సాగర్ తీరంలో బౌద్ధవనం
సాక్షి, నాగార్జునసాగర్: తెలంగాణకే తలమానికమైన సాగర్ తీరంలో బౌద్ధవనం సిద్ధమైంది. ఈనెల 14వ తేదీన రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. బుద్ధవనం ప్రారంభమైతే సాగర్‌కు పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో పర్యాటకశాఖకు ఆదాయం రావడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. 2003లో పనులు ప్రారంభం 2003–04లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు 2011వరకు నత్తనడకన సాగాయి. 2015లో 2559వ బుద్ధజయంతి ఉత్సవాలు నాగార్జునసాగర్‌లో నిర్వహించారు. వాటికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. బుద్ధవనంలో బోధివక్షం నాటారు. దీనిని అభివృద్ధి చేసే బాధ్యతను మల్లేపల్లి లక్ష్మయ్యకు అప్పగించి బుద్ధవనం ప్రత్యేకాధికారిగా నియమించారు. ఆనాటి నుంచి ఈ ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. మొత్తం రూ.65.14 కోట్లు ఖర్చు చేసి ఐదు సెగ్మెంట్లు పూర్తిచేశారు. మరో మూడింటి సెగ్మెంట్ల పనులు మొదలే కాలేదు. ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యేందుకు సుమారుగా రూ.500 కోట్లు ఖర్చవుతుందని అంచనా. చదవండి: (కేసీఆర్ మాపై కక్షగట్టారు) బౌద్ధమత సంస్కృతికి ప్రతిబింబం నాగార్జునసాగర్ జలాశయతీరంలో 274.28 ఎకరాల్లో నిర్మితమైన బుద్ధవనం ప్రపంచ బౌద్ధమత సంస్కృతికి ప్రతిబింబం కానుంది. బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు అన్ని అంశాలు ఉట్టిపడేలా ఇక్కడ శిల్పాలను ఏర్పాటు చేశారు. 70 అడుగుల ఎత్తు,140 అడుగుల వెడల్పుతో నిర్మించారు. పైన గుమ్మటం తరహాలో నిర్మాణం ఉంటుంది. ప్రధాన మందిరం లోపలి వైపు నిలబడి పైకి ఆకాశం ప్రతిబింబించేలా ప్రత్యేక తీర్చిదిద్దారు. జాతక పార్కులో జాతక కథల రూపంలో కళ్లకు కట్టేలా పర్యాటకులను ఆకట్టుకునే విధంగా శిల్పాలు ఏర్పాటు చేశారు. ఒకదానినుంచి మరొకటి వరుస క్రమంలో వీటిని పూర్తిగా చూసేందుకు రెండున్నర కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. అభివృద్ధికి ముందుకొస్తున్న సంస్థలు బుద్ధవనం అభివృద్ధికి పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. డీఎక్స్ఎన్ (మలేషియా) ప్లాన్ వారు బుద్ధి ష్ట్ యూనివర్శిటీ నిర్మాణానికి గాను రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. ఫోగౌంగ్షాన్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ వారు బుద్ధి స్ట్ మోనాస్టిక్ ఎడ్యుకేషన్ సెంటర్‌కు రూ.64.10 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. మహా బోధి సొసైటీ(బెంగళూరు) వారు మోనస్టరీమాంక్స్ సెట్టింగ్‌కు రూ.20.49 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారు. లోటస్ నిక్కో హోటల్స్ (న్యూఢిల్లీ) వారు హోటల్స్ ఏర్పాటుకు రూ.42 కోట్లు పెట్టబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. -
టూరిజంకు సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారు: ఆర్కే రోజా
సాక్షి, విజయవాడ: కృష్ణానదిలో బోధిసిరి బోటును పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బోధిసిరి బోట్ మరోసారి లాంచింగ్ చేశాము. 2004లో వైఎస్సార్ చేతుల మీదుగా ప్రారంభించిన బోధిసిరిని తిరిగి నేను ప్రారంభించడం ఆనందంగా ఉంది. టూరిస్ట్‌లకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటాం. టూరిజంకు సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారు. టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తాం. బోటు ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. రాష్ట్రంలో ఏపీ టూరిజం నుంచి 45, ప్రైవేట్‌గా 25 బోట్లు అందుబాటులో ఉన్నాయి. 9 ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్ ద్వారా బోట్స్ మానిటర్ చేస్తున్నాం. దేశ విదేశాలకు చెందిన టూరిస్ట్‌లకు అనుకూలంగా ఉండేలా టూరిజం అభివృద్ధి చేస్తాం. కోవిడ్ వల్ల టూరిజం ఆదాయం తగ్గింది. పీపీఈ మోడ్‌లో టూరిజంను డెవలప్మెంట్ చేస్తున్నాం. స్టేక్ హోల్డర్స్‌తో చర్చలు జరుపుతున్నాం' అని పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఈ కార్యక్రమానికి టూరిజం శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ మాట్లాడుతూ.. సీఎం ఆదేశాల మేరకు టూరిజం అభివృద్ధి చేస్తాం. రోప్ వేస్ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. రెండు రోప్ వేస్ పనులను త్వరలోనే ప్రారంభిస్తాం. విజయవాడ బరం పార్కులో 1, శ్రీశైలంలో 1 రోప్ వే ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి అని రజత్ భార్గవ తెలిపారు. చదవండి: (మాజీ మంత్రి అనిల్‌తో మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి భేటీ) -
నిబంధనలమేరకే ‘రుషికొండ’ నిర్మాణాలు
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని రుషికొండ పర్యాటక ప్రాజెక్టును ‘కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) నిబంధనలకు అనుగుణంగానే నిర్మిస్తున్నామని పర్యాటకశాఖ స్పష్టం చేసింది. కేంద్ర అటవీ, పర్యావరణశాఖ నుంచి పూర్తి అనుమతులు పొంది ఆమేరకే నిర్మాణ పనులు చేపడుతున్నామని పేర్కొంది. సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా రుషికొండ పర్యాటక ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ‘ఈనాడు’ పత్రిక ప్రచురించిన కథనం పూర్తిగా వాస్తవ విరుద్ధంగా ఉందని పర్యాటకశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. రూ.240 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ముందుగానే అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణ పనులు చేపట్టిందని పేర్కొంది. 9.88 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 5.18 ఎకరాల్లో నిర్మాణాలు చేపడుతుండగా 4.70 ఎకరాలు సుందరీకరణకు కేటాయించినట్టు తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ అనుమతించిన 139 చెట్లనే తొలగించామని, మిగిలినవి పొదలేనని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా వందలాది చెట్లను తొలగించినట్టు ‘ఈనాడు’ పత్రిక తన కథనంలో పేర్కొనడం అవాస్తవమని తెలిపింది. తొలగించిన చెట్లకు బదులుగా అంతకు రెండింతలకుపైగా మొక్కలు నాటేందుకు ఇప్పటికే నిర్ణయించామని, భవన నిర్మాణాలు పూర్తికాగానే మొక్కలు నాటతామని తెలిపింది. నిర్మాణ వ్యర్థాలు, కంకరను తీరప్రాంతంలో 10 కిలోమీటర్ల మేర పారబోస్తున్నట్టు చేసిన ఆరోపణలు కూడా సత్యదూరమని స్పష్టం చేసింది. విశాఖపట్నం జిల్లా యంత్రాంగం అనుమతించిన 287, 288 సర్వే నంబర్లతో ఉన్న ప్రభుత్వ భూమిలోనే డంప్ చేస్తున్నామని, ఆ మట్టిని భవిష్యత్‌లో లోతట్టు ప్రాంతాలను ఎత్తుచేసేందుకు జిల్లా యంత్రాంగం వినియోగిస్తుందని తెలిపింది. తీరప్రాంతంలో తాబేళ్లు, ఇతర సముద్ర జీవుల ఉనికికి ఎలాంటి ముప్పువాటిల్లడం లేదని స్పష్టం చేసింది. విశాఖపట్నం మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు ‘ఈనాడు’ తన కథనంలో చేసిన ఆరోపణ పూర్తిగా అవాస్తవమని తెలిపింది. ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రాంతం వీఎంఆర్డీఏ మాస్టర్‌ప్లాన్ మిక్స్డ్ యూజ్ జోన్–3 పరిధిలోకి వస్తుందంది. అంటే ఈ ప్రాంతంలో ఆతిథ్య రంగంలో ప్రాజెక్టులు నిర్మించేందుకు వీఎంఆర్డీఏ మాస్టర్‌ప్లాన్ అనుమతిస్తోందని వెల్లడించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నియమించిన నలుగురు సభ్యుల కమిటీ ఈ ప్రాజెక్టును పరిశీలించి నిబంధనల మేరకు నిర్మాణాలు చేపడుతున్నట్టుగా నివేదిక ఇచ్చిందని గుర్తుచేసింది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రుషికొండ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. సీఆర్‌జెడ్, వీఎంఆర్డీఏ నిబంధనలను అనుసరిస్తూ ఎన్జీటీ అనుమతుల మేరకు ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేస్తామని తెలిపింది. -
బొర్రా అందాలు అమోఘం
అనంతగిరి/అరకులోయ రూరల్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రాగుహల అందాలు అమోఘంగా ఉన్నాయని కమిటీ ఆఫ్ స్టడీ ఆన్ పబ్లిక్ సెక్టార్‌పై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ సంతోష్‌కుమార్ గన్వర్ చెప్పారు. ఆదివారం ఆయన, కమిటీ సభ్యులు జనార్దన్‌మిశ్రా, ఓంప్రకాష్ మాతుర్, పార్లమెంట్ సెషన్స్ సెక్రటరీ త్రిపాఠి బొర్రా గుహలు, అరకులోయను సందర్శించారు. సహజసిద్ధంగా ఏర్పడిన గుహలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. గైడ్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అరకులో గిరిజన సంప్రదాయ థింసా నృత్యాల నడుమ కమిటీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు గిరిజన మ్యూజియం, కాఫీ మ్యూజియం తిలకించారు. పర్యాటకశాఖ నుంచి బొర్రా పంచాయతీకి రావాల్సిన బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కమిటీకి బొర్రా సర్పంచ్ అప్పారావు వినతిపత్రం అందజేశారు. బొర్రా నుంచి పెద్దూరు గ్రామానికి వెళ్లే మార్గంలో రైల్వేట్రాక్ వల్ల ఇబ్బందిగా ఉందని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కమిటీ పర్యటన సందర్భంగా అరకులోయ సీఐ దేముడుబాబు నేతృత్వంలో అనంతగిరి, అరకులోయ ఎస్ఐలు రాము, నజీర్ బందోబస్తు నిర్వహించారు. తహసీల్దారులు వెంకటవరప్రసాద్, వేణుగోపాల్, ఎంపీడీవోలు నగేష్, రాంబాబు, ఏరియా సూపరింటెండెంట్ హరి, అనంతగిరి పీహెచ్సీ వైద్యాధికారి అనూషారావు తదితరులు పాల్గొన్నారు.