Doddaballapuram
-
భర్త కాదు.. మృగం.. భార్యను దారుణంగా..
సాక్షి, బెంగళూరు: వరకట్న వేధింపులకు మరో అబల బలైన ఘటన నెలమంగల తాలూకా భూసంద్ర గ్రామంలో చోటుచేసుకుంది. శ్రుతి (29) తన భర్త క్రిష్ణమూర్తి చేతిలో హత్యకు గురైంది. శ్రుతి తల్లిదండ్రులు వివాహ సమయంలో రూ.18 లక్షలు వరకట్నం ఇచ్చి అట్టహాసంగా పెళ్లి జరిపించారు. అయితే వివాహం జరిగిన మూడు నెలలు మంచిగానే ఉన్న క్రిష్ణమూర్తి తరువాత అసలు రంగు బయటపెట్టాడు. మరింత వరకట్నం తీసుకురావాలని శ్రుతిని వేధించసాగాడు. క్రిష్ణమూర్తికి అతడి తల్లి లక్ష్మమ్మ, తండ్రి బైలప్ప ఇద్దరూ వంతపాడేవారు. ఈక్రమంలో సోమవారం రాత్రి కట్నం విషయంలో భార్యతో గొడవపడ్డ క్రిష్ణమూర్తి కత్తితో శ్రుతిని దారుణంగా పొడిచి హత్య చేసి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. యంగ్ జర్నలిస్ట్ మృతి) -
యశ్వంత్‌తో వివాహేతర సంబంధం.. సంతోషానికి భర్త అడ్డుపడటంతో..
సాక్షి, బెంగళూరు(దొడ్డబళ్లాపురం): భార్య అక్రమ సంబంధం మోజులో భర్తను బలిగొన్న సంఘటన రామనగర తాలూకా హారోహళ్లిలో వెలుగు చూసింది. గొట్టిగెహళ్లి సమీపంలో ఇటీవల కాలిపోయిన స్థితిలో సుమారు 27 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి శవం లభ్యమైంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి మృతుడు కిరణ్‌గా గుర్తించారు. విచారణ జరిపి అతని భార్య, ఇద్దరు నిందితులను అరెస్టు చేసారు. కిరణ్ భార్య, ప్రధాన నిందితుడు యశ్వంత్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని, తమ ఆనందానికి అడ్డుగా ఉన్నాడని భర్త కిరణ్‌ను అంతం చేసిందని పోలీసులు తెలిపారు. కేసు విచారణలో ఉంది. చదవండి: (Hyderabad: చంపుతానని బెదిరించి.. భార్యను వ్యభిచారంలోకి దింపి!) -
జ్యోతిష్యుడి మాటలు నమ్మి.. భార్య, కన్నబిడ్డను..
సాక్షి, బెంగళూరు(దొడ్డబళ్లాపురం): సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నా కొందరు మూఢ నమ్మకాలను వీడటం లేదు. జ్యోతిష్యుడి మాటలు నమ్మి చెడు జరుగుతుందని నమ్మిన వ్యక్తి కట్టుకున్న భార్యను, కన్నబిడ్డను ఇంట్లోంచి బయటకు పంపించిన దారుణ సంఘటన చెన్నపట్టణ పరిధిలోని మంజునాథ్ లేఔట్లో చోటుచేసుకుంది. వివరాలు... నవీన్ (35), శ్రుతికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రుత్విక్ (2) అనే కుమారుడు ఉన్నాడు. ఆ చిన్నారి పుట్టిన నక్షత్రం వల్ల బిడ్డకు, ఆ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి వల్ల నీకు కీడు జరుగుతుందని ఓ జ్యోతిష్యుడు చెప్పడంతో ఆ మాటలు నమ్మిన నవీన్ భార్య, బిడ్డపై నిత్యం దాడి చేసి హింసించేవాడు. ఇంట్లోంచి వెళ్లిపోవాలని లేదంటే పెట్రోల్ పోసి ఇద్దరినీ తగలబెడతానని బెదిరించడంతో శ్రుతి తన బిడ్డను తీసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతూ పట్టుబడ్డ మహిళ.. చితకబాదిన స్థానికులు
సాక్షి, బెంగళూరు: చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతూ పట్టుబడ్డ మహిళను పట్టుకుని చితకబాదిన స్థానికులు ఆమెను పోలీసులకు అప్పగించిన సంఘటన దొడ్డ తాలూకా మధురె గ్రామంలో చోటుచేసుకుంది. హెసరఘట్ట గ్రామానికి చెందిన రాజమ్మ అనే వృద్ధురాలు పని నిమిత్తం మధురె గ్రామానికి వచ్చింది. పని ముగించుకుని బస్సు కోసం మధురె గ్రామం బస్టాప్‌లో వేచి ఉండగా బైక్‌పై వచ్చిన ఒక మహిళ, మరో వ్యక్తి తాము దంపతులమని చెప్పుకుని రాజమ్మతో మాటలు కలిపారు. హఠాత్తుగా మహిళ రాజమ్మ మెడలోని బంగారు గొలుసు తెంపుకుని పరారవడానికి ప్రయత్నించింది. అయితే స్థానికులు రావడం గమనించి బైక్‌పై పరారవడానికి చేసిన ప్రయత్నంలో మహిళ కిందపడిపోగా వ్యక్తి బైక్‌పై పరారయ్యాడు. పట్టుబడ్డ మహిళను చితకబాదిన స్థానికులు అనంతరం ఆమెను దొడ్డబెళవంగల పోలీసులకు అప్పగించారు. పట్టుబడ్డ మహిళ పేరు నందినిగా తెలిసింది. -
మామను ప్రియుడితో హత్య చేయించిన కోడలు
సాక్షి, కర్ణాటక(దొడ్డబళ్లాపురం): రామనగర తాలూకా భైరవనదొడ్డి గ్రామ సమీపంలోని తోటలోని ఇంట్లో ఫిబ్రవరి 25న జరిగిన కాంగ్రెస్ నాయకుడు గంటప్ప (55) హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసారు. గంటప్ప కోడలు ప్రియుడితో కలిసి మామను హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. గంటప్ప కోడలు చైత్ర (28) తన మామ ఆస్తిలో భాగం ఇవ్వలేదనే అక్కసుతో తన ప్రియుడు నవీన్‌కు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్టు పోలీసుల విచారణలో తేలింది. గంటప్ప కుమారుడు నందీష్‌ను వివాహం చేసుకోవడానికి ముందు చైత్ర నవీన్‌ను ప్రేమిస్తుండేది. వివాహం అనంతరం కూడా నవీన్‌తో వివాహేతర సంబంధం కొనసాగించేది. ఈ క్రమంలో మామ గంటప్ప ఆస్తి ఇవ్వలేదనే కోపంతో నవీన్‌తో కలిసి హత్యకు పథకం వేసింది. పథకం ప్రకారం నవీన్ గంటప్పను హత్య చేశాడు. ఈ కేసులో బిడది పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. చదవండి: (వివాహితపై కామాంధుల సామూహిక అత్యాచారం.. స్పృహ కోల్పోయి) -
ఆరేళ్లుగా పరిచయం.. ఉద్యోగం ఇప్పిస్తానని కారులో తీసుకెళ్లి..
దొడ్డబళ్లాపురం (కర్ణాటక): ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి యువతిపై అత్యాచారం జరిపిన సంఘటన నెలమంగల తాలూకా మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హర్షగౌడ (26) అనే యువకుడిపై అత్యాచారం కేసు నమోదయింది. ఆరేళ్లుగా పరిచయం ఉన్న యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఈనెల 16న పిలిపించుకుని కారులో తీసుకెళ్లి అత్యాచారం జరిపినట్టు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (నాటు వైద్యుని ఇంట్లో మహిళ శవం) -
నాగరాజు ఇంటిపై ఏసీబీ దాడులు.. దిగులుతో భార్య మృతి
సాక్షి, దొడ్డబళ్లాపురం (బెంగళూరు): నెలమంగల పట్టణంలోని కేఏఎస్ అధికారి నాగరాజు భార్య గుండెపోటుతో మృతిచెందింది. నాగరాజు ఇంటిపై ఇటీవలే ఏసీబీ అధికారులు దాడిచేసి కోట్ల విలువైన నగదు, నగలు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి భార్య నాగరత్న దిగులుగా ఉంటోంది. గురువారం తెల్లవారుజామున హఠాత్తుగా ఆమెకు గుండెపోటు వచ్చింది. బెంగళూరు కొలంబియా ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స ఫలించక మృతి చెందింది. తమ ఇంటిపై వరుసగా మూడోసారి ఏసీబీ దాడి జరగడంతో ఆమె ఆ రోజే మీడియా ముందు బోరున విలపించింది. చదవండి: (కట్నం వేధింపులకు నవ వధువు బలి) -
నమ్మకమే పెట్టుబడి: మాంచి ముహూర్తం చూసుకుని.. 130 కార్లతో జంప్!
దొడ్డబళ్లాపురం: ట్రావెల్స్ వ్యాపారం పేరుతో సుమారు 130 కార్లను అద్దెకు తీసుకున్న ఓ వ్యక్తి.. ఒకానొక రోజు మంచి ముహూర్తం చూసుకుని కార్లు అన్నిటినీ చాప చుట్టేసి, వాటి యజమానుల్ని నిండా ముంచేసి మాయమయ్యాడు. ఈ ఉందంతం బెంగళూరు సమీపంలోని నెలమంగల తాలూకాలో వెలుగుచూసింది. తమిళనాడుకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి సంవత్సరం క్రితం తాలూకాలోని నాగసంద్రలో ఆర్ఎస్ ట్రావెల్స్ పేరుతో ఆఫీసు తెరిచాడు. చుట్టుపక్కల వారి నమ్మకాన్ని చూరగొన్నాడు. మీ కార్లను నా దగ్గర ఉంచితే వాటిని అద్దెకు తిప్పి మీకు డబ్బులు ఇస్తానని చెప్పి.. సుమారు 130 కార్లను ఆధీనంలో ఉంచుకున్నాడు. వీటన్నింటి విలువ రూ.10 కోట్ల పైనే. ప్రారంభంలో ప్రతి నెలా 8వ తేదీన కార్ల యజమానులకు అద్దె డబ్బులను అకౌంట్లలో వేసేవాడు. నవంబర్ నెల అద్దె చెల్లించకపోవడంతో కార్ల యజమానులు శివకుమార్‌కు ఫోన్ చేయగా స్పందించలేదు. అనుమానం వచ్చి ట్రావెల్స్ ఆఫీసు వద్దకు వచ్చి చూడగా తాళం వేసి ఉంది. తామంతా మోసపోయామని తెలుసుకున్న యజమానులు బాగలగుంట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
దారుణం: కారు బైక్ ఢీ.. మామ, కోడలు దుర్మరణం
సాక్షి, దొడ్డబళ్లాపురం: వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొనడంతో మామ, కోడలు మృతి చెందిన సంఘటన నెలమంగల తాలూకా మల్లరబాణవాడి గ్రామంలో చోటుచేసుకుంది. గుల్బర్గా జిల్లా మాదాబకు చెందిన గీత (35), సూర్యకాంత్ (45) మృతి చెందారు. సూర్యకాంత్ కుటుంబం జీవనోపాధి కోసం నెలమంగల వచ్చి శాంతినగర్‌లో స్థిరపడ్డారు. కొత్తగా బైక్ కొన్న వీరు ఆదివారం సాయంత్రం పొద్దుపోయాక ఊరిలో తిరిగి ఇంటికి వస్తుండగా వెనుక నుండి వచ్చిన కారు వేగంగా ఢీకొంది. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇంజెక్షన్ చేసుకుని ఆత్మహత్య దొడ్డబళ్లాపురం: ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న యువకుడు ఇంజెక్షన్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన నెలమంగల పట్టణంలో చోటుచేసుకుంది. చిక్కమగళూరు కడూరుకు చెందిన సంజయ్ (19) నెలమంగలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున ఆస్పత్రిలోని రెస్ట్ రూంకి వెళ్లి ఎంతసేపయినా రాకపోవడంతో సిబ్బంది అనుమానం వచ్చి చూడగా సంజయ్ మత్తుమందు ఎక్కువ డోస్ తీసుకుని చనిపోయి ఉన్నాడు. దీనిపై అతని తల్లితండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: (ఐసీయూలో నటుడు సత్యజిత్.. పరిస్థితి విషమం) -
పొలం బాట పట్టిన మాజీ సీఎం
దొడ్డబళ్లాపురం: మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి లాక్డౌన్ సమయంలో వ్యవసాయ బాట పట్టారు. ప్రస్తుతం రామనగర తాలూకా కేతగానహళ్లిలో 20 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ బిజీగా ఉన్నారు. జొన్న, టొమాటో, బెండ, మిరపకాయి, కొబ్బరి, అరటి, వక్క పంటలు పండిస్తున్నారు. ఇవి కాక గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం కూడా చేస్తున్నారు. చదవండి : మణిపూర్ గవర్నర్‌గా గణేశన్ -
మరో 3 కోట్లు ఇవ్వాలి: మాజీ ఎమ్మెల్యేపై చీటింగ్ కేసు
సాక్షి, బెంగళూరు: దొడ్డబళ్లాపురం తాలూకా మాజీ ఎమ్మెల్యే జే నరసింహస్వామి, ఆయన భార్యపై చీటింగ్ కేసు నమోదైంది. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల ఖర్చు కోసం నరసింహస్వామి, ఆయన భార్య నాగమణి రూ.3 కోట్లు అప్పు తీసుకున్నారని, అయితే తరువాత తిరిగి ఇవ్వలేదని ఆరోపిస్తూ విలేఖరి సంగమ్‌దేవ్ బెంగళూరు సంజయ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.85 లక్షలు మాత్రం అప్పు తీర్చారని, మిగతా సొమ్ము ఇవ్వలేదని బాధితుడు ఫిర్యాదు చేశారు. మిగిలిన డబ్బు అడిగితే తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. రామదాసుపై భూముల కేసు మైసూరు: మైసూరు మళలవాడి ప్రాంతంలో ఉన్న భూముల అక్రమాల్లో కే.ఆర్.నగర బీజేపి ఎమ్మెల్యే ఎస్.ఎ.రామదాసుపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. 1994లో అప్పటి కలెక్టర్ విజయభాస్కర్ మళలవాడి భూముల అక్రమాలపైన విచారణ చేసి రామదాసుపైన నివేదికను ఇచ్చారు. 2008లో లక్ష్మిపురం పోలీస్ స్టేషన్లోనూ రామదాసుపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేపై విచారణ జరపాలని సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ పిటిషన్లు వేశారు. పరిశీలించిన కోర్టు కేసు నమోదు చేసి విచారించాలని ఆదేశించింది. చదవండి: ఈ 3 రాష్ట్రాల్లో పాత వాహనాలు ఎక్కువ -
వీళ్లు మామూలు దొంగలు కాదు; విమానాల్లో వచ్చి.. ఆపై
బెంగళూరు: విమానాల్లో వచ్చి చోరీలు చేసి రైళ్లలో పరారవుతున్న ఇద్దరు ఖతర్నాక్ దొంగలను యూపీలో కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. అర్జున్‌సింగ్ (27), సోనుకుమార్ (32)లు గతనెల 30న బెంగళూరు గ్రామీణ జిల్లాలో 19 చోట్ల చైన్ స్నాచింగ్‌లు చేశారు. అనంతరం సర్జాపురలో స్నేహితుడి గదికి వెళ్లారు. ఇలా ఒకే రోజు పెద్ద ఎత్తున స్నాచింగ్‌లు జరగడంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. కేసులు నమోదు చేసుకుని, నిందితులను సర్జాపురలోని తన గదిలో ఉంచుకున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో తిరిగి చివరకు యూపీలో నిందితులను అరెస్టు చేసారు. ఇంట్లో వారందరినీ కట్టేసి మైసూరు: ఇంట్లో వారందరినీ కట్టేసి నగదు, నగలు దోచుకుని పరారైన ఘటన జిల్లాలోని హణసూరు పట్టణంలో జరిగింది. పట్టణంలోని సుమన్ ఫంక్షన్ హాల్ యజమాని ఇంటికి సోమవారం అర్ధరాత్రి దుండగులు ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులను మారణాయుధాలతో బెదిరించి దాడి చేసి కట్టేశారు. అనంతరం ఇంట్లోని రూ. 6 లక్షల నగదు, అరకేజీ బంగారాన్ని దోచుకుని పరారయ్యారు. దొంగల దాడిలో గాయపడిన నస్రత్ ఉన్నిసా, మమ్తాజ్, ఆయేషా అంజుం, గజాలత్ తరనంలను ఆస్పత్రికి తరలించారు. భార్య పుట్టింటికి వెళ్లిందని... దొడ్డబళ్లాపురం: గొడవపడ్డ భార్య పుట్టింటికి వెళ్లడంతో కలతచెందిన భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెలమంగల తాలూకా దాబస్‌పేట పట్టణంలో చోటుచేసుకుంది. దాబస్‌పేట శివగంగ సర్కిల్లో నివసిస్తున్న శివరామ్ (42) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. శివరామ్ భార్య వారం క్రితం భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో శివరామ్ మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం ఇంట్లో నుండి దుర్వాసన వస్తుండడంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా శివరామ్ మృతదేహం కుళ్లిన స్థితిలో ఉంది. మూడు రోజుల క్రితమే ఆత్మçహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
అక్కడ 295 గ్రామాల్లో కరోనా కేసులు లేవు.. ఇదే కారణమట
సాక్షి, బెంగళూరు (దొడ్డబళ్లాపురం): బెంగళూరు గ్రామీణ జిల్లాలో కరోనా సర్వాంతర్యామిగా మారి విలయం సృష్టిస్తుంటే ఈ జిల్లాలోని 295 గ్రామాల్లో మాత్రం కరోనా ఆటలు సాగడంలేదు. ఇందుకు కారణం జిల్లా పంచాయతీ సీఈఓ రవికుమార్ ముఖ్య కారణమని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 1,091 గ్రామాలు ఉండగా వీటిలో 295 గ్రామాల్లో ఇప్పటికీ కరోనా అడుగుపెట్టలేకపోతోంది. అందులోనూ 157 గ్రామాల్లో ఇప్పటి వరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. నెలమంగల తాలూకాలో 151, హొసకోటలో 71, దొడ్డబళ్లాపురం తాలూకాలో 62, దేవనహళ్లి తాలూకాలో 11 గ్రామాల్లో కరోనా ఆటకట్టించారు. జిల్లా పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ సభ్యులు ఆయా గ్రామాల ప్రజల సహకారంతో ఇదంతా సాధించారు. ఈ గ్రామాల్లో ఇతర ప్రాంతాల నుండి వచ్చే ప్రతి ఒక్కరికీ కోవిడ్ టెస్టు చేసిగానీ గ్రామాల్లోకి అనుమతించడంలేదు. ఇదంతా జిల్లా పంచాయతీ సీఈఓ రవికుమార్ దిశానిర్దేశం మేరకు జరుగుతోందని అధికారులు అంటున్నారు. చదవండి: పంచాయతీ ఎన్నికల్లో ఓటేయలేదని గ్రామస్తులపై ఆగ్రహం -
కూతురు ప్రేమపెళ్లి.. పరువు కోసం కన్నవారు ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: కూతురు ప్రేమ పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు పరువు పేరుతో ఆమెను హత్యచేయడం అక్కడక్కడా జరుగుతోంది. ఈసారి తల్లిదండ్రులే ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన చెన్నపట్టణ తాలూకా తెంకనహళ్లిదొడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ మాజీ అధ్యక్షుడు రమేశ్ (50), భార్య శ్యామల (42) ఆత్మహత్యవారు. వీరి కుమార్తె శిల్ప (21) ను ఎంతో అల్లారుముద్దుగా పోషించారు. ఆమె ఇదే గ్రామానికి చెందిన యువకుడు పునీత్‌తో ప్రేమలో పడింది. కులాలు ఒక్కటే అయినా పలు కారణాల వల్ల శిల్ప తల్లిదండ్రులు వీరి ప్రేమకు ఒప్పుకోలేదు. దీంతో మే 30న శిల్ప పునీత్‌తో వెళ్లిపోయి వివాహం చేసుకుంది. విషయం తెలిసిన దంపతులు అవమానభారంతో మంగళవారం నాడు తమ తోటలో మామిడి చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. దీంతో బుధవారం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. -
బ్లాక్ ఫంగస్ భయం: మగ్గానికి ఉరేసుకున్న బాధితుడు
దొడ్డబళ్లాపురం: బ్లాక్ ఫంగస్ ఉన్నట్లు బయట పడటంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దొడ్డబళ్లాపురంలోని విద్యానగర్‌లో నివసిస్తున్న రవీంద్ర (58) మరమగ్గం కార్మికుడు. ఈయన కరోనాకు గురై బాగేపల్లిలోని కోవిడ్ కేర్ సెంటర్లో చికిత్స తీసుకున్నాడు. రోగ లక్షణాలు ఎక్కువ కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించగా బ్లాక్‌ఫంగస్ ఉన్నట్లు తేలింది. దీంతో అతన్ని బెంగళూరు విక్టోరియాకు తరలించారు. అక్కడ వైద్య సిబ్బందితో గొడవపడి తిరిగివచ్చిన రవీంద్ర గురువారం రాత్రి మగ్గం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అధికారులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి దహనం చేయడానికి నగరసభ అధికారులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది. మగ్గానికి వేలాడుతున్న రవీంద్ర -
ఇన్‌స్టాలో ప్రేమ పేరుతో మైనర్‌కు వల
దొడ్డబళ్లాపురం : కరోనా ప్రభావంతో లాక్డౌన్ వచ్చి పిల్లలు స్కూళ్లకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అయితే పాఠాలు మిస్ అవ్వకూడదని కొన్ని పాఠశాలలు ఆన్లైన్ క్లాసులు ప్రారంభించాయి. దీంతో పిల్లలు ఆన్‌లైన్‌తోపాటు ఇంటర్నెట్కు బాగా దగ్గరయ్యారు. సోషల్ మీడియాలో మునిగితేలుతున్నారు. ఇలా సోషల్ మీడియాకు బానిససైన మైనర్ బాలిక ఒక మాయలోడి మాయలో పడి మోసపోయింది. అయితే చివరి క్షణంలో ఆమె తండ్రి చొరవతో క్షేమంగా బయటపడింది. ఘటనకు సంబంధించి వివరాలు.. బెంగళూరు ఉత్తరహళ్లిలోని ఏజీఎస్ లేఔట్లో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక ఆన్లైన్ పాఠాలతో ఇంటర్నెట్, సోషల్ మీడియాకు బాగా అలవాటు పడింది. ఈ క్రమంలో లాక్డౌన్ అమలయినప్పటి నుంచి ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సమయం గడుపుతూ వ్యక్తిగత ఫోటోలు కూడా అప్లోడ్ చేస్తూ ఉండేది. ఇలా ఉండగా హైదరాబాద్‌కు చెందిన విశాల్ అనే యువకుడు పరిచయమయ్యాడు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. విశాల్ బాలికతో నిన్ను వదిలి ఉండలేనని, హైదరాబాద్ వచ్చేయాలని చెప్పాడు. దీంతో బాలిక జూన్ 8వ తేదీన మ్యూజిక్ క్లాస్ వెళ్లాలని చెప్పి ఇంటి నుండి బయటకు వచ్చి నేరుగా కెంపేగౌడ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. కుమార్తెలో మార్పును మొదటి నుంచి గమనిస్తున్న తండ్రి ఎంతసేపటికీ కూతురు ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి ఆమె ఇన్స్టాగ్రాం అకౌంట్ డీకోడ్ చేసి చాటింగ్ హిస్టరీ చూసి విషయం తెలుసుకున్నాడు. చాటింగ్‌లో విశాల్ హైదరాబాద్ రావడానికి బాలికకు విమానం టిక్కెట్ కూడా బుక్ చేసిన సంగతి తెలిసింది. నేరుగా ఎయిర్‌పోర్టుకు వెళ్లగా కుమార్తె పట్టుబడింది. ఇదే నెల 17న తండ్రి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్‌కు చెందిన విశాల్ బాలికకు 18 సంవత్సరాలు నిండాయని నమ్మించడానికి నకిలీ ఎస్ఎస్ఎల్సీ మార్క్స్ కార్డ్ తయారు చేయించాడు. వస్తూ ఫోటోలు, ఆధార్‌కార్డు, కొంత నగదు తీసుకురావాలని చెప్పడంతో బాలిక ఆదేవిధంగా చేసింది. అయితే విశాల్‌కు సంబంధించి ఎటువంటి వివరాలు పోలీసులకు ఇంకా లభించలేదు. సైబర్ క్రైం, పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్ 468 కింద కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అచ్చం దండుపాళ్యం గ్యాంగ్ తరహాలో..
సాక్షి, దొడ్డబళ్లాపురం : చికిత్స కోసమని వైద్యుని ఇంటి తలుపులు తట్టిన దుండగులు లోపల చొరబడి దోపిడీకి పాల్పడ్డ సంఘటన మాగడి తాలూకా కుదూరులో చోటుచేసుకుంది. దండుపాళ్యం ముఠాల తరహాలో దోపిడీ జరగడం గమనార్హం. సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో అపరిచితులు డాక్టర్ సుభాష్ సింగ్ ఇంటి తలుపులు తట్టడంతో తీశారు. ఒక మహిళ చిన్న పాపను ఎత్తుకుని వచ్చి ఆయాసంగా ఉందని, మందులు కావాలని అడిగింది. మహిళను లోపలకు రమ్మనగానే ఆమె వెనుకనే 15 మంది ఇంట్లోకి చొరబడ్డారు. వచ్చీరాగానే వైద్యుడు సుభాష్ సింగ్, భార్య శశికళ సింగ్, కుమారులు లోకనాథ్‌సింగ్, పృథ్వీ సింగ్‌ల కళ్లల్లో కారం చల్లారు. తరువాత నలుగురినీ కాళ్లు చేతులు కట్టి, నోట్లో గుడ్డలు కుక్కారు. ఇంట్లో ఉన్న రూ.50వేల నగదు, బంగారు వెండి ఆభరణాలతో పాటు, ల్యాప్‌ట్యాప్, ఇతర ఖరీదైన వస్తువులు, డిజిరో కారును దోచుకెళ్లారు. ప్రతిఘటించిన నలుగురినీ విచక్షణారహితంగా కొట్టారు. సీసీ కెమెరాలు, కుక్కలు ఉన్నా.. అనంతరం వైద్యుని కుమారులు అతి కష్టంమీద కట్లు తెంచుకుని బయటకు వచ్చి కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి రక్షించారు. వైద్యుని ఇల్లు విశాలంగా ఉంది. చుట్టూ 14 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి.15 పెంపుడు కుక్కలు ఉన్నాయి. అయినా దుండగులు నిర్భయంగా వచ్చి దోపిడీ చేసుకుపోవడం ప్రశ్నార్థకంగా ఉంది. తమ చిత్రాలు దొరక్కుండా దుండగులు సీసీ టీవీల ఉపకరణాలను కూడా అపహరించారు. క్షతగాత్రులను నెలమంగల ప్రభుత్వ ఆస్పపత్రికి తరలించారు.కుదూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్యారిస్ టూర్ అన్నారు.. తిండికీ దిక్కులేదు
దొడ్డబళ్లాపురం: ‘ఫ్యాషన్ రాజధాని అయిన ప్యారిస్ నగరాన్ని చూపిస్తాం. అద్భుతమైన టీచింగ్, మంచి ఉద్యోగాలు గ్యారంటీ అన్నారు. తీరా క్లాసులకి వెళ్తే బోధకులు కూడా లేరు’ అని విద్యార్థులు లబోదిబోమన్నారు. లక్షలకొద్దీ ఫీజులు దండుకుని సౌకర్యాలు కల్పించని కాలేజీ మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా విద్యార్థులు ధర్నా చేసిన సంఘటన దొడ్డబళ్లాపురం అపెరల్ పార్కులోని ఓ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కాలేజీలో చోటుచేసుకుంది. విద్యార్థుల్లో అధికమంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. మంగళవారం సాయంత్రం నుండి అర్థరాత్రి వరకూ విద్యార్థులు తరగతులు భహిష్కరించి కాలేజ్ మెయిన్ గేట్ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన తెలుగు విద్యార్థులు అమత, కీర్తన తరదితరులు కాలేజీలో చేరేముందు అనేక హామీలు ఇచ్చిన యాజమాన్యం, విద్యార్థులు చేరాక తమ సమస్యలను అస్సలు పట్టించుకోవడం లేదన్నారు. కాలేజీ గేట్ వద్ద బైఠాయించిన విద్యార్థులు ప్లేస్మెంట్లు లేవు, ఫ్యాషన్ షోలు లేవు ముఖ్యంగా ప్లేస్మెంట్లు కల్పించడం లేదని, ఫ్యాషన్ షోలు, గ్రాడ్యుయేషన్ డేలు నిర్వహించడం లేదని వాపోయారు. విద్యార్థులందరికీ ఒకే మొత్తం ఫీజు కాకుండా రూ.3 లక్షల నుండి 15 లక్షల వరకూ వసూలు చేశారన్నారు. తీరా కాలేజీలో చూస్తే టీచర్లు లేరని, ల్యాబ్‌లు, ఎక్విప్మెంట్లు అస్సలు లేవన్నారు. లక్షల ఫీజులు వసూలు చేసిన మంచి నీరు,నాణ్యమైన ఆహారం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇదేమని ప్రశ్నిస్తే సిబ్బంది బెదిరిస్తున్నారని, డిగ్రీ క్యాన్సిల్ చేయిస్తానని, అంతు చూస్తామని సర్టిఫికెట్లు ఇవ్వకుండా హెచ్చరిస్తున్నారన్నారు. కాలేజ్‌లో చేరిన మొదటి రోజుల్లో విద్యార్థులను ప్యారిస్ తీసికెళ్తామని చెప్పారని, అందుకు డబ్బులు కూడా అధికంగా కట్టించుకుని ఇప్పుడు ఆ వూసే ఎత్తడం లేదన్నారు. తరచూ ప్రిన్సిపాల్స్ మారుతుండడంతో కాలేజీలో చెప్పుకోడానికీ దిక్కులేకుండాపోయిందన్నారు. కాలేజీ ఫీజులుకాక అధికంగా వివిధ రకాలుగా ఫీజులు గుంజుతున్నారన్నారు. ఎంతో మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ కాలేజీలో చేరితే నిలువునా ముంచేసారని భోరుమన్నారు. అనంతరం పోలీసుల జోక్యంతో విద్యార్థులు ధర్నా విరమించారు. -
వివాహితతో కుమారుడు పరారు.. పరువు తీశాడని..
దొడ్డబళ్లాపురం : కుమారుడు పక్కింటి వివాహితతో పరారవడంతో అవమానం భరించలేని తల్లితండ్రులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కనకపుర తాలూకా కల్లిగౌడన దొడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామం నివాసులయిన సిద్ధరాజు (52) సాకమ్మ( 42) ఆత్మహత్యకు పాల్పడ్డ దంపతులు. వీరి కుమారుడు మను ఇదే గ్రామానికి చెందిన ఓ వివాహితను తీసుకుని బుధవారం పరారయ్యాడు. కుమారుడి చర్యలతో గ్రామస్తులు తల్లితండ్రులను నిందిండంతో పాటు ఇంటి ముం దుకువచ్చి వివాహిత కుటుంబ సభ్యులు గొడవ చేయడంతో తీవ్ర మనస్తాపం చెందిన వారు గురువారం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కోడిహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే ...
దొడ్డబళ్లాపురం : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే కాలయముడై భార్య ప్రాణం తీసిన సంఘటన బెళగావి జిల్లా బైలహొంగల తాలూకా మల్లమ్మన బెళవడి గ్రామంలో చోటుచేసుకుంది. çశనివారం ఉదయం నుండి భర్త యువరాజ్ అబ్బార్, మామ బసప్ప, అత్త మాదేవి, మరుదులు వీరణ్ణ, యల్లప్ప అందరూ ఇల్లు వదిలి పరారయ్యారు. సుమ (21) 10 నెలల క్రితమే యువరాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. యువరాజ్ కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. దీంతో యువరాజ్, సుమ ఇద్దరూ బైలహొంగలలో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. పెద్దల సమక్షంలో పంచాయతీ తరువాత అయిష్టంగానే దంపతులను ఇంట్లోకి రానిచ్చారు. అయితే ఆనాటి నుండి సుమను వేధించేవారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సుమను కొట్టి గొంతు నులిమి హత్య చేయడం జరిగింది. మృతురాలి తల్లితండ్రుల ఫిర్యాదుమేర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మా ఆవిడ.. కాదు మా ఆవిడ.. షాకిచ్చిన ఆవిడ
బెంగళూరు : ఆవిడ మా ఆవిడ అంటూ ఒకరు.. కాదు మా ఆవిడ అంటూ మరొకరు. ఇద్దరు వ్యక్తులు నడిరోడ్డుపై కొట్టుకున్న ఘటన గత శనివారం బెంగళూరు సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట్లో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఇద్దరు తనకొద్దు అంటూ.. మరొకరిని పెళ్లి చేసుకున్నానని తెలిపి వారికి షాకిచ్చింది ఆ మహిళ. వారిద్దరూ స్నేహితులేనని, తమతో సంబంధం పెట్టుకున్న యువతి కోసం తన్నుకున్నారని తేల్చిన పోలీసులు వారి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా సదరు మహిళను పిలిపించి మాట్లాడగా.. ఆ ఇద్దరిని పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని, తను వారితో సహజీవనం మాత్రమే చేశానని, మరో వ్యక్తిని పెళ్లి కూడా చేసుకున్నానని షాకిచ్చింది. అంతేకాకుండా సదరు మహిళకు అప్పటికే మూడు పెళ్లిళ్లు కావడం కొసమెరుపు. తొలుత రంగస్వామి అనే వ్యక్తిని పెళ్లాడిన ఆమె కొన్నాళ్లు సంసారం చేసి అనంతరం అతన్నుంచి విడిపోయింది. తర్వాత ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రమేష్ కుమార్‌తో సహజీవనం చేసింది. అనంతరం మూర్తి అనే ట్రాక్టర్ డ్రైవర్‌తో సహజీవనం సాగించింది. ఇది తెలిసిన రమేష్ ఆమెకు దూరంగా ఉన్నాడు. ఇదే సమయంలో పరిచయమైన సిద్దరాజు అనే క్యాబ్ డ్రైవర్ పెళ్లి చేసుకుందామని ఆమెకు చెప్పాడు. అతనితో కూడా సహజీవనం ప్రారంభించిన ఆమె, గత శనివారం సిద్దరాజుతో కలిసి ఉండటాన్ని మూర్తి చూశాడు. ఆగ్రహంతో సిద్దరాజుపై దాడి చేశాడు. ఇద్దరు గంటపాటు చితక్కొట్టుకున్నారు. ఇప్పుడా ఆ మహిళ ఇద్దరికీ హ్యాండిచ్చి మరొకరిని పెళ్లి చేసుకోవడం గమనార్హం. చదవండి: మా ఆవిడ.. కాదు మా ఆవిడ.. నడి రోడ్డుపై రచ్చ -
మా ఆవిడ.. కాదు మా ఆవిడ
దొడ్డబళ్లాపురం: ఆవిడ మా ఆవిడ అంటూ ఒకరు.. కాదు మా ఆవిడ అంటూ మరొకరు. ఇద్దరు వ్యక్తులు నడిరోడ్డుకు ఎక్కారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుప్పించుకుని నానా రచ్చ చేశారు. నెలమంగల తాలూకా బావికెరె క్రాస్ వద్ద శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... చిక్కబిదరకల్లు నివాసి మూర్తి, సిద్ధు అనే వ్యక్తులు ఒక మహిళను ఎవరికి వారే నా భార్య అంటూ వాగ్వాదానికి దిగారు. సుమారు గంటపాటు కొట్టుకోవటంతో హైడ్రామా నడిచింది. జనం గుంపులుగా చేరి మరీ గొడవను వీక్షించారు. ఒక్కరూ విడిపించే ప్రయత్నం చేయకపోగా.. వీడియో తీశారు కూడా. కొన్ని గంటల్లోనే వీడియోలు సోషల్ మీడియాలో రావడంతో టీవీ చానళ్లలో ఈ గొడవ వైరల్‌గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే... సదరు మహిళకు ఇదివరకే వివాహమై విడాకులు తీసుకున్నారు. కొట్టుకున్న ఇద్దరు వ్యక్తులూ ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నారట. ఈ విషయంపై స్థానిక పోలీసులు వాళ్ల మధ్య రాజీ కుదిర్చేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. Courtesy: Btv Kannada -
రాగి పంట కుప్పపై నిద్ర.. యువకుడు దుర్మరణం
సాక్షి, దొడ్డబళ్లాపురం : కోత కోసిన రాగి పంటను ఎండబెట్టేందుకు రోడ్డుపై వేసి ఆ కుప్పలమీదే పడుకున్న ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ విషాద సంఘటన కర్ణాటకలోని దొడ్డబళ్లాపురం తాలూకాలోని మెణసి గ్రామం సమీపంలో శుక్రవారం రాత్రి జరిగింది. మృతుడిని తాలూకాలోని మెణసి గ్రామానికి చెందిన యోగీష్ (19)గా గుర్తించారు. దొడ్డబళ్లాపురం-తుమకూరు రహదారిలో దొడ్డబెళవంగల వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. స్థానిక రైతులు తమ పొలాల్లో కోత కోసిన రాగి, జొన్న పంటలను ఎండబెట్టేందుకు, నూర్చేందుకు రోడ్డుపై వేస్తుండడం ఆనవాయితీ. ఇదేవిధంగా ఖాళీగా ఉన్న రోడ్డుపై శుక్రవారం రాత్రి తన పంట కుప్ప వేసి దానిపైనే యోగీష్ నిద్రించాడు. అర్ధరాత్రివేళ గుర్తుతెలియని వాహనం అదే రోడ్డుమీదుగా వెళ్లడంతో కుప్పలపై పడుకున్న యోగీష్ వాహనం కింద నలిగి అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చంపేస్తున్న ఈగ
ఈగల గోల మేం భరించలేకపోతున్నాం అని 8 గ్రామాల ప్రజలు లబోదిబోమంటున్నారు. రాజమౌళి ఈగ సినిమా చూశాక చాలామందికి ఈగను తక్కువగా అంచనా వేయరాదనే ఒక భావన వచ్చి ఉంటుంది. కానీ ఈ గ్రామాల వాసులకు ఆ సినిమాలో చూపించిన కష్టాల కంటే ఎక్కువే చుట్టుముట్టాయి. ఈగలు 24 గంటలూ వెంటాడి వేధిస్తున్నాయి. దొడ్డబళ్లాపురం: దొడ్డబళ్లాపురం తాలూకాలోని హుస్కూరు చుట్టుపక్కల ఉన్న సుమారు 15 కోళ్లఫారాల కారణంగా ఉత్పత్తవుతున్న ఈగలు దండయాత్ర మాదిరిగా పరిసర గ్రామాలపైబడి ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దీంతో ఓపిక నశించిన హుస్కూరు సహా 8 గ్రామాల ప్రజలు సోమవారంనాడు ఆ కోళ్లఫారాల ముందు బైఠాయించి ధర్నా చేశారు. ఈగలనైనా అరికట్టండి, లేదా ఊరు వదిలి వెళ్లిపోండి అని కోళ్లఫారాల యజమానులకు స్పష్టంచేశారు. మా కష్టాలు అన్నీఇన్నీ కావు బాధితులు మాట్లాడుతూ ‘15 సంవత్సరాలుగా హుస్కూరు చుట్టుపక్కల పలు కోళ్లఫారాలు నడుస్తున్నాయి, అక్కడి చెత్త వల్ల ఉత్పత్తవుతున్న ఈగలు మా గ్రామాలపైబడి అనేక సమస్యలు సృష్టిస్తున్నాయి, ఇంట్లో, బయట, గోడల మీద, పాత్రలమీద, వాహనాలమీద ఈగలు ముసురుకుంటున్నాయి. ఇటీవలి వర్షాలకు మరింత ముదిరాయి. నడుస్తున్నా, కూర్చున్నా, నిద్రపోతున్నా ఈగలు ముసురుకుంటున్నాయి. కనీసం టాయ్లెట్లోనూ ప్రశాంతత కరువైంది. చేతులతో నిర్విరామంగా ఈగలను తోలుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. భోజనం చేయాలంటేనే బేజారెత్తిపోయింది. అన్నం పెట్టుకుని కంచం ముందు పెట్టుకుంటే చేతికన్నా ముందు ఈగలే అన్నం మీద వాలుతున్నాయి. దీంతో గ్రామంలో చాలామంది అంటురోగాల బారినపడ్డారు. మనుషుల పరిస్థితి ఇదయితే పశువుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. పశువులపై ఈగలు వాలి ఇబ్బందులు పెడుతున్నాయి. ఈగల పీడ వల్ల గత వారం రోజుల్లోనే పదికి పైగా పశువులు మృత్యువాతపడ్డాయి’ అని బాధితులు ఆవేదనను ఏకరువు పెట్టారు. పట్టించుకోని నేతలు, అధికారులు పశువుల కళ్ళల్లోకి, ముక్కుల్లోకి వేళ్లే ఈగలు ఒంటిమీద గాయాలు ఉంటే రక్తాన్ని పీల్చి చంపుతున్నాయన్నారు. ఈగల సమస్యపై ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండాపోయిందన్నారు. ఈగల బాధ ఇలాగే కొనసాగితే గ్రామాలు వదలి వెళ్లిపోవాల్సిందేనని వాపోయారు. ఈ ఘటనపై స్పందించిన ఒక కోళ్లఫారం మేనేజర్ మాట్లాడుతూ ఈగల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
నష్టం మిగిల్చిన గాలీవాన
దొడ్డబళ్లాపురం: మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షం, వీచిన పెనుగాలుల దెబ్బ నుంచితాలూకా జనం, రైతులు తేరుకోక ముందే మరో దెబ్బ తగిలింది. బుధవారం రాత్రి బలమైన ఈదురు గాలుల తో కూడిన భారీ వర్షం మరో విషాదాన్ని నింపింది. బుధవారం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము వరకూ ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. అసలే అర్ధరాత్రి, ఆపై విద్యుత్ కూడా లేక పోవడంతో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతికారు. ఇస్లాంపురం, చైతన్య నగరం, సంజయ్ నగరం, వీరభధ్రన పాళ్యం తదితర ప్రాంతాల్లో ఇళ్లన్నీ జలమయమయ్యాయి. దుకాణదారులు ఉదయం తలుపులు తెరిచే సరికి దుకాణాలన్నీ మురుగు కాలువలను తలపించాయి. పట్టణంలోని శివపురం గేట్ వద్ద అశ్వత్థకట్టపై ఉన్న రావి చెట్టు దేవాలయంపై కూలడంతో దేవాలయం కట్టడం పాక్షికంగా దెబ్బతింది. అశ్వత్థకట్ట వేళ్లతోపాటు పెకలించుకు వచ్చింది. పాల శీతల కేంద్రంలో భారీ వృక్షం పెద్ద బాయిలర్‌పై పడడంతో అది దెబ్బతింది. పలు చెట్లు కాంపౌండ్‌పై పడ్డాయి. కోర్టు ముందు కూడా విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. ఎక్కడ చూసినా వందల కొద్దీ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కేబుల్‌వైర్లు, విద్యుత్ వైర్లు ఎక్కడికక్కడ తెగిపడ్డాయి. దీంతో గురువారం మధ్యాహ్నమైనా విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. పలు సెల్ టవర్లలో సైతం విద్యుత్ లేక ఇంటర్నెట్, మొబైళ్లు మూగబోయాయి. తాలూకా పరిధిలో అనేక పంటలు నీట మునిగాయి. భారీ చెట్లు, మామిడి, జామ, ద్రాక్ష తదితర పంటలు సర్వనాశనమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కోళ్ల ఫారంలలోకి వరద నీరు చేరడంతో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. ఇక షీట్లు ఉన్న ఇళ్ల పైకప్పులు దూది పింజల్లా ఎగిరి పోయాయి. ప్రభుత్వ పాఠశాలల్లో షీట్లతో నిర్మించిన భోజనం తయారీ కట్టడాల పైకప్పులు కూడా ఎగిరి పోయాయి. మరి కొన్ని పాఠశాలల్లో వర్షపు నీరు చేరింది.