elections 2018
-
TS Elections 2023: తెలంగాణలో కమ్మలకు, వెలమలకు చెడిందా?
రాజకీయాల్లో కుల సమీకరణాల పాత్ర చాలా కీలకం. ఓటు బ్యాంకును నిర్ణయించేది, ఎన్నికల్లో గెలిపించేది కులమే అని నమ్ముతారు. తెలంగాణ ఎన్నికలకు కొద్ది ముందు కమ్మ సామాజిక వర్గం విడుదల చేసిన ఓ ప్రెస్ నోట్ ఇప్పుడు ఆసక్తికరమైన అంశాలపై చర్చకు దారి తీసింది. మొన్నటి బీఆర్ఎస్ టికెట్ల పంపిణీలో వెలమ అభ్యర్థులకు 11 టికెట్లు దక్కగా, కమ్మ సామాజిక వర్గానికి 5 టికెట్లు దక్కాయి. అయితే ఆర్థికంగా బలంగా ఉన్న తాము, చాలా ప్రాంతాలతో పాటు ఇతర వర్గాలపైనా ప్రభావం చూపిస్తామని నమ్ముతున్న కమ్మలు తమకు 5 సీట్లు సరిపోవన్న అసంతృప్తిలో ఉన్నారు మాకు మీరు.. మీకు మేం తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్ వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు. కెసిఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీకి ముందు నుంచి కమ్మ సామాజిక వర్గం నుంచి మద్ధతు ఉంది. హైదరాబాద్, ఖమ్మంలో ఈ సామాజిక వర్గంకు ఉన్న ఓటు బ్యాంకుతో పాటు వీరు ప్రభావితం చేసే ఓట్లను గంపగుత్తగా బీఆర్ఎస్కు పడేవి. ఇటీవల సీఎం కెసిఆర్ ప్రకటించిన జాబితాలో టికెట్లు దక్కించుకున్న కమ్మలు జూబ్లీహిల్స్ - మాగంటి గోపినాథ్ శేరిలింగంపల్లి - అరికెపూడి గాంధీ సిర్పూర్ - కోనేరు కోనప్ప ఖమ్మం - పువ్వాడ అజయ్‌కుమార్ మిర్యాలగూడ - నల్లమోతు భాస్కరరావు (రేవంత్, మాణిక్కం ఠాగూర్ ను కలిసిన తర్వాత గాంధీభవన్ ముందు కమ్మ నేతలు) తుమ్మల, జలగం ఇద్దరికీ షాక్ ఇప్పుడు ఆ సమీకరణాల్లో తేడా కొట్టిందని కొన్ని పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఇటీవలే బీఆర్ఎస్ తమ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ఎక్కువ మంది సిట్టింగ్‌లకే టికెట్లు వచ్చాయి. పైగా 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయిన ఇద్దరు ముఖ్యమైన కమ్మ నేతలకు టికెట్ ఈ సారి దక్కలేదు. పాలేరు నుంచి టికెట్ ఆశించిన తుమ్మల నాగేశ్వరరావు నిరాశకు గురి కాగా.. పోటీ చేసే అవకాశం పార్టీ ఇవ్వలేదు. ఇవ్వాళ తుమ్మల కన్నీళ్లు పెడుతూ హైదరాబాద్ నుంచి వెళ్లే దృశ్యాలు ఈ సామాజిక వర్గంలో చర్చనీయాంశమయ్యాయి. (టికెట్ దక్కకపోవడంతో నిరాశకు గురై కన్నీళ్లు పెట్టుకున్న తుమ్మల) కమ్మ @ కిం కర్తవ్యం ఈ పరిణామాలు కమ్మ వర్గంలో కొంత అసంతృప్తి నింపాయి. ఈ మేరకు తెలంగాణ కమ్మ వర్గం ముఖ్యనేతలు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో తీసుకున్న నిర్ణయాలపై చర్చించారు. ఇక మిగిలింది కాంగ్రెస్, బీజేపీ కాబట్టి .. అర్జంట్‌గా రెండు లేఖలు తయారు చేశారు. ఈ రెండు పార్టీలు ప్రకటించబోయే జాబితాలో కమ్మలకు పది ఎమ్మెల్యే టికెట్లు, దీంతో పాటు వచ్చే ఏడాది రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రెండు ఎంపీ టికెట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని, అలాగే తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డిని కలిసి తమ విజ్ఞప్తులు అందించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ను మాత్రం కలవలేదు. (బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి కలిసి టికెట్లు ఇవ్వాలని కోరిన కమ్మ నేతలు) చాలా స్ట్రాంగ్ తెలంగాణలో ఆర్థికంగా అత్యంత శక్తిమంతమైన కులాలుగా ఉన్న కమ్మ, వెలమ కులాలు రాజకీయంగా మాత్రం వేర్వేరు స్థాయిల్లో ఉన్నాయి. ఈ రెండు కులాలకు హైదరాబాద్‌లోని ప్రధాన స్థలాల్లో సొంత భవనాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆ రెండు కులాలకీ చెరో ఐదెకరాల స్థలాన్ని ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంపై వివాదం చెలరేగింది. ఆ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఆ విషయంలో కూడా కమ్మ సామాజిక వర్గానికి కొంత అసంతృప్తి మిగిలింది. ఓ రకంగా బీఆర్ఎస్ను రెచ్చగొట్టడానికే కమ్మ నాయకులు కాంగ్రెస్, బీజేపీలను కలిశారన్న ప్రచారం జరుగుతోంది. -
38 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాలి
శామీర్‌పేట్: పోలింగ్ మొదలయ్యే సమయానికి 38 గంటల ముందే (19వ తేదీ సాయంత్రం 5 గంటలకు) ప్రచారాన్ని నిలిపివేయాలని జిల్లా ఉపఎన్నికల అధికారి జ్యోతి తెలిపారు. గురువారం శామీర్‌పేట మండల పరిషత్ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ... గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. శామీర్‌పేట మండలంలో 22 గ్రామపంచాయతీలు ఉండగా ఇందులో యాడారం, నాగిశెట్టిపల్లి పంచాయతీల్లో సర్పంచ్‌తో పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైందన్నారు. సీఎం దత్తత గ్రామమైన మూడుచింతలపల్లి సర్పంచ్ ఏకగ్రీవం అయ్యాయని వీటితో పాటు లింగాపూర్ తాండాలోని 8 వార్డుల వార్డుసభ్యులు ఏకగ్రీవంగా ఎన్పికైనట్లు తెలిపారు. శామీర్‌పేట మండలంలో మిగిలి 20 గ్రామపంచాయితీల్లో 74 మంది సర్పంచ్ అభ్యర్ధులతో పాటు 574 మంది వార్డు సభ్యుడి అభ్యర్ధులకు 216 పోలింగ్ బూత్‌ల ద్వారా ఎన్నికలు 21న నిర్వహించి ఆదే రోజు మధ్యాహ్నం తర్వాత ఉపసర్పంచ్‌ను ఎన్నుకోనున్నట్లు తెలిపారు. ఒకరోజు ముందే పోలింగ్‌స్టేషన్‌కు సిబ్బంది... గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ స్టేషన్‌కు ఒక రోజు ముందే ఎన్నికల సిబ్బంది చేరుకుంటారన్నారు. ప్రతి గ్రామానికి ఒక రిటర్నింగ్ అధికారిని నియమించామని, మండల వ్యాప్తంగా 22 రూట్లలో 22 బస్సుల్లో ఎన్నికల సామాగ్రిని తరలించనున్నట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నలుగురు జోనల్ అధికారులతో పాటు 672 మంది ఎన్నికల సిబ్బందిని నియమించామని, 4 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు(ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ, వీఎస్టీ, ఎంఎస్టీ)లు 24 గంటలు మండల వ్యాప్తంగా పర్యటిస్తున్నాయన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు... మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక బృందాలు పర్యటిస్తాయన్నారు. అతి సమస్యాత్మకమైన అలియాబాద్, బొమ్మరాశిపేట, లాల్‌గడి మలక్‌పేట, మజీద్‌పూర్, మూడుచింతలపల్లి, శామీర్‌పేట, తుర్కపల్లి గ్రామాలను గుర్తించామని ఈ గ్రామాల్లో అదనపు పోలీస్ సిబ్బందితో పాటు ప్రత్యేక బృందాలు(ఫ్లైయింగ్స్క్వాడ్) పర్యటిస్తాయన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అభ్యర్ధులతో పాటు ప్రజలు సహకరించాలన్నారు. -
రేపటి బంగ్లా ఎన్నికలపై భారత దృష్టి
సాక్షి, న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ పార్లమెంట్‌కు ఆదివారం నాడు జరుగుతున్న ఎన్నికలు ఆ దేశానికే కాకుండా భారత దేశానికి కూడా ముఖ్యమైనవే. 1971లో విమోచన యుద్ధం ద్వారా స్వాతంత్య్ర దేశంగా ఆవిర్భవించినప్పటి నుంచి బంగ్లాదేశ్‌కు సహజమైన మిత్ర దేశంగా ఉంటున్న భారత్‌కు మధ్య బలమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ ఆర్థిక రంగంలో సాధించిన పురోగతి, సుస్థిరత రాజకీయ రంగంలో సాధించకపోవడం మాత్రం విచారకరమైన విషయమే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటికి బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగానే కాకుండా అట్టడుగు స్థాయిలో ఉండింది. గడిచిన దశాబ్దం నుంచి ఆ దేశం ఏటా ఆరు శాతానికిపైనే జీడీపీ వృద్ధి రేటును సాధిస్తూ వచ్చింది. 2017–18 సంవత్సరంలో ఏకంగా 7.86 శాతం వృద్ధి రేటును సాధించింది. బంగ్లా వస్త్ర వ్యాపారంలో ప్రపంచంలోనే ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. చైనా తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రెండో దేశంగా కూడా గుర్తింపు పొందింది. ఒకప్పుడు వెనకబడిన దేశంగా బంగ్లాదేశ్‌ను పేర్కొన్న ఐక్యరాజ్య సమితి ఇప్పుడు దాన్ని అభివృద్ధి చెందుతున్న వర్ధమాన దేశంగా వ్యవహరిస్తోంది. బంగ్లాదేశ్ తనకు అవసరమైన సరుకులను ఎక్కువగా దిగుమతులు చేసుకుంటున్న విదేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. దక్షిణాసియాలోనే భారత్‌కు బంగ్లా అతిపెద్ద వ్యాపార భాగస్వామి. ఇరు దేశాల మధ్య నాలుగు వేల కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ప్రజాస్వామ్యం అంతంత మాత్రమే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాలుగేళ్లకే దేశ వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్‌ను హత్య చేసి సైన్యం అధికారంలోకి వచ్చింది. చాలాకాలం పాటు సైనిక నియంత పాలనే కొనసాగింది. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ కూడా కృషి చేయలేదు. గత పార్లమెంట్ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (ఇస్లాం పార్టీ) బహిష్కరించడంతో పాలకపక్ష అవామీ లీగ్ పార్టీ ఎలాంటి పోటీ లేకుండా సగానికి పైగా పార్లమెంట్ సీట్లను గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికల్లో 38 శాతం పోలింగ్ నమోదయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించుకుంది. అయితే వాస్తవానికి 22 శాతం మాత్రమే పోలింగ్ జరిగినట్లు స్వతంత్ర వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా ఎవరి మధ్య పోటీ దేశానికి స్వాతంత్య్ర లభించినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో ప్రధానంగా రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటోంది. వాటిలో ప్రధానమైనది దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన అవామీ లీగ్. సెక్యులర్ పార్టీగా గుర్తింపు పొందిన ఈ పార్టీకే మైనారీటీలైన హిందువులు, మెజారిటీలయిన బౌద్ధులు ఓటు వేయడం సంప్రదాయంగా వస్తోంది. ఈ పార్టీకి గట్టి పోటీ ఇస్తూ వస్తున్నది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. ఇస్లాం సిద్ధాంతాన్ని నమ్ముకున్న ఈ పార్టీ గత ఎన్నికలను బహిష్కరించడం వల్ల వరుసగా పదేళ్లపాటు షేక్ హసీనా నాయకత్వాన ఆవామీ లీగ్ పార్టీయే అధికారంలో ఉంది. ఈ కారణంగా కూడా ప్రజల్లో ఆమె పట్ల వ్యతిరేకత పెరిగింది. ప్రజాస్వామ్య పద్ధతులను తుంగలో తొక్కి ఆమె అణచివేత రాజకీయాలకు పాల్పడుతోందన్న విమర్శలు కూడా ఎక్కువే ఉన్నాయి. మాదక ద్రవ్యాలు, అవినీతిపై యుద్ధం పేరిట ఆమె తన రాజకీయ ప్రత్యర్థులందరిని దాదాపుగా మట్టుబెట్టారు.ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చీఫ్ ఖలేదా జియాను అవినీతి ఆరోపణలపై జైలుకు పంపించారు. ఆ కారణంగా ప్రస్తుత ఎన్నికల్లో ఆమె పోటీ చేయడానికి వీల్లేకుండా పోయింది. తన ప్రభుత్వాన్ని విమర్శించినందుకు దేశంలో మంచి గుర్తింపున్న మీడియా ఫొటోగ్రాఫర్ షాహిదుల్ ఆలంను కూడా కటకటాల వెనక్కి నెట్టారు. భారత్ మద్దతు ఎవరికి ? బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఆది నుంచి అవామీ లీగ్‌కే భారత్ లోపాయికారిగా మద్దతిస్తుండగా 2014 ఎన్నికల నుంచి బహిరంగంగా మద్దతివ్వడం ప్రారంభించింది. ఈ కారణంగానే షేక్ హసీనాతో భారత మైత్రి బలపడుతూ వచ్చింది. ఫలితంగా 2015లో ఇరు దేశాల మధ్య రెండు ప్రధాన ఒప్పందాలు కుదిరాయి. ఒకటి భూ సరిహద్దుకు సంబంధించిన ఒప్పందం కాగా, మరోటి అక్కడి భూభాగం మీది నుంచి పనిచేస్తున్న ‘యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం’ లాంటి భారత ఈశాన్య రాష్ట్రాల మిలిటెంట్ సంస్థలను సమూలంగా నిర్మూలించడం. ఈ రెండో ఒప్పందం కారణంగానే రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్ సైనికులు ఇచ్చిన సమాచారం మేరకు భారత సైనికులు బంగ్లా సరిహద్దుల్లోకి చొచ్చుకుపోయి అస్సాం మిలిటెంట్ నాయకులను కాల్చి వేశారు. ఈసారి కూడా అవామీ లీగ్‌కే భారత ప్రభుత్వం మద్దతిస్తోంది. ఇంతకీ ఎవరిదీ గెలుపు? షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్‌ను గట్టిగా ఎదుర్కొనేందుకు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పారీ ఈసారి 20 చిన్నా, చితక పార్టీలను కలుపుకొని ‘జాతీయ ఐక్య సంఘటన’ పేరిట పోటీకి రంగంలోకి దిగింది. ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత కూడా తమకు కలసి వస్తోందని జాతీయ ఐక్య సంఘటన భావిస్తోంది. ఈసారి ఇరు పక్షాల మధ్య పోటీ బలంగా ఉంటుందని, ఏ పక్షమైనా గెలవచ్చని ముందస్తు ఎన్నికల సర్వేలు సూచిస్తున్నాయి. అయితే ఈసారి కూడా ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగే అవకాశం లేనందున అవామీ లీగ్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మీడియా భావిస్తోంది. ఎన్నికల కమిషన్, పోలీసులు ప్రభుత్వం చేతుల్లో కీలు బొమ్మలయ్యాయని ప్రతిపక్ష అభ్యర్థులను అన్యాయంగా అభియోగాలు మోపి అరెస్ట్ చేయిస్తున్నారని ప్రతిపక్షం నాయకులు ఆరోపిస్తున్నారు. కేసులు, అరెస్ట్‌కారణంగా 17 పార్లమెంట్ సీట్లలో ప్రతిపక్షానికి అభ్యర్థులు లేకుండా పోయారు. పోలింగ్ కేంద్రాల్లో ఫొటోలు గానీ వీడియోలుగానీ తీయరాదంటూ మీడియాపై ఆంక్షలు విధించినందున రిగ్గింగ్ జరిగే అవకాశం ఎక్కువ ఉందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. -
పోలీసు శాఖలో ఎన్నికల సందడి
గుంటూరు: రాజధాని జిల్లా గుంటూరు పోలీసుల శాఖలో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడనుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. అర్బన్, రూరల్ జిల్లాల పరిధిలో ఎన్నికల్లో పోటీ పడేందుకు కొందరు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం పదవుల్లో కొనసాగుతూ రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న నాయకులు ఇప్పటి నుంచే పావులు కదుపుతూ వచ్చే ఎన్నికల్లో అనుకూలమైన అభ్యర్థికి మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ఓ సంఘం నాయకుడి పట్ల కొందరు అసంతృప్తితో ఉన్నారు. ఈ ఎన్నిక్లలో కొత్త వ్యక్తిని ఎన్నుకోవాలని ఆలోచన చేస్తున్నారు. బరిలో ఏడుగురు.. రెండు జిల్లాల పరిధిలో మొత్తం ఏడుగురు అభ్యర్థులు పోటీలో పాల్గొననున్నట్లు పోలీసులు చర్చించుకుంటున్నారు. తమకు సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించి అండగా నిలిచే అభ్యర్థులకే తమ మద్దతు తెలుపుతామంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే పోలీస్ మార్క్‌లో అభ్యర్థుల ఎంపిక సదరు అభ్యర్థులకు మద్దతు తెలపాలంటూ చాపకింద నీరులా ప్రచారం చేస్తున్నారు. నూతన సంవత్సరంలో.. వచ్చే నెలలో నోటిఫికేషన్ వెలువడిన అనంతరం వారం రోజుల వ్యవధిలో ఎన్నిక ప్రక్రియను ముగిస్తారు. ప్రస్తుతం అర్బన్ జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా పోటీ పడేందుకు శైలేంద్ర కుమార్, మస్తాన్‌వలి, జానయ్యలు సిద్ధంగాగా ఉండగా, రూరల్ జిల్లా పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న చందు పూర్ణచంద్రరావు, బాల కోటేశ్వరరావు, చెన్నయ్య, హరి బరిలో పోటీపడతారని ప్రచారం జరుగుతుంది. వీరిలో ఉన్నతాధికారులకు, సిబ్బందికి మధ్య వారధిగా ఎవరుంటారనే అంశంపై సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఆయా సంఘాల నాయకులు చిన్నచిన్న పొరపాట్లు చేశారని, అలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా బాధ్యతగా పనిచేసేవారినే ఎన్నుకుంటామని పోలీసులు అంటున్నారు. సంఘం ఎన్నిక జరిగేదిలా.. పోలీస్ అధికారుల సంఘం ఎన్నికలో సీఐ నుంచి కానిస్టేబుల్ వరకు పాల్గొంటారు. జిల్లా పరిధిలోని సీఐలు అందరూ కలసి ఓ మెంబర్‌ను, సబ్ డివిజన్ పరిధిలో ఉండే ఎస్ఐ, ఏఎస్ఐలు 50 మంది ఉంటే ఓ మెంబరును, అంతకంటే ఎక్కువ మంది ఉంటే ఇద్దరిని ఎన్నుకోవచ్చు. మహిళా హెడ్ కానిస్టేబుళ్లు ప్రతి 40 మంది ఒక్క మెంబరు, ఒక్కో స్టేషన్ పరిధిలో ఉండేహెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు(పురుషులు) ప్రతి 40 మంది ఒక్క మెంబరు చొప్పున ఎన్నుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఆర్మడ్ రిజర్వ్ విభాగం అధికారులు, సిబ్బంది కూడా పాల్గొంటారు. ఎన్నికైన మెంబర్లు సంఘం అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లను కలుపుకొని మొత్తం 13 మంది సభ్యులను ఎన్ను కుంటారు. అనంతరం అధ్యక్షుడు, కార్యదర్శి కలిసి ఇద్దరు కో–ఆప్షన్ మెంబర్లును ఎన్నుకోవడంతో ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుంది. వీరంతా అనంతరం రాష్ట్ర స్థాయిలో జరిగే పోలీస్ అధికారుల సంఘం ఎన్నికలో నేరుగా పోటీ చేయడం, ఓటు వేసేందుకు అర్హులు. కలుపుకుపోయేతత్వం ఉండాలి.. ఎన్నికలో ఎంతమందైనా పోటీపడవచ్చు. అందరిని కలుపుకు పోతూ సమస్యలు పరిష్కరించగలిగే నాయకత్వం ఉండాలి. అలాంటప్పుడే ఉన్నతాధికారులు, తొటి సిబ్బంది గౌరవం దక్కుతుంది. సివిల్, ఏఆర్ రెండు కళ్లు లాంటివి. ఎవరినీ నొప్పించకుండా సమయస్ఫూర్తిగా నెగ్గుకురావాలి.–దళవాయి సుబ్రహ్మణ్యం,రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి -
ప్రధాని మోదీ ప్రచారం చేసినా...
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెల్సిందే. అయితే ఆయన ఎన్నికల ప్రచారం చేసిన ప్రాంతాల పరిధిలో 70 శాతం నియోజక వర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయిందని ‘ఇండియాస్పెండ్’ విశ్లేషణ స్పష్టం చేస్తోంది. 80 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని 30 చోట్ల మోదీ బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. వాటిల్లో 23 సీట్లను బీజేపీ గెలుచుకోగా, 57 సీట్లలో ఓడిపోయింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 54 నియోజకవర్గాల పరిధిలో 22 ఎన్నికల ర్యాలీలు (అంటే 70 శాతానికిపైగా) ప్రధాని మోదీ ర్యాలీలు నిర్వహించగా, 22 సీట్లను (41 శాతం) గెలుచుకోగలిగింది. ఇక చత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లోని 26 నియోజక వర్గాల పరిధిలో మోదీ ఎనిమిది ర్యాలీలు నిర్వహించగా, ఒకే ఒక్క సీటును బీజేపీ గెలుచుకుంది. మిజోరం మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్, యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి 58 ర్యాలీలు నిర్వహించగా, బీజేపీ 27 సీట్లను గెలుచుకుంది. 42 సీట్లను కోల్పోయిందని ఇండియాస్పెండ్ విశ్లేషించింది. ఈ విషయంలో మోదీ కన్నా యోగి పర్యటించిన ప్రాంతాల్లోనే బీజేపీ కాస్త ఎక్కువ విజయం సాధించింది. మోదీ పర్యటించిన ప్రాంతాల్లో బీజేపీ 28.75 స్థానాల్లో, యోగి పర్యటించిన ప్రాంతాల్లో బీజేపీ 39.3 శాతం విజయం సాధించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో యోగి 27 బహిరంగ సభలు నిర్వహించగా, 37 స్థానాలకుగాను 21 స్థానాల్లో బీజేపి విజయం సాధించింది. ఇక చత్తీస్‌గఢ్‌లో యోగి 23 ర్యాలీలు నిర్వహించగా, బీజేపీ కేవలం ఐదు సీట్లను గెలుచుకుంది. -
తండ్రిని వెనకేసుకొచ్చిన ఎంపీ కవిత
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘పెద్ద బఫూన్’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) చేసిన వ్యాఖ్యలను ఆయన కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సమర్థించారు. ఢిల్లీలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... వెర్రి పనులు చేసే వారిని బఫూన్‌గా వర్ణిస్తామని, పార్లమెంట్లో రాహుల్ గాంధీ చేసిన తింగరి చేష్టలను దేశమంతా చూసిందన్నారు. ‘సభా సంప్రదాయాలను ఉల్లఘించి లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అమాంతంగా వాటేసుకోవడం జాతి యావత్తు వీక్షించింది. రాహుల్ చర్యను ప్రతి ఒక్కరు వెర్రి పనిగా భావించారు. అందుకే మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూడా స్పందిచార’ని కవిత వివరించారు. ప్రాంతీయ పార్టీలదే హవా తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలపై స్పందిస్తూ.. తెలంగాణలో కాంగ్రెస్ దారుణంగా వైఫల్యం చెందిందని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం రాలేదని, బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందని తెలిపారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను టీ20 మ్యాచ్‌లా ప్రజలు ఉత్కంఠతో వీక్షించారని చెప్పుకొచ్చారు. రాజస్తాన్‌లో పాత సంప్రదాయం కొనసాగడం వల్లే కాంగ్రెస్‌కు అధికారం దక్కిందని విశ్లేషించారు. రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల హవా ఉంటుందని అభిలషించారు. ‘ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలు ఉండివుంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవని గట్టిగా చెప్పగలను. రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో జాతీయ పార్టీలు విఫలమయ్యాయి. ఈ విషయంలో ప్రాంతీయ పార్టీలు మెరుగ్గా ఉన్నాయ’ని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ తథ్యం కాంగ్రెస్, బీజేపీ లేకుండా ఫెడరల్ ఫ్రంట్ సాకారమవుతుందని, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజల అవసరాలను గుర్తించేలా ఫెడరల్ ఫ్రంట్ ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని డీఎంకే నేత స్టాలిన్ భావి ప్రధానిగా వర్ణించడంపై స్పందిస్తూ.. కాంగ్రెస్ అనుకూల కూటమిలో లుకలుకలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాహుల్‌ను ఒక పార్టీ సమర్థిస్తే, అదే కూటమిలోని రెండు ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకించాయన్నారు. ‘మేము ఏర్పాటు చేయాలనుకుంటున్న మూడో ప్రత్యామ్నాయం ఒకరిని ప్రధాని చేయడానికో, ఒక పార్టీని అధికారంలోకి తేవడానికో కాదు. కొన్ని దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కొనుగొనాలన్న ఉద్దేశంతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. తెలంగాణలో మా పార్టీ ఇప్పటికే చేసి చూపించింది. తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలుల్లోకి తేవాలనుకుంటున్నామ’ని ఎంపీ కవిత వెల్లడించారు. -
ఎన్నికల్లో తగ్గుతున్న మహిళా విజేతలు
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 678 సీట్లకుగాను కేవలం 62 సీట్లలో మాత్రమే మహిళలు విజయం సాధించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో 9.30 కోట్ల మంది మహిళలు ఉండగా, వారిలో కేవలం 9 శాతం మంది మాత్రమే మహిళలు చట్టసభలకు ఎన్నికయ్యారు. 2013–2014 సంవత్సరంలో ఈ రాష్ట్రాల్లో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 77 ఉండగా, అంటే 11 శాతం ఉండేదని భారత ఎన్నికల కమిషన్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారమ్స్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే వెల్లడించింది. ఈసారి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో క్రితంసారి కన్నా ఎక్కువ మందే పోటీ చేసినప్పటికీ తక్కువ మంది గెలవడం గమనార్హం. ఒక్క చత్తీస్‌గఢ్‌లో మాత్రమే గతం కన్నా ఈసారి ఎక్కువ మంది విజయం సాధించారు. మిజోరంలో పది లక్షలకుపైగా కలిగిన జనాభాలో 49 శాతం మంది మహిళలు ఉన్నప్పటికీ అసెంబ్లీలో వారి ప్రాతినిధ్యం శూన్యం. ప్రజాస్వామ్యంలో మహిళల ప్రాతినిధ్యం అంటే ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటు వేయడం కాదని, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, ఓ ఎంపీగా గెలవడమని అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రితికా కుమార్ వ్యాఖ్యానించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు చురుగ్గా పాల్గొని ఎన్నికవడమే కాకుండా మళ్లీ పోటీచేసి కూడా విజయం సాధిస్తున్నారని ఆన్నారు. వరుసగా గత మూడు ఎన్నికల నుంచి ఈ ఐదు రాష్ట్రాల్లో మహిళలు ఎక్కువ మందే పోటీ చేస్తున్నప్పటికీ వారు ఎక్కువగా గెలవలేక పోతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 2,716 మంది అభ్యర్థులకుగాను 235 మంది మహిళలు పోటీ చేశారు. 2013 ఎన్నికల్లో 108 మంది, 2008 ఎన్నికల్లో 226 మంది మహిళలు పోటీ చేశారు. ఫలితాల్లో మాత్రం వెనకబడుతున్నారు. 2008లో 25 మంది, 2013లో 30 మంది విజయం సాధించగా, ఈసారి 22 మంది మహిళలు మాత్రమే విజయం సాధించారు. ఇక రాజస్థాన్‌లో 2008లో 154 మంది, 2013లో 152 మంది పోటీ చేయగా ఈసారి ఏకంగా 182 మంది పోటీ చేశారు. 2013 ఎన్నికల్లో 25 మంది విజయం సాధించగా, ఈసారి 22 మంది మాత్రమే విజయం సాధించారు. పోటీ చేస్తున్న వారి సంఖ్యలో గెలుస్తున్న వారి సంఖ్యను తీసుకుంటే మగవారికన్నా మహిళలే ఎక్కువ విజయం సాధిస్తున్నారు. రాజస్థాన్‌లో మొత్తం పోటీ చేసిన వారి సంఖ్యలో మహిళల శాతం ఎనిమిది ఉండగా, విజయం సాధించిన వారిలో వారి శాతం 11.5 శాతం ఉండడమే అందుకు ఉదాహరణ. నేషనల్ ఎలక్షన్ వాచ్ అధ్యయనం ప్రకారం జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఈసారి 12 శాతం సీట్లను మహిళలకు ఇచ్చారు. అన్ని పార్టీలకన్నా అతి తక్కువగా తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీ 3 శాతం సీట్లనే మహిళలకు ఇచ్చింది. ఇక ఓ మహిళ అధ్యక్షులుగా ఉన్న బహుజన సమాజ్ పార్టీ 9 శాతం టిక్కెట్లను మహిళలకు ఇచ్చింది. వివిధ పార్టీల తరఫున పోటీ చేసిన మహిళల్లో కాంగ్రెస్ పార్టీ నుంచే ఎక్కువ మంది విజయం సాధించారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు చర్చకు వస్తున్న సందర్భంగా ఇలాంటి వివరాలు అవసరమని రితికా కుమార్ అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్ల బిల్లును ఈ సమావేశాల్లోనే ఆమోదించేందుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతివ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. -
బీసీ కోటా 24 శాతం లోపే!
సాక్షి. హైదరాబాద్: త్వరలో జరగనున్న పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 23–24 శాతానికి మధ్య పరిమితం కానున్నా యి. ఎట్టి పరిస్థితిలో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఈ ఎన్నికల్లో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం. సుప్రీం కోర్టు తీర్పు మేరకు 50 శాతానికి మించకుండా రిజర్వేషన్లు అమలు చేసేందుకు రాష్ట్ర న్యాయ శాఖ శనివారం రాత్రి అత్యవసర ఉత్తర్వులు (ఆర్డినెన్స్) జారీ చేసిం ది. కొత్తగా అమల్లోకి వచ్చిన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని, బీసీలకు 34 శాతానికి తగ్గకుండా రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం పొందుపరిచింది. ఎన్నికల్లో 2011 జనా భా లెక్కల ఆధారంగా పంచాయతీ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉండగా, ఎస్సీలకు 20.46 శాతం, ఎస్టీలకు 5.73 శాతం రిజర్వేషన్లను కేటాయించాల్సి ఉంది. దీనికి తోడు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం బీసీలకు 34 శాతం కోటా అమలు చేస్తే మొత్తం రిజర్వేషన్లు 60.19 శాతానికి పెరిగిపోనున్నాయి. పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనల ప్రకారం.. ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కోటా అమలు చేసేందుకు సుప్రీం కోర్టు తీర్పు అడ్డంకిగా మారింది. జనవరి 10లోగా పంచాయతీ ఎన్నికలను నిర్వహిం చాలని హైకోర్టు విధించిన గడువు ముంచుకొస్తోంది. దీంతో ప్రభుత్వం ఈ ఎన్నికల్లో రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేయడం ద్వారా రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు జరిపింది. సర్పంచ్ పదవుల కోసం జనాభా దామాషా ప్రకారం ప్రాధాన్యత క్రమంలో ఎస్టీ, ఎస్సీలకు వరుసగా 5.73 శాతం, 20.46 శాతం రిజర్వేషన్లను కేటాయించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో బీసీలకు 23.81 శాతం కోటా మాత్రమే లభించే అవకాశముంది. గత జూన్ 12న పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 12,751 సర్పంచ్ స్థానాలుం డగా, షెడ్యూల్ ప్రాంతంలోని 1,308 పంచాయతీల తో పాటు 100 శాతం ఎస్టీల జనాభా కలిగిన 1,326 పంచాయతీలు ఎస్టీలకు రిజర్వు అవనున్నాయి. దీనికి తోడు 5.73 శాతం ఎస్టీ కోటా కింద రానున్న 580 స్థానాలకు కలిపి ఎస్టీలకు మొత్తం 3,214 సర్పంచ్ పదవులు రిజర్వు అవుతాయి. ఎస్సీలకు 20.46 శాతం కోటా కింద 2,070 స్థానాలు రిజర్వు కానున్నాయి. 34 శాతం కోటా కింద అప్పట్లో బీసీలకు 3,440 స్థానాలకు కేటాయించారు. తాజాగా ఆర్డినెన్స్ మేరకు బీసీ కోటాను 24 శాతానికి లోపు తగ్గించనుండటంతో ప్రాథమిక అంచనాల ప్రకారం బీసీలకు కేటాయించే సర్పంచ్ స్థానాల సంఖ్య 2,784 కు తగ్గే అవకాశముంది. రిజర్వేషన్ల కేటాయింపుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే ఈ అంశంపై స్పష్టత రానుంది. చివరిసారిగా 2013–14లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమ లు చేయగా, ఒక్కసారి 10 శాతానికి పైగా రిజర్వేషన్లు తగ్గిపోనుండటంతో బీసీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసినట్లు శనివారం వార్తలు వచ్చాయి. అయితే సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ కోటా 24 శాతం లోపే పరిమితం కానుంది. -
బీజేపీ పాలనలో 51 శాతం జనాభా!
మూడు హిందీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో ఇప్పుడు (2018 డిసెంబర్) దేశంలో కాషాయపక్షం పాలనలోని జనాభా సంఖ్య 63 కోట్ల 40 లక్షలకు (51 శాతం) పడిపోయింది. 2017లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దేశ జనసంఖ్యలో 71 శాతం (దాదా పు 88 కోట్ల 80 లక్షలు) ఉన్నట్టు అంచనా. తాజా ఎన్నికల ఫలితాలతో బీజేపీ పాలనలోని జనాభా సంఖ్య 25 కోట్ల 40 లక్షలు తగ్గిపోయింది. ప్రస్తుతం బీజేపీ ప్రత్యక్ష పాలనలో లేదా భాగస్వామిగా ఉన్న సంకీర్ణాల పాలనలో 16 రాష్ట్రాలున్నాయి. 2014 మే 24న కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఏడు రాష్ట్రాలు ఈ పార్టీ పాలనలో ఉనాయి. ఇప్పుడు వీటి సంఖ్య 16 రాష్ట్రాలకు (సంకీర్ణాలతో కలిపి) పెరిగింది. ఈ రాష్ట్రాలు: అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బిహార్, గోవా, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయా, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్. తాజా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒకానొక దశలో బీజేపీ రాష్ట్రాల సంఖ్య 21 వరకూ ఉండేవి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3 చోట్ల విజయం సాధించిన కాంగ్రెస్ లేదా సంకీర్ణ భాగస్వామిగా ఉన్న రాష్ట్రాల సంఖ్య ఐదుకు (కర్ణాటక, పంజాబ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్) పెరిగింది. 2017లో కాంగ్రెస్ పాలనలోని రెండు రాష్ట్రాల్లో 7% జనాభా ఉండగా, ఇప్పుడు రాష్ట్రాల సంఖ్యతోపాటు పాలనలోని జనాభా 21 శాతానికి పెరిగింది. మిజోరంలో కాంగ్రెస్ అధికారం కోల్పో యిన విషయం తెలిసిందే. ఇతర పార్టీల పాలనలోని రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కేరళ, మిజోరం, తమిళనాడు, పశ్చిమబెంగాల్. జమ్మూకశ్మీర్ ప్రస్తుతం గవర్నర్ పాలనలో ఉంది. ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 678 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ 305 సీట్లు, బీజేపీ 199 సీట్లు గెలుచుకున్నాయి. దేశ జనాభాలో ఆరో వంతు లేదా 15% ఈ రాష్ట్రాల్లో ఉంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఆ మూడు రాష్ట్రాలు.. మళ్లీ బాంబ్ పేల్చిన చంద్రబాబు!
-
ఆ మూడు రాష్ట్రాలు.. మళ్లీ బాంబ్ పేల్చిన చంద్రబాబు!
సాక్షి, విశాఖపట్నం: తన ప్రచారంతో, అడ్డగోలు వ్యాఖ్యలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నిండా ముంచేసిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. తాజాగా విచిత్ర వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలువడానికి టీడీపీనే కారణమంటూ ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ కృషి వల్లనే ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని ఆయన చెప్పుకొచ్చారు. నిజానికి ఆ మూడు రాష్ట్రాల్లో చంద్రబాబు కనీసం ప్రచారం కూడా చేయలేదు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని.. ఆయన విస్తృతంగా ప్రచారం చేసిన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. మహాకూటమి పేరిట కాంగ్రెస్ పార్టీతో జతకలిసిన చంద్రబాబు.. తెలంగాణ ఎన్నికల ప్రచారంలోనూ ఇదేవిధంగా ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఆధునిక తెలంగాణ నిర్మాతను తానేనని, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఔటర్ రింగ్‌రోడ్డు తానే కట్టానని ఆయన ఎన్నో గొప్పలు పోయారు. అసలే తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన చంద్రబాబు.. ఇలా ఇష్టారీతిగా మాట్లాడటంతో తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడమే కాదు.. పొత్తుతో వచ్చిన చంద్రబాబును రెండు సీట్లకు మాత్రమే పరిమితం చేసి.. గుణపాఠం నేర్పారు. అయినా, చంద్రబాబు తీరు మారనట్టు కనిపిస్తోంది. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయాలను ఆయన తన ఖాతాలో వేసుకోవడంతో హస్తం శ్రేణులు సైతం విస్తుపోతున్నాయి. -
ఏం చేద్దాం: ఓటమిపై బీజేపీ అంతర్మథనం
సాక్షి, న్యూఢిల్లీ: తాజాగా ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగలడంతో.. ఆ పార్టీ అధినాయకత్వంలో అంతర్మథనం మొదలైంది. తాజా పరాభవాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్రాల పధాధికారుల సమావేశం ఢిల్లీలో గురువారం ప్రారంభమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, లక్ష్మణ్‌తోపాటు మురళీధర్‌రావు, ఇతర రాష్ట్రాల సీనియర్ నాయకులు పాల్గొన్నారు. తాజాగా నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణాలు విశ్లేషించడం, పార్టీ నాయకత్వంలో, శ్రేణుల్లో మళ్లీ నైతిక ఉత్తేజాన్ని నింపి రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం సిద్ధం చేయడం లక్ష్యంగా అమిత్ షా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి: స్పందించిన యోగి!
పట్నా: తాజాగా వెలువడిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. అత్యంత కీలకమైన హిందీ మాట్లాడే రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీని ఓడించి.. కాంగ్రెస్ పార్టీ అధికార పీఠాన్ని సొంతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ విజయాలపై తాజాగా బీజేపీ స్టార్ క్యాంపెయినర్, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో గెలించిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ అబద్ధాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని, దీంతో బీజేపీ భవిష్యత్తు ఎన్నికల్లో లాభపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ సహా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో యోగి విస్తృతంగా పర్యటించి.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయినా, ఆయన ప్రచారం పార్టీకి పెద్దగా లాభించలేదు. ఈ నేపథ్యంలో బుధవారం నేపాల్‌కు వెళ్లి.. జానకీ ఆలయంలో ‘వివాహ పంచమి’ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. తిరుగుప్రమాణంలో పట్నాలో ఆగారు. ఈ సందర్భంగా బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్ సమరంగా భావిస్తున్న 4 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆయన తేలిక చేసి మాట్లాడారు. -
కొంపముంచిన ‘హిందూత్వ ఎజెండా’
సాక్షి, న్యూఢిల్లీ : సాధారణంగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రానున్న లోక్‌సభ ఎన్నికలకు ఘంటారావంగా భావిస్తారు. ఈ మూడు రాష్ట్రాలను కలుపుకొని మొత్తం 65 లోక్‌సభ సీట్లు ఉండగా, గత లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏకంగా 62 సీట్లను సాధించింది. ప్రస్తుతం ఈ మూడు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిలో లేదు. అయినప్పటికీ రానున్న లోక్‌సభ ఎన్నికలకు ఘంటారావంగాగానీ, రాజకీయ పండితులు వర్ణించినట్లు సెమీ ఫైనల్స్‌గాగానీ పరిగణించలేం. కాకపోతే ఓ హెచ్చరికగా చూడవచ్చు. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సొంతంగా ప్రభుత్వాలను ఏర్పాటుచేసేంతగా మెజారిటీలు వచ్చి ఉన్నట్లయితే సెమీ ఫైనల్‌గా చూసే అవకాశం ఉండేది. కానీ ఒక్క చత్తీస్‌గఢ్‌లో తప్పించి, మిగతా రెండు రాష్ట్రాల్లో మిత్రపక్షాల సహాయంతో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తోంది. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో వరుసగా మూడు పర్యాయాలు బీజేపీ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. కనుక ప్రభుత్వం వ్యతిరేకత ఉండడం సహజం. అయినప్పటికీ మధ్యప్రదేశ్‌లో అది ప్రతిఫలించలేదంటే ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్‌కున్న మంచిపేరు కావచ్చు. ఇక తెలంగాణలో గత ఎన్నికల్లో ఐదు సీట్లు గెలుపొంది.. ప్రస్తుతం వందకుపైగా సీట్లకు పోటీ చేసిన బీజేపీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. మిజోరంలో రెండు సీట్లను ఆశించి రంగంలోకి దిగి ఒక్క సీటును మాత్రమే దక్కించుకోగలిగింది. ప్రధానంగా ఎన్నికలు జరిగిన ఈ మూడు రాష్ట్రాలు హిందీ బెల్టులో ఉండడం, ప్రచారం చేసుకునే స్థాయిలో చేపట్టిన అభివద్ధి కార్యక్రమాలు కూడా పెద్దగా లేకపోవడంతో అక్కడ ప్రభుత్వాలను నిలబెట్టుకునేందుకు.. తెలంగాణలో విస్తరించేందుకు బీజేపీ హిందూత్వ ఎజెండాను ఎత్తుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత అంతటి ప్రచారకుడిగా భావించి.. బీజేపీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కూడా రంగంలోకి దింపింది. మిజోరం మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో విస్తతంగా పర్యటించిన ఆయన ‘రామ్, రామ్ మందిర్, రామ్ రాజ్యం’ గురించే ఎక్కువ మాట్లాడారు. తెలంగాణ దండకారణ్యంలో రాముడు పర్యటించారని చెప్పినా ఆయన మిగతా మూడు రాష్ట్రాలకు కూడా రాముడితో ఏదో ఒక లింకు పెట్టారు. తెలంగాణలో బీజేపీకి అధికారమిస్తే రాజధాని హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తానని చెప్పారు. రాష్ట్ర వనరులన్నీ ముస్లింలకే దోచిపెడుతున్నారంటూ ప్రజల మధ్య విధ్వేషాలను సృష్టించేందుకు ప్రయత్నించారు. ‘రాముడు గీముడు జాన్తా నహీ’ అంటూ తెలంగాణ సెంటిమెంట్ ముందు ఆయన ప్రచారం నిలబడలేకపోయింది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ ‘అభివృద్ధి’ నినాదం ద్వారానే విజయం సాధించిన విషయాన్ని పార్టీ పక్కన పెట్టి కేవలం హిందూత్వ ఎజెండానే ఎత్తుకోవడం వల్ల బాగా నష్టం జరిగిందని బీజేపీ పార్లమెంట్ సభ్యుడు సంజయ్ కాక్డే అభిప్రాయపడడం గమనార్హం. 2020 సంవత్సరం నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పిన మోదీ దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేసినా పట్టించుకోకపోవడం, ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తానంటూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని గాలికొదిలేసిన నేపథ్యంలో అభివృద్ధి ఎజెండాను ప్రచార అస్త్రంగా బీజేపీ చేసుకోలేకపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల నాటికైనా హిందూత్వ ఎజెండాను పక్కనపెట్టకపోతే మంగళవారం నాటి ఫలితాలు పునరావృతం కాక తప్పవని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. -
మధ్యప్రదేశ్‌లో హంగ్?
భోపాల్: మంగళవారం ఉదయం నుంచి ఎంతో ఉత్కంఠ రేపిన మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలు చివరకు ఏ పార్టీకీ విజయాన్ని అందించకుండా నిరాశపరిచాయి. కాంగ్రెస్, బీజేపీల మధ్య విజయం దోబూచులాడింది. పూర్తి ఫలితాలు ఇంకా వెల్లడి కానప్పటికీ మధ్యప్రదేశ్‌లో హంగ్ అసెంబ్లీ ఏర్పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగానే బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. 230 సీట్లున్న శాసనభలో సాధారణ ఆధిక్యానికి 116 సీట్లు అవసరం కాగా, బీజేపీ, కాంగ్రెస్‌ల్లో ఏ పార్టీ ఆ మార్కును చేరుకోలేక పోతున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో అతి తక్కవ సీట్లే ఉన్నా పలు చిన్నా చితకా పార్టీలు, స్వతంత్రులకు అత్యంత ప్రాధాన్యమేర్పడింది. వీరి మద్దతు ఎవరికి లభిస్తే ఆ పార్టీ అధికారం చేపట్టనుంది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ కాంగ్రెస్ నేతలు మధ్యప్రదేశ్ గవర్నర్‌ను ఆనందీబెన్ పటేల్‌ను మంగళవారం రాత్రి పొద్దుపోయాక కోరారు. మంగళవారం అర్ధరాత్రి 12.15 గంటల సమాయానికి 172 స్థానాల ఫలితాలు వెలువడగా బీజేపీ 83, కాంగ్రెస్ 85, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఒక సీటు గెలిచింది. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించారు. మరో 58 స్థానాల్లో లెక్కింపు కొనసాగుతుండగా 26 సీట్లలో బీజేపీ, 28 స్థానాల్లో కాంగ్రెస్, రెండు చోట్ల బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ), మరోచోట ఎస్పీ అభ్యర్థి, ఇంకో చోట స్వతంత్ర అభ్యర్థి ముందంజలో ఉన్నారు. మొత్తంగా గెలిచిన, ముందంజలో ఉన్న స్థానాలతో కలిపి బీజేపీకి 109, కాంగ్రెస్‌కు 113 సీట్లు ఉన్నాయి. ప్రయత్నాలు ప్రారంభించిన కాంగ్రెస్ సాధారణ ఆధిక్యం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించడం ఖాయం కావడంతో ఆ పార్టీ నేతలు ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బీఎస్పీ, ఎస్పీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులతోనూ కాంగ్రెస్ నేతలు చర్చలు ప్రారంభించారు. ఎంపీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్, కాంగ్రెస్ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియాలు గెలిచిన అభ్యర్థులతో చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే గతంలో కాంగ్రెస్‌తో పొత్తు అంశాన్ని మాయావతి కొట్టిపారేశారు. తాజాగా బీఎస్పీ నేత ఒకరు మాట్లాడుతూ ‘మాతో పొత్తు లేకుండా ఏ పార్టీ అధికారంలోకి రాలేదు. ఏ పార్టీకి మద్దతివ్వాలో మాయావతి నిర్ణయిస్తారు’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రాథమిక ఫలితాలను బట్టి రాష్ట్రంలో ప్రధాన పార్టీలయిన కాంగ్రెస్, బీజేపీలలో దేనికీ మెజారిటీ రాదని తేలడంతో ‘ఇతరుల’కు ప్రాధాన్యం పెరిగింది. బీఎస్పీ, ఎస్పీ, స్వతంత్రులకు కలిపి మొత్తంగా 7 స్థానాలు దక్కే అవకాశాలున్నాయి. హంగ్ వస్తే ప్రధాన పార్టీలు వీరి మద్దతుపై ఆధారపడక తప్పదు. సీఎల్పీ భేటీ బుధవారం జరగనుండగా, కాంగ్రెస్ కేంద్ర పరిశీలకుడిగా ఏకే ఆంటోనీ మంగళవారమే భోపాల్ చేరుకున్నారు. గవర్నర్‌కు లేఖ రాసిన కాంగ్రెస్ మధ్యప్రదేశ్‌లో అతిపెద్ద పార్టీగా నిలవడం దాదాపు ఖాయం కావడంతో తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ను ఆ పార్టీ నేతలు ఇప్పటికే కోరారు. ఈ మేరకు ఎంపీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ గవర్నర్‌కు లేఖ రాశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. వ్యతిరేకత ఉన్నా గట్టి పోటీ మధ్యప్రదేశ్‌లో బీజేపీకి చెప్పుకోదగ్గ ఫలితాలు భోపాల్: మధ్యప్రదేశ్‌లో పదమూడేళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత బలంగానే ఉన్నా కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇస్తోంది. మేజిక్ ఫిగర్ 116కు కేవలం కొన్ని సీట్ల దూరంలోనే బీజేపీ ఆగిపోయేలా కనిపిస్తోంది. మరోవైపు 13 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఈ సారి కూడా సాధారణ ఆధిక్యం కూడా సాధించలేక పోతోందంటే అది ఆ పార్టీ వైఫల్యంగానే చెప్పుకోవాలి. మౌలిక సదుపాయాలైన కరెంటు, నీరు, రహదారుల విషయంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలూ లేకపోవడం బీజేపీకి లాభించింది. సంస్థాగతంగా చౌహాన్‌కు మంచి పట్టు ఉండటంతో ఎన్నికల్లో బీజేపీ, ఆరెస్సెస్‌లు కలిసి పని చేసి క్షేత్రస్థాయి వరకు వెళ్లగలిగాయి. భూమి పుత్రుడిగా(కిసాన్ కీ బేటా)పే రొందిన చౌహాన్ తన హయాంలో ఇంటా బయటా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. మురికివాడల్లోని ప్రజలు, ఆర్థికంగా బలహీన వర్గాల వారికోసం చౌహాన్ ఆవాస్ యోజన వంటి పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు పరచడంతో ఆ వర్గాల మద్దతు గణనీయంగా పొందగలిగారు. ఒకప్పుడు రోగిష్టి రాష్ట్రాలుగా ముద్రపడ్డ బీమారు (బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్) నుంచి మధ్యప్రదేశ్‌ను బయటకు తీసుకొచ్చి చౌహాన్ అభివృద్ధివైపు నడిపించారనే భావన అక్కడి ప్రజల్లో ఉంది. -
ఐదు రాష్ట్రాల ఫలితాలు: బీజేపీకి బిగ్ షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : 2014 లోక్‌సభ ఎన్నికల నాటి నుంచి భారతీయ జనతా పార్టీకి తగిలిన అతిపెద్ద షాక్ నేటి ఫలితాలు. ముఖ్యంగా హిందీ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌లో నువ్వా, నేనా అన్నట్లు బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వడం, రాజస్థాన్‌లో వసుంధర రాజె నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టడం, రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి చత్తీస్‌గఢ్‌లో పాగా వేసిన బీజేపీని కాంగ్రెస్ పార్టీ గద్దె దించడం అసాధారణమే. తెలంగాణలో ఐదు స్థానాలు కలిగిన బీజేపీ, అత్యధిక స్థానాలకు పోటీ చేసి కనీసం 20 సీట్లనైనా గెలుచుకుందామని ఆశించి బొక్కా బోర్లా పడింది. ఇక మిజోరంలో కాంగ్రెస్, మిజో నేషనల్ ఫ్రంట్ మధ్యనే అధికార మార్పిడి జరగడం సర్వ సాధారణమే. ప్రీపోల్ సర్వేలు, పోస్ట్ పోల్ సర్వేలన్నీ కూడా కొంత గతి తప్పాయి. జాతీయ సర్వేలన్నీ రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని సూచించాయి. వాటి అంచనాలను తలకిందులు చేస్తూ చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం విశేషం. తెలంగాణలో పాలకపక్షం టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఎక్కువ సర్వేలు చెప్పినా అఖండ విజయం సాధింస్తుందని ‘ఇండియా టుడే’ సర్వేనే అంచనా వేయగలిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోకపోవడం కాంగ్రెస్ అధిష్టానంకు కొంత నిరుత్సాహం కలిగించే అంశమే. రాజస్థాన్‌లో కాంగ్రెస్ విజయం రాజస్థాన్‌లో మొత్తం 200 సీట్లకుగాను 199 సీట్లకు ఎన్నికలు జరిగాయి. 2013 ఎన్నికల్లో బీజేపీకి 163 సీట్లు రాగా, కాంగ్రెస్‌కు కేవలం 21 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు కావాల్సినదానికన్నా ఎక్కువ సీట్లు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. 1993 నుంచి ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడల్లా అధికార మార్పిడి జరుగుతూ వస్తోంది. ఓసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మరోసారి బీజేపీ ప్రభుత్వం వస్తోంది. ఈసారి వసుంధర ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తోంది. వసుంధర రాజె స్వతహాగా అహంభావి కావడం, ప్రజలతో మమేకమయ్యే మనస్తత్వం లేకపోవడం ఓటర్లకు ఆమెను దూరం చేస్తూ వచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి గజేంద్ర షెకావత్‌ను తొలగించడం, 2017లో వ్యతిరేకించినప్పటికీ వివాదాస్పద ‘పద్మావత్’ సినిమాను విడుదల చేయడం రాజ్‌పుత్‌లకు ప్రభుత్వం మీద కోపం తెప్పించింది. ఏప్రిల్–మే నెలల్లో వ్యవసాయ సంక్షోభం కారణంగా ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం, నిరుద్యోగ సమస్య ఓటమికి కారణమయ్యాయి. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య 55 శాతం ఉండగా, 2013 నుంచి వసుంధర రాజె ప్రభుత్వం ఏటా 15 లక్షలకు మించి ఉద్యోగాలను కల్పించలేక పోయింది. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు కూడా పుట్టి ముంచాయి. మెవ«ద్ ప్రాంతంలో 28 అసెంబ్లీ సీట్లు ఉండగా, అక్కడి ప్రజలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం 1998 సంవత్సరం నుంచి అలవాటు. వారు గతంలో బీజేపీకి ఓటు వేయగా, ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. మధ్యప్రదేశ్‌లోనూ కాంగ్రెస్సే మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 230 సీట్లు ఉండగా, 2013 ఎన్నికల్లో బీజేపీకి 44.88 శాతం ఓట్లతో 165 సీట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి 36.38 శాతంతో 58 సీట్లు వచ్చాయి. స్వయంగా వంద సీట్లను దాటిన కాంగ్రెస్ పార్టీ మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ మద్దతుతో సుస్తిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో ఉంది. 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పదవిలో శివరాజ్ సింగ్ చౌహాన్ కొనసాగినప్పటికీ ఆయన పట్ల ప్రజా వ్యతిరేకత లేదు. తమ పంటలకు తగిన గిట్టుబాటు ధరలు కల్పించడం లేదని, రుణాలు మాఫీ చేయడం లేదని ప్రభుత్వం పట్ల రైతుల్లో వ్యతిరేకత ఉంది. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా 2017లో మంద్సార్లో రైతులు నర్విహించిన ర్యాలీపై పోలీసులు కాల్పులు జరపడంతో ఆరుగురు రైతులు మరణించారు. అప్పటి నుంచి ప్రభుత్వం పట్ల రైతుల ఆగ్రహం మరింత పెరిగింది. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. బీజేపీ ప్రభుత్వం గత 14 ఏళ్లలో ఏటా 17,600 ఉద్యోగాలను మాత్రమే కల్పించకలిగింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ పరిమితి వయస్సు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచడం కూడా నిరుద్యోగులకు కోపం తెప్పించింది. జ్యోతిరాధిత్య సింధియా, కమల్ నాథ్లో ఎవరు ప్రభుత్వ సారథులో నిర్ణయించక పోవడం కూడా కాంగ్రెసకు కలిసి వచ్చింది. చత్తీస్‌గఢ్‌లోనూ.. మొత్తం సీట్లు 90. బీజేపీ పాలనలో 15 సంవత్సరాల నుంచి రమణ్ సింగ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నా ఆయన పట్ల ప్రజల్లో అంతగా వ్యతిరేకత లేదు. కాకపోతే నిరుద్యోగం, దారిద్య్రం, నక్సలిజం సమస్యలు ఈ ప్రాంతాన్ని పీడిస్తున్నాయి. ఎనిమిది జిల్లాల పరిధిలోని 18 అసెంబ్లీల పరిధిలో నక్సల్స్ సమస్య తీవ్రంగా ఉంది. రాష్ట్రంలోని 40 శాతం ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువున నివసిస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం కూడా తీవ్రంగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రుణాలు మాఫీ చేస్తామని, వరికి కనీస మద్దతు ధరను 2,500 రూపాయలు చేస్తామని, పేద కుటుంబానికి నెలకు 35 కిలోల బియ్యాన్ని ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలు ప్రజలకు ఎంతో ఆకర్షించాయి. ఫలితంగా అక్కడి రైతులు తమ చేతికి వచ్చిన వరి పంటలను ఇంకా కోయలేదు. ఇక మిజోరం ఫలితాలు మామూలే. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తోంది. -
యోగి ‘రాముడి’కథ ఎవరికి నచ్చలేదు
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మిజోరం మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ విస్తృతంగా ప్రచారం సాగించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆయన ఏకంగా 74 ఎన్నికల సభల్లో ప్రసంగించారు. ప్రతి చోటు ఆయన రాముడిని ప్రస్థావించి ఓ చోటుకు రాముడికి ఉన్న సంబంధాన్ని అనుబంధాన్ని వివరించడంతోపాటు బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి రాష్ట్రంలో ప్రజలందరిని సమానంగా చూసే రామరాజ్యం తీసుకొస్తామని ఆయన చెప్పారు. టెర్రరిస్టులకు మాత్రం బిర్యానీ తినిపించమని, బుల్లెట్లు తినిపిస్తామని చెప్పారు. ఆదిత్యనాథ్ చత్తీస్‌గఢ్ వెళ్లినప్పుడు అది రాముడి తల్లిగారి ఊరని చెప్పారు. తెలంగాణ వచ్చినప్పుడు రాముడు వనవాసం సమయంలో దండకారణ్యంలో తిరిగాడని చెప్పారు. మధ్యప్రదేశ్ వెళ్లినప్పుడు రాముడిని సవాల్ చేసిన పరుశరాముడి ప్రాంతమని తెలిపారు. రాజస్థాన్ వెళ్లినప్పుడు అది రాముడి కుడిభుజమైన బజరంగ్ బాలి ప్రాంతమని ఆలిని ఓడించడానికి ఆయన ఒక్కడు చాలని వ్యాఖ్యానించారు. ముస్లింల పక్షపాతంటూ కాంగ్రెస్‌ను ఆయన ఆలితో పోల్చారు. రాజస్థాన్‌లోని నాగౌర్‌లో యోగి మాట్లాడుతూ 2006లో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చేసిన ప్రసంగాన్ని వక్రీకరించి దేశ వనరులు మొట్టమొదట చెందాల్సిందీ ముస్లింలకని మన్మోహన్ చెప్పారని, మరప్పుడు హిందువులు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ విభజించు పాలించి రాజకీయాలకు పాల్పడుతున్నారని, అందుకే దేశంలో టెర్రరిస్టులు తయారవుతున్నారని, టెర్రరిస్టులకేమో బిర్యానీ తినిపిస్తున్నారని విమర్శించారు. వాస్తవానికి 2006లో ప్రధాని మన్మోహన్ మాట్లాడుతూ దేశంలోని ఎస్సీ, ఎస్టీలను, మైనారిటీ మతస్థులను, ముఖ్యంగా ముస్లింలను వెనకబడిన వారిగా గుర్తించామని, వారి అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అదిత్యయోగే కాకుండా సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 31 సభల్లో, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా 56 చోట్ల ప్రసంగించినా లాభం లేకపోయింది. ఒక్క మధ్యప్రదేశ్‌లోనే బీజేపీ రాణించగలిగింది. మిగతా అన్ని రాష్ట్రాల్లో పరాజయాన్ని మూటకట్టుకుంది. -
జాతీయ కాంగ్రెస్‌కు నేడే సుదినం
సాక్షి, న్యూఢిల్లీ : 2014, మే 16వ తేదీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇదే సుదినం. ఆ రోజున వెలువడిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలం పార్లమెంట్లో 44 సీట్లకు పడిపోయింది. ఆ తర్వాత మొన్నటి వరకు జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతూనే వస్తోంది. ఒకటి, రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా ఆవిర్భవించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక పోయింది. బీజేపీ మాత్రం సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి తన విజయపరంపరను కొనసాగిస్తూ ఏకంగా 15 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఓ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకన్నా తక్కువ సీట్లు వచ్చినప్పటికీ ఇతరులతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం, మధ్యప్రదేశ్‌లో బీజేపీతో దీటుగా ఎదుర్కోవడం సాధారణ విషయం కాదు. ఒక్క తెలంగాణాలోనే ఆశించిన ఫలితాలు అందలేదు. రానున్న రోజుల్లో బీజేపీకి గడ్డు రోజులు ఉంటాయని ఉత్తరప్రదేశ్‌లోని మూడు లోక్‌సభకు జరిగిన ఎన్నికల ఫలితాలే చెప్పాయి. నాడు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆయన డిప్యూటి చీఫ్ కేశవ్ ప్రాతినిథ్యం వహించిన రెండు స్థానాలతోపాటు మరో లోక్‌సభ సీటును బీజేపీ కోల్పోయింది. ఈ ఎన్నికల ఫలితాలు హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
ఈ ఫలితాలే ‘రోడ్ మ్యాప్’!
వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల పోరుకు సెమీ ఫైనల్స్‌గా పరిగణిస్తున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో ఈవీఎంలలో నిక్షిప్తమైంది పోటీలో నిలిచిన అభ్యర్థుల భవిష్యత్తే కాదు.. ప్రధాన రాజకీయ పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌ల భవితవ్యం కూడా. 2019 లోక్‌సభ ఎన్నికలపై ఈ ఫలితాలు గణనీయ ప్రభావం చూపనున్నాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌ల్లో కమలం పార్టీ అధికారంలో ఉంది. ఈశాన్యంలో కాంగ్రెస్‌కు మిగిలిన ఏకైక రాష్ట్రం మిజోరం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే.. రాజస్తాన్‌లో ఈ సారి కాంగ్రెస్ అధికార పీఠాన్ని అధిరోహించనుంది. అలాగే, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్దే విజయమని, మిజోరం కాంగ్రెస్ చేజారనుందని అవి తేల్చాయి. రెండు పక్షాలకు గెలుపు అవసరమే! రాజస్తాన్‌తో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల్లో కనీసం ఒక్క రాష్ట్రాన్నైనా కాంగ్రెస్ చేజిక్కించుకోగలిగితే.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు గట్టి బలం చేకూరుతుంది. కాంగ్రెస్ చీఫ్‌గా, జాతీయ స్థాయి నేతగా రాహుల్ గాంధీ స్థానం బలోపేతమవుతుంది. బీజేపీయేతర పక్షాల కూటమికి కాంగ్రెస్ పక్షాన రాహుల్ నేతృత్వం వహించగల అవకాశాలు మెరుగవుతాయి. లేని పక్షంలో, ఎన్నికల పొత్తులు, సీట్ల పంపకాల చర్చల్లో ఎన్డీఏయేతర ప్రాంతీయ పార్టీల నుంచి వచ్చే అనేకానేక డిమాండ్లకు తలొగ్గాల్సి వస్తుంది. కనీసం రెండు రాష్ట్రాల్లోనైనా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. బీజేపీ వ్యతిరేక విపక్ష కూటమికి నేతగా రాహుల్ ఆమోదనీయత పెరుగుతుంది. ఇతర పక్షాలు కాంగ్రెస్ మాట వినక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా, కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాలు రాకుంటే, రాహుల్ ఇమేజ్‌తో పాటు కాంగ్రెస్ ప్రతిష్ట భారీగా దెబ్బతింటాయి. ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ఏన్డీయేయేతర ప్రాంతీయ పార్టీల నేతలు ‘ప్రత్యామ్నాయాలు’గా ఎదుగుతారు. మిజోరంలో అధికారం కోల్పోతే మొత్తంగా ఈశాన్యం నుంచి కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యమే ఉండదు. మరోవైపు, కనీసం రెండు రాష్ట్రాల్లోనైనా విజయం సాధించడం బీజేపీకి అవసరం. ఇన్నాళ్లూ కొనసాగిన విజయపరంపరను ఈ ఎన్నికల్లోనూ కొనసాగించడం ద్వారానే ఆ పార్టీ ఆత్మవిశ్వాసంతో లోక్‌సభ ఎన్నికల బరిలో దిగగలదు. ఎన్డీయే పక్షాలతో పొత్తు చర్చల్లోనూ ఆధిక్యత కనపర్చగలదు. ఓటమి ఎదురైతే మాత్రం పార్టీలో, పార్టీ అగ్రనేతల్లో ఆత్మవిశ్వాసం భారీగా దెబ్బతింటుంది. పార్టీ లో అసహన స్వరాల జోరు పెరుగుతుంది. కూటముల్లోనూ మార్పులు ఈ ఫలితాల అనంతరం జాతీయ స్థాయిలో ప్రధాన కూటములైన ఎన్డీయే, యూపీఏల్లోని పార్టీల్లో కూడా మార్పుచేర్పులు చోటు చేసుకునే అవకాశముంది. ఎంతగా విమర్శించినా, బీజేపీ మిత్రపక్షంగానే శివసేన కొనసాగుతుంది. కానీ, బిహార్‌కు చెందిన రాష్ట్రీయ లోక్‌సమత పార్టీల్లాంటివి మాత్రం ఇప్పటికే ఎన్డీయేకు దూరమయ్యే దిశగా సంకేతాలిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే మిత్రపక్షాలపై పట్టును పెంచుకోగలదు. పక్క చూపులు చూస్తున్న ఎన్డీయే పార్టీల ఆలోచనల్లో మార్పు రాగలదు. మొత్తానికి, ప్రధాన పార్టీల నుంచి కీలక నేతలంతా ప్రచారం చేయడాన్ని బట్టే ఈ ఎన్నికలను ఆయా పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో అర్థమవుతుంది. - నేషనల్ డెస్క్ -
ఓటేయని వారు 1,96,124 : వరంగల్ అర్బన్
సాక్షి, హన్మకొండ అర్బన్: పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఎవరికెన్ని ఓట్లు పోలై ఉంటాయని అభ్యర్థులు, వారి అనుచరులు లెక్కలు వేసుకుంటుండగా, జిల్లా ఎన్నికల అధికారులు పోలింగ్ శాతం ఏ మేరకు పెరిగిందని లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తంగా చర్చంతా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసి వెళ్లిన వారి గురించే జరుగుతోంది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కలిపి 1,96,124 మంది అంటే.. సుమారు 30 శాతం మంది ఓటర్లు పోలింగ్ కేంద్రం ముఖం చూడలేదు. తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఓటర్ లిస్ట్ మార్క్డ్ జాబితా ప్రకారం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 6,78,036 మంది ఓటర్లు ఉండగా వారిలో 4,81,912 మంది ఓటర్లు(71.40 శాతం) మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయినా పెరిగింది.. జిల్లాలో 2014 సాధారణ ఎన్నికల సమయంలో మొత్తం 6,78,090 మంది ఓటర్లు ఉండగా వారిలో 4,67,335 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంతో జిల్లాలో 68.43 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం 2018 ఎన్నికల్లో మాత్రం 71.40 శాతం ఓట్లు పోల్ కావడంతో గతంకన్నా 2.97 శాతం పెరిగినట్లయ్యింది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఈ సారి పశ్చిమలో 1.46 శాతం పెరిగింది. వర్ధన్నపేట నియోజకవర్గంలో అత్యధికంగా 5.56 శాతం పోలింగ్ పెరిగింది. ఇక వరంగల్ తూర్పులో మాత్రం ఊహించని విధంగా పోలింగ్ గతంకన్నా 1.96 శాతం తగ్గింది. మరో విశేషం ఏమిటంటే జిల్లాలో 2014 ఓటర్ల జాబితాలో కన్నా ప్రస్తుతం ఓటర్ల జాబితాలో 54 మంది తక్కువగా ఉన్నారు. వరంగల్ పశ్చిమలో అత్యధికంగా 1,00,471 మంది ఓటు వేయలేదు. ఇక్కడ 41.71 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. వరంగల్ తూర్పులో 58,169 మంది పోలింగ్‌కు రాలేదు. ఇక్కడ 27.47 శాతం మంది ఓటర్లు ఓటుకు దూరంగా ఉన్నారు. వర్ధన్నపేటలో 37,484 మంది ఓటేయలేదు. ఇక్కడ 16.63 శాతం మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోలేదు. మొత్తంగా ఓటర్ల జాబితాలో 2 శాతం వరకు మరణించిన వారివి, మరికొందరివి రెండు చోట్ల ఉండే అవకాశం ఉంది. ఆ ఓట్లు మినహా మిగతావారు ఓటేయలేదని అధికారులు భావిస్తున్నారు. -
మోదీని తక్కువ అంచనా వేయొద్దు.. విజయం మాదే
సాక్షి, న్యూ ఢిల్లీ: తెలంగాణ సహా మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ముగియడంతో జాతీయ మీడియ సంస్థలు, పలు సర్వేసంస్థలు ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. తాజా ఎగ్జిట్‌ఫోల్స్ ఫలితాల ప్రకారం ఐదు రాష్ట్రాల్లోనూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అయితే ఈ ఫలితాలను తలకిందులు చేస్తూ తమ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని బీజేపీ ఆగ్రనేతలు అభిప్రాయపడుతున్నారు. మోదీని అందరూ తక్కువ అంచనా వేస్తున్నారని.. అయన నాయకత్వంలో బీజేపీకి గెలుపే తప్పా ఓటముండదని తేల్చిచెబుతున్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఎగ్జిట్స్‌పోల్స్ ఫలితాలను తిప్పి కొట్టారు. ‘ప్రజానాడి తెలిసిన నేతను, ప్రజలతో ప్రయాణం చేశాను. వారిని కలిశాను. నేనే పెద్ద సర్వేయర్‌ను. ఎవ్వరూ ఊహించని విధంగా మధ్యప్రదేశ్‌లో అత్యధిక మెజార్టీతో బీజేపీ మరోసారి అధికారంలోకి రాబోతుంది’ అంటూ శివరాజ్ సింగ్ జోస్యం చెప్పారు. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు కాంగ్రెస్‌కు స్వల్పసంతోషాన్ని కలిగించేవని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహారావు అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాల రోజు కాంగ్రెస్‌కు రిక్త హస్తం ఖాయమని జోస్యం చెప్పారు. ఇక ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలకు భిన్నంగా మోదీ-షా నాయకత్వంలోని బీజేపీ అఖండ విజయాన్ని సాధిస్తుందని మరో బీజేపీ నేత ఆశాభావం వ్యక్తం చేశారు. -
పోలింగ్ సామగ్రికి పటిష్ట భద్రత
పాల్వంచ : అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామగ్రిని పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా అక్కడ పటిష్ట భధ్రత చర్యలు చేపట్టారు. జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. జిల్లాలోని 995 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. కొన్ని చోట్ల ఓటర్లు సాయంత్రం కూడా బారులుదీరి ఉండటంతో ఓటింగ్ ఆలస్యం అయింది. అనంతరం మారుమూల ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఈవీఎంలు, వీవీప్యాట్లను కౌంటింగ్ కేంద్రానికి కట్టుదిట్టమైన భద్రత నడుమ తరలించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ... కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ రజత్ కుమార్ శైనీ, ఎస్పీ సునీల్‌దత్, జాయింట్ కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భద్రాచలం సబ్ కలెక్టర్ భవేష్ మిశ్రా, డీఎస్పీలు కుమారస్వామి, మధుసూదన్‌రావు పర్యవేక్షణ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన ఈవీఎంలను ఆన్లైన్ చేయడంతో పాటు బ్యాలెట్ యూనిట్లను కేటగిరీల వారీగా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం చుట్టూ సీసీ కెమెరాలు, వెబ్ కెమెరాలను అమర్చారు. స్ట్రాంగ్ రూంలకు విద్యుత్ సరఫరా లేకుండా చేశారు. ఎలాంటి అగ్నిప్రమాదాలు, షార్ట్‌సర్క్యూట్ జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేశారు. ఎన్నికల లెక్కింపు తీరును బయట నుంచి ఆయా అభ్యర్థులు, అధికారులు పరిశీలించేలా బయట ప్రొజెక్టర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. -
హోం మంత్రి కటారియాకు ఈసారి కష్టాలే!
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని ప్రతిష్టాకరమైన ఉధంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు విజయం సాధించిన హోం మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు గులాబ్ చంద్ కటారియాకి మొదటి సారి ఓటమి భయం పట్టుకుంది. అదీ సొంత పార్టీ నాయకుడే కాకుండా ఇంతకాలం తన సహచరుడిగా ఉన్న దల్పత్ సురాణా నుంచే. పైగా ఆయన కూడా కటారియాలాగా జైనుడే కావడం గమనార్హం. 74 ఏళ్లు వచ్చినప్పటికీ యువతరానికి అవకాశం ఇవ్వకుండా ఆరోసారి కూడా కటారియా రంగంలోకి దిగడంతో, తాను తిరుగుబాటు అభ్యర్థిగా జనతాసేన టిక్కెట్‌పై నామినేషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని సురాణా తెలిపారు. మొదటినుంచి ఆరెస్సెస్ అండ కలిగిన కటారియాకు బీజేపీ అధిష్టానం టిక్కెట్ ఇవ్వాల్సి వచ్చింది. ‘నా లక్ష్యం ఒక్కటే కటారియాను ఓడించడం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినా ఫర్వాలేదు’ అని సురాణా వ్యాఖ్యానించారు. కటారియా తన తల బిరుసుతనంతో పార్టీలో ఎవరినీ ఎదగకుండా చేశారని ఆయన విమర్శించారు. తాను బరిలోకి దిగకపోతే కటారియాకు ప్రత్యర్థిగా నిలబడే దమ్ము ఎవరికీ లేదని, అందుకనే మొన్నటివరకు ఆయన అనుచరిడిగా కొనసాగిన తాను రంగంలోకి దిగాల్సి వచ్చిందని చెప్పారు. నియోజకవర్గంలో దాదాపు 44 వేల మంది జైన ఓటర్లు ఉన్నారని, వారంతా ఇదివరకు కటారియాకే మద్దతిచ్చారని, ఇప్పుడు సురాణాకు ఇస్తున్నారని, ఆయనకు మద్దతిస్తున్న బ్రాహ్మణ నాయకుడు మంగేలాల్ జోషి తెలిపారు. ఆరెస్సెస్‌లోని యువత కూడా సురాణాకే మద్దతిస్తోంది. సురాణా ఎన్నికల్లో విజయం సాధించాక తిరిగి బీజేపీ పార్టీలోకి వస్తారని ఆ యువత భావిస్తోంది. కటారియాపై తిరుగుబాటు అభ్యర్థి సురాణా ఒక్కరే కాదు.. ప్రధాని నరేంద్ర మోదీ వీరాభిమాని, నమో విచార్ మంచ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ రటాలియా కూడా పోటీ చేస్తున్నారు. కటారియాను రాజ్‌పుత్‌లు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘కటారియాను ఓడించే సత్తా ఎవరికి ఉంటే వారికే మేము ఓటు వేస్తాం’ అని ‘మేవర్ క్షత్రియా మహాసభ సంస్థాన్’ అధ్యక్షుడు తన్వీర్ సింగ్ కష్ణావత్ తెలిపారు. ఇదివరకు తామంతా బీజేపీకే మద్దతు ఇస్తూ వచ్చామని, మేవర్‌లో 28 సీట్లుంటే బీజేపీ ఇద్దరు రాజ్‌పుత్‌లకు మాత్రమే సీట్లు ఇచ్చిందని, ఈ కారణంగా ఈ సారి తాము బీజేపీని ఓడించేందుకే కంకణం కట్టుకున్నామని ఆయన తెలిపారు. కటారియా మాత్రం అంతిమంగా విజయం తనదేనని చెబుతున్నారు. ఫలితాలు వెలువడ్డాక మాట్లాడండి అని మీడియాతో వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీలపై ప్రజలు కోపంగా ఉన్న విషయాన్ని ప్రస్తావించగా, ఆ అంశాలను ప్రజలు ఇప్పుడు మరచిపోయరని అన్నారు. మరి ఉద్యోగాల హామీ గురించి ప్రస్తావించగా, పకోడీల లాంటి థియరీ నాకోటి ఉందని, దాంతోని యువతను ఆకట్టుకున్నానని ఆయన చెప్పారు. కానీ ఆయన మొహంలో అంతకుముందున్న ధీమా కనిపించడం లేదు. -
ఓటరు ఎటువైపు?!
దాదాపు రెండు నెలలుగా హోరెత్తుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం బుధవారం సాయంత్రంతో ముగిసింది. శుక్రవారం జరగబోయే పోలింగ్‌కు ఎన్నికల యంత్రాంగం సర్వ సన్నద్ధమైంది. తెలంగాణతోపాటు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయి. మరో రాష్ట్రం రాజస్తాన్ పోలింగ్ తెలంగాణతోపాటే జరగబోతోంది. ఇతర రాష్ట్రాల మాటెలా ఉన్నా తెలంగాణలో తొలిసారి జరగబోతున్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పక్షం అంతిమ విజేతగా నిలుస్తుందన్న అంశంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల సంఘం నవంబర్ 11న తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసినా అంతకు నెల రోజుల ముందే టీఆర్ఎస్ తన అభ్యర్థుల్ని ఖరారు చేసుకుని ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టింది. ప్రతి పార్టీ ఈ ఎన్నికలను చావో రేవో అన్నట్టు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతోపాటు సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రులు రాష్ట్రా నికొచ్చి సభలూ, సమావేశాల్లో మాట్లాడారు. బీజేపీ నుంచి ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మొదలుకొని కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్ నాయ కులు వివిధ జిల్లాల్లో జరిగిన సభలూ, సమావేశాల్లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ తరఫున ముఖ్య మంత్రి కె. చంద్రశేఖరరావు అన్నీ తానే అయి దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. ఎప్పటికప్పుడు పార్టీ వ్యూహానికి పదునుపెడుతూ పార్టీ శ్రేణులను ఉరికించారు. పార్టీ కీలక నేతలు తారకరామారావు, హరీశ్‌రావులు సైతం పలు నియోజక వర్గాల బాధ్యతలను తీసుకుని ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని సంకల్పించుకున్న కాంగ్రెస్...అందుకోసం తన చిరకాల ప్రత్యర్థి అయిన తెలుగుదేశంతో పొత్తుకు సైతం సిద్ధపడి సీపీఐని, తెలంగాణ జన సమితి(టీజేఎస్) లను కూడా కలుపుకొని ప్రజా కూటమి పేరుతో ఎన్నికల బరిలో నిల్చుంది. ఏం చేసైనా అధికారం అందుకుని తీరాలని తహతహలాడిన కాంగ్రెస్ పార్టీ అందుకు తగినట్టుగా సకాలంలో అభ్యర్థుల్ని మాత్రం ఖరారు చేసుకోలేకపోయింది. తమ పార్టీలోనూ, కూటమిలోనూ కూడా చివరి నిమిషం వరకూ గందరగోళాన్ని మిగిల్చింది. మిత్రపక్షాలకు కేటాయించిన కొన్ని స్థానాల్లో తన అభ్యర్థులకు బీ ఫారాలిచ్చింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు తేదీ అయిన నవంబర్ 22కు కూడా తేల్చ కపోవడంతో నాలుగైదుచోట్ల కూటమిలోని పక్షాలే పరస్పరం తలపడే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో నాలుగున్నరేళ్లుగా వివిధ అంశాలపై ఒంటరిగా పోరాడుతున్న కాంగ్రెస్ చివరి నిమి షంలో స్వీయ సామర్థ్యంపై నమ్మకం లేకనో, మీడియాలో కథనాలొస్తున్నట్టు భారీగా డబ్బు సమ కూరుస్తానన్న చంద్రబాబు ప్రలోభానికి లొంగిపోవడం వల్లనో... పొత్తుకు సిద్ధపడి రాజకీయంగా తప్పు చేసిందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఎంత ఆత్మ విశ్వాసంతో పనిచేసిందో ఎవరూ మరిచిపోరు. 2004లో కేవలం అధిష్టానం ఒత్తిడి వల్ల ఆయన టీఆర్ఎస్తో పొత్తుకు అంగీకరించారు. 2009లో ఒంటరిగా పోటీకి దిగినా విజయం ఖాయమని అధిష్టానానికి నచ్చజెప్పి ఒప్పించి దాన్ని నిజం చేసి చూపారు. కానీ రాహుల్‌గాంధీ మొదలుకొని స్థానిక నాయకత్వం వరకూ కాంగ్రెస్‌లో ఎవరూ ఇప్పుడు ఆ స్థాయి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించలేక ‘పూలమ్మినచోటే కట్టెలమ్మిన’ తరహాలో చంద్రబాబు ప్రతిపాదించిందే తడవుగా దాన్ని శిరసావ హించారు. పోనీ సిద్ధపడితే పడ్డారు...కాంగ్రెస్ సగర్వంగా చెప్పుకోవడానికి అవకాశమున్న అత్యంత ప్రతిష్టాత్మక నిర్ణయాలను తమ సమక్షంలోనే చంద్రబాబు సొంత ఖాతాలో వేసుకుంటుంటే అచేతనులుగా గుడ్లప్పగించి చూశారు. ఐటీ అంకురార్పణ, శంషాబాద్ అంతర్జాతీయ విమానా శ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు వంటివన్నీ ఆయన తన ఘనతగా చెప్పుకుంటుంటే ‘కాద’ని చెప్పడానికి వారికి నోరు పెగల్లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌కు అంతో ఇంతో ప్రతిష్ట మిగిలిందంటే అది వైఎస్ పుణ్యమే. కానీ ఆయన్ను స్మరించుకోలేని దుస్థితికి కాంగ్రెస్ నాయకులు దిగజారారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎన్ని స్థానాలొచ్చినా అది తనవల్లే సాధ్యమైందని ముందూ మునుపూ దబాయించడా నికి చంద్రబాబుకు చేజేతులా అవకాశమిచ్చారు. నిజానికి తెలంగాణలో తెలుగుదేశం ప్రాభవం ముగిసి చాన్నాళ్లయింది. ఆ పార్టీలో పలుకుబడి ఉన్న నేతలు, కార్యకర్తల్లో అత్యధికులు టీఆర్ఎస్కు వలసపోయారు. ఇప్పుడున్నది నామ మాత్రావశిష్టమైన టీడీపీ మాత్రమే. చంద్రబాబు తన బ్రాండ్ మకిలిని కూటమిలోని ఇతర పక్షాలకు కూడా అంటించారు. మరి 48 గంటల్లో పోలింగ్ జరగబోతున్నదనగా తెలంగాణలోని వివిధ జిల్లాలు మొదలుకొని రాజధానిలోని కూకట్పల్లి వరకూ పట్టుబడుతున్న కరెన్సీ మూటలు, బంగారం నిల్వలు తెలంగాణ ప్రజల్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఇందులో కరెన్సీ విలువ రూ. 129 కోట్లుకాగా, బంగారం విలువ రూ. 8 కోట్లని వార్తలొస్తున్నాయి. ఇవిగాక లక్షలాది రూపాయల మద్యం ఏరులై పారుతోంది. పట్టుబడిన డబ్బు, బంగారం నిల్వల్లో అధిక భాగం కూటమి అభ్యర్థులదే కావడం, ఇదంతా ఆంధ్రప్రదేశ్ నుంచే తరలి వచ్చిందని కథనాలు రావడం తెలంగాణ ప్రజల్ని మాత్రమే కాదు...అక్కడివారిని సైతం కలవరపరుస్తాయి. ఇంతవరకూ రూ. 129 కోట్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నామని బుధ వారం రాత్రి పోలీసులు చేసిన ప్రకటన వెల్లడించిందంటే నాయకులు ఎంతకు దిగజారారో అర్ధమ వుతుంది. తెలంగాణ ప్రజలు రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్నవారు. వివేకమూ, విజ్ఞతా గల వారు. ధన, కనక, మద్య ప్రవాహాలతో ఏమార్చాలని చూసిన పార్టీలకూ, నేతలకూ తమ ఓటు ద్వారా గట్టిగా బుద్ధి చెప్పగలరని గత చరిత్ర చెబుతోంది. ఈ నెల 11న వెలువడే ఫలితాల్లో మరో సారి అదే ప్రస్ఫుటంగా ప్రతిఫలిస్తుందని ఆశిద్దాం. -
ఈ సారి సహారియాల ఓటు ఎవరికి ?
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 72 మంది ఆకలితో చనిపోయారనే వార్త 2002లో జాతీయ పత్రికల పతాక శీర్షికలకు ఎక్కింది. వారిలో 47 మంది ఒక్క రాజస్థాన్‌లోని కిషాన్‌గంజ్ సమితిలోనే చనిపోవడం గమనార్హం. వారంతా కూడా సహారియా తెగకు చెందిన వారే కావడం మరింత గమనార్హం. ఈ ఆకలి చావులకు వ్యతిరేకంగా నాడు సుప్రీం కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన పర్యావసానంగానే 2006లో ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఎస్)’, 2013లో జాతీయ ఆహార భద్రతా చట్టం వచ్చాయి. కిషన్‌గంజ్ నియోజకవర్గంలోని ధిక్వాణి, రతాయి, ఖైరాయ్ గ్రామాల్లో సహారియాలు ఎక్కువగా ఉన్నారు. మొత్తం రాజస్థాన్ రాష్ట్ర జనాభాలోనే 40 శాతం ఉన్న సహారియాలను షెడ్యూల్డ్ తెగల కింద గుర్తిస్తున్నారు. వారికి ఈ కిషన్‌గంజ్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని 1985లోనే కేటాయించారు. ఒకప్పుడు దట్టమైన అడవుల్లో నివసిస్తూ అటవి ఉత్పత్తులపై ఆధారపడి బతికిన సహారియాలు అడవులు ధ్వంసమవడం, పలచపడడం తదితర కారణాల వల్ల మైదాన ప్రాంతాల్లోకి వచ్చిపడ్డారు. అక్షరాస్యత ఏమాత్రంలేని వీరంతా కూలినాలి చేసుకుని బతికేవారే. చాలాకాలం వీరు భూస్వాముల వద్ద, ధనిక రైతుల వద్ద వెట్టి చాకిరి చేస్తూ బతికారు. ఆ చాకిరి నుంచి వీరికి విముక్తి కల్పించిందీ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ప్రతి కుటుంబంలో ఒక్కరికి కనీసం వంద రోజులు పని కల్పించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద ఏడాది క్రితం తాను 24 రోజులు పనిచేశానని, వాటికి కూలీ నేటి వరకు రాలేదని బరన్ జిల్లాలోని ధిక్వాని గ్రామానికి చెందిన కమలేష్ భాయ్ తెలిపారు. ఈ ఎన్నికలలోగానైనా కూలీ డబ్బులు వస్తాయని ఆశించానని, రాలేదని ఆమె చెప్పారు. డబ్బులు రాకపోతే ఆకిలితో చావడమో, వెట్టి చాకిరికి వెళ్లిపోవడమో తప్పేట్లు లేదని ఆమె వాపోయారు. మూడేళ్ల క్రితం వరకు ఉపాధి హామీ పథకం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని, అప్పుడు తనతోపాటు ఎన్నో కుటుంబాలు భూస్వాముల వెట్టి చాకిరి నుంచి విముక్తి పొందామని ఆమె తెలిపారు. మూడేళ్లుగానే నిధులు లేవంటూ ఆమె సతాయిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆమె ఆరోపణలతో మిగతా గ్రామాల ప్రజలు కూడా ఏకీభవించారు. ‘ఉపాధి హామీ పథకం మా జీవనాధారం’ అని రతాయ్ గ్రామానికి చెందిన అనితా సహారియా వ్యాఖ్యానించారు. గత కొన్నేళ్లుగా ఈ పథకం ఎందుకనో సవ్యంగా అమలు జరగడం లేదని ఆమె విమర్శించారు. 2008–10 సంవత్సరాలతో పోలిస్తే వంద రోజులు పని పొందిన వారి సంఖ్య పదింటిలో ఒకటికి పడిపోయినట్లు అధికారిక లెక్కలే తెలియజేస్తున్నాయి. ప్రజా పంపిణీ పథకం కింద తమకు రేషన్ సరుకులు కూడా సరిగ్గా అందడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఆధార్‌కార్డులతో అనుసంధానించిన రేషన్ మిషన్లు తమ వేలి ముద్రలను గుర్తించక పోవడం వల్ల డీలర్లు సరుకులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని అన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోందని అన్నారు. 2015 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు తనకు మూడంటే మూడుసార్లు మాత్రమే రేషన్ ఇచ్చారని, వేలి ముద్రలను యంత్రం గుర్తించకపోయినా డీలరు దయతలచి మూడు సార్లు ఇచ్చారని 72 ఏళ్ల హల్కీ భాయ్ తెలిపారు. రేషన్ సరుకులు అందక పేద ప్రజలు దీపావళి రోజున కూడా పస్తులున్నారంటూ స్థానిక పత్రికల్లో వార్తలు రావడంతో ఆ వారంతో సెప్టెంబర్, అక్టోబర్ రేషన్ కోటాను ప్రభుత్వం విడుదల చేసింది. ఇక కేంద్ర పథకాలైన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల, స్వచ్ఛ భారత్ పథకాలేవి తమకు అందుబాటులోకి రాలేదని కిషన్‌గంజ్ నియోజకవర్గం పరిధిలోని సహారియాలు ఆరోపిస్తున్నారు. ప్రధాని మంత్రి ఆవాస్ కింద తమ లబ్దిదారుడికి ఒకే ఒక ఇల్లు మంజూరయిందని, మొత్తం ఇంటికి 1.40 లక్షల రూపాయలను మంజూరు చేయాల్సి ఉండగా కేవలం మొదటి విడతగా 52 వేల రూపాయలను మాత్రమే విడుదల చేశారని, దాంతో పైకప్పు నిర్మించకుండా వదిలేశారని బాధితుడు తెలిపారు. బ్రాహ్మణులు, రాజ్‌పుత్‌లు అన్యాయంగా ఇళ్లను మంజూరు చేయించుకున్నారని వారు ఆరోపించారు. ఇక ఉజ్వల పథకం కింద ఉచితంగా మంజూరైన గ్యాస్ కనెక్షన్‌ను మొదటి సిలిండర్ అయిపోగానే మూలన పడేశామని వారంతా ముక్తకంఠంతో చెప్పారు. సిలిండర్ రీఫిల్లింగ్‌కు వెయ్యి రూపాయలను తాము ఎక్కడి నుంచి కడతామని వారంటున్నారు. అక్కడక్కడ అధ్వాన్నంగా కట్టిన మరుగుదొడ్లు కూడా మూలన పడ్డాయని వారు ఆరోపించారు. ఈసారి ఎవరికి ఓటేస్తారని వారిని ప్రశ్నించగా, ఎప్పటిలాగా కాంగ్రెస్‌కే ఓటేస్తామని వారు చెప్పారు. ఎందుకని ప్రశ్నించగా ప్రస్తుత ప్రభుత్వం తమను ఏనాడు పట్టించుకోలేని వారు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున హీరాలాల్ సహారియా, బీజేపీ తరఫున హేమ్రాజ్ మీనా కుటుంబాలే మొదటి నుంచి ఎస్టీలకు రిజర్వ్ చేసిన ఈ కిషన్‌గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే నిర్మలా సహారియా పోటీ చేస్తుండగా, బీజేపీ తరఫున లిలిత్ మీనాలు పోటీ చేస్తున్నారు.