endowment department
-
ఏపీ దేవాదాయ శాఖలో భారీ బదిలీలు
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. సుమారు 15 మంది డిప్యూటీ కమీషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.విజయవాడ కనకదుర్గ ఆలయపు డీసీ ఎం రత్నరాజును డిప్యూటీ ఈవోగా నియమించారు. అలాగే మహానందీశ్వర స్వామి దేవస్థానం డీసీ శోభారాణికి.. ఈవోగా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. పోస్టింగ్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్న విజయ రాజును కర్నూల్ ఉరుకుండ నరసింహ ఎర్రన్న స్వామివారి దేవస్థానానికి డీసీ & ఈవోగా నియమించారు.శ్రీకాకుళం అరసవెల్లి సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం డీసీ, ఈవో డీవీఎల్ రమేష్ బాబును కాకినాడ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్‌గా నియమించారు. ఈ మేరకు మొత్తం 15 మందికి పోస్టింగ్‌లతో పాటు బదిలీలు జారీస్తూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ సత్యనారాయణ(ఐఏఎస్) పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇదీ చదవండి: దుష్ప్రచారంలో దిట్ట -
ఆ పనులు ఆపండి!
సాక్షి, అమరావతి: కొత్త ఆలయాల నిర్మాణంతో పాటు పాత ఆలయాల పునరుద్ధరణకు కామన్ గుడ్ఫంఢ్ (సీజీఎఫ్), శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా గత ప్రభుత్వం మంజూరు చేసిన పనుల్లో ఇంకా ప్రారంభంకాని వాటన్నింటినీ పూర్తిగా పక్కన పెట్టాలని సీఎం చంద్రబాబు దేవదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మొదలైన పనులను మాత్రమే పూర్తిచెయ్యాలన్నారు.దేవదాయ శాఖ కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు మంగళవారం ఆ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీజీఎఫ్ కార్యక్రమంలో పాత ఆలయాల పునరుద్ధరణకు సంబందించి గత ప్రభుత్వంలో మంజూరై ఇంకా మొదలుకాని 243 పనులను సైతం పక్కన పెట్టాలంటూ సీఎం ఆదేశించారు. అలాగే, టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ కింద వివిధ ప్రాంతాల్లో తలపెట్టిన 1,797 దేవాలయాల పనులు ప్రారంభం కాలేదని, వాటినీ నిలిపివేయాలని ఆయన చెప్పారు. గతంలో పల్లెల్లో, వాడల్లో శ్రీవాణి ఆలయ నిర్మాణం ట్రస్ట్ ద్వారా రూ.10 లక్షలు ఇచ్చేవారని.. వీటితో ఆలయాల నిర్మాణాలు సాధ్యంకావడంలేదని సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డారు. దీంతో ఈ మొత్తాన్ని పెంచడానికి, ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సీఎం సూచించారు. ఆలయాల్లో అన్యమతస్తులు ఉండకూడదు.. దేవాలయాల్లో అన్యమతస్తులు ఉండకూడదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలో స్పష్టంచేశారు. ఏ మతంలో అయినా భక్తుల మనోభావాల ముఖ్యమని.. భక్తుల మనోభావాలకు, ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేలా దేవాదాయ శాఖాధికారులు పనిచేయాలని సూచించారు. అలాగే, రాష్ట్రంలో ఇకపై ఎక్కడా బలవంతపు మత మారి్పళ్లు ఉండకూడదన్నారు. రూ.20 కోట్లు కంటే ఎక్కువ వార్షికాదాయం ఉండే ఆలయ ట్రస్టు బోర్డుల్లో ప్రస్తుతం 15 మందిని సభ్యులుగా నియమిస్తుండగా, ఆ సంఖ్యను 17కు పెంచే ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపారు. అదనంగా పెంచిన సభ్యుల సంఖ్యలో ఒక బ్రాహ్మణుడు, ఒక నాయీ బ్రాహ్మణునికి అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. ఇక రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని.. ఈ విషయంలో ప్రణాళికలతో రావాలని సీఎం అధికారులను కోరారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి దేవాదాయ శాఖ, అటవీ శాఖ, పర్యాటక శాఖల మంత్రులతో కమిటీ ఏర్పాటుకు సమావేశంలో నిర్ణయించారు. అర్చకుల వేతనాలు పెంపు.. దేవదాయ శాఖ పరిధిలో పనిచేసే పలువురు అర్చకుల వేతనాల పెంపుపైనా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా.. » ప్రస్తుతం రూ.10 వేల వేతనంతో పనిచేసే అర్చకులకు ఇకపై రూ.15 వేలు చెల్లించాలని నిర్ణయించారు. » తక్కువ ఆదాయం ఉండే ఆలయాలలో ధూపదీప నైవేద్య పథకం ద్వారా అర్చకులకు అందజేసే మొత్తం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు. » అలాగే, వేద విద్య చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న వారికి నెలకు రూ.3 వేలు భృతి ఇవ్వాలని సీఎం సూచించారు. » అంతేకాక.. నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం రూ.25 వేలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. » వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ చేసుకున్న రోజును అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారు. గోదావరి, కృష్ణా నదీ హారతులు మళ్లీ.. గోదావరీ, కృష్ణా నదీ హారతులు మళ్లీ నిర్వహించాలని సమావేశంలో సీఎం చంద్రబాబు చెప్పారు. అలాగే, ప్రతి దేవాలయంలో ఆన్లైన్ విధానం అమలుచేయాలని, అన్ని సర్విసులు ఆన్లైన్ ద్వారా అందాలన్నారు. అవసరమైతే ప్రైవేటు రంగం భాగస్వామ్యంతో హోటళ్ల నిర్మాణం చేపట్టి భక్తులకు వసతులు కల్పించాలన్నారు. దేవాలయాలకు విరాళాలిచి్చన వారిని ప్రోత్సహించాలని.. వారి పేర్లు ప్రకటించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు. -
రూ.250 కోట్ల మఠం భూమి హాంఫట్.. కబ్జా చేసిన టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని గ్యాంగ్ అక్రమాలు, అరాచకాలకు పాల్పడుతోంది. అధికారమే అండగా రూ.250 కోట్ల విలువ చేసే దేవుడి మాన్యాన్ని అమాంతం మింగేసింది. నాని అనుచరులు.. అభ్యంతరం చెప్పిన దేవదాయశాఖ సిబ్బంది బట్టలు విప్పి, వారిని మోకాళ్లపై కూర్చోబెట్టారు.. అధికారులతో గోడ కుర్చీ వేయించారు. నానాబూతులు తిట్టి నిర్బంధించారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నాయన్నా ‘డోంట్ కేర్’ అంటూ వారి ఎదుటే.. దేవుడి మాన్యానికి దర్జాగా ప్రహరీ నిర్మించారు. నానీస్ గ్యాంగ్ అక్రమాలపై ‘సాక్షి’ బుధవారం ప్రచురించిన కథనం తిరుపతి రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లోనూ, దేవదాయ, రెవెన్యూ శాఖ అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. అప్పనంగా కొట్టేసి.. సొమ్ము చేసుకోవడమే లక్ష్యం.. తిరుపతి రూరల్ మండలం అవిలాల లెక్క దాఖలాలోని సర్వే నంబర్ 145, 147/1లో సుమారు 10 ఎకరాల విలువైన దేవుడి మాన్యం భూమిని నాని గ్యాంగ్ ఆక్రమించుకుంది. ఇక్కడ అంకణం కనీసం రూ.4 లక్షల వరకూ ఉంది. మొత్తం10 ఎకరాలు బహిరంగ మార్కెట్లో రూ.250 కోట్లు పలుకుతోంది. నాని గ్యాంగ్ దీన్ని అప్పనంగా కొట్టేసి, అమ్మేసి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తోంది. రూ.250 కోట్లకు స్కెచ్ వేశారంటే అధికార పారీ్టలోని ఎవరో ‘ముఖ్య’నేత ప్రమేయం ఉండకుండా ఉండదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాకు మూడు.. మీకు ఏడు హథీరాంజీ మఠానికి చెందిన భూమిని స్వాదీనం చేసుకోవడానికి చూస్తున్న ముగ్గురు వ్యక్తులతో టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది. ఈ భూమికి సంబంధించి మఠం, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బంది రాకుండా తాను చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చారని సమాచారం. తనకు మూడెకరాలు కేటాయించాలని.. మీరు ఏడెకరాలు తీసుకోవాలని వారితో చెప్పినట్టు తెలుస్తోంది. అంతటితో ఆగని నాని ఆ తర్వాత ఆ ఏడెకరాలను కూడా తానే కొనుగోలు చేసుకుంటానని చెప్పడంతో ఆ ముగ్గురు షాక్ అయ్యారు. ‘ఆ ఏడెకరాలకు రూ.25 కోట్లు ఇస్తా.. ఆ నగదును ముగ్గురు పంచుకోండి. దీంట్లో అమరావతి పెద్దలకు కూడా వాటా ఉంది’ అని స్పష్టం చేయడంతో చేసేదేమీ లేక ఆ ముగ్గురూ తెల్లముఖం వేశారని సమాచారం. పనులు ప్రారంభం ఆ పదెకరాలు చుట్టూ జూన్ 9న ఉదయం 7 గంటలకు ప్రహరీ గోడ వేయడానికి నానీస్ గ్యాంగ్ పనులు ప్రారంభించింది. ఈ సమాచారం అందుకున్న దేవదాయ శాఖ అధికారులు, మఠం సిబ్బంది అందరూ కలిసి జూన్ 10న ఆ స్థలం వద్దకెళ్లి ప్రహరీ నిర్మించడానికి వీల్లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటికే అక్కడ 100 మందికిపైగా నాని గూండాలు కాపుకాస్తున్నారు. ‘మేమెవరో తెలియదా?, ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తారు? మూసుకుని వెళ్లండి’ అంటూ బెదిరింపులకు దిగారు. అయితే మఠం అధికారులు పనులు ఆపాల్సిందేనంటూ గట్టిగా వాదించారు. దీంతో కోపోద్రిక్తులయిన టీడీపీ గూండాలు మఠం సిబ్బందిని తాత్కాలికంగా నిర్మించుకున్న గదిలోకి తీసుకెళ్లి బట్టలు ఊడదీయించారు. అధికారులతో గోడ కుర్చీ వేయించారు. నోటికొచ్చినట్లు బండ బూతులు తిట్టారు. దీంతో అధికారులు, సిబ్బంది ప్రాణ భయంతో అక్కడే బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరకు కాళ్లా వేళ్లా పడి బతుకుజీవుడా అంటూ అక్కడి నుంచి మఠం కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం మఠం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై చంద్రగిరి డీఎస్పీ జూన్ 11న నాని గ్యాంగ్‌ను, దేవదాయ శాఖ అధికారులను అక్కడకు పిలిపించుకున్నారు. పోలీస్ స్టేషన్లో సైతం గ్యాంగ్ ఓ దశలో అధికారులపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో దేవదాయ అధికారులకు ‘నాని గ్యాంగ్’ వారి్నంగ్ ఇచి్చనట్లు తెలుస్తోంది. ఎక్కడా ఈ అంశంపై నోరు మెదపవద్దని మండిపడినట్లు సమాచారం. తమకు వ్యతిరేకంగా నివేదికలు ఇవ్వడానికి లేదని హుకుం జారీచేసినట్లు తెలుస్తోంది. ఆందోళనకు ప్రజా సంఘాలు సిద్ధం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి ఒక ఆర్యవైశ్య వ్యాపారి రూ.రెండు కోట్లు ఇవ్వనందుకు ఇటీవల రైస్‌మిల్లు మూయించారు. అదే క్రమంలో టీటీడీ కాంట్రాక్టర్ నుంచి రెండెకరాలు రాయించుకున్నారు. ఇప్పుడు రూ.250 కోట్ల విలువైన పదెకరాల మఠం భూమిని ఆక్రమించుకుంటున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.ఆ భూమి హథీరాంజీ మఠందే.. తిరుపతి రూరల్ మండలం అవిలాల పరిధిలో ఆక్రమణకు గురైన భూమి హథీరాంజీ మఠానిదే. మఠానికి చెందిన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దానిని అడ్డుకునేందుకు వెళ్లిన మఠం సిబ్బందిని వంద మంది గూండాలతో రూమ్‌లో బంధించి, బట్టలూడదీసి.. నానా దుర్భాషలాడుతూ అంతు చూస్తామని బెదిరించారు. ఈ మేరకు తిరుపతి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. దీనిపై జిల్లా కలెక్టర్, ఎస్పీలకు కూడా ఫిర్యాదు ఇచ్చాం. ఈ భూకబ్జాలో ల్యాండ్ మాఫియా పాత్ర ఉంది. – రమేష్ నాయుడు, హథీరాంజీ మఠం పరిపాలనాధికారి భూములను సంరక్షించాలి.. చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల పరిధిలో ఉన్న హథీరాంజీ మఠం, పరకాల మఠం, దేవదాయ భూములను ప్రభుత్వం సంరక్షించాలి. తిరుపతి నగర నడిబొడ్డున 10 ఎకరాల భూమిని గత నెల నుంచి అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధి కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తెలిసి అడ్డుకున్న మఠం అధికారులను బట్టలూడదీయించి.. నానా బూతులు తిడుతూ భయకంపితులను చేశారు. ఈ భూముల కబ్జాను తక్షణం ఆపాలని సీఎం చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తున్నా. – కందారపు మురళి, సీపీఎం నేత -
515 ఆలయాలకు కొత్త ట్రస్టు బోర్డులు
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా 515 ఆలయాలకు కొత్త ట్రస్టు బోర్డులను నియమించాలని ప్రభుత్వం నియమించింది. పది పదిహేను రోజుల్లో ఈ బోర్డుల ఏర్పాటుకు దేవదాయ శాఖ కసరత్తు చేస్తోంది. దేవదాయ శాఖ పరిధిలో ఏడాదికి రూ. 5 లక్షలు, అంతకు పైబడి ఆదాయం ఉండే ఆలయాలు 1,234 వరకు ఉన్నాయి. వీటిలో 678 ఆలయాలకు ట్రస్టు బోర్డులు ఉన్నాయి. ట్రస్టు బోర్డుల పదవీ కాలం ముగిసిన ఆలయాలు 556 ఉన్నాయి. వీటిలో ట్రస్టు బోర్డుల నియామకానికి ఎలాంటి పాలన పరమైన, న్యాయపరమైన చిక్కులు లేని 515 ఆలయాలకు నూతన ట్రస్టు బోర్డులను నియమిస్తున్నారు. ట్రస్టు బోర్డులో ఆలయం స్థాయినిబట్టి 7 నుంచి 15 మంది వరకు సభ్యులు ఉంటారు. ఈ ట్రస్టు బోర్డుల నియామకం ద్వారా ఐదు వేల మందికి పైనే నామినేటెడ్ పదవులు దక్కే అవకాశం ఉంది. ఈ పదవుల్లో సగం బీసీ, ఎస్సీ, ఎస్టీలకే ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. జనరల్ సహా అన్ని కేటగిరీల్లో 50 శాతం పదవులు మహిళలకే దక్కనున్నాయి. రూ. 5 లక్షల లోపు వార్షికాదాయం ఉండే ఆలయాలకు ట్రస్టు బోర్డుల నియామకం నుంచి పూర్తిగా మినహాయించారు. ఈ ఆలయాల వంశ పారంపర్య ధర్మకర్తలు లేదంటే వంశ పారంపర్య అర్చకులు, లేదా çప్రముఖ హిందూ సంస్థలు వాటి నిర్వహణకు ముందుకొస్తే వారికే అప్పగించేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ట్రస్టు బోర్డుల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చింది సీఎం జగనే.. ఆలయ ట్రస్టు బోర్డుల్లోనూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ సీఎం వైఎస్ జగన్ ఇంతకు ముందే ప్రత్యేకంగా దేవదాయ శాఖ చట్టానికి సవరణలు తీసుకొచ్చారు. ప్రతి ట్రస్టు బోర్డులో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్లు, జనరల్ సహా ఆయా రిజర్వు కేటగిరిల్లో సగం పదవులు తప్పనిసరిగా మహిళలకే కేటాయించేలా జగన్ ప్రభుత్వం ఈ చట్టం చేసింది. దీంతోపాటు ఆలయాల కేశ ఖండన శాలల్లో నాయీ బ్రాహ్మణుల సేవలు ప్రముఖంగా ఉంటే ట్రస్టు బోర్డులోనూ ఆ వర్గం వారిని ఒక సభ్యుడిగా నియమించే వీలు కల్పించారు. అదే సమయంలో ట్రస్టు బోర్డు సభ్యుల్లో ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, అక్రమాలకు పాల్పడినా ప్రభుత్వం వారిని వారి పదవీ కాలం కంటే ముందే తొలగించేలా విస్పష్టంగా చట్టాన్ని సవరించారు. ఈ చట్ట సవరణలు అనంతరం ప్రభుత్వం నియమించిన అన్ని ఆలయ ట్రస్టు బోర్డుల్లో ఇప్పుటి వరకు 4,024 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చోటు దక్కింది. 3,787 మంది మహిళలూ ఆయా ట్రస్టు బోర్డుల్లో భాగస్వాములయ్యారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఆలయాల ట్రస్టు బోర్డు సభ్యుల నియామకంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు నామ మాత్రపు ప్రాధాన్యత కూడ ఉండేది కాదని అధికారవర్గాలు వివరిస్తున్నాయి. -
‘ధూపదీప నైవేద్యం’ ఎలా?
సాక్షి, హైదరాబాద్: గౌరవ భృతి అందని కారణంగా దేవుళ్లకు నైవేద్యం, పేద అర్చకుల పూట గడవటం కష్టంగా మారింది. కొత్త ప్రభుత్వం వచ్చాక గౌరవ భృతి బకాయిల కోసం వేడుకుంటున్నా ఫలితం లేదు. దీంతో అర్చకులు నిరసనకు సిద్ధమయ్యారు. మంగళవారం చలో సచివాలయం కార్యక్రమం నిర్వహించడం ద్వారా తమ దీనావస్థను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని నిర్ణయించారు. ఇదీ సంగతి: ఆదాయం అంతగా లేక ఆలనాపాలన కష్టంగా మారిన దేవాలయాల్లో నిత్య పూజలకు ఉమ్మడి ఏపీలో డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ‘ధూప దీపనైవేద్య పథకం’ప్రారంభించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత దాని పరిధిలో దేవాలయాల సంఖ్యతోపాటు గౌరవ భృతి మొత్తం కూడా పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా 6000 దేవాలయాలు ప్రస్తుతం దీని పరిధిలో ఉన్నాయి. తొలుత 3500 దేవాలయాలకు మాత్రమే ఉండగా, గతేడాది గోపనపల్లిలో బ్రాహ్మణ సంక్షేమ భవన ప్రారంభోత్సవం సందర్భంగా మరో 2500 దేవాలయాలను ఇందులో చేర్చనున్నట్టు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆమేరకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ వాటిని ధూపదీప నైవేద్య పథకంలో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గౌరవ భృతి రూ.6500 ఉండగా, దానిని కూడా రూ.10 వేలకు పెంచుతున్నట్టు కేసీఆర్ అప్పడు ప్రకటించారు. కొద్దిరోజులకు ఆమేరకు కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో గౌరవ భృతి రూ.10 వేలకు పెరిగింది. అప్పటి వరకు రూ.6500 చెల్లిస్తున్న ఆలయాలకు కూడా వర్తింపజేశారు. కొన్ని నెలలు పాత దేవాలయాలకు ఆ మొత్తం చెల్లించారు. కానీ, కొత్తగా చేరిన దేవాలయాలకు మాత్రం ఇప్పటి వరకు వాటి చెల్లింపులు మొదలు కాలేదు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున తర్వాత ఇస్తారులే అనుకుంటూ అర్చకులు కాలం గడిపారు. కొత్త ప్రభుత్వం కొలువు దీరటంతో బకాయిలు సహా వాటి చెల్లింపు ఉంటుందని ఆశపడ్డారు. కానీ, వారి గోడు పట్టించుకునేవారే కరువయ్యారు. పాత దేవాలయాలకు సంబంధించి నవంబరు నుంచి బకాయిలు పేరుకుపోగా, కొత్తగా చేరిన దేవాలయాలకు ఇప్పటి వరకు అసలే చెల్లించలేదు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసి విన్నవించినట్టు ఆర్చకులు చెబుతున్నారు. దేవాదాయశాఖ కమిషనర్‌ను కలిసి అభ్యర్థించామని పేర్కొంటున్నారు. కానీ, ఆర్థిక శాఖ అధికారులు డబ్బులు విడుదల చేయటం లేదన్న సమాధానం దేవాదాయ శాఖ అధికారుల నుంచి వస్తోందన్నారు. దీంతో విషయాన్ని స్వయంగా సీఎం దృష్టికి తెస్తేనన్నా ఫలితముంటుందన్న ఉద్దేశంతో చలో సచివాలయం కార్యక్రమానికి నిర్ణయించినట్టు పేర్కొంటున్నారు. -
విప్లవాత్మక సంస్కరణలతో దేవదాయ శాఖలో సువర్ణాధ్యయం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ళ పాలనలో దేవదాయ, ధర్మాదాయ శాఖలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలు దేవదాయ శాఖలో ఒక సువర్ణాధ్యాయం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి ఛాంబరులో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గడచిన ఐదేళ్ళ జగన్మోహన్రెడ్డి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన సమర్ధవంతంగా జరిగిందని, అర్హులైన పేదలందరికీ లబ్ధి చేకూరిందని అన్నారు. ఇచ్చిన హామీలను అన్నింటిని అమలు చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శించడం బాధాకరమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక దేవాలయాలను కూల్చేయగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటిన్నంటిని పునరుద్ధరించడమే కాకుండా 4500 కొత్త ఆలయాలను నిర్మించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1600 కోట్ల వ్యయంతో ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. శ్రీశైలం దేవాలయంలో భక్తులకు సౌకర్యం కల్పించే దిశగా సాలమండపాలు నిర్మాణాలను త్వరలో ప్రారంభించనున్నామని తెలిపారు. విజయవాడలో ఇటీవల జరిగిన మహాలక్ష్మి యజ్ఞం ఫలితంగా కేంద్రం నుంచి నిధులు వరదల్లా పారాయన్నారు. 2018 వరకు 1621 దేవాలయాలకు మాత్రమే ధూపదీప నైవేధ్యాల సౌకర్యం ఉండేదని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10వేల దేవాలయాల వరకు ధూపదీప నైవేధ్యాలు జరిగేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. హిందూ ధర్మం గొప్పతనాన్ని తెలియజేసే విధంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా వార, మాసోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. అర్చక వెల్ఫేర్ బోర్డు, ఆగమ సలహామండలి, అర్చక ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేశామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఆన్లైన్ ద్వారా బుకింగ్ సౌకర్యం కల్పించే విధంగా సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఆన్లైన్ బుకింగ్ కోసం యాప్‌ను కూడా రూపొందించామన్నారు. దేవాలయాల భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునేందుకు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఎండోమెంట్ ఆస్తుల లీజు గడువు ముగిశాక ఖాళీ చేసే విధంగా ఒక చట్టాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. ఆ చట్టం ప్రకారం వారిని ఖాళీ చేసేలా చర్యలు తీసుకుంటుందన్నారు. అర్చకులు పనిచేసే దేవాలయాల పరిధిలో వారికి ఇళ్ళ స్థలాలు కేటాయించామన్నారు. అందులో భాగంగా ఇళ్ళు లేని పేద అర్చకులకు ఇళ్ళు మంజూరు చేశామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామని చెప్పారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పదోన్నతులు కల్పించడమే కాకుండా ఆలయాల నిర్మాణాలలో క్వాలిటీని పెంచేందుకు ఇంజనీర్లను నియమిస్తున్నామన్నారు. ప్రీ ఆడిట్ సిస్టంను అమల్లోకి తెచ్చింది వైసీపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయాల ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు, పదోన్నతులు కల్పించిన సందర్భాన్ని పురస్కరించుకుని పలు దేవాయాలకు చెందిన ఉద్యోగులు మంత్రి కొట్టు సత్యనారాయణకు అభినందనలు తెలిపి గజమాలతో సత్కరించారు. -
ఇక గుడి భూములకు పక్కా లెక్క!
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల భూములన్నింటి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ చేస్తోంది. ఆలయం వారీగా ఏ గ్రామంలో, ఏ సర్వే నంబరులో, ఎంతెంత భూమి ఉంది, తదితర వివరాలను పక్కాగా ఆన్లైన్లో నమోదు చేస్తోంది. దీని ద్వారా అన్ని ఆలయాల వివరాలు ఒకే చోట అందుబాటులోకి వస్తాయి. దేవదాయ శాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 24,669 వరకు ఆలయాలు, సత్రాలు, మఠాలు, ట్రస్టులు ఉన్నాయి. వీటి భూముల వివరాలు ఆలయం లేదా సంస్థల వద్ద ‘43 నెంబరు’ రిజిస్టర్ పేరుతో ఉండే ప్రత్యేక రికార్డుల్లో మాత్రమే ఉండేవి. ఇటీవల కొన్ని చోట్ల రికార్డుల్లో భూముల వివరాలను ఉండే పేజీలను ప్రత్యేకంగా స్కాన్ చేసి, వాటిని మాత్రం ఆన్లైన్లో పొందుపరిచారు. దేవదాయ శాఖ కమిషనర్ సహా అధికారులకు ఏదైనా సమాచారం కావాలంటే జిల్లా లేదా ఆలయాల ఈవో నుంచి తెప్పించుకోవాల్సి వచ్చేది. దీనివల్ల ఏళ్ల తరబడి ఆలస్యం కావడంతోపాటు పారదర్శకత లోపించి, పలు చోట్ల ఆలయాల భూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం దేవుడి భూముల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, శాఖలోని కీలక అధికారులకు ఆలయాల వారీగా భూముల వివరాలన్నీ ఒకే చోట అందుబాటులో ఉండేలా కంప్యూటరీకరణకు చర్యలు చేపట్టింది. గత నెల రోజులుగా ఈవో స్థాయిలో ఆలయాల భూముల వివరాలు ప్రత్యేక ఫార్మాట్లో అన్లైన్లో నమోదు చేశారు. మాగాణి లేదా మెట్ట లేదా కొండ ప్రాంతం లేదా ఖాళీ స్థలం లేదా చెరువు తదితర కేటగిరితో సర్వే నంబర్ల వారీగా భూముల వివరాలు ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో ఈవో స్థాయిలో నమోదు కార్యక్రమాన్ని నిలిపివేశారు. వీటిలో మార్పులు చేసే అధికారం ఇకపై ఈవోలకు ఉండదు. ఇంకా ఎక్కడన్నా ఏ ఆలయం వివరాలు ఏవైనా మిగిలిపోతే వాటిని నమోదు చేసే అవకాశం దేవదాయ శాఖ జిల్లా అధికారులకు మాత్రమే కల్పించారు. ఈ ప్రక్రియను కూడా ముగించి.. ఆగస్టు మొదటి వారంలో రికార్డులను సరిపోల్చుకునే ప్రక్రియ చేపడతారు. వారం రోజుల్లో దీనిని పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఆన్లైన్లో నమోదు చేసిన వివరాల్లో మార్పులకు వీలు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తామని అధికారులు తెలిపారు. భవిష్యత్‌లో ఆలయాల భూముల వివరాల్లో మార్పులు చేయాలంటే జిల్లా అధికారులు, ఈవోలు ముందుగా దేవదాయ శాఖ కమిషనర్‌కు స్పష్టమైన కారణాలను తెలియజేసి, ఆయన అనుమతి పొందాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. -
ఫార్మాసిటీ కోసం ఆలయ భూములా?
సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీ ఏర్పాటు కోసం వెయ్యి ఎకరాల ఆలయ భూముల సేకరణను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తప్పుబట్టింది. దేవాదాయ శాఖ భూములను సాగునీటి ప్రాజెక్టుల కోసమే సేకరించాలని గతంలోనే ద్విసభ్య ధర్మాసనం చెప్పిందని, ఇతర అవసరాల కోసం కాదని స్పష్టంచేసింది. భూ సేకరణ, రెవెన్యూ అధికారులకు సంబంధించిన అంశంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక వసతుల సంస్థ (టీఎస్ఐఐసీ) పిటిషన్ ఎలా దాఖలు చేస్తుందని ప్రశ్నించింది. ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపాల్సిన దేవాదాయ భూ సేకరణపై సింగిల్ జడ్జిని ఆశ్రయించడాన్ని తప్పుబట్టింది. రంగారెడ్డి జిల్లా నందివనపర్తి, సింగారంలో ఓంకారేశ్వర స్వామి ఆలయానికి చెందిన 1,022 ఎకరాల భూ సేకరణపై యథాతథస్థితి విధించింది. నీటి ప్రాజెక్టులకు కాకుండా ఇతర ప్రజావసరాలకు ఆలయ భూములు సేకరించవచ్చన్న నిబంధనలు ఏవైనా ఉంటే.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్ఐఐసీ ఎండీ, రెవెన్యూ–దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ ఈవోకు నోటీసులు జారీ చేసింది. తాము తదుపరి ఆదేశాలిచ్చే వరకు భూ సేకరణపై ముందుకెళ్లరాదని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 12కు వాయిదా వేసింది. దేవాదాయ భూముల సేకరణకు హైకోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో నందివనపర్తి, సింగారం పరిధిలోని ఓంకారేశ్వర స్వామి ఆలయానికి చెందిన 1,022 ఎకరాల భూముల సేకరణ కోసం టీఎస్ఐఐసీ గత నవంబర్‌లో హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. భూ సేకరణకు అనుమతి ఇస్తూ అదే నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. భూ సేకరణ చట్ట ప్రకారం భూమిని సేకరించాలని, ఆ వచ్చిన మొత్తం నగదును ఓంకారేశ్వర స్వామి ఆలయ ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు. సదరు మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని సింగిల్ జడ్జి చెప్పారు. ద్విసభ్య ధర్మాసనం అనుమతి తప్పనిసరి సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన భక్తులు మోతెకాని జంగయ్య, కుర్మిడ్డకు చెందిన దేవోజీ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి.వినోద్‌కుమార్, జస్టిస్ పుల్ల కార్తీక్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆలయ భూముల సేకరణకు ద్విసభ్య ధర్మాసనం అనుమతి తప్పనిసరి అని.. సింగిల్ జడ్జిని ఆశ్రయించి ఉత్తర్వులు పొందడం చెల్లదన్నారు. తాగు, సాగు నీటి ప్రాజెక్టులకు మాత్రమే ఆలయ భూములు సేకరించాలని గతంలో డివిజన్ బెంచ్ పేర్కొందన్నారు. భూసేకరణతో ఎలాంటి సంబంధం లేని టీఎస్ఐఐసీ పిటిషన్ ఎలా వేస్తుందని ప్రశ్నించారు. భూ సేకరణను వెంటనే నిలిపివేయాలని, సింగిల్ జడ్జి ఉత్తర్వులను ఆపాలని కోరారు. ఇతర అవసరాలకు సేకరించవచ్చు... ఇతర ప్రజావసరాలకు కూడా దేవాదాయ భూములను సేకరించవచ్చని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో దీనికి సంబంధించి పలు తీర్పులు కూడా ఉన్నాయన్నారు. అయితే వివరాలు సమర్పించడానికి కొంత సమయం కావాలని కోరారు. భూములు ఇచ్చేందుకు ఓంకారేశ్వర ఆలయ కమిటీ, దేవాదాయశాఖ అంగీకరించాయని చెప్పారు. ఇందులో ఇతరులకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదన్నారు. -
హనుమా.. భూమాయ కనుమా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రెవెన్యూ అధికారులు, పూజారి వారసులు కలిసి ఏకంగా ఆంజనేయస్వామి భూములకే ఎసరు పెట్టారు. పహాణీలు, ధరణిలోని నిషేధిత జాబితాను పక్కన పెట్టి ఏకంగా 34 ఎకరాల దేవాదాయ భూమికి ఓఆర్సీ జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం అక్కడ ఎకరం రూ.కోటి వరకు పలుకుతుండటంతో ఎలాగైనా ఈ భూములను కొట్టేయాలని పక్కాగా ప్లాన్ చేశారు. మాడ్గుల మండలం అర్కపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 88లో 9.18 ఎకరాలు, సర్వే నంబర్ 79/ఎ4లో 20 గుంటలు, సర్వే నంబర్ 283లో 11 ఎకరాలు, సర్వే నంబర్ 241లో 11.06 ఎకరాల భూమి ఆంజనేయస్వామి దేవాలయం పేరున ఉంది. ఈ భూమికి అప్పటి ఆలయ పూజారి పప్పు లక్ష్మయ్య దంపతులను రక్షిత కాపలాదారుగా నియమించి, ఆ మేరకు రికార్డుల్లో వారి పేర్లను నమోదు చేశారు. భూమి కౌలు ద్వారా వచ్చి న డబ్బులతో ధూపదీప నైవేద్యాలు సమకూర్చా ల్సి ఉంది. ఆశించినస్థాయిలో కౌలు రాక, ఆలయ నిర్వహణ భారంగా మారి పూజారి లక్ష్మయ్య దంపతులు సుమారు 40 ఏళ్ల క్రితమే ఊరు విడిచి వెళ్లారు. అప్పటి నుంచి ఆలయ నిర్వహణ బాధ్యతను గ్రామస్తులే చూసుకుంటున్నారు. పహాణీల్లోనే కాదు ధరణి పోర్టల్లోనూ ఈ భూములు ఆంజనేయస్వామి దేవాలయం పేరునే రికార్డు అయి ఉన్నాయి. గుడ్డిగా ఓఆర్సీ జారీ చేసిన రెవెన్యూ.. తాజాగా ఈ భూమి తనదేనని, ఆయా భూములను తమ పేరున మార్చాల్సిందిగా కోరుతూ ఆలయ పూజారి కుమారుడు ఫైల్ నంబర్ 6820/2022న రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆయన అడిగిందే తడవుగా రెవెన్యూ అధికారులు ఓఆర్సీ జారీ చేశారు. ఈ విషయం తెలిసి ఆలయ కమిటీ, గ్రామ పంచాయతీ సభ్యులు సహా దేవాదాయశాఖ కమిషనర్ అప్రమత్తమయ్యారు. ఈ భూమిపై లావాదేవీలతో పాటు రెవెన్యూ అధికారులు జారీ చేసిన ఓఆర్సీని సైతం నిలిపి వేయాల్సిందిగా కోరుతూ దేవాదాయశాఖ కమిషనర్ సహా గ్రామ పంచాయతీ సభ్యులు రెవెన్యూ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నేడు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఆఫీసులో విచారణ జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) తిరుపతిరా>వు ఆర్డీఓ జారీ చేసిన ఓఆర్సీని నిలిపివేయడంతో పాటు రెవెన్యూ కోర్టుకు ఈ కేసును సిఫార్సు చేశారు. శనివారం ఉదయం ఇబ్రహీంపట్నం రెవెన్యూ కోర్టులో ఈ అంశంపై ఇటు దేవాదాయశాఖ, అటు పూజారి వారసులు, ఆంజనేయస్వామి దేవాలయం కమిటీ సభ్యుల సమక్షంలో విచారణ చేపట్టాలని నిర్ణయించారు. పరిశీలించకుండానే మ్యుటేషన్! అర్కపల్లి రెవెన్యూ గ్రామానికి ఆనుకునే సర్వే నంబర్ 95/2లో సుమారు ఆరు ఎకరాల వ్యవ సాయ భూమి ఉంది. రైతు ఇప్పటికే దీనిలో కొంత భాగాన్ని స్థానికులకు గుంటల్లో విక్రయించాడు. ప్రస్తుతం ఆ భూమిలో నివాసాలు కూడా వెలిశాయి. రెవెన్యూ రికార్డుల్లో గ్రామకంఠం భూమిగా రికార్డు చేశారు. ఇప్పటికే విక్రయించ గా మిగిలిన పది గుంటల భూమిని తన పేరున మ్యుటేషన్ చేయాల్సిందిగా సదరు రైతు ఇటీవల రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా, కనీస రికార్డులను పరిశీలించకుండా ఏకంగా నివాసాలు వెలిసిన భూమిని సైతం అమ్మిన రైతు పేరున మ్యుటేషన్ చేయడం గమనార్హం. భూ రికార్డుల నిర్వహణలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి ఇదో నిదర్శనం. -
దేవాదాయ శాఖ కొత్త ప్లాన్.. గుడుల్లోకి వెండి తీసుకుని, బంగారం!
సాక్షి, హైదరాబాద్: గుడుల్లో నిరుపయోగంగా పడి ఉన్న వెండికి బదులుగా బంగారం సేకరించి డిపాజిట్ చేయాలని దేవాదాయ శాఖ యోచిస్తోంది. ప్రధాన ఆలయాల్లో ఉపయోగించకుండా ఉన్న వెండి 8 వేల కిలోలుగా లెక్క తేలింది. ఆర్జేసీ కేడర్‌లో ఉన్న యాదగిరిగుట్ట, భద్రాచలం, వేములవాడ దేవాలయాల్లోనే 4 వేల కిలోలున్నట్టు గుర్తించారు. మూల విరాట్టులు, ఉత్సవ విగ్రహాలకు అలంకరణ, పూజాధికాలకు వాడే వెండి, ఆలయ తాపడాలకు ఉన్నది కాకుండా.. భక్తులు కానుకలుగా హుండీలో వేసిన వెండిని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. కానుకలుగా వచ్చినవాటిలో ఉపయోగించుకునే వస్తువులుగా ఉన్నది పోను, మిగిలిన ముక్కలకు సంబంధించిన నిల్వలపై లెక్కలు తీశారు. మొత్తం 8 వేల కిలోలుగా ఖరారు చేశారు. ఈ వెండిని స్వచ్ఛమైన (ఫైన్ సిల్వర్) వెండిగా మార్చి, దాని విలువకు సమానమైన బంగారాన్ని పొంది, గోల్డ్ డిపాజిట్ పథకం కింద స్టేట్ బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. 80 కిలోల వెండికి కిలో బంగారం దేవాలయాల్లో ఉత్సవాల నిర్వహణకు భారీగా ఖర్చు వస్తోంది. ఇందుకు ఆలయాల నుంచి వచ్చే ఆదాయాన్నే ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, వెండిని ఆదాయంగా మార్చుకోవాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఆలయాల్లో వెండిని సేకరించి, ఆయా ఆలయాల వారీగానే దాన్ని కరిగించి బంగారంలోకి మార్పిడి చేయించబోతోంది. కనీసం వంద కిలోల వెండి ఉన్న దేవాలయాలనే ఇందుకు గుర్తించింది. 8 వేల కిలోల వెండిని 995 (అంతకంటే మెరుగైన) ఫైన్ సిల్వర్‌గా మార్చేందుకు చర్లపల్లిలోని మింట్‌తో దేవాదాయశాఖ సంప్రదింపులు జరుపుతోంది. తిరుమల తిరుపతి దేవాలయంతో మింట్‌కు ఇప్పటికే ఒప్పందం ఉంది. అదే పద్ధతిలో తమ దేవాలయాల్లోని వెండిని కూడా కరిగించి, మేలిమిగా మార్చి, దాని విలువకు తగ్గ బంగారు బిస్కెట్లను అందించాలని కోరుతోంది. ఫైన్ వెండిగా మారిస్తే మొత్తం వెండి నిల్వలో 55 శాతం నుంచి 60 శాతం మాత్రమే మేలిమి వెండి ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఆ రోజు మార్కెట్లో ఉన్న మేలిమి వెండి ధర ఆధారంగా, దానికి సమానమైన 24 క్యారెట్ల బంగారాన్ని బిస్కెట్ల రూపంలో పొందాలన్నది ఆలోచన. ఈ లెక్కన 80 కిలోల వెండికి కిలో బంగారం సమకూరే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. గోల్డ్ డిపాజిట్ పథకంతో లబ్ధి.. సమకూరిన బంగారాన్ని స్టేట్ బ్యాంకులో గోల్డ్ డిపాజిట్ పథకంలో ఉంచనున్నారు. ఇలా చేయటం వల్ల ప్రస్తుతం వెండికి చేయిస్తున్న బీమా ఖర్చు భారం తొలగిపోతుంది. ఇక స్టేట్ బ్యాంకు నుంచి వచ్చిన వడ్డీని దేవాలయాల్లో ఉత్సవాల నిర్వహణకు వినియోగిస్తారు. -
దేవుడి సేవలన్నింటికీ ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్
సాక్షి, అమరావతి: కుటుంబ సమేతంగా అన్నవరం వెళ్లి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలని అనుకుంటున్నవారు ఇంతకు ముందులా ఎక్కువగా హైరానా పడాల్సిన పనిలేదు. 10–15 రోజుల ముందే వ్రతం టికెట్‌ను ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. శ్రీశైలంలో మల్లికార్జునస్వామి దర్శనానికి వెళ్లాలనుకునే వారు నెలరోజుల ముందే ఆన్లైన్లో డబ్బులు చెల్లించి ఆలయం వద్ద దేవదాయశాఖ గదులను బుక్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో దేవదాయశాఖ పరిధిలో పలు ఆలయాల్లో వివిధ రకాల పూజలు, దర్శన టికెట్లతోపాటు ఆయా ఆలయాల వద్ద నివాసిత గదుల బుకింగ్ వంటివన్నీ ఇప్పుడు ఆన్లైన్ విధానంలోకి తీసుకొచ్చింది. పూజలు, దర్శనం టికెట్లు, వసతి గదులను ఆలయం వద్దకు వెళ్లి మాత్రమే తీసుకోవాల్సిన ఇబ్బందులు తొలిగిపోయాయి. తాము వెళ్లే తేదీని ముందే నిర్ణయించుకున్న భక్తులు ఇంటివద్ద నుంచే ముందుగానే సేవా టికెట్లను, గదులను బుక్ చేసుకోవచ్చు. తమ పరిధిలోని ప్రముఖ ఆలయాలన్నింటిలో ఈ తరహా సేవలన్నీ ఉమ్మడిగా ఒకచోట ఆన్లైన్లో పొందేందుకు దేవదాయ శాఖ కొత్తగా https://www.aptemples.ap.gov.in వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో కొన్ని ఆలయాల్లో కొన్ని రకాల సేవలకు మాత్రమే దేవదాయశాఖ ప్రత్యేక వెబ్‌పోర్టల్ నిర్వహించగా.. ఇప్పుడు మొదటి దశలో 175 ప్రముఖ ఆలయాలన్నింటిలో అన్ని రకాల సేవలను ఈ కొత్త వెబ్‌పోర్టల్ ద్వారా భక్తులు ముందస్తుగా పొందేందుకు వీలు కల్పించింది. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గగుడి, పెనుగంచిప్రోలు, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, మహానంది, విశాఖపట్నం శ్రీకనకమహాలక్ష్మి, అంతర్వేది, అరసవెల్లి, మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి, మురమళ్ల వీరేశ్వరస్వామి, వాడపల్లి వేంకటేశ్వరస్వామి, కసాపురం నెక్కింటి ఆంజనేయస్వామి.. మొత్తం 16 ఆలయాల్లో స్వామి సేవలు, దర్శన టికెట్లు, గదుల కేటాయింపు వంటివన్నీ ముందస్తుగానే ఆన్లైన్లో పొందేందుకు అందుబాటులోకి ఉంచింది. అడ్వాన్స్ బుకింగ్ గడువు వివిధ ఆలయాల్లో అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి వివిధ రకాలుగా నిర్ణయించారు. మొదటి దశలో మొత్తం 175 పెద్ద ఆలయాల్లో, తర్వాత దశలో ఓ మోస్తరు ఆలయాల్లోనూ ఈ తరహా ముందస్తు ఆన్లైన్ సేవలు ఈ వెబ్‌పోర్టల్ ద్వారానే అందుబాటులోకి తీసుకురానున్నట్లు దేవదాయశాఖ అధికారులు తెలిపారు. -
ఏపీలో దేవాలయాల భూముల పరిరక్షణకి ప్రత్యేక చర్యలు
-
ఉదయం అర్చకత్వం ఆ తర్వాత కాయకష్టం..
సాక్షి, హైదరాబాద్: అంతగా ఆదాయం లేని చిన్న దేవాలయాల నిర్వహణకు ప్రభుత్వం ప్రారంభించిన ధూపదీపనైవేద్య పథకం గందరగోళంగా మారింది. దేవాల యంలో పూజాదికాలకు కావాల్సిన వస్తువులు(పడితరం) కొనేందుకు రూ.2 వేలు, ఆలయ అర్చకుడి కుటుంబ పోషణకు రూ.4 వేలు.. వెరసి రూ.6 వేలు ప్రతినెలా చెల్లించాల్సి ఉండగా, నిధుల లేమి సాకుతో ఆ మొత్తాన్ని ఆర్థిక శాఖ విడుదల చేయటం లేదు. పెద్ద దేవాలయాల్లో పని చేస్తున్న అర్చకులకు ట్రెజరీ నుంచి వేతనాలు అందుతున్నాయి. ఆ దేవాలయం నుంచి వచ్చే ఆదాయాన్ని దేవాదాయ శాఖ తీసేసుకుంటోంది. కానీ చిన్న దేవాలయాలకు అంతగా ఆదాయం లేకపోవటంతో ధూప దీప నైవేద్య పథకం నిధులపైనే ఆధారపడాల్సి వస్తోంది. గతేడాది కొన్ని నెలల పాటు వేతనం ఇవ్వక, ఆ దేవాలయాలు, వాటి అర్చకుల కుటుంబాలను ఆగమాగం చేసి న అధికారులు ఆ తర్వాత ఎట్టకేలకు కొద్ది నెలలు సక్రమంగానే విడుదల చేశారు. మళ్లీ డిసెంబరు నుంచి నిధులు విడుదల చేయటం లేదు. నాలుగు నెలలు వరసగా ఆగిపోగా, గత నెల ఒక నెల మొత్తం విడుదల చేశారు. మిగతావి అలాగే పెండింగులో ఉన్నాయి. ఆటో తోలుతున్న ఈ వ్యక్తి పేరు పురాణం దివాకర శర్మ. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన ఈయన స్థానిక శ్రీ వైద్యనాథ స్వామి దేవాలయ అర్చకులు. ధూప దీప నైవేద్య పథకం కింద ఆయన ఈ ఆలయ పూజారిగా పనిచేస్తున్నారు. కానీ ఆ పథకం కింద ఇవ్వాల్సిన రూ.6 వేలు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. నాలుగు నెలలుగా స్తంభించిన ఆ మొత్తంలో అతి కష్టమ్మీద ఒక నెల వేతనం మాత్రమే తాజాగా విడుదలైంది. గతేడాది కూడా ఇలాగే కొన్ని నెలలు నిలిచిపోయింది. దీంతో కుటుంబ పోషణ భారం కావడంతో ఉదయం దేవాలయం మూసేసిన తర్వాత ఇదిగో ఇలా అద్దె ఆటో తీసుకుని నడుపుకొంటున్నారు. ఒక్కో సారి రాత్రి దేవాలయం మూసేసిన తర్వాత గ్రామీణులకు కోలాటంలో శిక్షణ ఇస్తూ వారిచ్చిన ఫీజు తీసుకుని రోజులు గడుపుతున్నారు. మహానేత డాక్టర్ వైఎస్ హయాంలో పథకం ప్రారంభం మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, ఆదాయం లేని దేవాలయాల్లో నిత్య పూజలకు ఆటంకం కలగొద్దన్న సదాశయంతో 2007లో ఈ పథకాన్ని ప్రారంభించారు. అప్పట్లో అర్చకులకు గౌరవ వేతనం రూ 1500, పూజా సామగ్రికి రూ.1000 చొప్పున విడుదల చేసేవారు. 1750 దేవాలయాల్లో ఈ పథకం అమలవుతుండగా, తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2018లో 3645 ఆలయాలకు విస్తరింపజేస్తూ చెల్లించే మొత్తాన్ని రూ.6 వేలకు పెంచారు. దేవాలయాల సంఖ్య, వేతన మొత్తం పెరిగినా.. నిధుల విడుదల మాత్రం సక్రమంగా లేకపోవడంతో సమస్యలు ఎదురువుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3645 దేవాలయాలకు సంబంధించి ప్రతినెలా రూ. 2,18,70000 మొత్తం విడుదల కావాల్సి ఉండగా, నిధుల సమస్య పేరుతో ఆర్థిక శాఖ ఆ మొత్తాన్ని దేవాదాయ శాఖకు అందించటం లేదు. ఎన్ని ఇబ్బందులో.. ఓ దేవాలయ నిర్వహణకు నెలకు రూ.2 వేల నిధులు ఏమాత్రం సరిపోవటం లేదు. ఇక పూజారి కుటుంబ పోషణకు రూ.4 వేలు కూడా చాలటం లేదు. అయినా సరిపుచ్చుకుందామంటే ఆ నిధులు క్రమం తప్పకుండా అందటం లేదు. ధూపదీపనైవేద్యం అర్చకుల్లో బ్రాహ్మణేతరులు కూడా ఉన్నారు. వీరు పూర్తిగా ఆలయంపై ఆధారపడుతున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయన్న పేరుతో ఆలయానికి దాతలు అడపాదడపా ఇచ్చే సాయం కూడా ప్రస్తుతం తగ్గిపోయిందనేది అర్చకుల మాట. దీంతో గత్యంతరం లేక చాలా మంది అర్చకులు ఇతర పనులు చేసుకుంటున్నారు. కొందరు ఆటో నడుపుతుంటే, మరికొందరు ఉపాధి హామీ పనులు, ఇతర కూలీ పనులకు వెళ్తున్నారు. కూలీ పనులకు వెళ్తున్నాం ‘‘నేను కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం నాగల్ గావ్ ఆలయంలో ధూపదీపనైవేద్య పథకం అర్చకునిగా పనిచేస్తున్నాను. ఆ రూపంలో రావాల్సిన గౌరవ వేతనం సరిగా రావటం లేదు. ఆ వచ్చే మొత్తం కూడా కుటుంబ పోషణకు సరిపోక నా భార్యతో కలిసి మిగతా సమయంలో ఉపాధి హామీ పథకం పనులకు, ఇతరుల పొలాల్లో పనులకు కూలీలుగా వెళ్తున్నాం.’’ – సంగాయప్ప అర్చకుడు నిధులు పెంచాలి, క్రమం తప్పకుండా ఇవ్వాలి ‘‘గ్రామాల్లో ఉన్న దేవాలయాల్లో నిత్య పూజలు చేస్తూ పూజాదికాల్లో ఉంటున్న ధూపదీపనైవేద్య పథకం అర్చకుల పరిస్థితి దారు ణంగా మారింది. ఆ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని ప్రస్తుత మార్కెట్ ధరల పట్టికను అనుసరించి పెంచాల్సి ఉంది. ఆ మొత్తాన్ని క్రమం తప్పకుండా ఇవ్వాలి’’ – వాసుదేవ శర్మ,ధూపదీపనైవేద్య పథకం అర్చకుల రాష్ట్ర అధ్యక్షులు -
శ్రీశైలం దేవస్థానానికి 4,500 ఎకరాలు ఇచ్చేందుకు రెడీ
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం దేవస్థానానికి చెందిన 4,500 ఎకరాల భూమిని అప్పగించేందుకు అటవీశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. గత 50 ఏళ్లుగా ఈ భూమికి సంబంధించిన సమస్య అటవీశాఖకు, దేవస్థానానికి మధ్య పెండింగ్‌లో ఉంది. ఇటీవల శ్రీశైల దేవస్థానానికి చెందిన భూముల వివరాలు పురాతన శాసనం ద్వారా వెలుగులోకి వచ్చాయి. దాని ఆధారంగా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి అటవీశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతోపాటు ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆ వెంటనే అటవీ, దేవదాయ, రెవెన్యూ శాఖల అధికారులు ఉమ్మడిగా అత్యంత ఆ«ధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సర్వే చేయించారు. వారు ఆ 4,500 ఎకరాల భూమి శ్రీశైలం దేవస్థానానికి చెందినదేనని ధ్రువీకరించారు. దీంతో రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆ భూమిని దేవస్థానానికి అప్పగించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ కేంద్ర కార్యాలయంలో శ్రీశైలం దేవస్థానం ఈవో ఎస్.లవన్న, అటవీశాఖ డిప్యుటీ డైరెక్టర్ అలెన్‌చాంగ్‌టెరాన్ ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. ఆ కాపీని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వై.మధుసూదన్‌రెడ్డి, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వై.శ్రీనివాసరెడ్డిలకు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవదాయ శాఖకు భూమిని అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. త్వరలోనే కేంద్రం నుంచి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని, ఆ వెంటనే దేవదాయ శాఖకు భూమిని అప్పగిస్తామని అలెన్‌చాంగ్‌టెరాన్ తెలిపారు. -
ఆలయాల బోర్డుల్లో నాయీ బ్రాహ్మణులు..
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల ట్రస్టు బోర్డు సభ్యుల నియామకాల్లో నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒకరికి తప్పనిసరిగా స్థానం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ద్వారా ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసింది. అనాదిగా ఆలయాల వ్యవస్థలో అర్చకులతో పాటు నాయీ బ్రాహ్మణులకు విడదీయరాని బంధం ఉందని దేవదాయ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఆలయాల్లో భజంత్రీలుగా, క్షురకులుగా, ప్రత్యేక ఉత్సవాల సమయంలో స్వామి వారి ఊరేగింపు పల్లకీ సేవల్లో నాయీ బ్రాహ్మణులు పాలు పంచుకుంటున్నారని గుర్తు చేస్తున్నారు. ఆలయాల్లో పలు కార్యక్రమాల్లో సేవలందించే తమకు పాలక వర్గాల్లో చోటు కల్పించాలని నాయీ బ్రాహ్మణులు చాలా ఏళ్లుగా కోరుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన పాదయాత్ర సమయంలో దీనిపై సానుకూల హామీ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ నిర్వహించిన బీసీ గర్జన సభలలోనూ దీనిపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఇప్పుడు ఆ హామీని నెరవేరుస్తూ దేవదాయ శాఖ చట్టానికి సవరణ తెచ్చి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. 610 ఆలయాలకు త్వరలో నియామకం! హైకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు ప్రకారం దేవదాయ శాఖ పరిధిలో ఐదు లక్షలకు పైబడి ఆదాయం సమకూరే ఆలయాల్లో మాత్రమే దేవదాయ శాఖ ట్రస్టు బోర్డులను నియమించే అవకాశం ఉంది. రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలో ఏడాదికి రూ.ఐదు లక్షల పైబడి వార్షికాదాయం ఉన్న ఆలయాలు 1,234 వరకు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ట్రస్టు బోర్డు నియామకాలు పూర్తైన వాటిని మినహాయిస్తే మరో 610 ఆలయాలకు కొద్ది రోజుల్లో కొత్తగా ట్రస్టు బోర్డులను నియమించేందుకు కసరత్తు జరుగుతోంది. వీటిల్లో ప్రతి ఆలయానికి ఒకరి చొప్పున నాయీ బ్రాహ్మణులకు ట్రస్టు బోర్డులో స్థానం కల్పించే అవకాశం ఉంది. నాడు అవమానం.. నేడు సముచిత స్థానం ఆలయాల ట్రస్టు బోర్డు నియామకాల్లో తమకు చోటు కల్పిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడంపై నాయీ బ్రాహ్మణ సంఘాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ హయాంలో తాము అవమానాలు ఎదుర్కొనగా ఇప్పుడు సముచితం స్థానం దక్కిందని ఆయా సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఆలయాల నిర్వహణలో తమకు తగిన స్థానం కల్పించాలని కోరిన నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులను అధికారంలో ఉండగా చంద్రబాబు తీవ్రంగా అవమానించారని గుర్తు చేస్తున్నారు. నాడు సచివాలయంలో తనను కలసి సమస్యలు వినిపించిన సంఘాల నేతలనుద్దేశించి ‘తోకలు కత్తిరిస్తా.. ఆలయాల మెట్లు కూడా ఎక్కకుండా చేస్తా’ అంటూ చంద్రబాబు తీవ్ర స్వరంతో హెచ్చరించారు. దేశ చరిత్రలోనే అరుదు దేశ చరిత్రలో నాయీ బ్రాహ్మణులకు అరుదైన గౌరవం దక్కింది. మా వినతిని ఆలకించి ఆర్డినెన్స్ జారీ చేసిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాయీ బ్రాహ్మణుల ఆత్మ గౌరవాన్ని మరో మెట్టు ఎక్కించింది. సీఎం జగన్‌కు నాయీ బ్రాహ్మణ జాతి రుణపడి ఉంటుంది. – సిద్దవటం యానాదయ్య (ఏపీ నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్), గుంటుపల్లి రామదాసు (కేశ ఖండనశాల నాయీ బ్రాహ్మణ జేఏసీ అధ్యక్షుడు) -
మహాశివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: మహాశివరాత్రి నేపథ్యంలో ప్రముఖ శైవ క్షేత్రాలన్నింటిలో దేవదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కోటప్పకొండ, మహానంది ఆలయాలకు దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న నలుగురు అడిషనల్, రీజనల్ జాయింట్ కమిషనర్ స్థాయి అధికారులను ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్కరిని చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్లుగా నియమిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అడిషనల్ కమిషనర్ –1 చంద్రకుమార్‌ను కోటప్పకొండ ఆలయానికి, అడిషనల్ కమిషనర్ –2 రామచంద్రమోహన్ శ్రీకాళహస్తి ఆలయానికి, ఎస్టేట్స్ విభాగం జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్‌ను శ్రీశైల ఆలయానికి, కర్నూలు డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న రాణా ప్రతాప్‌ను మహానంది ఆలయానికి చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్లుగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. రాష్ట్రంలోని మిగిలిన శైవక్షేత్రాలకు సంబంధించి ఆర్జేసీలు ఆయా ఆలయాల వారీగా తమ పరిధిలోని సీనియర్ అధికారులను చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్లుగా నియమించాలని పేర్కొన్నారు. -
మన్నించు తల్లీ..
రోజుకు వెయ్యి నుంచి 2 వేల మంది వరకు భక్తులు దర్శించుకుంటారు. ఆదివారమైతే ఆ సంఖ్య 15 వేల నుంచి 20 వేల వరకు ఉంటుంది. ఏటా రూ.3 కోట్లకుపైగానే ఆదాయం వస్తుంది. కానీ భక్తులకు సౌకర్యాలు ఉండవు. రెగ్యులర్ ఈఓను నియమించరు. ప్రస్తుతం పాలకవర్గం కూడా లేదు. వెరసి పెద్దమ్మతల్లి అమ్మవారి వద్దకు వచ్చే భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. సాక్షి, పాల్వంచరూరల్: భక్తుల కొంగుబంగారమైన పెద్దమ్మతల్లి (శ్రీకనకదుర్గ) ఆలయంపై దేవాదాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రెగ్యులర్ ఈఓను నియమించకపోవడంతో ఇన్చార్జీల పాలనలో కాలం గడుస్తోంది. ఇటీవల కొంతకాలంగా పాలకవర్గం కూడా లేదు. భక్తులకు సరైన సౌకర్యాలు కూడా అందుబాటులో లేవు. రోజూ వేల సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునే భక్తులు సౌకర్యాల లేమిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏటా రూ.3 కోట్ల ఆదాయం ఉన్నా.. జిల్లాలో భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయం తర్వాత అధిక ఆదాయం కలిగిన ఆలయంగా పెద్దమ్మ తల్లి గుడి పేరొందింది. భక్తులకు అమ్మే టికెట్లు, కొబ్బరిచిప్పలు, అద్దెలు, తలనీలాలు, హుండీ ద్వారా ఏటా దేవాదాయ శాఖకు సుమారు రూ.3 కోట్లకు పైగా ఆదాయం లభిస్తుంది. ఇంత ఆదాయం ఉన్నా దేవాదాయ శాఖ, పాలకవర్గాలు భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలేదు. ఆలయం ప్రాంగణంలో మహిళా భక్తులు స్నానాలు చేసేందుకు గతంలో నిర్మించిన ఆరు బాత్రూమ్లను కూల్చివేశారు. దీంతో భక్తులకు స్నానాల గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు అందుబాటులోలేక ఇక్కట్లు పడుతున్నారు. గుడికి ఎదురుగా రోడ్డు దాటివెళ్తే ఐటీడీఏ నిర్మించిన పది బాత్ రూమ్‌లు ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయో కూడా భక్తులకు అర్థం కాదు. ఆచూకీ దొరకబట్టి అక్కడకు వెళ్లినా.. ఆదివారం భక్తుల సంఖ్య 15 వేలకు మించుతుండటంతో పది బాత్ రూమ్‌లు సరిపోవడం లేదు. అమ్మవారి సన్నిధిలో కనీసం తాగునీరు కూడా దొరకదు. దుకాణాల్లో కొనుగోలు చేసి తాగాలి్సందే. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఒకే క్యూలైన్ ఉండటంతో ఇబ్బందులు తప్పడంలేదు. గతంలో ఆలయానికి ఎదురుగా చెట్ల కింద నైవేద్యం వండుకునేవారు. వంటవార్పు చేసుకునేవారు. ఇప్పుడా చెట్లు నరికించి భవన నిర్మాణం చేపట్టారు. దీంతో భక్తులు నైవేద్యం వండుకునేందుకు కూడా ఇబ్బందులు తప్పడంలేదు. భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా దేవాదాయ శాఖ మౌలిక సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 22 మందిలో ఐదుగురే రెగ్యులర్ ఈఓలు ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చాక 22 మంది ఈఓలుగా పనిచేశారు. ఇందులో ఐదుగురే రెగ్యులర్ ఈఓలు. మిగిలిన 17 మంది ఇన్చారీ్జలే. ప్రస్తుత ఈఓ కూడా ఇన్చార్జే. ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి దేవాలయం ఈఓకు పెద్దమ్మగుడి ఈఓగా గత నవంబర్ నుంచి అదనపు బాధ్యతలు అప్పగించారు. కొద్దిరోజులు పాలకుర్తి ఆలయంలో, మరి కొన్ని రోజులు పెద్దమ్మగుడి వద్ద విధులు నిర్వర్తించాల్సి రావడంతో ఆలయ, పూజాది కార్యక్రమాల పర్యవేక్షణ కరువైంది. ఇన్చార్జి ఈఓల కారణంగానే ఆలయంలో అవినితి ఆరోపణలు రావడంతో గత నెలలో విచారణ కూడా నిర్వహించారు. పాలకవర్గ పదవీకాలం కూడా గత అక్టోబర్ 9వ తేదీతో ముగిసింది. నెల రోజుల క్రితం నూతన పాలకవర్గం కోసం నోటిఫికేషన్ జారీచేసినా ఇంతరవకు నియామకం జరగలేదు. దీంతో ఆలయం అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇప్పటికైనా దేవాదాయ శాఖ స్పందించి భక్తులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని, రెగ్యులర్ ఈఓను, నూతన పాలకవర్గాన్ని నియమించాలని భక్తులు కోరుతున్నారు. కోరిన కోరికలు తీర్చే తల్లి.. పాల్వంచ మండలం కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) అమ్మవారు కొలువై ఉన్నారు. ఇక్కడికి జిల్లాతోపాటు పొరుగు రాష్ట్రాలైన ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. రోజూ వెయ్యి నుంచి 2 వేల మంది వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. గురు, ఆదివారాల్లో రద్దీ మరింతగా ఉంటుంది. ప్రతి గురువారం 5 వేల నుంచి 10 వేల లోపు, ప్రతి ఆదివారం 15 వేల నుంచి 20 వేల లోపు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని దేవాదాయ శాఖ అధికారులే చెబుతున్నారు. (చదవండి: జనవరి 18న బీఆర్ఎస్ భేరీ ) -
గుళ్లలోని క్షురకులకు రూ.20 వేల కనీస ఆదాయం
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలో ఉన్న ప్రధాన ఆలయాల్లోని కేశఖండనశాలల్లో క్షురకులుగా పనిచేసే వారికి ప్రతి నెలా కనీసం రూ.20 వేలు ఆదాయం వచ్చేలా చర్యలు చేపడుతున్నట్టు ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ధార్మిక పరిషత్ తొలి సమావేశం సోమవారం ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగింది. అనంతరం సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రధాన ఆలయాల్లోని క్షురకులు ప్రస్తుతం టికెట్ల ఆధారంగా ప్రతి నెలా ఆదాయం పొందుతున్నారని చెప్పారు. వాళ్లకు నెలకు రూ.20 వేల కంటే తక్కువ ఆదాయం దక్కే సమయంలో.. ఆయా ఆలయాల్లోని వెల్ఫేర్ ట్రస్టు ద్వారా మిగిలిన మొత్తాన్ని ఇప్పించాలని సీఎం వైఎస్ జగన్ తమకు సూచించారని పేర్కొన్నారు. రూ.20 వేల కంటే ఎక్కువ ఆదాయం వస్తే.. వారికే ఆ మొత్తం చెందుతుందన్నారు. తక్కువ వచ్చినప్పుడు మాత్రమే ఆ మొత్తాన్ని అదనంగా అందజేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. సమావేశంలో హథీరాంజీ, బ్రహ్మంగారి మఠం,అహోబిలం, గాలి గోపురం, బ్రహ్మానంద మఠాలకు సంబంధించిన పాలనపరమైన అంశాలపైనా చర్చించినట్టు చెప్పారు. బెజవాడ దుర్గ గుడిలో అంతరాలయ దర్శన టికెట్ ధర ఎప్పటి నుంచో రూ.500గానే ఉందన్నారు. -
ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్ టికెట్లు
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలో ఉన్న 11 ప్రధాన ఆలయాల్లో ఈ నెల 20వ తేదీ నుంచి దర్శనం టికెట్లను పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఇవ్వనున్నట్లు ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఆలయాల వద్ద గదుల కేటాయింపు వంటి వాటిని కూడా ఆన్లైన్ పరిధిలోకి తెస్తామన్నారు. మంత్రి మంగళవారం విజయవాడలో దేవదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ గుడి, పెనుగ్రంచిపోలు, ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, విశాఖపట్నం కనకమహాలక్ష్మి ఆలయం, వాడపల్లి, ఐనవల్లి ఆలయాల్లో ఆన్లైన్ టికెట్ విధానం తప్పనిసరి చేస్తున్నట్లు చెప్పారు. భక్తులు అడ్వాన్స్‌గా నిర్ణీత తేదీకి ఆన్లైన్ దర్శన టికెట్లు, గదులు బుకింగ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. రద్దీ అధికంగా ఉండే మరో 12 ఆలయాల్లోనూ ఆన్లైన్ విధానం అమలుపై చర్చిస్తున్నట్లు వివరించారు. వారం వారం సమీక్ష ఇకపై ప్రతి బుధవారం దేవదాయశాఖ సమీక్ష సమావేశం నిర్వహించి, ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనతో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఉద్యోగుల పదోన్నతులకు అడ్డుగా ఉన్న కోర్టు కేసుల ఉపసంహరణకు ఉద్యోగ సంఘాల నేతలు ముందుకొచ్చారని, ఆ ప్రక్రియ ముగిసిన వెంటనే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పదోన్నతులు కల్పిస్తామని చెప్పారు. దేవదాయ శాఖ ట్రిబ్యునల్‌లో సిబ్బంది నియామకాలను చేపట్టినట్లు వివరించారు. కొత్తగా ఏర్పాటైన ధార్మిక పరిషత్ తొలి సమావేశం అక్టోబరు 10న నిర్వహించనున్నట్లు చెప్పారు. దసరా ఉత్సవాల్లో వీఐపీలకూ టైం స్లాట్ దర్శనాలు దసరా ఉత్సవాల్లో విజయవాడ కనకదుర్గ గుడిలో వీఐపీలకు కూడా టైం స్లాట్ ప్రకారమే దర్శనాలు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. వీఐపీలు కూడా టికెట్ కొనాలని చెప్పారు. రోజుకు ఐదు ప్రత్యేక టైం స్లాట్లు ఉంటాయన్నారు. రెండేసి గంటలు ఉండే ఒక్కొక్క టైం స్లాట్‌లో రెండు వేల వీఐపీ టికెట్లను ఇస్తామన్నారు. అందులో 600 టికెట్లు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలు ఉన్నవారికి కేటాయించి, మిగిలినవి అందరికీ ఇస్తామన్నారు. ఒక లేఖకు ఆరు టికెట్లు ఇస్తామన్నారు. సిఫార్సు లేఖలు, ఇతర వీఐపీ టికెట్ల బుకింగ్‌కు విజయవాడ కలెక్టర్ ఆఫీసులో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు వంటి ప్రివిలేజ్డ్ వీఐపీలు, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఉదయం, సాయంత్రం వేళల్లో అర్ధ గంట చొప్పున ఉచిత దర్శనం ఉంటుందని తెలిపారు. సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటామన్నారు. దుర్గ గుడి ఘాట్ రోడ్డును పూర్తిగా క్యూలైన్లకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఉచిత దర్శనానికి మూడు లైన్లు, రూ.300 టికెట్ వారికి ఒకటి, రూ.100 టికెట్ వారికి మరొక క్యూ ఉంటాయని చెప్పారు. వికలాంగులు, వృద్ధులకు రోజూ ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ఒకసారి, సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య మరోసారి ప్రత్యేక దర్శనాలు ఉంటాయని వివరించారు. మంత్రులకూ అంతరాలయ దర్శనం ఉండదు దసరా ఉత్సవాల సమయంలో దుర్గగుడిలో అంతరాలయ దర్శనం గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వంటి ప్రముఖులకు మాత్రమే ఉంటుందని తెలిపారు. మంత్రులకు సైతం బయట నుంచే దర్శనాలు కల్పించాలని ఆలోచన చేస్తున్నామని వివరించారు. దసరా ఉత్సవాల తర్వాత దుర్గగుడిలో అంతరాలయ దర్శనానికి రూ. 500 టికెట్ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. -
చవితి మండపాలకు ఫీజులు వసూలు చేయట్లేదు
సాక్షి, అమరావతి: వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసుకునే గణేష్ మండపాలకు రుసుములు (ఫీజులు) వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఇలాంటి వాటిని ప్రజలెవరూ నమ్మవద్దని దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండపాల ఏర్పాటుకు ఎటువంటి రుసుములు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. భద్రతా కారణాల నేపథ్యంలో మండపాల ఏర్పాటుకు స్థానిక పోలీసు.. రెవెన్యూ అధికారులను సంప్రదించాలన్నారు. చట్టపరంగా తీసుకోవాల్సిన అనుమతులు ఏవైనా ఉంటే రెవెన్యూ, పోలీస్ శాఖను సంప్రదించి తీసుకోవాలని కోరారు. అలాంటివి మినహాయించి ఏ రకమైన రుసుములు గానీ, చందాలు గానీ తీసుకున్నా లేక ప్రేరేపించబడినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫీజులు వసూలు చేస్తున్నారని తప్పుగా ప్రచారం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటువంటి అబద్ధపు నిరాధార ప్రచారాన్ని ప్రజలు, భక్తులు నమ్మవద్దని కోరారు. ఎక్కడైనా మండపాలకు ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
ఆదాయంలేని గుళ్లకు ‘ధూప దీప నైవేద్యం’
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో అతి తక్కువ ఆదాయం ఉండే ఆలయాల్లో సైతం స్వామివారికి నిత్యం నైవేద్య కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా.. ఈ నెలలో కొత్తగా 2,200 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకాన్ని (డీడీఎన్ఎస్) మంజూరు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. సచివాలయంలో మంగళవారం ఆయన తన శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కమిషనర్ హరిజవహర్‌లాల్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ పథకం కింద ఎంపిక చేసిన ఆలయాలకు నిత్య నైవేద్య ఖర్చులకుగాను నెలనెలా రూ.5 వేల చొప్పున దేవదాయ శాఖ నుంచి ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం అర్హత ఉన్న దేవాలయాలకు పరిమితి లేకుండా సంతృప్త స్థాయిలో డీడీఎన్‌ఎస్‌ను అమలుచేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని.. అందుకనుగుణంగా అర్హత ఉంటే ప్రతి గ్రామంలోను కనీసం ఒక దేవాలయాన్ని అయినా ఈ పథకం కిందకు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యనారాయణ తెలిపారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే దాదాపు 1,500 ఆలయాలకు ఆర్థిక సహాయం అందజేస్తున్నామని, మరో 3,500 దాకా వినతులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పెండింగ్‌లో ఉన్న వాటికి సంబంధించిన వినతులను జిల్లా దేవదాయ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారని.. ఇప్పటివరకు 2,346 దరఖాస్తుల పరిశీలన పూర్తయిందన్నారు. వీటిలో 2,200 ఆలయాలకు ఈ పథకం మంజూరు చేసేందుకు అర్హత ఉందన్నారు. ఇక డీడీఎన్ఎస్ పథకం ద్వారా ఆలయాలకు ప్రతినెలా ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచే దానిపై సీఎంతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని విలేకరుల ప్రశ్నకు మంత్రి కొట్టు సత్యనారాయణ బదులిచ్చారు. అమీన్లు కేటాయించాలని హైకోర్టును కోరుతాం ఇక దేవదాయ శాఖ భూముల ఆక్రమణలకు సంబంధించి ఎండోమెంట్ ట్రిబ్యునల్‌లో ప్రస్తుతం 4,708 కేసులు ఎప్పటినుంచో అపరిష్కృతంగా ఉన్నాయని.. అందులో 722 కేసులు పరిష్కారమయ్యాయని ఆయన చెప్పారు. కొన్నిచోట్ల దేవదాయ శాఖ సిబ్బంది ఆక్రమణలో ఉన్న భూములను స్వాధీనం చేసుకున్నప్పటికీ, మరికొన్నిచోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. ఇలాంటి చోట్ల ఆక్రమణలో ఉన్న భూములను స్వాధీనం చేసుకునేందుకు వీలుగా ఎనిమిది మంది అమీన్లను ప్రత్యేకంగా దేవదాయ శాఖకు కేటాయించేందుకు హైకోర్టును కోరాలని నిర్ణయించామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఇక ఎండోమెంట్ ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందిస్తామన్నారు. మాన్యం భూముల హక్కుదారు స్వామివారే.. దేవుడి మాన్యాలపై అసలు హక్కుదారుడు దేవుడేనని.. అందులో ఫలసాయం తీసుకోవడం వరకు మాత్రమే వాటిని పొందిన వారికి హక్కు ఉంటుందని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టంచేశారు. దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, సత్రాల పేరిట 4.09 లక్షల ఎకరాలు భూములున్నట్లు గుర్తించామని, వాటిలో ఆక్రమణలో ఉన్న వాటి వివరాలను సేకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే, టీటీడీ తరహాలో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఆన్లైన్ ద్వారా అన్నిరకాల సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా శ్రీశైలంలో అమలుచేస్తున్నామన్నారు. ఇక 21 మంది సభ్యులతో పూర్తిస్థాయిలో ధార్మిక పరిషత్‌ను ప్రభుత్వం ఏర్పాటుచేసిందని.. అవినీతికి, అక్రమాలకు పాల్పడే మఠాధిపతులపై చర్యలు తీసుకునే అధికారం, వారి స్థానంలో మరొకరిని నియమించే అధికారం ఈ ధార్మిక పరిషత్‌కు ఉందన్నారు. ఆస్తులను 11 సంవత్సరాలకు పైబడి లీజును విస్తరించే అధికారం కూడా ఈ పరిషత్‌కే ఉందని మంత్రి చెప్పారు. ప్రభుత్వంపై ప్రజల సంతృప్తికి ఆ సర్వేనే సాక్ష్యం దేవుడిపై విపరీతమైన నమ్మకంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఉంటారని, సంక్షేమ పథకాలు అమలుచేయడంలో ఆయనకు దేవుడి ఆశీస్సులు కూడా ఉన్నాయన్నారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారన్న దానికి ఇటీవల ఓ ఆంగ్ల చానల్ నిర్వహించిన సర్వే ఫలితాలే సాక్ష్యమని కొట్టు సత్యనారాయణ చెప్పారు. చదవండి: పరిశ్రమలకు ప్రోత్సాహంలో ముందెన్నడూ చూపనంత చొరవ -
మరిన్ని గుడులకు ‘గుడ్ ఫండ్’!
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) పథకం ద్వారా మూడేళ్లలో 547 పురాతన, శిధిలావస్థకు చేరిన ఆలయాల పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం సోమవారం మరికొన్నింటికి అనుమతి ఇవ్వనుంది. ఈమేరకు ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అధ్యక్షతన సచివాలయంలో ప్రత్యేక సమావేశం జరగనుంది. దేవదాయ శాఖ మంత్రి చైర్మన్‌గా, ముఖ్య కార్యదర్శి, కమిషనర్లతో పాటు టీటీడీ ఈవో సభ్యులుగా కొనసాగే కామన్ గుడ్ ఫండ్ కమిటీ ఆలయాల పునఃనిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 4వతేదీన నాడు దేవదాయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రూ.31.40 కోట్లతో 60 ఆలయాల పునఃనిర్మాణానికి అనుమతి తెలిపారు. ప్రస్తుతం దేవదాయ శాఖ వద్ద సుమారు 160 ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. సీజీఎఫ్‌కు నిధులు పెంచుతూ చట్టం ఆదాయం లేని పురాతన, శిధిలావస్థకు చేరుకున్న ఆలయాల పునఃనిర్మాణం కోసం వినియోగించే కామన్‌గుడ్ ఫండ్‌కు ఏడాది కిత్రం వరకు టీటీడీ తన వాటాగా ఏటా రూ. 1.25 కోట్లు ఇవ్వగా శ్రీశైలం, విజయవాడ దుర్గగుడి సహా దేవదాయ శాఖ పరిధిలో ఉండే ఇతర పెద్ద ఆలయాల నుంచి అధిక మొత్తంలో నిధులు అందేవి. ఈ నేపథ్యంలో టీటీడీ ఏటా రూ.40 కోట్లు చొప్పున కామన్‌గుడ్ ఫండ్‌కు కేటాయించేలా గతేడాది ప్రభుత్వం చట్టం తెచ్చింది. ఈ నేపథ్యంలో కామన్‌గుడ్ ఫండ్ కింద రూ.130 కోట్లు దాకా నిధులు సమకూరనున్నాయి. -
అన్యాక్రాంతమైన ఆలయ భూములపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి/తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో అన్యాక్రాంతమైన దేవదాయశాఖకు చెందిన భూములను తిరిగి రాబట్టే విషయంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని డిప్యూటీ సీఎం, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. జిల్లాల పునర్విభజన అనంతర పరిస్థితులపై అన్ని జిల్లాల దేవదాయ శాఖ అధికారులకు బుధవారం తాడేపల్లిలోని దేవదాయ శాఖ ట్రైనింగ్ కేంద్రంలో ఒక్క రోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. దేవదాయ శాఖకు రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల ఎకరాలకు పైగా భూములున్నాయని, వాటిలో 1.05 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు చెప్పారు. ఈ భూములకు సంబంధించి మూడు వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఆ కేసుల విషయంలో ఆక్రమణదారులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఎప్పటికప్పుడు తగిన సమాచారాన్ని కోర్టుల ముందుంచాలన్నారు. భూముల విషయంలో కోర్టు కేసుల ప్రగతి ఎలా ఉందనే విషయంపై ప్రతి మూడు నెలలకోసారి, రాష్ట్రంలో ఆలయాల పరిస్థితిపై ప్రతి శుక్రవారం సమీక్ష నిర్వహిస్తామని మంత్రి వివరించారు. భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉండే దేవదాయ శాఖపై లేని పోని అబద్ధాలతో బురదజల్లేందుకు ప్రతిపక్షాలు కాచుకుకూర్చున్నాయని, ఏ చిన్న పొరపాట్లకూ తావివ్వకుండా బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. ప్రస్తుత వేసవిలో భక్తులు ఇబ్బంది పడకుండా క్యూలైన్లలో నీడ ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, కమిషనర్ హరిజవహర్‌లాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ల రూపకల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి ఆలయానికి ఆ ఆలయ సంప్రదాయాలు పాటిస్తూ.. భక్తులకు సౌకర్యాలు, అభివృద్ధి పనులు చేపట్టేలా మాస్టర్ ప్లాన్ ఉంటుంది. వచ్చే 40 ఏళ్ల అవసరాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్‌కు రూపకల్పన చేయనున్నారు. తొలి దశలో దేవదాయ శాఖ పరిధిలోని 8 ప్రధాన ఆలయాలతో సహా 25 దేవాలయాలకు మాస్టర్‌ప్లాన్ రూపొందించనున్నారు. వీటిలో మహానంది, కసాపురం, అహోబిలం, యెక్కంటి వంటి ఆలయాలు ఉన్నాయి. ఇందుకు ఉత్తర భారత దేశంలో, తమిళనాడులో పలు పురాతన, ప్రఖ్యాత ఆలయాలకు ఇప్పటికే మాస్టర్ ప్లాన్లను రూపొందించిన రెండు ప్రముఖ అర్కిటెక్చర్ సంస్థలను దేవదాయ శాఖ ఎంప్యానల్ చేసింది. ఈ సంస్థల ప్రతినిధులతో వారం క్రితం దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్‌లాల్‌లు వీడియో సమావేశం నిర్వహించి, ఆలయాల వారీగా మాస్టర్ ప్లాన్ల రూపకల్పనపై చర్చించారు. ఆలయాల్లోని సంప్రదాయాలు, ప్రస్తుతం ఉన్న ప్రధాన గర్భాలయాల రూపం మారకుండా మాస్టర్ ప్లాన్లు ఉంటాయని దేవదాయశాఖ అధికార వర్గాలు తెలిపాయి. ఆలయం ప్రాంగణంలో, చుట్టుప్రక్కల ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమమైనా మాస్టర్ ప్లాన్ ప్రకారమే చేపడతారని చెప్పారు. సాయంత్రం వేళ ప్రాచీన సంప్రదాయ కళా ప్రదర్శనలు, ఇతర ఆరాధన కార్యక్రమాలకు వేదికల నిర్మాణం వంటి వాటికి ప్రాధన్యత ఉంటుందని తెలిపారు. ఇటీవలి కాలంలో కుటుంబ సమేతంగా కార్లలో ఆలయాలకు వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆలయం పరిసరాలను అవకాశం ఉన్న మేరకు విశాలమైన పార్కింగ్ ఏరియా, ఆహ్లదకరమైన పూల వనాలు వంటి వాటికి మాస్టర్ ప్లాన్‌లో చోటు కల్పిస్తామన్నారు. -
రోజుకు 25 వేల మందికి అయ్యప్ప దర్శనం
సాక్షి, అమరావతి: ఈ ఏడాది ప్రతి రోజూ గరిష్టంగా 25 వేల మంది అయ్యప్ప భక్తులు శబరిమలను దర్శించుకోవచ్చని కేరళ ప్రభుత్వం తెలిపింది. కరోనా ఉధృతి కారణంగా గత ఏడాది రోజుకు కేవలం వెయ్యి మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించారు. ఈ ఏడాది కరోనా ఉధృతిలో తగ్గుదల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. శబరిమల దర్శనాలకు సంబంధించి దక్షిణాది ఐదు రాష్ట్రాల అధికారులతో కేరళ ప్రభుత్వ అధికారులు మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్‌లాల్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కరోనా ఉధృతి చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది ఎక్కువ మంది భక్తులకు అనుమతిస్తున్నట్టు కేరళ ప్రభుత్వం తెలిపింది. అయితే, భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రం నుంచి శబరిమల యాత్రకు వచ్చే భక్తులకు తెలిసేలా విస్త్రత ప్రచారం కల్పించాలని కేరళ ప్రభుత్వం కోరింది. శబరిమల యాత్రికులకు కేరళ ప్రభుత్వం సూచనలు: ► శబరిమల దర్శనానికి వచ్చే భక్తులు ముందస్తుగా కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఆన్లైన్ పోర్టల్‌లో తప్పనిసరిగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ► రెండు డోసుల కరోనా టీకా పూర్తయినట్లు ధృవీకరణ పత్రం వెంట తీసుకురావాలి. లేదా దర్శనానికి 72 గంటల ముందుగా పరీక్ష చేయించుకుని, కోవిడ్ నెగిటివ్ ధృవీకరణ పత్రాన్ని వెంట తెచ్చుకోవాలి. ► శబరిమల ఆలయ పరిసరాలలో ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులనూ అనుమతించరు. ► పంబా నదిలో స్నానాలపై ఆంక్షలు ఈ ఏడాది కూడా కొనసాగుతాయి. నదీ స్నానాలకు బదులు కేవలం నది వెంబడి షవర్ స్నానాలకు మాత్రమే అనుమతి ఉంటుంది.