Enumerators
-
సర్వేకు వెళ్లిన ఎన్యూమరేటర్లపై దాడులు
నగరంలోని పంజాగుట్టలో కుటుంబ ఆర్థిక గణన సర్వే కోసం ఇంటికి వచ్చి వివరాలు అడిగిన ఎన్యూమరేటర్‌కు సమాచారం అందించేందుకు నిరాకరించడంతో పాటు దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇలాంటి ఘటనలు మాస్ ఏరియాలో కాకుండా క్లాస్ ఏరియాలో ఎదురు కావడం విస్మయానికి గురిచేస్తోంది. సాక్షి, హైదరాబాద్: నగరంలో కుటుంబ ఆర్థిక గణన సర్వేకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. వివరాలు అందించేందుకు కొందరు సవాలక్ష సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు దాడులకు సైతం పాల్పడుతున్నారు. జాతీయ ఆర్థికాభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతులను అంచనా వేసేందుకు నగరంలో ఏడో ఆర్థిక గణన సర్వే మూణ్నెల్లుగా కొనసాగుతోంది. ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ద్వారా సర్వే చేస్తున్నారు. దీని ద్వారా దారిద్యరేఖకు దిగువ, ఎగువ కుటుంబాల తలసరి ఆదాయాల లెక్క తేలనుంది. 11.4 లక్షల కుటుంబాల సర్వే పూర్తి.. ⇔ నగరంలో ఇప్పటి వరకు సుమారు 11.4 లక్షల కుటుంబాల గణన పూర్తయ్యింది. అందులో 10,28,462 నివాస గృహాలు, 64,694 వాణిజ్య దుకాణాలు, 10,917 ఇతరత్రా సముదాయాల సర్వే పూర్తయినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ⇔ హైదరాబాద్ జిల్లా పరిధిలో సుమారు 15 లక్షల కుటుంబాలు ఉన్నట్లు ప్రాథమిక అంచనా వేసిన అధికారులు ఆర్థిక గణన సర్వే కోసం సుమారు 1,394 ఎన్యూమరేటర్లను రంగంలోకి దింపారు. 196 మంది సూపర్వైజర్లు పర్యవేక్షిస్తున్నారు. నగరంలో మొత్తం 266 యూనిట్లుగా విభజించగా ఇప్పటి వరకు 134 యూనిట్లు పూర్తి చేశారు. మార్చి 31నాటికి సర్వే పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. 30 అంశాలపై .. ⇔ నగరంలో కుటుంబ ఆర్థిక గణన సుమారు 30 అంశాలపై కొనసాగుతోంది. ప్రతి కుటుంబం జీవనశైలి, నివాసాలు, ఆర్థిక వనరులు తదితర అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ద్వారా సర్వే చేస్తున్నారు. ప్రతి కుటుంబంనుంచి సేకరించిన వివరాలను అక్కడికక్కడే ఎన్యూమరేటర్ మొబైల్ యాప్‌లో పొందుపరుస్తున్నారు. ⇔ ఎన్యూమరేటర్లకు జియో ట్యాగింగ్, టైమ్ స్టాంపింగ్, యాప్ లెవల్ డేటా ధ్రువీకరణ, డేటాను సంరక్షించేందుకు సురక్షితం కోసం లాగిన్,వెబ్ అప్లికేషన్ ద్వారా సేకరించిన సమాచారాన్ని నివేదికలను పైస్థాయి అధికారులకు అప్లోడ్ చేసేలా సులభతరంగా వీటిని రూపొందించారు. ⇔ సర్వే రెండు రకాలుగా ఉంటుంది. ప్రతి కుటుంబాన్ని కలుస్తారు. ఇల్లు తీరును పరిశీలించి వివరాలను సేకరిస్తారు. ఇంటి ముందు దుకాణాలు ఉన్నా, ఇంటి ముందు కమర్షియల్ గదులు ఉన్నా, మొత్తంగా కమర్షియల్ దుకాణాలు ఉన్నా వివిధ విభాగాల కింద వివరాలను సేకరించి నమోదు చేస్తారు. ⇔ నార్మల్ హౌస్‌హోల్డ్, సెమీ నార్మల్ హౌస్‌హోల్డ్, కమర్షియల్ విభాగాల కింద సర్వే వివరాలను నమోదు చేస్తారు. ఆర్థిక గణన కార్యక్రమాన్ని ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన కామన్ సర్వీసెస్ సెంటర్స్ ద్వారా సర్వే కొనసాగుతోంది. హైదరాబాద్ జిల్లా మేనేజర్లు శివారెడ్డి, గౌతం ఈ సర్వేను పర్యవేక్షిస్తున్నారు. సర్వేకు సహకరించండి.. కుటుంబ ఆర్థిక గణన సర్వేకు సహకరించాలి. భవిష్యత్తులో బహుళ ప్రయోజనకారిగా ఎంతో ఉపయోగపడుతోంది. ఎన్యూమరేటర్లు అడిగిన వివరాలు వెల్లడిస్తే సరిపోతుంది. ఇబ్బందేమీ ఉండదు. - డాక్టర్ ఎన్.సురేందర్, జిల్లా ప్రణాళిక అధికారి -
హైదరాబాద్‌లో వన్ మిలియన్ డిజిటల్ సర్వేలు
సాక్షి, హైదరాబాద్: యువతకు డిజిటల్ లిటరసీపై అవగాహన కల్పిస్తూ నైపుణ్యాన్ని మెరుగుపరిచిన తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) మరో శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏడో ఆర్థిక సర్వే(డిజిటల్)లో ఎన్యూమరేటర్లుగా దాదాపు ఐదారువేల మందికి అవకాశం కల్పించబోతున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్ని ‘టీటా’ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల విడుదల చేసి సర్వేను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఐటీ అసోసియేషన్ అనుబంధ సంస్థ డిజిథాన్తో కలిసి ‘సీఎస్సీ’ ఈ సర్వేను నిర్వహిస్తున్నదని తెలిపారు. సర్వేలో భాగంగా పది లక్షల నివాసాలకు వాలంటీర్లు వెళ్లి మొబైల్ యాప్ ద్వారా వివరాలు సేకరిస్తారని తెలిపారు. గ్రేటర్ పరిధిలో 573 ఇన్వెస్టిగేటర్ యూనిట్లు ఉన్నాయని, ఒక్కో యూనిట్‌కు పది మంది వరకు ఎన్యూమరేటర్లు అవసరమని ఆయన వివరించారు. పదో తరగతి ఉత్తీర్ణులై, స్మార్ట్ ఫోన్ వాడకంలో పరిజ్ఞానం కలిగి ఉన్నవారు bit.ly/censussurvey వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తామని సందీప్ చెప్పారు. ఈ డిజిటల్ సర్వేను సీఎస్సీ హైదరాబాద్ విభాగం మేనేజర్ పర్యవేక్షిస్తున్నారని, మరిన్ని వివరాలకు కార్యాలయ వేళల్లో 6300368705/ 9542809069/ 7989702090/ 9948185053 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. -
ఎన్పీఆర్ అమలుకు రంగం సిద్ధం..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) నవీకరణ, జనాభా గణన, గృహ ఆస్తుల వివరాల సేకరణ (హౌస్ లిస్టింగ్)కు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ప్రభుత్వం శిక్షణ ఇచ్చి నియమించిన ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి ప్రజల నుంచి వివిధ వివరాలు సేకరించనున్నారు. ‘మీరు, మీ తల్లిదండ్రుల పుట్టిన తేదీ, పుట్టిన ప్రాంతం ఏమిటి?.. మీరు భారతీయులేనా? మీ ఆధార్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, మొబైల్ నంబర్ ఏమిటి?. మీకు చట్టబద్ధంగా, సంప్రదాయబద్ధంగా పెళ్లైందా లేక సహజీవనం చేస్తున్నారా? వంటి వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన రుజువులను ప్రజలు స్వచ్ఛందంగా ఇస్తే ఎన్యూమరేటర్లు తీసుకోనున్నారు. అయితే సర్వేకు వచ్చినప్పుడు ఈ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని ఎన్యూమరేటర్లు కుటుంబ పెద్దను కోరనున్నట్లు ఎన్పీఆర్–2020 యూజర్ మాన్యువల్‌లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పౌరసత్వ చట్టం–1955, పౌరసత్వ నిబంధనలు–2013 కింద ఎన్పీఆర్కు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. దేశ పౌరులతోపాటు దేశంలో నివాసముంటున్న విదేశీయుల సమాచారాన్ని ఈ కార్యక్రమంలో భాగంగా సేకరించనుంది. ఎన్పీఆర్ కింద అడిగే ప్రశ్నలు.... 1. ఎన్పీఆర్ బుక్లెట్పై ముద్రించిన పేరు సరైనదేనా? (ఒకవేళ తప్పులుంటే పేరును బుక్‌లెట్‌లో సరిచేస్తారు. ప్రతి వ్యక్తి పేరును కరెక్టుగా నమోదు చేయడం కీలకమని ఎన్పీఆర్ నియమావళి పేర్కొంటోంది) 2. ఇంట్లో అందుబాటులో ఉన్న వ్యక్తులు ఎంత మంది? (కుటుంబ సభ్యులు ఎవరైనా వలస వెళ్లినా, చనిపోయినా నమోదు చేసుకుంటారు) 3. కుటుంబ పెద్దతో ఇతర సభ్యుల బంధుత్వం. 4. పురుషులా.. మహిళలా లేక ఇతరులా? 5. వివాహ స్థితిగతులు. (అవివాహితులు, వివాహితులు, వితంతువు/భార్య చనిపోయిన వ్యక్తి, విడిపోయిన వారు, విడాకులు పొందిన వారు వంటి వివరాలు సేకరిస్తారు. రెండోసారి పెళ్లి చేసుకున్నా లేక సహజీవనం చేస్తున్నా పెళ్లయిన వ్యక్తుల కిందే లెక్కగట్టనున్నారు) 6. కుటుంబ సభ్యుల పుట్టిన తేదీ ఏమిటి? (తప్పుగా ఉంటే సరిచేస్తారు. ఒకవేళ ఎవరైనా తమ పుట్టిన తేదీ, నెల వివరాలు అందించలేని స్థితిలో ఉంటే కేవలం పుట్టిన సంవత్సరాన్ని మాత్రమే నమోదు చేస్తారు. ఎన్పీఆర్ డేటాబేస్‌లో పుట్టిన తేదీ కీలకం. ఒకవేళ పుట్టిన తేదీ సమాచారం అందించలేని పరిస్థితిలో ఉంటే సంబంధిత వ్యక్తుల స్కూల్ సర్టిఫికెట్లు, ఇతర పత్రాలు, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, ఇతర పత్రాల ఆధారంగా పుట్టిన తేదీని సేకరిస్తారు. అవి కూడా లేకపోతే సభ్యుల జాతక చక్రాన్ని పరిగణలోకి తీసుకోనున్నారు. జాతకచక్రం కూడా లేకుంటే ఎన్యూమరేటర్లే వయసును అంచనా వేసి నమోదు చేసుకోనున్నారు) - కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే తెలిసి ఉంటే పుట్టిన తేదీని అంచనా వేసేందుకు ఎన్యూమరేటర్లు పలు ప్రశ్నలు అడగనున్నారు. వర్షాకాలంలో పుట్టారా లేదా తర్వాత? పుట్టిన నెలలో దసరా, దీపావళి, సంక్రాంతి, క్రిస్మస్ వంటి ఏమైనా పండుగలు వచ్చాయా? గాంధీ జయంతి, స్వాతంత్య్ర దినోత్సవం వంటి సెలవులు వచ్చాయా? వంటి ప్రశ్నలను సంధించడం ద్వారా పుట్టిన తేదీని అంచనా వేయనున్నారు. - పుట్టిన తేదీ, సంవత్సరం రెండూ తెలియని పక్షంలో ఎప్పుడు పుట్టారో తెలుసుకోవడానికి దేశ చరిత్రలో కీలక ఘట్టాలుగా నిలిచిన సంఘటనల ఆధారంగా వ్యక్తుల వయసును ఎన్యూమరేటర్లు అంచనా వేయనున్నారు. తొలి ప్రపంచ యుద్ధం (1914–18), దండి యాత్ర (1930), క్విట్ ఇండియా ఉద్యమం (1942), స్వాతంత్య్ర దినోత్సవం (1947), చైనాతో యుద్ధం (1962), పాకిస్తాన్‌తో యుద్ధం (1965), బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం (1971), ఏసియాడ్ క్రీడలు (1982), భారత్ తొలి క్రికెట్ ప్రపంచకప్ విజయం (1983) సాధించినప్పుడు పుట్టారా? అని అడిగి తెలుసుకోనున్నారు. 7. మీరు పుట్టిన ప్రాంతం ఏమిటి? (దేశంలో పుడితే రాష్ట్రం, జిల్లా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది) 8. మీ జాతీయత ఏమిటి? భారతీయులేనా? (మీరు పాస్‌పోర్టు నంబర్ స్వచ్ఛందంగా ఇస్తే స్వీకరించనున్నారు) 9. మీ విద్యార్హతలు ఏమిటి? (ప్రీ ప్రైమరీ, ప్రాథమిక, 1–12 తరగతులు, ఐటీఐ, పాలిటెక్నిక్, నర్సింగ్ డిప్లొమా, టీటీసీ, ఇతర డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ, ఎంఫిల్, పీజీ ఆపై, సరైన విద్య లేని, నిరక్షరాస్యులా? వంటి వివరాలను అడిగి తెలుసుకోనున్నారు) 10. మీ వృత్తి ఏమిటి? (వ్యవసాయం, రోజుకూలీ, స్వయం ఉపాధి, ప్రభుత్వ ఉద్యోగి, ఉద్యోగి యజమాని, ప్రైవేటు ఉద్యోగి, డొమెస్టిక్ హెల్పర్, నాన్ వర్కరా? అని అరా తీయనున్నారు) 11. తల్లి మాతృ భాష ఏమిటి? 12. మీ శాశ్వత చిరునామా చెప్పండి 13. ప్రస్తుత చిరునామాలో ఓ సభ్యుడు పుట్టినప్పటి నుంచి ఉంటున్నాడా? (ఒకవేళ లేకుంటే ఇప్పుడు ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఉన్నాడు? అంతకు ముందు ఎక్కడ ఉన్నాడో తెలపాలి) 14. తండ్రి, తల్లి, భాగస్వామి వివరాలు (తల్లిదండ్రుల గణన ఈ ఇంట్లో జరగని పక్షంలో వారి పేర్లు, పుట్టిన తేదీ వివరాలు సేకరిస్తారు. భాగస్వామి అయితే కేవలం పేరు మాత్రమే రాస్తారు. అదే ఇంట్లో తల్లిదండ్రులు, భాగస్వామి గణన నిర్వహిస్తే వారి పేర్లు, దేశం/విదేశంలో పుట్టిన ప్రాంతం, పుట్టిన తేదీ వివరాలు సేకరిస్తారు. తల్లిదండ్రుల పుట్టిన తేదీ వివరాలు రూఢీ కాకపోతే సంబంధిత కాలమ్‌లో ‘–’అని పెడతారు. 15. ఆధార్, మొబైల్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్లు అందుబాటులో ఉంటే తీసుకుంటారు. జనాభా గణనకు అర్హులైన వారు.. - ఎన్యూమరేటర్ వచ్చిన సమయంలో ఇంట్లో అందుబాటులో ఉన్న వ్యక్తులు. - జనాభా గణన నిర్వహించే సమయంలో అక్కడ ప్రత్యక్షంగా ఉన్న ఇంటి సాధారణ నివాసితులు. - ఇంటి సాధారణ నివాసితులై ఉండి ఎన్యూమరేటర్ సందర్శనకు వచ్చిన సమయంలో ఇంట్లో లేని వ్యక్తులు జనాభా గణన ముగిసేలోగా తిరిగి వస్తే వారి వివరాలను సైతం సేకరించనున్నారు. - సందర్శకులు, పనిమనుషులు, అద్దెకు ఉండే వ్యక్తులు, డ్రైవర్లు లేదా అలాంటి వ్యక్తులు ఓ గృహ పరివారంతో కలసి ఉండటంతోపాటు పైన పేర్కొన్న మూడు అర్హతలను కలిగి ఉంటే వారి వివరాలను సైతం సేకరిస్తారు. ఎన్పీఆర్ డేటాబేస్–2010 ఆధారంగా... దేశంలో నివాసముంటున్న ప్రజలందరికీ సంబంధించిన ఎన్పీఆర్ డేటాబేస్‌ను తొలిసారిగా 2010లో తయారు చేశారు. జనగణన–2011 కార్యక్రమంలో భాగంగా 2010లో నిర్వహించిన సర్వేలో సేకరించిన సమాచారం ఆధారంగా ఎన్పీఆర్ డేటాను రూపొందించారు. ఆ వివరాలతో ‘ఎన్పీఆర్ డేటా బుక్లెట్’ను ముద్రించనున్నారు. ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి కుటుంబ పెద్ద నుంచి జనాభా గణనతోపాటు ఎన్పీఆర్కు సంబంధించి తాజా సమాచారాన్ని సేకరించనున్నారు. ఈ క్రమంలో ఎన్పీఆర్ బుక్‌లెట్స్‌లో సంబంధిత కుటుంబం/వ్యక్తులకు సంబంధించి ముద్రించి ఉన్న సమాచారాన్ని సరిపోల్చి చూడనున్నారు. ఇందుకు అవసరమైతే ఆధార్, ఓటర్ ఐడీ కార్డు వంటి రుజువులను చూపాలని కోరనున్నారు. పాత ఎన్పీఆర్ డేటాబేస్‌లో ఎవైనా తప్పులుంటే సరిచేయడంతోపాటు అవసరమైన కొత్త సమాచారాన్ని నమోదు చేసుకోనున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా పాత ఎన్పీఆర్ డేటాబేస్‌లో ఉన్న కుటుంబాల్లో కొత్త సభ్యులున్నట్లుగానీ, కొత్త కుటుంబాలున్నట్లుగానీ గుర్తిస్తే వారికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసేందుకు ఎన్యూమరేటర్లకు ‘ఖాళీ ఎన్పీఆర్ ఫారాలను’కేంద్రం అందించనుంది. ఓ కుటుంబానికి సంబంధించిన ఎన్పీఆర్ బుక్‌లెట్‌లో ఆ కుటుంబానికి సంబంధించిన కొత్త సభ్యుల వివరాలను నమోదు చేసేందుకు అవసరమైన ఖాళీ పేజీలుంటే అదే బుక్‌లెట్‌లో నమోదు చేయనున్నారు. - కుటుంబలోని ప్రతి వ్యక్తికి సంబంధించిన ఎన్పీఆర్ డేటాబేస్‌ను నవీకరిస్తారు. - నవీకరించిన ఎన్పీఆర్ డేటాబేస్‌ను కుటుంబ పెద్దకు చూపించడంతోపాటు బుక్లెట్పై అతడి/ఆమె సంతకం/వేలిముద్రను సేకరించనున్నారు. - కుటుంబ సభ్యుల పేర్లు, సంఖ్య, ఇతర అంశాలకు సంబంధించిన సరైన సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత కుటుంబ పెద్దది అని ఎన్పీఆర్ నిబంధనలు పేర్కొంటున్నాయి. - ఒకే గృహంలో నివాసముంటూ ఉమ్మడి కిచెన్‌పై ఆధారపడిన రక్తసంబంధికులతోపాటు ఏ సంబంధం లేని వ్యక్తుల ఎన్పీఆర్ డేటాను ‘సాధారణ గృహాల’విభాగం కింద స్వీకరించనున్నారు. - బోర్డింగ్ గృహాలు, మెస్‌లు, హాస్టళ్లు, హోటళ్లు, రెస్క్యూ గృహాలు, అబ్జర్వేషన్ హోంలు, బెగ్గర్ హోంలు, జైళ్లు, ఆశ్రమాలు, వద్ధాశ్రమాలు, బాల గృహాలు, అనాథాశ్రమాలు వంటి భవనాల్లో నివాసముండే ఏ బంధుత్వం లేని వ్యక్తుల ఎన్పీఆర్ డేటాను వ్యవస్థాగత గృహాల విభాగం కింద సమీకరించనున్నారు. - ఎన్పీఆర్ బుక్లెట్పై రాష్ట్రం/జిల్లా/తహసీల్/తాలుకా/పోలీస్ స్టేషన్/డివిజన్ బ్లాక్/సర్కిల్ బ్లాక్/మండలం/పట్టణం/గ్రామం పేర్లతో వాటికి సంబంధించిన కోడ్లు ముద్రించి ఉండనున్నాయి. వార్డు, హౌస్‌హోల్డ్ బ్లాక్ నంబర్, సబ్బ్లాక్ నంబర్, పిన్‌కోడ్ వంటి వివరాలు సైతం ఉండనున్నాయి. -
ఊరించి.. ఉసూరుమనిపించి!
► జిల్లాలో పూర్తి కావచ్చిన పల్స్ సర్వే ► సిబ్బందికి చెల్లించాల్సిన గౌరవ వేతనంలో జాప్యం ► ఎన్యూమరేటర్ల ఎదురుచూపు జనాలకు నిద్రపట్టినివ్వలేదు.. సిబ్బందిని పడుకోనివ్వలేదు.. సామాన్యుల్లో ఒకటే టెన్షన్. స్మార్ట్ సర్వేలో నమోదు అరుుతే చిక్కులు తప్పవని.. దాని తీరూ అలాగే ఉంది. ప్రస్తుతానికి ఆ విషయం పక్కనపెడితే రేరుుంబవళ్లు సర్వే పేరుతో ఒళ్లు గుల్ల చేసుకొని.. పని పూర్తి చేసిన సిబ్బందికి ప్రభుత్వ ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది. చేసిన శ్రమకు గౌరవ వేతనం ఇంకా ఇవ్వకుండా మనోవేదనకు గురి చేస్తోంది. - ఒంగోలు టౌన్ ‘ప్రస్తుతం జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వే చివరి దశకు చేరుకొంది. ఆరునెలలపాటు ఈ సర్వే ప్రక్రియ కొనసాగింది. అరుుతే కష్టపడిన ఎన్యూమరేటర్లకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ ఊసే ఎత్తడం లేదు. దీని కోసం వారంతా ఎదురు చూస్తున్నారు’ జేబులో డబ్బుతో.. సర్వే చేసిన సమయంలో సిబ్బంది కష్టాలు అన్నీ.. ఇన్నీ కావు. సిగ్నల్స్ దొరక్కపోవడంతో పాటు జేబులో డబ్బు పెట్టి మరీ నెట్ బిల్లు చెల్లించి సర్వే పూర్తి చేశారు. అరుుతే ఈ నగదు కూడా తమ ఖాతాలో జమ అవుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది జూన్ నుంచి సర్వే ప్రారంభం కాగా.. 8,60,463 ఇళ్లను సందర్శించి 33,59,220 మంది వివరాలు నమోదు చేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. కాగా దీనికోసం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నవారిలో 2251 మంది ఎన్యూమరేటర్లను, వారి పనితీరును పరిశీలిస్తూ సలహాలు సూచనలు అందించేందుకు 295 మంది సూపర్వైజర్లను నియమించారు. ఒక్క పేరుకు రూ. 4 ఒక్కో ఎన్యూమరేటర్ ఒక పేరు సర్వేలో పొందుపరిస్తే నాలుగు రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్యూమరేటర్ చేసిన సర్వేలో దానిలో పదిశాతం సూపర్వైజర్కు ఇవ్వనున్నట్లు చెప్పింది. దీంతో కొన్ని శాఖలకు చెందినవారు తమ విధులను పక్కనపెట్టి పూర్తి స్థారుులో సర్వేలో పాల్గొన్నారు. చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులంతా అందుబాటులో లేకపోవడంతో ఒక్కో ఇంటికి నాలుగైదుసార్లు తిరిగిన సందర్భాలున్నారుు. పైగా కొంతమంది అథంటికేషన్(థంబ్, ఐరిష్) వంటివి లేకపోవడంతో మరోమారు వివరాలను సేకరించాల్సి వచ్చింది. రూ 3.47కోట్లకు రూ. 1.70 కోట్లే! జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వేకు సంబంధించి 3.47 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. సర్వేకు సంబంధించి ఎన్యూమరేటర్ల రెమ్యునరేషన్ నుంచి మెటీరియల్ తదితర వాటికి లెక్కలు వేసి నివేదించారు. అరుుతే ప్రభుత్వం కోటి 70లక్షల రూపాయలను మాత్రమే విడుదల చేసింది. ప్రస్తుతం వచ్చిన ఈ మొత్తాన్ని ఏవిధంగా పంపిణీ చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనికితోడు సర్వే ప్రారంభించిన సమయంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లుగా నియమించిన వారిలో కొంతమంది శాఖాపరమైన విధి నిర్వహణకు సంబంధించి ఒత్తిళ్లు ఉండటంతో స్మార్ట్ పల్స్ సర్వే నుంచి తప్పుకున్నారు. దాంతో వారి స్థానాల్లో కొత్తవారిని నియమించారు. సర్వే చేస్తూ మధ్యలో మానివేసిన వారి వివరాలు, ప్రస్తుతం సర్వే చేస్తున్న వారి వివరాలను సేకరిస్తూ వారి ఖాతాల్లో రెమ్యునరేషన్ వేసే విషయంలో గందరగోళం నెలకొంది. -
ఎన్యూమరేటర్ సస్పెన్షన్
► స్మార్ట్ పల్స్ సర్వే వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశం ►విజయనగరం మున్సిపాలిటీలోని పలు కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీ విజయనగరం మున్సిపాలిటీ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ పల్స్ సర్వే తుది దశకు చేరుకుందని, ఇప్పటికీ సర్వే పరిధిలోకి రాని ప్రజలను గుర్తించి వారి వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ వివేక్‌యాదవ్ ఆదేశించారు. మంగళవారం విజయనగరం మున్సిపాలిటీ పరిధిలోని పలుప్రత్యేక శిబిరాల్లో చేపడుతున్న సర్వే ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరిధిలో గల లంకాపట్నం ఆది ఆంధ్ర మున్సిపల్ ప్రైమరీ పాఠశాల పోలింగ్ బూత్‌ను పరిశీలించారు. అక్కడ సర్వే కోసం ప్రజలెవ్వరు రాకపోగా... నియమించిన ఇద్దరు ఎన్యూమరేటర్లలో విధులకు గైర్హాజరైన త్రినాథ్‌ను విధుల నుంచి సస్పెన్షన్ చేయాలని మున్సిపల్ ఇంజినీర్‌ను ఆదేశించారు. అదేవిధంగా 10వ వార్డులోని ఆదిభట్ల నారాయణ దాసు పురపాలక ప్రాథమిక పాఠశాలలో, 20వ వార్డులోని జొన్నగుడ్డి వినాయకనగర్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ బూత్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా 20 వ వార్డకు కేటారుుంచిన ఇద్దరు ఎన్యూమరేటర్లు 209 మందిని సర్వే చేయాల్సి ఉండగా.. మరో 94మంది సర్వే పరిధిలోకి రావాల్సి ఉన్నట్లు వివరించారు. తరువాత 30 వ వార్డు పరిధిలోని కంటోన్మెంట్ హిందూమున్సిపల్ ప్రైమరీ పాఠశాల పోలింగ్ బూత్‌ను పరిశీలించారు. సర్వే చేపడుతున్న ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. వివిధ కారణాల వల్ల జిల్లాలో సర్వే పరిధిలోకి రాకుండా మిగిలిపోరుున వారి కోసం ఈనెల 19 నుంచి 23వరకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. పంచాయతీ కార్యాలయాలతో పాటు పట్టణ పరిధిలో వార్డు పోలింగ్ బూత్‌లలో ఈ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. ఇప్పటి వరకు సర్వేలో వివరాలు నమోదు చేసుకోని వారంతా విధిగా వివరాలు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెనుక మున్సిపల్ ఇంజినీర్ కె.శ్రీనివాసరావు, విజయనగరం తహసీల్దార్ శ్రీనివాసరావు, టౌన్‌ప్లానింగ్ అధికారి శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
పల్లెల్లో ముగిసిన ప్రజాసాధికార సర్వే
- బుధవారం సాయంత్రంలోగా సర్వే ముగిసినట్లు సర్టిఫికెట్లు ఇవ్వాలని జేసీ ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాసాధికార సర్వే ముగిసింది. మండలాలు, ఎన్యూమరేషన్ బ్లాక్‌ల వారీగా మొత్తం జనాభా ఎంత, ఎంత మందిని సర్వే చేశారు, ఎంత మందిని సర్వే చేయలేదు, ఇందులో మరణించినవారు, వలస వెళ్లినవారు, సర్వే పరిధిలోకి రానివారు, సర్వేకు దూరంగా ఉన్నవారు తదితర వివరాలను తెలియజేస్తూ సర్వే ముగించినట్లు బుధవారం సాయంత్రంలోగా సర్టిఫికెట్లు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ అన్ని మండలాల తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్యూమరేటర్లు ముందుగా ఈ విధమైన సర్టిపికెట్లు తహసీల్దారుకు ఇవ్వాలి. దీనిని బట్టి తహసీల్దార్లు సర్వే ముగిసినట్లు సర్టిపికెట్ ఇవ్వాల్సి ఉంది. అర్బన్ ప్రాంతాల్లో ఈ నెలాఖరుతో సర్వేను ముగించే అవకాశం ఉంది. డిసెంబరు నుంచి సర్వే నివేదిక ప్రకారం పథకాలు అమలవుతాయి. -
ఎన్యూమరేటర్లపై దాడి
నెల్లూరు(పొగతోట): ప్రజా సాధికార సర్వే నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్లపై నెల్లూరు బాలాజీనగర్ ప్రజలు కొందరు దాడి చేశారని, దీంతో సర్వే నిలిపివేశామని బాధితులు శుక్రవారం జేసీ ఇంతియాజ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌వీఆర్‌సీ శేఖర్‌రావు మాట్లాడుతూ ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన లేని కారణంగా ఎన్యూమరేటర్లు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారను. బాలజీనగర్‌లో సర్వేకు వెళ్లిన ఎన్యూమరేటర్లు ఐడీ పత్రాలు చూపించండని, కులం చెప్పమని స్థానికులను అడిగితే మీకేందుకు చెప్పాలని ప్రజలు సిబ్బందిని ఎదురు ప్రశ్నిస్తున్నారన్నారు. దీంతో సర్వే చేయడానికి ఎన్యూమరేటర్ల భయపడుతున్నారన్నారు. సర్వేపై ప్రజల్లో ఉన్న అపోహలను పొగోట్టేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆటోలో ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామని జేసీ ఎన్యూమరేటర్లకు తెలిపారు. సర్వే నిలిపివేయకుండా కొనసాగించాలని ఎన్యూమరేటర్లకు సూచించారు. -
నగరంలో రెండు సర్వేలు..
♦ ఎన్యూమరేటర్లకు సహకరించండి ♦ నగర ప్రజలకు జీహెచ్ఎంసీ కమిషనర్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్ : భారత పౌరుల జాతీయ రిజిస్టరు తయారీలో మొదటి అంకమైన నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్పీఆర్)కోసం జరుగుతున్న ఇంటింటి సర్వేలో సిబ్బందికి తగిన విధంగా సహకరించాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సర్వేలో భాగంగా ఎన్యూమరేటర్లు కోరే వ్యక్తుల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన స్థలం, ప్రస్తుత చిరునామా, విద్యార్హతలు, వృత్తి, జాతీయత, చిరునామా తదితర వివరాలు అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ నెలాఖరు వరకు ఈ సర్వే జరుగనుంది. 19.71 లక్షల ఓటర్ల పునః పరిశీలన.. ఓటర్ల తుది జాబితా మే 31న విడుదల చేయనున్నందున స్పెషల్ సప్లిమెంటరీ రివిజన్ కింద ఓటర్ల జాబితాకు సంబంధించి ఇంటింటి సర్వే జరుగుతోంది. ఈ సర్వేలో భాగంగా చిరునామా మారినవారు, మరణించిన వారు, డూప్లికేట్లను జాబితాలోంచి తొలగిస్తారు. మే 15 వరకు మార్పుచేర్పులతో కూడిన తుది జాబితాను రూపొందించి, 31వ తేదీన వెలువరిస్తారు. గతంలో జాబితాలోంచి తొలగించిన 19.71 లక్షలమంది ఓటర్లకు సంబంధించిన వివరాలను పునః పరిశీలిస్తారు. మృతులు, చిరునామా మారిన వారు, అనర్హులు తదితరులను గుర్తిస్తారు. అర్హులుంటే జాబితాలో చేరుస్తారు. ఇందుకుగాను బూత్‌లెవెల్ ఆఫీసర్లు ఇంటింటి సర్వేలో పాల్గొంటున్నారు. అనర్హులను తొలగించేందుకు ఏప్రిల్ 16 నుంచి 22 వరకు నోటీసులు జారీ చేస్తారు. మే 10లోగా ఫిర్యాదులు స్వీకరిస్తారు. మార్పులు, చేర్పులు, జాబితాలో పేరు స్పెల్లింగ్‌లలో పొరపాట్లు తదితరమైన వాటికి సంబంధించి అందిన దరఖాస్తులను పరిష్కరిస్తారు. 15వ తేదీలోగా అనర్హులను, చిరునామా మారినవారి పేర్లు తొలగిస్తారు. 18న అనుబంధ జాబితా రూపొందిస్తారు. 20 తేదీన జాబితాను ప్రచురిస్తారు. 21 వ తేదీనాటికి ఎన్నికల ప్రధానాధికారికి పంపిస్తారు. 23వ తేదీ నాటికి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తారు. మే 31న ఓటర్ల తుది జాబితాను వెలువరిస్తారు. ఈ సందర్భంగా ఇళ్లకు వచ్చే బూత్‌లెవెల్ అధికారులకు సహకరించాల్సిందిగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. జాబితా లో పొరపాట్లు ఉంటే సవరించుకోవాలని, అర్హులైన వారు జాబితాలో పేర్లు లేకుంటే నమోదు చేయించుకోవాలని, చిరునామా మార్పులు, ఫొటోలు, పేర్లలో పొరపాట్లు దొర్లినా సవరించుకోవచ్చునని సూచించారు. -
‘సర్వే’త్రా ఫిర్యాదుల వెల్లువ
ఘట్కేసర్ టౌన్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ సమగ్ర సర్వే కొన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో జరగలేదని తెలుస్తోంది. సర్వేరోజు రాత్రి 9 గంటలకు వరకు కూడా తమ ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాలేదని ప్రజలు క్లస్టర్ అధికారుల ముందు నిరసనలు తెలిపారు. సర్వే సజావుగా సాగిందనుకున్న అధికారులు ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో తప్పు ఎక్కడ జరిగిందనే విషయమై పరిశీలిస్తున్నారు. మండలంలో 72,961 ఇళ్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటికి నంబర్లు కేటాయించి ఎన్యూమరేటర్లకు అప్పగించారు. 68,593 కుటుంబాల సర్వే పూర్తితో 104.31 శాతం నమోదు అయిందని, 4,368 ఇళ్లకు తాళాలు వేసి ఉన్నట్లు తహసీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి ప్రకటించారు. నివేదికలు ఇలా ఉంటే క్షేత్రస్థాయిలో మరోలా కనిపిస్తోంది. సర్వే రోజు రాత్రి వేలాది మంది తమ ఇళ్లకు నంబర్లు వేయలేదని తమ వివరాలను కూడా సర్వేలో నమోదు చేయాలని అధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. నమోదు కాని ఇళ్లు తేలిందిలా..! ఇంటింటి సర్వే 104.31 శాతం పూర్తయిందని అధికారులు ప్రకటిస్తున్నా ఇంకా మిగిలిన ఇళ్లు ఎక్కడివన్న అనుమానం తలెత్తుతోంది. ఇంటి నంబర్లను కేటాయించే సమయంలో ఇంట్లో ఉన్న అన్ని కుటుంబాలకు విడిగా నంబర్లు ఇవ్వకపోవడం, అద్దెకున్న వారి వివరాలను ఇంటి యజమానులు తెలపకపోవడం, ఎన్యూమరేటర్ల దగ్గర నమోదు పత్రాలు లేకపోవడంతోనే గందరగోళం జరిగినట్లు తెలుస్తోంది. పంచాయతీ సిబ్బంది నంబర్లు కేటాయించే సమయంలో ఇంటికి ఒక నంబర్‌ను ఇవ్వగా సర్వే రోజు మాత్రం అదే ఇంట్లో పెళ్లి అయిన ప్రతి జంట విడిగా నమోదు చేయించుకున్నారు. దీంతో ఇళ్ల సంఖ్య పెరగడమే కాకుండా ఎన్యూమరేటర్ల దగ్గర ఉన్న నమోదు పత్రాలు కూడా అయిపోయాయి. ఎన్యూమరేటర్లు తిరుగు ముఖం పట్టడంతో చాలా ఇళ్లు మిగిలిపోవడానికి కారణమైనట్లు భావిస్తున్నారు. అదే రోజు రాత్రి నమోదు కాని ఇళ్లు సుమారు 2 వేల వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోసారి సర్వే చేపట్టి అందరినీ పరిగణలోకి తీసుకుని కుటుంబ వివరాలను నమోదుచేయాలని ప్రజలు కోరుతున్నారు. పంచాయతీల్లో ఫిర్యాదు చేయండి... సర్వేలో పేర్లు నమోదు కాని వారు తమతమ పంచాయతీ కారాలయాల్లో ఫిర్యాదు చేయాలని తహసీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. ఒక్క బోడుప్పల్ పంచాయతీ పరిధిలోనే సుమారు 800లకు పైగా ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు. మండల వ్యాప్తంగా సుమారు 4వేల కుటుంబాలు సర్వే కాకుండా మిగిలిపోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. -
సర్వే తీరిలా..
సాక్షి, సిటీబ్యూరో/నెట్వర్క్: మలక్‌పేట్‌లోని ఓల్డ్‌మలక్‌పేట్, శంకర్‌నగర్, మూసారంబాగ్, అజంపుర, సైదాబాద్, అక్బర్‌బాగ్, యాకుత్‌పురా ఐఎస్‌సదన్, మాదన్నపేట్‌లోని కొన్ని కాలనీలకు ఎన్యూమరేటర్లు రాలేదు. దీంతో శంకర్‌నగర్ , శ్రీసాయినగర్, ఐఎస్సదన్లలో కాలనీవాసులు ధర్నా నిర్వహించారు. నమూనా పత్రాలను తగులబెట్టారు. శంకర్‌నగర్, ఓల్డ్‌మలక్‌పేట్ తదితర ప్రాంతాల్లో సర్వే పత్రాలు అయిపోవడంతో కిరాయి ఇళ్లలో నివసిస్తున్న వారి వివరాల నమోదుకు ఎన్యూమరేటర్లు నిరాకరించారు. హయత్‌నగర్ డివిజన్లోని శుభోదయ కాలనీకి ఎన్యూమరేటర్లు రాకపోవడంతో స్థానికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. హస్తినాపురం సెంట్రల్ కాలనీకి ఎన్యూమరేటర్లు రాకపోవడంతో కాలనీవాసులు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి సర్వే పుస్తకాలు తెచ్చుకుని వారే సర్వే సమాచారాన్ని అధికారులకు ఇచ్చారు. మన్సూరాబాద్ డివిజన్ బండ్లగూడ రాజీవ్ స్వగృహలో 500 కుటుంబాలు నివసిస్తున్నా, అక్కడికి ఎన్యూమరేటర్లు రాలేదు. కాలనీవాసులు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ఫారాలు తెచ్చుకుని నింపి అధికారులకు అందజేశారు. కొన్ని ఇళ్ళకు ఎన్యూమరేటర్లు వెళ్లలేదు. ఇంతకుముందు ఇచ్చిన చెక్‌లిస్ట్‌ల ఆధారంగానే దరఖాస్తులు నింపుకున్నారు. కనీసం ఇంటి యజమానుల సంతకాలు కూడా తీసుకోలేదు. సర్వే హైలెట్స్..ముషీరాబాద్: ఎన్యూమరేటర్ల కోసం జనం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. అడిక్‌మెట్, ముషీరాబాద్, కవాడిగూడ, దోమల్‌గూడ, భాగ్‌లింగంపల్లి డివిజన్ల పరిధిలో సుమారు 80 శాతం సర్వే జరిగినట్లు అధికారుల అంచనా. భోలక్‌పూర్ డివిజన్లో సర్వే అధ్వానంగా జరిగింది. 13 మంది ఎన్యూమరేటర్లు, మరో 164 మంది సహాయ ఎన్యూమరేటర్లు సర్వే విధులకు డుమ్మా కొట్టారు. తమ వీధుల్లోకి ఎవరూ రాకపోవడంతో జనం అయోమయానికి గురయ్యారు. ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, ఎంపీలు నంది ఎల్లయ్య, రాపోలు ఆనందభాస్కర్, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, డిప్యూటీ మేయర్ రాజ్ కుమార్, పీసీసీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు వివరాలు నమోదు చేసుకున్నారు. అంబర్పేట్: అంబర్పేట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు డివిజన్లలో సర్వేపై అయోమయం నెలకొంది. పాతనల్లకుంట మేదర్‌బస్తీలో ఎన్యూమరేటర్లు ఒకే చోట కూర్చుని సర్వే ఫారాలు నింపడంతో స్థానికులు వారి చుట్టూ గుమికూడారు. నిబంధనలకు విరుద్ధంగా వివరాలు నమోదు చేసుకున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అంబర్‌పేటలోని ప్రేమ్ నగర్, పటేల్‌నగర్, చెన్నారెడ్డినగర్, బాపు నగర్, ఎంసీహెచ్‌కాలనీ తదితర ప్రాంతాలలో సాయంత్రం వరకూ సర్వే సిబ్బంది రాకపోవడంతో జనమంతా వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. బర్కత్‌పురలోని తన నివాసానికి వచ్చిన ఎన్యూమరేటర్లకు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పూర్తి వివరాలను అందజేసి సర్వే పత్రంపై సంతకం చేశారు. గోల్నాక డివిజన్లోని ఖాద్రిబాగ్లో సగం ఇళ్లలో సర్వే చేపట్టిన సిబ్బంది తమ దగ్గర ఉన్న సర్వే పుస్తకాలు అయిపోయాయని చెప్పి చేతులెత్తేశారు. అక్కడి కొన్ని ఇళ్లలో సర్వే చేయకుండానే వెళ్లిపోయారు. అన్నపూర్ణనగర్, మారుతీ నగర్, శాంతినగర్, అంబేద్కర్‌నగర్ తదితర బస్తీలలో సర్వే జరుగలేదు. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అబిడ్స్: సుల్తాన్‌బజార్, జాంబాగ్, గౌలీగుడ, ఉస్మాన్‌గంజ్, మాలకుంట ప్రాంతాలకు ఎన్యూమరేటర్లు రాకపోవడంతో అబిడ్స్ జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని స్థానికులు ముట్టడించారు. మంగళవారం రాత్రి అబిడ్స్‌లోని 8వ సర్కిల్ కార్యాలయం వద్ద వందలాది మంది జీహెచ్ఎంసీ కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీహెచ్ఎంసీ డౌన్‌డౌన్ అంటూ, కేసీఆర్ డౌన్‌డౌన్ అంటూ పెద్ద పెట్టున నినదించారు. సర్వే సిబ్బంది రాకపోవడంతో ఆగ్రహించిన కురుమ బస్తీ వాసులు నమూనా సర్వే ఫారాలను తగులబెట్టారు. ఎన్యూమరేటర్‌తో అసభ్య ప్రవర్తన తార్నాక : ఎన్యూమరేషన్ కోసం వెళ్లిన మహిళతో ఓ వ్యక్తి ద్వంద్వార్థాలతో మాట్లాడటంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించాడు. రామంతాపూర్‌లో మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఈ ఘటన జరిగింది. తీవ్రమనస్తాపానికి గురైన బాధితురాలు ఉప్పల్ డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో మునిసిపల్ సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకొచ్చి విచారిస్తున్నారు. -
భోజనం ఎలా.. ఇళ్లకు వెళ్లేదెలా?
కీసర:వారంతా విద్యార్థులు.. సమగ్ర సర్వేలో స్వచ్ఛందగా పాల్గొన్నారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు సర్వే చేశారు. వారికి మధ్యాహ్నం భోజన వసతి కల్పించిన అధికారులు సర్వే ముగిశాక వారిని విస్మరించారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు.. రాత్రివేళ తాము ఇంటికి ఎలా చేరుకోవాలి.. భోజనం ఎక్కడ చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై మండిపడుతూ.. మండలంలోని అహ్మద్‌గూడ గ్రామంలో ఆందోళనకు దిగారు. సమగ్ర సర్వే కోసం తామంతా స్వచ్ఛందంగా తరలి వచ్చామని.. తమ కోసం ఆలోచించేవారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఉపాధ్యాయ బృందాన్ని ప్రభుత్వ అధికారులను వినియోగించుకునే ప్రభుత్వం వారికి సకల ఏర్పాట్లు చేస్తుందని వారికంటే తక్కువ తామేం చేశామని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు వెంటనే రవాణా సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. సర్వేలో విద్యార్థినులు చాలా మంది ఉన్నారని ... వారి పరిస్థితి ఏంటని అన్నారు. తమ నిరసనపై స్థానిక అధికారులు స్పందించకపోవడం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఎన్యూమరేటర్లను సురక్షితంగా వారి ఇళ్లకు చేరుస్తామన్నారు. -
సమగ్ర సర్వేకు ఫారాల కొరత
పరిగి: సమగ్ర కుటుంబ సర్వేకు ఫారాల కొరత ఏర్పడింది. వారం పదిహేను రోజులుగా కసరత్తు చేస్తున్నా సర్వే రోజున గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ప్రధానంగా సర్వే ఫారాల కొరతతో ఎన్యూమరేటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సర్వే కోసం ముందుగా ఇళ్లకు నంబర్లు సక్రమంగా వేయకపోవటంతో ఈ వివాదం తలెత్తింది. ప్రధానంగా ఈ సమస్య అన్ని గ్రామాల్లోనూ కనిపించినప్పటికీ పరిగి పట్టణంతో పాటు పరిగి అనుబంధ గ్రామమైన మల్లెమోనిగూడలో గ్రామస్తులు ఎన్యూమరేటర్లతో వాగ్వాదానికి దిగారు. మల్లెమోనిగూడలో ఏకంగా రోడ్లపైకి వచ్చి అధికారుల తీరుపై గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఒక ఇంట్లో ఐదారు కుటుంబాలు ఉండగా సరైన సమాచారం తీసుకోకుండా ఒక నంబర్ మాత్రమే వేశారు. అదే జాబితాను ఎన్యూమరేటర్లకు అందజేశారు. లిస్టులో లేని ఇళ్లను సర్వే చేసేందుకు నిరాకరించటంతో ఆగ్రహించిన ప్రజలు ఎన్యూమరేటర్లతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ శంషుద్దీన్ తదితరులు మల్లెమోనిగూడను సందర్శించి పరిస్థితి సమీక్షించారు. అనంతరం స్పందించిన అధికారులు అదనంగా ఫారాలు పంపించి అందరి ఇళ్లు సర్వే చేసేలా చూస్తామని హామీ ఇవ్వటంతో గ్రామస్తులు శాంతించారు. ఇదే సమయంలో అదనంగా 1500 సర్వే ఫారాలు జిరాక్స్ తీయించి పరిగితో పాటు కొరత ఉన్న మండల పరిధిలోని గ్రామాలకు పంపించారు. -
సర్వే సక్సెస్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే జిల్లాలో విజయవంతమైంది. మంగళవారం ఉదయం 8గంటలకే సర్వే ప్రారంభించాల్సి ఉండడంతో అధికారగణం అంతా తెల్లవారుజాము నుంచే విధుల్లో తలమునకలైంది. ఉదయం 6 గంటల కల్లా మండల కేంద్రాలకు హాజరైన సిబ్బంది..అల్పాహారం ముగించుకుని సర్వేకు ఉపక్రమించారు. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ప్రారంభమైన సర్వే ప్రక్రియ.. రాత్రి 9 గంటల తర్వాత కూడా కొనసాగింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో 7.89 లక్షల కుటుంబాలున్నట్లు భావించినయంత్రాంగం..రాత్రి వరకు 7.17 లక్షల కుటుంబాలను కవర్ చేస్తూ.. వారి వివరాలు సేకరించినట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. మొత్తంగా 27,675 మంది ఎన్యుమరేటర్లు పాల్గొన్న ఈ సర్వేలో దాదాపు 90 శాతం జనాభా నుంచి వివరాలు సేకరించారు. జిల్లాలో అధికంగా మర్పల్లి మండలంలో 97.41 శాతం కుటుంబాల వివరాలు సేకరించారు. ఆతర్వాత యాలాల మండలంలో 89.14 శాతం, ఇబ్రహీంపట్నంలో 88.9 శాతం, తాండూరు గ్రామీణంలో 88.89 శాతం వివరాలు సేకరించి అగ్రభాగంలో నిలిచాయి. అదేవిధంగా రాజేంద్రనగర్ గ్రామంలో అతి తక్కువగా 65.25 శాతం వివరాలు నమోదు కాగా, హయత్‌నగర్ గ్రామీణంలో 66.91 శాతం సర్వే పూర్తయింది. అక్కడక్కడా అయోమయం.. గందరగోళం కొన్నిచోట్ల సర్వే ప్రక్రియ గందరగోళంగా మారింది. ఒకే గృహంలో నాలుగైదు కుటుంబాలున్నప్పటికీ.. కేవలం ఒకరి వివరాలు మాత్రమే సేకరిస్తున్నారంటూ ఇబ్రహీంపట్నం, తాండూరు, హయత్‌నగర్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో స్థానికులు ఆందోళన చేశారు. తాండూరులో ఏకంగా అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే గృహాల నమోదులో భాగంగా వేసిన నంబర్ల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్లు తెలపడంతో కొంత అయోమయం నెలకొంది. సర్వేలో ప్రధానాంశాలివీ... సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా జిల్లాకు చెందిన ప్రముఖుల ఇళ్ళను ఎన్యూమరేటర్లు సందర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ జె.ఎం లింగ్డో, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేల కుటుంబాల వివరాలను ఎన్యూమరేటర్లు సేకరించారు. తాండూరులోని రాజీవ్ గృహకల్ప కాలనీలో కిరాయిదారులను రాత్రికి రాత్రి ఖాళీ చేయించిన ఓనర్లు మంగళవారం హడావుడిగా ఇళ్లకు చేరి సర్వేలో పేర్లు నమోదు చేసుకున్నారు. దీంతో నిన్నటివరకు ఇక్కడే నివాసమున్న కిరాయిదారుల వివరాలు రికార్డు చేయలేదు. దీంతో వారు ఆందోళనకు గురయ్యారు. తాండూరు మున్సిపాలిటీ పరిధిలో పలువురు ఎన్యూమరేటర్లు విధులకు గైర్హాజరు కావడంతో స్థానికులు రూట్ఆఫీసర్ను నిలదీశారు. ఈక్రమంలో వాగ్వాదం కాస్త గొడవకు దారితీసింది. దీంతో సదరు అధికారిణి తాను సర్వే చేయలేనంటూ మున్సిపల్ కమిషనర్‌కు రిపోర్టు చేశారు. పరిగిలో స్థానికంగా నివాసం ఉండని పలువురు.. మంగళవారం ఉదయం కల్లా వారి సొంతింటి ముందు హాజరై ఎన్యూమరేటర్లకు వివరాలిచ్చారు. సర్వేలో వివరాలు నమోదు చేసుకునేందుకు వచ్చిన కుల్కచర్ల మండలం ఆలుగడ్డతాండా వాసి పాముకాటుకు గురై మృత్యువాత పడ్డాడు. అదేవిధంగా మోమిన్‌పేట మండలంలో బూర్గుపల్లితాండా వాసి రోడ్డుప్రమాదానికి గురై మృతిచెందాడు. హయత్‌నగర్ మండలం అబ్దుల్లాపూర్‌మెట్‌లోని జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో పలువురు లబ్ధిదారులు వారి ఇళ్లను కిరాయికిచ్చారు. తాజాగా సర్వే నేపథ్యంలో వారిని హడావుడిగా ఖాళీ చేయించిన ఓనర్లు.. వారి వివరాలు మాత్రమే నమోదు చేసుకున్నారు. ఫలితంగా కిరాయిదారుల వివరాలు రికార్డులోకి రాలేదు. -
సర్వే..‘ఘన’ గణ
సాక్షి, సిటీబ్యూరో: సమగ్ర కుటుంబ సర్వే-2014లో భాగంగా గ్రేటర్ నగరం కొత్త దృశ్యాన్ని ఆవిష్కరించింది. గతంలో మున్నెన్నడూ లేని విధంగా.. ఏ ప్రభుత్వ కార్యక్రమానికీ సహకరించని విధంగా ప్రజలు ఈ కార్యక్రమానికి స్పందించారు. విధులు మానుకొని ఇళ్లవద్దే వేచి చూస్తూ ఎన్యూమరేటర్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. రాత్రి 10 గం టల వరకు కూడా సర్వే జరిగినప్పటికీ.. ఇంకా చాలామంది నుంచి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. గతంలోని కర్ఫ్యూలను, బంద్‌లను మరిపిస్తూ నగరం బోసిపోయింది. గ్రేటర్లో 2011 జనాభా లెక్కల మేరకు 15.24 లక్షల కుటుంబాలుండగా.. ప్రస్తుతమది 20.24 లక్షలకు చేరి ఉండవచ్చునని అంచనా వేసిన అధికారులు అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసినప్పటికీ.. చాలా ప్రాంతాలకు ఎన్యూమరేటర్లు వెళ్లలేకపోయారు. వెళ్లినప్రాంతాల్లో వారికప్పగించిన కుటుంబాల కంటే లెక్కకుమిక్కిలిగా కుటుంబాలు కనిపించడంతో శక్తికి మించి పనిచేశారు. పెరిగిన రద్దీతో మరోవైపు ఒకే చోట కూర్చొని సర్వే ఫారాలు నింపారు. రాత్రి 10.30 గంటల వరకు 15.35 లక్షల కుటుంబాల సర్వే జరిగినట్లు ఒక అధికారి తెలిపారు. బుధవారం కానీ.. పూర్తి సమాచారం తెలిసే పరిస్థితి లేదు. మిగిలిపోయిన ప్రక్రియను బుధవారం ముగించాల్సిందిగా చీఫ్ సెక్రటరీ సూచించారు. ఎవరెంతగా శ్రమించినా ప్రజాస్పందన ముందు నిందలపాలు కాక తప్పలేదు. ఫారాలు అందలేదని.. ఎన్యూమరేటర్లు రాలేదనే ఫిర్యాదుల వరద ఆగలేదు. సర్వే ముగిశాక అసిస్టెంట్ ఎన్యూమరేటర్లుగా పాల్గొన్నవారికి చాలాచోట్ల రెమ్యునరేషన్ అందలేదంటూ ఘర్షణలు.. గందరగోళాలు చోటుచేసుకున్నాయి.నిర్బంధాలు జరిగాయి. పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రెమ్యునరేషన్ ఇవ్వకపోవడంతో కొందరు సర్వే ఫారాలు నోడల్అధికారులకు అందజేయకుండా ఇళ్లకు తీసుకువెళ్లారు. ఒకే రోజు సర్వే కావడంతో తమ వివరాలు నమోదు కాావేమోననే అందోళన పలువురిలో కనిపించింది. జీహెచ్ఎంసీ చేసిన ప్రీవిజిటల్లు.. శిక్షణలు తగిన ఫలితాన్నిచ్చినప్పటికీ ఊహించని స్పందనతో చేసిన ఏర్పాట్లు సరిపోలేదు.దీంతో పలు ప్రాంతాల్లో ప్రజలు అధికారుల తీరుపై మండిపడ్డారు. తగిన ఏర్పాట్లు చేయలేదని విమర్శల వర్షం గుప్పించారు. సర్వే జరగని ఇళ్లు.. తాళాలు వేసిన ఇళ్లకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదించి.. తదుపరి ఆదేశాల మేరకు వ్యవహరిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్పారు. కుటుంబాల సంఖ్యకు సరిపోని సిబ్బంది సమగ్ర కుటుంబ సర్వేలో తమ వివరాలు అందించేందుకు ప్రజలు తమకు తాముగా ముందుకొచ్చినా.. అందరి వివరాలూ సేకరించేందుకు సిబ్బంది సరిపోలేదు. లెక్కకుమిక్కిలిగా ఉన్న కుటుంబాలు.. జనాభాకు సరిపడా లేని ఎన్యూమరేటర్లతో ఇబ్బందులు ఎదురయ్యాయి. తమ వివరాలు తీసుకోవాలంటూ రాత్రి పొద్దుపోయేంతదాకా ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. జీహెచ్ఎంసీలో సవాల్‌గా స్వీకరించిన సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైందని కమిషనర్ సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల మేరకు గ్రేటర్లో 15.24 లక్షల కుటుంబాలు ఉండగా, రాత్రి 8 గంటల వరకు 15.5 లక్షల కుటుంబాల సర్వే పూర్తయిందన్నారు. ఎన్నో బృందాలు రాత్రి 9.30 గంటల వరకూ సర్వే నిర్వహించినందున బుధవారం కానీ పూర్తి వివరాలు అందే పరిస్థితి లేదని చెప్పారు. పూర్తి సహకారమందించిన నగర ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులు, సిబ్బందికి కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా మిగిలినపోయిన ఇళ్లతో పాటు తాళాలు వేసి ఉన్న ఇళ్ల వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి విషయంలో వ్యవహరిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. సర్వేలో భాగంగా ఇంకా మిగిలిపోయిన పనులేవైనా ఉంటే బుధవారం పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారన్నారు. -
వలస జీవుల తంటాలు
మోర్తాడ్:మోర్తాడ్ మండలం తొర్తికి చెందిన పోచయ్య ఉపాధి కోసం ముంబాయిలో ఉంటున్నాడు. సమగ్ర సర్వే కోసం రెండు రోజుల కింద స్వగ్రామానికి చేరుకున్నాడు. అయితే, స్థానికంగా నివాసం ఉండటం లేదం టూ ఆయన వివరాలు సేకరించడానికి ఎన్యూమరేటర్లు స్పష్టం చేశారు. దోంచందకు చెందిన సంజీవ్‌కుమార్ ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తూ నిజామాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. సర్వేలో వివరాలను న మోదు చేయించుకునేందుకు కుటుంబం సహా స్వగ్రామానికి వచ్చారు. ఆయన ఇంట్లో అద్దెకు ఉంటున్న వా రి వివరాలు సేకరించడానికి తమకు ఇబ్బంది లేదని, నిజామాబాద్‌లో ఉంటున్నవారి వివరాలను మాత్రం ఇక్కడ సేకరించమని సర్వే బృందం తేల్చి చెప్పింది. ఇలా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు చాలా మంది నిరాశకు గురయ్యారు. ఎవరూ పట్టించుకోక సర్వే కోసం ఎన్నో తంటాలు పడుతూ స్వగ్రామాలకు చేరుకున్నవారిని ఎవరూ పట్టించుకోకపోవడంతో వా రి కష్టం బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. ఉన్న ఊరిలో ఉపాధి లేక ముంబాయి, పూణే, భీవండితోపాటు ఇతర పట్టణాలకు వలస వెళ్లిన తెలంగాణవాసులు సర్వే కోసం సొంత ఊళ్లకు వస్తే వివరాలను న మోదు చేయక పోవడంతో వారు అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో గ్రామాలలో ఉద్రిక్త వాతావరణం చో టు చేసుకుంది. తమ వివరాలను నమోదు చేయడం లేదంటూ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసినా ఫలితం లే కపోయింది. అందుబాటులో ఉన్న అధికారులకు ఫో న్ చేస్తే వారు విసుక్కున్నారు. కొందరు అధికారులు తమ సెల్ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి ఉంచడంతో జనం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. స్టిక్కర్ల గొడవ సర్వే నిర్వహించడానికి గుర్తింపు కోసం స్టిక్కర్లను అతికించారు. కొన్ని ఇళ్లకు అతికించలేదు. స్టిక్కర్లతో సంబంధం లేకుండా సర్వే నిర్వహిస్తామని అధికారులు ప్రకటించినా, స్టిక్కర్లు లేని కారణంగా ఎన్నో ఇళ్లలో కుటుంబ సభ్యుల వివరాలను సర్వే బృందం నమోదు చేయలేదు. స్టిక్కర్లు అతికించిన రోజున సిబ్బంది నమోదు చేసుకున్న వివరాల ఆధారంగానే సర్వే రోజున వివరాలను సేకరించారు. సర్వే విధివిధానాలు అర్థం కాకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. సర్వేపై ఎలాంటి అ పోహలు పెట్టుకోవద్దని ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ప్రచారం చేసినా సర్వేలోని ఆంశాలు, వివరాలు సేకరించిన తీరుతో జనంలో అపోహలు మరింత ఎక్కువయ్యాయి. -
సర్వే సక్సెస్
ప్రగతినగర్ : తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే జిల్లాలో విజయవంతంగా జరిగిందని కలెక్టర్ రొనాల్డ్‌రాస్ తెలిపారు. ప్రగతిభవన్‌లో ఆయన రాత్రి విలేకరులతో మాట్లాడా రు. బంగారు తెలంగాణకు బాటలు వేసేందుకు, అర్హులందరికీ ప్రభుత్వ, సంక్షేమ పథకాలను అందించేందుకు చేపట్టిన సర్వే ఊరురా పండుగలా సాగిందన్నారు. గ్రామాలు, మండలాలలో సాయంత్రం ఆరు గం టల వరకు వంద శాతం సర్వే పూర్తి చేశామన్నారు. ఆర్మూర్, బోధన్, కామారెడ్డి మున్సి పాలిటీలలో ఏడు గంటల వరకు సర్వే పూర్తి అయిందన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో మాత్రం అక్కడక్కడా పొరపాట్లు జరిగాయని, వాటిని సరిదిద్దామని తెలి పారు. కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లు ఉన్నందున, కుటుంబాల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నం దున అక్కడక్కడ స్టిక్కర్ల కోసం ప్రజలు అవస్థలు పడ్డారన్నారు. మధ్యాహ్నం ఈ సమస్యను గుర్తించి తిరిగి 600 మంది ఎన్యూమరేటర్లను ఆయా డివిజన్ల పరి ధికి పంపించామన్నారు. మహారాష్ట్ర, బీవండీ, పూణె, ముంబాయి, ఇతర ప్రాంతాల నుండి ప్రజలు తరలి రావడంతో ప్రీ స్టిక్కర్ల కొరత ఏర్పడిందన్నారు. ఇంటి యజమానులు కొందరు కేవలం ఒక్క స్టిక్కరు మాత్ర మే వేయించుకున్నారని, అద్దెకు ఉన్న వారి వివరాల ను దాచి ఉంచారని పేర్కొన్నారు. జిల్లాలో 6,95,205 కుటుంబాలు ఉండగా, ఇతర ప్రాంతాల నుండి ప్రజలు తరలి రావడంతో మంగళవారం ఉదయానికి అవి7.10 లక్షలకు చేరుకున్నాయన్నారు. సర్వే పూర్తి డాటాను 13 ప్రాంతాలలో ఆన్లైన్ ద్వారా సీడింగ్ చేయనున్నామన్నారు. వీటి కోసం హై స్పీడ్ సాఫ్ట్ వేర్‌తో కూడిన రెండు వేల కంప్యూటర్లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాకు సంబంధించిన పూర్తి డాటాను ఈ నెల 31లోగా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ తెలిపారు. సర్వేను జిల్లా ప్రత్యేక అధికారి జనార్దన్‌రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారన్నాని కలెక్టర్ వివరించారు. -
సమగ్ర సర్వేలోసకల జనులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉదయం పది గంటల వరకు సర్వే 22 శా తంగా నమోదైంది. అప్పటి వరకు మందకొడి గా సాగిన సర్వే ఆ తర్వాత వేగం పుంజుకుంది. రాత్రి ఎనిమిది గంటల వరకు 5,63,275 కుటుంబాలు (81శాతం) తమ వివరాలను నమోదు చేయించుకున్నాయి. కలెక్టర్ రొనాల్డ్‌రాస్ అదనంగా మరో 600 మంది ఎన్యూమరేటర్లను ప్రత్యేకంగా రంగంలోకి దింపడంతో సమగ్ర కుటుంబ సర్వే లక్ష్యానికి చేరుకుంది. అయితే, జిల్లావ్యాప్తంగా పలుచోట్ల తమ పేర్లు లేవని, తమ ఇంటికి స్టిక్కర్లు వేయలేదని, స్టిక్కర్లు వేసినా ఎన్యూమరేటర్లు వివరా లు నమోదు చేయలేదని ప్రజలు ఆందోళనకు దిగారు. ఎలుపుగొండ ఎంపీడీఓ రవీశ్వర్‌గౌడ్, కామారెడ్డి మున్సిపల్ క మిషనర్ బాలోజీ నాయక్ తదితరులను నిర్బంధించారు. ఎడపల్లిలో నిర్బంధించిన ఎన్యూమరేటర్లను ఉన్నతాధికారులు విడిపించారు. చెదురు మదురు సంఘటనలు మినహా సర్వే ప్రశాంతంగా ముగిసింది. సర్వే సందర్భంగా జిల్లా కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. నిజామాబాద్ నగరంతో పాటు ఆర్మూరు, కామారెడ్డి, బాన్సువాడ, బోధన్ తదితర పట్టణాలలో వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలను మూసి ఉంచారు. వాహనాలు తిరగలేదు. ప్రధాన వీధులు నిర్మానుష్యంగా మారాయి. ఇళ్ల వద్దనే ఉండి వ్యవసాయ శాఖ మంత్రి పరిగి శ్రీనివాస్‌రెడ్డి ఆయన స్వగ్రామం బాన్సువాడ నియోజకవర్గం పోచారంలో పేరు నమోదు చేయించుకున్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ మద్నూరు మండలం సిర్పూరులో వివరాలు నమోదు చేసుకున్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ పాంగ్రా పరిధిలోని బ్యాంకు కాలనీలో వివరాలు నమోదు చేసుకున్నారు. బోధన్ ఎమ్మెల్యే అహ్మద్ షకీల్, ఆయన కుటుంబసభ్యులు 35 వార్డులో నమోదు చేసుకున్నారు. నవీపేట మండలం సిరాన్‌పల్లికి చెందిన మాజీ మంత్రి పి. సుదర్శన్ రెడ్డి ఇంటికి తాళం ఉంది. ఆయన హైదరాబాద్‌లో సర్వేలో పాల్గొన్నారని సమాచారం. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ భిక్కనూర్ మండలం బస్వాపూర్‌లో, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌లో, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే డోన్‌గాంలో, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు మహమ్మద్నగ ర్లో వివరాలు నమోదు చేసుకున్నారు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. సర్వే జాబితాలో పేర్లు లేవని నిరసనలు జిల్లా అంతటా సర్వే సందడి...పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. దూరం ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లినవారు స్వగ్రామాలకు చేరుకుని సర్వేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల తమ ఇళ్లకు స్టిక్కర్లు అంటించలేదని, సర్వే జాబితాలో తమ పేర్లు లేవని నిరసన వ్యక్తం చేశారు. రెంజల్ మండలం నీలా, ఈరన్నగుట్ట తదితర గ్రామాలలో ప్రజలు గ్రామ పంచాయతీలను ముట్టడించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి నమోదు చేస్తామని హామీ ఇవ్వడం తో ఆందోళన విరమించారు. మాచారెడ్డి మండలం ఎలుపుగొండలో ఎంపీడీఓ రవీశ్వర్గౌడ్తోపాటు ఐ దుగురు సాక్షరభారత్ కార్యకర్తలపై దాడికి యత్నించడంతో వారు గ్రామ పంచాయతీలోకి వెళ్లి త లుపులు వేసుకున్నారు. నిజాంసాగర్ మండలం మహమ్మద్‌నగర్‌లో, పరారీ లో ఉన్న అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ ధనుల వెంకట్రాములు సర్వే కోసం వచ్చి పోలీసులకు చిక్కాడు. కుటుంబాల సంఖ్య కొత్తగా చేరిన వారితో 7.10 లక్షలకు పెరిగిందని, కొద్దిగా ఆలస్యం జరిగినా నూటికి నూరు శాతం సర్వే పూర్తి చేశామని కలెక్టర్ రొనాల్డ్‌రాస్ మంగళవారం రాత్రి పేర్కొన్నారు. కాగా, సర్వేలో పాల్గొన్న ఎన్యూమరేటర్లకు బుధవారం సెలవు ప్రకటించారు. -
బొగ్గు ఉత్పత్తికి బ్రేక్
శ్రీరాంపూర్ : సమగ్ర కుటుంబ సర్వేతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. సర్వే సందర్భంగా కార్మికులు ఇంటి వద్దే ఉండాలని యాజమాన్యం మంగళవారం వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. దీంతో కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో మైనింగ్ ఆపరేషన్స్ నిలిచాయి. భూగర్భ గనులు, ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయింది. జిల్లా పరిధిలో బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ డివిజన్లు ఉన్నాయి. ఈ మూడింటిని కలిపి బెల్లంపల్లి రీజియన్ అంటారు. ఈ రీజియన్ పరిధిలో మొత్తం 15 భూగర్భ గనులు, 4 ఓసీపీలు ఉన్నాయి. ఇందులో సుమారు 23 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. రీజియన్‌లోని గనుల్లో ఒక్క రోజు బొగ్గు ఉత్పత్తి సుమారు 30 వేల టన్నులు ఉంటుంది. సమగ్ర కుటుంబ సర్వేతో ఈ ఉత్పత్తిని సింగరేణి నష్టపోయింది. తద్వారా సుమారు రూ.4.5 కోట్ల నష్టం వాటిల్లింది. వేతనంతో కూడిన సెలవు ఇవ్వడంతో కంపెనీపై రూ.3 కోట్ల వేతన భారం పడింది. కాగా, రీజియన్ నుంచి సుమారు 1500 మంది ఉద్యోగులను కంపెనీ ఎన్యూమరేటర్లుగా పంపింది. మొదటిసారి.. సింగరేణిలో మొదటి సారిగా కార్మికులకు వేతనంతో కూడిన సెలవును యాజమాన్యం ప్రకటించింది. పండుగ సందర్భంగా ఇచ్చే సెలవును యాజమాన్యం ప్రభుత్వ కార్యక్రమాల కోసం ఇవ్వడం ఇదే ప్రథమం. సర్వే కోసం కార్మికులు చాలా మంది ఇంటి వద్దే ఉన్నారు. ఇతర ప్రాంతాల కార్మికులు, అధికారులు స్వస్థలాలకు తరలివెళ్లారు. సమ్మె వాతావరణం.. కార్మికులు రాక గనులపై సమ్మె వాతావరణం కనిపిం చింది. మ్యాన్‌రైడింగ్, టబ్బులు, తట్టాచెమ్మస్ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బొగ్గుపెళ్ల కూడా బయటికి రా లేదు. గనుల ముందు ఉన్న హోటళ్లూ మూసి ఉన్నా యి. సెక్యూరిటీ సిబ్బంది, పంప్ ఆపరేటర్లు వంటి అత్యవసర సిబ్బంది కొందరే విధుల్లో ఉన్నారు. ఓసీపీల్లోనూ ఓవర్‌బర్డెన్ మట్టి పనులు నిలిచిపోయాయి. సీహెచ్‌పీలు, డిపార్ట్మెంట్లు, వర్క్‌షాపుల్లోనూ ఇదే పరిస్థితి. దూర ప్రాంతాలకు బొగ్గు రవాణా చేసే లారీలు ఉత్పత్తి లేక యార్డుకే పరిమితమయ్యాయి. ఇబ్బంది పడ్డ కార్మికులు..... సర్వే సందర్భంగా కార్మికుల్లో కొందరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కడక్కడ కొందరు బినామీ పేర్లతో కంపెనీలో పనిచేస్తున్నారు. చాలా ఏళ్ల నుంచి పనిచేస్తున్నప్పటికీ ప్రస్తుత సర్వేలో ఏ పేరు చెప్పాలో తెలియక ఇబ్బంది పడ్డారు. గతంలో డిపెండెంట్ ఉద్యోగాలు కొ నుక్కొని చేస్తున్నవారు, వేరే కులంతో పనిచేస్తున్నవారు ఇక్కట్లకు గురయ్యారు. అంతేకాకుండా కొత్తగా క్వార్టర్లు వచ్చినవారు, క్వార్టర్లు మారినవారు పాత అడ్రస్ వద్దకు వెళ్లి సర్వేలో వివరాలు నమోదు చేసుకోవడం ఇబ్బందిగా మారింది. ఇంటి నంబర్ కుదరకపోవడం, ఎన్యూమరేటర్ల వద్ద పాత పేర్లు ఉండడంతో కొంత గందరగోళ పరిస్థితి తలెత్తింది. క్వార్టర్‌కు ఒకే నంబర్ ఇవ్వడం, ఇంటి మొత్తాన్ని ఒకే యూనిట్‌గా రాసుకోవడంతో పలువురు కార్మికులు ఇబ్బందులు పడ్డారు. -
నంబర్లు లేవు.. నమోదు చేయలేదు..
బెల్లంపల్లి : అధికారుల నిర్లక్ష్యం వల్ల బెల్లంపల్లిలో కొన్ని కుటుంబాలు మంగళవారం కుటుంబ, ఆర్థిక, సామాజిక సమగ్ర సర్వేకు నోచుకోలేదు. ఎన్యూమరేటర్లు సదరు ఇళ్లలో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసుకోలేదు. అధికారుల తప్పిదానికి తాము బలయ్యామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 34వ వార్డు కాల్టెక్స్ ఏరియాలో 30 ఏళ్ల పైబడి నుంచి కొన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. దాసరి ఓదమ్మ, దాసరి జ్యోతి, గరిగ నాగరాజు, గరిగ నాగమణి, గరిగ వెంటేశ్వర్రావు, గరిగ వెంకటేశ్వరమ్మ, గరిగ శివ, గరిగ శోభ, కుడుపూడి నాగరాజు, కుడుపూడి రమాదేవి, ఉమామహేశ్వరి, అనుషాదేవి వేర్వేరు ఇళ్లలో నివసిస్తున్నారు. వీరిలో కొందరికి సొంత గృహాలు ఉండగా.. మరికొందరు అద్దె ఇళ్లలో జీవిస్తున్నారు. కూలీ పనులు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు. వీరందరికి రేషన్, ఆధార్‌కార్డులు ఉన్నా సదరు వ్యక్తులు నివసిస్తున్న ఇళ్లకు నంబర్లు వేయలేదు. దీంతో సర్వేకు వచ్చిన ఎన్యూమరేటర్లు వివరాల నమోదుకు నిరాకరించారు. తమ కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసుకోవాలని సభ్యులు కోరినా ఎన్యూమరేటర్లు అంగీకరించలేదు. తమకు కేటాయించిన పేర్లు, ఇళ్ల నంబర్ల ఆధారంగానే సర్వే చేస్తామని తేల్చి చెప్పడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. 25వ వార్డులో.. 25వ వార్డులోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఒక ఇంట్లో రెండు కుటుంబాలు వేర్వేరుగా ఉంటున్నాయి. ఆ ఇంటికి ఒక సంఖ్య మాత్రమే వేయడం వల్ల మరో కుటుంబం వివరాలు సేకరించడానికి ఎన్యూమరేటర్లు నిరాకరించారు. దీంతో వాగ్వాదం జరిగింది. వార్డు పరిధిలోని హన్మాన్‌బస్తీకి చెందిన పలువురు తాము నివసిస్తున్న ఇళ్లను పరిశీలించి బై నంబర్లు వేసి వివరాలు నమోదు చేసుకోవాలని ఎన్యూమరేటర్లను నిలదీశారు. దీంతో కొద్దిసేపు సర్వేకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న సూపర్వైజర్ లలిత అక్కడికి చేరుకోవడంతో ఆమెతో బస్తీ ప్రజలు వాగ్వివాదానికి దిగారు. సూపర్వైజర్ తన వద్ద ఉన్న కుటుంబ సర్వే కాపీలను ఎన్యూమరేటర్లకు ఇచ్చి సర్వే చేయాలని సూచించడంతో వివాదం సద్దుమణిగింది. తాళ్లగురిజాలలో.. బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాల గ్రామంలో కొందరు ఎస్టీల ఇళ్లకు సర్వేనంబర్లు వేయకపోవడంతో సదరు కుటుంబాల వివరాల నమోదు ప్రక్రియ జరగలేదు. గ్రామంలోని నాయిని పెద్దులు, గొలిశెట్టి మల్లు, గొలి శెట్టి ఎల్లరాజు, నాయిని బక్కు, గొలిశెట్టి వెంకటేశ్, పల్లె లింగమ్మ, మంతెన నర్సయ్య, పల్లెకుర్తి లింగమ్మ తదితరులు తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఎన్యూమరేటర్లతో వాగ్వాదానికి దిగారు. అయినా ఎన్యూమరేటర్లు పేర్లు నమోదు చేసుకోలేదు. చివరికి మండల విద్యాధికారి డి.శ్రీధర్‌స్వామి అక్కడికి వచ్చి అదనపు సర్వే కాపీలను తెప్పించి వివరాలు నమోదు చేయిస్తామని నచ్చజెప్పడంతో గిరిజనులు శాంతించారు. సర్వేలో వివరాలు నమోదు చేసుకోని కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరుతున్నారు. -
సర్వే సక్సెస్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే చిన్నచిన్న ఒడిదుడుకులు మినహా సజావుగా సాగింది. సర్వేకు విశేష స్పందన లభించింది. ప్రజలు కుటుంబ వివరాలు నమోదు చేసుకునేందుకు ఉత్సాహం చూపారు. కుటుంబ యజమానితోపాటు, కుటుంబ సభ్యులు అంతా ఇంటి వద్దే ఉండి ఎన్యూమరేటర్‌కు ధ్రువీకరణ పత్రాలు చూపిస్తూ వివరాలు తెలిపారు. పట్టణవాసులు వివరాలు నమోదు చేసుకోవడానికి తమ స్వగ్రామాలకు వెళ్లగా పట్టణాలు బోసిపోయాయి. పల్లెలు ప్రజలతో కళకళలాడాయి. జిల్లాలోని విద్యా సంస్థలు, బ్యాంకులు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు తెరుచుకోలేదు. సాయంత్రం వరకు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జనాలు లేక రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి తదితర పట్టణాల్లో నిత్యం రద్దీగా ఉండే వ్యాపార కూడళ్లు బోసిపోయాయి. రాత్రి వరకూ కొనసాగిన సర్వే ఉదయం 8 గంటలకు ప్రారంభమైన సర్వే రాత్రి 11 గంటలు దాటే వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల వరకు 83.33 శాతం కుటుంబాల్లో సర్వే పూర్తి చేసినట్లు జిల్లా యంత్రాంగం అధికారికంగా ప్రకటించింది. రాత్రి 8 గంటల వరకు 92 శాతం సర్వే పూర్తికాగా, సర్వే ముగిసే సమయానికి జిల్లా వ్యాప్తంగా సుమారు 99 శాతం కుటుంబాలను సర్వే చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 866 గ్రామపంచాయతీలు, ఏడు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 7.89 లక్షల కుటుంబాలున్నట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు ఈ మేరకు సర్వే ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న తన స్వగ్రామం జైనథ్ మండలం దీపాయిగూడలో తన కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయించుకున్నారు. కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఉట్నూర్ , మంచిర్యాల డివిజన్లలో పర్యటించి సర్వే తీరును పర్యవేక్షించారు. సర్వేలో ముందున్న గిరిజనం మైదాన ప్రాంతం కంటే ఏజెన్సీ ఏరియాల్లోనే అత్యధికంగా ఎన్యూమరేషన్ నమోదు కావడం గమనార్హం. గోండు, కొలాం, మన్నేవార్ తదితర గిరిజన తెగల గిరిజనులు ఉత్సాహంగా తమ కుటుంబాల వివరాలను నమోదు చేసుకున్నారు. మారుమూల ప్రాంతమైన ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజన్లో సాయంత్రం ఆరు గంటల వరకే 90 శాతం కుటుంబాల సర్వే పూర్తయిందని కలెక్టర్ ఎం.జగన్మోహన్ తెలిపారు. బోసిపోయిన బొగ్గుబావులు సింగరేణి కార్మికులతో సందడిగా ఉండే బొగ్గు బావులు బోసిపోయాయి. కేవలం కార్మికుల సమ్మె చేస్తున్నప్పుడు మాత్రమే నిలిచిపోయే బొగ్గు ఉత్పత్తి, ఇప్పుడు ప్రభుత్వమే సెలవు ప్రకటించడంతో గనులు ఒకరోజు మూతపడ్డాయి. ఆదిలాబాద్ జిల్లాలోని 15 భూగర్భ గనులు, నాలుగు ఓపెన్‌కాస్టు గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచింది. సింగరేణి వ్యాప్తంగా 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిందని, ఈ ఉత్పత్తి విలువ సుమారు రూ.4.50 కోట్లు ఉంటుందని సింగరేణి అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు ప్రకటించడంతో సుమారు రూ.3 కోట్ల భారం పడుతుందని అధికారులు తెలిపారు. బాసరలో ఘననీయంగా తగ్గిన భక్తుల రద్దీ నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే బాసర జ్ఞాన సరస్వతీ ఆలయం భక్తులు లేక నిర్మానుష్యంగా మారింది. వేకువజామున అమ్మవారికి అభిషేకం నిర్వహించిన పూజారులు సర్వేలో తమ పేర్లు నమోదు చేయించుకునేందుకు తమ నివాసాలకు వెళ్లిపోయారు. పలుచోట్ల ఆటంకాలు..ఆలస్యంగా ప్రారంభం... సర్వే ముందస్తు ఏర్పాట్లలో జరిగిన పొరపాట్ల కారణంగా జిల్లాలో పలుచోట్ల సర్వేకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. పలు గ్రామాల్లో, మున్సిపల్ వార్డుల్లో సర్వే ఆలస్యంగా ప్రారంభమైంది. ఎన్యూమరేటర్లకు ఇంటి నంబర్లు దొరకక ఇబ్బంది పడ్డారు. ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు నివాసం ఉన్నట్లు సర్వే కోసం వెళ్లిన ఎన్యూమరేటర్లకు చెప్పడంతో ఒక్కో ఎన్యూమరేటర్ అదనంగా 5 నుంచి 15 కుటుంబాలను సర్వే నిర్వహించాల్సి వచ్చింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని బేల మండలంలో పలువురు తమ పేర్లు ప్రాథమిక సర్వే లిస్టులో లేవని, దీంతో తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకోవడం లేదని తహశీల్దార్, ఎంపీడీవోల దృష్టికి తీసుకురావడంతో వారు సంబంధిత ఎన్యూమరేటర్లతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకోవాలని ఆదేశించారు. సర్వే చేసిన కొందరు ఎన్యూమరేటర్‌కు అంశాలపై పూర్తి అవగాహన లేకపోవడంతో కొన్ని చోట్ల తూతూ మంత్రంగా వివరాలు నమోదు చేశారని పలు గ్రామాల వాసులు ఆరోపించారు. బోథ్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎన్యూమరేటర్లు సర్వే ఆలస్యంగా ప్రారంభించారు. బోథ్ మండల కేంద్రంలోని ఏడో వార్డులో కొన్ని ఇళ్లకు అధికారులు నంబర్లు వేయకపోవడంతో సర్వే సాయంత్రం వరకు నిర్వహించలేదు. అధికారులు కల్పించుకుని సమస్యను పరిష్కరించారు. తాంసి మండలం కప్పర్లలో ఒకే బ్లాక్‌ను ఇద్దరు ఎన్యూమరేటర్లకు కేటాయించారు. దీంతో గందరగోళానికి దారి తీసింది. బెల్లంపల్లిలోని కాల్టెక్స్, హన్మాన్బస్తీ 26వ వార్డులోనూ పలువురి ఇళ్లకు సీ నంబర్లు వేయకపోవడం వల్ల పలువురు ఆందోళన నిర్వహించారు. ఎన్యూమరేటర్లతో వాగ్వాదానికి దిగారు. అధికారులు కల్పించుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. తాళ్లగురిజాల గ్రామంలో పలువురు ఎస్టీల ఇళ్లకు సీ నంబర్లు వేయలేదు. మరికొన్ని ఇళ్లకు బై నంబర్లు కూడా వేయకపోవడంతో ఎస్టీల పేర్లు, వివరాలు ఎన్యూమరేటర్లు నమోదు చేసుకోలేదు. తాండూర్ మండలం మాదారం టౌన్షిప్లో ఒకే బ్లాక్‌ను ముగ్గురు ఎన్యూమరేటర్లకు విధులు అప్పగించడంలో రెండు గంటలు ఆలస్యంగా సర్వే ప్రారంభమైంది. నిర్మల్ పట్టణంలో 97 మంది ఎన్యూమరేటర్లు సర్వే విధులకు గైర్హాజరు అయ్యారు. దీంతో అధికారులు స్పందించి ట్రిపుల్ ఐటీ విద్యార్థులను శిక్షణ ఇప్పించి సర్వేకు పంపించారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో సర్వే ఆలస్యంగా ప్రారంభమైంది. ఆసిఫాబాద్‌లోని రావులవాడ, పెషాజీనగర్, రాజంపేట్, వాంకిడి మండలం కమ్మాల తదితర చోట్ల ఇంటి నంబర్లు దొరక్క సర్వేకు ఆటంకం ఏర్పడింది. దీంతో ఎన్యూమరేటర్లు ఇబ్బందులు పడగా, స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఖానాపూర్‌లో కొన్ని గృహాలకు ముందస్తు నంబర్లు వేయకపోవడంతో ఇంటి యజమానులు ఆందోళనకు దిగారు. అధికారులకు విషయం తెలుసుకుని ఈ గృహాల్లో సర్వే చేశారు. సర్వేను కరెంటు కోతలు వదలడం లేదు. ఎన్యూమరేటర్లు ఒక్కో గ్రామంలో రాత్రి 9 గంటల వరకు విధులు నిర్వహించారు. పూర్తి చేసిన ఫారాలను ఖానాపూర్ పంచాయతీ కార్యాలయానికి తీసుకొచ్చారు. కరెంటు లేకపోవడంతో ఫారాలను సెల్, టార్చిలైట్ వెలుతురులో అధికారులకు అందజేశారు. కొందరు బుధవారం ఉదయం ఇస్తామని వెళ్లిపోయారు. భైంసా పట్టణంలోని సంతోష్‌నగర్, సిద్దార్థనగర్లలో ఆలస్యంగా సర్వే ప్రారంభమైంది. ముథోల్ మండలంలో సర్వే కోసం గ్రామాలకు ఎన్యూమరేటర్లు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోవడంతో ముగ్గురు ఎన్యూమరేటర్లకు గాయాలయ్యాయి. కాగజ్‌నగర్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో సాంకేతిక లోపం తలెత్తి పట్టణంతోపాటు, పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సర్వేకు ఆటంకం కలిగింది. -
ఎన్యూమరేటర్ల నిర్బంధం
పెనుబల్లి: పెనుబల్లి మండల పరిధిలోని కుప్పెనకుంట్లలో ఇళ్లకు స్టిక్కర్లు వేయకపోవడంతో సుమారు 150 కుటుంబాలకు సర్వే నిర్వహించలేదు. దీంతో అందరికీ సర్వే పూర్తి చేసిన తర్వాతే ఎన్యూమరేటర్లు బయటకు వెళ్లాలంటూ గ్రామస్తులు వారిని మంగళవారం రాత్రి నిర్బంధించారు. అధికారుల నిర్లక్ష్యంతో కొందరి ఇళ్లకు అసలు స్టిక్కర్లు వేయలేదని, మరికొందరి ఇళ్లలో ఒకరి కంటే ఎక్కువ కుటుంబాలు నివాసం ఉంటున్నప్పటికీ వారిని గుర్తించలేదని స్థానికులు ఆందోళనకు దిగారు. అందరినీ సర్వే చేసేంతవరకు కదలనీయబోమని స్పష్టం చేశారు. దీంతో విషయం తెలుసుకున్న వీఎం బంజర్ ఎస్సై బి. పరుశురాం ఆ గ్రామానికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు. అందరి వివరాలు సేకరించిన తర్వాతే ఎన్యూమరేటర్లు వెళ్తారని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. కాగా, మంగళవారం అర్ధరాత్రి వరకూ గ్రామంలో సర్వే కొనసాగుతూనే ఉంది. -
మద్యం మత్తులో ఎన్యూమరేటర్
టేకులపల్లి : సమగ్ర కుటుంబ సర్వే చేయాల్సి ఎన్యూమరేటర్ మద్యం మత్తులో విధులకు డుమ్మా కొట్టిన సంఘటన టేకులపల్లి మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సంపత్‌నగర్‌లో పని చేస్తున్న సీనియర్ ఉపాధ్యాయుడికి 13వ బ్లాక్ బద్దుతండాలో ఎన్యూమరేటర్‌గా విధులు కేటాయించారు. సోమవారం రాత్రి అతను మిగిలిన వారితో కలిసి సర్వే సామగ్రిని సరి చూసుకున్నాడు. సంబంధిత పత్రాలు, బుక్లెట్ తీసుకున్నారు. కానీ అతను స్వగ్రామానికి వెళ్లకుండా బోడురోడ్డు సెంటర్లో ఉన్న పాత హీరోహోండా షోరూం వద్ద మద్యం తాగి రోడ్డు పక్కనే పడుకున్నాడు. మంగళవారం ఉదయం 6 గంటలకు సామగ్రి పంపిణీ కేంద్రానికి వెళ్లాల్సి ఉండగా అతను వెళ్లలేదు. తిరిగి మద్యం తాగి అక్కడే పడుకున్నాడు. ఉదయం 7.30 నిమిషాల వరకు కూడా కేంద్రానికి వెళ్లలేదు. స్థానికులు అతనిని గమనించి అధికారులు సమాచారం అందించారు. దీంతో అతని స్థానంలో వెంటనే శకుంతల అనే వైద్యశాఖ ఉద్యోగిని ఎన్యూమరేటర్‌గా పంపించారు. ఈ విషయమై తహశీల్దార్ రమాదేవి వివరణ కోరగా ఉపాధ్యాయుడు కేంద్రానికి రాలేదని, రిపోర్టు కూడా చేయలేదని అన్నారు. అయితే ఆ వ్యక్తి మంగళవారం రాత్రి కూడా రోడ్డు పక్కనే ఉన్నట్లు స్థానికులు తెలిపారు. -
అ‘సమగ్ర’ సర్వే..!
భద్రాచలం : భద్రాచలం ఏజెన్సీలో సమగ్ర కుటుంబ సర్వే గందరగోళంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు డివిజన్‌స్థాయి అధికారులు శ్రద్ధ చూపినప్పటికీ ప్రాథమిక సర్వేలో జరిగిన లోపాలు ప్రజల నుంచి వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతం చేసేందుకు ముందుగా అంగన్వాడీ కార్యకర్తలతో సర్వే చేయించారు. ఈ సర్వేను వీఆర్వోలు పర్యవేక్షించారు. గుర్తించిన ఇళ్లకు ప్రత్యేకంగా నంబర్లు కేటాయిస్తూ ప్రతీ ఇంటికి స్టిక్కర్ అంటించారు. కానీ కొంత మంది సిబ్బంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మంగళవారం నిర్వహించిన సమగ్ర సర్వేలో సమస్య తలెత్తింది. ప్రధానంగా భద్రాచలం పట్టణంలోనే వందల సంఖ్యలో ఇళ్లకు స్టిక్కర్లు అందించకపోవడమే ఇందుకు నిదర్శనం. స్టిక్కర్లు ఉంటేనే సర్వే చేస్తామని ఎన్యూమరేటర్లు చెప్పడంతో స్టిక్కర్లు లేని ఇళ్లవారు ఆందోళనకు గురయ్యారు. భవిష్యత్‌లో అన్ని ధ్రువీకరణ పత్రాలకు ఈ సర్వేనే ప్రామాణికంగా తీసుకుంటామని ప్రభుత్వం చెప్పడంతో వివరాలు నమోదు చేయించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. అంతా గందరగోళమే... స్టిక్కర్లు అంటించని ఇళ్ల వారు ఈ విషయాన్ని ఆర్డీఓ, తహశీల్దార్ల దృష్టికి తీసుకెళ్లడంతో వారు స్పందించారు. సర్వేలో ఏ ఒక్కరు కూడా వివరాలు నమోదు చేయించుకోకుండా ఉండకూడదనే ఉద్దేశంతో వారి సమాచారాన్ని సేకరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఒక్కో కాలనీలో ముగ్గురు ఎన్యూమరేటర్లను ఏర్పాటు చేసి స్టిక్కర్లు లేని వారి సమాచారాన్ని కూడా సేకరించేలా ఏర్పాట్లు చేశారు. అయితే భద్రాచలం పట్టణంలో సరైన రీతిలో సర్వే లేకపోవటంతో రాత్రి 9 గంటల వరకూ కూడా ఇది కొనసాగింది. మరోపక్క కొంత మంది ఇళ్లకు స్టిక్కర్లు ఉన్నప్పటికీ ఎన్యూమరేటర్లు వారి వివరాలు నమోదు చేయలేదు. దీంతో చాలా మంది ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయా కాలనీల్లోని వారే కొందరు స్వయంగా మిగిలిపోయిన వారి వివరాలతో జాబితా తయారు చేసి అధికారులకు అందజేశారు. ఎమ్మెల్యే రాజయ్య ఇంటినీ మరిచారు : భద్రాచలం ఎమ్మెల్యే సున్న రాజయ్య భగవాన్‌దాస్ కాలనీలో ఉంటున్నారు. కానీ ఎమ్మెల్యే ఇంటికి స్టిక్కరు అతికించలేదు. దీంతో ఆ కాలనీకి వెళ్లిన ఎన్యూమరేటర్ ఎమ్మెల్యే సమాచారం సేకరించేందుకు నిరాకరించారు. దీంతో ఆయన ఈ విషయాన్ని నేరుగా ఆర్డీఓ అంజయ్య దృష్టికి తీసుకెళ్లారు. వీఆర్‌పురం మండలం సున్నంవారిగూడెంలో అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు ఉన్నప్పటికీ కొన్నేళ్లుగా భద్రాచలంలోని సొంత ఇంట్లో తాను ఉంటూ ప్రజాప్రతినిధిగా పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నానని తెలిపారు. దీంతో ఆర్డీఓ అంజయ్య అప్పటికప్పుడు ఓ ఎన్యూమరేటర్‌ను ఏర్పాటు చేశారు. ఆ కాలనీలో సర్వేను పరిశీలించేందుకు వెళ్లిన ఎంఈఓ మాధవరావు, ఎన్యూమరేటర్‌ను ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లి ఆయన సమాచారాన్ని సేకరించారు. స్టిక్కరు అతికించకపోవటంతోనే ఇటువంటి సమస్య ఏర్పడిందని ఎమ్మెల్యే రాజయ్య అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. సుందరయ్య కాలనీ వాసులు నిరశన : భద్రాచలం పట్టణంలోని సుందరయ్య కాలనీలో స్థిర నివాసులమైన తమ ఇళ్లకు స్టిక్కర్లు అంటించకపోవడమే కాకుండా సర్వే కూడా చేయలేదని కాలనీ వాసులు నిరసన తెలిపారు. ఆ కాలనీ వాసులు డిగ్రీ కళాశాలకు వచ్చి అధికారుల వద్ద నిరశన తెలిపారు. స్టిక్కర్లు అతికించపోవడంతో వివరాలు నమోదు చేయలేమని ఎన్యూమరేటర్లు చెప్పారని వార్డు సభ్యురాలు మంగ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారి వివరాలు కూడా సేకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. -
సర్వే సమాప్తం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎన్నో అపోహలు, అనుమానాలు, పుకార్లతో పాటు ఎంతో ఉత్సుకత, ఆసక్తిని రేకెత్తించిన సమగ్ర కుటుంబ సర్వే - 2014 జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఉద యం 7 గంటలకు ప్రారంభమైన సర్వే తొలుత మందకొడిగా సాగి, మధ్యాహ్నం నుంచి ఊపందుకుంది. మధ్యాహ్నం ఒంటిగంట కల్లా 40 శా తమే పూర్తయిన సర్వే సాయంత్రం ఆరు గంటల సమయానికి 80 శాతానికి చేరింది. మొత్తం మీద 90 శాతానికి పైగానే జరిగిందని అధికారులు చెపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 8 లక్షలకు పైగా కుటుంబాల వివరాలు నమోదు చేశారు. ఖమ్మం కార్పొరేషన్‌తోపాటు ఇతర పట్టణ ప్రాంతాల్లో సర్వే అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఈ సర్వేలో సామాన్య ప్రజానీకంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వివిధ పార్టీల నాయకులు, ఇతర ప్రముఖులు తమ వివరాలను నమోదు చేయించుకున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, జేసీ, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సర్వేలో పాల్గొన్నారు. ఎన్యూమరేటర్‌కు తమ వివరాలు ఇచ్చేంతవరకు ప్రజలు బయటకు రాకపోవడం, చాలా మంది ఆదివారమే తమ స్వగ్రామాలకు వెళ్లడంతో ఖమ్మంతో పాటు పలు పట్టణాల్లో కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. సినిమా హాళ్లు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు సెలవు ప్రకటించడంతో సాయంత్రం నాలుగు గంటల తర్వాత కొంత జనసమ్మర్థం కనిపించింది. సర్వే సందర్భంగా ఎన్యూమరేట ర్లకు కేటాయించిన ఇంటి నంబర్లలో గందరగోళం ఏర్పడడంతో పాటు ఇళ్లు దొరక్కపోవడంతో నా నా అవస్తలు పడాల్సి వచ్చింది. ఎన్యూమరేటర్లకు చాలా చోట్ల భోజన వసతి కూడా లేక ఇబ్బందులు పడ్డారు. ఇక, సర్వే సందర్భంగా జిల్లా ప్రజానీకమంతా ఎదుర్కొన్న సమస్య ‘స్టిక్కరింగ్.’ స్టిక్కర్ ఉన్న కుటుంబానికి సంబంధించిన సమాచారమే తీసుకుంటామని ఎన్యూమరేటర్లు చెప్పడంతో జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ప్రజలు గందరగోళానికి గురయ్యారు. తల్లాడ, బూర్గం పాడు, ఖమ్మం నగరం, రఘునాథపాలెం.. ఇలా మెజార్టీ మండలాల్లో ప్రజలు తహశీల్దార్, మున్సిపల్ అధికారుల చుట్టూ పరుగులు తీయాల్సి వచ్చింది. కొన్నిచోట్ల ప్రజలు తాము సర్వేను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత అధికారుల హామీతో సర్వే కొనసాగింది. జిల్లాలో జరిగిన సర్వే కార్యక్రమాన్ని ప్రత్యేకాధికారి నీరబ్‌కుమార్ ప్రసాద్ పర్యవేక్షించారు. మంగళవారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన కలెక్టర్‌తో కలిసి సర్వే ను సమీక్షించారు. ఇక, ప్రజల ఫిర్యాదులతో అధికారుల ఫోన్లు హోరెత్తిపోయాయి. జిల్లా కేం ద్రంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నెంబర్లకే 300 కు పైగా ఫోన్లు వచ్చాయి. తహశీల్దార్లు, ఇతర అధికారుల ఫోన్లయితే లెక్కే లేదు. చిన్న చిన్న అవాం తరాల నడుమ సర్వే సమాప్తం కావడంతో జిల్లా ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సర్వే జరిగిన తీరిది.. ఇల్లెందులో ఇళ్లకు స్టిక్కర్లు వేయలేదంటూ సర్వే సిబ్బంది, అధికారులతో పలువురు వాగ్వాదానికి దిగారు. మండలంలోని రాఘబోయినగూడెం ముల్కనూర్ గ్రామంలో మున్నూరుకాపు వారికి కుల ధ్రువీకరణ పత్రం ఉంటేనే వివరాలు నమోదు చేస్తామని సిబ్బంది చెప్పడంతో వారు వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న జోనల్ అధికారి విద్యార్థుల సర్టిఫికెట్లలో ఎలా ఉంటే అలాగే నమోదు చేయాలని సూచించడంతో సర్వే కొనసాగింది. టేకులపల్లిలో ఒక ఎన్యూమరేటర్ మద్యం సేవించి హంగామా సృష్టించాడు. సంపత్‌నగర్‌లో సర్వే సిబ్బందిని దింపి టేకులపల్లికి వస్తున్న వాహనం ఒక బాలుడిని ఢీకొంది. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బయ్యారం మండలం ఇసుక మిది గ్రామానికి చెందిన ఆదివాసీలు తమకు జీవో నంబర్ 3 ప్రకారం ఉద్యోగాలు కల్పించాలని, పోడు భూముల సాగు విషయంలో అటవీ అధికారుల వేధింపులపై చర్యలు తీసుకోవాలని సర్వే సిబ్బందిని అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీడీఓ చంద్రశేఖర్ జేసీతో మాట్లాడి సమస్య పరిష్కరించారు. కామేపల్లిలోని 17 గ్రామపంచాయతీల్లో ఉదయం 8 గంటలకే సర్వే ప్రారంభమైంది. స్టిక్కర్లు అంటించని కుటుంబాలను మొబైల్ టీమ్‌ల ద్వారా సర్వే చేశారు. గార్లలో ఇళ్లకు స్టిక్కర్లు వేయకపోవడంతో సర్వే సిబ్బందితో పలువురు వాగ్వాదానికి దిగారు. వైరాలో కుటుంబాల విషయంలో అధికారులకు సరైన అవగాహన లేకపోవడంతో పూర్తి స్థాయిలో స్టిక్కర్లు వేయలేదు. దీంతో అధికారులు మొబైల్ సిబ్బందిని ఏర్పాటు చేసి ఎన్యూమరేటర్లను పంపించి సర్వే నిర్వహించారు. కారేపల్లి మండలంలోని కారేపల్లి, గుంపెళ్ళగూడెం, భాగ్యనగర్‌తండా, బాజుమల్లాయిగూడెం, పాటిమీదిగుంపు, చీమలపాడు, పోలంపల్లి, పేరుపల్లి, గేటుకారేపల్లి, గిద్దెవారిగూడెం, విశ్వనాధపల్లి గ్రామాలతో పాటు మరి కొన్ని గ్రామాలతో కలిపి సుమారు 80 మంది కు టుంబాలకు స్టిక్కరింగ్ వేయలేదనే కారణంతో ఎన్యుమరేటర్లు సర్వే నిర్వహించలేదు. దీంతో తహశీల్దార్ మంగీలాల్ ముందు బాధిత కుటుంబాల వారు గోడు వెల్లబోసుకున్నారు. భాగ్యనగర్‌తండాలో సర్వేనిర్వహిస్తున్న ఎన్యూమరేటర్ నరసింహా చారి స్పృహ తప్పి కింద ప డిపోయారు. వాంతులు, విరేచనాలు కావడం తో గ్రామస్తులు కారేపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. రిజ ర్వులో ఉన్న మరో ఎన్యూమరేటర్‌ను తహశీల్దార్ నియమించి సర్వేను పునఃప్రారంభించారు. కొణిజర్ల మండలంలో సర్వే ఆలస్యంగా ప్రారంభమైంది. తనికెళ్ల, కొణిజర్ల, పల్లిపాడులో అంగన్వాడీ కార్యకర్తల నిర్లక్ష్యంతో ఒక ఇంట్లో రెండు కుటుంబాలు నివాసం ఉంటూ అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉన్నా ఒకే ఇంటి కింద నమోదు చేయడంతో తనికెళ్లలో ప్రజలు వీఆర్వో మహబూబ్ అలీ పై చేయి చేసుకోబోయారు. మండలంలో జరిగిన సర్వేను జిల్లా కలెక్టర్ ఇలంబరితి పరిశీలించారు. ఏన్కూరు మండలం రాజులపాలెంలో స్టిక్కర్లు పంపిణీ చేయలేదని గ్రామస్తులు సర్వేను అడ్డుకున్నారు. అశ్వారావుపేట మేజర్ పంచాయతీ సర్వే జాబితాలో సుమారు 1500 కుటుంబాల పేర్లు గల్లంతు కావడంతో వారంతా తిరిగి తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన అన్ని చోట్లా ఇదే సమస్య ఉత్పన్నం అయింది. సర్వేకు కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు సిబ్బందిని, స్థానిక వ్యవసాయ కళాశాల విద్యార్థులను కూడా వినియోగించారు. పాల్వంచలో స్టిక్కర్లు, జాబితాలో పేర్లు లేకపోవడంతో మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రజలు ఆందోళన చేపట్టారు. మంచికంటినగర్, బోలోరిగూడెం, గట్టాయిగూడెం గ్రామాలలో ఐటీడీఏ పీవో దివ్య సర్వేను పరిశీలించారు. పాల్వంచలోని ప్రశాంత్‌నగర్‌లోని ఇళ్లకు స్టిక్కర్లు వేయకపోవడంతో సర్వేను బహిష్కరిస్తున్నామని స్థానికులు ప్రకటించారు. కొత్తగూడెంలోని గాజులరాజంబస్తీ, హనుమాన్‌బస్తీ తదితర ప్రాంతాల్లో అంగన్వాడీ కార్యకర్తలు స్టిక్కర్లు అంటించకపోవడంతో స్థానికులు ఆందోళన చెందారు. బర్మాక్యాంప్‌లో సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా 60 శాతం సర్వే కాకపోవడంతో అక్కడి ప్రజలు ఆర్డీవో అమయ్‌కుమార్‌కు ఫిర్యాదుచేశారు. బూర్గంపాడు మండలంలో చాలా ఇళ్లకు స్డిక్కర్లు అంటించకపోవడంతో తహశీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. దీంతో తహశీల్దారు సారపాక లోని ఓప్రైవేటు పాఠశాలలో స్టిక్కర్లు లేని వారినందరినీ ఒకే దగ్గర ఉంచి సర్వే నిర్వహించారు. మణుగూరు మండలంలోనూ సర్వేలో కొంత గందరగోళం నెలకొంది. రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చాలా ఇండ్లకు స్టిక్కర్లు వేయకపోవడంతో వారంతా తహశీల్దారు కార్యాయలంలో ఆందోళన నిర్వహించారు. దీంతో తహశీల్దారు తక్షణమే మొబైల్ టీమ్‌లను ఏర్పాటు చేసి స్టిక్కర్లు లేని వారి సమాచారాన్ని సేకరించి తిరిగి వారి ఇండ్లలో సర్వే నిర్వహించారు. అశ్వాపురం, గుండాలలో సర్వే ప్రశాంతగా కొనసాగింది. పాలేరు నియోజకవర్గంలో ఉదయం 8గంటలకే సర్వే ప్రారంభించినా.. మందకొడిగా సాగింది. ఎన్యూమరేటర్లకు ఏంచెపితే ఏమవుతుందోనని కొందరు వెనుకాడారు. ఎట్టకేలకు మధ్యాహ్నం 12 గంటలకు సర్వే ప్రక్రియ ఊపందుకుంది. కూసుమంచి మండలం పోచారంలో దాదాపు 150 కుటుంబాలకు స్టిక్కర్లు వేయకపోవడంతో వారి వివరాలు నమోదు చేసేందుకు ఎన్యూమరేటర్లు తిరస్కరించారు. దీంతో ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి కల్పించుకుని విషయాన్ని తహసీల్దార్ కిషోర్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లో ఆకుటుంబాలను సర్వే చేయాలని తెలిపారు. దీంతో స్పందించిన తహసీల్దార్ వెంటనే 150 ఫారాలు పంపించి గ్రామంలో అన్ని కుటుంబాలను సర్వే చేశారు. ఖమ్మం రూరల్ మండలం ఆరెంపులలో కూడా ఇదే పరిస్థితి ఉండటంతో గ్రామ సర్పంచ్ బండి జగదీష్ కల్పించుకుని అన్ని కుటుంబాలను సర్వేలో చేర్చారు. తల్లాడ మండలం పినపాకలో సుమారు 50 ఇళ్లకుపైగా స్టిక్కర్లు అంటించలేదని గ్రామస్తులు సర్వేను బహిష్కరించటంతో అధికారులు అక్కడికి చేరుకుని స్టిక్కర్లు అంటించని వారిని కూడా సర్వే చేస్తామని హామీ ఇవ్వటంతో ఆ తర్వాత సహకరించారు. సత్తుపల్లి మండలం సిద్ధారంలో స్టిక్కర్లు అంటించలేదని ఎన్యూమరేటర్‌ను కొద్ది సేపు అడ్డుకున్నారు. బేతుపల్లిలో సైతం పేర్లు నమోదు కాలేదంటూ పంచాయతీ కార్యాలయానికి చేరుకోవటంతో మధిర డిప్యూటీ డీఈఓ బి.రాములు వారికి సర్దిచెప్పి పేర్లు నమోదు నమోదు చేసుకోవటంతో సర్వే సజావుగా సాగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాయంత్రం 4.30 గంటల నుంచి సత్తుపల్లి జేవీఆర్ డిగ్రీ కళాశాలలో స్టిక్కర్లు అంటించని, కొత్తగా నమోదు చేసుకున్నవారు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొస్తే అక్కడికక్కడే నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఎన్యూమరేటర్లకు సకాలంలో భోజనం అందించక పోవటంతో ఇబ్బంది పడ్డారు. డీసీసీబీ అధ్యక్షుడు మువ్వా విజయబాబు సత్తుపల్లిలోని సొంత అపార్ట్మెంట్లో కుటుంబ సర్వే సిబ్బంది వద్ద పేర్లు, వివరాలు నమోదు చేయించుకున్నారు. భద్రాచలం డివిజన్లో సర్వే ప్రశాంతంగా ముగిసింది. వాజేడు మండల కేంద్రంలో ఓ కుటుంబంలో పెండ్లి వేడుకలు ఉన్నాయనే కారణంతో వారి విజ్ఞప్తి మేరకు ఎన్యూమరేటర్ సోమవారం రాత్రే సర్వే చేశారు. భద్రాచలంలో వందల సంఖ్యలో ఇండ్లకు స్టిక్కర్లు అంటించ లేదు. సర్వే సమయంలో ఇది వెలుగులోకి రావటంతో ఎన్యూమరేటర్లను అదనంగా ఏర్పాటు చేసి సమాచారాన్ని సేకరించారు. పట్టణంలో సుందరయ్య నగర్ కాలనీలోని 30 ఇండ్లు వారు స్టిక్కర్లు అంటించకపోవటంతో డి గ్రీ కళాశాలలోని కేంద్రానికి వచ్చి నిరసన తెలిపారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజ య్య పట్టణంలో భగవాన్‌దాస్ కాలనీలోని తన ఇంటి వద్ద సర్వేలో సమాచారం అందజేశారు. ముంపు మండలాల్లో సర్వే జరగలేదు. అయితే ముంపులోనే పేర్కొన్న భద్రాచలం పట్టణానికి ఆనుకొని ఉన్న రాజుపేట కాలనీ( ఇది లక్ష్మీదేవి పేట రెవెన్యూ గ్రామం) శ్రీరామనగర్ కాలనీ( ఇది పురుషోత్తపట్నం రెవెన్యూ గ్రామం )లో సర్వే చేశారు. ఇక్కడ సర్వే ఉండ దని అధికారులు ముందుగా ప్రకటించినా.. మంగళవారం సర్వే చేశారు. మధిర మండలంలోని సిద్దినేనిగూడెం, మాటూ రు, సిరిపురం తదితర గ్రామాల్లో సర్వే పూర్తిస్థాయిలో జరగలేదు. ముఖ్యంగా కొన్ని ఇళ్లకు స్టిక్కర్లు అంటించకపోవడంతో సర్వే సిబ్బంది ఆయా కుటుంబాలకు వెళ్లి సర్వే నిర్వహించలేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. మధిర నగరపంచాయతీ పరిధిలోని 8,9,10, 11 వార్డుల్లో పలు కుటుంబాలకు సర్వే నిర్వహించకపోవడంతో వారు నిరసన వ్యక్తంచేశారు. ఖమ్మం నగర శివారరులోని మమత ఆసుపత్రి ప్రాంతంలో కూల్చిన గుడిసెల ప్రాంతంలో వేసుకున్న గుడారాల్లో సర్వేలో అనేక ఇబ్బంది పడ్డారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాసనగర్, ప్రకాష్‌నగర్, చెరువుబజార్, ముస్తఫానగర్, రమణగుట్ట, వికాలాంగుల కాలనీ, రాపర్తినగర్, బీసీ కాలనీ కాల్వోడ్డు తదితర ప్రాంతాల్లో స్టిక్కరింగ్ ప్రక్రియ జరగక పోవడంతో స్థానికులు కొంత అందోళన గురైయ్యారు. స్టిక్కర్ల కోసం ఉదయం 7 గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలోని మీ సేవా కార్యాలయం ముందు బారులు తీరారు. దీంతో అధికారులు 10 గంటల సమయంలో ఇంటినెంబర్ల సీరిస్ ఆధారంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. -
సర్వేలో మహిళల సిగపట్లు
ఈ ఇల్లు నాదంటే.. నాదని ఇద్దరు మహిళల ఘర్షణ ఆ ఇంటిని వదిలేసిన ఎన్యూమరేటర్ పోలీస్‌స్టేషన్‌కు చేరిన పంచాయితీ పరకాల : సర్వేకు వచ్చిన ఎన్యూమరేటర్‌తో ఈ ఇల్లు నాదంటే.. నాదని ఇద్దరు మహిళలు ఘర్షణ పడిన సంఘటన పట్టణంలోని వెలమవాడలో మంగళవారం సాయంత్రం జరిగింది. పట్టణంలోని వెలమవాడకు చెందిన దగ్గు నర్సింగరావు ఎంబీబీఎస్ వైద్యుడు. పరకాలలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సునీతతో 1999లో వివాహమైంది. కొంతకాలం అన్యోన్యంగా ఉన్నారు. తర్వాత విభేదాలు వచ్చాయి. అదే సమయంలో నర్సింగరావు శ్రీశైలం సమీపంలోని సుండిపేటకు చెందిన వాణి(నూర్జహాన్)ను 2005లో మరో పెళ్లి చేసుకున్నాడు. అతడు అనారోగ్యంతో 2008లో మృతిచెందాడు. అప్పటి నుంచి ఆయన భార్యలు సునీత, వాణి మధ్య తగాదా వచ్చి కోర్టుకెక్కారు. కోర్టులో కేసు విచారణలో ఉంది. ఇదే సమయంలో సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నట్లు సమాచారం అందడతో వాణి సోమవారం రాత్రి పట్టణానికి చేరుకుంది. సర్వే కోసం వచ్చే సిబ్బంది కోసం మంగళవారం ఎదురుచూస్తున్నారు. ఆ కాలనీలో 9-49 ఇంటినంబర్లో ఉంటున్న వారివద్దకు ఎన్యూమరేటర్ కేదారి వచ్చారు. ఆయన సమక్షంలోనే సునీత, వాణి.. ఆ ఇంటిపై నా పేరు రాయమంటే.. నా పేరు రాయమని ఘర్షణకు దిగారు. గంటల తరబడి ఇద్దరు పేరు కోసం పట్టుబట్టడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారిద్దరిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. సునీత, వాణికి సీఐ వెంకటేశ్వర్లు కౌన్సెలింగ్ ఇచ్చి గొడవ పెట్టుకోవడం సరికాదని సూచించారు. కేసు విచారణలో ఉండగా మీరిలా ప్రవర్తించడం పద్ధతి కాదని, మరోసారి గొడవ జరిగితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కాగా ఎన్యూమరేటర్ ఆ ఇంటిని మినహాయించి సర్వే కొనసాగించాడు.