Eturnagaram
-
నేలకొరిగిన లక్ష చెట్లు..
-
ఏటూరునాగారంలో నేలకొరిగిన దట్టమైన అడవి
-
అయ్యప్ప భక్తుడిని కారుతో ఢీ.. బైరి నరేష్‌పై కేసు
సాక్షి, ములుగు జిల్లా: అయ్యప్ప భక్తుని కారుతో ఢీకొట్టిన ఘటనలో ఏటూరు నాగారం పీఎస్‌లో బైరి నరేష్‌పై కేసు నమోదైంది. అయ్యప్ప భక్తుడిని వాహనంతో ఢీకొట్టి గాయపర్చిన ఘటనలో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన అనంతరం మంగపేట వైపు వెళ్తుండగా నరేష్ వాహనం ప్రమాదానికి గురైంది. జీడివాగు వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. సకాలంలో ఎయిర్ బెలూన్లు ఓపెన్ అవడంతో అంతా సురక్షితంగా బయటపడ్డారు. ఘటన తర్వాత వాహనం అక్కడే వదిలేసి నరేష్ బస్సులో వెళ్లిపోయారు. వాహనం ప్రమాదంపై మరో కేసు నమోదైంది. ప్రమాదం జరిగిన అనంతరం మణుగూరు వైపు వెళ్లిన బైరి నరేష్, అయన భార్య, కొడుకు, డ్రైవర్ వెళ్లినట్లు సమాచారం. బైరి నరేష్ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. బైరి నరేష్ స్వగ్రామం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు. ఇదీ చదవండి: బిర్యానీ గొడవ: కస్టమర్లపై దాడి.. రాజాసింగ్ సీరియస్ -
బైరి నరేష్ అడ్డగింత.. తీవ్ర ఉద్రిక్తత
ములుగు, సాక్షి: ఏటూరు నాగారంలో ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. నాస్తికుడు బైరి నరేష్‌పై అయ్యప్ప భక్తులు భగ్గుమంటున్నారు. అతన్ని అరెస్ట్ చేయాలని ఆందోళన చేపట్టారు. అందుకు కారణం.. బైరి నరేష్ వాహనం కారణంగా ఓ అయ్యప్ప భక్తుడికి గాయాలు కావడమే. సోమవారం.. కోరేగావ్ సమావేశం కోసం బైరి నరేష్ ఏటూరు నాగారం వెళ్లాడు. అది తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు అయ్యప్ప స్వాములు. గతంలో అయ్యప్ప మీద చేసిన వ్యాఖ్యలు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ బైరి నరేష్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో నరేష్ అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. అయితే నరేష్ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ అయ్యప్ప స్వాములు వాహనాన్ని అడ్డుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో.. నరేష్ వాహనం ముందుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ అయ్యప్ప భక్తుడికి గాయాలయ్యాయి. బాధితుడ్ని పోగు నర్సింహారావుగా గుర్తించారు. దీంతో నరేష్‌ను అరెస్ట్ చేయాలంటూ స్వాములు అందోళన చేపట్టారు. గతంలో.. ఏడాది కిందట.. అయ్యప్ప స్వామి పుట్టుక గురించి బైరి నరేష్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. హిందూ సంఘాలు, అయ్యప్ప స్వాముల ఫిర్యాదు నేపథ్యంతో కేసు నమోదు అయ్యింది. దాదాపు 45 రోజుల పాటు నరేష్ చర్లపల్లి జైలులో ఉన్నాడు. కోడంగల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చాక కూడా నరేష్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. హనుమకొండలో మరోసారి అయ్యప్ప భక్తులు దాడి చేశారు. అయితే ఉద్దేశపూర్వకంగానే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు అప్పుడు పోలీసుల విచారణలో బైరి నరేష్ అంగీకరించాడు. -
హనుమకొండ: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
హనుమకొండ, సాక్షి: జిల్లా రహదారి నెత్తురోడింది. శుక్రవారం తెల్లవారుజామున ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట శివారులో ఘోర ప్రమాదం జరిగింది. ఇసుక లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. గాయపడిన వాళ్లను వరంగల్ ఎంజీఎం తరలించి చికిత్స అందిస్తున్నారు. వీళ్లంతా ఏటూరునాగారంకు చెందిన ఒకే కుటుంబంగా నిర్ధారణ అయ్యింది. దైవదర్శనం కోసం శంకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతదేహాల్ని ఎంజీఎం మార్చురీకి తరలించి పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మృతులు మంతెన కాంతయ్య(72) మంతెన శంకర్(60) మంతెన భారత్(29) మంతెన చందన(16) చికిత్స పొందుతున్నవాళ్లు మంతెన రేణుక(60) మంతెన భార్గవ్(30) మంతెన శ్రీదేవి(50) -
‘వెంటపడి వేధించిండు.. అందుకే చంపేసిన’
సాక్షి, ములుగు: జిల్లాలోని ఏటూరునాగారం పరిధిలో యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. తనను వేధిస్తున్న దగ్గరి బంధువును.. కత్తితో పొడిచి చంపింది ఓ యువతి. హత్య అనంతరం సరాసరి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తాను ఎందుకు చంపింది వివరించి మరీ పోలీసులకు లొంగిపోయిందామె. ఏర్రలవాడలో నివసించే రామటెంకి శ్రీనివాస్ అనే యువకుడు స్థానికంగా ఉంటున్న జాడి సంగీతను ప్రేమ, పెళ్లి పేరుతో వేధిస్తున్నాడు. వీళ్లిద్దరూ దగ్గరి బంధువులు. ఇరు కుటుంబాలు కూలీ పనితో జీవనం కొనసాగిస్తున్నాయి. అయితే.. సంగీతపై శీను వేధింపులు శ్రుతి మించిపోతూ వస్తున్నాయి. ఈ క్రమంలో విసిగిపోయిన ఆమె.. శీనుపై కేసు పెట్టింది. దీంతో శీనును అరెస్ట్ చేశారు పోలీసులు. జైలుకు వెళ్లొచ్చాక కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. వెంటపడి పెళ్లి చేసుకోవాలంటూ వేధించడం పెంచాడు. ఈసారి మద్యం మత్తులో వేధించడం మొదలుపెట్టాడు. భరించలేకపోయిన సంగీత.. శీనును చేతులు కట్టేసి మరీ కత్తితో పొడిచి చంపేసింది. ఆపై నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. -
అటవీ శాఖలో దొంగలు తయారయ్యారు: సీఎం కేసీఆర్ ఫైర్
సాక్షి, ములుగు: ఏటూరునాగారం సమీక్ష సందర్భంగా అటవీ శాఖ అధికారులపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ‘‘ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో దొంగలు తయారయ్యారు. అన్నీ అమ్ముకుదొబ్బారు. ఒక్కచెట్టు అయినా ఉందా?’’ అని ములుగు జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్‌శెట్టిని ప్రశ్నించారు. ‘‘అటవీ ప్రాంతంలో రోడ్డు వేయనీయం, బ్రిడ్జి కట్టనీయం, కరెంట్ పోల్ వేయనీయం అనడం మంచిదికాదు. శాపల్లి బ్రిడ్జి నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? రోడ్డు సౌకర్యం లేక రేషన్ ఇవ్వలేక కలెక్టర్, ప్రజలు చావాలా? వెరీ సారీ.. ఇది మంచి పద్ధతి కాదు’’ అని మండిపడ్డారు. చదవండి: (ఇంకా ఉద్యమాలు చేయాలె.. మాజీ మహిళా నక్సలైట్‌తో సీఎం కేసీఆర్) -
ఇంకా ఉద్యమాలు చేయాలె.. సంధ్యకు సీఎం కేసీఆర్ భరోసా
సాక్షి, వరంగల్: ‘‘ధైర్యంగా ఉండమ్మా.. ఇంకా మనం ఉద్యమాలు చేయాలె.. టీఆర్ఎస్లో ఇంకా బాగా పనిచేయాలె.. త్వరలో హైదరాబాద్‌కు పిలిపించుకుని మాట్లాడుతా..’’అని మాజీ నక్సలైట్, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పురి స్వరూప అలియాస్ సంధ్యకు సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఏటూరునాగారంలో సమీక్ష పూర్తిచేసుకుని హనుమకొండకు బయలుదేరుతున్న సమయంలో.. స్వరూప సీఎంను కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అది చూసిన సీఎం ఆమెను బస్సులోకి పిలిపించుకుని మాట్లాడారు. అనంతరం స్వరూప మీడియాతో మాట్లాడారు. ‘‘మాది తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామం. చిన్నవయసులోనే మావోయిస్టు పార్టీలో పనిచేసి లొంగిపోయాను. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాను. నాకు అమ్మనాన్న ఎవరూ లేరు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. ఈ విషయాలన్నీ సీఎం కేసీఆర్‌కు విన్నవించుకున్నాను. సార్ నా ఫోన్ నంబర్ తీసుకున్నారు. హైదరాబాద్‌కు పిలిపించుకుని మాట్లాడుతానని హామీ ఇచ్చారు..’’అని వివరించారు. చదవండి: (CM KCR: వరదలు విదేశీ కుట్రే.. సీఎం కేసీఆర్ సంచల వ్యాఖ్యలు) -
గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతు
సాక్షి, వరంగల్: ఉగాది పండుగ రోజున ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఏటూరునాగారం మండలం రోహీర్ గ్రామ సమీపంలోని గోదావరి నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. రోహీర్ గ్రామానికి చెందిన డోంగిరి సందీప్, ఆకుదారి సాయివర్దన్, సతీష్ బెడిక ముగ్గురు విద్యార్ధులు ఉగాది పండుగ రోజున గోదావరిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. నీటిలో దిగి ఈత కొడుతుండగా ప్రవాహం అధికంగా ఉండడంతో గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు గల్లంతైన వారి గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: అలాంటి వారు వెంటనే అన్‌ఫాలో కండి: కేటీఆర్ -
యూకే నుంచి వచ్చి.. రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
సాక్షి, మల్కాజిగిరి/ఏటూరునాగారం : ఉన్నత విద్య కోసం యూకే వెళ్లిన ఆ యువకుడు సెలవులకు ఇంటికి వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన హర్షవర్ధన్‌రెడ్డి(26) యూకేలో ఎంఎస్ చేస్తున్నాడు. క్రిస్మస్ సందర్భంగా అక్కడ సెలవులు ఇవ్వడంతో సొంతవూరికి వచ్చాడు. వచ్చే నెలలో తిరిగి యూకేకు వెళ్లాల్సివుంది. మల్కాజిగిరిలో ఉంటున్న తన స్నేహితుడు రాహుల్‌ను కలవడానికి బుధవారం తన బైక్ మీద మల్కాజిగిరికి వస్తుండగా ఆర్.కె.నగర్ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో హర్షవర్ధన్‌రెడ్డికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ సంఘటన పై అతని సోదరుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన దురదృష్టకరం.. : ఎమ్మెల్యే మైనంపల్లి ఉన్నత చదువు చదువుకుంటున్న విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తనను కలిచివేసిందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గతంలో కూడా అదే ప్రాంతంలో జరిగిన ప్రమాదాల్లో మరి కొందరు మృతి చెందినట్లు తెలిసిందన్నారు. ఆ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. -
ములుగు జిల్లాలో పులి చర్మం స్వాధీనం
ఏటూరునాగారం/ములుగు: పోలీసులు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల ముఠాను అరెస్టు చేసి.. వారి నుంచి పెద్దపులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్ గురువారం ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. ఏటూరునాగారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద పులి చర్మం అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి పులి చర్మంతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. వాజేడు మండల కేంద్రానికి చెందిన తిరుమలేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా చండూరు గ్రామానికి చెందిన సత్యం అని తేలింది. ఇన్చార్జి ఎఫ్డీఓ శ్రీగోపాల్‌రావు, ఇతర అధికారులు పులి చర్మాన్ని పరీక్షించి.. నిజమైనదేనని నిర్ధారించారు. కాగా, పులి చర్మాన్ని వరంగల్‌లోని ఓ మహిళా కాంట్రాక్టర్‌కు అప్పగించడానికి వారు ముల్లకట్ట బ్రిడ్జి వద్దకు వచ్చారని పోలీసుల విచారణలో వెల్లడైంది. -
కరోనా పేరు తెలియని అడవిబిడ్డలు
ఏటూరునాగారం: మీ గూడెంలో ఎవరికైనా కరోనా వచ్చిందా.. అని ప్రశ్నించినప్పుడు వారు చెప్పే సమాధానం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అవును.. అడవిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవనం సాగించే వారికి కరోనా అంటే కొత్తగా వచ్చిన జ్వరం అని మాత్రమే తెలుసు.! ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కోవిడ్ ఆ గూడెం పొలిమేర కూడా దాటకపోవడం గమనార్హం. సుమారు 15 సంవత్సరాల క్రితం ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన వీరు ఏటూరునాగారం గ్రామ పంచాయతీలోని మామిడిగూడెంలో కరోనా వంటి మహమ్మారి ఆనవాళ్లు కూడా తాకకుండా ఆనందంగా జీవనం సాగిస్తోన్నారు. ఉదయం లేచినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక పనిలో నిమగ్నం కావడం తప్ప మరో ద్యాస లేకుండా ఉంటున్నారు. గ్రామంలోని ఉన్న ఇళ్లు దూరం దూరంగా ఉంటూ అన్ని రకాల చెట్ల మధ్యలో నివసిస్తుంటారు. రిజర్వు ఫారెస్టు కావడంతో పక్కా ఇళ్లు లేకున్నా గూనపెంకులు, మట్టి గోడలను నిర్మించుకొని సావాసం చేస్తున్నారు. విభిన్నమైన అలవాట్లు గూడేనికి ఆనుకొని ప్రవహిస్తున్న జంపన్నవాగులోని చెలిమల నీటినే నేటికీ తాగునీటిగా వాడుతారు. ఇప్ప పువ్వులను వండుకొని తింటారు. గంజి, అంబలి, లద్దా లాంటివి సేవిస్తారు. ఇప్ప పువ్వు సారను తాగుతుంటారు. కట్టుబొట్టు అంతా విభిన్నంగా ఉంటుంది. ఒకరింటికి ఒకరు పోవడం గానీ, ఒకరి ఆహారం మరొకరు తీసుకోవడం వంటివి చేయరు. ఎవరి ఇంటిలో వారే వండుకోవడం, ఎవరి ఆహారాన్ని వారే సమకూర్చుకుంటారు. అడవిలో లభించే నల్లగడ్డలు, ఎర్రగడ్డలు, పుట్టగొడుగులు ఆహారంగా తీసుకుంటారు. ఏటూరునాగారంలో ప్రతీ శనివారం నిర్వహించే సంతకు వచ్చి వారానికి సరిపడా నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసుకుంటారు. అలాగే ఇప్ప పువ్వును బియ్యానికి విక్రయిస్తారు. పువ్వు ఇచ్చి బియ్యాన్ని తీసుకోవడం వారి అలవాటు. కూలీ పనులకు పోయి వస్తే వెంటనే వాగుల్లోకి వెళ్లి స్నానం చేసిన తర్వాతనే గూడెంలోకి వస్తామని గూడెం ప్రజలు చెబుతున్నారు. శానిటైజేషన్ అంటే వారికి తెలియదు. శానిటైజర్ బాటిళ్లు ఎలా ఉంటాయో కూడా తెలియవు. మూతికి మాస్క్ కూడా ఆ గూడెంలో ఎవరు కట్టుకోరు. కరోనాతో ప్రపంచం వణుకుతోన్న ఈ రోజుల్లో కూడా వారు స్వేచ్ఛాయుత జీవితాన్ని గడుపుతున్నారు. కరోనా వచ్చిందా.. మీ గూడెంలో ఎవరికైనా కరోనా వచ్చిందా.. అంటే రాలేదు.. రాదు ధీమాగా చెబుతున్నారు ఈగూడెంవాసులు. ఆ గూడెంలోని జనులను సాక్షి పలకరించగా.. పలు విషయాలను వెల్లడించారు. ఏ ఇంటికి వెళ్లి అడిగినా కరోనా వచ్చిందా అంటే రాలేదనే సమాధానమే వస్తుంది. కరోనా అంటే తెలుసా అంటే కొత్తగా వచ్చిన జ్వరం కదా అని వారి అమాయకమైన మాటలు వింటుంటే విచిత్రంగా ఉంది. కరోనా పేరు చెబితే గడగడలాడుతున్న నేటి తరుణంలో కరోనా అంటే ఉట్టి జ్వరం అన్న ఆలోచనలో ఉండడం గమనార్హం. ఇదేకాకుండా వారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో వారికి ఏదైనా వ్యాధులు వస్తే చెట్ల పసర్లు, మంత్రాలతోనే నయం చేసుకునేవారు. ఈ మధ్య కాలంలోనే ఆ గూడేనికి ఏఎన్ఎంలు వెళ్లి చికిత్సలు అందిస్తున్నారు. లేకుంటే వారికి చెట్ల పసర్లు, మూలికలతోనే వారి రోగాలకు చికిత్సలు చేయించుకునేవారు. కరోనా వైరస్ వారి ధరి చేరకపోవడం సంతోషకరం. అయితే వారు ఎప్పుడు కూడా గుమికూడిన ప్రదేశాల్లో ఉండరు. ఎవరిని ముట్టుకోరు. షాపుల దగ్గరకు వస్తే దూరంగా ఉంటూ సామాన్లను సేకరిస్తుంటారు. వారికి తెలియకుండానే కరోనా నియమాలను పాటించడం గమనార్హం. గిరిజనుల అలవాట్లు ఇంటికి ఇంటికి మధ్య దూరం ఉంటుంది. ఆ గూడెంలోకి ఎవరు రాకుండా కుక్కలు కాపలా ఉంటాయి. గూడెంలోకి కొత్త వ్యక్తి వస్తే పది అడుగుల దూరం నుంచి మాట్లాడి పంపిస్తారు. గ్రామం చుట్టూ దట్టమైన అడవి, ఒక పక్క వాగు నీరు ఎలాంటి విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, కూలర్లు ఉండవు. ప్రతి ఇంటి వద్ద రాత్రి వేళలో నెగడు (కర్రలతో నిప్పుపెట్టుకొని ) ఉంటారు. పొద్దుగాల అడవికి పోతం లేవగానే ముఖం కడుక్కొని అడవికి పోతాం. అడవిలో కావాలి్సన ఫలాలను సేకరిస్తాం. తునికిపండ్లు సేకరించి ఇంటికి తెచ్చుకొని పిల్లలకు ఇస్తాం. కట్టెలు కొట్టడం, ఇంటిచుట్టూ శుభ్రం చేస్తుంటాం. మాకు కావాలి్సన ఆహారాన్ని తయారు చేసుకొని ఉదయమే తింటాం. ఆ తర్వాత చిన్న చిన్న పనులు చేసుకొని పడుకుంటాం. మాకు ఈ కరోనా గురించి పెద్దగా తెలవదు. - అడమయ్య, మామిడిగూడెం కరోనా అంటే భయం లేదు కరోనా వైరస్ మాకు వస్తుందనే భయం లేదు. ఎందుకంటే మేము ఎటు పోవడం లేదు. మా గూడేనికి ఎవరు రావడం లేదు. అది మనుషులతోనే వస్తుందని తెలుసు. ఇప్పటి వరకు మా గూడెంలోని ఎవరికి రాలేదు. అందరం మంచిగానే ఉన్నాం. స్కూళ్లు కూడా బంద్ కావడంతో సారు కూడా రావడం లేదు. కరోనా వైరస్ అంటే పెద్దగా మేము పట్టించుకోవడం లేదు. - మహేశ్, మామిడిగూడెం ముందస్తు అవగాహన మామిడిగూడెంలోని గిరిజనులకు ముందస్తుగా అవగాహన కల్పించాం. ఎవరు కూడా బయటకు రాకుండా ఉండాలని వివరించాం. గ్రామానికి ఎవరైనా వస్తే వెంటనే పంపించి వేయాలని సూచనలు చేశాం. గ్రామంలో జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు వస్తే వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ఫోన్ నంబర్లను అందుబాటులో పెట్టాం. గ్రామానికి వచ్చిపోయే వారు ఎవరు కూడా లేకపోవడంతో వారికి కరోనా భయం లేదు. కరోనా వచ్చే అవకాశాలు కూడా తక్కువే. - ఈసం రామ్మూర్తి, ఏటూరునాగారం సర్పంచ్ చదవండి: జనం చస్తుంటే.. జాతర చేస్తారా.. చదవండి: చెరువులో విషప్రయోగం.. -
తండాలో నో కరోనా..!
ఏటూరునాగారం : కరోనాతో ప్రపంచమంతా గడగడలాడిపోతుంటే ఏటూరునాగారం మండల పరిధిలోని కోయగూడ ఎల్లాపురం పంచాయతీ పరిధిలోని లంబాడీతండా ప్రజలు మాత్రం ప్రశాంత జీవనం గడుపుతున్నారు. వారి చైతన్యమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. కట్టుబాట్లు, గ్రామ పెద్దలు తీసుకునే నిర్ణయాలను సమష్టిగా ఆచరిస్తూ.. కోవిడ్ మహమ్మారి నుంచి తమను తాము రక్షించుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని, చేతులు ఎప్పటికప్పుడు శానిటేషన్ చేసుకోవాలని గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ గ్రామాల నుంచి బయటకి వెళ్లిన వారు ఇంటికి తిరిగి రాగానే వేడినీళ్లతో స్నానం చేయాలని నిర్ణయించారు. రోజూ వేడి చేసిన నీరు తాగుతూ.. వ్యక్తిగత శుభ్రత పాటించడంతో కరోనా తమ గ్రామానికి రాలేదని గ్రామస్తులు ముక్తకంఠంతో చెబుతున్నారు. అన్ని కార్యక్రమాలకు దూరం తండాలోని ప్రజలు ఎవరూ బయటికి వెళ్లకుండా ఉండడం.. తండాకు ఎవరినీ రానీయకుండా ఆపేయడం వంటి చర్యలతో కరోనా నియంత్రణలో ఉందని గ్రామస్తులు తెలిపారు. ఇక్కడి ప్రజలు మూడు దశాబ్దాలుగా పోడు వ్యవసాయంతో పాటు వరి, మొక్కజొన్న, మిర్చి, పత్తి, వేరుశనగ పండిస్తున్నారు. గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో నిరంతరం ఇబ్బందులు పడుతుంటారు. అయినా చైతన్యంతో స్థానిక పరిస్థితులపై నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారు. కరోనా మొదటి వేవ్ ప్రారంభంలోనే ప్రజలంతా ఏకమై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు కావడంతో నిత్యావసర వస్తువులను పంటల ఆధారంగా ఒకేసారి నిల్వ చేసుకోవడం జరుగుతుంటుంది. ఒక వైపు జీడివాగు, మరోవైపు అటవీప్రాంతం కావడంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. సెకండ్ వేవ్‌లో ఒక్క కేసు కూడా లేకపోవడం గమనార్హం. సంపూర్ణ అవగాహనతోనే.. కరోనా నిబంధనలపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాం. గ్రామంలో 102 కుటుంబాలున్నాయి. గ్రామంలో బ్లీచింగ్, శానిటేషన్ పనులు చేయించాం. ట్రైబల్ ప్రాంతం కావడంతో సంపూర్ణ మద్దతులో అభివృద్ధి పనులు చేపట్టాం. పారిశుద్ధ్య పనులతోపాటు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. దోమల మందు పిచికారీ చేయించడం జరిగింది. – లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి, కోయగూడ ఎల్లాపురం సమష్టిగా నిర్ణయాలు.. గ్రామంలో అభివృద్ధి పనులకై సమష్టిగా నిర్ణయం తీసుకుంటాం. కరోనా కట్టడికి మాస్క్‌లు, శానిటేషన్‌తోపాటు భౌతికదూరం పాటించే అలవాటు ఉంది. అన్ని కుటుంబాలు వ్యవసాయ పనుల పైనే దృష్టి పెట్టారు. రాత్రి అయితే గానీ ఎవరూ ఎవరికి కలవరు. ఉదయం నుంచి రాత్రి వరకు పొలాల వద్ద, అటవీ ప్రాంతాలకు పనుల నిమిత్తం పోతుంటారు. దాని వల్ల భౌతికదూరం ఏర్పడుతుంది. – నగేష్, ఉప సర్పంచ్, కోయగూడ ఎల్లాపురం -
కెమెరాకు చిక్కింది.. ఆ తర్వాత జాడ లేకుండా పోయింది!
ఏటూరునాగారం/చెన్నూరు: మంచిర్యాల జిల్లా చెన్నూరు అటవీ ప్రాంతం నుంచి కవ్వాల్ – 4(కె–4) పెద్దపులి ములుగు జిల్లా ఏటూరునాగారం అభయారణ్యంలోకి ప్రవేశించిందనే సమాచారంతో ఉద్యోగులు అన్వేషణలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు చెన్నూరు, ఏటూరునాగారం వన్యప్రాణి సిబ్బంది సంయుక్తంగా పులిజాడల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. రెండు నెలల క్రితం చెన్నూరు అటవీ ప్రాంతం నుంచి బుద్దారం అడవుల్లోకి వెళ్లే క్రమంలో కెమెరాకు చివరిసారిగా చిక్కిన పులి ఆ తర్వాత జాడ లేకుండా పోయింది. దీంతో మహారాష్ట్ర, జయశంకర్ భూపాలపల్లి, ములుగు అటవీ ప్రాంతాల్లోకి పులి వెళ్లి ఉంటుందనే అంచనాతో ఉద్యోగులు విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. ఏటూరునాగారం అభయారణ్యంలోకి కవ్వాల్ –4 (కె–4) పెద్దపులి వచ్చిన జాడల కోసం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో పులి ఇక్కడే ఆవాసం ఏర్పాటు చేసుకుని ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఐలాపురం అడవుల్లో ఆనవాళ్లు ఏటూరునాగారం రేంజ్ పరిధిలోని ఐలాపురం అటవీ ప్రాంతంలో పెద్దపులి అడుగులను అటవీశాఖ అధికారులు ఈనెల 8న గుర్తించారు. దీంతో పెద్దపులి కదలికలను తెలుసుకునేందుకు కెమెరాలను కూడా ఏర్పాటు చేయించారు. ఏటూరునాగారం డీఎఫ్‌వో ప్రదీప్శెట్టిని వివరణ కోరగా ఆ పాదముద్ర ఇప్పటివరకు ఏ పులిది అనే విషయం నిర్ధారించలేదన్నారు. అలాగే, ఈ ఏడాది జనవరి 29న కూడా కన్నాయిగూడెం మండలంలోని భూపతిపూర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి అడుగులు కనిపించడంతో అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. గతంలో ఈ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో పెద్దపులులు ఉండేవని అటవీశాఖ రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఇందుకోసం కెమెరాలను ఈ ప్రాంతంలో అమర్చి పరిశీలిస్తున్నారు. అనుమానాలు అనేకం.. నడుముకు ఉచ్చు బిగిసి నాలుగేళ్లపాటు ఎటూ కదలని కె–4 పులి రెండు నెలల క్రితం ఇతర ప్రాంతానికి ఎలా వెళ్లింది..? ఒకవేళ కె–4 మంచిర్యాల ఫారెస్ట్ డివిజన్లోని ఇతర ప్రాంతానికి వెళ్తే సీసీ కెమెరాలకు ఎందుకు చిక్కలేదు..? ఈ ప్రాంతంలో దాని పాదముద్రలు ఎందుకు లభ్యం కాలేదు..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. చదవండి: ఆరేళ్లుగా కుమార్తె అస్థికలు భద్రపరిచి.. జాడలేని తల్లి.. పాపం పులి కూనలు.. -
భార్యపై పెట్రోల్ పోసి హత్య చేసిన భర్త
సాక్షి, ఏటూరునాగారం: కట్టుకున్న భర్త భార్యపై పెట్రోల్ పోసి హత్య చేసిన సంఘటన మండల కేంద్రంలోని తీగలవాయి ప్రాంతంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం. ఏటూరునాగారం మండలకేంద్రంలోని తీగలవాయి ప్రాంతానికి చెందిన గునిగంటి ప్రవీణ్‌కుమార్‌తో ఇదే మండలం చిన్నబోయినపల్లి పంచాయతీ హనుమాన్ నగర్‌కు చెందిన గొసు్కల జ్యోతి, నర్సయ్య కుమార్తె శిరీషతో రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. స్థానికంగా ఇద్దరూ నివాసం ఉంటున్నారు. వీరికి ఏడాది బాబు కూడా ఉన్నాడు. అనాథగా మారిన బాలుడు బుధవారం భార్యభర్తల మధ్య గొడవలు రావడంతో భర్త ప్రవీణ్‌కుమార్ భార్య శిరీషపై పెట్రోల్ పోసి నిప్పంటించగా మంటలు వ్యాప్తి చెంది శిరీష ఒల్లు కాలిపోయింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న శిరీషను భర్త ప్రవీణ్ ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించాడు. పరిస్థితి విషమించడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు భర్త ప్రవీణ్‌కుమార్ విలేకరులకు తెలిపారు. భార్య మృతదేహాన్ని వదిలేసి పారిపోయి తన నివాసానికి రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కానిస్టేబుల్ కృష్ణయ్య నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తల్లి మృతి చెందడంతో దిక్కుతోచని స్థితిలో బాలుడు ఉన్నాడు. -
ఐలాపురం అడవుల్లో పెద్దపులి
ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం రేంజ్ ఐలాపురం అటవీ ప్రాంతంలో సోమవారం పెద్దపులి అడుగులను అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఎఫ్ఆర్ఓ ఆసిఫ్ పులి అడుగు జాడలపై డీఎఫ్‌వో ప్రదీప్కుమార్శెట్టికి సమాచారం ఇచ్చారు. పులి జాడను కనిపెట్టేందుకు కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేయాలని డీఎఫ్‌వో ఆదేశించడంతో పులి సంచరించే నీటి వసతి ఉన్న ప్రాంతాలు, వాగులు, చెలిమలు, కుంటల వద్ద కెమెరాలతో అన్వేషిస్తున్నారు. చదవండి: కే–4 ఆడ పులి.. దాని జాడేది? -
ఏటూరునాగారంలో పులి!
సాక్షి, హైదరాబాద్: ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలు, కదలికలు రికార్డయ్యాయి. టైగర్ రిజర్వ్‌లకు ఆవల కొత్తగా మరో అడవిలో పులి కనిపించడం, అక్కడే ఆవాసం ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించడం ఒక శుభపరిణామంగా అటవీశాఖ అధికారులు, పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. ఏటూరునాగారంతో పాటు కిన్నెరసాని, పాకాల అటవీ ప్రాంతాల్లోనూ పులులు స్థిరనివాసం ఏర్పరచుకునేందుకు అనువైన పరిస్థితులున్నాయని పర్యావరణవేత్తలు వెల్లడించారు. రాష్ట్రంలో మెరుగైన అటవీ, వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ చర్యలతో పాటు సువిశాల దట్టమైన అడవి, తగిన సంఖ్యలో వివిధ రకాల జంతువులు, నీటి వనరులు అందుబాటులో ఉండటం పులులు ఆవాసాలు ఏర్పరచుకోవడానికి, వాటి సంఖ్య వృద్ధి చేసుకునేందుకు అనువుగా ఉన్నట్టుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వైల్డ్ లైఫ్ ఓఎస్డీ ఎ.శంకరన్ ‘సాక్షి’కి తెలిపారు. పెద్ద టైగర్ రిజర్వ్‌లతో అనువైన పరిస్థితులు.. దేశంలో 50 టైగర్ రిజర్వ్‌లుండగా, వాటిలో 2 వేల చ.కి.మీ. పైబడి అటవీ వైశాల్యమున్న 4, 5 అభయారణ్యాల్లో.. ఏపీలోని నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్) 3,728 చ.కి.మీ.లలో, తెలంగాణలోని ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) 2,611 చ.కి.మీ, మరో పులుల అభయారణ్యం కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్) 2,016 చ.కి.మీ.లలో విస్తరించి ఉన్నాయి. ఒక పులి స్వేచ్ఛగా తిరిగి, తన జీవనాన్ని సాగించేందుకు 50 చ.కి.మీ. అడవి అవసరమవుతుంది. దీనిని బట్టి తెలంగాణలోని ఏటీఆర్, కేటీఆర్‌లతో పాటు ఇతర అనువైన అటవీ ప్రాంతాలు కలుపుకుని 5 వేల చ.కి.మీ. పైగానే దట్టమైన అటవీ విస్తీర్ణం ఉన్నందున ఇక్కడ వంద దాకా పులుల స్థిరనివాసం ఏర్పరుచుకునేందుకు అవకాశముందని శంకరన్ తెలిపారు. ఇప్పటివరకు పులులు లేని కిన్నెరసాని, పాకాల, ఏటూరునాగారం వంటి కొత్త ప్రదేశాల్లోనే 5 నుంచి 10 దాకా పులులు జీవనం సాగించేందుకు అనువైన పరిస్థితులున్నాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్‌లో మనుషుల జీవనాధారం పులుల భద్రత పరిరక్షణతోనే ముడిపడి ఉండబోతోందని, పులులు తమ తమ ఆవాసాల్లో సంతోషంగా జీవిస్తేనే, మనుషులు కూడా ఆనందమయ జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుందని శంకరన్ వెల్లడించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక పులి మీద అడవి, పర్యావరణం, ప్రకృతి, జంతుజాలం, గడ్డి భూములు, జీవవైవిధ్యం వంటివి ఆధారపడి ఉన్నందున పులుల మనుగడ అనేది మానవాళి కొనసాగేందుకు కూడా ప్రధానమన్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరముందని చెప్పారు. తాజా నివేదికపై అభ్యంతరాలు.. రాష్ట్రంలో 26 పులులున్నట్టుగా గతేడాది విడుదలైన టైగర్ సెన్సెస్ రిపోర్ట్–2018లో వెల్లడైంది. మంగళవారం ‘స్టేటస్ ఆఫ్ టైగర్స్ అండ్ కోప్రిడేటర్స్ అండ్ ప్రే ఇన్ ఇండియా–2018’పేరిట కేంద్ర అటవీ పర్యావరణ శాఖ విడుదల చేసిన రిపోర్ట్‌లోనూ తెలంగాణలో 26 పులులున్నట్టు పేర్కొన్నారు. అయితే కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంఖ్య తక్కువగా చూపడం, ఇతర అటవీ ప్రాంతాల్లోనూ పులులకు ఆహారంగా ఉపయోగపడే జంతువుల సంఖ్య తక్కువగా పేర్కొనడం పట్ల హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ కో ఫౌండర్ ఇమ్రాన్ సిద్ధిఖీ అభ్యంతరం తెలిపారు. తాజా నివేదికలో రాష్ట్రంలోని టైగర్ రిజర్వ్‌ల్లోని పులుల లెక్కింపు, ఇతర అంశాల పరిశీలన అసమగ్రంగా ఉందని, కొన్ని విషయాల్లో స్పష్టత లోపించిందని తెలిపారు. తెలంగాణలోని 2 పులుల అభయారణ్యాల్లో మెరుగైన పరిస్థితులున్నాయని అందువల్ల గతంలో అంచనా వేసిన 26 కంటే కూడా ఎక్కువగానే పులుల సంఖ్య ఉంటుందనే విశ్వాసాన్ని ‘సాక్షి’తో మాట్లాడుతూ ఇమ్రాన్ తెలిపారు. పులుల ఆవాసాల ద్వారా పర్యావరణ పరంగా అందుబాటులోకి వచ్చే సేవలను డబ్బు పరంగా లెక్కిస్తే ఒక్కో పులి రూ.250 కోట్ల విలువ చేస్తుందన్నారు. కోవిడ్ సంక్షోభం మనందరికీ ప్రకృతి, పర్యావరణం, వన్యప్రాణులను గౌరవించి, కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ఒక హెచ్చరికగా తెలియజేసిందని చెప్పారు. పొరుగు రాష్ట్రాల నుంచి వలసలు.. తెలంగాణలోని టైగర్ రిజర్వ్‌ల్లో పులుల వృద్ధికి అనుకూల పరిస్థితులతో పాటు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి అభయారణ్యాల్లోంచి రాష్ట్రంలోకి పులుల వలసలు పెరుగుతున్నాయి. తడోబా, తిప్పేశ్వర్లలో పులుల సంఖ్య గణనీయంగా పెరగడంతో అక్కడ చోటు సరిపోక, ఇంద్రావతిలో సానుకూల వాతావరణం లేక తెలంగాణలో మెరుగైన అటవీ విస్తరణ, వేటకు తగిన సంఖ్యలో జంతువులు, నీటివనరులు వంటివి ఉండటంతో ఇక్కడకు వస్తున్నట్టుగా అటవీ, పర్యావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. -
మహిళా మావోయిస్టు అరెస్టు
ఏటూరునాగారం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన మహిళా మవోయిస్టును ములుగు జిల్లా ఏటూరునాగారం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. స్థానిక సీఐ నాగబాబు దీనికి సంబంధించిన వివరాలు మీడియాకు తెలిపారు. ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి సిబ్బందితో ఏటూరునాగారంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. బస్టాండ వద్ద ఒక మహిళ అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయగా ఆమె వద్ద ఉన్న సంచిలో పేలుడు పదార్థాలు, పేలుళ్లకు వాడే టిఫిన్ బాక్స్, వైర్లు, విప్లవ సాహిత్యం లభించిందని చెప్పారు. ఆమెను విచారించగా, తన పేరు హేమ్ల జయమతి, భర్త పేరు మడకం ఉంగ, ఛత్తీస్‌గఢ్‌లోని మరియుగొండి మండలం పుల్లుం గ్రామవాసిగా తెలిపిందని సీఐ నాగబాబు వెల్లడించారు. ఈ విషయాన్ని ఛత్తీస్‌గఢ్ పోలీసులకు తెలపగా.. ఆమె నేరచరిత్రపై వివరాలు పంపించారని చెప్పారు. మవోయిస్టు పార్టీలో ఆమె 14 ఏళ్ల నుంచి ఆమె పనిచేస్తోందని, 2017లో పామేడు ఏరియా కమిటీలో పనిచేసిన జయమతి పలు ఎన్కౌంటర్లలో పాల్గొని తప్పించుకుందని చెప్పారు. 2013 ఏప్రిల్, మే మధ్యకాలంలో చిన్నగల్లెం, బానిసగూడ పీఎస్ పరిధిలో పోలీసు పార్టీని చంపడానికి జరిపిన కాల్పుల్లో కీలక పాత్ర పోషించినట్టు తెలిపారు. తాజాగా పామేడు కమిటీ సెక్రటరీ మనీల ఆదేశాల మేరకు ఛత్తీస్‌గఢ్ నుంచి ఏటూరునాగారం గుర్త తెలియన వ్యక్తి దగ్గర నుంచి పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం తీసుకొని తిరిగి ఛత్తీస్‌గఢ్ వెళ్లేందుకు ఏటూరునాగారం బాస్టాండ్‌కు రాగా పట్టుకున్నట్టు తెలిపారు. ఆమెపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపుతున్నామని వివరించారు. జయమతిపై ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రూ.8 లక్షల రికార్డు ప్రకటించిందని చెప్పారు. -
బువ్వపెట్టించండి సారూ..
సాక్షి, ఏటూరునాగారం: గిరిజన యువతీ, యువకులను వృత్తి నైపుణ్యులుగా తీర్చిదిద్ది ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఐటీడీఏ ఆధ్వర్యాన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా 2019 సెప్టెంబర్‌లో జీఎన్ఎం, డీఓటీ, డీఎంఎల్టీ కోర్సుల కోసం దరఖాస్తుల ఆహ్వానించారు. దరఖాస్తుదారులనుంచి 58 మందిని ఐటీడీఏ అధికారులు అక్టోబర్ 5న ఎంపిక చేశారు. ఇందులో 40 మందిని హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రికి జీఎన్ఎం, డీఎంఎల్టీ కోర్సుల్లో శిక్షణ నిమిత్తం పంపించారు. మిగతా వారిని వరంగల్, కరీనంగర్ వైద్య కోర్సులకు పంపించారు. అయితే హైదరాబాద్‌లోని విద్యానగర్‌లోని గిరిజన హాస్టల్స్‌లో నాలుగు నెలలుగా 40 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరికి భోజనం, వసతితోపాటు ఉపకార వేతనాలు, హాస్టల్‌కు మెస్‌చార్జీలు కూడా అందించాల్సి ఉంది. నాలుగు నెలల నుంచి ఇవ్వకపోవడంతో అక్కడి నిర్వాహకులు విద్యార్థులను చిన్న చూపు చూడడం, అందులో ఉండే డిగ్రీ విద్యార్థులకు మాంసం భోజనాలు పెట్టి వీరికి పెట్టకపోవడంతో చిన్నబుచ్చుకున్న విద్యార్థులు చదువు కూడా ఒంటబట్టని పరిస్థితి నెలకొంది. అయితే వారికి విద్యార్థులకు కావాల్సిన భోజన బిల్లులను ఐటీడీఏ నుంచి రాకపోవడంతో అక్కడున్న నిర్వాహకులు భోజనం, పాలు, టిఫిన్ వడ్డించేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో విద్యార్థులు పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. మెస్‌చార్జీలు ఇస్తేగాని సరైన భోజనం పెట్టని పరిస్థితి ఉందని విద్యార్థులు వాపోతున్నారు. అంతేకాకుండా ఉపకార వేతనాలు లేక హాస్టల్స్ నుంచి గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు రోజు పోయి రావడానికి బస్సు చార్జీలు తడిసిమోపెడు అవుతున్నాయి. ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోయాయి. దీంతో బస్‌పాస్‌లు కల్పించాలని అధికారులను వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఏమిచేయలేక ఇంటి దగ్గర నుంచి డబ్బులు అందక కాలేజీకి పోలేని పరిస్థితి నెలకొంది. ఇటు మెస్‌చార్జీలు చెల్లించక, ఉపకార వేతనాలు అందక విద్యార్థులు కంటి నిండ నిద్ర, కడుపు తిండిలేకుండానే రోజులు వెళ్లదీస్తున్నారు. వృత్తి కోర్సులను నేర్పించడానికి తీసుకెళ్లిన అధికారులు విద్యార్థులు అలాన పాలన చూసుకోకుండా చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులు, పెరిగిన ఊరును వదిలేసి పట్టణంలో ఉంటున్న వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. సమస్యను పరిష్కరించాలని వినతి ఐటీడీఏ అధికారులు సకాలంలో బిల్లులు చెల్లించి మెస్‌చార్జీలు ఇస్తేగానీ భోజనం పెట్టే పరిస్థితి లేదని విద్యార్థినులు వాపోతున్నారు. సోమవారం ఐటీడీఏ పీఓ హనుమంత్ కె జెండగేకు విన్నవించి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఉపకార వేతనాలు, బస్‌పాస్, పుస్తకాలు, యూనిఫాం, సరైన వసతులు కల్పించాలని పీఓకు మొరపెట్టుకున్నారు. స్పందించిన పీఓ ఏపీఓ వసంతరావు ద్వారా హైదరాబాద్‌లోని హాస్టల్ వార్డెన్‌కు ఫోన్లో మాట్లాడమని ఆదేశించారు. ఐటీడీఏ ద్వారా బిల్లులను అందించడానికి చర్యలు చేపడుతున్నామని, మా పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఏపీఓ వార్డెన్‌ను ఫోన్లో కోరారు. -
టీఆర్ఎస్ శ్రేణుల్లో గుబులు..
సాక్షి, ఏటూరునాగారం: మావోయిస్టు అమరుల సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీలోని టీఆర్ఎస్ నాయకుల్లో గుబులు పుట్టింది. మావోయిస్టు నక్సల్స్ టీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో పోలీసులు ఒక్కసారిగా టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేశారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న టీఆర్ఎస్ నాయకులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం(కే) మండలాలకు చెందిన అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులను సురిక్షత ప్రాంతాలకు తరలివెళ్లాలని పోలీసులు ఆదేశాలు ఇవ్వడంతో సేఫ్ జోన్లోకి వెళ్లినట్లు సమాచారం. చిట్యాల, రేగొండ, టేకుమట్ల, పలిమల వంటి ప్రాంతాల్లోని టీఆర్ఎస్ నాయకులతోపాటు టార్గెట్‌లో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా గ్రామాల్లో ఉండొద్దని రాష్ట్ర స్థాయి పోలీసు అధికారులను స్థానిక అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో పోలీసులు వారికి సెల్‌ఫోన్, మేసేజ్‌తోపాటు, లిఖిత పూర్వకంగా కూడా ముందస్తు హెచ్చరికలను అందజేశారు. పూర్వపు ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో పోలీసులు నాయకులను, టార్గెట్లను అప్రమత్తం చేస్తూ వారికి రక్షణ కల్పిస్తున్నారు. జూలై 12న కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని బేస్తకొత్తూరుకు చెందిన పెదమిడిసిలేరు ఎంపీటీసీ సభ్యుడు నల్లూరి శ్రీనివాసరావును ఈనెల 8న మావోయిస్టులు అపహరించుకు తీసుకెళ్లారన్నారు. ఈనెల 12న ఛత్తీస్‌గఢ్‌లోని పుట్టపాడుకు వెళ్లే మార్గంలో శ్రీనివాసరావు మృతదేహాన్ని ఆయన బైక్‌ను వదిలిపెట్టి వెళ్లారు. అక్కడే అతడిని హతమార్చారు. అయన టీఆర్ఎస్ పార్టీ కావడంతో తెలంగాణ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించి వాటిని ప్రత్యేక దృష్టి సారించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు సవాల్‌గా తీసుకొని ప్రత్యేక చర్యలను ముమ్మరం చేశారు. అడవుల్లో కూంబింగ్‌తోపాటు అనుమానితులను అదుపులోకి తీసుకోవడం, గొత్తికోయగూడెంల్లో ఆకస్మిక తనికీలు, కార్డెన్ సెర్చ్ కార్యక్రమాలను చేపడుతున్నారు. అంతర్రాష్ట్ర ప్రధాన రోడ్డు అయిన ఛత్తీస్‌గఢ్– హైదరాబాద్ ప్రాంతాల మధ్యలోని ఏటూరునాగారం వై జంక్షన్, ముల్లకట్ట బ్రిడ్జి వద్ద పోలీసులు గట్టి నిఘా వేసి తనిఖీలను తీవ్ర స్థాయిలో చేపడుతున్నారు. ఏజెన్సీలో పోలీసుల తనిఖీలు, మావోయిస్టుల కదలికలతో ప్రజలు భయాందోళనలో గడుపుతున్నారు. -
యువతిని కాపాడిన పోలీస్..
సాక్షి, ఏటూరునాగారం(ములుగు): ప్రజలకు భద్రత కల్పించడంతోపాటు వారిని రక్షించాల్సిన బాధ్యత పోలీసులదే. పోలీసులు బాధ్యతను సక్రమంగా నిర్వహించినప్పుడే వారిపై ప్రజలకు నమ్మకం ఉంటుంది. నీళ్లలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ యువతిని పోలీసులు సకాలంలో స్పందించి.. కాపాడారు. నీళ్లలో మునిగిపోతున్న యువతిని వెలికితీసి.. ప్రాణాలు కాపాడి నిజమైన పోలీస్ అనిపించున్నాడు వాజేడు ఎస్ఐ కృష్ణప్రసాద్. మండలంలోని తాళ్ళగడ్డ ప్రాంతానికి చెందిన మహిళ పర్వతం మల్లేశ్వరీ.. ముల్లకట్ట బ్రిడ్జ్ పై నుంచి నీళ్లలోకి దూకి ఆత్మహత్య ప్రయత్రం చేసింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందివ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని గమనించిన వాజేడు ఎస్ఐ కృష్ణప్రసాద్‌తోపాటు అక్కడే ఉన్న ఓ వాహనదారుడు సకాలంలో స్పందించి ఆమెను కాపాడారు. ఇటీవలే కరీంనగర్‌లోని జమ్మికుంట పట్టణంలో ఎస్ఐ సృజన్ రెడ్డి సాహసోపేతంగా బావిలోకి దిగి ఇద్దరిని కాపాడిన విషయం తెలిసిందే. ఈ అపూరూప దృశ్యాన్ని మరవక ముందే మరో సంఘటన చోటు చేసుకోవడం విశేషం. -
బైక్‌ను ఢీకొన్న ఎమ్మెల్యే సీతక్క కారు, పాప మృతి
సాక్షి, వరంగల్ : ములుగు జిల్లా ఎమ్మెల్యే సీతక్క కారు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం శివారులోని జీడివాగు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దంపతులు తమ చిన్నారిని తీసుకొని బైక్‌పై వెళ్తుండగా జీడివాగు సమీపంలో ఎదురుగా దూసుకొచ్చిన ఎమ్మెల్యే కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, దంపతులు గాయపడ్డారు. అయితే పాప తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. దంపతులను చికిత్స నిమిత్తం ఏటూరు నాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ఎమ్మెల్యే సీతక్క వాహనం ఢీకొని చిన్నారి మృతి -
వస్త్ర దుకాణంలో చోరీ..
సాక్షి, ఏటూరునాగారం: వస్త్ర దుకాణంలో దొంగలు చొరబడి రూ. 50 వేల విలువైన దుస్తులు, రూ. 63 వేల నగదు ఎత్తుకెళ్లిన సంఘటన ఏటూరునాగారం మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. మండల కేంద్రంలో ఆర్ఆర్ రెడీమేడ్ షాపును మాచర్ల సారంగపాణి నడిపించుకుంటున్నారు. రోజువారిలాగానే షాపుకు తాళాలు వేసి ఇంటికి వెళ్లాడు. శనివారం ఉదయం షాపు తెరిచి లోనికి వెళ్లి చూడగా వెనుక ఉన్న బాత్ రూమ్ వెంటిలేటర్, షాపు వెనుకభాగంలో ఉన్న తలుపును గడ్డపారతో పలుగగొట్టి లోనికి చొరబడినట్లు గుర్తించానని షాపు యజమాని తెలిపాడు. బట్టల షాపులో విలువైన రెడీమెడ్ పాయింట్లు, టీషర్టులతో పాటు షాపులో రూ. 63 వేల నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితుడు వెల్లడించారు. దొంగతనం విషయంపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి పరిశీలించినట్లు తెలిపాడు. సీసీ పుటేజీలో అనవాళ్లు ఆర్ఆర్ రెడీమేడ్ షాపు పక్కనే ఉన్న స్వాతి జ్యూవెల్లరి నగల దుకాణం వెనుకాల అమర్చిన సీసీ కెమెరాలో దొంగల ముఖాలు కనిపించాయి. ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ షాపు వెనుకాల రెక్కి నిర్వహించినట్లు తెలుస్తోంది. ఒకరు లోనికి చొరబడగా మరోకరు కాపలా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖం పూర్తిగా కనబడకపోవడంతో ఆ వ్యక్తి ఎవరు అనేది తెలియాల్సి ఉంది. సీసీ పుటేజీలో రికార్డు అయిన వీడియోను పోలీసులకు అందజేయనున్నట్లు షా పు యజమాని తెలిపారు. అంతేకాకుండా పోలీసులు ఇటీవల గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లోని పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మానుకోటలోని ఓ ఇంట్లో దొంగతనం మానుకోట పట్టణంలోని నర్సంపేట బైపాస్‌రోడ్డులోగల హోలియదాసరి బజార్లో నివాసం ఉండే వట్టం ఉపేందర్, భాగ్యమ్మ నివాసంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. మానుకోట రూరల్, టౌన్ ఇన్చార్జి ఎస్సై పత్తిపాక జితేందర్ కథనం ప్రకారం...మానుకోట పట్టణంలోని నర్సంపేట బైపాస్‌రోడ్డులోగల హోలియదాసరి బజార్లో నివాసం ఉండే వట్టం భాగ్యమ్మ వృత్తిరీత్యా ముత్యాలమ్మగూడెం ఏహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయురాలు. ఆమె ఎన్నికల విధుల్లో భాగంగా వర్ధన్నపేటకు గురువారం సాయంత్రం వెళ్లారు. ఆమె భర్త వట్టం ఉపేందర్ కొత్తగూడ మండలంలోని గోపాలపురంకు ఓటు వేయడం కోసం వెళ్లారు. ఆయన శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చి చూసే సరికి ఇంట్లోని సామానులు చిందరవందరగా పడేసి ఉన్నాయి. బెడ్రూంలోకి వెళ్లి చూసేసరికి బీరువా తలుపులు పగులగొట్టి కనిపించాయి. సమాచారం అందుకున్న టౌన్ సీఐ ఎస్.రవికుమార్, సీసీఎస్ సీఐ ఎన్.వెంకటేశ్వర్లు, క్లూస్‌టీం బృందం ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు -
వైద్యులు అప్రమత్తంగా ఉండాలి
ఏటూరునాగారం వరంగల్ : వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులతో ఆస్పత్రికి వచ్చే రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.. వైద్యులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అమయ్‌కుమార్ ఆదేశించారు. ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రిని ఆయన సోమవారం ఆకస్మిక సందర్శించారు. మొదట ఆస్పత్రిలోకి వెళ్లిన ఆయన ఈసీజీ తీయించుకున్నారు. అనంతరం ఓపీ నమోదు, రోగులకు అందుతున్న సేవల గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది పనితీరు, మందుల కొరత తదితర విషయాలపై ఆరా తీశారు. నిత్యం ఓపీ 500ల నుంచి 800 వరకు నమోదవుతున్నట్లు వైద్యులు కలెక్టర్‌కు వివరించారు. వేతనాలు రావడంలేదు.. తమకు ఐదు నెలల నుంచి వేతనాలు రావడం లేదని ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా బడ్జెట్ రాలేదని వచ్చాక ఇస్తామన్నారు. లేదంటే తన నిధుల నుంచి అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆస్పత్రికి వచ్చిన కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన సునారికాని సమ్మక్క తనకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పించాలని, పింఛన్ రావడంలేదని చెప్పడంతో ఆమె ఆదార్‌కార్డును పరిశీలించిన కలెక్టర్ వయస్సు 65 సంవత్సరాలు ఉంటేనే పింఛన్ వస్తుందని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇంటి కోసం ప్రపోజల్ పెట్టాలని తహసీల్దార్ నరేందర్‌ను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఐటీడీఏ పీఓ చక్రధర్‌రావు, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ శంకర్రావు, ఏఈఈ మధుకర్, వీఆర్ఓలు పాండ్య, రాములు తదితరులు ఉన్నారు. -
బెల్ట్‌షాపులు ఎత్తివేయాలని ధర్నా
నందిగామ రూరల్ : గ్రామంలో బెల్టు షాపులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఏటూరు గ్రామ మహిళలు నందిగామ ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. అధికారులు చర్యలు తీసుకునే వారుకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. గతంలో ఆందోళన ఫలితంగా మూడు నెలలపాటు బెల్టు షాపులు మూసివేశారని, అయితే, ఇటీవల మళ్లీ బెల్టు షాపులు తిరిగి ఏర్పాటు చేయడంపై మండపడ్డారు. విద్యార్థులు కూడా మద్యానికి బానిసలవుతున్నారని వాపోయారు. మహిళల ఆందోళనకు సీపీఎం నాయకుడు సయ్యద్ ఖాసిం, కటారపు గోపాల్ మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న అధికారులు మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఎక్సైజ్ సీఐ సాయిస్వరూప్ ఆధ్వర్యంలో సిబ్బంది గ్రామానికి వెళ్లారు. వారు తిరిగి కార్యాలయానికి వచ్చే వరకు మహిళలు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. గ్రామంలోని బెల్టు షాపులను పూర్తిగా మూసివేయించామని, ఇకపై గ్రామంలో బెల్టు షాపు నడవకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. డ్వాక్రా సంఘాల లీడర్లు శీలం నాగేంద్రం, కామా అరుణకుమారి, నేలపాటి మరియమ్మ, సుజాత, తేరేజమ్మ, దుర్గ, మరియమ్మ పాల్గొన్నారు.