the farmer
-
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువరైతు మృతి
తాడిపత్రి రూరల్ : అప్పుల బాధ భరించలేక డిసెంబర్ 29న పురుగుమందు తాగి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెద్దపప్పూరు మండలం కుమ్మెత గ్రామానికి చెందిన రైతు షౌకత్(30) సోమవారం మృతి చెందినట్లు ఎస్ఐ శ్రీహర్ష తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతునికి భార్య అస్మత్, కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
దుంప తెంచింది!
ఆశ చావని రైతు బంగాళాదుంప సాగుతో మరో సారి దెబ్బతినాల్సి వచ్చింది. గతంలో పంట సాగుచేసినా వర్షాల కారణంగా తీవ్ర నష్టాల్ని మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పంట దిగుబడి పెరిగినా ధర పతనమవ్వడంతో అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వచ్చింది. పంటబీమా కూడా చేసుకోకపోవడంతో కుదేలవ్వాల్సిన దుస్థితి ఎదురైంది. చేసిన అప్పులు తీర్చలేక.. కొత్త అప్పులు పుట్టక రైతులు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. పలమనేరు: జిల్లాలోని పడమటి మండలాలు చల్లదనానికి పెట్టింది పేరు. ఇక్కడ బంగాళాదుంప సాగుకు అనుకూలం. పలమనేరు, కుప్పం, పుంగనూరు నియోజకవర్గాల్లో ఈ దఫా సుమారు 1,500 ఎకరాల్లో దుంపను సాగుచేశారు. గతంలో తీరని నష్టం మామూలుగా ఈ ప్రాంతాల్లో బంగాళాదుంపను రెండు అదునులుగా సాగుచేస్తారు. మొదటి అదునుగా గత ఏడాది సెప్టెంబర్‌లో.. రెండో అదునుగా నవంబర్, డిసెంబర్‌ల్లో సాగుచేశారు. అయితే నవంబర్‌లో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా భూమిలోపల దుంప సైజు పెరగలేదు. సగం పంట నీటిశాతం ఎక్కువై చేలళ్లోనే కళ్లిపోయింది. ఉన్న దుంపలు పచ్చటి రంగులోకి మారి పనికిరాకుండా పోయాయి. వర్షాలు తగ్గుముఖం పట్టాక తోటలు ఏపుగా పెరిగాయేగానీ పంట దిగుబడి మాత్రం గణనీయంగా తగ్గిపోయింది. రెండో అదనులో నాటిన తోటలు కూడా వర్షానికి సగం మాత్రమే మొలకెత్తాయి. ఎకరాకు రూ.70 వేల పెట్టుబడి బంగాళాదుంప సాగుచేసేందుకు రైతులు ఎకరాకు రూ.70 వేలదాకా ఖర్చు చేశారు. విత్తనాలు, ఎరువు లు, క్రిమిసంహారకమందు లు, సస్యరక్షణ తదితరాలకు భారీగానే పెట్టుబడులు పెట్టారు. అప్పట్లో విత్తనపు గడ్డ తుండు(42 కిలోలు) రూ.1500 దాకా తెచ్చి నాటారు. ఎకరాపొలానికి 15 తుండ్లు కావాలి. దీంతో రూ.22,500 విత్తనాలకు, ఎరువులకు మరో రూ.25 వేలు, క్రిమిసంహారకమందులకు ఇంకో రూ.15 వేలు, కూలీలు ఇతరత్రా ఖర్చులు రూ.8వేలు మొత్తం రూ.70 వేలు పంటకోసం వెచ్చించారు. తుండుకు 5 బస్తాలు కూడారాని దిగుబడి మామూలుగా పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడి వస్తే తుండు విత్తనాలకు 20 నుంచి 22 బస్తాల దిగుబడి రావాలి. కానీ ఈ దఫా తుండుకు 5 నుంచి 7 బస్తాలు మాత్రమే వచ్చింది. దానికి తోడు దుంపల నాణ్యత తగ్గింది. ఆ లెక్కన ఎకరానికి 75 నుంచి 100 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చింది. ఇప్పుడున్న ధర (తుండు రూ.550 నుంచి రూ.600) రూ.42 వేల నుంచి 60 వేల దాకా రైతులకు రాబడి వచ్చింది. పంట పెట్టుబడే రూ.70 వేలు అయితే వచ్చిన రాబడి రూ.42 నుంచి రూ.60 వేలు మాత్రమే. మొత్తమీద రైతులు ఎకరాకు రూ.30 వేలదాకా నష్టపోవాల్సి వచ్చింది. నష్టం రూ.45 కోట్లు ఎకరాకు రూ.30 వేలు నష్టం కాగా 1,500 ఎకరాలకు రూ.45 కోట్ల దాకా నష్టంమొచ్చింది. గతంలో రైతులు ఈ పంటకు కనీసం పంటల బీమా కూడా చేసుకోలేదు. దీంతో పూర్తిగా నష్టపోయారు. వేరుశెనగకు మాత్రం బీమా కట్టించుకున్న అధికారులు కూరగాయల పంటలను గురించి పట్టించుకోలేదు. అప్పులు చేసి పంటను సాగు చేసిన రైతన్నలు అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నారు. రుణమాఫీ ఎఫెక్ట్‌తో మళ్లీ పంటల సాగుకు బ్యాంకులు కొత్త రుణాలివ్వకుండా ముఖం చాటేస్తున్నాయి. కాల్‌మనీ వ్యవహారంతో ప్రవేటు వడ్డీ వ్యాపారులు సైతం అప్పులు ఇవ్వడం లేదు. దీంతో రైతన్నల పరిస్థితి దిక్కుతోచని విధంగా మారింది. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
విద్యుదాఘాతంతో ఓ రైతు పొలంలోనే ప్రాణాలు విడిచాడు. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం కుంచెలవారిపాలెంలో శనివారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. కౌలు రైతు అయిన డి.సుబ్బారెడ్డి (52) రెండు ఎకరాల పొలంలో వరి సాగు చేస్తున్నాడు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన సుబ్బారెడ్డి... విద్యుత్ మోటారు ఆన్ చేయగా, వైర్లు తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రైతు ఆత్మహత్య
అప్పుల బాధతో మరో అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం కోయగూడెంలో ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నాగేశ్వర్ రావు(32) తనకున్న నాలుగెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది పంట దిగుబడి రాకపోవడంతో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు తీర్చలేకపోయాడు. ఈ ఏడాది కూడా పంట ఆశించిన విధంగా లేకపోవడంతో.. మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. -
రైతు ఆత్మహత్య
మానసిక వేదనతో ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం రామదుర్గం గ్రామంలో బుధవారం జరిగింది. వరసగా రెండేళ్ళు తీవ్ర మైన పంట నష్టం రావడంతో.. కొనకండ్ల చిన్న హనుమంతు(65) తీవ్ర మనో వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారు జామున ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ.. మరణించాడు. -
అన్నదాత ఆత్మహత్య
నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటికాల యాదయ్య (45) అప్పులు చేసి పత్తి సాగు చేశాడు. అయితే, పంటకు తెగులు వచ్చింది. అది చూసి తట్టుకోలేకపోయిన యాదయ్య ఆదివారం ఉదయం పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
రైతులను మోసం చేసిన సర్కారు
- కలెక్టరేట్ వద్ద జైల్‌భరోలో సీపీఐ నేతలు మచిలీపట్నం (చిలకలపూడి) : భూసేకరణ విషయంలో రైతులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు డి.నిర్మల పేర్కొన్నారు. భూసేకరణ ఆర్డినెన్స్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా, జైల్‌భరో నిర్వహించారు. నిర్మల మాట్లాడుతూ భూసేకరణ విషయంలో రైతులను వేధింపులకు గురిచేసి వారి నుంచి భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బలవంతంగా భూములను లాక్కోవటం వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం సీపీఐ నాయకులు కలెక్టరేట్ గేటు వద్ద నినాదాలు చేశారు. దీంతో పోలీసులు సీపీఐ నాయకులను అరెస్టు చేసి చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు అఫ్జల్, పరుచూరి రాజేంద్రప్రసాద్, లింగం ఫిలిప్, జంపాన వెంకటేశ్వరరావు, గారపాటి సత్యనారాయణ, నర్రా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇది ప్రభుత్వ భూదాహం
జైల్‌భరోలో నినదించిన సీపీఐ 200 మంది అరెస్టు నినదించిన సీపీఐ విజయవాడలో జైల్‌భరోకు భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు 200 మంది అరెస్టు భూసేకరణ తీరును నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో జిల్లాలో గురువారం జైల్‌భరో కార్యక్రమం నిర్వహించారు. పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టేందుకు రైతుల భూములు స్వాధీనం చేసుకుంటున్నారని మండిపడ్డారు. విజయవాడ : రైతుల భూములను పారిశ్రామికవేత్తలకు అప్పగించేందుకే పేదల నుంచి చంద్రబాబు లక్షలాది ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. పార్టీ జాతీయ మహాసభ పిలుపు మేరకు దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జైల్‌భరో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు, విదేశీ కార్పొరేట్ సంస్థలకు రైతుల భూములు కట్టబెడుతున్నారని విమర్శించారు. రాజధాని పేరుతో కృష్ణాజిల్లాలో 12వేల ఎకరాలు, గుంటూరు జిల్లాలో 33వేల ఎకరాలు రైతుల నుంచి లాక్కునేందుకు యత్నిస్తున్నారన్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా పది వామపక్ష పార్టీలను కలుపుకొని పోరాడతామని హెచ్చరించారు. సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ చంద్రబాబుకు భూదాహం పట్టిందన్నారు. సన్న, చిన్నకారు రైతుల నుంచి వేలాది ఎకరాలు స్వాధీనం చేసుకుని స్వామీజీలు, బాబాలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సీపీఐ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం రామకృష్ణ, దోనేపూడి శంకర్‌ను పోలీసులు అరెస్టు చేస్తుండగా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దాదాపు 200 మందికిపైగా సీపీఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఆందోళనలో నాయకుడు పల్లా సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. -
రైతులను వంచిస్తున్న ప్రభుత్వం
కామారెడ్డి (నిజామాబాద్): కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ కుటుంబ పాలన చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు పొంగులేని శ్రీనివాసరెడ్డి చేపట్టిన రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్కు తొత్తుగా మారితే, టీడీపీ లోపాయికారి ఒప్పందం చేసుకుని ప్రజలను వంచిస్తోందని విమర్శించారు. రైతులను వంచిస్తున్న వారిపై పోరాడుతాం రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ ఆరోపించారు. అక్కడ రాజధాని పేరుతో రైతుల భూములను లాక్కొంటూ మోసగిస్తున్నారని తెలిపారు. ఇక్కడ బంగారు తెలంగాణ పేరు తో రైతాంగాన్ని వంచిస్తున్నారని విమర్శించారు. రైతులకు అండగా ఉండి పోరాడుతామన్నారు. చంద్రబాబుది బందిపోటు పాలన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రభుత్వరంగ సంస్థలను ప్రై వేటుపరం చేసి బందిపోటు పాలన సాగించారని పార్టీ సీజీసీ మెంబర్ నల్లా సూర్యప్రకాశ్ ఆరోపించారు. బాబు పాలనలో రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయ్యాక రైతులకు మేలు జరిగిందని, ఆయన చనిపోయాక తిరిగి రైతులకు కష్టాలు మొదలయ్యాయన్నారు. వైఎస్ జగన్ రైతుల పక్షాన పోరాడుతున్నారని, అం దులో భాగంగానే పొంగులేటి దీక్ష అని తెలిపారు. రైతు కుటుంబాలను ఆదుకున్నది వైఎస్సారే ‘దేశం’ పాలనలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆదుకున్నది దివంగత వైఎస్సారేనని మాజీ ఎమ్మెల్యే, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడ్మ కిష్టారెడ్డి అన్నారు. విద్యుత్తు బకాయలు, రుణాలను మాఫీ చేసి రైతులకు వైఎస్సార్ ఎంతో మేలు చేస్తే, ఇప్పటి పాలకులు అన్ని రకాల పన్నులు పెంచుతూ మోయలేని భారం మోపుతు న్నారని ఆరోపించారు. రైతు సమస్యలపై పోరాడుతాం.. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడతామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. కామారెడ్డిలో రైతుదీక్ష వేదికపై ఆయన మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న రైతులకు అండగా ఉండి భరోసా కల్పించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దీక్ష చేపట్టిందని చెప్పారు. -
నేడే దీక్ష
- రైతుకు భరోసా కల్పించే లక్ష్యంగా - కామారెడ్డికి నేడు పొంగులేటి శీనన్న - రైతు దీక్షను స్వాగతిస్తున్న జిల్లా ప్రజలు - వైఎస్ఆర్సీపీ పోరుకు జనం మద్దతు - స్వచ్ఛందంగా తరలి రానున్న అన్నదాతలు - అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పార్టీ శ్రేణులు కామారెడ్డి: వైఎస్ఆర్ సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం చేపట్టే ఒక్కరోజు రైతుదీక్షకు కామారెడ్డి ముస్తాబైంది. రైతు సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపతలపెట్టిన రైతు దీక్షకు సర్వం సిద్ధమైంది. కామారె డ్డి పట్టణంలోని సీఎస్ఐ గ్రౌండ్స్ వేదికగా రైతు దీక్ష చేపట్టనున్నారు. ఆదివారం ఉద యం 10 గంటల నుంచి సాయంత్రం వరకు దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షకు వైఎస్ఆర్ సీపీ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల ముఖ్యనేతలు తరలి రానున్నారు. కాగా, రైతుల సమస్యలపై చేపట్టిన దీక్షకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా రైతులు పెద్ద ఎత్తున తరలిరావడానికి సన్నద్ధమ య్యారు. వైఎస్ఆర్ సీపీ నేతలు ఊరూరా తిరుగుతూ, రైతుల పక్షాన పార్టీ చేస్తున్న పోరాటాన్ని వివరిస్తూ మద్దతు కోరుతున్నారు. రైతులు సంసిద్ధమై మీ వెంట నడు స్తామంటూ ముందుకు వస్తున్నారు. దీంతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం వ్యక్తమవుతోంది. రైతుదీక్ష వేదిక వద్ద వేలాది మంది రైతులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. దీక్షను స్వాగతిస్తున్న రైతులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో ప్రజల మద్దతు రోజు రోజుకు పెరుగుతోంది. రైతు బాంధవుడిగా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న వైఎస్ఆర్ పేరును ఇప్పటికీ జిల్లా ప్రజలు జపిస్తున్నారు.ఆయన ఆశయాల సాధ న, ప్రజలకు అండగా నిలవడమే లక్ష్యంగా వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక ప్రజాఉద్యమాలు నిర్వహించారు. ఇదే సమయంలో ఆరుగాలం శ్రమిం చినా గిట్టుబాటు ధర లభించక అప్పుల ఊబిలోకి కూరుకుపోయిన రైతులకు ‘నేనున్నాను..’ అంటూ 2012 జనవరిలో 10, 11, 12 తేదీలలో మూడు రోజుల పాటు జిల్లాలో రైతుదీక్ష నిర్వహించిన రైతులకు భరోసా కల్పించారు. మరోసారి తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డిలో ఆదివా రం రైతుదీక్ష చేయడం రైతువర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా రైతు సంక్షేమాన్ని విస్మరించిన తరుణంలో వైఎస్ఆర్ సీపీ రైతుదీక్ష లు చేపట్టడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు భరోసా ఇచ్చేందుకు శీనన్న చేపట్టిన రైతుదీక్షను జిల్లా ప్రజలు స్వాగతిస్తున్నారు. ‘పొంగులేటి’ పర్యటన సాగేది ఇలా వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ఉదయం కామారెడ్డి పట్టణానికి చేరుకుని నిజాంసాగర్చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు సిద్దార్థరెడ్డి తెలిపారు. అక్కడ మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతారని, వేలాది మంది రైతులు పాల్గొంటా రని పేర్కొన్నారు. యువకులు బైకులపై ర్యాలీ నిర్వహిస్తారని, అక్కడి నుంచి సీఎస్ఐ గ్రౌండ్ వేదికగా రైతు దీక్ష ప్రారంభమవుతుందని చెప్పారు. గ్రా మాల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలివస్తారని పేర్కొన్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టే రైతుదీక్షలో రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొననుండగా. దీక్షకు హాజరయ్యే రైతులకు కోసం సభాస్థలి వద్ద ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
నీడనిస్తుందనుకుంటే నిండు ప్రాణం బలి
- కొట్టం కూలి కౌలు రైతు దుర్మరణం - పటేల్‌గూడెంలో విషాదం లింగాలఘణపురం : బలమైన ఈదురు గాలులు, వర్షం నుంచి రక్షించి నీడనిస్తుందనుకున్ను కొట్టమే ఓ రైతును బలి తీసుకుంది. మరో రైతు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన మండలంలోని పటేల్‌గూడెంలో శనివారం సాయంత్రం జరిగింది. స్థానిక రైతుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కౌలు రైతు అనుముల మల్లయ్య(65) లింగాలఘణపురానికి చెందిన మంద నర్సిరెడ్డి పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. శనివారం సాయంత్రం అక్కడే వంకాయతోటకు మందు వేశాడు. ఒక్కసారిగా బలమైన ఈదురు గాలులు, వర్షం వస్తుండడంతో సమీపంలోని నకిరెడ్డి యాదయ్య కొట్టం వద్దకు వచ్చాడు. ఇద్దరు ఆ కొట్టంలోనే తలదాచుకున్నారు. గాలి ఒక్కసారిగా బలంగా వీచడంతో కొట్టం పైకప్పుకు ఉన్న ఇనుకరేకులు ఎగిరిపోయాయి. రేకులు వేసిన సిమెంట్ స్తంభాలతోపాటు కొట్టంలోని కణి (రాయి స్తంభం) విరిగి మల్లయ్య తలపై పడింది. తీవ్ర రక్తస్రావం జరుగుతుండగా యాదయ్య వెంటనే కణిని అతడి తలపై నుంచి తొలగించాడు. స్పృహలేకపోడంతో సమీపంలోని రైతు వీరారెడ్డి వద్దకు తీసుకొచ్చాడు. అప్పటికే మల్లయ్య మృత్యువాత పడ్డాడు. -
అప్పులబాధ భరించలేక..
- పురుగులమందు తాగి రైతు బలవన్మరణం - ఆలేరులో ఘటన ఆలేరు పట్టణానికి చెందిన గుంటుక వేణుగోపాల్‌రెడ్డి(45)కి వ్యవసాయమే జీవనాధారం. తన కున్న నాలుగు ఎకరాల భూమితో పాటు, కొంత భూమికౌలు తీసుకుని పత్తి, వరి సాగు చేశాడు. పెట్టుబడులకు తెలిసిన వారి వద్ద రూ. 5 లక్షల వరకు అప్పు చేశాడు. రెండేళ్లుగా కాలం అనుకూలించలేదు. కుటుంబ అవసరాల కోసం యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూర్ గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీలో కార్మికునిగా పనిచేశాడు. ఇంటి అవసరాలు.. అప్పులు పెరిగిపోవడంతో తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనస్తాపానికి గురైన వేణుగోపాల్‌రెడ్డి బుధవారం అర్ధరాత్రి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగాడు. తెల్లవారుజామున అటుగా వెళ్లిన రైతులు అపస్మారకస్థితిలో పడి ఉన్న వెంకట్‌రెడ్డి వద్దకు వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందాడు. సమాచారం అందుకుని ఘటన స్థలానికి కుటుంబ సభ్యులు చేరుకుని బోరున విలపించారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతిడి భార్య సోమలక్ష్మి ఫిర్యాదు మేరకు ఏఎస్సై సలీం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఏలేరు ఆధునికీకరణకు రూ.295.82 కోట్లు
- జీఓ నం : 241 విడుదల - నెరవేరనున్న రైతుల కల పిఠాపురం : కొన్నేళ్లుగా ఏటా కోట్ల విలువైన పంటలు కోల్పోతున్న ఏలేరు రైతాంగం కష్టాలు తీరనున్నాయి. ఏలేరు ఆధునికీకరణకు ప్రభుత్వం రూ.295.82 కోట్లు విడుదల చేస్తూ జీఓ నం: 241ని శుక్రవారం విడుదల చేసింది. ఆరు మండలాల్లో సాగునీటికి ఆధారమైన ఏలేరు ఆధునికీకరణకు నోచుకోక గత కొన్నేళ్లుగా రైతాంగం తీవ్ర నష్టాల పాలవుతోంది. కాలువలు పూర్తి శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు ఆక్రమణలకు గురికావడం, గట్లు బలహీనపడి కోతకు గురవడం వ ంటి సమస్యలు పీడిస్తున్నారు. నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏలేరు కాలువల నిర్మాణం జరిగింది. ఏలేరు పరీవాహక ప్రాంతం 2,232 చదరపు కిలోమీటర్లు (862చదరపు మైళ్లు) ఉండగా, 128 కిలోమీటర్ల పొడవు, 27,325 హెక్టార్ల ఆయకట్టు (67,614 ఎకరాలు) కలిగి ఉంది. పెద్దాపురం, ప్రత్తిపాడు, కిర్లంపూడి, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల ఆయకట్టు సాగునీటికి ఆధారంగా ఏలేరు కాలువలు నిర్మించారు. ఏలేరు కాలువ ప్రాజెక్టు నుంచి ఏలేరు, నక్కలఖండి, గొర్రిఖండి, పెద ఏరు, చిప్పలేరు, తదితర పేర్లతో పిలువబడుతోంది. సాగునీటితో పాటు ఏలేరు అదనపు జలాలను సముద్రంలోకి తరలించడానికి ఏలేరు ప్రాజెక్టు నుంచి కొత్తపల్లి మండలం సముద్ర తీరం వరకు దీనిని నిర్మించారు. అన్నదాతల వెతలకు స్పందించిన వైఎస్ అయితే నిర్మించిన నాటి నుంచి పూర్తి స్థాయిలో ఆధునికీకరణ పనులు జరగక పోవడంతో ప్రాజెక్టుతో పాటు కాలువలు అధ్వానస్థితికి చేరుకున్నాయి. ముఖ్యంగా సాగునీరు అందకపోవడంతో పాటు వరదలు వచ్చినపుడు పంటలు మునిగి పోవడం నిత్యకృత్యంగా మారింది. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పర్యటనకు వచ్చినపుడు రైతాంగం సమస్యను ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. స్పందించిన ఆయన ఏలేరు ఆధునికీకరణకు రూ.138 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పనులకు శంకుస్థాపనసైతం చేశారు. అయితే ఆయన అకాల మృతితో ఆ పనులు ఆగిపోయాయి. అనంతరం ప్రభుత్వాలు పట్టించుకోపోవడంతో ఏలేరు మరింత శిథిలావస్థకు చేరుకుంది. ఇటీవల ఏలేరు ప్రాజెక్టుతో పాటు తిమ్మరాజు చెరువు, ఏలేరు కాలువల అభివృద్ధి, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలతో కలిపి మొత్తం ఏలేరు పూర్తి ఆధునికీకరణకు రూ.308 కోట్ల వ్యయం కాగలదని నీటిపారుదల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం ఎట్టకేలకు రూ.295.82 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అరుుతే ప్రతిపాదించిన మొత్తంలో కొన్ని పనులు అవసరం లేదంటూ రూ.13 కోట్లకు కోత విధించింది. ఆధునికీకరణ పనుల్లో భాగంగా నిర్మించ తలపెట్టిన పెద్దాపురం ఇరిగేషన్ సెక్షన్ కార్యాలయం, పెద్దాపురం, పిడిమిదొడ్డి, కాండ్రకోట, దివిలి, నాగులాపల్లిలలో లస్కర్ క్వార్టర్ల నిర్మాణాలు అవసరం లేదని ఉత్తర్వులలో పేర్కొంది. -
ఏసీబీ వలలో ఇద్దరు సర్వేయర్లు
* ఓ రైతు వద్ద పొలం కొలతలకు రూ.17 వేలు తీసుకుంటూ... * ఎకరాకు రూ.2 వేలు డిమాండ్ ఒంగోలు క్రైం: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు సంతనూతలపాడు మండలానికి చెందిన ఇద్దరు సర్వేయర్లు చిక్కారు. ఓ రైతు నుంచి రూ.17 వేలు లంచం తీసుకుంటుండగా ఒంగోలు ఏసీబీ డీఎస్పీ ఆర్‌విఎస్‌ఎన్ మూర్తి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి చేసిన దాడిలో సంతనూతలపాడు సర్వేయర్ ఒ.యలమందరాజు, సహాయ సర్వేయర్ శివరాజులు ఒకేసారి చిక్కారు. సంతనూతలపాడులో యలమందరాజు విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ ఒంగోలులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ కార్యాలయంలోనే అవినీతి కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో అక్కడే నిఘా పెట్టారు. ఏసీబీ డీఎస్పీ ఆర్‌విఎస్‌ఎన్ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం... కొండపి మండలం ముప్పరాజుపాలేనికి చెందిన మురార్జీకి తన బావమరిదికి సంతనూతలపాడు మండలం మద్దులూరులోని సర్వే నెం.299, 300లో 14 ఎకరాల పొలం ఉంది. సంతనూతలపాడు మండలానికి యలమందరాజు సర్వేయర్ కావడంతో తన 14 ఎకరాల పొలం కొలిచేందుకుగాను రైతు కోటపాటి మురార్జీ గత వారం రోజుల క్రితం సంప్రదించాడు. కొన్ని రోజుల పాటు తిప్పుకున్న తర్వాత ఎకరాకు రూ.2 వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేను, ఎకరాకు రూ.1,000 చొప్పున ఇచ్చుకుంటానని రైతు మురార్జీ అభ్యర్ధించినా అంగీకరించని సర్వేయర్ రూ.1,800 ఇస్తే సరే లేకపోతే వేరేవారిని చూసుకోవాలంటూ తెగేసి చెప్పాడు. చివరకు చేసేది లేక రూ.1,500 చొప్పున ఎకరాకు ఇచ్చేందుకు అంగీకారం కుదుర్చుకున్నారు. తొలుత అడ్వాన్సుగా రూ.4 వేలు సర్వేయర్‌కు ఇచ్చారు. మిగతా రూ.17 వేలు కొలతలు పూర్తయిన తర్వాత ఇవ్వాల్సి ఉంది. అయినా కొలతలు పూర్తి చేయకుండానే రూ.17 వేలు మొత్తం ఇవ్వాలని సర్వేయర్ రైతు మురార్జీపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఒంగోలు ఏసీబీ డీఎస్పీ మూర్తిని బాధిత రైతు ఆశ్రయించాడు. ముందుస్తు ప్రణాళిక ప్రకారం మురార్జీ ఆ మొత్తాన్ని తీసుకొని నేరుగా యలమందరాజు ప్రైవేట్ కార్యాలయానికి వెళ్లి సహాయ సర్వేయర్ శివరాజుకు రైతు అందజేశాడు. ఆ తర్వాత సహాయ సర్వేయర్ శివరాజు నుంచి ప్రధాన సర్వేయర్ యలమందరాజు తీసుకొని తను వేసుకున్న టీ-షర్టు జేబులో పెట్టుకున్నాడు. అదే సమయంలో మాటు వేసి ఉన్న ఏసీబీ డీఎస్పీ మూర్తి బృందం సర్వేయర్ యలమందరాజు ప్రైవేట్ కార్యాలయంపై దాడి చేశారు. అతని వద్దనున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రత్యేక కెమికల్స్ ద్వారా ఆ నోట్లను పరీక్షించారు. నగదు నోట్లపై ఉన్న వేలిముద్రలు, సర్వేయర్, సహాయ సర్వేయర్లవేనని నిర్ధారించి కేసు నమోదు చేశారు. దాడి చేసి పట్టుకున్న వారిలో ఏసీబీ డీఎస్పీ మూర్తితోపాటు నెల్లూరు సిఐ కె.కృపానందం, ఒంగోలు ఎస్సై ఎస్. వెంకటేశ్వర్లు, ఒంగోలు ఏసీబీ కార్యాలయ సిబ్బంది ఉన్నారు. -
వర్ణం
పద్ధతైన ప్రణాళిక ఆకులు అల్లుకున్నట్టున్న రాతి భవనాల దారిలో నడుస్తున్న వృద్ధుడిని ఫొటోలో చూడవచ్చు. ఇటలీలోని టస్కనీ ప్రాంతంలోని పియెంజా పట్టణ శివారు దృశ్యం ఇది. కొండను కేంద్రంగా చేసుకుని, దానిచుట్టూ ఇలా ఊరి నిర్మాణం జరిగింది. ఆ లోయంతా కూడా సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడంలో ముందుంది. పునరుజ్జీవన కాలంలో నిర్మాణమైన పియెంజా, 1996లో, పద్ధతైన నగర నిర్మాణానికిగానూ యునెస్కో ‘ప్రపంచ వారసత్వ సంపద’ జాబితాలో చోటుచేసుకుంది. సంప్రదాయ వేట ఫొటోలో ఉన్నది చేపలవేటకు ఉచ్చులు పెడుతున్న ఒక వియత్నాం రైతు. ఈ ప్రాచీనమైన పద్ధతిలో, చేపలు ఈదేమార్గంలో వీటిని ఉంచుతారు. ఒకసారి ఇందులోకి ప్రవేశించిందంటే చేప ఇక వెనక్కి మళ్లలేదు. ఈ దృశ్యం హంగ్ యెన్ రాష్ట్రంలోని ఖొవాయి చౌ జిల్లాలోనిది. చాలామంది రైతులు వ్యవసాయం చేస్తూనే అదనపు ఆదాయం కోసం చేపలు, పీతల వేటకు దిగుతుంటారక్కడ. విశ్వాస ప్రకటన స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో, సామూహికంగా పశ్చాత్తాపం (కన్ఫెషన్) ప్రకటిస్తున్న విశ్వాసులు వీరు. రోమన్ కాథలిక్కుల చర్చికి చెందిన ‘ఓపస్ డెయి’ (దైవ కార్యం) మాజీ నాయకుడు, బిషప్ అయిన ‘బ్లెస్డ్’ అల్వారో డెల్ పోర్టిల్లో(1914-94) ‘బీటిఫికేషన్’ సందర్భంగా చోటుచేసుకున్న దృశ్యం ఇది. -
పండుగ పూట రైతు ఇంట్లో చీకట్లు
కురవి/మహబూబాబాద్‌టౌన్ : ఊరంతా వెలుగులు నింపే దీపావళి పండుగపూట ఆ రైతు ఇంట్లో చీకట్లు ఆవరించాయి. పండుగ పూట దీపాలతో కళకళలాడాల్సిన ఆ ఇల్లు కన్నీటి సంద్రమైంది. కరెంట్ రాత్రిపూట సరఫరా అవుతుండడంతో పంటకు నీరు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతానికి గురై మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన మహబూబాబాద్ మండలం మాధవపురం శివారు చీకటిచింతల తండాలో గురువారం తెల్లవారుజామున జరిగింది. తండా వాసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకా రం... చీకటిచింతల తండాకు చెందిన బానోత్ వెంకన్న(38)కు మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో వరి, పత్తి, మిర్చి పంటలను సాగు చేస్తున్నాడు. ఇప్పటికే బావిలో నీళ్లు అడుగంటడంతో పొలం ఎండిపోయింది. దీంతో క్రేన్ సాయంతో బావిలో పూడిక తీయిస్తున్నాడు. తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు కరెంట్ సరఫరా అవుతుండడంతో కరెంట్ రాగానే అతడు బావి వద్దకు వెళ్లాడు. మోటార్‌ను ఆన్ చే సే ముందు ఫ్యూజులను సరిచేస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అరుస్తూ కుప్పకూలాడు. నీళ్లు పెట్టేందుకు వచ్చిన సమీప రైతులు బానోత్ రామా, వీరమ్మ అతడి అరుపులు విని సంఘటన స్థలానికి పరుగెత్తుకొచ్చారు. వెంకన్న స్టార్టర్ బాక్స్ పక్కన షాక్‌తో విలవిలలాడుతుండడం గమనించిన వారు వెంటనే అతడిని కర్రతో పక్కకు లాగారు. కొనఊపిరితో ఉన్న అతడిని బతికించేందుకు యత్నించినా ఫలితం లేకుండాపోయింది. వెంకన్న మరణవార్త తెలియగానే అతడి భార్య విజయ, కుమార్తెలు కల్యాణి, రోజా, కుమారుడు బాలాజీ బోరున విలపిస్తూ బావి వద్దకు పరుగులు పెట్టారు. మృతదేహంపై పడి కన్నీరుమున్నీరయ్యూరు. పిల్లల రోదన చూసి బంధుమిత్రులు, తండా వాసులు కంటతడి పెట్టారు. మృతదేహంతో ఆందోళన రాత్రి, తెల్లవారుజామున కరెంట్ సరఫరా చేయడం వల్లే వెంకన్న మృతిచెందాడని ఆగ్రహించిన తండా వాసులు మృతదేహాన్ని అయ్యగారిపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ వద్దకు ట్రాక్టర్లో తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. సబ్‌స్టేషన్ ఎదురుగా ఉన్న మరిపెడ-మానుకోట ప్రధాన రహదారిపై మృతదేహాన్ని ఉంచి సుమారు రెండుగంటలపాటు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నాయకులు నల్లు సుధాకర్‌రెడ్డి, ఎన్.సురేందర్ కుమార్, కన్నె వెంకన్న, గునిగంటి రాజన్న, గంధసిరి శ్రీనివాస్, దుడ్డెల రాంమూర్తి, బజ్జూరి పిచ్చిరెడ్డి ధర్నాకు మద్దతుగా నిలిచారు. రైతు కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కురవి సీఐ కరుణాసాగర్‌రెడ్డి చేరుకుని ఆందోళన విరమించాలని కోరగా ఆర్డీఓ రావాలని, ఎక్స్‌గ్రేషియో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏఈ రాజారత్నంను అక్కడికి పిలిపించగా.. రూ.2 లక్షలు పరిహారం వస్తుందని, మరో రూ.50 వేలు అదనంగా వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
పండుగొచ్చే.. పత్తి మార్కెట్ లేకపాయే..
పత్తిలోడు వాహనంలో కూర్చున్న ఈ రైతు పేరు రాంచందర్. జమ్మికుంట మండలం వావిలాల గ్రామం. తనకున్న రెండెకరాల్లో పత్తి సాగు చేయగా... రెండు రోజులు ఏరితే 10 బస్తాలైంది. జమ్మికుంట పత్తి మార్కెట్‌కు సెలవు ప్రకటించడంతో శనివారం అర్ధరాత్రి వరంగల్ మార్కెట్‌కు బయలుదేరాడు. జమ్మికుంట మార్కెట్ తెరిచి ఉంటే అదనపు భారంతోపాటు దూర ప్రయాణం ఉండేది కాదంటున్నాడు. స్థానిక మార్కెట్ ఉంటే బస్తాకు రూ.25 ఆటో కిరాయి చెల్లించేది. వరంగల్‌కు రూ.80 అవుతుందని, రాత్రి అక్కడ మార్కెట్లో దోమలు, ఈగలు తెల్లదాక తెలివితోటి ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశాడు. జమ్మికుంట: దీపావళి పండగ వేళ జమ్మికుంట పత్తి మార్కెట్ బోసిపోతోంది. దీంతో పండగ ఖర్చుల కోసం...తెచ్చిన అప్పులు చెల్లించేందుకు పత్తి రైతు పడరాని పాట్లు పడుతున్నారు. పట్టించుకునే దిక్కు లేకపోవడంతో పత్తిని అమ్ముకునేందుకు పక్కజిల్లాకు పరుగులు పెడుతున్నారు. అర్ధరాత్రి వేళ అష్టకష్టాలు పడుతూ వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్ బాటపడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి ఈటెల రాజేందర్ ఇలాకలో రైతులు పత్తిని అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 26 వరకు పత్తి మార్కెట్‌కు మార్కెట్ కార్యదర్శి సెలవులు ప్రకటించడంతో పండగ సమయంలో రైతులు సందిగ్ధంలో పడ్డారు.శుక్రవారం నుంచి సెలవులు ప్రకటించిన క్రమంలో కొందరు రైతులకు ఈ విషయం తెలియక మార్కెట్‌కు ఉత్పత్తులను తీసుకొచ్చారు. వెంటనే పత్తి వ్యాపారులను పిలిపించి కొనుగోళ్లు జరిపించారు. మార్కెట్లో మైక్‌ల్లో శనివారం నుంచి 26వరకు పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో పండుగ ఖర్చుల కోసం...పత్తి ఏరిన కూలీల డబ్బులు చెల్లించేందుకు.. పంట పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు తీర్చేందుకు అన్నదాతలు అవస్థలు పడాల్సిన పరిస్థితి. చేతికి వచ్చిన పత్తిని అమ్ముకునే సమయంలో పత్తిమార్కెట్ బంద్ కావడంతో వారికి ఇబ్బందులు మొదలయ్యాయి. వరంగల్ బాట.. జమ్మికుంట పత్తి మార్కెట్ బంద్ కావడంతో రైతులు పండుగ అవసరాల కోసం ఏరిన పత్తిని అమ్ముకునే ందుకు వరంగల్ బాట పట్టారు. శుక్రవారం అర్ధరాత్రి జమ్మికుంట, వీణవంక మండలాల నుంచి దాదాపు రెండు వేల క్వింటాళ్ల పత్తిని ఎనమాముల పత్తి మార్కెట్‌కు తీసుకెళ్లారు. అర్ధరాత్రి 12గంటల సమయంలో టాటా ఏసీలు, డీసీఏం వాహనాల్లో తరలించారు. ఏ వాహనం చూసినా పత్తి బస్తాలే కన్పించాయి. వేలాది బస్తాలు పత్తి పక్క జిల్లాకు తరలిపోవడంతో జమ్మికుంట మార్కెట్ ఆదాయానికి గండి పడింది. -
చేదుగుళిక
కలిసిరాని చెరకు సాగు స్వల్పకాలిక వంగడాలపై రైతుల ఆసక్తి ఏటేటా తగ్గుతున్న పంట జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ఈ పంటకు మదుపులు బాగా పెరిగిపోయాయి. ఇంటిల్లిపాదీ రెక్కలు ముక్కలు చేసుకున్నా గిట్టుబాటు కావడం లేదు. గడచిన పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది తక్కువ విస్తీర్ణంలో నాట్లు వేశారు. చక్కెర మిల్లులు మద్దతు ధరను చెల్లించకపోవడంతో నీటి వసతి పుష్కలంగా ఉన్న భూములలో సైతం సరుగుడు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలు వేస్తున్నారు. చెరకు ఏక వార్షిక పంట. సుమారు పది నెలలు పెంచాల్సి ఉంటుంది. ఈ సమయంలో అతివృష్టి, అనావృష్టికి గురయితే అంతే సంగతి. మునగపాక : చెరకు సాగు రైతుకు లాభసాటి కావడం లేదు. దీంతో ఈ పంట విస్తీర్ణం జిల్లాలో ఏటేటా తగ్గిపోతోంది. సాధారణ విస్తీర్ణం 38,329 హెక్టార్లు. ఈ ఏడాది 37,459 హెక్టార్లే సాగయింది. మూడేళ్లుగా చీడపీడల బెడద, చక్కెర మిల్లులు మద్దతు ధర చెల్లించకపోవడం, మార్కెట్లో బెల్లం ధరల్లో హెచ్చు తగ్గులు ఈ పంటను చేపట్టే రైతులను దివాలా తీసేలా చేస్తున్నాయి. తాతల కాలం నుంచి జీవనాధారంగా వస్తున్న పంటను వదులుకోలేక వేరే పనులు చేసే అవకాశం లేక రైతులు తీవ్ర దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కుటుంబమంతా ఏడాది పాటు కష్టపడినా పెట్టుబడులు కూడా దక్కకపోవడంతో అప్పులపాలైపోతున్నారు. ఎకరా చెరకు సాగుకు రూ. 40వేల నుంచి రూ. 45వేలు వరకు ఖర్చవుతోంది. పంట చీడపీడలు, అతివృష్టి, అనావృష్టికి గురయి దిగుబడి తగ్గిపోతోంది. కనీసం పదిపాకాలకు మించి దిగుబడులు రావడం లేదు. బెల్లం మొదటిరకం క్వింటా రూ.2910 నుంచి రూ. 3070లు పలుకుతోంది. ఈ లెక్కన పదిపాకాలకు సుమారు రూ.30వేలు ఆదాయం వస్తోంది. అంటే ఎకరాకు రూ.15వేలు నష్టం తప్పడం లేదు. చక్కెర మిల్లులు కూడా మద్దతు ధర చెల్లించడం లేదు. గతేడాది సరఫరా చేసిన చెరకుకు ఇప్పటి వరకు తుమ్మపాల యాజమాన్యం చెల్లింపులు జరపలేదు. దీనికి తోడు అతివృష్టి, అనావృష్టిలు దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయని వ్యవసాయ అధికారులు అంటున్నారు. మద్దతు ధర లేదు నాది మునగపాక. చెరకు సాగే జీవనాధారం. అయితే పంట మదుపులకు, ఆదాయానికి పొంతన ఉండడం లేదు. బెల్లం తయారు చేస్తే మార్కెట్లో ధర ఉండడం లేదు. ఫ్యాక్టరీకి తరలిస్తే మద్దతు ధర లేదు సరికదా చెల్లింపులు లేవు. తీవ్రంగా నష్టపోతున్నాం. అందుకే ఈ ఏడాది 30సెంట్ల తోటను రసానికి అమ్మాను. పది టన్నులు వస్తుంది. టన్ను రూ. 2300లు. మొత్తం రూ. 23వేలు వరకు ఆదాయం వస్తుంది. ఇదే బాగుంది. - పెంటకోట శ్రీనివాసరావు ఏటా నష్టమే నాది మునగపాక. రెండెకరాల్లో చెరకు వేశా. గతేడాది రెండెకరాల్లోని పంటకు తెగుళ్లు సోకాయి. నివారణ చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. ఎకరాకు రూ.45వేలు వరకు మదుపు పెట్టా. చీడపీడల కారణంగా ఎకరా చెరకు గానుగాడితే పదిపాకాలకు మించి బెల్లం రాలేదు. మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు రూ. 23వేలు మాత్రమే వచ్చింది. ఈ లెక్కన ఎకరాకు రూ 22వేలు వరకు నష్టపోయా. ఇంటిల్లిపాదీ కష్టపడినా నష్టమే వచ్చింది. - పెంటకోట వెంకటరావు, వ్యవసాయ రైతు -
వ్యవసాయ మిషన్‌లో రైతుకు చోటుందా?
సాక్షి ప్రతినిధి, అనంతపురం : నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తన ‘వ్యవసాయ మిషన్’ను కరువు జిల్లాలో ప్రకటించనున్నారు. ఆగస్టు ఏడున విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో తన ప్రభుత్వ ప్రాధాన్యతలను ‘ఏడు మిషన్లు.. ఐదు గ్రిడ్లు’గా చంద్రబాబు వివరించారు. అందులో ప్రాధాన్యతా రంగ అభివృద్ధి కింద ‘వ్యవసాయ మిషన్’ను ప్రకటించనున్నారు. కలెక్టర్ల సమావేశంలోనే ముఖ్యమంత్రి ‘వ్యవసాయ మిషన్’ రూపురేఖలను రేఖామాత్రంగా వివరిస్తూ.. ‘వ్యవసాయ ఉత్పాదకతను గణనీయంగా పెంచాలి. వరి, అరటి లాంటి పంటల ఉత్పత్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి. ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలి. పశుపోషణ, పాడి, పౌల్ట్రీ లాంటి అనుబంధ రంగాలను వ్యవసాయంతో అనుసంధానం చేయాలి. భూగర్భజలాల పెంపు, నీటివనరుల సంరక్షణపై మరింత కేంద్రీకరించాలి’ అంటూ పేర్కొన్నారు. దీన్నిబట్టి ‘వ్యవసాయ మిషన్’ ఉత్పాదకత పెరుగుదల చుట్టూనే తిరుగుతోందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సంక్షోభంలో ఉన్నది వ్యవసాయ రంగమా లేక రైతాంగమా అన్న మౌలిక ప్రశ్నను రైతు సంఘాల ప్రతినిధులు లేవనెత్తుతున్నారు. స్వాతంత్య్రం వచ్చాక 1950లో సగటున కోటి జనాభాకు పది లక్షల టన్నుల ఆహార ధాన్యాలు, 30 మందికి లీటరు పాల ఉత్పత్తి మాత్రమే ఉండేది. అయినా ఆ కాలంలో రైతు ఇప్పుడున్నంత సంక్షోభంలో లేడు. హరిత విప్లవం నేపథ్యంలో ప్రస్తుతం సగటున కోటి జనాభాకు 20 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి సాధించాం. పది మందికి లీటరు చొప్పున పాల ఉత్పత్తి చేస్తున్నాం. దేశ జనాభా 3.5 రెట్లు పెరగ్గా.. ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏడు రెట్లు అధికమైంది. పాల ఉత్పత్తి పది రెట్లు, అక్వా రంగ ఉత్పత్తులు 12 రెట్లు పెరిగాయి. వ్యవసాయోత్పత్తుల్లో గణనీయమైన అభివృద్ధి సాధించినా.. అది రైతుల జీవితాల్లో ప్రతిఫలించక పోవడమే ప్రస్తుత విషాదం. ఇందుకు ప్రధాన కారణం ఉత్పత్తి పెరిగినప్పటికీ గిట్టుబాటు ధర లభించకపోవడమే. అర శతాబ్ద కాలంగా వ్యవసాయానికి సంబంధించిన శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ రైతుల జీవితాల్లో మాత్రం సంక్షోభం పెరుగుతూనే వస్తోంది. దీని పర్యవసానమే ఏటా వేల సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు అని విశ్లేషకుల అభిప్రాయం. చంద్రబాబు ప్రకటించనున్న ‘వ్యవసాయ మిషన్’లో ఈ ప్రధాన అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముందని రైతుసంఘాల ప్రతినిధులు సూచిస్తున్నారు. రైతుకు వ్యవసాయం గిట్టుబాటయ్యేలా చేయడమన్న అంశాన్ని ఇరుసుగా చేసుకుని ‘వ్యవసాయ మిషన్’ను ప్రతిపాదించాల్సిన అవసరముందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సంక్షోభం ఇలా : మన రాష్ట్రంలో అత్యధికంగా సాగవుతున్న పంట వరి. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారమే క్వింటాలు ధాన్యం పండించేందుకు రైతుకు అవుతున్న ఖర్చు రూ.1,675. అయితే.. క్వింటాల్ ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.1,310 మాత్రమే. అంటే రైతు ప్రతి క్వింటాలుకు రూ.365 నష్టపోతున్నాడు. ఇక ప్రకృతి విపత్తులు, సమయానికి సాగునీరు అందకపోవడం లాంటి సందర్భాల్లో నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టమే. వరి తర్వాత అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న పంట పత్తి. క్వింటాల్ పత్తి ఉత్పత్తి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ.5,950. ప్రభుత్వ మద్దతు ధర మాత్రం రూ.4 వేలు. వ్యాపారుల మాయాజాలం కారణంగా కనీస మద్దతు ధర కూడా రైతుకు లభించని పరిస్థితులున్నాయి. మిగతా అన్ని పంటల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఎన్నో కష్టనష్టాలకోర్చి రైతు పంటలు పండిస్తున్నా ‘మార్కెట్’ ముందు అచేతనుడిగా మిగిలిపోతున్నాడు. గిట్టుబాటు కాని వ్యవసాయం కారణంగానే అప్పుల ఊబిలోకి కూరుకు పోయిన రైతు ఆత్మహత్యల బాట పడుతున్నాడు. వ్యవసాయోత్పత్తులు పెంచడంతో పాటు ‘గిట్టుబాటు’ ధర కల్పించినప్పుడే ‘వ్యవసాయ మిషన్’కు సార్థకత ఉంటుందన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ‘పంటల దిగుబడిని బట్టి కాకుండా, ఎకరానికి రైతు ఆర్జించిన నికర ఆదాయాన్ని బట్టే వ్యవసాయాభివృద్ధిని లెక్కించాలి’ అన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మాటలను ఈ సందర్భంగా పలువురు రైతుసంఘాల ప్రతినిధులు గుర్తు చేస్తున్నారు. పంట పొలాల్లో ప్రాజెక్టులు వద్దు చంద్రబాబు ‘వ్యవసాయ మిషన్’లో భూగర్భ జలాల పెంపు, నీటి నిల్వల సద్వినియోగం కూడా ఓ ప్రధానాంశం. ముఖ్యమంత్రి ‘వ్యవసాయ మిషన్’ను ప్రకటించేందుకు అత్యంత కరువు జిల్లా అయిన అనంతపురాన్నే వేదిక చేసుకున్న సందర్భంగా ఇక్కడ వ్యవసాయ యోగ్యమైన భూములను పారిశ్రామిక అవసరాలకు కేటాయించడంపై జిల్లా వాసుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లాలో పుష్కలంగా భూగర్భ జలాలున్న రెండు, మూడు ప్రాంతాల్లో నంబులపూలకుంట ఒకటి. ఇక్కడా దాదాపు ఐదు వేల ఎకరాల్లో ‘సోలార్’ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు కేటాయించిన భూమికి ఒకవైపు వెలిగల్లు, మరోవైపు పెడబల్లి రిజర్వాయర్లు ఉన్నాయి. పుష్కలంగా భూగర్భ జలాలు ఉన్న ఈ భూమిని వ్యవసాయాభివృద్ధికే కేటాయించాలన్న డిమాండ్‌పై సీఎం సానుకూలంగా స్పందిస్తే ఆయన ప్రకటించే ‘వ్యవసాయ మిషన్’పై జిల్లా వాసుల్లో కొంతైనా నమ్మకం ఏర్పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే హంద్రీ-నీవాను సత్వరం పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను కేటాయించాలని, హెచ్ఎల్సీ నుంచి పూర్తి నీటివాటా పొందేందుకు సమాంతర కాలువ నిర్మాణానికి చొరవ చూపాలన్న చిరకాల డిమాండ్లపైనా సీఎం స్పందనకోసం జిల్లా వాసులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రణాళికా సంఘం అనుమతులు కూడా పొందిన ‘ప్రాజెక్టు అనంత’ను అమల్లోకి తెచ్చి జిల్లా ఎడారి కాకుండా కాపాడినప్పుడే చంద్రబాబు ‘వ్యవసాయ మిషన్’కు సార్థకత చేకూరుతుందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. -
కమ్ముకుంటున్న కరువు మేఘాలు
కర్నూలు(అగ్రికల్చర్): ఓవైపు పంటలు ఎండుతున్నాయి..మరోవైపు పశుగ్రాసం కొరత వేధిస్తోంది.. వరుణదేవుడు మాత్రం కరుణించడం లేదు. వెరసి అన్నదాత పరిస్థితి దయనీయంగా మారింది. స్పందించాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. దీంతో దిక్కుతోచని అన్నదాతలు కరుణించు వరుణుడా అంటూ ఆకాశం వైపు చూస్తున్నారు.. తొమ్మిదేళ్ల పాలనలో వ్యవసాయాన్ని దండగా మార్చిన చంద్రబాబు నేడు తమది రైతు ప్రభుత్వంగా ప్రచారం చేసుకుంటున్నారు. కమ్ముకున్న కరువు మేఘాలను మాత్రం చూడటం లేదు. జూన్‌తో మొదలైన ఖరీఫ్ ఈ నెలతో అంటే మరో మూడు రోజుల్లో పూర్తి కానుంది. ఖరీఫ్ ఆరంభం నుంచి జిల్లాను వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఆలస్యంగా ఆగస్టు 22న మొదలైన వర్షాలు సెప్టెంబర్ మొదటి వారం వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అయితే, ఈ వాన కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం.. సెప్టెంబర్ 2వ వారం నుంచి మళ్లీ వర్షాలు బెట్టు చేయడం.. ఎండల తీవ్రత పెరగడంతో పంటలు ఎండుముఖం పట్టాయి. కోడుమూరు, ప్యాపిలి, సి.బెళగల్, పత్తికొండ, తుగ్గలి, గోనెగండ్ల తదితర మండలాల్లో అంతంత మాత్రంగా వర్షాలు పడ్డాయి. ఇక్కడ ఉన్న కొద్దిపాటి తేమ కూడా ప్రస్తుత ఎండతీవ్రతకు ఆవిరవుతోంది. దీంతో పత్తి, మొక్కజొన్న, ఆముదం, కొర్ర వంటి పంటలు అడుగు మేర వరకే పెరుగుదల ఉంది. జిల్లాలో సాధారణ సాగు 5.85 లక్షల హెక్టార్లు ఉండగా, ఆరు లక్షల హెక్టార్లకు పైగా పంటలు సాగయ్యాయి. జిల్లా మొత్తం మీద జూన్ నుంచి సెప్టెంబర్ 27 వరకు 438.9 మి.మీ., సాధారణ వర్షపాతం కాగా 311.8 మి.మీ., వర్షపాతం మాత్రమే నమోదయింది. అంటే 29 శాతం తక్కువగా నమోదయింది. కేవలం రెండు మండలాల్లో మాత్రమే అధిక వర్షాలు పడగా, 11 మండలాల్లో సాధారణ వర్షపాతం మేరకు వర్షాలు కురిశాయి. అంటే 41 మండలాల్లో కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం కరువు గురించి ఇంతవరకు మాట మాత్రంగా కూడా స్పందించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భారంగా మారనున్న పశుపోషణ మామూలుగా అయితే ఆగస్టు నుంచి కొండల్లో, బీడు భూముల్లో పచ్చిక అభివృద్ధి చెందుతుంది. ఎద్దులు పశువులను మేపడానికి బయటికి తరలిస్తారు. ఖరీఫ్ ముగుస్తున్న అనేక మండలాల్లోని కొండలు, బీడు భూముల్లో పచ్చిక మొలవలేదంటే కరువు పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించవచ్చు. ఇప్పటికి పశువులకు ఎండగడ్డినే వినియోగిస్తున్నారు. ఈనెల మొదటి వారంలో వానలు పడినా చుక్కనీరు చేరని చెరువులు అనేకం ఉన్నాయి. కల్లూరు మండలం ఉల్లిందకొండ చెరువుకు ఇప్పటికీ చుక్కనీరు రాలేదు. ప్యాపిలి మండలంలోని చెరువులు, కుంటలన్నీ వెలవెలపోతున్నాయి. పశువులకు తాగడానికి కూడా నీరు కరువై రైతులకు పశుపోషణ పెనుభారంగా మారనుంది. -
లారీలోనే ముక్కిపోతున్న ధాన్యం
- ఒకే లారీని రెండు చోట్ల సీజ్ చేసిన పోలీసులు - 15 రోజులుగా స్టేషన్ ఆవరణలోనే తడ: సుమారు రూ.3 లక్షల విలువైన ధాన్యం 15 రోజులుగా లారీలోనే ముక్కిపోతున్నాయి. ఇప్పటికే వాసన వస్తోందని, ఇక పారబోయడం మినహా మరోదారి లేదని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరుకు చెందిన రైతు గుమ్మా వెంకటేశ్వర్లు తన ధాన్యంతో పాటు పక్క రైతుల నుంచి కొంత ధాన్యం కొనుగోలు చేసి మిల్లులో విక్రయించేందుకు లారీలో బయలుదేరాడు. లారీలో 1010 రకానికి చెందిన రూ.3 లక్షల విలువైన 255 బస్తాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీన నెల్లూరులోనే పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. ఆరబెట్టుకునేందుకు సరైన వసతి లేకపోవడంతో కోత కోసిన వెంటనే అమ్ముకునేందుకు మిల్లుకు తరలిస్తున్నానని, లారీని విడిపించాలని జాయింట్ కలెక్టర్, డీఎస్‌ఓలకు మొరపెట్టుకున్నాడు. వారు స్పందించి ధాన్యం విక్రయానికి సంబంధించిన ధృవపత్రాలను తీసుకుని లారీని విడిపించాలని ఎస్పీకి సిఫార్సు చేయడంతో లారీ విడులైంది. అప్పటికే పది రోజులు గడిచిపోవడం, ధాన్యం నాణ్యత దెబ్బతినడంతో మిల్లర్లు కొనుగోలు చేసేందుకు నిరాకరించారు. దీంతో రెడ్‌హిల్స్‌లో విక్రయించాలని భావించి బయలుదేరాడు. అయితే అదే లారీని 23వ తేదీ రాత్రి తడ సమీపంలో ఎస్బీ పోలీసులు సీజ్ చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అప్పటి నుంచి లారీ స్థానిక స్టేషన్ ఆవరణలోనే ఉండడంతో ధాన్యం ముక్కిపోతోంది. మూడు సరుకుల లారీల సీజ్ బీవీపాళెం(తడ): ఎలాంటి బిల్లులు లేకుండా తమిళనాడు నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించిన మూడు సరుకుల లారీలను అధికారులను సీజ్ చేశారు. చెక్‌పోస్టులో తనిఖీ చేయించుకోకుండా వెళ్లిపోతున్న రెండు ఐషర్ లారీలను ఏఓ మల్లికార్జునరావు వెంబడించి పూడి వద్ద పట్టుకున్నారు. ఒక లారీలో రూ.1.67 లక్షల విలువైన ప్రెషర్ కుక్కర్లు, మరోలారీలో రూ.1.63 లక్షల విలువైన ప్రెషర్ కుక్కర్లు ఉన్నాయి. వీటిని హైదరాబాద్‌కు తీసుకెళుతున్నామని డ్రైవర్లు చెబుతున్నప్పటికీ విజయవాడకు వెళుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అదే సమయంలో చెన్నై నుంచి నెల్లూరుకు వెళుతున్న ఓ లారీని తనిఖీ చేయగా ఎలాంటి బిల్లులు లేని రూ.8.22 లక్షల విలువైన ఊర్వశి సబ్బుల లోడు గుర్తించారు. కుక్కర్లకు 5 శాతం, సబ్బులకు 14.5 శాతం పన్ను విధించడంతో పాటు అంతే మొత్తంలో జరిమానా విధిస్తామని ఏఓ మల్లికార్జునరావు తెలిపారు. -
సీఎం చంద్రబాబు రాక
సాక్షి, గుంటూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 23, 24 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 23న ప్రత్తిపాడులో డ్వాక్రా సదస్సు, 24న పెదకూరపాడులో రైతు సదస్సు నిర్వహిస్తున్నారు. సీఎం పర్యటనపై మంగళవారం జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలు... = ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారు లను ఆదేశించారు. = 23న ప్రత్తిపాడులో జరిగే డ్వాక్రా సదస్సుకు 30 వేల మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలని ఆదేశించారు. = అదే రోజు సాయంత్రం గుంటూరులోని జిల్లా పరిషత్ సమావేశ మంది రంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. అధికారులు విధిగా పవర్ పాయింట్ ప్రజేంటేషన్‌కు సిద్ధం కావాలన్నారు. = సీఎం పర్యటన ముగిసే వరకు వారం రోజులపాటు ఉద్యోగులకు సెలవు మంజూరు చేయవద్దని ఆదేశించారు. = ఈ సదస్సు ముఖ్య బాధ్యతలను డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ ప్రశాంతి, డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్ ఢిల్లీరావు, గుంటూరు ఆర్డీఓ భాస్కర నాయుడులకు అప్పగించినట్టు తెలిపారు. పెదకూరపాడులో రైతు సదస్సు = 24న పెదకూరపాడులో రైతు సదస్సు జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని వ్యవసాయశాఖ జేడీ శ్రీధర్‌ను ఆదేశించారు. = ఇక్కడ కూడా 30 వేల మందికి తగ్గకుండా రైతులను సమీకరించాలన్నారు. సదస్సు నిర్వహణకు తగిన స్థలాన్ని ఎంపిక చేసి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. = బహిరంగవేదికకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి 23వ తేదీ రాత్రి గుంటూరులో బస చేసే అవకాశం ఉందన్నారు. = {పత్తిపాడు, పెదకూరపాడు సదస్సుల ఆవరణల్లో టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు. = రెండు సదస్సుల్లో, ఆర్ అండ్ బీ అతిథి గృహంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. = ఆ రెండు రోజుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారన్నారు. = ముఖ్యమంత్రి పర్యటించే మార్గమధ్యలో వివిధ శాఖల లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు. సదస్సుల్లో స్టాల్స్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. = పెదకూరపాడు సదస్సు సమన్వయకర్తగా ఆర్డీవో మురళికి బాధ్యతలు అప్పజెప్పారు. ఈ సమావేశంలో జేసీ వివేక్‌యాదవ్, డీఆర్వో నాగబాబు, అన్ని శాఖల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
‘మాఫీ’ చేయకుంటే రణమే..
ఖమ్మంజడ్పీ సెంటర్ : జిల్లాలో అర్హులైన రైతులందరికీ వెంటనే రుణమాఫీ వర్తింపజేయాలని, వ్యవసాయానికి నిరంతరాయంగా ఏనిమిది గంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్‌లో మహాధర్నా నిర్వహించారు. తొలుత వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు ప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ధర్నాచౌక్‌లో ఏర్పాటు చేసిన శిబిరంలో బైఠాయించి రుణమాఫీని వెంటనే అమలు చేయాలి, కొత్త రుణాలు అందించాలి, సోనియా రాహుల్ నాయకత్వం వర్దిల్లాలి, కాంగ్రెస్ జిందాబాద్, కిలాడి చంద్రశేఖర్‌రావు ఢాం ఢాం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పార్టీ జిల్లా కార్యాలయం ఇన్చార్జి అయితం సత్యం అధ్యక్షతన జరిగిన ధర్నాలో పలువురు నేతలు ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ పథకాన్ని వెంటనే అమలు చేసి కొత్తరుణాలు ఇవ్వాలని రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి డిమాండ్ చేశారు. రైతులకు ఎరువులు, విత్తనాలు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. కేసీఆర్ వందరోజుల పాలనలో 175 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రైతులు కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అక్రమార్కుల పాలిట హిట్లర్ అని కేసీఆర్ చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. సమగ్ర సర్వే పేరుతో ప్రజలందరినీ ఉరుకులు పరుగులు పెట్టించి, ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న వారిని కూడా రప్పించి, చివరకు సంక్షేమ పథకాలు అందకుండా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రెక్కలు ముక్కలు చేసుకొని వ్యవసాయం చేస్తున్న రైతులకు ఆలస్యం చేయకుండా రుణమాఫీ ఇవ్వాలన్నారు. వందరోజుల పాలనలో వెయ్యి అబద్దాలు చెప్పిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. దేశవ్యాప్తంగా రూ. 75వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందన్నారు. ఆ రుణమాఫీలో కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులు కూడా మాఫీ పొందలేదా? అని ప్రశ్నించారు. 2001లో సోనియాగాంధీ నాయకత్వంలో వై.ఎస్. రాజశేఖరరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి రైతుల కష్టాలు తెలుసుకొని ఉచిత విద్యుత్ అమలు చేశారన్నారు. ప్రభుత్వం రుణమాఫీపై బ్యాంకర్లకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదని మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఆరోపించారు. వెంటనే రుణమాఫీ పై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకర్లు మాత్రం పాతరుణాలు చెల్లిస్తేనే మరలా కొత్తరుణాలు చెల్లిస్తామని చెబుతున్నారని తెలిపారు. రాష్ట్రం ఆత్మహత్యల తెలంగాణగా మారుతోందన్నారు. రైతులందరికీ రుణమాఫీని వర్తింపజేసి ఆదుకోవాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ కోరారు. బంగారం రుణాలు, పట్టణ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులను తికమక పెట్టకుండా స్పష్టమైన వైఖరిని తీసుకుని మాఫీని అమలు చేయాలని, వర్షాలు కురిసి వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున రైతులకు అవసరమైన అన్ని ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుకుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కిలాడి కేసీఆర్ రోజుకోమాట చెబుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. వందరోజుల పాలనలో ఆయన చేసిన ఘనకార్యం ఏమీ లేదన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు కలెక్టరేట్‌లోకి వెళ్ళేందుకు ప్రయత్నించారు. అప్పటికే గేట్లు మూసి వేయడంతో పలువురు ముఖ్యనాయకులు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ ఇలంబరితికి అందచేశారు. ఈ మహాధర్నాలో నాయకులు ఎడవల్లి కృష్ణ, మానుకొండ రాధాకిషోర్, శీలంశెట్టి వీరభద్రం, నాగండ్ల దీపక్‌చౌదరి, పరుచూరి మురళి, పులిపాటి వెంకయ్య, వి.వి.అప్పారావు, వడ్డెబోయిన శంకర్, కొల్లు పద్మ, దేవబత్తిని కిషోర్, విజయ్‌కుమార్, కూల్‌హోం ప్రసాద్, వెంకట్, మగ్బూల్, నరేంద్రచౌదరి, మనోహర్‌నాయుడు పాల్గొన్నారు. -
కరువు కోరల్లో తెలంగాణ!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం నమోదైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, విదర్భ, మరాట్వాడా, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు కలవరపెడుతున్నాయి. తెలంగాణలో జూన్ 1వతేదీ నుంచి ఆగస్టు 20వతేదీ మధ్య కాలంలో సాధారణ వర్షపాతం కంటే 55 శాతం తక్కువగా నమోదైంది. ఇక ఏపీకి సంబంధించి కోస్తాంధ్రలో మైనస్ 35 శాతం, రాయలసీమలో మైనస్ 28 శాతం వర్షపాతం నమోదైంది. 2 వారాల్లో వానలు పడకుంటే కష్టమే.. తెలంగాణలో మొక్కజొన్న, వేరుశనగ పంటలపై రైతుల ఆశలు ఆవిరయ్యాయి. వరి పొలాలు నీళ్లు లేక బీళ్లలా మారాయి. వర్షాభావ పరిస్థితులకు తోడు కరెంటు కోతలు కరువును తలపిస్తున్నాయి. ఆగస్టు 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు తెలంగాణలో సాధారణ వర్షపాతం కంటే 86 శాతం తక్కువగా నమోదవడం గమనార్హం. 50.33 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం 7.3 మి.మీ. వర్షం మాత్రమే కురిసింది. ఇదే పరిస్థితి మరో రెండు వారాలు కొనసాగితే తెలంగాణ ప్రాంతం కరువుతో విలవిల్లాడే ప్రమాదం పొంచి ఉంది. ఆగస్టు 27వ తేదీ తరువాత తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు పడవచ్చని మాత్రం తెలిపింది. 580 మండలాల్లో కరువు ఛాయలు హైదరాబాద్: ఏపీలో ఉన్న 664 మండలాలకు గాను 580 మండలాల్లో కరువు ఛాయలు నెలకొన్నాయని మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప వెల్లడించారు. శనివారం శాసనమండలి జీరో అవర్‌లో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. ఆగస్టు 31వ తేదీ నాటికి తగినంత వర్షం రాకపోతే అనంతపురం, వైఎస్ఆర్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని 2.89 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ప్రత్యామ్నాయ పంటల సాగు చేసేందుకు ప్రత్యేకంగా ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. -
కోత్త బత్తాయి లోకం!
కిన్నో ఆరెంజ్ సాగుతో సేద్యాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్న ప్రకృతి వ్యవసాయదారుడు సత్యారెడ్డి.. రసాయనిక వ్యవసాయంలో కుదే లై తోట తీసేద్దామనుకున్న దశలో ప్రకృతి వ్యవసాయంపై దృషి ప్రకృతి వ్యవసాయం ఇచ్చిన ధైర్యంతో 28 ఎకరాల్లో కిన్నో ఆరెంజ్ సాగు కోటి ఆశలతో బత్తాయి తోట వేసిన రైతు సత్యారెడ్డి ఆశలు నాలుగేళ్లలోనే ఆవిరయ్యాయి. ఎంత ఖర్చుపెట్టినా చెట్లు చనిపోతుండడంతో.. తగిన పరిష్కారాల కోసం వివిధ రాష్ట్రాల్లో విస్తృతంగా అన్వేషించారు. ఈ క్రమంలో ఎగుమతి అవకాశాలున్న కిన్నో ఆరెంజ్ పంట సాగు మేలైనదని గుర్తించారు. అన్నివిధాలా నష్టదాయకంగా పరిణమించిన రసాయనిక వ్యవసాయం కన్నా ప్రకృతి వ్యవసాయం మేలైనదని రైతుల అనుభవాల ద్వారా గ్రహించారు. ప్రకృతి వ్యవసాయ బాటన నడుస్తూ లాభాల మాధుర్యాన్ని చవిచూస్తున్నారు. సేద్య పోరాటంలో విజేతగా నిలుస్తున్నారు. కింద పడకపోవడంలో ఏమంత గొప్పతనం లేదు, పడి లేవడంలోనే జీవితపు గొప్పదనం దాగి ఉంది - నెల్సన్ మండేలా ఇది సమాజంలో అందిరికన్నా రైతుకు ఎక్కువ వర్తిస్తుంది. ఎన్నిసార్లు కిందపడినా, గాయపడినా తిరిగి లేచి ప్రయాణం కొనసాగించడం ఒక్క అన్నదాతకే చెల్లింది. రసాయనిక వ్యవసాయం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం వెదుక్కుంటూ సేద్య పోరాటంలో సాగుతున్న ఒకానొక యోధుడు సత్యారెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా వడ్డేపల్లి మండలం తనగలకు చెందిన రైతు సత్యారెడ్డి, మాణిక్యమ్మ దంపతులు పాతికేళ్ల కిందట సేద్యంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల తర్వాత.. 50 ఎకరాల్లో బత్తాయి సాగు చేపట్టారు. నాటిన ఐదేళ్లకు బత్తాయి కాపునకు వచ్చింది. మొదటి సంవత్సరం మంచి పంట వచ్చింది. కానీ అధిక దిగుబడి సాధించాలన్న తాపత్రయంలో విపరీతంగా ఎరువులు వాడడంతో చెట్లు వేరుకుళ్లు తెగులుతో క్రమంగా దెబ్బతినడం ప్రారంభించాయి. తరువాత నాలుగేళ్లలో వేరు కుళ్లుతో చాలా చెట్లు చనిపోయాయి. పదేళ్లకు చెట్లన్నీ తీసేశాను. తరువాత ఏం చేయాలో అర్థం కాలేదు. భూమిని దున్నటం.. ఏ పంట సాగు చేయాలో అర్థంకాక బీడుగా వదిలే యటం.. తన మదిలో ప్రశ్నలకు జవాబు కోసం ఎక్కడెక్కడో సంచరించడం.. ఇలా కొన్ని సంవత్సరాలపాటు గడచింది. ఈ అన్వేషణలో భాగంగా కర్ణాటక ప్రాంతంలో వ్యవసాయ క్షేత్రాలన్నీ తిరిగారు. అక్కడ ఒక రైతు క్షేత్రంలో మొదటసారి కిన్నో ఆరెంజ్ సాగు చూశాక దానిపై ఆసక్తి కలిగింది. సిట్రస్ జాతికి చెందిన రెండు వంగడాలను సంకరం చేసి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం 1935లో అభివృద్ధి చేసిన పంట కిన్నో ఆరెంజ్. బత్తాయిలోకన్నా రసం ఎక్కువ కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. పాకిస్తాన్ కిన్నో ఆరెంజ్‌కు ఆదరణ ఎక్కువ. మన పంజాబ్‌లోనూ ఈ పంట సాగులో ఉంది. మార్కెట్లో కిన్నో ఆరెంజ్‌కు వున్న డిమాండ్ తెలుసుకున్నాక సత్యారెడ్డి పదకొండెకరాల్లో (20్ఠ20 దూరంలో ఎకరానికి వంద చొప్పున) ఈ మొక్కలు నాటారు. సత్యారెడ్డి స్ఫూర్తితో మరికొంత మంది రైతులు సుమారు వంద ఎకరాల్లో కిన్నో ఆరెంజ్ సాగు మొదలుపెట్టారు. రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో ప్రారంభించిన కిన్నో ఆరెంజ్ సాగును కూడా గతంలో బత్తాయిలో ఎదురైన సమస్యలు వెంటాడాయి. రెండో ఏడాదిలో వంద చెట్లు చనిపోయాయి. అయినా ఏ మాత్రం తగ్గకుండా రసాయనిక ఎరువులు వాడారు. మూడో ఏడాది మరో యాభై చెట్లు చనిపోయాయి. కానీ ఆ ఏడాది 50 టన్నుల దిగుబడి ద్వారా సుమారు రూ. 11 లక్షల ఆదాయం వచ్చింది. నిజానికి మూడో సంవత్సరంలో పంట తీయకూడదు. కానీ, మన వాతావరణం దీనికి సరిపోదని చాలా మంది చెప్పడంతో వచ్చిన అవకాశాన్ని జారవిడవొద్దన్న ఆతృతలో తొందరగా పంట తీసుకున్నారు. సూక్ష్మపోషకాల లోపాలు ఎక్కువయ్యాయి. మేరుకుళ్లు సమస్య మరింత తీవ్రమైంది. నాలుగో సంవత్సరంలో వంద చెట్లు చనిపోయాయి. దీంతో ఇక తోట మొత్తాన్నీ తీసేయాలన్న ఆలోచనకు వచ్చారు. అదే సమయంలో.. వివిధ రాష్ట్రాల్లో పాలేకర్ శిక్షణ శిబిరాలకు హాజ రయ్యారు. ప్రకృతి వ్యవ సాయ పద్ధతులు అమలు చేస్తున్న తోటలకు స్వయంగా వెళ్లి చూశారు. అవన్నీ చూశాక తన కిన్నో ఆరెంజ్ తోటలో సమస్యల పరిష్కారానికి ప్రకృతి వ్యవసాయమే తగిన పరిష్కారమన్న నిర్థారణకు వచ్చారు. ఇక ఆలస్యం చేయకుండా పన్నెండు ఆవులను తెచ్చి గత ఏడాది ప్రకృతి సాగుకు శ్రీకారం చుట్టారు. మిట్ట మధ్యాహ్నం చెట్ల నీడ పడే సమయంలో ప్రతి పదిహేను రోజుల కోసారి డ్రిప్ ద్వారా జీవామృతం, ప్రతి 3 నెలలకోసారి ఎకరానికి 200 కిలోల చొప్పున ఘనజీవామృతం వేశారు. చిగురాకు దశలో ఆకు తొలిచే పురుగులు, పచ్చ పురుగులు ఆశించి నప్పుడు దశపర్ణి కషాయం, బ్యాక్టీరియా తెగుళ్లకు పుల్ల మజ్జిగ చల్లారు. క్రమంగా చెట్లు కోలుకోవడం ప్రారం భమైంది. ఖర్చు ఎకరాకు రూ. 2 వేలకు తగ్గింది. ఆయన తోటలో వచ్చిన అనూహ్యమైన మార్పును చూసి అప్పటి దాకా కిన్నో ఆరెంజ్ తీసేద్దామనకున్న సాటి రైతులు కూడా ప్రకృతి వ్యవసాయం వైపునకు మళ్లారు. అయితే, రసాయనిక వ్యవసాయం నుంచి ఒకేసారి ప్రకృతి సేద్యం వైపు మళ్లడంతో దిగుబడి నలభై టన్నులకు తగ్గింది. ప్రకృతి సాగు వల్ల కన్నో ఆరెంజ్ పండల పరిమాణం, రుచి, నిల్వ సామర్థ్యం పెరిగింది. కానీ మార్కెట్లో కేజీకి రూ. 35 ధర పలకడంతో ఆదాయం తగ్గలేదు. క్రమంగా భూమి శక్తిని పుంజుకోవడంతో ఈ సంవత్సరం 11 ఎకరాల పాత తోటలో 60 టన్నుల దిగుబడి వస్తుందని సత్యా రెడ్డి అంచనా. 9 ఎకరాల తోటలో తొలిపంటగా 20 టన్నుల వరకు వచ్చే అవకాశం ఉందం టున్నారు. ప్రకృతి సేద్యం ద్వారా పండించిన కిన్నో ఆరెంజ్ సైజులోను, నాణ్యతలోను చాలా మెరుగ్గా ఉండటం విశేషం. పంజాబ్‌లో పంట లేని సమయంలో ఇక్కడ పంట రావడం మార్కెటింగ్ విషయంలో కలిసొచ్చే అంశమైంది. కినోవాను ఆయన చెన్నై, బెంగళూరుకు ఎగుమతి చేస్తుంటారు. ప్రకృతి సేద్యంలో కిన్నో ఆరెంజ్ పంట ఇచ్చిన స్థైర్యంతో మరో 17 ఎకరాల్లో కిన్నో ఆరెంజ్ వేశారు. సత్యారెడ్డి జీవితం ఒక పోరాటం. ఒక ఎడతెగని అన్వేషణ. రైతుగా ప్రకృతితో అనుబంధాన్ని పునరుద్ధరిం చుకోవడమే ఆయన విజయ రహస్యం! - కె. క్రాంతికుమార్‌రెడ్డి తీపి బత్తాయి.. ఎర్ర నిమ్మ! గత సంవత్సరం జలంధర్ వెళ్లినప్పుడు సిట్రస్ జాతికి చెందిన మాల్లా బ్లడ్ రెడ్, మాల్టా జఫ్ఫాల గురించి సత్యారెడ్డికి తెలిసింది. ఆ మొక్కలు తెచ్చి కిన్నో ఆరెంజ్ తోటలో ప్రయోగాత్మకంగా అంతరపంటగా సాగు చేస్తున్నారు. కిన్నో ఆరెంజ్ ఏడాదికి ఒకసారి కాపుకొస్తే.. మాల్టా జఫ్ఫా 2, 3 సార్లు కాపుకొస్తుంది. ఇది చూడటానికి బత్తాయిలా ఉండి, కిన్నో ఆరెంజ్ కన్నా తియ్యగా ఉంటుంది. గుజ్జు, రసం కూడా ఎక్కువే. మాల్టా బ్లడ్ రెడ్ లోపల రక్త వర్ణంలో ఉంటుంది. దీని రసం ఒక నెల రోజుల పాటు నిల్వ చేసినా ఏమాత్రం పాడవదని చెబుతున్నారు. పంటకాలం 45 ఏళ్లు! ప్రకృతి వ్యవసాయంలో సిట్రస్ తోటల పంటకాలం 45 ఏళ్లుంటుంది. పంజాబ్‌లో కిషన్‌కుమార్ జాకడ్ అనే రైతు పొలంలో 40 ఏళ్లనాటి కిన్నో ఆరెంజ్ తోట చూసి.. ఈ పంటను సాగు చేస్తున్నా.. మా తోటలో వ్యవ సాయ పనులన్నీ నా భార్య మాణిక్యమ్మ చూసుకుంటారు. అసలు శ్రమంతా ఆమెదే. నేను సలహాదారుడ్ని మాత్రమే. - గని సత్యారెడ్డి(90007 59372), తనగల, వడ్డేపల్లి మండలం, మహ బూబ్‌నగర్ జిల్లా