gaddam prasad kumar
-
కేటీఆర్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. ‘నేను స్పీకర్‌ని. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. బీఆర్ఎస్ ఓడిపోయినా ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారు. నేను స్పీకర్ కావడానికి బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చింది. సీనియర్ సభ్యుడిగా ఉన్న కేటీఆర్ స్పీకర్‌పై ఈ రకమైన వాఖ్యలు చేయడం సరైంది కాదు. బీఆర్ఎస్ ప్రజల్లో విశ్వాసం కోల్పోతోంది. శాసన సభలో ప్రతిపక్షానికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోవడం లేదు’అని వ్యాఖ్యానించారు. అంతకుముందు అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ తీరుపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘శాసనసభ ప్రారంభానికి ముందే మా హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారు. మొదటి రోజే మమ్మల్ని లోపలికి రాకుండా పోలీసులతో అరెస్టు చేయించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా సమస్యలను ఎత్తిచూపేందుకు నిరసన తెలిపితే అరెస్టు చేశారు. మా పార్టీ శాసనసభ్యుల అక్రమ పార్టీ ఫిరాయింపుల పైన నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారు. గత శాసనసభ సమావేశాల్లోనూ మా పార్టీ సభ్యుల గొంతు నోక్కేల వ్యవహరించారు. మాకు అవకాశం ఇవ్వకుండా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారు. మా శాసన సభ్యుల్లో అతి తక్కువ మంది మాత్రమే కొత్త శాసనసభ్యులు ఉన్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న స్పీకర్ వ్యవహార శైలికి నిరసనగా రేపటి నుంచి జరగనున్న ఓరియంటేషన్ సెషన్‌ను బహిష్కరిస్తున్నాము. ఇప్పటికైనా స్పీకర్ పార్టీలకు అతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము’’ అని ట్వీట్లో పేర్కొన్నారు. తాజాగా, కేటీఆర్ వ్యాఖ్యలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ పై విధంగా వ్యాఖ్యానించారు. -
తెలంగాణలో ఉత్తమ శాసనసభ వక్త అవార్డు: శ్రీధర్ బాబు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ అంటే అందరిదీ.. ఏ ఒక్క పార్టీకి చెందినది కాదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కొత్తగా శాసనసభకు ఎన్నికైన నేతలందరూ సభకు హాజరయ్యే సంప్రదాయం కొనసాగించాలని కోరారు. సిద్ధాంతపరంగా బేధాలున్నప్పటికీ.. సభలో ఎవరి పాత్ర వాళ్లు పోషించాలన్నారు.శాసనసభ వ్యవహారాలపై తెలంగాణ శాసనసభ, మండలి సభ్యులకు బుధ, గురువారాల్లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..‘మొదటి సారి ఎన్నికైన శాసనసభ్యులు 57 మంది శాసన సభలో ఉన్నారు. శాసన సభ అందరిది.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో మరొక పార్టీదో కాదు. ఈ ట్రైనింగ్ సెషన్స్ కోసం అందరికీ ఆహ్వానం పంపించాము.పాత రోజుల్లో సిద్ధాంత పరంగా భేదాభిప్రాయాలు ఉన్నా సభలో ఎవరి పాత్ర వారు పోషించారు. నేను మొదటిసారి ఎన్నికైనప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. నేను నాలుగోసారి సభలో ఉన్నప్పుడు పీఏసీని ప్రతిపక్షానికి ఇవ్వలేదు. ఎమ్మెల్యేలు అందరూ శాసనసభకు హాజరయ్యే సాంప్రదాయం కొనసాగించాలి. ఎమ్మెల్యేగా గెలిచి సభ రాకుండా దూరంగా ఉండకండి. పార్లమెంట్లో ఎలాగైతే ఉత్తమ పార్లమెంటేరియన్ ఇస్తున్నారో అదే విధంగా ఉత్తమ శాసనసభ వక్త అవార్డు ఇవ్వాలని స్పీకర్‌ను కోరుతున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు.స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ..‘చట్టాలను రూపొందించే హక్కు శాసన సభ్యులకు ఉంటుంది. గతంలో శాసనసభ సమావేశాలు ఉంటే సినిమా రిలీజ్ వాయిదా వేసుకునే వారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తులు బాగా మాట్లాడి మంచి పేరు తెచ్చుకున్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్ మాదిరిగా ఉత్తమ శాసనసభ వక్త అవార్డు పరిశీలన చేస్తాం’ అంటూ చెప్పుకొచ్చారు.తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ..‘గాలివాటం రాజకీయాలు ప్రారంభం అయినప్పటికీ కొత్త వాళ్ళు మళ్ళీ గెలవడం లేదు. మొదటిసారి ఎన్నికై రాజకీయాల్లో సక్సెస్ అయ్యే వారి శాతం 25శాతమే. కొందరు నాయకులు గెలిచాక ప్రజలతో మమేకం కావడం లేదు. ఎమ్మెల్యేకు కోటరీ వల్ల ప్రజలు స్వయంగా ఎమ్మెల్యేను కలిసే అవకాశం ఎక్కువగా ఉండదు. ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలి.. ఫోన్లు ఎత్తాలి. నేను ఒకసారి ఓడిపోవడానికి నాకు సెక్యూరిటీ సమస్య వల్లే. ప్రజలు ఎమ్మెల్యేకు దూరం అవ్వడానికి కారణం పీఏలు, పీఆర్వోలు అంటూ కామెంట్స్ చేశారు. -
నిబంధనల ప్రకారం ముందుకెళ్తాం: స్పీకర్ గడ్డం ప్రసాద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించి కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక, కోర్టు వ్యాఖ్యలపై తాజాగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందించారు. ఈ క్రమంలో నిబంధనల ప్రకారం నడుచుకుంటామని కామెంట్స్ చేశారు.కాగా, స్పీకర్ గడ్డం ప్రసాద్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఫిరాయింపులకు సంబంధించి కోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చింది. నిబంధనల ప్రకారం మేము నడుచుకుంటాం. పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. నేను తీసుకునే నిర్ణయం రాబయే కాలంలో తెలుస్తుంది అంటూ కామెంట్స్ చేశారు.మూడు పిటిషన్లపై విచారణ.. 2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున విజయం సాధించి, తర్వాత కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావును అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే విధంగా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున విజయం సాధించిన దానం నాగేందర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లో చేరారని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మరో పిటిషన్ వేశారు. అలాగే నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా స్పీకర్ సమయం ఇవ్వడం లేదంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి ఇంకో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి సుదీర్ఘ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.ఇదీ తీర్పు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏప్రిల్‌లో ఒక పిటిషన్, జూలైలో ఇంకో పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఆగస్టు 10 తీర్పు రిజర్వు చేశాం. ఇప్పటివరకు అనర్హత పిటిషన్లపై ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియదు. ఈ నేపథ్యంలో రిట్ పిటిషన్లలో ఉపశమనం పొందేందుకు పిటిషనర్లు అర్హులని ఈ కోర్టు అభిప్రాయపడుతోంది. స్పీకర్ కార్యాలయానికి రాజ్యాంగ హోదా, గౌరవం ఉంది. అనర్హత పిటిషన్లను వెంటనే రాష్ట్ర శాసనసభ స్పీకర్ ముందు ఉంచాలని స్పీకర్ కార్యదర్శిని ఆదేశిస్తున్నాం. ఇరుపక్షాల వాదనలు, డాక్యుమెంట్లు, వ్యక్తిగత వాదనలకు సంబంధించి నేటి నుంచి నాలుగు వారాల్లోగా షెడ్యూల్ నిర్ణయించాలి. నాలుగు వారాల్లో ఏం తేల్చకపోతే సుమోటోగా విచారణ చేపడతాం. తగిన ఆదేశాలను మేమే ఇస్తాం అని న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి తీర్పు ఇచ్చారు. -
ఆటిట్యూడ్ స్టార్ 'చంద్రహాస్' సినిమా ఫస్ట్ లుక్
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా 'రామ్ నగర్ బన్నీ'. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, పొడకండ ప్రభాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్‌లో 'రామ్ నగర్ బన్నీ' సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ గ్రాండ్ ఈవెంట్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి తన వంతుగా హీరో చంద్రహాస్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించి ఆ మొత్తాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి అందజేశారు .తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ..'ప్రభాకర్ నాకు సుపరిచితులు. ఆయన రామ్ నగర్ బన్నీ సినిమా గురించి నాకు చెప్పారు. ఆయన పిలుపుమేరకు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. ఇందులో హీరోగా నటిస్తున్న చంద్రహాస్ మా అమ్మాయి క్లాస్ మేట్. తెలంగాణలో వరద బాధితులను ఆదుకునేందుకు చంద్రహాస్ తన వంతు సహాయాన్ని అందించడం సంతోషంగా ఉంది. మొదటి సినిమాకు హీరోలు అంతగా ఆకట్టుకోరు. కానీ చంద్రహాస్ బాగున్నాడు. ఫస్ట్ లుక్, గ్లింప్స్ తో ఆకట్టుకున్నాడు. అతన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా.' అని స్పీకర్ తెలిపారు.'ఆటిట్యూడ్ స్టార్' చంద్రహాస్ మాట్లాడుతూ .. మా "రామ్ నగర్ బన్నీ" ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. రెండేళ్ల క్రితం ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఆటిట్యూడ్ చూపిస్తున్నాడు అని కామెంట్స్ చేశారు. నేను సినిమాల్లో ఒకలా, బయట మరొకలా బిహేవ్ చేయను. నా మనసులో ఏముందో అదే మాట్లాడుతుంటా. అది కొందరికి నచ్చలేదు. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయాలనే కోరికతో హీరోగా మారాను. అందుకు మా అమ్మా నాన్నలు ఎంతో సపోర్ట్ చేశారు. మా నాన్న ప్రభాకర్ పేరు నిలబెట్టేలా కష్టపడతాను. నా ప్రతిభను నా సినిమాల రిజల్ట్ ద్వారానే తెలియజేయాలని భావిస్తున్నా. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నా. వాటిలో ఫస్ట్ మూవీగా రామ్ నగర్ బన్నీ మీ ముందుకు రాబోతోంది. ఈ సినిమా కలెక్షన్స్ లో 10 శాతం వరద బాధితుల సహాయార్థం అందిస్తాం.' అని ఆయన తెలిపారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఫైర్
-
సుప్రీం కోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చింది పార్టీ మారిన ప్రతి ఒక్కరికి
-
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు కేటీఆర్ లేఖ.. విషయమేంటంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వేళ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో రేవంత్ సర్కార్ శాసనసభ్యుల హక్కులను ఉద్దేశపూర్వకంగా కాలరాస్తోందని ఆరోపించారు.కాగా, కేటీఆర్ లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ లేఖ ప్రకారం.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. అహంకారపూరితంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాదని కాంగ్రెస్ నేతలకు సంక్షేమ పథకాల పంపిణీ బాధ్యతలు అప్పగిస్తున్నారు.శాసససభ్యుల హక్కులను ఉద్దేశపూర్వకంగా రేవంత్ సర్కార్ కాలరాస్తోంది. ఎమ్మెల్యేల హక్కులు, ప్రోటాకాల్ ఉల్లంఘనలు జరగకుండా అడ్డుకోవాలి. ఈ మేరకు సీఎస్, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక, అవసరమైతే ఈ అంశాన్ని అసెంబ్లీ సమావేశాల్లో కూడా లేవనెత్తుతామని తెలిపారు.ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చురకలు అంటించారు. తాజాగా హరీష్ రావు..‘మూడు సార్లు మంత్రి, ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన మహిళా ప్రజాప్రతినిధికి ఇందిరమ్మ రాజ్యంలో గౌరవం లేదా? ప్రజలు గెలిపించిన నాయకులకు విలువ లేదా?. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని విస్మరించి, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, మూడో స్థానానికి పరిమితమైన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి అధికార యంత్రాంగం సలాం కొట్టడం ఏమిటి?.ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల్లో ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించడం లేదని ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. కనీస చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రోటోకాల్ విషయంలో ప్రజాప్రతినిధులకు జరుగుతున్న అవమానం పట్ల స్పీకర్ గడ్డం ప్రసాద్ వెంటనే స్పందించాలి. తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మాకు ఆ గౌరవం ఏదీ? ప్రొటోకాల్‌పై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: తాము అత్యున్నత రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నా అధికారులు కనీసంప్రొటోకాల్ పాటించడం లేదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాల పర్యటనకు వెళ్తున్న సందర్భాల్లో ప్రొటోకాల్ నిబంధనల మేరకు తమను గౌరవించడం లేదన్నారు. శాసనసభ ప్రాంగణంలో మండలి చైర్మన్ గుత్తా, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నతాధికారులతో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రొటోకాల్ అంశంలో తాము ఎదుర్కొంటున్న సమస్యల జాబితాను వివరించారు. అనంతరం డీజీపీ జితేందర్, ఇతర పోలీసు ఉన్నతాధికారులతోనూ చైర్మన్, స్పీకర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ భేటీలో ప్రొటోకాల్ అంశంపై వీరిద్దరు ఉన్నతాధికారులను హెచ్చరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో జరిగిన భేటీలో పలు అంశాలను ప్రస్తావించారు. తమను గౌరవించాల్సిన తీరుపై కిందిస్థాయి అధికారులకు అర్థమయ్యే రీతిలో సందేశాలు, సంకేతాలివ్వాలని గుత్తా, గడ్డం ప్రసాద్ చెప్పారు. చైర్మన్, స్పీకర్ అభ్యంతరాలు ఇవే.. తాము జిల్లా పర్యటనకు వెళ్లిన సమయంలో కనీసం ఆర్డీఓ లేదా తహసీల్దార్ స్థాయి అధికారులు స్వయంగా వచ్చి స్వాగతం చెప్పాల్సిన ఉన్నా ఎవరూ రావడం లేదు. తమ పర్యటనలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని ప్రొటోకాల్ విభాగం జిల్లా అధికారులకు పంపించడం లేదు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ పరంగా జరిగే అభివృద్ధి కార్యక్రమాలకూ ఆహ్వానించడం లేదు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలకు మాత్రమే సమాచారం ఇస్తున్నారు. సాధారణంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో బదిలీలపై వచ్చే అధికారులు మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్‌ను మర్యాదపూర్వకంగా కలవాలనే ఆనవాయితీని పాటించడం లేదు. దీంతో ఏ అధికారి ఏ స్థానంలో పనిచేస్తున్నారో కనీస సమాచారం కూడా ఉండట్లేదు. జాతీయ పండుగలైన పంద్రాగస్టు, గణతంత్ర దినోత్సవం, రాష్ట్ర అవతరణ వేడుకలు తదితర సందర్భాల్లో తాము జాతీయ పతాకాన్ని ఏ జిల్లాలో ఎగురవేయాలో చివరి నిమిషం వరకు చెప్పడం లేదు. ⇒ పర్యటనలకు వెళ్లిన సందర్భంలో కనీసం ఎస్ఐ స్థాయి అధికారి బందోబస్తు ఇవ్వాల్సి ఉన్నా ఎక్కడా కనిపించడం లేదు. దీనికి వాహనాల కొరత, మంత్రుల వెంట వెళ్లడం తదితర కారణాలను సాకుగా చూపుతున్నారు. ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో సినిమా తారలు, ఇతరులను కూర్చోబెడుతూ మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ వెళ్లిన సందర్భంలో అధికారిక ఏర్పాట్లేవీ చేయడం లేదు. అటవీ ప్రాంతాలు, మారుమూల గ్రామాలకు వెళ్లినపుడు భద్రతా ఏర్పాట్లు ఉండటం లేదు. 25 లేదా 26న రాష్ట్ర బడ్జెట్? రాష్ట్ర అసెంబ్లీ వార్షిక బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్ర బడ్జెట్ ఈనెల 23న ప్రవేశపెడుతున్న నేపథ్యంలో, రాష్ట్ర బడ్జెట్ ఈనెల 25 లేదా 26న ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం ఉన్నతాధికారులతో జరిగిన భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ సమీక్ష నిర్వహించారు. సమావేశాలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. డీఎస్సీ, గ్రూప్స్ పరీక్షలపై విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాసనసభ, మండలి లెజిస్లేచర్ సెక్రటేరియట్లో పెండింగులో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాల్లో ప్రొటోకాల్ వివాదాలు తలెత్తకుండా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పారు. ఈ సమీక్షలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, లెజిస్లేచర్ సెక్రెటరీ నరసింహాచార్యులు, విప్ రామచంద్రు నాయక్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు . -
సీఎం రేవంత్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి
లంగర్‌హౌస్ (హైదరాబాద్): గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, అయితే సీఎం రేవంత్‌రెడ్డి అమ్మవారి ఆశీర్వాదాలతో తెలంగాణను అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తారని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో మెదటి బోనాల పూజలు అందుకునే గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాలను ఆదివారం లంగర్‌హౌస్‌లో ప్రారంభించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారమ్యన్, గోల్కొండ జగదాంబిక ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కాంత అరవింద్‌ల ఆధ్వర్యంలో మంత్రులు లంగర్‌హౌస్ చౌరస్తాలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం నజర్బోనంతో, తొట్టెలను ఊరేగింపుగా గోల్కొండ కోటకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఈ సంవత్సరం రాష్ట్రం నలుమూలల నుంచి మహిళలు పెద్ద ఎత్తున గోల్కొండకు తరలి వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.20 కోట్లు మంజూరు..అనంతరం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లా డుతూ.. బోనాల ఉత్సవాల నిర్వహణకోసం రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలకు గత సంవత్సరం కంటే రూ.5 కోట్లు ఎక్కు వగా అంటే ఈ సంవత్సరం రూ.20 కోట్లు మంజూరు చేశా మని తెలిపారు. ఒక వేళ ఈ నిధులు సరిపోకపోతే మరింత అందజేస్తామని వివరించారు. గోల్కొండ బోనాలు నిర్వ హించే కార్వాన్ నియోజకవర్గానికి 73 లక్షల 15 వేల రూపా యలు మంజూరు చేశామన్నారు. అనంతరం ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. జంట నగరాల బోనా ల ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరఫున రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. దానం నాగేందర్, చిన్నారెడ్డి, మధుయాష్కీ గౌడ్, వి.హనుమంతరావు, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్ హనుమంత రావు, సీపీ శ్రీనివాస్‌రెడ్డి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. -
‘సీఎం రేవంత్‌రెడ్డి ఒత్తిడితోనే స్పీకర్ కలవలేదు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తమకు అపాయింట్మెంట్ ఇచ్చిమరీ కలవకపోవడంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ సమర్పించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు అపాయిట్మెంట్ ఇవ్వడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ వెళ్లారు. ఇంట్లో స్పీకర్ లేకపోవడంతో ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో రెండున్నర గంటల పాటు స్పీకర్ నివాసం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరీక్షించి అయినప్పటికీ ఆయన రాకపోవటంతో వెనుదిరిగారు. తమను స్పీకర్ కలవకపోవటంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడారు. స్పీకర్ గడ్డం ప్రసాద్.. అపాయింట్మెంట్ ఇచ్చి తమను కలవకపోవడం బాధాకరమని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఒత్తిడితోనే అసెంబ్లీ స్పీకర్ తమను కలవలేదని మండిపడ్డారు. రేపు మరోసారి స్పీకర్‌కు దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ సమర్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారాయన. -
కేసీఆర్‌కు ఈ చాంబర్ ఏంటి?
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఇన్నర్ లాబీలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఏళ్ల తరబడి కేటాయిస్తూ వస్తున్న చాంబర్‌ను తొలగించి తాజాగా కె.చంద్రశేఖరరావుకు ఔటర్ లాబీలో ఇరుకైన చిన్న గదిని కేటాయించడంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శాసనసభ సమావేశాల తొలిరోజున గురువారం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్ చాంబర్‌కు వెళ్లి తమ నిరసన తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, హరీశ్‌రావు, సీనియర్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి తదితరులు కేసీఆర్ చాంబర్‌ను మార్చడాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. 39 మంది ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ప్రధాన ప్రతిపక్షం నేత కార్యాలయాన్ని ఇన్నర్ లాబీ నుంచి ఔటర్ లాబీకి మార్చడాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచీ ఇన్నర్ లాబీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ప్రత్యేక చాంబర్‌ను కేటాయించడం ఆనవాయితీగా వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతకు కేటాయించిన చాంబర్‌ను ఔటర్ లాబీకి తరలించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలపైనా ఫిర్యాదు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాసేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తూ నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలకు సంబంధించిన పలు సంఘటలను కూడా స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అనారోగ్యంతో బాధపడుతున్నా ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి భార్య వచ్చేంత వరకు సుమారు రెండు గంటల పాటు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు నిలిపివేశారన్నారు. నర్సాపూర్, దుబ్బాక, జహీరాబాద్ తదితర నియోజకవర్గాల్లోనూ ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థులను పోలీసులు ఎస్కార్ట్ వాహనంతో అనుసరిస్తున్నారని స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరగకుండా అధికారులను ఆదేశించాలని స్పీకర్‌ను కోరారు. పని చేయని టీవీ.. డోర్ హ్యాండిల్ లేని బాత్ రూం గతంలో ఐదుగురు సభ్యులున్న కాంగ్రెస్‌కు కూడా చాంబర్‌ను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇన్నర్ చాంబర్‌లోని ప్రతిపక్ష నేత చాంబర్‌ను తాను వాడుకుంటానని స్పీకర్ కోరడంతో ఔటర్ లాబీకి తన కార్యాలయాన్ని తరలించేందుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారన్నారు. అయితే ఔటర్ లాబీలో ఇరుకైన చిన్న గది కేటాయించారని, అందులోని మూత్రశాలకు కనీసం డోర్ హ్యాండిల్ లేదనీ, టీవీ పనిచేయడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు తెలిపారు. ఇది ప్రతిపక్ష నేతను అవమానించడం లాంటిదేనని, విశాలమైన చాంబర్‌ను కేటాయించాలని కోరారు. వచ్చే సెషన్‌లోగా ప్రతిపక్ష నేత చాంబర్‌ను విశాలంగా తీర్చిదిద్ది అన్ని వసతులు కల్పిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. -
బీఏసీకి హరీశ్ రాకపై అభ్యంతరం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ నిర్వహణ తేదీలు, ఎజెండా ఖరారు కోసం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో మంత్రులు, మాజీ మంత్రి హరీశ్‌రావు మధ్య స్వల్ప వాగ్విదం జరిగింది. బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత కేసీఆర్‌కు బదులు హరీశ్‌రావు బీఏసీ భేటీకి హాజరు కావడంపై మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ చాంబర్లో బీఏసీ తొలి సమావేశం ప్రారంభమైంది. అధికార పార్టీ తరఫున శ్రీధర్‌బాబు, పొన్నంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రతిపక్ష బీఆర్ఎస్ తరఫున హరీశ్‌రావు, కడియం శ్రీహరి హాజరయ్యారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నందున తనకు బదులుగా హరీశ్‌రావు బీఏసీ సమావేశంలో పాల్గొంటారంటూ మాజీ సీఎం కేసీఆర్ బుధవారం స్పీకర్‌కు సమాచారం ఇచ్చినట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అయితే శ్రీధర్‌బాబు, పొన్నం అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాగ్వాదం జరిగింది. కేసీఆర్‌కు బదులుగా తాను హాజరయ్యేందుకు స్పీకర్ అంగీకరించారని హరీశ్ చెప్పారు. అయితే ఈ అంశంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కాబట్టి హరీశ్‌రావు హాజరయ్యేందుకు వీలు లేదని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. అలా హాజరయ్యేందుకు వీలు లేదు: శ్రీధర్‌బాబు తాము ఎవరిని బీఏసీ సమావేశం నుంచి బయటకు వెళ్ళమని చెప్పలేదని శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. స్పీకర్ నిర్ణయం మేరకు బీఏసీ సమావేశంలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ నుంచి ఇద్దరు సభ్యులకు అవకాశం కలి్పంచారని చెప్పారు. దీంతో బీఆర్ఎస్ తరఫున మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కడియం శ్రీహరి పేర్లు ఇచ్చారని తెలిపారు. కానీ బీఏసీ భేటీకి కేసీఆర్ రావడం లేదు కాబట్టి తాను వస్తానని హరీశ్‌రావు తెలిపారని, అయితే ఒక సభ్యుడు సమావేశానికి రావడం లేదని చెప్పి అతడి స్థానంలో మరో సభ్యుడికి అనుమతినివ్వడం కుదరదని పేర్కొన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నుంచి ఎలాంటి లేఖ కూడా ఇవ్వలేదని తెలిపారు. కాగా అసెంబ్లీని ఎన్నిరోజులైనా నిర్వహించేందుకు తా ము సిద్ధమని శ్రీధర్‌బాబు చెప్పారు. దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. గతంలో అనేకసార్లు మేం అనుమతించాం: హరీశ్ గతంలో తాము బీఏసీ జాబితాలో లేని వారిని కూడా పార్టీ శాసనసభా పక్ష నేత వినతి మేరకు అనుమతించిన విషయాన్ని హరీశ్ గుర్తు చేశా రు. ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ బదు లుగా ఎమ్మెల్యే బలాలను పలు సందర్భాల్లో అనుమతించామని, అవసరమైతే బీఏసీ మిని ట్స్‌ను పరిశీలించాలని అన్నారు. తాము అలా అనుమతించలేదని నిరూపిస్తే రాజీనామా చేసి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్తానని హరీశ్ స్పష్టం చేశారు. దీంతో మినిట్స్ పరిశీలించేందు కు సమయం పడుతుందని, అభ్యంతరం వ్యక్తమైన నేపథ్యంలో సర్దుకుపోవాలని స్పీకర్ ప్రసాద్‌కుమార్ కోరారు. దీంతో మీ విచక్షణకే వదిలివేస్తున్నానంటూ హరీశ్‌రావు బీఏసీ భేటీ నుంచి బయటకు వచ్చారు. దీంతో కడియం ఒక్కరే బీఆర్ఎస్ తరఫున బీఏసీ భేటీలో పాల్గొన్నారు. -
స్పీకర్ గడ్డం ప్రసాద్, తమ్మినేనిని పరామర్శించిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. స్పీకర్ గడ్డం ప్రసాద్, సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని పరామర్శించారు. వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివరాల ప్రకారం.. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం, సీఎం రేవంత్.. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వెళ్లారు. ఈ క్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిసి పరామర్శించారు. కాగా, ఇటీవలే స్పీకర్ ప్రసాద్ అనారోగ్యానికి గురయ్యారు. మరోవైపు.. తమ్మినేని వీరభద్రాన్ని కూడా సీఎం రేవంత్ పరామర్శించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన సీఎం రేవంత్.. తమ్మినేనిని పరామర్శించారు. కాగా, తమ్మినేనికి ఇటీవల స్ట్రోక్ రావడంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో, ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను సన్మానించిన FNCC సభ్యులు
తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిలింనగర్ కల్చరల్ కమిటీ(FNCC) సభ్యులు తాజాగా సన్మానం చేసి గౌరవించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఫిలింనగర్ కల్చరల్ కమిటీ(FNCC) సభ్యులు ప్రెసిడెంట్ ఆదిశేష గిరి, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రటరీ పెద్దిరాజు, ఎక్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణతో పాటుగా ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. గడ్డం ప్రసాద్‌కు FNCC ప్రెసిడెంట్, సెక్రటరీ పుష్పగుచ్చము ఇచ్చి శాలువా కప్పి సన్మానం చేయడం జరిగింది. ప్రొడ్యూసర్, FNCC సెక్రటరీ మోహన్ మాట్లాడుతూ గడ్డం ప్రసాద్ కుమార్ గారు శాసనసభ స్పీకర్‌గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తమ ఆహ్వానాన్ని మన్నించి FNCCకి విచ్చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి ప్రత్యేకంగా కమిటీ సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఆపై తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. తనను ఇలా ఈ సన్మానానికి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. FNCC ద్వారా ఇక్కడికి రావడమే కాకుండా తన స్నేహితుల్ని ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. FNCC కి తన వంతు కావాల్సిన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ వుంటాయని ఆయన తెలియచేశారు. ఇలా తనను ఆహ్వానించి గౌరవించినందుకు FNCC కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. -
రెండు గదులు కేటాయించండి
సాక్షి, హైదరాబాద్: శాసససభ ఇన్నర్లాబీలో ఇప్పటికే కేటాయించిన కార్యాలయంతో పాటు, ఆవరణలోనే తమ కోసం విశాలంగా ఉండేలా రెండుగదుల కార్యాలయాన్ని ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు బీజేపీ శాసనసభాపక్షం (బీజేఎల్పి) విజ్ఞప్తి చేసింది. తమ పార్టీ పక్షాన 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, నలుగురు ఎంపీలున్నందున సమావేశమయ్యేందుకు, సందర్శకులను కలుసుకునేందుకు వీలుగా రెండుగదులున్న కార్యాలయాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శుక్రవారం స్పీకర్‌కు బీజేఎల్పీ పక్షాన ఎమ్మెల్యేలు టి.రాజాసింగ్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణగుప్తా వినతిపత్రం సమరి్పంచారు. తమ విజ్ఞప్తిపై స్పీకర్ సానుకూలంగా స్పందించారని బీజేపీ ఎమ్మెల్యేలు తెలిపారు. అందుబాటులో ఉన్న గదులు, వీలును బట్టి తప్పకుండా అసెంబ్లీ ఆవరణలోనే కార్యాలయం కేటాయించే విషయాన్ని పరిశీలిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారని తెలిపారు. -
స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఉదయం శాసనసభ సమావేశం కాగానే ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ప్రసాద్‌కుమార్‌కు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష సభ్యులు అభినందనలు తెలిపారు. అనంతరం సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తదితరులు స్పీకర్‌ను గౌరవ పూర్వకంగా తోడ్కొని వెళ్లి ఆయన కుర్చీలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత వరుసగా మంత్రులు, ఎమ్మెల్యేలు స్పీకర్ చైర్ వద్దకు వచ్చి ప్రసాద్‌కుమార్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. మంచి సాంప్రదాయానికి అందరి మద్దతు: సీఎం స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్, ఎంఐఎం, సీపీఐ సభ్యులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. మంచి సాంప్రదాయానికి అందరూ మద్దతు తెలిపారని, భవిష్యత్‌లో కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. గొప్ప వ్యక్తి స్పీకర్ అయ్యారని కొనియాడారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారన్నారు. ప్రసాద్‌కుమార్ తన సొంత జిల్లా నేత అని గుర్తు చేశారు. వికారాబాద్ అభివృద్ధిలో ప్రసాద్కుమార్ది చెరగని ముద్ర అని పేర్కొన్నారు. ఉమ్మడి కుటుంబ బాధ్యతలు ఆయనకు బాగా తెలుసన్నారు. ఆయనకు 8 మంది సోదరీమణులు ఉన్నారని, చిన్న వయస్సులోనే తండ్రి చనిపోవడంతో వారందరి బాధ్యత తానే తీసుకున్నారన్నారు. ఈ అసెంబ్లీ కూడా ఒక కుటుంబమేనని, ఆ కుటుంబంలో మనమంతా సభ్యులమని పేర్కొన్నారు. ప్రతిపక్ష, పాలకపక్షం అందరూ కుటుంబ సభ్యులేనన్నారు. మనందరినీ సమన్వయం చేసే బాధ్యతను ఆయన సమర్ధవంతంగా నిర్వహించగలరని, సభలో అందరి హక్కులను కాపాడగలరని, ఆదర్శవంతమైన అసెంబ్లీగా దీన్ని తీర్చిదిద్దుతారనే పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. సమాజంలో ఎన్నో రుగ్మతలకు ప్రసాద్‌కుమార్ పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ప్రసాద్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు. ఆయన పేదల సమస్యలు తెలిసిన వ్యక్తి అని అన్నారు. రాష్ట్రంలోని సమస్యలను పెద్ద ఎత్తున చర్చించేందుకు సభ్యులకు ఎక్కువ సమయం ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. సంపూర్ణ మద్దతుకు కేసీఆర్ ఆదేశం: కేటీఆర్ స్పీకర్ ఎన్నిక విషయంలో మద్దతు ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు అడగగానే సంపూర్ణ మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. స్పీకర్ ఎన్నికకు ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ.. మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్రెడ్డిలాగే సభా హక్కులను కాపాడాలని కోరుతున్నానన్నారు. సామాన్య ప్రజల సమస్యలు చర్చకు వచ్చేలా చూడాలన్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..ప్రసాద్‌కుమార్ అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు స్పీకర్‌గా ఎన్నికయ్యారంటూ అభినందనలు తెలిపారు. తన తండ్రి శ్రీపాదరావు ఇదే శాసనసభలో చైర్‌కు ఔన్నత్యాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు. స్పీకర్‌కు మద్దతు తెలిపినందుకు విపక్ష పా ర్టీలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రసాద్‌కుమార్ ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కాదని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పిల్లలకు తండ్రి లాంటి పాత్ర ఆయన సభలో పోషించాలని ఆకాక్షించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్యేలు పద్మావతి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కాలే యాదయ్య, దానం నాగేందర్, కడియం శ్రీహరి, యెన్నం శ్రీనివాసరెడ్డి తదితరులు మాట్లాడారు. బీజేపీ సభ్యుల ప్రమాణ స్వీకారం ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు మొదటి రోజు అసెంబ్లీకి గైర్హాజరైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారానికి సైతం దూరంగా ఉన్న వారు గురువారం అసెంబ్లీకి హాజరయ్యారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ సమక్షంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, పాల్వాయి హరీశ్‌బాబు, పాయల్ శంకర్, పవార్ రామారావు పాటిల్, టి.రాజాసింగ్ వీరిలో ఉన్నారు. పార్టీల బలాలను బట్టి సమయం: స్పీకర్ తనను స్పీకర్‌గా ఎంపిక చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి ప్రసాద్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఏకగీవ్రంగా ఎన్నుకున్నందుకు అన్ని పా ర్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. 57 మంది కొత్త సభ్యులు ఉన్నారంటూ..పా ర్టీల బలాలను బట్టి సమయం కేటాయిస్తానని చెప్పారు. స్పీకర్ స్థానం ఉన్నతమైనదే కాదు సంక్లిష్టమైనదని పేర్కొన్నారు. అంతకుముందు సభ మొదలైన వెంటనే గతంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయని వారి చేత ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మారావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి వీరిలో ఉన్నారు. -
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్
-
తెలంగాణకు తొలి దళిత స్పీకర్.. రేపే అధికారిక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శాసనసభ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ వేశారు. ప్రతిపక్ష బీఆర్ఎస్, దాని మిత్ర పక్షం మజ్లిస్ సైతం స్పీకర్ ఎన్నికకు సహకరిస్తామని ప్రకటించింది. గడువు ముగియడంతో ఆయన స్పీకర్ కావడం ఖాయమైంది. శాసనసభ స్పీకర్ ఎన్నిక నామినేషన్ల కోసం ఇవాళే ఆఖరి రోజుకాగా.. ఒకే ఒక నామినేషన్ దాఖలు అయ్యింది. దీంతో స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నిక దాదాపు ఖరారు అయినట్లే. ప్రొటెం స్పీకర్ రేపు(గురువారం డిసెంబర్ 14)న శాసన సభలో స్పీకర్ ఎన్నికపై అధికారిక ప్రకటన చేయనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గడ్డం ప్రసాద్‌కుమార్ రెండుసార్లు వికారాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. తొలిసారి ఆయన నెగ్గింది 2008 ఉప ఎన్నికల్లో. ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లో మంత్రిగానూ పని చేశారు. అయితే ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఓడారు. ఆపై కాంగ్రెస్‌కు ఉపాధ్యక్షుడిగా, టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగానూ పని చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నుంచే మళ్లీ ఎమ్మెల్యేగా నెగ్గారు. సహజంగానే అధికార పార్టీ స్పీకర్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌గా నియమిస్తే తెలంగాణ రాష్ట్ర తొలి దళిత స్పీకర్ అవుతారు. గడ్డం ప్రసాద్ కుమార్ స్వస్థలం వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బెల్కటూరు గ్రామం. తల్లిదండ్రులు ఎల్లమ్మ, ఎల్లయ్య. తాండూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1984లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. -
ప్రజాస్వామ్య పద్ధతిలో సభ నిర్వహిస్తా
సాక్షి, హైదరాబాద్: పాలక, ప్రతిపక్ష సభ్యులను సమన్వయం చేసుకుంటూ శాసనసభ ఔ న్నత్యం ఇనుమడింపజేసేలా ప్రజాస్వామ్య ప ద్ధతిలో సభా కార్యక్రమాలు నిర్వహిస్తానని వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ ఎన్నికకానున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. స్పీకర్ పదవికి కాంగ్రెస్ తనను ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందని... దళితుడికి ఇంత పెద్ద హోదా కేవలం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమన్నారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే... మంత్రి పదవి వస్తుందని అనుకున్నా... నాతో పాటు నియోజకవర్గ, జిల్లా ప్రజలు కూడా ఈసారి నాకు మంత్రి పదవి వస్తుందని అనుకున్నాం. కానీ పార్టీ అధిష్టానం ఇంకా గొప్పగా ఆలోచించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెద్ద బాధ్యత అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తను నేను. పార్టీ ఏ పదవి ఇచ్చినా కాదనకుండా చేసుకుంటూపోతా. కాంగ్రెస్ పేరుకు దెబ్బ తగలకుండా ఇచ్చిన పదవికి గౌరవం తెచ్చేలా పనిచేస్తా. రెండు పర్యాయాలుస్పీకర్ నామమాత్ర పాత్రనే... గత రెండు పర్యాయాలు శాసనసభ కార్యక్రమాల నిర్వహణను రాష్ట్ర ప్రజలంతా గమనించారు. నియంతృత్వ ధోరణిలో ప్రతిపక్షాలను లెక్క చేయకుండా ఏకపక్షంగా సభానాయకుడే సభలో నిర్ణయాలు తీసుకున్న పరిస్థితిని గమనించాం. స్పీకర్ పాత్ర నామమాత్రమైంది. నేను స్పీకర్‌గా ఎన్నికైతే ప్రజాస్వామ్య పద్ధతిలో, సభ గౌరవం తగ్గకుండా, స్పీకర్ విలువ పెంచేలా సభను నడిపిస్తా. మహామహులు సభలో ఉన్నా... సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మాజీ సీఎం కేసీఆర్ ఇతర సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు. పాలక, ప్రతిపక్షాల సభ్యులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతా. ఇప్పటి వరకు పాలక పక్షం చెప్పిందే వేదంగా సాగేది. సభలో ప్రతిపక్షాలకు కూడా తగిన సమయం ఇస్తా. అందరినీ కలుపుకొని ముందుకు వెళతా. మొదటి దళిత స్పీకర్‌ను నేనే అవుతా... నేను ఎన్నికైతే తెలంగాణ శాసనసభలో తొలి దళిత స్పీకర్‌గా నాదే రికార్డు అవుతుంది. ఉమ్మడి ఏపీలో ప్రతిభాభారతి తొలి దళిత స్పీకర్‌గా ఉండేవారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇంత పెద్ద పదవి దక్కింది కూడా నాకే. -
‘ఆ పథకంపై కేసీఆర్‌ది సవతి తల్లి ప్రేమ’
సాక్షి, పరిగి( వికారబాద్): పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని మాజీ మంత్రి గడ్డంప్రసాద్‌కుమార్, మాజీ ఎంపీ కొండావిశ్వేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, జలసాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అనంతరెడ్డి అన్నారు. కృష్ణాజలాల వినియోగం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సాధనకై ఆదివారం పరిగి పట్టణ కేంద్రంలో అఖిలపక్షం నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కావాలనే పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల పనులను ఆపేశారన్నారు. ఆ నిధులన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు తరలించారన్నారు. ప్లానింగ్ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిధులన్నీ తన సొంత జిల్లాలకే తీసుకెళ్లి పనులు చేపడుతున్నారని విమర్శించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్ నిధులను సైతం తన ప్రాంతాలకు తరలించారన్నారు. రోజుకు కొత్త మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ 10 టీఎంసీలు ఉంటే దాన్ని ఒక టీఎంసీకి మార్చారని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మళ్లీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో సామర్థ్యాన్ని పునరుద్ధరించారన్నారు. కృష్ణా జలాల పరిరక్షణ కోసం ప్రధానమంత్రికి కూడా వినతిపత్రం అందించామన్నారు. అధికార పార్టీ నాయకులు కూడా ఈ విషయంపై స్పందించి మన ప్రాంతానికి నీళ్లు తీసుకువచ్చేందుకు కృషిచేయాలన్నారు. మన ప్రాంతాలకు జలాలను తెచ్చుకునేందుకు పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయ పార్టీల ముఖ్య నాయకులు హన్మంతుముదిరాజ్, భీంరెడ్డి, రాముయాదవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘సమస్యలపై ఫోన్ చేస్తే ఎప్పుడూ స్పందించరు’
సాక్షి, వికారాబాద్: ‘నేను చాలా సార్లు ఫోన్ చేశా, మీరు తీయడం లేదు, ఒక వేళ మీటింగ్‌లతో బిజీగా ఉంటే ఆ తర్వాతైనా ఫోన్ చేయొచ్చు కదా.. మీరు ప్రజాప్రతినిధులను చిన్న చూపు చూస్తున్నారు’ అని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం ప్రసాద్‌కుమార్ కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్ ఎదుట ఆవేదన వెళ్లగక్కారు. వివరాలిలా ఉన్నాయి.. రైతు సమస్యల పరిష్కారం డిమాండ్‌తో సోమవారం పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ నేతలు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వద్దకు వెళ్లిన ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. మాజీ ప్రజా ప్రతినిదులంటే చిన్నచూపు ఎందుకని నిలదీశారు. మీతో మాకు వ్యక్తిగత అవసరలేవీ లేవని, ఈ ప్రాంతం గురించి మీకు గానీ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు గానీ పూర్తి స్థాయిలో అవగాహన లేదన్నారు. అందుకోసమే కొన్ని విషయాలు చెప్పాలని ఫోన్ చేస్తే మీరు స్పందించడం లేదని అసహనం వ్యక్తంచేశారు. తాము 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నామని తెలిపారు. మీరు పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ఫోన్ తీయలేకపోతే తర్వాత చేసినా మార్యాద ఇచ్చిన వారవుతారన్నారు. పలు సమస్యలపై మాట్లాడేందుకు తాను చాలా సార్లు ఫోన్ చేసినా తీయలేదన్నారు. ఇది తమను అగౌరవపర్చినట్లేనని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ప్రాంతంలో ఇప్పటికీ సగం మంది రైతులకు పట్టా పాసుపుస్తకాలు అందలేదని, 50 శాతం రైతులకు రైతుబంధు అందలేదని తెలిపారు. జిల్లా అంటే మరుగుదొడ్లు నిర్మించడం, మొక్కలు నాటడమే కాదు, ప్రజల అవసరాలను తెలుసుకొని పాలన అందిస్తే మంచిదని ప్రసాద్‌కుమార్ ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు. జిల్లా యంత్రాంగం, మండల అధికారులు ఎప్పుడు చూసినా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్, ప్రిన్సిపల్ సెక్రెటరీ వీసీ అంటూ కార్యాలయాల్లో అందుబాటులో ఉండటం లేదని తెలిపారు. అధికారుల పనితీరుతో ఎంతో మంది రైతులు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారని పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కె.విశ్వేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ పట్టణ నాయకులు తదితరులు ఉన్నారు. -
జిల్లాలో క్లీన్‌స్వీప్ చేస్తాం..
సాక్షి, వికారాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీమంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బుధవారం ఆయన స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభించిన టీఆర్ఎస్ను గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జిల్లాలో అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆయన అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటుగా కొత్తగా ఏర్పడిన వికారాబాద్ జిల్లాకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలలో అన్యాయం చేసిందని ఆరోపించారు. ప్రాణహిత–చేవెళ్ల, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల డిజైన్లు మార్చి జిల్లాకు తాగునీరు, సాగునీరు రాకుండా అడ్డుకుంటున్న ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వికారాబాద్‌కు చేసిందేమీలేదని దుయ్యబట్టారు. శాటిలైట్ సిటీకి కేంద్రం నుంచి సుమారుగా రూ.3వేల కోట్లకు పైగా రావాల్సిన నిధులను రాబట్టడంలో విఫలమయ్యారని విమర్శించారు. తాను ఆరు సంవత్సరాల ఎమ్మెల్యేగా, మంత్రిగా వికారాబాద్ నియోజకవర్గానికి రూ.600కోట్లతో అభివృద్ధి చేశానన్నారు. 2008 ఎన్నికల పునరావృతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గురువారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే బంట్వారం: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే అధికారమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం ప్రసాద్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన కోట్‌పల్లి మండలంలో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా ఎల్లమ్మ గుట్ట వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యకర్తల భారీర్యాలీ మధ్యన తరలివెళ్లారు. నాగసాన్పల్లి, మోత్కుపల్లి, బార్వాద్, కరీంపూర్, ఎన్కేపల్లి, నాగసాన్‌పల్లితండా, బార్వద్‌తండా, మద్గుల్ తండాలో రోడ్‌షో నిర్వహించి సుదీర్ఘంగా ప్రసంగించారు. టీఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ను మించిన మోసకారి ప్రపంచంలో ఎక్కడా లేరన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆయన గుర్తు చేశారు. రాజీవ్‌ఆరోగ్యశ్రీ, 108 పథకాలతో ఎంతో మంది ప్రాణాలు నిలబడాడ్డయని, ఇప్పటికీ వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయారన్నారు. టీఆర్ఎస్ మునిగే నాలావలాంటిదన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు ఎంఎ.వాహిద్ ,మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు అయూబ్ అన్సారి, రాంచంద్రారెడ్డి, నర్సింహారెడ్డి, ఫయాజ్, శ్రీనివాస్‌గౌడ్, అనంత్‌రాంగౌడ్, మహేశ్వర్‌రెడ్డి ,ప్రభాకర్‌రెడ్డి, రాంచద్రరెడ్డి, మాధవ్, సురేందర్, కరుణాకర్‌రెడ్డి, శ్రీనివాస్, రాజు, అనిల్, రామునాయక్, రమేష్‌రాథోడ్, వెంకట్రామ్రెడ్డి పాల్గొన్నారు. -
టీపీసీసీలో మనోళ్లకు ప్రాధాన్యం
సాక్షి, వికారాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో జిల్లాకు పెద్ద పీట వేశారు. స్థానిక నేతలకు రెండు కీలక పదవులు కట్టబెట్టారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొడంగల్ తాజా, మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను టీపీసీసీ స్టాటజీ అండ్ ప్లానింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ నియమించారు. పార్టీ మారినా.. పోస్టు మారలే.. రేవంత్‌రెడ్డికి ఎట్టకేలకు కాంగ్రెస్‌లో సముచిత స్థానం లభించింది. ఎంతో ఆర్భాటంగా టీడీపీ నుంచి హస్తం గూటికి చేరిన ఈయనకు ఇప్పటివరకూ ఎలాంటి పదవి ఇవ్వకుండా అధిష్టానం నానుస్తూ వచ్చింది. ఈ క్రమంలో అనేక ఊహాగానాలు వినిపించాయి. అయితే అసలైన సమయంలో పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించడం ఆయన వర్గీయుల్లో ఆనందం నింపింది. ఎన్నికల ప్రచార పర్వంలోనూ రేవంత్ కీలకంగా మారనున్నారని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగిన ఈయనను కాంగ్రెస్‌లోనూ ఇదే పదవి వరించింది. అనుమానాలకు తెర... జిల్లాకు చెందిన కాంగ్రెస్ కీలక నేతలు రేవంత్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్‌లకు టీపీసీసీలో కీలక పదవులు కట్టబెట్టడం ద్వారా ఆ పార్టీ అధిష్టానం అనేక అనుమానాలకు తెరదించినట్లయింది. ప్రసాద్‌కుమార్ కారెక్కనున్నాడనే పుకార్లు షికార్లు చేసిన నేపథ్యంలో ఇవేవీ పట్టించుకోకుండా కీలక పోస్టు అప్పగించింది. దీంతో అధిష్టానం దృష్టిలో ప్రసాద్‌కుమార్‌కు మంచి స్థానమే ఉందని తేలిపోయింది. రేవంత్‌రెడ్డిని రాజకీయంగా బలహీనం చేసేందుకే కాంగ్రెస్ ఆయన్ను చేర్చుకుందని వచ్చి న పుకార్లకు సైతం అధిష్టాన నిర్ణయం జవాబుగా నిలిచింది. ఈ నేపథ్యంలో జిల్లాలో టీఆర్ఎస్ నేతలతో పాటు ఆపద్ధర్మ మంత్రి మహేందర్‌రెడ్డిని మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పక్కాగా ముందుకెళ్తోంది. -
సీఎం కేసీఆర్ పెద్ద మోసగాడు
వికారాబాద్ అర్బన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మోసగాడని, ఆయన ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు అన్ని అబద్ధాలు ఆడుతారని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గడ్డం ప్రసాద్‌కుమార్ విమర్శించారు. వికారాబాద్ జిల్లా ను జోగులాంబ జోన్లో కలుపడాన్ని వ్యతిరేకిస్తూ పా ర్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో రిలే నిరహార దీక్షలను సోమవారం ప్రారంభించారు. అం తకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కేసీఆర్ తె లంగాణకు ముఖ్యమంత్రి అయినా ఆయన ప్రాణమంతా సంగారెడ్డి జిల్లా అభివృద్ధి మీదనే ఉంటు ందన్నారు. అందుకే హైదరాబాద్‌కు దూరంగా ఉ న్న సంగారెడ్డిని చార్మినార్ జోన్లో కలిపి తన ప్రే మను ప్రదర్శించాడన్నారు. వికారాబాద్‌కు 250 కి. మీ దూరంలో ఉన్న జోగులాంబ జోన్లో జిల్లా ను కలపడానికి కారణాలు ఏమిటో చెప్పాలని డి మాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చై ర్మన్ సత్యనారాయణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు సు ధాకర్‌రెడ్డి, కమాల్‌రెడ్డి, సంగమేశ్వర్, కౌన్సిలర్లు మధు, నర్సింలు, అబ్దుల్ ఖాలెద్, రాజలింగం, సుభాన్ రెడ్డి,రామస్వామి,రవిశంకర్ పాల్గొన్నారు. -
కార్పొరేషన్ రుణాల పంపిణీలో ప్రభుత్వం నిర్లక్ష్యం
మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు గడ్డం ప్రసాద్‌కుమార్ ధారూరు: బీసీ, ఎస్టీ, మైనార్టీలకు కార్పొరేషన్ రుణాలు అందలేదని, వీటిపై కలెక్టర్ స్పష్టమైన ప్రకటన చేయాలని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు గడ్డం ప్రసాద్‌కుమార్ డిమాండ్ చేశారు. ధారూరులో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆరు నెలల కిందట నిరుద్యోగులు కార్పొరేషన్ల రుణాలకు దరఖాస్తులు చేసుకోగా ఎంపికైన లబ్ధిదారులకు ఇంతవరకు మంజూరు కాలేదని తెలిపారు. యూనిట్ల గ్రౌండింగ్‌కు కలెక్టరేట్, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఖాతాల్లో రుణాలు జమ కాలేదని వాపోయారు. లబ్ధిదారులకు రుణాలు పంపిణీ చేస్తారా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలని కోరారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవసరమైన నిధులు జమచేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కార్పొరేషన్ రుణాలకు నిధులు విడుదల చేయకుండా తప్పించుకుంటోందని విమర్శించారు. సంక్షేమ పథకాల అమలులో గారడీ చేస్తోందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు పట్లోళ్ల రాములు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంగమేశ్వర్రావు, గట్టెపల్లి సర్పంచ్ పాండునాయక్, కాంగ్రెస్ నాయకులు చెక్క వీరన్న, నారాయణ్‌రెడ్డి, చాకలి నర్సింహులు, యువజన కాంగ్రెస్ నాయకులు కిరణ్‌కుమార్, కుమ్మరి రాము, శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.