Gorati Venkanna
-
సోయిలేకే మొదటి నుంచి తెలంగాణ ఆగం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడిరాష్ట్రంలో నాటి ఆంధ్రానాయకత్వ స్వార్థంతోపాటు, తెలంగాణ నాయకత్వం సోయిలేనితనం కారణంగానే రైతాంగానికి దశాబ్దాల పాటు నష్టాన్ని కలిగించిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. నాటి తెలంగాణ నాయకత్వం విద్యుత్, వ్యవసాయరంగంలో తెలంగాణకు ఉద్దేశపూరితంగా చేసిన ద్రోహాలు పసిగట్టంలో విఫలమైందన్నారు.ఆ సమయంలో తెలంగాణ సమస్యలను కవులు, కళాకారులు సాహిత్య, సాంస్కృతిక ప్రక్రియలతో ఓ వైపు వ్యాప్తి చేయడం, మరోవైపు టీఆర్ఎస్ రాజకీయ ప్రక్రియ.. జమిలిగా సాగిన భావజాల వ్యాప్తితోనే తెలంగాణ సాధించామని కేసీఆర్ పేర్కొన్నారు.ఎమ్మెల్సీ గోరటి వెంకన్న గురువారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన కవితల పుస్తకాలు కేసీఆర్‌కు అందించారు. ఈ సందర్భంగా ఇద్దరూ తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, రాజకీయాలు తదితర అంశాలపై చర్చించారు. శాంతియుత పద్ధతిలో సాగిన కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం, పదేళ్లలో కేసీఆర్ పాలన ఆదర్శవంతంగా సాగిందని గోరటి తనదైన సాహిత్య శైలిలో వివరించారు.ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు వర్దెల్లి వెంకన్న తన ‘పిట్ట వాలిన చెట్టు’పుస్తకాన్ని కేసీఆర్‌కు అందించారు. ఈ పుస్తకాన్ని పరిశీలించిన కేసీఆర్ వర్దెల్లిని అభినందించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గోరటి వెంకన్నకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి,అమరావతి: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2021కు ఎంపికయిన ప్రసిద్ధ వాగ్గేయకారుడు, ప్రజాకవి, రచయిత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలియజేశారు. గోరటి వెంకన్న రచించిన ‘వల్లంకి తాళం ’ కవితా సంపుటికి ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆయనను అభినందిస్తూ సీఎం గురువారం ట్వీట్ చేశారు. సామాన్యుడికి చేరేలా హావభావాలతోటి గ్రామీణ జానపదాలతో ఆయన ప్రజల హృదయాలు గెలిచారని, ఒక లెజెండరీగా ఎదిగారని తెలిపారు. వారి ప్రజా గేయాలు ఈనాటికీ యువకుల్లో స్ఫూర్తిని నింపుతాయని పేర్కొన్నారు. ఆయనతో పాటు యువజన, పిల్లల విభాగంలో అవార్డులు గెలుచుకున్న తగుళ్ల గోపాల్, దేవరాజ్ మహరాజ్‌కు కూడా సీఎం జగన్ అభినందనలు తెలిపారు. -
మా కష్టమంతా మర్చిపోయాం
‘‘ఆంధ్రా ప్రజలకు పెరుగన్నం, ఆవకాయతో తినడం ఇష్టం. తెలంగాణ వాళ్లకు ధమ్ బిర్యానీ తింటే సంతృప్తి. ‘బిలాల్పూర్ పోలీస్‌స్టేషన్’ చూస్తే అలాంటి సంతోషమే ప్రేక్షకులకు దక్కుతుంది’’ అని మహంకాళి శ్రీనివాస్ అన్నారు. మాగంటి శ్రీనాథ్, శాన్వీ మేఘనా జంటగా నాగసాయి మాకం దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’. మహంకాళి శ్రీనివాస్ నిర్మాత. కవి గోరటి వెంకన్న కీలక పాత్ర పోషించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ – ‘‘మా చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. తొలి చిత్రానికే విజయం దక్కడం నిర్మాతగా మరిన్ని సినిమాలు చేయడానికి ప్రోత్సాహం ఇచ్చింది’’ అన్నారు. ‘‘ఫస్ట్ షో చూస్తుంటే సినిమాకు పడ్డ కష్టం అంతా మర్చిపోయాం. సినిమా బావుంటే నటీనటులు కొత్తా పాతా అని ఉండదని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు’’ అన్నారు నాగసాయి. ‘‘ఎలాంటి అశ్లీలత, హింస మా చిత్రంలో లేదు. నేను రాసిన పాటలను అందరూ ఆనందించారు. తాజాగా నేను నటించిన ఈ చిత్రాన్ని కూడా ఆనందిస్తున్నారు’’ అని గోరటి వెంకన్న అన్నారు. ఈ వేడుకలో శ్రీనాథ్, శాన్వీ, సంగీత దర్శకుడు సాబూ వర్గీస్, మౌన శ్రీ మల్లిక్ పాల్గొన్నారు. -
నటనపై గౌరవం పెరిగింది
‘‘నటనలో నాకు పెద్దగా అనుభవం లేదు. ‘బతుకమ్మ’ సినిమా అప్పుడు ఇటీవల మరణించిన దీక్షితులుగారు మూడు రోజులు శిక్షణ ఇచ్చారు. అలాగే నాటకరంగంలో ఉన్న ప్రవేశం కూడా సహాయపడింది. ‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’ చిత్రంలో ఫుల్‌లెంగ్త్ పాత్ర చేసిన తర్వాత నటనపై చాలా గౌరవం పెరిగింది’’ అన్నారు రచయిత, గాయకులు గోరటి వెంకన్న. మాగంటి శ్రీనాథ్ హీరోగా మాకం నాగసాయి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’. మహంకాళీ శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలకానుంది. ఈ సందర్భంగా గోరటి వెంకన్న మాట్లాడుతూ– ‘‘నిర్మాత శ్రీనివాస్, సాయి బాగా తెలుసు. అందుకే సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రి, హెడ్ కానిస్టేబుల్ సురేందర్ పాత్రలో నటించాను. అరుణయ్య అనే మిత్రుడు కానిస్టేబుల్ నుంచి ఎస్సై స్థాయికి చేరుకున్నారు. నాకు ఆయనే గుర్తుకొచ్చారు. ఆ పాత్రనే వేశాను అనిపించింది. టీమ్ అందరూ ప్రోత్సహించారు. ఓ సీన్లో భాగంగా నన్ను ఏడవమన్నారు. గ్లిజరిన్ లేకుండా పదిసార్లు ఏడ్చాను. ఆ సీన్ బాగా పండింది. దృశ్య మాద్యమం చాలా శక్తివంతమైనది. ఎవరైనా పాత్రలు చేయమని ప్రేమతో అడిగితే చేస్తాను. పాత్రల కోసం పని కట్టుకుని పోను. ప్రేమ గీతాలు రాశాను. మనసు చంపుకుని ఓ స్పెషల్ సాంగ్ కూడా రాశాను. ‘దొరసాని’, ‘సంత’, ‘మల్లేశం’, ‘నేనే..సరోజ’, ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ చిత్రాలకు పాటలు రాశాను. కొన్ని పెద్ద సినిమాల్లో పాత్రలు చేసే అవకాశాలు వచ్చాయి. వద్దనుకున్నాను’’ అని చెప్పుకొచ్చారు. -
జనం గుండె చప్పుడు జానపదం
జానపద మూలాలను అన్వేషించి,వాటిని వెలికితీసి భావితరాలకు అందించాలని ప్రముఖ రచయిత, ప్రజా కవి, గాయకుడు గోరటి వెంకన్న సూచించారు. అప్పుడే జానపద సాహిత్యంలోని ఔనత్యం ప్రజలకు అందుతుందన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించిన అంతర్జాతీయ జానపద విజ్ఞాన దినోత్సవంలో ఆయన మాట్లాడారు. రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం): జానపద మూలాలను అన్వేషించి, వాటిని వెలికితీసి భావితరాలకు అందించాలని ప్రముఖ రచయిత, ప్రజా కవి, గాయకుడు గోరటి వెంకన్న సూచించారు. అప్పుడే జానపద సాహిత్యంలోని ఔనత్వం ప్రజలకు అందుతుందన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించిన అంతర్జాతీయ జానపద విజ్ఞాన దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి ఒడిలో నుంచి జానపదం పుట్టిందన్నారు. అందుకే జానపద మూలాలు ప్రకృతిలోనే ఉన్నాయన్నారు. ఆధునికత పేరుతో నేడు మానవుడు ఆ ప్రకృతికి దూరంగా జీవిస్తున్నాడని, సంస్కృతికి కూడా దూరమవుతున్నాడని చెప్పారు. ప్రాచీన కాలం నుంచి పాట ప్రజల నోట ఉండేదని, అందుకే పని, పాట అనేవారని గుర్తు చేశారు. ఇప్పటికే జానపద విజ్ఞానంపై అవగాహన కలిగిన వారు మరింత లోతైన పరిశోధనలు చేసి భావితరాలకు అందించాలన్నారు. జానపదంపై నేటితరాలకు కూడా అర్థమయ్యే విధంగా సినిమాలు రావాలన్నారు. వీసీ ఆచార్య ఎం.ముత్యాలునాయుడు మాట్లాడుతూ ప్రాంతాలు వేరైనా, పాలకులు వేరైనా మనమంతా ఒక్కటే, ఒకే భాషకు, ఒకే సంస్కృతికి చెందిన వారమన్నారు. సాహిత్యానికి ఎల్లలు లేవని, కవులకు ప్రాంతాలు అడ్డుకావన్నారు. మన సంస్కృతిని కాపాడుతున్న సైనికులు వీరేనన్నారు. అలరించిన కళా ప్రదర్శనలు సుమారు 30 మంది కళాకారులు కోలాటం, తాషా విన్యాస నృత్యం తదితర పలు జానపద కళారూపాలు ప్రదర్శించారు. అనంతరం ఆ కళాకారులను సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎస్ రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సదస్సు కన్వీనర్ డాక్టర్ టి.çసత్యనారాయణ, రిజిస్ట్రార్ డాక్టర్ టి.అశోక్, కో–ఆర్డినేటర్ డాక్టర్ జి.ఎలీషాబాబు, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుబ్బారావు, డీన్ ఆచార్య ఎస్.టేకి, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ డి.జ్యోతిర్మయి, తెలుగు విభాగం అధ్యాపకులు డాక్టర్ తలారి వాసు, డాక్టర్ వరప్రసాద్, డాక్టర్ నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు సినిమాని కొత్త దారిలో తీసుకెళుతుంది
ఎం.ఎస్.క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం ‘బిలాల్పూర్ పోలీస్‌స్టేషన్’. మాగంటి శ్రీనాథ్, మేఘన జంటగా నటించారు. నాగసాయి మాకం దర్శకుడు. ఈ చిత్రం కోసం గోరేటి వెంకన్న పాడిన ప్రచార గీతాన్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాగసాయి మాట్లాడుతూ – ‘‘దాదాపు 200 పోలీస్ స్టేషన్లలకు వెళ్లి అక్కడి కేసులను పరిశీలించి కథను తయారు చేసుకున్నాను. సినిమాకి పనికొచ్చే కేసులను కథలో చేర్చాం. ఈ కేసులన్నీ వినోదాత్మకంగానే ఉంటాయి. సినిమా అంతా గ్రామీణ నేపథ్యంలోనే సాగుతుంది’’ అన్నారు. మహంకాళీ శ్రీనివాస్ మాట్లాడుతూ – ‘‘నేనీ చిత్రాన్ని ప్యాషన్ కోసం చేయలేదు. వ్యాపారం కోసమే చేశాను. పెట్టిన డబ్బు తిరిగి రాకపోతే ప్యాషన్ ఉండి ఏం లాభం. ఈ సినిమాను కొత్త తరహా కథ, కథనాలతో తెరకెక్కించాం’’ అన్నారు. సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ – ‘‘సాహిత్యానికి చిన్నా పెద్దా తేడా లేదని దాసరిగారు నాతో చెప్పేవారు. చిన్న హీరోకు పాట రాసినా సూపర్ స్టార్‌కు రాసినట్లే భావించి రాయాలని చెప్పేవారు. అలాగే ఈ చిత్రంలో మంచి పాట రాశాను. మనసు పెట్టి రచించాను’’ అన్నారు. గోరేటి వెంకన్న మాట్లాడుతూ – ‘‘నాకు గాయకునిగా, గీత రచయితగానే కాకుండా నటునిగా ఈ చిత్రంలో అవకాశం కల్పించారు దర్శక,నిర్మాతలు. ప్రాధాన్యమున్న పాత్రలో నటించాను. కావాల్సినంత వినోదం ఉంటుంది. ‘బిలాల్పూర్ పోలీస్‌స్టేషన్ ’ తెలుగు సినిమాను కొత్తదారిలో తీసుకెళ్లే చిత్రమవుతుంది’ అన్నారు. -
సహజమైన కథ
శ్రీనాథ్ మాగంటి, మేఘన జంటగా నాగసాయి మాకం దర్శకత్వంలో ఎమ్ఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాసులు నిర్మించిన సినిమా ‘బిలాల్పూర్ పోలీస్‌స్టేషన్’. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘‘పోలీస్‌స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే వినూత్నమైన చిత్రం ఇది. ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. కథ మీద నమ్మకంతో దర్శకుడి ఆలోచనలకు అనుగుణంగా ఉన్నత నిర్మాణ విలువలతో చిత్రాన్ని నిర్మించాం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు శ్రీనివాసులు. ‘‘వాస్తవ సంఘటనలతో అల్లుకున్న పూర్తి సహజమైన కథ ఇది. ప్రజా కవి గోరటి వెంకన్న ఓ ప్రధాన పాత్రలో కనిపిస్తారు. కామెడీ సన్నివేశాలు టైమింగ్‌కు తగ్గట్లుగా ఉంటాయి. సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు నాగసాయి. ఈ సినిమాకు సంగీతం: సాబూ వర్గీస్. -
‘సంత’ సక్సెస్ కావాలి
‘‘గ్రామీణ నేపథ్యంలో చక్కని ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా తీసిన చిత్రం ‘సంత’. గోరేటి వెంకన్నగారు ఓ లెజెండ్. ఆయన ఈ సినిమాకి రాసిన పాట అద్భుతంగా ఉంది. ప్రేక్షకులకు నచ్చే అంశాలున్న ‘సంత’ సక్సెస్ కావాలి. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్’’ అని దర్శకుడు సుకుమార్ అన్నారు. సూర్య భరత్‌చంద్ర, శ్రావ్యారావు జంటగా నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సంత’. ‘మట్టి మనుషుల ప్రేమకథ’ అన్నది ట్యాగ్ లైన్. శ్రీ జై వర్ధన్ బోయెనేపల్లి నిర్మించి న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని ‘రంగస్థలం’ సెట్లో సుకుమార్ విడుదల చేశారు.ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ– ‘‘ఓ సంత నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. ఫీల్‌గుడ్ ఎంటర్టైన్మెంట్ జోనర్లో ఉంటుంది. హైదరాబాద్, వరంగల్ పరిసర ప్రాంతాల్లో పాటలు చిత్రీకరించాం. షూటింగ్ పూర్తయింది. త్వరలో పాటలు విడుదల చేస్తాం’’ అన్నారు. కిన్నెర, మధుమణి, ఫణి, ప్రసన్న, ఆర్.ఎస్.నందా, దుర్గేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఫణీంద్ర వర్మ అల్లూరి, కథ– కథనం– సంగీతం– దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్. -
పల్లె సంప్రదాయానికి పదునుపెట్టిన గోరటి
చీమకుర్తి రూరల్: పల్లె సంప్రదాయాలకు పదాలను జతగూర్చి జనపదాలుగా మార్చి నృత్యరూపకంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ప్రముఖ జానపద కళాకారుడు గోరటి వెంకన్న. ఆశుకవిత్వంతో పద కవితలను గుక్కతిప్పుకోకుండా ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. శుక్రవారం చీమకుర్తిలో జరిగిన బాలోత్సవం కార్యక్రమాన్ని వెంకన్న జానపద గీతాలతో వేదికను దద్దరిల్లేలా చేశారు. రెండోరోజు జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పద్మక్క, వెంకటరెడ్డితో కలిసి గోరటి వెంకన్న పల్లెల్లోని వాతావరణ పరిస్థితులను తన జానపద గేయాలతో నృత్యరూపకంలో చూపరులను ఆకర్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యహరిశ్చంద్రుడిగా పేరుగాంచిన చీమకుర్తి నాగేశ్వరరావు పద్యాలు ఉమ్మడి రాష్ట్రాలలోనే పేరెన్నికగలవని అన్నారు. అంతటి కళాకారుడుని ఆదరించిన చీమకుర్తి వాసులకు కళలంటే ఎంత మక్కువో చెప్పకనే చెప్తున్నాయని, స్థానికుల కళాభిమానాన్ని కొనియాడారు. ముందుగా బాల బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక, జానపద నృత్యాలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. వాటితో పాటు తిరువూరు బాలలు ప్రదర్శించిన ఆలోచించండి నాటిక ఆకట్టుకుంది. తొలుత రెండోరోజు బాలోత్సవం కార్యక్రమాన్ని రోటరీక్లబ్ అ«ధ్యక్షుడు శిద్దా వెంకట సురేష్, వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకూరి రఘుకిరణ్, ప్రధాన కార్యదర్శి ముప్పూరి చలమయ్య ప్రారంభించారు. రెండో రోజు కార్యక్రమాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. -
తంగేడు పూవైతది!
‘‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో...’ ప్రపంచంలోనే ఏకైక సామూహిక పూలపండగకు తెలంగాణ వేదిక. పూలంటే గులాబీలు, తామరలు కాదు, గునుగు, గడ్డి పూలు, తంగేడు.. ఆ బతుకమ్మకు సింగారం, మహా అలంకారం, పవిత్ర ఆకారం. ఇక్కడ మీరెప్పుడైనా ఓ విషయం గమనించారా.. ‘గడ్డిపోచ’ చులకనకు భాషారూపం. పూలను పూజించే ఈ అద్భుత అనాది ప్రక్రియ ఆ అనామక పూలకు పవిత్ర స్థానమిచ్చింది. లేకుంటే ఆ గడ్డిపూలను కానేదెవరు, ఈపాటికి అంతరించేల చేసినా అడిగే నాథుడెవడు? అనామక పూలనే అంతగొప్పగా కాపాడుకుంటున్న మనం.. విశ్వ భాషల్లో మేటిగా నిలిచే మన అమ్మ భాషను ఎంత పదిలంగా చూసుకోవాలి. అందుకే నేను చెప్పేదేందంటే గొప్పదైన మన మూల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటేనే భాష ఉంటది. భాష–మనదైన సంస్కృతిలో భాగం. దానిపై నేటి తరంలో మక్కువ కల్పించాలి. అప్పుడు తంగేడు పూలంతా గొప్పగా తెలుగు వర్ధిల్లుతుంది’’ పూసిన పున్నమి వెన్నల మేన తెలంగాణ వీణ.. వాసిగ చరిత వెలుగొందిన గత వైభవాల కోన... అంటూ తెలంగాణ ఉనికిని కళ్లముందుంచిన ప్రజాకవి గోరటి వెంకన్న మాట ఇది! శ్రమజీవుల చెమట నుంచి పుట్టి.. పండితుల చేతుల్లో వన్నెలద్దుకున్న ఈ ప్రాచీన భాషా వైభవం ఇకముందు కూడా వెలుగొందాలంటే దాన్ని మన సంస్కృతిలో భాగంగా చేసి, తెలుగు మూల సంప్రదాయాలపై నేటి తరంలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు. జనం పాటకు ప్రాణం పోస్తున్న ఆయన ఆ పాటకు ప్రాణమిచ్చిన భాషకు ఎలా పట్టం కట్టాలో తనదైనశైలిలో చెబుతున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. కాటమరాజు కథలో ఆవులేమైనవో ఎవరికైనా ఎరుకనా... కాటమరాజు కథ చదవండి, అందులో ఆవుల వర్ణన వింటే రోమాలు నిక్కపొడుచుకుంటై. దాదాపు ఐదొందల రకాల పేర్లను చెప్తరు. వాటిని మేపేందుకు అవసరమైన గడ్డి గురించి చెప్పే క్రమంలో దాదాపు 200 రకాల గడ్డి జాతుల పేర్లు వినిపిస్తయి. మరి ఇప్పుడు అన్ని రకాల ఆవులు, గడ్డి జాతులేమైనయి. ఎవరైనా ఆలోచించిన్రా, మనదైన మేలురకం ఆవులు పోయి జెర్సీ ఆవులేడికెళ్లి వచ్చినై? విదేశీ గడ్డి వంగడాలెందుకు దూసుకొచ్చినై? ఈస్టిండియా కంపెనీ కథ వింటే ఇది ఉట్టిగనే అర్థమైతది. తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు మన మీద దాడి చేసి మన సంపద, సంప్రదాయాలను నాశనం చేసిన తీరే దీనికి నిదర్శనం. మన భాషను నాశనం చేస్తే మనం వారికి గులాములైతమన్న కుట్ర అమలైంది. ఇది మన భావితరానికి తెలవాల్సి ఉంది. ఇంగ్లిష్‌కు గ్లామర్ వద్దు.. ఇంగ్లిష్‌లో చదివితెనే మంచి ఉద్యోగమొస్తదని, దాన్ని నేరిస్తేనే నాగరికులనే గ్లామర్ విపరీతంగా వచ్చింది. అది ఓ భాష మాత్రమే. చైనా విద్యార్థులు మాతృభాషలో చదివి ప్రపంచ అంగట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్ముతలేరా, వియత్నాం వాసులు వారి భాషలో చదివి వ్యవసాయోత్పత్తులను ఎగుమతి చేస్తలేరా, జపనీయులు సొంత భాషలో చదివి అమెరికాను మించి ఎదుగతలేరా? మనమెందుకు మన భాష ఒదిలి ఆంగ్లం వెంట ఉరకాలె? ఈ మాటలు పిల్లల మెదడులోకి ఎక్కాలె. భాషలెన్నైనా నేర్వచ్చు. కానీ మన తెలుగు భాషను మరవొద్దు. ఇవాంకా వస్తే గంత మురిపమెందుకు? ఇటీవల అమెరికా అధ్యక్షుడి బిడ్డ ఇవాంకా మన పట్నానికి వచ్చింది. ఆమెను గౌరవించటం, మంచి ఆతిథ్యమియ్యటం మన బాధ్యత. ఇందులో ప్రభుత్వానికి ప్రత్యేక బాధ్యత ఉంటది. మంచి చెడ్డలు ప్రభుత్వం చూసుకుంటది. కానీ వ్యాపారాల్లో మునిగితేలే ఇవాంకా వస్తే మనజనం ఎందుకు అంత మురిసి పోయిన్రు. గంత హడావుడి ఎందుకు పడ్డరు. ఈ విదేశీ వ్యామోహమే మన భాషను కూలుస్తోంది. దీన్ని కూడా అర్థం చేసుకోవాలి. మనం మన సంప్రదా యాలను నిర్లక్ష్యం చేస్తే భాషను పక్కనపెట్టినట్టే. చెంచులు వేల రకాల మూలికలను సేకరిస్తరు, వాటి పేర్లను నోటికి యాదికించు కుంటరు. ఆ మూలికల్లో భయంకర జబ్బులను నయం చేసే గుణమూ ఉంటది. మరి ఆ మూలికలే మూలంగా విదేశీ కంపెనీలు మందులు తయారు చేసి మనకే అమ్మవట్టిరి. ఇంకేముంది మూలికల చెంచులు జాడే లేకుండా పోబట్టే. ఇది మూలికలకే కాదు.. మూలమైన మన భాషకూ పట్టుకుంది. ఇదంతా నేటి తరం గమనించాలె. అందుకే మన చరిత్ర చెప్పాలె.. భాషను బతికించాలంటే.. తెలుగులో చదివినోళ్లకు ఉద్యోగాలిస్తమన్న తాయిలాలు కాదు.. ఆ భాష ప్రాధాన్యం వారికి తెలియచెప్పాలె. కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉన్న అమెరికాకంటే ఐదు వేలకుపైబడ్డ చరిత్ర ఉన్న మన ముచ్చట్లు చెప్పాలె. ఆ చరిత్రకున్న గొప్పతనం విప్పిజెప్పాలె. ఆ గొప్పదనం ప్రపంచానికి ఏమిచ్చిందో వివరించాలె. అప్పుడు ఆమెరికా, ఆంగ్లం గొప్పయి కాదన్న సంగతి వారికి తెల్సి వాటెనక ఉరుకుడు ఆపుతరు. ఇక్కడ మన సంస్కృతీ సంప్రదాయాలంటే మూఢత్వానికి దూరంగా ఉన్న అసలు సంప్రదాయమన్నది నా ఉద్దేశం భాష పరిరరక్షణకు ఉద్యమం రావాలె గ్రంథాలయోద్యమం తరహాలో మన భాష పరిరక్షణ ఉద్యమం రావాలె. మిల్లెట్స్ పేరుతో జొన్నలు తెచ్చుకుని తినేటోళ్లు మన భాష పదం జొన్నలను గుర్తువట్టరు. ఖరీదైన వంటకంగా పులస చేప రుచిని చూస్తరు దాని తెలుగుపేరు తెల్వదు. ఈ తీరు మారాలె. ఈ విషయంలో తల్లిదండ్రుల్లో తొలుత చైతన్యం రావాలె. మూకుమ్మడిగా కదిలితే ఆ ఉద్యమం మంచి ఫలితమిస్తది. అవగాహనతో భాషను బతికించుకుంటం. ఈ కోవలో ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలు మంచి మేలే చేస్తయనిపిస్తుంది. మన భాషను రక్షించుకునే ఆలోచన రగిలిస్తది. ఇలాంటి సభలు మరిన్ని జరగాలె. ఊళ్లలో కూడా కొనసాగాలె. విదేశీ అనుకరణ ప్రమాదమనే సంకేతం పోవాలె. కేసీఆర్‌కు రుణపడి ఉంటా ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవం వేళ తన ప్రసంగ సమయంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నాపాట ‘గల్లీ సిన్నది... గరీబోళ్ల కథ పెద్దది’ అనంగనె లక్షల చప్పట్లు మోగె. గది సంప్రదాయ పాటకున్న శక్తి. పెద్దపెద్ద సాఫ్ట్వేర్ సంస్థల ఉద్యోగుల ముంగట నేను పాటపాడితే వాళ్లు లేసి గంతులేసిన్రు. మన పాట, మన మాట, మన భాష మజా తెలిస్తే ఇట్లనే ఉంటది. ఆ ప్రయత్నం చేస్తె మంచిది. కేసీఆర్ లాంటి వాళ్లు మన పాటలు, పద్యాలు పాడితే సాధారణ ప్రజలెందుకు మొదలుపెట్టరు. అందుకే కేసీఆర్‌కు రుణపడి ఉంటా.. ఆయన ఆలపించిన పద్యాలు కొన్ని లక్షల మందిలో ఇప్పటికే ఆలోచన రేకెత్తి ఉంటాయి. రేపట్నుంచి పద్యాలకు ఆదరణ కచ్చితంగా పెరుగుతుంది. – గౌరీభట్ల నరసింహమూర్తి -
తీతువగొంతును తియ్యగజేసింది
వాగ్గేయకారునిగా గోరటి వెంకన్న విశిష్టతకు ప్రధాన కారణాలలో వస్తు వైవిధ్యం ఒకటి. వస్తువు దృష్ట్యా వెంకన్న గేయాలను– విప్లవోద్యమ గేయాలు, దళిత చైతన్య గేయాలు, ప్రపంచీకరణ నిరసన గేయాలు, స్మృతి గేయాలు, వర్ణనాత్మక గేయాలు... మొదలైన విధంగా విభజించుకోవచ్చు. సంత, వాన, కొంగ, నల్లతుమ్మ, సంచారం, జలచక్రం, వేకువహాయి, రాత్రి, వెన్నెల, అడవి మొదలైన గేయాలు వర్ణనాత్మకమైనవి. ‘వర్ణనాత్మకమైనవి’ అంటే ‘ఏకవస్తు వర్ణన’ ప్రధానమైనవని ఇక్కడ నా ఉద్దేశం. ‘వాన’ పాటలో వర్షరుతు ఆరంభంలోని అందమైన పల్లె దృశ్యాలు ప్రత్యక్షంగా, శ్రమజీవుల ఆనందం పరోక్షంగా వర్ణింపబడినాయి. ఈ పాటకు ప్రాణి లక్షణారోహణ సౌందర్యాన్ని సమకూర్చింది. ‘‘గద్దగూటిలోని గడ్డిని తడిపింది గువ్వగూటి గులకరాళ్లను జరిపింది తీతువగొంతును తియ్యగజేసింది పరికిపిట్ట ముక్కు పాసిని కడిగింది ఎద్దు మూపురాన్ని ముద్దాడి మురిసింది ముల్లుగర్ర వొల్లు సల్లగ జేసింది’’ – ఉత్ప్రేక్షా వాచకాలు లేకుండా, నిర్ధారణ వాక్యాలలోనే వర్ణన ఆసాంతం సాగింది. కాని, ఇవన్నీ అందమైన ఉత్ప్రేక్షలే. ‘ముల్లుగర్ర వొల్లు సల్లగ జెయ్యడం’, ‘ఎగిరె దట్టీలకు వెండి మెరుపులద్దడం’ లాంటి వాక్యాలు వెంకన్న పరిశీలనాసక్తినీ, పరిశీలనాశక్తినీ పట్టిస్తాయి. వెంకన్న చాలా పాటలలో ఎక్కడో ఒకచోట ఆ«ధ్యాత్మిక అంశాల ప్రస్తావనలు ఉంటాయి. ఈ పాటలోని ‘తులశమ్మ దీపం’, ‘సాధుల సమాధులు’, ‘సూఫీ దర్గా’ల ప్రస్తావనలు అలాంటివే. ‘తాను రాకముందె తూనీగలను లేపి, తన పాటకే తాను దరువేసి ఆడింది’– తూనీగలు ఎగిరి తిరుగుతూ ఉండటం, వర్షాగమన సంకేతమన్న భావనను తెలుపుతుంది. గానం చేస్తూ, తన గానానికి తానే వాద్య సహకారాన్ని సమకూర్చుకొంటూ నాట్యం చేస్తున్న నర్తకిగా వర్షాన్ని వర్ణించడం విశేషం. సుందరమైన దృశ్యభావచిత్రాల ద్వారా, అంతటా పేరుకున్న ధూళీ, మలినాలూ, వర్షం వల్ల తొలగిపోయి ఒక వినిర్మల కాంతిని సమకూర్చుకోవడమూ, మనుషులతోపాటు సర్వప్రాణులూ ఆనందంలో తేలియాడడమూ సూచింపబడినాయి. వర్షం చేసే వివిధానేక ప్రక్షాళన క్రియలను అందమైన ఊహలతో జోడించి ‘లఘు చలనచిత్రాలు’గా తీర్చిదిద్దడం ఈ గీతంలోని ప్రత్యేకత. (పెన్నా శివరామకృష్ణ ‘గోరటి వెంకన్న కవితాపరామర్శ’ పుస్తకంలోంచి...) గోరటి వెంకన్న కవితాపరామర్శ రచన: పెన్నా శివరామకృష్ణ పేజీలు: 128; వెల: 80 ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు. రచయిత ఫోన్: 9440437200 -
‘గోరటి’కి సుద్దాల పురస్కారం
సాక్షి, హైదరాబాద్: కలం యోధుడు సుద్దాల హనుమంతు, జానకమ్మ 2017 సంవత్సరం జాతీయ పురస్కారాన్ని ప్రజాకవి గోరటి వెంకన్న అందుకున్నారు. సుద్దాల ఫౌండేషన్ నేతృత్వంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. ఫౌండేషన్ వ్యవస్థాపక అ«ధ్యక్షుడు సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. ఈ పురస్కారాన్ని గోరటి వెంకన్నకు అందించడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ప్రభుత్వం ట్యాంక్ బండ్‌పై సుద్దాల హనుమంతు విగ్రహాన్ని పెట్టాలని, అలాగే ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. హనుమంతు విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. సాయుధ పోరాటంలో తన పాటతో ప్రజలను చైతన్యం చేసిన వ్యక్తి హనుమంతు అన్నారు. హనుమంతు వారసత్వాన్ని అందిపుచ్చుకొని అశోక్‌తేజ ఆ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. ఈ పురస్కారాన్ని తనకివ్వడం పట్ల గోరటి వెంకన్న సంతోషం వ్యక్తం చేశారు. నటుడు ఆర్. నారాయణ మూర్తి.. సుద్దాల హనుమంతు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తల్లిదండ్రులు స్ఫూర్తిని కొనసాగిస్తామంటూ సుద్దాల అశోక్ తేజ తన తండ్రిపై రాసిన గీతాన్ని హనుమంతు కుమార్తె రచ్చ భారతి ఆలపించారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.వి.యల్., సిహెచ్. స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
సుద్దాల, గోరటికి జాలాది పురస్కారం
విశాఖ కల్చరల్: జాలాది రచనలు అద్భుతం, అనితరసాధ్యమని ప్రముఖ సినీరచయిత సుద్దాల అశోక్‌తేజ కొనియాడారు. సుప్రసిద్ధ సినీగేయ రచయిత, రంగస్థల ప్రయోక్త డాక్టర్ జాలాది రాజారావు 86వ జయంతి వేడుక సిరిపురం వుడా చిల్డ్రన్స్ థియేటర్లో బుధవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో సుద్దాల అశోక్‌తేజ, ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్నలకు జాలాది పురస్కారాలను ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, జాలాది ట్రస్ట్ వ్యవస్థాపకురాలు జాలాది విజయ తదితరులు అందజేశారు. ఈ సందర్భంగా సుద్దాల మాట్లాడుతూ జాలాది, కొసరాజులు సినీజగత్తులో రారాజులని, వారి స్ఫూర్తితోనే 23 సంవత్సరాలుగా రచనలు చేస్తున్నట్లు తెలిపారు. గోరటి వెంకన్న మాట్లాడుతూ జాలాదిని తమిళంలో భైరవమూర్తితో పోల్చారు. -
గోరటి దీపం
దీపం పాడుతుంది ‘‘ తాండవిస్తుంది ‘‘ బోధిస్తుంది ‘‘ చూపిస్తుంది నడిపిస్తుంది ‘‘ గోరటి దీపం ‘‘ కొండంత వెలుగు ‘పల్లె కన్నీరు పెడుతుందో..’ అంటూ పల్లె జీవితాన్ని తన పదాల అల్లికతోనూ, పాటతోనూ తెలుగువారి హృదయాన్ని తాకిన కవి, జానపద కళాకారుడు గోరటివెంకన్న. జనాన్ని జాగృతం చేసే పాటలతో అందరికీ పరిచయం అయిన ఈ గళం దైవం గురించి ఏం చెబుతుంది? వనస్థలిపురంలోని ఆయన నివాసంలో ఓ సాయంసంధ్యవేళ కలుసుకున్నప్పుడు గోరటివెంకన్న పంచుకున్న దైవపదాలు ఇవి... ‘దీపం వెలిగిస్తున్నారు, కొంత సమయం పడుతుంది’ అని మీ ఇంట్లో వాళ్లు చెప్పారు. మీకు దైవ భక్తి చాలా ఉన్నట్టుంది... ? దీపం మనలోని అంతర్జ్యోతిని వెలిగిస్తుంది. భక్తి అంతర్ముఖులను చేస్తుంది. రోజూ కాసేపు మనల్ని మనం తెలుసు కోవడానికి ఉపయోగపడే సాధనాలివి. ఉదయం, సాయంత్రం దీపం వెలిగించడం మా నాయన నుంచి వచ్చిన అలవాటు. నా చిన్నప్పటి నుంచి మా నాయన ఇంట్లో దీపం వెలిగించడం చూసేవాడిని. ఆయన కూడా చెన్నదాసు అనే ఓ అవధూత చెప్పినప్పటి నుంచి దీపం వెలిగించడం మొదలుపెట్టాడు. ఆ అవధూత ఓ పాడుబడిన ఇంట్లో గోడ దాపున కూర్చుని ఎన్నో తత్త్వాలు చెప్పేవాడు. ఆ తత్త్వాలు నన్ను బాగా ఆలోచింపజేసేవి. పల్లె నుంచి వచ్చారు. ఆ పల్లె జీవితంలో భక్తిని ఎలా వంటపట్టించుకున్నారు? ‘వీసేగాలి, మోసే నేల, పొంగే గంగ, పొద్దూ నింగి, ఐదింటి రూపం ఈ గూటి దీపం’ అని పంచభూతాల గురించి వర్ణించి రాసే శక్తి పల్లెనే ఇచ్చింది. ఆ శక్తితోనే వందల పాటలు రాశాను. మాది మహబూబ్‌నగర్‌లోని గౌరారం అనే ఊరు. పల్లె జీవితంలో ప్రకృతే దైవం. అక్కడ అంతా గ్రామదేవతలను పూజించేవారు. నేనూ రాయీరప్ప, చెట్టూపుట్ట.. అన్నింటì కీ మొక్కేవాడిని. గ్రామదేవతల పూజల్లో పాల్గొనేవాణ్ణి. మా నాయిన యక్షగాన కళాకారుడు కూడా కావడంతో దైవానికి సంబంధించిన పాటలు అలవోకగా పాడేవాడు. నేనూ వాటిని వింటూ, చూస్తూ, పాడుతూ ఎదిగా! నా చిన్నప్పుడు దెయ్యాల కథలు బాగా వినేవాడిని. చీకటిపడ్డాక భయమేసేది. భయపడ్డప్పుడల్లా దేవుని తలుచుకోమనేవారు అమ్మవాళ్లు. దీంతో దైవాన్ని ఆసరా చేసుకునేవాడిని. అలాంటి సంఘటనలు తలుచుకుంటే నవ్వొస్తుంటుంది కూడా! ఆ తర్వాత్తర్వాత తార్కికంగా ఆలోచించడం మొదలుపెట్టాను. యూనివర్శిటీ చదువులో సాహిత్యం బాగా వంటపట్టింది. అప్పుడే బుద్ధుని బోధనల పట్ల ఆకర్షితుడినయ్యాను. సృష్టిలో వేటికీ దైవం అవసరం లేదు. మనిషికి మాత్రమే ఎందుకు అవసరం? ఆని ఆలోచించాను. అప్పటినుంచే మానవుడికున్న బుద్ధి వికాసానికి భక్తి అవసరమే అనే నిర్ణయానికి వచ్చాను. బుద్ధుడి బోధనలు మిమ్మల్ని అంతగా ఆకట్టుకోవడానికి కారణాలు... బౌద్ధానికి ముందు ప్రపంచం ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది? అని తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఎందుకు బుద్ధుణ్ణి దశావతారంగా హిందువులు సొంతం చేసుకున్నారు.. అనే దానిమీద ప్రముఖులు రాసిన రచనలు చదివాను. అంతేకాదు వైశాలి, గయ, సారనాథ్, నేపాల్, నాగార్జునసాగర్.. ఇలా బుద్ధుడు తిరుగాడిన ప్రాంతాలన్నీ వెళ్లి చూసొచ్చాను. బౌద్ధానికి ముందు యజ్ఞయాగాది క్రతువులలో మనుషులను కూడా బలి ఇచ్చేవారట. తర్వాత జంతువుల వరుస వచ్చింది. దానిని రూపుమాపడానికే అహింసామార్గాన్ని చూపుతూ బౌద్ధం వచ్చింది. దుఃఖం నుంచి ఎలా వేరుపడాలో తెలియజేసింది. మూఢభక్తి నుంచి ఎదగమని చెప్పింది బౌద్ధం. అందుకే బుద్ధుడు అంటే నాకు చాలా ఇష్టం. నిర్గుణ నిర్వికార నిరంజన అనే భావన సమాజంలో తీసుకురావడం అన్నది చిన్న విషయం కాదు. ఇదే ఆదిశంకరుని అద్వైతవేదాంతం కూడా చెప్పింది. అయితే, నిర్వికార ఉపాసన గురించి తెలిసినప్పటికీ అద్వైతం ప్రజలలో అంతగా చొచ్చుకుపోలేదు. బౌద్ధంలోని విషయాలు అందరూ పాటించదగినవిగా ఉంటాయి. మన తార్కిక ఆలోచనకు అందుతాయి. నిజాన్ని కళ్లకు కడతాయి. ఆ తర్వాత.. రమణమహర్షి, రామకృష్ణ పరమహంస, వేమన, కబీరుదాసు, బ్రహ్మంగారు లాంటి ఆధ్యాత్మికులు ఎంతో మంది దైవం గురించి కొత్తగా పరిచయం చేస్తూనే వచ్చారు. ‘నీవు – భగవంతుడు వేరు కాదు’ అన్నారు వారంతా! ‘చిల్లర రాళ్లకు మొక్కుతు ఉంటే చిత్తం చెడు ఒరే ఒరే!’ అని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. మనిషి నిర్వికార స్థితికి చేరుకోవడానికి ఈ ప్రపంచంలో ఎంతో ఉద్ధరణ జరిగింది. అందుకే ‘దేవుడు’ అని ఆ పేరుతో కొంతవరకే పరిమితం చేయకూడదు. దైవం అనంతం. ఆధ్యాత్మిక గురువులు చెప్పిన దాని మీద దృష్టిపెడుతూ, దైవం గురించి తెలుసుకుంటూ మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ఇందుకు బౌద్ధం బాగా ఉపయోపడుతుంది. బౌద్ధం చెప్పినట్టు ఒక రూపాన్ని ఆధారం చేసుకోకుండా ఆరాధించడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు కదా! సాధన చేస్తే అవుతుంది. బుద్ధుని గురించే చెప్పుకుందాం. విగ్రహారాధన కూడదు అంటుంది బౌద్ధం. కానీ, (నవ్వుతూ) విగ్రహాలు అనేవి బుద్ధుని ఆరామాల నుంచే ఎక్కువ వచ్చాయి కదా! అయినా.. రాయి, రప్ప, చెట్టు, పుట్ట, కీటకంలో... అన్నింటా భగవంతుడిని చూస్తున్నప్పుడు మనిషి చెక్కిన విగ్రహం కూడా ఈ సృష్టిలోనిదే కదా! మొక్కితే తప్పేం ఉంది? అయితే, ఆ విగ్రహాన్ని చూపి కమీషన్ ఇవ్వమంటేనే తప్పు. దేవుడికి కమీషన్ ఇస్తే ఆయన తిరిగి లాభం ఇస్తడు అనుకోవడమే పెద్ద తప్పు. ఆయనేమన్నా తన దగ్గర తక్కెడ పెట్టుకున్నడా? ‘నువ్వింత ఇస్తే.. నేను ఇంత ఇస్త’ అని. అలాగని గుళ్లకు వెళ్లకుండా ఉండను. కానీ, కమీషన్ ఎక్కడా ఇవ్వను. ఈ స్పెషల్ దర్శనాలేంటో.. విఐపీ దర్శనా లేంటో... ఆ పవర్ వీళ్లకు మాత్రమే దేవుడు ఎట్లిచ్చిండో... అని ఆలోచిస్తాను. తార్కికంగా ఆలోచించడానికి మీకు ఉపయోగపడిన భక్తి గ్రంథాలు... చాలా ఉన్నాయి. ఒక సమయంలో భగవద్గీత గురించీ ఒక ఆలోచన కలిగింది. కమ్యూనిస్టు ఉద్యమకారులతో తిరుగుతున్న రోజులవి. కరీంనగర్ జిల్లాలో ఒక అన్నను ఆస్తి తగాదాల్లో సొంత చెల్లెనే చంపింది. భగవద్గీతలో ఒక చోట ఉంటది ‘అన్న ఏంది? తమ్ముడేంది? యుద్ధంలో శత్రువే! చంపు’ అంటడు దేవుడు. మళ్లీ ‘వాళ్లంతా నా లీలలో మాయ’ అంటడు. యుద్ధం ధర్మం ఏంది, యుద్ధం వినాశనం కదా! అని నా ఆలోచన. ఆనాటికాలంలో దాయాదుల పంచాయితీ లో అలా చెప్పి ఉండవచ్చు. ఇప్పుడు దాన్ని మన మానవసంబంధాలను బలపరిచేందుకు ఎలా ఉపయోగించాలి? అని ఆలోలచిస్త. గ్రంథాల నుంచి కూడా మంచినే తీసుకుందాం అనుకుంటాను. ఈ ఆలోచన నా పాటలకు బాగా ఉపయోగపడుతుంది. ఈ తార్కిక ఆలోచనలను మీ పిల్లలకూ పరిచయం చేస్తుంటారా? నాకు ముగ్గురు కూతుళ్లు, కొడుకు. నా అలవాటునే నా పిల్లలూ అనుసరిస్తారు. చదువు తార్కికంగా ఆలోచించే శక్తిని ఇస్తుంది. అందుకే వారికి మంచి చదువు ఇవ్వడానికి ఎంత ఖర్చయినా వెనకాడను. ‘భక్తిగా ఉండు. అయితే, దేనినీ గుడ్డిగా నమ్మవద్దు’ అంటాను. పూజలు, యజ్ఞయాగాదుల పేరిట ఆడంబరపు ఖర్చులు అవసరం లేదంటాను. నాలాగే వారూ ఆలోచిస్తారు అయితే, మీ జీవితంలో దేవుడున్నాడు అనుకున్న సందర్భం ఎప్పుడూ రాలేదా? ఒకసారి ఊరెళుతుంటే కారు ప్రమాదం జరిగింది. రోడ్డు మీద పడ్డాను. దెబ్బలు తగిలాయి. ఆ సమయంలో మరో వాహనం ఎదురురాలేదు కానీ లేకపోతే పోయేవాడినే! భయం వేసింది. ఆ సమయంలో ‘హమ్మయ్య, దేవుడు కాపాడాడు’ అనుకున్నాను. అది ఒక్క క్షణమే! ఆ వెంటనే ‘మొన్న ఓ చిన్నపిల్ల రోడ్డు దాటుతూ ప్రమాదంలో చనిపోయిందే! పాపం ఆ చిన్న పిల్ల ఏం తప్పు చేసిందని దేవుడు కాపాడలేదు’ అనుకున్నాను. ఇలా ప్రతీది తార్కికంగా ఆలోచించుకుంటూ ఉంటాను. దేవుడి మీద కోపం వచ్చిన ఘటన... నాకు తెలిసి ఎప్పుడూ అలా జరగలేదు. నా బంధుమిత్రుల్లో దుఃఖం కలిగినప్పుడు కోపం తెచ్చుకున్న సందర్భాలు చూశాను. అలాగే, దుఃఖం ఉన్నచోటనే దేవుడుంటాడని గ్రహించాను. దుఃఖం ఉన్నప్పుడే కదా మనిషికి కోపం కలిగేది. అందుకే మహాత్ములు ఎక్కడ దుఃఖితులు ఉన్నారో అక్కడకే వచ్చి సేవలు చేశారు. బుద్ధుడు, క్రీస్తు, రాముడు.. వంటి వారంతా దుఃఖితులయ్యే దేవుళ్లు అయ్యారు. మదర్ థెరిస్సా దుఃఖితులైన రోగులను చేరదీసింది. సాయిబాబా కూడా దుఃఖితులకే మేలు చేశాడు. మనుషుల్లో మీరు చూసిన దివ్యత్వం... షామీర్పేట్ పోతుంటే ఒక దగ్గర మర్రిచెట్లు ఉంటయ్.. అక్కడ చింకి గుడ్డలు, చింపిరిజుట్టుతో ఓ ౖబైరాగి కనిపిస్తడు. భయపడో మరోటో గానీ ఎవ్వరూ దగ్గరకు వెళ్లరు. కానీ, నేనాదారిలో వెళితే తప్పక అతన్ని కలిసి, పలకరిస్తుంటాను. మొదట్లో తిట్టేవాడు. పట్టుకుంటే విదిలించి కొట్టేవాడు. ఇప్పుడైతే నవ్వుతూ చూస్తుంటాడు. అతని కళ్లు కాంతిగోళాల్లా ఉంటాయి. ఎవ్వరితో మాట్లాడడు. ఆయన సమక్షంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది. భక్తి అంటే అచలం, బైరాగితత్త్వం అనిపిస్తుంది. సిద్ధులు, యోగులు, అవధూతలే నిజమైన ఆధ్యాత్మికత గలవారు. అంతటి శక్తి రావాలంటే మనం చాలా ఎదగాలి. – చిల్కమర్రి నిర్మలారెడ్డి -
మన వైభవాన్ని ప్రపంచానికి చాటాలి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పిలుపు భాష సమాజానికి వారధి: జస్టిస్ లావు నాగేశ్వరరావు గోరటి వెంకన్నకు లోక్‌నాయక్ ఫౌండేషన్ పురస్కారం ప్రదానం సాక్షి, విశాఖపట్నం: ‘‘పలు రాజకీయ కారణాలతో కొత్త రాష్ట్రంలోకి వచ్చాం. మళ్లీ మన (తెలుగు వారి) వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి’’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కళాకారులు, సాహితీ వేత్తలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలోని ఏయూ అసెంబ్లీ హాల్లో శనివారం రాత్రి లోక్‌నాయక్ ఫౌండేషన్ అవార్డును సాహితీ వేత్త గోరటి వెంకన్నకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడారు. మారుతున్న తరానికి అనుగుణంగా గోరటి వెంకన్న చక్కటి రచనలు చేస్తున్నారని ప్రశంసించారు. సాహితీవేత్తలతో పాటు ఇతర రంగాల్లోని విశిష్ట వ్యక్తులకు సైతం లోక్‌నాయక్ ఫౌండేషన్ అవార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. దేశంలోనే మంచి గుర్తింపు లభించే స్థాయికి ఈ పురస్కారాన్ని తీసుకెళ్లాలన్నారు. కాలంతో పాటు కళారూపాల్లో, కళలు సాధన చేసిన వారి తరగతుల్లోనూ మార్పు వచ్చిందని చెప్పారు. కళలను ఆస్వాదించడం మానవ లక్షణమని, దానికి పెద్దగా చదువు అక్కర్లేదని, మనిషైతే చాలని వెల్లడించారు. భాష సమాజానికి వారధి లాంటిదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు చెప్పారు. గోరటి వెంకన్న పాటల్లో సందేశం ఉంటుందన్నారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ... 13 ఏళ్లుగా సాహితీరంగంలో విశిష్ట వ్యక్తులకు అవార్డులను అందజేస్తున్నామన్నారు. రెండు రాష్ట్రాల ఆత్మ ఒకటే తెలుగు రాష్ట్రాలు విడిపోయినా ఈ రెండింటి ఆత్మ ఒకటేనని అవార్డు గ్రహీత గోరటి వెంకన్న తెలిపారు. ఉత్తరాంధ్రలో రాచకొండ విశ్వనాథశాస్త్రి (రావిశాస్త్రి) తనకు ప్రేరణ అని, దేవులపల్లి కృష్ణశాస్త్రి, దువ్వూరి రామిరెడ్డి తనకు గురువులని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌జాస్తి చలమేశ్వర్ పంచెకట్టులో ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు. పంచెకట్టులో జస్టిస్ చలమేశ్వర్‌ను చూస్తుంటే దివంగత నేతలు వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎన్టీఆర్‌లు గుర్తుకొస్తున్నారని చెప్పారు. గోరటికి అవార్డు ప్రదానం తొలుత గోరటి వెంకన్నకు లోక్‌నాయక్ ఫౌండే షన్ అవార్డును సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ లావు నాగే శ్వరరావు, జాతీయ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ జి.రఘురాం, మంత్రి గంటా శ్రీనివాస రావు, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ల సమక్షంలో ప్రదానం చేశారు. పురస్కారం కింద రూ.1.50 లక్షలు అందజేశారు. -
గోరటికి జాషువా పురస్కారం
గుంటూరు ఈస్ట్: శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రజా నాట్య మండలి, గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జాషువా కవిత పురస్కార ప్రధానోత్సవ సభ మంగళవారం నిర్వహించారు. ప్రముఖ ప్రజా గాయకుడు గోరటి వెంకన్నకు పురస్కారం ప్రదానం చేసి సత్కరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం డీన్ ఆచార్య డాక్టర్ ఎండ్లూరి సుధాకర్, జాషువా విజ్ఞాన కేంద్రం పాశం రామారావు తదితరులు ప్రసంగించారు. జాషువా స్ఫూర్తితో గోరటి వెంకన్న తన గళంతో ప్రజా సమస్యలపై పోరాడుతున్న యోధుడని కొనియాడారు. జాషువా ఏ లక్ష్యంతో తన కలాన్ని వాడారో అదే మార్గంలో గోరటి వెంకన్న నడుస్తూ అందరికి ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రజానాట్య మండలి రమణ బృందం జాషువా పద్యాలను ఉత్సాహ భరితమైన జానపద వాయిద్యాలతో ఆలపించారు. సభకు నరసరావుపేట జిల్లా రిజిస్ట్రార్ జాషువా పురస్కార ప్రధాన సంఘ అధ్యక్షుడు ఎస్ .బాలస్వామి సభకు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలోని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, సంస్కృతి వ్యవస్థాపకుడు బాలచందర్ , ఏసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.ముత్యం, అభిమానులు పాల్గొన్నారు. -
27న ‘గోరటి’కి జాషువా కవితా పురస్కారం
గుంటూరు ఈస్ట్: మహాకవి కవికోకిల నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 121వ జయంతోత్సవాలు సందర్భంగా గోరటి వెంకన్నకు జాషువా కవితా పురస్కారం అందజేస్తున్నట్లు ఆహ్వాన సంఘం అధ్యక్షుడు జిల్లా రిజిస్ట్రార్ ఎస్.బాలస్వామి తెలిపారు. అరండల్ పేటలోని ఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27న శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జాషువా పురస్కార కవితాసభ నిర్వహిస్తున్నామని చెప్పారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘువులు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణ రావు మాట్లాడుతూ జాషువా సాహిత్య విశిష్టతపై ప్రముఖకవి యండ్లూరి సుధాకర్, గోరటి వెంకన్న కవిత్వంపై మువ్వా శ్రీనివాస్ ప్రసంగిస్తారని వెల్లడించారు. ఆహ్వాన సంఘ గౌరవాధ్యక్షుడు ఏసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.ముత్యం, జాషువా విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎన్.కాళిదాసు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి పీవీ రమణ, నాయకులు బి.లక్ష్మణరావు, సి.హెచ్.కిన్నర్, తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ఆత్మకు ప్రతీక
- ఠాగూర్ మాదిరి కాళోజీకి విశ్వప్రజాకవి బిరుదు: స్పీకర్ - ఆయన రచనలను నోబెల్‌కు ప్రతిపాదించాలి - ఘనంగా కాళోజీ 102వ జయంతి ఉత్సవం - గోరటి వెంకన్నకు కాళోజీ పురస్కారం ప్రదానం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆత్మకు ప్రజాకవి కాళోజీ ప్రతీక అని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. రవీంద్ర నాథ్ ఠాగూర్‌కు విశ్వకవి బిరుదు ఎలా ఇచ్చారో అలాగే కాళోజీకి విశ్వప్రజాకవి బిరుదు ఇచ్చేలా కాళోజీ ఫౌండేషన్ వారు కృషి చేయాలని సూచించారు. కాళోజీ రచనలను, వ్యక్తిత్వాన్ని, పోరాటాలను, జీవన విధానాలను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయాలన్నారు. తెలిపారు. ఎక్కడ అవమానం, అణచివేత ఉంటుందో అక్కడ తాను ఉంటానని కాళోజీ తన రచనల ద్వారా నిరూపించాడని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 102వ జయంతి ఉత్సవం-తెలంగాణ భాషాదినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి గోరటి వెంకన్నకు కాళోజీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్‌తోపాటు డిప్యూటీ సీఎం కడి యం శ్రీహరి, హోంమంత్రి నాయిని నర్సిం హారెడ్డి, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడు తూ కాళోజీ పురస్కారానికి గోరటిని ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. కాళోజీ రచనలు విశ్వజనితమైనవని, నోబెల్ పురస్కారానికి ఆయన రచనలు పంపే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించాలని సూచిం చారు. మంత్రి ఈటల మాట్లాడుతూ.. 1970 నుంచి కాళోజీతో తమకు పరిచయం ఉందన్నారు. ‘‘మాది తాత, మనవడు అనుబంధం. ఏదైనా నచ్చితే నెత్తికి ఎత్తుకోవడం కాళోజీ తత్వం. నచ్చకపోతే మాత్రం చీల్చి చెండాడుతాడు. ఆయన బతికినంత కాలం తెలంగాణ కోసం పరితపించారు. గోరటి వెంకన్న పాట లు మనుషులు ఉన్నంతవరకు సజీవంగా ఉంటాయి’’ అని అన్నారు. కడియం మాట్లాడుతూ.. కాళోజీ జయంతిని అధికారికంగా జరుపుకోవడం, సాహిత్య పురస్కారాన్ని ఇవ్వటం గర్వంగా ఉందన్నారు. వరంగల్‌లో రెండున్నర ఎకరాల్లో రూ.60 కోట్లతో కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు. దీనికి ప్రభుత్వం ఇప్పటికే రూ.10 కోట్లు మంజూరు చేసిందన్నారు. కేంద్రం రూ.15 కోట్లు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో దీన్ని పూర్తి చేస్తామని తెలిపారు. కాళోజీ పాటలను సీడీ రూపంలో భావితరాలకు అందించడానికి సాంస్కృతిక శాఖ కృషి చేయాలన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా గోరటి వెంకన్నకు డాక్టరేట్ ఇవ్వడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కాళోజీ 102వ జయంతిని భాషాదినోత్సవంగా జరుపుకోవడం అదృష్టమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ అన్యాయాన్ని ఎదిరించినవాడే తనకు ఆరాధ్యుడన్న కాళోజీ తెలుగువారందరికీ ఆదర్శప్రాయుడ న్నారు. కాళోజీది ధిక్కార స్వరం ప్రజాకవి కాళోజీ నారాయణరావు ధిక్కార స్వరం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని వక్తలు కొనియాడారు. శుక్రవారం టీఎన్జీవో భవన్లో కాళోజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్, అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు. అన్యాయాన్ని ఎదిరిం చడంలో, అణచివేతను ఎదుర్కోవడం లో కాళోజీ ధైర ్యం ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు. వరంగల్‌లో ఆయన పేరిట హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం, కాళోజీ జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించడం తెలంగాణ ప్రభుత్వానికి ఆయన పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమని పేర్కొన్నారు. నా పాట నాన్న భిక్ష: గోరటి కాళోజీ పురస్కార ప్రదాన కార్యక్రమంలో గోరటి వెంకన్న మాట్లాడుతూ.. తన పాట నాన్న పెట్టిన భిక్ష అని అన్నారు. పురస్కారం అందించిన ప్రభుత్వానికి, సభకు హాజరైన అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. గోరటిని పురస్కారంతో సత్కరించి రూ.1,01,116 నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన వేదికపై తన తల్లి ఈరమ్మకు పాదాభివందనం చేశారు. అనంతరం తన పాటలతో ఆహూతులను అలరించారు. ఈ కార్యక్రమంలో సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, తెలుగు వ ర్సిటీ ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ, డెరైక్టర్ మామిడి హరికృష్ణ, ఎమ్మెల్సీలు సుధాకర్ రెడ్డి, కర్నె ప్రభాకర్, మేయర్ బొంతు రామ్మోహన్, కాళోజీ ఫౌండేషన్ నాగిళ్ల రామ శాస్త్రి మాజీ ఎమ్మల్యే నోముల న ర్సింహయ్య, సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు. -
జన వాగ్గేయ ఝరి..గోరటి
సాక్షి, సిటీబ్యూరో: శ్రమ జీవుల చెమట చుక్క అతడి కలానికి ఇంధనం. కూలీల కష్టమే అతడి అక్షరానికి ఆలంబన. బడుగు జీవుల బతుకు చిత్రాన్ని తన పాటల్లో ఆవిష్కరించి ఎలుగెత్తి చాటే ఎర్రజెండా అతడు. సామాన్యుల వెతల పల్లకీని మోసే ఉద్యమ బోయీ. అతడే ప్రజా కవిగా జగమెరిగిన గోరటి వెంకన్న. మహబూబ్ నగర్ జిల్లా గౌరారం చెక్కిన శిల్పం. ఆకలి, దోపిడీ ఉన్నచోట పాటై పల్లవించే ఈ తెలంగాణ బిడ్డడు నేడు ‘ప్రజా కవి కాళోజీ నారాయణరావు’ సాహితీ పురస్కారం అందుకుంటున్నాడు. ఈ సందర్భంగా గోరటి వెంకన్న ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆయన మాటల్లోనే.. ‘మహబూబ్‌నగర్ జిల్లా గౌరారంలో ఆదర్శ భావజాలం ఉన్న నరసింహ, ఈరమ్మ దంపతులకు 1965లో ఏప్రిల్ 4న పుట్టాను. టీచర్ కావాలని ఎంఏ తెలుగు సాహిత్యం చదువుకున్నా. అయితే, కో–ఆపరేటివ్ శాఖలో ఉద్యోగిగా మారాను. చిన్నప్పటి నుంచి ప్రజలు పడే కష్టాలను అక్షరబద్ధం చేసి గొంతు విప్పడం, వారి తరఫున పాటై ప్రశ్నించడం అలవాటు. శతకోటి వందనాలు.. నా కవిత్వం, పాటను ఆదరించిన సమాజానికి శతకోటి నమస్కారాలు. ప్రజాకవి కాళోజీ సాహితీ పురస్కార ఎంపిక కమిటీ నాపై చూపిన వాత్సల్యానికి, వారి ప్రతిపాదనను అంగీకరించిన సీఎం కేసీఆర్‌కి వందనాలు. నా ఈ కవిత్వం.. పాట ప్రయాణంలో ప్రతి సందర్భంలో సహరించిన అందరికి వందనాలు. మహాకవి కాళోజీ పేరు మీద పురస్కారం అందుకోవడం మాటల్లో వర్ణించలేను. నా కవిత్వానికి, పాటకు ప్రకృతి తల్లి అందజేస్తున్న మహా కానుకగా భావిస్తున్నా. ఈ ప్రయాణంలో జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నెన్నో అవార్డులు, పురస్కారాలు, సన్మానాలు, సత్కారాలు అందుకున్నా. కానీ రెండు ముద్దు.. తొలిది 70 ఏళ్లు పైబడిన సాహితీ యోధులకు ఇచ్చే హంస అవార్డును 43 ఏళ్లకే అందుకున్న. అప్పటి సీఎం దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నన్ను గుర్తించి, అభిమానంగా పురస్కారం అందించారు. కారణం 1996లో ‘పల్లె కన్నీరు పెడుతుందో.. కనిపించని కుట్రల’ అనే పాట రాశాను. మొహర్రం పండుగకు గౌరారం వెళ్లా. జనాలే లేరు. బాధేసింది. ఆ బాధను బాలసంతుల యక్షగానం స్ఫూర్తితో రాశాను. ఆ పాట సమాజంలోని ప్రతి ఒక్కరి గుండెను తాకింది. ఇప్పుడు తెలంగాణ సర్కారు మహాకవి కాళోజీ పురస్కారం అందిస్తోంది. ఇప్పుడు మళ్లీ అంతే ఆనందంగా అందుకోబోతున్నాను’ అంటూ ముగించారు. -
ఈవెంట్
బంగారు తెలంగాణపై కవి సమ్మేళనం ‘కామన్ డయాస్’ ఆధ్వర్యంలో నేడు ఉదయం 10 గంటలకు ‘బీసీ సాధికారత సంస్థ, హిమాయత్ నగర్’(తెలుగు అకాడమీ పక్కన)లో ‘బంగారు తెలంగాణ’పై కవి సమ్మేళనం జరగనుంది. మసన చెన్నప్ప, కాలువ మల్లయ్య, బీవీఆర్ చారి పాల్గొంటారు. కవిత్వ కళా శిబిరం ‘తెలంగాణ రచయితల సంఘం’ ఆధ్వర్యంలో నేడు ఉదయం 10 గంటలకు కర్షక్ బీఈడీ. కళాశాల, కామారెడ్డిలో ‘కవిత్వ కళా శిబిరం- కవి సమ్మేళనం’ జరగనుంది. కీలకోపన్యాసం: నందిని సిధారెడ్డి. ప్రసంగాలు: నాళేశ్వరం శంకరం, ఎం.నారాయణశర్మ, అయాచితం నటేశ్వరశర్మ. వెజిటేరియన్స్ ఓన్లీ ఆవిష్కరణ ఓరియంట్ బ్లాక్ స్వాన్ ప్రచురించిన స్కైబాబా తెలుగు కథల ఆంగ్లానువాదం ‘వెజిటేరియన్స్ ఓన్లీ’ ఆవిష్కరణ నేడు ఉదయం 10 గంటలకు నల్లగొండ జిల్లా కేశరాజుపల్లిలో జరగనుంది. ఆవిష్కర్త: రచయిత అమ్మ హాజీబేగం. ఇందులో వేముల శేఖర్, పసునూరి రవీందర్, అంబటి సురేంద్రరాజు, గోరటి వెంకన్న, నోముల సత్యనారాయణ, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, బెరైడ్డి కృష్ణారెడ్డి, కార్టూనిస్ట్ శంకర్, నిసార్, బెల్లి యాదయ్య, షాజహానా తదితరులు పాల్గొంటారు. ఇస్మాయిల్ కవిత్వ పురస్కార సభ 2014 ఇస్మాయిల్ కవిత్వ పురస్కారాన్ని ‘నదీమూలం లాంటి ఆ ఇల్లు’ కవితాసంపుటికిగానూ యాకూబ్‌కు ప్రదానం చేయనున్నారు. ఇస్మాయిల్ మిత్రమండలి ఆధ్వర్యంలో నేడు ఉదయం 10:30కి కాకినాడలోని పి.ఆర్.ప్రభుత్వ కళాశాల సమావేశ మందిరంలో జరిగే ఈ కార్యక్రమంలో ధూళిపాళ అన్నపూర్ణ, వాడ్రేవు చినవీరభద్రుడు, పలమనేరు బాలాజీ, కొప్పర్తి వెంకటరమణమూర్తి, వాడ్రేవు వీరలక్ష్మీదేవి పాల్గొంటారు. ‘బతుకుముడి’కి వట్టికోట పురస్కారం ‘మంజీరా రచయితల సంఘం’ నిర్వహించిన వట్టికోట ఆళ్వార్‌స్వామి స్మారక కథా పురస్కారానికి నిజామాబాద్‌కు చెందిన బి.కళాగోపాల్ కథ ‘బతుకుముడి’ ఎంపికైంది. అలాగే, దిలావర్(ఖమ్మం) ‘మూడు తరాలు’, హుమాయూన్ సంఘీర్(నిజామాబాద్) ‘బూదెవ్వ’ ఉత్తమ కథలుగా ఎంపికయ్యాయని వేముగంటి రఘునందన్ తెలియజేస్తున్నారు. నందిని సిధారెడ్డి, దేవరాజు మహారాజు, సంగిశెట్టి శ్రీనివాస్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఇస్మాయిల్ అవార్డు-2015 తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు చామర్తి మానస ఎంపికైందని తమ్మినేని యదుకుల భూషణ్ తెలియజేస్తున్నారు. ‘తనదైన అనుభవాన్ని అనాయాసంగా దృశ్యమానం చేయగల ప్రతిభా వ్యుత్పన్నతలు నేటికాలపు కవులనుండి ఈమెను ఎడంగా నిలబెడతాయి’. గతంలో పాలపర్తి ఇంద్రాణి, గోపిరెడ్డి రామకృష్ణారావు, గరికపాటి పవన్‌కుమార్, పి.మోహన్, వైదేహి శశిధర్, గండేపల్లి శ్రీనివాసరావు, పద్మలత, తులసీ మోహన్, స్వాతికుమారి, మమతకు ఈ అవార్డ్ లభించింది. ఉమ్మడిశెట్టి అవార్డు కోసం... ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు-2015 కోసం కవుల నుండి 2015లో అచ్చయిన కవితాసంపుటాలను ఆహ్వానిస్తున్నారు అవార్డు వ్యవస్థాపకులు డాక్టర్ ఉమ్మడిశెట్టి రాధేయ. నాలుగు పుస్తకాలను 2016 జనవరి 31లోగా ‘రాధేయ, 13-1-606-1, షిర్డినగర్, రెవెన్యూ కాలనీ, అనంతపురం-515001’ చిరునామాకు పంపాలి. ఫోన్: 9985171411 ఫ్రీవర్స్ ఫ్రంట్ కవిత్వ బహుమతులు గత 45 ఏళ్లుగా ప్రతి యేటా ఉత్తమ వచన కవితాసంపుటికి అవార్డులు యిస్తూవున్న ఫ్రీవర్స్ ఫ్రంట్ సంస్థ గత సంవత్సరానికీ, ఈ సంవత్సరానికీ ఉమ్మడిగా అవార్డుల్ని ప్రకటించింది. 2014 సంవత్సరానికిగానూ తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ ‘మాకూ ఒక భాష కావాలి’ ఎంపికైందనీ, 2015కుగానూ ప్రసాదమూర్తి ‘పూలండోయ్ పూలు’ ఎంపికైందనీ శీలా వీర్రాజు తెలియజేస్తున్నారు. ఈ పురస్కారాల్ని డిసెంబర్ 18న దేవరాజు మహారాజు అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో దేవిప్రియ చేతుల మీదుగా అందజేస్తారు. -
అది ఆయన... స్వభావం, సంస్కారం!
మరువలేని జ్ఞాపకం పల్లవి: పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లి బంది అయిపోతుందో కనిపించని కుట్రల చరణం: 1 కుమ్మరి వామిలొ తుమ్మలు మొలిసెను కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను పెద్ద బాడిస మొద్దు బారినది సాలెల మగ్గం సడుగులిరిగినది చేతి వృత్తుల చేతులిగిరిపాయే నా పల్లెల్లోన అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోనపాయే ఈ దేశంలోనే చరణం: 2 మడుగులన్ని అడుగంటి పోయినవి బావులు సావుకు దగ్గరయ్యినవి వాగులు వంకలు ఎండిపోయినవి సాకలి పొయ్యిలు కూలిపోయినవి పెద్ద బోరు పొద్దంత నడుస్తుందో బలిసీన దొరలవి మరి పేద రైతుల బావులెందుకెండే నా పల్లెల్లోన (మొత్తం 15 చరణాల పాట ఇది) చిత్రం: కుబుసం (2002) గీత రచయిత: గోరటి వెంకన్న సంగీతం, గానం: ‘వందేమాతరం’ శ్రీనివాస్ ‘పల్లె కన్నీరు పెడుతుందో’ పాట ఒక చారిత్రక సందర్భంలో రాసింది. తుప్పు పట్టిన వృత్తులు, దుమ్ము పట్టిన పల్లెలు ఈ పాట ప్రతీ చరణంలో కనిపిస్తాయి. ఈ పాట విని దర్శకుడు శ్రీనాధ్ ‘కుబుసం’ చిత్రంలో ఉపయోగించారు. తరువాత మరో సందర్భంలో కపిల్ సురవరం ఈపాటకు దృశ్యరూపం ఇచ్చాడు. అలా సామాన్యుల దగ్గర నుంచి మేధావుల వరకూ ఈ పాటతో మమేకమయ్యారు. రాజశేఖర్‌రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో, ఆయన సన్నిహితుడు రవిచంద్ ఈ పాటను ఆయనకు పరిచయం చేశారు. పాట విన్న తరువాత రాజశేఖర్‌రెడ్డి తన భావాలను పాదయాత్ర డైరీలో ప్రత్యేకంగా రాసుకున్నారు. తరువాత తన ఎన్నికల ప్రచారంలో ఈ పాటను ఉపయోగించారు. ఇదంతా నా పరోక్షంలో జరిగింది. రాజశేఖర్‌రెడ్డి గారు ఎన్నికలలో గెలిచి ప్రమాణ స్వీకారం చేసిన మర్నాడు నాకు కబురుపెట్టారు. మొదట నేను కొంత ఆశ్చర్యపోయాను. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నన్ను పిలవడంలో ఆంతర్యమేమిటో నాకు బోధపడలేదు. నేను మిత్రులతో కలిసి రాజశేఖర్‌రెడ్డి గారి దగ్గరకు వెళ్లాను. నన్ను చూసి ఆయన చుట్టూ వున్న వాళ్లంతా పాటను ప్రశంసిస్తున్నారు. ఆయన ఏమీ మాట్లాడకండా నన్ను చూసి సహజశైలిలో ఒక నవ్వు నవ్వి, కవి గారికి పిల్లలెంతమంది, ఆర్థిక పరిస్ధితులేమిటని ఆరా తీశారు. ఆయన ఔదార్యానికి కృతజ్ఞతలు చెప్పి వచ్చేశాను. నిజానికి మా పరిచయం అక్కడితో ముగిసిపోవలసింది. కానీ రానురాను మా అనుబంధం మరింత బలపడింది. ఆయనకు నా పాట చేసిన చిన్న ఉపకారానికి నన్ను తను ఉన్నంతకాలం ఏదో రకంగా గౌరవించారు. ‘హంస’ అవార్డు సమయంలో ఆయన దగ్గరి వాళ్లతో ఫోన్ చేయించి కవిగారు అవార్డు తీసుకుంటారో లేదోనని వాకబు చేశారు. ఆ తరువాత తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం మొదలుకొని అనేక అవార్డులతో నన్ను గౌరవించారు. ప్రతీ అవార్డు కమిటీలో నన్ను సభ్యుడిగా నియమించారు. నిజానికి ప్రత్యక్షంగా కలిసింది మూడే మూడు సార్లు. కానీ ఆయన పరోక్షంలో ఆయన ఎప్పుడూ నాకు దగ్గరగా వున్నట్టే వుండేది. ప్రతిష్ఠాత్మక జలయజ్ఞం మీద నాతో ‘సుజలాం, సుఫలాం సస్యశ్యామలం’ పాట రాయించారు. ఆ పాటను నాతో పదే పదే పాడించుకుని మురిసిపోయారు. అసలు అంత స్థాయిలో వున్న వ్యక్తి నన్ను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆయనకు నేనంటే తెలియని అభిమానం. రాజశేఖర్‌రెడ్డి గారికి సహజంగా కృతజ్ఞతా భావం ఎక్కువ. తాను నమ్మిన వారిని, ప్రేమించిన వారిని ఆయన ఎప్పుడూ మరిచిపోలేదు. అది ఆయన స్వభావం, సంస్కారం. ఆయన ప్రేమకు, అభిమానానికి నేను పాత్రుడినవడం నిజంగా నా అదృష్టం. - గోరటి వెంకన్న (వై.ఎస్.ఆర్. పోయిన బాధలో పల్లె ఇంకా కన్నీరు పెడుతోంది. ఈ విషయం మీద గోరటి వెంకన్నతో మాట్లాడితే ఈ పాటను ఇచ్చారు. వై.ఎస్.ఆర్తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.) -
యాసలు వేరైనా.. మనమంతా ఒక్కటే..
గాయకుడు గోరటి వెంకన్న కోస్తా, రాయలసీమ, తెలంగాణ.. ప్రాంతాలు, రాష్ట్రాలు వేరైనా మనమంతా ఒక్కటేనని, తెలుగు భాషలోని భావం ఒక్కటేనని సినీ గేయ రచయిత, గాయకుడు గోరటి వెంకన్న అన్నారు. కుబుసం, బతుకమ్మ, ఎన్కౌంటర్, శ్రీరాములయ్య, పీపుల్స్.. వంటి 80కుపైగా చిత్రాల్లో పాటలు రాశారాయన. ప్రజా సమస్యలపై తన వాణి వినిపించారు. నిద్రపోతున్న సమాజాన్ని తన కలం, గళంతో తట్టిలేపి, నూతనోత్తేజాన్ని కల్పించటంలో ఆయన తీరే ప్రత్యేకం. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో జరుగుతున్న జెక్‌ఫెస్ట్-15కు వచ్చిన వెంకన్న శుక్రవారం కొద్దిసేపు ‘సాక్షి’తో ముచ్చటించారు. - గుడ్లవల్లేరు సాక్షి : గాంధీ సిద్ధాంతాలు ప్రస్తుతం అమలవుతున్నాయంటారా.? వెంకన్న : ఆధునిక యుగంలో గ్రామాలను నగరాలుగా మార్చేందుకు ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. దేశంలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు ప్రధానమంత్రులు బాగా కృషి చేస్తున్నారంటే అమలవుతున్నట్టే కదా.. సాక్షి : దేశాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వెంకన్న : అమెరికాలోని ఎక్కువ శాతంగా ఉన్న డాక్టర్లు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు భారతీయులే. వారిని మనదేశానికి రప్పించాలి. అలాగే, వనరులను సమృద్ధి పరుచుకోవటంలోనూ ప్రభుత్వాలు ముందుకు సాగాలి. విద్య, వైద్య రంగాల్ని వ్యాపార ధోరణితో కాకుండా పవిత్రమైన బాధ్యతగా చేపట్టాలి. సాక్షి : నేటి సాంకేతిక పరిజ్ఞానంపై మీ కామెంట్.. వెంకన్న : దేశాన్ని అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడే ఆ పరిజ్ఞానమే నేడు పక్కదారి పడుతోంది. అంతర్జాలంలో అశ్లీలత పెరిగిపోతోంది. సాక్షి : నేటి యువతకు మీరిచ్చే సందేశం ఏమిటి? వెంకన్న : కులమత భావాలను తగ్గించుకుని మానవత్వాన్ని పెంచుకోవాలి. గురజాడ, శ్రీశ్రీ వంటి రచనల సారాన్ని అవపోసన పట్టాలి. సాక్షి : నేటి సమాజంపై సినిమా ప్రభావం ఉందంటారా.. వెంకన్న : సినిమా కల్చర్ వల్ల అంత ఉపయోగమేమీ లేదు. పిల్లల్లో అతి తగ్గాలి. ఎక్కువ సినిమాల్లో మానవీయత నశిస్తోంది. సాక్షి : తెలుగు ప్రజలకు మీరిచ్చే సందేశం..... వెంకన్న : కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ.. రాష్ట్రాలు వేరైనా అంతా తెలుగువారమే. తెలుగు ప్రజల నుంచే పుట్టినట్టుగా నేను సినిమాల్లో పాటలు రాశాను. రాజకీయ ఉచ్చులో పడకూడదు. తెలుగు వారమంతా ఒక్కటే అనేది గుర్తుంచు కోవాలి. యాసలు తేడా ఉన్నా తెలుగు భాషలో భావం ఒక్కటే. సాక్షి : మీరు సానుకూలంగా, వ్యతిరేకంగా స్పందించే అంశాలు ఏమిటి? వెంకన్న : నేను శ్రమను గౌరవిస్తాను. మనుషుల ప్రాణాలను సైతం హరించే థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణాలను వ్యతిరేకిస్తాను. వాటి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. గోరటి వెంకన్న -
అరుణోదయం
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ఐదవ మహాసభలు పురస్కరించుకొని స్థానిక ఏబీఎం జూనియర్ కాలేజీ నుంచి కళాకారులు మహా ప్రదర్శనగా బయలుదేరారు. అక్కడ నుంచి కలెక్టర్ బంగ్లారోడ్డు, చర్చి సెంటర్, ప్రకాశం భవనం, నెల్లూరు బస్టాండు మీదుగా మిరియాలపాలెం సెంటర్, ట్రంకురోడ్డు, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్, అద్దంకి బస్టాండు, ఆర్టీసీ బస్టాండు మీదుగా సభా వేదికైన హెచ్‌సీఎం జూనియర్ కాలేజీ వరకు ర్యాలీ చేపట్టారు. ఆంధ్రతో పాటు తెలంగాణ రాష్ట్రాల నుంచి దాదాపు వెయ్యి మంది కళాకారులు ఉత్తేజం రేకెత్తించారు. గజ్జె కట్టడం, కోలాటం, గొంగడి నాట్యం, కాళ్లకు రింగులతో గారడీ నృత్యం, కోయ కళాకారుల విన్యాసాలు, డప్పు కళాకారులు, కాటి కాపరులు విశేషంగా ఆకట్టుకున్నారు. ముందు వరుసలో పీఓడబ్ల్యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బీ రమాసుందరి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, అరుణోదయ రాష్ట్ర నాయకులు సీహెచ్ జాలన్న, ఎం. వేణు, అరుణోదయ అంజయ్య నుంచొని ఉత్సాహం నింపారు. కళా ప్రదర్శనలు భళా.. సభా వేదిక ఏర్పాటు చేసిన హెచ్‌సీఎం జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లోని గాండ్ల వెంకట్రావు నగర్ (ప్రాంగణం)లో నిర్వహించిన కళాప్రదర్శనలను భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు తిలకించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సుబ్బారావు, పాణిగ్రాహి వారసుడు సుబ్బారావు బృందం ప్రదర్శించిన ‘జముకల కథ’ ఆకట్టుకుంది. శ్రీకాకుళం జిల్లా రైతాంగ పోరాటం, మన్నేకల్లి గ్రామంలో జరిగిన ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. తూర్పుగోదావరి జిల్లా కందులపాలేనికి చెందిన గారడి బృందం ప్రదర్శన అలరించింది. ‘ఆడపిల్లవని బాధపడకూ’ అంటూ నేటి రోజుల్లో ఆడపిల్లల వెతలకు నృత్య రూపకం ఇచ్చారు. వరంగల్ జిల్లా కొత్తగూడెంకు చెందిన కోయ కళాకారులు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన డప్పు దళం, అదే జిల్లాకు చెందినవారి కోలాటం, సంతనూతలపాడు మండలం మద్దులూరుకు చెందిన బాలికల కోలాట ప్రదర్శనలకు హర్షధ్వానాలు మిన్నంటాయి. అరుణోదయ అంజయ్య ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నీయలో’ విశేషంగా ఆకట్టుకుంది. నాటి నక్సల్బరి నుంచి నేటి గోదావరి పోరాటం వరకు జరిగిన పోరాటాల్లో అమరులకు జోహార్లు అర్పిస్తూ చేసిన ప్రదర్శన చలించేలా చేసింది. హైదరాబాద్‌కు చెందిన కళాకారుల నృత్య రూపకంలోని ‘బతుకమ్మ’ పండగలో సంధ్య కూడా జత కలిశారు. ప్రజా గాయకురాలు చైతన్య సమకాలీన అంశాలపై గీతం ఆలపించారు. సినీనటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి, ప్రముఖ కవి, కళాకారుడు గొరటి వెంకన్నలు ఆసక్తిగా తిలకించారు. -
గీతాలే ఉద్యమాన్ని గెలిపించాయి
సాక్షి, సిటీబ్యూరో: ఆకలి చావులు, ఆత్మహత్యలు లేని సుభిక్షమైన నవతెలంగాణ నిర్మాణ ంలో కవులు, కళాకారులు భాగస్వాములు కావాలని సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యవుంలో కళాకారులు, కవులు నిర్వహించిన పాత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు. ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు సంపాదకీయంలో వెలువడిన ‘ఒక్కొక్క పాటేసి...’- తెలంగాణ నూటొక్క పోరు పాటలు.. పుస్తకాన్ని నగరంలోని ఆంధ్ర సారస్వత పరిషత్ హాలులో ఆదివారం సాయుంత్రం కవులు, కళాకారులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన దత్తాత్రేయ మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయుణ వూట్లాడుతూ పాట వులి దశ తెలంగాణ ఉద్యవుంలో కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. సీనియుర్ సంపాదకులు కె. రావుచంద్రవుర్తి వూట్లాడుతూ తెలంగాణ కని పెంచిన కవులు ప్రపంచంలో ఎక్కడా కనిపించరని ... ఇక్కడి కవులు, కళాకారుల గొప్ప తనం, త్యాగనిరతిని కొనియూడారు. ఎమ్మెల్యే రసవురుు బాలకిషన్ వూట్లాడుతూ పాట ద్వారానే తాను అసెంబ్లీకి వెళ్లానని... ఆ పాటను ఎప్పటికీ వుర్చిపోలేనన్నారు. సభలో వూజీ ఎంపీ వుధుయూష్కి, ప్రొఫెసర్ జయుధీర్ తిరువులరావు, సంపాదకులు టంకశాల అశోక్, ప్రజా కవులు, కళాకారులు గద్దర్, గోరటి వెంకన్న, వివులక్క, అంద్శై సుద్దాల అశోక్ తేజ, అల్లం రాజయ్యు, జూలూరి గౌరీశంకర్, డాక్టర్ చెరుకు సుధాకర్, జగన్, దరువు ఎల్లన్న, వేణు సంకోజులు వూట్లాడారు. తెలంగాణ రిసోర్స్ సెంటర్ అధ్యక్షుడు వేదకువూర్ అధ్యక్షత జరిగిన ఈ సభలో గద్దర్, గోరటి వెంకన్న, వివులక్క, అంద్శైపలువురు కళాకారుల ఆట- పాటలు ఆకట్టుకున్నాయి. -
ఓ మనిషీ! లోపలి మనిషిని కాపాడుకో!!
గోరటి వెంకన్న... ప్రజాకవి. సమాజం అనే చెట్టుకు పూసిన పువ్వు. ఆకలి తెలిసిన ఈయన అక్షరం వెదజల్లే సువాసనకు కృత్రిమత్వం తెలియదు. కృతకపు మకిలీ అంటదు. ప్రకృతిలోని సహజత్వాన్ని అచ్చంగా నింపుకున్న ఆయన అంతరంగం ఇది. మీ గురించి మీరు ఒక్కమాటలో... పరిమితత్వాన్ని, ప్రశాంతతను, సహజత్వాన్ని ఇష్టపడతాను. మీలో మీకు నచ్చే లక్షణం, అలాగే నచ్చని లక్షణం ? నచ్చే లక్షణం ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ నన్ను నేను సవరించుకోవడం. నచ్చని లక్షణం కోపం. అదీ ఒక్క నిమిషమే. మీ పాటకు గురువు ఎవరు ? తొలి గురువు నా తండ్రి. ఆ తర్వాత ప్రకృతి. ఎప్పుడు, ఎక్కడ పుట్టారు? ఏం చదువుకున్నారు? మహబూబ్‌నగర్ జిల్లా గౌరారంలో పుట్టాను. 1965, ఏప్రిల్ 4న పుట్టానని స్కూల్లో టీచర్ రాశారు. వైశాఖ పౌర్ణమి రోజు పుట్టానని అమ్మ చెప్పింది. ఎంఎ తెలుగు లిటరేచర్ చదువుకున్నా. చదువుకునే రోజుల్లో జీవితంలో ఎలా స్థిరపడాలనుకునేవారు? చిన్నప్పుడు టీచర్ని కావాలనుకునేవాడిని. నాగర్ కర్నూల్లో కో ఆపరేటివ్ సెక్షన్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా చేస్తున్నాను. మీరు ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులు? మా అమ్మానాన్నలు నరసింహ, ఈరమ్మ. జీవితంలో మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి ! మా నాన్న. ఆయన రైతు, అయినా శతకాలను కంఠతా చెప్పేవాడు. అలా చేసి ఉండాల్సింది కాదనుకున్న సందర్భం? ఉంది. కానీ, చెప్పకూడదు. మీకు పిల్లలు ఎంతమంది? నలుగురు. ముగ్గురమ్మాయిలు (ఎంఫార్మసీ, ఐఎంఎస్సి, బీ.టెక్). ఒక అబ్బాయి (ఇంటర్ చదువుతున్నాడు).వచ్చే జన్మంటూ ఉంటే... మళ్లీ కవిగానే.మీకు శిష్యులు... నేనెవర్నీ తయారు చేయలేదు. మనిషి ఎలా ఉండాలంటారు? సాహిత్యం చదవాలి. అంతరంగంలోని మనిషిని కాపాడుకోవాలి. అంతరంగ చేతనకు అనుగుణంగా మెలగాలి. మిమ్మల్ని భయపెట్టే విషయాలేంటి ? పిల్లల గురించిన భయమే ఎక్కువ. వాళ్లు ఇంటికి రావడం కొద్దిగా ఆలస్యమైనా భయమేస్తుంది. అద్దంలో చూసుకున్నప్పుడు ఏమనుకుంటారు ? ‘రంగస్థల నటుడిగా అమరుతాను’ అనుకుంటాను. నాలో పాతకాలపు నాటకాల (16వ శతాబ్దం నాటి) ఛాయలు ఉన్నాయనిపిస్తుంది. - వాకా మంజులారెడ్డి