Gurram Jashuva
-
గుర్రం జాషువాకు వైఎస్ జగన్ నివాళులు
-
ఆ మహాకవికి నా నివాళి: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, నవయుగ కవిచక్రవర్తి, మహాకవి గుర్రం జాషువా జయంతి నేడు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, సాహితీవేత్తలు ఆయన్ని స్మరించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. తన కవితల ద్వారా గుర్రం జాషువా మూఢాచారాలను ప్రశ్నించారని, దళితుల జీవన విధానాన్ని అద్దం పట్టేలా కావ్యాలు రాశారని అన్నారు . తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు ఎల్లకాలం గుర్తుంటాయన్న వైఎస్ జగన్.. ఆ మహాకవి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నట్లు అని ఎక్స్‌లో ఓ సందేశం ఉంచారు.అప్పటి మూఢాచారాలను తన కవితల ద్వారా ప్రశ్నించిన మహాకవి పద్మభూషణ్ గుర్రం జాషువా గారు. దళితుల జీవన విధానాన్ని అద్దం పట్టేలా ఆయన రాసిన ఎన్నో కావ్యాల్లో ``గబ్బిలం ``ఎంతో ప్రాచుర్యం పొందింది. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆ మహాకవి జయంతి సందర్భంగా…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 28, 2024 YSRCP కేంద్ర కార్యాలయంలో.. మహాకవి గుర్రం జాషువా జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో.. జాషువా విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు కొమ్మూరి కనకారావు, అడపా శేషు, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అణగారిన వర్గాలకు జరిగిన అన్యాయాలపై సాహిత్య ఉద్యమం ఆరంభించిన నవయుగ కవి చక్రవర్తిగా, అప్పటి మూఢాచారాలను తన కవితల ద్వారా ప్రశ్నించిన మహాకవిగా తనదైన ముద్ర వేసుకున్న గుర్రం జాషువాను ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు గుర్తు చేసుకున్నారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. -
నవయుగ కవిచక్రవర్తికి జేజేలు!
జాషువ అచ్చమైన జాతీయకవి. విశ్వనరుడి భావన ఆయన సాహిత్య తాత్వికత. తెలుగు నుడి కారం, ఇంపుసొంపులను పద్య లాలిత్యంతో పాఠకునికి అందించిన ‘నవయుగ కవి చక్రవర్తి’. భారతీయ తత్వాన్ని ఆకళించు కున్న కళాప్రపూర్ణుడు. నిరంతరం జాతి పురోగమనాన్ని కాంక్షిస్తూ సంఘంలో ఉన్న అసమానతలు తొలగిపోవాలన్న ధృడ సంకల్పంతో శక్తిమంతమైన కావ్యాలను రాసిన పద్మ భూషణుడన్న సాహిత్య విమర్శకుని మాటలు మహాకవికి అక్షరాలా అబ్బుతాయి. జాషువ కవిత్వం జాతీయ భావాలతో నిండి, మానవ జాతి శ్రేయస్సునూ, విశ్వకల్యాణాన్నీ కాంక్షిస్తూ చైతన్యశీలంగా ఉంటుంది. ‘భరత ఖండంబు నా పాఠశాల / భాగవతంబు నా బాలశిక్ష’ అని పేర్కొన్న జాషువాకి ఈ దేశ భిన్నసంస్కృతి, సంప్రదాయాల పట్ల అపారగౌరవం వుంది. కాబట్టే ఆయన ‘కులమతాలు గీచుకున్న గీతల జొచ్చి, పంజరాన గట్టువడను నేను / నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు విశ్వన రుడ నే’నని ప్రకటించాడు. దేశం సంస్కృతీ, భిన్న సంప్ర దాయాలను గౌరవిస్తూ అందరూ ఐకమత్యంతో, సహనంతో సహజీవనం చెయ్యాలని కాంక్షించాడు. మనుష్యులంతా సమానమేనని మరణంలేని మానవతను ప్రకటించాడు. ‘సింధు గంగానదీ జలక్షీరమెపుడు / కురిసి బిడ్డల పోషించుకొనుచున్న / పచ్చి బాలెంతరాలు మా భారత మాత / మాతలకు మాత సకల సంపత్సమేత’ అని దేశాన్ని కీర్తించారు. భారతీయ చారిత్రక పురాణ పురుషులనూ, అందు నాయకులనూ వారి ఔన్నత్యాన్నీ బట్టి గొప్ప వ్యక్తు లుగా చిత్రించారు. సగరుడు, మాంధాత్రి వంటి చక్ర వర్తులు మొదలు అశోకుడు, గౌతమ బుద్ధుడు, కర్ణుడు, శివాజీ, మహాత్మాగాంధి, అంబేడ్కర్ వంటి నేటికాల మేధా వుల వరకూ జాషువ రచనల్లో అత్యుత్తమంగా కన్పిస్తారు. మొదటి ఖండికే భారతమాత ప్రశస్తికి అంకితమై దేశానికి నీరాజనం పట్టింది. తరతరాల భారతీయ స్త్రీ, పురుషుల పరాక్రమోన్నతినీ నదుల ప్రాభవాన్నీ, గానం చేసి ‘గొన బుసిరిగల భాగ్యశాలివి నీవు, భారతాంబా మణి నమస్కారమమ్మ’ అని రెండు చేతుల నమస్కరించిన తీరు ఆయన దేశభక్తికీ, జాతీయతకీ నిదర్శనం. స్వాతంత్య్రం సిద్ధించిన పిమ్మట ఆనందాతిశయంతో ‘తల్లి భారతి నేడు దక్కె మాకు / పదియు రెండగు పుణ్య నదులు నదంబులు / చిరకాలమునకు జేజిక్కె మాకు / అమర సన్నుతమైన హస్తినాపుర రత్న పీఠంబు...’ అని హర్షాతిరేకము ప్రకటించారు. చికాగోలో జరిగిన విశ్వమత మహాసభలో వివేకానందుని అద్భుత ప్రతిభాపాటవాలనూ, అహింసాయుధంతో మహాత్మాగాంధీ సాంధించిన స్వాతంత్య్రాన్నీ, తెలుగు వాడైన తత్త్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్నూ, విశ్వకవి రవీంద్రునీ కొనియాడారు. అన్ని సంపదలు పుష్కలంగా ఉన్న దేశంలో ప్రజల మధ్య అనైక్యత, ప్రాంతాల వారిగా, మతాలవారిగా విడిపోయి, పరమత సహనం, పరజాతి సహనం లోపించి మానవజాతి సహజ గుణాల్ని కోల్పోయి అసహనంగా తయారయిందని చింతించారు. కులం కారణంగా తనను హీనపరిచారని దేశ ప్రము ఖులను స్తుతిస్తూనే తన నిందను సున్నితంగా చెప్పారు. జాతి సమైక్యత, సహన సహిత జీవనమే మహాకవి కవిత్వ తత్త్వంగా సాగింది. బాపూజీ అంటే జాషువ కవికి అనిర్వచనీయమైన భక్తిభావం. మహాత్ముని నిత్యసత్యవ్రతుడిగా పేర్కొన్నారు. ‘వడికిన నూలుపోగుతో ప్రపంచపు టేనుగు గట్టి అహింసా మార్గాన విరోధి గుండెలో పిడుగులు గుప్పువాడనీ, తన బోసినోట అమృత బిందువులను జిమ్మెడు వక్త’ అనీ మహా త్ముని వ్యక్తిత్వాన్ని గొప్పగా స్తుతించారు జాషువ. ‘మహా త్ముని చెప్పుల జాడలోన కాలాడ చరించెదన్’ అనీ వెల్లడించారు. ‘గోచిపాత గట్టుకొని జాతి మానంబు నిలపినట్టి ఖదరునేతగా, పండ్లు నూరుచున్న బహుమతంబులలోన సహన విద్య నేర్పు సాధకుండనీ, భార్య బిడ్డలున్న ప్రత్యక్ష దైవం’ అనీ ‘విశ్వసామరస్య విజ్ఞాన సంధాత’ అనీ బాపూ జీని ప్రస్తుతించారు. నిమ్న జాతుల కంటినీరంబు దుడిచి యాశ్వాసించు నిరుపేద బాంధవుడు అని కొనియాడారు. భారత స్వాతంత్య్ర దీప్తి సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులు ప్రదర్శించిన ధైర్యసాహసాలకు ముగ్ధుడై ‘బోసు చరిత్ర మద్భుతమైనది, ఆయన మహాత్యాగి, మహనీ యునకు కావ్య నమస్కారము చేయక నా చేతులూరు కొనక పోయినవి’ అని ‘నేతాజీ’ కావ్యాన్ని రచించారు. భారతవీరుడు శీర్షికన కర్ణుని గుణగణాలను శౌర్య ప్రతాపాలను వర్ణించారు. కర్ణుని పరాక్రమం, సత్యసంధత కవిని ముగ్ధుని చేశాయి. మనుషుల్లో పెరుగుతున్న అమానవీయ మౌఢ్యాలను ఖండిస్తూ ‘మనుజులార మాది ఘనమైన మతమని / ఒకడు తరిమి తరిమి ఉగ్గడించు పెక్కు మతములిట్లు పేచీలు సాగింప మార్గమేది’ అని మహాకవి జాషువ అన్ని మతాల వారినీ ప్రశ్నించారు. మతం కంటే మానవత్వమే గొప్ప దనీ, మానవత్వానికి మకుటధారణ చేయమన్నారు. కుల జాఢ్యాన్ని వదిలి మానవతకు పట్టం కట్టాలని కోరారు. భారత ఇతిహాస యుగం నుండి మొగలాయి యుగం వరకూ, స్వాతంత్య్రోద్యమం నుండి స్వాతంత్య్రానంతరం దేశంలో నెలకొన్న భిన్న సంఘర్షణల వరకూ జాషువ తన కవిత్వంలో బంధించారు. విశ్వమానవ లక్షణాలను పుణికి పుచ్చుకున్న జాషువ విశ్వకల్యాణానికై తన కవిత్వాన్ని ఆయుధంగా మలిచారు. జాషువ కవిత్వం నేటికినీ ప్రాసంగికతను కలిగి ఉందనటంలో అతిశయోక్తి లేదు. అనేక కష్టాలనూ, అవమానాలనూ ఎదుర్కొన్నప్పటికీ జాషువ మహాకవి మాత్రం భారతజాతి అభివృద్ధికి కులమతాలు లేని సమసమాజాన్ని కాంక్షించారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాసకర్త మాజీమంత్రి (నేటి నుండి 28 వరకూ గుంటూరులో ‘జాషువ జయంతి వారోత్సవాలు’) -
ఇల్లు చూపి ఇల్లాలిని చేసుకునే ఓ ‘పిట్ట’ కథ
ఆత్మకూరు రూరల్(నంద్యాల జిల్లా): అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే అన్నాడో కవి.. ఆమె ఓర చూపే మోక్ష మార్గం అని కూడా వర్ణించాడు. ప్రేయసి కోసం మనుషులు ఇలా కవిత్వాన్ని ఆశ్రయిస్తే.. ఓ పక్షి మాత్రం గూడుకట్టి తన గుండె స్పందనను తెలుపుతోంది. ప్రేమ కోసం తన అద్భుత నైపుణ్యాన్ని ప్రదరిస్తున్న అందరికీ తెలిసిన ‘పిట్ట’ కథ ఇదీ.. చదవండి: రెస్టారెంట్లో బిర్యానీ తింటున్నారా?.. అయితే మీకో చేదు వార్త ఏటి ఒడ్డునో, చెరువు గట్టునో ఈత, తుమ్మ వంటి చెట్ల చిటారు కొమ్మలకు వేలాడుతూ గిజిగాళ్లు నిర్మించిన గూళ్లు కనపడుతుంటాయి. వీటి నిర్మాణ శైలి అద్భుతంగా ఉంటుంది. ఈతనారను జాగ్రత్తగా సేకరించే మగ పక్షులు అద్భుతమైన నైపుణ్యంతో గూళ్లు నిర్మిస్తాయి. తమకు ప్రమాదకరమైన పాములు, కాకులు వంటి వాటి నుంచి రక్షించుకునేందుకు ఏటినీళ్ల పైన వేలాడే విధంగా, గట్టుపైన ఉండే చెట్ల కొమ్మలు నీటిపై వేలాడే చోట గూళ్లు కడతాయి. తిరగవేసిన కిరోసిన్ దీపం చిమ్నిలా ఈ గూళ్లలో ప్రత్యేకమైన గదులు, మెత్తటి పాన్పులాంటి నిర్మాణాలుంటాయి. నల్లమల అటవీ సమీప గ్రామాలు, పరిసర ప్రాంతాల్లో గిజిగాడి గూళ్లు విరివిగా కనిపిస్తుంటాయి. ప్రేమకోసం.. ఆంగ్లంలో వీవర్ బర్డ్‌గా ఈ పక్షిని పిలుస్తారు. ఆత్మకూరు పరిసర ప్రాంతాల ప్రజలు వీటిని పిట్టలుగానే గుర్తిస్తారు. మగపక్షి గూడును నిర్మించి ఆడపక్షిని ఆకర్షిస్తుంది. గూడు చూపి ఆడపక్షితో జతకట్టేందుకు ఆహ్వానిస్తుంది. ఇల్లును చూసి ఇల్లాలి నైజం గ్రహించ వచ్చని పెద్దలు చెబుతుంటారు. అయితే గిజిగాడి పక్షుల్లో మాత్రం ఇల్లాలి కోసం మగ పక్షి ఇల్లు(గూడు) కడుతుంది. సగం గూడు నిర్మించే మగ పక్షి అటు వెళ్లే ఆడపక్షులకు తన గూడును చూడరమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా గూటిపై వాలి రెక్కలల్లారుస్తూ కువకువలాడుతుంది. ఈ దృశ్యం చూడముచ్చటగా ఉంటుంది. గూడు నచ్చితే ఆడపక్షి మగపక్షితో జతకట్టేందుకు అంగీకరిస్తుంది. గూడు నచ్చక ఆడపక్షి ‘నో ’ చెబితే అసంపూర్ణ నిర్మాణాన్ని (గూడు) వదలి మరోచోట మరో గూడు కట్టేందుకు మగ పక్షి సిద్ధమవుతుంది. ఆడపక్షి గూడు నచ్చి అంగీకారం వ్యక్తపరచగానే మగపక్షి మిగిలిన గూడు నిర్మాణం పూర్తి చేస్తుంది. ఆడపక్షి గూటిలో గుడ్లు పెడితే వాటి సంరక్షణ మగపక్షి చూసుకుంటుంది. పిల్లలు గుడ్లనుంచి బయటికి రాగానే వాటి పోషణ భారం మాత్రం ఆడపక్షే మోస్తుంది. ఒక్కో ప్రదేశంలో గిజిగాళ్లు రెండు వందల వరకు సామూహికంగా గూళ్లు నిర్మించుకుని సామాజిక జీవనం గడుపుతాయి. శత్రువులు దాడి చేసినపుడు మూకుమ్మడిగా పెద్దగా అరుస్తూ తమ పిల్లలను, గూళ్లలోని గుడ్లను రక్షించుకునే ప్రయత్నం చేస్తాయి. గిజిగాడిపై ఖండకావ్యం గిజిగాళ్లు జీవిత కాలం 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇవి కీటకాలు, వివిధ రకాల విత్తనాలను తిని బతుకుతుంటాయి. ఎంత వర్షం వచ్చినా, సుడిగాలి వీచినా గూడు చెదరకుండా, తడవకుండా బలంగా నిర్మించుకుంటాయి. గిజిగాడి నైపుణ్యానికి మెచ్చి మహాకవి గుర్రం జాషువా ఖండ కావ్యాన్ని రచించారు. ‘‘తేలిక గడ్డి పోచలను దెచ్చి, రచించెదవీవు తూగుటు య్యేల గృహంబు’’ అంటూ తన పద్యంలో ‘‘బంగారువన్నెగల దుస్తులు ధరించి, నీ భార్యా పిల్లలు నీ పొదిగిట నిద్రిస్తుండగా, హాయిగా వీచే పిల్లగాలులు మీరున్న ఊయల గృహాన్ని ఊపుతూ ఉండగా, ఏమాత్రం భయంలేకుండా ప్రశాంతంగా నిద్రిస్తుంటావు. నీకున్న ఆ గొప్ప సుఖం మాకెక్కడుందిరా గిజిగా! అసలు మాకేమిటిరా.. ఏ మహరాజుకైనా అంతటి సుఖం ఉంటుందంటావా?’’ అంటూ ఆ గిజిగాని వైభవాన్ని కీర్తించారు. -
గుర్రం జాషువాకు సీఎం వైఎస్ జగన్ నివాళి
సాక్షి, అమరావతి: నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘన నివాళులర్పించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘‘కవిత్వమే ఆయుధంగా మూఢాచారాలపై తిరగబడ్డ ఆధునిక తెలుగు కవి శ్రీ గుర్రం జాషువా. వడగాల్పు నా జీవితం.. వెన్నెల నా సాహిత్యం అంటూ పేదరికం, వర్గ సంఘర్షణ, ఆర్థిక అసమానతలపై పోరాడిన అభ్యుదయ వాది జాషువా. మహాకవి జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను’’ అంటూ సీఎం ట్వీట్ చేశారు. కవిత్వమే ఆయుధంగా మూఢాచారాలపై తిరగబడ్డ ఆధునిక తెలుగు కవి శ్రీ గుర్రం జాషువా. వడగాల్పు నా జీవితం.. వెన్నెల నా సాహిత్యం అంటూ పేదరికం, వర్గ సంఘర్షణ, ఆర్థిక అసమానతలపై పోరాడిన అభ్యుదయ వాది జాషువా. మహాకవి జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) September 28, 2022 -
దళిత సాహిత్య కృషికి దక్కిన గౌరవం
మహాకవి ‘జాషువా కళా పీఠం’ ప్రతి సంవత్సరం జాషువా జయంతి వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రతిష్ఠాత్మక ‘జాషువా సాహితీ పురస్కారా’న్ని ప్రదానం చేస్తున్నారు. ఇప్పటివరకూ కొలకలూరి ఇనాక్, పాపినేని శివ శంకర్, ఎండ్లూరి సుధాకర్, ఆ తరు వాత ‘పడమటి గాలి’ నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు ఈ అవార్డును స్వీకరించారు. ఈ సంవత్సరం ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు జి. లక్ష్మీ నరసయ్య (ఎల్ఎన్)కు దీనిని ప్రదానం చేస్తున్నారు. రెండు దశాబ్దాలకు పైగా సాహిత్య విమర్శకునిగా, కవిగా, ఉపన్యాసకునిగా, సిద్ధాంత సమన్వయకర్తగా దళిత బహుజన సాహిత్య సమాజాన్ని చైతన్య పరుస్తున్నాడు ఎల్ఎన్. ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో 1995లో జి. లక్ష్మీనరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్ సంపాదకత్వంలో వచ్చిన ‘చిక్కనవుతున్న పాట’ కవితా సంకలనం ఒక పెను సంచలనం. తెలుగు సాహిత్య చరిత్ర ‘చిక్కనవుతున్న పాట’కు ముందు, తరువాత అన్నంతగా ఆ సంకలనం చరిత్ర సృష్టించింది. ఈ పుస్తకం ప్రేర ణతో అనేకమంది యువ కవులు కవిత్వం రాయడం మొదలుపెట్టారు. తాను అప్పట్లో ‘వరదయ్య’ పేరుతో కవిత్వం రాసేవాడు. దాదాపు అన్ని ప్రముఖ పత్రికలలో ప్రతి సోమవారం ‘సాహిత్య పేజీ’లో, ‘ఆదివారం అను బంధం’ పేజీలలో తాను కవిత్వం రాస్తూ, ఇతరుల కవిత్వాన్ని సమీక్షిస్తూ, ‘కవితా నిర్మాణ పద్ధతుల’ను తెలియజేస్తూ, సాహిత్య సమాజం, పరిశోధకులు, సాధారణ పాఠకులు... ‘ఈరోజు ఏ కవిత వస్తుంది, ఏ అంశంపై వ్యాసం వస్తుంద’ని ఎదురుచూసే ట్లుగా దళిత సాహిత్య పంటను పండించిన కృషీవలుడు లక్ష్మీనరసయ్య. ‘చిక్కనవుతున్న పాట’ దళిత ఉద్యమానికే దారి చూపే భూమికగా పదునెక్కాక, 1996లో ‘పదునెక్కిన పాట’ అనే పేరుతో మరో దళిత కవితా సంకలనాన్ని సహచర దళిత కవుల సంపాదకవర్గంతో కలిసి తీసుకు వచ్చారు. దళిత సాహిత్యానికి ‘అంబేడ్క రిజ’మే అంతిమ మార్గమనే స్పష్టమైన అవగాహనతో, దళిత స్త్రీవాద రచయిత్రులు రాసిన పదునైన కవితలు, ‘దండోరా’ ఉద్యమాన్ని స్వాగతిస్తూ వచ్చిన కవితలతో వచ్చిన ఈ పుస్తకం ఇది. సంకలనాలే కాకుండా ఎల్ఎన్ స్వయంగా ‘దళిత సాహిత్యం – తాత్విక దృక్పథం’, ‘ద ఎసెన్స్ ఆఫ్ దళిత్ పొయెట్రీ : ఎ సోషియో ఫిలసాఫిక్ స్టడీ’ గ్రంథాలనూ; కవిత్వం ఎలా రాయాలో చెప్పే ‘కవితా నిర్మాణ పద్ధతులు’, సాహిత్య విమర్శను తెలియ చెప్పే ‘సామాజిక కళా విమర్శ’నూ రాశారు. అలాగే ‘అస్తిత్వ ఉద్యమాల ఆది గురువు మహాత్మా జ్యోతిబాపూలే’ గ్రంథాన్నీ, ఎంతో చర్చకు కారణమైన ‘అంబేడ్కర్ తాత్వికుడు కాడా?’, ‘అంబేడ్కర్ అంటే ఏమిటి?’ వంటి వందలాది వ్యాసాలు రాశాడు. ప్రస్తుతం ‘కవి సంగమం’, ‘సారంగ’ లాంటి అంతర్జాల పత్రికలలోనూ విరివిగా రాస్తున్నారు. ‘కవిత్వం–చర్చనీయాంశాలు’ పుస్తకం ‘కవి సంగమం’లో వచ్చిన వ్యాసాల సంకలనమే. (క్లిక్ చేయండి: మనువును జయించిన విశ్వనరుడు) అగ్రవర్ణ కథానాయకులను తిరస్కరించి దళిత కథా నాయకుణ్ణి సాహిత్యానికి పరిచయం చేసినవాడు జాషువా. అగ్రవర్ణ సాహిత్యాన్ని తిరస్కరించి దళిత సాహిత్యాన్ని తెలుగు ప్రపంచంలో పాదుకొల్పినవాడు లక్ష్మీనరసయ్య. జాషువా అందమైన పద్యం రాస్తే, ఎల్ఎన్ ఆ పద్యాన్ని ఆర్ద్రతతో ఆలపిస్తాడు. పదునైన కవిత్వం రాస్తూ, నిబద్ధమైన విమర్శ చేస్తూ, సిద్ధాంతాన్ని ఉపన్యాసంగా మారుస్తూ జాషువా పద్యాన్ని అద్భుతంగా తన కంఠంతో ప్రచారం చేస్తున్నందుకుగానూ... ప్రస్తుత ఎమ్మెల్సీ, సాహితీ పోష కులు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఈ పురస్కారాన్ని’ ప్రదానం చేస్తున్నారు. ఈ అవార్డు ఎల్ఎన్ సాహితీ కృషికి దక్కిన గౌరవం మాత్రమే కాదు, దళిత సాహితీ ప్రపంచానికి దక్కిన గౌరవం. (క్లిక్ చేయండి: ప్రత్యామ్నాయ భావజాల దార్శనికుడు) - డాక్టర్ కాకాని సుధాకర్, కవి (జి. లక్ష్మీనరసయ్యకు జాషువా పురస్కార ప్రదానం) -
Gurram Jashuva: మనువును జయించిన విశ్వనరుడు
‘‘కులమతాలు గీచుకున్న గీతల జొచ్చి / పంజరాన గట్టువడను నేను నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు విశ్వనరుడ నేను’’ అంటూ విశ్వమానవతను ప్రకటించాడు తన కవిత్వం ద్వారా జాషువా మహాకవి. తాను నమ్మిన విలువల్ని, సిద్ధాంతాల్ని తన రచనల ద్వారా నిక్కచ్చిగా ప్రకటించాడు. తన సాహితీ ప్రస్థానంలో సామాజికంగా ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా వెనుదిరగలేదు. కులమతాల దాడులకు వెరవక తన ప్రస్థానాన్ని కొనసాగించాడు. ‘పలుకాకుల మూకలు అసూయ చేత నన్ను ఏవిధంగా దూషించిన నా సాహితీ సౌరభం మాయమై పోద’నీ, ‘నన్ను వరించిన శారద లేచి పోవునే’ అని అన్నాడు. ‘ప్రపంచం ఎట్లా నిర్ణయించిన నాకు కొదవలేదు నేను విశ్వనరుడను’ అని ప్రకటించాడు. కసరి బుసగొడుతున్న నాగరాజుల వైపు కవితా దివిటీలను విసిరాడు. కేవలం విశ్వమానవతను ప్రకటించడమే కాకుండా తన కవితా ప్రస్థానమంతటా జాగరూకుడై కవిత్వమై ప్రతి స్పందించాడు. జాతీయోద్యమ కాలంలో జాతి జనుల్లో భారతమాత గొప్పతనాన్ని చాటి చెప్పే అనేక విషయాలను తన కవిత్వంలో పొందుపరచాడు. సింధు గంగా నదులు జీవజల క్షీరాన్ని నిరంతరాయంగా ప్రవహింపజేస్తూ తమ సంతానాన్ని పోషించుకుంటున్నదని పచ్చి బాలింతరాలుగా కన్న దేశాన్ని కీర్తించాడు. తద్వారా ప్రజల్లో దేశభక్తిని పాదుకొల్పాడు. దేశాన్ని గతంలో పాలించిన రాజుల వైభవాన్నీ, తాత్విక మార్గదర్శకులుగా ఉండిన మహనీయుల గురించీ, విశ్వవిఖ్యాతి చెందిన వారి ఘనతను గురించీ ప్రజలకు కనువిప్పు కలిగించే విధంగా, జాతీయభావాలు ఉప్పొంగేలా కవిత్వం రాసిన పద్యాల పరుసవేది జాషువా. బుద్ధుని తాత్విక చింతనలోని సారాంశాన్ని వర్ణిస్తూ... ‘రెండు వేల ఐదువందల ఏళ్ళు గడిచినా నీ కమనీయ బోధలకు నిగ్గు రవ్వంత కూడ తగ్గలేదు’ అంటాడు. అశోకుని వంటి మహా చక్రవర్తుల గుండెలను సైతం బౌద్ధం పెళ్ళగించి అహింసా సిద్ధాంతం వైపు మళ్ళించిందని పేర్కొన్నాడు. మరో సందర్భంలో భారతీయ సంస్కృతీ ఔన్నత్యాన్ని విశ్వసభల్లో చాటిన మహనీయుడు స్వామి వివేకానంద గొప్పదనం గురించి ‘వివేకానంద’ అనే ఖండికలో వివరించాడు. పేదరికం, అవమానాలతో కుంగిపోక ధీరోదాత్తునిలా ఎదుర్కొని విశ్వనరుడి స్థాయికి ఎదిగాడు. నవయుగ కవి చక్రవర్తిగా కీర్తినొందాడు. తెలుగుదనాన్ని తన పద్యంలో జాలువార్చి స్వచ్ఛమైన తెలుగుభాషకు ప్రాణప్రతిష్ఠ చేశాడు. అటు సంప్రదాయ సాహిత్య సంస్కారాన్నీ, ఇటు ఆధుని కతనూ మేళవించి తన సాహిత్య ప్రస్థానాన్ని కొనసాగిం చాడు. కావుననే జాషువా పద్యం జానపదుల నాలుకలపై జీవించి వుంది. ఇంతటి ప్రాచుర్యం పొందిన కవి తెలుగు భాషలో అరుదని చెప్పొచ్చు. జాషువా సాహిత్యంలో భారత పురాణ పురుషులే గాక, ప్రపంచ శాంతికి సత్యం, అహింస వంటి ఆయుధాలను అందించిన గౌతమ బుద్ధుడు, అహింసామూర్తి గాంధీ, సామాజిక తత్వవేత్త అంబేడ్కర్ వంటి మహానీయులు అందరూ దర్శనమిస్తారు. బుద్ధుని బోధనల్లోని అహింసా తత్వాన్నీ, విశ్వమానవ ప్రేమనూ, ఏసుక్రీస్తు బోధనల్లోని శాంతి, కరుణ, సత్యం, సౌశీల్యాన్నీ ఆయన ప్రజల్లో దేశభక్తిని పాదుకొల్పేవిగా పేర్కొన్నాడు. ఆయన దృష్టిలో జాతీయత అంటే అన్ని మతాలు సహనంతో కలగలసి జీవించడం. ఏసుక్రీస్తు చెప్పినట్లు ‘నీవలే నీ పొరుగువారిని ప్రేమించడం’. సామాజిక సమానత, సంక్షేమం కోసం కవిత్వం రాశాడు. ‘కాందిశీకుడు’ రచనలో ‘కపాలం’ ద్వారా మాట్లాడుతూ సమాజంలోని అసమానతలు తొలగిపోయి విశ్వ సమానతా భావం, విశ్వ సోదరభావం పెంపొందినపుడే జాతీ యతా భావం ఆవిర్భావం జరుగుతుందని చెబుతాడు. నా జాతి నాయూరు నాదేశమని పొంగు స్వాభీ మానము శూన్యమయిన దాక విశ్వసౌభ్రాత్రంబు వెలయించునైక్య సం ఘావ్యాప్తిదిశల పెంపారు దాక... అంటాడు. మహాత్ముడి అకాల మరణానికి దిగ్భ్రాంతికి గురయిన జాషువా ‘బాపూజీ’ లఘు కావ్యాన్ని రచించాడు. గాంధీజీ అహింసా సిద్ధాంతాల పట్ల అత్యంత ప్రేమాదరణను కన బరచిన ఆయన ఈ కావ్యానికి ముందు మాటగా ‘వినతి’ని రాస్తూ ‘ప్రపంచ చరిత్రలో నెట్టివాడు నీయుగమున గడింపని కీర్తి నతడార్జించి, అనుంగు బిడ్డలగు భారతీయుల కంకిత మొనర్చినాడు. ప్రతిఫలముగా తనకు లభించినది బలవన్మరణము. భస్మస్వరూపము. అది తలంపరాని విషమ ఘడియ’. ‘నాడు రాలిన యశ్రు కణములే ఈ కావ్యము’ అంటాడు. బాపూజీ కావ్యంలో జాషువా హృదిలో ముద్రించుకున్న చిత్రం దృశ్యమానంగా కళ్ళకు కట్టి కనిపిస్తుంది. అహింసావాదిగా కరుణా మూర్తిగా, సంఘ సంస్కర్తగా, హిందూ ముస్లిం సమైక్యతావాదిగా గాంధీజీని చిత్రించాడు. గోచిపాత గట్టుకొని జాతి మానంబు నిలిపినట్టి ఖదరు నేతగాడు విశ్వసామరస్య విజ్ఞాన సంధాత కామిత ప్రదాత గాంధితాత’’ అంటాడు. గాంధీ సైద్ధాంతిక నిష్టను, నైతికతను మనఃపూర్వకంగా ఒప్పు కున్నాడు. ఆచరింప దగినవిగా భావించాడు. ఈ నేపథ్యంలో ఆయన ‘నివసించుటకొక నిలయము తప్ప గడన చేయుటకు ఆశపడను’ అన్నాడు. ‘ఆలు బిడ్డలకు ఆస్తి పాస్తులు గూర్చ పెడత్రోవలో కాలు పెట్టను’ అన్నాడు. ఈ నైతిక, సామాజిక నిష్ఠను గాంధీజీ దృక్పథం నుండి జాషువా గ్రహించాడు. ఆయన దృష్టిలో దేశభక్తి, విశ్వమానవత ప్రాధాన్యాలు. నిత్యం అనేక సామాజిక అవరోధాలను ఎదుర్కొన్నా, తాను మాత్రం జాతీయతా దృక్పథంతోనూ, విశ్వమానవ తత్పరతతోనూ రచనా వ్యాసంగాన్ని కొనసాగించాడు. మహాకవి దృష్టిలో దేశభక్తీ, విశ్వమానవతా రెండూ నాణేనికి రెండు వైపుల వంటివి. జీవించినంత కాలం ఈ సైద్ధాంతిక భూమికకు కట్టుబడే పనిచేశాడు. కాబట్టే బుద్ధుడు, మహాత్ముడు తనకు ఆరాధ్యులుగా భావించాడు. - డొక్కా మాణిక్యవరప్రసాద్ ఏపీ ప్రభుత్వ విప్, మాజీమంత్రి (జాషువా జయంతి వారోత్సవాలు నేటి నుంచి ఈ నెల 28 వరకు గుంటూరులో జరుగుతున్న సందర్భంగా) -
గుర్రం జాషువాకు సీఎం వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఘన నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘తన పదునైన కవిత్వం ద్వారా సమాజంలోని దురాచారాలను ప్రశ్నించి ఆలోచింపజేసిన కవి గుర్రం జాషువా గారు. అణగారిన ప్రజల ఆత్మగౌరవం కోసం పాటుబడిన నవయుగ కవి చక్రవర్తి ఆయన. తెలుగు వారికి ఎన్నో ఆణిముత్యాల్లాంటి రచనలను అందించిన జాషువా గారి జయంతి సందర్భంగా ఘన నివాళి’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. తన పదునైన కవిత్వం ద్వారా సమాజంలోని దురాచారాలను ప్రశ్నించి ఆలోచింపజేసిన కవి గుర్రం జాషువా గారు. అణగారిన ప్రజల ఆత్మగౌరవం కోసం పాటుబడిన నవయుగ కవి చక్రవర్తి ఆయన. తెలుగు వారికి ఎన్నో ఆణిముత్యాల్లాంటి రచనలను అందించిన జాషువా గారి జయంతి సందర్భంగా ఘన నివాళి. — YS Jagan Mohan Reddy (@ysjagan) September 28, 2021 చదవండి: క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్ -
ఆయన... కాలం చెల్లని కవి
తెలుగు సమాజంలో జాషువా ప్రాసంగికత కాలం నడుస్తున్న కొలదీ పెరుగుతోంది. ఆయన మరణించి యాభై ఏళ్ళు గడచినా ఆయన కవిత్వం మన సమాజంతో సజీవ సంబంధం కలిగి ఉంది. 1895 సెప్టెంబర్ 28న అంటే 126 ఏళ్ళ క్రితం పుట్టిన జాషువా 1971లో మరణించారు. ఆయన 76 ఏళ్ళు జీవించారు. ఈ జీవిత కాలంలో 1917 నుండి 1966 దాకా విభిన్న రచనలు చేశారు. కొన్ని పౌరాణిక రచనలు మినహాయిస్తే, ఆయన రచించిన సాంఘిక కావ్యాలు ఈనాటికీ తెలుగు సమాజంతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. గుర్రం జాషువా ఏయే సామాజిక రుగ్మతల్ని తన కవిత్వంలో విమర్శకు పెట్టారో, అవి ఇప్పుడు కూడా యథాతథంగాగానీ, రూపం మార్చుకొనిగానీ కొనసాగుతూనే ఉన్నాయి. ఆయనకు ఒక అందమైన భారతదేశ సామాజిక స్వప్నం ఉంది. ఆ కల ఇంకా సాకారం కాలేదు. ఆ అందమైన భారతీయ సమాజం ఆవిర్భవించేదాకా ఆయన కవిత్వానికి సామాజిక ప్రాసంగికత ఉంటుంది. వలసపాలన ముగిసిన వెంటనే ‘అచ్చముగ భారతీయుడనైతి నేడు’ అని ఎగిరి గంతేసిన కవి జాషువా. సాంఘికంగా వివక్షలు, ఆర్థికంగా అసమానత, రాజకీయంగా అవినీతి, సాంస్కృతికంగా మౌఢ్యం లేని కొత్త భారతదేశం జాషువా స్వప్నం. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచీ ఆయన సమాజంలో రావలసిన మార్పులను గుర్తుచేస్తూ వచ్చారు. తన స్వప్నం సాకారం కావడానికి ఏయే సామాంజి కాంశాలు అడ్డుపడుతున్నాయో వాటినన్నిటినీ విమర్శిం చారు జాషువా. 1932 నాటి ‘పిరదౌసి’ కావ్యం నుండే ఆయన శ్రమదోపిడీని విమర్శించారు. 1934 నాటి ‘అనాథ’ కావ్యం నుండే స్త్రీ శక్తిని కీర్తించారు. ఆధిపత్యం, అసమానత, అవినీతి, మౌఢ్యం ఈ నాల్గింటిని ప్రజలకు శత్రువులుగా భావించిన జాషువా, అవి లేని భారతదేశం నిర్మాణం కావాలని ఆకాంక్షించారు. అయితే, స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు గడచిపోతున్నా అవి కొనసాగుతూనే ఉన్నాయి. అందువల్ల ఆయన ఈనాటికీ మనకు కావలసిన కవి. సాంఘిక నిరంకుశత్వానికి భౌతిక రూపమైన కులవ్యవస్థను, దాని వికృతచేష్ట అయిన అస్పృశ్యతను జాషువా తీవ్రంగా విమర్శించారు. అస్పృశ్యతా నిర్మూలనకు అనేక సందర్భాలలో పిలుపునిచ్చారు. ‘అనాథ’, ‘గబ్బిలం’ వంటి అనేక కావ్యాలలో తన దళిత వేదనను ఆగ్రహం గానూ, ఆర్ద్రతతోనూ వినిపించారు. ‘కుల భేద పిశాచి’ అని కులవ్యవస్థను నిర్వచించారు. దళితకులంలో పుట్టినకవిగా తన అనుభవాలను కవితలుగా మలిచారు. ‘కసరిబుసకొట్టు నాతని గాలిసోకనాల్గుపడగల హైందవ నాగరాజు’ అన్న వాక్యం జాషువా కులనిరసనలలో అగ్రగామి. ‘చెండింపుమస్పృశ్యతన్’ అని ఒక చోట, ‘కారుణ్యంబున నంటరాని తనమును ఖండింపవా?’ అని మరోచోట ఇలా అనేక పర్యాయాలు విజ్ఞప్తి చేశారు. సాంఘిక వివక్ష, కులనిరంకుశత్వం లేని వ్యవస్థను కోరుకొన్న జాషువ ఈనాటికీ సామాజిక అవసరమే. కాలం ఎంతమారుతున్నా, దళితులు చదువుకొని, చైతన్యవంతులవుతున్నా వాళ్ల పట్ల వివక్ష మాత్రం తగ్గవలసినంతగా తగ్గలేదు. అందుకే ఆయన కాలంచెల్లిన కవి కాదు. అభ్యుదయ సాహిత్యం మొదలవుతున్నప్పుడే జాషువా ఇతర మార్క్సిస్టు కవులలాగే మన సమాజంలోని వర్గ వైరుధ్యాలను గుర్తించారు. సంపద అందరిదీ కావాలని, శ్రమదోపిడీ నశించాలని కోరుకున్నారు. దళితులు శ్రమదోపిడీకి గురికావడాన్ని నిరసించారు. వాని రెక్కలకష్టంబు లేనినాడు / సస్యరమ పండి పులకింప సంశయించు / వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు / భోజనము బెట్టు, వానికి భుక్తి లేదు (గబ్బిలం) అంటూ దళిత శ్రామికుల శ్రమ పరాయీకరింపబడటాన్ని జాషువా అధిక్షేపించారు. ‘ఒక ప్రాణి కొక ప్రాణి యోగిరంబ’య్యే వ్యవస్థను నిరసించి, మానవీయ భారతదేశం ఆవిర్భవించాలని జాషువా ఆకాంక్షించారు. ఇప్పుడు దేశంలో ఎంతో మార్పు వచ్చినా అధిక సంఖ్యాకుల శ్రమ మాత్రం దోపిడీకి గురౌతూనే ఉంది. శ్రమ దోపిడి నశించేదాకా జాషువా మనల్ని హెచ్చరిస్తూనే ఉంటారు. ఆయన గాంధీజీ అడుగుజాడలలో నడిచిన రాజకీయ కవి. ‘గబ్బిలం’, ‘బాపూజీ’ వంటి కావ్యాలలో జాషువా తన రాజకీయ దృక్పథాన్ని చాటి చెప్పారు. అయితే స్వాతంత్య్రానంతర రాజకీయాలలో ఆడంబరాలు పెరిగిపోవడం, ఆర్థిక అవినీతి పెచ్చరిల్లడం, ఎన్నికలలో ధనప్రాబల్యం ప్రవేశిం చడం వంటి అనేక దుష్పరిణామాల మీద జాషువా కవితాగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం రాగానే దేశం పూర్తిగా మారిపోతుందని కవి ఆశించారు. ఒక ఏడాది గడచినా మార్పు కనిపించలేదు. మొదటి సార్వత్రిక ఎన్నికలలోనే ధనం పాత్రను గుర్తించి ఆనాడే ప్రజలను హెచ్చరించారు జాషువ. ఇప్పుడు ఈ ధనప్రధాన ఎన్నికల రంగం బాగా బలిసిపోయింది. మతం పేరు మీద మౌఢ్యం రాజ్యమేలడాన్ని ఆయన వ్యతిరేకించారు. మతం కన్నా మనిషి ప్రధానమని భావిం చారు. నరుని కష్టపెట్టి నారాయణుని కొలిచే వింత సంస్కృతిని ప్రశ్నించారు. పెండ్లిండ్లకు, విగ్రహాలకు విపరీతంగా ధనం ఖర్చుపెడుతూ ప్రజలు ఆకలితో మాడుతుంటే పట్టిం చుకోని అమానుషత్వాన్ని నిలదీశారు. అంటువ్యాధులు వచ్చినపుడు ప్రతిమలను పూజించడం ‘ముతక తెలివి’ అన్నారు. కందుకూరి, గురజాడల నుండి అనేకమంది తెలుగు ప్రజా రచయితలు సమాజ పునర్నిర్మాణానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో గుర్రం జాషువా ఒక్కరు. మరణించి 50 ఏళ్ళు ముగిసినా ఆయన కవిత్వం ఇప్పటికీ తాజాగానే ఉంది. ఈ సందర్భంలో ఆయన కవిత్వాన్ని సమకాలీన దృక్పథంతో అధ్యయనం చేసి, పునర్మూల్యాంకనం చేయడం ఇప్పుడు చేయవలసిన పని. ఇదే ఆ మహాకవికి అసలైన నివాళి. ‘కులమతాలు గీచుకున్న గీతలజొచ్చి/పంజరాన కట్టువడను నేను /లోకనిఖిలమెట్ల నిర్ణయించిన నాకు/తరుగులేదు విశ్వనరుడ నేను’ (నేడు గుర్రం జాషువా 126వ జయంతి) రాచపాళెం చంద్రశేఖరరెడ్డి వ్యాసకర్త ప్రముఖ సాహితీ విమర్శకులు -
నవ కవితా యుగ ప్రవర్తకుడు
మహాకవి జాషువా ఆధునిక కవితా యుగ ప్రవర్తకుడు. కవిత్వంలో నూత్నప్రత్యామ్నాయ ఆవిష్కరణలు చేసిన ప్రయోక్త. సామాజిక జీవితం లోని వైవిధ్యాలకు అద్దం పట్టిన చిత్ర కారుడు. అస్పృశ్యతా భారతంలోని వేదనను అక్షరదృశ్యాలు చేసి, ఆకాశ నక్షత్రాలుగా వెలిగించిన సృష్టికర్త. గతించి అర్ధ శతాబ్ది అయినా కవికి మరణం లేదని నిరూపించిన పునరుజ్జీవుడు. వస్తువు ఏదైనా శృతిహితంగా తెలుగు నుడికారపు సొగసుతో చెప్పగలిగిన ధీశాలి. ‘రాజు మరణించె ఒక తార రాలిపోయే. సుకవి మర ణించె ఒక తార గగనమెక్కే’; ‘రాజు జీవించు రాతి విగ్రహ ములయందు. సుకవి జీవించు ప్రజల నాల్కలయందు’ అని చెప్పిన జాషువా ప్రజల నాల్కల మీద నర్తిస్తున్నాడు. ఆయన రచించిన ‘గబ్బిలం’ నాకు లండన్ మ్యూజియం లైబ్రరీలో సాక్షాత్కరించింది. వినుకొండ నుండి గుంటూరుకు, గుంటూరు నుండి ఢిల్లీకి, ఢిల్లీ నుండి లండన్‌కు ఎగబాకిన విశ్వకవి జాషువా. ‘గబ్బిలం’ తెలుగు సాహిత్యంలోని పంచకావ్యాలకు ప్రత్యామ్నాయ కావ్యంగా మలచబడింది. ‘చిక్కిన కాసుచే తనివి చెందు అమాయ కుడు’ ఆయన నాయకుడు. గబ్బిలం అనే నామకరణం ద్వారా అస్పృశ్య జీవుని గురించే కాదు, అస్పృశ్యమైన పక్షుల గురించి కూడా ఆయన గానం చేశాడు. ఆయన కవితా ఖండి కల్లో ‘శ్మశానవాటిక’ అద్భుతమైంది. అందులో దళిత తాత్త్విక వాదాన్ని ప్రవేశపెట్టాడు. ‘ఏలే బుగ్గల సౌరు రూపరి యెనో యేముద్దు నిద్రించేనో! యేలీలావతి గర్భ గోళమున వహ్నిజ్వాల జీవించెనో’ అంటూ సాగిన కవితలో దళితవాడ తత్త్వం ఉంది. ఒక గాఢమైన సామాజిక ప్రపంచం ఉంది. జాషువా కవితలో ఒక సత్యం కళతో మమేకమై ఉంటుంది. ‘ఎన్నో యేండ్లు గతించి పోయినవి గానీ’; ‘కన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొక్కడైనన్ లేచిరాడు; ‘ఎన్నాళ్లీ చల నంబు లేని శయనంబు’; ‘ఏ తల్లులల్లాడిరో’; ‘కన్నీ టంబడి క్రాగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్’; పద్యాన్ని వేదనా ప్రకటనకు, జ్వలిత చైతన్య విస్ఫోటనకు, సమస మాజ నిర్మాణోద్యమ సారథ్యానికి ప్రబలవాహికగా మలుచు కున్న క్రాంతదర్శి జాషువా అనుటలో అత్యుక్తి లేదు. ‘చల నంబులేని శయనంబు’ వంటి చిన్నచిన్న పదబంధాలు గుండెను తొలిచివేస్తాయి. మానవ వాక్కులకందతగిన ఆనం దకరమైనట్టియు, రసస్ఫోరకమైనట్టి, నిర్దుష్టమైనట్టి రచనా శిల్పమే కవిత్వం అన్న ఆంగ్ల విమర్శకుని వ్యాఖ్యానంలోని శిల్పం జాషువా కవిత్వంలో భాసిస్తుంది. కరుణరసప్లావి తమైనపుడు ఏమాత్రం హృదయ స్పందన ఉన్నవాణ్ణి కూడా అంతర్ముఖుణ్ణి చేయగల శక్తి ఆయన కవితకున్నది. జాషువా కవిత్వంలో కులతత్వ నిరసన ప్రధానాంశం. ఆయన ముందు ప్రకృతిని పరిశీలించారు. అందులో అసమానతలు లేవు. మనుషుల్లో అసమానతలు ఎక్కువ. ఇవన్నీ కల్పించుకున్నవే. కొందరు కేవలం ప్రకృతి కవులు. మరికొందరు ప్రకృతి ఆరాధకులు. ప్రకృతిలో ఉన్న సహజ జీవిత గుణాలను మానవులకు ఉత్తేజంగొల్పే దిశగా వర్ణించడం ఉన్నత కవుల లక్షణం. ఆ ఔన్నత్యమే జాషు వాను మహాకవిని చేసింది. ‘ముసలివాడైన బ్రహ్మకు బుట్టి నారు నలువురు కుమారులనుట విన్నాము గాని, పసర మున కన్న హీనుడభాగ్యుడైన ఐదవ కులస్థుడె వ్వరమ్మా! సావిత్రీ?’ ఈ మాటలు కలంలోనుంచి వచ్చినవి గానీ, గళంలోనుంచి జారినవి గానీ కాదు; ఇవి గుండె రాపిడిలో నుంచి లేచిన నిప్పురవ్వలు. ‘అసమ సమాజం బాకులు గుమ్మినపుడు, అంటరానితనం నిషాగ్నులు చిమ్మిన పుడు, దుర్భర దారిద్య్రం వెన్నుడికినపుడు, దురంత వేదన గుండె లలో తుక తుక ఉడికినపుడు’ పెల్లుబికిన ప్రశ్నల వెల్లువ. భారతమ్మోరిని, భారతీయుల్ని నిలదీసి అడుగు తుంది జాషువా కవిత. ఆయన నిజజీవితంలో కూడా కరుణార్ద్ర హృదయుడు. కుక్కలను ఎంతో ఇష్టంగా పెంచేవారు. పక్షులకు గింజలేసి ఆదరించేవారు. ఆయన నివసించిన వినుకొండ రామణీ యకమైన ప్రదేశం. ఒక పక్క కొండ, మరో పక్క నది, ఇంకో పక్క అడవి, మరో పక్క ఊరు–వాడ. ఆ ప్రదేశాన్ని చూసిన ప్పుడే కవిత్వమొస్తుంది. తండ్రి వీరయ్య యాదవులు. తల్లి లింగమాంబ దళిత స్త్రీ. తలిదండ్రులిద్దరూ వర్ణాంతర వివా హాన్ని ఆ రోజుల్లోనే ధైర్యంగా చేసుకున్నారు. తండ్రి క్రైస్తవ ఫాదర్. తల్లి ప్రేమమూర్తి. తండ్రిలోని గొల్ల సుద్దుల శ్రుతి వచ్చింది. బైబిల్లోని శాంతి, కరుణ, ప్రేమ కవిత్వంలో ప్రవ హించింది. వీరి ‘క్రీస్తుచరిత్ర’కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. వీరి కావ్యాల్లో ‘ఫిరదౌసి’ అత్యుత్తమ మైనది. మోసపోయిన కవి ఆవేదనను దిక్కులు పిక్కటిల్లేలా చెప్పారు. జాషువా మతమౌఢ్యాన్ని నిరసించారు. ‘వాని రెక్కల కష్టంబు లేనినాడు సస్యరమ పండి పులకింప సంశ యించు’; ‘వారు చెమ్మటలలోడ్చి ప్రపంచమునకు భోజనం బెట్టు వానికి భుక్తి లేదు’ అని సామాజిక ఆర్థిక దోపిడీని ఎలుగెత్తి చాటారు. పగటి దివిటీలతో ఆయన్ని ఊరేగిం చారు. పద్మశ్రీ, పద్మ భూషణ్ వరించాయి. నవయుగ కవి చక్రవర్తిగా కీర్తించ బడ్డారు. శ్రీనాథుడిలా కవిసార్వభౌ ముడు. వేమనలా కవితా సందేశం, తిక్కనలా తెలుగు నుడికారపు విన్నాణవ్ు చాటారు. దళితులకు ఆత్మగౌరవం, ఆత్మ సై్థర్యం నేర్పారు. భారత దేశ సృష్టికర్తలుగా వారిని పేర్కొన్నారు. ఆధునిక దళిత కవితా యుగాన్ని సృష్టించారు. శత్రువుల్ని కూడా ఆశ్చర్య చకితుల్ని చేశారు. తన కూతురు హేమలతను సంస్కర్త అయిన గోరా కుమారుడు లవణంకు ఇచ్చి పెళ్లి చేసి విశ్వజ నీనతను చాటాడు. ‘ముంతాజ్ మహల్’, ‘కాందిశీకులు’, ‘బాపూజీ’, ‘నేతాజీ’ వంటి అనేక కావ్యాలు తెలుగు భాషకు సమర్పించాడు. ‘సాలీడు’, ‘గిజిగాడు’ వంటి ఎన్నో కావ్య చిత్రాలు గీశారు. శిశువు, శ్మశానవాటిక వంటి అమేయమైన కవితా ఖండికలు ఒక్కొక్క కావ్యంతో సమానం.‘వాక్యం రసాత్మకం కావ్యం’ అనేది జాషువాలోనే చూస్తాము. జాతీ యత, మానవత, నవ్యత, శ్రవ్యత, సమత, మమత వంటి అనేక గుణాల శిల్పమే మహాకవి జాషువా. ఆయన పేరు మీద ఒక గొప్ప కళాక్షేత్రాన్ని నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రతి మండలంలో జాషువా సాహితీ గ్రంథాలయాలు నిర్మించి ఆయన రచనలను 6వ తరగతి నుండి ఎంఏ వరకు పాఠ్యగ్రంథాలుగా పెట్టి ఆయన కవితా జీవనవ్యవస్థకు ప్రతిష్ట కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వా లకు ఉంది. ఈ 50వ వర్ధంతిని ఆయన ప్రజ్వలిత కవితా జీవన మార్గంగా భావిద్దాం. ఆ స్ఫూర్తితో పయనిద్దాం. వ్యాసకర్త ఐసీఎస్ఎస్ఆర్ సీనియర్ రీసెర్చ్ ఫెలో (నేడు గుర్రం జాషువా 50వ వర్ధంతి) -
ఘనంగా జాషువా జయంతి వేడుకలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో 125వ గుర్రం జాషువా జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. జాషువా విగ్రహానికి పూలమాల వేసి మంత్రి ఆదిమూలపు సురేష్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు మెరుగు నాగార్జున, సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు, మద్యపాన నిషేధ కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు. ప్రతిపక్షాలు కులరాజకీయాలు చేస్తున్నాయి ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. 'గుంటూరులో గుర్రం జాషువా కళాప్రాంగణం ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే జాషువా కళా ప్రాంగణ నిర్మాణాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సమాజ హితం కోసం జాషువా ఎన్నో రచనలు చేశారు. జాషువా సమాధిని స్మృతి వనంగా అభివృద్ధి చేస్తాం.జాషువా ఆలోచనలకు అనుగుణంగా సీఎం జగన్ దళితుల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రతిపక్షాలు కులాలను అడ్డుపెట్టుకోని రాజకీయాలు చేస్తున్నాయి' అని పేర్కొన్నారు. దళితులపై దాడులు అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని మంత్రి తిప్పికొట్టారు. తమది దళితులను గౌరవించే ప్రభుత్వం అని పేర్కొన్నారు. గత 14 ఏళ్లలో చంద్రబాబు ఎలా దాడులు చేశారో అందరికీ తెలుసునన్నారు. దళిత సమాజికి వర్గానికి పెద్దపీట వేస్తూ సుచరితకు హోం మంత్రి పదవి ఇచ్చిన ప్రభుత్వం తమదని, దళితుల అభ్యున్నతికి, సమనత్వానికి వైఎస్ జగన్ పెద్ద పీట వేస్తున్నారని అన్నారు. నవ సమాజంలో అణగారిన వర్గాలు ఏ విధంగా చైతన్యం కావాలో తెలిపిన వ్యక్తి జాషువా అని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ అన్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గాలు ఓటు బ్యాంకుకే పరిమితం కాకూడదని సీఎం జగన్ పోరాడుతున్నారని తెలిపారు. దళితులపై దాడులు అంటూ ప్రతిపక్షాలు కొత్త రాజకీయం తెర మీదకు తెస్తున్నారని, వారి కుల రాజకీయాలు చెల్లవని వ్యాఖ్యానించారు. (బాబు ప్రయోజనాల కోసమే రౌండ్‌టేబుల్ సమావేశం) -
ప్రత్యామ్నాయ కవిత్వం.. పరిపూర్ణ కవిత్వం
జాషువా 125వ జయంతిని కరోనా కాలంలో జరుపుకుంటున్నాం. ఇదొక అనుభవం. ఇన్నేళ్ళుగా ఆయన కవిత్వం ‘ప్రజల నాల్కల యందు’ జీవిస్తూనే ఉంది. తరం తరువాత తరం మీద పరిమితులు లేని ప్రభావాన్ని వేస్తూనే ఉంది. జాషువా కేవలం గొప్ప భావాల్ని మాత్రమే వ్యక్తం చేసి ఊరుకోలేదు. అవి ప్రజల నాల్కల మీద ఆడే రీతిలో రాశాడు. తనకాలంలో వస్తున్న కవిత్వానికి ప్రత్యామ్నాయ కవిత్వాన్ని రాసి మెప్పించినవాడు జాషువా. తన కవితా ప్రస్థానంలో ఎన్ని అడ్డంకులూ, అవమానాలూ ఎదుర్కొన్నాడో అన్ని నీరాజనాలూ అందుకున్నాడు. తాను రంగంలోకి దిగేసరికి తెలుగు కవిత్వంలో మూడు ధోరణులు ప్రధానంగా నడుస్తున్నాయి. కృష్ణశాస్త్రి, రాయప్రోలు నాయకత్వంలో భావకవిత్వం ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. విశ్వనాథ సత్యనారాయణ నాయకత్వంలో హిందూ సనాతన కవిత్వం మరోపక్క సవ్వడి చేస్తోంది. శ్రీశ్రీ నాయకత్వంలో అభ్యుదయ కవిత్వమూ ఉద్యమంలా వస్తో్తంది. ఈ మూడు ధోరణులకు భిన్నంగా రాస్తూ ప్రత్యామ్నాయ కవిత్వాన్ని సృష్టించాడు జాషువా. ప్రేమనూ, విరహాన్నీ ఊహించి విలపించే భావకవిత్వం వాస్తవానికి దూరంగా ఉందని విమర్శించాడు. విశ్వనాథ సనాతన హిందూ ధర్మాన్నీ ఎండగట్టాడు. ‘ప్రణయ కవి యొకండు, పాషాణ కవి యొక్కడు’ అని పై రెండు ధోరణుల కవుల్ని అధిక్షేపించాడు. ‘నేనాచరించని నీతులు బోధించి/ రాని రాగము తీయగలేను నేను’ అంటూ అభ్యుదయ కవుల మీదా చురకలు వేశాడు. తన కాలపు కుల, మత వాస్తవికతనూ, అంటరానితనాన్నీ, అంధవిశ్వాసాలనూ, పేదరికాన్నీ, దోపిడీనీ, స్త్రీల పీడననీ శక్తిమంతమైన కవిత్వంగా మలిచాడు. ప్రకృతి మీదా, పిల్లల మీదా, ప్రేమా, కరుణల వంటి విలువల మీదా, కళల మీదా, మానవ అశాశ్వతత్వం మీదా, మరణం మీదా– ఇలా విభిన్న అంశాల మీద వైవిధ్యపూరితమైన కవిత్వం రాశాడు. వివిధ తరహాల పాఠకులు కనెక్ట్ కాగలిగే వస్తు విస్తృతి జాషువాది. విభిన్నత నుంచి విశ్వజనీనతను చేరుకున్న కవిత్వం రాయడం ద్వారా ‘విశ్వ నరుడ్ని నేను’ అని సగర్వంగా ప్రకటించుకోగలిగాడు. ‘గబ్బిలం’, ‘పిరదౌసి’, ‘అనాథ’, ‘నేతాజీ’, ‘క్రీస్తు చరిత్ర’ ‘ముసాఫరులు’తో సహా 38 కవిత్వ గ్రంథాలను అందించాడు. ఇవి కాక వ్యాసాలూ, జాబులూ తదితర రచనలూ చేశాడు. ఒకపక్క రాయప్రోలు ‘పొగడరా నీదు తల్లి భూమి భారతిని /నిలపరా నీ జాతి నిండు గౌరవము’అని దేశభక్తిని గానం చేస్తుంటే జాషువా ఈ దేశాన్ని విమర్శించాడు. కులవ్యవస్థతో పంచముల్ని పీక్కుతినే ఈ దేశం భయంకరమైనదని అన్నాడు: ‘ఇది భయంకర దేశము వర్ణభేదముల్ గూడలు గట్టినవనరాదు పంచమ జాతివారికిన్ కూడు హుళక్కి, మానవత గూడ హుళక్కి, హుళక్కి జన్మమున్’. నిచ్చెనమెట్ల కుల సమాజంతో మనుషుల్ని ఎక్కువ తక్కువలుగా విభజించి, పంచములకు ఆహారాన్నీ, ఆత్మగౌరవాన్నీ, మనిషితనాన్నీ నిరాకరించిన ఈ దేశం భయంకరమైనదని బాధతో ధర్మాగ్రహాన్ని వెలిబుచ్చాడు. ‘లేదురా ఇటువంటి భూమి ఎందులేదురా/మనవంటి పౌరులింకెందు సూర్యుని వెలుతురుల్ సోకునందాక’, అని ఈనేలనూ, ప్రజల్నీ వైభవీకరించటాన్ని జాషువా తప్పు పట్టాడు. ఈ భూమి నీచమైనదనీ, ఈ పౌరులు కులోన్మాదులై దళితుల శ్రమను దోచుకునేవారనీ రాశాడు. ‘నేను చిందులాడి నేను డప్పులు గొట్టి యలసి సొలసి సత్తి కొలువు గొలువ ఫలితమెల్ల నొరులు భాగించుకొనిపోవు నీచమైన భూమి జూచినావె?’ అని అందుకే నిలదీశాడు. దళితుల గురించి దేశమూ, దళితేతరులూ ఏమనుకుంటున్నారనేది కాదు, దేశాన్ని గురించీ, తమను నిత్యం పీడిస్తున్న కులాల పౌరుల గురించీ దళితులు ఏమనుకుంటున్నారనేది ఇక్కడ ముఖ్యంగా వ్యక్తం చేశాడు కవి. అందుకే ఈయన దృక్కోణం ప్రత్యామ్నాయ దృక్కోణమయ్యింది. ఈ వ్యవస్థ గురించి సంప్రదాయ కవులూ, మేధావులూ, నాయకులూ అల్లిన పవిత్ర భ్రమల్నీ, కట్టుకథల్నీ భగ్నంచేసి వాటి వెనకవున్న నిజాల్ని వెల్లడిచేయటంలోనే జాషువా ప్రత్యామ్నాయ దృక్కోణం ఉంది. విశ్వనాథ సత్యనారాయణ ‘వేయిపడగలు’ పేరుతో హిందూమతాన్ని వైభవీకరిస్తే, జాషువా దానికున్న కుల స్వభావాన్ని బయటపెట్టాడు. దళితుల్ని అంటరాని వాళ్లుగా కసరి కొడుతూ ఆకలితో అలమటింపజేసిన హైందవ సంస్కృతిని గాఢమైన కవితాభివ్యక్తిలో పట్టుకున్నాడు: ‘ఆ అభాగ్యుని రక్తమునాహరించి ఇనుపగజ్జలతల్లి నర్తనము చేయు కసరి బుసకొట్టు నాతని గాలిసోక నాల్గు పడగల హైందవ నాగరాజు’ మనిషిని పశువుకన్నా హీనంగా జూసిన, చూస్తున్న చరిత్రను ఇంతకన్నా బలంగా ఎవరు చెప్పగలరు! శ్రమ గురించీ, దోపిడీ గురించీ, అసమానతల గురించీ రాసినప్పటికీ, శ్రీశ్రీ వాటి ముఖ కవళికల గురించీ, నిర్దిష్ట రూపురేఖల గురించీ రాయలేదు. ఆ పని జాషువా చేశాడు. ఈదేశ వర్గ దోపిడీ కుల పెత్తనంలో భాగంగా ఉందీ, ఇక్కడ వర్గాలు కులాలలో మనుగడ సాగిస్తున్నాయనే అంబేడ్కరిస్టు అవగాహనను జాషువా సమర్థంగా పలికించాడు. ‘వాని రెక్కల కష్టంబు లేనినాడు సస్య రమ పండి పులకింప సంశయించు వాడు చెమటోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భుక్తి లేదు’ అని ఈ దేశంలో దోపిడీ యొక్క నిర్దిష్ట రూపాన్ని స్పష్టంగా పట్టుకున్నాడు. ‘కర్మ సిద్ధాంతమున నోరు కట్టివేసి/స్వార్థలోలురు నా భుక్తి ననుభవింత్రు’ అని దళితుడి చేత చెప్పించాడు. కులవ్యవస్థ కారణంగా దేశాన్ని విమర్శించినప్పటికీ, తన దేశప్రేమను జాషువా దాచుకోలేదు. బుద్ధుడినీ, గాంధీనీ, అంబేడ్కర్నూ ప్రేమిస్తూ పద్యాలు రాశాడు. నేతాజీ, శివాజీల మీద కావ్యాలు రాశాడు. దేశ స్వాతంత్య్ర అవసరాన్ని ఆకాంక్షించాడు. ‘స్వీయ రథము’ వస్తుంది కనుక వెరపు వలదని తన జనానికి ధైర్యం చెప్పాడు. దళితుల్ని అగ్రకులస్తులు పీడించటాన్ని విమర్శించి ఊరుకోకుండా దళితుల్లో సఖ్యత లేనితనాన్ని కూడా ఎద్దేవా చేశాడు. ‘వాని గుడిసె మీద వాలిన కాకి నా గుడిసె మీద వాలగూడదెప్పుడు కాకులందు మాలకాకి మాదిగ కాకి రూఢిసేయు మా విరోధములను’ అంటూ మాలమాదిగల విభేదాల్ని బయటపెట్టాడు. ‘దేవుడొక్కడు మాకు దేవళంబులు రెండు/ దేశమొకటి మాకు తెగలు రెండు’ అంటూ విమర్శించాడు. స్వతంత్ర భారతం దళితులకు రాజ్యాధికార భాగాన్ని తీసుకువస్తుందని విశ్వాసం వెలిబుచ్చాడు. ‘వెరపు వలదు నీకు హరిజన సోదరా స్వీయ రథము వెడలి వచ్చె లాగికొమ్ము నీకు భాగంబు కలదంచు పాడుచుండె రత్న భరతమాత’ ఇలా ఈనాటి దళిత రాజ్యాధికార భావనను ఆనాడు పలికించాడు. తన తరవాత రాబోయే దళిత కవులకు మార్గం చూపాడు. కులమతాల విమర్శతోనూ వేదనతోనూ ఆగిపోకుండా స్త్రీల పీడననూ ఎత్తిచూపాడు. స్త్రీలకు ‘ఎదిరింప జాలని చిలుకల చదువు నేర్పి’ బానిసలుగా పడుండే స్థితిని తెచ్చిన పురుష స్వామ్యాన్ని గట్టిగా ఎండగట్టాడు. శ్మశానం మీద రాసిన పద్యాలతో మానవ జీవితాన్నీ, మరణాన్నీ తాత్వీకరించాడు. ‘ఇట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు’ లాంటి బలమైన భావాల్ని శ్మశానానికి ఆపాదించాడు. పలనాటిని ప్రస్తావిస్తూ, ‘గడ్డి మొలిచెను పులి చారల గద్దెమీద’ అంటాడు. ఇంత గంభీర కవిత్వం రాస్తూనే, మరొకపక్క జీవితంలోని అందాల్నీ, ప్రకృతి సౌందర్యాన్నీ కవిత్వంలో సున్నితంగా ప్రతిభావంతంగా పండించాడు. గిజిగాడినుద్దేశించి– ‘తేలిక గడ్డిపోచలను దెచ్చి రచించెదవీవు తూగుటుయ్యేల గృహంబు మానవుల కెరీకి సాధ్యము కాదు’ అంటాడొకచోట. పసి బాలుడ్ని ‘గానమాలింపక కన్నుమూయని రాజు/అమ్మ కౌగిటి పంజరమ్ము చిలక’ అని అద్భుతంగా వర్ణిస్తాడు. ఇంత గొప్పగా జీవితంలోని పలు పార్శా్వలను పదునైన వ్యక్తీకరణతో సాధికారికంగా, సజీవంగా చిత్రించాడు జాషువా. నిండైన కవిగా పరిణమించాడు. అతి సామాన్యమైన మాటలూ, అంతకు ముందు కవులెవ్వరూ వాడని పదాలూ, పదబంధాలూ, నిత్యం జనం వాడుకలో ఉన్న పలుకుబడీ ప్రయోగించి కవిత్వానికి సరికొత్త జీవశక్తిని ప్రసాదించాడు. అవమానించిన వారినుంచే అభినందనలు పొందాడు. రాసింది పద్యాలైనప్పటికీ వాటిలో ఆధునిక కవితా వ్యూహాల్ని ప్రదర్శించి అబ్బురపరిచాడు. చదువరుల్ని మంత్రముగ్ధు్దల్ని చేసే వ్యక్తీకరణను సాధించగలిగాడు. జాషువా సృజించిన కవిత్వాన్ని మొత్తంగా చూసినప్పుడు, ఆయన ప్రత్యామ్నాయ కవే కాదు పరిపూర్ణ కవి కూడా అనిపిస్తాడు. రవీంద్రనా«థ్ టాగూర్‌లా, సుబ్రమణ్య భారతిలా జాతీయ స్థాయి కవని అనిపిస్తాడు. తెలుగు జనం, తెలుగు కవిత్వం గర్వించదగ్గ కవి శిఖరం జాషువా. -జి.లక్ష్మీనరసయ్య -
సీఎం జగన్ నిర్ణయం.. దళితుల హర్షం
సాక్షి, అమరావతి: గుర్రం జాషువా స్మృతికి రూ.3 కోట్ల నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జాషువా సమాధి అభివృద్ధి, ఆడిటోరియం ఏర్పాటు కోసం ఈ నిధులు కేటాయించినట్లు తెలిపారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, గుంటూరు నడిబొడ్డున జాషువా కళాప్రాంగణం అభివృద్ధికి సీఎం చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. సెప్టెంబర్ 28న జాషువా జయంతి సందర్భంగా తెలుగు అకాడమీ ద్వారా ‘సాహిత్య పురస్కారం’ ప్రదానం చేస్తామన్నారు. జాషువా గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేసేందుకు సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. సీఎం తీసుకున్న నిర్ణయంపై దళితులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని మంత్రి సురేష్ తెలిపారు.(దళితులపై చంద్రబాబు కపట ప్రేమ) గుర్రం జాషువాకు నివాళి.. గుర్రం జాషువా 49వ వర్ధంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి విజయవాడ సిటీ ప్రెసిడెంట్ బొప్పన భవకుమార్.. మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్ల చైర్మన్లు నివాళులర్పించారు. -
జాషువా ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి
సాక్షి, సూర్యారావుపేట: సామాజిక మార్పు కోసం ఎంతో కృషి చేసిన మహాకవి జాషువా ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. మహాకవి గుర్రం జాషువా 124వ జయంతిని పురస్కరించుకుని బందరురోడ్డులోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జాషువా సాంస్కృతి వేదిక, తెలుగు షార్ట్‌ఫిలిం అసోసియేషన్,సుమదుర కళానికేతన్ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజలు పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి షార్ట్ ఫిలింపోటీల విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ ఔత్సాహిక షార్ట్ ఫిలిం మేకర్స్‌కు జాషువా సాంస్కృతిక వేదిక మంచి అవకాశం కల్పి స్తుందన్నారు. సినీ దర్శకుడు రేలంగి నరసిం హారావు మాట్లాడుతూ షార్ట్ ఫిలిమ్ తీస్తున్న యువత అభ్యుదయ భావాలతో ఎంతో ముం దున్నారని తెలిపారు. తెలుగు వారి మేధస్సును అమెరికా లాంటి విదేశాలు ఎక్కువగా విని యోగించుకుంటున్నాయని పేర్కొన్నారు. అమరావతి బాలోత్సవం కమిటీ గౌరవాధ్యక్షుడు చలవాది మల్లిఖార్జునరావు, సుమదుర కళానికేతన్ కార్యదర్శి పి.విజయకుమార్ శర్మ, షార్ట్ ఫిలిమ్ అసోషియేషన్ కార్యదర్శి డి.వి. రాజు తదితరుల ప్రసంగించారు. అనంతరం ఉత్తమ చిత్రాలకు మంత్రి చేతుల మీదుగా నగదు బహుమతి,మెమోంటో, ప్రశం సా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గుండు నారాయణరావు,ప్రసాద్,నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ చిత్రాలు మొదటి ఉత్తమ చిత్రంగా పద్మాలయ ప్రొడక్షన్ వారి ఆడపిల్ల నిలిచింది. 2వ ఉత్తమ చిత్రం మాతృదేవో భవ, 3వ ఉత్తమ చిత్రం కోయిలమ్మ పిల్లలు నిలిచాయి. వీరికి నగదు నగదు బహుమతితో పాటు జాపిక, సర్టిఫికేట్లను అందజేశారు. పోటీలో పాల్గొన్న ఫిలిమ్ మేకర్స్‌కు జ్ఞాపిక,ప్రశంసాపత్రం అందించారు. ఆదర్శనీయం.. జాషువా జీవితం గాంధీనగర్: నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువా జీవితం నుంచి నేటి యువత ఎంతో నేర్చుకోవాల్సి ఉందని సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు తానేటి వనిత అన్నారు. శుక్రవారం హోటల్ ఐలాపురంలో డ్రీమ్ స్వచ్ఛంద సేవా సంస్థ, సామాజిక సాధికారత కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో గుర్రం జాషువా 125వ జయంతి వేడుకలు జరిగాయి. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ఆధునిక కవులలో గుర్రం జాషువాను మించిన వారులేరన్నారు. విజయవాడ రూరల్ ఎంఈవో ఆదూరి వెంకటరత్నం జాషువా రచించిన పద్యాలను ఆలపించారు. డ్రీమ్ స్వచ్చంద సేవా సంస్థ చైర్మన్ మేదర సురేష్‌కుమార్ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో సినీ రాజకీయ విమర్శకుడు కత్తి మహేష్, తెలుగు సాహిత్య అకాడమీ చైర్మన్ కొలకలూరి ఇనాక్, వైఎస్సార్సీపీ నాయకులు కాలే పుల్లారావు, సిరిపురపు గ్రిటన్, జాషువా మునిమనువడు పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
మూఢాచారాలపై తిరగబడ్డ ‘గుర్రం’
సాక్షి, ఒంగోలు టౌన్: సమాజంలోని మూఢాచారాలపై కవిత్వమనే ఆయుధంతో తిరగబడ్డ మహోన్నత వ్యక్తి గుర్రం జాషువా అని స్థానిక శ్రీ పింగళి కోదండరామయ్య సంస్కృతాంధ్ర విద్యానిలయం ఓరియంటల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్. పద్మావతి కొనియాడారు. జాషువా 125వ జయంతి వేడుకలను శుక్రవారం పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుర్రం జాషువా చిన్నతనం నుండే మక్కువ కలిగి మహాకవిగా ఎదిగారన్నారు. సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయురాలు బి. రాజ్యలక్ష్మి మాట్లాడుతూ గబ్బిలం, ఫిరదౌసి, క్రీస్తుచరిత్ర వంటి ఎన్నో గొప్ప పుస్తకాలను గుర్రం జాషువా రచించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పర్యావరణంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో తమ పాఠశాల నుంచి బహుమతులు గెలుచుకున్న విద్యార్థులను అభినంధించారు. ఉపాధ్యాయులు ఎన్. శ్రీకాంత్, జి. ఆనంద్, కె. సత్యనారాయణ, ఉమాదేవి పాల్గొన్నారు. ఘనంగా జాషువా పద్యాల పోటీ మహాకవి గుర్రం జాషువా జయంతి పురస్కరించుకుని బహుజన రచయితల వేదిక ఆధ్వర్యంలో ఒంగోలు ట్రినిటీ హైస్కూలులో చిన్నారులకు జాషువా పద్యాల పోటీ ఘనంగా నిర్వహించారు. పోటీ సందర్భంగా నిర్వహించిన సభకు వేదిక కార్యదర్శి డాక్టర్ నూకతోటి రవికుమార్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ట్రినిటీ సురేష్ ప్రసంగించారు. విద్యార్థుల్లో పద్య సాహిత్యంపై ఆసక్తి పెంచటానికి ఇటువంటి సృజనాత్మక పోటీలు ఉపకరిస్తాయన్నారు. సభలో వేదిక గౌరవ సలహాదారు మిరియం అంజిబాబు, అకాడెమీ ఆఫ్ రొబోటిక్స్ ప్రతినిధి జి.ఎస్.రవికుమార్ పాల్గొని ప్రసంగించగా, న్యాయ నిర్ణేతగా మిట్నసల శాంతారావు వ్యవహరించి జాషువా రచించిన పలు పద్యాలు ఆలపించారు. పోటీల్లో ఒంగోలు క్విస్, నెక్టŠస్‌జెన్, ట్రినిటీ, ఓక్బ్రిడ్జ్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు 200 మందికి పైగా పాల్గొనగా, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. -
జీవితం వడగాడ్పు, కవిత్వం వెన్నెల
మనిషిని మనిషి కించపరిచి, అసహ్యించుకుని, ఊడిగింపు చేయించుకుని అధఃపాతాళానికి తొక్కే సమాజ పరిస్థితులున్నంతవరకూ దేశంలో ఎన్ని ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పటికీ ఆ సమాజం అభివృద్ధి చెందనట్లే భావించాలి. ఈ పరిస్థితి మారాలంటే కొన్ని దశాబ్దాల క్రితం మహాకవి గుర్రం జాషువా అనుభవించిన వేదనను మనం అర్థం చేసుకోవాలి. ఆయన వేదన కొన్ని వేల ఏళ్ల దళిత ఆక్రందనల ప్రతిఫలన. అది పీడితుల బాధలతో, గాథలతో అప్పుడూ ఇప్పుడూ మమేకమవుతున్న హృదయ స్పందన. స్వాతంత్య్రోద్యమంతో పాటు అనేక సామాజిక ఉద్యమాలు జరుగుతున్న కాలంలో అడుగడుగునా వివక్షకు గురవుతూనే ఆయన పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఉపాధ్యాయ శిక్షణను పొంది తెలుగు అధ్యాపకుడిగా ఉద్యోగం చేశారు. మహా మహా పండితులతో సమానంగా తెలుగు పద్యాలు రాయగల శక్తిని సంపాదించారు. వినుకొండలో జరిగిన ఒక సభలో జాషువా తన ఆశుకవితా నైపుణ్యంతో సభికులను మెప్పించారు. అయితే ఈ సభలో ఒక నిమ్నజాతికి చెందిన కవికి ఎలా ప్రవేశం కలిగిందని కొందరు ఆగ్రహించడంతో జాషువా నీరుకారి పోకుండా మరింత పట్టుదలతో అద్భుతమైన సాహిత్యాన్ని సృజించారు. ఒక సారి రైలులో ఒక రాజావారు తనతో ప్రయాణిస్తున్న జాషువా కవి అని తెలుసుకుని ఆయన కవితలు విని మెచ్చుకున్నారు. చివరిలో జాషువా కులం గురించి తెలుసుకుని చివాలున లేచిపోయారు. దీంతో ‘తన కవితా వధూటిని చూసి భళి భళి అన్నవారే కులం తెలుసుకుని చివాలున లేచిపోతే బాకుతో కుమ్మినట్లుంటుంద’ని పద్యం రాశారు. పండితుల సాహచర్యం సంపాదించి పద్యాలు రాయడం నేర్చుకున్నారు. మేఘ సందేశం, రఘువంశం, కుమార సంభవం వంటి సంస్కృత కావ్యాలను చదివి భాషపై పట్టు సంపాదించారు.. సరళ గ్రాంథికాన్నీ, ప్రాచీన పద్య ఛందస్సును స్వీకరించి పద్యానికి కూడా జవజీవాలు కల్పించి ప్రజల్లోకి తీసుకువెళ్లగలమని నిరూపించిన కవి జాషువా. జాషువా రచనల్లో గబ్బిలం పద్యకావ్యం ప్రతిఘటనా కావ్యంగా చరిత్రలో నిలిచిపోయింది. గుడిలో గబ్బిలానికి ప్రవేశం ఉన్నది కాని దళితుడికి మాత్రం లేదని ఆయన వ్యక్తపరిచిన ఆవేదన చదివిన ప్రతి ఒక్కరి హృదయాలను కరిగిస్తుంది. ‘ఎన్ని దేశాలు తిరిగిన నేమి నీవు నా వలె పుట్టు బానిసవు కావు..’ అని ఆయన అంటారు. ఫిరదౌసి అనే మరో పద్యకావ్యంలో ఒక కవికి అక్షరలక్షలు ఇస్తానని చెప్పిన చక్రవర్తి మాట తప్పడంతో ఆ కవి ఆత్మహత్య చేసుకున్న తీరును అద్భుతమైన శైలిలో అనన్యసామాన్యమైన కవితా ప్రతిభతో వర్ణిస్తారు. ‘రాజు మరణించెనొక తార రాలిపోయె, సుకవి మరణించెనొక తార గగనమెక్కె, రాజు జీవించు రాతివిగ్రహములయందు, సుకవి జీవించు ప్రజల నాల్క లయందు‘. అని రాశారు. జాషువా రచించిన సత్యహరిశ్చంద్ర నాటకంలోని çశ్మశాన వాటికలోని పద్యాలు చదివిన వారి గుండెలు ఆర్ద్రతతో స్పందించక మానవు. పేద రైతు కుటుంబంలో జన్మించిన జాషువా రైతన్నల బాధలను తన కవిత్వంలో పండించినంతగా మరెవరూ పండించలేదనే చెప్పాలి. ‘వాని రెక్కల కష్టంబు లేనినాడు సస్యరమ పండి పులకింప సంశయించు’ అన్నాడు. తిరుపతి వేంకట కవుల్లో ఒకరైన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి జాషువా కాలికి గండపెండేరం తొడిగి ‘ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మ ధన్యమైంది’ అన్నారు. ‘తన జీవితంలో అన్నిటికన్నా ఇది అత్యున్నత పురస్కారం’ అని జాషువా అన్నారు. చెళ్లపిళ్ళ వేంకటశాస్త్రి శిషు్యడైన విశ్వనాథ సత్యనారాయణ కూడా శారదాదేవీ అనుగ్రహం వల్ల జాషువా కవిత్వంలో మాధుర్యం ధ్వని స్తుందని, ఆయన మధుర కవి అని ప్రశంసించారు. జాషువా రాసిన శిశువు అనే ఖండికను కమనీయంగా గానం చేసిన ఘంటసాల ఇంటిలోకి వెళ్లడానికి తాను తటపటాయిస్తుంటే ఆ గాయకుడు ఎంతో బాధపడ్డారట. ‘నాకు అటువంటి పట్టింపులు లేవు, మీరు స్వేచ్ఛగా లోపలికి రావచ్చు. పైగా మీరు సరస్వతీ పుత్రులు. మీరు అంటరాని వారైతే, సరస్వతీ దేవి కూడా అంటరానిదనే కదా అర్థం!’’ అని ఘంటసాల అన్నారట. ‘వడగాడ్పు–నా జీవితమైతే, వెన్నెల–నా కవిత్వం’ అని జాషువా అన్నారు. ఆయన జీవితమంతా వడగాడ్పులా సాగితే వెన్నెల లాంటి ఆయన కవిత్వం నేటికీ మన హృదయాలను రసప్లావితం చేస్తోంది. (సీఎం క్యాంప్ ఆఫీస్‌లో సభ సందర్భంగా) వ్యాసకర్త : ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు -
28న సాహిత్యకారులకు పురస్కారాలు
సాక్షి, విజయవాడ: సాహిత్యకారులకు ‘గుర్రం జాషువా జయంతి’ పురస్కరించుకొని గతంలో ప్రభుత్వం రూ.50 వేలు నగదు అందించేదని.. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.1 లక్ష చేశారని ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి ఆధ్యర్యంలో అధికార భాష సంఘం, భాషా సాంస్కృతిక శాఖలు బుధవారం సమావేశం అయ్యాయి. ఈ సమావేశంలో పాల్గొన్న లక్ష్మీ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. గుర్రం జాషువా 124వ జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 28న సాహిత్యకారులకు పురస్కారాలను ప్రదానం చేయనుందని తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహిత్యకారులు డా. కత్తి పద్మారావు, బోయ్ ఐమావతమ్మ, డా. గుజర్లముడి కృపాచారి, ఆచార్య చందు సుబ్బారావులకు రూ.1 లక్ష నగదు, జ్ఞాపికతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్కరిస్తారని ఆయన ప్రకటించారు. -
ఆదర్శప్రాయుడు ‘కాసు’
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీహెచ్ఈఎల్, ఐడీపీఎల్, ఈసీఐఎల్, బీడీఎల్, హిందుస్థాన్ కేబుల్స్, విశాఖ ఉక్కు కర్మాగారం తదితర దిగ్గజ సంస్థల ఆవిర్భావంలో ప్రధాన పాత్ర పోషించి రాష్ట్రం పారిశ్రామికంగా సుసంపన్నం కావడానికి దోహదపడిన మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి 110వ జయంతి నేడు. ‘నాలుగు కోట్ల ఆంధ్రుల మనఃఫల కంబుల కాసు వంశ భూపాలుని పేరు ముద్రపడి భాసిల్లుచున్నది తెల్గురాణి...’ అంటూ నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా చేసిన ప్రశంసకు ఆయన అన్నివిధాలా అర్హులు. తెలుగుజాతికి చేసిన సేవలు అటువంటివి మరి. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని చిరుమామిళ్లలో వెంకటకృష్ణారెడ్డి, శాయమ్మ దంపతులకు 1909 జూలై 28న జన్మించిన బ్రహ్మానందరెడ్డి తిరువనంతపురం వర్సిటీలో న్యాయశాస్త్ర పట్టభద్రుడై ఆ వృత్తిలోకి ప్రవేశించారు. అచిర కాలంలోనే పేరు ప్రఖ్యాతులు సాధించారు. జిల్లా బోర్డుకు 1936లో జరిగిన ఎన్నికల్లో జస్టిస్ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించడం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. స్వాతం త్రోద్యమంలో చురుగ్గా పాల్గొని పలుమార్లు అరెస్టయ్యారు. లాఠీ దెబ్బలు తిన్నారు. మహాత్మా గాంధీని స్వయంగా కలుసుకున్నాక ఆయన స్ఫూర్తితో ఖద్దరు వస్త్రధారణకు మారారు. 1964 ఫిబ్రవరి 21న సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక రాష్ట్రాన్ని బహుముఖ రంగాల్లో తీర్చిదిద్దారు. బాలికా విద్యకు అగ్ర ప్రాధాన్యమిచ్చారు. వారికి సెకండరీ స్థాయి వరకూ ఉచిత విద్యా సౌకర్యం కల్పించారు. అంతేకాదు... బాలికల కోసం విస్తృతంగా ప్రత్యేక పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటుచేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడమే కాదు... జిల్లా పరిషత్తులకు సంపూర్ణ అధికారాలిచ్చారు. బీసీల రిజర్వేషన్లు అమలుచేసి, మున్నూరు కాపుల్ని ఆ జాబితాలోకి తీసుకొచ్చారు. ఎస్టీ వర్గాల పురోగాభివృద్ధికి కృషిచేశారు. ఆ రోజుల్లో రూ.10 కోట్లు ఎల్ఐసీ రుణంతో బలహీన వర్గాలకు తొలిసారి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. స్వయానా క్రీడాకారుడైన ఆయన సీఎంగా క్రీడలకు ప్రాధాన్యమిచ్చారు. హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియం ఆయన హయాంలోనే నిర్మాణమైంది. బ్రహ్మానందరెడ్డి 1964 మొదలుకొని 1971 వరకూ ఏడేళ్లపాటు సీఎంగా పని చేశారు. తెలంగాణ ఉద్యమ తీవ్రత కారణంగా పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఆరో ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా, కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. ఎమర్జెన్సీ ఎత్తివేశాక 1977లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇందిరాగాంధీ రాజీనామా చేసినప్పుడు బ్రహ్మానంద రెడ్డి అధ్యక్షుడయ్యారు. ఆ మరుసటి ఏడాది ఆయనతో ఇందిరాగాంధీకి విభేదాలు తలెత్తి ఇందిరా కాంగ్రెస్ పేరుతో వేరు కుంపటి పెట్టుకున్నారు. అయితే 1980లో తన నాయకత్వంలోని కాంగ్రెస్‌ను ఆయన ఇందిరా కాంగ్రెస్‌లో విలీనం చేశారు. రాజీవ్‌గాంధీ హయాంలో మహారాష్ట్ర గవర్నర్‌గా పని చేశారు. 1994 మే నెలలో కన్ను మూసిన బ్రహ్మానందరెడ్డి చివరివరకూ విలువలకు కట్టుబడి జీవించారు. ఆ మహనీయుడి సేవలకు గుర్తింపుగా స్మృతివనం ఏర్పాటుచేస్తే సముచిత నివాళి అర్పించి నట్టవుతుంది. -వందవాసి అవంతి, గుంటూరు -
సాహితీ సేనాని
విద్వాన్ బూతపాటి కిరణశ్రీకి తెలుగు భాషంటే ప్రాణం. తెలుగుభాష మాధుర్యాన్ని ప్రపంచానికి చాటాలనే దృఢ సంకల్పం. తెలుగు పండితునిగా విద్యార్ధుల్లో ఆయన స్థానం సుస్థిరం. అక్షరాలు సమాజాన్ని మారుస్తాయన్న అచంచల నమ్మకం ఆయనది. రచనలు, అనువాదాలు చేస్తూనే.. నవయుగ కవి చక్రవర్తి, పద్మ విభూషణ్ గుర్రం జాషువా కవిత్వం పట్ల, జీవిత విధానం పట్ల మక్కువతో విశ్రాంత జీవితాన్ని సమాజాన్ని మలిచేందుకు వినియోగిస్తున్నారు. జాషువా పేరిట తొలి ప్రజాగ్రంథాలయాన్ని నెల్లూరులో ఏర్పాటు చేశారు. జాషువా విగ్రహాన్నీ ప్రతిష్ఠించారు. భవిష్యత్ తరానికి సాహితీ సిరులను అందించడంలో అలుపెరగని అవిశ్రాంత ఉపాధ్యాయుడు కిరణశ్రీ. జాషువా సేవలో తరించారు కిరణశ్రీ సొంత ఊరు అప్పటి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ. తల్లిదండ్రులు నాగరత్నమ్మ, జాన్. ఆయన తండ్రి ఆంగ్లేయుల కాలంలోనే ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడు. కిరణశ్రీ ప్రాధమిక విద్య ఉయ్యలవాడలోనే సాగింది. సంజీవరాయునిపేటలో ఎస్ఎస్ఎల్సి పూర్తిచేశారు. 1968–71ల మద్య పద్మభూషణ్ గుర్రం జాషువాకు శిష్యునిగా సేవలందించారు. అప్పుడే తెలుగుభాషా మాధుర్యాన్ని చవి చూసి, భాషపై మక్కువ పెంచుకున్నారు. జాషువాతో పాటు జంధ్యాల పాపయ్యశాస్త్రి, అమరేంద్ర, ప్రసాదరాయ కులపతి వంటి మహాపం డితుల సహచర్యం ఆయనకు లభించింది. చిన్నవయస్సులోనే వారితో కవిసమ్మేళనాల్లో పాల్గొన్నారు. విద్యార్థులపై చెరగని ముద్ర చదువు పూర్తయ్యాక బెస్తవారిపేట క్రైస్తవ మిషనరీ కళాశాలలో సెకండరీగ్రేడ్ పూర్తిచేశారు కిరణశ్రీ. అనంతరం ద్వితీయశ్రేణి తెలుగు పండిట్‌గా 1973లో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఓవైపు బోధిస్తూనే తాను విద్యార్ధిగా మారి డిగ్రీలను సాధించారు. ముప్పైమూడేళ్ల పాటు ఉపాధ్యాయునిగా సేవలు అందించారు. తెలుగు నుడికారాలను, ఉచ్చారణ, పద్యపఠన, చందస్సులను బోధించడంలో ప్రతి విద్యార్థ్ధిపై తనదైన చెరగని ముద్రవేశారు. పదవీ విరమణ అనంతరం వెలుగు ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేశారు. 2012లో రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ తెలుగు అనువాదకునిగా అనేక జీవోలను తెలుగులోకి అనువదించారు. విగ్రహం ఏర్పాటుకు పదేళ్లు! నెల్లూరులో జాషువా కవితా పీఠాన్ని 1984లో ప్రారంభించారు కిరణశ్రీ. 2008లో జాషువా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఆయనలో కలిగింది. పదేళ్లపాటు సుదీర్ఘ పోరాటంతో 2018 సెప్టెంబర్‌లో నెల్లూరు నగరంలో జాషువా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీ ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆథర్స్, కన్ఫెడరేషన్ అండ్ యునెస్కో క్లబ్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యవర్గ సభ్యులు, జాషువా కవితాపీఠం, అధికారభాషా సంఘం రాష్ట్ర, జాతీయ సంస్థల్లో అనేక కీలక పదవులను నిర్వహిస్తున్న సమయంలో కూడా జాషువా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన పలు అవరోధాలను అధిగమించాల్సి వచ్చిందన్నది నిజం. పురస్కారాలు.. పుస్తకాలు కిర ణశ్రీ రచించిన పలు పుస్తకాలను ప్రభుత్వం పాఠ్యగ్రంథాలుగా తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడో తరగతి విద్యార్థుల కోసం ‘అణిముత్యాలు’ అనే తెలుగు ఉపవాచక పుస్తకానికి గాను ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. ఆయన రాసిన ‘పిచ్చివాడు’ అనే నాటకం సుమారు యాభై పరిషత్‌ల అవార్డులను అందుకుంది. ‘మడివేలు మాచయ్య’ పద్యనాటకం పండితుల ప్రశంసలు సైతం అందుకుంది. అనువాదకునిగా ఆయన ఎనభైకి పైగా గ్రం«థాలను తెలుగులోకి తెచ్చారు. తెలుగు భాషను సజీవంగా ఉంచాలని, విశిష్టమైన తెలుగు భాషా మాధుర్యాన్ని భావితరాలకు అందించాలని నిర ంతరం కృషి చేస్తున్న కిరణశ్రీ వంటి వారి అడుగుజాడల్లో ఈతరం వారు నడవడం ఎంతైనా అవసరం. – మౌంట్‌బాటన్, సాక్షి, నెల్లూరు -
తొలి తెలుగు దళిత మహిళా కావ్యం
విమర్శ 1934 దాకా గుర్రం జాషువ పౌరాణిక చారిత్రక రచనలే చేశారు. 1934లో ఆయన ‘స్వప్నకథ’, ‘అనాథ’ అనే రెండు సాంఘిక కావ్యాలు రచించారు. ఈ రెండూ పేద స్త్రీల జీవితాలను ప్రతిబింబించే కావ్యాలు. మొదటిది ఒక పేద రెడ్డి మహిళ మానవీయ జీవితాన్ని ఆవిష్కరించగా, రెండవది ఒక పేద దళిత మహిళ దైన్య జీవితాన్ని ప్రతిఫలించింది. 1934 నాటికి గాంధీజీ స్వాతంత్య్రోద్యమంలో భాగమైన నిర్మాణ కార్యక్రమాలలో హరిజనోద్ధరణ ఒకవైపూ, బి.ఆర్.అంబేడ్కర్ దళితోద్యమాలు మరొకవైపూ కొనసాగుతున్నాయి. తెలుగులో ఒకవైపు భావ కవిత్వం, మరోవైపు స్వాతంత్రోద్యమ కవిత్వం ముమ్మరంగా వస్తున్నాయి. అభ్యుదయ కవిత్వం పురుడుపోసుకుంటున్నది. ఈ సంధి దశలో జాషువ ‘అనాథ’ రచించారు. ఉత్పత్తి రంగంతో సంబంధం లేని భావకవులు విశ్రాంతి వర్గ స్త్రీలను ప్రణయమూర్తులుగా చిత్రిస్తూ ఉంటే, జాషువ వాళ్లకు భిన్నంగా శ్రామిక దళిత స్త్రీ జీవితం వస్తువుగా, వాస్తవిక దృక్పథంతో ‘అనాథ’ రచించారు. ఇది తెలుగులో తొలి దళిత మహిళా కావ్యం. ఈ కావ్యం రావడానికి 25 ఏళ్ళు ముందు నుంచే దళిత కవిత్వం వస్తున్నది. మాలవాండ్ర పాట (1909, అజ్ఞాత కర్తృకం) తొలి తెలుగు దళిత కవిత. ‘లవణరాజు కల’ (గురజాడ, 1910) తొలి తెలుగు దళిత కథాకవిత. నిరుద్ధ భారతము (1915, మంగిపూడి వెంకటశర్మ) తొలి తెలుగు పద్యమహాకావ్యం. ‘మాకొద్దీ నల్ల దొరతనము’ (కుసుమ ధర్మన్న, 1921) దళితుడైన కవి రాసిన తొలి కవిత. హరిజన శతకము (కుసుమ ధర్మన్న, 1933) తొలి తెలుగు దళిత శతకం. ఈ మధ్య కాలంలో గరిమెళ్ళ సత్యనారాయణ, జాలా రంగస్వామి వంటివారు దళిత కవితలు రచించారు. అయితే దళిత మహిళ జీవితాన్ని కావ్యంగా రాసిన తొలి కవి గుర్రం జాషువ. ఈ కావ్యంలో స్త్రీ వస్తువుగా వచ్చే భావ కవిత్వ ధోరణి, ఆర్థిక అసమానతను ప్రశ్నించే అభ్యుదయ కవిత్వ ధోరణి, భారతీయ సామాజిక నిర్దిష్టతకు చెందిన అట్టడుగువర్గ చిత్రణ చేసే దళిత కవిత్వ ధోరణి – ముప్పేటగా పెనవేసుకొని ఉన్నాయి. అనాథ 72 పద్యాల ఖండ కావ్యం. ఒక పేద దళిత వితంతువు. ఆమెకు ఆరుగురు సంతానం. అందరూ ‘నేదరులు’. ‘నడచు పీనుగులు’ లాగా ఉన్నారు. ఆమెకు కట్టుకున్న బట్టలు తప్ప ఇంకే ఆస్తి లేదు. భిక్షాటన తప్ప మరో బ్రతుకుతెరువు లేదు. బిచ్చమెత్తుకోవడంలో ఆమె పడిన బాధలే ఈ కావ్యం. ఇది మూడు విషయాలను ప్రతిపాదించింది. 1. మన సమాజం ధనిక పేద వర్గాల సమాజం. ‘‘సుఖమొకచోట గడగండ్లొకచోట గదా వసుంధరన్’’ 2. దళితుల పేదరికానికి కారణం ఎవరు? అన్న ప్రశ్న. ఎవడారగించు నమృత భోజనంబున గలిసెనో యీలేమా గంజిబువ్వ.... ఎవడపహరించె నేమయ్యె నీమె సుఖము కలుషమెరుగని దీని కొడుకుల సుఖము? 3. సాంఘిక, ఆర్థిక అసమానతలు గల సమాజమే అయినా, అందరూ చెడ్డవాళ్ళు కాదు. ఈ మూడింటితో పాటు, కావ్యంలో నాలుగో అంశాన్నిగూడ గుర్తించవచ్చు. ఇది ముఖ్యమైంది కూడా. ఇది 1934 నాటికి జాషువ భావజాలానికి సంబంధించినది. సాంఘిక, ఆర్థిక అసమానతలతో కూడిన సమాజంలో భగవంతుడు పేదలవైపే ఉన్నాడన్నది నాల్గవ అంశం. ఈ కావ్యంలో ‘అనాథ’ దారిద్య్రాన్ని చిత్రిస్తూ, భర్త మరణంతో ఆమెకు మిగిలింది ‘పిత్య్రమగు ధనము జోలెసంచి’ అన్నారు జాషువ. ఈ అనాథకు బిచ్చమెత్తడ మొక్కటే మిగిలిన దారి. ఆ క్రమంలో దళితేతర సంపన్నులు ఆమె పట్ల ప్రవర్తించే తీరును చిత్రించడం ద్వారా జాషువ సమాజంలోని ఆర్థిక అంతరువులను, వాటి మధ్య బతుకుతున్న మనుషులలోని మంచి చెడ్డలను ఆవిష్కరించారు. దీనికోసం ఆయన మూడు సంఘటనలను చిత్రించారు. మొదటిది: అనాథ ఒక రాత్రి పూట ఒక ఇంట వసారాలో తలదాచుకుంటుంది. తెల్లవారగానే ఆ యింట్లోంచి ఒకమ్మాయి కళ్ళాపు చల్లడానికి బయటకు వస్తుంది. ఓసీ యెవ్వతెవీవు? నీ మగని సొమ్మన్నట్లు పాపిష్ఠు రా లా! సంసారము బెట్టినావు మొగసాలన్ లేచి పొమ్మంచు ఆమె నీటి చెంబును కాలితో తన్ని తరిమేస్తుంది. ఆమె వెళ్ళి ఒక చెట్టుకింద కూర్చుంటుంది. అప్పుడు పక్కింటి స్త్రీ వచ్చి, ఒక పెళ్ళి ఉందనీ, ఆక్కడికి పోతే బాగా తిండి దొరుకుతుందనీ చెప్పి, తన దగ్గరున్న చద్దన్నం కొంచెం పెడుతుంది. రెండవది: ఆమె పెళ్ళి జరిగే చోటికి బయలుదేరుతుంది. అప్పటికే పంగనామాలు పెట్టుకొని, పట్టు పంచెలు కట్టుకున్న వాళ్ళు వెళ్తూ వుంటారు. వాళ్ళు అనాథను చూచి చీదరించుకుంటారు. ఆమె వాళ్ళకు దండంబెట్టి పక్కకు తప్పుకుంటుంది. పెండ్లి ఇంటి దగ్గర ఒక చెట్టుకింద కూర్చుంటుంది. ఆ సమయంలో ఒక సైకిల్ కుర్రాడు వచ్చి ఆమెను, ఆమె చంక బిడ్డను దొర్లించేసి, ఆమెను తిట్టి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా చూస్తున్నారు గానీ ఒక్కరూ దగ్గరికి వచ్చి ఆమెను లేవనెత్తే ప్రయత్నం చేయలేదు. ఒక మేడమీద సరసాలాడుకుంటున్న దంపతులు, ఆ దృశ్యాన్ని చూచి తమకేమీ పట్టనట్టు తమ ఆనందంలో మునిగిపోతారు. అప్పుడు ఒక యువకుడు వచ్చి ఆమెను లేపి ఆసుపత్రిలో చేర్పిస్తాడు. దీనిని గమనించిన అమ్మలక్కలు అతని భార్యకు చెప్పి దెప్పిపొడుస్తారు. ఓ లలనా! నీ మగండొక మాలది పడిపోవ నంటి మైలవడియె వై ద్యాలయము జేర్చినాడిక నీలాగున నయిన గుడియనెడమయు లేదె? అని వ్యాఖ్యానించి ఆమెకు ‘‘త్రాపి రెలమి క్రోధరసము’’. ఆ యువకుడు ఇంటికి రాగానే ఆమె స్నానం చేసి గాని ఇంట్లోకి రావద్దంటుంది. ఆయన స్నానం చేసి, భార్యను సమీపించి అలుక శమించెనా జలకమాడిన యంతనె? మాలదాని పిల్లల కడగండ్లు చూచి బహుళంబుగ దాప్తమునందు నామనో జలజము మైలవడ్డదాది స్నానము చేసెనె? వెఱిదాన! యీ వెలుపలి శుద్ధి జీవులకు బెట్టునె? పోయునె? ముక్తినిచ్చునె? అని తీవ్రంగా ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నకు అంటు జాడ్యంతో బాధపడుతున్న అతని భార్య దగ్గర సమాధానం లేదు. అతను మరునాడు పోయి అనాథ పిల్లల్ని అనాథ శరణాలయంలో చేర్పిస్తాడు. మూడవది: ఒక రోజు బాగా వర్షం కురుస్తున్నది. అనాథ ఒక చావడిలోకి వెళ్తుంది. అక్కడ ఒకడు తన పెంపుడు కుక్కను పెట్టుకొని ఉన్నాడు. అనాథను చూడగానే ‘పంచనంటుకొన్నావటే’ అని అరచి వెళ్లమంటాడు. అప్పుడు అతని భార్య వస్తుంది. ఆమె దయాళువు. ఎవరైననేమి? రక్షణ మవశ్య కర్తవ్యమే కదా? నరులకు, ధ ర్మువునకు గలుగునే కుల వివక్షతము జిన్నపెద్ద భేదము నాథా! అని బుద్ధి చెబుతుంది. ఈ మూడు సందర్భాలలో దళితేతరులు అనాథ పట్ల కొందరు మానవత్వంతోనూ, మరికొందరు అమానుషంగానూ ప్రవర్తించినట్లు చిత్రించారు జాషువ. ఈ కావ్యం రాసేనాటికి జాషువ భావవాదిగానే ఉన్నాడు. భగవంతుడు పేదవాళ్ళ వైపే ఉంటాడు అన్న అవగాహనతో ఉన్నాడు. పరుల దుర్గతిగని గుండెగఱిగి వగచు సదాయసహృదయుల వీక్షణాంచలమునందు బుట్టుచుండును కన్నీటి బొట్టు్టవోలె ఏడి భగవంతుడని సంశయింతు వేల?’’ ఈ అంశాన్ని చెప్పడానికి జాషువ ఈ కావ్యం రాశాడేమో అనిపిస్తుంది. అనాథకు ఆరుగురు పిల్లలనీ, ఆమె భర్త చివరి బిడ్డ పురిటిలో ఉండగానే మరణించాడనీ చెబుతూ, అది ‘నలువ సేయు విలాసమేమొ’ అని వ్యాఖ్యానించారు. సైకిల్ కుర్రాడు అనాథనూ, ఆమె చంకలో బిడ్డనూ దొర్లించి, ఆమెను తిట్టి వెళ్ళిపోతాడు. అనాథకు దెబ్బలు తగిలి రక్తం కారుతుంది, కాని చిన్న బిడ్డకు ఏమీ కాదు. ఈ సందర్భంలో కూడా కవి దేవుడి ఉనికిని చాటి చెప్పాడు. ఓయి నాస్తికుడా! వినుమొక్కమాట అరసి యుందువు ఘోర దృశ్యంబు నిచట మృత్యుదేవత కోఱలు మెఱయునపుడు శిశువునేమహాశక్తి రక్షించెనోయి! గబ్బిలం కాలం నాటికి ఈ విశ్వాసాల పట్ల జాషువకు అనుమానాలు మొలకెత్తాయి. సాంఘిక, ఆర్థిక అసమానతలను గుర్తించాడు జాషువ ఇందులో. అయితే, ఇందుకు కారణాలను, ఆ అసమానతలను నడిపిస్తున్న తాత్విక విశ్వాసాలను అనుమానించే దశకు చేరలేదు. అప్పటికి జాషువ పరిమితి ఇది! - రాచపాళెం చంద్రశేఖరరెడ్డి 9440222117 -
జాషువా రచనలతో అసమానతలు దూరం
గుంటూరు ఈస్ట్: అస్పృశ్యత, అసమానతలు ఉన్నంత కాలం జాషువా రచనలు వాటిని చెండాడుతూనే ఉంటాయని అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ చెప్పారు. అమరావతి రోడ్డులోని అన్నదాన సమాజంలో మహాకవి జాషువా కళాపీఠం సారథ్యాన నిర్వహిస్తున్న సాహితీ చర్చ నాలుగో రోజు ఆదివారం కూడా కొనసాగింది. కొలకలూరి ఇనాక్ అధ్యక్షతన జరిగిన సభలో పెనుగొండ మాట్లాడుతూ జాషువా సాహిత్య ఉద్యమం పోరాట బావుటాను తర్వాతి తరం ముందుకు తీసుకువెళ్లేందుకు అభ్యుదయ కవులకు అవకాశం లభించిందన్నారు. కళాపీఠం అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ అసమానతలు లేని రేపటి సమాజంలో జాషువా కవిత్వం ప్రధాన భూమిక వహిస్తుందన్నారు. -
పద్యాలతో జాషువాకు పట్టాభిషేకం
గుంటూరు ఈస్ట్: మహాకవి గుర్రం జాషువాకు శనివారం గుంటూరులో ఆయన రచించిన పద్యాలతోనే పట్టాభిషేకం జరిగింది. పలువురు కవి గాయకులు నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా పద్యాలు రసరమ్యంగా ఆలపించి పరవశించారు. పలువురు సాహితీమూర్తులు విశ్వనరుడు జాషువాను విశ్వమానవ గోత్రీయుడంటూ కొనియాడారు. ఆయన సామాజిక స్ఫూర్తి భవిష్యత్ తరాలకు అందించాలని ఆకాంక్షించారు. మహాకవి జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 121వ జయంతి వారోత్సవాలలో మూడోరోజు శనివారం పోలీస్ కల్యాణ మండపంలో పద్మశ్రీ కొలకలూరి ఇనాక్‌తో పాటు 50 మంది కవులు,రచయితలను సత్కరించి,జాషువాకు సాహిత్య నీరాజనం అర్పించారు. వందమంది కవులు రచించిన కవితల సంకలనం అయిన ‘‘వందగొంతులు ఒక్కటై జాషువా కోసం’’ పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రముఖ గాయకులు గజల్ శ్రీనివాస్, నరాలశెట్టి రవికుమార్,బండారు పద్మ, దేవసహాయం, బద్వేలు శ్రీహరి, ప్రజానాట్య మండలి గాయకుడు రమణ తదితరులు జాషువా పద్యాలను ఆలపించిన తీరు ఆహూతులను అలరించింది. పద్మశ్రీ కొలకలూరి ఇనాక్‌ను కళాపీఠం అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్, సాహితీవేత్తలు డాక్టర్ బూసురుపల్లి వెంకటేశ్వర్లు,ధనేకుల వెంకటేశ్వర్లు,పెనుగొండ లక్ష్మీనారాయణ,పాపినేని శివశంకర్ ఘనంగా సత్కరించారు.అనంతరం పద్మశ్రీ ఇనాక్ రచించిన అమరావతి,పులుల బోను–నేను, సర్పయాగం, అమరావతి ఖ్యాతి మాదిగల స్థితి పుస్తకాలను ఆవిష్కరించారు. జిల్లాకు జాషువా పేరు పెట్టాలి.. పలువురు వక్తలు తమ ప్రసంగాలలో గుంటూరు జిల్లాకు గుర్రం జాషువా పేరుపెట్టాలని, నవ్యాంధ్రలో ఆయన పేరుమీదగా లైబ్రరీ, సాంస్కృతిక కార్యక్రమాలకు నిర్వహణకు హాలును నిర్మించాలని కోరారు. జాషువా గొప్ప మానవతా వాది అని, సమాజ దార్శనికుడని ఎందరో ఆధునిక కవులకు మార్గదర్శకుడయ్యారని కొనియాడారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు కన్నా మాస్టారు, వేదయ్య,న్యాయవాది వైకే, చందోలు శోభారాణి, సముద్రాల కోటేశ్వరరావు, బత్తుల వీరాస్వామి,జాషువా సంఘం అధ్యక్షుడు పెద్దింటి యోహాను తదితరులు పాల్గొన్నారు. -
కాలాన్ని జయించిన జాషువా
కొత్త కోణం జాషువా ఛందోబద్ధ కవిత్వాన్ని ఎంచుకోవడంలో అభ్యంతరాలున్నాయి. ఆయన కవిత్వ ఉద్దేశం ఆధిపత్య పండితలోకాన్ని తట్టిలేపడం కూడా. ఏ వర్గమైతే తమ పండిత ప్రగ ల్భంతో ఆధిపత్యం చలాయిస్తున్నదో దానిని సవాల్ చేయదల్చుకున్నాడు. ఏ పాండిత్య మైతే ఆధిపత్య కులాలను సాహిత్యం తమ సొంతమని విర్రవీగేలా చేసిందో, అదే పాండి త్యంతో ప్రతిఘటించదల్చుకున్నాడు. అంబేడ్కర్ ఇంగ్లిష్ చదువుతో సాధించిన డిగ్రీలతో ఆధిపత్య సమాజాన్ని ఎదిరించినట్టే జాషువా ఛందోబద్ధ కవిత్వంతో చెడుగుడాడారు. సమ ధర్మంబు వీడి ధనుంజయుడు పంపె / నతనిచే జచ్చె రాధేయుడనెడు ఏల్కు / పుట్టినను చింతకలదు కాబోలు నీకు / నట్లు కాదయ్య! గెలుపు నీదియె కర్ణ! మహాకవి, కవి చక్రవర్తి గుర్రం జాషువా కావ్య ఖండిక ‘భారత వీరుడు’లోని పద్యపంక్తులివి. జాషువా జీవితం, సాహిత్యంపైన వేల పేజీల వ్యాఖ్యానాలు, ప్రశంసలు అచ్చయినవి. అయినా ఏనాటికానాడు జాషువా కొత్తగానే కనిపిస్తాడు. గతాన్ని జీర్ణించుకొని, వర్తమానంలో జీవించి, భవి ష్యత్‌కు మార్గమేసిన జాషువా సాహిత్యం ఒక సమగ్ర అవలోకనగా కనిపి స్తున్నది. ఆయన సాహిత్యం ఆద్యంతం ఒక తాత్విక చింతనలోసాగింది. ఆయన గబ్బిలంను ఉద్దేశించిన నాగార్జునసాగర్ గలగలలు, వినిపించిన భరత పురుషుల చరితను విప్పిచెప్పిన ఆయన వాదం వివక్ష, అవమానం అసమానతలు లేని సామ్యవాదం. ఇప్పటికి కూడా చాలా మంది కవులలో లేని చారిత్రక దృష్టి జాషువాలో కనిపిస్తుంది. ఈ వ్యాసం మొదట్లో ప్రస్తావించిన పద్యపాదములే అందుకు సాక్ష్యం. సామాజిక న్యాయం గురించి, సమానత్వం గురించి రాసే వాళ్లలో చాలా మంది ఇప్పటికీ పాండ వులదే న్యాయమని వ్యాఖ్యానిస్తుంటారు. కానీ భారతదేశంలోని కుల వ్యవస్థ పుట్టుకను, పరిణామాలను లోతుగా అర్థం చేసుకొని, నేటి తరానికి ఒక శాస్త్రీయ దృష్టిని ఆనాడే అందించాడు జాషువా. అందుకే తన ఖండ కావ్యంలో కర్ణుడిని భారతవీరుడు అన్నాడు. అర్జునుడిని దోషిగా నిలబెట్టాడు. ఆనాటికే కాదు, ఈనాటికీ ఇది సాహసమే. కులం పునాదులను కొల్లగొట్టాలంటే ధర్మ శాస్త్రాల గుట్టును బట్టబయలు చేయాలన్న డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ తాత్వికతకు జాషువా ఆలోచన సరిగ్గా సరితూగుతుంది. అనేక రకాలుగా అవమానాల పాల్జేసి చివరకు కుతంత్రంతో కర్ణుడిని వధించారని కూడా జాషువా ప్రకటించాడంటే ఆయన ఆ రోజుల్లోనే హిందూ ధర్మశాస్త్రాల మీద యుద్ధం ప్రకటించినట్టు అర్థం చేసుకోవాలి. దారిద్య్రం నేర్పిన ధీరత్వం గుర్రం జాషువా 1895 సెప్టెంబర్ 28వ తేదీన గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. తండ్రి వీరయ్య, తల్లి లింగమాంబ. తండ్రి యాదవ కులం వారైతే, తల్లి మాదిగ కులం. ఇరు కుటుంబాలు వారిని వెలివే శాయి. వీరయ్య క్రైస్తవంలో చేరి, పాస్టర్‌గా జీవనం సాగించారు. వీరయ్య జీవితం మాదిగ జీవన విధానంతోనే ముడిపడి ఉన్నది. అందుకే జాషువా తన పుట్టుకను, పెంపకాన్ని కలిపి ఒక చైతన్యాన్ని అందిపుచ్చుకున్నాడు. జాషువా తల్లి దండ్రులే ఈ సమాజం మీద ప్రతిఘటన జెండా ఎత్తారు. సరిగ్గా ఇక్కడే ఇటీవల హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో బలిదానం చేసుకున్న వేముల రోహిత్ గుర్తుకొస్తాడు. గుర్రం జాషువా తండ్రి యాదవ కులానికి చెందిన ప్పటికీ తాను తన తల్లి జీవితాన్నీ, తండ్రి చైతన్యాన్నీ అందిపుచ్చుకొని అంట రానివానిగా ప్రకటించుకున్నారు. రోహిత్ వేముల తండ్రి వడ్డెర కులస్తుడైన ప్పటికీ తాను తన తల్లి కులంలో తన అస్థిత్వాన్ని వెతుక్కొని వివక్షాపూరిత సమాజంపై ధిక్కారస్వరమయ్యాడు. జాషువా ఈ భూమి మీదకి అడుగు పెట్టేనాటికి తన చుట్టూరా ఒక సామాజిక చైతన్య వాతావరణం ఉన్నది. ‘‘తినడానికి పిడికెడు అన్నం లేదు, ఊగడానికి తూగుటుయ్యాల లేదు, నాన్న గారు దారిద్య్రాన్ని, సాంఘిక అసమానతను పట్టుకొని పుట్టారు. దారిద్య్రం లోని రుచిని, సాంఘిక పుటసమానతలోని అవమానాన్నియనుభవిస్తూ వచ్చిన మనిషి, నిరాశతో, నిస్పృహతో కృంగి, కృశించి, నశించి పోగల అవ కాశం ఉంది. కానీ ఇక్కడే మనిషి వ్యక్తిత్వం, ధీరత్వం దాగి ఉంది. నాన్నగారి వ్యక్తిత్వం, ధీరత్వం ఇక్కడే అవగాహన అయింది’’ అంటూ ఆయన కూతురు హేమలతా లవణం అన్న మాటలు జాషువా గుండె ధైర్యాన్ని గుర్తుకు తెప్పిస్తాయి. ఈ చైతన్యం, కసి జీవితానుభవం నుంచే వచ్చాయి. కుల అణచి వేతతోపాటు, పేదరికాన్ని జమిలిగా అనుభవించిన వారు జాషువా. పండుగ నాడు పిండివంటలు తినడం పిల్లలకు గొప్ప అనుభూతి. కానీ ఇంట్లో వాటికి కరువు. ఒక అమ్మాయి తినుబండారాలు తీసుకెళ్తుంటే కిందపడ్డ వాటిని తీసుకొని తన తమ్ముడు ఇస్రాయెల్‌కు ఇస్తాడు జాషువా. ఆయనే స్వయంగా తాను రాసిన ‘స్వప్న’లో ‘‘పేదరికం పెద్ద వింత విద్యాశాల దానిలోన లజ్జ కనపడదు’’ అని రాయడంలో జాషువా అనుభవించిన ఆకలి బాధ ప్రతిబిం బిస్తుంది. జాషువా ‘‘జీవితం నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. నాకు గురువులు ఇద్దరు. పేదరికం, కులభేదం. ఒకటి సహనాన్ని నేర్పితే, మరొకటి నాలో ఎదిరించే శక్తిని పెంచింది, కానీ బానిసగా మాత్రం మార్చలేదు. దారిద్య్రాన్ని, కుల భేదాన్ని కూడా చీల్చి నేను మనిషిగా నిరూపించుకోదలిచాను. వాటిపై కత్తిగట్టాను. అయితే నా కత్తి కవిత. నా కత్తికి సంఘంపై ద్వేషం లేదు. దాని విధానంపై ద్వేషం’’ అంటూ సమాజంలోని అంతరాలపై తన వైఖరిని స్పష్టం చేశారు. విశ్వనరుడను నేను అంటూ రాసిన పద్యంలో ‘‘నేను కులాల చట్రంలో ఇమడను, అవేవీ నన్ను బంధించలేవు’’ అంటూ తన నిరసనను తెలియజేయడం మాత్రమే కాదు, తాను ఒక ఉన్నతమైన విశ్వ మానవుణ్ణి అని ప్రకటించుకున్నారు. కుల మతాల గీచుకొన్న గీతలజొచ్చు/పంజరాన గట్టుపడను నేను నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు/తరుగులేదు విశ్వనరుడనేను అని కవితా గర్జన చేశారాయన. కులం అసమానతలపై పోరు గుర్రం జాషువా కుల అసమానతలపై, అంటరానితనంపై విసిరిన పద్యాల ఈటెలు కుల వ్యవస్థ పునాదులను పెకిలించాయి. బ్రహ్మదేవుడికి నలుగురు కుమారులు పుట్టెనని చెప్పిన ధర్మశాస్త్రాన్ని, అయిదో కొడుకు అంటరానివాడై ఎలా పుట్టాడని ప్రశ్నిస్తారు. దేవాలయంలో పూజలు, అర్చనలు చేస్తున్న వాళ్లు సాటి మనిషిని కులం పేరుతో హింసిస్తున్న వైనాన్ని కూడా ప్రశ్నించారు. అదే విధంగా వానినుద్ధరించు భగవంతుడేలేడు./మనుజుడెట్లు వాని కనికరించు వాడుజేసుకొన్న పాపకారణమేమొ/యింతవరకు వాని కెరకలేదు. అంటూ అంటరానితనానికి కారణం ఏమిటో తెలియదంటూ మిలియన్ డాలర్ల ప్రశ్నని సమాజంపై సంధించారు. కనపడలేదు దైవతం కాని పదార్థం భారతంబునన్/గనుపడలేదు వర్ణము కన్న పిశాచము భారతంబునన్ / కనుపడలేదు సత్కులం కన్న మహా కళం కము భారతంబునన్/గనుపడలేదు పంచముని కన్నన్ నీఛపు జంతు వేది యున్ అంటూ అంటరాని కులాలు అనుభవిస్తున్న దీనస్థితిని తెలియజేస్తూ ‘ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’ అంటూ చేసిన గీతోపదే శాన్ని తన తాత్విక చింతనతో తిప్పి కొట్టారు. ధర్మసంస్థానార్థంబు ధరణి మీద /నవతరించెదననే నబ్సభవుని తండ్రి / మునుపు జన్మించి నెత్తినకెత్తినది లేదు /నేడు జన్మింపకున్న మునిగినదీ లేదు.’ అంటూ గీతాసారాన్ని నిస్సారం చేసి పడేశారు. అదే సమయంలో ముప్పు ఘటించి వీని కులమున్ గలిమిన్ గబళించి దేహమున్ /బిప్పి యొనర్చి నీ భరత వీరుని పాదం కందకుండగా జెప్పులుకుట్టి జీవనం సేయును గాని నిరాకరింపే లే/దెప్పుడు నప్పుపడ్డది సుమీ భారతావని వీని సేవకున్ అంటూ దోపిడీ సమాజంపై కవితా కత్తులు ఝుళిపించాడు. అంటరాని కులాల శ్రమతో వారి నైపుణ్యంతో తయారు చేసిన ఎన్నో వస్తువులను ముఖ్యంగా, కాలికి ముల్లంటకుండా వాడే చెప్పు లను కుట్టించి ఇచ్చిన వాడు కూటికీ కులానికీ తక్కువై మనిషికన్నా హీనంగా బతకడాన్ని జాషువా సవాల్ చేశారు. హిందూమతం స్త్రీలను అణచివేసిన విధానాన్ని కూడా ఆయన సహించలేకపోయాడు. అంటరాని కులాలతోపాటు మహిళలు కూడా ఏవిధంగా హిందూ మతం చట్రంలో బందీలైపోయారో వివరించారు. కొట్టుటకు, తిట్టుటకు నొక /పట్టా జన్మించినట్లు భావించి వెతల్ బెట్టితి నిల్లాలిని నా /పెట్టు శ్రమలనోర్చె సతియు విధియనుకొనుచున్ అంటూ స్త్రీలపై మగవారి అధికారాన్ని నిర్ద్వంద్వంగా నిరసించాడు. అరవై యేండ్లు దాటినా తల్లి ప్రేమ తరగనిదని, తల్లి తన బిడ్డలపైన ఉన్న మమ కారానికి ఈ లోకంలో సాటిలేదని అమ్మ ప్రేమకు అగ్రతాంబూలం ఇచ్చారు. అబలలని పేరుపెట్టి మహిళలను అణచివేస్తున్నారని చెపుతూ ‘అబలయన్న బిరుదమంటించి కాంతల / స్వీయ శక్తులదిమి చిదిమినారు / సబలయన్న బిరుదు సాధించి హక్కులు /గడ న చేసి కొమ్ము కష్ట చరిత.’ అని హక్కుల సాధనకు నారీలోకం నడుం బిగించాలని పిలుపునిచ్చాడు. ఆయన లక్ష్యం సామాన్యుడే గుర్రం జాషువా తన జీవితం మొత్తాన్ని సాహితీ ఉద్యమానికి అంకితం చేశాడు. కొద్దిమందికి కొన్ని సందేహాలున్నాయి. ఆయన ఛందోబద్ధ కవి త్వాన్ని ఎంచుకోవడంలో అభ్యంతరాలున్నాయి. కానీ ఆయన లక్ష్యం సామా న్యుడే. అయితే అంతకుమించి ఆయన తన కవిత్వ ఉద్దేశం ఆధిపత్య పాండి త్యలోకాన్ని తట్టిలేపడం కూడా. ఏ వర్గమైతే తమ పండిత ప్రగల్భంతో ఆధిపత్యం చలాయిస్తున్నదో దానిని సవాల్ చేయదల్చుకున్నాడు. ఏ పాండి త్యమైతే ఆధిపత్య కులాలను సాహిత్యం తమ సొంతమని విర్రవీగేలా చేసిందో, అదే పాండిత్యంతో జాషువా ప్రతిఘటించదల్చుకున్నాడు. బాబా సాహెబ్ అంబేడ్కర్ తన ఇంగ్లిష్ చదువు ద్వారా సాధించిన ఎన్నో డిగ్రీలతో ఆధిపత్య సమాజాన్ని ఎదిరించినట్టే జాషువా ఛందోబద్ధ కవిత్వంతో చెడుగు డాడారు. అందుకే జాషువాను ఆధిపత్య కులాలలోని ప్రజాస్వామికవాదులే ఎక్కువగా గుర్తించి గౌరవించారు. ఒకరకంగా ఆ రోజు జాషువా సాగించిన సాహితీ పోరాటం సరైనదే. కుల సమాజం కొనసాగడానికి, వివక్ష సమసి పోవడానికి, అంటరాని కులాలు కారణం కాదు. అందుకు ఆధిపత్య కులాలదే బాధ్యత. అందుకే జాషువా ఆ మార్గాన్ని ఎన్నుకొని అలుపెరుగని పోరా టాన్ని సాగించారు. అంటరాని కులాల విముక్తి కోసం అహరహం శ్రమించిన జాషువా సాహిత్యం, జీవితం స్ఫూర్తిదాయకాలే. (సెప్టెంబర్ 28న జాషువ జయంతి సందర్భంగా) మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 -
పద్యం జాషువాకు మాతృభాష
సంస్మరణ సభలో ప్రముఖుల నివాళులు రాజమహేంద్రవరం కల్చరల్ : ‘‘మనిషి జీవించిన కాలంకన్నా, మరణించిన తరువాత జీవించిన కాలం ఎక్కువ ఉండాలి. జాషువా ఈ కోవకు చెందిన కవి’’ అని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ తలారి వాసు అన్నారు. భారతీయ సాహిత్య పరిషత్, నగర శాఖ ఆధ్వర్యాన ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాలలో వేమూరి విశ్వనాథం జయంతి సందర్భంగా గురువారం జరిగిన జాషువా సంస్మరణ సభలో వాసు ప్రసంగించారు. ‘రాజు జీవించు రాతి విగ్రహములందు – సుకవి జీవించు ప్రజల నాల్కలయందు’ అని జాషువా అన్నారని గుర్తు చేశారు. ‘‘పద్యం జాషువాకు మాతృభాష. కష్టాలు, కన్నీళ్ళు ఆయనకు కళ్లజోడు’’ అని అన్నారు. ‘‘గాడుపు నా జీవితమైతే, వెన్నెల నా కవిత్వం’’ అని జాషువా అన్నారన్నారు. ‘‘కులమతాలు గీసుకున్న గీతల జొచ్చి, పంజరాన కట్టుబడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తిరుగు లేదు, విశ్వనరుడ నేను’’ అంటూ కవికి కులం ఉండదన్న విషయాన్ని జాషువా చెప్పారని వివరించారు. జాషువా రచించిన ‘గబ్బిలం’ ఆంధ్రుల చరిత్రేనని వాసు అన్నారు. శతావధానధురీణ డాక్టర్ అబ్బిరెడ్డి పేరయ్యనాయుడు ప్రసంగిస్తూ, జాషువా కవిత్వం కరుణ రసాత్మకమైనదని అన్నారు. ధనవంతుడిని, అందగాడిని కాదని, నీతివంతుడిని, గుణవంతుడిని జాషువా కథానాయకుడిని చేశారన్నారు. తొలుత జాషువా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. çసభకు చిలకమర్తి ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి పెరుమాళ్ళ రఘునాథ్ అధ్యక్షత వహించారు. ప్రధాన వక్త తలారి వాసును నిర్వాహకులు సత్కరించారు. ప్రిన్సిపాల్ చింతా జోగినాయుడు, కరస్పాండెంట్ అసదుల్లా అహమ్మద్ పాల్గొన్నారు. అలరించిన ఛలోక్తులు తలారి వాసు తన ప్రసంగం ఆద్యంతం ఛలోక్తులతో విద్యార్థులను ఆకట్టుకున్నారు. ‘క’ష్టజీ‘వి’కి అటు ఇటు ‘కవి’.. ‘క’నిపిస్తే, ‘వి’సిగించేవాడు ‘కవి’.. వర్షంలో తాను సభకు రావడాన్ని ప్రస్తావిస్తూ ‘ఈ ప్రపంచంలో మన మెడలు వంచగలవాడు ఆటోవాడు ఒక్కడే’ అని చమత్కరించారు. ‘‘బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆటోను ఆపాడు, బిలబిలా 24 మంది ప్రయాణికులు దిగారు’’ అంటూ మరో చమత్కార బాణం వదిలారు. -
కవిత్వానికి కన్నీరద్దిన కవి జాషువ
కవులు మూడు రకాలుగా ఉంటారు. మొదటి రకం వాళ్ళు తాము కవిత్వం రాసిన కాలానికి ప్రాతినిధ్యం వహించి, తర్వాతి కాలంలో తెరమరుగుకు వెళ్ళిపోతారు. భావ కవులు ఇలాంటి వాళ్ళు. రెండవ రకం వాళ్ళు తాము కవిత్వం రాసిన కాలంలో సూర్యతేజంతో వెలిగిపోతారు. తర్వాతి కాలంలో తమ అవ సరం లేకపోయినా, తమవర్గ వారసుల ద్వారా చర్చలో నలు గుతూ ఉంటారు. పౌరాణిక చారిత్రక కవులు ఇలాంటి వాళ్ళు. మూడవరకం వాళ్ళు తాము కవిత్వం రాసిన కాలంలో నిరాదర ణకు, వివక్షకు గురై తర్వాతి కాలంలో తిరుగులేని దీపధారు లుగా వెలుగొందుతారు. గురజాడ, గుర్రం జాషువ ఇలాంటి వారు. (‘‘గురజాడ 1915లో మరణించినా. ఆ తర్వాతనే జీవించడం ప్రారంభించారు’’ అన్న కృష్ణశాస్త్రి మాట జాషు వకు కూడా వర్తిస్తుంది.) గుర్రం జాషువ 19వ శతాబ్దం చివరలో పుట్టిన భారతీయ దళితకవి. సంఘ సంస్కర ణోద్యమం ఉచ్ఛదశలోను, భారత స్వాతంత్య్రోద్యమం పరిణామ దశలోను ఉండగా పుట్టి, నగ్జల్బరీ ఉద్యమం పురుడు పోసుకుంటున్న కాలం దాకా బతికిన కవి (28-9-1895 24-7-1971). భావకవిత్వం తొలిదశలో ఉన్నకాలంలో కలం బట్టి అభ్యుదయ సాహి త్యోద్యమ కాలమంతా గొప్ప రచనలు చేసిన కవి జాషువ. విప్లవ సాహిత్యం మొలకదశలో ఉండగా ఆయన మరణించాడు. 76 ఏళ్ళ జీవితంలో 50 ఏళ్ళకు పైగా సాహిత్య జీవితం గల జాషువ ఆధునిక తెలుగు కవులలో అనేకవిధాలుగా విశిష్టత గల కవి. సంఘ సంస్క రణ, భారత స్వాతంత్య్ర భావ, అభ్యుదయ కవిత్వాల సంగమం ఆయన. సగర మాంధాతాది షట్చక్రవర్తుల సంకీ ర్తన దశ నుంచి కొత్తలోక దర్శనం దాకా పరిణమించిన కవి జాషువ. దేవుడు లేడనే నాస్తికులను హెచ్చరించే దశ నుండి దేవుడినే హెచ్చరించే ధైర్యం చేసిన కవి. పద్య కవిత్వ యుగంలో పుట్టి, గేయం, పాట, వచన కవిత్వ యుగాలలో ప్రధాన రచనలు చేసినా, పద్య కవిగానే స్థిరపడిన కవి జాషువ. చాతుర్వర్ణ వ్యవస్థను వందలేళ్లుగా కీర్తించిన పద్యంతోనే ఆ వ్యవస్థను చీల్చి చెండాడాలన్న పట్టుదల కూడా కావచ్చు. శత్రువు ఆయుధంతోనే శత్రు వును జయించాలన్న లక్ష్యం కూడా కావచ్చు. ఆధునిక భావాలను అభివ్యక్త్తం చేయడానికి కూడా పద్యాన్ని ఉపయోగించవచ్చునని జాషువ నిరూపించాడు. భావకవులలో జాషువ ప్రత్యేకమైన కవి. ఆయన ఊహాలోక విహారి కాదు. వాస్తవ ప్రపంచ సంచారి. కావ్యఖండికలు, ఖండకావ్యాలు స్వీకరించి దైనందిన జీవిత సత్యాలనే చిత్రించాడు. వాటికి కండపుష్టి కలిగించాడాయన. తెలుగు కవిత్వంలో ‘జీవునివేదన’ స్థానంలో ‘జీవన వేదన’కు పీటవేసిన కవి జాషువ. పౌరాణిక, చారిత్రాత్మక, సాంఘిక వస్తువులలో దేనిని స్వీకరించి కవిత్వం రాసినా, అందులో తనదైన దళితానుభవం అంత స్సూత్రంగా ఉంటుంది. భారతదేశ చరిత్రను జాషువ ఎక్కడా అగౌరవపరచలేదు. సామా జిక వ్యవస్థ మీద ఆర్థిక, సాంఘిక, రాజకీయ దృష్టి కోణాలనుంచి విమర్శనాత్మక కవిత్వం రాశాడు. హిందూ, ముస్లిం, క్రైస్తవ వస్తువులన్నిటినీ కవిత్వీకరించాడు. గౌతమ బుద్ధుడు, ఏసుక్రీస్తు, గాంధీ వీరిని ఒక త్రయంగా జాషువ అనేక పర్యా యాలు కీర్తించాడు. అంబేడ్కర్‌ను గురించి జాషువ తక్కువగా పద్యాలు రాసినట్లు కని పిస్తున్నప్పటికీ. ఆయన కవిత్వమంతా అంబేడ్కర్ ప్రచారం చేసిన సౌభ్రాతృత్వ భావన పరచుకొని కనిపిస్తుంది. అంబేడ్కర్ బోధించిన ‘‘బోధించు, పోరాడు.’’ అనే గుణాలు ఆయన మరచిపోలేదు. మార్క్సిజాన్ని జాషువ జీవితావసానదశలో ఆమోదించినట్లు కని పిస్తుందిగాని, ఆయన మొదటి నుంచి శ్రమ దోపిడిని గర్హిస్తూ సమసమాజాన్నే కోరు కున్నాడు. ఈ రకంగా జాషువలో సమకాలీన సమాజంపై ప్రభావం చూపిన మూడు తాత్విక భావజాలాలు సంగమించాయనిపిస్తుంది. సాంఘిక వివక్ష, ఆర్థిక అసమానత, రాజకీయ అవినీతి, తాత్విక మౌఢ్యం ఈ నాల్గింటిపైన జీవిత కాలం యుద్ధం చేసిన విశిష్ట కవి జాషువ. ‘నాది కలికి తెలుగు కులము’ అని గర్వంగా చెప్పుకున్నాడు. స్వాతంత్రం వచ్చిన వెంటనే ‘‘అచ్చముగ భారతీ యుడనైతి నేడు’’ అని ప్రకటించాడు. ‘‘విశ్వనరుడ నేను’’ అని అనేక పర్యాయాలు చాటుకున్నాడు. గుర్రం జాషువ నిబద్ధత గల కవి. ఆయన నిబద్ధత బహుముఖీనమైనది. క్రైస్తవుడని హిందువుల చేత, హిందూకావ్యాలు రాస్తున్నాడని క్రైస్తవుల చేత నిరాదరణకు గురైనజాషువ ముస్లిం సమాధులలో కూర్చొని చదువుకున్నాడని ఆయన జీవిత చరిత్ర కారులు చెబుతారు. ఆయన ఎంతైనా పద్యకవే గదా అని ఆధునికులు, ఆయన సాంఘిక విమర్శను చూసి సంప్రదాయవాదులు జాషువను నిరాదరించినా తనంతట తానుగా విశిష్ట కవిగా ఎదిగాడు. ఆయన కవిత్వం తాను జీవించి రచించిన కాలం నాటికన్నా ఇవాళ ఎక్కువగా ప్రజలకు సన్నిహితమైంది. అదే ఆయన విశిష్టత. అదే ఆయన విజయం. (నేడు గుర్రం జాషువ 45వ వర్ధంతి సందర్భంగా) వ్యాసకర్త ప్రముఖ సాహితీ విమర్శకులు మొబైల్ : 9440222117 - రాచపాళెం చంద్రశేఖరరెడ్డి