heavy rainfall
-
ఏపీకి ముంచుకొస్తున్న వాయుగుండం.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి,అమరావతి: మరి కొద్ది గంటల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు అంచనా వేసింది.ఈ తరుణంలో దక్షిణ కోస్తా, రాయలసీమకు వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఈనెల 17న పుదుచ్చేరి, తమిళనాడు, దక్షిణ కోస్తా దగ్గర వాయుగుండం తీరం దాటుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయల భారీ వర్షాలు , కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు పడనున్నాయి. ఫ్లాష్ ఫ్లడ్ సంభవించే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసిందిబంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుండటంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే వేటలో ఉన్న మత్స్యకారులను వెనక్కి రావాలని స్పష్టం చేసింది. ప్రజా రవాణా, రైల్వేల రాకపోకలపై నిరంతర పర్యవేక్షణ వుండాలని వాతావారణ శాఖ సూచనలు జారీచేసింది. -
దేశవ్యాప్తంగా సాధారణంకంటే అధిక వర్షపాతం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత వర్షాకాల సీజన్లో దేశవ్యాప్తంగా సాధారణంకంటే 7 శాతం అధికంగా వర్షపాతం నమోదయినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు 707.4 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఏకంగా 759.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని వివరించింది. దేశంలోని 14 రాష్ట్రాల్లో సాధారణం కన్నా భారీ వర్షాలు కురిశాయని, అందులో రెండు తెలుగు రాష్ట్రాలున్నాయని తెలిపింది.తెలంగాణలో 581.2 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కన్నా 29 శాతం అధికంగా 751.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, ఆంధ్రప్రదేశ్‌లో 373.6 మిల్లీమీటర్లకు గానూ 534.3 మిల్లీమీటర్లు అంటే 43 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని వెల్లడించింది. తెలంగాణలో ఏడు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురవగా, ఏపీలో నాలుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడినట్లు వివరించింది. అలాగే భారీ వర్షాల జాబితాలో తెలంగాణలో 11, ఏపీలో 21 జిల్లాలున్నట్లు తెలిపింది. మిగతా జిల్లాలో సాధారణ వర్షపాతం ఉందని పేర్కొంది. దేశంలో అతిభారీ వర్షాలు కురిసిన జిల్లాలు అధికంగా తమిళనాడులో 19, రాజస్తాన్‌లో 14 జిల్లాలు ఉన్నాయని వెల్లడించింది. -
India Meteorological Department: ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం
న్యూఢిల్లీ: ఎండలు, వడగాడ్పులతో అల్లాడుతున్న వేళ భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లని కబురు మోసుకొచ్చింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో దేశంలో సమృద్ధిగా వానలు కురుస్తాయని శుభవార్త చెప్పింది. ‘లా నినో’ వాతావరణ పరిస్థితులు కలిసిరావడంతో దేశంలో ఈసారి సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనావేసింది. వాతావరణ శాఖ అంచనా వివరాలను కేంద్ర భూవిజ్ఞానశాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్ సోమవారం ఢిల్లీలో వెల్లడించారు. ‘‘దీర్ఘకాల సగటు వర్షపాతం 106 శాతం మేర పడొచ్చు. అంటే 87 సెంటీమీటర్లకు మించి నమోదు కావచ్చు. ప్రస్తుతం భూమధ్య రేఖ పసిఫిక్ ప్రాంతంలో మధ్యస్థ ఎల్‌నినో పరిస్థితులున్నాయి. ఈ ఎల్ నినో (వర్షాభావ పరిస్థితులు) నైరుతి రుతుపవనాల ప్రవేశం (జూన్) నాటికి బలహీనపడి, ద్వితీయార్థంలో లా నినో (వర్షాలకు అనుకూల) పరిస్థితులు ఏర్పడనున్నాయి. గడచిన మూడు నెల్లో ఉత్తరార్థ గోళం, యూరేసియాలో మంచు సాధారణం కన్నా తక్కువగా ఉంది. దీంతో ఈసారి భారత్‌లో వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువ నమోదు కావచ్చు’’ అని పేర్కొన్నారు. దేశ సాగు విస్తీర్ణంలో 52 శాతం పంటలు వర్షాధార పంటలే. రిజర్వాయర్లు అడుగంటి తాగునీటికి సైతం జనం కష్టాలు పడుతున్న ఈ తరుణంలో వాతావరణ శాఖ ప్రకటన రైతాంగాన్ని భారీ ఊరటనిస్తోంది. అయితే వాయవ్య, తూర్పు, ఈశాన్య భారతావనిలోని కొన్ని ప్రాంతాత్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదుకావచ్చని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర అంచనావేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్లలో వర్షపాత వివరాలను ఐఎండీ వెల్లడించలేదు. గత 50 ఏళ్ల సగటున అయిన 87 సెంటీమీటర్ల వర్షపాతంలో 96 శాతం నుంచి 104 శాతాన్ని ‘సాధారణ వర్షపాతం’గా ఐఎండీ గణిస్తోంది. దీర్ఘకాల సగటులో 90 శాతం కన్నా తక్కువ వర్షపాతం కురిస్తే దానిని వర్షాభావ పరిస్థితిగా లెక్కిస్తారు. 90–95 శాతం కురిస్తే దానిని సాధారణ వర్షపాతంగా, 105–110 శాతం కురిస్తే సాధారణం కన్నా ఎక్కువగా పరిగణిస్తారు. 1951–2023 కాలంలో పరిశీలిస్తే ఎల్ నినో తర్వాత వచ్చే లా నినో సందర్భాల్లో తొమ్మిదిసార్లు దేశంలో రుతుపవన కాలాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. లా నినో సంభవించిన 22 సంవత్సరాల్లో 20 సార్లు సాధారణం/సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. -
సాక్షి కార్టూన్ 06-09-2023
-
వరిసాగు పైపైకి.. పప్పు ధాన్యాలు కిందకి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలు, పెరిగిన భూగర్భ జలాల లభ్యత కారణంగా వరి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. గత ఏడాది ఖరీఫ్‌లో వరిసాగు దేశ వ్యాప్తంగా 3.45 కోట్ల హెక్టార్లుగా ఉంటే ఈ ఏడాది అది 15 లక్షల హెక్టార్లు (4 శాతం) మేర పెరిగి 3.60 కోట్ల హెక్టార్లకు చేరిందని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. అయితే ఈ ఏడాది పప్పుధాన్యాల సాగు మాత్రం 6 శాతం మేర తగ్గింది. గత ఏడాది మొత్తంగా పప్పుధాన్యాల సాగు 1.26 కోట్ల హెక్టార్ల మేర ఉంటే అది ఈ ఏడాది 12 లక్షల హెక్టార్ల మేర తగ్గి 1.14 కోట్ల హెక్టార్లకు పరిమితం అయ్యిందని వివరించింది. ముఖ్యంగా కందుల సాగు బాగా తగ్గిందని వెల్లడించింది. -
హైదరాబాద్‌లో ఏకధాటిగా కురుస్తున్న వర్షం.. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం
-
ఉత్తరాదిన విలయం సృష్టిస్తున్న వరదలు
-
ఢిల్లీని కుదిపేస్తున్న కుంభవృష్టి.. 40 ఏళ్లలో ఇదే తొలిసారి..
ఢిల్లీ: ఎడతెరిపిలేని వర్షాలు దేశ రాజధానిని కుదిపేస్తున్నాయి. ఢిల్లీలో రెండో రోజూ భారీగా వర్షం కురుస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 153 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. గత 40 ఏళ్లలో ఒకే రోజులో ఈ స్థాయిలో వర్షం సంభవించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 1982 జులైలో మొదటిసారి ఇంత భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ ఇప్పటికే జలమయమయ్యాయి. రానున్న మరో 2-3 రోజులపాటు తీవ్ర స్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో దేశ రాజధానిలో ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు అధికారులు. #WATCH | Delhi wakes up to rain lashing several parts of the city; visuals from Mayur Vihar Phase II area pic.twitter.com/WVXuHMyR0E — ANI (@ANI) July 9, 2023 భారీ వానల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల మీద వరద నీరు చేరడంతో అండర్ పాస్‌లను అధికారులు మూసివేశారు. రానున్న నాలుగు, ఐదు రోజుల్లో జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావం విశేషంగా కొనసాగుతోంది. పంజాబ్, హర్యానాల్లో ఊహించినదానికంటే ముందుగానే వచ్చాయి. పంజాబ్, హర్యానా, ఛండీగఢ్‌లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. వర్షాల కారణంగా ఢిల్లీలో ఇప్పటికే 15 ఇల్లు కూలిపోగా.. ఓ వ్యక్తి మరణించాడని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ఢిల్లీలో భారీ వర్షం.. ఇండియా గేట్, నోయిడాలో భారీగా ట్రాఫిక్ జామ్ -
Hyderabad: గాలివాన బీభత్సం.. ట్యాంక్ బండ్లో తప్పిన పెను ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఉరుములు, మెరుపులతో వాన దంచికొట్టింది. రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్సార్‌నగర్, ఖైరతాబాద్‌లో వాన భారీ ఎత్తున కురిసింది. బొమ్మల రామారం, తుర్కపల్లి లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షం పడింది. ఎల్బీనగర్, హయత్ నగర్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈదురు గాలుల కారణంగా సిటీలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షం మరింత కురిసే అవకాశం ఉందని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు. (దొంగ తెలివి! పని మనిషిగా చేరిన 24 గంటల్లోనే దోపిడీ.. ఎప్పటిలా మళ్లీ సిటీకి) తప్పిన పెను ప్రమాదం ట్యాంక్ బండ్లో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షానికి భాగమతి టూరిస్ట్ బోటు ట్యాంక్ బండ్లో కొట్టుకుపోయింది. ఆ సమయంలో బోటులో 40 మంది పర్యాటకులున్నారు. అయితే, అప్రమత్తమైన సిబ్బంది వారిని కాపాడి, సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో 40 మంది టూరిస్టులతో బుద్ధ విగ్రహం వద్దకు బోటు బయల్దేరింది. బుద్ధ విగ్రహం చేరుకునే సమయంలో భారీగా ఈదురు గాలుల వీచాయి. దీంతో అదుపు తప్పిన బోటు, కొట్టుకుపోయింది. ప్రమాదాన్ని ముందే గుర్తించి టూరిజం సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే స్పీడ్ బోట్ల ద్వారా బోట్‌ను బోట్స్ క్లబ్ వద్ద ఒడ్డుకు చేర్చారు. పర్యాటకులంతా సురక్షితంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు. నిమ్మకాయంత సైజులో రాళ్లు.. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మంగళవారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగండ్లు కూడా పడటంతో భారీ ఎత్తున పంట నష్టం సంభవించిందని రైతులు వాపోయారు. తొగుట మండలం గుడికందుల, గోవర్ధనగిరిలో నిమ్మకాయంత సైజులో రాళ్లు పడ్డాయని స్థానికులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, బీబీ నగర్ లో ఉరుములు, మెరుపులతో కుడిన భారీ వర్షం కురిసింది. (Telangana: డిగ్రీ చదువుతూనే 10 వేలు సంపాదన.. ఎలా అంటే..!) -
రాష్ట్రాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు.. పాఠశాలలు, కళాశాలలకు సెలవు
చెన్నై: తమిళనాడు, శ్రీలంక తీరంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తంజావూరు, పుదుకోటై జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు శనివారం సెలవు ప్రకటించారు అధికారులు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెండు జిల్లాల కలెక్టర్లు వెల్లడించారు. నగరంలో శనివారం ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలుగా ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా నైరూతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శ్రీలంక తీరాన్ని తాకిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం తమిళనాడులోని డెల్టా జిల్లాలైన పుదుకోటై, తిరువారూర్, నాగపట్నం, తంజావూరు జిల్లాలతో పాటు దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, తూత్తుకుడి, రామనాథపురం, తెన్కాశి, తిరునల్వేలి జిల్లాలపై కూడా పడింది. అలాగే, విల్లుపురం, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాలోనూ అనేక చోట్ల వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో సముద్ర తీర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని 11 జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కాగా, వాయువ్య భారతదేశంలో ఈ నెలలో సాధారణ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. రానున్న రోజుల్లో చలిగాలుల ప్రభావం తగ్గుతుందని పేర్కొంది. Tamil Nadu Rains: Schools, Colleges Shut In Thanjavur and Pudukottai Districts Amid Heavy Rainfall#TamilNaduRains #Thanjavur #Pudukottai #HeavyRainfall #IMDhttps://t.co/URLQXV6A0u — LatestLY (@latestly) February 4, 2023 వాయుగుండం రూపంలో ఎదురైన గండం డెల్టా అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తిరువారూర్ జిల్లాలో 75 వేల ఎకరాల్లో వరి వర్షార్పణమైంది. వేల ఎకరాల్లో వేరుశనగ పంట దెబ్బతింది. ఈ నష్టం పరిశీలనకు శుక్రవారం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. గురువారం రాత్రి, శుక్రవారం మధ్యాహ్నం వరకు వర్షాలు కొనసాగాయి. అధికంగా డెల్టా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. తిరువారూర్ జిల్లాలో 75 వేల ఎకరాల వరి పంట దెబ్బతింది. తంజావూరు, పుదుకోటై జిల్లాల్లోని వేలాది ఎకరాలు దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, డెల్టా జిల్లాలో పెద్ద ఎత్తున వేరుశనగ పంట కూడా దెబ్బతింది. ఆయా జిల్లా అధికారులు నష్టం తీవ్రతను పరిశీలిస్తున్నారు. -
Hyderabad Alert: రాగల 24 గంటల్లో భారీ వర్షసూచన..
సాక్షి, హైదరాబాద్: ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో నగరంలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షాల కారణంగా ఆరెంజ్ అలర్ట్‌ను జారీచేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జీహెచ్ఎంసీ, జలమండలి, రెవెన్యూ, పోలీసు విభాగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షం కురిసే సమయంలో అత్యవసరమైతేనే బయటకు రావాలని హెచ్చరికలు జారీచేసింది. ఆవర్తనం ప్రభావంతో బుధవారం నగరంలో మళ్లీ కురిసిన జడివాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. వందలాది బస్తీలు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముంపు సమస్యలపై బల్దియా కాల్ సెంటర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పలుచోట్ల ఇళ్లలోకి చేరిన వరద నీటిని తొలగించేందుకు జనం నానా అవస్థలు పడ్డారు. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతున వరద నీరు పోటెత్తింది. రాత్రి 10 గంటల వరకు అత్యధికంగా మచ్చబొల్లారంలో 9.3, ఎల్బీనగర్లో 8.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా జియాగూడ, రాజేంద్రనగర్‌లలో 4.8 సెం.మీ చొప్పున నమోదైంది. వాహనదారులు, ప్రయాణికుల కష్టాలు.. సాయంత్రం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల నుంచి బయలుదేరిన వాహనదారులు, ప్రయాణికులు ట్రాఫిక్‌లో చిక్కుకొని ఆలస్యంగా ఇళ్లకు చేరుకున్నారు. భారీ వర్షానికి మూసీ నదికి వరద పోటెత్తింది. మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను వేరే మార్గాల్లో మళ్లించారు. చాదర్‌ఘాట్ బ్రిడ్జి నుంచి నల్లగొండ క్రాస్ రోడ్డు వరకు భారీగా ట్రాఫిక్‌జాం ఏర్పడింది. వర్షం సమయంలో అవసరమైతేనే బయటకు రావాలని నగరవాసులకు పోలీసులు హెచ్చరించారు. ఈ ప్రాంతాల్లో దంచికొట్టింది.. మచ్చబొల్లారం, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, మలక్‌పేట, మెహిదీపట్నం, గోషామహల్, మంగళ్‌హాట్, ఆసిఫ్‌నగర్, జియాగూడ, పురానాపూల్, బహదూర్ పురా, ఫలక్‌నూమా, చాంద్రాయణగుట్ట, అఫ్జల్‌గంజ్, లక్డీకాపూల్, నాంపల్లి, పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, సికింద్రాబాద్, కూకట్పల్లి, బాలానగర్, బోయిన్పల్లి, శేరిలింగంపల్లి, చిలకలగూడ, తిరుమలగిరి, మారేడుపల్లి, ప్యాట్నీ సెంటర్, బేగంపేట్, సోమాజిగూడ, రాంనగర్, తార్నాక, ఓయూ, అంబర్‌పేటలతో పాటు పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. చదవండి: ఎంజీఎం ఘటనపై ప్రభుత్వం సీరియస్ గంటల తరబడి ట్రాఫిక్‌జాం జడివాన కారణంగా నగరంలో ట్రాఫిక్‌జాం సిటీజన్లకు చుక్కలు చూపించింది. వరద నీరు పోటెత్తడంతో సాయంత్రం 6 నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పలు ప్రధాన రహదారులపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. గంటల తరబడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రహదారులపై నిలిచిన వరద నీటిని తొలగించేందుకు, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులు, బల్దియా అత్యవసర బృందాలు నానా కష్టాలు పడ్డాయి. -
ఐటీ నగరిని ముంచెత్తిన భారీ వర్షాలు
-
చైనాలో ఆకస్మిక వరదలు.. 12 మంది మృతి
బీజింగ్: నైరుతి, వాయవ్య చైనాలోని పలు ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. కుండపోత వర్షం కారణంగా వరదలు సంభవించి సిచువాన్ రాష్ట్రంలో ఆరుగురు చనిపోయారు. మరో 12 మంది గల్లంతయ్యారు. శనివారం నాటికి ఈ ప్రాంతంలో 1300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చైనా అధికారిక మీడియా తెలిపింది. వాయువ్య గన్సు రాష్ట్రంలోని లాంగ్నాన్ నగరంలోనూ వరదల వల్ల ఆరుగురు చనిపోయినట్లు మీడియా వెల్లడించింది. ఆ ప్రాంతంలో 3000 మందిని ప్రత్యేక శిబిరాలకు తరలించినట్లు పేర్కొంది. ఒకట్రెండు రోజుల్లోనే వర్షపాతం 98.9 మిల్లీమీటర్లకు చేరిందని, జులై సగటుతో పోల్చితే ఇది దాదాపు రెట్టింపు అని వెల్లడించింది. ఒకవైపు చైనాలోని తూర్పు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుంటే నైరుతి, వాయవ్య ప్రాంతాల్లో మాత్రం కుండపోత వర్షాలు కురిసి వరదలు సంభవిస్తున్నాయి. తూర్పు జెజియాంగ్ రాష్ట్రం, షాంఘై నగరాల్లో గతవారం ఉష్ణోగ్రతలు 42 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయయ్యాయి. వాతావరణ మార్పుల వల్లే ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వేడి గాలులు ఎక్కువ నీటిని నిల్వ చేసుకుంటాయని, ఆ నీరు ఒక్కసారిగా విడుదలైనప్పుడు క్లౌడ్ బరస్ట్‌లు సంభవిస్తాయని చెప్పారు. ఫలితంగా ఆకస్మిక వరదలు వస్తాయని పేర్కొన్నారు. చదవండి: మంటల్లో కాలిపోతున్న ఇల్లు..హీరోలా పిల్లల్ని కాపాడిన పిజ్జా డెలివరీ బాయ్ -
వరద విరుచుకుపడినా నిలబడిన కడెం.. చరిత్రలో తొలిసారి భీకర దృశ్యాలు
నిర్మల్/కడెం: సముద్రం నుంచి సునామీ దూసుకువస్తోందా అన్నట్టు కడెం ప్రాజెక్టుపై వరద పోటెత్తింది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రాజెక్టు పైనుంచి వరద ప్రవహించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి 5 లక్షల క్యూసెక్కులు వస్తుంటేనే కడెం గుండె దడదడలాడింది. అధికారులు, సమీప గ్రామాల ప్రజలు వణికిపోయారు. అలాంటిది బుధవారం రాత్రి 2 గంటల తర్వాత ఏకంగా 6.5 లక్షల క్యూసెక్కుల వరద దూసుకొచ్చింది. ఎత్తిన 17 గేట్లతో పాటు (ఒక గేటు పనిచేయడం లేదు) ఎడమకాలువకు పడ్డ గండి నుంచి 3.5 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్తుండగా అంతకు దాదాపు రెట్టింపు స్థాయిలో వచ్చిన వరద ప్రాజెక్టుపై నుంచి పొంగింది. అలా దాదాపు మూడునాలుగు గంటల పాటు కొనసాగింది. ఇక ప్రాజెక్టు కొట్టుకుపోవడం ఖాయమని భావించిన సిబ్బంది వదిలేసి వచ్చేశారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ, అంతటి తాకిడినీ తట్టుకుని ఆనకట్ట చెక్కుచెదరకుండా నిలబడింది. రెండు గేట్ల కౌంటర్ వెయిట్ దిమ్మెలు మాత్రం కొట్టుకుపోయాయి. గేట్ల గదులు, ప్రాజెక్టు పైభాగం మొత్తం వరద తాకిడితో వచ్చిన చెట్లు, చెట్లకొమ్మలు, చెత్తా చెదారంతో నిండిపోయాయి. ఈ కారణంగా గేట్లను దించడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడటంతో ప్రాజెక్టు ఖాళీ అవుతోంది. ఎన్నడూ చూడని వరద ఉధృతి కడెం ప్రాజెక్టుకు తొలిసారి ఈస్థాయి ఇన్‌ఫ్లో వచ్చింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి వరదను చూడలేదని అధికారులు, స్థానికులు పేర్కొన్నారు. 1958లో ఒకసారి 5.10 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. (అప్పట్లో 9 గేట్లే ఉండేవి) దిగువన మొత్తం నీటమునిగింది. భారీ వరదకు డ్యామ్ ఒకవైపు కోతకు గురయ్యింది. ఆ ప్రమాదం తర్వాత మరో తొమ్మిది గేట్లను నిర్మించి, ప్రాజెక్టు ఎత్తును కూడా పెంచారు. అయితే 1995లో 4 లక్షల క్యూసెక్కుల వరద రాగా డ్యామ్ ఎడమ కాలువ వద్దనే గండిపడింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఏకంగా 6.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి ప్రాజెక్టుపై నుంచి పారింది. ఈసారి కూడా ఎడమవైపు గండిపడటం వల్లే కట్ట ఆగిందని చెబుతున్నారు. ప్రాజెక్టు ఎడమకాలువ వద్ద గండి పడటంతో కోతకు గురైన ప్రాంతం ప్రాజెక్టు నిలిచింది..నష్టం మిగిల్చింది కడెం ప్రాజెక్టు పైభాగమంతా అటవీ ప్రాంతమే ఉంటుంది. భారీ వర్షాలు కురిసినప్పుడు అధికారులు అంచనా వేసే లోపే ఎగువన ఉన్న వాగులన్నీ పొంగి ప్రాజెక్టులోకి వరద వేగంగా వచ్చేస్తుంది. ఈవిధంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి గురువారం వేకువ జాము వరకు పోటెత్తిన వరదతో కడెం ప్రాజెక్టు చాలావరకు దెబ్బతింది. భారీ నష్టాన్ని మిగిల్చింది. ప్రాజెక్టు ఒకటి, రెండు గేట్ల కౌంటర్ వెయిట్లు కొట్టుకుపోయాయి. వరద గేట్లను ఎత్తి దించేందుకు ఈ దిమ్మెలు ఉపయోగపడతాయి. 2018లో కూడా రెండో నంబర్ గేటు కౌంటర్ వెయిట్ కొట్టుకుపోయింది. ఇక వరద గేట్లలో మొత్తం చెత్త పేరుకుపోవడం, ఎలక్ట్రికల్ కనెక్షన్లు దెబ్బతినడంతో వాటిని సరిచేయడం ఇప్పట్లో కుదరని పని అని అంటున్నారు. ఎడమ కాలువకు గండిపడ్డ ప్రాంతంలో వందమీటర్ల మేర కాలువ కోతకు గురైంది. వరద ఉధృతికి ప్రాజెక్టు దిగువన సైడ్‌వాల్స్ మొత్తం దెబ్బతిన్నాయి. కొనసాగుతున్న అవుట్ ఫ్లో ప్రస్తుతం 17 గేట్ల ద్వారా దిగువకు అవుట్‌ఫ్లో కొనసాగుతూనే ఉంది. గురువారం రాత్రి 9 గంటలకు మొత్తం 700 అడుగులకు గానూ 684.725 అడుగుల నీటిమట్టం, మొత్తం 7.603 టీఎంసీలకు గానూ 4.259 టీఎంసీల నీటినిల్వ ఉంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1,25,582 క్యూసెక్కులు ఉండగా అదేస్థాయిలో వరద దిగువకు వెళుతోంది. పెను ప్రమాదం తప్పింది: మంత్రి కడెం ప్రాజెక్టుకు పెనుప్రమాదం తప్పిందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. గురువారం సాయంత్రం అధికారులతో కలిసి ఆయన కడెం ప్రాజెక్టును సందర్శించారు. పరిస్థితిని పరిశీలించారు. కడెం వాగుకు పూజలు చేశారు. -
రెండ్రోజులు మరిన్ని వానలు! ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరు రోజులుగా దంచికొడుతున్న వానలు గురువారానికి కాస్త నెమ్మదించాయి. గురువారం కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదుకాగా.. రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం 3.95 సెంటీమీటర్లుగా నమోదైంది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు అత్యధికంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో 29.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరికొన్ని చోట్లా భారీ వర్షాలు పడ్డాయి. గురువారం మధ్యాహ్నం తర్వాత చాలా చోట్ల వర్షాలు తెరిపినిచ్చాయి. శుక్ర, శనివారాల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది. అయితే ఏ జిల్లాకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేయలేదు. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను ప్రకటించింది. బలహీనపడ్డ అల్పపీడనం: ఒడిశా, కోస్తాంధ్ర పరిధిలోని వాయవ్య బంగాళాఖాతంలో మూడు రోజులుగా కొనసాగిన తీవ్ర అల్పపీడనం గురువారం ఉదయం బలహీనపడిందని వాతావరణశాఖ తెలిపింది. అయితే దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మాత్రం కొనసాగుతోందని.. దాని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. సీజన్లో 52.49 సెంటీమీటర్ల వర్షపాతం: ఏటా నైరుతి సీజన్లో 72.58 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాలి. అందులో జూలై 14కి 22.66 సెంటీమీటర్లు కురవాలి. కానీ ఈసారి ఏకంగా 52.49 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు రాష్ట్ర ప్రణాళికా విభాగం వెల్లడించింది. అంటే మొత్తం నైరుతి రుతుపవనాల కాలంలో కురిసే వర్షంలో మూడింట రెండొంతులు ఇప్పటికే కురిసినట్టు తెలిపింది. -
పలిమెల.. విలవిల, మూడు రోజులుగా బాహ్య ప్రపంచంతో బంధం కట్
భూపాలపల్లి: ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర–తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలిమెల మండలం జలదిగ్బంధంలో చిక్కుకుని విలవిలలాడుతోంది. ఐదురోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు పలురోడ్లు, బ్రిడ్జీలు కోతకు గురవడంతో రవాణా సౌకర్యం స్తంభించింది. ఏడు 33 కేవీ విద్యుత్ లైన్ స్తంభాలు కూలిపోవడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. మూడురోజులుగా మండలానికి వెలుపల ఉన్న బాహ్యప్రపంచంతో సంబంధం తెగిపోయింది. మండలంలో 8 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మొత్తం జనాభా సుమారు 7,500 ఉంటుంది. ఈ మండలానికి మూడు వైపుల ఉన్న దారులు స్తంభించాయి. మండల ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం ఎక్కువగా మహదేవ్పూర్ మీదుగా జిల్లాకేంద్రానికి వస్తుంటారు. శనివారంరాత్రి ఆ దారిలోని పెద్దంపేట వాగు ఉధృతంగా ప్రవహించడంతో మధ్యలోని బ్రిడ్జి వద్ద రోడ్డు కోతకు గురైంది. పక్కనే పొలాల్లో ఉన్న ఏడు 33 కేవీ కరెంటు లైన్ స్తంభాలు కూలిపోయాయి. గర్భిణి రజితను వాగు దాటించి తీసుకొస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం దీంతో ఆ మండలం మొత్తానికి శనివారంరాత్రి నుంచి రవాణా, విద్యుత్ సరఫరా నిలిచిపోయాయి. తాగు, వంట, ఇతర అవసరాలకు వర్షపు నీరే దిక్కు అయింది. మూడు రోజులుగా విద్యుత్ లేకపోవడంతో పలువురు యువకులు ట్రాలీలు, కార్లు, ట్రాక్టర్ల బ్యాటరీలతో సెల్ఫోన్లు చార్జింగ్ చేసుకొని అధికారులకు సమాచారం చేరవేస్తున్నారు. మండల ప్రజల దయనీయ పరిస్థితి తెలుసుకొని కలెక్టర్ భవేశ్ మిశ్రా వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పిలిపించారు. గర్భిణులతోపాటు పాలు, కూరగాయల వ్యాపారులను వాగు దాటిస్తూ ఆపత్కాలంలో సేవలు అందిస్తున్నారు. వైద్య సిబ్బంది పలుచోట్ల వాగులు దాటుకుంటూ వచ్చి నలుగురు గర్భిణులను ప్రభుత్వాసుపత్రులకు తరలించి ప్రసవాలు చేశారు. పలిమెల, పంకేన గ్రామాలకు పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా తాగునీరు సరఫరా చేశారు. మండల కేంద్రంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు. ట్రాక్టర్ బ్యాటరీతో సెల్ చార్జింగ్ పలిమెల: విద్యుత్ సరఫరా లేక ఫోన్ చార్జింగ్కు ఇబ్బంది ఏర్పడటంతో ఒక రైతు వినూత్నంగా ట్రాక్టర్ బ్యాటరీతో ఇన్వర్టర్ ఏర్పాటు చేశాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో ఫోన్లు మూగబోయాయి. దీంతో మండల కేంద్రంలో వంగల శివ అనే రైతు సెల్‌ఫోన్ చార్జింగ్ కోసం ట్రాక్టర్ బ్యాటరీ సహాయంతో ఇన్వర్టర్ ఏర్పాటు చేశాడు. దానికి స్విచ్ బోర్డు కనెక్షన్ ఇచ్చాడు. ఈ విషయం తెలియడంతో స్థానికులతోపాటు సమీప గ్రామాల ప్రజలు ట్రాక్టర్ నడిచేందుకు డీజిల్ తెచ్చి శివకు అందిస్తున్నారు. ట్రాక్టర్ ఇంజన్‌ను ఆన్‌లో ఉంచుతూ ఫోన్లు చార్జింగ్ చేసుకుంటున్నారు. (క్లిక్: 64 ఏళ్ల రికార్డు బద్దలు.. దడ పుట్టిస్తున్న‘కడెం’ ప్రాజెక్టు) -
Telangana Rains: రాష్ట్రంలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్ / సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గురువారం అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 10 సెం.మీ పైగా వర్షపాతం నమోదైంది. గరిష్టంగా పెద్దపల్లి జిల్లా కనుకులలో 16 సెం.మీ వర్షం కురిసింది. తీవ్ర అల్పపీడనంగా మారి.. సోమవారం దక్షిణ ఒడిశా– ఉత్తర ఆంధ్రప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం మంగళవారం తీవ్ర అల్ప పీడనంగా బలపడి ఒడిశా తీరం, దాని పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ. వరకు విస్తరించి ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంపు తిరిగి ఉందని వాతావరణ కేంద్రం వివరించింది. మరోవైపు సోమవారం నాటి ఉపరితల ఆవర్తనం, ఈస్ట్‌వెస్ట్ షియర్ జోన్ ఈ రోజు ఉత్తర ద్వీపకల్ప భారతదేశం అంతటా వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొద్దీ దక్షిణం వైపుకి వంపు తిరిగి ఉంది. ఇక రుతుపవన ద్రోణి మంగళవారం జైసాల్మర్, కోట, మాండ్ల, రాయిపూర్, ఝార్సిగూడ తీవ్ర అల్పపీడన మధ్యభాగం మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ కారణాల వల్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జిల్లాల్లో జోరు వాన ఉమ్మడి వరంగల్‌లో జిల్లాలో ఆరు రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మంగళవారం పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంగపేట పుష్కర్ ఘాట్ వద్ద పంటపొలాలు కోతకు గురవుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల జలదిగ్భంధంలో చిక్కుకుంది. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం ఏడుబావుల జలపాతం వద్ద ప్రమాదవశాత్తూ కొండ పైనుంచి జారిపడటంతో ఖమ్మం జిల్లాకు చెందిన దాసరి సాయి (21) మరణించాడు. ఉమ్మడి వరంగల్‌లో వర్షాలు, వరదలపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, సీఎస్ సోమేశ్‌కుమార్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. భారీ వర్షాలతో సిద్దిపేట జిల్లాలో 55 చెరువులు అలుగుపోస్తున్నాయి. సిద్దిపేట పట్టణం ఒకటో వార్డుకు చెందిన రామిరెడ్డి(70) అనే వృద్ధుడు కాలకృత్యాలకు వెళ్లగా బాత్రూమ్ గోడ కూలడంతో తీవ్ర గాయాలకు గురై మృతి చెందాడు. గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. ఆదిలాబాద్ జిల్లాలో చెరువులు ఉప్పొంగడంతో వంతెనల వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. 25 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కాగా, జల్దా గ్రామం నుంచి 108లో గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తుండగా వంతెన కూలిపోవడంతో ఆమెను ప్లైఓవర్ బ్రిడ్జి నుంచి 44 జాతీయ రహదారి పైకి తీసుకువచ్చి అటు నుంచి ఆస్పత్రికి తరలించారు. నిర్మల్ జిల్లాలో పంటచేలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నిర్మల్ నడిబొడ్డున గల ధర్మసాగర్ చెరువుకు బుంగపడటంతో పక్కనే ఉన్న గాజులపేట కాలనీని నీళ్లు చుట్టుముట్టాయి. ఆసిఫాబాద్ జిల్లాలో దాదాపు 45 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కరీంనగర్ జిల్లాలో 1,376 చెరువులుండగా.. ప్రస్తుతం అన్నీ నిండి అలుగు పారుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా మంచిర్యాలలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలోని గర్భిణులు, బాలింతలను మంగళవారం రాత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హైదరాబాద్: కూరగాయలపై వర్షాల ఎఫెక్ట్.. రేట్లు మరింత పెరిగే అవకాశం
సాక్షి, సిటీబ్యూరో: ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు! రాష్ట్రంలో ఉద్ధృతంగా కురుస్తున్న వర్షాలు కూరగాయల ధరల్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవల వరుసగా ముసురు వానలు పడుతుండటంతో తోటల్లోని కూరగాయలను కోసేందుకు వీలులేకుండా పోయింది. పొలాలన్నీ బురదమయం కావడంతో కాయ, ఆకు కూరలను తెంచడం కష్టంగా మారింది. దీంతో నగర మార్కెట్లకు వచ్చే దిగుమతులపై ప్రభావం పడింది. కేవలం శివారు జిల్లాలే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా వానలు పడుతుండడంతో అక్కడి నుంచి కూరగాయల రవాణా నిలిచిపోయింది. ఇది కూడా ధరల పెరుగుదలకు కారణంగా మారింది. నిన్నామొన్నటి వరకు హోల్‌సేల్, రిటైల్ వ్యాపారుల వద్ద ఉన్న నిల్వలు నగర ప్రజల అవసరాలను తీర్చినప్పటికీ, సోమవారం నుంచి ఇవి కూడా కరిగిపోవడంతో కూరగాయల రేట్లు మరింత పెరిగే అవకాశముందని మార్కెటింగ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. కూరగాయలకు డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. సాధారణ రోజుల్లో టమాటా కేజీ రూ.30 నుంచి రూ.40 ఉండగా.. సోమవారం దీని ధర కిలోకు రూ. 50 వరకు పలికింది. పచ్చిమిర్చీ కూడా ఘాటెక్కింది. ఏకంగా వాటి ధర కిలో రూ. రూ.60, రూ.80 వరకు చేరింది. ఇతర కూరగాయల ధరలు కూడా కిలో రూ.20 నుంచి రూ.30 పెరిగాయి. పుంజుకోని దిగుమతులు మార్కెట్లకు శుక్రవారం నుంచి కూరగాయల దిగుమతులు రాలేదు. రోజు వంద శాతం వివిధ రకాల కూరగాయలు దిగుమతి అయితే గత నాలుగైదు రోజుల నుంచి 30–50 శాతం మాత్రమే నగర హోల్‌సేల్ మార్కెట్లకు దిగుమతి అయినట్లు మార్కెటింగ్ శాఖ రికార్డులు చెబుతున్నాయి. బోయిన్పల్లి మార్కెట్‌కు సోమవారం కేవలం 12 వేల క్వింటాళ్లు, గుడిమల్కాపూర్ 4 వేల క్వింటాళ్ల కూరగాయలు దిగుమతి అయ్యాయి. అదే సాధారణ రోజుల్లో బోయిన్‌పల్లిలో మార్కెట్‌కు సగటున 32 వేల క్వింటాళ్లు, గుడిమల్కాపూర్‌కు 10 వేల క్వింటాళ్ల దిగుమతులు అవుతాయి. దీంతో డిమాండ్‌కు సరిపడా కూరగాయల అందుబాటులో లేకపోవడంతో ధరలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. -
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణల్లో భారీ వర్షాలు.. గోదారి ఉగ్రరూపం
సాక్షి, అమరావతి/ఎటపాక/చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా)/పోలవరం రూరల్/ ధవళే శ్వరం/దేవీపట్నం/హోళగుంద/బుట్టాయగూడెం: నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంవల్ల మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. కడెంవాగు, ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, కిన్నెరసాని తదితర ఉప నదులు ఉప్పొంగుతుండటంతో సోమవారం గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణలో ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లు ఎత్తేశారు. దీనికి ఉప నదుల నుంచి వస్తున్న వరద తోడవడంతో సరస్వతి, లక్ష్మీ బ్యారేజీల గేట్లు ఎత్తేసి.. 8.68 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరదకు ఉప నదులు, వాగులు, వంకల నుంచి వచ్చిన వరద తోడవడంతో సమ్మక్క బ్యారేజీలోకి 11.82 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. ఆ మొత్తాన్ని దిగువకు వదిలేస్తున్నారు. సమ్మక్క బ్యారేజీ దిగువన పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంవల్ల సీతమ్మసాగర్‌లోకి 14,30,597 (123.62 టీఎంసీలు) క్యూసెక్కులు చేరుతుండగా.. వచ్చింది వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. ఫలితంగా భద్రాచలంలో వరద గంటగంటకూ పెరుగుతోంది. ఇక్కడ వరద మట్టం 53 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. విలీన మండలాల్లో రాకపోకలు బంద్ గోదావరికి వరద పోటెత్తడంతో విలీన మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక, రాయనపేట, నెల్లిపాక, వీరాయిగూడెం, గౌరిదేవిపేట, నందిగామ, మురుమూరు గ్రామాల వద్ద రహదారిపైకి వరద చేరింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లే భారీ వాహనాలు జాతీయ రహదారులపై నిలిచిపోయాయి. శబరి నది కూడా ఎగపోటుకు గురవుతోంది. దీంతో చింతూరు మండలంలో పలు వాగులు పొంగుతున్నాయి. ఈ ప్రాంతంలోనూ పలు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వరద అధికంగా ఉన్నందున అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని.. నిత్యావసర వస్తువులు, టార్పాలిన్లు సమకూర్చాలన్నారు. అలాగే, జ్వరాలు, డయేరియా ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముందుజాగ్రత్తగా లక్ష వాటర్ ప్యాకెట్లు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, ఇతర నిత్యావసర సరకులతోపాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ మీడియాకు తెలిపారు. అంతేకాక.. వేలేరుపాడు, కుక్కునూరులో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, జేసీ అరుణ్‌బాబు, ఐటీడీఏ పీఓ జి.శ్రీనుకుమార్, ఆర్డీఓ ఎం.ఝాన్సీరాణి ఆయా గ్రామాల్లో పర్యటించారు. ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు ఎత్తివేత పోలవరం నుంచి వస్తున్న వరద జలాలతో ధవళేశ్వరం బ్యారేజీలో సోమవారం రాత్రి 7 గంటలకు బ్యారేజీలోకి 8,02,114 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటిమట్టం 10.10 అడుగులకు పెరిగింది. నాలుగు వేల క్యూసెక్కులు డెల్టాకు విడుదల చేసి, మిగులుగా ఉన్న 7,98,114 క్యూసెక్కులను 175 గేట్లు ఎత్తేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. సోమవారం రాత్రికి బ్యారేజీలోకి పది లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశముంది. ఎస్సారెస్సీ నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకూ గోదావరి ప్రధాన పాయపై ఉన్న ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తేశారు. రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద నీటిమట్టం 15.70 మీటర్లు ఉంది. వరద ఉధృతి కారణంంగా కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం మండలం జి.పెదపూడిలంక, బూరుగులంక, అరిగెలవారిలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా కలెక్టరు హిమాన్షు శుక్లా, ఎస్పీ సురేష్‌కుమార్ రెడ్డి సోమవారం ఆయా గ్రామాలకు పడవపై లంకలోకి వెళ్లి వరద ఇబ్బందులపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధంగా ఉన్నామన్నారు. జూలై రెండో వారంలో ఈ స్థాయిలో గోదావరికి వరద రావడం ఇదే ప్రథమం అని అధికారులు చెబుతున్నారు. ఆల్మట్టి గేట్లు ఎత్తివేత.. మరోవైపు.. కృష్ణా ప్రధాన పాయపై కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్‌లోకి 75 వేల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఆదివారం, సోమవారం పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురవడం.. ఉప నదులపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో ఎగువ నుంచి భారీ వరద వస్తుందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరించింది. దాంతో.. ముందుజాగ్రత్తగా ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తేసి దిగువకు 75 వేల క్యూసెక్కులు వదిలేస్తున్నారు. ఆ జలాలు నారాయణపూర్‌లోకి చేరుతున్నాయి. నారాయణపూర్ కూడా నిండుకుండలా మారడంతో ఆ డ్యామ్ గేట్లు కూడా మంగళవారం ఎత్తివేయనున్నారు. కృష్ణాలో వరద ఉధృతి ఇలాగే కొనసాగితే.. మరో ఐదు రోజుల్లో శ్రీశైలానికి కృష్ణమ్మ చేరుకునే అవకాశముంది. ఇక కృష్ణా ప్రధాన ఉప నది అయిన తుంగభద్రలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఈ డ్యామ్‌లోకి 81 వేల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 91 టీఎంసీలకు చేరుకుంది. మరో 9 టీఎంసీలు చేరితే తుంగభద్ర నిండుతుంది. సోమవారం అర్ధరాత్రి లేదా మంగళవారం ఉదయం ఈ డ్యామ్ గేట్లు ఎత్తేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, పులిచింతల దిగువన బేసిన్లో కురిసిన వర్షాలకు 43 వేల క్యూసెక్కుల ప్రవాహం ప్రకాశం బ్యారేజ్‌లోకి చేరుతోంది. ఇందులో ఐదు వేల క్యూసెక్కులను డెల్టా కాల్వలకు విడుదల చేసి.. మిగులుగా ఉన్న 38 వేల క్యూసెక్కులను బ్యారేజ్ 50 గేట్లను అడుగు మేర ఎత్తి సముద్రంలోకి వదులుతున్నారు. వరదలకు జాగ్రత్తలు తీసుకోవాలి – మంత్రి అంబటి రాంబాబు రికార్డు స్థాయిలో గోదావరి వరద పెరుగుతున్న దృష్ట్యా ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో సోమవారం వరద పరిస్థితిని జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్నవెంకటేష్, ఈఎన్సీ నారాయణరెడ్డిలతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వరద ప్రమాదం తొలగే వరకు ప్రజలను పునరావాస శిబిరంలో ఉంచి వారికి భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. వరద పెరగడంతో డయాఫ్రమ్ వాల్ ప్రాంతంలోకి వరద నీరు చేరిందన్నారు. ఫలితంగా.. పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం ఏర్పడిందన్నారు. నిజానికి.. గత ప్రభుత్వ హయాంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందన్నారు. దీనిని నిపుణుల బృందం పరిశీలిస్తోందని, వారిచ్చిన నివేదిక మేరకు కొత్తది నిర్మించాలా లేదా మరమ్మతులు చేయించాలా అనే విషయం తేలాల్సి ఉందన్నారు. -
Heavy Rains: భారీ వర్షాలు
భారీ వర్షాలు -
తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. కనువిందు చేస్తున్న ఆ 5 జలపాతాలు
రాష్ట్రంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో చెరువులన్నీ అలుగు పారుతున్నాయి. వాగులు, వంకలు అలుపెరుగక పరుగెడుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి.. 1. ములుగు జిల్లాలో కొండలపై నుంచి జాలువారుతున్న ముత్యంధార 2. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని గుండాల (బాహుబలి) జలపాతం 3. మహబూబాబాద్ జిల్లా మిర్యాలపెంట గ్రామశివారులోని ‘ఏడుబావుల’ ఉరకలు 4. నిర్మల్ జిల్లాలో పరవళ్లు తొక్కుతున్న పొచ్చర 5. నాగర్‌కర్నూలు జిల్లా నల్లమలలోని మల్లెలతీర్థం. -
చిరపుంజిలో రికార్డ్ స్థాయి వర్షం
న్యూఢిల్లీ: దేశంలో అత్యధిక వర్షపాతానికి చిరునామాగా నిలిచిన చిరపుంజిలో గత 27 ఏళ్లలో జూన్‌లో ఎన్నడూలేనంతటి భారీ వర్షపాతం ఈ ఏడాది నమోదైంది. మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర నుంచి బుధవారం ఉదయం ఎనిమిదిన్నర వరకు అంటే ఒక రోజులో ఏకంగా 811.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడ 1995 తర్వాత జూన్‌లో ఒక్కరోజులో ఇంతటి వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి అని భారత వాతావరణ శాఖ బుధవారం పేర్కొంది. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్లే ఇంతటి వర్షం పడిందని వెల్లడించింది. మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర నుంచి బుధవారం ఉదయం ఎనిమిదిన్నర వరకు మాసిర్రమ్లో 710.6 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదవడం గమనార్హం. 1974–2022 కాలానికి ప్రపంచంలోనే అత్యంత అధిక వర్షపాతం నమోదైన ప్రాంతంగా మాసిర్రమ్ గతంలో రికార్డులకెక్కడం తెల్సిందే. చిరపుంజి, మాసిడ్రమ్ రెండూ దాదాపు 10 కి.మీ.ల దూరంతో మేఘాలయలోనే ఉన్నాయి. -
నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు
-
AP Rain Alert: ఏపీలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ చేసింది. నాలుగు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ అండమాన్ సముద్రంలో 30న మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తొలుత ఇది 29వ తేదీనే ఏర్పడుతుందని అంచనా. కానీ ప్రస్తుతం బ్యాంకాక్ సమీపంలో ఉండడంతో అండమాన్ తీరానికి వచ్చేందుకు సమయం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం ఏపీలో వచ్చే నెల 3 నుంచి 5 వరకు ఉత్తరాంధ్రలో కొంతమేర ఉండే అవకాశం ఉందని తెలిపారు. చదవండి: ఒమిక్రాన్ తరుముతున్నా తీవ్ర నిర్లక్ష్యం.. మాస్కు మరిచి ఎన్ని కథలో.., తమిళనాడుపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ సీజన్లో మదురై, విరుదునగర్ జిల్లాల మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి. తాజాగా మళ్లీ వానలు పడుతుండటంతో వరదముప్పు ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు పలు జిల్లాల్లో చెక్‌డ్యాంల నుంచి వరద ముప్పు ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీవర్షాల కారణంగా నేడు రేపు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. తమిళనాడు తీర ప్రాంతంలో గాలుల వేగం గంటకి 40 కి.మీ. నుంచి 50 కి.మీ. దాకా ఉండొచ్చని పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు.. పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు