Horticultural crops
-
అన్నదాతలకు వాయు‘గండం’..
సాక్షి, అమరావతి: భారీ వర్షాలకు పెద్దఎత్తున వ్యవసాయ, ఉద్యాన పంటలు ముంపునకు గురవుతున్నాయి. బుడమేరు, ఎర్రకాలువలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఎన్టీఆర్, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని వేలాది ఎకరాలు ముంపునకు గురయ్యాయి. ఇక ఉద్యాన పంటల విషయానికొస్తే అత్యధికంగా కూరగాయలు, అరటి, పసుపు, మిరప, తమలపాకు పంటలకు అపార నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. కూరగాయల పంటలే ఎక్కువగా దెబ్బతిన్నట్లు అంచనా వేస్తున్నారు.ఈ వర్షాలవల్ల 30వేల మందికి పైగా రైతులు ప్రభావితమైనట్లు సమాచారం. ప్రస్తుతం వరి పంట దుబ్బులు కట్టే దశలో ఉండడంతో ఈ వర్షాలు మేలుచేస్తాయని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. అయితే, ముంపునీరు 5–6 రోజులకు మించి చేలల్లో ఉంటే మాత్రం పంటలకు నష్టం వాటిల్లే అవకాశముందని చెబుతున్నారు. నిజానికి.. సీజన్ ఆరంభం నుంచి రైతులు తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఖరీఫ్ సాగుచేస్తున్నారు. ఇప్పటికే జులైలో కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతినడంతో నష్టపోయిన రైతులు రెండోసారి విత్తుకున్నారు. తాజాగా.. కురుస్తున్న వర్షాలు వారిని మరింత కలవరపెడుతున్నాయి.13 జిల్లాల్లో పంటలపై తీవ్ర ప్రభావం..రాష్ట్రంలోని 13 జిల్లాల్లో.. 135 మండలాల పరిధిలోని 581 గ్రామాల్లో భారీ వర్షాలవల్ల పంటలు ముంపునకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ప్రాథమిక అంచనా ప్రకారం శనివారం రాత్రికి 1.60 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 10 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు ముంపునకు గురైనట్లు గుర్తించారు. ఇది ఇంకా ఎక్కువే ఉంటుందని క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారం. ఈ వర్షాలు ఉభయ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, నంద్యాల, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. -
ఉద్యానం.. మరింత విస్తారం
సాక్షి, విశాఖపట్నం: ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని విస్తృతం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం రైతులకు రాయితీలిచ్చి ప్రోత్సహిస్తోంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో ఉద్యాన విస్తరణ పథకం కింది ఏటా కొంతమేర దీనిని విస్తరించాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. విశాఖపట్నం జిల్లాలో 10,328 ఎకరాల ఉద్యాన పంటల విస్తీర్ణం ఉంది. ఈ ఏడాది అదనంగా మరో 180 ఎకరాల్లో ఈ పంటలను విస్తరించాలని జిల్లా ఉద్యానశాఖ నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ప్రక్రియను ఉద్యానశాఖ అధికారులు చేపట్టారు. ఉద్యాన విస్తరణ పథకం కింద డ్రాగన్ ఫ్రూట్, టిష్యూ కల్చర్ అరటి, బొప్పాయి, కూరగాయలు తదితర పంటలు సాగు చేస్తారు. వీటితో పాటు జిల్లాలో మరో 500 ఎకరాల్లో ఆయిల్‌పాం తోటలు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పథకంలో సాగు చేసే పంటలకు ప్రభుత్వం రాయితీ కూడా ఇస్తోంది. మొక్కలు, ఎరువులతో పాటు సాగుకు అవసరమైన పనిముట్లకు కూడా యూనిట్ ధరను బట్టి గరిష్టంగా 50 శాతం వరకు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం జిల్లా ఉద్యానశాఖ అధికారులు ఆర్బీకే స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉద్యాన సాగు పెంపు ఆవశ్యకత, అధిక దిగుబడులనిచ్చే వంగడాలు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు తదితర అంశాలను రైతులకు వివరిస్తున్నారు. అదే సమయంలో వీటికి అర్హులైన రైతులను గుర్తింపు ప్రక్రియను కూడా మొదలు పెట్టారు. ఈ నెల 15 వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అనంతరం అవసరమైన నర్సరీలను కూడా ఎంపిక చేసి మొక్కలను పంపిణీ చేస్తారు. ఉద్యాన పంటల విస్తరణకు నీటి పారుదల, డ్రిప్, స్పింక్లర్లు వంటి సదుపాయాలు కలిగి ఉండాలి. మరోవైపు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పండ్ల తోటల పెంపకాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇందులో మొక్కలను ఉచితంగా ఇవ్వడమే కాకుండా ఇందుకు అవసరమయ్యే కూలీలను కూడా ఈ పథకంలో సమకూరుస్తారు. ఇది రైతులకు ఆర్థికంగా ఎంతో వెసులుబాటు చేకూర్చనుంది. మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తాం రైతులు పండించిన ఈ ఉద్యాన పంటలకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తాం. ఈ ఉత్పత్తులను రైతు బజార్లలో విక్రయించేలా మార్కెటింగ్ శాఖ ద్వారా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ఈ రైతులకు కార్డులను జారీ చేస్తాం. ఉద్యాన పంటల నాణ్యత, దిగుబడులు పెంచడం, రైతులకు మంచి ధర గిట్టుబాటు అయ్యేలా చూడడం వంటివి లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. – మన్మధరావు, జిల్లా ఉద్యానశాఖ అధికారి, విశాఖపట్నం -
ఉద్యాన పంటలకు హబ్‌గా ఏపీ
సాక్షి, అమరావతి/తాడేపల్లిగూడెం: ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల ఉద్యాన పంటలకు ఆంధ్రప్రదేశ్ హబ్‌గా మారిందని రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. మొత్తం 17.84 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 312.34 లక్షల టన్నుల ఉత్పత్తితో మన రాష్ట్రం ఉద్యానపంటల ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని వివరించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని వెంకట్రామన్నగూడెంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఐదో స్నాతకోత్సవం శుక్రవారం నిర్వహించారు. చాన్సలర్ హోదాలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ పోషకాహార భద్రత కల్పించేలా ఉద్యాన పంటలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఇప్పటికే స్థూల జాతీయోత్పత్తిలో ఉద్యాన పంటలు ఆరు శాతం ఉండటం శుభపరిణామమని చెప్పారు. ఉద్యానవన రంగం 14శాతం ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని, అందులో 42 శాతం మహిళలకే దక్కడం గొప్ప విషయమన్నారు. సమాజం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉందన్నారు. రోబోటిక్ టెక్నాలజీ, డ్రోన్ల వినియోగం వల్ల ఉత్పత్తి పెరగడంతోపాటు, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని, ఈ దిశగా యూనివర్సిటీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలకు సాంకేతిక సహకారం అందించడంలో ఉద్యాన వర్సిటీ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. వర్సిటీ దశాబ్దంన్నర ప్రయాణంలో విద్య, పరిశోధన, విస్తరణ విభాగాల్లో అద్భుత పురోగతిని సాధించిందని, ఇక్కడ అభివృద్ధి చేసిన 18 వంగడాలను జాతీయ స్థాయిలో కేంద్రం నోటిఫై చేయడం అభినందనీయమన్నారు. నీతి ఆయోగ్ సభ్యుడు, ప్రఖ్యాత వ్యవసాయ ఆర్థికవేత్త రమేష్ చంద్ మాట్లాడుతూ ఉద్యాన విద్యలో డిగ్రీలు సాధించిన విద్యార్థులు జాతీయ స్థాయిలో రైతులకు ఉపయోగపడే నూతన ఆవిష్కరణలు చేయాలని సూచించారు. ఉద్యాన వర్సిటీ ఉప కులపతి టి.జానకీరామ్ వర్సిటీ సాధించిన ప్రగతి, లక్ష్యాల గురించి వివరించారు. అనంతరం 1,069 మందికి బీఎస్సీ హానర్స్, 97 మందికి ఎమ్మెస్సీ, 26 మందికి పీహెచ్డీ పట్టాలను గవర్నర్ ప్రదానం చేశారు. ‘గోల్డ్ మెడల్స్’ అందుకున్నవారు వీరే... ఉత్తమ అధ్యాపకుడిగా వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ (ఎంటమాలజి)డాక్టర్ ఎన్.ఇమ్మానుయేల్, ఉత్తమ పరిశోధనా శాస్త్రవేత్తగా కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె.రవీంద్రకుమార్, ఉత్తమ విస్తరణ శాస్త్రవేత్తగా వెంకట్రామన్నగూడెంలోని కేవీకే శాస్త్రవేత్త (మత్స్యసంపద సైన్స్) డాక్టర్ ఎ.దేవీవరప్రసాద్ రెడ్డి బంగారు పతకాలు అందుకున్నారు. అడ్డా వెంకాయమ్మ గోల్డ్ మెడల్‌ను కొత్తకడప లక్ష్మీకళ (ప్రకాశం), డాక్టర్ టీబీ దాశరథి గోల్డ్‌మెడల్‌ను దుర్గావెంకట రవితేజ అములోతు (గుంటూరు), శంబతరు పావని(వైఎస్సార్), దేవరకొండ పుల్లయ్యశాస్త్రి గోల్డ్ మెడల్‌ను దుంపపెంచల విజయ్‌రెడ్డి (నెల్లూరు), నోరు రాజశేఖర్‌రెడ్డి (కర్నూలు), షాహిద్ లెఫ్ట్‌నెంట్ అమిత్ సింగ్ గోల్డ్ మెడల్‌ను రమావత్ తావుర్యనాయక్ (ప్రకాశం), అన్నే శిఖామణి మెమోరియల్ గోల్డ్ మెడల్‌ను దేవిరెడ్డి మేఘన, గరికిముక్కల పరంజ్యోతి అందుకున్నారు. -
AP: రికార్డులు బ్రేక్ చేసిన ఉద్యాన పంటల ఉత్పత్తులు
సాక్షి, అమరావతి: ఉద్యాన పంటల సాగు.. దిగుబడుల్లో ఆంధ్రప్రదేశ్ రికార్డులు తిరగరాస్తోంది. పండ్ల దిగుబడుల్లో అయితే రాష్ట్రం జాతీయ స్థాయిలో మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. లాభసాటి కాని వ్యవసాయ పంటల స్థానంలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 44 నెలలుగా తీసుకున్న చర్యలు, ఇస్తున్న ప్రోత్సాహకాల ఫలితంగా సాగు విస్తీర్ణం పెరిగింది. ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో నిర్వహిస్తున్న తోటబడుల ద్వారా ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించేలా చేయడంతో దిగుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో 17% వృద్ధి 2021–22లో ఉద్యాన పంటల తుది దిగుబడి అంచనాలను ప్రభుత్వం విడుదల చేసింది. 2020–21లో 44.90 లక్షల ఎకరాల్లో సాగవగా, 314.78 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి. ∙అదే 2021–22లో 45.60 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవగా ఏకంగా 368.83 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. ♦ 2020–21తో పోలిస్తే సాగు విస్తీర్ణం 70వేల ఎకరాల్లో పెరిగితే దిగుబడులు ఏకంగా 54 లక్షల టన్నుల మేర పెరిగాయి. ♦ ఇలా ఏకంగా 17% వృద్ధి రేటుతో ఆల్‌టైం రికార్డు నమోదైంది. ♦ ఏడాదిలో దిగుబడులు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ♦ 2022–23లో 400 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. పంట పండిన పండ్లు.. గుబాళించిన పూలు.. ఇక పండ్ల దిగుబడుల్లో ఏపీ తన స్థానాన్ని పదిలపర్చుకుంది. 2020–21లో 178.86 లక్షల టన్నుల దిగుబడులు నమోదైతే.. 2021–22లో ఏకంగా 203.35 లక్షల టన్నులు దిగుబడులొచ్చాయి. ఇది కూడా ఓ రికార్డు అని చెబుతున్నారు. అలాగే, గతంలో ఎన్నడూ లేనివిధంగా పూలు కూడా గుబాళించాయి. పండ్లతో పోటీపడేలా వీటి దిగుబడులొచ్చాయి. 2020–21లో 44వేల ఎకరాల్లో పూల మొక్కలు సాగవగా, 2.80 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి. అదే 2021–22లో సాగు విస్తీర్ణం 1.04 లక్షల ఎకరాలకు పెరగగా, దిగుబడులు ఏకంగా 8.67 లక్షల టన్నులు నమోదయ్యాయి. ఇక ఆయిల్‌పామ్, కొబ్బరి, జీడిమామిడి, కోకో వంటి ప్లాంటేషన్ పంటల దిగుబడులు 2020–21లో 43.52 లక్షల టన్నులు నమోదైతే 2021–22లో ఏకంగా 57.56 లక్షల టన్నులు నమోదయ్యాయి. ఇక కూరగాయల విషయానికొస్తే 2020–21లో 72.92 లక్షల టన్నుల దిగుబడులొస్తే 2021–22లో 77 లక్షల టన్నులు నమోదయ్యాయి. దిగుబడులు పెరగడానికే కారణాలు.. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాల్లో మార్పులు తీసుకురావడంతో పాటు నాణ్యమైన దిగుబడులు సాధించేందుకు ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో సాగులో మెళకువలు నేర్పేందుకు పెద్దఎత్తున తోటబడులు నిర్వహించింది. పంటలకు అదనపు విలువ జోడించేందుకు గ్రామస్థాయిలో మౌలిక వసతులు కల్పించడం, మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపర్చడం వంటి చర్యలు సత్ఫలితాలిచ్చాయి. ఈ కారణంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా 4 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. మరోవైపు.. స్ట్రాబెర్రీ, నట్మెగ్, సిన్నామన్, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, జామూన్, కరండ, చెర్రీ వంటి విదేశీ పండ్ల సాగు కూడా విస్తరిస్తోంది. -
సాగుబడి @5:30 Pm 18 నవంబర్ 2022
-
ఉద్యాన పంటలతో పోషకాహార భద్రత
తాడేపల్లిగూడెం: ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా పోషకాహార భద్రత లభిస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ‘ట్రైబల్ హార్టికల్చర్’ (గిరిజన ఉద్యాన పంటలు) అనే అంశంపై రెండు రోజులు నిర్వహించనున్న జాతీయ స్థాయి సదస్సు సోమవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ పంటలతోపాటు ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా రైతులు అ«ధిక రాబడులు పొందే అవకాశం ఉందన్నారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ తోలేటి జానకీరామ్ మాట్లాడుతూ.. మన దేశంలో ఉద్యాన పరిశ్రమ 320 మిలియన్ టన్నుల ఉత్పత్తితో స్థూల జాతీయోత్పత్తిలో 33 శాతంగా ఉందన్నారు. కేంద్రీయ ఉష్ణ మండల ఉద్యాన పంటల కేంద్రం (లక్నో) డైరెక్టర్ డాక్టర్ హెచ్ఎస్ సింగ్ వర్చువల్‌గా గిరిజన ప్రాంతాల్లో లాభసాటిగా ఉద్యాన పంటల సాగుపై వివరించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధన విద్యార్థులు సమర్పించిన 102 పరిశోధన పత్రాలపై ఈ సదస్సులో చర్చించారు. భారతీయ ఆయిల్ఫామ్ పరిశోధన సంస్థ డైరెక్టర్ ఆర్కే మాధుర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యాన సిరులు
ఈమె పేరు పాదర్తి కృష్ణమ్మ. పొదలకూరు మజరా లింగంపల్లి. కృష్ణమ్మ ఈ ఏడాది 1.20 ఎకరాల్లో కూరగాయాల సాగు చేపట్టింది. ఉద్యానశాఖ ద్వారా ఆమెకు రూ.19,200 సబ్సిడీ బ్యాంకు ద్వారా ప్రభుత్వం అందజేసింది. కూరగాయాల సాగులో మెళకువలను తెలుసుకుని దిగుబడి సాధించారు. యర్రనాగు దొరసానమ్మ. మండలంలోని మొగళ్లూరు. ఆమె తన ఎకరా పొలంలో నిమ్మ మొక్కలు నాటారు. ఆమెకు ఉద్యానశాఖ ద్వారా ఈ ఏడాది రూ.9,602 రాయితీ లభించింది. ఉద్యానాధికారుల సలహాలు సూచనలతో చీడపీడలు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా అందజేస్తున్న రాయితీ వస్తుందని, దీనిపై ఆధారపడి నిమ్మ మొక్కలు నాటుకున్నట్టు వెల్లడించారు. ఈ రైతు పేరు అక్కెం అంకిరెడ్డి. మండలంలోని ముదిగేడు. తనకున్న 1.20 ఎకరాల్లో నిమ్మమొక్కలు నాటుకుని జీవిస్తున్నారు. ఉద్యానశాఖ రాయితీ సహకారంతో తోటలో మల్చింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దీనికి ఈ ఏడాది రూ.19,200 బ్యాంకులో సబ్సిడీ నగదు జమఅయ్యింది. ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా కల్పిస్తున్న రాయితీలు రైతుకు ఉపయోగకరంగా ఉన్నాయి. పొదలకూరు: పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో పండ్ల తోటల విస్తీర్ణాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా రాయితీలను అందజేస్తోంది. ప్రధానంగా 70 శాతం మంది రైతులు వరి సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే పంట మార్పిడి పద్ధతిని రైతులకు అలవాటు చేసే దశగా ప్రభుత్వం ఉద్యాన పంటలను గణనీయంగా పెంచేందుకు కృషి చేస్తోంది. జిల్లాలో ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు అదనంగా మరో 20 వేల హెక్టార్లలో సాగు పెంచేందుకు ఉద్యానశాఖ కసరత్తు చేస్తోంది. నిమ్మ, మామిడి విస్తీర్ణం పెరుగుతున్నా మిగిలిన పండ్ల తోటల సాగు ఇంకా పెరగాల్సి ఉంది. ప్రభుత్వ ప్రకటిస్తున్న రాయితీలతో పండ్లు, కూరగాయలు, పూల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. మూడు విడతల్లో రాయితీ పండ్ల తోటల పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీ మొత్తాన్ని మూడు విడతలుగా పంపిణీ చేస్తోంది. పండ్ల తోటల సాగు ద్వారా అధిక దిగుబడులను సాధించేందుకు నూతనంగా తోటల అభివృద్ధి పరిచేందుకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. పండ్ల తోటలతో పాటు మల్లె, చామంతి, కనకాంబరం, బంతి, లిల్లీ పూల తోటల పెంపకానికి కూడా రాయితీలను అందజేస్తున్నారు. సన్న, చిన్నకారు రైతులు పెట్టే మొత్తం ఖర్చులో 40 శాతం రాయితీని హెక్టారుకు రూ.16 వేలు, ఇతర రైతులకు 25 శాతం హెక్టారకు రూ.10 వేలు అందజేస్తున్నారు. పూలపెంపకం మల్చింగ్‌కు రూ.16 వేలు, ప్రాసెసింగ్ యూనిట్‌కు రూ.10 లక్షలు, ప్యాక్‌హౌస్ రూ.2 లక్షలు, కోల్డ్‌స్టోరేజ్‌కు రూ.5.25 లక్షలు, సంకరజాతి కూరగాయాల పెంపకానికి హెక్టారుకు ఏడాదికి రూ. 20 వేలు అందజేస్తున్నారు. యాంత్రీకరణకు రాయితీలు ఉద్యాన యాంత్రీకరణకు రాయితీలు అందజేస్తున్నారు. ఈ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులు 50 శాతం, ఇతరులు 40 శాతం రాయితీ పొందవచ్చు. మినీ ట్రాక్టర్‌కు రూ.75 వేలు, పవర్ టిల్లర్ రూ.40 వేలు, తైవాన్ స్ప్రేయర్ రూ.8 వేలు రాయతీ కల్పిస్తున్నారు. కరువు పరిస్థితుల్లో ఉద్యాన పంటలను రక్షించుకునేందుకు తోటల్లో నీటి కుంటల నిర్మాణానికి ఉద్యానశాఖ ద్వారా కమ్యూనిటీ నీటి కుంట రూ.20 లక్షలు, పంట కుంట రూ.75 వేలు అందజేస్తున్నారు. పంటల సాగుకు ప్రోత్సాహం ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీలను అందజేస్తోంది. ప్రధానంగా పండ్ల తోటల సాగు విస్తీర్ణం పెంపొందించేందుకు కృషి చేస్తున్నాం. రైతుల అనుమానాలను క్షేత్రస్థాయికు వెళ్లి నివృత్తి చేస్తున్నాం. ఉద్యానశాఖ నిబంధనల ప్రకారం రైతులకు లబ్ధి చేకూరుస్తున్నాం. – ఈ.ఆనంద్, ఉద్యానాధికారి, పొదలకూరు -
ఇందుకూరు పేట.. కూరగాయల తోట
పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని ఇందుకూరుపేట మండలం కూరగాయల తోటలకు ప్రసిద్ధి. నెల్లూరులోని ప్రధాన కూరగాయల మార్కెట్‌కు వచ్చే ఆకు కూరలతో పాటు కూరగాయల్లో వంగ, బెండ, దొండ, కాకర, బీర, చిక్కుడు, చేమ వంటివి సింహభాగం ఇక్కడ పండేవే. చిన్న, సన్నకారు రైతులు వందలాది ఎకరాల్లో ఆకు కూరలు, కూరగాయల పంటలు సాగు చేస్తుంటారు. అన్ని కాలాల్లోనూ పంటలు సాగవుతుండడంతో ఈ పనులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకు కూరలు, కూరగాయలు కోసి, స్వయంగా రాత్రి పూట మార్కెట్‌కు తరలించి, విక్రయించుకుని వెళ్తుంటారు. మరి కొందరు టోకు ధరతో కొనుగోలు చేసి ఇక్కడ కూరగాయల మార్కెట్లో విక్రయిస్తుంటారు. ఇందుకూరుపేట: దక్షిణ కోనసీమగా పిలిచే ఇందుకూరుపేట విభిన్న కోణాల్లో కనిపిస్తోంది. ఓ వైపు ప్రకృతి అందాలు, మరో వైపు ఆధ్యాత్మికత.. ఇంకో వైపు వివిధ రకాల పంటల సాగు దృశ్యాలు ఇందుకూరుపేట సొంతం. ప్రధానంగా జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ ద్వారా జిల్లా వ్యాప్తంగా సరఫరా అయ్యే ఆకుకూరలు, కూరగాయల్లో అత్యధిక శాతం ఇక్కడ పండించేవే. నేల, నీరు, వాతావరణం అనుకూలంగా ఉండడంతోమండలంలోని ఇందుకూరుపేట, కొత్తూరు, డేవిస్‌పేట, జగదేవిపేట, పల్లిపా డు తదితర పంచాయతీల్లో వంగ, బెండ, మిరప, చిక్కడు, చేమ, అరటి తదితర పంటలు సుమారు 1000 నుంచి 1500 ఎకరాల విస్తీర్ణం వరకు సాగు చేస్తున్నారు. అనునిత్యం ప్రతి ఇక్కడి నుంచి టన్నుల కొద్దీ కూరగాయలను నెల్లూరు మార్కెట్‌కు తరలించి విక్రయిస్తుంటారు. రైతు కుటుంబాలే కూలీలు ఆకు కూరలు, కూరగాయల పంటలు అతి స్వల్ప కాలిక పంటలే. అర ఎకరం నుంచి రెండు ఎకరాల లోపు సాగు చేసే రైతులే ఇక్కడ అధికం. సుమారు 400 మందికి పైగా రైతు కుటుంబాలు వారి తోటల్లో వారే కూలీలుగా పని చేస్తుంటారు. ఒక్కొక్క కుటుంబంలో ముగ్గురు, నలుగురు ఉంటారు. వీరితో పాటు మరి కొందరు సహాయంతో ఈ పనులు చేస్తుంటారు. ఇటు వంటి మరో 300 మంది ఉంటారు. ప్రతి రోజు అందరికి చేతిలో పని ఉంటుంది. అదను చూసి దుక్కిదున్నడంతో పాటు నీరు పెట్టడం, కలుపు తీయడం,, మందులు పిచికారీ చేయడం, ఎరువులు వేయడం వంటి పనులు రైతులు దినచర్యగా చేస్తోంటారు. వేకువజామునే లేచి భార్యాభర్తలు, కుటుంబ సభ్యులతో కలిసి తోటకు పయనమవుతారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పని చేసిన రైతులు సాయంత్రం పండిన పంటను కోసి తరలిచేందుకు వీలుగా బస్తాలకు, ప్లాస్టిక్ బాక్స్‌ల్లో నింపుకొని సి«ధ్దం చేసుకొంటారు. అర్ధరాత్రి లేచి కాలకృత్యాలకు తీర్చుకొని రెండు, మూడు గంటకు గ్రామం నుంచి నెల్లూరు నగరానికి బయలు దేరుతారు. నెల్లూరు మార్కెట్‌కు వెళ్లి విక్రయించుకుని తెల్లారే సరికి ఇళ్లకు చేరుకుంటారు. ఇదే వీరి నిత్యం జీవితం. ఉద్యాన పంటలే మాకు ఆధారం మొదటి నుంచి కూరగాయలు సాగు చేసే మేము జీవిస్తున్నాం. వాతావరణానికి అనుకూలంగా పంటలు వేస్తాను. మేమే కష్టపడి పనిచేసుకొంటాం. ప్రస్తుతం బెండ, ఆకుకూరలు వేసి ఉన్నాను. దీనికి తోడు కొబ్బరి చెట్లను లీజుకు తీసుకున్నాను. బెండ పంటను రోజు మార్చి రోజు కోత కోసి మార్కెట్‌కు తీసుకెళుతున్నాను. ప్రస్తుతం మంచి రేటు ఉంది. ఈ ఉద్యాన పంటలే మాకు ప్రధాన జీవనాధారం. – తిమ్మిరెడ్డి శేషయ్య, కొత్తూరు కూరగాయల సాగుతోనే జీవనం నేను నాకున్న ఎకరం భూమిలో వివిధ రకాల కూరగాయలు కొన్నేళ్లుగా సాగు చేస్తున్నాను. ఇదే నా కుటుంబానికి ఆదాయ వనరు. ప్రస్తుతం బెండ, పచ్చిమిర్చి, గోంగూర, ఆకు కూరలు సాగు చేస్తున్నాను. ప్రతి రోజు కుటుంబ సభ్యులం ఉదయాన్నే తోటకు చేరి పనులు చేసుకొంటాం. ఎక్కువ దిగుబడి ఉంటే ఇక్కడే దళారులకు విక్రయిస్తాం. కొద్దిగా ఉంటే నెల్లూరు మార్కెట్‌కు వెళ్లి పంటను అమ్ముకొంటాం. – మేనాటి మురళీ, కొత్తూరు నేనే సొంతంగా విక్రయిస్తాను లాక్డౌన్ సమయం నుంచి మార్కెట్‌కు వెళ్లడం లేదు. సొంతంగా ఆటో కొనుక్కొని నెల్లూరు పరిసర ప్రాంతాల్లో, పొరుగున ఉన్న టీపీ గూడూరు మండలంలో గ్రామంలో తిరుగుతూ సరుకును అమ్ముకొంటాను. నేను పండించిన పంటనే కాకుండా పక్కనున్న వారి కూరగాయలు సైతం కొనుక్కొని ఈ పని చేస్తున్నాను. మా కుటుంబంలో అందరికీ కూలి పాటు గిట్టుబాటు అవుతుంది. – అత్తిపాటి వెంకయ్య, కొత్తూరు -
ప్రకృతి సేద్యం విస్తరణకు ఏపీ ప్రభుత్వం చర్యలు
సాక్షి, కడప: రైతు శ్రేయస్సే పరమావధిగా, ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి సేద్యం విస్తరణకు చర్యలు తీసుకుంటోంది. రసాయనాలు వద్దు– ప్రకృతి సేద్యం ముద్దు అనే రీతిలో ప్రోత్సహిస్తూ, ప్రకృతిసాగులో సలహాలు, సూచనలు అందిస్తూ అధిక పెట్టుబడులు పొందేలా భరోసాగా నిలుస్తోంది. ఫలితంగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల సంఖ్య ఏటా పెరుగుతోంది. మొదట్లో వరి సాగుకే పరిమితం కాగా ప్రస్తుతం ఉద్యాన పంటలకూ ఈ విధానంలో సాగు విస్తరించింది. గతం కంటే మెరుగ్గా.. జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారులు గతం కంటే మిన్నగా ప్రకృతి సేద్యాన్ని ప్రజలకు, రైతులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ప్రకృతి వ్యవసాయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నీతి ఆయోగ్ సదస్సులో ప్రత్యేకించి ప్రసంగించడం తెలిసిందే. అంతేకాదు వైఎస్సార్‌జిల్లా నుంచి ముగ్గురు రైతులు నీతి ఆయోగ్‌లో అవార్డు అందుకున్నారు. ఇందులో మైదుకూరు మండలం టి. కొత్తపల్లెకు చెందిన రైతు శివరామయ్య, పెండ్లిమర్రికి చెందిన గంగిరెడ్డి, కలసపాడు మండలం బ్రహ్మణపల్లెకు చెందిన కోటేశ్వరరావు ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఖరీఫ్ సాగు లక్ష్యమిలా.. ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 68700 మంది రైతులకు సంబంధించి 78,310 ఎకరాల్లో వ్యవసాయ పంటలతోపాటు ఉద్యాన పంటలను సాగు లక్ష్యం పెట్టుకున్నారు. ఇందులో 23700 మంది రైతులకు సంబంధించి 27059 ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని నిర్ణయించారు. దీంతోపాటు 51,251 ఎకరాల్లో వ్యవసాయ పంటల సాగు లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇందులో 28,650 మంది రైతులకు సంబంధించి 30920 ఎకరాల్లో వరి, 5720 మంది రైతులకు సంబంధించి 6920 ఎకరాల్లో వేరుశనగ పంటను, 4800 మంది రైతులకు సంబంధించి 6570 ఎకరాల్లో శనగ, మినుములు, 5830 మంది రైతులకు సంబంధించి 6850 ఎకరాల్లో కూరగాయలను సాగు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేసి వారికి కావా ల్సిన సూచనలు, సలహాలను ఇవ్వనున్నారు. కిచెన్ గార్డెన్స్‌పై ప్రత్యేక దృష్టి.. జిల్లా అధికారులు కేవలం రైతులతో ప్రకృతి సాగు చేయించి సరిపెట్టకుండా మహిళలను కూడా ప్రకృతి సాగు వాటి ఉపయోగాల వైపు మరల్చి మహిళా సంఘాల ద్వారా కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేయిస్తున్నారు. తద్వారా ప్రతి మహిళా ఆకుకూరలు, కూరగాయలను ఎలాంటి రసాయనాలు, పురుగుమందులు లేకుండా పండించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో కలుపుకుని 75 వేల దాకా కిచెన్గార్డెన్లను ఏర్పాటు చేశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలు తినడంవల్ల మనకు కావాల్సిన మిటమిన్స్, మినరల్స్ అధికంగా లభించే అవకాశం ఉంది. లక్ష్యం అధిగమించేందుకు కృషి ఖరీఫ్ సీజన్లో 73310 ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేశాము. ఆ దిశగా సిబ్బందిని అప్రమత్తం చేశాము. ప్రకృతి వ్యవసాయ సాగులో రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా రైతులను అప్రమత్తం చేయనున్నాం. వీటి స్థానంలో ఘన జీవామృతం, జీవామృతాలను వాడే విధంగా రైతుల్లో చైతన్యాన్ని తీసుకుని వచ్చి లక్ష్య సాధనకు కృషి చేస్తాం. – రామకృష్ణమరాజు, డీపీఎం, ప్రకృతి వ్యవసాయం, వైఎస్సార్ జిల్లా. -
ఉద్యాన పంటలను పరిశీలించిన మంత్రి జోగి రమేష్
సాక్షి, కృష్ణా జిల్లా: తుపాను ప్రభావంతో తోట్ల వల్లూరు మండలంలో నష్టపోయిన ఉద్యానవన పంటలను మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ శనివారం పరిశీలించారు. నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బాధిత రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు. వ్యవసాయం దండగన్న టీడీపీ నేతలు, స్టీరింగ్ కమిటీ అంటూ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. రైతాంగ సంక్షేమానికి నాడు వైఎస్సార్, నేడు జగన్ ఎంతో కృషి చేశారన్నారు. చదవండి: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై నోరు పారేసుకున్న చంద్రబాబు -
ఉద్యాన సిరులు
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది ఉద్యాన పంటలు రైతు ఇంట సిరులు కురిపిస్తున్నాయి. జిల్లాలో ఉద్యాన పంటలుగా అత్యధిక విస్తీర్ణంలో నిమ్మ, బత్తాయి, బొప్పాయి, మిరప, మల్లె తదితర పంటలు సాగులో ఉన్నాయి. మెట్ట రైతుల బెట్ట తీరేలా దిగుబడులకు తోడు ధరలు సైతం ఆశా జనకంగా ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ దఫా రికార్డు స్థాయిలో రేటు దక్కుతోంది. కనీవినీ ఎరుగని స్థాయిలో నిమ్మ రేట్లు బాగా ఉండడంతో నిమ్మ రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఉద్యాన రైతుల ఇళ్లల్లో సిరులు దొర్లుతున్నాయి. నిమ్మతో పాటు మిరప, బత్తాయి, బొప్పాయి, మల్లె పంటల ధరలు ఈ ఏడాది ఆశాజనకంగా ఉన్నాయి. నిమ్మ ధరలు అయితే చరిత్రలో ఎన్నడూ పలకని విధంగా పసిడి ధరతో పోటీపడుతున్నాయి. నిమ్మ లూజు బస్తా కనిష్టంగా రూ.13 వేల నుంచి గరిష్టంగా రూ.15 వేల వరకు స్థానిక మార్కెట్లో పలుకుతోంది. కిలో రూ.150 నుంచి రూ.200 వరకూ ధర ఉంది. ముంబయి, బెంగళూరు మార్కెట్లలో సైతం నిమ్మ ధరలు ఆకాశాన్ని అంటాయి. అవే ధరలు మార్కెట్లో నిలకడగా ఉండడంతో నిమ్మ రైతుల ఆనందానికి అవధుల్లేవు. ఎండలు ముదరడంతో.. ఎండలు ముదరడంతో నిమ్మ ధరలు వేగంగా పుంజుకున్నాయి. ఉమ్మడి జిల్లాలో పొదలకూరు, గూడూరు నిమ్మ మార్కెట్ల నుంచి దేశ రాజధాని ఢిల్లీ, ముంబయి, బెంగళూరుకు ఎగుమతి అవుతాయి. తాజాగా ఆయా మెట్రో సిటీల్లో «నిమ్మకాయలకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో మార్కెట్లో ఊపు వచ్చింది. కిలో ఆపిల్ కంటే కిలో నిమ్మధర అధికంగా ఉంది. తాజా సీజన్లో మహారాష్ట్రలోని బీజాపూర్, ఏపీలో రాజమండ్రి, ఏలూరు, తెనాలిలో దిగుబడి ఆశించిన మేరకు లేకపోవడం, రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో నిమ్మ కాపు బాగా ఉండడంతో మార్కెట్లో మంచి ధర లభిస్తోందని వ్యాపారులు వివరిస్తున్నారు. బత్తాయి.. మిరప ధరలు జోష్ బత్తాయి, మిరప, మల్లెల ధరలు సైతం జోష్‌లో ఉన్నాయి. టన్ను బత్తాయిలు మేలైనవి రూ.60 వేలు పలుకుతుంటే.. కాయ నాణ్యతను బట్టి రూ.40 వేలకు తక్కువ లేకుండా ధర ఉంది. మిరపలో ఆకాష్ రకం కాయలు ధరలు బాగా ఉన్నాయి. బెంగళూరు బ్రీడ్ అయిన ఈ రకం నాలుగు రెట్లు అధికంగా కారం ఉంటుంది. దీంతో మెట్ట ప్రాంత రైతులు అధికంగా సాగు చేశారు. ప్రస్తుతం కిలో రూ.120 తక్కువ లేకుండా ధర పలుకుతోంది. ధరలు బాగా ఉండడంతో ఎకరానికి రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలు లాభాలు దక్కుతున్నాయి. మల్లెపూలు మార్చి నుంచి దిగుబడి ప్రారంభమైంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.300 తగ్గడం లేదు. అక్టోబర్ వరకు దిగుబడి రానుంది. ఉద్యాన పంటల ధరలు నిలకడగా ఉండడంతో రైతులు ఇంట సిరులు కురుస్తున్నాయి. జిల్లాలో సర్వేపల్లి, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి, కోవూరు, కందుకూరు నియోజకవర్గాల్లో ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయి. తిరుపతి జిల్లాలో కలిసిన గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో కూడా అధికంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 వేల హెక్టార్లల్లో ఉద్యాన పంటలు సాగులో ఉండడం విశేషం. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవడంతో ఉద్యాన పంట ఉత్పత్తులు నాణ్యతగా ఉన్నాయి. దీనికి తోడు మార్కెట్లో ధరలు కూడా బాగుండటం, ప్రభుత్వం ఉద్యాన రాయితీలు ప్రకటించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం జిల్లాలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక రాయితీలు ప్రకటించింది. ఆధునిక పద్ధతుల్లో సాగు చేసేందుకు అవసరమైన మెటీరియల్ రాయితీతో అందిస్తోంది. ప్రధానంగా మెట్ట ప్రాంతాల్లో నీటి కొరతను అధిగమించేందుకు బిందు సేద్యంతో పాటు మల్చింగ్ విధానం సాగుకు రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తోంది. నేరుగా రైతుల ఖాతాల్లో ప్రోత్సాహక నగదు జమ చేస్తోంది. హెక్టారుకు రూ.16 వేల రాయితీ అందిస్తోంది. బత్తాయి ధరలు బాగున్నాయి ఈ ఏడాది బత్తాయి ధరలు అశాజనకంగా ఉన్నాయి. కొన్నేళ్లుగా ధరలు లేక రైతులు ఇబ్బంది పడ్డారు. గతేడాది వర్షాలు పుష్కలంగా కురిసి దిగుబడులు బాగా వచ్చాయి. గిట్టుబాటు ధరలు లభించాయి. ఈ ఏడాది మంచి వర్షాలు పడటంతో దిగుబడితో పాటు కాయ నాణ్యత కూడా చాలా బాగుంది. టన్ను ధర కాయ నాణ్యతను బట్టి రూ.45 వేల నుంచి రూ.60 వేలకు పైగా ధరలు పలుకుతున్నాయి. దివంగత వైఎస్సార్ హయాంలో బత్తాయి రైతు ఇంట ఆనందం కనిపించింది. ఇప్పుడు ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి పాలనలో బత్తాయి ధరలు గిట్టుబాటుగా ఉన్నాయి. – సయ్యద్ గౌస్‌మొయిద్దీన్, బత్తాయి రైతు, దాసరి పల్లి, ఉదయగిరి మండంలం -
హార్టికల్చర్ హబ్‌గా ఏపీ
సాక్షి, మచిలీపట్నం: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాలతో ఉద్యాన పంటల సాగులో ఏపీ ముందంజలో ఉంది. సర్కారు ప్రోత్సాహంతో ఏటా వీటి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. రెండేళ్లుగా ప్రతి జిల్లాలోనూ వెయ్యి నుంచి 2వేల హెక్టార్లలో కొత్తగా పంటలు వేస్తున్నారు. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల హెక్టార్లలో 138 రకాల పండ్లు, కూరగాయలు, పువ్వుల పంటలు సాగుచేస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే పండ్లు, పూలకు మంచి డిమాండ్ ఉండటంతో విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. అరుదైన ఉత్పత్తులు ఇక్కడ ప్రత్యేకం ఉద్యాన పంటల సాగులో మిర్చి అత్యధికం. అందులో గుంటూరు జిల్లాలో సాగయ్యే మిర్చికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ పండే మిర్చి దేశంలో ఎక్కడా సాగవ్వదని అధికారులు చెబుతున్నారు. అలాగే, నేల స్వభావంవల్లే రైతులు ఇక్కడ ఈ పంటను అత్యధికంగా సాగుచేస్తున్నారని చెప్పారు. అందుకే ఇక్కడ అత్యధికంగా మిర్చి యార్డులు ఏర్పాటుచేసుకున్నారు. ఇక రెండో స్థానంలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది మామిడి. మొత్తం 52 రకాల మామిడి పంటలు రాష్ట్రంలో సాగవుతున్నాయి. ఇందులో కర్నూలు, కృష్ణా జిల్లాలో సాగయ్యే బంగినపల్లి ఎంతో ప్రత్యేకమైనవి కావడంతో వీటికి డిమాండ్ ఎక్కువ. అదే విధంగా చిత్తూరు జిల్లాలోని తోతాçపురి రకానికి కూడా. ఇక్కడ ఏటా మామిడి సాగు పెరుగుతుండటంతో చిత్తూరు జిల్లాలో పెద్దఎత్తున గుజ్జు పరిశ్రమలు ఏర్పాటుచేసి ఎగుమతి చేస్తున్నారు. టమాటా, ఉల్లికి కేరాఫ్ చిత్తూరు, కర్నూలు ఇక టమాటా, ఉల్లి పంట ఉత్పత్తులకు నిలయం చిత్తూరు, కర్నూలు జిల్లాలు. ఇక్కడ ఈ రెండు పంటలు అధికంగా సాగుచేస్తున్నారు. టమాటా కోసం మదనపల్లిలో ప్రత్యేకంగా మార్కెట్ యార్డును ఏర్పాటుచేయగా.. కర్నూలులో అతిపెద్ద ఉల్లి మార్కెట్ యార్డు ఉంది. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో ఈ రెండు ప్రధానమైనవిగా చెప్పుకుంటారు. ఈ రెండు మార్కెట్లే వీటి ధరలను నిర్ణయించడం విశేషం. ఇక్కడ నుంచే వీటిని వివిధ రాష్ట్రాలకు ఎగుమతి కూడా చేస్తున్నారు. ఇకపోతే రాష్ట్రంలో మరో ప్రధానమైన ఉద్యాన పంట అరటి. వివిధ ప్రాంతాల్లో 17 రకాల అరటి పంటలు సాగుచేస్తున్నారు. అమృతపాణి, చక్కరకేళి, కర్పూరం రకాలకు ఎక్కువ డిమాండ్. వైఎస్సార్ కడప జిల్లా కోడూరులో అరటి పంటను అత్యధికంగా సాగుచేస్తున్నారు. కొత్త రకాల సాగు.. రాయలసీమ జిల్లాల్లో కొత్తకొత్త రకాల పండ్ల తోటలు వేస్తున్నారు. వైఎస్సార్ కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో డ్రాగన్ ప్రూట్ పంటల సాగుచేస్తున్నారు. మొదట్లో ఎకరం, రెండెకరాల్లో ప్రారంభమైన ఈ పంటల సాగు ఏటా పెరుగుతూ వస్తోంది. ఈ మూడు జిల్లాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ పంటను సాగుచేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నట్లు ఉద్యాన శాఖాధికారులు చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో ఖర్జూరం, కర్నూలు జిల్లాలో ద్రాక్ష సాగు విస్తరిస్తోంది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆయిల్‌పామ్ సాగు పంటపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. దాంతో కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ అంపాపురం వద్ద నూనెగింజల ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేశారు. రెండు జిల్లాల నుంచి వచ్చే పంట ఉత్పత్తుల ద్వారా ప్రతిరోజూ 1.60 లక్షల టన్నుల ప్రొడక్షన్ ఉందని పరిశ్రమ నిర్వాహకులు వెల్లడించారు. మరోవైపు.. రాష్ట్రంలో జీడిపప్పు సాగు కూడా అనూహ్యంగా పెరుగుతోంది. కొబ్బరి తోటలూ అధికంగా ఉన్నాయి. ఉపాధి పథకంతో ఊతం ఉద్యాన వనాలకు ‘ఉపాధి’ హామీ పథకం ఎంతగానో చేయూతనిస్తోంది. పండ్ల తోటల పెంపకానికి ఈ పథకం రైతులకు బాసటగా నిలుస్తోంది. మూడేళ్లపాటు వాటి సంరక్షణకు తోడ్పాటునిస్తోంది. తమ సొంత పొలాల్లో తాము కోరుకున్న పండ్ల తోటలు పెంచుకుంటూనే ‘ఉపాధి’ పొందే వెసులుబాటు కల్పిస్తుండడంతో రైతులు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. సొంత పొలంలో గుంతలు తీసి మొక్కలు నాటేందుకు అయ్యే ఖర్చుని ప్రభుత్వమే భరిస్తోంది. తోట పెంపకానికి ఎంతమంది ఉపాధి కూలీలు అవసరమవుతారో గుర్తించి, ఆ రైతుతో పాటు వారికి కూడా వేతనాలు చెల్లిస్తారు. తన తోటలో తాను పనిచేసుకుంటూ రోజుకు రూ.220కు పైగా వేతనం పొందే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది రైతులు తోటల పెంపకానికి మొగ్గు చూపుతున్నారు. ఒక్కో రైతుకు గరిష్టంగా కనీసం వంద రోజుల పనిదినాలు కల్పిస్తున్నారు. దాంతో రాష్ట్రంలో పండ్ల తోటల పెంపకంపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. -
ఫలించిన ప్రయోగం
శింగనమల: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వ్యవసాయానికి, ఉద్యాన పంటల సాగుకు ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో రైతులు సైతం పంటల సాగులో నూతన పంథాను అవలంభిస్తున్నారు. కొత్త రకం పంటల సాగుపై దృష్టి సారించిన అనంతపురం రైతులు జిల్లాలోనే కాక పొరుగు రాష్ట్రాల్లోనూ ఆ తరహా పంటలపై అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే శింగనమల మండలం గుమ్మేపల్లికి చెందిన రైతు చంద్రప్రకాష్‌రెడ్డి (బాబు) సరికొత్త ద్రాక్ష రకాన్ని ఎంపిక చేసుకుని ప్రయోగదశలోనే ఆశించిన ఫలితాన్ని సాధించారు. ఆస్ట్రేలియా రకం రెడ్ గ్లోబ్ ఇప్పటి వరకూ ఆస్ట్రేలియాకే పరిమితమైన రెడ్ గ్లోబ్ రకం ద్రాక్షకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ ద్రాక్ష రకాన్ని సాగు చేస్తే ఎలా ఉంటుందని రైతు చంద్రప్రకాష్‌రెడ్డి భావించారు. అనుకున్నదే తడవుగా రెడ్ గ్లోబ్ సాగు చేస్తున్న రైతుల గురించి ఆరా తీస్తూ కర్ణాటకలోని చిక్కబళ్లాపురానికి వెళ్లారు. అక్కడ ఓ రైతు సాగు చేస్తున్న రెడ్ గ్లోబ్ ద్రాక్షను పరిశీలించారు. 2019లో రూట్స్ తీసుకొచ్చి నాటారు. 2020లో రెడ్‌గ్లోబ్ అంటు కట్టించారు. ఒక్కొక్క అంటుకు రూ.150 చొప్పున ఖర్చు పెట్టారు. మొత్తం ఆరు ఎకరాల్లో ఆరు వేల అంటు మొక్కలు నాటారు. పందిరి, ఇతర ఖర్చులు అన్నీ కలిపి ఎకరాకు రూ.10 లక్షల వరకు ఖర్చు పెట్టాడు. ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లోనే పండే ఈ రకం పంట జిల్లా వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుందో.. లేదోననే అనుమానాలు ఉండేవి. అయితే అనూహ్యంగా పంట ఏపుగా పెరిగి ప్రస్తుతం కోత దశకు వచ్చింది. ఓ ప్రయోగం చేద్దామనుకున్నా.. రెడ్ గ్లోబ్ ద్రాక్ష రకం గురించి తెలియగానే ఎలాగైనా ఈ పంట సాగు చేయాలని అనుకున్నా. చిక్కబళ్లాపురంలో ఈ పంట సాగు చేస్తున్నట్లు తెలుసుకుని అక్కడికెళ్లి చూశాను. ఎర్ర నేలలు అనుకూలమని తెలిసింది. దీంతో నాకున్న 50 ఎకరాల్లో ఓ ఐదు ఎకరాల్లో ప్రయోగం చేద్దామని అనుకున్నా. అంటు మొక్కలు తీసుకొచ్చి ఆరు ఎకరాల్లో నాటాను. పశువుల పేడ ఎరువు వాడాను. దిగుబడి ఆశించిన దాని కన్నా ఎక్కువగానే ఉంది. ఎకరాకు 10 నుంచి 15 టన్నుల వరకూ దిగుబడి వస్తుందని అనుకుంటున్నా. ఈ లెక్కన తొలి కోతలో పెట్టుబడులు చేతికి వస్తే.. ఆ తర్వాత వరుస లాభాలు ఉంటాయి. ఆరు నెలల పాటు పంట కోతలు ఉంటాయి. సాధారణంగా మార్కెట్లో రెడ్ గ్లోబ్ ద్రాక్ష కిలో రూ.300 నుంచి రూ.500 వరకు ధర పలుకుతోంది. అయితే జిల్లాలో సరైన మార్కెటింగ్ వసతి లేకపోవడంతో ముంబయి, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లోని మార్కెట్‌కు తరలిస్తున్నా, కిలో రూ.180 నుంచి అమ్ముడుబోతోంది. – చంద్రప్రకాష్‌రెడ్డి, రైతు, గుమ్మేపల్లి, శింగనమల మం‘‘ -
అన్నదాతల సేవలో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్
సాక్షి, అమరావతి: విత్తనం మంచిదైతే.. పంట బాగుంటుంది. పంట కళకళలాడితే... దిగుబడి దిగులుండదు. దిగుబడి, ధరలూ బాగుంటే ఇక రైతన్నకు తిరుగుండదు.. అంతా సవ్యంగా జరగాలంటే మేలి రకం విత్తనం కావాలి. అన్నదాతలు నకిలీ విత్తనాలతో మోసపో కుండా వైఎస్సార్ అగ్రి ల్యాబ్స్ భరోసా కల్పిస్తున్నాయి. ఏటా రూ.వేల కోట్ల పెట్టుబడి మట్టి పాలు కాకుండా కాపాడుతున్నాయి. పైసా ఖర్చు లేకుండా ఇన్‌పుట్స్‌ను ముందుగానే పరీక్షించుకోవడం ద్వారా నాసిరకం బారిన పడకుండా ధైర్యంగా సాగు పనులు చేపడుతున్నామని రైతన్నలు ఆనందంగా చెబుతున్నారు. నాణ్యమైన ధ్రువీకరించిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇప్పటికే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే రైతులకు అందుబాటులోకి వచ్చాయి. ఇక ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటవుతున్న వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ నాణ్యత పరీక్షకు భరోసా కల్పిస్తున్నాయి. 70 కేంద్రాలు ఇప్పటికే సేవలందిస్తుండగా కొద్ది నెలల్లోనే మిగతావి కూడా ప్రారంభం కానున్నాయి. ఆర్బీకేల ద్వారా సరఫరా చేసే ఇన్‌పుట్స్‌తో పాటు మార్కెట్లోకి వచ్చే ప్రతీ ఇన్పుట్ శాంపిల్‌ను ఇక్కడ పరీక్షించుకునే సదుపాయం ఉండటం వల్ల రైతుల్లో నమ్మకం పెరుగుతోంది. సొంతంగా తయారు చేసుకున్న విత్తనమైనా, మార్కెట్లో కొనుగోలు చేసినవైనా నేరుగా ఈ ల్యాబ్‌కు వెళ్లి నాణ్యతను ఉచితంగా పరీక్షించుకోవచ్చు. విత్తనమే కాకుండా ఎరువులు, పురుగు మందుల నాణ్యతను కూడా పరీక్షించుకుని ధీమాగా సాగు పనులు చేపట్టవచ్చు. గతంలో 3 శాతం లోపే పరీక్ష.. రాష్ట్రంలో ఏటా వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు కోసం 1.25 లక్షల లాట్స్ విత్తనాలు, 2.80 లక్షల బ్యాచ్‌ల పురుగు మందులు, 20 వేల బ్యాచ్‌ల ఎరువులు మార్కెట్‌కు వస్తుంటాయి. గతంలో వీటి నాణ్యతను పరీక్షించేందుకు రాష్ట్రంలో 11 ల్యాబరేటరీలు మాత్రమే అందుబాటులో ఉండేవి. పెస్టిసైడ్స్ కోసం 5, ఎరువులు, విత్తన పరీక్షల కోసం మూడు చొప్పున మాత్రమే ప్రయోగశాలలున్నాయి. మార్కెట్లోకి వచ్చే ఎరువుల్లో 30 శాతం, విత్తనాల్లో 3–4 శాతం, పురుగు మందుల్లో ఒక శాతానికి మించి శాంపిళ్లను పరీక్షించే సామర్ధ్యం వీటికి లేదు. దీంతో మార్కెట్లో నకిలీలు రాజ్యమేలేవి. ఏటా వీటి బారిన పడి రైతన్నలు ఆర్థికంగా చితికిపోయే వారు. ఇప్పుడా దుస్థితి తొలగిపోయింది. నాసిరకం తయారీదారుల ప్రొసిక్యూషన్ నాసిరకం ఇన్పుట్స్ బారిన పడకుండా ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన 70 ల్యాబ్స్ ద్వారా 2021–22లో విత్తనాలు, ఎరువులు 10 వేల నమూనాల చొప్పున, పురుగు మందుల శాంపిళ్లు 5,500 పరీక్షించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటివరకు 8,238 విత్తన, 6,490 ఎరువులు, 3,618 పురుగుల మందుల శాంపిల్స్ పరీక్షించారు. వీటిలో 10–20 శాతం రైతులు తెచ్చిన శాంపిల్స్ కాగా మిగిలినవి డీలర్లు అందచేసిన నమూనాలు ఉన్నాయి. 112 విత్తన, 240 ఎరువులు, 41 పురుగుల మందుల నమూనాలు నాసిరకంగా ఉన్నట్లు గుర్తించి తయారీ కంపెనీలను చట్టపరంగా ప్రాసిక్యూట్ చేసేందుకు నోటీసులు జారీ చేశారు. ఖరీఫ్ కల్లా మిగిలిన ల్యాబ్స్ ఇప్పటిదాకా తమిళనాడులో అత్యధికంగా 33 అగ్రీ ల్యాబ్స్ ఉండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి ఫలితంగా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్‌తో నంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఒక్కొక్కటి రూ.6.25 కోట్లతో జిల్లా స్థాయిలో 13 ల్యాబ్స్ ఏర్పాటవుతున్నాయి. రూ.81 లక్షలతో నియోజకవర్గ స్థాయిలో 147 చోట్ల గ్రామీణ ప్రాంతంలో ల్యాబ్స్ సేవలందిస్తాయి. రూ.75 లక్షలతో నాలుగు (విశాఖ, తిరుపతి, అమరావతి, తాడేపల్లిగూడెం) రీజనల్ కోడింగ్ సెంటర్స్ ఏర్పాటు కానున్నాయి. వీటన్నిటి కోసం ప్రభుత్వం రూ.213.27 కోట్లు వ్యయం చేస్తోంది. ఇక సీడ్ జన్యు పరీక్ష కోసం డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీతో మరో రూ.8.50 కోట్ల అంచనా వ్యయంతో గుంటూరులో ల్యాబ్ అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే అత్యాధునిక సౌకర్యాలతో నెలకొల్పిన 70 అగ్రీ ల్యాబ్స్‌ను రైతు దినోత్సవమైన డాక్టర్ వైఎస్సార్ జయంతి రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించడం తెలిసిందే. మిగిలిన వాటిలో 50 ల్యాబ్‌లను మార్చిలో, మిగతా ల్యాబ్‌లతో పాటు జిల్లా ల్యాబ్‌లు, కోడింగ్ సెంటర్లను ఖరీఫ్ సీజన్ కల్లా సిద్ధం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వేగంగా పరీక్ష నివేదికలు.. నియోజకవర్గ స్థాయి ల్యాబ్‌లన్నీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాగానే నెలకు 50 శాంపిల్స్‌ను విత్తనాలు, ఎరువులు ఏటా 88,200 చొప్పున నమూనాలు పరీక్షిస్తారు. ప్రతీ జిల్లా ల్యాబ్‌లో విత్తనాలు, ఎరువుల నమూనాలు 39 వేల చొప్పున, 2 వేల చొప్పున పురుగు మందుల శాంపిల్స్‌ను పరీక్షిస్తారు. ఆ విధంగా ఏటా 1,27,200 శాంపిళ్ల చొప్పున విత్తనాలు, ఎరువులతోపాటు 26 వేల పురుగు మందుల నమూనాలను పరీక్షించి నిర్ధారిస్తారు. విత్తన పరీక్ష నివేదికను వారం నుంచి పది రోజులలోపు పొందవచ్చు. పురుగు మందులు, ఎరువుల నాణ్యత నిర్థారణ రిపోర్టును రెండు మూడు రోజుల్లోనే అందచేస్తారు. రైతులు కాకుండా వ్యాపారులు, డీలర్లు, తయారీదారులు, ఇతరులు నాణ్యత ప్రమాణాల పరీక్ష నివేదిక కోసం ఎరువుల రకాన్ని బట్టి రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు చెల్లించాలి. పురుగు మందులకు సంబంధించి రూ.3,500 చెల్లించాలి. విత్తనాల నివేదిక కోసం రూ.200 చొప్పున చెల్లించాలి. రైతులకు మాత్రం పూర్తి ఉచితం. ప్రభుత్వమే ఈ వ్యయాన్ని భరించి రైతన్నకు తోడుగా నిలుస్తుంది. ప్రతి ల్యాబ్‌లో ఆటోమెషన్ నమూనాల పరీక్ష కోసం ప్రత్యేకంగా ఆటోమేటెడ్ క్వాలిటీ కంట్రోల్ యాప్ (ఇన్సైట్) అభివృద్ధి చేశారు. ఫలితాలను ట్యాంపర్ చేసేందుకు వీల్లేని రీతిలో ప్రతి లేబరేటరీలో ఆటోమేషన్ ఏర్పాటు చేశారు. టెస్టింగ్ చేసిన ప్రతీ ఒక్కటి రికార్డు కావడంతోపాటు ఫలితాలు ఆటోమేటిక్‌గా సిస్టమ్‌లో నమోదవుతాయి. ఏ ల్యాబ్‌లో ఏ బ్యాచ్ శాంపిల్‌ను ఏ సమయంలో పరీక్షించారో నిర్ధారిస్తూ ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా ఈ టెక్నాలజీ నమోదు చేస్తుంది. రైతు షాపు కెళ్లినప్పుడు బ్యాచ్ నెంబర్ చెక్ చేసుకుంటే చాలు నాణ్యతా సర్టిఫికెట్ ఉందో లేదో తెలిసిపోతుంది. శాంపిల్స్‌కు టెస్టింగ్ జరిగిందో లేదో కూడా ట్రాక్ చేసుకోవచ్చు. జిల్లా ల్యాబ్‌లో గ్రో అవుట్ టెస్టింగ్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు. ఇక్కడ మొక్కల జనటిక్ ఫ్యూరిటీ టెస్టింగ్ కూడా చేస్తారు. నాలుగు కేటగీరిల్లో సేకరించిన నమూనాలను పరీక్షిస్తారు. రైతులు తెచ్చే నమూనాలకు ఎలాంటి రుసుము వసూలు చేయరు. ల్యాబ్‌లో విధులు నిర్వహించే ఏవోలు, ఎఈవోలు, ఏడీలకు జాతీయ ఇన్స్టిట్యూట్ల ద్వారా అత్యాధునిక శిక్షణ ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్‌ను సమీప ఆర్బీకేలతో అనుసంధానిస్తున్నారు. ఇన్పుట్స్ పరీక్షించుకునేలా రైతులను ప్రోత్సహించేలా ఆర్బీకే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ధైర్యంగా వాడా... గత సీజన్లో వాడగా మిగిలిన ఎరువుల నాణ్యతపై అనుమానం రావడంతో అగ్రీ ల్యాబ్‌లో పరీక్షించుకున్నా. నాణ్యత బాగుందని నిర్ధారణ కావడంతో ఎలాంటి సందేహం లేకుండా ధైర్యంగా వాడా. రైతులకు చేరువలో ఇంత అద్భుతమైన సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వానికి రైతులు రుణపడి ఉంటారు. సీఎం సార్‌కు కృతజ్ఞతలు –తమ్మా వెంకటరెడ్డి, పామర్రు, కృష్ణా జిల్లా నమ్మకం పెరిగింది ఖరీఫ్‌లో ఎంటీయూ 1064 రకం సాగు చేసా. విత్తనాన్ని నర్సీపట్నం ల్యాబ్‌లో పరీక్షించి నాణ్యమైనదని నిర్థారించడంతో ధైర్యంగా సాగుచేయగలిగా. ఈ ల్యాబ్స్ వల్ల ఇన్పుట్స్ విషయంలో రైతులకు నమ్మకం పెరిగింది. ప్రభుత్వం మంచి పని చేసింది. –రెడ్డి రామరాజు, సుబ్బరాయుడుపాలెం, విశాఖ జిల్లా మొలకెత్తడమే అదృష్టంగా ఉండేది... ఎన్‌ఎల్‌ఆర్ 34449 వరి విత్తనాన్ని ఆత్మకూర్ ల్యాబ్‌లో పరీక్షించుకున్నా. నాణ్యత బాగుందని రిపోర్టు వచ్చింది. గతంలో ఇలాంటి సౌకర్యం లేదు. మార్కెట్లో కొన్న విత్తనం ఎలా ఉన్నా విత్తుకోవల్సిందే. అదృష్టం బాగుంటే మొలకెత్తుతాయి. లేకుంటే లేదు అన్నట్టుగా ఉండేది. ల్యాబ్‌లు ఏర్పాటు చేసిన తర్వాత పైసా ఖర్చు లేకుండా పరీక్షించుకునే సౌకర్యం అందుబాటులోకి రావడం వల్ల రైతులకు మేలు జరుగుతోంది. –షేక్ ఖాదర్ బాషా, ఆత్మకూర్, నెల్లూరు జిల్లా ఎంతో ఉపయోగం.. మినుము విత్తనాన్ని (ఎన్ఆర్ఐ–బీ002) ఆళ్లగడ్డ ల్యాబ్‌లో పరీక్షించి చూసుకున్నా. బాగా మొలకెత్తుతుందని నిర్ధారణ కావడంతో విత్తుకున్నా. పంట బాగుంది. చాలా ఆనందంగా ఉంది. ఈ ల్యాబ్‌లు రైతులకెంతో ఉపయోగం. –ఎన్ వెంకటేశ్వర్లు, రుద్రవరం, కర్నూలు జిల్లా జవాబుదారీతనం.. నాణ్యమైన ఇన్పుట్స్ వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ సేవలు 2021 ఖరీఫ్ సీజన్ నుంచి అందుబాటులోకి వచ్చాయి. కంపెనీలు, అమ్మకందారుల్లో జవాబుదారీతనంతో పాటు రైతులకు నాణ్యమైన ఇన్‌పుట్స్‌ను అందుబాటులోకి తీసుకు రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ నకిలీల మాటే ఉండదు.. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఇక మార్కెట్లో నకిలీలు, నాసిరకం అనే మాట వినపడదు. ఏ ఇన్పుట్ అయినా దర్జాగా వినియోగించుకునే దైర్యం వస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచలనలకు అనుగుణంగా దేశంలో ఎక్కడా లేని విధంగా వీటిని తీసుకొచ్చాం. –పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ శాశ్వత వ్యవస్థ.. సీఎం సంకల్పం రైతులకు నాణ్యమైన ఇ¯న్పుట్స్ ఇవ్వడానికి శాశ్వతంగా ఓ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం. ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లను తీసుకొచ్చాం. నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ల్యాబ్స్‌తో పాటు నాలుగు రీజనల్ కోడింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఆర్బీకేలో కూడా టెస్టింగ్ కిట్స్ పెట్టాం. ఈ వ్యవస్థ పూర్తి స్థాయిల్లో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను టెస్టింగ్ చేయకుండా అమ్మకాలకు అనుమతించం. –కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి ముందు జాగ్రత్తతో.. కృష్ణా జిల్లా పామర్రు మండలం జుజ్జువరం రైతు జన్ను నాగ ఫణీంద్ర ఐదెకరాల్లో కూరగాయలు పండిస్తుంటారు. విత్తనం మొలకెత్తి పూత, పిందె దశలు దాటి కాపుకొచ్చేదాకా దేవుడినే నమ్ముకునేవాడు. నాసిరకం విత్తనాల వల్ల ఒక్కోసారి మొలక కూడా వచ్చేవి కాదు. మొలకెత్తినా దిగుబడి చూశాక దిగాలు తప్పదు. ఆయనకు ఇప్పుడా అవస్థలు లేవు. వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రీ ల్యాబ్స్ ద్వారా విత్తనాల నాణ్యతను ఉచితంగా పరీక్షించుకుని నమ్మకంగా కూరగాయలు పండిస్తున్నాడు. ఆయన సొంతంగా తయారు చేసుకున్న కూరగాయ విత్తనాలను పామర్రులోని అగ్రి ల్యాబ్‌లో పరీక్షించగా బీర విత్తనాల్లో మొలక శాతం (జర్మినేషన్) ఏమాత్రం లేదని నిర్ధారణ కావడంతో వాటిని వదిలేసి నాణ్యమైన బీర రకాలను ఎంచుకున్నాడు. బెండ విత్తనంలో 88 శాతం మొలక సామర్థ్యం ఉన్నట్లు తేలడంతో ధీమాగా సాగు చేశాడు. మొలక శాతం లేని బీర విత్తనాలను సాగుచేసి ఉంటే రూ.15 వేల పెట్టుబడితో పాటు కనీసం 20–25 క్వింటాళ్ల దిగుబడి కోల్పోవడం ద్వారా రూ.30–40 వేల ఆదాయాన్ని నష్టపోయే వాడినని చెప్పారు. సీజన్లో విలువైన 20 రోజుల సమయాన్ని కోల్పోవాల్సి వచ్చేదని నాగఫణీంద్ర ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు. ల్యాబ్‌లో నాణ్యతను పరీక్షించుకోవడం వల్ల ముందు జాగ్రత్తతో విత్తనాన్ని మార్చుకుని పంట కాపాడుకోగలిగానని సంతృప్తిగా చెప్పాడు. -
సేంద్రియ విధానం... కొత్త పురుగు.. పరుగో పరుగు
పిఠాపురం: ‘త్రిప్స్ పార్విస్పైనస్’.. ఇండోనేషియా నుంచి వచ్చిన కొత్త రకం తామర పురుగు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో విధ్వంసం సృష్టిస్తోంది. రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మిరప, మామిడి, చింత, పత్తి, మునగ, దోస, సొర, క్యాప్సికమ్, బంతి, చామంతి వంటి ఉద్యాన పంటలను చిదిమేస్తోంది. ఈ పురుగు ఉధృతిని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ పరిశోధనా సంస్థలు రంగంలోకి దిగి అధ్యయనం చేపట్టాయి. కాగా, ఈ కొత్త పురుగును తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ రైతులు సేంద్రియ విధానాలతో కట్టడి చేస్తున్నారు. గ్రామంలో 650 ఎకరాల్లో మిరప సాగు చేయగా.. సేంద్రియ పద్ధతులు పాటించిన 80 ఎకరాల్లో మిరప చేను కొత్త పురుగును తట్టుకుని నిలబడింది. దీంతో మిగిలిన రైతులు కూడా సేంద్రియ మందుల వాడకం ప్రారంభించి సత్ఫలితాలు సాధిస్తున్నారు. కుళ్లిన ఉల్లితో కషాయం దుర్గాడ గ్రామంలో కొంత విస్తీర్ణంలో ఉల్లి కూడా పండిస్తుంటారు. ఉల్లి కుళ్లి పోతే పనికి రాదని పారేసేవారు. ఇప్పుడు ఆ కుళ్లిన ఉల్లి మరో పంటకు ప్రాణం పోస్తోంది. కుళ్లిన ఉల్లితో రైతులు కషాయం తయారు చేస్తున్నారు. 70 కేజీల ఉల్లి, 20 కేజీల వేపాకు, 20 కేజీల సీతాఫలం ఆకు, 70 లీటర్ల దేశవాళీ ఆవు మూత్రం, 5 కేజీల ఉమ్మెత్త ఆకు, 4 లీటర్ల నీరు కలిపి 4 గంటలు ఉడకబెట్టి జీవామృతం తయారు చేస్తున్నారు. దీనినుంచి సుమారు 100 నుంచి 110 లీటర్ల జీవామృతం తయారవుతుండగా.. ఎకరానికి 6 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీటితో కలిపి మిరప పంటపై పిచికారీ చేస్తుంటే కొత్త పురుగుతోపాటు ఇతర పురుగులు సైతం చనిపోతున్నట్టు రైతులు చెబుతున్నారు. దీనిని వారానికి ఒకసారి చొప్పున మూడు వారాలపాటు పంటకు పిచికారీ చేస్తున్నారు. దీనివల్ల కొత్త తామర పురుగు పూర్తిగా పోతోందని, దెబ్బతిన్న పంట కూడా తిరిగి ఊపిరి పోసుకుంటోందని ఇక్కడి రైతులు చెబుతున్నారు. నాలుగో వారంలో పులియబెట్టిన మజ్జిగ పిచికారీ చేస్తున్నామని, దీనివల్ల పంటకు చల్లదనం వస్తుందని చెబుతున్నారు. దేశవాళీ ఆవు పాలతో తయారైన మజ్జిగ మాత్రమే ఇందుకు ఉపయోగపడుతుందంటున్నారు. కాగా, ఉల్లి కషాయాన్ని పొరుగు రైతులకు లీటరు రూ.30 చొప్పున అమ్ముతున్నారు. కుళ్లిన చేపలతో మీనామృతం మరోవైపు ఇతర చీడపీడల నుంచి రక్షించుకునేందుకు మీనామృతాన్ని ఇక్కడి రైతులు వినియోగిస్తున్నారు. పిండినల్లి, పూత రాలడం వంటి సమస్యకు కుళ్లిన చేపలతో మీనామృతం తయారు చేస్తున్నారు. 70 కేజీల కుళ్లిన చేపలు, 70 కేజీల పాత బెల్లం, 70 లీటర్ల నీరు కలిపి 21 రోజులు ఊరబెడుతున్నారు. ఊరిన తరువాత 10 లీటర్ల నీటికి 100 మిల్లీలీటర్ల మీనామృతం చొప్పున కలిపి పిచికారీ చేస్తున్నారు. మీనామృతంను లీటరు రూ.100కు విక్రయిస్తున్నారు. అల్లం, వెల్లుల్లితో అగ్ని అస్త్రం మరోవైపు రసం తొలిచే పురుగు, గొంగళి పురుగు, కాయ తొలిచే పురుగుల నుంచి కాపాడుకునేందుకు అల్లం, వెల్లుల్లి కషాయాన్ని వినియోగిస్తున్నారు. కేజీ అల్లం, 500 గ్రాముల వెల్లుల్లి, కేజీ పొగాకు, 2 కేజీల వేపాకులను 48 గంటలపాటు నీటిలో నానబెట్టి దానిని మిర్చి పంటలపై పిచికారీ చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నట్టు ఇక్కడి రైతులు చెబుతున్నారు. పరిశీలిస్తున్నాం కొత్త పురుగు ఉధృతి ఇటీవల బాగా పెరిగింది. దీనిపై ఎప్పటికప్పుడు పరిశీలించి రైతులకు సూచనలు, సలహాలు ఇస్తున్నాం. సేంద్రియ మందులతో కొత్త పురుగు ఉధృతి తగ్గినట్టు కనిపిస్తోంది. దుర్గాడలో రైతులు పాటిస్తున్న సేంద్రియ విధానాలపై ఉద్యాన శాస్త్రవేత్తలకు సమాచారం ఇచ్చాం. వారు వచ్చి నిర్ధారిస్తే సేంద్రియ మందుల తయారీ మరింత పెరిగే అవకాశం ఉంది. – శైలజ, ఉద్యాన అధికారి, పిఠాపురం కొత్త పురుగును తరిమికొడుతున్నారు స్థానిక రైతులు సేంద్రియ పద్ధతులతో కొత్త పురుగును తరిమికొడుతున్నారు. రసాయనక ఎరువులు, మందుల కంటే ఇవి బాగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఉల్లి కషాయం వాడిన పొలాల్లో మిరప పంట కొత్త పురుగును తట్టుకుని నిలబడింది. అలా వాడిన పొలాల్లో పంట మళ్లీ పుంజుకుంటోంది. – అనంతకుమార్, డిజిటల్ మాస్టర్ ట్రైనర్, ప్రకృతి వ్యవసాయం పరిశీలించి నిర్ధారిస్తాం సేంద్రియ మందుల వినియోగం వల్ల కొత్త పురుగు తగ్గుతున్నట్లు చెబుతున్నారు. అయితే వాటిని పరిశీలించి ఎంతవరకు తగ్గుతుంది, ఎలా పని చేస్తుందనేది నిర్ధారించాల్సి ఉంది. త్వరలో తూర్పు గోదావరి జిల్లా పర్యటించి పంటలను పరిశీలించి నిర్ధారిస్తాం. – శిరీష, ఉద్యాన శాస్త్రవేత్త, గుంటూరు ఉల్లి కషాయం కొత్త పురుగును కట్టడి చేస్తోంది కుళ్లిన ఉల్లి, వేపాకులతో తయారు చేస్తున్న కషాయం కొత్త పురుగును బాగా కట్టడి చేస్తోంది. ఇలా చేయడం వల్ల ఇప్పటివరకు సుమారు 80 ఎకరాల్లో మిర్చి పంటలు కొత్త పురుగును తట్టుకుని నిలబడ్డాయి. దీంతో మిగిలిన రైతులు సేంద్రియ మందులు వాడటం ప్రారంభించారు. సొంతంగా దేశవాళీ ఆవులను పెంచుతూ బారీగా ఉల్లి కషాయం, మీనామృతం, అగ్ని అస్త్రం వంటి మందులు తయారు చేసి స్థానిక రైతులకు అందుబాటులోకి తెస్తున్నాము. దీనివల్ల మా ఏరియాలో కొత్త పురుగు ఉధృతి చాలా వరకు నియంత్రించబడింది. – గుండ్ర శివచక్రం, రైతు, దుర్గాడ -
మల్చింగ్.. ఇక సులభం!
ఎత్తు మడులపై మల్చింగ్ షీట్ పరిచి ఉద్యాన పంటలు పండించడానికి సాధారణంగా ట్రాక్టర్‌కు అనుసంధానం చేసే పరికరాన్ని ఉపయోగిస్తుంటారు. ఎకరానికి 6 నుంచి 8 మంది కూలీల అవసరం ఉంటుంది. ఒక రోజు నుంచి రోజున్నర సమయం పడుతుంది. అయితే, సులువుగా, తక్కువ ఖర్చుతో మల్చింగ్ షీట్‌ను పరిచే పరికరాన్ని మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన యువకుడు రూపొందించారు. కేవలం ఇద్దరు మనుషులతో, 8 గంటల్లోనే ఎకరంలో మల్చింగ్ షీట్ పరచడానికి ఉపయోగపడే మల్చింగ్ పరికరాన్ని యువ ఉపాధ్యాయుడు, రైతు నితిన్ ఘలే పాటిల్ రూపొందించారు. నాసిక్‌లోని శివాజీ నగర్లో గల అభినవ్ బాల్‌వికాస్ మందిర్ పాఠశాలలో నితిన్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తూనే వ్యవసాయాన్ని మక్కువతో చేస్తుంటారు. గత ఏడాది మే నెలలో తన 7 ఎకరాల భూమిలో టమాటో, మిరప, బంతిపూలను సాగు చేయటం కోసం ఎత్తుమడులపై మల్చింగ్ షీట్ పరవాలని అనుకున్నాడు. అయితే, కూలీల కొరత వల్ల సాధ్యంకాలేదు. ఆ క్రమంలో మల్చింగ్ షీట్ పరిచే ప్రక్రియను సులభతరం చేసే పరికరాన్ని తయారు చేసుకునే ప్రయత్నం చేశాడు. తన వద్ద ఉన్న పాత ఇనుము వస్తువులను ఉపయోగించి, సొంత ఆలోచన ప్రకారం వెల్డింగ్ చేయించి ఒక పరికరాన్ని రూపొందించాడు. ట్రాక్టర్‌కు అనుసంధానం చేసి దీన్ని ఉపయోగించే ప్రయత్నం చేశాడు. మల్చింగ్ షీట్ చిరిగిపోతుండటంతో.. ట్రాక్టర్ లేకుండా మనుషులు ఈడ్చుకుంటూ వెళ్తూ మల్చింగ్ షీట్ పరిచేలా మార్పులు చేశాడు. పరికరం అడుగున చక్రాలను అమర్చటంతోపాటు.. పరిచిన షీట్‌పై మట్టి ఎగదోయడానికి వీలుగా రెండు ఇనుప బ్లేడ్లను అమర్చడంతో ఈ పరికరం సిద్ధమైంది. 15 రోజులు కష్టపడి అనేక విధాలుగా మార్పులు చేస్తూ చివరికి విజయం సాధించారు. తన పొలంలో ఉపయోగించడంతోపాటు మరో ఇద్దరు రైతులకు కూడా ఈ పరికరాన్ని ఇచ్చి పరీక్షించానన్నారు నితిన్. ‘మా ప్రాంతంలో ఎకరంలో మల్చింగ్ షీట్ పరచడానికి 12 మంది కూలీలు అవసరం. వారి కూలి, తిండితో కలిపి రూ. 8 వేల వరకు రైతుకు ఖర్చవుతుంది. నేను ఈ పరికరాన్ని రూ. 10 వేలకే తయారుచేసి ఇస్తున్నాను. ఒక్కసారి కొనుక్కుంటే చాలు. ఇద్దరు మనుషులతో దీనితో మల్చింగ్ షీట్ పరచవచ్చు. ఎకరాన్ని 8 గంటల్లోనే పూర్తి చేయవచ్చు. చిన్న రైతులకు ఇది చాలా బాగా ఉపయోగపడుతోంది. కూలీలతో కూడా పనిలేకుండా రైతు కుటుంబ సభ్యులే దీన్ని ఉపయోగించవచ్చు. సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని కొద్ది రోజుల్లోనే వంద మంది రైతులు ఇది కావాలన్నారు..’ అని నితిన్ (98909 82432) సంతోషంగా చెప్పారు. తన టొమాటో తోటలో నితిన్ పాటిల్ -
బీడు భూముల్లోనూ ఉద్యాన సిరులు
కర్నూలు (అగ్రికల్చర్): పండ్ల తోటల సాగులో రాష్ట్ర ప్రభుత్వం విప్లవం తీసుకొస్తోంది. బీడు భూముల్లోనూ ఉద్యాన పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తోంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వంద శాతం సబ్సిడీతో పండ్ల తోటల సాగుకు అవకాశం కల్పిస్తోంది. బావి, బోరు లేకున్నా పండ్ల తోటలు అభివృద్ధి చేసుకునేలా డ్రై ల్యాండ్ హార్టీకల్చర్ పథకం కింద బీడు భూమి సమీపంలోని చెరువు, కుంట, ఫారమ్ పాండ్ నుంచి నీళ్లు తెచ్చి మొక్కలను బతికించుకునే విధంగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. కరువు పీడిత జిల్లాల రైతులకు ఈ పథకం వరంగా మారుతోంది. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో చాలామంది రైతులు ఈ విధానం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది లక్ష ఎకరాల్లో పండ్ల తోటలు 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ విధానంపై ఆసక్తి ఉన్న 39,173 మంది రైతులను ఇప్పటివరకు అధికారులు గుర్తించారు. 60,495 ఎకరాల్లో సాగుకు అంచనాలు సిద్ధం చేశారు. వీరిలో 23,747 మంది రైతులకు 38,096 ఎకరాల్లో సాగు చేపట్టేలా ఇప్పటికే అనుమతులు ఇచ్చారు. పండ్ల తోటల అభివృద్ధిలో కర్నూలు జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో ఉంది. ఉపాధి నిధులతో పండ్ల తోటల సాగులో అనంతపురం జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. కృష్ణా జిల్లా అట్టడుగున ఉంది. అనంతపురం జిల్లాలో 15,001 ఎకరాల్లో పండ్ల తోటల సాగు చేపట్టాలనేది లక్ష్యం కాగా.. ఇప్పటికే 15,351 ఎకరాలకు సంబంధించి 5,652 మంది రైతులను గుర్తించడం విశేషం. విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోనూ పండ్ల తోటల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఉపాధి నిధులతో అన్ని రకాల పండ్ల తోటలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. రైతులు పండ్ల మొక్కలను ఎక్కడి నుంచైనా తెచ్చుకుని నాటుకోవచ్చు. వీటికి జిల్లాస్థాయి పర్చేజ్ కమిటీ నిర్ణయించిన ధరలను చెల్లిస్తారు. లేకపోతే ప్రభుత్వం టెండర్ ద్వారా ఎంపిక చేసిన నర్సరీల నుంచి తెచ్చుకోవచ్చు. 26 వేల కి.మీ. పొడవునా అవెన్యూ ప్లాంటేషన్ పండ్ల తోటలను అభివృద్ధి చేస్తూనే.. మరోవైపు పచ్చదనం పెంపుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 26,002 కి.మీ. రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు నిర్ణయించింది. కి.మీ.కు 200 మొక్కల చొప్పున నాటి పచ్చదనం అభివృద్ధికి గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు 15,027 కి.మీ. మేర అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టేందుకు అంచనాలు సిద్ధం చేశారు. ఇందులో ఇప్పటికే 6,600 కి.మీ. మేర మొక్కలు నాటేందుకు పరిపాలన అనుమతులొచ్చాయి. పచ్చదనం తరిగిపోయిన కొండల్లో అటవీ జాతి చెట్లకు సంబంధించి లక్షలాది సీడ్‌బాల్స్‌ను వెదజల్లనున్నారు. కర్నూలు జిల్లాలోనే 10 లక్షల సీడ్‌బాల్స్‌ను వేయనున్నారు. డ్రై ల్యాండ్ హార్టీకల్చర్ రైతుల్ని ఆదుకుంటోంది ఉపాధి హామీ పథకం కింద వంద శాతం సబ్సిడీతో చేపట్టిన డ్రై ల్యాండ్ హార్టీకల్చర్ పథకం రైతులను ఆదుకుంటోంది. ఉపాధి నిధులతో జిల్లాలో 35 వేల ఎకరాల్లో పండ్ల తోటల్ని అభివృద్ధి చేశాం. ఈ ఏడాది జిల్లాలో 8వేల ఎకరాల్లో పండ్ల తోటలు, 2 వేల కిలోమీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్‌కు చర్యలు తీసుకున్నాం. – అమరనాథరెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్, డ్వామా, కర్నూలు -
ఉద్యాన హబ్‌గా ఏపీ
సాక్షి, అమరావతి: ఉద్యాన పంటల హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయ సమావేశ మందిరంలో ఉద్యాన పంచాంగం 2021–22ని శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆధునిక పద్ధతుల్లో ఉద్యాన పంటల సాగు ద్వారా ఆరోగ్యకరమైన పంటలు పండించాలని రైతులకు సూచించారు. ఉద్యాన పంటల సాగు వైపు యువ రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీనిని ప్రతి రైతు భరోసా కేంద్రంలో రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఉద్యాన వర్సిటీ, ఉద్యాన శాఖ సమన్వయంతో పనిచేసి రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు విస్తరణకు పాటుపడాలన్నారు. పురుగుల మందుల వాడకాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేలా రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ సేంద్రియ సాగును ప్రోత్సహించాలన్నారు. పరిశోధనా ఫలాలు, నూతన యాజమాన్య పద్ధతులు, నూతన వంగడాలు, సస్యరక్షణ, ఏ నెలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలపై తీర్చిదిద్దిన ఉద్యాన పంచాంగాన్ని రూపొందించిన వర్సిటీ వైస్ చాన్సలర్, శాస్త్రవేత్తలను మంత్రి కన్నబాబు అభినందించారు. వైస్ చాన్సలర్ డాక్టర్ టి.జానకిరామ్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ అరుణ్‌కుమార్, విస్తరణ, పరిశోధనా సంచాలకులు డాక్టర్ బి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
'పంట తల్లీ'.. ఎలా ఉన్నావ్!
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్, శాస్త్రవేత్తలు పల్లెబాట పట్టారు. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను వేదికగా చేసుకుని ఉద్యాన రైతులతో మమేకమవుతున్నారు. ప్రయోగ శాలల్లో చేసిన పరిశోధనల ఫలితాలను సాధ్యమైనంత త్వరగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం ద్వారా సాగులో సత్ఫలితాలను సాధించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని సాకారం చేసే దిశగా ‘మన గ్రామం.. మన విశ్వవిద్యాలయం’ కార్యక్రమానికి ఉద్యాన వర్సిటీ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం కింద శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, ఉద్యాన అధికారులతో కలిసి వారంలో ఒకరోజు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి పంటల యోగక్షేమాలను స్వయంగా పరిశీలిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. వీసీ టు విలేజ్ మన గ్రామం.. మన విశ్వవిద్యాలయం కార్యక్రమానికే పరిమితం కాకుండా వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ టి.జానకిరామ్ సైతం ‘వీసీ టు విలేజ్’ పేరిట పల్లెబాట నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ పరిష్కారానికి తగిన చర్యలు చేపడుతున్నారు. రైతులకు మేలు జరగాలంటే ఏ తరహా పరిశోధనలు, ఏ స్థాయిలో చేయాలనే అంశంపై శాస్త్రవేత్తలకు సైతం ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కలుగుతోంది. గడచిన ఏడు నెలల్లో 22 గ్రామాల్లో ఈ కార్యక్రమాల్ని నిర్వహించారు. 42 గ్రామాలను దత్తత తీసుకున్న వర్శిటీ ఉద్యాన వర్సిటీకి అనుబంధంగా 4 కృషి విజ్ఞాన కేంద్రాలు, 19 ఉద్యాన పరిశోధనా కేంద్రాలు, 4 ఉద్యాన, 4 పాలిటెక్నిక్, 11 అనుబంధ కళాశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో ఒక్కో గ్రామం చొప్పున మొత్తం 42 గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆ గ్రామాల్లో ఉద్యాన పంటల సాగులో యూనివర్సిటీ కొత్తగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా వ్యవసాయ, ఉద్యాన సహాయకుల సహకారంతో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కొత్త రకం ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించే దిశగా సహకారం అందిస్తున్నారు. కావాల్సిన విత్తనాలను సమకూర్చడంతో పాటు సాగులో అవసరమైన మెళకువలపైనా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. దత్తత గ్రామాల రైతులతో ప్రతి బుధవారం యూనివర్సిటీ నుంచే వెబినార్ ద్వారా సమావేశమవుతూ సూచనలు, సలహాలు అందిస్తున్నారు. రైతులకు మరింత మేలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల మేరకు పల్లెబాట పట్టాలన్న సంకల్పంతో నిర్వహిస్తున్న వీసీ టు విలేజ్, మన గ్రామం.. మన విశ్వవిద్యాలయం కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. వారానికో గ్రామాన్ని సందర్శిస్తున్నాం. క్షేత్ర స్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలెన్నో మా దృష్టికి వస్తున్నాయి. దీనివల్ల మరింత లోతైన పరిశోధనలు చేసేందుకు అవకాశం కలుగుతోంది. – డాక్టర్ టి.జానకిరామ్, వీసీ, ఉద్యాన వర్సిటీ చాలా ప్రయోజనకరంగా ఉంది మన ఊరు–మన విశ్వవిద్యాలయం కార్యక్రమంలో భాగంగా మా గ్రామాన్ని గతేడాది గాంధీ జయంతి రోజున కేవీకే శాస్త్రవేత్తలు దత్తత తీసుకున్నారు. ఆర్గానిక్ వ్యవసాయం, కోళ్ల పెంపకంపై శిక్షణ ఇస్తున్నారు. జీడిమామిడి రైతులను పందిరి మామిడి పరిశోధనా కేంద్రానికి తీసుకెళ్లి జీడిమామిడి పిక్కల ప్రొసెసింగ్ ఎలా చేయాలో వివరించారు. తాటికల్లుతో బెల్లం ఎలా తయారు చేయాలో చెప్పారు. కూరగాయ, పెరటి తోటల విత్తనాలు ఇచ్చారు. ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంది – కోతం మోహనరావు, పండుగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా -
ఉద్యాన పంటలకు ఊతం
సాక్షి, అమరావతి: ఉద్యాన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం ఊతమిస్తుండటంతో వాటి రూపురేఖలు మారుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం (మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టీకల్చర్–ఎంఐడీహెచ్) కింద ప్రభుత్వం పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. అంతేకాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేస్తోంది. దీంతో ఉద్యాన రైతులు ఉత్పత్తి నష్టాలను తగ్గించుకుంటుండగా.. మరోవైపు సాగు విస్తీర్ణం, ఎగుమతులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. 9 జిల్లాల్లో అమలు రాష్ట్రంలో 17.84 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఏటా 3.12 లక్షల టన్నుల దిగుబడులొస్తున్నాయి. గతంలో పంటను మార్కెట్‌కు తరలించేందుకు, డిమాండ్ ఉన్నచోట గిట్టుబాటు ధరకు అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడేవారు. గ్రేడింగ్, ప్యాకింగ్, రవాణా వంటి సౌకర్యాల లేకపోవడం వల్ల ఉత్పత్తిలో 30 శాతం మేర నష్టపోయేవారు. ఆశించిన స్థాయిలో ఎగుమతులు చేయలేని పరిస్థితి తలెత్తేది. సర్కారు పుణ్యమా అని ఇప్పుడు అలాంటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయి. సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం (ఎంఐడీహెచ్) విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో అమలవుతోంది. గడచిన రెండేళ్లలో 9 జిల్లాల్లోనూ రూ.290.30 కోట్లతో ఈ పథకం కింద కల్పించిన మౌలిక సదుపాయాల వల్ల 31,700 హెక్టార్లు కొత్తగా సాగులోకి వచ్చాయి. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. ఈ పథకం కింద పాత తోటల పునరుద్ధరణ, రక్షిత సేద్యం (గ్రీన్, పాలీ హౌస్) మల్చింగ్, నీటికుంటలు, ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్, కోల్డ్ స్టోరేజ్, రైపనింగ్ చాంబర్లు, ఉల్లి గిడ్డంగులు, యాంత్రీకరణ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. గుంటూరు జిల్లాలో కాపుకొచ్చిన డ్రాగన్ ఫ్రూట్ తోట నీటి కుంటలతో చీనీ తోటలకు రక్షణ బత్తాయి (చీనీ) పంటకు చాలినంత నీటి వనరుల్లేక తోటలు ఎండిపోవడం లేదా నిర్జీవంగా తయారయ్యేవి. ఎంఐడీహెచ్ పథకం కింద పెద్దఎత్తున నీటి కుంటలు (ఫారమ్ పాండ్స్) నిరి్మంచడంతో గడచిన రెండేళ్లుగా చీనీ తోటలు వేసవిలో కూడా కళకళలాడుతున్నాయి. 2019–20లో 435 నీటికుంటల నిర్మాణంతో 3,067 హెక్టార్లు, 2020–21లో 460 నీటికుంటల నిర్మాణంతో 3,250 హెక్టార్లలో తోటలను ఎండిపోకుండా కాపాడగలిగారు. తద్వారా 467 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి పెరిగి రైతులు రూ.1.22 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగలిగారు. అరటి ఎగుమతులకు ఊపు ఈ పథకం ద్వారా అరటి, మిరప సాగుతోపాటు వాటి ఎగుమతులను ప్రోత్సహించేందుకు చేపట్టిన బనానా, చిల్లీ వేల్యూ చైన్ ప్రాజెక్టులు సత్ఫలితాలిస్తున్నాయి. అరటిలో టిష్యూ కల్చర్‌తో పాటు ఫ్రూట్‌కేర్ విధానాల వల్ల సాగు విస్తీర్ణంతో పాటు నాణ్యత కూడా పెరిగింది. దీంతో 1,750 హెక్టార్లలో కొత్తగా అరటి సాగులోకి వచ్చింది. అనంతపురంలో రెండు ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్‌లు, పులివెందులలో రెండు కోల్డ్ స్టోరేజ్‌లు నిర్మించడంతో ఈ ప్రాంతం నుంచి ఏటా 10 వేల టన్నులకు మించని అరటి ఎగుమతులు ఇప్పుడు 1.50 లక్షల టన్నులకు పెరిగాయి. మిరప విషయానికి వస్తే రెండేళ్లలో 38,844 ఎకరాల్లో కొత్తగా సాగు మొదలైంది. తద్వారా ఉత్పాదకతలో 15 శాతం, ఉత్పత్తిలో 8 శాతం వృద్ధి సాధించగలిగారు. ఉత్పత్తి, నాణ్యతకు బూస్ట్ కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాల వల్ల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత నాణ్యత, ఉపాధి అవకాశాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. అంతర పంటల సాగు ద్వారా రైతులు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడులు సాధించగలుగుతున్నారు. 2019–20లో ఈ పథకం కింద రూ.132 కోట్లు ఖర్చు చేయగా.. కొత్తగా 15,200 హెక్టార్లు సాగులోకి వచ్చాయి. 2020–21లో రూ.158.30 కోట్లను వెచ్చించగా.. కొత్తగా మరో 16,500 హెక్టార్లు కలిపి రెండేళ్లలో మొత్తంగా 31,700 హెక్టార్లు సాగులోకి వచ్చాయి. దీనివల్ల 2019–20లో 52,500 మంది రైతులు, 2020–21లో 58,270 మంది రైతులు లబ్ధి పొందారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.180 కోట్లు వెచ్చించి.. కొత్తగా 18,500 హెక్టార్లు సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. తద్వారా 75వేల మంది లబ్ధి పొందే అవకాశాలున్నాయని అంచనా. -
తెలంగాణలో సిరుల ‘పంట’.. లక్ష కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అదే స్థాయిలో పంట దిగుబడులూ గణనీయంగా పెరుగుతున్నాయి. కాలం కలిసి రావడం, సాగునీటి వసతులు పెరగడం, ప్రభుత్వం రైతుబంధు కింద అన్నదాతలకు ఆర్థిక సాయం చేయడంతో పరిస్థితి మరింత మెరుగుపడింది. దీంతో 2020-21లో రెండు సీజన్లలో వ్యవసాయ, ఉద్యాన పంటల స్థూల ఉత్పత్తి విలువ (ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి మొత్తం దిగుబడుల విలువ) ఏకంగా రూ.లక్ష కోట్లని ఉద్యానశాఖ తేల్చింది. 2019-20లో మొత్తం పంటల విలువ రూ.89,058 కోట్లని పేర్కొంది. ఏడాది కాలంలోనే అదనంగా పంటల ఉత్పత్తి విలువ రూ. 10,942 కోట్లు పెరగడం విశేషం. ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి.. 2020–21లో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 2.09 కోట్ల ఎకరాలు కావడం గమనార్హం. 2014–15 వానాకాలం, యాసంగి కలిపి పంటల సాగు విస్తీర్ణం 1.40 కోట్ల ఎకరాలు. ఈ ఏడేళ్లలో సాగు విస్తీర్ణం ఏకంగా 69 లక్షల ఎకరాలు పెరిగింది. 2020–21 ఖరీఫ్‌లో 1.20 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి కాగా, రబీలో దాదాపు 1.35 కోట్ల మెట్రిక్ టన్నులకు పైగా వస్తుందని అంచనా. ఈ యాసంగిలో 65.02 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఇది తెలంగాణలో ఆల్‌టైం రికార్డుగా వ్యవసాయశాఖ పేర్కొంది. యాసంగి వరిసాగు కూడా ఆల్‌టైం రికార్డు నమోదైనట్లు వెల్లడించింది. 50.49 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడినట్లు తెలిపింది. యాసంగిలో సాధారణ వరి సాగు విస్తీర్ణం 22.19 లక్షల ఎకరాలు కాగా, గతేడాది యాసంగిలో 26.97 లక్షల ఎకరాల్లో సాగైంది. అదే ఇప్పటివరకు యాసంగి రికార్డు సాగు. కానీ ఈయేడు యాసంగిలో భారీగా వరి సాగై కొత్త రికార్డును నెలకొల్పింది. వరి సాగు విస్తీర్ణంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌గా నిలిచినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 12.50 లక్షల ఎకరాలు ఉండగా, దాన్ని దీర్ఘకాలికంగా 66లక్షల ఎకరాలకు విస్తరించాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది. అంటే 5 రెట్లకుపైనే ఉద్యాన పంటలను విస్తరించాలని భావిస్తోంది. 2027 నాటికి ఎగుమతి చేసే స్థాయికి ఆయిల్‌పాం వంట నూనెలను ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. దీంతో విదేశీ మారకద్రవ్యం కరిగిపోవడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చుతగ్గులు నూనె ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆయిల్‌పాం సాగు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా తెలంగాణలోనూ ఆయిల్‌పాం సాగుపై ఉద్యాన శాఖ దృష్టి సారించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఆయిల్‌ఫాం సాగు విస్తీర్ణం కేవలం 38 వేల ఎకరాలు మాత్రమే. దీంట్లో 2.08లక్షల మెట్రిక్ టన్నులే ఉత్పత్తి వస్తోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలని.. 2026 నాటికి స్వయం సమృద్ధి సాధించాలని, 2027 నుంచి ఎగుమతులు చేసే స్థాయికి చేరుకోవా లని ఉద్యానశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో స్వల్పకాలిక విస్తరణలో భాగంగా 8.52 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేపట్టాలని నిర్ణయించింది. అందుకోసం ఆయిల్‌ఫెడ్ సహా వివిధ కంపెనీలకు సాగు ప్రాంతాలను అప్పగించింది. దీర్ఘకాలిక విస్తరణ కింద 15 లక్షల ఎకరాల్లో సాగు, 1.65 కోట్ల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకుంది. పండ్లు, కూరగాయల సాగు నాలుగున్నర రెట్లు రాష్ట్రంలో పండ్లు, కూరగాయలు సమృద్ధిగా పండటం లేదు. టమాటా సహా అనేక కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నాం. పండ్లదీ అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలంలో రాష్ట్రంలో పండ్లు, కూరగాయల సాగు విస్తీర్ణాన్ని నాలుగున్నర రెట్ల వరకు పెంచాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో పండ్ల సాగు విస్తీర్ణం 4.49 లక్షల ఎకరాలు కాగా, స్వల్పకాలిక విస్తరణలో భాగంగా 5.13 లక్షల ఎకరాలకు, మధ్యకాలిక లక్ష్యంలో భాగంగా 10 లక్షల ఎకరాలు, దీర్ఘకాలిక విస్తరణలో భాగంగా 19.50 లక్షల ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఉల్లి సహా అన్ని రకాల కూరగాయల సాగు ప్రస్తుత విస్తీర్ణం 2.73 లక్షల ఎకరాలు కాగా, దీర్ఘకాలికంగా దీన్ని 12 లక్షల ఎకరాలకు విస్తరించాలని నిర్ణయించింది. ఇక సుగంధ ద్రవ్యాల ప్రస్తుత సాగు విస్తీర్ణం 3.73 లక్షల ఎకరాలు కాగా, దీర్ఘకాలికంగా 16 లక్షల ఎకరాలకు విస్తరించాలని భావిస్తున్నట్లు ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. అంటే మొత్తం ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం అదనంగా 53.50 లక్షల ఎకరాలు పెంచాలని దీర్ఘకాలిక లక్ష్యంగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఉల్లి సాగు లక్ష్యం.. 3 లక్షల ఎకరాలు ఉల్లి లొల్లి నుంచి బయటపడే దిశగా ఉద్యానశాఖ కసరత్తు ప్రారంభించింది. ఉల్లి కోసం మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాలపై ఆధారపడే పరిస్థితి ఇక ఉండకూడదని నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల్లో ఉల్లి కొరత ఉంటే, ఇక్కడ ధరలు పెరగడం... ఫలితంగా వినియోగదారులు ఇబ్బందులు పడటం తెలిసిందే. దానికి కారణం రాష్ట్రంలో ఉల్లి విస్తీర్ణం పెద్దగా లేకపోవడమే. ప్రస్తుతం రాష్ట్రంలో 18 వేల ఎకరాల్లోనే ఉల్లి సాగవుతోంది. 1.82 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యాన పంటల విస్తీర్ణం పెంపులో భాగంగా స్వల్పకాలిక, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలను ఉద్యానశాఖ నిర్దేశించుకుంది. ఆ ప్రకారం స్వల్పకాలిక విస్తరణలో భాగంగా 75 వేల ఎకరాలకు ఉల్లి సాగు విస్తీర్ణాన్ని పెంచడం ద్వారా 7.90 లక్షల టన్నుల దిగుబడి సాధించాలని నిర్ణయించింది. ఆపై లక్షన్నర ఎకరాలకు ఉల్లి సాగు పెంచి, ఉత్ప త్తిని 16.50 లక్షల టన్నులు చేయడం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇక దీర్ఘకాలిక విస్తరణలో భాగంగా 3 లక్షల ఎకరాల్లో ఉల్లి సాగు చేపట్టి, 35 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. -
రైతులకు రూ.135.70కోట్ల పెట్టుబడి రాయితీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది భారీ వర్షాలు, వరదల వల్ల వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం రూ.135,70,52,500 పెట్టుబడి రాయితీని విడుదల చేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తుది అంచనాలు పూర్తి చేసిన ప్రభుత్వం రాష్ట్ర విపత్తు సహాయ నిధి (ఎస్డీఆర్ఎఫ్) నిబంధనావళి ప్రకారం 33 శాతానికి మించి వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లిన రైతులకు రూ.113,11,68,500 పెట్టుబడి రాయితీని విడుదల చేసింది. ఉద్యాన పంటలు దెబ్బతిన్న రైతులకు రూ.22,58,84,000 మేర పెట్టుబడి రాయితీని విడుదల చేసింది. ఆన్లైన్లో రైతుల ఖాతాలకు జమ జూన్, జూలైలో వర్షాల వల్ల ఉభయ గోదావరి, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో 14,005 మంది రైతులకు చెందిన 8,443.75 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ కమిషనర్ ప్రతిపాదన మేరకు పెట్టుబడి రాయితీగా ప్రభుత్వం రూ.12.39 కోట్లు విడుదల చేసింది. ఆగస్టు, సెపె్టంబర్లో వరదలు, భారీ వర్షాలవల్ల 1,28,889 మంది రైతులకు చెందిన 73,664.73 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. వీరికి రూ.100.72 కోట్లు పెట్టుబడి రాయితీని విడుదల చేసింది. రైతుల బ్యాంకు ఖాతాలు, ఆధార్, ఇతర సమాచారాన్ని పక్కాగా పరిశీలించి ధ్రువీకరించుకున్న తర్వాత పెట్టుబడి రాయితీ మొత్తాన్ని వారి ఖాతాలకు ఆన్లైన్లో జమ చేయాలని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యాన రైతులకు రూ.22.58 కోట్లు... ప్రకాశం, ఉభయ గోదావరి, వైఎస్సార్, కర్నూలు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం రూ. 22.58 కోట్ల పెట్టుబడి రాయితీ విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి సోమవారం వేర్వేరు జీవోలు జారీ చేశారు. సాయంలో శరవేగం.. రైతులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శరవేగంగా స్పందించింది. విపత్తు వల్ల పంట నష్టపోయిన రైతులకు కూడా అతి తక్కువ సమయంలోనే పెట్టుబడి రాయితీని అందిస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విపత్తు బాధిత రైతులకు రూ.1,800 కోట్ల పెట్టుబడి రాయితీని ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ బకాయిలను విడుదల చేసి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఆ తర్వాత కూడా వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు త్వరితగతిన సాయం అందించింది. ఈ ఏడాది సెపె్టంబర్ వరకు రైతులకు పెట్టుబడి రాయితీ మొత్తాన్ని ఇప్పటికే విడుదల చేసింది. ఈ నెలలో భారీ వరదల వల్ల జరిగిన పంట నష్టం అంచనాలను పూర్తి చేసి నవంబర్‌లో బాధిత రైతులకు పెట్టుబడి రాయితీ అందించేలా చర్యలు చేపట్టింది. -
తీపి కబురు!
త్రిపురాంతకం: ఉద్యాన పంటలు కళకళలాడుతున్నాయి. వీటికి ప్రభుత్వ ప్రోత్సాహం లభించడంతో రైతులు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. గత నాలుగేళ్లుగా వర్షాలు లేక తోటలు ఎండుముఖం పడుతు కళావిహీనంగా మారాయి. అయితే ఈ ఏడాది వర్షాలు అధికంగా కురవడంతో మళ్లీ జీవం వచ్చినట్లైంది. రైతు భరోసా కేంద్రాలు కూడా అందుబాటులోకి రావడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా రైతుల ఉత్సాహం జిల్లాలో పండ్ల తోటలను అధిక విస్తీర్ణంలో సాగుచేసేదిశగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వం రాయితీలు ప్రకటించడంతో పాటు వాతావరణం అనుకూలంగా ఉంది. ఉద్యాన పంటలకు అనువైన భూములు ఉండటం మంచి అవకాశంగా మారింది. కొన్ని పంటలకు ఎక్కువగా నీరు అవసరం కాగా.. మిగిలినవి వర్షాధారం. పశ్చిమ ప్రకాశంలో ఒకప్పుడు బత్తాయి, నిమ్మ, బొప్పాయి, అరటి తోటలు విస్తారంగా ఉండేవి. మళ్లీ ఈ పంటలు పూర్వవైభవం పొందే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో బత్తాయి 11685 హెక్టార్లు, నిమ్మ 4,123, మామిడి 10,458, అరటి 801 హెక్టార్లు, సపోట 3201, బొప్పాయి 1940, జామ 725 హెక్టార్లలో తోటలు సాగులో ఉన్నాయి. ఈ ఏడాది వాతావరణం అనుకూలించడంతో రైతులు దీర్ఘకాలిక పండ్ల తోటల సాగుపై ఆలోచిస్తున్నారు. అధికారులు కూడా ప్రోత్సహిస్తున్నారు. తోటల పెంపకానికి ప్రోత్సాహం జిల్లాలో గత ఏడాది పదివేల ఎకరాల్లో తోటల పెంపకాన్ని లక్ష్యంగా పెట్టుని ప్రోత్సహించారు. దీంతో ఈఏడాది ఉత్సాహంతో రైతులు ముందుకు వస్తున్నట్లు తెలుపుతున్నారు. ఉపాధిహామీ నుంచి మొక్కలు, నాటేందకు గుంతలు, నిర్వహణ వ్యయం కింద ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. అదేవిధంగా ఉద్యాన శాఖ నుంచి ఎకరా బత్తాయికి 16,004 రూపాయలు, మామిడి రూ. 13,300, అరటి రూ. 40,985, బొప్పాయి రూ. 24,662, దానిమ్మ రూ. 26,672, జామ రూ. 29,331, సపోట రూ. 10,896, పసుపుకు రూ. 12,000 చొప్పున మూడేళ్లు మూడు దఫాలుగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. నీటి నిల్వ కోసం ఫారంపాండ్ల నిర్మాణంకు రూ. 75 వేల వరకు రాయితీలు అందించారు. యాంత్రీకరణ పరికరాలను 50 శాతం సబ్సిడీపై అందిస్తున్నారు. గతం నరకం.. ఒకప్పుడు వాతావరణం అనుకూలంగానే ఉంది. దాంతో తోటలు అధికంగా సాగుచేశారు. రానురాను వాతావరణంలో వచ్చిన మార్పులకు నీటి ఎద్దడి కారణంగా తోటలు దెబ్బతిన్నాయి. పశ్చిమ ప్రాంతంలో బత్తాయికి అనుకూలంగా ఉండటంతో రైతాంగం దీనిపై ఆసక్తిని పెంచుకుని తోటలు సాగుచేశారు. గత పాతికేళ్లుగా ఇక్కడ బత్తాయి, నిమ్మ వంటి పంటలతో కళకళలాడుతూ తోటలు దర్శనమిచ్చేవి. కాలక్రమేణ వర్షాలు తగ్గిపోవడం భూగర్భజలాలు అడుగంటిపోయాయి. ప్రకతి వైపరీత్యాలు వెంటాడాయి. ఎండలు అధికం కావడం, తీవ్ర నీటి ఎద్దడి కారణంగా తోటలు కళ తప్పాయి. పదేళ్లుగా బోర్లలో నీరు అడుగంటి పోయింది. ఇలాంటి పరిస్థితుల తర్వాత ప్రస్తుతం తరచూ వర్షాలు పడుతుండటంతో ఈదిశ నుంచి రైతులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. -
‘కుండీ పందిరి కూరగాయల’కు అవార్డుల పంట!
కుండీల్లోనే బుల్లి పందిళ్లు వేసి ఎంచక్కా తీగజాతి కూరగాయలను మేడ మీద/పెరట్లో కూడా ఇట్టే పండించుకోవచ్చని ఈ ఫొటోలు చూస్తే తెలుస్తుంది. కన్నుల పండువగా ఉన్న చిట్టి పందిరి కూరగాయల సాగుదారులు ఇటీవల కోల్‌కత్తాలో జరిగిన అవార్డులు పంట పండించుకున్నారు. అగ్రి–హార్టికల్చరల్ సొసైటీ ఆఫ్ ఇండియా (డా. విలియం కారీ 1820లో స్థాపించారు) కోల్‌కత్తాలో ఏర్పడి 200 ఏళ్లయ్యింది. ఈ సందర్భంగా 200వ వార్షిక పుష్ప ప్రదర్శనతోపాటు మధ్య ఆసియా దేశాల గులాబీ మహాసభ ఈ నెల 9 నుంచి 12 వరకు జరిగాయి. ప్రపంచం నలుమూలల నుంచి 300 మంది ప్రతినిధులు ఈ మహాసభలో పాల్గొన్నారు. రోజ్ షోలో 136 సెక్షన్లు ఉండగా.. కూరగాయలు, పండ్లు, బోన్సాయ్, పామ్స్, ఫెర్న్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ తదితర 50 విభాగాల్లో ఉత్తమ సాగుదారులకు బహుమతులు అందజేశారు. కుండీల్లోనే చిన్న పందిళ్లు వేసి తీగజాతి కూరగాయలు పండించే నమూనాలు, కుండీల్లో పండ్ల సాగు నమూనాలు ఈ షోలో హైలైట్‌గా నిలిచాయి. ఒక కుండీలో కట్టె పుల్లలతో పందిరి వేసి సొర తీగను పాకించి నాలుగు సొరకాయలు కాయించిన నమూనాకు కంటెయినర్ కిచెన్ గార్డెనింగ్ విభాగంలో ప్రథమ బహుమతి దక్కింది. వంగ కుండీకి ద్వితీయ బహుమతి దక్కింది. కుండీల్లో సైతం తీగజాతి కూరగాయలను నిశ్చింతగా సాగు చేయడమే కాకుండా మంచి దిగుబడి కూడా తీయొచ్చని ఈ ఫొటోలు చూస్తే అర్థమవుతుంది. హైదరాబాద్ అగ్రి–హార్టీకల్చర్ సొసైటీ నేతలు కొందరు కోల్కత్తా పూలు, కూరగాయలు, పండ్ల ప్రదర్శనలో పాల్గొని స్ఫూర్తిని పొందటం విశేషం. -
గంజాయి తోటల్లో ఉద్యాన వన సిరులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/పాడేరు: పదేళ్లుగా విశాఖ మన్యంలోని మారుమూల ప్రాంతాల్లో సంప్రదాయ పంటల కంటే గంజాయి సాగు వైపే అమాయక గిరిజనులు మొగ్గుచూపుతున్న పరిస్థితి నెలకొందనేది ఎవరూ ఔనన్నా కాదన్నా వాస్తవమే. విచ్చలవిడి గంజాయి సాగు, రవాణాతో అన్నెం పున్నెం ఎరుగని గిరిపుత్రులు పోలీసు, ఎక్సైజ్ కేసులకు బలికాగా... దళారులు, స్మగ్లర్లు, వ్యాపారులు మాత్రం రూ.కోట్లకు రూ.కోట్లు వెనకేసుకున్నారు. అందుకే నిషేధిత గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడంతో పాటు ఆ స్థానంలో గిరిజనులకు ఉద్యానవనపంట సాగుపై అవగాహన కల్పించాలని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తొలినాళ్ల నుంచే కృతనిశ్చయంతో అడుగులు వేసింది. గంజాయి సాగు, రవాణాపై పక్కాగా నిషేధం అమలు చేస్తూ వచ్చింది. ఎక్కడికక్కడ పంటలను ధ్వంసం చేస్తూ రవాణాదారులపై కేసులు నమోదు చేసి జైళ్లకు పంపించింది. మరోవైపు స్వచ్ఛందంగా సాగు విరమించిన గిరిజనులకు లెక్కకు మించిన ప్రోత్సాహకాలు అందిస్తోంది. పదివేల నుంచి ఏడు వేలకు తగ్గిన సాగు.. పాడేరు, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, చింతపల్లి, జీ.కే.వీధి. హుకుంపేట డుంబ్రిగుడ మండలాల్లోని మారుమూల గ్రామాలు గంజాయి సాగుకు కేంద్రాలు మారిపోయాయనే సంగతి తెలిసిందే. గత పదేళ్లుగా సగటున ఏడాదికి 10వేల ఎకరాల విస్తీర్ణంలో గంజాయి సాగయ్యేది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం గంజాయి సాగు, రవాణాపై పక్కాగా నిషేధం ప్రకటించి కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాది సాగు 3వేల ఎకరాలకు తగ్గిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కడెక్కడ గంజాయి సాగును వదిలేశారంటే.. పాడేరు మండలంలోని ఇరడాపల్లి, గొండెలి, బడిమెల, కించూరు, హుకుంపేట మండలంలోని జర్రకొండ, జి.మాడుగుల మండలంలోని బీరం, గెమ్మెలి, వంజరి, వంతాల, గడుతూరు పంచాయతీల పరిధిలోని అన్ని గ్రామాలలోను గిరిజనులు గంజాయి సాగును పూర్తిగా వదిలిపెట్టారు. గంజాయి సాగు బదులు గంజాయి సాగుకు పేరొందిన పాడేరు మండలం ఇరడాపల్లి పంచాయతీ బొడ్డాపుట్టు, సరియాపల్లి. వీసమామిడి గ్రామాల్లోని కొన్ని గిరిజన కుటుంబాలు ఈ ఏడాది నుంచి గంజాయి సాగు వదిలివేశాయి. గతంలో నిషేధిత పంట సాగు చేసిన భూముల్లో ఇప్పుఉ వరి, రాజ్మా, చోడి. పసుపు పంటలను సాగు చేశారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో వరిపంట దిగుబడులు అధికంగా ఉండడంతో ప్రస్తుతం ధాన్యం నూర్పుల పనుల్లో నిమగ్నమయ్యారు. ఇక రాజ్మా పంట సేకరణ దశలో ఉంది. మరికొందదరు పసుపు పంట సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఏజెన్సీలో 90 శాతం రాయితీపై విత్తనాల పంపిణీ ఏజెన్సీలో గిరిజనులకు 90శాతం రాయితీపై రాజ్ మా చిక్కుళ్ల విత్తనాలు సరఫరా చేస్తున్నాం. ఖరీ ఫ్ సీజన్లో 2200 క్వింటాళ్ళ విత్తనాలు సరఫరా చేశాం. ఏజెన్సీలో పంటల సాగుకు గిరిజనులకు అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తాం. – ఎ.మల్లికార్జునరావు, వ్యవసాయశాఖ జేడీ రూ.82 కోట్లతో ప్రత్యేక పంటల ప్రణాళిక గంజాయి సాగును వదిలి ప్రత్యామ్నాయ పంటల సాగుకు ముందుకొచ్చే వారిని ప్రోత్సహించేందుకు రూ.82 కోట్లతో ప్రత్యేక పంటల ప్రణాళిక రూపొందించాం. విశాఖ మన్యంలో వంద శాతం గంజాయి సాగు నిర్మూలనకు ఎక్సైజ్, పోలీసు శాఖలతో కలిసి సమన్వయంగా చర్యలు చేపట్టాం. – డి.కె బాలాజీ, ఐటీడీఏ పీవో ఇక గంజాయి జోలికి పోం.. మెట్ట భూములలో గంజాయి సాగును వదిలిపెట్టి, ఈఏడాది ప్రభుత్వం పంపిణీ చేసిన 90శాతం సబ్సీడి విత్తనాలను సద్వినియోగం చేసుకుని రాజ్మా పంటను సాగు చేసాం. రాజ్మా పంటకు వాతావరణ పరిస్థితులు కలిసి రావడం ఎంతో మేలు చేసింది. పంట సేకరణ చేపట్టి, మరో వారం రోజులలో రాజ్మా గింజల అమ్మకాలు చేస్తాం. వచ్చే ఏడాది కూడా రాజ్మా,ఇతర వాణిజ్య పంటలను సాగు చేస్తాం. ఇక భవిష్యత్తులో గంజాయి జోలికి పోం – గల్లెలి నాగరాజు, ఈ.బొడ్డాపుట్టు గ్రామం, ఇరడాపల్లి పంచాయతీ, పాడేరు మండలం ప్రభుత్వ అండతో మాకు భయంపోయింది గంజాయి సాగును వదిలిపెట్టి మా భూములలో ఈ ఏడాది చోడిపంటను విస్తారంగా సాగు చేశాం. పంట సాగు ఆశాజనకంగా ఉండడంతో పంట సేకరణ చేపడుతున్నాం, విరగ్గాసిన వరికంకులతో దిగుబడి బాగుంది. భవిష్యతులో కూడా తమ వ్యవసాయ భూములలో వాణిజ్య పంటలను సాగు చేస్తాం. గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన చర్యలతో భయం పోయింది. – మర్రి రాజు, వీసమామిడి గ్రామం అందరమూ ఒకే మాటగా గంజాయి వదిలేశాం.. గంజాయి తోటల సాగును ఈఏడాది పూర్తిగా వదిలిపెట్టాం. గంజాయి సాగు చేపట్టే సమయంలో ప్రతిక్షణం భయంతో బ్రతికేవాళ్ళం. ఇప్పుడు అధికారుల అండతో గ్రామస్తులంతా ఐక్యమై ఒకే మాట అనుకుని గంజాయి సాగుకు దూరమయ్యాం. వచ్చే ఏడాది నుంచి కాఫీ తోటలు సాగు చేయాలని నిర్ణయించాం. ఈ ఏడాదికి ప్రభుత్వ సాయంతో నీడనిచ్చే సిల్వర్‌ఓక్ మొక్కలను 50ఎకరాలలో నాటుకున్నాం. – కిల్లో సాలో, గిరిజన మహిళా రైతు, వీసమామిడి ఉద్యానవన పంటల సాగుపై దృష్టి పెట్టాం.. గిరిజనులు ఉద్యానవన పంటల సాగువైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే కాఫీ, రాజ్మా, కూరగాయలు, స్వీట్ ఆరెండ్, పైన్ యాపిల్వంటి పండ్ల మొక్కల సాగు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గ్రీన్ కాలిఫ్లవర్ –బ్రకోలీ, పర్పల్ కలర్ క్యాబేజీ, చైనీస్ క్యాబేజీ, జుకుని–దోసకాయలు వంటి విదేశీ కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నాం. జనవరి, ఫిబ్రవరిలో 50 వేల యాపిల్ మొక్కల ప్లాంటేషన్ చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చే ఏడాది పసు పు, అల్లం పంటలను ఏజెన్సీలో పెద్దమొత్తంలో సాగు చేయించాలని భావిస్తున్నాం. గంజాయి సాగు వదిలేసిన రైతులు ఇతర పంటల సాగుకు పవర్ టిల్ల ర్లు, పవర్ వీడర్లు, స్ప్రేయర్లు అడిగారు. ఆ మేరకు అందిస్తాం. – ప్రభాకర్‌రావు, ఉద్యానవనశాఖ ప్రత్యేక అధికారి, ఐటీడీఏ