Independents
-
‘లోక్‌సభ’లో స్వతంత్రులు విజేతలా? పరాజితులా?
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటించడంతో రాజకీయ పార్టీల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కేంద్రంలోని అధికార బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా తన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇతర పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇదిలా ఉండగా కొన్ని పార్టీలలో టిక్కెట్లు ఆశించి, భంగపడినవారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశాలున్నాయి. ఇటువంటి వ్యవహారం దేశంలో తొలిసారి లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. మొదటి లోక్‌సభ ఎన్నికల్లో.. 1951-52లో మొదటి లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. దేశంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 37 మంది స్వతంత్ర ఎంపీలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. రెండో లోక్‌సభలో స్వతంత్ర ఎంపీల సంఖ్య పెరిగింది. 1957లో రెండో లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 42 మంది స్వతంత్ర ఎంపీలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1962లో స్వతంత్రుల హవా మూడో లోక్‌సభలో స్వతంత్ర ఎంపీల సంఖ్య సగానికి పైగా తగ్గింది. 1962లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 20 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎంపీలు అయ్యారు. నాలుగో లోక్‌సభలో స్వతంత్ర ఎంపీల సంఖ్య తిరిగి పెరిగింది. 1967లో జరిగిన ఎన్నికల్లో 35 మంది స్వతంత్ర ఎంపీలు ఎన్నికయ్యారు. 1971లో ఐదవ లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. ఈసారి ఎన్నికల్లో గెలిచిన స్వతంత్రుల సంఖ్య తగ్గింది. ఈ ఎన్నికల్లో 14 మంది స్వతంత్ర ఎంపీలు మాత్రమే ఎన్నికయ్యారు. ‘ఎమర్జెన్సీ ’ తర్వాత.. దేశంలో ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత జరిగిన 1977 లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీల ప్రాతినిధ్యం తగ్గింది. ఆరో లోక్‌సభలో కేవలం తొమ్మిది మంది స్వతంత్ర ఎంపీలు మాత్రమే ఎన్నికయ్యారు. ఏడో లోక్‌సభలో స్వతంత్ర ఎంపీల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదు. 1980లో తొమ్మిదిమంది స్వతంత్రులు లోక్‌సభ ఎంపీలు అయ్యారు. స్వతంత్ర ఎంపీల ప్రాతినిధ్యం 1984లో మెరుగుపడింది. ఎనిమిదో లోక్‌సభలో 13 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. స్వతంత్ర ఎంపీల సంఖ్య 1989లో స్వల్పంగా తగ్గింది. 10వ లోక్‌సభకు ఒక్కరే.. తొమ్మిదో లోక్‌సభలో 12 మంది స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే పార్లమెంట్ దిగువ సభకు చేరుకున్నారు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీల ప్రాతినిధ్యం పూర్తిగా తగ్గిపోయింది. 10వ లోక్‌సభకు ఒక స్వతంత్ర ఎంపీ మాత్రమే ఎన్నికయ్యారు. అత్యల్ప సంఖ్యలో స్వతంత్ర ఎంపీలు 1991లో ఎన్నికయ్యారు. 11వ లోక్‌సభలో పార్లమెంటులో స్వతంత్ర ఎంపీల వాటా మరోసారి పెరిగింది. 1996లో జరిగిన ఎన్నికల్లో తొమ్మదిమంది స్వతంత్రులు లోక్‌సభ ఎంపీలు అయ్యారు. 14వ, 15వ లోక్‌సభ ఎన్నికల్లో.. 12వ లోక్‌సభలో అంటే 1998లో స్వతంత్ర ఎంపీల సంఖ్య ఆరుకి తగ్గింది. 1999లో 13వ లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూడా ఆరుగురు స్వతంత్రులు పార్లమెంటుకు చేరుకున్నారు. 14వ లోక్‌సభలో తొమ్మిది మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఈ లోక్‌సభ ఎన్నికలు 2004లో జరిగాయి. 2009లో జరిగిన 15వ లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీల సంఖ్య తొమ్మది. 3,449 మంది డిపాజిట్లు గల్లంతు 16వ లోక్‌సభకు 2014లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కేవలం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే ఎంపీలుగా ఎన్నికయ్యారు. 2019లో జరిగిన 17వ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 8,054 మంది అభ్యర్థులు పోటీ చేయగా, వారిలో 3,461 మంది స్వతంత్రులు. వీరిలో 3,449 మందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. కేవలం నలుగురు స్వతంత్రులు మాత్రమే పార్లమెంటుకు చేరుకున్నారు. విజేతల ఓట్లు.. మహారాష్ట్రలోని అమరావతి స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవనీత్ రాణా 36,951 ఓట్ల తేడాతో గెలుపొందారు. అసోంలోని కోక్రాజార్ లోక్‌సభ స్థానం నుంచి 37,786 ఓట్లతో విజయం సాధించి నబ కుమార్ సరానియా పార్లమెంటుకు చేరుకున్నారు. దాద్రా అండ్ నగర్ హవేలీ స్థానం నుంచి డెల్కర్ మోహన్‌భాయ్ సంజీభాయ్ 9,001 ఓట్లతో గెలుపొందారు. కర్ణాటకలోని మాండ్య స్థానం నుంచి సుమలత అంబరీష్ 1,25,876 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. -
ఇండిపెండెంట్లే కీలకం.. రాజస్థాన్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
జైపూర్: రాజస్థాన్‌లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోటీ ఉందని రాజస్థాన్ మంత్రి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతాప్ సింగ్ ఖచరియావాస్ అన్నారు. 200 మంది సభ్యుల అసెంబ్లీలో రెండు పార్టీలకు 90-100 సీట్లు వస్తే స్వతంత్ర అభ్యర్థులు కీలక పాత్ర పోషిస్తారని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఖచరియావాస్ తాజాగా ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘ఇరు పార్టీలు 90-100 సీట్లు సాధిస్తే, బీజేపీ, కాంగ్రెస్ రెండూ స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీలను గౌరవించాల్సిందే. అప్పుడు ఎవరికి మద్దతు ఇవ్వాలో వారు నిర్ణయిస్తారు. ప్రస్తుతం రాజస్థాన్‌లో నెక్ టు నెక్ ఫైట్ జరుగుతోందని నేను భావిస్తున్నాను’ అన్నారు. రాజస్థాన్‌లో తమకు 125 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ చేసిన వాదనలను పలు ఎగ్జిట్ పోల్స్ తోసిపుచ్చాయని ప్రతాప్ సింగ్ గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ 100 పైగా సీట్లు సాధిస్తుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చాలా ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓటమిని తాము ఊహించామని, కానీ ఎగ్జిట్ పోల్స్ ఆ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్లు చూపిస్తున్నాయన్నారు. రాజస్థాన్‌లో గట్టి పోటీ ఉంటుందని చాలా ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. మూడు ఎగ్జిట్ పోల్లు బీజేపీ స్పష్టమైన విజయాన్ని సాధిస్తుందని అంచనా వేయగా, మరో రెండు రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ముందంజలో ఉందని పేర్కొన్నాయి. డిసెంబరు 3న ఫలితాలు వెలువడినప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో చిన్న పార్టీలు, స్వతంత్రులతో సహా "ఇతరులు" కీలక పాత్ర పోషిస్తారని ఎగ్జిట్ పోల్ అంచనాలు స్పష్టం చేశాయి. 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీకి 199 స్థానాలకు నవంబర్ 25న ఎన్నికలు జరిగాయి. -
సేమ్ నేమ్ బ్యాలెట్ గేమ్!
సాక్షి, హైదరాబాద్: యాదృచ్చికమో..ఉద్దేశపూర్వకమో.. తెలియదు కానీ ఎన్నికలు ఏవైనా సరే.. ఇంటి పేరు సహా ఒకే పేరు ఉన్న వేర్వేరు అభ్యర్థులు పోటీ చేయడం రివాజుగా మారింది. పేరు మాత్రమే కాకుండా ఇంటి పేర్లు కూడా ఒకేలా ఉండటంతో ఓటర్లలో నిరక్షరాస్యులు, అవగాహన కొందరు ఓటర్లలో గందరగోళం నెలకొనే ప్రమాదం ఉందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.ఈనెల 30న జరగనున్న శాసనసభ ఎన్నికలలో రాష్ట్రంలోని చాలా నియోజక వర్గాలలో ఈ సమస్య కనిపిస్తోంది. ఎక్కువగా బీఆర్ఎస్ అభ్యర్థులను పోలిన వారే ఎక్కువగా బీఆర్ఎస్ అభ్యర్థులను పోలిన పేర్లున్న వారే స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. కొన్ని చోట్ల అలయెన్స్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ పార్టీ (ఏడీఆర్) పేరుతోనూ ఉన్నారు. దీంతో ప్రధాన పార్టీల నేతలు.. పోటీ చేసే పార్టీ గుర్తు, అభ్యర్థి ఫొటోతో పాటు పేరును కూడా తెగ ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను గందరగోళానికి గురి చేయడమే లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేశారు. ఒకే పేరు కలిగి పోటీ పడుతున్న నియోజకవర్గాల్లో కొన్ని ఎల్బీనగర్: దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి (బీఆర్ఎస్), దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి (స్వతంత్ర), డి.సుధీర్‌రెడ్డి (స్వ) మహేశ్వరం: కె.లక్ష్మారెడ్డి (కాంగ్రెస్), కె.లక్ష్మారెడ్డి (జన శంఖారావం), పి.సబిత (బీఆర్ఎస్), ఎం.సబిత (స్వ) మునుగోడు: కె.ప్రభాకర్‌రెడ్డి (బీఆర్ఎస్), కె.ప్రభాకర్‌రెడ్డి (ఏడీఆర్) మిర్యాలగూడ: బి.లక్ష్మారెడ్డి (కాంగ్రెస్), బి.లక్ష్మారెడ్డి (స్వ) అచ్చంపేట: జి.బాలరాజు (బీఆర్ఎస్), జి.బాలరాజు (ఏడీఆర్) దేవరకద్ర: ఏ.వెంకటేశ్వర్ రెడ్డి (బీఆర్ఎస్), ఏ.వెంకటేశ్వర్‌రెడ్డి (స్వ) గద్వాల: సరిత (కాంగ్రెస్), జి.సరిత (నవతరం కాంగ్రెస్), సరిత (స్వ) సనత్‌నగర్: శ్రీనివాస్‌యాదవ్ (బీఆర్ఎస్), ఉప్పలపాటి శ్రీనివాస్ (యుగ తులసి) జహీరాబాద్: ఏ.చంద్రశేఖర్ (కాంగ్రెస్), చంద్రశేఖర్, ఎం.చంద్రశేఖర్, ఎడ్ల చంద్రశేఖర్ (స్వ) ఇబ్రహీంపట్నం: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (బీఆర్ఎస్), కె.కిషన్‌రెడ్డి (ఏడీఆర్) ఉప్పల్: బండారి లక్ష్మారెడ్డి (బీఆర్ఎస్), మన్నె లక్ష్మారెడ్డి (ఏడీఆర్) పరిగి: కొప్పుల మహేశ్‌రెడ్డి (బీఆర్ఎస్), బి.మహేశ్‌రెడ్డి (ఏడీఆర్) కొడంగల్: పట్నం నరేందర్‌రెడ్డి (బీఆర్ఎస్), ప్యాట నరేందర్ రెడ్డి (స్వ) నారాయణపేట: ఎస్.రాజేందర్‌రెడ్డి (బీఆర్ఎస్), కె.రాజేందర్ రెడ్డి (స్వ) మహబూబ్‌నగర్: వి.శ్రీనివాస్‌గౌడ్ (బీఆర్ఎస్), ఎం.శ్రీనివాసులు (స్వ) కొల్లాపూర్: బి.హర్షవర్ధన్ రెడ్డి (బీఆర్ఎస్), కె.హర్షవర్ధన్ రెడ్డి (స్వ) హుజూర్నగర్: ఎస్.సైదిరెడ్డి (బీఆర్ఎస్), టి.సైదిరెడ్డి (ఏడీఆర్) ఖమ్మం: పువ్వాడ అజయ్ (బీఆర్ఎస్), ఏ.అజయ్ (స్వ), కె.అజయ్ (స్వ) ముషీరాబాద్: ముఠాగోపాల్ (బీఆర్ఎస్), ఎం.గోపాల్ (ఏఐహెచ్‌సీపీ) (నోట్: స్వతంత్రులు (స్వ), అలయెన్స్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) ఎన్నికలు బహిష్కరిస్తూ తీర్మానం కొత్తగూడెంరూరల్: తమ సమస్యలు పరిష్కరించనందున నాలుగు గ్రామ పంచాయతీల ప్రజలు ఎన్నికలను బహిష్కరిస్తామంటున్నారు. ఈ మేరకు వారు బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం కొత్త చింతకుంట, లక్ష్మీపురం, బొజ్జలగూడెం, బంగారుచెలక గ్రామస్తులు ఈ మేరకు తీర్మానం చేశారు. సర్వే నంబర్ 286, 381 అసైన్మెంట్ భూ హక్కుదారుల పేర్లను ధరణిలో చేర్చాలని, వ్యవసాయానికి త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని, గిరివికాస్ పథకంలో అర్హులైన రైతులందరికీ వ్యవసాయ బోర్లు మంజూరు చేయాలని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గృహలక్ష్మి పథకం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారానికి ఎన్నో రోజులుగా పోరాడుతున్నా ఎవరూ పట్టించుకోనందుకు నిరసనగా ఎన్నికలను బహిష్కరిస్తున్నామని వెల్లడించారు. -
గెలిచామా.. ఓడామా.. కాదు
‘ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా... బుల్లెట్ దిగిందా లేదా’.. ఈ పూరీ మార్కు డైలాగ్‌ను ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న చాలామంది..’’ గెలిచామా.. ఓడామా.. కాదు పోటీ చేశామా లేదా అన్నదే ముఖ్యం’’ అన్న రీతిన మార్చేసి బరిలో సై అంటున్నారు. మునుపెన్నడూ అంతగా లేని విధంగా ఈసారి ఎన్నికల్లో భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలోకి దిగారు. ప్రధాన రాజకీయ పార్టీల నుంచే కాకుండా చిన్నాచితకా పార్టీల నుంచి, ఇండిపెండెంట్లు కలిపి రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు గాను ఏకంగా 2,290 మంది పోటీలో ఉన్నట్టు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. అంటే సగటున ఒక్కో నియోజకవర్గానికి 20 మంది పోటీ చేస్తున్నారన్న మాట. ఈ పోటీ ఎంత తీవ్రంగా ఉందంటే 65 చాలా నియోజకవర్గాల్లో రెండు లేదా మూడు బ్యాలెట్ యూనిట్లు వినియోగించాల్సి వస్తోంది. నోటాతో కలిపి అభ్యర్థుల సంఖ్య 16లోపు ఉంటేనే ఒక బ్యాలెట్ యూనిట్ సరిపోతుంది.కానీ, ఈసారి అంతకంటే ఎక్కువ మంది 65 స్థానాల్లో బరిలో ఉండడంతో బ్యాలెట్ యూనిట్లను పెంచాల్సి వస్తోంది. ఎల్బీనగర్ టాప్ ఇక నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే ఎక్కువ మంది పోటీ చేస్తున్న జాబితాలో ఎల్బీనగర్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడి నుంచి ఏకంగా 48 మంది అభ్యర్థులు అమీతుమీ తేల్చుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి 44 మంది బరిలో ఉన్నారు. ఇక, ఏడుగురే పోటీలో ఉండి రాష్ట్రంలో అతి తక్కువ మంది పోటీ చేస్తున్న నియోజకవర్గంగా బాన్సువాడ నిలిచింది. పది మంది కంటే తక్కువగా పోటీ చేస్తున్న నియోజకవర్గాలు మొత్తం నాలుగు కాగా, 20నుంచి 30 మంది పోటీ చేస్తున్న నియోజకవర్గాలు 33, 30 మంది కంటే ఎక్కువ మంది పోటీ చేస్తున్న నియోజకవర్గాలు 13 ఉన్నాయి. మొత్తం స్థానాల్లో నామినేషన్ వేసిన 2898 అభ్యర్థులలో 608 మంది విత్‌డ్రా చేసుకున్నట్లుగా ఎన్నికల సంఘం వెల్లడించించిన సంగతి తెలిసిందే. పేరు కోసం ఒకరైతే... పోటీ చేయాలనే తపన మరొకరిది ఎలాగైనా పోటీ చేయాలని కొందరు అభ్యర్థులు భావిస్తే మరికొందరు పేరు కోసం పోటీ చేసినట్టుగా ఉంది. ఏదో నామినేషన్ వేశామా లేదా అన్నట్లుగా పోటీలో ఉంటున్నారు. ప్రచారం చేయడం కానీ, ఎన్నికల సంఘం కేటాయించిన తన గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లడం కానీ ఇప్పటి వరకైతే చేయడంలేదు. మరో వైపు కొన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతతోనో, అభ్యర్థిపై నిరసనతోనో...లేక ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ నెరవేర్చలేదనో పోటీకి దిగుతున్నారు.. కొన్నిచోట్ల సొంతపార్టీ నుంచి టికెట్ రాక రెబల్స్‌గా పోటీ చేస్తున్నారు. మరో వైపు అభ్యర్థి ఓట్లను చీల్చాలని మరికొందరు పోటీ చేస్తున్నారన్న వాదనలూ ఉన్నాయి. -
పరేషాన్లో టీఆర్ఎస్, బీజేపీ? వారికి భారీగా ఓట్లు.. ఎవరిది విజయం?
సాక్షి, నల్గొండ: హోరాహోరీగా సాగుతున్న మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకొస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి సొంత మండలం చౌటుప్పల్‌లో చేదు ఫలితాలు రాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకు సొంతూర్లోనే షాక్ తగిలింది. ఆయన సొంత గ్రామం లింగవారి గూడెం లో బీజేపీ ఆధిక్యం కనబర్చింది. ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం.. తొలి రౌండ్లో స్వతంత్ర అభ్యర్థులు అనూహ్యంగా ఓట్లు సాధించడం విశేషం. మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ తొలి రౌండ్లో.. చపాతి మేకర్ గుర్తు శ్రీశైలం యాదవ్ 104 ఓట్లు, చెప్పుల గుర్తు గాలయ్య 157 ఓట్లు, ఉంగరం గుర్తు కేఏ పాల్ 34 ఓట్లు, రోడ్డు రోలర్ గుర్తు శివకుమార్ 84 ఓట్లు సాధించారు. (చదవండి: ఎన్నికల ప్రధానాధికారి తీరుపై బీజేపీ సీరియస్) అయితే, నిముషనిముషానికి మారుతున్న ఆధిక్యం ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీకి కలవరం పుట్టిస్తుండగా.. ఇతర అభ్యర్థులు భారీగా ఓట్లకు గండిపెట్టడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ సహా 47 మంది అభ్యర్థులు మునుగోడు బరిలో నిలిచారు. ఎన్నికల కమిషన్ వివరాల ప్రకారం.. నాలుగు రౌండ్లు ముగిసేసరికి 63351ఓట్లను లెక్కించగా.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 26443 ఓట్లు, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 25729, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి 7380 ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థిపై టీఆర్ఎస్ అభ్యర్థి 714 స్వల్ప ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక అనూహ్యంగా బీఎస్పీ అభ్యర్థి అందోజు శంకరాచారి నాలుగు రౌండ్లలో కలిపి 907 ఓట్లు ఖాతాలో వేసుకోవడం గమనార్హం. ఇక మిగతా స్వతంత్రులు, నోటాకు పోలైన ఓట్లు 2892. ఈ ఓట్లు అభ్యర్థుల గెలుపోటలను తారుమారు చేయడంలో కీలక పాత్ర పోషించినా ఆశ్చర్యపోనవసరం లేదు! ఎవరి ఓట్లు చీలిపోయి ఓటమిపాలవుతారో? ఎవరికి మేలు జరిగి విజయబావుటా ఎగరేస్తారో చూడాలి. (చదవండి: ఓటమి తట్టుకోలేక కౌంటింగ్‌పై బీజేపీ ఆరోపణలు.. మంత్రి జగదీష్ రెడ్డి) -
ఒకే ఇంటి నుంచి ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల పోటీ..
సాక్షి, తాండూరు టౌన్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ చివరి రోజు సందర్భంగా శుక్రవారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, వేర్వేరు వార్డుల నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా కౌన్సిలర్ స్థానానికి నామినేషన్లు వేశారు. తాండూరు పట్టణం ఇందిరా నగర్‌కు చెందిన అవిటి శ్రీశైలం స్థానిక ఇందిరాచౌక్‌లో చాయ్ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అవిటి శ్రీశైలం 26వ వార్డు నుంచి, భార్య రాజకుమారి 28 వార్డు నుంచి, తల్లి వీరమణి 27 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. గతంలో శ్రీశైలం 2019 ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేగా కూడా నామినేషన్ వేసి బరిలో నిలిచారు. ఎమ్మెల్సీగా కూడా నామినేషన్ వేసినప్పటికీ తిరస్కరణ గురి కావడం జరిగింది. తాజాగా తనొక్కడే కాకుండా ఇంట్లోని మరో ఇద్దరితో నామినేషన్ వేయించడం చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో సకలజనుల సమ్మె సందర్భంగా సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపిన శ్రీశైలంకు రాజకీయాలన్నా, ప్రజాసేవ అన్నా ఎంతో ఇష్టంగా భావిస్తారు. తాను ప్రజలకు సేవ చేసేందుకే కౌన్సిలర్‌గా బరిలో దిగానని, అలాగే తన భార్య, తల్లితో కూడా నామినేషన్ వేయించానన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో తన భార్య లేదా తల్లిని చైర్‌పర్సన్‌గా చూడాలనేది తన కోరిక అని శ్రీశైలం చెప్పడం విశేషం. -
కాషాయ పార్టీకే ఇండిపెండెంట్ల మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ : హరియాణాలో తిరిగి పాలనా పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ సంసిద్ధమైంది. మేజిక్ ఫిగర్‌కు ఆరు సీట్లు అవసరమైన క్రమంలో పాలక బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు స్వతంత్ర ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని హర్యానా లోక్‌హిత్ పార్టీ చీఫ్, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గోపాల్ కందా చెప్పారు. బీజేపీకి బేషరుతు మద్దతు ఇచ్చేందుకు ఆరుగురు ఇండిపెండెంట్లు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. 90 మంది సభ్యులు కలిగిన హరియాణా అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా బీజేపీ 40 మంది సభ్యులకే పరిమితమైంది.కాంగ్రెస్ 31 స్ధానాల్లో, జేజేపీ 10 స్ధానాలు, ఇతరులు 9 స్ధానాల్లో గెలుపొందారు. హరియాణా అసెంబ్లీలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని 8 మంది ఇండిపెండెంట్లను ఆశ్రయించింది. బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చించేందుకు హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ఢిల్లీ చేరుకున్నారు. తాము హరియాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు పది స్ధానాలు పొందిన జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా మద్దతు కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. హరియాణాపై ఆశలు వదులుకోలేదని ఆ పార్టీ నేత, మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా పేర్కొనడం గమనార్హం. -
‘విన్’డిపెండెంట్లు లేరక్కడ!
సాక్షి, కొత్తపేట (తూర్పు గోదావరి): జిల్లాలో కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్లు స్వతంత్ర అభ్యర్థులకు ఎప్పుడూ పట్టం కట్టలేదు. అయితే ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో నువ్వా.. నేనా..? అనే రీతిలో తలపడి స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. ఇక్కడ ఆది నుంచీ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పలువురు ఎన్నికల బరిలో నిలిచినా ప్రధానంగా ముత్యాల సుబ్బారాయుడు మాస్టారు (కొత్తపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల రిటైర్డ్ హెచ్ఎం), ఎంవీఎస్ సుబ్బరాజు, డాక్టర్ చిర్ల సోమసుందరరెడ్డి స్వతంత్రంగా పోటీ చేసి ఓటమిపాలైనా తమ సత్తా చాటుకున్నారు. 1962, 1967 ఎన్నికల్లో వరుసగా ముత్యాల సుబ్బారాయుడు మాస్టారు (కొత్తపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల రిటైర్డ్ హెచ్ఎం) కాంగ్రెస్ అభ్యర్థి ఎంవీఎస్ సుబ్బరాజుకు గట్టి పోటీ ఇచ్చి కేవలం 1,542 ఓట్లు, 3,143 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 1972లో ఎంవీఎస్ సుబ్బరాజు కాంగ్రెస్ అభ్యర్థి భానుతిలకంతో తలపడి 9,829 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. డాక్టర్ చిర్ల సోమసుందరరెడ్డి 1985, 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు డాక్టర్ ఐఎస్ రాజు, బండారు సత్యానందరావులతో తలపడి 1,397, 16,113 ఓట్ల తేడాతో ప్రత్యర్థిగా నిలిచి తన సత్తా చాటుకున్నారు. అలా ఈ నియోజకవర్గం ప్రజలు ఎప్పుడూ రాజకీయ పార్టీలకే పట్టం కట్టారు. -
సింహపురి స్వతంత్ర సింహాలు
జాతీయ చిత్రపటంలో ధాన్యసిరిగా ప్రసిద్ధిచెందిన సింహపురిలో రాజకీయ చైతన్యం ఎక్కువ. దేశ రాజకీయాల్లో వెలుగువెలిగిన ఎందరో ఉద్దండులకు రాజకీయ జీవితాన్నిచ్చిన నెల్లూరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి జరిగిన సాధారణ ఎన్నికల్లో జాతీయ, ప్రాంతీయ పార్టీల తరఫున కాకుండా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచి విజయం సాధించిన వారు ఉన్నారు. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకత చాటిన బెజవాడ కుటుంబం నుంచి పాపిరెడ్డి, నలపరెడ్డి శ్రీనివాసులురెడ్డి లాంటి రాజకీయ ఉద్దండులు స్వంతంత్ర అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించి అసెంబ్లీలో తమ వాణి వినిపించారు. సాక్షి, నెల్లూరు: ఏపీలో తొలిసారి ఎన్నికల నుంచి 2014 అసెంబ్లీ ఎన్నికల వరకు జిల్లాలో 16 మంది స్వతంత్ర అభ్యర్థుల విజయం సాధించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇండిపెండెంట్ విజేతలు వీరే.. ♦ 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి జీటీ నాయుడు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా జీసీ కొండయ్య పోటీ పడ్డారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 59,021 మంది ఓటర్లు ఉండగా 31,243 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు . ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీటీ నాయుడుకు 10,560 ఓట్లు రాగా, ఇండిపెండింట్ అభ్యర్థి జీసీ కొండయ్యకు 20,682 ఓట్లు రావడంతో ఆయన విజయం సాధించారు. ♦ కావలి నియోజకవర్గంలో 1967లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున జేసీ కొండయ్య, ఇండిపెండెంట్ అభ్యర్థిగా జి.సుబ్బానాయుడు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి 24,231 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థి సుబ్బానాయుడికి 26,540 ఓట్లు లభించి విజయం సాధించారు. ♦ కావలి నియోజకవర్గంలో 1972లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి ఏపీవీరెడ్డిపై మరో స్వతంత్ర అభ్యర్థి జి.కొండపనాయుడు విజయం సాధించారు. ఏపీవీ రెడ్డికి 21,442 ఓట్లు రాగా, కొండపనాయుడుకు 27,874 ఓట్లు వచ్చాయి. ♦ 1967లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సూళ్లూరుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎం.మునిస్వామిపై స్వతంత్ర అభ్యర్థిగా పిట్ల వెంకటసుబ్బయ్య పోటీ చేసి విజయం సాధించారు. మునిస్వామికి 22,987 ఓట్లు రాగా, వెంకటసుబ్బయ్యకు 24,840 ఓట్లు లభించాయి. 1967లో జరిగిన సాధారణ ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పి.సిద్ధయ్యనాయుడుపై ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో సిద్ధయ్యనాయుడికి 25,751 ఓట్లు రాగా, పి రామచంద్రారెడ్డికి 33,126 ఓట్లు లభించాయి. 1952లో సాధారణ ఎన్నికల్లో నెల్లూరు ఉమ్మడి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ఏసీఎస్రెడ్డి, కె.చిన్నయ్యపై ఇండిపెండెంట్ అభ్యర్థులు కె.కృష్ణారావు, స్వర్ణ వేమయ్య విజయం సాధించారు. ♦ 1967లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎ.కృష్ణయ్యపై ఇండిపెండెంట్ అభ్యర్థి ఒ.వెంకటసుబ్బయ్య విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కృష్ణయ్యకు 23,197 ఓట్లు రాగా, వెంకటసుబ్బయ్యకు 31,193 ఓట్లు లభించాయి ♦ 1967లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోవి రామయ్యచౌదరిపై ఇండిపెండెంట్ అభ్యర్థి ధనేకుల నరసింహం విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో రామయ్య చౌదరికి 19,826 ఓట్లు లభించగా, ధనేకుల నరసింహంకు 29,500 ఓట్లు వచ్చాయి. ♦1967లో జరిగిన ఎన్నికల్లో అల్లూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి వి.విమలాదేవిపై ఇండిపెండెంట్ అభ్యర్థి బెజవాడ పాపిరెడ్డి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో విమలాదేవికి 13,389 ఓట్లు రాగా పాపిరెడ్డికి 32,822 ఓట్లు లభించాయి. ♦ 1962లో జరిగిన ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి వీకే రెడ్డిపై ఇండిపెండెంట్ అభ్యర్థి వి.వెంకురెడ్డి విజయం సాధించారు. వీకే రెడ్డికి 23,355 ఓట్లు రాగా వెంకురెడ్డికి 23,441 ఓట్లు లభించాయి. ♦ 1955లో జరిగిన ఎన్నికల్లో నందిపాడు నియోజకవర్గం నుంచి కేఎల్పీ అభ్యర్థి ధనేకుల నరసింహంపై ఇండిపెండెంట్ అభ్యర్థి కె విజయరెడ్డి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ధనేకుల నరసింహంకు 9,251 ఓట్లు రాగా కేవీ రెడ్డికి 11,137 ఓట్లు లభించాయి. శారదాంబపై నల్లపరెడ్డి విజయం 1972లో జరిగిన ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి టీకే శారదాంబపై ఇండిపెండెంట్ అభ్యర్థి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో శారదాంబకు 27,015 ఓట్లు రాగా, శ్రీనివాసులురెడ్డికి 40,057 ఓట్లు లభించాయి. కంభం విజయకేతనం 1994 ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మాదాల జానకిరాంపై ఇండిపెండింట్ అభ్యర్థి కంభం విజయరామిరెడ్డి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో జానకిరాంకు 26,793 ఓట్లు రాగా, కంభం విజయరామిరెడ్డికి 51,712 ఓట్లు లభించాయి. జేకే రెడ్డి సంచలనం ∙1989లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తాళ్లపాక రమేష్‌రెడ్డిపై ఇండిపెండెంట్ అభ్యర్థి జక్కా కోదండరామిరెడ్డి (జేకే రెడ్డి) సంచలన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో రమేష్‌రెడ్డికి 42,092 ఓట్లు రాగా, జేకే రెడ్డికి 56,566 ఓట్లు లభించాయి. నువ్వుల విజయం ♦ 1972లో జరిగిన సా«ధారణ ఎన్నికల్లో రాపూరు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి కాకాణి రమణారెడ్డిపై మరో ఇండిపెండెంట్ అభ్యర్థ్ధి నువ్వుల వెంకటరత్నంనాయుడు విజయం సాధిం చారు. రమణారెడ్డికి 20,863 ఓట్లు రాగా, వెంకటరత్నంనాయుడుకు 28,637 ఓట్లు లభించాయి. బొల్లినేనిపై కొమ్మి విజయం ఆత్మకూరు నియోజకవర్గంలోని 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ఆ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బొల్లినేని కృష్ణయ్య ఎన్నికల బరిలో నిలిచారు. జాతీయ, ప్రాంతీయ పార్టీల నుంచి టికెట్ కోసం ప్రయత్నించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్ తరుపున బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి పోటీచేశారు. త్రిముఖ పోటీలో ఇండిపెండెంట్ అభ్యర్థి కొమ్మి లక్ష్మయ్యనాయుడు విజయం సాధించారు. బొల్లినేని కృష్ణయ్యకు 38,950 ఓట్లు రాగా, ఇండిపెండెంట్ అభ్యర్థి కొమ్మి లక్ష్మయ్యనాయుడుకు 43,347 ఓట్లు లభించాయి. -
తటస్థులే ‘కీ’లకం
సాక్షి, జనగామ: లోక్‌సభ ఎన్నికల సైరన్ మోగడంతో విజయంపై ఎవరికి వారే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల విజయోత్సవంతో గులాబీ దళం ఒకడుగు ముందుకు వేస్తుండగా.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని మిగతా పార్టీలు కిందస్థాయి నుంచి కసరత్తు మొదలు పెట్టాయి. నామినేషన్ల ప్రక్రియ షెడ్యూల్ కోసం మరో రెండు రోజుల గడువు ఉండడంతో వ్యూహాలకు పదును పెడుతున్నారు. నామినేషన్ల పర్వం మొదలు కాకముందే ఎవరికి వారే తమ ప్రత్యర్థుల కదలికలను గమణిస్తున్నారు. గ్రామాల వారీగా చేరికలకు శ్రీకారం చుడుతూ ముఖ్యులపై కన్నేస్తున్నారు. తటస్థ ఓటర్లను ఆకర్షించేందుకు ఇప్పటి నుంచే ఎక్కువ సమయం కేటాయి స్తున్నారు. పార్టీలకు సంబంధం లేని ఓటర్ల హృదయాలను గెలుచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 6,96,535 లక్షల ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 3,48,301, పురుషులు 3,48,222, ఇతరులు 12 మంది ఉన్నారు. ప్రముఖులతో కాంటాక్టు.... లోక్‌సభ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, బీజేపీ తలపడనున్నాయి. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న జనగామ నియోజక వర్గంతో పాటు వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో ‘ఎంపీ’ ఎలక్షన్ల వేడి మొదలైంది. ఆయా నియోజక వర్గాల పరిధిలోని మండల, జిల్లా నాయకులతో పాటు ఎమ్మెల్యేలు విశ్రాంత ఉద్యోగులు, ఆయా వర్గాల్లోని వ్యాపారులు, యువకులు, ఉద్యోగులతో పాటు పార్టీలకు అతీతంగా తటస్థంగా ఉన్న ఓటర్లపై కన్నేశారు. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకంగా మారడంతో ఒక్కరిని కూడా వదిలిపెట్టడం లేదు. ఆయా గ్రామాల్లో ప్రముఖులను కలుస్తూ అన్ని వర్గాల ప్రజల ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఫోన్లో అప్యాయంగా పలకరిస్తూ... నామినేషన్ల సమయం దగ్గర పడుతుండడంతో...గ్రామాల్లోని ద్వితీయ శ్రేణి నాయకులను దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్లో ఆప్యాయంగా పలకరిస్తూ... పార్టీ సంగతుల గురించి వాకబు చేస్తున్నారు. పట్నంపై నజర్.. ఇతర ప్రాంతాలకు బతుకు దెరువు కోసం వెళ్లి... సొంత గ్రామాల్లో ఓటు హక్కు ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నారు. వీరంగా ఎన్నికల సమయంలో సొంత గ్రామాలకు వచ్చి.. ఓట్లు వేస్తారు. -
చిన్న పార్టీల పెద్ద దెబ్బ
రాజస్తాన్‌లో 99 స్థానాలు గెలుచుకుని మెజారిటీకి దగ్గరగా వచ్చిన కాంగ్రెస్‌ను తిరుగుబాటుదారులు, స్వతంత్రులు బాగా దెబ్బతీశారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులూ, చిన్న చిన్న పార్టీలూ కలిపి మొత్తం 199 సీట్లలో 27 సీట్లను గెలుచుకున్నారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ వస్తుందని ఊహించినా.. ఆ స్థాయిలో గెలుపు సాధించలేకపోయింది. ఎన్నికలకి ముందు ఎవరితోనూ పొత్తు పెట్టుకోకపోవడం కొన్ని స్థానాల్లో విజయావకాశాలను దెబ్బతీసిందనేది పార్టీలో సీనియర్ నాయకులు భావిస్తున్నారు. ఎన్నికల అనంతరం ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకోసం కొత్తగా ఎన్నికైన బీజేపీయేతర పార్టీల అభ్యర్థుల మద్దతుని ఆశించక తప్పని పరిస్థితి ఏర్పడింది. చిన్న పార్టీలను తమకు మద్దతుగా ఒక్కతాటిపైకి తేవడంలోనూ, తిరుగుబాటుదారులను బుజ్జగించి తన దోవలోకి తెచ్చుకోవడంలోనూ కాంగ్రెస్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. రాజస్థాన్‌లో ప్రధానమైన ఎదురుదెబ్బ స్వతంత్ర అభ్యర్థులనుంచే ఎదుర్కొంది. గత(2013) ఎన్నికల్లో 7 సీట్లు సాధించిన స్వతంత్రులు ఈసారి ఏకంగా 13 సీట్లు గెలుచుకున్నారు. ఈ 13 సీట్లలో కనీసం 8 స్థానాల్లో గెలుపొందిన వారు కాంగ్రెస్ పార్టీ రెబల్సే కావడం గమనార్హం. ‘బిజెపి కన్నా మా పార్టీకే తిరుగుబాటు దారుల వల్ల ఇబ్బంది ఎక్కువన్న విషయం మాకు ముందే తెలుసు. సగానికి పైగా ఇండిపెండెంట్లు కాంగ్రెస్ పార్టీనుంచి వెళ్లినవారే. వాళ్ళు మా అవకాశాలను బాగా దెబ్బతీశారు’ అని రాజస్థాన్‌కి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అన్నారు. స్వతంత్రులను పక్కనపెడితే ఆరు సీట్లను గెలుచుకున్న బహుజన్ సమాజ్ పార్టీ చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపింది. మాజీ బీజేపీ నేత హనుమాన్ బెనివాల్ సారథ్యంలోని రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ 3 సీట్లూ, గుజరాత్ కి చెందిన భారతీయ ట్రైబల్ పార్టీ, సీపీఎం చెరో 2, రాష్ట్రీయ లోక్‌దళ్ ఒక సీటు గెలిచాయి. ‘ ముందుగానే కాంగ్రెస్ తిరుగుబాటుదారులను ఒప్పించినా, లేదా స్వతంత్ర అభ్యర్థులను చేర్చుకున్నా ఫలితాలు మరో రకంగా ఉండేవి’ అని జైపూర్‌కి చెందిన రాజస్థాన్ యూనివర్సిటీ మాజీ ప్రిన్సిపల్ ఆర్.డి.గుర్రాజ్ అభిప్రాయపడ్డారు. ఎంపీలో 17.. రాజస్తాన్‌లో 141% తేడాతో సీట్లు తారుమారు ఒక శాతం, లేదా ఒక శాతం లోపు ఓట్లు అటూ ఇటూ అయితే ప్రభుత్వాలే పడిపోతాయని మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలు రుజువు చేశాయి. కేవలం ఒక్క శాతంలోపు ఓట్ల తేడాతో రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 31 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు ఓటముల నిర్ణయం జరిగింది. మధ్యప్రదేశ్‌లో 17 నియోజకవర్గాలు, రాజస్థాన్‌లో 14 అసెంబ్లీ సీట్లలో అతి తక్కువ ఓట్ల తేడాతో విజయావకాశాలు చేజారి పోయినట్టు ఓట్ల వివరాలను బట్టి తెలుస్తోంది. ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ఓట్ల శాతంలో తేడా అత్యంత స్వల్పంగా ఉండటం ఇక్కడ గమనార్హం. మధ్య ప్రదేశ్‌లో పోటీపోటీగా జరిగిన ఎన్నికల్లో 17 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధుల మధ్య ఓట్ల తేడా కేవలం ఒక శాతం లోపు ఉండగా, అందులో 15 స్థానాల్లో మరితం తక్కువ ఓట్ల తేడాతో గెలుపు ఓటముల నిర్ణయం జరిగిపోయింది.ఈ 15 సీట్లలో 9 చోట్ల కాంగ్రెస్ విజయం సాధిస్తే, బీజేపీ అభ్యర్ధులు ఆరు స్థానాల్లో గెలిచారు. శివరాజ్ సింగ్‌చౌహాన్ మంత్రివర్గంలో వైద్య విద్యాశాఖ మంత్రిగా ఉన్న శరద్ జైన్ జబల్పూర్ నార్త్ నియోజకవర్గంలో కేవలం 0.4శాతం ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ సక్సేనా చేతిలో ఓటమి పాలయ్యారు.అలాగే, ఓటమి పాలయిన 13 మంది మంత్రుల్లో ఉమా శంకర్ గుప్తా, దీపక్ జోషి, రుస్తుం సింగ్ అతి తక్కువ ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఇక రాజస్థాన్ విషయానికి వస్తే 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1 శాతం ఓట్ల తేడాతో అభ్యర్థుల తలరాతలు మారిపోయాయి. వీటిలో ఏడు చోట్ల బీజేపీ గెలుపొందగా, మిగతా స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. వసుంధర రాజె ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రాజేంద్ర రాతోర్ 1 శాతం ఓట్ల తేడాతో చురు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. -
నిలిచేదెవరు..? తప్పుకునేదెవరు..?
పార్టీ టికెట్టు కేటాయించకపోవడంతో అలిగి స్వతంత్రంగా నామినేషన్లు వేసిన కాంగ్రెస్ నేతలను అధిష్టానం బుజ్జగిస్తోంది. ఇతర అవకాశాలు కల్పిస్తామంటూ హామీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోవారు అధిష్టానం మాట విని తప్పుకుంటారా? బరిలోనే ఉంటారా అన్న విషయమై ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం ముగియనుండడంతో కాంగ్రెస్ అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. సాక్షి, కామారెడ్డి: టికెట్టు దక్కలేదన్న కోపంతో తిరుబాటుకు సిద్ధపడ్డ నేతలను కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగిస్తోంది. ముందుముందు ఎంపీ ఎన్నికలు ఉన్నాయని, పోటీకి అవకాశం కల్పిస్తామని, ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని ఆశచూపుతోంది. పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి తెస్తోంది. అయితే తమకు ఏ పదవి ఇస్తారో అధికారికంగా ప్రకటిస్తేనే పోటీ నుంచి తప్పుకుంటామని తిరుబాటు నేతలు మొండికేస్తున్నట్టు సమాచారం. దీంతో వారిని ఒప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మూడు చోట్లా రెబెల్స్.. జిల్లాలో ఒక్క కామారెడ్డి నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాట్లు లేవు. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నేతలు టికెట్టు కోసం ప్రయత్నించారు. అయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన జాజాల సురేందర్‌కు అవకాశం దక్కింది. దీంతో భంగపడ్డ సుభాష్‌రెడ్డి బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ టికెట్టు కాసుల బాల్రాజును వరించింది. ఇక్కడ టికెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నించిన మల్యాద్రిరెడ్డి తిరుగుబాటు జెండా ఎగురవేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. జుక్కల్‌లో గంగారామ్‌కు టికెట్టు రావడంతో అరుణతార తిరుగుబాటు చేశారు. ఆమె ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారని భావించారు. అయి తే అనూహ్యంగా బీజేపీలో చేరిన అరుణతార ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. రంగంలోకి హైకమాండ్.. తిరుగుబాటు చేసిన నేతలను బుజ్జగించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. హైదరాబాద్ కేంద్రంగా తిరుగుబాటు నేతలతో సంప్రదింపులు జరుపుతోంది. ఎల్లారెడ్డిలో తిరుగుబాటు చేసిన సుభాష్‌రెడ్డికి ఎంపీ టికెట్టు ఇస్తామని నేతలు చెప్పినట్లు తెలిసింది. అయితే పార్టీ నుంచి అధికారికంగా ప్రకటించాలని ఆయన మెలిక పెట్టినట్టు సమాచారం. ఎంపీ అవకాశం ఇస్తామని కచ్చితంగా ప్రకటిస్తేనే తాను పోటీ నుంచి తప్పుకుంటానని చెబుతున్నారు. బాన్సువాడలో మల్యాద్రిరెడ్డి కూడా స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో నిలవడంతో ఆయ నతో కాంగ్రెస్ ముఖ్యనేతలు మాట్లాడినట్టు తెలిసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. నేటితో ముగియనున్న గడువు.... నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. గడువులోగా తిరుగుబాటు నేతలు నామినేషన్లను ఉపసంహరించుకుంటారా లేదా అన్నదానిపై చర్చించుకుంటున్నారు. భవిష్యత్తులో న్యాయం చేస్తా మని పార్టీ హైకమాండ్ చెబుతున్నా రెబ ల్స్ నమ్మడం లేదని సమాచారం.. తిరుగుబాటు నేతలు ఉపసంహరణకు మొగ్గుచూపుతున్నా.. వారి అనుచరులు ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్‌లో ఇచ్చే ప్రాధాన్యతపై ఇప్పుడే స్పష్టమైన ప్రకటన చేయాలంటూ పట్టుబడుతున్నట్టు సమాచారం. అధిష్టానం బుజ్జగిం పులు ఫలించి, తిరుగుబాటు నేతలు పోటీలోనుంచి తప్పుకుంటారా, లేక బరిలోనే నిలిచి బలాన్ని తేల్చుకుంటారా అన్నది గురువారం సాయంత్రంలోగా తేలనుంది. -
కాంగ్రెస్ గెలుపు అవకాశాలు దెబ్బతీయడమే వీరి లక్ష్యం!
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియడంతో కాంగ్రెస్‌పార్టీ బుజ్జగింపులపై దృష్టి పెట్టింది. టికెట్ దక్కని నేతలు, అసంతృప్తులను మచ్చిక చేసుకునే పర్వానికి తెరలేపింది. ఇండిపెండెంట్లుగా, ఇతర పార్టీల తరఫున బరిలో నిలిచిన నేతలను ఒప్పించి, మెప్పించి అసమ్మతి సెగలు చల్లార్చేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, ఇప్పటికే చాలామంది అసమ్మతివాదులు ఇతర పార్టీల బి–ఫారాలపై పోటీలో నిలవడం, టికెట్ దక్కించుకున్న నేతలను ఓడించాలనే కసితో ఉండటం అధినాయకత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పార్టీ పెద్దలు జరుపుతున్న సంప్రదింపులతో అసంతృప్త నేతలు మెత్తబడి అభ్యర్థులతో చేతులు కలుపుతారా? లేక చేయిస్తారా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. వేరే పార్టీల నుంచి కొందరు.. ఇండిపెండెంట్లుగా బరిలో... మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి దుబ్బాక టికెట్ దక్కకపోవడం తో మంగళవారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీ బీ–ఫారంపై పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కించుకున్న గంగారాంను ఓడించడమే లక్ష్యంగా ప్రచారం మొదలుపెట్టారు. నారాయణఖేడ్‌లో టికె ట్ ఆశించిన దివంగత మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డి సైతం బీజేపీ తరఫున బరిలో నిలిచారు. ఈయన బరిలో ఉండటం కాంగ్రె స్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ గెలుపును తీవ్రంగా ప్రభావితం చేయనుంది. వేములవాడ టికెట్ దక్కకపోవడంతో ఏనుగు మనోహర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. ఇబ్రహీంపట్నం నుంచి బీ ఫారం ఇవ్వకపోవడంతో మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గంలో ఆయన సోదరుడు మల్రెడ్డి రాంరెడ్డి ఎన్సీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. బాన్సువాడలో మల్యాద్రిరెడ్డి, ఎల్లారెడ్డిలో వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, వికారాబాద్‌లో మాజీమంత్రి చంద్రశేఖర్, నారాయణపేటలో బీఎల్ఎఫ్ తరఫున శివకుమార్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో ఎన్సీపీ తరఫున సురేందర్‌రెడ్డి, బీఎస్పీ తరఫున ఇబ్రహీం, చెన్నూర్‌లో బోడ జనార్దన్, ముథోల్‌లో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, ఇల్లందులో ఊకె అబ్బయ్య, స్టేషన్ ఘన్‌పూర్‌లో విజయరామారావు, పెద్దపల్లిలో కేతి ధర్మయ్య, సురేశ్‌రెడ్డి, వరంగల్ వెస్ట్‌లో నాయిని రాజేందర్‌రెడ్డి, పటాన్చెరులో గాలి అనిల్‌కుమార్ ఎన్నికల బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు ఒకరోజే గడు వు ఉండటంతో సాధ్యమైనంత ఎక్కువ మందిని తమ దారిలోకి తెచ్చుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని రకాల సహకారం ఉంటుందని వారికి నచ్చచెబుతోంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, రేవంత్‌రెడ్డి తదితరులు బరిలో నిలిచిన అసంతృప్త నేతలతో మాట్లాడుతున్నారు. భిక్షపతితో చర్చలు.. రాజేంద్రనగర్ టికెట్ కోసం చివరివరకు ప్రయత్నించినా దక్కకపోవడంతో తీవ్ర నైరాశ్యంలో ఉన్న పి.కార్తీక్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని, కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. అయితే, రాజీనామా ప్రభావం మహేశ్వరం నుంచి పోటీలో ఉన్న తన తల్లి సబితారెడ్డిపై పడుతుందని, పార్టీ కి రెండు విధాలా నష్టమని పార్టీ పెద్దలు నచ్చచెప్పడంతో ఆయన మెత్తబడ్డారు. కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో షాద్‌నగర్ స్థానంలో ఎస్పీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన మాజీమంత్రి శంకర్రావ్ వెనక్కి తగ్గారు. కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి మేరకు పార్టీలోనే కొనసాగుతున్నట్లు ఆయన మంగళవారం ప్రకటించారు. ఖైరతాబాద్ టికెట్ ఆశించి భంగపడ్డ స్థానిక నేత రోహిణ్‌రెడ్డి సైతం అక్కడ బరిలో నిలిచిన దాసోజు శ్రవణ్‌కు సహకరించేందుకు నిరాకరించారు. అయితే, ఉత్తమ్ రంగంలోకి దిగి మాట్లాడటంతో దాసోజుకు సహకరించేందుకు రోహిణ్‌రెడ్డి అంగీకరించారు.శేరిలింగంపల్లి టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాజీఎమ్మెల్యే భిక్షపతియాదవ్‌ను బుజ్జగించేందుకు కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి రంగంలోకి దిగారు. మంగళవారం ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. నామినేషన్ వెనక్కి తీసుకోవాలని కోరారు. దీనిపై భిక్షపతి నిర్ణయం తెలియాల్సి ఉంది. – సాక్షి, హైదరాబాద్ -
ఇండిపెండెంట్లుగా..!
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు రెబెల్స్ బెడద తప్పేలా లేదు. జిల్లాలోని ఆయా అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన తర్వాత అసమ్మతి జ్వాలలు భగ్గున మండాయి. తమకే టికెట్ వస్తుందని ఆశించిన వారికి భంగపాటు ఎదురవడంతో అభ్యర్థిని వ్యతిరేకిస్తూ బహిరంగ ప్రకటనలు కూడా చేశారు. వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. అధిష్టానం కొందరిని బుజ్జగించినా మరికొందరు ససేమిరా అంటున్నారు. అలాంటి వారు ఇప్పుడు ఇండిపెండెంట్‌గా బరిలో దిగేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. మిర్యాలగూడ, నల్లగొండలో ఈ పరిస్థితి ఎదురవుతోంది. సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో టీఆర్ఎస్ రాజకీయం నెల రోజులుగా రోజుకో రకంగా మారుతూ వస్తోంది. పార్టీలో ముందునుంచీ పనిచేసిన వారు టికెట్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నెల రోజుల కిందట ఆ పార్టీ అధ్యక్షుడు, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల్లో తమ పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన సదరు నేతలు అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా అసమ్మతి కుంపటి రాజేశారు. అభ్యర్థులను మార్చాలని, ఏళ్లకు ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న అసమ్మతి కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు అధినాయకత్వం భగీరథ ప్రయత్నమే చేసింది. వీరిలో కొందరు దారికి వచ్చినా, మరికొందరు మాత్రం ససేమిరా అంటున్నారు. జిల్లా కేంద్రంలో 4వ తేదీన జరిగిన ఉమ్మడి జిల్లా ప్రజా ఆశీర్వాద సభ వరకు ఓపిక పట్టిన అసమ్మతి నాయకులు ఒక్కొక్కరు ఇప్పుడు తమ అభిమతాన్ని బయట పెడుతున్నారు. ఇక, అధిష్టానం దిగివచ్చి అభ్యర్థులను మార్చే అవకాశాలు దాదాపుగా లేకపోవడంతో, చేసేది లేక తామే బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అసంతృప్త నేతలు కొందరు ఇప్పటికే తాము ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తామని ప్రకటించారు. రెబల్స్ బెడద ఇప్పటికిప్పుడు టీఆర్ఎస్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. అభ్యర్థుల ప్రకటన తర్వాత కాంగ్రెస్‌లోనూ ఇదే పరిస్థితి తలెత్తే అవకాశాలు లేకపోలేదని పేర్కొంటున్నారు రెబల్ గులాబీలు.. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఇప్పటికే పది చోట్ల అభ్యర్థులను ప్రకటించారు. నాగార్జునసాగర్, మునుగోడు, మిర్యాలగూడ, నల్లగొండ, తుంగతుర్తి నియోజకవర్గాల్లో అభ్యర్థులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు, అసమ్మతి సమావేశాలు జరిపారు. వీరిలో కొందరు అగ్రనాయకత్వం పిలిపించి మాట్లాడడంతో తమ రాజకీయ భవిష్యత్ కోసం రాజీపడిపోయారు. మరికొందరు మాత్రం ససేమిరా అంటూ ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. మిర్యాలగూడలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఇక్కడి సిట్టింగ్ భాస్కర్‌రావు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. అధినాయకత్వం చివరకు ఆయనకే టికెట్ ఖాయం చేసింది. ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన అలుగుబెల్లి తానే స్వయంగా పోటీలో ఉంటానని ప్రకటించారు. ఈ మేరకు ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం కూడా చేస్తున్నారు. పార్టీ నాయకత్వం పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేసినా అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి భాస్కర్‌రావుకు దీటుగా నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. నల్లగొండ నియోజకవర్గంలోనూ ఇదే పరి స్థితి ఉంది. మాజీ ఇన్చార్జి చకిలం అనిల్‌కుమార్ రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి వచ్చారు. అయినా, తన నిర్ణయంలో మార్పు లేదంటున్న ఆయన ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించిన ఆయన ఆ మాటకే కట్టుబడి నియోజకవర్గాన్ని చుట్టి వస్తున్నారు. మరో అసమ్మతి నేత, తిప్పర్తి జెడ్పీటీసీ సభ్యుడు తండు సైదులు గౌడ్ ఇన్ని రోజులు ఎదురు చూసి ఆదివారం తన నిర్ణయాన్ని ప్రకటించారు. తన అనుయాయులతో సమావేశమై ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇప్పుడు నల్లగొండ టీఆర్ఎస్లో ఇద్దరు రెబల్స్ ఉన్నట్టు లెక్క. హుజూర్నగర్ నియోజకవర్గ నాయకుడు సామల శివారెడ్డి సైతం తాను ఇండిపెండెంటుగా బరిలో ఉంటానని ప్రకటించారు. కాకుంటే ఆయన ఎలాంటి ప్రచారం, ఇతర కార్యక్రమాలేవీ చేపట్టడం లేదు. మరో వైపు పార్టీ నిర్ణయంపై అసంతృప్తితో జెడ్పీ చైర్మన్ బాలూనాయక్ కాంగ్రెస్‌లో చేరారు. నల్లగొండలో మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌కూ రెబల్స్ ముప్పు అభ్యర్థులు ప్రకటించిన టీఆర్ఎస్లో మాత్రమే రెబల్స్ ఉన్నట్లు కనిపిస్తున్నా.. త్వరలో అభ్యర్థులు ఖరారు కానున్న కాంగ్రెస్‌కూ రెబల్స్ బెడద తప్పేలా లేదని అంచనా వేస్తున్నారు. మునుగోడు టికెట్ ఆశిస్తున్న శాసన మండలి సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే ఎన్నికల కమిటీల నియామకాలపై నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీగా మరో మూడేళ్లకుపైగానే పదవీ కాలం ఉన్నందున ఆయనకు టికెట్ నిరాకరిస్తే ఇండిపెండెంటుగానైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అనుచరగణం పేర్కొంటోంది. మునుగోడును పొత్తుల్లో భాగంగా సీపీఐకి కేటాయించినా, తనకు కాకుండా మరో అభ్యర్థికి ప్రకటించినా రాజగోపాల్‌రెడ్డి రెబల్‌గా బరిలోకి దాదాపు ఖాయమని పేర్కొంటున్నారు. టికెట్లు ప్రకటించాక గానీ కాంగ్రెస్‌కు ఏయే నియోజకవర్గాల్లో ఈ బెడద ఉంటుందో చెప్పలేమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
3,500 పోటీ చేస్తే 9 మంది గెలిచారు
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో స్వంతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగిన వారికి నిరాశే మిగిలింది. మొత్తం 3,500 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా అందులో విజయం సాధించింది కేవలం 9 మందే. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. గెలిచిన 9 మందిలో ఒక్క కేరళ నుంచే ఆరుగురు విజయం సాధించారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం ముగ్గురు గెలుపొందారు. తమినాడు నుంచి ఒక్కరూ గెలవకపోవడం గమనార్హం. 3,500 మందిలో కేరళ నుంచి 782, అస్సాం నుంచి 711, పశ్చిమ బెంగాల్ నుంచి 371, పుదుచ్చేరి నుంచి 96 మంది రంగంలోకి దిగినట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. మొత్తం 822 నియోజక వర్గాల్లో పోలింగ్ జరిగింది. ఇండిపెండెంట్ అభ్యర్ధులు పశ్చిమ బెంగాల్లో 2.2 శాతం, తమిళనాడులో 1.4 శాతం, కేరళలో 5.3 శాతం, అస్సాంలో 11 శాతం, పుదుచ్చేరిలో 7.9 శాతం ఓట్లను పొందారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఐదు రాష్ట్రాల నుంచి 2,556 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయగా అందులో ఏడుగురు విజయం సాధించారు. -
అన్నింటా గందరగోళమే..
- ఏ కార్పొరేషన్‌లోనూ రాని మెజారిటీ స్థానాలు - నవీముంబైలో ఎన్సీపీ.. మిగతా చోట్ల కాషాయ కూటమి ఆధిక్యం - చతికిల పడ్డ కాంగ్రెస్..హిట్టయిన ఎంఐఎం - కీలకం కానున్న స్వతంత్రులు సాక్షి, ముంబై: కార్పొరేషన్ల ఫలితాలు అందరూ ఊహించినట్లే వచ్చాయి. పోలింగ్ తక్కువగా నమోదవడంతో నవీముంబై, ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో అన్నిచోట్ల గందరగోళం నెలకొంది. అధికారం ఏర్పాటు చేయాలంటే ఇతరుల మద్దతు కచ్చితంగా తీసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. వేర్వేరుగా పోటీ చేసిన ప్రధాన పార్టీలు ఇప్పుడూ పంతాలకు పోతే అధికారానికి దూరమవాల్సిందే. నవీముంబై, ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు బుధవారం ఎన్నికలు జరగ్గా గురువారం ఫలితాలు వెలువడ్డాయి. గత ఎన్నికలతో పోలిస్తే కొన్ని పార్టీలకు స్థానాలు పెరగ్గా, మరికొన్ని పార్టీల స్థానాలు తగ్గిపోయాయి. నవీముంబై ఎన్సీపీ అతిపెద్ద పార్టీ నవీముంబైలో 111 వార్డులుండగా మొత్తం 568 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందరికన్నా ఎక్కువ స్థానాల్లో పోటీ చేసిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 52 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక్కడ ప్రధాన పార్టీలైన శివసేన, బీజేపీ కలసే పోటీ చేశాయి. శివసేన 68 స్థానాల్లో పోటీచేయగా 38 వార్డుల్లో విజయకేతనం ఎగురవేసింది. బీజేపీ 43 స్థానాల్లో పోటీ చేయగా కేవలం ఆరు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ ఎన్సీపీ ఒంటరిగా పోటీ చేశాయి. ఎన్సీపీ 107 స్థానాల్లో పోటీచేయగా ఏకంగా 52 స్థానాలు దక్కించుకుంది. పంతాలకు పోయిన కాంగ్రెస్ 89 స్థానాల్లో పోటీచేసి 10 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇతరులు ఐదు స్థానాలు గెలుచుకున్నారు. కార్పొరేషన్లో అధికారం ఏర్పాటు చేయాలంటే మేజిక్ ఫిగర్ 56 (స్థానాలు) కావాలి. అందులో 52 స్థానాలు ఎన్సీపీకి రావడంతో ఈ పార్టీ అధికారం దక్కించుకోవడ ం ఖాయంగా కనిపిస్తోంది. తమకు ఐదుగురు స్వతంత్రుల మద్దతు ఉందని, కాంగ్రెస్‌తో జతకట్టాల్సిన అవసరం లేదని ఎన్సీపీ నేత గణేశ్ నాయిక్ అన్నారు. లోక్‌సభ, శాసన సభ ఎన్నికల్లో ప్రభావం కోల్పోయిన ఎన్సీపీకి ఈ గెలుపు ఊరటనిచ్చే అంశం. కాషాయ కూటమి విజయ భేరి ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 113 వార్డులకు జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మొత్తం 900 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. శివసేన, బీజేపీ కూటమికి ఇక్కడి ఫలితాలు నవీముంబై కంటే కొంత మెరుగ్గానే వచ్చాయి. శివసేన 64 స్థానాల్లో పోటీచేయగా 29 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 49 స్థానాల్లో పోటీ చేసి 23 గెలుచుకుంది. కాషాయకూటమికి మొత్తం 52 స్థానాలు వచ్చాయి. ఔరంగాబాద్‌లో ముస్లిం సంఖ్య ఎక్కువే అయినప్పటికీ నవీముంబైతో పోలిస్తే ఇక్కడ బీజేపీకి ఫలితాలు చాలా మెరుగ్గా వచ్చాయి. 110 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్.. ఇక్కడ కూడా కేవలం 10 స్థానాలతో సరిపెట్టుకుంది. దీంతో కాంగ్రెస్ ఇరు చోట్ల పూర్తిగా దెబ్బతింది. నవీముంబైలో అధికార పీఠం ఖాయం చేసుకున్న ఎన్సీపీ.. 70 స్థానాల్లో పోటీచేసి కేవలం మూడు స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఎంఐఎం హిట్.. ఎంఐఎం 53 వార్డుల్లో పోటీ చేసి ఏకంగా 25 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఎంఐఎంకు ఫలితాలు చాలా మెరుగ్గా వచ్చాయి. నవీముంబైతో పోలిస్తే ఔరంగాబాద్‌లో పోలింగ్ శాతం ఎక్కువ నమోదైంది. కాని ఇక్కడ రికార్డు స్థాయిలో అభ్యర్థులు బరిలో దిగడంవల్ల ఓట్లు చీలిపోయి ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. అధికారం ఏర్పాటు చేయాలంటే మేజిక్ ఫిగర్ 57 స్థానాలు కావాలి. కాశాయ కూటమికే అధికార పీఠం దక్కించుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీఎస్పీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు, ఇతరులు 18 మంది ఉన్నారు. వీరిలో ఎవరి మద్దతుతోనైనా అధికారం ఏర్పాటు చేసుకునేందుకు అవకాశముంది. అంబర్నాథ్, బద్లాపూర్‌లో కాషాయ రెపరెప అంబర్నాథ్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికారం ఏర్పాటు చేయడానికి కాశాయ కూటమికే ఎక్కువ అవకాశం ఉంది. మొత్తం 57 స్థానాలుండగా ఇందులో మూడు స్థానాలు ఇది వరకే ఏకగ్రీవమయ్యాయి. మిగతా 54 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో శివసేనకు 26, మిత్రపక్షమైన బీజేపీకి 10 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ ఎనిమిది, ఎన్సీపీ ఐదు స్థానాలతో సరిపెట్టుకున్నాయి. బద్లాపూర్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా కాషాయకూటమి అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతో ఇద్దరు, ముగ్గురు స్వతంత్రుల అండతో అధికారం ఏర్పాటు చేసేందుకు అవకాశం లభించింది. కాంగ్రెస్, ఎన్సీపీలు ఇక్కడ కూడా చతకిలపడిపోయాయి. మొత్తం 47 స్థానాలుండగా ఐదు వార్డులు ఇదివరకే ఏకగ్రీవమయ్యాయి. మిగతా 42 స్థానాల్లో కాశాయ కూటమి ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. -
టెన్షన్..టెన్షన్..టెన్షన్!
రేపే ఓట్ల లెక్కింపు చక్రం తిప్పనున్న ఇండిపెండెంట్లు? సాక్షి, ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనున్న నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి రానుంది...? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే... విషయంపై అనేక ఊహగానాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఓట్ల లెక్కింపుపైనే కేంద్రీకృతమైంది. ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ పెద్ద పార్టీగా అవతరించనుందని తేలడంతో బీజేపీ వర్గాల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఆ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం అప్పుడే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఒకవేళ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి మెజారిటీ స్థానాలు లభ్యమైతే ముఖ్యమంత్రి పదవి ఎవరికి కట్టబెట్టాలనే విషయంపై ఇప్పటినుంచే రాష్ట్రవ్యాప్తంగా జోరుగా చర్చలు ప్రారంభమయ్యాయి. ఆ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా రోజుకో పేరు తెరపైకి వస్తోంది. ముఖ్యమంత్రి రేసులో ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, పంకజా ముండే, దేవేంద్ర ఫడ్నవీస్, వినోద్ తావ్డే, ఏక్నాథ్ ఖడ్సేలున్న సంగతి తెలిసిందే. వీరితోపాటు ఇప్పుడు మరో పేరు విన్పిస్తోంది. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు ముఖ్యమంత్రి పదవి అప్పగించే అవకాశాలున్నాయంటూ కొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి విషయంపై సుదీర్ఘ చర్చలు జరిగే అవకాశముంది. కీలకంగా మారనున్న ఇండిపెండెంట్లు... ఎవరికీ పూర్తి మెజార్టీ లభించనట్టయితే ఇండిపెండెంట్లు కీలకంగా మారే అవకాశాలున్నాయి. ముఖ్యంగా పాతికేళ్ల తర్వాత పార్టీలన్నీ ఒంటరిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్నటివరకు మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీలతోపాటు శివసేన, బీజేపీల ఓట్లు చీలే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో ఎవరు గెలిచినా చాల స్వల్పమెజార్టీతో గట్టెక్కే అవకాశాలున్నాయి. మరోవైపు గతంలో మాదిరిగా ఓట్లు చీలి ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా పరాజయం పాలయ్యే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏ పార్టీకీ పూర్తి మెజార్టీరాకుండా హంగు ఏర్పడినట్టయితే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఇండిపెండెంట్లు ప్రధాన పాత్ర పోషిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,686 మంది ఇండిపెండెంట్లు పోటీచేశారు. వీరిలో ఎంత మంది విజయం సాధిస్తారనేది ఆదివారం వరకు వేచిచూడాల్సిందే. ప్రతిపక్షంలో ఎవరో మరి.. సాక్షి, ముంబై: రాష్ట్రంలో బుధవారం జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కాకముందే కొన్ని ప్రముఖ పార్టీలు తమకు తోచిన విధంగా పదవులపై అంచనాలు వేసుకుంటున్నాయి. ఎగ్జిట్ పోల్స్ సర్వేలో బీజేపీకి భారీ మెజార్టీ వస్తుందని, సొంత బలంపై ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పష్టం కావడంతో ఇక ప్రతిపక్షంలో ఎవరుంటారనే దానిపై ప్రముఖ పార్టీల్లో ఉత్కంఠ రేపుతోంది. ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం మొదటి స్థానంలో బీజేపీ ఉండగా రెండు, మూడు, నాలుగో స్థానంలో నిలిచే పార్టీల మధ్య ఎక్కువ తేడా లేదు. దీంతో ప్రతిపక్షంలో ఎవరు కొనసాగుతారనే దానిపై అంతటా చర్చ జరుగుతోంది. కాగా సర్వే రిపోర్టు ప్రకారం రెండో స్థానంలో శివసేన ఉన్నప్పటికీ ప్రతిపక్ష నాయకుడి పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై కూడా పార్టీ వర్గీయుల్లో చర్చనీయంశమైంది. కాని సర్వే రిపోర్టుపై తమకు నమ్మకం లేదని తామే ప్రభుత్వం ఏర్పాటుచేస్తామనే ధీమాతో శివసేన నాయకులు ఉన్నారు. కాని సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజార్టీ రాకున్నప్పటికీ కనీసం ప్రతిపక్షంలోనైనా కొనసాగుతామనే ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క ప్రభుత్వం ఏర్పాటులో ఎన్సీపీ కీలకపాత్ర పోషిస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ప్రఫుల్ పటేల్ అభిప్రాయపడిన విషయం తెలిసిందే. ఇలా ఎవరికి వారు ఫలితాల తర్వాత ఎదురయ్యే రాజకీయ పరిణామాలపై బేరీజు వేసుకుంటున్నారు. -
ఒక్క ఓటుతో లక్ష్మీనారాయణ విజయం
- అన్నీ తామై నడిపించిన ఎంపీ, ఎమ్మెల్యే - ఒక్క ఓటుతో లక్ష్మీనారాయణ విజయం యైటింక్లయిన్‌కాలనీ : పక్కా ప్రణాళికతో వ్యూహాన్ని అమలు పర్చి రామగుండం కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగిరేలా చేశారు పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ. పార్టీ కార్పొరేటర్లు తక్కువ సంఖ్యలోనే గెలుపొందినా... ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టి ఎక్కడా పట్టు జారకుండా జాగ్రత్తపడ్డారు. పథకం ప్రకారం టీఆర్ఎస్, ఇండిపెండెంట్లు, బీజేపీ కార్పొరేటర్లను కమాన్‌పూర్ మండలం జూల పల్లి గ్రామ ఆదర్శనగర్‌లోని సానా క్యాంపస్‌లోకి తరలించారు. ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే సత్యనారాయణ క్యాంపునకు ముందుగానే చేరుకుని వ్యూహం రచించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ బలం సమానంగా ఉన్నా... ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో ఓట్లతో ఓడిపోయే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదని, జరగబోయే పరిణామాలను అంచనావేసి కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. అందరూ కొంకటి లక్ష్మీనారాయణకు మద్దతు పలికేలా ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. అనంతరం ప్రత్యేక బస్సులో వారిని గోదావరిఖని తీసుకెళ్లారు. ఎన్నిక సమయంలో ఒక టీఆర్ఎస్ కార్పొరేటర్ గైర్హాజరై ఉత్కంఠ పరిస్థితి నెలకొనగా ఎంపీ, ఎమ్మెల్యేల ఓటుతో లక్ష్మీనారాయణ విజయం సాధించారు. ఒక్కఓటు తేడాతో మేయర్ పదవి దక్కించుకున్నారు. -
ఈ ‘లెక్క’కు ఓ చిక్కుంది
సాక్షి, కాకినాడ :ఎన్నికలు జరిగి సుమారు ఒకటిన్నర నెలలైంది. అభ్యర్థులు ఎన్నికల్లో పెట్టిన ఖర్చులు మాత్రం తేలడం లేదు. ముందెన్నడూ లేని రీతిలో కోట్లు కుమ్మరించిన అభ్యర్థులు.. లక్షల్లో చిట్టాపద్దులు రాసేందుకు ఆపసోపాలు పడ్డారు. నానాతంటాలు పడి వీరు అప్పగించిన లెక్కలను మదించడంలో అధికారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. జిల్లాలో మూడు పార్లమెంటు, 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు గత నెల ఏడున సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్, లోక్‌సత్తా, జై సమైక్యాంధ్ర వంటి పార్టీలతో పాటు పెద్దఎత్తున ఇండిపెండెంట్లు తలపడ్డారు. మూడు పార్లమెంటు స్థానాల కోసం 50 మంది పోటీ పడగా, 19 అసెంబ్లీ స్థానాలకు 250 మంది బరిలో నిలిచారు. ఎమ్మెల్యే అభ్యర్థులకు 28 లక్షలు, ఎంపీ అభ్యర్థులకు రూ.70 లక్షలకు మించి వ్యయం చేయరాదని ఎన్నికల సంఘం నిర్దేశించింది. నామినేషన్ నాటి నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు ఏరోజుకారోజు ఎన్నికల ఖర్చుల వివరాలను రిటర్నింగ్ అధికారులకు తెలియజేసేవారు. ఎన్నికల అనంతరం విజేతలుగా నిలిచిన ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు పరాజితులైన అభ్యర్థులు ఎన్నికల్లో చేసిన ఖర్చుల వివరాలతో కూడిన చిట్టాపద్దులు సమర్పించేందుకు మాత్రం జూన్ 18కి గడువు విధించారు. అభ్యర్థులు సమర్పించిన చిట్టాపద్దులను పరిశీలించి జూన్ 19కల్లా ఎన్నికల కమిషన్‌కు తుది నివేదిక సమర్పిస్తామని జిల్లా అధికారులు ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేనంతగా కొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం కోట్ల రూపాయలు కుమ్మరించారు. అయితే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తాము చేసిన ఖర్చులను లక్షల్లో కుదించి తుది జాబితాలను సమర్పించారు. జిల్లాలో 31 మంది అభ్యర్థులు మినహా ప్రధాన పార్టీ విజేతలతో పాటు బరిలో నిలిచిన మిగిలిన అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చును ఎన్నికల సంఘం నిర్దేశించిన ఫార్మెట్లలోనే రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. వాటిని రిటర్నింగ్ అధికారులు ఆడిట్ బృందాలతో పరిశీలన జరిపి జిల్లా ఎన్నికల సెల్‌కు అప్పగించారు. గత మూడు రోజులుగా ఏరోజుకారోజు తుది జాబితాలను ఎన్నికల సంఘానికి సమర్పిస్తామంటూ చెబుతున్నప్పటికీ, సాయంత్రమయ్యేసరికి ఇంకా కొలిక్కి రాలేదంటూ అధికారులు దాట వేస్తున్నారు. అభ్యర్థులు సమర్పించిన ఎన్నికల ఖర్చుల జాబితాలను మదింపు చేసేందుకు సుమారు 20 మందితో కూడిన సిబ్బంది పొద్దస్తమానం కుస్తీ పడుతున్నా లెక్కలు మాత్రం తేల్చలేకపోతున్నారు. అభ్యర్థులు రోజు వారీగా చేసిన ఖర్చులు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు సమర్పించిన ఖర్చుల వివరాలు, అభ్యర్థులు సమర్పించిన ఖర్చుల వివరాలను సరిపోల్చుకుంటున్నారు. అభ్యర్థులు చేసిన ప్రతీ ఖర్చుకు ఓఫార్మెట్ ఉండడంతో వాటిని క్రోడీకరిస్తూ.. వ్యయాన్ని సరిపోల్చుకోవడం అధికారులకు తలకు మించిన భారంగా మారింది. ఒకవైపు ఎన్నికల సంఘం తరుముతున్నప్పటికీ.. తేలని లెక్కలు సమర్పిస్తే ఎక్కడ చిక్కుల్లో పడతామోననే భయం అధికారులను వెన్నాడుతోంది. శనివారం ఎట్టి పరిస్థితుల్లోను తుది జాబితాలను వెల్లడిస్తామని ప్రకటించిన అధికారులు ఆనక చేతులెత్తేశారు. ఇంకెంత సమయం పడుతుందో వారికే తెలియని పరిస్థితి నెలకొంది. పైకి మాత్రం ఈ నెల 23కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. -
గెలుపోటములపై ‘స్వతంత్రుల’ ప్రభావం
గాజులరామారం, న్యూస్‌లైన్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బరిలో ఉన్న అభ్యర్థులే ఇతర అభ్యర్థుల గెలుపోటముల్లో ప్రభావం చూపబోతున్నారు. నియోజకవర్గంలోని ఓటర్లతో పాటు పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా పరోక్షంగా విజయావకాశాలను నిర్ణయించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో అధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉండడమే ఇందుకు కారణం. ఇప్పుడు అభ్యర్థులు తమకు ఎన్ని ఓట్లు వస్తాయన్న విషయాన్ని పక్కన బెట్టి తమ ప్రత్యర్థులకు పోల్ అయ్యే ఓట్లపై లెక్కలు వేసుకుంటున్నారు. బరిలో 23 మంది అభ్యర్థులు తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ స్థానానికి 23 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ప్రధాన, ప్రతిపక్షాలతో పాటు ఇతర పార్టీల నుంచి పోటీ చేసిన రెబల్స్, స్వతంత్రులు 9 మంది కూడా బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఇద్దరు ఇతర పార్టీల నుంచి పోటీ చేశారు. నియోజకవర్గంలోని 6లక్షలకు పైగా ఉన్న ఓటర్లలో 2.94 లక్షల మందే ఓట్లు వేశారు. వీరే బరిలో నిలిచిన 23 మంది అభ్యర్థుల భవితవ్యం నిర్ణయించనున్నారు. పోలింగ్ శాతం తగ్గుదల... అభ్యర్థుల అయోమయం 2009 అసెంబ్లీ ఎన్నికలలో 3,13,160 ఓటర్లు ఉండగా, 2014 ఎన్నికల నాటికి అది 6,01,204కి పెరిగిన సంగతి తెలిసిందే. అంటే గత ఎన్నికలకన్నా ఈసారి అదనంగా 50 శాతానికిపైగా ఓటర్లు పెరిగారు. అభ్యర్థులు కూడా ఎన్నికల ముందు వరకు పెరిగిన ఓటర్ల శాతం చూసి తమ గెలుపుపై అంచనాలు వేసుకున్నా రు. కానీ పోలింగ్ శాతం గత ఎన్నికల కంటే తక్కువగా నమోదు కావడంతో వారి అంచనాలు తలకిందులయ్యాయి. అసలే రెబల్స్... దీనికి తోడు పార్టీలు మారిన ద్వితీయ శ్రేణి నాయకులు... దీంతో ఓట్లు చీలిపోయాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంఐఎం అభ్యర్థి బరిలో ఉండడంతో మైనార్టీల ఓట్లపై ప్రధాన పార్టీల అభ్యర్థులు పూర్తిగా ఆశలు వదులుకున్నారు. వీటన్నిటికితోడు బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకు పోలయ్యే ఓట్లు తమ విజయంపై ఎక్కడ ప్రభావం చూపిస్తాయో అని ఆందోళనకు గురవుతున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. పోలింగ్ శాతం తగ్గుదల, పోలైన ఓట్లలో చీలిక, ఎక్కువగా స్వతంత్రులు, ఇతరులు పోటీలో ఉండడం తదితర విషయాలు అభ్యర్థుల ఆందోళనకు ప్రధాన కారణం. ఓటర్లతో పాటుగా బరిలో ఉన్న అభ్యర్థులు ఈసారి గెలుపోటములను నిర్ణయించనున్నారు. -
ఆ ‘సైకిల్’ స్వతంత్రులదే..!
ఇప్పుడు టీడీపీకి గుర్తుగా ఉన్న సైకిల్ 1983కు ముందు ఇండిపెండెంట్లకు కేటాయించేవారు. ఇదిగో అదే సైకిల్ గుర్తుపై ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచిన చరిత్ర కరీంనగర్ జిల్లా బుగ్గారం సెగ్మెంట్‌కు సొంతం. బుగ్గారం నియోజకవర్గం 2009 పునర్విభజనతో కనుమరుగైంది. 1962 అసెంబ్లీ ఎన్నికల్లో బుగ్గారం నుంచి కాంగ్రెస్ తరపున ఎ. మోహన్‌రెడ్డి, ఇండిపెండెంట్‌గా కోరుట్ల మండలం జోగన్‌పల్లికి చెందిన ఏనుగు నారాయణరెడ్డి పోటీ పడ్డారు. నారాయణరెడ్డికి ఎన్నికల సంఘం సైకిల్ గుర్తు కేటాయించింది. కాంగ్రెస్, ఇండిపెండెంట్ల మధ్యనే హోరాహోరీగా పోటీ సాగింది. నారాయణరెడ్డి నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో సైకిల్‌పైనే తిరుగుతూ ప్రచారం సాగించారు. ఆ సమయంలో సైకిల్ గుర్తు అందరినీ ఆకట్టుకుంది. చివరికి సైకిల్ గుర్తుపై పోటీ చేసిన నారాయణరెడ్డికి 20,807 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి మోహన్‌రెడ్డికి 20,493 ఓట్లు వచ్చాయి. కేవలం 300పై చిలుకు ఓట్ల తేడాతో నారాయణరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదీ స్వతంత్రుల సైకిల్ సంగతి. - న్యూస్‌లైన్, కోరుట్ల -
పార్టీలకు స్వతంత్రుల తలనొప్పి
279 నామినేషన్లలో 114 మంది స్వతంత్రులు టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు సవాలు 9 నియోజకవర్గాల్లో ఒక్కో దానిలో 16 నుంచి 20 మంది పోటీ అదనంగా 4364 బ్యాలెట్ యూనిట్లు అవసరం ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి 2529 మాత్రమే అవసరమైతే పక్క జిల్లాల నుంచి రప్పించాలని అధికారుల యోచన విశాఖ ఎంపీకి 15 మంది స్వతంత్రులు నామినేషన్లు సక్రమంగా ఉన్న 279 మందిలో 114 మంది స్వతంత్రులే ఉండడం విశేషం. ప్రధానంగా విశాఖ లోక్‌సభ స్థానానికి 25 మంది నామినేషన్లు రాగా ఇందులో 15 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. యువకులు, మహిళలు సైతం రూ.25 వేలు చెల్లించి నామినేషన్ వేయడం గమనార్హం. అరకు ఎంపీ స్థానానికి 12 మందిలో ఏడుగురు స్వతంత్రులు ఉన్నారు. అనకాపల్లి ఎంపీకి మాత్రం 9 నామినేషన్లలో ఇద్దరు మాత్రమే ఇండిపెండెంట్లు ఉన్నారు. అభ్యర్థులకు సవాలు జిల్లాలో 9 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు రెబెల్స్ బెడద ఉంది. టికెట్లు ఆశించిన భంగపడిన వారందరూ రెబెల్స్‌గా నామినేషన్లు వేశారు. స్వతంత్రులుగా బరిలోకి దిగి పార్టీ నాయకులకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. దీంతో టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఈ స్వతంత్రులను బుజ్జగించడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని అభ్యర్థులతో పాటు పార్టీ అధినాయకులు రంగంలోకి దిగి నజరానాలు ఆశ చూపిస్తున్నా.. వీరు మాత్రం పంతం వీడడం లేదు. దీంతో వారిని దారికెలా తెచ్చుకోవాలో తెలియక టీడీపీ అభ్యర్థులకు కంటి మీద కునుకులేకుండాపోతోంది. -
స్వతంత్రుల జోరు
ఆనవాయితీగా ఆ రెండు సెగ్మెంట్లలో ఇండిపెండెంట్లదే హవా కొనసాగుతోంది. ఈసారి కూడా అక్కడ బరిలో ఉన్న స్వతంత్రులు ప్రధాన పార్టీల అభ్యర్థులకు ముచ్చెమటలు పుట్టిస్తున్నారు. హోరాహోరీగా ప్రచారంలో తలపడుతున్నారు. జిల్లాలోని మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 60 మంది ఇండిపెండెంట్లు, లోక్‌సభ స్థానాల్లో 11 మంది ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది నామ్‌కే వాస్తేగా బరిలో నిలిచినప్పటికీ... రామగుండం, కోరుట్ల నియోజకవర్గాల్లో స్వతంత్రుల పోరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రామగుండం నియోజకవర్గంలో ప్రధాన పార్టీలకు మించి ఇండిపెండెం ట్ల ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీ ల టిక్కెట్లు ఆశించి భంగపడ్డ నేతలు నలుగురు అక్కడ ఇండిపెండెంట్లుగా పోటీలో ఉండటం గమనార్హం.కాంగ్రెస్ రెబల్‌గా కౌశిక హరి, టీఆర్ఎస్ టిక్కెట్టు ఆశించిన కోరుకంటి చందర్, ఇటీవలే టీడీపీని వీడిన గోపు ఐలయ్యయాదవ్, వైఎస్సార్సీపీని వీడిన మక్కాన్‌సింగ్ అక్కడ ప్రధాన పార్టీలకు ధీటుగా ఎన్నికల్లో తలపడుతున్నారు.ఈ నియోజకవర్గంలో ఇండిపెండెంట్లను గెలిపించే ఆనవాయితీ ఉండటంతో.. ఇక్కడి పోటీ ఉత్కంఠ రేపుతోంది. 2009 ఎన్నికలోనూ ఇక్కడి ఓటర్లు ఇండిపెండెంట్ అభ్యర్థికి పట్టం కట్టారు. ఆఖరి నిమిషంలో టీడీపీ టిక్కెట్టు తెచ్చుకున్న సోమారపు సత్యనారాయణ గడువులోగా బీ ఫారమ్ సమర్పించకపోవటంతో టీవీ గుర్తుపై ఇండిపెండెంట్‌గా పోటీలో నిలిచి విజయం సాధించారు. పునర్విభజనకు ముందు ఉన్న మేడారం (ఎస్సీ), కొత్తగా ఏర్పడ్డ రామగుండం నియోజకవర్గానికి ఇప్పటివరకు మొత్తం 12సార్లు ఎన్నికలు జరిగితే మూడుసార్లు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 1962లో స్వతంత్ర అభ్యర్థి ఎం.రాంగోపాల్‌రెడ్డి, 1994లో టీడీపీ టిక్కెట్ దక్కకపోవటంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గని కార్మికుడు మాలెం మల్లేశంను ఇక్కడి ఓటర్లు గెలిపించారు. దీంతో ఇక్కడ ఇండిపెండెట్ల పోటీ ప్రధాన పార్టీలకు సవాలు విసురుతోంది. తెలంగాణ ఉద్య మ సమయంలో టీఆర్ఎస్లో చేరిన సి ట్టింగ్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఈసారి పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయనతో పోటాపోటీ పడ్డ ప్రత్యర్థులిద్దరూ ఈసారి ఇండిపెండెట్లుగా బరిలో నిలువటం గమనా ర్హం. అప్పటి పీఆర్పీ ప్రత్యర్థి కౌశికహరి, టీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ ఈ సారి ఇండిపెండెంట్లుగా పోటీలో ఉన్నా రు. వీరికి తోడు కాంగ్రెస్ అ భ్యర్థి బాబ ర్‌సలీంపాషా, బీజేపీ తరఫున గుజ్జుల రామకృష్ణారెడ్డి తలపడుతున్నారు. కోరుట్లలోనూ ఇండిపెండెంట్ల ప్రభావం ఆసక్తి రేపుతోంది. పునర్విభజనకు ముందు మెట్పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 1952 నుంచి 13సార్లు, కోరుట్ల సెగ్మెంట్లో రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. మెట్పల్లి సెగ్మెంట్లో రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికయ్యారు. బుగ్గారం సెగ్మెంట్లో 12సార్లు ఎన్నికలు జరిగితే నాలుగుసార్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. మెట్పల్లిలో 1952లో స్వతంత్ర అభ్యర్థి గంగుల భూమయ్య, 1967లో సీహెచ్.సత్యనారాయణరావు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. బుగ్గారం నియోజకవర్గంలో 1957లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన మోహన్‌రెడ్డి, 1962లో ఏనుగు నారాయణరెడ్డి, 1972లో గెలిచిన జె.దామోదర్‌రావు ఇండిపెండెట్లుగా పోటీ చేసినవారే. 1989లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ జువ్వాడి రత్నాకర్‌రావు స్వతంత్రునిగా పోటీకి దిగి.. టీడీపీ అభ్యర్థి వెంకటేశ్వరరావుపై విజయం సాధించారు. తండ్రి తరహాలోనే ఈసారి కాంగ్రెస్ టిక్కెట్టు ఆశించి భంగపడ్డ జువ్వాడి తనయుడు నర్సింగరావు ఇండిపెండెంట్‌గా పోటీకి నిలిచారు. అక్కడ పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థులతో సమ ఉజ్జీగా ఎన్నికల్లో తలపడుతున్నారు. కోరుట్లలో కాంగ్రెస్ నుంచి కొమిరెడ్డి రాములు, టీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, బీజేపీ అభ్యర్థి సురభి భూంరావు పోటీలో ఉన్నారు. -
ఎవరికి వరం?
సాక్షి, ఒంగోలు : పార్టీలతో పనిలేదు. ప్రధాన నేతలను వేడుకోవాల్సిన అవసరం లేదు. ‘బి’ఫారం గురించి బెంగే అక్కర్లేదు. పోటీ చేయాలన్న ఆలోచన, ప్రజాసేవ చేయాలనే తపన ఉంటే చాలు... నామినేషన్‌ను స్వతంత్రంగా వేయవచ్చు. ప్రజల మనిషిగా ప్రజాక్షేత్రంలో నిలబడొచ్చు. గెలుపో..ఓటమో పక్కనబెడితే ప్రధాన పార్టీల ఓట్లపై ప్రభావం చూపొచ్చు. గెలిస్తే ప్రధాన పార్టీల భవిష్యత్‌లో కీలకంగా మారొచ్చు. ఈ సిద్ధాంతాన్నే నమ్ముకుని ముందడుగేస్తున్నారు కొందరు స్వతంత్ర అభ్యర్థులు. జిల్లా పురపోరులో స్వతంత్ర అభ్యర్థుల జాబితా మునుపటికంటే పెరిగింది. జిల్లాలో ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు ఏడు మున్సిపాలిటీలుండగా, కోర్టు వ్యాజ్యాలతో ఒంగోలు, కందుకూరు ఎన్నికలు నిలిచిపోయాయి. మిగిలిన ఆరు మున్సిపాలిటీల్లో (చీమకుర్తి, కనిగిరి, మార్కాపురం, అద్దంకి, చీరాల, గిద్దలూరు) మొత్తం 145 వార్డులకుగాను 1217 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మూడు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 142 వార్డుల్లో పోటీ తప్పనిసరైంది. ఇందుకుగాను మొత్తం 592 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 137 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా కాంగ్రెస్ శ్రేణులే స్వతంత్రులుగా బరిలో ఉండటం గమనార్హం. పార్టీ గడ్డుపరిస్థితికి చేరిన నేపథ్యంలో.. ఆ గుర్తుతో ప్రజల్లోకి వెళ్లలేక స్వతంత్ర ముసుగును తగిలించుకున్నారు. ఇక మిగిలిన వారిలో కొందరు మాజీలుగా పార్టీల్లో పనిచేసి, విసుగుచెంది స్వతంత్రులుగా బరిలోకి దిగారు. ఓట్ల చీలికతో ఫలితాలు తారుమారు ప్రతి మున్సిపాలిటీలోని వార్డుల్లో స్వతంత్రులు ఇద్దరు ముగ్గురు వరకు పోటీపడుతుండగా, కొన్నిచోట్ల వీరిసంఖ్య ఐదుకు మించి ఉంది. ఈ పరిస్థితి ప్రధాన పార్టీలకు ఇబ్బందిగా మారింది. ఇండిపెండెంట్లు తమకున్న పలుకుబడితో ఓట్లను రాల్చుకున్న పక్షంలో ... అన్ని ప్రధాన పార్టీలకు భారీగా ఓట్లు చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభ్యర్థుల గెలుపోటములు కూడా కొద్ది తేడాలోనే తేలడం ఖాయమని, భారీ అధిక్యత చూపే అవకాశం లేదంటున్నారు. కొన్నిచోట్ల టీడీపీ రెబల్స్ అధికంగా ఉంటే... కాంగ్రెస్ రెబల్స్ స్థానిక పట్టణ సంరక్షణ సమితి, బీఎస్పీ పేరుతో ఎన్నికల్లో తమ సత్తా పరీక్షించుకునేందుకు బరిలోకి దిగారు. చీరాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం పక్క పార్టీల వైపు చూస్తూనే ఉన్నారు. ఈలోగా అతని చుట్టూ ఉన్న కేడర్ కూడా క్రమంగా ప్రత్యామ్నాయ రాజకీయ వేదికల్ని చూసుకుంటున్న నేపథ్యంలో మున్సిపాలిటీ ఎన్నికలొచ్చాయి. దీంతో ఆయన తనవద్దనున్న కొందరితో చీరాల పరిరక్షణ సమితి పేరిట స్వతంత్రంగా ఎన్నికల బరిలోకి దింపారు. మరోవైపు కాంగ్రెస్ కూడా అంతే పోటీగా బరిలో పావులు కదుపుతోంది. అక్కడ్నే టీడీపీ రెబల్స్ కూడా ఉన్నారు. ఈక్రమంలో ఆరెండు పార్టీల అభిమానులు తమ ఓట్లను స్వతంత్ర అభ్యర్థులకు వేసే ఆలోచనలో ఉన్నారు. గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ వ్యవహారం వైఎస్సార్ కాంగ్రెస్‌కు బాగా కలిసొచ్చేదిగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ ఓటు బ్యాంకులు రెండూ చీలిన పక్షంలో.. ఆయా పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులకూ ఓట్లశాతం తక్కువగా ఉంటుందని.. ఇప్పటికే డిపాజిట్‌గా ఉన్న బడుగు బలహీనవర్గాల ఓటుబ్యాంకు వైఎస్సార్ సీపీని అఖండ మెజార్టీతో గెలిపిస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. -
జడ్పీ పీఠంపైఎవరో?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారఘట్టం మొదలైంది. 36 జడ్పీటీసీల కు 195 మంది, 583 ఎంపీటీసీ స్థానాలకు 2,819 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు ఉండగా, స్వతంత్రులు, ఇతరులకు గుర్తుల కేటాయింపు జరిగిపోయింది. ప్రచారం హోరెత్తుతోంది. అయినప్పటికీ ప్రధాన పార్టీలు జడ్పీ ైచైర్మన్ అభ్యర్థులను ప్రకటించడం లేదు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చే సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేస్తాయని భావిస్తుండగా, ప్రధాన పార్టీల నాయకులు పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై పార్టీ కేడర్‌లో అసహనం వ్యక్తం అవుతోంది. నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీల్లోను ఇదే పరిస్థితి నెలకొంది. ఆనవాయితీ తప్పిన పార్టీలు జడ్పీటీసీ సభ్యులు ఎన్నికయ్యాక వారంతా కలిసి ైచైర్మన్ను ఎన్నుకుంటారు. అయినా ఆయా పార్టీలు ైచైర్మన్ అభ్యర్థులను ప్రకటించడం ఆనవాయితీ. అయి తే సార్వత్రిక ఎన్నికల తర్వాత మున్సిపల్, ‘స్థానిక’ ఎన్నికలు ఉంటాయని ప్రణాళికలు సిద్ధం చేసుకున్న నేతలకు ఈ ఎన్నికల నోటిఫికేషన్లు షాక్ ఇచ్చాయి. ఆర్థిక అంచనాలు ఒక్కసారిగా తలకిందులు కావడం తో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు పోటీ చేయాలనుకుం టున్న నాయకులు మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై అనాసక్తిగా ఉన్నారంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు మేయర్, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీ ైచైర్మన్, ఎంపీపీలను ముందుగానే ప్రకటించే సాహసం చేయడం లేదు. ఇదిలా వుండగా కాంగ్రెస్ పార్టీ నుంచి 36 మండలాలకు జడ్పీటీసీ అభ్యర్థులు బరిలో ఉండగా, ఎవరికీ వారు తామే జడ్పీ ైచైర్మన్ కాబోతున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో కేడర్ అయోమయానికి గురవుతోంది. టీఆర్ఎస్ సైతం 36 మందిని బరిలోకి దింపగా, బీజేపీ31, టీడీపీ 29 మంది అభ్యర్థులను పోటీలో నిలిపింది. వైఎస్ఆర్ సీపీ, సీసీఐ, సీపీఎం, లోక్‌సత్తాల అభ్యర్థులు పోటీ లో ఉన్నారు. అందరికీ పరీక్షా సమయమే బీసీ జనరల్‌కు కేటాయించిన జిల్లా పరిషత్ ైచైర్మన్ పదవి ప్రధాన రాజకీయ పార్టీలకు సవాలే. నిజామాబాద్ కార్పొరేషన్, కామారెడ్డి, బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీలు ముఖ్య నేతలకు ఇప్పటికే ప్రతిష్టాత్మకం కాగా, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు తలనొప్పిగా మారాయి. జిల్లాలో రాజకీయ ఉద్ధండులుగా పేరున్న కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీల సీనియర్లకు ఎటూ పాలుపోవడం లేదు. పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ ధర్మపురి శ్రీనివాస్, మాజీ మంత్రులు పి.సుదర్శన్ రెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి, ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, బీజేపీకి చెందిన ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, టీడీపీ ఎమ్మెల్యేలు మండవ వెంకటేశ్వర్రావు, అన్నపూర్ణమ్మ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులకు జడ్పీ ఎన్నికలు కీలకమే. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్న నేపథ్యంలో ఒక నెల ముందుగానే కార్పొరేషన్, మున్సిపాలిటీలకు...22 రోజుల ముందు జడ్పీటీసీ, ఎంపీటీసీల పోరు జరగడం రాజకీయ పార్టీల్లో సర్వత్రా చర్చనీయాంగా మారింది.