Indian economy System
-
భారత్ ఎకానమీ వృద్ధి 6.8 శాతం
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023 ఏప్రిల్–2024 మార్చి) 6.8 శాతం వృద్ధి సాధిస్తుందని పరిశ్రమల చాంబర్– సీఐఐ అంచనావేసింది. ఇంతక్రితం వేసిన 6.5–6.7 శాతం వృద్ధి శ్రేణికన్నా తాజా అంచనాలు అధికం కావడం గమనార్హం. ఇక 2024–25లో వృద్ధి రేటు 7 శాతానికి చేరుతుందని విశ్లేíÙంచింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, వ్యాపార వాతావరణం సులభతరం చేయడంపై ప్రభుత్వం నిరంతర దృష్టి సారించడం వంటి అంశాలు ఎకానమీ పురోగతికి కారణంగా పేర్కొంది. 2022–23లో భారత్ జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం. 2023–24లో ఈ రేటు 6.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) అంచనావేస్తోంది. క్యూ1లో 8 శాతం వృద్ధి అంచనాకు భిన్నంగా 7.8 శాతం ఫలితం వెలువడింది. క్యూ2లో 6.5 శాతం అంచనాలు వేయగా ఇందుకు 1.1 శాతం అధికంగా 7.6 శాతం వృద్ధి ఫలితం వెలువడింది. క్యూ3లో 6 శాతం, క్యూ4లో 5.7 శాతంగా ఆర్బీఐ అంచనా వేస్తోంది. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటుందని భావిస్తోంది. ఆర్బీఐ అంచనాలను మించి తాజాగా సీఐఐ అంచనాలు వెలువడ్డం గమనార్హం. టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్‌కు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కూడా అయిన సీఐఐ ప్రెసిడెంట్ ఆర్ దినేష్ తాజాగా ఇచి్చన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న అంశాలు ఇవీ.. ► తాజా పాలసీ కొనసాగింపునకు... ఇటీవలి రాష్ట్ర ఎన్నికల ఫలితాలు (మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు), స్టాక్ మార్కెట్, పరిశ్రమ సానుకూలంగా ఉన్నాయి. ►విధానపరమైన నిర్ణయాల కొనసాగింపును మేము స్వాగతిస్తాము. ఆయా అంశాలు దేశ పురోగతికి దోహదపడతాయన్న విషయంలో ఏకాభిప్రాయం ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా విధానపరమైన అంశాల్లో మార్పు ఉండకూడదని మేము వివరించి చెప్పడానికి ప్రయతి్నస్తాము. స్టాక్ మార్కెట్ కూడా ఇదే విధమైన చర్యల పట్ల సానుకూలంగా ఉంటుంది. ►పెట్టుబడులకు భారత్ తగిన ఆకర్షణీయ ప్రాంతమని మేము విశ్వసిస్తున్నాము. మౌలిక వనరుల అభివృద్ధి, తగిన వాతావరణ సానుకూల పరిస్థితుల ఏర్పాటుపై కేంద్రం తగిన విధంగా దృష్టి సారించడం దీనికి కారణం. ►రాబోయే ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షల్లో రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం. ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి వరకూ ఈ రేటును ఆర్బీఐ 4 శాతం నుంచి 6 శాతానికి పెంచింది. గడచిన నాలుగు ద్వైమాసిక సమావేశాల్లో రేటు పెంపు నిర్ణయం తీసుకోలేదు) తగ్గించాలని మేము కోరడం లేదు. రేటు తగ్గించాలని కోరడానికి ఇది తగిన సమయం అని మేము భావించడం లేదు. ఎందుకంటే ద్రవ్యోల్బణం బెంచ్‌మార్క్ (4 శాతం) కంటే ఎక్కువగా ఉంది. ►ఇప్పుడు పలు రంగాలు తమ మొత్తం సామర్థ్యంలో 75 నుంచి 95 శాతాన్ని మాత్రమే వినియోగించుకుంటున్నాయి. గత 3 త్రైమాసికాల నుంచీ ఇదే పరిస్థితి. అయితే త్వరలో పరిస్థితి మారుతుందని విశ్వసిస్తున్నాం. పలు కంపెనీలు తమ మూలధన పెట్టుబడులను పెంచుతున్నాయి. ►మేము మా సభ్యత్వ సంస్థల ప్రతినిధులతో సర్వే చేశాము. మెజారిటీ సభ్యులు వాస్తవానికి ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలతో పోలి్చతే (2023 ఏప్రిల్–సెప్టెంబర్) రెండవ అర్థ భాగంలో (2023 అక్టోబర్–మార్చి 2024) అధిక పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారని సర్వేలో వెల్లడైంది. -
వృద్ధి వేగవంతం.. ధరలే దారుణం
ముంబై: భారత ఆరి్థక వ్యవస్థ రెండో త్రైమాసికంలో ఊపందుకుంటోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆర్టికల్ ఒకటి పేర్కొంది. అయితే వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం కేంద్రం ఆర్బీఐకి నిర్దేశిస్తున్న స్థాయికి మించి (6 శాతం) సగటున కొనసాగుతుండడమే ఆందోళన కరమైన అంశమని ఆర్బీఐ నెలవారీ బులెటిన్‌లో వెలువడిన ఒక కథనం పేర్కొంది. జూన్‌లో 4.87 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బనం జూలైలో 15 నెలల గరిష్ట స్థాయి 7.44 శాతానికి ఎగసిన నేపథ్యంలో తాజా కథనం వెలువడ్డం గమనార్హం. సమీక్షా నెల్లో టమాటా, కూరగాయలు, ఇతర ఆహార ఉత్పత్తుల ధరలు తీవ్ర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ధరల తీవ్రత విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలోసైతం ప్రస్తావిస్తూ, సమస్యను తగ్గించడానికి తగిన మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్బీఐ అభిప్రాయాలు కావు... రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం ఈ కథనాన్ని రచించింది. అయితే, ఆరి్టకల్‌లో వ్యక్తీకరించిన అభిప్రాయాలు రచయితలవి మాత్రమేనని, వీటిని రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయాలుగా పరిగణించరాదని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. వెలువడిన ఆరి్టకల్లోని కొన్ని అంశాలు పరిశీలిస్తే.. మొదటి త్రైమాసికంలో పటిష్టమైన పనితీరు తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా మందగించింది. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, భారత్‌లో వినియోగ డిమాండ్ బాగుంది. పెట్టుబడుల పరిస్థితి ప్రోత్సాహకరంగా కొనసాగుతోంది. ఆయా అంశాలు భారత్‌కు లాభిస్తున్నాయి. అంతర్జాతీయ మందగమన పరిస్థితులతో కుంటుపడిన ఎగుమతుల క్షీణబాట ప్రతికూలతలను అధిగమించగలుగుతున్నాం. -
ఈ దశాబ్దం భారత్‌దే
న్యూఢిల్లీ: ప్రస్తుత దశాబ్దం (2030 వరకు) భారత్‌కు ఆశావహం అని, ఎన్నో అవకాశాలు రానున్నాయని టాటా గ్రూపు చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అన్నారు. దేశ సమగ్ర అభివృద్ధికి కోట్లాది మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే, మరింత మంది మహిళలను ఉద్యోగాల్లోకి వచ్చేలా చూడాలన్నారు. సీఐఐ నిర్వహించిన వ్యాపార సదస్సులో ఆయన మాట్లాడారు. రానున్న దశాబ్దాల్లో 70% ప్రపంచ వృద్ధి అంతా వర్ధమాన దేశాల నుంచే ఉంటుందని చంద్రశేఖరన్ అంచనా వేశారు. అందులోనూ ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్ వృద్ధి రేటు ఎక్కువగా ఉంటుందని, భారత్ ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. సమ్మిళిత వృద్ధి..: ‘‘మనం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నాం. కానీ, ఈ వృద్ధి ఫలాలు అందరూ అనుభవించే విధంగా ఉండాలి. ధనిక, పేదల మధ్య అంతరం పెరగకుండా చూడాలి. నా వరకు ఇదే మూల సూత్రం’’అని చంద్రశేఖరన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కనీస నాణ్యమైన జీవనాన్ని ప్రతి ఒక్కరూ పొందేలా ఉండాలన్నారు. రానున్న పదేళ్లలో కోట్లాది మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలని సూచించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి చూస్తే భారత్ ప్రపంచ జీడీపీలో 3% నుంచి 7%కి చేరింది. ఈ అభివృద్ధి వల్ల గత పదేళ్లలోనే 27 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తులయ్యారు. మనం కొత్త వ్యాపారాలు, కొత్త రంగాల్లోకి అడుగు పెట్టాం. నేడు ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా అవతరించాం. 2022లోనే ఇప్పటి వరకు చూస్తే ప్రతీ వారం ఒక యూనికార్న్ ఏర్పడింది. అయినా, మనం ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉంది. అది మహిళలకు ఉపాధి కల్పించే విషయంలోనూ. ఇప్పటికీ ఎంతో మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. వీరు ఆరోగ్య, విద్యా సదుపాయాలను అందుకోలేకున్నారు’’అని చంద్రశేఖరన్ తెలిపారు. సమస్యలను పరిష్కరించుకోవాలి.. భారత ఆర్థిక వ్యవస్థ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ‘‘5 లక్షల కోట్ల డాలర్లు, 8 లక్షల కోట్ల డాలర్లకు భవిష్యత్తులో చేరుకుంటాం. తలసరి ఆదాయం రెట్టింపు అవుతుంది. కానీ, ఇది సమ్మిళితంగా ఉండాలి’’ అని తెలిపారు. ఈ దశాబ్దం భారత్‌దేనని మరోసారి గుర్తు చేస్తూ ఈ క్రమంలో సమస్యలు, సవాళ్లను పరిష్కరించుకున్నప్పుడే అవకాశాలను అందిపుచ్చుకోగలమన్నారు. సమాజంలోని అంతరాలను తొలగించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. మహిళలకు ప్రాతినిధ్యం పని ప్రదేశాల్లో మహిళల ప్రాతినిధ్యం తగ్గిపోతున్న విషయాన్ని ఎన్.చంద్రశేఖరన్ గుర్తు చేశారు. గత దశాబ్దంలో ఇది 27 శాతం నుంచి 23 శాతానికి దిగివచ్చినట్టు చెప్పారు. అయితే, కొత్త నైపుణ్య నమూనా కారణంగా ఇది మారుతుందన్నారు. ఇంటి నుంచే పని విధానం ఇప్పుడప్పుడే పోదంటూ, అది శాశ్వతంగానూ కొనసాగదన్నారు. -
భారత్‌ను నిండా ముంచేస్తున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం! ఐక్యరాజ్యసమితి వార్నింగ్!
ఐక్యరాజ్యసమితి: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రభావం 2022లో భారత్‌పై తీవ్రంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి వ్యవహారాల విభాగం (యూఎన్‌సీటీఏడీ) గురువారంనాటి తన తాజా నివేదికలో పేర్కొంది. 2022పై ఇంతక్రితం 6.7 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను తాజాగా 4.6 శాతానికి (2 శాతానికి పైగా) తగ్గించింది. ఇంధన సరఫరాలపై సమస్యలు, వాణిజ్య ఆంక్షలు, ఆహార ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్య పరపతి విధానాలు, వెరసి ఆర్థిక అనిస్థితిని దేశం ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపింది. ఇక యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ వృద్ధి రేటు అంచనాను ఒక శాతం అంటే 3.6 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ►ఈ ఏడాది రష్యా తీవ్ర మాంద్యాన్ని చవిచూసే పరిస్థితి ఉండగా, పశ్చిమ ఐరోపా అలాగే మధ్య, దక్షిణ, ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో వృద్ధిలో గణనీయమైన మందగమనం ఉంటుంది. ► రష్యా వృద్ధి 2.3 శాతం నుండి మైనస్ 7.3 శాతానికి క్షీణించింది. ► దక్షిణ, పశ్చిమ ఆసియాలోని కొన్ని ఇతర ఆర్థిక వ్యవస్థలు ఇంధన ధరల వేగవంతమైన పెరుగుదల నుండి కొన్ని ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఆయా దేశాలు ప్రాథమిక వస్తువుల మార్కెట్లలో ప్రతికూలతలు, ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం తత్సబంధ ఫైనాన్షియల్ అస్థిరతలు ఎదుర్కొనే వీలుంది. ► అమెరికా వృద్ధి అంచనా మూడు శాతం నుండి 2.4 శాతానికి, చైనా వృద్ధి 5.7 శాతం నుంచి 4.8 శాతానికి తగ్గిస్తున్నాం. ► రష్యా క్రూడ్, గ్యాస్‌ను ఎగుమతి చేస్తున్నప్పటికీ దేశంలో ఇతర వస్తువలు అధిక ధరల కారణంగా ఆదాయాల భర్తీలోపురోగతి కనిపించని పరిస్థితి ఉంది. దిగుమతులు లేదా రుణ సేవల కోసం విదేశీ మారక ఆదాయాన్ని ఉపయోగించే పరిస్థితి లేకపోవడం ప్రతికూలాంశం. ► ఫారెక్స్ మార్కెట్లలో రోజువారీ టర్నోవర్ 6.6 ట్రిలియన్ డాలర్లు. బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా కరెన్సీలు వాటా 3.5% కంటే ఎక్కువ కాదు. యునైటెడ్ స్టేట్స్ డాలర్ టర్నోవర్ ఒక్కటే 44 శాతంగా ఉండడం గమనార్హం. ► ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా పలు అభివృద్ధి చెందిన దేశాలు ద్రవ్య పరపతి విధానాలను కఠినతరం చేసే వీలుంది. ఆయా అంశాలు బడ్జెట్ వ్యయాల కోతలకూ దారితీయవచ్చు. ► బలహీనపడుతున్న ప్రపంచ డిమాండ్, అంతర్జాతీయ స్థాయిలో తగినంత విధాన సమన్వయం లేకపోవడం, మహమ్మారి వల్ల పెరిగిన రుణాలు వంటి అంశాలు పలు దేశాలకు ఆర్థిక కష్టాలను సృష్టిస్తాయి. ఇది కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలను దివాలా, మాంద్యం అగాధాలకు నెట్టవచ్చు. ► కోవిడ్–19తో అసలే తీవ్ర సమస్యల్లో కూరుకుపోయిన ప్రపంచ ఎకానమీకి ఇప్పుడు యుద్ధం మరింత ప్రమాదం తెచ్చిపెట్టే పరిస్థితి నెలకొంది. ► పెరుగుతున్న ఆహారం, ఇంధన ధరలు అభివృద్ధి చెందుతున్న దేశాలలో అత్యంత పేదలపై దుర్బలమైన తక్షణ ప్రభావం చూపుతాయి. ఫలితంగా తమ ఆదాయంలో అత్యధిక వాటాను ఆహారంపై ఖర్చు చేసే కుటుంబాలు తీవ్ర సమస్యలకు గురయ్యే వీలుంది. వీరి కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయే వీలుంది. ► ఆహారం, ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రమాదం తీవ్రంగా ఉంటుంది. తాజా పరిస్థితులు అధిక ధరలు జీవనోపాధిని తగ్గించడంతోపాటు, పెట్టుబడులను నిరుత్సాహపరుస్తాయి. దీనికితోడు పలు దేశాల వాణిజ్య లోటు భారీగా పెరగడం ఆందోళన కలిగించే అంశం. -
భారత్‌పై ఉక్రెయిన్–రష్యా సంక్షోభ ప్రభావం
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుంగుబాటుకు గురికావడం.. భారత ఆర్థిక వ్యవస్థపై ఎన్నో రూపాల్లో ప్రతికూల ప్రభావాలను చూపిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) డైరెక్టర్ జెర్రీరైస్ తెలిపారు. చైనాపై ఈ ప్రభావం తక్కువేనన్నారు. చమురు ధరలు గణనీయంగా పెరగడం స్థూల ఆర్థికంగా ఎక్కువ కుదుపులకు గురి చేస్తుందన్నారు. ‘‘అధిక ద్రవ్యోల్బణం కరెంటు ఖాతా లోటుకు దారితీస్తుంది. అయితే భారత్ ఎగుమతి చేసే ఉత్పత్తులకు అధిక కమోడిటీ ధరల దన్నుతో కరెంటు ఖాతా లోటును కొంత వరకు సర్దుబాటు చేసుకోవచ్చు’’ అని రైస్ తెలిపారు. ఉక్రెయిన్‌లో యుద్ధం యూఎస్, ఈయూ, చైనాలపై ప్రభావం చూపిస్తుంది కనుక.. భారత ఎగుమతులకు డిమాండ్ తగ్గే ప్రమాదం ఉంటుందన్నారు. కఠిన ద్రవ్య పరిస్థితులు, పెరిగిన అనిశ్చితి దేశీయ డిమాండ్‌పై ప్రభావం చూపించొచ్చని, అధిక రుణ వ్యయాలు ద్రవ్య పరిస్థితిని నిర్ణయిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత వృద్ధి చుట్టూ ఎన్నో అనిశ్చితులున్నట్టు పేర్కొన్నారు. భారత్‌పై చమురు భారం : ఎస్అండ్పీ అంచనా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చమురును గణనీయంగా దిగుమతి చేసుకునే భారత్, థాయిలాండ్‌పై రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం అధికంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2022 ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే) భారత జీడీపీ 7.8 శాతం వృద్ధి సాధించొచ్చని అంచనా వేసింది. 2023–24లో 6 శాతం, 2024–25లో 6.5 శాతం చొప్పున వృద్ధి నమోదు కావచ్చని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (మార్చితో ముగిసే/2021–22) ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని తెలిపింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని (ఏపీఏసీ) బ్యాంకులు రష్యాతో స్వల్ప స్థాయిలోనే ఎక్స్పోజర్ కలిగి ఉన్నందున యుద్ధం తాలూకు ప్రభావం వాటిపై స్వల్పంగానే ఉంటుందని పేర్కొంది. ప్రధానంగా ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో ఉన్న అతిపెద్ద రిస్క్‌లలో మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులకుతోడు.. అధిక కమోడిటీ చార్జీలను ప్రస్తావించింది. ముఖ్యంగా ఇంధనాన్ని అధికంగా దిగుమతి చేసుకునే ఆర్థిక వ్యవస్థలకు రిస్క్ ఎక్కువ ఉన్నట్టు చెప్పింది. దేశ చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతులపైనే భారత్ ఆధారపడిన విషయం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇటీవల బ్యారెల్‌కు 140 డాలర్ల వరకు వెళ్లి 100 డాలర్ల దిగువకు రావడం తెలిసిందే. -
యూట్యూబ్ చేస్తున్న అద్భుతం, ఇండియన్ ఎకానమీ సూపరో సూపరు!
వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్‌లో కంటెంట్‌ను రూపొందించే క్రియేటర్ల వ్యవస్థతో భారత ఎకానమీకి గణనీయంగా ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది. 2020లో దీని ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకి రూ. 6,800 కోట్ల మేర లబ్ధి చేకూరింది. భారత్‌లో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలపై యూట్యూబ్ ప్రభావాలను మదింపు చేసేందుకు ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ అనే కన్సల్టెన్సీ నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ‘ 2020లో స్థూల దేశీయోత్పత్తికి రూ. 6,800 కోట్ల మేర తోడ్పడటంతో పాటు 6,83,900 పైచిలుకు ఫుల్ టైమ్ ఉద్యోగాలకు సరిసమానమైన కొలువులకు ఊతంగా నిలి్చంది‘ నివేదిక వెల్లడించింది. యూట్యూబ్ ఆధారిత ప్రకటనల ఆదాయాలు, సబ్స్క్రిప్షన్ లాంటి ప్రకటనయేతర ఆదాయాలు, స్పాన్సర్‌షిప్‌లు వంటి ఇతరత్రా ఆదాయాలను పరిగణనలోకి తీసుకుని ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ దీన్ని రూపొందించింది. చదవండి: మీకిదే నా సలహా..ఇలా చేస్తే జాబ్, మంచి ఫ్యూచర్ ఉంటుంది! -
ఒమిక్రాన్ ఎఫెక్ట్ తక్కువే!: ఆర్థిక శాఖ
జీడీపీ జోరుకు పగ్గాల్లేవ్ పటిష్ట వృద్ధిని సాధించనున్న దేశాలలో భారత్ ఆర్థిక శాఖ తాజా సమీక్ష న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దుష్ప్రభావాల తదుపరి పటిష్ట వృద్ధిని అందుకోనున్న కొద్దిపాటి ప్రపంచ దేశాలలో భారత్‌కూడా ఒకటని ఆర్థిక శాఖ తాజాగా పేర్కొంది. ఇటీవల పలు దేశాలలో తలెత్తుతున్న ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం దేశీయంగా తక్కువగానే ఉంటుందని అభిప్రాయపడింది. ఇందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన వేగవంత వ్యాక్సినేషన్ సహకరించనున్నట్లు తాజా ఆర్థిక సమీక్షలో తెలియజేసింది. గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో కోవిడ్–19 దెబ్బకు పలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒక్కసారిగా కుదేలైన నేపథ్యంలో తాజా అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడింది. 8.4 శాతం అప్ Economy Of India ఈ ఏడాది క్యూ2(జులై–సెప్టెంబర్)లో రియల్ జీడీపీ 8.4 శాతం ఎగసింది. కరోనా మహమ్మారికి ముందు అంటే 2019–20 ఏడాది ఇదే కాలంలో వృద్ధితో పోలిస్తే ఇది రెట్టింపని నెలవారీ సమీక్షలో ఆర్థిక శాఖ వివరించింది. కోవిడ్–19 నేపథ్యంలోనూ వరుసగా నాలుగు త్రైమాసికాలపాటు ఆర్థిక పురోభివృద్ధిని సాధించిన దేశాలలో భారత్ ఒకటని వెల్లడించింది. గతేడాది(2020–21) క్యూ3, క్యూ4లతోపాటు.. ఈ ఏడాది క్యూ1, క్యూ2లను ప్రస్తావించింది. సర్వీసుల విభాగంలో నమోదైన రికవరీ, తయారీ, వ్యవసాయ రంగాలు సాధించిన నిలకడైన వృద్ధి ఇందుకు సహకరించినట్లు పేర్కొంది. తిరిగి పెట్టుబడులు పుంజుకుంటున్న అంశాన్ని రికవరీ ప్రతిఫలిస్తున్నట్లు వివరించింది. భారీ వ్యాక్సినేషన్, సమర్థవంత ఆర్థిక నిర్వహణ, స్థూల, సూక్ష్మ ఆర్ధిక పరిస్థితులను ఉత్తేజితం చేయడం వంటి మద్దతిచ్చినట్లు తెలియజేసింది. మరింత స్పీడ్ దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మిగిలిన కాలంలోనూ మరింత పటిష్టపడనున్నట్లు తాజా సమీక్షలో ఆర్థిక శాఖ అంచనా వేసింది. క్యూ2లో ఇందుకు పలు సంకేతాలు(హెచ్ఎఫ్ఐలు) వ్యక్తమైనట్లు పేర్కొంది. సమీక్షలో ఆర్థిక శాఖ ఇంకా ఇలా వివరించింది.. ‘కొత్తగా తలెత్తిన ఒమిక్రాన్ వేరియంట్ గ్లోబల్ రికవరీకి తాజా సవాళ్లను విసురుతోంది. అయితే ప్రాథమిక దృష్టాంతాల ప్రకారం దేశీయంగా అంతంతమాత్ర ప్రభావాన్నే చూపగలదని అంచనా. వేగవంత వ్యాక్సినేషన్ ఇందుకు కారణంకానుంది. కోవిడ్–19వల్ల గతేడాది తగిలిన దెబ్బనుంచి దేశం వేగవంతంగా పుంజుకుంటోంది. క్యూ2లో ఇది ప్రదర్శితమైంది. ఈ ఏడాదికి జీడీపీ 9.5 శాతం ఎగిసే వీలున్నట్లు తాజా సమీక్షలో మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) అభిప్రాయపడింది. మహమ్మారికి ముందు ఏడాది అంటే 2019–20తో పోలిస్తే ఇది 1.6 శాతం అధిక వృద్ధికి సమానం. గతేడాది నమోదైన క్షీణత నుంచి బయటపడి పటిష్ట రికవరీ సాధిస్తున్న అతికొద్ది ప్రపంచ దేశాలలో భారత్ ఒకటిగా నిలుస్తోంది. ఇందుకు వ్యవసాయం దన్నునిస్తోంది. పుంజుకున్న ఆహార ధాన్యాల దిగుబడి, ఖరీప్, రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపు, గ్రామీణ ప్రాంత ఆదాయాలు మెరుగుపడటం వంటి అంశాలు సహకరిస్తున్నాయి. చదవండి: సింగపూర్ నుంచి వచ్చేవారికి తప్పిన ‘ రిస్క్’ ! కేంద్రం కొత్త ఆదేశాలు -
పటిష్టంగా ఎకానమీ పునాదులు
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉన్నాయని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికాల్లో వాస్తవ జీడీపీ గణాంకాలు.. కరోనా పూర్వ స్థాయిని అధిగమించడం ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. కోవిడ్–19 మహమ్మారి సమస్యను సాధ్యమైన వేగంగా, నిర్మయాత్మకంగా దేశం అధిగమించాలని పనగారియా పేర్కొన్నారు. దేశీయంగా ప్రైవేట్ పెట్టుబడులు ఇప్పటికే పుంజుకున్నాయని ఆయన వివరించారు. మరోవైపు, సంపన్న దేశాలు అమలు చేస్తున్న ఉపశమన ప్యాకేజీల (క్యూఈ) వల్లే భారత్‌లోకి విదేశీ పెట్టుబడులు వస్తున్నాయన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. భారత్‌లోకి పెట్టుబడులకు క్యూఈతో పాటు అనేక కారణాలు ఉన్నాయన్నారు. ‘క్యూఈ అనేది సంపన్న దేశాల నుంచి ఇతర దేశాలకు పెట్టుబడులు మరలడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ నిధులన్నీ ఇతర వర్ధమాన మార్కెట్లలోకి కాకుండా మొత్తం భారత్‌లోకే వస్తాయన్న హామీ లేదు. అత్యధికంగా రాబడులు వస్తాయన్న భరోసా కారణంగానే ఇన్వెస్టర్లు భారత్‌ను ఎంచుకుంటున్నారు‘ అని పనగారియా చెప్పారు. సంపన్న దేశాలు క్రమంగా ప్యాకేజీలను ఉపసంహరించే కొద్దీ పెట్టుబడుల్లో కొంత మొత్తం వెనక్కి వెళ్లడం సాధారణమేనన్నారు. అయితే, ఆయా సంపన్న దేశాల్లో వచ్చే రాబడులకన్నా ఎంత అధికంగా అందించగలదన్న అంశంపైనే భారత్‌లో పెట్టుబడుల కొనసాగింపు ఆధారపడి ఉంటుందని పనగారియా చెప్పారు. హేతుబద్ధంగానే స్టాక్ మార్కెట్ల తీరు .. వాస్తవ పరిస్థితులతో సంబంధం లేనట్లుగా ఆర్థిక వృద్ధి మందగించిన తరుణంలో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లిపోతుండటం అసాధారణమేమీ కాకపోవచ్చని పనగారియా చెప్పారు. భవిష్యత్ రాబడుల అంచనాలపైనే స్టాక్ మార్కెట్ ధరలు ఆధారపడి ఉంటాయని వివరించారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాలు భారీగా ఉన్న నేపథ్యంలో షేర్ల రేట్ల విషయంలో ఈక్విటీ ఇన్వెస్టర్లు హేతుబద్ధంగానే వ్యవహరిస్తున్నారని భావించవచ్చన్నారు. -
వేగంగా రికవరీ అవుతున్న ఎకానమీ!
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా రికవరీ అవుతోందని ‘స్టేట్ ఆఫ్ ఎకానమీ’ పేరుతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బులెటిన్‌లో వచ్చిన ఒక ఆర్టికల్ విశ్లేషించింది. కరోనా ప్రేరిత అంశాలతో అతలాకుతలం అయిన ఆర్థిక వ్యవస్థ మూడవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లోనే వృద్ధిని నమోదుచేసుకుంటుందని అంచనావేసింది. కాగా ఆర్బీఐ అధికారులు రాసిన ఈ ఆర్టికల్‌లో వ్యక్తమైన అభిప్రాయాలను రచయితల అభిప్రాయాలుగానే పరిగణించాలితప్ప, ఆర్బీఐకి ఆపాదించరాదని సెంట్రల్ బ్యాంక్ పేర్కొనడం గమనార్హం. తొలి త్రైమాసికంలో భారత్ ఎకానమీ క్షీణ రేటు 23.9 శాతంగా నమోదుకావడం... దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 8% నుంచి 14% వరకూ ఉంటుందని పలు రేటింగ్, విశ్లేషణా సంస్థల అంచనాలు... అటు తర్వాత కనబడిన ఆర్థిక క్రియాశీలత... సెప్టెంబర్ త్రైమాసికంలో క్షీణరేటు 7.5 శాతానికి కట్టడి... ఈ సానుకూల వాతావరణంలో ఆర్బీఐసహా పలు సంస్థల తమ క్షీణ అంచనాలను సవరించడం (2020–21 ఆర్థిక సంవత్సరానికి) వంటి అంశాల నేపథ్యంలో వెలువడిన ఆర్టికల్‌లో ముఖ్యాంశాలు చూస్తే... ► కోవిడ్–19 కఠిన పరిస్థితుల నుంచి భారత్ ఆర్థిక వ్యవస్థ బయటపడినట్లు స్పష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో మూడవ త్రైమాసికంలోనే భారత్ 0.1 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందని భావిస్తున్నాం. ► భారత్ ఆర్థిక వ్యవస్థ రికవరీకి సంకేతంగా రెండు అంశాలను ప్రస్తావించుకోవచ్చు. అందులో ఒకటి సెప్టెంబర్ మధ్యస్థం నుంచే పెట్టుబడులు, వినియోగ డిమాండ్ విషయంలో సానుకూలత కనిపించింది. ఇక రెండవ విషయానికి వస్తే, ద్రవ్యపరమైన చర్యలు వినియోగంవైపే కాకుండా, పెట్టుబడుల వైపునకూ మళ్లాయి. ► దేశంలో సెకండ్‌వేవ్ ప్రభావం పెద్దగా కనిపించని పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి సంబంధించిన ద్రవ్యపరమైన చర్యలు మరింత ఊపందుకున్నాయి. ► ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్న పలు సానుకూల అంశాల నేపథ్యంలోనే క్షీణతకు సంబంధించి తొలి అంచనాల సవరణ జరుగుతోంది. జూలై– సెప్టెంబర్ త్రైమాసికం గణాంకాలు (నవంబర్ 27) వెలువడ్డానికి ముందే – అంతర్జాతీయ బ్రోకరేజ్ దిగ్గజం– గోల్డ్‌మన్ శాక్స్, గోల్డ్‌మన్ శాక్స్ తన క్రితం భారీ 14.8 శాతం క్షీణ అంచనాలను 10.3 శాతానికి సవరించింది. దీనిని మూడీస్ అనుసరిస్తూ, తన తొలి అంచనా 11.5 శాతం నుంచి 10.6 శాతానికి తగ్గించింది. అనుకున్నట్లుగానే నవంబర్ 27వ తేదీన వెలువడిన సెప్టెంబర్ త్రైమాసిక గణాంకాలు అంచనాలకన్నా మెరుగ్గా వెలువడ్డాయి. క్షీణత 7.5 శాతానికి కట్టడి జరిగింది. త్రైమాసికాల పరంగా చూస్తే, జీడీపీ విలువల్లో వృద్ధి 22 శాతంపైగా నమోదయ్యింది. ఈ సానుకూలత పరిస్థితుల్లో ఫిచ్ (క్షీణత 10.5 శాతం నుంచి 9.4 శాతానికి), ఏడీబీ (–9 శాతం నుంచి – 8 శాతానికి) ఆర్బీఐ ( క్షీణత 9.5 శాతం నుంచి 7.5 శాతానికి), ఎస్అండ్పీ ఆ సంస్థ పరిశోధనా విభాగం క్రిసిల్ (– 9 శాతం నుంచి – 7.7 శాతానికి), ఇక్రా (–11 శాతం నుంచి 7.8 శాతానికి) ఎస్బీఐ రీసెర్చ్ (– 10.9 శాతం నుంచి 7.4 శాతానికి) క్షీణ అంచనాలను తగ్గించాయి. క్షీణ అంచనాలను తగ్గించిన ఇండియా రేటింగ్స్ కాగా, 2020–21 భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తన తొలి క్షీణ అంచనాలను ఇండియా రేటింగ్స్ గురువారం 11.8 శాతం నుంచి 7.8 శాతానికి తగ్గించింది. మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా – 0.8 శాతం, – 0.3 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనావేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 9.6 శాతంగా విశ్లేషించింది. -
జీడీపీ బౌన్స్‌బ్యాక్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి రికవరీ అయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020 ఏప్రిల్–2021 మార్చి) జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణ రేటు 7.5 శాతానికి పరిమితమయ్యింది. నిజానికి క్షీణత ‘సింగిల్ డిజిట్’కు పరిమితమవుతుందని పలు విశ్లేషణలు వచ్చినప్పటికీ, ఇంత తక్కువగా నమోదవుతుందని అంచనావేయలేదు. అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– మూడీస్ ఆర్థిక వ్యవస్థ 9.5 శాతం క్షీణిస్తుందని అంచనావేసింది. తయారీ, వ్యవసాయం, విద్యుత్, గ్యాస్ రంగాలు ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన రికవరీకి చేయూతను ఇచ్చాయి. వినియోగ డిమాండ్ మెరుగుపడితే రానున్న కాలంలో ఆర్థిక వ్యవస్థ మరింత ఊపునందుకునే అవకాశం ఉందని విశ్లేషణలు పేర్కొంటున్నాయి. కఠిన లాక్డౌన్ పరిస్థితులతో భారత్ ఆర్థిక వ్యవస్థ మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) భారీగా 23.9 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో జీడీపీ 4.4 శాతం వృద్ధి రేటు నమోదైంది. వివిధ రంగాలు చూస్తే...: తయారీ: జూన్ నుంచీ కఠిన లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో ఆర్థిక వ్యవస్థ క్రమంగా ఊపందుకుంది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థలో దాదాపు 15% వాటా ఉన్న తయారీ రంగం 0.6% వృద్ధి నమోదుచేసుకోవడం గమనార్హం. జూన్ క్వార్టర్లో ఈ విభా గం 39% క్షీణించింది. ► వ్యవసాయం: జీడీపీలో దాదాపు 15% వాటా ఉన్న వ్యవసాయం 3.4 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► విద్యుత్, గ్యాస్: 4.4% వృద్ధిని సాధించాయి. ► ఫైనాన్షియల్, రియల్టీ సేవలు: ఈ విభాగాలు క్షీణతలోనే ఉన్నాయి. 8.1 శాతం మైనస్ నమోదయ్యింది. ► ట్రేడ్, హోటల్స్, రవాణా, కమ్యూనికేషన్ విభాగాలు సైతం 15.6 శాతం నష్టాల్లోనే (క్షీణత) ఉన్నాయి. ► నిర్మాణం: ఆర్థిక వ్యవస్థలో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న ఈ రంగం క్షీణత 8.6 శాతం. అయితే క్యూ1లో భారీగా ఇది 50% క్షీణించింది. ► ప్రభుత్వ వ్యయాలు: ఆందోళనకరంగానే ఉన్న ప్రభుత్వ వ్యయాలు మరో అంశం. ప్రభుత్వ వ్య యాలు సెప్టెంబర్ క్వార్టర్లో 12% క్షీణించింది. క్షీణత ఇలా...: జాతీయ గణాంకాల కార్యాలయం ప్రకటన ప్రకారం, 2020–21 సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.33.14 లక్షల కోట్లు. 2019–20 ఇదే కాలంలో ఈ విలువ 35.84 లక్షల కోట్లు. అంటే విలువలో ఎటువంటి వృద్ధిలేకపోగా 7.5 శాతం క్షీణత నమోదయ్యిందన్నమాట. సాంకేతికంగా మాంద్యమే... ఒక ఆర్థిక వ్యవస్థ వరుసగా రెండు త్రైమాసికాలు క్షీణ రేటును నమోదుచేస్తే, ఆ పరిస్థితిని మాంద్యంగా పరిగణిస్తారు. జూన్, సెప్టెంబర్ త్రైమాసికాల్లో భారత్ వరుస క్షీణ రేటును నమోచేసిన నేపథ్యంలో దేశం సాంకేతికంగా మాంద్యంలోకి జారిపోయినట్లే భావించాల్సి ఉంటుంది. మొదటి ఆరు నెలల కాలంలో భారత్ ఆర్థిక వ్యవస్థ 15.7 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. గత ఏడాది ఇదే కాలంలో 4.8 శాతం వృద్ధిరేటు నమోదయ్యింది. అయితే ఎకానమీ ‘వీ’ నమూనా వృద్ధి నమోదుచేసుకుంటుందని ఆర్థిక నిపుణులు భరోసాతో ఉండడమే ఊరట. దేశంలో క్రమంగా వినియోగ డిమాండ్ పుంజుకుంటోంది. ఆటో మొబైల్ పరిశ్రమ బాగుంది, నాన్–డ్యూరబుల్ రంగం మెరుగుపడుతోంది. రైలు రవాణా పెరుగుతోంది. వచ్చే ఏడాది తొలి నెలల్లోనే వ్యాక్సిన్ వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఇవన్నీ వృద్ధికి ఊతం ఇచ్చేవి కావడం గమనార్హం. అయితే సెకండ్‌వేవ్ కేసుల భయాలూ ఉన్నాయి. ఇది రానున్న రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థను ప్రతికూలతలోకి నెడతాయన్న అంచనాలు ఉన్నాయి. ఇక ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న దానికన్నా (4% వద్ద నిర్దేశం) అధికంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండడం గమనార్హం. వృద్ధి బాటలో చైనా దూకుడు ప్రధాన ఆర్థిక వ్యవస్థలుసహా ప్రపంచంలోని పలు దేశాల ఎకానమీలు కరోనా ప్రేరిత అంశాలతో క్షీణతలోకి జారిన నేపథ్యంలో... ఈ మహమ్మారికి పుట్టినిల్లు చైనా మాత్రం వృద్ధి బాటన సాగుతోంది. ఈ ఏడాది వరుసగా రెండవ త్రైమాసికం జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఆ దేశ ఎకానమీ 4.9 శాతం వృద్ధి రేటును (2019 ఇదే కాలంతో పోల్చి) నమోదుచేసుకుంది. కరోనా సవాళ్లతో మొదటి త్రైమాసికం జనవరి–మార్చి మధ్య 44 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 6.8 శాతం క్షీణతకు జారిపోయిన చైనా ఆర్థిక వ్యవస్థ, మరుసటి క్వార్టర్ (ఏప్రిల్–జూన్)లోనే 3.2 శాతం వృద్ధి నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. 2020తో తొలి ఆరు నెలల కాలం (జనవరి–జూన్) చూసుకుంటే 1.6 శాతం క్షీణతలో ఉన్న చైనా, మూడు త్రైమాసికాలు కలిపితే 0.7 శాతం పురోగతిలో ఉంది. అక్టోబర్‌లో మౌలికం 2.5 శాతం క్షీణత మౌలిక రంగంలోని ఎనిమిది కీలక పరిశ్రమల ఉత్పత్తి అక్టోబర్‌లో 2.5 శాతం మేర క్షీణించింది. ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు ఉత్పత్తి పడిపోవడం ఇందుకు కారణం. మౌలిక రంగం క్షీణించడం ఇది వరుసగా ఎనిమిదో నెల. మార్చి నుంచి ఇది క్షీణ బాటలోనే ఉంది. 2019 అక్టోబర్‌లో ఎనిమిది మౌలిక పరిశ్రమల ఉత్పత్తి 5.5 శాతం క్షీణత నమోదు చేసింది. బొగ్గు, ఎరువులు, సిమెంట్, విద్యుదుత్పత్తి సానుకూల వృద్ధి కనపర్చగా, క్రూడాయిల్, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు ప్రతికూల వృద్ధి నమోదు చేశాయి. ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంలో చూస్తే మౌలికం 13% క్షీణించింది. గతేడాది ఇదే వ్యవధిలో 0.3% వృద్ధి నమోదైంది. విభాగాల వారీగా .. అక్టోబర్‌లో బొగ్గు ఉత్పత్తి 11.6%, సిమెంట్ (2.8%), విద్యుత్ (10.5%) వృద్ధి నమోదు చేశాయి. మరోవైపు క్రూడాయిల్ 6.2 శాతం, సహజ వాయువు 8.6%, రిఫైనరీ ఉత్పత్తులు 17 శాతం, ఉక్కు 2.7 శాతం మేర ప్రతికూల వృద్ధి నమోదు చేశాయి. 1950–51నుంచి భారత్ జీడీపీ డేటా అందుబాటులో ఉన్న నాటి నుంచి ఐదుసార్లు – 1958, 1966, 1967, 1973, 1980 ఆర్థిక సంవత్సరాల్లోనూ మైనస్ వృద్ధి నమోదైంది. అంచనాలు నిజమైతే 2020–21 ఆరవసారి అవుతుంది. అబ్బురపరుస్తున్నాయ్... ఆర్థిక రికవరీ అబ్బుర పరుస్తోంది. ప్రత్యేకించి తయారీ రంగం సానుకూలతలోకి రావడం హర్షణీయం. వ్యవస్థలో తిరిగి డిమాండ్ నెలకొంటోందని ఈ అంశం సూచిస్తోంది. – రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ప్రోత్సాహకరం మహమ్మారి ప్రేరిత అంశాలు, గత త్రైమాసికం తీవ్ర నిరాశాకర ఫలితాల నేపథ్యంలో వెలువడిన తాజా గణాంకాలు కొంత ప్రోత్సాహకాన్ని ఇస్తున్నాయి. అయితే ఇక్కడ కొంత ఆందోళన కూడా ఉంది. ఆర్థిక క్షీణత మహమ్మారి వల్లే. ఈ సవాలు ఇంకా కొనసాగుతోంది. – కృష్ణమూర్తి సుబ్రమణ్యం, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ ద్వితీయార్ధంలో ‘వృద్ధి’కి అవకాశం ప్రభుత్వం చేపట్టిన ఉద్దీపన చర్యలు, సంస్కరణలు ఇందుకు దోహదపడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ భాగంలో (అక్టోబర్–మార్చి) దేశం వృద్ధి బాటకు వస్తుందన్న విశ్వాసం కనబడుతోంది. 2021–22లో వృద్ధి రెండంకెల్లో నమోదు అవుతుందని భావిస్తున్నాం. అక్టోబర్‌లో భారీగా పెరిగిన వినియోగ డిమాండ్ ఆశావహ పరిస్థితులను సృష్టిస్తోంది. అయితే సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనడమే ప్రస్తుతం కీలకాంశం. – ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ విశ్వాసాన్ని పెంచుతున్నాయ్ తాజా గణాంకాలు ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని పెంచుతున్నాయి. కఠిన లాక్డౌన్ పరిస్థితులను క్రమంగా సడలిస్తున్న నేపథ్యం ఇది. ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక వ్యవస్థ సంస్కరణలు ఫలితాలను అందిస్తున్నాయి. ఇదే ధోరణి ఇకముందూ కొనసాగుతుందని భావిస్తున్నాం. వినియోగ డిమాండ్ మున్ముందు పుంజుకునే అవకాశం ఉంది. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ తయారీలో విజయం అంచనాలకు మించి సానుకూల ఫలితం రావడం హర్షణీయం. భారత్ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన రికవరీ బాటలో ఉన్నట్లు అర్థం అవుతోంది. ముఖ్యంగా తయారీ రంగంలో సానుకూలత మంచి పరిణామం. ప్రోత్సాహకరమైనది. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల ఫలితమిది. – సంగీతా రెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్ ముందుముందు మంచికాలం ఫలితాలు సంతోషాన్ని ఇస్తున్నాయి. తాజా ఫలితాలను చూస్తుంటే, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లోనూ మంచి ఫలితాలు వెలువడతాయన్న విశ్వాసం వ్యక్తం అవుతోంది. ఆర్థిక వ్యవస్థలో పలు విభాగాలు పురోగతి బాటన పయనిస్తుండడం గమనార్హం. ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పట్టణ ప్రాంతాల్లో వినియోగం మెరుగుపడుతోంది. – దీపక్ సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ -
బడ్జెట్ తయారీ ప్రక్రియకు శ్రీకారం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో... తన మూడవ బడ్జెట్ తయారీ ప్రక్రియకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించి శుక్రవారం జరిగిన మొట్టమొదటి సమావేశంలో ఆర్థిక సేవలు, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గృహ, ఉక్కు, విద్యుత్ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఆర్థికమంత్రిత్వశాఖ షెడ్యూల్ ప్రకారం నవంబర్ 12వ తేదీనాటికి బడ్జెట్ తయారీలో కీలక సమావేశ ప్రక్రియ పూర్తవుతుంది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సవరిత అంచనాలు (ఆర్ఈ), 2021–22 బడ్జెట్ అంచనాలు (బీఈ) దాదాపు నెలరోజుల్లో ఖరారవుతాయి. ప్రభుత్వ ఆదాయాలు పడిపోవడం, ప్రభుత్వ ఆదాయ–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు రెండంకెలకు చేరే అవకాశాలు కనిపిస్తుండడం వంటి అంశాల నేపథ్యంలో తాజా బడ్జెట్ రూపకల్పనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో ఎనానమీ 23.9 శాతం క్షీణించిన నేపథ్యంలో... 2020–21 ఆర్థిక సంవత్సరం మొత్తంలో భారత ఆర్థిక వ్యవస్థ 8.5 శాతం నుంచి 15 శాతం వరకూ క్షీణిస్తుందని ఇప్పటికే పలు అంతర్జాతీయ ఆర్థిక, రేటింగ్, విశ్లేషణా సంస్థలు అంచనావేసిన సంగతి తెలిసిందే. కాగా బడ్జెట్ రూపకల్పన ప్రక్రియలో జరగనున్న సమావేశాలకు అన్ని శాఖల నుంచి గరిష్టంగా ఐదుగురు సభ్యులకన్నా ఎక్కువమంది హాజరుకాకుండా నియంత్రణలు విధించనున్నట్లు ఆర్థిక శాఖలో బడ్జెట్ విభాగం పేర్కొంది. అదీ డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీ స్థాయి వ్యక్తులకే ఈ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కోవిడ్–19 తీవ్రత నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్మలా సీతారామన్‌తోపాటు మోదీ 2.0 ప్రభుత్వానికి కూడా ఇది మూడవ బడ్జెట్. ఫిబ్రవరి 1వ తేదీన 2021–22 బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. -
ఏడో రోజూ కొనసాగిన ర్యాలీ
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ గవర్నర్ ఆశావహ వ్యాఖ్యలతో శుక్రవారం కూడా స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 327 పాయింట్లు పెరిగి 40,509 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 80 ర్యాలీ చేసి 11,914 వద్ద ముగిసింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ... కరోనా ప్రభావంతో సెప్టెంబర్ క్వార్టర్లో మైనస్‌ల్లో నమోదైన జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ4 నుంచీ రికవరీ బాట పట్టే అవకాశం ఉందన్నారు. వ్యవస్థలో ప్రతికూల పరిస్థితు లు నెలకొన్న తరుణంలో అకామిడేటివ్ విధానాన్ని కొనసాగిస్తామన్నారు. దీంతో ఫైనాన్స్ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అలాగే కీలక వడ్డీరేట్లపై యథాతథ పాలసీకే కట్టుబడి ఉంటామన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెంచే చర్యలు చేపడతామన్నారు. ఫలితంగా బ్యాంకింగ్ రంగ షేర్లు ర్యాలీ చేశాయి. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగి బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లతో పాటు గత సెషన్లో సూచీలను నడిపించిన ఐటీ షేర్ల హవా నేడు కూడా కొనసాగింది. ఫలితంగా సూచీలు ఏడో రోజూ లాభాలను మూటగట్టుకున్నాయి. ఈ 7 రోజుల్లో సెనెక్స్ 2,537 పాయింట్లను, నిఫ్టీ 692 పాయింట్లను ఆర్జించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,067 – 40,585 రేంజ్లో కదలాడగా, నిఫ్టీ 11,805 – 11,939 మధ్య ఊగిసలాడింది. అయితే ఫార్మా, రియల్టీ, ఎఫ్ఎంజీసీ, ఆటో, రియల్టీ రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దన్నుగా అంతర్జాతీయ సంకేతాలు ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలకు తోడు సానుకూల అంతర్జాతీయ సంకేతాలు కూడా మన మార్కెట్‌కు దన్నుగా నిలిచాయి. అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాల కన్నా తక్కువగా నమోదుకావడంతో ఉద్దీపన ఆశలు మరింత పెరిగాయి. ఫలితంగా నేడు ఆసియాలో మార్కెట్లు రెండున్నర ఏళ్ల గరిష్టాన్ని తాకాయి. వారం రోజుల సెలవు తర్వాత ప్రారంభమైన చైనా మార్కెట్ లాభాలతో దూసుకెళ్లింది. యూరప్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం కావడంతో పాటు అమెరికా ఫ్యూచర్లు పాజిటివ్‌గా ట్రేడ్ అవడం మన మార్కెట్‌కు కలిసొచ్చాయి. కొత్త జీవితకాల గరిష్టానికి ఇన్వెస్టర్ల సంపద స్టాక్ మార్కెట్ వరుస ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపదగా కొత్త జీవితకాల గరిష్టానికి చేరుకుంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన అన్ని కంపెనీల మొత్తం క్యాపిటలైజేషన్ శుక్రవారం రూ.160.68 లక్షల కోట్లకు చేరుకుంది. ఆర్థిక వ్యవస్థకు అండగా అవసరమైతే మరిన్ని విధాన చర్యలకు సిద్ధమని ఆర్బీఐ గవర్నర్ ప్రకటన మార్కెట్ సెంటిమెంట్ బలపరిచింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వాలన్న ఆర్బీఐ నిర్ణయం సాహసోపేతం. వడ్డీరేట్ల యథాతథ కొనసాగింపు, అకామిడేటివ్ విధానాలు బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్ల ర్యాలీకి మద్దతునిచ్చాయి’’ – దీపక్ జెసానీ, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ హెడ్ -
ఇక వచ్చే ఏడాదే జీడీపీ ‘వెలుగు’
ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి ఇక ఈ ఏడాది ఉండబోదని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీపీఎం) సభ్యుడు నీలేష్ షా సూచించారు. మార్చి త్రైమాసికం (2021 జనవరి–మార్చి) లేదా జూన్ త్రైమాసికం (2021 ఏప్రిల్–జూన్)లోనే భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలోకి వస్తుందని ఆయన అంచనావేశారు. సంక్షోభ స్థితి నుంచి అవకాశాల బాటకు భారత్ మళ్లాల్సి ఉంటుందని కూడా ఆయన అన్నారు. ఇందుకు సంస్కరణలే మార్గమని బుధవారం స్పష్టం చేశారు. నీలేష్ షా ప్రస్తుతం కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నారు. ఈక్విటీ మార్కెట్లు పెరుగుదలకు ఆశావాదమే కారణమవుతోందని కూడా ఆయన విశ్లేషించారు. మార్కెట్లు గత గణాంకాలను కాకుండా, భవిష్యత్‌వైపు దృష్టి సారిస్తున్నాయని అన్నారు. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్ఇన్ నిర్వహించిన ఒక వెబ్‌నార్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సంక్షోభ పరిస్థితుల నుంచి అవకాశాలవైపు వెళ్లడం అంశాన్ని ఆయన విశ్లేషిస్తూ, ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో చైనా నుంచి కంపెనీలు బయటకు వచ్చేయాలనుకుంటున్నాయి. దీనిని భారత్ అవకాశంగా తీసుకోవాలి. కంపెనీలు భారత్‌లోకి రావడానికి తగిన ప్రయత్నాలు జరగాలి. ఈ దిశలో పాలనా, ఆర్థిక సంస్కరణలను చేపట్టాలి’’ అని ఆయన అన్నారు. మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, విద్యుత్ వ్యయాలు తగ్గడం వంటి చర్యలను భారత్ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులు, చమురు ధరలు తక్కువగా ఉండడం, సానుకూల వ్యవసాయం వంటి అంశాలు భారత్‌కు ప్రస్తుతం సానుకూలంగా ఉన్నాయని అన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలకు మంచి వ్యాపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. నాలుగు రెట్ల వృద్ధి లక్ష్యంగా మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ పనిచేస్తోందన్నారు. ప్రస్తుతం వీటిలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య 2.5 కోట్లయితే వచ్చే ఐదారేళ్లలో ఈ సంఖ్యను 10 కోట్లకు పెంచాలన్నది పరిశ్రమ లక్ష్యంగా ఉందని వివరించారు. -
ఆ ఆర్థిక అంచనాలు తప్పు!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభన కారణంగా ప్రపంచంలో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలి జీడీపీ వృద్ధి రేటు మైనస్‌లోకి పడిపోగా, భారత దేశ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడమే కాకుండా సానుకూలంగా పురోభివృద్ది సాధిస్తోందని భారతీయ జనతా పార్టీ ఇటీవల ఓ ట్వీట్ చేసింది. అందులో కరోనా సంక్షోభ పరిస్థితులను తట్టుకొని నిలబడడమే కాకుండా పురోభివృద్ధి సాధించిన దేశాలు ప్రపంచంలో రెండో రెండని, అందులో ఒకటి భారత్‌కాగా, మరోటి చైనా అంటూ ఓ గ్రాఫ్‌ను కూడా విడుదల చేసింది. అందులో భారత్ పురోభివృద్ధి జీడీపీ రేటును 1.9గా, చైనా వృద్ధి రేటును 1.2గా పేర్కొంది. ఇక అమెరికా వృద్ధి రేటు మైనస్ 5.9, జర్మనీ వృద్ధి రేటు మైనస్ 7 శాతం, ఫ్రాన్స్ మైనస్ 7.2 శాతమని, ఇటలీ వృద్ది రేటు మైనస్ 9.1గా పేర్కొంది. ఈ డేటాను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి సేకరించిందని, అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ తన పేరును నిలబెట్టుకుంటోందని ఐఎంఎఫ్ అభివర్ణించినట్లుగా కూడా బీజేపీ తన ట్వీట్లో పేర్కొంది. బీజేపీ ట్వీట్‌ను పలు పార్టీ ఎంపీలు మనోజ్ రాజోరియా, సుభాశ్ భామ్రి, రాజేశ్ వర్మ, పరిశోత్తం సబారియా, నిత్యానంద్ రాయ్, అర్జున్ ముండా తదితరులు రీ ట్వీట్లు కూడా చేశారు. భారత్ సానుకూల అభివృద్ధిని సాధించిందని ఐఎంఎఫ్ పేర్కొందా? అతివేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు భారత ఆర్థిక పరిస్థితిని ఐఎంఎఫ్ అంచనా వేసిందా? లేదనే సమాధానం చెప్పాల్సి వస్తుంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ బలాబలాలపై ఐఎంఎఫ్ ప్రతి ఏటా ఏప్రిల్–మే, సెప్టెంబర్–అక్టోబర్ నెలల్లో తన అంచనాలను విడుదల చేస్తుంది. గత ఏప్రిల్ నెలలో ఐఎంఎఫ్ విడుదల చేసిన అంచనాల్లో భారత్ 1.9 శాతం వృద్ధి రేటును సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆ తర్వాత ఐఎంఎఫ్ తన అంచనాలను సవరిస్తూ జూన్ నెలలో ‘వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ అపేడేట్’ పేరిట నివేదిక విడుదల చేసింది. దానిలో భారత్ వృద్ధి రేటును ‘మైనస్–4.5’గా అంచనా వేసింది. బీజీపీ సరిగ్గా ఇక్కడే తప్పులో కాలేసింది. సవరించిన అంచనాలను పరిగణలోకి తీసుకోకుండా అంతకు రెండు నెలల ముందు, అంటే భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావం అంతగా లేనప్పుడు వేసిన అంచనాలను పరిగణలోకి తీసుకుంది. భారత ఆర్థిక వృద్ధి రేటు సవ్యంగానే ఉంటే జీఎస్టీలో రాష్ట్రాల వాటాను చెల్లించలేనంటూ కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేతులు ఎత్తేస్తుంది ? చదవండి: చైనా కవ్వింపు చర్యలు.. బదులిచ్చిన భారత్ -
ఉద్యోగాలేవీ?: రాహుల్
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు, లాక్డౌన్ విధించడం... ఈ మూడు భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘ఉపాధి కల్పించండి’అనే నినాదంతో కాంగ్రెస్ యువజన విభాగం చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని పురస్కరించుకొని రాహుల్... మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘మోదీ ప్రధాని పదవి చేపట్టినపుడు ప్రతియేటా రెండో కోట్ల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. స్వప్నాన్ని చూపించారు. కానీ వాస్తవం ఏమిటంటే మోదీ ప్రభుత్వ విధానాల వల్ల 14 కోట్ల మంది నిరుద్యోగులుగా మారారు. ఎందుకిలా జరిగింది? తప్పుడు విధానాలే కారణం. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, లాక్డౌన్... ఈ మూడు చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. వాస్తవమేమిటంటే ఇప్పుడు భారత్ యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోతోంది’అని రాహుల్ ట్విట్టర్లో విడుదల చేసిన వీడియోలో ధ్వజమెత్తారు. అందుకే యూత్ కాంగ్రెస్ వీధులకు ఎక్కిందన్నారు. దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో నిరుద్యోగ సమస్యను యూత్ కాంగ్రెస్ లేవనెత్తడం సంతోషకరమన్నారు. యూత్ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాహుల్ అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రోజ్‌గార్ దో ఉద్యమానికి మద్దతు తెలుపుతూ యువశక్తే మన బలమన్నారు. పూర్తిస్థాయి అధ్యక్షుడు కావాలి: శశిథరూర్ పూర్తిస్థాయి అధ్యక్షుడిని నియమించే ప్రక్రియకు కాంగ్రెస్ వేగవంతం చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు శశిథరూర్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ చుక్కాని లేని నావలా తయారైందని, సరైనా దిశానిర్దేశం కొరవడిందని వ్యతిరేక మీడియా కారణంగా ప్రజల్లో నెలకొంటున్న అభిప్రాయాన్ని అడ్డుకోవాలంటే.. వెంటనే అధ్యక్ష నియామకం జరగాలన్నారు. మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టే సామర్థ్యం రాహుల్ గాంధీకి ఉందని తాను భావిస్తున్నానన్నారు. ఒకవేళ రాహుల్ బాధ్యతలు స్వీకరించడానికి విముఖంగా ఉంటే... కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొనే ప్రక్రియను వెంటనే చేపట్టాలని శశిథరూర్ ఆదివారం పీటీఐ వార్తాసంస్థతో అన్నారు. తాత్కాలిక సారథిగా సోనియాగాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి ఈనెల పదో తేదీతో ఏడాది అవుతుంది. సోనియా నిరవధికంగా ఈ బాధ్యతలు మోయాలనుకోవడం న్యాయం కాదని శశిథరూర్ అన్నారు. గట్టి ప్రతిపక్షంగా కాంగ్రెస్ వ్యవహరించలేకపోతోందని, సవాళ్లను స్వీకరించడం లేదనే ప్రచారానికి తెరపడాలన్నారు. రాహుల్ విముఖంగా ఉంటే... కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి, అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించడం ద్వారా పార్టీలో ఉత్తేజం నింపొచ్చని అభిప్రాయపడ్డారు. ఇంకొంత కాలం సోనియా కొనసాగుతారు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పదవీకాలం సోమవారంతో ముగిసినా మరికొంతకాలం ఆమె పదవిలో కొనసాగుతారని పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి తెలిపారు. సమీప భవిష్యత్తులో అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని, అప్పటిదాకా సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. -
భారత్‌కు రూ.10 లక్షల కోట్ల నష్టం!
ముంబై: కరోనా వైరస్ భారత్‌తో పాటు ప్రపంచ దేశాలన్నింటిని ఆర్థికంగా ఎంతో కుంగదీసింది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం దేశాలన్ని లాక్డౌన్ అమలు చేశాయి. దాంతో అన్ని రంగాలు షట్‌డౌన్ అయ్యాయి. ఆర్థిక కార్యాకలాపాలు కుంటుపడ్డాయి. ఇప్పటికే ప్రపంచ దేశాలన్ని తీవ్రమైన ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్నట్లు ఐఎమ్ఎఫ్ ఆందోళన వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ కూడా తీవ్రమైన ఆర్థికమాంద్యం ఎదుర్కొబోతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ హెచ్చరించారు. ఈ క్రమంలో 2019-20కి గాను భారతదేశ జీడీపీ203 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. అయితే 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 5 శాతం తగ్గుదల ఉండనున్నట్లు నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఇది సుమారుగా రూ.10లక్షల కోట్లుగా ఉండనున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. భారత్‌లో కరోనా కేసులో ఎప్పుడు గరిష్టంగా ఉంటాయో చెప్పలేకపోతున్నారు. దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద కూడా భారీగానే ఉండనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఫలితంగా ఆర్థిక నష్టం ఇంకా ఎక్కువగానే ఉండనున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.(భారత్ నుంచి 12 లక్షల కోట్లు వెనక్కి) భారత్‌లో కరోనా కట్టడి కోసం వైరస్ వ్యాప్తి ప్రారంభమైన తొలినాళ్లలోనే 68 రోజుల కఠిన లాక్‌డౌన్‌ను విధించారు. దాంతో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా కుంటుపడ్డాయి. దాంతో బీద, బిక్కి ప్రజలను ఆదుకోవడం కోసం ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. అయితే లాక్డౌన్ నిబంధనలు సడలించిన నాటి నుంచి దేశంలో కరోనా కేసులు అనుహ్యాంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్ కేసుల్లో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కేసులు తక్కువగానే ఉన్నాయి. ఉదాహరణకు తూర్పు భారతదేశంలో కరోనా కేసులు తక్కువగానే ఉన్నాయి. ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభిచవచ్చు. కానీ కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఇది సాధ్యం కాదు. ప్రస్తుతం దేశంలో ఖరీఫ్ సీజన్ మధ్యలో ఉంది. ఈ సమయంలో వ్యవసాయ కార్యకలాపాలు జోరుగా సాగుతాయి. వీటితో పాటు పలు రాష్ట్రాల్లో ఉపాధి హామీ పనులు కూడా బాగానే సాగుతున్నాయి. అయితే ఈ రెండు ఒకేసారి ముగుస్తాయి. అప్పుడు గ్రామీణభారతం కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. (మరో విడత ఉద్దీపన ప్యాకేజీ!) కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడం ప్రస్తుతం ప్రభుత్వం ముందున్నఅతి పెద్ద సవాలు. ఇవి తేలికగా పరిష్కారమయ్యేవి కావు. ప్రభుత్వాలు పేదలకు బియ్యం పంపిణీ వంటి వాటి మీదనే కాక దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంతేకాక ఈ సంక్షోభ సమయంలో రాజకీయ నాయకులు విమర్శలు చేయడం మాని ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని కోరుతున్నాయి. -
భారత్ ఎకానమీ అస్తవ్యస్తం
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందిలో ఉందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఎస్ అండ్ పీ పేర్కొంది. 2021 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 5% క్షీణిస్తుందని తాజా నివేదికలో పేర్కొంది. కరోనా వైరస్ కట్టడిలో కష్టాలు, విధాన పరమైన నిర్ణయాల అమల్లో జాప్యం, పైనాన్షియల్ రంగంసహా పలు విభాగాల్లో అనిశ్చితి ధోరణి వంటి అంశాలు దీనికి కారణం. అయితే బేస్ ఎఫెక్ట్ కారణంగా 2021–22లో ఆర్థిక వ్యవస్థ కొంత వృద్ధిని నమోదుచేసుకునే అవకాశం ఉందని అంచనావేసింది. కరోనా ఎఫెక్ట్‌తో ఆసియా–పసిఫిక్ ప్రాంతం మూడు ట్రిలియన్ డాలర్లను నష్టపోయే వీలుందని తెలిపింది. ఈ ప్రాంతం ఆర్థిక వ్యవస్థ 2020లో 1.3 శాతం నష్టపోతుందని అయితే 2021లో 6.9 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుందని పేర్కొంది. కాగా చైనా ఆర్థికాభివృద్ధి 2020, 2021ల్లో వరుసగా 1.2 శాతం, 7.4 శాతాలుగా నమోదవుతాయని అంచనావేసింది. డీ అండ్ బీ చెప్పింది ఇదే: దేశంలోని పలు ప్రాంతాల్లో లాక్డౌన్ అమలు, కోవిడ్–19 కేసులు పెరుగుతుండడం వంటి అంశాలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని ఆర్థిక విశ్లేషణా దిగ్గజ సంస్థ డీ అండ్ బీ పేర్కొంది. ఇక సరఫరాల చైన్ దెబ్బతింటే ఆహార ధరలూ తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. వ్యవస్థలో డిమాండ్ మందగమనం కొనసాగుతుందని, వలస కార్మికుల కొరత కారణంగా కంపెనీలకు ప్రత్యేకించి లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపింది. -
భారత ఎకానమీకి కరోనా ముప్పు
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ను మరింత కాలం కొనసాగించిన పక్షంలో భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు మరింత దిగజారే ముప్పు ఉందని ప్రముఖ ఆర్థికవేత్త జీన్ ద్రీజ్ అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌తో ఇప్పటికే దేశంలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆయన చెప్పారు. లాక్డౌన్ విషయాన్ని పక్కన పెట్టినా అంతర్జాతీయ మాంద్య ప్రభావాలు సైతం భారత ఎకానమీపై ప్రతికూలంగా ఉండవచ్చని పేర్కొన్నారు. కరోనావైరస్ వ్యాప్తితో దేశీయంగా కొన్ని రంగాలు కుదేలైనప్పటికీ.. సంక్షోభ సమయంలో కూడా మెడికల్ కేర్ వంటి కొన్ని విభాగాలు వృద్ధి చెందుతున్నాయని చెప్పారు. అయితే, కొన్ని రంగాలు సరిగ్గా లేకపోతే మిగతా రంగాలు మనలేవన్నారు. ‘సైకిల్ టైరుకు పంక్చర్ పడితే ఒక్క చక్రంతో ఎలాగైతే ముందుకు వెళ్లలేదు కదా. అలాగే, లాక్డౌన్ కారణంగా సంక్షోభం కొనసాగిన పక్షంలో అది బ్యాంకింగ్ వ్యవస్థ సహా ఎకానమీలోని మిగతా రంగాలన్నింటినీ దెబ్బతీస్తుంది‘ అని ద్రీజ్ చెప్పారు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులంతా స్వస్థలాలకు చేరుకునేందుకు ప్రయత్నిస్తారని, కొంత కాలం దాకా మళ్లీ వలస వెళ్లకపోవచ్చని అభిప్రాయపడ్డారు. స్వంతంగా పొలాలు ఉన్న వారికి తప్ప స్వస్థలాల్లో ఉపాధి దొరికే పరిస్థితి లేదని చెప్పారు. మరోవైపు, వలస కార్మికులు వెళ్లిపోవడంతో వారిపై ఎక్కువగా ఆధారపడిన రంగాల్లో కార్మికుల కొరత ఏర్పడుతుందన్నారు. -
‘శక్తి’మాన్.. బ్రహ్మాస్త్రం!
పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా... అసలే ఆర్థిక మందగమనంతో అతలాకుతలం అయిన భారత్ ఆర్థిక వ్యవస్థ తాజాగా కరోనా కాటుకు గురవుతున్న నేపథ్యంలో... పరిస్థితిని చక్కదిద్దడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రంగంలోకి దిగింది. ఏప్రిల్ 1 నుంచి 3వ తేదీ మధ్య జరగాల్సిన 2020–21 మొదటి ద్రవ్య పరపతి విధాన సమీక్షను అర్ధంతరంగా మార్చి 27కు మార్చింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నడూ లేని విధంగా కమిటీ సమావేశాన్ని సైతం వారం రోజులు ముందుకు తీసుకువచ్చిన అంశాన్ని పరిశీలిస్తే, ప్రస్తుత ఆర్థిక అత్యవసర పరిస్థితులను అవగాహన చేసుకోవచ్చు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యమైనవి పరిశీలిస్తే... గృహ, ఆటో, వ్యక్తిగత రుణాలు ఇక చౌక బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో రేటును భారీగా 75 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో ఈ రేటు 4.4 శాతానికి దిగివచ్చింది. కోవిడ్–19 ప్రభావం నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, మందగమన ధోరణులను ఎదుర్కొనడానికి అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌సహా దాదాపు 43 సెంట్రల్ బ్యాంకులు రేటు కోత నిర్ణయం తీసుకున్నాయి. 2019 ఫిబ్రవరి నుంచి (చివరిసారి రెండు సార్లు మినహా) వరుసగా ఐదుసార్లు రెపో రేటును 135 బేసిస్ పాయింట్లమేర ఆర్బీఐ తగ్గించింది. దీనితో ఈ రేటు 5.15 శాతానికి దిగివచ్చింది. ధరల పెరుగుదల రేటు అదుపులో ఉండడంతో వృద్ధే లక్ష్యంగా రేటు కోత నిర్ణయం తీసుకోగలిగిన ఆర్బీఐ, ద్రవ్యోల్బణం భయాలతోనే చివరి రెండు సమావేశాల్లో ఈ దిశలో నిర్ణయాలు తీసుకోలేకపోయింది. శుక్రవారం తీసుకున్న నిర్ణయంతో రెపో రేటు 16 సంవత్సరాల కనిష్టానికి తగ్గింది. దీనికి సంబంధించి మరింత లోతుకు వెళితే... 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో 2009 ఏప్రిల్‌లో రెపో రేటు 4.75 శాతానికి తగ్గింది. అటు తర్వాత అంతకంటే తక్కువ స్థాయికి ప్రస్తుతం రెపోరేటు దిగివచ్చింది. ఇక ప్రస్తుత 4.4 శాతం రెపో రేటు 2004 తర్వాత చూడ్డం ఇదే తొలిసారి. అంటే ప్రస్తుత రేటు దశాబ్దంన్నర కనిష్టస్థాయి అన్నమాట. రెపో రేటు తగ్గింపు వల్ల ఈ రేటుతో అనుసంధానమైన గృహ, వాహన, వ్యక్తిగత రుణ రేట్లు దిగివస్తాయి. పరిశ్రమలకు కూడా వడ్డీరేట్ల భారం తగ్గుతుంది. బ్యాంకులు డిపాజిట్ చేస్తే వచ్చేది 4 శాతమే.. ఇక బ్యాంకులు తమ వద్ద ఉన్న మిగులు నిధులను ఆర్బీఐ వద్ద ఉంచి పొందే వడ్డీరేటు రివర్స్ రెపోను ఏకంగా 90 బేసిస్ పాయింట్లు ఆర్బీఐ తగ్గించింది. దీనితో ఈ రేటు 4 శాతానికి దిగివచ్చింది. తమ ఫండ్స్‌ను ఆర్బీఐ వద్ద ఉంచడం వల్ల వచ్చే వడ్డీ మరీ తక్కువగా ఉండడం వల్ల, ఈ మేరకు నిర్ణయం విషయంలో బ్యాంకులను కొంత వెనక్కు తగ్గేలా చేసి, మార్కెట్లోనే వడ్డీకి ఇచ్చేలా వాటిని ప్రోత్సహించడం ఈ ఇన్స్ట్రుమెంట్ లక్ష్యం. ► అయితే ఆర్థిక మందగమనం పరిస్థితుల్లో, మొండిబకాయిలు తీవ్రమైన పరిస్థితుల్లో నిధులను బయటకు వడ్డీకి ఇచ్చి ఇబ్బందులుపడే బదులు, వాటిని ఆర్బీఐ వద్దే ఉంచి స్వల్ప వడ్డీనైనా పొందడం మంచిదని బ్యాంకులు భావిస్తుంటాయని నిపుణుల విశ్లేషణ. సీఆర్ఆర్ ఏకంగా ఒకశాతం ఇక నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని ఆర్బీఐ ఏకంగా ఒకశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 3 శాతానికి దిగివచ్చింది. బ్యాంకులు తమ డిపాజిట్లలో కొత్త మొత్తాన్ని తప్పనిసరిగా నగదు రూపంలో ఆర్బీఐ వద్ద ఉంచాలి. దీనిపై ఆర్బీఐ ఎటువంటి వడ్డీ ఇవ్వదు. ఈ రేటు తగ్గింపు వల్ల బ్యాంకుల వద్ద అదనపు నిధుల లభ్యత ఉంటుంది. ఆర్బీఐ సీఆర్ఆర్ను తగ్గించడం ఏడు సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి. వ్యవస్థలోకి నిధులు ఎలా..? ఇక ఆర్బీఐ తీసుకున్న పలు నిర్ణయాల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థకు రూ.3.74 లక్షల కోట్ల ద్రవ్య లభ్యత– లిక్విడిటీ (2019–20 జీడీపీ అంచనాల్లో దాదాపు 2 శాతం) అందుబాటులోకి రానుంది. ఇందులో రెపో ఆపరేషన్ వల్ల రూ. లక్ష కోట్లు వ్యవస్థలోకి వస్తాయి. సీఆర్ఆర్ ద్వారా ఫైనాన్షియల్ సిస్టమ్‌లోకి వచ్చే మొత్తం రూ.1.37 లక్షల కోట్లు. రుణాలపై 0.75% వడ్డీ కోత: ఎస్బీఐ ఆర్బీఐ విధాన ప్రకటన నేపథ్యంలో– బ్యాంకి ంగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 75 బేసిస్ పాయింట్ల రెపో కోతనూ కస్టమర్‌కు ఏప్రిల్ 1వ తేదీ నుంచీ బదలాయించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఎస్బీఐ నిర్ణయం నేపథ్యంలో ప్రస్తుత ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ అనుసంధాన వార్షిక రుణ రేటు (ఈబీఆర్) ప్రస్తుత 7.8 శాతం నుంచి 7.05 శాతానికి తగ్గుతుంది. ఇక రెపో ఆధారిత రుణ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) 7.40 శాతం నుంచి 6.65 శాతానికి దిగివస్తుంది. దీని ప్రకారం, 30 సంవత్సరాలకు సంబంధించి గృహ రుణ రేటు నెల ఈఎంఐపై లక్షకు రూ.52 తగ్గుతుందని ప్రకటన పేర్కొంది. నిధుల వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)పై వచ్చే నెల్లో జరగనున్న బ్యాంక్ అసెట్ లయబిలిటీ కమిటీ (ఏఎల్‌సీఓ) ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. డిపాజిట్ రేట్లూ తగ్గింపు అన్ని కాలపరిమితుల రిటైల్, బల్క్ డిపాజిట్ రేట్లనూ 20 నుంచి 100 బేసిస్ పాయింట్ల శ్రేణిలో తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. రిటైల్ డిపాజిట్‌పై రేటు 20 బేసిస్ పాయింట్ల నుంచి 50 బేసిస్ పాయింట్లు తగ్గితే, బల్క్ డిపాజిట్‌పై రేటు 50 నుంచి 100 బేసిస్ పాయింట్లు తగ్గింది. ఏయే రుణాలపై మారటోరియం... క్రెడిట్ కార్డ్ చెల్లింపులు సహా టర్మ్ లోన్లపై (వ్యవసాయ, గృహ, విద్య, వ్యక్తిగత, వాహన) నెలవారీ చెల్లింపు(ఈఎంఐ)లకు సంబంధించి కస్టమర్లకు పెద్ద వెసులుబాటును ఆర్బీఐ కల్పించింది. ఈ రుణ చెల్లింపులపై మూడు నెలల మారటోరియం నిర్ణయం తీసుకోడానికి ఆర్థిక సంస్థలకు వెసులుబాటు ఇచ్చింది. మారటోరియం సమయాన్ని డిఫాల్ట్‌గా, మొండిబకాయిగా పరిగణించడానికి వీలు పడదు. ‘‘మార్చి నుంచి మే మధ్య అన్ని రుణ చెల్లింపులపై మారటోరియం అమల్లో ఉంటుంది. క్రెడిట్ కార్డ్ బకాయిలు సహా రిటైల్, కార్పొరేట్ రుణాలకు సంబంధించి అన్ని విభాగాలకూ ఇది వర్తిస్తుంది. అసలు, వడ్డీ, మొత్తం బకాయి చెల్లింపులు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బకాయిలు అన్నింటికీ మారటోరియం వర్తిస్తుంది’’ అని ఆర్బీఐ ప్రకటన ఒకటి తెలిపింది. మారటోరియం తర్వాత టర్మ్ లోన్లకు సంబంధించి రుణ చెల్లింపుల షెడ్యూల్ మూడు నెలలు పెరుగుతుంది. ఉదాహరణకు మీరు ఒక రుణానికి సంబంధించి 2022 మార్చి 31లోపు అన్ని ఈఎంఐలు చెల్లించాల్సి ఉందనుకుందాం. ఆ షెడ్యూల్ ఇప్పుడు 2022 జూన్ 30 వరకూ పొడిగించడం జరుగుతుంది. అన్ని కమర్షియల్ బ్యాంక్‌లు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులుసహా) సహకార బ్యాంకులు, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ సంస్థలు, ఎన్‌బీఎఫ్‌సీల రుణ చెల్లింపులు అన్నింటికీ ఈ మారటోరియం వర్తిస్తుంది. ► వ్యాపార సంస్థలు తీసుకున్న వర్కింగ్ క్యాపిటల్ రుణాలపై చెల్లించాల్సిన వడ్డీకి వెసులుబాటు లభిస్తుంది. ఈ కాలానికి పోగుపడే వడ్డీని మారటోరియం పూర్తయ్యాక కట్టాల్సి ఉంటుంది. ► మారటోరియం విధివిధానాలపై బ్యాంకులే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ► ఒక రకంగా ఇది రుణాల చెల్లింపు కాస్త వాయిదా పడటమే తప్ప తర్వాతైనా కచ్చితంగా కట్టాల్సిందే. ఆయా బ్యాంకుల నిబంధనలు బట్టి ఈఎంఐ కాలవ్యవధి పెరగవచ్చు లేదా మారటోరియం వ్యవధిలో కట్టాల్సి వడ్డీని మిగిలిన టర్మ్‌లో కొద్ది కొద్దిగా కట్టేలా సర్దుబాటు చేయొచ్చు. దీనిపై బ్యాంకులు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు బాకీల పరిస్థితేంటి... క్రెడిట్ కార్డు బాకీలు, ఈఎంఐలకు కూడా మూడు నెలల మారటోరియం వర్తిస్తుందని ఆర్బీఐ స్పష్టతనిచ్చింది. ఆ మేరకు బాకీలను మూడు నెలల తర్వాత కట్టవచ్చు. అయితే, ఈ మొత్తం సమయానికి అసలుపై వడ్డీ భారం పడుతూనే ఉంటుంది. ఉదాహరణకు అసలు కట్టాల్సినది రూ. 10,000 అయితే, వాయిదాపడిన మొదటి నెలలో దీనిపై వడ్డీ లెక్కిస్తారు. దీనికి పన్నులు అదనం. అలాగే, రెండో నెలలో అసలు, వడ్డీ మీద కలిపి అదనంగా వడ్డీ, పన్నులు ఉంటాయి. మూడో నెలా ఇదే రిపీట్ అవుతుంది. ఇక నాలుగో నెలలో మాత్రం (మారటోరియం తర్వాత) అప్పటిదాకా పేరుకుపోయిన బాకాయి మొత్తాన్ని వడ్డీ, పన్నులతో సహా ఒకేసారి చెల్లించాల్సి రావడంతో తడిసి మోపెడవుతుంది. రేటు తగ్గిస్తే ఏంటి ప్రయోజనం... గృహ, వాహన, వ్యక్తిగత రుణాల్లాంటి టర్మ్ లోన్స్ గ్రహీతలకు రేట్ల కోతతో ప్రయోజనం లభిస్తుంది. ఆర్బీఐ పాలసీకి అనుగుణంగా బ్యాంకులు కూడా రేటు తగ్గిస్తే .. రుణాలు చౌకగా మారతాయి. ఎలాగంటే.. ► రిజర్వ్ బ్యాంక్ 75 బేసిస్ పాయింట్లు (ఒక బేసిస్ పాయింట్ అంటే 0.01 శాతం) తగ్గించింది. దీనితో రెపో–రేటు అనుసంధానిత గృహ రుణం తీసుకున్నవారికి... గణనీయంగా వడ్డీ రేటు భారం తగ్గవచ్చు. ఉదాహరణకు 8 శాతం వార్షిక వడ్డీ రేటుపై రూ. 50 లక్షలు తీసుకున్న వారి ఈఎంఐ భారం దాదాపు రూ. 2,139 మేర తగ్గవచ్చు. అయితే, ఎస్బీఐ ఇప్పటికే 0.75 శాతం రుణ రేటు తగ్గించిన నేపథ్యంలో మిగతా బ్యాంకులూ దీన్నే అనుసరించే చాన్స్ ఉంది. ► సాధారణంగా 2019 అక్టోబర్ 1 తర్వాత నుంచి రెపో రేటు ప్రాతిపదికనే బ్యాంకులు ఫ్లోటింగ్ రేట్ రుణాలు ఇస్తున్నాయి. కాబట్టి కచ్చితంగా ఆర్బీఐ తగ్గించిన మేరకు ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బ్యాంకులు బదలాయించాల్సి ఉంటుంది. గతంలో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్(ఎంసీఎల్ఆర్) ఆధారిత వడ్డీ రేటుపై రుణాలు తీసుకున్న వారికి కూడా కొంత మేర తగ్గుతుంది. ఒక వేళ పూర్తి ప్రయోజనాలు దక్కని పక్షంలో.. కాస్త వన్ టైమ్ అడ్మినిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి వచ్చినా.. రెపో రేటు ఆధారిత గృహ రుణాలకు మారడం శ్రేయస్కరం. బ్యాంకులు తగ్గిస్తాయి కాబట్టి... వాటితో పోటీ పడేందుకైనా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలూ(హెచ్ఎఫ్సీ) తగ్గించే అవకాశాలు ఉంటాయి. ఇంతకీ మారటోరియం అంటే.. సంక్షోభ సమయంలో రుణ గ్రహీతలకు కాస్త ఊరటనిచ్చేందుకు ఉద్దేశించినది మారటోరియం. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రకటించిన లాక్‌డౌన్‌తో ఆదాయాలు పడిపోయే అవకాశం ఉంది. దీంతో రుణాలు తీసుకున్న వారు ఈఎంఐలు చెల్లించడం కష్టంగా మారవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఆర్బీఐ తాత్కాలికంగా ఈఎంఐల చెల్లింపు విషయంలో వ్యవధిపరంగా 3 నెలలు వెసులుబాటునిస్తూ మారటోరియం ప్రకటించింది. దీనితో మే నెల దాకా ఈఎంఐ కట్టకపోయినా.. బ్యాంకు మిమ్మల్ని ఎగవేతదారుగా పరిగణించ బోదు. మీ క్రెడిట్ స్కోరుకు నష్టం లేదు. ఆర్థికం అనిశ్చితే... అయినా పటిష్టం.. 2019–20 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5 శాతంగా ఉంటుంది. జనవరి–మార్చి త్రైమాసికంలో ఈ రేటు 4.7 శాతంగా నమోదయ్యే వీలుంది. అంతర్జాతీయ ఆర్థిక మందగమనం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే క్రూడ్ ఆయిల్ ధరల పతనం ఆర్థిక వ్యవస్థకు కొంత ఊరటనిచ్చే అంశం. తీసుకుంటున్న ద్రవ్య పరపతి చర్యల సానుకూల ప్రభావం, కరోనా కట్టడి వంటి అంశాలు భవిష్యత్‌తో దేశాభివృద్ధికి మార్గదర్శకాలుగా ఉంటాయి. రికార్డు స్థాయి ఆహార ఉత్పత్తుల వల్ల ఆహార ధరలు అదుపులోనే ఉంటాయి. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం అవుట్‌లుక్‌లపై ఎటువంటి అంచనాలనూ చెప్పలేం. అనిశ్చితి పరిస్థితులే దీనికి కారణం. ఇక ఆర్బీఐ తీసుకునే అన్చి చర్యలకూ ఆర్థిక పటిష్టత, వృద్ధి పునరుద్ధరణే లక్ష్యం. భారత్‌లో బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితం. ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్లు భద్రం. బ్యాంకుల నుంచి భయాందోళనలతో కూడిన నిధుల ఉపసంహరణ (విత్‌డ్రాయెల్స్) అవసరం లేదు. 2008 ఫైనాన్షియల్ మార్కెట్ సంక్షోభ పరిస్థితులతో పోల్చితే ప్రస్తుత భారత స్థూల ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయి. – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ ఆర్థిక వ్యవస్థకు రక్షణ ఆర్బీఐ చర్యలు కరోనావైరస్ ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థకు రక్షణ కల్పిస్తాయి. వ్యవస్థలో ద్రవ్య లభ్యతను పెంచుతాయి. నిధుల సమీకరణ వ్యయాలు తగ్గుతాయి. మధ్య తరగతి ప్రజలు, వ్యాపారులకు ఆర్బీఐ నిర్ణయాలు సహకరిస్తాయి. – నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి తక్షణ బదలాయింపు జరగాలి ఆర్బీఐ రెపోరేటు తగ్గింపు ద్వారా తమకు ఒనగూరిన ప్రయోజనాన్ని బ్యాంకులు తక్షణం కస్టమర్‌కు బదలాయించాలి. భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందన్న గవర్నర్ ప్రకటన హర్షణీయం. బకాయిల చెల్లింపుపై మారటోరియం పెద్ద ఊరట. – నిర్మలా సీతారామన్, ఆర్థికమంత్రి మానవీయ దృక్పధం ఆర్థిక వ్యవస్థ రక్షణలో మానవీయ దృక్పధంతో కూడిన సాహసోపేత, హర్షణీయ నిర్ణయాలను ఆర్బీఐ తీసుకుంది. ఎస్బీఐకి సంబంధించి రూ.60,000 కోట్ల వరకూ రుణ మారటోరియం పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ -
లాక్డౌన్ మూల్యం రూ.9 లక్షల కోట్లు
ముంబై: కోవిడ్ మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపించనుంది. వైరస్ విస్తరించకుండా నివారణ చర్యల్లో భాగంగా మూడు వారాల పాటు దేశవ్యాప్త లౌక్‌డౌన్ (మూసివేత)ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల 120 బిలియన్ డాలర్లు (సుమారు రూ.9 లక్షల కోట్లు) మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బ్రిటిష్ బ్రోకరేజీ సంస్థ బార్క్లేస్ అంచనా వేసింది. ఇది భారత జీడీపీలో 4 శాతానికి సమానమని పేర్కొంది. మూడు వారాల లాక్డౌన్ వల్ల నష్టమే 90 బిలియన్ డాలర్లు ఉంటుందని, దీనికి అంతకుముందే పలు రాష్ట్రాల్లో లౌక్‌డౌన్ ప్రభావం అదనమని వివరించింది. కాగా, దేశవ్యాప్త లౌక్‌డౌన్ నిర్ణయం బుధవారం ఈక్విటీ మార్కెట్లను ఏ మాత్రం ప్రభావితం చేయకపోవడం గమనార్హం. వృద్ధికి దెబ్బ...: అలాగే, 2020–21 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనాలను 1.7 శాతం మేర తగ్గించి 3.5 శాతంగా ఉంటుందని తాజాగా విడుదల చేసిన నివేదికలో బార్క్లేస్ పేర్కొంది. వడ్డీ రేట్లకు భారీగా కోత..: ఆర్బీఐ ఏప్రిల్ 3న తన విధాన ప్రకటనను విడుదల చేయనుంది. ఆ సందర్భంగా కీలక రేట్లను 0.65 శాతం తగ్గించే అవకాశాలున్నాయని, ఈ ఏడాది మిగిలిన కాలంలో మరో ఒక శాతం వరకు రేట్లను తగ్గించొచ్చని తెలిపింది. ద్రవ్యలోటు కూడా లక్ష్యాన్ని దాటిపోతుందని బార్క్లేస్ పేర్కొంది. ద్రవ్యలోటు 5 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. ఆర్థిక చర్యల్లేవు..: ఇతర దేశాలతో పోలిస్తే ముందుగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకున్న చర్యలను బ్రోకరేజీ సంస్థ ఎడెల్వీజ్ అభినందిస్తూనే.. దీని కారణంగా ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని ఎదుర్కొనే చర్యలు లోపించాయని పేర్కొంది. లాక్డౌన్ వల్ల ఆర్థికంగా పడే ప్రభావం విషయమై కేంద్ర సర్కారు మౌనం దాల్చినట్టు వ్యాఖ్యానించింది. ఇప్పటికే డీమోనిటైజేషన్, జీఎస్టీ నిర్ణయాలతో ఇబ్బందులు పడుతున్న అసంఘటిత రంగాన్ని కోవిడ్ మహమ్మారి మరింత అగాధంలోకి నెట్టేసినట్టయిందని పేర్కొంది. మానిటరీ పరంగా ఎన్నో చర్యలు అవసరమని సూచించింది. క్యూ4లో వృద్ధిరేటు 1.5–2.5 శాతమే! లాక్డౌన్ దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రతికూల ప్రభావం చూపుతుందని కేర్ రేటింగ్స్ తాజా నివేదికలో అంచనావేసింది. 21 రోజుల్లో ఆర్థిక వ్యవస్థలో నిత్యావసర సేవలు, వ్యవసాయ రంగం (20% ఉత్పత్తి) మినహా 80 శాతం ఉత్పత్తి నష్టం జరుగుతుందని వివరించింది. ఆర్థిక వ్యవస్థకు రోజుకు రూ.35,000 కోట్ల నుంచి రూ.40,000 కోట్ల నష్టం వాటిల్లుతుందని విశ్లేషించింది. మొత్తంగా రూ.6.3 లక్షల కోట్ల నుంచి రూ.7.2 లక్షల కోట్ల వరకూ ఎకానమీ దెబ్బతింటుందని అంచనావేసింది. 2019–20 లో స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.140 లక్షల కోట్ల నుంచి రూ. 150 లక్షల కోట్ల వరకే ఉంటుందని అంచనావేసింది. పరిస్థితి చూస్తుంటే ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (జనవరి–మార్చి) మైనస్‌లోకి వెళ్లే అవకాశంలేదుకానీ, 1.5–2.5 శాతం శ్రేణిలో నమోదయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంది. -
పరిశ్రమలు వెనక్కి.. ధరలు పైపైకి!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రతికూల పరిస్థితుల నుంచి బయట పడలేదనడానికి స్పష్టమైన గణాంకాలు బుధవారం వెలువడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి డిసెంబర్లో మైనస్‌లోకి జారిపోతే... రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల గరిష్టానికి చేరింది. పారిశ్రామిక ప్రగతి శూన్యం... పారిశ్రామిక ఉత్పత్తి నవంబర్‌లో కొంచెం పుంజుకుందనుకుంటే, డిసెంబర్లో మళ్లీ నీరసించిపోయింది. ఉత్పత్తి సూచీ (ఐఐపీ) –0.3 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 డిసెంబర్‌తో పోల్చిచూస్తే, 2019 డిసెంబర్లో అసలు వృద్ధిలేకపోగా –0.3 శాతం క్షీణతలోకి జారిందన్నమాట. తయారీ, విద్యుత్ రంగాలూ క్షీణబాటలోనే నిలిచాయి. ఐఐపీ గతేడాది వరుసగా మూడు నెలల పాటు క్షీణ బాటలోనే ఉన్నప్పటికీ (ఆగస్టులో –1.4 శాతం, సెప్టెంబర్‌లో – 4.6 శాతం, అక్టోబర్‌లో –4 శాతం) నవంబర్‌లో కాస్త పుంజుకుని 1.8 శాతంగా నమోదైంది. కానీ ఆ తర్వాత నెల డిసెంబర్లో మళ్లీ క్షీణించడం గమనార్హం. 2018 డిసెంబర్లో ఐఐపీ వృద్ధి రేటు 2.5 శాతం. కీలక రంగాలను చూస్తే... ► తయారీ: 2019 డిసెంబర్లో తయారీ రంగ ఉత్పాదకత క్షీణించి మైనస్ 1.2 శాతానికి పరిమితమైంది. 2018 డిసెంబర్లో ఇది 2.9 శాతం వృద్ధిలో ఉంది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ చూస్తే, 0.5 శాతం వృద్ధిలో ఉన్నా... ఇది 2018 ఇదే కాలంతో పోల్చిచూస్తే (4.7 శాతం) తక్కువకావడం గమనార్హం. ► విద్యుత్: ఈ రంగంలో ఉత్పత్తి 4.5% వృద్ధి నుంచి నుంచి –0.1%కి పడింది. ► మైనింగ్: 5.4 శాతం పెరిగింది. అంతక్రితం ఏడాది డిసెంబర్లో ఇది మైనస్ 1 శాతంగా నమోదైంది.అయితే ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ ఈ రేటు 3.1 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గింది. ► క్యాపిటల్ గూడ్స్: పెట్టుబడులకు, భారీ యంత్ర సామాగ్రి కొనుగోలుకు కొలమానంగా నిల్చే క్యాపిటల్ గూడ్స్ విభాగంలో రేటు ఏకంగా – 18.2 శాతం క్షీణించింది. 2018 డిసెంబర్లో ఇది 4.2 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌కండీషనర్ల వంటి ఉత్పత్తికి సంబంధించిన ఈ విభాగంలో ఉత్పత్తి మైనస్ 6.7 శాతం. తొమ్మిది నెలల్లో ఇలా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి 0.5 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇది 4.7 శాతం. నిత్యావసర ధరల మంట ఇక వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం చూస్తే, 2020 జనవరిలో భారీగా 7.59 శాతం పెరిగింది. అంటే 2019 జనవరితో పోల్చితే నిత్యావసర వస్తువుల బాస్కెట్ రిటైల్ ధర భారీగా 7.59 శాతం పెరిగిందన్నమాట. గడచిన ఆరేళ్లలో (2014 మేలో 8.33 శాతం) ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. కట్టుదాటి...! రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం ఉండాలన్నది ఆర్బీఐకి కేంద్రం నిర్దేశం. అయితే, దీనికి ‘ప్లస్ 2’ లేదా ‘మైనస్ 2’ శాతాన్ని తగిన స్థాయిగా పరిగణనలోకి తీసుకుంటారు. కాగా ఉల్లి తదితర కూరగాయల రేట్లు ఆకాశాన్నంటడంతో రిటైల్ ద్రవ్యోల్బణం ఒక్కసారిగా ఎగిసింది. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న స్థాయికి దూరంగా నవంబర్ (4.62 శాతం), డిసెంబర్ (7.35 శాతం), జనవరి (7.59 శాతం)ల్లో జరుగుతూ వచ్చింది. 2014 జూలైలో తొలిసారిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు.. రిటైల్ ద్రవ్యోల్బణం 7.39 శాతం. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిని డిసెంబర్లో తాకింది. ఆర్బీఐ పాలసీ విధానానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక. 2019 ఫిబ్రవరి 7వ తేదీతో మొదలుకొని ఈ నెల మొదటి వారంలో జరిగిన ఏడు ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షా సమావేశాల సందర్భంగా చివరిసారి రెండుసార్లు మినహా అంతకుముందు వరుసగా ఐదుసార్లు బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోను 135 బేసిస్ పాయింట్లమేర ఆర్బీఐ తగ్గిం చింది. దీనితో ఈ రేటు 5.15 శాతానికి దిగివచ్చింది. ధరల పెరుగుదల రేటు అదుపు లో ఉండడంతో వృద్ధే లక్ష్యంగా రేటు కోత నిర్ణయాలు తీసుకోగలిగిన ఆర్బీఐ, ద్రవ్యోల్బణం భయాలతోనే చివరి రెండు సమావేశాల్లో ఈ దిశలో నిర్ణయాలు తీసుకోలేకపోయింది. ఆందోళనకరం... గత నెల దాకా పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకుంటున్న దాఖలాలు కనిపించినప్పటికీ డిసెంబర్లో గణాంకాలు ఆందోళన రేకెత్తించేవిగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలతో అన్ని పరిశ్రమలకు సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ఎకానమీకి ఇది అంత మంచిది కాదు. – రుమ్కీ మజుందార్, డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త -
ఆర్థిక రంగం ముందు సవాళ్లు: సీతారామన్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక రంగం సవాళ్లను ఎదుర్కొంటోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ‘ది రైజ్ ఆఫ్ ఫైనాన్స్: కాజెస్, కన్సీక్వెన్సెస్, క్యూర్’ అనే పేరుతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై వి.అనంత నాగేశ్వరన్, గుల్జార్ నటరాజన్ సంయుక్తంగా రచించిన పుస్తకాన్ని మంత్రి ఆదివారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచం, భారత ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఈ పుస్తకం పరిష్కారాలను సూచించినట్టు చెప్పారు. ఓ పుస్తకంగా ఇది ఎంతో ప్రాచుర్యం పొందగలదని, మరీ ముఖ్యంగా.. మనకు సందర్భోచితంగా ఉండటంతోపాటు సరైన సమయంలో విడుదల చేసినట్టు పేర్కొన్నారు. మందగమనంపై ప్రశ్నలు ఎదురవుతున్న తరుణంలో ఇది వచ్చినట్టు చెప్పారు. -
మార్కెట్ ర్యాలీ..?
ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత వారాంతాన పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. శుక్రవారం మార్కెట్ ముగిసిన తరువాత.. భారత ఆర్థిక వ్యవస్థలో ఉత్సాహాన్ని నింపే పలు చర్యలను మంత్రి ప్రకటించారు. తాజా ప్రభుత్వ నిర్ణయాల వెల్లడి నేపథ్యంలో మార్కెట్‌కు జోష్ వచ్చే అవకాశం ఉందని దలాల్ స్ట్రీట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై బడ్జెట్లో ప్రతిపాదించిన సర్‌చార్జీని ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడం సానుకూల అంశంగా ఉందని చెబుతున్నాయి. సర్‌చార్జ్ అంశం ఇటీవల దేశ స్టాక్ మార్కెట్లను తీవ్రంగా నష్టపరచగా.. ఈ కీలక అంశంపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని స్పష్టంచేయడంతో మళ్లీ ఎఫ్‌పీఐల పెట్టుబడి భారత క్యాపిటల్ మార్కెట్‌కు వచ్చి చేరే అవకాశం ఉందని కోటక్ సెక్యూరిటీస్ మార్కెట్ ఫండమెంటల్స్ రీసెర్చ్ హెడ్ రస్మిక్ ఓజా విశ్లేషించారు. డాలరుతో రూపాయి మారక విలువ బలపడేందుకు కూడా ప్రభుత్వ తాజా నిర్ణయం దోహదపడనుందని అభిప్రాయపడ్డారు. ‘ఎఫ్‌పీఐల అమ్మకాల ప్రవాహం ఆగిపోయి.. కొనుగోళ్లు జరిగేందుకు అవకాశం ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగేందుకు ఆస్కారం ఉందని భావిస్తున్నాం. అయితే, ఈ ర్యాలీ కొనసాగాలంటే.. కంపెనీల ఆదాయ వృద్ధి పుంజుకుని, ఆర్థిక వ్యవస్థలో మందగమనం తొలగిపోవాలి’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె.విజయ్ కుమార్ అన్నారు. భారత జీడీపీలో వృద్ధి వేగంగా కొనసాగుతుందని ఆర్థిక మంత్రి భరోసా, ఎఫ్‌పీఐ సర్‌చార్జ్ ఉపసంహరణ వంటి కీలక అంశాల నేపథ్యంలో సోమవారం మార్కెట్ గ్యాప్ అప్ ఓపెనింగ్‌కు చాన్స్ ఉందని ట్రేడింగ్ బెల్స్ కో–ఫౌండర్, సీఈఓ అమిత్ గుప్తా చెప్పారు. పీఎస్‌యూ బ్యాంక్ షేర్లకు మద్దతు..! ఆర్థిక వ్యవస్థలో రుణ మంజూరీని పెంచేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70,000 కోట్లను మూలధన సాయంగా అందించనున్నట్టు ఆర్థిక మంత్రి వెల్లడించారు. మరోవైపు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీలు)కు అదనంగా రూ.20,000 కోట్ల నిధులను ఎన్‌హెచ్‌బీ ద్వారా అందించనున్నట్లు చెప్పారు. ఈ తాజా అంశాల నేపథ్యంలో పీఎస్‌యూ బ్యాంకుల షేర్లకు కొనుగోలు మద్దతు లభించే అవకాశం ఉందని ఎలారా క్యాపిటల్ విశ్లేషకులు గరిమా కపూర్ అన్నారు. ఇక ఆటో రంగానికి ఊతమిస్తూ.. ప్రభుత్వ శాఖలు, విభాగాలు పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాల కొనుగోలుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం, వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు సవరణను 2020 జూన్ వరకు వాయిదా వేయడం వంటి పలు ప్రోత్సాహక నిర్ణయాలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ అంశానికి తోడుగా.. వస్తు, సేవల పన్ను ఊరట లభిస్తే ఆటో రంగ షేర్లలో పతనం ఆగుతుందనేది దలాల్ స్ట్రీట్ వర్గాల అంచనా. ఇక ఈ ఏడాది రెండో త్రైమాసిక (జూలై–సెప్టెంబర్) జీడీపీ అంచనాల గణాంకాలను ప్రభుత్వం శుక్రవారం ప్రకటించనుంది. అంతర్జాతీయ అంశాల ప్రభావం.. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలకు ధీటుగా చైనా సవాలు విసురుతోంది. ఇటీవల చైనా దిగుమతులపై 10% సుంకం విధించాలని అమెరికా తీసుకున్న నిర్ణయానికి ప్రతీకారంగా.. మొత్తం 75 బిలియన్ డాలర్ల విలువగల యూఎస్ వస్తువులపై అదనంగా 10% టారిఫ్‌లను అమలు చేయనున్నట్టు చైనా శుక్రవారం ప్రకటించింది. దీంతో ట్రంప్ అదేరోజున మరోసారి తీవ్రంగా స్పందించారు. చైనా దిగుమతులపై అదనపు సుంకాలను విధించడంతో పాటు ఆదేశం నుంచి అమెరికన్ కంపెనీలు బయటకు వచ్చేయాలని కోరారు. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లు ఆరోజున భారీ నష్టాలను చవిచూశాయి. నాస్డాక్ ఏకంగా 3% నష్టపోయింది. ఆగస్టులో రూ.3,014 కోట్లు ఉపసంహరణ... విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఆగస్టు 1–23 కాలానికి ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.12,105 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. అయితే, డెట్ మార్కెట్లో రూ.9,091 కోట్లను పెట్టుబడి పెట్టారు. దీంతో క్యాపిటల్ మార్కెట్లో వీరి నికర పెట్టుబడి ఉపసంహరణ ఈనెల్లో ఇప్పటివరకు రూ.3,014 కోట్లకు పరిమితమైంది. ఎఫ్‌పీఐ లపై కేంద్ర ప్రభుత్వం సర్‌చార్జ్ ఉపసంహరణతో వీరి పెట్టుబడులు మళ్లీ పెరిగేందుకు ఆస్కారం ఉందని భావిస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీ ఎండీ, సీఈఓ విజయ్ చందోక్ అన్నారు. ఆర్థిక మంత్రి ఇచ్చిన భరోసాతో పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని వి.కే విజయ్‌కుమార్ విశ్లేషించారు. -
ఆర్థిక వ్యవస్థకు బూస్ట్..
న్యూఢిల్లీ: మందగమన సంకేతాలతో సతమతమవుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్రం తగు చర్యలు తీసుకుంటుందని పరిశ్రమ వర్గాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసానిచ్చారు. ఎకానమీకి తోడ్పాటునిచ్చే చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఒకే అభిప్రాయంతో ఉన్నాయని ఆమె చెప్పారు. శుక్రవారం జరిగిన పరిశ్రమల సమాఖ్య సీఐఐ జాతీయ మండలి సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ‘ఎకానమీకి ఊతమిచ్చే చర్యలు తీసుకునే విషయంలో రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వం ఒకే అభిప్రాయంతో ఉన్నాయి‘ అని ఆమె తెలిపారు. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య సుహృద్భావ వాతావరణమే ఉందన్నారు. పరిశ్రమ వర్గాలకు పరిస్థితులను కఠినతరం చేయాలన్న ఉద్దేశమేదీ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ పురోగతికి సూచనగా నిలిచే కీలక రంగాల వృద్ధి గణాంకాలు, ఆటోమొబైల్ తదితర రంగాల పనితీరు నానాటికి దిగజారుతుండటంతో పాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం (ఎన్బీఎఫ్సీ) పలు సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలిస్తున్నామని, రాబోయే వారాల్లో పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని నిర్మలా సీతారామన్ తెలిపారు. కాస్త మందగించినా భారత్ .. ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని ఈ సందర్భంగా సీతారామన్ చెప్పారు. సీఎస్‌ఆర్‌పై భరోసా.. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద కంపెనీలు తప్పనిసరిగా నిర్దేశిత మొత్తం కేటాయించకపోతే తీసుకునే కఠిన చర్యలను ప్రభుత్వం మరోసారి సమీక్షిస్తుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘ఎవరిపైనా క్రిమినల్ కేసులు పెట్టాలన్న ఉద్దేశమేదీ ప్రభుత్వానికి లేదు‘ అని ఆమె స్పష్టం చేశారు. ఆదాయ పన్ను శాఖపరమైన వేధింపుల ఆరోపణల గురించి తెలుసుకునేందుకు వచ్చే వారం నుంచి పరిశ్రమ వర్గాలతో సమావేశం కానున్నట్లు ఆమె తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు ఆమె వివరించారు. ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు కూడా తీసుకోనున్నట్లు నిర్మలా సీతారామన్ వివరించారు. అప్పటికప్పుడు పన్ను అధికారులకు ఆయా అంశాలకు సంబంధించిన ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందన్నారు. పన్నులపరమైన వేధింపు ఉదంతాలను స్వయంగా తానే పరిశీలించేందుకు వీలుగా టెక్నాలజీ ఆధారిత ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇక కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గించాలని ప్రభుత్వానికి కూడా ఉందని, అయితే.. కార్పొరేట్లు ఇందుకోసం కొంత ఓపిక పట్టాల్సి ఉంటుందని ఆమె వివరించారు. మరోవైపు, వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి కార్పొరేట్లు, సరఫరాదారులకు రావాల్సిన బకాయిల సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టినట్లు మంత్రి చెప్పారు. చిన్న, మధ్యతరహా సంస్థలకు రావాల్సిన బకాయిలు ఏకంగా రూ. 48,000 కోట్ల మేర ఉంటాయని అంచనా. పన్ను ఊరట కల్పించండి: ఎఫ్‌పీఐల వినతి అధిక ఆదాయవర్గాలపై అదనపు సర్‌చార్జీలు తదితర అంశాలతో ఆందోళన చెందుతున్న మార్కెట్ వర్గాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు శుక్రవారం నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. అదనపు సర్‌చార్జీ నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐ) మినహాయింపునివ్వాలని, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) సమీక్షించాలని, దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ)ని పూర్తిగా ఎత్తివేయడం లేదా కనీసం తగ్గించడమైనా చేయాలని కోరుతూ డిమాండ్ల చిట్టాను మంత్రికి అందజేశారు. గోల్డ్‌మన్ శాక్స్, నొమురా, బ్లాక్‌రాక్, సీఎల్ఎస్ఏ, బార్క్లేస్, జేపీ మోర్గాన్ తదితర సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎఫ్‌పీఐల అభిప్రాయాలను మంత్రి సావధానంగా విన్నారని.. అయితే ఎటువంటి హామీ మాత్రం ఇవ్వలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. రూ. 2 కోట్ల పైగా ఆదాయం ఉన్న వారికి వర్తించే పన్నులతో పాటు అదనపు సర్‌చార్జీ కూడా విధించాలని బడ్జెట్లో చేసిన ప్రతిపాదనతో ఆందోళన చెందుతున్న ఎఫ్‌పీఐలు స్టాక్‌మార్కెట్లలో భారీగా విక్రయాలు జరపడం, మార్కెట్లు భారీగా పడటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆర్థిక మంత్రితో ఎఫ్‌పీఐల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నిధుల అవసరాల కోసం ఎన్బీఎఫ్సీలు కేవలం బ్యాంకులపైనే ఆధారపడకుండా ఇతరత్రా సాధనాలూ పరిశీలించాలని, అలాగే ఈ రంగానికి కూడా నేషనల్ హౌసింగ్ బోర్డు (ఎన్‌హెచ్‌బీ) తరహాలో ప్రత్యేక నియంత్రణ సంస్థ ఏర్పాటు చేయాల్సిన అవ సరం ఉందని ఫైనాన్స్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ రామన్ అగర్వాల్ చెప్పారు. -
మందగమనానికి ఆనవాలు!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని జూన్ ఎగుమతి, దిగుమతి గణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ రెండు విభాగాల్లోనూ వృద్ధి లేకపోగా (2018 జూన్‌తో పోల్చి) క్షీణత నమోదయ్యింది. సోమవారం వెలువడిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► ఎగుమతులు అసలు పెరక్కపోగా 9.71% క్షీణించాయి. 8 నెలల తర్వాత (2018 సెప్టెంబర్‌లో –2.15% క్షీణత) దిగుమతులు క్షీణతను నమోదుచేసుకున్నాయి. విలువ రూపంలో ఎగుమతులు 25.01 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ గూడ్స్, పెట్రోలియం ప్రొడక్టులు, ప్లాస్టిక్, హస్త కళల ఉత్పత్తులు, రెడీమేడ్ దుస్తులు, రసాయనాలు, తోలు, సముద్ర ఉత్పత్తులు, చమురు గింజలు ఇలా కీలక విభాగాల్లో ఎగుమతులు పడిపోయాయి. ► వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం– నిర్వహణ అంశాల నేపథ్యంలో ఏప్రిల్ 17 నుంచి జూన్ 28 వరకూ ఓఎన్జీసీ మంగళూర్ పెట్రోకెమికల్ లిమిటెడ్ తాత్కాలికంగా తన ఉత్పత్తిని నిలిపివేసింది. ఇది పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపింది. జామ్‌నగర్ రిఫైనరీ పరిస్థితి కూడా జూన్‌లో దాదాపు ప్రతికూలంగానే ఉంది. అంతర్జాతీయంగా స్పీట్ ధరల పతనం ఇంజనీరింగ్ గూడ్స్‌పై ప్రభావం చూపింది. ► ఇక దిగుమతులూ క్షీణతలోనే ఉన్నాయి. –9 శాతం క్షీణత నమోదయ్యింది. విలువ రూపంలో 40.26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ► దీనితో ఎగుమతి–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 15.28 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది జూన్‌లో వాణిజ్యలోటు 16.6 బిలియన్ డాలర్లు. ► పసిడి దిగుమతులు 13 శాతం పెరిగి 2.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► చమురు దిగుమతులు 13.33% క్షీణించి 11 బి. డాలర్లుగా నమోదయ్యాయి. చమురేతర దిగుమతు లు 7.34% క్షీణించి 29.26 బి. డాలర్లకు పడ్డాయి. బేస్ ఎఫెక్టే... 2018 జూన్‌లో ఎగుమతులు(27.7 బిలియన్ డాలర్లు) భారీగా పెరిగాయి. అప్పటితో పోల్చితే ఇప్పుడు ఎగుమతులు తగ్గాయి. బేస్ ఎఫెక్ట్ వల్ల ఎగుమతులు భారీగా పడినట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి కూడా దీనికి కారణం. 2019లో ప్రపంచ వాణిజ్యం (కేవలం 2.6 శాతం) బలహీనంగా ఉంటుందని గత నెల వెలువడిన గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్ నివేదిక కూడా పేర్కొన్న విషయం ఇక్కడ గమనార్హం. – అనూప్ వర్థమాన్, వాణిజ్య కార్యదర్శి పలు దేశాల్లోనూ ఇదే ధోరణి ఇటీవలి నెలల్లో పలు దేశాల ఎగుమతులు కూడా పడిపోవడం గమనార్హం. ఏప్రిల్‌కు సంబంధించి అంతర్జాతీయ వాణిజ్య సంస్థ వెలువరించిన గణాంకాల ప్రకారం జపాన్ (–5.88 శాతం), యూరోపియన్ యూనియన్ (–4.30 శాతం), చైనా (–2.75 శాతం), అమెరికా (–2.12 శాతం) ఎగుమతులు కూడా క్షీణతను నమోదుచేసుకున్నాయి. ఏప్రిల్–జూన్ మధ్యా క్షీణతే.. ఏప్రిల్– జూన్ మధ్యా ఎగుమతులు 1.69 శాతం క్షీణించి 81 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతులు 0.29 శాతం క్షీణించి 127 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరిసి వాణిజ్యలోటు 45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. సేవల్లో 15.49 శాతం వృద్ధి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం... ఈ ఏడాది మే నెలలో సేవల ఎగుమతులు 15.49 శాతం పెరిగాయి. విలువ 18.68 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కాగా సేవల దిగుమతులు 22.37 శాతం పెరిగి 12.49 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.