Karthika pournami
-
హైదరాబాద్ లో ఘనంగా కార్తీక పౌర్ణమి పూజలు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి : కనులపండువగా కోటి దీపోత్సవం (ఫొటోలు)
-
మనుషుల మదులను ఉత్తేజితం చేసి మైమరపించే నెలరేడు!
ప్రకృతి తీరుతెన్నులను చురుకుగా పరిశీలించే స్వభావం కలవారికి ఎవరికయినా, కలువపూలు వెన్నెలలో వికసిస్తాయనీ, మనిషి మనసుకూ చందమామకూ సంబంధం ఉంటుందనీ మరొకరు చెప్పవలసిన పని ఉండదు. పున్నమి చంద్రుడిని చూస్తే... సముద్రమే పట్టరాని ఆవేశంతో పొంగిపోతుంది. మనిషి మనసూ అంతే. ‘రసమయ జగతిని ఉసిగొలిపే తన మిసమిస’తో నెలరేడు మనుషుల మదులను ఉత్తేజితం చేసి మైమరపిస్తాడు. మనసు పని తీరును తీవ్రతరం చేస్తాడు. కోరిన దిశలో మరింత వేగంగా నడిపిస్తాడు. భోగులను భోగంవైపూ, యోగులను యోగంవైపూ, భావుకులను భావ తీవ్రతవైపూ, ప్రేమికులను ప్రేమ జ్వరం దిశగానూ, భక్తులను అనన్య భక్తి మార్గంలోనూ నడుపుతాడు. ‘చంద్రమా మనసో జాతంః’ చంద్రుడు విరాట్ పురుషుని మనసు నుండి సృష్టి అయినవాడు అని వేదం. అందుకే కాబోలు మనసుకు పున్నమి చంద్రుడంటే అంత వెర్రి ఆకర్షణ.అందునా, కార్తీక పూర్ణిమ మరీ అందమైంది. అసలే శరదృతువు. ఆపైన రాతిరి. ఆ పైన పున్నమి. పున్నమి అంటే మామూలు పున్నమి కాదు. పుచ్చ పూవు వెన్నెలల పున్నమి. మనసు చురుకుగా చిందులు వేస్తూ పరవశంతో, రెట్టింపు ఉత్సాహంతో విజృంభించి విహరించే సమయం.అయితే చిత్త నది ‘ఉభయతో వాహిని’ అన్నారు. అది ‘కల్యాణం’ (శుభం) దిశగానూ ప్రవహించగలదు. వినాశం దిశగానూ ప్రవహించ గలదు. మనస్సు యజమానిగా ఉండి, ఇంద్రియాలను నియంత్రిస్తే, చిత్త నది సరయిన దిశలో ప్రవహించేందుకు అవి సాయపడతాయి. ఇంద్రి యాలు లాక్కెళ్ళినట్టు, మనసు వెళితే ప్రవాహం వినాశం దిశ పడుతుంది.చదవండి: కార్తీక పూర్ణమి విశిష్టత.. త్రిపుర పూర్ణిమ అని ఎందుకు అంటారు?చిత్త నదిని ‘కల్యాణం’ దిశగా మళ్ళించే ప్రయత్నాలకు పున్నమి దినాలు అనువైనవనీ, పున్నములలో కార్తీక పూర్ణిమ ఉత్తమోత్తమమనీ భారతీయ సంప్రదాయం. ఈ పుణ్య దినాన చేసిన నదీస్నానాలకూ, తులసి పూజలకూ, జపతప దాన యజ్ఞ హోమాది కర్మలకూ ఫలితాలు ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయని నమ్మిక. ప్రాకృతిక కారణాలవల్ల ఈ పర్వదినాన, మనసు మరింత శ్రద్ధా, శుద్ధీ నిలుపుకొనేందుకు సన్నద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈనాడు చేసే ఉపవాసాలూ, శివారాధనలూ, ప్రత్యేక దీపారాధనలూ, దీపదానాలూ, ఆలయాలలో ఆకాశ దీప నమస్కారాలూ, జ్వాలా తోరణ దర్శనాలూ వంటి పర్వదిన విధులు, సత్ఫలాలు కాంక్షించే సజ్జనులకు పెద్దలు చూపిన మార్గం.కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు!!– ఎం. మారుతి శాస్త్రి -
తిరుపతిలో కార్తీక పౌర్ణమి సందడి.. భక్తుల కోలాహాలం (ఫొటోలు)
-
వైభవంగా కార్తీక పౌర్ణమి..
-
365 వత్తులు.. కార్తీక పురాణం ఏం చెబుతోంది?
కార్తీక మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున కార్తీక పౌర్ణమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున స్నానం, దీపం,దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పవిత్ర కార్తీకమాసంలో పౌర్ణమికిచాలా ప్రాధాన్యత ఉంది. చాలా పవిత్రమైంది భక్తులు పరిగణిస్తారు. ఈ ఏడాది కార్తికపౌర్ణమి ఎపుడు, పూజలు గురించి తెలుసుకుందాం.కార్తీక పౌర్ణమి రోజున ఆలయాలన్నీ దీప కాంతులతో వెలుగొందుతాయి. శివనామ స్మరణలతో శివాలయాలన్నీ మార్మోగుతాయి. కార్తీక పూర్ణిమ రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించినట్లు నమ్ముతారు. ఇది చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. త్రిపురాసురుని పీడ తొలగిపోయినందుకు దేవతలు స్వర్గమంతా దీపాలతో వెలిగించారట.. అందుకే భక్తులు కూడా ఈ విజయాన్ని ఎంతో భక్తి, శ్రద్ధలతో జరుపుకుంటారు. దేవాలయాలు , నదీ తీరాల దగ్గర దీపాలను వెలిగిస్తారు. ముఖ్యంగా అరటి దొప్పల్లో నేతి దీపాలను వెలగించి నీటిలో వదిలే దృశ్యాలు శోభాయమానంగా ఉంటాయి.ఈ రోజున విష్ణువు తన మత్స్య (చేప) అవతారంలో కనిపించడాన్ని సూచిస్తుందని, ఇది సృష్టి సంరక్షణకు సంబంధించిన విశ్వ చక్రంతో ముడిపడి ఉందని నమ్ముతారు. ఈ పూర్ణిమ నాడు చేసే పుణ్య కార్యాలు ఆధ్యాత్మిక వృద్ధితోపాటు, సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం.“అల్పమపి క్షితౌ క్షిప్తం వటబీజం ప్రవర్ధతే.జలయోగాత్ యథా దానాత్ పుణ్యవృక్షో ⁇ పి వర్ధతే॥”“దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే”కార్తీక పూర్ణిమ నాడు పవిత్ర స్నానం , దానంగంగా , యమునా, కృష్ణ లాంటి వంటి పవిత్ర నదులలో స్నానం చేస్తే మోక్షం, లభిస్తుందని సర్వ పాపాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఆవునేతిలో ఉంచిన 365 వత్తులను ఆ దేవుడి ముందు వెలిగించి పాపాలను తొలగించి, ముక్తిని ప్రసాదించమని కోరుకుంటారు. సంవత్సరమంతా పూజలు చేయకపోయినా, కార్తీకమాసం అంతా దీపారాధన చేయలేనివారు కనీసం కార్తీక పౌర్ణమిరోజు భక్తితో ఇలా దీపం ముట్టించి, ఆ దేవదేవుడికి నమస్కరిస్తే చాలని కార్తీక పురాణం చెబుతోంది.రోజంతా ఉపవాసం ఉండి శివాలయం లేదా వైష్ణవ ఆలయంలో ఆవునేతి లో నానబెట్టి ఉంచుకున్న 365 వత్తులను వెలిగిస్తారు. భక్తితో పూజాదికాలు సమర్పించి అపుడు ఉపవాసాన్ని విరమిస్తారు. దేవాలయాలక, నదీ తీరాలకు వెళ్లలేని వారు ఇంట్లో చక్కగా శుభ్రం చేసి పిండితో ముగ్గులు పెట్టుకొని అలంకరించుకున్న తులసమ్మ దగ్గర పున్నమి కాంతుల్లో ఈ దీపాలు వెలిగించి నమస్కరించినా, శివకేశవుల అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతారు. అలాగే కార్తీక పూర్ణిమ నాడు చేసే విరాళం ఈ రోజున అత్యంత ముఖ్యమైనది. బ్రాహ్మణులు ,నిరుపేదలకు ఆహారం, దుస్తులు, ఇతర వస్తువులను దానం చేస్తారు. గరుడ పురాణంతో సహా వివిధ హిందూ గ్రంథాలలో దాతృత్వం గురించిన ప్రాముఖ్యత చెప్పబడింది. మరికొంతమంది ఈ రోజు కేదారీశ్వరుడిని నోము నోచుకొని అన్నదానం చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజున దీపాలను దానం చేయడం మరో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీ పూజ, తులసి పూజ కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. జ్వాలా తోరణంతో కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. తద్వారా ఆధ్యాత్మిక ఫలితాలతోపాటు ఆర్థిక శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. -
ఔషధాల కొండ.. కందికొండ గుట్ట
కురవి: దేశంలో పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యం విరాజిల్లింది. ప్రకృతిలో లభించే వనమూలికలు, ఔషధమొక్కలతో పలు రకాల రోగాలను నయం చేసేవారు. ప్రస్తుతం ఆయుర్వేద వైద్యం మనుగడలోకి వస్తోంది. వన మూలిక మొక్కలు ప్రకృతిలో ఎక్కువగా కొండలు, గుట్టల్లో లభిస్తాయి. అలాంటి ఔషధ మొక్కలకు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గుట్ట నిలయంగా పేరుగాంచింది. మునులు తపస్సు చేసిన ప్రాంతం కందికొండపై ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కొండపైకి నడక దారి, మార్గమధ్యలో గుహలు, పైన దేవాలయం, కోనేర్లు ఉన్నాయి. ఈ క్షేత్రంలో పూర్వం కపిలవాయి మహాముని, స్కంద మహాముని వంటి వారు తపస్సులు చేసినట్లు చరిత్ర చెబుతోంది. అయితే అప్పటి నుంచి ఈ కొండపై తపస్సుకు వినియోగించే మొక్కలతో పాటు, వైద్యం చేసేందుకు ఉపయోగపడే ఔషధ మొక్కలు కూడా పెంచినట్లు చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొండ పరిసర ప్రాంతాలకు వెళ్లగానే ఏదో అనుభూతి, ప్రత్యేకమైన సువాసన వెదజల్లుతోందని స్థానికులు చెబుతారు. మూలికల సేకరణ.. గుట్టపై పెద్ద కందిచెట్టు ఉండేదని, అందుకే ఇది కందికల్ గుట్టగా చరిత్రలో లిఖించి ఉందని పూర్వికులు చెబుతుంటారు. కొండ అనేక వనమూలికలకు ప్రసిద్ధి అని, ఇక్కడికి సాధువులు, కోయ గిరిజనులు, ఆయుర్వేద వైద్యులు వచ్చి వనమూలికలు, ఔషధ మొక్కలను తీసుకెళ్తుంటారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికీ కొంత మంది కోయ జాతికి చెందిన గిరిజనులు వచ్చి మొక్కలను తీసుకెళ్తుంటారని చెబుతుంటారు.గుట్ట ఎక్కుతుంటే మధ్యలో భోగం గుడి ఎదురుగా రెండు కోనేర్లు ఉంటాయి. అందులో అనేక ఔషధమొక్కలు కనిపిస్తుంటాయి. గుడి ముందు మరో కోనేరు ఉంటుంది. ఈ కోనేటిలో స్నానాలు ఆచరించడం వల్ల రోగాలు నయమవుతాయని నమ్మకం. అయితే కార్తీక పౌర్ణమితోపాటు, ఇతర శుభ దినాల్లో మూలికలను సేకరిస్తే మంచి ఫలితం ఉంటుందని సాధువులు చెబుతారు. అందుకోసమే తెలంగాణ ప్రాంతంలోని జంగాలు ఈ ప్రాంతం నుంచి ఔషధ మొక్కలు, వన మూలికలు సేకరించి తయారు చేసిన ఆయుర్వేద మందులు చెన్నై, ముంబై, సింగపూర్, ఢిల్లీ వంటి ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకు వెళ్లి వైద్యం చేసి వస్తారు.ఔషధ మొక్కల పేర్లు..గుట్టపై ఉన్న కోనేరులో నాలుగు రకాల మొక్కలు కనిపిస్తాయి. ఈరజడ, రక్తజడ, అంతర దామెర, మద్దెడ వీటిని గుట్ట ఎక్కిన భక్తులు తెంపుకుని తీసుకెళ్తుంటారు. ఈరజడ ఆకులను ఇంటికి తీసుకెళ్లి చిన్నారులకు ఊదు పడుతుంటారు. వీటికి తోడు రాజహంస, పరంహంస, పందిచెవ్వు చెట్టు, నల్ల ఉసిరి చెట్టు, అడవి నిమ్మ, బుర్రజమిడి, నల్లవాయిలి చెట్లు ఉన్నాయి. గుడి దగ్గర బండ పువ్వు లభిస్తుంది. అలాగే నాగసారం గడ్డ, నేల ఏను మొక్కల ఆకులను పశువులకు రోగాలు వచ్చినప్పుడు ఉపయోగిస్తారు. కొండ మామిడి చెట్టుతో కాళ్లు, చేతులు విరిగితే కట్టు కడుతుంటారు. పొందగరుగుడు చెక్క, నల్లెడ తీగలు, బురుదొండ, అడవిదొండ లాంటి మొక్కలు లభిస్తా యని గ్రామస్తులు తెలిపారు. గొర్రెలు, మేకల కు రోగాలు వస్తే న యం చేసేందుకు చే గొండ ఆకు, ఉప్పుచెక్క, ముచ్చతునక చెట్టు ఆకులను వాడుతుంటారని గొర్రెలు, మేకల పెంపకందారులు చెబుతున్నారు. అలాగే కలములక చెట్టు మనుషులకు దగ్గుదమ్ముకు, సోమిడిచెట్టు చెక్క, ఆకులు చిన్న పిల్లలకు జబ్బు చేస్తే వాడుతుంటారని చెబుతున్నారు.కార్తీక పౌర్ణమిరోజు మూలికలు సేకరిస్తారు కందికొండ గుట్టపై అనేక ఔషధ మొక్కలుంటాయి. మొక్కల కోసం ఏటా కోయ జాతి గిరిజనులు, ఆయుర్వేద వైద్యులు, సాధువులు వస్తుంటారని గ్రామంలో చర్చించుకుంటారు. కార్తీక పౌర్ణమిరోజు మూలికలు సేకరిస్తే మంచిగా పని చేస్తాయని నమ్మిక. – బి.హేమలత, కందికొండ మాజీ సర్పంచ్ప్రతీ మొక్కలో ఔషధ గుణమే కొండపైన ఉన్న ప్రతీ మొక్కకు ప్రత్యేకత ఉంది. మనం రోజువారీగా చూసే మొక్కలతోపాటు, రకరకాల మొక్కలు దొరుకుతాయి. పెద్ద పెద్ద రోగాలను కూడా నయం చేసే మొక్కలు ఇక్కడ దొరుకుతాయట. దూర ప్రాంతం నుంచి వచ్చిన వారు గొర్రెల కాపరులను తీసుకెళ్లి మొక్కలు తెస్తారు. – మెట్టు ఉప్పల్లయ్య, కందికొండఆయుర్వేద కళాశాల ఏర్పాటు చేయాలి మా ఊరు సరిహద్దులో కందికొండ గుట్ట ఉంటుంది. ఇక్కడ దొరికే ఔషధ మొక్కలు ఎక్కడ దొరకవు అంటారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న గుట్టపై ఉన్న మందు మొక్కలను పరిరక్షించాలి. దీనిని రాబోయే తరాలకు, ఆయుర్వేదంలో ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాంతంలో ఆయుర్వేద కళాశాల ఏర్పాటు చేయాలి. – గాండ్ల సతీశ్, సూదనపల్లి -
Karthika Pournami 2023 Photos: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు (ఫోటోలు)
-
కార్తీక పౌర్ణమి రోజున ఈ వ్రతం చేస్తే సిరిసంపదలు సిద్ధిస్తాయట
కార్తీక మాసం..అనేక పర్వదినాలకు ఆలవాలం. శివకేశవులకు, ఆయన వారి కుమారుడు అయ్యప్ప స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వరుడికి పరమ ప్రీతికరమైన మాసం. నోములు, వ్రతాలు, పూజలు ఈ మాసంలో చేసుకుంటే అధిక ఫలాన్నిస్తాయి. అటువంటి వాటిలో కేదారేశ్వర వ్రతం ఒకటి. కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతం నోచుకుంటే సిరిసంపదలకు, అన్న వస్త్రాలకు లోటుండదని పండితులు, పెద్దలు చెబుతుంటారు. మర్రిపండ్లను బూరెలుగా, మర్రి ఆకులను విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతన కాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. మహిళలు , పురుషులనే తారతమ్యం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించే భక్తులు ఇంటిల్లిపాది ఉపవాసాలుండి ఆ కేదారేశ్వరుని ధ్యానించాలి. గంగాజలం లేదా శుద్ధజలం, ఆవుపాలు, చెరుకు రసం, కొబ్బరినీళ్లు, తమలపాకులు , పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం సమర్పించిన అనంతరం నక్షత్ర దర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకోవాలి. కార్తీక మాసంలో కొన్ని ప్రాంతాల్లో నవగ్రహ దీపాల నోముగా నోస్తారు. ఈ నోములో ముందుగా గణపతి ఆరాధన చేసి, తరువాయి శివలింగార్చన చేసి, నవధాన్యాలను కొద్దికొద్దిగా తీసి వాటిపై వేస్తూ దీప ప్రమిదల నుంచి ఓం నమఃశ్శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు స్మరిస్తారు. తరువాత అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేసి తొమ్మండుగురు బ్రాహ్మణులకు ఆ దీపాలను దానం ఇస్తారు. దానం చేసేటప్పుడు యథాశక్తి నిండు మనస్సుతో ఇవ్వాలి. ఈ నోము శుభతిథులలో సాయంత్రం వేళల్లో మాత్రమే జరగాలి. నోము అనంతరం అక్షతలను గృహం ఈశాన్య భాగంలో కొద్దిగా చల్లి , కుటుంబంలో అందరూ శిరస్సుపై చల్లుకోవాలి. ఇది సర్వ రక్షాకరంగా కుటుంబాన్ని కాపాడుతుందని పురాణోక్తి. శ్రీ కేదారేశ్వర వ్రత కథ శివుడిని మనం అర్ధనారీశ్వరుడిగా ఆరాధిస్తాం కదా... ఆయన అర్ధనారీశ్వరుడెలా అయ్యాడో వివరించే కథ ఇందులో కనిపిస్తుంది. ఈ కథను సూతుడు శౌనకాది మునులకు చెప్పాడు.పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందడం కోసం చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతాన్ని గూర్చి చెబుతాను. శ్రద్ధతో వినవలసిందని సూతుడు శౌనకాదులకు చెప్పాడు. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చుని ఉన్నాడు. సిద్ధ–సాధ్య– కిన్నర కింపురుష–యక్ష–గంధర్వులు శివుని సేవిస్తున్నారు. దేవముని గణాలు శివుని స్తుతిస్తున్నారు. అట్టి ఆనంద కోలాహలములలో భృంగురిటి అనబడు శివభక్త శ్రేష్టుడు ఆనందపులకితుడై వినోద సంభరితమైన నాట్యగతులతో సభాసదులను, శివుడ్ని మెప్పించాడు. శివుడాతనిని అభినందించి సింహాసనం నుండి లేచి భృంగురిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనునందు భృంగి మొదలు గాగల వంది మాగదులు శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి ‘‘నాథా! నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి? ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరు పరచి ఇట్లేల చేసితిరి?’’ అని ప్రశ్నించింది. అంత సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకొని ‘‘దేవీ! పరమార్ధ విదులగు యోగులు నీవలన ప్రయోజనం కలుగచేయబడవని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించార’’ ని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినై ఉండి ఆ దండప్రణామములకు నోచుకొని అయోగ్యురాలనని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుకొనుటకై తపస్సు చేయాలనుకుని కైలాసాన్ని వదలి భూలోకంలో సస్యశ్యామలమైన గౌతమాశ్రమానికి వచ్చింది. అక్కడి మునులు, వారి పత్నులను చూసి వారితో ‘‘నియమనిష్టాగరిష్టులై అలరారు పుణ్యపురుషులారా! పవిత్రాంగన లారా! నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని. శివునిసతిగా నా నాధునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సొనర్చ సంకల్పించుకొన్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చాను. కాబట్టి నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతాన్ని నాకు ఉపదేశించండి’’ అని పార్వతి వారిని కోరుకున్నది. అందుకు గౌతముడు ‘‘అమ్మా! పార్వతీ! ఈప్సితార్ధదాయకమగు ఉత్తమ వ్రతమొకటున్నది. అది కేదారేశ్వర వ్రతం. నీవావ్రతాన్ని ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందంటూ వ్రతవిధానాన్ని వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభీష్టానుసారం తన మేనులో సగభాగాన్ని పార్వతికి అనుగ్రహించాడు. కొంతకాలమునకు శిభక్తపరాయుణడగు చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వరవ్రతమును దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని వెల్లడిచేయగోరి దివినుండి భువికేతించి ఉజ్జయినీ నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదారవ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడయ్యాడు. తదనంతరం ఉజ్జయినీ నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి, భాగ్యవతి అనే ఇరువురు కుమార్తెలున్నారు. వారిరువురు ఒక వటవృక్షం కింద కూర్చుని తోరం కట్టుకొని భక్తితో పూజ చేసుకున్నారు. మహేశ్వరుడు వారికి పూజాసామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తంగా వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు, సుందర రూపములను ప్రసాదించి అంతర్హితుడయ్యాడు. ఆ వైశ్య పుత్రికలకు యుక్తవయసు వచ్చింది. సౌందర్యసోయగం కలిగిన ఆ వైశ్య పుత్రికలలో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయినీ నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రియగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగాలతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంతకాలానికి చిన్నకుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోన్మత్తురాలై కేదారవ్రతాన్ని మరచిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది, ఆమె భర్త ఆమెను, కుమారుడ్ని రాజ్యం నుంచి వెడలగొట్టివేసాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుడ్ని చేరబలిచి ‘‘నాయనా నీ పెద్దతల్లి ఉజ్జయినీపురం మహారాణి. ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయమర్థించి తీసుకొని రావలసిందని చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినీకి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుడ్ని సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్దగల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరల పెద్దతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత ధనాన్నిచ్చి పంపింది. ఈ పర్యాయము కూడా మార్గమధ్యమందు చోరరూపుడైన శివుడాసొమ్మును తీసుకొని పోయాడు. మరల అతడు పెద్దతల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు ‘‘ఓయీ! నీవు ఎన్నిసార్లు నీపెద్దతల్లి నడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదారవ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదు’’ అని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్దతల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియచెప్పాడు. అప్పుడామె బాగా ఆలోచించి అతని చేత కేదారవ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది. తల్లితో కేదార వ్రతం చేయవలసినదిగా చెప్పమన్నది. అతడాప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్దతల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసినదని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదారవ్రతాన్ని చేసింది. ఆమె భర్త మందీమార్బలంతో వచ్చి ఆమెను, కుమారుడ్ని రాజధానికి తీసుకొని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదారవ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్యసంపదలతో జీవిస్తున్నది. ఎవరు ఈ కేదారేశ్వర వ్రతాన్ని నియమనిష్టలతో కల్పోక్తంగా చేయుదురో అట్టివారు ఎట్టి కష్టములు లేని వారై సుఖంగా జీవించి అంత్యమున శివసాన్నిధ్యం పొందుతారు. -డి. వీ. ఆర్. భాస్కర్ -
కార్తీక పౌర్ణమి.. శివనామ స్మరణతో మార్మోగుతున్న ఆలయాలు
సాక్షి, హైదరాబాద్: శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక పౌర్ణమి, అందులోనూ సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయియి. భక్తుల శివనామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున నుంచే భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాన్నారు. భక్తిశ్రద్దలతో దీపాలు వెలిగిస్తున్నారు. వరంగల్ భద్రకాళి, అన్నవరం, ద్వారకతిరుమల, భద్రాచలం తదితర ప్రాంతాల్లోని ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే మల్లికార్జున స్వామికి అభిషేకాలు చేయడంతో పాటు ఆలయ ప్రాంగణంలో దంపతులు, మహిళలు వేలాదిగా వచ్చి దీపాలను వెలిగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రహ్లాద్ మాట్లాడుతూ ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి సోమవారం రావడంతో ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఉదయం నాలుగు గంటల నుండి స్వామివారి అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అలాగే ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ఆలయ ప్రాంగణంలో జ్వాలాతోరణం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. నిర్మల్ జిల్లా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఖానాపూర్ పట్టణంలో దేవాలయాలు భక్తులతో నిండిపోయాయి. స్థానిక వెంకటేశ్వర స్వామి, హనుమాన్ దేవలయలలో భక్తులు పూజలు నిర్వహించి కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమొగుతున్నాయి. హన్మకొండలోని రుద్రశ్వరస్వామి (వెయ్యి స్తంభాల గుడి), సిద్దేశ్వరా స్వామి దేవాలయం, భద్రకాళి భద్రశ్వరా స్వామి దేవాలయాల్లో తెల్లవారు జామునుంచి భక్తులు బారులు తీరారు. కార్తీకపౌర్ణమి పర్వదినం కావడంతో దేవాలయలకు పోటెత్తారు. కాళేశ్వరం, రామప్ప, పాలకుర్తి సోమేశ్వర స్వామి దేవాలయం, కురవి వీరబాదరస్వామి, ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయాల్లో కార్తీకపౌర్ణమి శోభ సంతరించుకుంది. కాకినాడ జిల్లా కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్నవరం శ్రీ సత్యదేవుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి వ్రతములు ఆచరిస్తూ శ్రీ స్వామి దర్శనానికి బారులు తీరారు.పిఠాపురం పాదగయ క్షేత్రంలో కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి పాదగయ పుష్కరినిలో పవిత్ర స్నానమాచరించి, కార్తీక దీపాలు వెలిగిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. విశాఖపట్నం విశాఖ నగరంలో కార్తీకమాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయాలు దర్శించుకుంటున్నారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఏలూరు జిల్లా. ద్వారకాతిరుమల శేషాచల కొండపై శివాలయంలో భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. శివ నామస్మరణలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున కార్తీకదీపం వెలిగిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కార్తీక సోమవారం పౌర్ణమి పర్వదిన సందర్భంగా రాజమండ్రి గోదావరి ఘాట్ల వద్ద తెల్లవారుజాము నుంచి భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. శివనామ స్మరణతో శైవాలయాలు మారుమోగుతున్నాయి. రాజమండ్రిలో మార్కండేయ స్వామి ఆలయం, ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయాలతో పాటు పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామం, అంబేద్కర్ కౌన్సిలింగ్ జిల్లాలోని కోటిపల్లి మురమళ్ళ ముక్తేశ్వరం లోని క్షణముక్తేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజాము నుండి స్వామివారు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. -
ఇవాళే కార్తీక పౌర్ణమి! జ్వాలా తోరణం ఎందుకు వెలిగిస్తారు?
సమస్త పాపాలను దగ్ధం చేసే జ్వాలా తోరణం మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశ పెట్టడం వెనుక ఒక కారణం ఉంది. యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమశిక్ష. ఈ తోరణం గుండా వెళ్లకుండా ఉండాలంటే జ్వాలా తోరణ దర్శనం చేసుకోవాలి అని పెద్దలు చెప్పారు. కార్తీక పౌర్ణమిరోజున సాయంకాలం జ్వాలా తోరణం చేస్తారు ఎందుకు ? కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలా తోరణం. ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి ఆచారం మనకు కనబడదు. కార్తీక పౌర్ణమినాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి.. ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడిని పల్లకిలో అటూ ఇటూ మూడు సార్లు ఊరేగిస్తారు. శ్రీనాథుడు ద్రాక్షారామంలో జరిగే జ్వాలాతోరణ మహోత్సవాన్ని భీమేశ్వర పురాణంలో వర్ణిస్తూ.. "కార్తీక వేళ భీమశంకరుని నగరమందు దూరునెవ్వాడు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణ నిర్వాణవేళ ఘోర భీకర యమద్వార తోరణంబు..’’ అంటాడు. మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఒక కారణముంది. యమలోకంలోకి వెళ్లినవారికి మొదట దర్శనమిచ్చేది అగ్ని తోరణం. యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తీ ఈ తోరణం గుండానే లోపలికి వెళ్లాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుడిని ప్రార్థించటం ఒకటే మార్గం. అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడు సార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది. అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు. అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి. దీని వెనక మరో తత్వకోణం కూడా ఉంది. జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడిస్తే - ‘‘శివా ! నేను ఇప్పటి దాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి. వచ్చే ఏడాది దాకా ఎటువంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తా..’’ అని ప్రతీకాత్మకంగా చెప్పటం. ఆ జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి - ఇంటి చూరులోనో.. గడ్డివాములోనో.. ధాన్యాగారంలోనోపెడతారు.అది ఉన్న చోట్ల భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని.. ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం... కార్తీకపౌర్ణమి నాడు ఏం చేయాలి? " సమస్త ప్రాణులకూ నేను మహోపకారం చేయగలను కార్తీకపౌర్ణమి నాడు. ఇతర ప్రాణులు చెయ్యలేవు. నేను ఏమి చెయ్యగలను? దీపం తీసుకెళ్ళి ఓ గదిలో పెట్టాననుకోండి కొంత ఫలితం. వీధిలోకి తీసుకువచ్చి దీపం పెట్టాననుకోండి విశేష ఫలితం. యధార్ధానికి శాస్త్రంలో ఏమి చెప్పారంటే ఆ రోజున వీధులలో ఉన్న చెత్త కూడా వెలిగించాలి. కానీ లౌకికాగ్నితో వెలిగించకూడదు. మీ ఇంట దీపం వెలిగించి కార్తీక పౌర్ణమి నాటి ప్రదోషవేళ, " దామోదరమావాహయామి " అనిగాని, " త్రయంబకమావాహయామి " అనిగాని అని, ఆ దీపంతో వెలిగించాలి. ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఈ శ్లోకం చెప్పాలి... కీటాఃపతంగా మశకా శ్చ వృక్షాః జటేస్ధలే... ఫలే ఏ నివసంతి జీవా దృష్ట్వాప్రదీపం నచ జన్మ భాగినః భవతింత్వ స్వపచాహి విప్రాః" ఈ దీపము దీపము కాదు, ఇది త్రయంబకుడు, ఇది దామోదరుడు. కాబట్టి ఈ దీపం వలన మొదటి ఫలితం ఎవరికి వెళ్ళాలంటే కీటకములు, పురుగులు, పతంగాలు, దోమలు, వృక్షాలకు వెళ్ళాలి. కాబట్టి ఈశ్వరా! నీ దీపపు వెలుతురు ఆ చెట్టు మీద పడుతుంది. కాబట్టి దామోదరుడి చెయ్యి దానిమీద పడినట్టే! త్రయంబకుని చెయ్యి దానిమీద పడినట్టే! అది అభ్యున్నతిని పొందాలి. నీటిలో ఉండే చేపలు, కప్పలు, తాబేళ్ళ వంటి వాటిపై ఈ దీపపు వెలుతురు పడినప్పుడు, ఆ ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి. అక్కడితో వాటి పాపపుణ్యాలన్నీ నశించుపోవుగాక! ఇక వాటికి జన్మ లేకుండుగాక! ఉదర పోషణార్ధమే బ్రతుకుతున్న భయంకరమైన స్ధితిలో ఉన్న వాడిమీద ఈ దీపము యొక్క కాంతి ప్రసరించి వాడు వచ్చే జన్మలో అభ్యున్నతిని పొందుగాక! నువ్వు ఈ శ్లోకం చెప్పి నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు. మనం ఒక ఇల్లు కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్కరోజు ఉండకూడదు. 365 రోజులూ దీపాలు వెలుగుతూ ఉండాలి. అలా దీపం వెలగకపోతే ఆ దోషం మీకే వస్తుంది. మళ్లీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపం పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడిన అద్భుతమైన తిధి "కార్తీక పౌర్ణమి". అందుకే కార్తీకపౌర్ణమి నాడు 365 వత్తులు గుత్తిదీపం ఆవునేతిలో ముంచి వెలిగిస్తుంటారు. దీపాలు ఇంటి యజమాని వెలిగించాలి. మా ఆవిడ వెలిగిస్తుంది, నేను టి.వి చూస్తాను అనకూడదు. యజమాని పంచె కట్టుకుని వెళ్ళి దేవాలయంలో దీపం వెలిగించాలి. ఇంట దీపం పెడితే కార్తీకపౌర్ణమి తిధి ప్రధానం. దేవాలయంలో దీపం పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం. (బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరావుగారి ప్రవచనం ఆధారంగా) --డీ. వీ ఆర్ భాస్కర్ (చదవండి: అలవాటుని అధిగమించటం అతికష్టం!) -
కార్తీక దీపం.. శోభాయమానం (ఫొటోలు)
-
హరిహరులకు ఎంతో ప్రీతికరం.. కార్తీక మాసం
హరిహరులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం బుధవారం (అక్టోబర్ 26) నుంచి ప్రారంభమైంది. నవంబర్ 23 వరకు కొనసాగే ఈ మాసంలో దీపారాధనకు విశేష ప్రాధాన్యం ఉంది. అన్ని ఆలయాలు, నదీతీరాలు, ఇళ్లల్లో సైతం దీపాలను వెలిగించడం పుణ్యప్రదమని కార్తీక పురాణం చెబుతోంది. దీపదర్శనం, దీపదానం, దీప ప్రకాశనం అనే మూడు ఈ మాసంలో ఎంతో పుణ్యాన్నిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఆలయాలు కార్తీక సందడికి సిద్ధమవుతున్నాయి. ప్రత్యేక సోమవారాలు, ఏకాదశి, శనివారంతో పాటు ఈ నెలరోజులూ పుణ్యదినాలేనని అర్చకులు చెబుతున్నారు. విశిష్టత ఇలా.... కార్తిక శుద్ధ పాడ్యమికి బలి పాడ్యమి అని పేరు. ఈ రోజున బలిచక్రవర్తిని పూజించి దానం చేస్తే సంపదలు తరగవని చెబుతారు. మరుసటి రోజు ‘భగినీ హస్త భోజనం’ చేస్తారు. దీన్నే యమ ద్వితీయ, భ్రాత ద్వితీయ అని కూడా అంటారు. ఈ రోజున మహిళలు సోదరులు, సోదర వరసైన వారిని ఇంటికి పిలిచి స్వయంగా వంటచేసి భోజనం వడ్డిస్తారు. శుద్ధ చవితిని నాగుల చవితిగా చేసుకుంటారు. శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశికి ప్రబోధన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని పేరు. ఆ మరుసటి రోజుకు క్షీరాబ్ధి ద్వాదశి అని పేరు. శుద్ధ చతుర్దశికి వైకుంఠ చతుర్దశి అని పేరు. ఈ రోజున మహావిష్ణువు పరమశివుణ్ని పూజించారని నానుడి. కార్తికపౌర్ణమిని పరమశివుడు త్రిపురాసులను సంహరించిన రోజుగా చెబుతారు. ఈ రోజున శివాలయాల్లో జ్వాలా తోరణోత్సవాన్ని నిర్వహిస్తారు. దీపమే దైవం... ‘దీపం జ్యోతి పరబ్రహ్మం’ అన్నారు. దీపమే దైవ స్వరూపమని అర్థం. అందుకే లోకాల్లో చీకట్లను తొలగించే దీపారాధనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం, విప్పనూనె వంటి వాటితో కూడా దీపారాధనలు చేస్తారు. నదీ స్నానం, దానధర్మాలు, ఉపవాసాలు, పూజలు, వ్రతాలు, నోములకు కూడా ఈ మాసంలో ఎంతో ప్రాధాన్యం ఉంది.. దీనివల్ల కష్ట నష్టాలు పోవడంతో పాటు పాపాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. మొత్తం నాలుగు కార్తీక సోమవారాలు అక్టోబర్ 26వ తేదీ నుంచి వచ్చేనెల 23వ తేదీ వరకు కార్తీక మాసంలో మొత్తం నాలుగు సోమవారాలు వచ్చాయి. ఈనెల 31వ తేదీ మొదటి కార్తీక సోమవారం, నవంబర్ 4న ఏకాదశీ, 7న రెండో కార్తీక సోమవారం, అదే రోజు కార్తీక పౌర్ణమి, జ్వాలా తోరణం, 8న చంద్ర గ్రహణం, నవంబర్ 14న మూడో సోమవారం, 21న నాల్గోవ సోమవారం. ఆకాశదీపం ప్రత్యేకం ఆయా ఆలయాల వద్ద ద్వజస్తంభాలకు ఈ నెల రోజుల పాటు సాయంత్రం వేళ ఆకాశదీపాలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేసి దీపాలను ధ్వజస్తంభాలకు వేలాడదీస్తుంటారు. ఈ దీపాన్ని చూసిన, నమస్కరించిన దోషాలు తొలగి సుఖసంతోషాలతో జీవిస్తారని భక్తుల విశ్వాసం. ఏటేటా ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. (క్లిక్ చేయండి: కేదారేశ్వర వ్రతం ఎందుకు చేసుకుంటారంటే!) -
వరంగల్ జిల్లా ఆలయాల్లో కార్తీక పౌర్ణమి శోభ
-
పండిత పామర రంజకంగా సింగపూర్ లో కార్తీక పౌర్ణమి వేడుకలు.
"శ్రీ సాంస్కృతిక కళాసారథి" సింగపూర్ వారు కార్తీక పౌర్ణమి పర్వదిన సందర్భంగా, శివభక్తి మయమైన చక్కటి సాంప్రదాయక కథాగాన కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాల వేదికపై అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ కార్యక్రమంలో హరికథకు పుట్టినిల్లయిన విజయనగరం నుంచి 'హరికథా చూడామణి' కాళ్ళ నిర్మల భాగవతారిణి ఆలపించిన హరికథా గానంతో కార్యక్రమం ప్రారంభించారు. వల్లీ కళ్యాణం ఇతివృత్తంగా రుద్రాక్ష మహిమను తెలుపుతూ చక్కటి కథాగానంతో, పద్యాలతో మాధుర్యభరితమైన గాత్రంతో ఆహార్యంతో ఆమె అందరిని ఆకట్టుకున్నారు. వయోలిన్ పై యమ్ జి భానుహర్ష మృదంగంపై యమ్ మహేశ్వరరావు ఆమెకు వాద్య సహకారం అందించారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి "శ్రీ విఘ్నేశ్వర కళా బృందం" బుర్రకథ కళాకారులు 'పార్వతీ కళ్యాణ' ఘట్టాన్ని చక్కటి బుర్రకథగా మలచి, అందరిని అలరించే జానపద శైలిలో అచ్చ తెలుగు మాటలలో లయబద్ధంగా వినిపించారు. ప్రధాన కథకులుగా యడవల్లి కృష్ణ ప్రసాద్ పాల్గొనగా, వచనంతో చిరంజీవి, హాస్యంతో కన్నబాబు సహకారాన్ని అందించి చక్కటి ఊపును అందించారు. "శ్రీ సాంస్కృతిక కళాసారథి" అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు మాట్లాడుతూ "కరోనా కష్టకాలంలో ఆదరణ కరువైపోతున్న హరికథ, బుర్రకథ వంటి సంప్రదాయక కళలకు చేయూతనిచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కార్తీక పౌర్ణమి పర్వదిన సందర్భంగా భక్తి మార్గంతో మేళవించి ఏర్పాటు చేశామని, దీనికి "గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం చారిటబుల్ ఫౌండేషన్" సంస్థవారు, మరియు సింగపూర్ నుండి స్థానిక సభ్యులు ముందుకు వచ్చి, కథాగానం వినిపించిన కళాకారులకు పారితోషికాలు అందించడం చాలా ఆనందంగా ఉంది" అని దాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ నుండి స్థానిక గాయనీగాయకులు సౌభాగ్యలక్ష్మి తంగిరాల, విద్యాధరి కాపవరపు, రాధికా నడదూరు, షర్మిళ చిత్రాడ, యడవల్లి శేషుకుమారి, శ్రీవిద్య, శ్రీరామ్, పాల్గొని చక్కటి శాస్త్రీయ శివభక్తి గీతాలను ఆలపించి భక్తి పారవశ్యాన్ని కలుగజేశారు. రామాంజనేయులు చామిరాజు వ్యాఖ్యాన నిర్వహణలో భాస్కర్ ఊలపల్లి, రాధిక మంగిపూడి సహ నిర్వాహకులుగా, రాధా కృష్ణ గణేశ్న సాంకేతిక నిర్వాహకులుగా నడిపించిన ఈ కార్యక్రమాన్ని సుమారు 1000 మందికి పైగా ప్రపంచ నలుమూలల నుంచి యూట్యూబ్ & ఫేస్బుక్ ద్వారా వీక్షించారు. -
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ ఫొటోలు
-
అపురూప దృశ్యం.. భక్తులు తన్మయత్వం
శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం ఆలయ పరిధిలోని భీమేశ్వర ఆలయం శిఖరాన కార్తిక పౌర్ణమి వేళ గురువారం రాత్రి చంద్ర దర్శనం కనువిందు చేసింది. ఆలయం శిఖరాన నిండు పౌర్ణమి చంద్రుడు ఇలా దర్శనమిచ్చారు. ఈ అపురూప దృశ్యాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. – జలుమూరు -
రేపటి నుంచి శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలంలో శుక్రవారం నుంచి డిసెంబర్ 4 వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా స్వామివారి గర్భాలయ అభిషేకాలను పూర్తిగా రద్దు చేశారు. రోజూ 4 విడతల్లో ఆర్జిత సామూహిక అభిషేకాలు నిర్వహిస్తారు. మల్లికార్జునస్వామి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు. ఈ మాసంలో వచ్చే కార్తీక సోమవారాలు, పౌర్ణమి రోజున పుష్కరిణి వద్ద లక్షదీపార్చన, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జ్వాలాతోరణోత్సవం, కృష్ణవేణి నదీమతల్లికి పుణ్యనదీ హారతులిస్తారు. భక్తులు కార్తీక దీపారాధనను చేసుకునేందుకు వీలుగా ఆలయ దక్షిణ మాడవీధిలో, గంగాధర మండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసం ప్రారంభ సూచికగా శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఈ మాసమంతా ఆలయంలో దీపాన్ని వెలిగిస్తారు. -
వైభవంగా కార్తీక పౌర్ణమి గరుడ సేవ
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆలయంలో సోమవారం సాయంత్రం కార్తీక మాస పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. కోవిడ్ నేపథ్యంలో లాక్డౌన్ అనంతరం మొదటిసారిగా మలయప్పస్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 నుండి 8.30 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.గరుడ వాహనసేవలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. -
ఇంద్రకీలాద్రిపై వైభవంగా కోటిదీపోత్సవం
-
కోటి పుణ్యాల కార్తీక పున్నమి
కార్తీకమాసంలో ప్రతిరోజూ పర్వదినమే. అయితే ఈ మాసం నెలరోజులు చేసే పూజలన్నింటి కంటే కార్తీక పౌర్ణమి నాటి పూజకు ఫలితం అధికంమంటారు. అగ్నితత్త్వ మాసమైన కార్తీకంలో వచ్చే పౌర్ణమికి చంద్రుని విశేషంగా ఆరాధించాలని మన పూర్వులు చెబుతారు. చంద్రుని కొలవడంలో మానసిక చైతన్యం, కుటుంబ శ్రేయస్సు, భార్యాభర్తల మధ్య సఖ్యత, సంతాన సౌభాగ్యం కలిగి ప్రశాంతత ఏర్పడుతుంది. అటువంటి కార్తీక పౌర్ణమి విశేషాలను తెలుసుకుందాం.కారీక్త పౌర్ణమి రోజున సంప్రదాయం ప్రకారం ఉదయమే పుణ్యస్త్రీలు మంగళ స్నానం ఆచరించి శుచియైన వస్త్రం ధరించి ఇంటి ముంగిట రంగవల్లులు దిద్ది, పార్వతీపరమేశ్వరులకు ఆహ్వానం పలుకుతూ ఇల్లంతా అలంకరించాలి. సూర్యోదయానికి పూర్వమే తులసికోట వద్ద 365 వత్తులను ఆవునేతితోగాని, కొబ్బరినూనెతోగాని, నువ్వులనూనెతో గాని తడిపి దీపాలను వెలిగించాలి. అలాగే బియ్యపిండితో చేసిన దీపాలను, ఉసిరికాయ దీపాలను కూడా సమర్పించాలి. పిమ్మట.. శివాలయానికి వెళ్ళి గుమ్మడి, కంద దుంప, తాంబూలాదులతో బ్రాహ్మణులకు దానమిచ్చి, నమస్కరించి వారి ఆశీర్వాదాన్ని పొందాలి. అరటి దొన్నెలో దీపాలను వెలిగించి పవిత్ర నదులలో, కాలువలో వదలాలి. ఈవేళ చాలా ప్రాంతాలలో నదీమతల్లికి పసుపు కుంకుమను సమర్పిస్తారు. ఈ దృశ్యం అత్యంత మనోహరంగా, కనులకింపుగా వుంటుంది. దీనివల్ల నదీమతల్లి సంతసించి సకల సంపదలు ప్రసాదిస్తుందని, సంపూర్ణ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. ఈ దినమంతా ఉపవసించి, సంధ్యాసమయంలో యధావిధిగా తిరిగి స్నానాదులు గావించి, కుటుంబ సౌఖ్యం, సౌభాగ్యం, ఐశ్వర్యం కోరుకుంటూ చంద్రునికి భక్తితో దీపాలు సమర్పించి వేడుకోవాలి. పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను ధనం, సౌభాగ్యం, ఆరోగ్యం, యశస్సునిమ్మని ప్రార్థించాలి. ఈరోజు శివాలయంలో ఈశ్వరునికి నవరసాలతో, పంచామృతాలతో మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. తదనంతరం లక్షపత్రి పూజ, లక్ష కుంకుమార్చనలను నిర్వహిస్తారు. ధాత్రీపూజను కూడా చేస్తారు. ఉసిరి చెట్టు లభ్యం కాకపోతే కనీసం ఉసిరి కొమ్మనైనా తులసి కోటలో వుంచి పూజిస్తే మంచిది. ఈ రోజు సంధ్యాసమయంలో శివాలయంలో జ్వాలాతోరణం నిర్వహిస్తారు. ఎండుగడ్డితో తాడును తయారు చేసి ఆలయం ముంగిట తోరణంగా అమర్చి దానిని ఆవునేతి దీపంతో వెలిగిస్తారు. పార్వతీపరమేశ్వరులను పల్లకీలోనుంచి ఈ తోరణం నుండి మూడుసార్లు ఊరేగిస్తారు. ఆ పల్లకీని అనుసరించి శివనామ జపం చేస్తూ ప్రదక్షిణలు చేయడం వల్ల అనేక జన్మల నుండి చేసిన పాపాలన్నీ పటాపంచలయి, ఆనందం కలుగుతుందని శాస్త్రవచనం.కార్తీక పూర్ణిమ నాడు శంకరుడు త్రిపురాసురుణ్ణి వధించిన రోజు. అందువలన ఈరోజును త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తారు. కార్తీకపురాణం ప్రకారం ఈరోజు దీపదానం, సాలగ్రామ దానం చేయాలి. దానధర్మాలు చేయాలి. ఇవి కోటిరెట్లు ఫలితాన్నిస్తాయని నమ్మిక. ఈ పౌర్ణమి రోజు అరుణాచల క్షేత్రంలో అఖండ జ్యోతి వెలిగిస్తారు. ప్రాముఖ్యత గలిగిన ఈ జ్యోతి దర్శనానికి అనేక రాష్ట్రాలనుండి భక్తులు వస్తారు. పౌర్ణమినాడు శ్రీ కృష్ణుని రాసలీలకు పెట్టినది పేరు. అందువలన ఈ రోజు శ్రీ కృష్ణ స్మరణ కూడా అత్యంత ఫలవంతమైనది. కార్తీకపౌర్ణమి నాడు కార్తికేయుడు తారాకాసుర సంహారం చేసినట్లు తెలుస్తోంది. అందువలన ఆయనకు కూడా విశేష పూజలు నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమినాడు తమిళులు నూత్న వధూవరులను పుట్టింటికి పిలిచి వారితో దీపారాధన చేయించి, సువాసినులకు దక్షిణ తాంబూలాలు ఇప్పిస్తారు. దీనివలన భవిష్యత్తు బంగారు బాటగా ఉంటుందని, తమ కుమార్తె వలన మరొక గృహం కాంతులీనుతుందని నమ్మకం.అత్యంత ఫలప్రదమైన ఈ కార్తీక పౌర్ణమిని భక్తి శ్రద్ధలతో ఆచరించి మన సంప్రదాయ విధివిధానాలను ముందు తరాలకు పదిలపరచి లోకక్షేమానికి కృషిచేద్దాం.:::డా. దేవులపల్లి పద్మజ -
కార్తీక వెలుగుల్లో ఇంద్రకీలాద్రి
సాక్షి, విజయవాడ: కార్తీక పౌర్ణమి సందర్భంగా పలు దేవాలయాలు దీపాలు వెలిగించే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అందులో భాగంగా ఇంద్రకీలాద్రి కోటి దీపకాంతులతో వెలిగిపోతుంది. మల్లిఖార్జున మహామండపం నుంచి కనకదుర్గానగర్ మాడవీధుల వరుకు భక్తులు దీపాలతో అలంకరించారు. కోటి దీపోత్సవంలో వందలాది భక్తులు పాల్గొన్నారు. దుర్గామల్లేశ్వర స్వామి వారికి పూజారులు ఘనంగా జ్వాలాతోరణం నిర్వహించారు. రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్ వేద మంత్రాల ఘోషతో మారుమోగుతోంది. కార్తీక పూర్ణిమ హారతి కార్యక్రమాన్ని బుద్ధవరుపు చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించింది. గోదావరి హారతి కార్యక్రమనికి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, పలువురు ప్రజాప్రతిధులు పాల్గొననున్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ
-
కార్తీక దీపం.. సకల శుభకరం
సాక్షి, వర్గల్(గజ్వేల్): నాచగిరి శివకేశవుల నిలయం..జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం..కార్తీక పౌర్ణమి వేళ మంగళవారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక దీపోత్సవంతో ఆధ్యాత్మిక అనుభూతులు పంచనున్నది. ఇందుకోసం నాచారం గుట్ట శ్రీలక్ష్మీ నృసింహ క్షేత్రం కార్తీక పౌర్ణమి మహోత్సవానికి సర్వసన్నద్ధమైంది. ఈ విశేష పర్వదినం రోజున క్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలాచరిస్తారు. శివాలయం పక్కన కార్తీక దీపాలు వెలిగించి దీపారాధన చేస్తారు. సకల శుభాలు కోరుతూ పెద్ద ఎత్తున భక్తులు కార్తీక సత్యనారాయణ వ్రతాలు జరుపుకుంటారు. కార్తీకపౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతాల ప్రారంభ వేళలు మొదటి విడత వ్రతాలు: ఉదయం 6 గంటలకు రెండో విడత వ్రతాలు ఉదయం 8 గంటలకు మూడో విడత వ్రతాలు ఉదయం 10 గంటలకు నాలుగో విడత వ్రతాలు మద్యాహ్నం 12 గంటలకు అయిదో విడత వ్రతాలు సాయంత్రం 4.30 గంటలకు సామూహిక వ్రతాలకు విస్తృత ఏర్పాట్లు.. నాచగిరిలో కార్తీక పౌర్ణమి మహోత్సవం సందర్భంగా ఆలయ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. వ్రతభక్తులకు ఇబ్బంది కలగకుండా ఉదయం 6 గంటల నుంచే సత్యదేవుని వ్రతాలు ప్రారంభమవుతాయి. తొలి విడత ఉదయం 6 గంటలకు , రెండో విడత ఉదయం 8 గంటలకు, మూడో విడత ఉదయం 10 గంటలకు, నాలుగో విడత మద్యాహ్నం 12 గంటలకు, చివరి విడత సాయంత్రం 4.30 గంటలకు వ్రతాలు ప్రారంభమవుతాయి. వ్రతాలు జరిపించుకునే భక్తులు కౌంటర్లలో టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. వారితో పురోహిత పరివారం ఆలయ వ్రతమండపంలో వ్రతాలు జరిపిస్తారు. నేడు సాయంత్రం కార్తీక దీపోత్సవం కార్తీక పౌర్ణమి సందర్భంగా నాచగిరి క్షేత్రంలో మంగళవారం సాయంత్రం భక్తజన సామూహిక కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు ఈ వేడుక ప్రారంభమవుతుంది. ఆలయ ఆవరణలో వివిధ ఆకృతులలో వెలుగులు విరజిమ్ముతూ దీపాల వరుసలు నేత్ర పర్వం చేయనున్నాయి. దుబ్బాకటౌన్: హిందువులకు కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది, కార్తీకం ఈ పేరు వింటేచాలు బాధలు క్షణాల్లో తొలగిపోతాయని భక్తుల నమ్మకం. కార్తీక మాసంలో తమ ఇంట్లో వ్రతాలు (నోము) చేస్తే సర్వ సుఖాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయన్న విశ్వాసం. అందుకే కార్తీక మాసంలో పెద్దనోములు, దీపారాధనలు చేయడం అనవాయితీగా వస్తోంది. పవిత్రమైన రోజు.. కార్తీక శుద్ధ పౌర్ణమి అనగా కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కల్గిన పదిహేనవరోజు. కార్తీక మాసంలో చివరిరోజైన పౌర్ణమి ఎంతో పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. అన్ని మాసాల్లో ఈ కార్తీక మాసానికే విశిష్టత ఉందని వేదాలు, పురణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ప్రతిదినం ఓ పర్వ దినమే అందులో ముఖ్యమైనవి భగిని, హస్తభూజనం, నాగుల చవితి, నాగుల పంచమి, ఉరŠాధ్వన ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, చివరిగా కార్తీక పౌర్ణమి. ప్రతీ ఇంటా నోములు, వ్రతాలు.. కార్తీకమాసం వచ్చిందంటనే ప్రతి ఇంటా నోములు(వ్రతాలు) ప్రత్యేకం. ప్రతీ ఏటా కార్తీక మాసంలో పెద్దనోములు( కేదారీశ్వర వ్రతం), సత్యనారాయణ వ్రతం,భక్తీశ్వర వ్రతాలు చేసుకుంటారు. కార్తీక దీపారాధన కార్తీక దీపానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. జ్ఞానానికి చిహ్నం దీపం, సర్వసంపదలు జ్ఞానం వల్లనే లభిస్తాయి.ఈ మాసమంతా దీపారాధన చేసి చివరిరోజున వెలుగుతున్న వెండి ప్రమిదను దానం చేస్తే అనంత పుణ్యఫలం, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. శివ, విష్ణుదేవలయాలు రెండింట స్త్రీలు ఎంతో నిష్టతో దీపాలు వెలిగిస్తారు. ప్రతీ ఇంటా కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే ఉసిరి కాయలు, ఆకులతో మరిగించిన నీటితో తలస్నానాలు ఆచరించి ఇంట్లో తులసికోట వద్ద మహిళలు నేతితో నింపిన భరిణిల్లో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తారు. దీపావళి రోజు నుంచి ఈ కార్తీక పౌర్ణమి వరకు 15 రోజులు తమ ఇండ్ల ముందర సాయం కాళంలో దీపాలు పెడుతారు. కార్తీక వనభోజనాలు... కార్తీకపౌర్ణమి రోజున శివ, విష్ణు ఆలయాలను భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుంటారు.అలాగే కార్తీక వనభోజనాలకు వెళ్లడం ముఖ్యంగా ఉసిరిచెట్ల నీడలో కుటుంబసమేతంగా వన భోజనాలు చేయడం చాలా శ్రేష్టం. దీపారాధన శుభప్రదం.. కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం, ఆకాశదీపాలు వెలిగించడం, నదిలో దీపాలను వదలడం, దీపదానం చేయడం అత్యంత శుభప్రదం. వీటిని తప్పనిసరిగా ఆచరించాలని శాస్త్రం చెబుతున్నది. కార్తీకమాసమంతా ఇంటిముందర ద్వారానికి ఇరువైపుల దీపాలు వెలిగించి పెట్టాలి. సాయం వేళలో శివాలయాల్లో గాని, వైష్ణవాలయాల్లోగాని, గోపుర ద్వారం లేదా దేవుడి సన్నిధానంలో గాని, ఆలయ ప్రాంగణంలో గాని దీపాలను వెలిగిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతున్నది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. ఉపవాస నియమాలు పాటించడం శుభప్రదం. – హరిప్రసాద్ శర్మ, నాచగిరి వేదపండితులు తెలంగాణ ప్రాంత భక్తుల ఆరాధ్యక్షేత్రం నాచగిరి. ఇక్కడ జరిగే ప్రతీ కార్యక్రమం పండుగలా జరగాలన్నదే అభిమతం. అదేవిధంగా మంగళవారం కార్తీకపౌర్ణమి మహోత్సవం పండుగ వాతావరణంలో నిర్వహిస్తాం. కార్తీక పౌర్ణమి రోజున పెద్ద ఎత్తున కార్తీక వ్రతాలు జరుగనున్నాయి. అలాగే సాయంత్రం కార్తీక దీపోత్సవం జరుగుతుంది. ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేశాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్దీకి అనుగుణంగా విడతల వారీగా వ్రతాలు జరిపిస్తాం. అదేవిధంగా సామూహిక కార్తీక దీపోత్సవం సాయంత్రం 6.30కు ప్రారంభమవుతుంది – కట్టా సుధాకర్‌రెడ్డి (నాచగిరి ఆలయ కార్యనిర్వహణాధికారి) -
కపిలతీర్థంలో కార్తీక శోభ