led lights
-
రూ.7.7 కోట్లు బాకీ.. కంపెనీపై దివాలా చర్యలు
రుణ చెల్లింపుల్లో విఫలమైనందుకు గాను సిస్కా ఎల్ఈడీ లైట్స్పై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోనున్నారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి రూ.7.70 కోట్ల బాకీల వసూలు కోసం రుణదాత సన్‌స్టార్ ఇండస్ట్రీస్ దాఖలు చేసిన పిటీషన్‌ను విచారణకు స్వీకరించింది.సిస్కా ఎల్ఈడీ లైట్స్ బోర్డును రద్దు చేసి దివాలా పరిష్కార ప్రొఫెషనల్‌గా దేవాశీష్ నందాను ఎన్సీఎల్టీ నియమించింది. సన్‌స్టార్ సరఫరా చేసిన ఉత్పత్తుల నాణ్యతపై వివాదం నెలకొందని, ఆ కంపెనీ దివాలా చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందన్న సిస్కా వాదనలను తోసిపుచ్చింది. సన్‌స్టార్‌కి సిస్కా రుణం చెల్లించాల్సి ఉందనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పిటీషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నట్లు వివరించింది.ఇదీ చదవండి: అదానీ ప్రాజెక్ట్‌పై కొత్త ప్రభుత్వం పునఃపరిశీలనఎస్ఎస్కే గ్రూప్‌లో భాగంగా ఉన్న సిస్కా ఎల్ఈడీ లైట్స్‌కి ఎలక్ట్రికల్ గృహోపకరణాల సంస్థ సన్‌స్టార్ ఇండస్ట్రీస్ 60 రోజుల క్రెడిట్ వ్యవధితో ఉత్పత్తులను సరఫరా చేసేది. తొలినాళ్లలో సక్రమంగానే చెల్లింపులు జరిపినప్పటికీ 2023 మార్చి నుంచి జులై వరకు పంపిన 25 ఇన్వాయిస్లను చెల్లించకుండా డిఫాల్ట్ కావడంతో సన్‌స్టార్ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. -
మూత తెరిచినా మునగం
వానాకాలం మొదలైంది.. కాస్త గట్టి వర్షం పడటంతో రోడ్లపై నీళ్లు నిలిచాయి.. ఆ నీరు వేగంగా పోయేందుకు కొన్నిచోట్ల మ్యాన్‌హోల్స్ తెరిచారు.. ఆ నీళ్లలోంచే, ఆ మ్యాన్‌హోల్స్ దగ్గరి నుంచే జనం అటూఇటూ నడిచి వెళ్లారు.. కానీ ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు.ఎందుకంటే..అక్కడ మ్యాన్‌హోల్ ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ పట్టుజారినా అందులో పడిపోకుండా గ్రిల్స్ అడ్డంగా ఉన్నాయి. కాసేపటికి నీరంతా వెళ్లిపోయింది. మ్యాన్‌హోల్‌పై పెట్టేసిన మూత ఎల్ఈడీలతో వెలుగుతోంది. ప్రభుత్వం చేపట్టిన రక్షణ చర్యలన్నీ పూర్తయితే.. నిపుణుల సూచనలన్నీ అమల్లోకి వస్తే.. జరిగేది ఇదే.కానీ మ్యాన్‌హోల్స్ వద్ద రక్షణ చర్యలు ఇంకా పూర్తవలేదు.. వానల తీవ్రత పెరుగుతున్నా పనుల వేగం పెరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. డీప్ మ్యాన్‌హోల్స్‌కు గ్రిల్స్ ఏర్పాటును వేగవంతం చేయాలని.. జపాన్‌లో అనుసరిస్తున్న తరహాలో మ్యాన్‌హోల్స్ మూతలపై ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి అమలైతే.. ‘మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి మృతి’వంటి ఘటనలు ఇకపై వినకుండా ఉంటామని అంటున్నారు.సాక్షి, హైదరాబాద్: వానాకాలం ప్రారంభమైంది. కాస్త గట్టిగా చినుకులు పడినప్పుడల్లా.. డ్రైనేజీ, నాలాలు ఉప్పొంగడం.. రోడ్లపై, కాలనీల్లో నీళ్లు చేరడం మొదలైంది. జీహెచ్ఎంసీ, జల మండలి ఎన్ని చర్యలు తీసుకున్నా.. రోడ్ల మీది చెత్త డ్రైనేజీల్లో చేరి పూడుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఇబ్బందిగా మారుతోంది. అలాంటి సమయాల్లో మ్యాన్‌హోల్స్ మూతలు తెరిచి, నీరు పోయేలా చేస్తుండటం ప్రమాదకరంగా మారుతోంది. కొన్నిసార్లు అయితే.. ఎక్కడ మ్యాన్‌హోల్స్ ఉన్నాయి? ఎక్కడ రోడ్డు ఉందనేది తెలియని పరిస్థితి ఉంటోంది. ఏదో పనిమీద బయటికి వెళ్లినవారు, ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంటిబాట పట్టాల్సిన దుస్థితి. తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్‌లో పడి జనం మృత్యువాతపడిన ఘటనలూ ఎన్నో.150కి పైగానే వాటర్ ల్యాగింగ్ పాయింట్స్మహానగరం పరిధిలో వాన నీరు నిలిచిపోయే సుమారు 150కుపైగా పాయింట్లుæ ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో 50 వరకు ప్రమాదకర ప్రాంతాలు ఉన్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా ఎల్బీనగర్, చాదర్ ఘాట్, సింగరేణి కాలనీ, బాలాపూర్, మల్లేపల్లి, మైత్రీవనం, పంజగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, ఛే నంబర్, మెట్టుగూడ, వీఎస్టీ, ముషీరాబాద్, బాలానగర్, మూసాపేట, బోరబండ, మియాపూర్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రాంతాలు ఎక్కువ. ఇలాంటి చోట్ల నిలిచిన నీళ్లు త్వరగా వెళ్లిపోయేందుకు మ్యాన్‌హోల్స్ మూతలు తీస్తుండటం.. ప్రమాదాలకు దారి తీస్తోంది. మరికొన్ని చోట్ల వాహనాల రాకపోకలతో మ్యాన్‌హోల్స్ ఓపెనింగ్స్ దెబ్బతిన్నాయి, మూతలు పగిలిపోయాయి. అలాంటి చోట వాననీరు నిలిచి.. పాదచారులు ప్రమాదాల బారినపడుతున్నారు. వాహనాలు కూడా వాటిలో పడి దెబ్బతింటున్నాయి.జపాన్‌లో మ్యాన్‌హోల్స్‌కు ఎల్ఈడీ లైట్లు జపాన్‌లోని టోక్యో సిటీలో మ్యాన్‌హోల్స్ మూతలపై ప్రత్యేకంగా కార్టూన్ డిజైన్లతో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. సౌర విద్యుత్ సాయంతో రీచార్జి అయ్యే ఈ లైట్లు.. రోజూ సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు వెలుగుతూ ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్ ఉన్నాయని సులువుగా గుర్తించి, జాగ్రత్త పడేందుకు వీటితో చాన్స్ ఉంటుంది. అంతేగాకుండా రకరకాల డిజైన్లు, రంగులతో కార్టూన్ క్యారెక్టర్లు కనిపిస్తూ అందంగా కూడా ఉంటున్నాయి. ఇలా మన దగ్గర కూడా మ్యాన్‌హోల్స్‌పై ఎల్ఈడీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు. రాత్రిపూట మ్యాన్‌హోల్స్ సులువుగా కనబడితే.. ప్రమాదాలు తప్పుతాయని అంటున్నారు.జలమండలి రక్షణ చర్యలువరదల ముంపుతో ఢిల్లీ, ముంబై లాంటి పరిస్థితి హైదరాబాద్‌లో ఏర్పడకుండా జలమండలి ముందస్తు చర్యలు చేపట్టింది. సీవరేజీ ఓవర్ ఫ్లో, మ్యాన్‌హోల్స్ నిర్వహణపై సీరియస్‌గా దృష్టిపెట్టింది. నగరవ్యాప్తంగా వాటర్ ల్యాగింగ్ పాయింట్లు, లోతైన మ్యాన్‌హోల్స్‌ను గుర్తించింది. మ్యాన్‌హోల్స్‌కు సేఫ్టీ గ్రిల్స్ బిగించడంతోపాటు అత్యంత ప్రమాదకరమైనవని తెలిపేలా.. మ్యాన్‌హోల్స్‌కు ఎరుపు రంగు వేసి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తోంది.కొన్ని వాటర్ ల్యాగింగ్ పాయింట్ల వద్ద ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి పరిస్థితిని పర్యవేక్షించేలా చర్యలు చేపట్టింది. నగరవ్యాప్తంగా 63వేలకుపైగా డీప్ మ్యాన్ హోల్స్ ఉండగా.. ఇప్పటివరకు 25 వేల వరకు మ్యాన్‌హోల్స్‌పై సేఫ్టీ గ్రిల్స్ బిగించినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రధాన రహదారుల్లో ఉన్న వాటిని కవర్స్‌తో సీల్ చేసి, ఎరుపు రంగు పెయింట్ వేస్తున్నామని.. ఎప్పటికప్పుడు మ్యాన్‌హోల్స్ నుంచి పూడిక, వ్యర్థాలను తోడేసేందుకు ఎయిర్‌టెక్ యంత్రాలను అందుబాటులో ఉంచినట్టు వివరిస్తున్నారు. ఇప్పటికే వానాకాలం మొదలైన నేపథ్యంలో.. ఈ రక్షణ చర్యలను మరింత వేగవంతం చేయాల్సి ఉందని నగర ప్రజలు కోరుతున్నారు.రంగంలోకి ఈఆర్టీ, ఎస్పీటీలువర్షాల నేపథ్యంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ఈఆరీ్ట), సేఫ్టీ ప్రొటోకాల్ టీమ్ (ఎస్పీటీ)లను జలమండలి రంగంలోకి దింపింది. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి రక్షణ పరికరాలతోపాటు వాహనాలను కేటాయించింది. వాననీరు నిలిచిన చోట వాహనాల్లో ఉండే జనరేటర్లు, మోటార్లతో నీటిని తోడేస్తారు. ఎయిర్‌టెక్ యంత్రాలతో మ్యాన్‌హోల్స్ నుంచి తీసిన వ్యర్థాల (సిల్ట్)ను ఎప్పటికప్పుడు తొలగిస్తారు. మరోవైపు మ్యాన్‌హోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రతి సెక్షన్Œ నుంచి సీవర్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో బృందాలను ఏర్పాటు చేశారు. వారు రోజూ ఉదయాన్నే తమ పరిధిలోని ప్రాంతాలకు వెళ్లి పరిస్థితి పర్యవేక్షిస్తారు. వాటర్ ల్యాగింగ్ పాయింట్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తారు.మ్యాన్‌హోల్స్ తెరిస్తే క్రిమినల్ కేసులువాన పడుతున్న సమయంలో, నీళ్లు నిలిచినప్పుడు.. అధికారుల అనుమతి లేకుండా మ్యాన్‌హోల్స్ మూతలను తెరవకూడదని జలమండలి స్పష్టం చేసింది. ఇష్టమొచి్చనట్టు తెరిచిపెడితే క్రిమినల్ కేసులు పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎక్కడైనా మ్యాన్‌హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా.. జలమండలి నంబర్ 155313కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వవచ్చని సూచించింది. నాలాలపై నిర్లక్ష్యంతో.. మహానగర పరిధిలోని పలుచోట్ల నాలాలు ప్రమాదకరంగా మారాయి. నిబంధనల ప్రకారం.. రెండు మీటర్ల కన్నా తక్కువ వెడల్పున్న నాలాలను క్యాపింగ్ (శ్లాబ్ లేదా ఇతర పద్ధతుల్లో పూర్తిగా కప్పి ఉంచడం) చేయాలి. రెండు మీటర్ల కన్నా వెడల్పున్న నాలాలకు రిటైనింగ్ వాల్ కట్టాలి. లేదా ఫెన్సింగ్ వేయాలి. కానీ గ్రేటర్ సిటీ పరిధిలో సగానికిపైగా చిన్న నాలాలకు క్యాపింగ్ లేదు. పెద్ద ఓపెన్ నాలాలకు రిటైనింగ్ వాల్/ ఫెన్సింగ్ లేకుండా పోయాయి. గతంలో వేసిన క్యాపింగ్, ఫెన్సింగ్ భారీ వర్షాలతో దెబ్బతిన్నాయి. దీనితో వాన పడినప్పుడు నాలాల్లో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గత ఐదేళ్లలో సుమారు 15 మందికిపైగా నాలాల్లో పడి చనిపోవడం గమనార్హం. వానాకాలం మొదలైన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన క్యాపింగ్, ఫెన్సింగ్ వేయడం.. బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని సామాజిక వేత్తలు కోరుతున్నారు.మ్యాన్‌హోల్స్‌కు రక్షణ కవచాలు వర్షాకాలంలో మ్యాన్‌హోల్స్‌తో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాం. మ్యాన్‌హోల్స్‌కు సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నాం. డీప్ మ్యాన్‌హోల్స్‌కు ఎరుపు రంగు వేసి అత్యంత ప్రమాదకరమైనవని తెలిసేలా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. వాటర్ ల్యాగింగ్ పాయింట్లను గుర్తించి ఎప్పటికప్పుడు క్లియర్ చేసేలా చర్యలు చేపట్టాం. వర్షం పడే సమయంలో కింది స్థాయి సిబ్బంది నుంచి మేనేజర్ వరకు వారి పరిధిలోని ఫీల్డ్‌లో ఉండేలా ఆదేశాలు జారీ చేశాం.డ్రైనేజీలు, నాలాలు క్లీన్‌గా ఉంచాలి డ్రైనేజీలు, నాలాలు క్లీన్‌గా ఉంచాలి. వాటిలో పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలి. వాన నీరు సైతం సాఫీగా వెళ్లే విధంగా మార్గం ఉండాలి. వాటిలో పూడిక పేరుకుపోవడంతో వర్షం పడినప్పుడు నీరు వెళ్లక రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మురుగు నీటి వ్యవస్ధను పర్యవేక్షించే యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. నిరంతరం పూడికతీత పనులు కొనసాగించాలి. వర్షాకాలంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలి.సిటీలో సీవరేజీ నెట్వర్క్, మ్యాన్ హోల్‌ల లెక్క ఇదీ..జీహెచ్ఎంసీ పరిధిలో సీవరేజీ నెట్వర్క్: 5,767 కి.మీశివారు మున్సిపాలిటీల పరిధిలో : 4,200 కి.మీ మొత్తం మ్యాన్‌హోల్స్: 6,34,919 డీప్ మ్యాన్‌హోల్స్: 63,221 వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో..: 26,798 శివారు మున్సిపాలిటీల పరిధిలో..: 36,423 -
Khushi Pandey: ఖుషీతో దిల్ ఖుష్
చిన్నతనంలో తాము పడ్డ కష్టాలు తమ పిల్లలు పడకూడదని వారికి నొప్పి తెలియకుండా ఎంతో కష్టపడి పెంచుతారు తల్లిదండ్రులు. అయితే లక్నోకు చెందిన ఖుషీ అందుకు భిన్నం. తన తండ్రిలా మరెవరూ కష్టపడకూడదని తానే ఓ సామాజిక కార్యకర్తగా మారి సాటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది ఖుషీ పాండే. లక్నోకు చెందిన 23 ఏళ్ల ఖుషీ పాండే బాల్యం ఉన్నావ్ అనే ఊళ్లో గడిచింది. తన తండ్రి నుంచి చిన్ననాటి విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుంది. ఖుషీ తండ్రికి బాగా చదువుకోవాలని ఉండేది. కానీ పెన్సిల్ కొనే స్థోమత కూడా లేదప్పుడు. ఈ విషయం తెలుసుకుని,∙నాన్నలా మరెవరూ చదువుకోసం ఇబ్బంది పడకూడదు అనుకుంది. నిరుపేదలకు సాయం చేయాలని చిన్నప్పుడే గట్టిగా నిర్ణయించుకుంది. ఖుషీ పెద్దయ్యేసరికి నాన్న వాళ్ల లక్నోకి మకాం మార్చారు. అక్కడ ఓ షాపులో పనిచేస్తూ తరువాత కాంట్రాక్టర్‌గా మారారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టులు కూడా రావడంతో ఖుషీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. దీంతో ఖుషీ ‘లా’ పూర్తయ్యాక, సోషల్ వర్క్‌లో పీజీ చేసింది. చదువు పూర్తయ్యాక వెంటనే నిరుపేదలకు చదువు చెప్పడం ప్రారంభించింది. మురికివాడల్లోని పిల్లలను ఒక చెట్టుకింద కూర్చోబెట్టి సాయంత్రం రెండుమూడు గంటలు చదువు చెప్పేది. రోజుకి యాభై మంది వరకు ఖుషీ క్లాసులకు హాజరయ్యేవారు. తన దగ్గరకు వచ్చే పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడంతోపాటు, వారి తల్లిదండ్రులకు చదువు ప్రాముఖ్యతను వివరిస్తోంది. తాతయ్య మరణంతో... అది 2020 ... ఒకరోజు రాత్రి ఖుషీ వాళ్ల తాతయ్య షాపు నుంచి తిరిగి వస్తున్నారు. చీకట్లో సరిగా కనిపించక ఎదురుగా వచ్చే కారు తాతయ్య సైకిల్ని ఢీ కొట్టడంతో ఖుషీ తాతగారు అక్కడికక్కడే చనిపోయారు. తాతయ్యను ఎంతో ఇష్టపడే ఖుషీ ఈ చేదు సంఘటనను తట్టుకోలేకపోయింది. సైకిల్‌కు లైట్ ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు అనుకుని ప్రతి సైకిల్‌కు లైటు ఉండాలాని భావించింది. రోజూ కూలి పనిచేసుకునేవారు తమ సైకిళ్లకు లైట్లు పెట్టుకోవడానికి తగ్గ స్థోమత ఉండేది కాదు. దాంతో వాళ్లకు ఒక్కొక్కరికి 350 రూపాయల ఖరీదు చేసే లైట్లను ఉచితంగా పంచింది. ఇలా ఇప్పటిదాకా 1500 మంది వాహనాలకు బ్యాటరీతో నడిచే లైట్లను అమర్చింది. లైట్లు అమర్చడానికి ‘ఇన్స్టాల్ లైట్స్ ఆన్ బైస్కిల్’ అని రాసిన ఉన్న ప్లకార్డు పట్టుకుని వీధుల్లో తిరుగుతూ ఎంతోమందికి అవగాహన కల్పించింది. అప్పట్లో ఖుషీ చేసిన ఈ పనిని ఓ ఐఏఎస్ అధికారి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అయ్యింది. ఈ విషయం తెలిసిన ఎనభైమంది యువకులు ఖుషీతో కలిసి సైకిళ్లు, ట్రక్కులకు, ఇతర వాహనాలకు లైట్లు అమర్చడంలో ఖుషీకి సాయంగా నిలిచారు. పాఠాలతో పైసలు సంపాదించి... ఖుషీ చేస్తోన్న సామాజిక కార్యక్రమాలకు నిధులు చాలా కావాలి. ఇందుకు తన తండ్రి, బంధువులు సమకూర్చిన మొత్తం ఏమాత్రం సరిపోలేదు. దాంతో యూట్యూబ్‌లో ‘లా’ తరగతులు చెప్పడంతోపాటు, ఇతర పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ్త నెలకు అరవై నుంచి డెబ్భై వేల వరకు సంపాదించి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. మహిళలకు అండగా... బాలికలకు శానిటరీ ప్యాడ్ ల గురించి అవగాహన కల్పించడం, విద్యుత్ సదుపాయం లేని వారికి సోలర్ ల్యాంప్స్ అందించడం, ‘జీవిక సాథీ’ ప్రాజెక్టు పేరుతో దివ్యాంగ మహిళలు, వితంతువులు, ఒంటరి మహిళలకు కుట్టుమిషన్, జ్యూవెలరీ తయారీలో శిక్షణ ఇప్పించి వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేయడం వంటి సేవా కార్యక్రమాలతో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. -
అతి పెద్ద గోళం.. మినుమిట్లు గొలిపే ఎల్ఈడీల మాయాజాలం (ఫొటోలు)
-
ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ ఆవిష్కారం: ఎక్కడో తెలుసా? వైరల్వీడియో
లాస్ వెగాస్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఈడీ గోళం ఆకర్షణీయంగా నిలుస్తోంది. వేగాస్ స్కైలైన్‌లో ఎల్ఈడీ లైట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో స్క్రీన్ వీడియో వైరల్ అవుతోంది. అయితే ఎంఎస్‌జీ స్పియర్ అని పిలుస్తున్న ఈ కొత్త ఆవిష్కారం సిన్ సిటీకి కొత్త అందాలతోపాటు సరికొత్త కీర్తిని తెచ్చిపెట్టింది. కొత్త పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది. పర్యాటకులు 366 అడుగుల ఎత్తైన గోళాన్ని విస్మయంతో వీక్షించారు. లాంతరు, భూమి సహా భారీ ఐబాల్, బాస్కెట్‌బాల్, స్నో గ్లోబ్, జాక్-ఓ వంటి అనేక మెస్మరైజింగ్ డిస్ప్లేలు ఉన్నాయి. The new sphere in Las Vegas is the coolest building I’ve ever seen. It features 580K square feet of fully-programmable LED lighting to produce life-like images visible from miles away. And the story behind it is wilder than the videos it creates: A THREAD 1/16 pic.twitter.com/UO7FPJK2CN — Aakash Gupta 🚀 Product Growth Guy (@aakashg0) July 9, 2023 బౌల్-ఆకారంలో 366 అడుగుల పొడవు , 516 అడుగుల వెడల్పుతో ప్రపంచంలో అత్యధిక రిజల్యూషన్ ర్యాప్‌రౌండ్ ఎల్ఈడీ స్క్రీన్‌ను రూపొందించారు. దాదాపు 1.2 మిలియన్ LED పుక్లతో రూపొందించబడిం 580,000-చదరపు అడుగులతో ప్రోగ్రాం చేసిన ఈ ఎక్సోస్పియర్ గ్లోబులో 48 వ్యక్తిగత LED డయోడ్లు ఉంటాయి. ఇది 256 మిలియన్ విభిన్న రంగులను ప్రదర్శిస్తుంది. అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఈడీ డిస్ప్లే భూమి, మార్స్ చంద్రుడిగా మారిపోతుంది. స్పేస్షిప్లాగా, అంతరిక్షం నుండి భూమిలా మెరిసిపోతుంది. గ్లోబల్ ఆర్కిటెక్చర్ సంస్థ ఎంఎస్‌జీ దీన్ని తయారు చేసింది. ఈ బిగ్గెస్ట్ ఐ బాల్ కోసం ఎంఎస్‌జీ 2.3 బిలియన్ డాలర్లను ఖర్చు చేసిందట. తన 40 ఏళ్ల సర్వీసులోఇంతటి అద్భుతాన్ని చూడలేదని స్పియర్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ రిచ్ క్లాఫీ కెప్పారు. నెవాడాలోని లాస్ వెగాస్‌లో( జూలై 04, 2023న) స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా ఇది సందడి చేసింది. సెప్టెంబర్ 29న అధికారికంగా లాంచ్‌కానుందని భావిస్తున్నారు. -
‘ఔటర్’ అందాలు అదరహో! కేటీఆర్ ట్వీట్ వైరల్
సాక్షి, పటాన్చెరు(హైదరాబాద్): ఓఆర్ఆర్ను మరిపించే రీతిలో రీజినల్ రింగ్‌రోడ్డు రానుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం రాత్రి పటాన్చెరు మండల పరిధిలోని ముత్తంగి రింగ్‌రోడ్డుపై ఎల్ఈడీ దీపాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో ఏ నగరానికి కూడా మన దగ్గర ఉన్న విధంగా 160 కిలోమీటర్ల రింగ్ రోడ్డు లేదన్నారు. ఓఆర్ఆర్పై ప్రమాదాలు జరగకుండా రెండు దశల్లో 270.5 కిలోమీటర్ల పరిధిలో 9,706 కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి.. వాటిలో 18వేల 220 ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తొందర్లోనే 340 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ను మరిపించేలా వస్తుందన్నారు. అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్ మెడికల్ డివైస్ పార్క్‌లో 50 సంస్థలకు స్థలాలు ఇచ్చామని, ఇప్పటికే ఏడు సంస్థలను ప్రారంభించామని తెలిపారు. స్థానిక యువతకు ఉపాధి దొరకాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఓఆర్ఆర్ రాకతో 80 వేల ఎకరాల స్థలంలో పరిశ్రమలను ఆహ్వానించడానికి మంచి అవకాశం వచ్చిందన్నారు. సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మరిన్ని ఉపాధి అవకాశాలు దొరికేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో చేవేళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, శాసన మండలి సభ్యుడు రాజు, జెడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, హెచ్ఎండీఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ‘ఔటర్’ వెలిగిపోతోంది సాక్షి, సంగారెడ్డి: ఓఆర్ఆర్ ఎల్ఈడీ దీపాలతో వెలిగిపోతోందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఓఆర్ఆర్పై రూ.100.22 కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ పనులను ప్రారంభించిన అనంతరం ఎల్ఈడీ దీపాలతో వెలిగిపోతున్న ఔటర్ రింగ్ రోడ్డు ఫొటోలను ట్విట్టర్లో పంచుకున్నారు. Delighted to illuminate the entire stretch of Outer Ring Road (ORR), all intersections & important sections of service roads totalling 190.5 kms with 6340 poles & 13009 LED fixtures with a cost of ₹ 100.22 Cr My compliments to @HMDA_Gov on a job well done 👍 pic.twitter.com/iQn7xQTEjA — KTR (@KTRTRS) December 16, 2021 -
ఏసీ, ఎల్ఈడీల తయారీకి పీఎల్ఐ స్కీమ్
సాక్షి, న్యూఢిల్లీ: ఎయిర్ కండీషనర్, ఎల్ఈడీ విద్యుత్తు దీపాలు వంటి వైట్ గూడ్స్ తయారీ సంస్థలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం వర్తింపచేయాలని కేంద్ర మంత్రి మండలి నిర్ణయించింది. ఇందుకోసం రూ. 6,238 కోట్లు వెచ్చించనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. అంతర్జాతీయంగా తయారీ రంగంలో భారత్ కీలక పాత్ర పోషించేందుకు పీఎల్ఐ పథకంపరమైన ప్రోత్సాహకాలు దోహదపడనున్నాయి. దీని ద్వారా విదేశీ పెట్టుబడులు రావడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడి ఎగుమతులు పెరుగుతాయని కేంద్రం ఆశిస్తోంది. వైట్ గూడ్స్ పీఎల్ఐ స్కీమ్ ప్రకారం దేశీయంగా ఏసీలు, ఎల్ఈడీ లైట్లు తయారు చేసే కంపెనీలకు అయిదేళ్లపాటు విక్రయాలపై 4 నుంచి 6 శాతం దాకా ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రస్తుతం భారత్‌లో తగినంత స్థాయిలో ఉత్పత్తి లేనటువంటి ఉత్పాదనల తయారీని ప్రోత్సహించేందుకు దీన్ని ఉద్దేశించారు. ఫినిష్డ్ గూడ్స్‌ను అసెంబ్లింగ్ మాత్రమే చేసే సంస్థలకు ఇది వర్తించదు. కొత్తగా పెట్టుబడులు పెట్టే సంస్థలకు ఈ ప్రోత్సాహకాలు అందుబాటులో ఉంటాయి. రానున్న ఐదేళ్ల కాలంలో పీఎల్ఐ పథకం వల్ల రూ. 7,920 కోట్ల పెట్టుబడులు వస్తాయని, రూ .64,400 కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అవుతాయని, ప్రత్యక్ష–పరోక్ష మార్గాల్లో రూ. 49,300 కోట్ల ఆదాయం సమకూరడమే కాకుండా 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయనేది కేంద్రం అంచనా. సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీకి .. అధిక సామర్థ్యం కలిగిన గిగా వాట్ స్థాయి సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీకి కూడా ‘నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ హై ఎఫిషియెన్సీ సోలార్ పీవీ మాడ్యుల్స్’ పేరుతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం వర్తింపజేస్తూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఇందుకు రూ. 4,500 కోట్లు ప్రోత్సాహకాలుగా వెచ్చించనుంది. దేశీయ పరిశ్రమలో సోలార్ పీవీ మాడ్యుల్స్ నిర్వహణ సామర్థ్యాలు తక్కువగా ఉన్నందున వీటి దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. అందువల్ల దేశీయంగా సామర్థ్యం పెంపు కోసం పీఎల్ఐ స్కీమ్ అమలుచేయాలని కేంద్రం నిర్ణయించింది. -
ఎల్ఈడీ లైట్లతో కరోనా ఖతం!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలను భయ భ్రాంతులకు గురిచేస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ను అంతమొందించడానికి మానవాళికి మరో ఆయుధం దొరికింది. ఎల్ఈడీ లైట్ల నుంచి వెలువడే అల్ట్రా వయలెట్ కిరణాలతో కరోనా వైరస్‌ను ఇట్టే ఖతం చేయవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించి చెబుతున్నారు. అల్ట్రా వయెలెట్ కిరణాలతో కరోనా వైరస్ చనిపోతుందని శాస్త్రవేత్తలు ఇదివరకే నిరూపించారు. అయితే ఎల్ఈడీ లైట్ల నుంచి వెలువడే అల్ట్రా వయెలెట్ కిరణాలతో కూడా వైరస్‌ను 99.9 శాతం చంపవచ్చని ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ యూనివర్శిటీ చెందిన ప్రొఫెసర్ హదాస్ మమేన్ మొదటి సారి నిరూపించారు. గదుల్లో, ఇళ్లలో కరోనా వైరస్ లేకుండా చేయడానికి వెంటిలేటర్ల వద్ద, ఏసీ గదుల్లో గాలీ పీల్చుకునే ఏసీ వెంటిలేటర్ల వద్ద ఎల్ఈడీ బల్బులను అమర్చుకోవాలని, బస్సుల్లో, రైళ్లలో, క్రీడా ప్రాంగణాల్లో శాస్త్రీయంగా ఆలోచించి ఎల్ఈడీ లైట్లను అమర్చాలని ఆయన సూచించారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న చౌక ఎల్ఈడీ బల్బులను ఉపయోగించే తాము విజయవంతంగా కరోనా వైరస్‌ను అంతం చేయగలిగామని ప్రొఫెసర్ హదాస్ మమేన్ వివరించారు. చౌకైనా ఎయర్ ప్రెషర్స్‌లో ఎల్ఈడీ లైట్లను ఉపయోగించడం ద్వారా కూడా ఈ వైరస్‌ను నిర్మూలించవచ్చని ఆయన చెప్పారు. -
ఓఆర్ఆర్.. ఫుల్ జిగేల్!
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పూర్తిగా వెలుగు జిలుగులతో తళుకులీననుంది. రాత్రి సమయాల్లో వాహనదారులు సాఫీ ప్రయాణం చేసే దిశగా హెచ్ఎండీఏ వేగిరంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వరకు దాదాపు 24 కిలో మీటర్ల పొడవునా ఎల్ఈడీ లైట్లు వెలుగులు అందుబాటులోకి తీసుకొచ్చిన అధికారులు.. మిగిలిన 136 కి.మీ మార్గంలోనూ త్వరితగతిన పనులు ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 13న ఎల్ఈడీ బల్బుల బిగింపు పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. సాక్షి, హైదరాబాద్: నగరానికే తలమానికమైన ఔటర్ రింగ్ రోడ్డు 158 కి.మీ మేర ఉంది. ఇప్పటికే గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌కు 24 కి.మీ మేర ఎల్ఈడీ బల్బుల వెలుగులు 2018 నుంచి ప్రారంభమయ్యాయి. ఇన్నాళ్లూ మిగిలిన ప్రాంతాల్లో ఎల్ఈడీ బల్బుల వెలుగులపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన అధికారులు 0 నుంచి 136 కి.మీ వరకు అంటే కోకాపేట నుంచి కొల్లూరు, పటాన్చెరు, దుండిగల్ తదితర ప్రాంతాల మీదుగా శంషాబాద్ వరకు బిగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నాలుగు ప్యాకేజీల కింద దాదాపు రూ.107.50 కోట్ల వ్యయంతో ఈ పనులను వివిధ ఏజెన్సీలకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన డిజైనింగ్ పనులకు సిద్ధమయ్యారు. దీపావళికి ముందు అధికారికంగా ప్రారంభమయ్యే పనులను దాదాపు ఏడాది వ్యవధిలోనే పూర్తి చేయనున్నారు. సుమారు 7 వేల స్తంభాలు, 14 వేల ఎల్ఈడీ బల్బులను ఇటు ఓఆర్ఆర్ మెయిన్ క్యారేజ్ వే, ఇంటర్‌చేంజ్‌లు, జంక్షన్లు, సరీ్వస్ రోడ్లు, అండర్‌పాస్‌ల్లో బిగించనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఓఆర్ఆర్ మొత్తంలో ఈ వెలుగుల పనులు పూర్తయితే దేశంలోనే తొలి ప్రాజెక్టు అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఆటోమేటిక్ లైటింగ్‌లో కూడా.. ఓఆర్ఆర్పై రాత్రి వేళలో వాహనదారుల కదలికల్ని బట్టి ఈ బల్బుల వెలుగులు ఉంటాయి. వాహనాల రాకపోకలు ఉన్న సమయంలో పూర్తిస్థాయిలో వెలుగులు ఉండేలా.. అవి లేని సమయాల్లో ఆటోమేటిక్ డీమ్ అయ్యేలా అధికారులు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటున్నారు. రిమోట్ నుంచి పనిచేసేలా చేస్తున్న ఈ వ్యవస్థ ద్వారా కూర్చున్న చోట నుంచే అంటే తమ సెల్ఫోన్ల నుంచే లైట్లు వెలుగుతున్నాయా లేదా.. ఏమైనా సమస్యలు ఏర్పడ్డాయా అనే తెలుసుకునే ‘ఆటోమేషన్’ ఉందని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. రాత్రి సమయాల్లో రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశముందని ఆశిస్తున్నారు. -
వెలుగుల మాటున వసూళ్లు!
పంచాయతీల్లో ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణకు 2017లో అప్పటి ప్రభుత్వం ఐలెట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దీపాలు ఏర్పాటు చేయించింది. 2021 వరకు దీపాల నిర్వహణ బాధ్యతను సంస్థే చూడాలి. కానీ ఈ నిబంధనను పక్కనపెట్టి పంచాయతీల నుంచి నిర్వహణ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరమ్మతుల పేరిట నిధులు కొల్లగొడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయనగరం రూరల్: పంచాయతీల్లో ఎల్ఈడీ విద్యుత్ దీపాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. జిల్లాలో 2015లో ఎల్ఈడీ ప్రాజెక్టు ప్రారంభం కాగా 2017లో విజయనగరం ఎంపీ ల్యాడ్స్ నుంచి ఎల్ఈడీ దీపాల కొనుగోళ్లు, నిర్వహణను గంట్యాడ మండలం కరకవలసకు చెందిన ఐలైట్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి అప్పగించింది. ఒక్కో ఎల్ఈడీ విద్యుత్ దీపం కొనుగోలుకు ప్రభుత్వం రూ.999లుగా ధర నిర్ణయించింది. ఎల్ఈడీ కొనుగోలుకు ఎంపీ లాడ్స్ నుంచి 70 శాతం వాటా, గ్రామ పంచాయతీల నిధుల నుంచి 30 శాతం వాటాను ఐలైట్ ఇండియా సంస్థకు చెల్లించింది. జిల్లాలోని 18 మండలాల్లో ఉన్న 463 గ్రామ పంచాయతీల్లో ఎంపీల్యాడ్స్ నుంచి 55,974 ఎల్ఈడీ బల్బులు కొనుగోలు చేసి పంచాయతీల్లో అమర్చింది. విద్యుత్ బల్బుల ఏర్పాటు, ఒప్పందం ప్రకారం 2017 నుంచి 2021 వరకు విద్యుత్ దీపాల నిర్వహణ బాధ్యత అంతా సంస్థదే. ప్రకృతి వైపరీత్యాల పేరిట డబ్బుల వసూలు.. విద్యుత్ దీపాల నిర్వహణ ఒప్పందం నాలుగేళ్లు. కానీ ఆ సంస్థ ప్రకృతి వైపరీత్యాలను కారణంగా చూపి బల్బులు పూర్తి గా పాడయ్యాయని చెప్పి ఒక్కోదానికి గ్రామ పంచాయతీల నుంచి రూ. 300 చొప్పున వసూలు చేస్తున్నట్లు అధికారు లు, గ్రామ పంచాయతీ కార్యదర్శుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక మండలంలో ఒక నెలలో 40 బల్బులు పాడయ్యాయి. వాటిని బాగుచేసేందుకు ఆ సంస్థకు అప్పగిస్తే అందులో 20 వరకు పూర్తిగా పాడైపోయాయని, ఒక్కో దానికి రూ.300లు చెల్లించాలని సంస్థ నిర్వాహకులు డిమాండ్ చేసినట్టు పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. పాడైపోయిన 20 బల్బులకు డబ్బులు చెల్లించకపోతే మిగిలినవాటిని మరమ్మతు చేయడం లేదని పంచాయతీల కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిడుగులు పడినా, చెట్టు కొమ్మలు విరిగిపడి ఎల్ఈడీ విద్యుత్ దీపాలు పాడైపోతే వాటికి వారంటీ ఇవ్వలేమని, బిల్లులు చెల్లించాల్సిందేనని నిర్వాహకులు చెబుతున్నారని పేర్కొంటున్నారు. వాస్తవంగా పాడైపోయిన దీపాలను నిర్వాహకులకు అప్పగించిన 72 గంటల్లో మరమ్మతులు చేపట్టి అందించాల్సి ఉన్నా వారు స్పందించడంలేదని పంచాయతీ కార్యదర్శులు చెబుతు న్నారు. నాటి టీడీపీ పెద్దల సహకారంతో ఈ కాంట్రాక్టును రూ. 5.50 కోట్లకు దక్కించుకున్న సంస్థ ఇప్పుడు మరమ్మతుల పేరిట అదనంగా వసూలు చేయ డం పంచాయతీలకు భారమేనని పేర్కొంటున్నారు. దీనిపై ఓ ఎంపీడీఓ ఉన్నతాధికారులకు లేఖ రాయడంతో హడావుడిగా సమావేశం ఏర్పాటు చేసి ఐలైట్ సంస్థ నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. షోకాజ్ నోటీసు జారీచేశాం ఎల్ఈడీ విద్యుత్ దీపాలు పాడైపోతే 72 గంటల్లో వాటికి మరమ్మతు చేయాల్సి ఉన్నా సంస్థ నిర్వాహ కులు సకాలంలో వాటిని అందించలేదని మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శుల నుంచి వస్తు న్న ఫిర్యాదుల ఆధారంగా షోకాజ్ నోటీసు జారీ చేశాం. ఇటీవల ఈ విషయంపై అధికారులు, ఐలైట్ సంస్థ నిర్వాహకులతో సమావేశం నిర్వహించాం. సంస్థ నిర్వాహకులు ప్రకృతి వైపరీత్యాల కారణంగా పూర్తిగా పాడైపోయిన బల్బులకు వారంటీ లేదని చెప్పారు. వారంటీ లేనివాటికి మరమ్మతులు చేపట్టలేమని చెప్పారు. – కె.సునీల్ రాజ్‌కుమార్, జిల్లా పంచాయతీ అధికారి కరోనాయే కారణం కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఏడు నెలలుగా పాడైపోయిన ఎల్ఈడీ దీపాలు బాగుచేయ డంలో ఆలస్యమైంది. మా దగ్గరకు వచ్చిన 455 బల్బులకు 276 బల్బులు బాగుచేశాం. కేవలం 179 విద్యుత్ దీపాలను మరమ్మతు చేపట్టడంలో ఆలస్యమైంది. వారంటీలో లేని విద్యుత్ దీపాలు పూర్తిగా చెడిపోతే కొత్తవి కావాలని అధికారులు అడిగితే వాటిని విక్ర యిస్తున్నాం. మరమ్మతుల పేరిట అదనపు వసూలు చేయడం లేదు. – కళ్యాణ్, ఐలైట్ సంస్థ ,నిర్వాహకుడు -
పంచాయతీలకు ‘పవర్ షాక్’
సాక్షి, హైదరాబాద్: పంచాయతీలకు ప్రభుత్వం ‘పవర్’షాక్ ఇచ్చింది. వీధి దీపాల నిర్వహణ బాధ్యతల నుంచి గ్రామ పంచాయతీలను తప్పించింది. ఈ నిర్ణయంతో స్థానిక పాలకవర్గాలు.. ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతున్నాయి. పంచాయతీల నిర్ణయాధికారాలపై ప్రభుత్వ పెత్తనమేంటని మండిపడుతున్నాయి. కరెంట్ బిల్లుల భారం తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించిన పంచాయతీరాజ్ శాఖ.. మున్సిపాలిటీల మాదిరి పంచాయతీల్లోనూ ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఎల్ఈడీ దీపాల సరఫరా, నిర్వహణలో సమర్థంగా పనిచేస్తున్న ఇంధన పొదుపు సేవా సంస్థ (ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీస్ లిమిటెడ్)తో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 12,753 గ్రామపంచాయతీల్లో ఏడేళ్ల పాటు వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను ఆ సంస్థకు అప్పగించింది. ఈ మేరకు ఈఈఎస్ఎల్ సంస్థతో త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించింది. జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో), గ్రామ పంచాయతీలు, ఈఈఎస్ ఎల్ సంస్థల మధ్య త్రైపాక్షిక ఒప్పందం చేసుకునేందుకు అంగీకరించింది. బల్బు మొదలు టైమర్ వరకు ఒప్పంద కాలంలో ఎల్ఈడీ లైట్ల నిర్వహణ బాధ్యత పూర్తిగా సంస్థదే. బల్బుల బిగింపు, నిర్వహణ, ఇంధన పొదుపులో భాగంగా టైమర్లను కూడా సంస్థనే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే కరెంట్ బిల్లులను మాత్రం స్థానిక పంచాయతీలు చెల్లించాలి. నిధుల కొరతతో బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో గ్రామపంచాయతీ ఉంటే బిల్లులను డీపీవో సర్దుబాటు చేయాలి. ఈఈఎస్ఎల్ సంస్థ పనితీరును క్రమం తప్పకుండా గ్రామపంచాయతీలు మదింపు చేయాలని, నేషనల్ లైట్స్ కోడ్ ప్రమాణాలకు అనుగుణంగా వీధి దీపాలను ఏర్పాటు చేశారో లేదో పరిశీలించాలని స్పష్టం చేసింది. పంచాయతీల్లో వీధి దీపాల నిర్వహణ పరిశీలనకు పంచాయతీరాజ్ కమిషనరేట్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సర్పంచ్‌లు.. ఈఈఎస్ఎల్ సంస్థకు పంచాయతీల్లోని వీధి దీపాల బాధ్యతలను కట్టబెట్టడాన్ని గ్రామపంచాయతీలు తప్పుపడుతున్నాయి. పంచాయతీరాజ్ చట్టం సెక్షన్–32 ప్రకారం పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ అధికారాలు సర్పంచ్‌లకు ఉంటాయని, ఆ అధికారాలకు కత్తెర పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ఈఈఎస్ఎల్ సంస్థ ఈ పనులు అప్పగించేందుకు అంగీకారం తెలుపుతూ తీర్మానాలు చేసేందుకు పంచాయతీలు ససేమిరా అంటున్నాయి. దీంతో తీర్మానాల కోసం సర్పంచ్‌లకు నచ్చజెప్పడం అధికారులకు తలనొప్పిగా మారింది. కాగా, ఈ నెల 28లోపు ఒప్పందాలు చేసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ డెడ్‌లైన్ విధించింది. అయితే ఇప్పటివరకు సిద్దిపేట, రంగారెడ్డి, నారాయణపేట, జనగామ జిల్లాలు మాత్రమే ఈ మేరకు ఒప్పంద పత్రాలు పంపాయి. మిగతా జిల్లాల్లో ఇప్పటికీ పంచాయతీల్లో తీర్మానాల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పంచాయతీరాజ్ అధికారులు తలపట్టుకుంటున్నారు. -
‘దిశ’ ఘటన; అధికారుల దిద్దుబాటు
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు తొండుపల్లి టోల్గేట్ ప్లాజా సర్వీసు రోడ్డు వద్ద ‘దిశ’పై గతేడాది నవంబర్ 27న అత్యాచారం, ఆపై చటాన్‌పల్లి అండర్‌పాస్ వద్ద మృతదేహం కాల్చివేత ఘటనతో ఉలిక్కిపడిన హెచ్ఎండీఏ ఓఆర్ఆర్ విభాగాధికారులు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. ఆ ఘటనలు జరిగిన సమయాల్లో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదన్న వాదన రావడంతో హెచ్ఎండీఏ అనుబంధ విభాగమైన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) ఓఆర్ఆర్ విభాగాధికారులు మేల్కొన్నారు. అప్పటి హెచ్‌జీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ హరిచందన దాసరి ఆదేశాలతో డిసెంబర్లో ఓఆర్ఆర్ అండర్‌పాస్‌లలో ఎల్ఈడీ, సౌర లైట్లు అమర్చేందుకు టెండర్లు పిలిచారు. 158 కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఓఆర్ఆర్కు ఉన్న 165 అండర్‌పాస్ వేలలో రూ.1.90 కోట్ల వ్యయంతో పూర్తిస్థాయిలో విద్యుద్దీకరణ పనులు చేపట్టారు. బుధవారం నుంచి అన్నిచోట్లా ఈ వెలుగులు విరజిమ్ముతాయని అధికారులు చెబుతున్నా, కొన్నిచోట్లా మాత్రం ఇంకా పనులు పూర్తికాలేదని కిందిస్థాయి సిబ్బంది అంటున్నారు. ఏదేమైనా దిశ ఘటనతో అధికారులు మేల్కొని రాత్రివేళల్లో వెలుగులు ఉండేలా చూడటం శుభ పరిణామమని వాహ నదారులు అంటున్నారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయని, మహిళల భద్రతకు ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. -
మళ్లీ పంచాయతీలకే వీధి దీపాలు
సాక్షి, అమరావతి: గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను తిరిగి గ్రామ పంచాయతీలకు అప్పగించనున్నారు. వీధి దీపాల పర్యవేక్షణ పంచాయతీల ఆధీనంలోనే ఉండాల్సినా టీడీపీ హయాంలో దీన్ని పైవేట్‌పరం చేశారు. ట్యూబులైట్ల స్థానంలో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది. ఎల్ఈడీ బల్బులు మాడిపోతే మార్చడం, సక్రమంగా వెలిగేలా చూసే బాధ్యతను ప్రైవేట్ సంస్థలే నిర్వహించేలా ఒప్పందాలు జరిగాయి. ఒక్కో ఎల్ఈడీ దీపానికి ఏటా రూ. 450 – రూ. 600 చొప్పున సంబంధిత గ్రామ పంచాయతీ ప్రైవేట్ సంస్థకు పదేళ్ల పాటు చెల్లించాలనేది ఒప్పందంలో ప్రధాన నిబంధన. రాష్ట్రంలో 13,065 గ్రామ పంచాయతీలు ఉండగా 11,032 పంచాయతీల్లో ఈ పనులను ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తున్నాయి. పగలే వెలుగుతున్న లైట్లు: గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ ప్రైవేట్ పరం చేసిన తర్వాత పట్టపగలు కూడా లక్షల సంఖ్యలో లైట్లు వెలుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల పరిధిలో 23.90 లక్షల కరెంట్ స్థంభాలు ఉండగా 27,65,420 వీధి దీపాలున్నాయి. వీటిల్లో 2,29,194 వీధి దీపాలు నిరంతరాయంగా 24 గంటలూ వెలుగుతున్నాయని గుర్తించారు. మరోవైపు 2,77,324 వీధి దీపాలు అసలు వెలగటం లేదని పంచాయతీరాజ్ కమిషన్ కార్యాలయానికి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టింది. ఎనర్జీ అసిస్టెంట్లకు బాధ్యత: వీధి దీపాలను రోజూ సాయంత్రం వెలిగించడం, తెల్లవారు జామున తిరిగి ఆఫ్ చేసే బాధ్యతను ప్రైవేట్ సంస్థల నుంచి తప్పించి గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఎనర్జీ అసిస్టెంట్లకు అప్పగించాలని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. వారం పది రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. -
ఓటీ లైట్లు మళ్లీ ఫెయిల్
సాక్షి,సిటీబ్యూరో: నిమ్స్‌లో మరోసారి న్యూరో సర్జరీ చికిత్సలు నిలిచిపోయాయి. ఆపరేషన్ థియేటర్లో రెండు లైట్లు ఉండగా, ఇప్పటికే ఒక లైటు పనిచేయడం లేదు. బుధవారం రెండో లైటు కూడా వెలగకపోవడంతో సర్జరీలను నిలిపివేశారు. రూ.లక్షన్నర కూడా ఖరీదు చేయని ఈ లైట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాల్సిన ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా బుధవారం శస్త్రచికిత్స కోసం ఆపరేషన్ థియేటర్ వద్దకు తీసుకొచ్చిన రోగులను తిరిగి వార్డులకు తరలించారు. ఇక్కడి న్యూరోసర్జరీ విభాగంలో నాలుగు ఆపరేషన్ థియేటర్ టేబుళ్లు ఉండగా, వీటిలో ఇప్పటికే రెండు (ఓటీ–3, ఓటీ–4) పనిచేయడం లేదు. తాజాగా మరో థియేటర్లో లైట్లు ఫెయిలవడంతో సర్జరీలను వాయిదా వేశారు. తలకు గాయాలై, మెదడులో రక్తం గడ్డకట్టిన బాధితులు, న్యూరో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి సమయానికి శస్త్ర చికిత్సలు చేయక పోవడంతో రోగులు ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు సాంకేతిక నిపుణులను పిలిపించి సాయంత్రం ఆపరేషన్ థియేటర్లలో మరమ్మతులు చేయించారు. -
ఎల్ఈడీ లైట్లు.. జీపీఎస్ సౌకర్యం
హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం ఇకపై ప్రయాణికులకు గొప్ప అనుభూతిని మిగల్చనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే గోదావరి ఎక్స్‌ప్రెస్ బోగీల్లో ఇకపై ఎల్ఈడీ లైట్లు, జీపీఎస్ సౌకర్యాలతో పాటు అదనపు హంగులు జతచేరనున్నాయి. పీయూష్ గోయల్ నేతృత్వంలోని భారతీయ రైల్వే చేపట్టిన ఉత్కృష్ట ప్రాజెక్టులో భాగంగా వివిధ రైళ్లలో వినూత్నమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీనిలో భాగంగానే గోదావరి ఎక్స్‌ప్రెస్‌లోని 24 బోగీలను అంగరంగ వైభవంగా తీర్చిదిద్ది ప్రారంభించినట్లు సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ అమిత్ వర్ధన్ సర్క్యులర్ విడుదల చేశారు. ఉత్కృష్ట ప్రాజెక్టులో భాగంగా 2018–19 సంవత్సరంలో మొత్తం మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని 640 బోగీలను వివిధ హంగులతో పునరుద్ధరించనున్నారు. తొలి విడతలో భాగంగా 140 బోగీలను.. రెండవ విడతలో మిగిలిన 500 బోగీలను సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రతి బోగీకి రూ. 60 లక్షలు కేటాయించారు. ఈ ఏడాది మార్చిలోగా ప్రాజెక్టును పూర్తిచేయాల్సి ఉంది. – సాక్షి, హైదరాబాద్ ఉత్కృష్ట ప్రాజెక్టులో భాగంగా అమర్చనున్న కొత్త సొగసులు.. ►కలర్ స్కీంలో భాగంగా రొటీన్ ఎరుపు, పసుపు రంగుల్లో కాకుండా అందమైన పోలీయురిథేన్ (పీయూ) పెయింటింగ్‌లో రైలు బోగీలు ప్రయాణికులను ఆకట్టుకోనున్నాయి. ►బోగీల్లో జీపీఎస్ సదుపాయంతో ఎల్ఈడీ ఇండికేషన్ బోర్డ్‌లు, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంటాయి. ►అన్ని బోగీల్లో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తారు. ►టాయిలెట్లు, డోర్లు, బెర్త్‌ల మధ్యన, బోగీల లోపల అంతా అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. ►అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు మంటలను ఆర్పే సాధనాలు అన్ని చోట్లా అందుబాటులో ఉంటాయి. అలాగే రైళ్లలోని వాష్బేసిన్లన్నీ స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేసినవి అమరుస్తారు. ► తడిని పీల్చేలా, పొడిగా, పరిశుభ్రంగా ఉండేందుకు టాయిలెట్స్‌లో సైతం పాలిమెరైజ్డ్ ఫ్లోరింగ్ ఏర్పాటు చేస్తారు. ► బెర్త్‌లు సైతం మరింత సౌకర్యవంతంగా తయారు చేస్తున్నారు. -
జిగేల్ సిగ్నల్స్
సాక్షి, సిటీబ్యూరో: ‘సైఫాబాద్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన ద్విచక్ర వాహనంపై మెహిదీపట్నం వైపు వెళ్తున్నాడు. మాసబ్‌ట్యాంక్ చౌరస్తా వద్ద ఓ బస్సు వెనుక ఉండి డ్రైవ్ చేస్తున్నాడు. దీంతో ఇతడికి సిగ్నల్ స్తంభం తప్ప దానికి ఉండే రెండు సిగ్నల్స్ కనిపించలేదు. అప్పటి వరకు ‘గ్రీన్’గా ఉన్న సిగ్నల్ హఠాత్తుగా ‘రెడ్’గా మారింది. ముందు బస్సుతో పాటే వెళ్తున్న ఇతడికి జంక్షన్ అవతల వైపు ఉన్న ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని చలానాతో పాటు పెనాల్టీ పాయింట్ సైతం విధించారు.’ సిటీలో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్‌తో అనేక మంది ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కచ్చితంగా నిబంధనలు పాటించే వారైనా, తమ తప్పు లేకపోయినా జరిమానాతో పాటుపెనాల్టీ పాయింట్ తప్పట్లేదు. దీన్ని పరిగణలోకి తీసుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ట్రాఫిక్ సిగ్నల్స్‌కు ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద అమలులోకి తీసుకువచ్చారు. కొన్నాళ్ల అధ్యయనం తర్వాత మార్పుచేర్పులు చేస్తూ అన్ని జంక్షన్లలోనూ అమలులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. ఆ ఉల్లంఘన ప్రమాదకరం కావడంతో... సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు రహదారి నిబంధనల ఉల్లంఘనల్ని మూడు రకాలుగా విభజిస్తారు. వాహనచోదకుడికి ప్రాణాంతకమైనవి, ఎదుటి వ్యక్తికి ప్రాణాంతకమైనవి, వాహనచోదకుడితో పాటు ఎదుటి వ్యక్తికీ ప్రాణాంతకమైనవి. సిగ్నల్ జంపింగ్ అనేది ఈ మూడో కేటగిరీ కిందికి వస్తుందని పోలీసులు చెప్తున్నారు. ఓ వాహనచోదకుడు చేసిన తప్పువల్ల నిబంధనలు పాటించే ఎదుటి వ్యక్తి నష్టపోయే ప్రమాదం ఉందని, అందుకే ఇలాంటి నిబంధనల్ని కచ్చితంగా అమలు చేస్తామని అంటున్నారు. అయితే ప్రస్తుతం సిటీలో ఉన్న సిగ్నల్ స్తంభాల్లో రెండు చోట్ల మాత్రమే సిగ్నల్ లైట్లు ఉంటున్నాయి. రోడ్డుకు కుడి పక్కన ఉండే స్తంభం మధ్య భాగంలో, దానికి పైన రోడ్డు మధ్యలోకి వచ్చే విధంగా మరోటి (థర్సర్ సిగ్నల్) మాత్రమే ఉంటున్నాయి. దీంతో ముందు వరుసలో పెద్ద వాహనాలు ఉండే వెనుక వారికి ఆ సిగ్నల్స్ కనిపించవు. ఫలితంగా వారి తప్పు లేకుండానే ఉల్లంఘనులుగా మారిపోతున్నారు. ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసి... ఈ తరహా ఉదంతాలను పరిగణలోకి తీసుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం సిగ్నల్ లైట్లు మాత్రమే కాకుండా స్తంభం కూడా ఏ రంగు సిగ్నల్ ఉందో చూపే విధంగా చేయాలని యోచించారు. ఇలా చేస్తే లైట్లు కనిపించకున్నా స్తంభాన్ని చూసైనా ముందుకు వెళ్లొచ్చా? లేదా? అనేది వాహన చోదకులు నిర్ధారించుకోవచ్చని ఓ ఆలోచన చేశారు. సిగ్నల్ స్తంభానికి రెండు ప్రాంతాల్లో ఉండే లైట్ల మధ్యలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు వీటిని సిగ్నల్‌తో అనుసంధానిస్తున్నారు. ఫలితంగా రెడ్ సిగ్నల్ పడితే ఈ ఎల్ఈడీ లైట్లు ఆ రంగులో, గ్రీన్ పడితే ఆ రంగులోకి మారతాయి. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద ఆయకార్ భవన్ నుంచి కమిషనరేట్‌కు వెళ్లే సిగ్నల్‌కు ఏర్పాటు చేశారు. అధ్యయనం తర్వాత వీటిని విస్తరించనున్నారు. ఇలా చేయడంతో సుదూర ప్రాంతాల్లో ఉన్న వారికీ ఇక సిగ్నల్ కనిపిస్తుందని, పొరపాటున జరిగే ఉల్లంఘనులకు చెక్ చెప్పడం, ప్రమాదాలు తగ్గించడానికి ఇది ఉపకరిస్తుందని అధికారులు చెబుతున్నారు. -
ఓఆర్ఆర్.. ఇక జిగేల్!
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై ఇక పూర్తి స్థాయిలో ఎల్ఈడీ వెలుగులు విరజిమ్మనున్నాయి. ఇప్పటికే 24.38 కిలోమీటర్ల మేర శంషాబాద్–గచ్చిబౌలి మార్గంలో అమర్చిన ఎల్ఈడీ బల్బులు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు బాగా తోడ్పడ్డాయి. దీంతో మిగిలిన 133.62 కిలోమీటర్లలోనూ పూర్తి స్థాయిలో ఎల్ఈడీ వెలుగులు తీసుకొచ్చే దిశగా హెచ్ఎండీఏ అడుగులు వేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరునాటికి ఓఆర్ఆర్ పూర్తిస్థాయిలో ఎల్ఈడీ వెలుగుల్లో కనపడాలని సీఎస్ ఎస్కే జోషి ఆదేశాలిచ్చారు. ఈ మేరకు రూ.107 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. చెన్నైకి చెందిన శబరి ఎలక్ట్రికల్, హైదరాబాద్‌కు చెందిన కేఎంవీ ప్రాజెక్ట్స్ కంపెనీలు ఇందుకు పోటీపడుతున్నాయి. మరో వారం రోజుల్లో టెండర్ ఫైనల్ చేసి పనులు ప్రారంభించేలా హెచ్ఎండీఏ అధికారులు చొరవ తీసుకుంటున్నారు. అంటే టెండర్ నియమ నిబంధనల ప్రకారం 15 నెలల్లో ఎల్ఈడీ లైట్ల బిగింపు పనులు పూర్తి చేయాలి. పదివేలకుపైగా బల్బులు... శంషాబాద్ ముగింపు ప్రదేశం నుంచి కోకాపేట ముగింపు ప్రదేశం వరకు కిలోమీటర్‌కు 40 స్తంభాల చొప్పున అంటే 133.62 కిలోమీటర్లకు 5,345 స్తంభాలను ఏర్పాటుచేయనున్నారు. అలాగే ఒక్కో స్తంభానికి రెండు లైట్ల చొప్పున 10,690 లైట్లు బిగించనున్నారు. మెయిన్ క్యారేజ్ వే, జంక్షన్ల మొదలుకొని అన్ని ప్రాంతాల్లో వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. కిలోమీటర్న్నరకు ఒక్కో కంట్రోల్ బాక్స్‌ను కూడా ఏర్పాటుచేయనున్నారు. ఇప్పటికే గతేడాది జూన్ నెలలో 24.38 కిలోమీటర్ల ఓఆర్ఆర్ శంషాబాద్–గచ్చిబౌలి మార్గంలో ఫిలిప్స్ కంపెనీ ఎల్ఈడీ వెలుగులు అందుబాటులోకొచ్చిన సంగతి తెలిసిందే. మిగిలిన 133.62 కిలోమీటర్ల పనులు వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పనులు దక్కించుకున్న సంస్థ పూర్తి చేసే అవకాశముంది. ఆటోమేటిక్ సిస్టం... గచ్చిబౌలి నుంచి శంషాబాద్ మార్గంలో ప్రస్తుతం పనిచేస్తున్న జీఎస్ఎం ఆధారంగా ఆటోమేషన్ సిస్టమ్, వెబ్ బేస్డ్ మేనేజ్మెంట్తో ఎల్ఈడీ లైటింగ్ వ్యవస్థను పనిచేసేలా అధికారులు తీర్చిదిద్దనున్నారు. ఎల్ఈడీ బల్బుల వల్ల విద్యుత్ ఖర్చు తక్కువ కావడంతో పాటు ముందు వెళ్లే వాహనాలు స్పష్టంగా కనిపిస్తాయి. సెన్సర్ల సహాయంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఎల్ఈడీ బల్బులు దేదీప్యమానంగా వెలుగుతాయి. రద్దీ లేనప్పుడు దానంతటే అదే 50 శాతం వెలుగు తగ్గిపోతుంది. ఫలితంగా విద్యుత్ బిల్లులు తగ్గనున్నాయి. ఎల్ఈడీ దీపాల నిర్వహణ ఎలా ఉంది...సరిగ్గా ఉందా లేదా అనే తదితర అంశాలను అధికారులు ఆన్లైన్ ద్వారా పర్యవేక్షించే వెసులుబాటుంది. స్తంభాలకున్న జంక్షన్ బాక్సులను ఎవరైనా తెరిచిన...తస్కరించినా...విద్యుత్ చౌర్యం చేసినా వెంటనే ఆ సమాచారం సంబంధిత అధికారులు, హెచ్ఎండీఏ అధికారులకు తెలిసిపోయేలా ఏర్పాట్లు చేయనున్నారు. రాత్రివేళ ప్రయాణం సేఫ్... అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులోకి వచ్చిన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై రాత్రి ప్రయాణమంటే ప్రాణంతో చెలగాటం. రహదారిపై వాహనాలు నిలిపి ఉండటంతో చీకట్లో దగ్గరకు వచ్చేవరకు ఎదుటి వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగిన ఘటనలు అనేకం. వేగాన్ని అదుపుచేయలేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అయితే దీనంతటికి కారణం ఓఆర్ఆర్లో రాత్రి సమయాల్లో వెలుతురు లేకపోవడమనే రెండేళ్ల క్రితం గుర్తించిన హెచ్ఎండీఏ అధికారులు గతేడాది గచ్చిబౌలి–శంషాబాద్ మార్గంలో ప్రయోగాత్మకంగా ఎల్ఈడీ బల్బులు అమర్చారు. దీనివల్ల ఆ మార్గంలో ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. సురక్షిత ప్రయాణం కోసమే... ఔటర్‌పై రోజుకు ప్రయాణించే వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. గతేడాది 76 వేల వాహనాలుంటే ఇప్పుడది లక్షకు చేరుకుంది. రద్దీ సమయాల్లో రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరిగి రోడ్లు నెత్తురోడుతున్నాయి. లైటింగ్ వ్యవస్థ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి ఎల్ఈడీ లైటింగ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. ఇందులో భాగంగానే గచ్చిబౌలి–శంషాబాద్ మార్గంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేసిన ఎల్ఈడీ లైటింగ్ సత్ఫలితాలనిచ్చింది. దీంతో ఈ వెలుగుల ప్రక్రియను మిగిలిన 133.62 కిలోమీటర్లలోనూ చేపడుతున్నాం. – టి.చిరంజీవులు,హెచ్ఎండీఏ కమిషనర్ -
బ్యాటరీ ‘విప్పి’ చూడ బంగారముండు!
సాక్షి, హైదరాబాద్: విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా చేసే ముఠాలు నానాటికీ తెలివి మీరుతున్నాయి. ఎల్ఈడీ లైట్ బ్యాటరీల లోపలి భాగంలో బంగారం ప్లేట్లను అమర్చి, స్కానింగ్‌కు సైతం చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటూ స్మగ్లింగ్ చేస్తున్నాయి. ఈ పంథాలో ఎనిమిది పసిడి రేకుల్ని తీసుకువచ్చిన ఓ వ్యక్తిని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఇతడి నుంచి రూ.14 లక్షల విలువైన 445 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు శుక్రవారం వెల్లడించారు. దుబాయ్‌కు చెందిన ఓ ముఠా బంగారాన్ని అక్రమ రవాణా చేసేందుకు తాజాగా ఎంచుకున్న మార్గమే ఎల్ఈడీ బ్యాటరీ. బంగారాన్ని స్మగ్లర్లు మందమైన రేకులుగా మార్చారు. దీన్ని రీ–చార్జబుల్ లాంతర్ లైట్ లోపల ఉండే బ్యాటరీల్లో అమర్చారు. ఆ లైట్‌ను స్కానింగ్ చేసినా పసిడి ఆచూకీ దొరక్కుండా బంగారు రేకుల చుట్టూ నల్లరంగు పొడి ఏర్పాటు చేశారు. ఈ లైట్‌ను గురువారం దుబాయ్ విమానాశ్రయానికి తీసుకువచ్చిన స్మగ్లర్లు హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి అప్పగించారు. అతడికి ఎలాంటి వివరాలు చెప్పకుండా ఆ లైట్‌ను తీసుకుని హైదరాబాద్ వెళ్లాలని, అక్కడ తమ వారు వచ్చి తీసుకుంటారని పంపారు. దీనికి ప్రతిఫలంగా కొంత మొత్తం చెల్లించారు. బండారం బయటపడిందిలా: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో వచ్చిన ఈ క్యారియర్ గురువారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అనుమానాస్పదంగా ఉన్న అతన్ని కస్టమ్స్ అధీనంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని బ్యాగ్‌లో ఉన్న ఎల్ఈడీ లైట్‌ను పరిశీలించగా.. బ్యాటరీల తీరులో మార్పులు కనిపించాయి. వాటిని పగులగొట్టి చూడగా.. లోపల నల్లటి పొడితో కప్పి ఉంచిన బంగారం రేకులు బయటపడ్డాయి. క్యారియర్‌ను విచారించగా తనకు దాన్ని ఇచ్చిన వారితో పాటు తీసుకునే వారి వివరాలు సైతం తెలియవన్నాడు. అయితే దీని వెనుక పెద్ద రాకెట్ ఉండి ఉంటుందని కస్టమ్స్ అధికారులు అనుమానిస్తున్నారు. -
ఎల్ఈడీతో ఇంటి అందం రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: ట్యూబ్‌లైట్లు, సీఎఫ్ఎల్ బల్బులకు కాలం చెల్లింది. వెలుతురుతో పాటూ ఇంటి అందాన్ని రెట్టింపు చేసే జాబితాలో లైట్ ఎమిటింగ్ డయోడ్ (ఎల్ఈడీ) లైట్లు చేరాయి. సెల్‌ఫోన్ నుంచి కూడా ఆపరేటింగ్ చేసుకునే వీలుండటం వీటి ప్రత్యేకత. బల్బు, ట్యూబ్‌లైట్లలో డే లైట్, వామ్ లైట్ అనే రెండు రంగులు మాత్రమే ఉంటాయి. అదే ఎల్ఈడీ లైట్లలో మనం కోరుకున్న రంగు మార్కెట్లో దొరుకుతుంది. అంతేకాదు ఇంట్లో గదిని బట్టి, ఆయా రోజును బట్టి కూడా లైట్ రంగును మార్చుకోవచ్చు కూడా. ఈమధ్య కాలంలో నగర వాసుల్లో ఈ విధమైన అభిరుచి బాగా పెరిగిపోయింది. పూజ గదిలో ఎరుపు, గార్డెనింగ్‌లో ఆకుపచ్చ, పడక గదిలో నీలం, హాల్లో వామ్ లైట్, స్టడీ రూంలో డే వైట్ లైట్, ఆఫీసుల్లో ప్యూర్ వైట్, జువెల్లరీ, బట్టల దుకాణాల్లో వామ్ లైట్, రెస్టారెంట్లు, పబ్బుల్లో నీలం, ఎరుపు, ఆరెంజ్ రంగులను ఎక్కువగా వినియోగిస్తారు. రోజుకో రంగు..: రోజును బట్టి ఇంట్లో లైట్ రంగును మార్చుకోవాలనే అభిరుచి కూడా నగరవాసుల్లో ఈమధ్య బాగా పెరిగిపోయింది. ఇందుకు తగ్గట్టుగానే ఒకే ఎల్ఈడీ లైట్‌తో రోజుకో రంగును వెదజల్లేలా సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. సోమవారం– ఎరుపు, మంగళవారం– ఆకుపచ్చ, బుధవారం– నీలం, గురువారం– వామ్ లైట్, శుక్రవారం– పర్పుల్, శనివారం– ఆరెంజ్, ఆదివారం– తెలుపు రంగులను ఎంపిక చేసుకునేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. సెల్‌ఫోన్ నుంచే ఆపరేటింగ్..: ప్రస్తుతం ఎల్ఈడీ లైట్లలో లైట్ ఆటోమిషన్ ట్రెండ్ నడుస్తోంది. ఈ రకమైన ఎల్ఈడీ లైట్లు గదిలోకి రాగానే దానంతటదే లైట్ ఆన్ అవుతుంది. వెళ్లిపోగానే ఆఫ్ అవుతుంది. టీవీ సౌండ్ పెంచినట్టుగా రిమోట్ సహాయంతో లైట్ వెలుతురు (లుమిన్స్)ను ఎక్కువ, తక్కువ చేసుకోవచ్చు కూడా. ఇక వెబ్ బేస్డ్ సొల్యుషన్స్ ఎల్ఈడీ లైట్లయితే ఇంటర్నెట్ సహాయంతో ఐ–ఫోన్, ఐప్యాడ్ల నుంచే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇవి ఎక్కువగా రెస్టారెంట్లు, పబ్బులు, గేమింగ్ జోన్లు, థియేటర్లు, షామింగ్ మాళ్లులో వినియోగిస్తుంటారు. ధర ఎక్కువైనా..: బల్బు, సీఎఫ్ఎల్, ట్యూబ్‌లైట్లతో పోల్చుకుంటే ఎల్ఈడీ లైట్ల ధర కాస్త ఎక్కువే. కానీ, విద్యుత్ వినియోగం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. 18 ఓల్టుల ఎల్ఈడీ లైట్ ధర రూ. 1,500–1,800 మధ్య ఉంటుంది. 1,000 చ.అ. ఇంటికి రూ. 8 లక్షలతో వెబ్ బేస్డ్ సొల్యుషన్స్ ఎల్ఈడీ లైట్లను అమర్చుకోవచ్చు. 300 గజాల ఇండిపెండెంట్ హౌజ్ గార్డెనింగ్‌కు రూ. 3 లక్షలు ఖర్చవుతుంది. ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఫంక్షన్ హాల్‌కు రూ. 40 లక్షలు, షాపింగ్ మాళ్లకు చదరపు అడుగుకు రూ. 500 నుంచి రూ. 1,000 వరకు ఖర్చవుతుంది. -
ఈ వెలుగులు ఆ ప్రస్థానానికే...
అక్కడ స్విచ్ వేస్తేనే... ఇక పల్లెకు వెలుగులు. అదెలాఅనుకుంటున్నారా? కమాండ్ కంట్రోల్ సిస్టమ్ద్వారానేజిల్లా కేంద్రం నుంచి నియంత్రణ మొదలవుతుంది.ఇందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఎలక్ట్రిసిటీ ఎఫీషియెన్సీ లిమిటెడ్ సిద్ధమవుతోంది. జిల్లాలోని ప్రతి పల్లెలోనూ ఇక ఎల్ఈడీల ఏర్పాటు ముమ్మరమవుతోంది.ఎక్కడ దీపం వెలగకున్నా... కమాండ్ కంట్రోల్ సిస్టమ్గుర్తిస్తుంది. తక్షణం దాని పునరుద్ధరణకు తగు సూచనలిస్తుంది. అంతేనా... బిల్లులు చెల్లించని పంచాయతీలకుసరఫరా నిలిపివేసేందుకు కూడా ఈ విధానం దోహదపడనుంది. విద్యుత్‌బిల్లులు సకాలంలో వసూలు కావాలంటేఇలాంటి నియంత్రణ ఇక అనివార్యమేమో... సాక్షిప్రతినిధి, విజయనగరం: జిల్లాలోని పంచాయతీల్లో వీధి దీపాలకు ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. మూడేళ్లుగా వరుసగా 14వ ఆర్థిక సంఘం, ఎంపీల్యాడ్స్ నిధులతో జిల్లాలోని 594గ్రామాల్లో ఇప్పటికే ఎల్ఈడీలను ఏర్పాటు చేశారు. మరో 326 గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు ఎలక్ట్రిసిటీ ఎఫీషియెన్సీ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) సిద్ధమవుతోంది. ఈ దీపాలను నియంత్రించేందుకు, పర్యవేక్షించేందుకు జిల్లా కేంద్రమైన విజయనగరంలో కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల విద్యుత్ బకాయిల వసూళ్లకు కూడా అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం ఏర్పాటు చేసిన దీపాల్లో చాలా వరకూ పనిచేయడం లేదు. వాటిని మరమ్మతు చేయడానికి కూడా ఎవరూ ప్రయత్నించడం లేదు. కమాండ్ కంట్రోల్ విధానం అమలులోకి వస్తే ఈ పరిస్థితిలోనూ మార్పు వచ్చే అవకాశం ఉంది. నగరం నుంచే వీధిలైట్ల నియంత్రణ జిల్లాలో 920 పంచాయతీల్లో ఎల్ఈడీ వీధి లైట్లు ఏర్పాటు పూర్తి చేసిన తర్వాత వాటిని జిల్లా పరిషత్, కలెక్టరేట్లో ఏర్పాటు చేసే కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌కు అనుసంధానిస్తారు. వాటిని ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. ఏయే లైట్లు వెలుగుతున్నాయి. ఏయే లైట్లు వెలగడం లేదు. గ్రామాల్లోని వీధి లైట్ల సంఖ్యను అనుసరించి కమాండ్ కంట్రోల్ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమయిన టీసీఎంఎస్ బాక్సులను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో గ్రామంలో తక్కువగా ఉంటే ఓ టీసీఎంఎస్ బాక్స్‌ను ఏర్పాటు చేస్తారు. అదే పెద్ద గ్రామమయితే అక్కడి అవసరాన్ని బట్టి రెండు నుంచి నాలుగు బాక్సులు అవసరమవుతాయని చెబుతున్నారు. ఫ్రీక్వెన్సీని గ్రహించే దూరాన్ని బట్టి ఈ టీసీఎంఎస్ బాక్సులను ఏర్పాటు చేస్తారు. ఎన్ని మార్చాల్సి ఉందన్న విషయాలు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సిబ్బంది తెలుసుకుని ఆయా ఏజెన్సీలను అప్రమత్తం చేస్తారు. వెంటనే ఆయా గ్రామాల పరిధిలో ఉండే సిబ్బంది వెళ్లి లైట్లకు మరమ్మతులు చేయడం లేదా కొత్తవి ఏర్పాటు చేయడం చేస్తారు. బిల్లులు చెల్లించకుంటే కట్! పంచాయతీల్లో ఉన్న వీధి లైట్లకు అయ్యే విద్యుత్ చార్జీలను చెల్లించేందుకు సర్పంచ్‌లు, విద్యుత్ శాఖాధికారుల మధ్య గతంలో వివాదాలు నడిచేవి. గతంలో ప్రభుత్వం చెల్లించే వీధిలైట్ల విద్యుత్ బిల్లులను ఇప్పుడు నిధుల్లేని గ్రామ పంచాయతీలు చెల్లించాల్సిందేనని టీడీపీ ప్రభుత్వం వచ్చాక రూల్స్ మార్చింది. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 83,013 విద్యుత్ స్తంభాలుంటే వాటిలో 75,047 స్తంభాలకు వీధిలైట్లను నిర్వహిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. విద్యుత్ శాఖకు జిల్లాలోని మైనర్ పంచాయతీలు రూ.21.29 కోట్లు, మేజర్ పంచాయతీలు రూ. 2.50 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. 2017–18 బకాయిలే రూ.10.35 కోట్లు కాగా వాటిలో కేవలం రూ.5.43 కోట్లు వసూలు చేయగలిగారు. ఇలా ఏటా సగానికిపైగా బకాయిలు పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయి. -
తిరుమలలో ఎల్ఈడీ కాంతులు
తిరుపతి అర్బన్: తిరుమలలో మరింత మెరుగైన విద్యుత్ వెలుగులు నింపే క్రమంలో రానున్న ఫిబ్రవరి నాటికి మొత్తం ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశించారు. వివిధ టీటీడీ పథకాలు, అభివృద్ధి పనులపై శనివారం ఆయన సీనియర్ అధికారులతో సమీక్షించారు. ఈఓ మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలోనూ విద్యుత్ అలంకరణలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వెండివాకిలి ప్రాకారంలోని శ్రీనివాస కల్యాణం చిత్రాలకు ప్రత్యేక లైట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల ద్వారా తిరుమలకు చేరుకునే కాలిబాట భక్తులకు మరింత పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలిపిరి కాలిబాట మార్గంలోని లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం వద్దనుంచి మోకాలిమిట్ట వరకు రోడ్డుపై ఉన్నందున భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు రాకుండా చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. అదే విధంగా కాలిబాట మార్గాల్లో భక్తులు జారిపడకుండా తగిన ఏర్పాట్లు తీసుకోవాలన్నారు. ఆలయంలో భక్తులు తడవకుండా.. తిరుమల ఆలయంలోని మహద్వారం నుంచి ధ్వజస్తంభం వరకు రిట్రాక్టబుల్ రూఫింగ్‌ను ఏర్పాటు చేసి భక్తులు వర్షంలో తడవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రసాదాలు స్వీకరించే ప్రాంతంలోని కొళాయిల వద్ద పారిశుద్ధ్యం మెరుగుపరచాలని, జారిపడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైతే పారిశుద్ధ్య సిబ్బందిని పెంచుకోవాలన్నారు. వేడినీటితో శుభ్రం చేసే యంత్రాలను వినియోగించేందుకు అనువైన చర్యలు తీసుకోవాలన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో క్యూలపై అధ్యయనం చేసి భక్తులు సౌకర్యంగా దర్శనానికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సీవీఎస్ఓ రవికృష్ణకు సూచించారు. శ్రీవారి ఆలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఇతర ప్రాంతాల్లో జనవరి నాటికి ఎలక్ట్రికల్ వైరింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. ఘాట్రోడ్ల ద్వారా రాకపోకలు సాగించే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొండ చరియలు విరిగిపడకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలిపారు. చరియలు విరిగిపడే ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి తక్షణం చర్యలు చేపట్టాలన్నారు. పరకామణి విభాగంలో లెక్కింపు మినహా మిగిలిన అన్ని కార్యక్రమాలు ఔట్సోర్సింగ్ వారిద్వారా చేయించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో తిరుమల, తిరుపతి జేఈఓలు శ్రీనివాసరాజు, పోల భాస్కర్, చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డి, తిరుపతి ఎస్టేట్ ఆఫీసర్ గౌతమి, సీవీఎస్వో ఆకె రవికృష్ణ, విద్యుత్ విభాగం అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. -
జహీరాబాద్ ఇక జిగేల్
సంగారెడ్డి, జహీరాబాద్: జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో ఎల్ఈడీ బల్బులను బిగించే ప్రక్రియకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సర్వే పూర్తి చేసిన ఐదు నెలల తర్వాత మున్సిపల్ అధికారులు బల్బులను బిగించే పనులను సోమవారం సాయంత్రం చేపట్టారు. ఎల్ఈడీ బల్బులను బిగించడం ద్వారా విద్యత్ ఖర్చు సగానికి సగం తగ్గుతుంది. మున్సిపల్ పరిధిలో వీటిని బిగించేందుకు వీలుగా డిమాండ్ సర్వే చేపట్టారు. సీడీఎంఏ (కమిషనర్ ఆఫ్ డైరెక్టరేట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) ద్వారా ఈపథకాన్ని అమలు చేసేందుకు ఈఈఎస్ఎల్ (ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్) ముందుకు వచ్చింది. మున్సిపల్ పరిధిలో అవసరమయ్యే బల్బుల ఖర్చును సదరు సంస్థే భరిస్తుంది. బల్బులను బిగించడం, పాడైన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం లాంటి పనులను సైతం వారే చూసుకుంటారు. ఇందు కోసం పని చేసే సిబ్బంది వేతనాల కింద 30 శాతం మేర మున్సిపాలిటీ ఈఈఎస్ఎల్కు చెల్లించాల్సి ఉంటుంది. ఇది పోను 70 శాతం మున్సిపాలిటీకి మిగులుబాటు అవుతుందనేది ఈ పథకం అంచనా. పూర్తయితే రూ.2లక్షల మేర మిగులుబాటు.. ఎల్ఈడీ విద్యుత్ బల్బులను బిగించడం ద్వారా జహీరాబాద్ మున్సిపాలిటీకి ప్రతీనెల రూ.2లక్షల మేర మిగులు బాటు అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నెలకు సుమారు రూ.7లక్షల మేర విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. ఎల్ఈడీ లైట్లను బిగిస్తే ఇందులో సగానికి సగం బిల్లు తగ్గుతుందని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. మిగిలే రూ.3.50లక్షల్లో సుమారు రూ.లక్ష నిర్వహణ, విద్యుత్ బల్బులు దెబ్బతింటే మార్చడం లాంటి వాటి కోసం సదరు సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది పోను ప్రతీనెల రూ.2లక్షల నుంచి రూ.2.50 లక్షల మేర మున్సిపాలిటీకి మిగులుబాటవుతుందని భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో సర్వే.. ఎల్ఈడీ బల్బులను బిగించేందుకు వీలుగా నిర్వహించిన సర్వేలో పలు వివరాలు సేకరించారు. పట్టణంలో ప్రస్తుతం ఉన్న పోల్స్ ఎన్ని, ఇంకా ఎన్ని అవసరం ఉన్నాయి?, ఏయే వాడలో ఎన్ని స్తంభాలున్నాయి. ఒక్కో ఫీడర్ పరిధిలో ఎన్ని దీపాలు ఉన్నాయి.? కరెంటు బిల్లులు ఎంత మేర వస్తోంది అనే సమాచారాన్ని ఈఈఎస్ఎల్ సేకరించింది. ఎల్ఈడీ బల్బులను సాధ్యమైనంత త్వరగా బిగించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో పనుల్లో పురోగతి వచ్చే అవకాశం ఉన్నట్లు అప్పట్లో భావించారు. అయినా ఏయే ప్రాంతాల్లో ఎంత మేర ఓల్టేజీ ఉన్న బల్బులను బిగించాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. జూన్ నెలాఖరు వరకల్లా పనులు ప్రారంభించి పూర్తి చేయాలని భావించినప్పటికీ మొదలు పెట్టలేదు. ప్రస్తుతం మున్సిపల్ పరిధిలో 3వేల మేర విద్యుత్ స్తంభాలు ఉన్నట్లు గుర్తించారు. పూర్తి స్థాయిలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసేందుకు మొత్తం 4,300 విద్యుత్ స్తంభాలు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ పథకం కింద ప్రస్తుతం చేపడుతున్న విద్యుత్ దీపాల బిగింపు పూర్తయితే జహీరాబాద్ పట్టణం విద్యుత్ కాంతులతో జిగేల్‌మననుంది. 65వ జాతీయ రహదారి, రైల్వే ఓవర్ బ్రిడ్జి, పట్టణంలోని అనేక రోడ్లు, కాలనీలు మెరిసిపోనున్నాయ. బిగించేందుకు ఆరు టీములు మున్సిపల్ పరిధిలో ఎల్ఈడీ బల్బులను బిగించేందుకు ఆరు టీములను ఏర్పాటు చేశారు. ఒక్కో టీములో ఇద్దరు చొప్పున మొత్తం 12 మంది పనులు నిర్వహిస్తారు. ఆరు టీములకు ఆయా వార్డులను కేటాయించారు. -
గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ వెలుగులు
– అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి తీర్మానాలు పంపండి – డీపీఓ పార్వతీ కర్నూలు(అర్బన్): జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు పీఆర్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారని జిల్లా పంచాయతీ అధికారిణి బీ పార్వతీ చెప్పారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే పలు మేజర్ గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేసుకున్నారని, అయితే కమిషనర్ ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేయించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అలాగే 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ మేరకు పంచాయతీ పాలక వర్గం తీర్మానం చేసి తమ కార్యాలయానికి ఆ కాపీలను పంపాలన్నారు. జిల్లాలో ఏప్రెల్ 30వ తేది వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూలుకు పీఆర్ కమిషనర్ గడువు పెంచిన నేపథ్యంలో ఇప్పటి వరకు 85 శాతం మేర పన్నులు వసూలు చేసినట్లు చెప్పారు. మొత్తం రూ.24 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా, రూ.20.40 కోట్లను వసూలు చేసినట్లు చెప్పారు. మిగిలిన 15 శాతం కూడా ప్రభుత్వ భవనాలు, మొండి బకాయిలు ఉన్నాయన్నారు. గ్రామ పంచాయతీల్లో విద్యుత్ బిల్లులకు సంబంధించి సర్‌చార్జీలను ప్రభుత్వం మినహించిన దృష్ట్యా కేవలం రెగ్యులర్‌గా వాడే విద్యుత్‌కు సంబంధించిన బిల్లులను సకాలంలో చెల్లించి బకాయిలు లేకుండా చూసుకోవాలన్నారు. -
కోవెలలకు ఎల్ఈడీ కాంతులు
తక్కువ ఖర్చుతో అమరుస్తున్న ‘ఫార్చ్యూ¯ŒS’ l ఇప్పటికే తిరుమల సహా పలు ఆలయాల్లో ఏర్పాటు త్వరలోనే అన్నవరంలో.. అన్నవరం : ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ హిందూ దేవాలయాలకు రంగు రంగుల ఎల్ఈడీ విద్యుత్ దీపాలను తక్కువ ఖర్చుతో అమర్చుతూ శోభాయమానంగా తీర్చి దిద్దుతోంది హైదరాబాద్‌కు చెందిన ‘ఫార్చ్యూ¯ŒS ఆర్ట్ ఎల్ఈడీ లైటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ’ సంస్థ. ఇప్పటికే తిరుమల తిరుపతి సహా పలు ప్రముఖ దేవస్థానాలలో ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేసి ఆలయ ప్రముఖులు భక్తుల ప్రశంసలు పొందిన ఫార్చ్యూ¯ŒS త్వరలోనే అన్నవరం దేవస్థానంలో కూడా ఏర్పాటు చేసి రత్నగిరి, సత్యగిరిలకు కొత్త వన్నెలద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ‘ఫార్చ్యూ¯ŒS’ సీఎండీ అరవింద్ శ్రీమల్ శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ 35 ఏళ్లు లైటింగ్ వ్యాపారంలో ఉన్న తాము దేశంలోనే తొలిసారిగా ఎల్ఈడీ లైట్లను తయారుచేసే ప్లాంట్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామని, అక్కడ తయారయ్యే దీపాలను లాభం ఆశించకుండా తయారీ ఖర్చుతోనే దేవాలయాలలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విజయనగరంలోని శ్రీ రామనారాయణ ఆలయానికి చేసిన ఎల్ఈడీ విద్యుత్ అలంకరణ తమకు మంచి పేరు తెచ్చిందన్నారు. రాత్రి వేళల్లో ఆ ఆలయం భూలోకస్వర్గంలా దర్శనమిచ్చేలా రంగు రంగుల విద్యుల్లతలు, ఫౌంటె¯ŒSలకు, వివిధ దేవతా విగ్రహాలకు చేసిన అలంకరణ ప్రముఖుల ప్రశంసలు తెచ్చిపెట్టిందన్నారు. విజయనగరంలోని శ్రీ అష్టలక్ష్మీ, శ్రీ వాసవి కన్యకాపర మేశ్వరి ఆలయాలకు శ్రీ చినజీయర్ స్వామి ఆశ్రమానికి చేసిన విద్యుత్ అలంకరణ కూడా పేరు తెచ్చిందని చెప్పారు. హైదరాబాద్‌లో శ్రీ చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో రూ.500 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకుంటున్న శ్రీరామానుజ సహస్రాబ్ది ప్రాజెక్ట్‌కు కూడా ఎల్ఈడీ విద్యుత్ అలంకరణ చేసే అవకాశం తమకే దక్కిందన్నారు. అన్నవరం దేవస్థానాన్ని కూడా ఎల్ఈడీ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దుతామని వివరించారు. రాత్రి వేళల్లో హైవేపై, రైళ్లలో ప్రయాణించే వారికి,భక్తులకు ఈ అలంకరణ కన్నుల పండువ గావిస్తుందని తెలిపా రు. ఇప్పటికే రూ. 30 లక్షలతో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామన్నారు. -
ఎల్ఈడీ లైట్లలో గోల్డ్ స్మగ్లింగ్..అరెస్ట్
శంషాబాద్ : బంగారం అక్రమ రవాణాకు స్మగ్లర్లు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎల్ఈడీ లైట్లలో బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సింగపూర్ నుంచి టైగర్ ఎయిర్వేస్ (టీఆర్2624) ఫ్లైట్‌లో ఆదివారం ఉదయం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఓ వ్యక్తిని అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో అతని నుంచి పెద్ద ఎత్తున బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారం బిస్కెట్లను ఎల్ఈడీ లైట్లలో అమర్చడంతో పాటు శరీర భాగాల్లో అమర్చుకుని స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడు. అతని వద్ద నుంచి 2 కిలోల బంగారం,, రూ. 59.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎల్ఈడీ లైట్ల లోపల 8, శరీర భాగాల్లో 12 బంగారు బిస్కెట్లను గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.