mining mafia
-
టీడీపీ మైనింగ్ మాఫియా అరాచకం.. క్వారీలో దారుణ హత్య
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో టీడీపీ మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. పచ్చ పార్టీ నేతల కనుసన్నల్లో పలమనేరులో అనధికారికంగా క్వారీల నిర్వహణ జరుగుతోంది. అంతేకాకుండా అక్కడ పనిచేస్తున్న వారిపై దాడులు కూడా జరుగుతున్నాయి.వివరాల ప్రకారం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా పలమనేరు మండలం కొలమాసనపల్లిలో శరత్ కుమార్ అనే వ్యక్తి క్వారీని టీడీపీ నేత ఆక్రమించుకున్నారు. ఇక, అక్కడ క్వారీలో పనిచేస్తున్న సిబ్బందికి రెండు నెలలుగా జీతం ఇవ్వకుండా వారిని వేధింపులకు గురిచేస్తున్నాడు సదరు టీడీప నేత. అంతేకాకుండా క్వారీలో పనిచేస్తున్న చిన్నస్వామి అనే యువకుడిని క్వారీలో చంపిపడేయటం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, ఈ హత్య విషయం పలమనేరు పోలీసు స్టేషన్‌కు చేరింది. పోలీసు స్టేషన్లో టీడీపీ నేతలు పంచాయతీ పెట్టారు. ఇక, మృతుడు చిన్న స్వామి డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మృతుడి కుటుంబీకులు, వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అతడిని హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. -
టీడీపీలో టికెట్ల బేరం!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు అధిష్టానం తీరుపై కుతకుత ఉడికిపోతున్నారు. అధికార పార్టీ దూకుడు మీద ఉండగా.. టీడీపీ అసలు అభ్యర్థులనే ప్రకటించకుండా జాప్యం చేస్తుండడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా.. ఒకవైపు పొత్తులు, మరోవైపు కమిటీల పేరుతో ఎంతో కాలంగా పనిచేసిన లీడర్లను కూడా హీనంగా చూస్తున్నారని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పోటీలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారంటూ ఎక్కువ డబ్బు డిమాండు చేయడం గతంలో ఎప్పుడూ చూడలేదని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. మమ్మల్ని నిర్ణయించేది జోనల్ కమిటీనా? తెలుగుదేశం పార్టీలో ఇటీవలే జోనల్ కమిటీని వేశారు. రాయలసీమకు సంబంధించిన ఈ జోనల్ కమిటీలో బీద రవిచంద్రయాదవ్, కిలారి రాజేష్ ఉన్నారు. వీళ్లిద్దరి పెత్తనం ఎక్కువైందనేది ఇక్కడి నేతల ఆవేదన. చీటికి మాటికి హైదరాబాద్ పిలుస్తున్నారని, అక్కడికి వెళితే ‘మీ నియోజకవర్గంలో పోటీ ఎక్కువగా ఉంది. మీరు చెబుతున్న డబ్బుకైతే మీకు టికెట్ ఇవ్వడం కష్టం’ అని చెబుతున్నారని అంటున్నారు. ఇద్దరు అభ్యర్థులను ఒక్కొక్కరి చొప్పున (వన్ టూ వన్) పిలిచి డబ్బులు అడుగుతున్నారని, టికెట్ కోసం రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్లు ఇవ్వడానికి ఇన్నేళ్లు జెండా మోయడం దేనికని మండి పడుతున్నారు. రాబిన్ శర్మ రిపోర్టులంటూ.. ప్రస్తుతం టీడీపీ వ్యూహకర్తగా పనిచేస్తున్న రాబిన్‌శర్మ వ్యవహారం తీవ్ర విమర్శలకు తావిస్తున్నట్టు ఆ పార్టీ నేతలు అంటున్నారు. ప్రతి ఒక్కరినీ పిలిచి, మీకు రిపోర్టులు నెగిటివ్‌గా ఉన్నాయని చెబుతున్నారని, ఈ రిపోర్టులను ఆధారం చేసుకుని జోనల్ కమిటీ మెంబర్లు డబ్బులు అడుగుతున్నట్టు నేతలు వాపోతున్నారు. ఎవరికైతే టికెట్ ఇవ్వకూడదనే ఆలోచన ఉందో వారికి సంబంధించి రాబిన్ శర్మ రిపోర్టు నెగిటివ్‌గా ఉందని చెబుతున్నారని, డబ్బులిచ్చిన వారికి రిపోర్టు బాగుందని అంటున్నారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టూమెన్ కమిటీ ఇంకెన్నాళ్లు? ఉమ్మడి అనంతపురం జిల్లాలో శింగనమల, మడకశిర రెండూ రిజర్వుడు నియోజకవర్గాలు. శింగనమలలో ఇద్దరు ఓసీ నేతలతో టూమెన్ కమిటీ వేశారు. ఇక్కడ ఈ ఇద్దరిదే పెత్తనం. మడకశిరలోనూ అంతే. మైనింగ్ మాఫియాగా ఉన్న గుండుమల తిప్పేస్వామి అక్కడ ఇన్చార్జ్గా ఉన్నారు. ఆయన చెప్పిందే వేదమని, ఎస్సీలను డమ్మీ చేశారని టీడీపీ ఎస్సీ నేతలు ఆరోపిస్తున్నారు. కాలపరిమితి లేని కమిటీగా వ్యవహరిస్తున్నారని, తమను వీరినుంచి విముక్తి చేయాలని వారు కోరుతున్నారు. -
క్రిమినల్ కోసం వెళ్లిన పోలీసులపై మర్డర్ కేసు!
దెహ్రాదూన్: నేరాలకు పాల్పడుతున్న వారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తారు పోలీసులు. అయితే, నేరస్థులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపైనే మర్డర్ కేసు నమోదైన అరుదైన సంఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. మైనింగ్ మాఫియాను పట్టుకునే క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో స్థానిక బీజేపీ నేత భార్య మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసులపై దాడి చేశారు. వారిపై హత్య కేసు సైతం నమోదు చేశారు. ఇంతకి ఏం జరిగిందంటే? ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరదాబాద్‌కు చెందిన ఐదుగురు పోలీసులు మైనింగ్ మాఫియాను పట్టుకునేందుకు ఉత్తరాఖండ్‌లోని జాస్పూర్కు వెళ్లారు. రూ.50,000 రివార్డ్ ఉన్న వాంటెడ్ క్రిమినల్ జాఫర్.. జాస్పూర్‌లోని భుల్లార్ అనే వ్యక్తి ఇంటిలో ఉన్నట్లు తెలిసి.. అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, మైనింగ్ ముఠా మధ్య ఎన్కౌంటర్ మొదలైంది. ఈ ఎదురుకాల్పుల్లో స్థానిక బీజేపీ నేత గుర్తాజ్ భుల్లార్ భార్య గుర్ప్రీత్ కౌర్ ప్రాణాలు కోల్పోయింది. ఇద్దరు పోలీసులకు సైతం తూటాలు తగిలాయి. బీజేపీ నేత భార్య మృతితో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరాఖండ్ వెళ్లిన ఐదుగురు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులపై హత్య కేసు సైతం నమోదైంది. ‘రూ.50వేల రివార్డ్ ప్రకటించిన వాంటెడ్ క్రిమినల్ కోసం వెతుకుతున్నాం. భరత్‌పుర్ గ్రామం నుంచి తప్పించుకుని పోయాడు. మా పోలీసు బృందం అక్కడికి వెళ్లిన క్రమంలో వారిపై దాడి చేసి ఆయుధాలు లాక్కున్నారు. ప్రస్తుతం ఐదుగురు పోలీసులు చికిత్స పొందుతున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం వేట కొనసాగుతుంది.’ అని మొరదాబాద్ సీనియ్ పోలీసు అధికారి షలాబ్ మథూర్ తెలిపారు. ఇదీ చదవండి: హిజాబ్ తీర్పు: సుప్రీం కోర్టులో ఊహించని పరిణామం -
డీఎస్పీని హత్య చేసిన ట్రక్కు డ్రైవర్ అరెస్టు.. ఎన్కౌంటర్లో దిగిన బుల్లెట్!
చండీగఢ్: హర్యానా డీఎస్పీ సురేంద్రసింగ్ బిష్ణోయ్‌పైకి ట్రక్కు ఎక్కించి హత్య చేసిన డ్రైవర్‌ను పోలీసులు గంటల్లోనే పట్టుక్నునారు. నూహ్‌లో అతడ్ని గుర్తించి వెంబడించారు. ఈ క్రమంలోనే ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నిందితుడి మోకాలిలోకి బుల్లెట్ దిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నిందితుడి పేరు ఇక్కార్ అని అధికారులు తెలిపారు. ఎన్కౌంటర్లో గాయపడిన అతడ్ని చికిత్స కోసం నల్హార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. నూహ్‌లో అక్రమ మైనింగ్ జరుగుతుందనే పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించేందుకు మంగళవారం మధ్యాహ్నం తన టీమ్‌తో వెళ్లారు తావడు డీఎస్పీ సురేంద్రసింగ్ బిష్ణోయ్. అక్కడ మైనింగ్ చేస్తున్న డంపింగ్ ట్రక్కును ఆపేందుకు ప్రయత్నించారు. కానీ ట్రక్కు డ్రైవర్ మాత్రం డీఎస్పీ ఆపుతున్నా లెక్కచేయకుండా వాహనాన్ని ఆయనపై నుంచే పోనిచ్చాడు. అనంతరం సురేంద్రసింగ్‌ను ఆస్పత్రికి తరలించగా.. తీవ్ర గాయాలపాలై ఆయన అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ట్రక్కును ఆపే సమయంలో డీఎస్పీతో పాటు గన్‌మెన్, డ్రైవర్ ఉన్నారు. కానీ వారు ప్రాణభయంతో ట్రక్కు దగ్గరకురాగానే పక్కకు దూకారు. డీఎస్పీ మాత్రం అలాగే ఉండిపోవడం వల్ల ట్రక్కు ఆయనపై నుంచి వెళ్లి చనిపోయాడు. ఈ ట్రక్కును డ్రైవ్ చేసింది నిందితుడు ఇక్కారే అని పోలీసులు తెలిపారు. చదవండి: అక్రమ మైనింగ్ ఆపేందుకు వెళ్లిన డీఎస్పీ.. ట్రక్కుతో తొక్కించి చంపిన మాఫియా గ్యాంగ్ -
రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా.. రైడింగ్‌కు వెళ్లిన డీఎస్పీ దారుణ హత్య
చండీగఢ్: హర్యానాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. తావడు డీఎస్పీ సురేంద్రసింగ్ బిష్ణోయ్‌ను దుండగులు దారుణంగా హతమార్చారు. నూహ్‌లో అక్రమంగా మైనింగ్ జరుగుతుందనే పక్కా సమాచారంతో రైడింగ్‌కు వెళ్లిన ఆయనను.. మాఫియా గ్యాంగ్ ట్రక్కుతో తొక్కించి కిరాతకంగా చంపింది. పంచగావ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఓ డంపర్ డ్రైవర్ డీఎస్పీపై నుంచి ట్రక్కును పోనిచ్చినట్లు నూహ్ పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకే డీఎస్పీ వెళ్లారని, తన వెంట బలగాలను తీసుకువెళ్లే సమయం లేదని పేర్కొన్నారు. నిందితులు హత్యకు ఎలాంటి ఆయుధాలు ఉపయోగించలేదని స్పష్టం చేశారు. Haryana | Tawadu (Mewat) DSP Surendra Singh Bishnoi, who had gone to investigate an instance of illegal mining in Nuh, died after being run over by a dumper driver. Search operation is underway to apprehend the accused. Details awaited: Nuh Police pic.twitter.com/Q1xjdUPWE2 — ANI (@ANI) July 19, 2022 వదిలిపెట్టేది లేదు.. డీఎస్పీ హత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హర్యానా మైనింగ్ మినిస్టర్ మూల్ చంద్ శర్మ తెలిపారు. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో కూడా చర్చించినట్లు చెప్పారు. హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ కూడా నిందితులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సురేంద్ర సింగ్ కుటుంబానికి రూ.50లక్షలు బ్యాంకు ద్వారా , మరో రూ.50లక్షలు ప్రభుత్వం తరఫున పరిహారంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పోలీసు శాఖ మొత్తం డీఎస్పీ కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చదవండి: వాట్సాప్ స్టేటస్‌గా నూపుర్ శర్మ వీడియో.. కత్తులతో నిర్దాక్షిణ్యంగా పొడిచారు?! -
కంత్రీ కాంతారావు
తెలుగుదేశం పార్టీ నాయకుల మైనింగ్ దందాకు రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ మండలం నేమకల్లు అడ్డాగా మారింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ టీవీఎస్ కాంతారావు. అనుమతులు పొందింది గోరంత.. తవ్వి బొక్కసం చేసింది కొండంత. 2014–19 మధ్య కాలంలో టీవీఎస్ కాంతారావు చేసిన దందా అంతా ఇంతాకాదు. కోట్లాది రూపాయల ఖనిజం కొల్లగొట్టాడు. అప్పటి మంత్రి కాలవ శ్రీనివాసులుకు ప్రధాన అనుచరుడిగా ఉన్న అతనికి ఇటు రాజకీయంగానూ, అటు అధికారుల పరంగానూ ఎవరూ అడ్డు చెప్పలేకపోయారు. దీంతో కోట్లాది రూపాయల ఖనిజాన్ని ఇష్టారాజ్యంగా తరలించి సొమ్ము చేసుకున్నాడు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కాంతారావు మైనింగ్ దందాతో చెలరేగిపోయాడు. అనుమతులు తీసుకోవడం ఒక సర్వే నంబర్లో.. తవ్వింది మరో సర్వే నంబర్లో. ఇవన్నీ ఎవరో చెప్పినవి కావు.. స్వయానా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో బయటపడ్డాయి. ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడి వరకు తవ్వారో అధికారులకే అంతుచిక్కలేదు. దీంతో భారీగా పెనాల్టీలు విధించారు. నేమకల్లులో సర్వే నంబర్ 253లో అధికారికంగా అతనికిచ్చింది ఎకరా విస్తీర్ణంలో తవ్వుకోవాలని మాత్రమే. కానీ విచ్చలవిడిగా తవ్వడంతో అధికారులు రూ.కోట్లల్లో పెనాల్టీ విధించారు. అంతేకాదు అత్యంత కఠినమైన ఆర్ఆర్ (రెవెన్యూ రికవరీ) యాక్ట్ ద్వారా ఆస్తులు రికవరీ చేసుకోవాలని కూడా నోటీసులు ఇచ్చారు. కానీ తెలుగుదేశం హయాంలో ఏ అధికారీ అతని క్రషర్ల వైపు వెళ్లలేకపోయారు. కూతురు, అల్లుడు, తమ్ముడు, తమ్ముడి కొడుకు ఇలా అందరి పేరుమీదా కాంతారావు మైనింగ్ చేసి రూ.కోట్లకు కోట్లు కొల్లగొట్టిన తీరు మైనింగ్ అధికారులనే నివ్వెరపోయేలా చేసింది. అనుమతులు లేకుండా తవ్వారు అనుమతి ఇచ్చిన దానికంటే ఎక్కువ మెటల్‌ను తవ్వి తరలించారు. అంతేకాకుండా పరిమితికి మించి ఎక్కువ భూమిలో తవ్వారు. దీంతో ఎక్కువ పెనాల్టీలు వేశాం. తహసీల్దార్లకు కూడా దీనికి సంబంధించిన నోటీసులు ఇచ్చాం. దీనిపై సదరు వ్యక్తులు కోర్టులకు వెళ్లారు. దీనికి మేము రివిజన్ పిటిషన్లు కూడా వేశాం. –బాలసుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ డైరెక్టర్, గనులశాఖ కఠిన చర్యలు తీసుకుంటాం మైనింగ్ శాఖ నుంచి తహసీల్దార్ కార్యాలయానికి నోటీసులు వచ్చాయి. ఈ మేరకు ఆయా యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. వారి ఆస్తులను గుర్తించి ఆర్ఆర్ యాక్ట్కింద వసూలు చేస్తాం. జరిమానాలు కట్టించి తీరతాం. –ఎ.నిశాంత్‌రెడ్డి, ఆర్డీఓ, కళ్యాణదుర్గం -
ఉల్లం‘ఘనులకు’ ఇంటి దొంగల వత్తాసు
సాక్షి, అమరావతి: గనులను కొల్లగొట్టిన అక్రమార్కులకు మైనింగ్ శాఖలోని కొందరు అధికారులే అండగా నిలవడం ఉత్తరాంధ్రలో చర్చనీయాంశమైంది. విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతంలోని మెటల్ క్వారీల్లో చోటుచేసుకున్న అక్రమాలపై మైనింగ్ విజిలెన్స్ విభాగం 10 రోజులుగా చేస్తున్న తనిఖీలకు అక్కడి మైనింగ్ అధికారులు అడుగడుగునా అడ్డు తగులుతున్నట్టు తేలింది. తనిఖీలకు నేతృత్వం వహిస్తున్న విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డి పట్ల అనకాపల్లి మైనింగ్ ఏడీ కార్యాలయ అధికారులు దురుసుగా ప్రవర్తించగా.. జియాలజిస్ట్ విఘ్నేశ్వరుడు ఏకంగా దాడికి యత్నించటం కలకలం రేపింది. ఫైళ్లు ఇవ్వకుండా.. మాఫియాకు పాదాక్రాంతం అనకాపల్లి మండలంలోని 30 క్వారీల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్టు ఫిర్యాదులు రావడంతో మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ బృందాలను రంగంలోకి దించారు. ఈ బృందాలు రాష్ట్రంలోనే బడా కంపెనీలకు చెందిన క్వారీల్లో తనిఖీలు చేసి ఉల్లంఘనల్ని బయటపెడుతుండడంతో మైనింగ్ మాఫియా వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. అయినా విజిలెన్స్ అధికారులు వెనక్కి తగ్గకపోవడంతో అనకాపల్లి ఏడీ కార్యాలయంలోని కొందరు సిబ్బంది, ఇతర ప్రాంతాల్లోని పలువురు మైనింగ్ అధికారులు విజిలెన్స్ బృందాలకు అడ్డంకులు కల్పించారు. తనిఖీలు చేస్తున్న క్వారీలకు సంబంధించిన ఫైళ్లు, అనుమతులు, ఇతర వివరాలు ఇవ్వకుండా అక్కడి అధికారులు రోజుల తరబడి తప్పుకుని తిరుగుతున్నట్టు సమాచారం. మరోవైపు విజిలెన్స్ అధికారుల తనిఖీల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మైనింగ్ మాఫియాకు చేరవేస్తూ అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో మైనింగ్ విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డి ఇటీవల అనకాపల్లి మైనింగ్ ఏడీ కార్యాలయానికి వెళ్లి ఫైళ్లు ఇవ్వాలని కోరారు. విజిలెన్స్ బృందం మూడు గంటలకు పైగా ఆ కార్యాలయంలో వేచి ఉన్నప్పటికీ.. ఫైళ్లు ఇవ్వకుండా తనిఖీలను తప్పుపట్టేలా మాట్లాడుతూ అక్కడి జియాలజిస్ట్ విఘ్నేశ్వరుడు విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఉన్నట్టుండి ఏడీ మొహంపై తాను తాగుతున్న టీని విసిరారు. ఆ తర్వాత దాడికి ప్రయత్నించడంతో సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై ప్రతాప్‌రెడ్డి విజయవాడలోని మైనింగ్ శాఖ సంచాలకులు వెంకటరెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణ జరిపారు. అనకాపల్లి జియాలజిస్ట్ విఘ్నేశ్వరుడుదే తప్పని నిర్థారించి వెంటనే ఆయనను సస్పెండ్ చేసి పని చేస్తున్న ప్రాంతం నుంచి అనుమతి లేకుండా వెళ్లకూడదని ఆదేశించారు. విజిలెన్స్ ఏడీ లక్ష్యంగా మాఫియా స్కెచ్ ఉత్తరాంధ్ర మైనింగ్ మాఫియాకు చెందిన శ్రీనివాస చౌదరి, ఎంఎస్ రెడ్డి, వాణీ చౌదరికి చెందిన కంపెనీలతోపాటు ఇతర కంపెనీలతోనూ అనకాపల్లి మైనింగ్ ఏడీ కార్యాలయ అధికారులు లాలూచీపడినట్టు స్పష్టమైంది. వారి మద్దతుతోనే విజిలెన్స్ ఏడీపై జియాలజిస్ట్ దాడి చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారం బహిర్గతమవడంతో ఇప్పుడు నేరుగా మాఫియాలోని వ్యక్తులే విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డిని అడ్డుకునేందుకు స్కెచ్ వేసినట్టు పోలీసులకు సమాచారం అందింది. ఆయన్ను భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా తనిఖీలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. దీంతో ప్రతాప్‌రెడ్డికి పోలీసులు భద్రత పెంచారు. విజిలెన్స్ బృందాలకు సైతం భద్రత పెంచి తనిఖీల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులు సైతం అనకాపల్లి మైనింగ్ వ్యవహారాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నట్టు సమాచారం. -
విశాఖలో మైనింగ్ మాఫియా అక్రమాలు..
సాక్షి, విశాఖపట్నం: మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడిన కంపెనీలపై శుక్రవారం అధికారులు దాడులు చేశారు. గడిచిన 10 రోజుల్లో విశాఖలోనే మైనింగ్ మాఫియా అక్రమాలకు రూ.120 కోట్లు ఫైన్ వేశారు. మొత్తం 9 క్వారీ లీజుల్లో అక్రమాలను అధికారులు గుర్తించారు. అయితే గత కొన్నేళ్లుగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న వీవీఆర్ గ్రూప్‌లో దాడులు చేశారు. ఈ దాడులలో భారీ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు 8 క్వారీలకు రూ.114 కోట్లు ఫైన్‌తో పాటు నాలుగు క్వారీలకు సంబంధించిన అక్రమాలపై ఇప్పటికే వీవీఆర్ గ్రూప్‌కు నోటీసులు జారీ చేశారు. కాగా 5 క్వారీల్లో తవ్వని వాటికి కూడా ప్రభుత్వం నుంచి బిల్లులు పొందినట్లు నిర్ధారణయింది. పర్యావరణ అనుమతులు, భద్రతా ప్రమాణాలు పాటించకుండా అక్రమ తవ్వకాలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. -
2014లో సొంత ఇల్లు లేదు.. నేడు కోట్లకు పడగలు!
సాక్షి, ఒంగోలు: గ్రానైట్ మాఫియా గుండెల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డ మాఫియా డొంక కదులుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కనుసన్నల్లో గ్రానైట్ అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగింది. ఆయన తన అనుచరులు పావులూరి చిన కోటయ్య, చంద్రమౌళి ద్వారా ప్రకాశం జిల్లా నుంచి వేలాది లారీల గ్రానైట్‌ను బిల్లులు లేకుండా పొరుగు రాష్ట్రాలకు తరలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. గ్రానైట్ అక్రమ రవాణా వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అధికారికంగా నిర్ధారించారు. అనధికారిక సమాచారం ప్రకారం.. గ్రానైట్ మాఫియా రూ.1,000 కోట్లకుపైగానే దోచేసినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటిదాకా 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో యరపతినేని అనుచరుడు చంద్రమౌళి అలియాస్ సీఎం కూడా ఉన్నాడు. కోట్లకు పడగలెత్తిన చిన కోటయ్య గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన పావులూరి కోటేశ్వరరావు అలియాస్ చిన కోటయ్య 2014కు ముందు సొంత ఇల్లు కూడా లేక అద్దె ఇంటిలో నివాసం ఉండేవాడు. అతడిది సామాన్య మధ్య తరగతి కుటుంబం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు యరపతినేని నేతృత్వంలో నడిచిన గుట్కా, రేషన్, గ్రానైట్ మాఫియాకు కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. ఐదేళ్లలోనే చిన కోటయ్య రూ.కోట్లకు పడగలెత్తాడు. అక్రమాలకు సహకరించిన అధికారుల్లో వణుకు ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి, బల్లికురవ, మార్టూరు, సంతమాగులూరు వంటి ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు రాజకీయ నాయకుల అండదండలతో నకిలీ కంపెనీలు సృష్టించి, వాటి పేరిట ఆన్లైన్ ద్వారా ఈ–వే బిల్లులు పొంది గ్రానైట్ లారీలను అక్రమంగా రాష్ట్రం దాటించారు. కొన్నిసార్లు అసలు బిల్లులు కూడా లేకుండా గ్రానైట్ లారీలను ఇతర రాష్ట్రాలకు తరలించి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. గత టీడీపీ సర్కారు హయాంలో ఈ బాగోతం నిరాటంకంగా సాగిపోయింది. అద్దంకి సేల్స్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ వి.పి.శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి, లోతుగా దర్యాప్తు జరిపారు. గ్రానైట్ మాఫియా డొంకను కదిలించారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో యరపతినేని శ్రీనివాసరావు అనుచరులు బిల్లులు లేకుండా ఇతర రాష్ట్రాలకు తరలించిన గ్రానైట్ విలువ రూ.1,000 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇక నకిలీ వే బిల్లులతో వెళ్లిన లారీల సంఖ్య వేలల్లోనే ఉంటుందని చెబుతున్నారు. ఈ గ్రానైట్ లారీలు సక్రమంగా పన్నులు చెల్లించి ఉంటే ప్రభుత్వ ఖజానాకు రూ.300 కోట్లకు పైగా ఆదాయం వచ్చేదని తేల్చారు. ప్రకాశం జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు యరపతినేని అనుచరుడు చంద్రమౌళిని అదుపులోకి తీసుకున్నారన్న విషయం తెలియగానే మరో అనుచరుడు చిన కోటయ్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. ఈ కేసులో మరో 123 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ చెప్పారు. అలాగే టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో గ్రానైట్ మాఫియాకు సహకరించిన ప్రభుత్వ అధికారుల్లో కలవరపాటు మొదలైంది. -
'ఏ ఒక్కరినీ వదలకండని సీఎం జగన్ ఆదేశించారు'
సాక్షి, ఒంగోలు: గుట్టుచప్పుడు కాకుండా అధికారులను మేనేజ్ చేస్తూ కోట్ల రూపాయలు గడించిన మైనింగ్ మాఫియాకు సంబంధించి కీలకంగా వ్యవహంచిన 16 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ సమావేశ మందిరంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. 16 మంది నిందితులను మీడియా ఎదుట హాజరు పరిచి వీరు ఏ విధంగా ప్రభుత్వాన్ని మోసం చేశారో వివరించారు. ముంబై మాఫియాను తలపించే రీతిలో చేసిన వీరి మోసంపై సీబీఐ విచారణ అక్కర్లేదని, తామే మొత్తం నిందితులు గుట్టు రట్టు చేస్తామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ధీమా వ్యక్తం చేశారు. నేరం వెలుగు చూసింది ఇలా.. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థీకృత నేరంగా మారిన కేసు.. అద్దంకి స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ వీపీ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వానికి ట్యాక్స్‌లు కట్టకుండా నకిలీ ఫరంలతో 290 కోట్ల 49 లక్షల 75 వేల 81 రూపాయల వ్యాపారం చేసి 52 కోట్ల 20 లక్షల 19 వేల 33 రూపాయల పన్ను ఎగ్గొట్టారని, తాము విచారించగా ఫరంలన్నీ తప్పుడు చిరునామాలతో ఆన్లైన్లో సృష్టించినట్లుగా శ్రీనివాస్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్టూరు పరిసర ప్రాంతాల్లో ఒన్‌మ్యాన్ ఫ్రీ బిజినెస్ పాలసీ కింద 2018 ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 2919 సెపె్టంబర్ 28వ తేదీ వరకు ఒన్‌మ్యాన్ ఫ్రీ బిజినెస్ పాలసీ కింద ప్రభుత్వం కలి్పంచిన అవకాశాన్ని దుర్వినియోగం చేసి అక్రమాలకు పాల్పడినట్లు శ్రీనివాస్ తేల్చడంతో నిందితుల నేరం వెలుగులోకి వచ్చింది. దీనిపై మార్టూరు ఎస్ఐ మల్లికార్జున్ తొలుత సాంకేతిక పరిజ్ఞానం, స్థానికుల ద్వారా సమాచారం సేకరించి నిందితులు గుట్టు వెలికితీయడంతో ఇదో పెద్ద మాఫియా అన్న వ్యవహారం స్పష్టమైంది. ఈ కేసును చేధించడం ఒక్క ఎస్ఐతో సాధ్యం కాదని భావించిన ఎస్పీ..ఏకంగా చీరాల డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి, అద్దంకి సీఐ టి.అశోక్‌వర్థన్, ఇంకొల్లు సీఐ రాంబాబు, మార్టూరు ఎస్ఐ మల్లికార్జున, మేదరమెట్ల ఎస్ఐ బాలకృష్ణతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్)ను ఏర్పాటు చేశారు. చిన కోటయ్యకు లోడుకు రూ.6 వేలు ఈ నేపథ్యంలో జిల్లా సరిహద్దులు దాటించగలిగారు కానీ దాచేపల్లి వద్ద వీరి వ్యవహారానికి గండిపడింది. ఇప్పటికే గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్ వ్యవహారంలో యరపతినేని అనుచరునిగా పేరుండి సీబీఐ కేసులో నిందితుడైన చినకోటయ్య రాజకీయ నాయకులు, అధికారులను మేనేజ్ చేసేందుకు లోడుకు రూ.6 వేలు చొప్పున అందించేవారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆయన్నూ విచారించేందుకు పోలీసులు దృష్టి సారించారు. తొలుత నలుగురు.. నేడు 16 మంది ఈ కేసుకు సంబంధించి రెండు నెలల క్రితం తాము నలుగురిని అరెస్టు చేశామని, ప్రస్తుతం 16 మందిని అరెస్టు చేశామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి ట్యాక్స్‌లు కట్టకుండా జీఎస్టీ, మైనింగ్ బిల్లులకు సంబంధించి రూ.300 కోట్ల నష్టం వాటిల్లిందని, బిల్లులు లేకుండా తరలి వెళ్లిన సరుకు విలువ రూ.900 కోట్లకుపైనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కేసులో ఇంకా 123 మంది నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అంతే కాకుండా అక్రమ వ్యాపార లావాదేవీలు నిర్వహించిన మార్కర్లకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. నేరంలో పాత్ర ఉన్న ఏ ఒక్కరినీ వదిలి పెట్టవద్దని సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సార్లు తమను ఆదేశించారని ఎస్పీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కేసు దర్యాప్తులో విశేషంగా కృషి చేస్తున్నారంటూ సిట్ బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అరెస్టయిన నిందితులు వీరే.. పఠాన్ అరీఫుల్లా, షేక్ షబ్బీర్, షీక్ రహీం (మార్టూరు గొట్టిపాటి హనుమంతురావు కాలనీ), కోనేరు సతీష్ (మార్టూరు మద్ది సత్యనారాయణ కాలనీ), గడ్డం హేమంత్ (మార్టూరు ఎంఎల్ఏ క్వార్టర్స్), ఆలకుంట రవికుమార్ (బల్లికురవ మండలం వైదన), వేముల జెల్లయ్య (బళ్లారి సమీపంలోని టోర్నగల్ గ్రామం), పఠాన్ జానీబాషా (మార్టూరులోని గన్నవరం రోడ్డు), కల్లేపల్లి శివప్రసాద్ వర్మ (మార్టూరు మండలం రాజుగారిపాలెం), గుర్రంకొండ భార్గవ్ (మార్టూరు విద్యానగర్), చల్లగొండ కార్తీక్ చౌదరి (మార్టూరు తూర్పు బజారు), ఏలికా రవి (గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నవరం), పెద్దిశెట్టి రవికుమార్ (మార్టూరు విద్యానగర్ మొదటి లైను), బిళ్లా చినబాబు (మార్టూరు మండలం నాగరాజుపల్లి), కోటగిరి శ్రీనివాసరావు (మార్టూరు), కాకుమాను చంద్రమోహన్ అలియాస్ చంద్రమౌళి (గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం చించాలిడొంక). దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అక్రమాలు సిట్ దర్యాప్తులో అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత యర్రపోగు మహేంద్ర, అమర్నేని వెంకటేశ్వర్లు మార్టూరు పరిసర ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికి అవసరమైన రుణాలు ఇప్పిస్తామంటూ వారికి సంబంధించిన ధ్రువపత్రాలు సేకరించారు. వాటిని వారు జంపని వెంకట సుబ్బారావు, చేబ్రోలు రమే‹Ù, ఆడిటర్ చేబ్రోలు రమేష్‌నాయుడులకు ఇచ్చారు. వారు వాటి సాయంతో 26 ఫోన్ నంబర్లు, 17 ఈ మెయిల్స్ సాయంతో 278 నకిలీ ఫరంలు సృష్టించారు. ఒక్కో ఫరాన్ని వారు రూ.35 వేలు చొప్పున విక్రయించేవారు. ఇలా మొత్తం 19 గ్రూపులకు విక్రయించారు. ఒక్కో గ్రూపులో 6 నుంచి 10 మంది ఉంటారు.ఈ మొత్తం గ్రూపుల్లో మార్టూరు పరిసర ప్రాంతాల్లోని వారు 70 మంది ఉన్నట్లు వెల్లడైంది. ఈ 19 గ్రూపుల్లోని వారు తాము కొనుగోలు చేసిన ఫరంల ద్వారా నకిలీ వేబిల్లులు సృష్టించేవారు. ఇలా నకిలీ ఫరంలను పఠాన్ ఆరీఫుల్లా, దరియావలి, షబ్బీర్, జాని, కాలేషా, శివవర్మ, కార్తీక్, షరీఫ్, భార్గవ్, శివ, జైపాల్‌రెడ్డి, కాళి, రహీం, ఎల్లయ్య, హేమంత్, ఖలీల్, రవి, సందీప్, నాగరాజు అనే వారు కొనుగోలు చేశారు. వీరంతా సంబంధిత గ్రూపుల లీడర్లు. ఇలా తాము కొన్న నకిలీ ఫరం ద్వారా 33 మంది మార్కర్లతో వీరు వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒక్కో లారీ గ్రానైట్ లోడుకు ప్రభుత్వానికి రూ.75 వేలు నుంచి లక్ష రూపాయల వరకు మార్కర్ చెల్లించాల్సి ఉంటుంది. నకిలీ ఫరాలు కొనుగోలు చేసిన వారు అందుకు భిన్నంగా మార్కర్ల వద్ద రూ.30 వేలు తీసుకునేవారు. అందులో తాము రూ.20 వేలు ఉంచుకుని మిగిలిన రూ.10 వేలు చంద్రమౌళి, కామేశ్వరరావు అలియాస్ కాముడు, సుదీర్, నన్నేషు, జానీ, కరీం, చినబాబు, సుదర్శన్, మల్లికార్జున, అంజయ్య, నాగయ్య, శేషు అనే వారికి ఇచ్చి లారీలను రాష్ట్ర సరిహద్దులు దాటించే బాధ్యతను అప్పగించేవారు. ఇందుకుగాను ప్రతి గ్రూపులో ఉన్న సభ్యుల్లో ఏడుగురు అక్రమ గ్రానైట్ తరలుతున్న లారీలకు ముందు పైలెట్లుగా వ్యవహరించేవారు. ఎక్కడైనా అధికారులు ఉన్నా సమాచారం అందిస్తూ వాహనాలను దారి మళ్లించడం వీరి పని. ఈ క్రమంలో విజయవాడ వైపు వెళ్లే లారీలను రాష్ట్ర సరిహద్దులు దాటించే బాధ్యత శేషు అనే వ్యక్తి తీసుకునేవాడు. మిగిలిన వారు మాచర్ల, దాచేపల్లి, చెన్నై, బెంగళూరు వైపు ఎటువంటి తనిఖీలు జరగకుండా, వాహనాలు సీజ్ కాకుండా జాగ్రత్త పడేవారు. -
రూ.8 కోట్ల విలువైన ఖనిజం అక్రమరవాణా
పచ్చని చెట్లపై పక్షుల కిలకిల రావాలు.. పొదల మాటున జీవనం సాగించే వన్యప్రాణులు. విలువైన వృక్ష సంపద. అద్భుతమైన జీవ వైవిధ్యం.. అటవీ ప్రాంతం సొంతం. గత టీడీపీ హయాంలో నేతలు అడవినీ వదిలి పెట్టలేదు. అడవిలో విధ్వంసం సృష్టించి సహజ వనరులను కొల్లగొట్టారు. కొందరు అక్రమార్కులు తమ స్వార్థం కోసం అటవీ ప్రాంతంలో జెలిటిన్స్టిక్స్తో పేల్చుతూ వృక్ష, పక్షి జాతులతో పాటు వన్యప్రాణులను విలవిలల్లాడేలా చేశారు. ఇదంతా రిజర్వు ఫారెస్ట్‌లోనే విలువైన ఖనిజాన్ని కొల్లగొట్టడానికే అని విజిలెన్స్ విచారణలో నిగ్గు తేలింది. గడిచిన ఐదేళ్ల కాలంలో అక్రమార్కులు రూ.8 కోట్ల విలువైన సంపదను యథేచ్ఛగా అక్రమ రవాణా సాగించినా, అధికారులు నిలువరించలేకపోయారు. అప్పటి మంత్రి అండదండలు ఉండడంతో అక్రమార్కులకు అధికారులు అండగా నిలిచారని సమాచారం సాక్షి, నెల్లూరు: అధికారం మాటున అప్పటి మంత్రి అండదండలతో అక్రమార్కులు అడవిని ధ్వంసం చేశారు. రక్షకులమంటూ.. అడవిని భక్షించారు. నీతికి, నిజాయతీకి తామే బ్రాండ్ అంబాసిడర్లమంటూ నిత్యం నీతులు వల్లించే ఆ పార్టీ నేతలు మైనింగ్ నిర్వాహకులతో కలిసి అటవీ సహజ వనరులను దోచేశారు. పొదలకూరు మండలం నందివాయ రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 28లో 36.58 ఎకరాల భూమిని 1990లో ఉమామహేశ్వరీ మైన్ నిర్వాహకులకు మైనింగ్ అనుమతి ఇచ్చారు. ఆ సర్వే నంబరులో దాదాపు 214 ఎకరాల భూమి ఉంది. అందులో 70 ఎకరాల భూమి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తుంది. రెవెన్యూ భూములను మైనింగ్‌కు అనుమతులు తీసుకున్న నిర్వాహకులు మాత్రం రెవెన్యూ భూముల పరిధి దాటి రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లోకి చొరబడ్డారు. కొండలు, గుంటల భూములను ఇష్టానుసారంగా తవ్వేసి తెల్లరాయి, గ్రావెల్, మెటల్‌ను అక్రమంగా రవాణా చేశారు. 19 ఏళ్ల పాటు మైనింగ్ అనుమతులు పొందిన లీజుదారులు ఆయా భూములను పీల్చి పిప్పి చేసి కోట్లాది రూపాయల విలువైన సంపదను దోచేశారు. 2009 నాటికి మైనింగ్ అనుమతులు ముగిసినా కూడా నిర్వాహకులు రెన్యువల్ చేయించుకోలేదు. అయినా యథేచ్ఛగా మైనింగ్‌ను కొనసాగించారు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే అప్పటి అధికార పార్టీ నేత, మాజీమంత్రి అండతో దోపిడీని కొనసాగించారు. టీడీపీ హయాంలో.. టీడీపీ హయాంలో మైనింగ్ నిర్వాహకుడు జిల్లా మంత్రితో లోపాయి కారి ఒప్పందం చేసుకుని అనుమతులు లేకుండానే రెవెన్యూ భూములే కాకుండా నందివాయ రిజర్వ్ ఫారెస్ట్‌ను ఆక్రమించారు. ఫారెస్ట్ పరిధిలో ఉండే కొండలను జిలెటిన్‌స్టిక్ వంటి పేలుడు పదార్థాలతో పేల్చి తెల్లరాయి నుంచి గ్రావెల్, మెటల్‌ను అక్రమ రవాణా సాగించారు. టీడీపీ ఐదేళ్ల కాలంలో ఫారెస్ట్ పరిధిలో సుమారు 20 ఎకరాల్లోకి చొచ్చుకుపోయి సహజ వనరులను కొల్లగొట్టుతున్నా అటవీశాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోలేదు. అప్పటి మంత్రి అండదండలు ఉండడంతో చర్యలు తీసుకొనేందుకు వెనకాడిన అధికారులు మైనింగ్ నిర్వాహకుడితో లాలూచీ పడి అక్రమ రవాణాకు సహకరించారు. అప్పట్లో అక్రమ మైనింగ్‌పై స్థానికులు ఫిర్యాదు చేయడంతో 2017లో అటవీశాఖ, రెవెన్యూ శాఖ సర్వే నిర్వహించి ఫారెస్ట్ భూముల్లో మైనింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో మైనింగ్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. కానీ అప్పటి అధికార పార్టీ మంత్రి అండదండలు ఉండడంతో సర్వే నివేదికను తొక్కి పెట్టారు. దీంతో మైనింగ్ నిర్వాహకుడు మాత్రం అక్రమ రవాణా దందా కొనసాగించాడు. జిల్లా అధికారుల దృష్టికి వెళ్లినా.. నందివాయ రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్ వ్యవహారం విషయం జిల్లా స్థాయిలో అధికారులందరికీ తెలిందే. ఈ వ్యవహారంపై గత జిల్లా ఉన్నతాధికారి దృష్టికి అటవీశాఖ అధికారులు తీసుకెళ్లినా అధికార పార్టీ నేతల ఒత్తిడితో కనీసం స్పందించలేదని తెలిసింది. జిల్లా అటవీశాఖ అధికారుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడిచినట్లు తెలుస్తోంది. అప్పటి మంత్రి ఈ అక్రమ మైనింగ్‌కు అండగా ఉండడంతో జిల్లా స్థాయి అధికారులు కూడా వారికి సహకరించి స్వామి భక్తిని చాటుకున్నారు. ఇటు రెవెన్యూ, అటు మైనింగ్ అధికారులు కూడా అక్రమ మైనింగ్‌కు పూర్తి స్థాయిలో అండదండలు అందించారు. వన్యప్రాణులు విలవిల మైనింగ్ నిర్వాహకులు తమ స్వార్థం కోసం అడవినే ఆక్రమించి సంపదను కొల్లగొట్టే క్రమంలో విధ్వంసం సృష్టించి వన్యప్రాణులను, పక్షి జాతులను విలవిలాలాడేలా చేశారు. నందివాయ రిజర్వ్ ఫారెస్ట్‌లో దాదాపు 40 రకాల పక్షి జాతులు, వన్యప్రాణులు ఉన్నాయి. పచ్చని అడవిలో ప్రశాంతంగా ఉండే పక్షులు, వన్యప్రాణులకు పేలుళ్లతో నిద్ర లేకుండా చేశారు. కొండను తొలిచేందుకు నేపథ్యంలో జెలిటిన్‌స్టిక్, అమ్మెనియా వంటి పేలుడు పదార్థాలను ఉపయోగించి రాత్రి వేళల్లో పేల్చేవారు. ఆ ప్రభావంతో వన్యప్రాణులు, పక్షులు విలవిలలాడాయి. ఆ పేలుళ్ల ప్రభావం వల్ల నందివాయ గ్రామ పరిధిలో పంటలపై పడేది. పచ్చని పంటలపై దుమ్ము, ధూళి కణాలు పడి ఎదుగుదల లోపించేదని స్థానికులు ఆరోపించారు. విచారణలో నిగ్గుతేలిన వాస్తవాలు నందివాయ రిజర్వు ఫారెస్ట్‌లో కొండలను తొలిచి ఏళ్ల కాలంగా అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న వైనంపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో అక్రమ మైనింగ్ వ్యవహారంపై కదలిక వచ్చింది. అధికారులు విచారణలో దాదాపు అడవిని కొల్లగొట్టి రూ.8 కోట్ల విలువైన ఖనిజాన్ని అక్రమంగా రవాణా సాగించినట్లు నిగ్గు తేలింది. 2010 నుంచి మైనింగ్‌కు అనుమతి లేకుండా నిర్వాహకులు మాత్రం మైకా, తెల్ల రాయిలను అక్రమంగా రవాణా చేసినట్లు గుర్తించి అటవీశాఖ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. గత టీడీపీ హయాంలో ఇంత భారీగా అక్రమ మైనింగ్ జరిగినా అధికారులు స్పందించలేదని తేలడంతో అందుకు బాధ్యులైన ఇద్దరు బీట్ అధికారులపై వేటు వేశారు. ఇంకా ఈ అక్రమ మైనింగ్‌కు సహకరించిన అధికారులపై కూడా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఒక్కరూ సహకరించలేదు నేను రాపూరు రేంజర్‌గా జాయిన్ అయినప్పటి నుంచి అక్రమ మైనింగ్‌ను నిలువరించేందుకు పోరాటం చేస్తున్నా. ఏ ఒక్క అధికారి కూడా నాకు సపోర్ట్ చేయలేదు. రెవెన్యూ, మైనింగ్ అధికారులు అయితే అసలు చెవికెక్కించుకోలేదు. గతంలో అక్రమ మైనింగ్‌పై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. మైనింగ్ నిర్వాహకుడిపై కేసు కూడా నమోదు చేశాను. కానీ ఎవరూ సహకరించకపోవడంతో ఏమి చేయలేకపోయాం. నిర్వాహకుడు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నాడు. జాయింట్ సర్వే చేయమని కోర్టు ఆదేశాలున్నా అధికారులు పట్టించుకోలేదు. – శ్రీదేవి, ఫారెస్ట్ రేంజ్ అధికారిణి జాయింట్ సర్వే నిర్వహిస్తాం రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్ వ్యవహారంలో సహకరించిన అధికారులు, ఉద్యోగులందరిపై శాఖా పరమైన చర్యలు ఉంటాయి. త్వరలోనే మైనింగ్‌పై జాయింట్ సర్వే నిర్వహిస్తాం. పూర్తి స్థాయి విచారణ కూడా జరుపుతాం. అక్రమ మైనింగ్‌కు సహకరించిన ఎవరిని వదలం. ఇప్పుడు ఇద్దరు ఉద్యోగులపై తాత్కాలిక చర్యలు చేపట్టాం. పూర్తిస్థాయి విచారణలో తప్పు చేశారని తెలిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు. – శ్రీనివాసులు రెడ్డి, డీఎఫ్ఓ , నెల్లూరు -
గుండుమల దందా!
మడకశిర నియోజకవర్గం జిల్లా సరిహద్దులో కర్ణాటకకు సమీపంలో ఉంది. అక్షరాస్యత శాతం చాలా తక్కువ. ప్రశ్నించే తత్వం కూడా లేని ప్రాంతం. దీన్ని ఆసరా చేసుకున్న ఎమ్మెల్సీ గుండుమల కుటుంబం టీడీపీ హయాంలో క్వారీల బిజినెస్ ప్రారంభించింది. కొండ కనబడితే పిండేస్తూ రూ.కోట్లు సంపాదించింది. తమ్ముళ్లందరినీ క్వారీ బిజినెస్‌లో దింపిన గుండుమల నిబంధనలకు విరుద్ధంగా సహజవనరులన్నీ దోచేస్తున్నారు. అధికారులకు ఆమ్యామ్యాలిస్తూ విలువైన గ్రానైట్‌ను అడ్డగోలుగా సరిహద్దు దాటించేస్తున్నారు. తమ పరిధిలో ఎవరైనా పొరపాటున క్వారీ బిజినెస్ చేయాలన్నా కప్పం కట్టాలంటూ హెచ్చరికలు జారీ చేస్తూ భారీగా వసూళ్లు చేస్తున్నారు. సాక్షి, మడకశిర: టీడీపీ హయాంలో ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి హవా నడిపించారు. పచ్చ చొక్కా మాటున ఫ్యామిలీ బిజినెస్ చేశారు. సొంత తమ్ముళ్లందరినీ క్వారీల బిజినెస్‌లోకి దింపి నిబంధనలకు విరుద్ధంగా సహజవనరులన్నీ సరిహద్దు దాటించేశారు. ఎమ్మెల్సీ కుటుంబమంతా క్వారీలపైనే ఆధారపడి బతుకుతుండగా.. అధికారులు ఆ క్వారీలవైపు కన్నెత్తి చూసేందుకు జంకుతున్నారు. అడపాదడపా దాడులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మడకశిర మండలంలోని జాడ్రహళ్లి కలర్ గ్రానైట్ క్వారీ చాలా విలువైనది. ఈ క్వారీలో ఎమ్మెల్సీ సోదరులు రాధాకృష్ణ, శివానందప్ప, చంద్రప్పలు పాగా వేశారు. మూడు హెక్టార్ల విస్తీర్ణంలోని ఈ క్వారీ నుంచి విలువైన గ్రానైట్‌ను తవ్వుకుని కర్ణాటకకు తరలిస్తున్నారు. అనుమతులకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టడంతో పాటు రాయల్టీ కూడా చెల్లించకుండానే గ్రానైట్ తరలిస్తున్నారు. పలుసార్లు గనులశాఖ అధికారులు గ్రానైట్ లారీలను సీజ్ చేసినా ఎమ్మెల్సీ అండతో మళ్లీ అదే దందా నడిపిస్తున్నారు. రాత్రివేళల్లో గ్రానైట్‌ను సరిహద్దు దాటించేస్తున్నారు. ఇక అగళి మండలంలోని హెచ్డీ హళ్లి క్వారీలో విలువైన గ్రానైట్ లభ్యమవుతుండగా.. ఈ క్వారీపై కూడా ఎమ్మెల్సీ కుటుంబ సభ్యుల కన్నుపడింది. ఎమ్మెల్సీ సోదరుడు చంద్రప్ప రెండు హెక్టార్లలో గ్రానైట్ క్వారీని లీజుకు తీసుకుని అడ్డగోలుగా తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఇది పూర్తిగా కర్ణాటక సరిహద్దుకు ఆనుకుని ఉండగా..రాత్రికి రాత్రి గ్రానైట్‌ను సరిహద్దు దాటించేస్తున్నారు. ఇవన్నీ తెలిసినా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కొండ కనబడితే చాలు ఎన్ఓసీ గుండుమల కుటుంబీకులు రూ.కోట్లు కుమ్మరించే గ్రానైట్, మెటల్ క్వారీ బిజినెస్‌పైనే దృష్టి సారించారు. టీడీపీ హయాంలో అడ్డూఅదుపు లేకుండా తవ్వకాలు సాగించారు. కొండలు కనబడితే చాలు వెంటనే క్వారీల నిర్వహణకు అనుమతి తీసుకుంటారు. వీరికి మైనింగ్, గనులు, రెవెన్యూ శాఖాధికారులు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. ఇతరులెవరైనా ఎన్ఓసీకి దరఖాస్తు చేసుకుంటే గుండుమలకు ముందుగానే సమాచారం ఇచ్చి స్వామిభక్తి చాటుకుంటున్నారు. అందువల్లే నియోజకవర్గంలో క్వారీల నిర్వహణకు పలువురు టీడీపీ నాయకులు దరఖాస్తు చేసుకున్నా వారికి దక్కని పరిస్థితి. పొరపాటున ఎవరైనా క్వారీలకు అనుమతులు తెచ్చుకున్నా గుండుమల కుటుంబీకులు వారిని భయాందోళనకు గురిచేస్తున్నారనే చర్చ ఉంది. తమదారికి వచ్చాక మామూళ్లు వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు గుండుమల అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇది మడకశిర మండలం మెళవాయి సమీపంలోని రోడ్డు మెటల్ క్వారీ. దీన్ని ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సోదరులు జయప్ప, సుభాష్‌లు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపడుతున్నారన్న ఫిర్యాదుల మేరకు ఇటీవల కర్నూలు విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. హద్దులు దాటి తవ్వకాలు చేసినట్లు గుర్తించి సీజ్ చేశారు. అయినా ఎమ్మెల్సీ కుటుంబీకులు క్వారీల్లో పనులు కొనసాగిస్తున్నారు. -
పరిటాల మైనింగ్ మాఫియాపై సీఎంకు ఫిర్యాదు
సాక్షి, ఆత్మకూరు: మాజీ మంత్రి పరిటాల సునీత బంధువులు, ఎస్ఆర్సీ సంస్థ నిర్వాహకులు ‘వడ్డెర్ల బండ’ ద్వారా రూ.250 కోట్లు దోపిడీ చేశారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొట్టి, అక్రమంగా కంకర తరలించి సొమ్ము చేసుకున్నారని విరుచుకుపడ్డారు. ఆత్మకూరు మండలం కుర్లపల్లి సమీపంలోని కంకర క్రషర్‌ను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ బండపై ఆధారపడి 200 వడ్డెర కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు. అయితే పరిటాల సునీత బంధువులు, ఎస్ఆర్సీ సంస్థ వారు క్రషర్ పేరిట లీజుకు తీసుకుని, అక్రమంగా మరికొంత బండను ఆక్రమించుకున్నారని విమర్శించారు. మూడో ప్యాకేజీ కింద హంద్రీ–నీవా కాలువ నిర్మాణం కోసం 20 లక్షల క్యూబిక్ మీటర్ల రాయికి బిల్లు తీసుకున్నారన్నారు. వాస్తవానికి కాలువపై ఆ మేరకు రాయి కనిపించడం లేదన్నారు. మరో 30 లక్షల టన్నుల రాయిని కంకరగా మార్చి అక్రమ మార్గంలో అమ్మేసుకున్నారన్నారు. వడ్డెర్ల బండకు సంబంధించి 24 ఎకరాలకు గాను 18 ఎకరాల్లో 35 లక్షల టన్నుల బండను క్రషింగ్ చేశారన్నారు. అంతేకాకుండా బండపైన, కాలువకు పైన ఉన్న రాయిలో దాదాపు 50 లక్షల టన్నుల రాయిని అమ్ముకున్నారన్నారు. మూడు ఎకరాలు బండ లీజు తీసుకుని, అంతకు మించి ఆక్రమించి బండ కొడుతున్నారని తెలిపారు. యరపతినేని మైనింగ్ మాఫియా తరహాలోనే ఇక్కడ కూడా మాఫియా చెలరేగిపోయిందన్నారు. క్రషర్ నిర్వాహకులు ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొట్టి సొమ్ము చేసుకుంటున్నా మైనింగ్ అధికారులు పట్టనట్టు వ్యవహరించారని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆత్మకూరు పంచాయతీ రూ.60 కోట్లకు పైగా ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఫిర్యాదు చేసినా పట్టని అధికారులు కంకర మిషన్ ద్వారా వెలువడే దుమ్ము సమీప పొలాలను కప్పేస్తుండటంతో పంటలు పండటం లేదని, స్థానికులు అనారోగ్యాల బారిన పడుతున్నారని రైతులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టనట్టు వ్యవహరించారని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఫిర్యాదు చేసిన రైతులపైనే తప్పుడు కేసులు పెట్టారన్నారు. అధికారులు ప్రజల పక్షాన పనిచేయాలని హితవు పలికారు. ఇదివరకే మైనింగ్ అధికారులకు, విజిలెన్స్ అధికారులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. త్వరలోనే ఈ మైనింగ్ మాఫియాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఆత్మకూరు, కృష్ణమరెడ్డిపల్లి, నసనకోట, సుబ్బరాయునిపల్లి వద్ద మైనింగ్ దోపిడీ యథేచ్ఛగా సాగుతోందన్నారు. అవినీతి అక్రమాలకు సహకారం అందిస్తున్న అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆత్మకూరు వడ్డెర్లకు జీవనోపాధిగా ఉన్న బండను తిరిగి అప్పగించాలని ఆయన సూచించారు. -
టీడీపీ నేతల గ్రానైట్ దందా
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలు విచ్చలవిడిగా దోపిడీ పర్వం సాగించారు. మైనింగ్ మాఫియాకు సహకరించి.. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన రూ.వందల కోట్ల రాయల్టీని ఎగ్గొట్టి, జేబులు నింపుకున్నారు. డొల్ల కంపెనీలు, దొంగ వే బిల్లులు సృష్టించి ప్రకాశం జిల్లా నుంచి విలువైన గ్రానైట్‌ను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించారు. గ్రానైట్ దోపిడీ వెనుక టీడీపీ మాజీ ఎమ్మెల్యేల పాత్ర ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే, గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ మాజీ ఎమ్మెల్యేల ప్రమేయం బయటపడింది. రవాణా శాఖ, సేల్స్ ట్యాక్స్, జీఎస్టీ, విజిలెన్స్ అధికారుల భాగస్వామ్యం ఉన్నట్లు తేలింది. ఒక్కో లారీకి రూ.17 వేలు వసూలు ప్రకాశం జిల్లాలో దాదాపు 2,500 గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒక్క మార్టూరు ప్రాంతంలోనే 700 వరకు పాలిషింగ్ యూనిట్లున్నాయి. ఇక్కడి నుంచి గ్రానైట్‌ను ఇతర రాష్ట్రాలకు తరలించాలంటే మూడు సర్టిఫికెట్లు అవసరం. గ్రానైట్ కంపెనీకి చెందిన ఇన్వాయిస్, మైనింగ్ పర్మిట్, ఈ–వే బిల్లు ఉండాలి. చెక్‌పోస్టుల్లో గానీ, తనిఖీ అధికారులు ఆపినప్పుడు గానీ ఇవి చూపించాల్సి ఉంటుంది. గ్రానైట్‌ను క్యూబిక్ మీటర్లలో సైజుల వారీగా తరలిస్తారు. సైజులను బట్టి ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి. ప్రతి రూ.లక్ష లావాదేవీకి 18 శాతం జీఎస్టీ (రూ.18,000) చెల్లించాలి. రిజిస్టర్ అయిన కంపెనీ పేరిట ఉన్న మైనింగ్ పర్మిట్, ఈ–వే బిల్లుల ప్రకారం ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ, మైనింగ్ మాఫియా సభ్యులు డొల్ల కంపెనీల పేరిట సృష్టించిన దొంగ ఈ–వే బిల్లులతో గ్రానైట్ లారీలను తరలించారు. దొంగ ఈ–వే బిల్లుల ముద్రణ, నకిలీ మైనింగ్ పర్మిట్ల వ్యవహారం మొత్తం బల్లికురవ కేంద్రంగా సాగినట్లు పోలీసుల విచారణలో తేలింది. అద్దంకి, మార్టూరు నుంచి గ్రానైట్‌ను సరిహద్దులు దాటించేందుకు ఒక్కో లారీ నుంచి రూ.17 వేల చొప్పున వసూలు చేశారు. ఇందులో రూ.5 వేలు ప్రభుత్వ అధికారులకు, మిగిలిన రూ.12 వేలు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలకు వాటాలు ఇచ్చేవారు. అద్దంకి, మార్టూరు నుంచి వినుకొండ, సంతమాగులూరు అడ్డరోడ్డు మీదుగా పిడుగురాళ్ల, దాచేపల్లి, అక్కడినుంచి తెలంగాణకు గ్రానైట్‌ను అక్రమంగా తరలించేవారు. ఈ మార్గంలో ఎవరైనా అధికారులు ఆపితే వినుకొండకు చెందిన మైనింగ్ మాఫియా రంగప్రవేశం చేసి, వ్యవహారాన్ని చక్కబెట్టేది. ఈ అక్రమ రవాణాకు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు అండగా నిలిచి రూ.కోట్లు వెనకేసుకున్నారు. గ్రానైట్ దోపిడీ వ్యవహారాన్ని రెండు మూడు రోజుల్లో ఆధారాలతో సహా బహిర్గతం చేయనున్నట్లు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి చెప్పారు. 270 డొల్ల కంపెనీలు, 16వేల దొంగ వే బిల్లులు ప్రకాశం జిల్లా నుంచి అక్రమంగా తరలిపోతున్న గ్రానైట్ లారీలను ఇటీవల పోలీసులు, విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వినుకొండ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మైనింగ్ మాఫియాకు చెందిన ఇద్దరు కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించడంతో అక్రమాల గుట్టు బయటపడింది. 270 డొల్ల కంపెనీలను సృష్టించి, 16,000 దొంగ వే బిల్లులతో ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని ఎగ్గొట్టినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రకాశం జిల్లాలో ఐదు నెలల కాలంలోనే మొత్తం రూ.300 కోట్ల రాయల్టీని ఎగ్గొట్టినట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది. -
టీడీపీ మహిళా నేత దందా
సాక్షి, పెనుకొండ: టీడీపీ మహిళా నేత అక్రమ దందా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మైనింగ్ అధికారులు సీజ్ చేసిన క్వారీ నుంచి కంకరను టిప్పర్‌తో అక్రమంగా తరలిస్తుండగా కియా పోలీసుస్టేషన్ సిబ్బంది శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని గుట్టూరు సమీపంలో టీడీపీ నాయకురాలు సవితమ్మ నిర్వహిస్తున్న ఎస్ఆర్ఆర్ ట్రస్టుకు చెందిన క్వారీకి సరైన అనుమతులు లేకపోవడంతో ఇటీవల జిల్లా మైనింగ్ అధికారులు సీజ్ చేశారు. క్వారీలోని కంకరను బయటకు తరలించకుండా ఆదేశాలు జారీ చేశారు. అయితే నిబంధనలను ఉల్లంఘించి క్వారీ నిర్వాహకులు గత రెండు రోజులుగా 6 ఎంఎం కంకరను టిప్పర్‌లో బయటకు తరలిస్తున్నారు. నిఘా ఉంచిన కియా పోలీసులు టిప్పర్‌లో అక్రమంగా తరలిస్తుండగా దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం టిప్పర్ సహా డ్రైవర్‌ను స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ నారాయణ తెలిపారు. ఇదిలా ఉంటే టిప్పర్‌పై దేవా వెంకటకొండయ్య పేరు ఉంది. ఇతను సవితమ్మ భర్త వెంకటేశ్వరరావుకు స్వయానా తమ్ముడు. ఇతను చనిపోయాడు. కంకరను సవితమ్మే అక్రమంగా తరలిస్తుందనేందుకు ఇదే నిదర్శనంగా పోలీసులు భావిస్తున్నారు. అయినప్పటికీ కేసు నమోదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. -
యరపతినేని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..
మైనింగ్ మాఫియా ఒంట్లో వణుకు మొదలైంది. అడ్డూ అదుపూ లేకుండా ప్రకృతి వనరులను కొల్లగొట్టిన ఘనుల బండారం బట్టబయలవుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకపర్వానికి తెర తీసిన అక్రమార్కులకు కళ్లెం పడబోతోంది. చట్టాలను తుంగలో తొక్కి పచ్చ చొక్కాలకు సలాం కొడుతూ గులాంగిరి చేసిన అధికారులను నడిరోడ్డుపై నిలబెట్టనుంది. పల్నాడు ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సాగించిన మైనింగ్ దందా గుట్టురట్టవుతోంది. యరపతినేనితో సహా ఆయనకు సహకరించిన పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికార యంత్రాంగానికి ఉచ్చు బిగుస్తోంది. ఈ మేరకు పిడుగురాళ్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సాక్షి, గుంటూరు: మైనింగ్ మాఫియా గుండెల్లో గుబులు మొదలైంది. అక్రమ మైనింగ్‌కు పాల్పడి ప్రకృతి సంపదను దోచుకున్న వాళ్లపై కేసుల రూపంలో ఉచ్చు బిగుస్తోంది. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నేతలు రెచ్చి పోయిన విషయం తెలిసిందే. చట్టాలను తమ చుట్టాలుగా భావిస్తూ తప్పుల మీద తప్పుల చేస్తూ పోయిన పచ్చపార్టీ నేతలు తగిన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరపడ్డాయని అందరూ అంటున్నారు. అక్రమ మైనింగ్‌పై 2015లో హైకోర్టును ఆశ్రయించినందుకుగాను టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, అప్పటి సీఐ హనుమంతరావు, ఎస్సై, కానిస్టేబుళ్లు, అప్పటి ఆర్డీవో, మైనింగ్ ఏడీలు తనను వేధింపులకు గురిచేసి, చంపాలని చూశారని వైఎస్సార్ సీపీ నాయకుడు కుందుర్తి గురువాచారి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు యరపతినేని సహా 12 మందిపై పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయం జిల్లాలో సంచలనంగా మారింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక పల్నాడు ప్రాంతంలోని గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం నడికుడి, కేసానుపల్లి, పిడుగురాళ్ళ మండలం కోనంకి గ్రామాల్లో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా కొనసాగింది. రూ.వేల కోట్ల విలువ చేసే లైమ్ స్టోన్ (సున్నం రాయి) నిక్షేపాలు అప్పటి ఎమ్మెల్యే యరపతినేని అండదండలతో మైనింగ్ మాఫియా కొల్లగొట్టిందన్న ఆరోపణలున్నాయి. దర్యాప్తు ప్రారంభం.. యరపతినేని, రెవెన్యూ, మైనింగ్ అధికారులకు వ్యతిరేకంగా అక్రమ మైనింగ్‌పై హైకోర్టులో పిల్ (ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం) వేసిన కోపంతో ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు, రౌడీలు, సీఐ హనుమంతరావు, ఎస్సై, కానిస్టేబుళ్లతో మానసికంగా, శారీరకంగా వేధించి చంపేందుకు యత్నించారని గురువాచారి ఫిర్యాదులో పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలతో యరపతినేని సహా 12మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం. 2016లో గురువాచారిని వేధింపులకు గురిచేసిన ఘటనపై ఇటీవల కేసు నమోదు కావడంతో మైనింగ్ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అరెస్టుల భయం.. పల్నాడు ప్రాంతంలో గత ఐదేళ్లలో జరిగిన అక్రమ మైనింగ్‌కు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే యరపతినేనికి అరెస్ట్ భయం పట్టుకుందని ఆయన సన్నిహితులు అంటున్నారు. అక్రమ మైనింగ్ కేసులో సీబీసీఐడీ అధికారులు తనను అరెస్టు చేయకుండా పోలీసులను ఆదేశించాలని ఇప్పటికే యరపతినేని శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై మరో కేసు నమోదవడంపై యరపతినేని శ్రీనివాసరావు ఆందోళన చెందుతున్నారని టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. -
టీడీపీ నేత యరపతినేనిపై కేసు నమోదు
సాక్షి, గుంటూరు: టీడీపీ నేతల మైనిగ్ మాఫియా అక్రమాలు బయటపడుతున్నాయి. కోర్టు ఆదేశాలతో టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదేవిధంగా యరపతినేనితో పాటు,ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 12 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరితో పాటు మైనింగ్ ఏడీ జగన్నాధరావు, ఆర్డీవో మురళీ, సీఐ హనుమంతావులపై కూడా కేసు నమోదు చేశారు. గతంలో అక్రమ మైనింగ్ తవ్వకాలపై గురవాచారి అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దాంతో తనపై వ్యతిరేకంగా కేసు పెట్టాడనే కోపంతో యరపతినేని.. గురవాచారిని కాళ్లు, చేతులు విరిగేలా కొట్టించాడు. తనపై జరిగిన దాడి గురించి గురవాచారి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టినా వారు పట్టించుకోలేదు. దీంతో చేసేది ఏమీ లేక గురవాచారి హైకోర్టులో ప్రైవేట్ కేసు వేశారు. ఈ క్రమంలో తాజాగా హైకోర్టు ఆదేశాలతో యరపతినేనితో సహా రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులపై కేసుల నమోదయ్యాయి. -
హద్దులు దాటి.. అక్రమ తవ్వకాలు!
సాక్షి, అమరావతి : ఇన్నాళ్లూ అధికారం అడ్డం పెట్టుకుని అక్రమాలు సాగించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా దందా కొనసాగిస్తున్నారు. అనుమతి లేని చోట కొండలను అక్రమంగా తవ్వేస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామ రెవెన్యూ పరిధి దొనబండ సర్వే నంబర్ 801లోని 1,204 ఎకరాల్లో 94 క్వారీలకు స్థానిక టీడీపీ నేతలు గత ప్రభుత్వ హయాంలో అనుమతులు తెచ్చుకున్నారు. ఒక్కోచోట 5 నుంచి 10 హెక్టార్లలోపు మాత్రమే క్వారీయింగ్‌కు అనుమతులు లభించాయి. క్వారీయింగ్‌కు అనుమతించిన ప్రాంతంలో మూడేళ్ల కిందటే తవ్వకాలు పూర్తయ్యాయి. ఆ తరువాత టీడీపీ నేతల కన్ను అక్కడికి సమీపంలోనే ఉన్న కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌పై పడింది. క్వారీయింగ్ పూర్తి చేసిన ప్రాంతానికి చెందిన అనుమతులనే చూపిస్తూ రిజర్వ్ ఫారెస్ట్‌లోకి చొచ్చుకుపోయారు. అటవీ ప్రాంతంలో కొండలను నిత్యం బ్లాస్టింగ్లతో పిండి చేస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సమీప బంధువులే ఇక్కడ అక్రమ క్వారీలు నిర్వహిస్తుండడం గమనార్హం. అక్రమ మైనింగ్‌కు సహకరించినందుకు ఎన్నికల సమయంలో టీడీపీకి కొందరు వ్యక్తులు నిధులు సమకూర్చినట్లు ఆరోపణలున్నాయి. అంతరించిపోతున్న వన్యప్రాణులు కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ 150 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఇక్కడ అపార ఖనిజ సంపదతోపాటు వన్యప్రాణులు జీవిస్తున్నాయి. 32 రకాల జంతువులున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. ఈ అటవీ ప్రాంతంలో 48 రకాల అరుదైన వృక్ష జాతులు కూడా ఉన్నాయి. ఇక్కడ 100 హెక్టార్లలో కొండలు విస్తరించి ఉండగా ఇప్పటికే దాదాపు 80 హెక్టార్ల పరిధిలో కొండలను మైనింగ్ మాఫియా తవ్వేసింది. ఈ క్రమంలో అరుదైన వృక్ష జాతులు నాశనమయ్యాయి. జిలెటిన్ స్టిక్స్‌తో బ్లాస్టింగ్లు చేస్తుండడంతో వన్యప్రాణులు కన్ను మూస్తున్నాయి. హద్దులను చెరిపి క్వారీయింగ్‌కు మైనింగ్ శాఖ అనుమతులు ఇచ్చేటప్పుడు సర్వే నిర్వహించి హద్దులు నిర్ధారించాలి. అయితే, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అండదండలతో పరిటాల క్వారీలకు నిర్వాహకులు హద్దులే లేకుండా చేశారు. 94 క్వారీలకు హద్దులు ఏమిటో ఎవరికి తెలియవు. హద్దులు చెరిపేసి... సరిహద్దులు దాటి రెవెన్యూ, ఫారెస్ట్ భూముల్లోకి మైనింగ్ మాఫియా చొచ్చుకుపోయింది. నెల రోజులపాటు విరామం రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో తమ అక్రమ మైనింగ్ వ్యవహారం బయటపడకుండా నిర్వాహకులు నెల రోజుల పాటు తవ్వకాలు నిలిపేశారు. అయితే, తాజాగా మళ్లీ బ్లాస్టింగ్లు ప్రారంభించారు. ఇక్కడి నుంచి వచ్చే దుమ్ము, ధూళి వల్ల తమ పంటలకు నష్టం వాటిల్లుతోందని సమీప ప్రాంత రైతులు గగ్గోలు పెడుతున్నా మైనింగ్ నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హద్దులు నిర్ధారించి, అక్రమ మైనింగ్‌ను అరికట్టాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. పర్యావరణానికి తీవ్ర నష్టం రిగ్ బ్లాస్టింగ్ల వల్ల వచ్చే భారీ శబ్దాలను భరించలేక వణ్యప్రాణులు ఈ ప్రాంతం నుంచి పారిపోతున్నాయి. పర్యావరణం పరంగా తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అక్రమంగా అటవీ భూముల్లో మైనింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం – బూరుగు లెనిన్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, కంచికచర్ల -
అడ్డదారుల్లో.. అడ్డగోలుగా
సాక్షి, టెక్కలి(శ్రీకాకుళం) : డివిజన్ కేంద్రమైన టెక్కలిలో మైన్స్ కార్యాలయం అక్రమాలకు నిలయంగా మారుతోందనే విమర్శలు గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయి. ఇక్కడి అధికారులు సంవత్సరాలు తరబడి సిట్టింగ్ వేయడంతో అటు గ్రానైట్ క్వారీల్లో... ఇటు ఇప్పుడిప్పుడే చాప కింద నీరులా సాగుతున్న క్రషర్ చిప్స్ అనుమతుల్లో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత ఐదేళ్ల కాలంలో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు అండతో మైనింగ్ అధికారులు చేసిన అడ్డగోలు వ్యవహారాలు తారాస్థాయిలో ఉన్నప్పటికీ అవేమీ బయట పడకుండా సదరు నేతకు, చోటా నాయకులకు గుట్టు చప్పుడు కాకుండా ముడుపులు చెల్లించారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఐదేళ్లలో క్వారీ బ్లాకుల తరలింపు విషయంలో అక్రమాలు ఉన్నప్పటికీ ఎక్కడా బయట పడకుండా అధికారులు తస్మాత్ జాగ్రత్తగా వ్యవహరించినట్లు సమాచారం. ఇప్పుడు క్వారీల్లో నిల్వగా ఉన్న మెటిరీయల్తో తయారయ్యే చిప్స్ విషయంలో మళ్లీ అధికారుల చేతివాటం తారాస్థాయికి చేరుకుంది. క్వారీలకు అనుకుని సమీప దూరంలో ఉన్న కొన్ని క్రషర్ యూనిట్లకు అడ్డగోలు ‘టీపీ’ (తాత్కాలిక అనుమతులు) ఇచ్చి, ఇష్టారాజ్యంగా రవాణాకు ప్రోత్సహిస్తున్నారు. వాస్తవానికి ప్రతి డంపర్‌కు లోడ్ చేసే విషయంలో ఎప్పటికప్పుడు బిల్లులు పక్కాగా ఉండాలి. అయితే ఇక్కడ ఆ పరిస్థితులు కనిపించడం లేదు. నామమాత్రంగా అనుమతులు ఇస్తూ లెక్కలేని విధంగా యూనిట్లను లోడ్ చేసుకుంటున్నారు. టెక్కలి సమీపంలో కొన్ని క్వారీల నుంచి రోజూ టెక్కలి మీదుగా లెక్కకు మించిన చిప్స్ లోడ్లు రవాణా జరుగుతున్నాయి. ఏ రోజూ వాటిపై మైన్స్ అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. దీంతో అడ్డగోలు ‘టీపీ’ల వ్యవహారం బయట పడడం లేదు. వాస్తవానికి టెక్కలి మైన్స్ కార్యాలయంలో కొంతమంది అధికారులు, దిగువ స్థాయి సిబ్బంది సంవత్సరాలు తరబడి ఇక్కడే తిష్ట వేయడం వల్ల కొన్ని రకాల వ్యవహారాలు అలవాటుగా మారిపోయాయి. దీంతో అక్రమాలు చోటు చేసుకోవడమే కాకుండా ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో చేరాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందిస్తే, ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
దెందులూరులో చింతమనేని అధ్వర్యంలో మైనింగ్ మాఫియా
-
ఏపీలో మరో కుట్ర బట్టబయలు
సాక్షి, గుంటూరు: ప్రశాంతంగా ఉన్న గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో అలజడులు సృష్టించేందుకు టీడీపీ నేతలు కుట్ర పన్నారు. ఎన్నికల సమయంలో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి.. రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తన అనుచరుల మధ్య వివాదాన్ని.. వైఎస్సార్సీపీ మెడకు చుట్టాలనుకున్నారు. తన హత్యకు కుట్ర పన్నారంటూ వైఎస్సార్సీపీ మీద బురద జల్లుతూ ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు రాయించారు. అయితే జిల్లా రూరల్ ఎస్పీ ఇది యరపతినేని అనుచరుల మధ్య ఆధిపత్య పోరు మాత్రమే అని పక్కాగా తేల్చడంతో.. ఇప్పుడు ఆయన దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వివరాలు.. పల్నాడు ప్రాంతంలో తుపాకులు పట్టుకుని తిరుగుతున్న గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరులైన నల్లబోతు శ్రీనివాసచౌదరి, వడ్లమూడి శివరామకృష్ణ చౌదరి, పూర్ణచంద్రరావును ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఓటమి భయంతో ఉన్న యరపతినేని.. తమ అనుచరులు తుపాకులతో పట్టుబడటాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇది తనకు మరింత చెడ్డ పేరు తెచ్చిపెట్టిందని భావించారు. తనకు రాజకీయ సమాధి తప్పదనుకున్న ఆయన వెంటనే.. తన హత్యకు వైఎస్సార్సీపీ కుట్ర పన్నిందంటూ ఎల్లో మీడియాలో కథనాలు రాయించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నించారు. అయితే యరపతినేని ప్రధాన అనుచరుడు, మైనింగ్ మాఫియాలో కీలక సూత్రధారి అయిన ముప్పన వెంకటేశ్వర్లును మట్టుబెట్టేందుకు.. మిగతా అనుచరులంతా ఏకమై తుపాకులు తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. యరపతినేని నామినేషన్ కార్యక్రమంలోనే వెంకటేశ్వర్లును కాల్చి చంపాలనుకున్నట్లు వెల్లడైంది. ఇదంతా యరపతినేని అనుచరుల ఆధిపత్య పోరులో భాగమేనని గుంటూరు రూరల్ ఎస్పీ ఎస్.వి.రాజశేఖర్‌బాబు స్పష్టం చేశారు. అయినా కూడా ఓటమి భయంతో ఉన్న యరపతినేని.. ఎల్లో మీడియా ద్వారా ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు యరపతినేని అనుచరులు అనుకున్నది పక్కాగా జరిగితే.. ఆ నేరాన్ని వైఎస్సార్సీపీ నేతలపైకి నెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నారేమోననే అనుమానాలను స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, తుపాకులతో పట్టుబడ్డ నలబోతు శ్రీనివాసరావు చౌదరితో పాటు ఎమ్మెల్యే యరపతినేని, ఆయన అనుచురుడు ముప్పన వెంకటేశ్వర్లు.. గతంలో జరిగిన కాంగ్రెస్ నేత ఉన్నం నరేంద్ర హత్య కేసులో నిందితులు. అయినా కూడా దొంగే దొంగా అని అరిచినట్లుగా ఉంది ఆయన తీరు అని స్థానికులు మండిపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఇలాంటి కుట్రలు పన్నుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. పల్నాడులో యథేచ్ఛగా అక్రమ క్వారీయింగ్ ఎన్నికల నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలు భారీగా మోహరించి తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ.. పిడుగురాళ్ళ, దాచేపల్లి, కేశానుపల్లి, తంగెడ తదితర ప్రాంతాల్లో మైనింగ్ మాఫియా యథేచ్ఛగా తెల్లరాయి అక్రమ తవ్వకాలకు పాల్పడుతోంది. భారీ ఎత్తున బ్లాస్టింగ్‌లకు పాల్పడుతూ అక్రమంగా పేలుడు పదార్థాలు నిల్వ ఉంచుతోంది. అయినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. ఎన్నికల సమయంలో అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళితే.. ఘోర సంఘటనలు జరిగే ప్రమాదముంది. పోలీస్స్టేషన్లకు కూతవేటు దూరంలో బ్లాస్టింగ్లు జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. -
మాఫియా గుండెల్లో మందుపాతర ముగ్ధ సిన్హా
‘వెల్డన్.. డన్ ఎ గ్రేడ్ జాబ్’ అనేవారు. వెంటనే ట్రాన్స్ఫర్ చేసేవారు. ప్రతిసారీ అంతే. ప్రతిచోటా అంతే. ముగ్ధ బెదర్లేదు. బ్యాక్ స్టెప్ వెయ్యలేదు.ఎందుకోసమైతే ఆమె ఐఏఎస్ అయ్యారో అందుకోసమే పనిచేస్తున్నారు.ఆమె సామాన్యుల పక్షం. వాళ్ల కోసం ఎంతటివాళ్లతోనైనా పోరాడేందుకు సిద్ధం అయ్యే.. ఏరోజుకారోజు ఆమె డ్యూటీకి బయల్దేరుతుంటారు. రాజస్థాన్ కేడర్‌కు చెందిన ముగ్ధ ప్రస్తుతం రాజస్థాన్–ఢిల్లీమధ్య పాలనా వ్యవహారాల్లో కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాజస్థాన్‌లోని ఝున్ఝును జిల్లా. 2010. ఆ జిల్లాలోని పల్లెల్లో.. చట్టబద్ధమైన ఎలాంటి అనుమతి, అంగీకారం లేకుండా యథేచ్ఛగా మైనింగ్ జరుగుతోంది. అగ్రకులాల వాళ్లు ఏది చెబితే అదే చట్టం. ఏం చేస్తే అదే న్యాయం. మైనింగ్ మాఫియా, బోర్‌వెల్స్, గ్యాస్ సిలెండర్స్, బ్లాక్ మార్కెటింగ్.. ఒకటేమిటి అన్నీ! అలా ఒకసారి.. ఓ గ్రామంలో మైనింగ్ కోసం పేలుడు పదార్థాలు పెట్టారు. ధనార్జనే ధ్యేయం కాబట్టి పనిచేస్తున్న కూలీల, చుట్టుపక్కల ప్రజల భద్రతను గాలికొదిలేశారు. దాంతో ఆ పేలుడికి కొంతమంది ఎగిరిపడ్డారు. ప్రాణాలు గాల్లో కలిశాయి. తర్వాత చూస్తే దగ్గర్లో ఉన్న పొదల్లో తెగిపడ్డ తలలు కనిపించాయి. ఊరంతా వణికిపోయింది. దానికి బాధ్యులమంటూ స్థానిక మైనింగ్ కంపెనీలేవీ ముందుకు రాలేదు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారాన్నిచ్చే బాధ్యతా తీసుకోలేదు. చివరకు ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించింది. ఆ మైనింగ్ వ్యవస్థా మూతపడింది. ఇదంతా ఇక్కడ రాసినంత తేలిగ్గా, అలవోకగా జరగలేదు. కొన్ని నెలల పోరాటం, బెదిరింపులు, బదిలీలు.. అన్నీ జరిగాకే న్యాయం గెలిచింది. అది ఓ వ్యక్తి సాధించిన విజయం. ఆమె ఆ జిల్లా కలెక్టర్. పేరు ముగ్ధా సిన్హా. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఆ జిల్లాకు కలెక్టర్‌గిరీ చేయడానికి పురుష ఐఏఎస్ అధికారులే భయపడ్తుంటే మహిళా ఐఏఎస్‌లు చార్జ్ తీసుకోవడం ఊహించలేని విషయం. కాని ఆ సవాల్‌ను స్వీకరించారు ముగ్ధా సిన్హా. ఝున్‌ఝునుకు వచ్చిన మొదటి మహిళా కలెక్టర్‌గానే కాదు.. ఆ జిల్లాను ఓ దారిలో పెట్టిన ఐఏఎస్గానూ చరిత్రలో నిలిచారు. నిజానికి నలభై లక్షల జనాభా ఉన్న పెద్ద జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేసిన ముగ్ధా.. ఝున్‌ఝునుకు ట్రాన్స్ఫర్ అవగానే.. చిన్న జిల్లా, హాయిగా పనిచేసుకోవచ్చని ఊపిరి పీల్చుకున్నారట. తీరా వచ్చాక తెలిసింది.. పరిమాణంలో చిన్నదే అయినా ఎదుర్కోవాల్సిన చాలెంజెస్ పెద్దవని. భయపడలేదు ఆమె. ‘‘బ్యూరోక్రాట్స్‌లో నాలుగు రకాలుంటారు. ఒకటి.. నిజాయితీగా, సమర్థవంతంగా పనిచేసేవారు. రెండు.. నిజాయితీగా ఉన్నా సామర్థ్యంలేని వాళ్లు. మూడు.. సామర్థ్యం ఉన్నా నిజాయితీలేని వాళ్లు. నాలుగు.. అవినీతి, అసమర్థులైన ఆఫీసర్లు. నాకు తెలిసింది.. నేను ప్రయత్నించేది.. ఒక్కటే.. నిజాయితీగా ఉండాలి.. సమర్థవంతంగా పనిచేయాలి. ఆ సూత్రాన్ని నమ్మాను కాబట్టే ఝన్‌ఝునులో పరిస్థితులకు వెరవలేదు’’ అంటున్నారు ముగ్ధ. మాఫియా నుంచి ఫోన్ కాల్స్ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాక ముగ్ధాకు చాలా ఫోన్‌కాల్స్ వచ్చాయి.. ‘‘మళ్లీ మా మైన్స్ ఎప్పుడు తెరుస్తున్నారు’’ అంటూ! అలా ఫోన్ చేసిన వాళ్లెవరూ నిజమైన యజమానులు కారు. యజమానులు ఫోన్ చేయించిన మధ్యవర్తులు. అలాంటి ఏ ఒత్తిళ్లకూ తలొగ్గలేదు ముగ్ధ. అదొక్కటే కాదు.. ఝున్‌ఝునులో జరుగుతున్న ఇతర అరాచకాలకూ ఆమె అడ్డుకట్ట వేశారు. మైనింగ్ తర్వాత ఆ రేంజ్‌లోనే ఉన్న వంట గ్యాస్ సిలెండర్ల బ్లాక్ మార్కెటింగ్‌నూ బ్లాక్ చేసేశారు. అలాగే పర్మిషన్ లేకుండా వేస్తున్న బోర్‌వెల్స్‌నూ పూడ్చేయించారు. హర్యానా నుంచి బోర్వెల్ మెషీన్స్ వచ్చేవి. వాటన్నిటినీ సీజ్ చేయించారు. ఝున్ఝునూను పట్టి పీడిస్తున్న ఇంకో పెద్ద రుగ్మత.. అగ్రకుల అహంకారం. సామాన్యులు తమ గోడు వెళ్లబుచ్చుకోవడానికి కలెక్టర్ ఆఫీస్ ముందు వరుస కడితే.. వాళ్ల ముందు అగ్ర కులస్థుల సమూహం ఉండేది. అగ్రకులస్థులు కలెక్టర్‌ను కలిసి మాట్లాడాకే నిమ్న కులస్థులు కలవాలి. ఇది అక్కడి ఆనవాయితీ. ఆ ‘సంప్రదాయాన్ని’ తుంగలో తొక్కారు ముగ్ధ. అసలు ఎవరూ తన ఆఫీస్ ముందు క్యూ కట్టకముందే గ్రామాల్లోకి వెళ్లిపోయి ప్రత్యక్షంగా సామాన్య ప్రజలను ఆమె కలిసేవారు. వాళ్ల అర్జీలు, దరఖాస్తులు తీసుకునేవారు. సత్వర పరిష్కారం కోసమూ అంతే శ్రమించేవారు. ఆఫీస్ పనివేళలు అయిపోయి, పని మిగిలిపోతే ఆ ఫైల్స్ పట్టుకుని ఇంటికి వెళ్లేవారు. రాత్రంతా కూర్చొని ఫైల్స్ చెక్ చేసేవారు. ఆమె నిజాయితీ, సామాన్యులకు అండగా ఉన్న తీరు, మైనింగ్ మాఫియా, బ్లాక్ మార్కెటింగ్‌పై ఆమె ఉక్కుపాదం మోపడం.. ఇవన్నీ గిట్టని పెద్దలు ఆర్నెల్లలో ముగ్ధకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇప్పించారు. ఆ ఆర్డర్ తీసుకునే ముందు.. ఆరావళి పర్వత సాణువుల్లోని మైన్స్‌లో ఇల్లీగల్ మైనింగ్ కోసం పేలుడు పదార్థాల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కులన్నిటినీ ముగ్ధ సీజ్ చేయించారు. ఇది జరిగి దాదాపు తొమ్మిదేళ్లవుతోంది. ఇప్పటి వరకు ఆ మైన్స్ తెరుచుకోలేదు. ఆమె తీసుకున్న నిర్ణయాన్ని కాదనే ధైర్యం ఎవరూ చేయట్లేదు. అడ్మినిస్ట్రేషన్‌లో ముగ్ధ వేసిన ముద్ర అది! అమ్మ కోరికపై ఐఎఎస్ ముగ్ధా తండ్రి గురు స్వరూప్ సిన్హా. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌గా పనిచేసేవారు. చైనాతో, ఆ తర్వాత 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. 1978లో విమాన ప్రమాదంలో మరణించారు.. విధి నిర్వహణలోనే. అప్పటికి ముగ్ధ వయసు నాలుగేళ్లు. ఇద్దరు చెల్లెళ్లు. తల్లి కమలా సిన్హా పిల్లల్ని పెంచి పెద్దచేసింది. సమాజాన్ని సంస్కరించడం కోసం ముగ్ధాకు ఐఏఎస్ లక్ష్యాన్ని నిర్దేశించిందీ ఆమెనే. భర్త చనిపోయాక పిల్లలను తీసుకుని ఆగ్రా వెళ్లిపోయారు కమల. పాఠశాల విద్యను అక్కడే పూర్తి చేశారు ముగ్ధ. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో హిస్టరీ హానర్స్ చదివారు. కాలేజ్ ఫస్ట్. యూనివర్సిటీలో థర్డ్ ర్యాంకర్. ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో ఎమ్మే చేశారు. సెకండ్ అటెంప్ట్‌లో ఐఏఎస్ సాధించారు. సివిల్స్‌లో ఆమెది ఆల్ ఇండియా ఎయిత్ ర్యాంక్. జైపూర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా ముగ్ధానే. రెండేళ్లు సీఎమ్ (రాజస్థాన్) ఆఫీస్‌లోనూ పని చేశారు. జిల్లా కలెక్టర్‌గా 2005లో మొదటి అపాయింట్మెంట్ తీసుకున్నారు. ‘‘సివిల్ సర్వీస్.. జాబ్ కాదు. నిజంగా సర్వీసే. సామాన్యుల సంక్షేమం కోసం చేసే సేవ. మనం చేసిన పనే తర్వాతి తరాల వాళ్లకు అందే వారసత్వం. మన పనే ప్రజల హృదయాల్లో మనకు సుస్థిరస్థానం కల్పిస్తుంది’’ అని అంటారు ముగ్ధా సిన్హా. పదేళ్లలో పదమూడు బదిలీలు! ఆర్నెల్లలోనే అరవై ఏళ్ల పాలనా సంస్కరణలు తెచ్చారు ముగ్ధ. అందుకే ఆమె ట్రాన్స్ఫరై పోతుంటే ఆ జిల్లాలోని ప్రజలు సరే.. లాయర్లు, టీచర్లు, ఇంజనీర్లు అందరూ ముగ్ధా బదిలీని ఆపమంటూ ధర్నా నిర్వహించారు. బంద్‌కు పిలుపిచ్చారు. ఆమెలోని సిన్సియారిటీ, సమర్థత తన పదిహేనేళ్ల సర్వీస్‌లో పదమూడు ట్రాన్స్ఫర్స్లను గిఫ్ట్‌గా ఇచ్చింది. అయినా అలుపెరగక ప్రయాణిస్తూనే ఉన్నారామె తను నమ్మిన దారిలో. -
పల్నాడులో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా
-
ఎమ్మెల్యే యరపతినేని దౌర్జన్యకాండ
సాక్షి, గుంటూరు: తన ఆకలి తీర్చుకోవడానికి పాము తన పిల్లల్ని తానే తింటుందని చెబుతుంటారు. అదే తీరున గుంటూరు జిల్లా గురజాల అధికార పార్టీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ధనదాహానికి సొంత పార్టీ నేతల్నే బలి తీసుకుంటున్నారు. యరపతినేని కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియా.. క్వారీల యజమానులు, లీజుదారులను బెదిరించి దౌర్జన్యంగా క్వారీలను ఆక్రమించి అక్రమ తవ్వకాలకు తెగబడుతోంది. ఇప్పుడు వీరి కన్ను సొంత పార్టీ నేతల క్వారీలపై పడింది. వీరి బారిన పడిన అనేక మంది భూములు కోల్పోయి అప్పులపాలై ఊరు వదలి వెళ్లిపోయారు. తాజాగా గురజాల మాజీ ఎమ్మెల్యే గడిపూడి మల్లికార్జునరావు కుమారుడు ఆదినారాయణ అలియాస్ బుజ్జి.. యరపతినేని బెదిరింపులతో మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్చగా.. అక్కడికి చేరుకున్న మైనింగ్ మాఫియా యరపతినేని పేరు బయట పెట్టవద్దంటూ ఆదినారాయణ సోదరులు, బంధువులతో బేరసారాలకు దిగారు. వాటికి లొంగకపోవడంతో దౌర్జన్యానికి దిగారు. మీడియాపై కూడా దురుసుగా ప్రవర్తిస్తూ నెట్టివేశారు. తమ కుటుంబానికి ఎమ్మెల్యే వల్ల ప్రాణహాని ఉందని, తమకేం జరిగినా ఆయనదే బాధ్యతని కుటుంబసభుల్య మీడియా ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరుల క్వారీల దురాక్రమణ దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే గడిపూడి మల్లికార్జునరావు కుమారుడు ఆదినారాయణ, ఆయన బావమర్ది బెల్లంకొండ పూర్ణచంద్రరావులకు సర్వే నెంబర్ 325లో 2. 10 ఎకరాల భూమి ఉంది. అందులో తెల్లరాయి నిక్షేపాలు ఉండటంతో క్వారీ లీజు అనుమతి కోసం దరఖాస్తు చేశారు. దీంతో 2018 జూలై 10వ తేదీన పూర్ణచంద్రరావు పేరుతో మైనింగ్ అధికారులు అనుమతులిచ్చారు. ఎమ్మెల్యే యరపతినేని కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియాపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం, సీబీసీఐడీ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో మైనింగ్ మాఫియా వ్యూహాన్ని మార్చేసింది. గతంలో మూతబడ్డ క్వారీలు, వీరు బెదిరించి నిలుపుదల చేసిన క్వారీలను దౌర్జన్యంగా లాక్కుని వాటికి తిరిగి అనుమతులు తెప్పించుకుని తెల్లరాయిని అక్రమంగా దోచేసే కుట్రకు తెరతీశారు. ఇందులో భాగంగా కేసానుపల్లిలో ఆదినారాయణకు చెందిన క్వారీని కూడా లాగేసుకుని తవ్వకాలు మొదలు పెట్టారు. తమ క్వారీని అప్పగించాలంటూ ఆదినారాయణ గత పదిరోజులుగా యరపతినేని అనుచరుడు, అక్రమ మైనింగ్ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న నెల్లూరి శ్రీనివాసరావును కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఎమ్మెల్యే తమకు అప్పగించారని, ఆయనతో మాట్లాడుకుని తేల్చుకోవాలంటూ శ్రీనివాసరావు చెప్పాడు. ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు తన క్వారీని లాక్కుని అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న నెల్లూరి శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలంటూ ఆదినారాయణ శనివారం దాచేపల్లి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే పోలీసులు పట్టించుకోలేదు. దీంతో శనివారం రాత్రి ఆదినారాయణ సోదరుడు కోటేశ్వరరావు ఎమ్మెల్యే యరపతినేని వద్దకు వెళ్లి తమ క్వారీ అప్పగించాలంటూ వేడుకున్నారు. ఎంతో కొంత తీసుకుని వెళ్లిపోవాలంటూ చెప్పడంతో చేసేదేమీ లేక వెనక్కు వచ్చేశారు. ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ఫోన్ చేసి బెదిరించడంతో తీవ్ర మనస్థాపం చెందిన ఆదినారాయణ ఇంటికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి కొన ఊపిరితో ఉన్న ఆదినారాయణను పిడుగురాళ్ల పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స చేస్తున్నారు. యరపతినేని వల్ల మా కుటుంబానికి ప్రాణహాని ఉంది ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించినప్పటి నుంచి మా తండ్రి, మాజీ ఎమ్మెల్యే గడిపూడి మల్లిఖార్జునరావు పార్టీకి అండగా ఉన్నారు. యరపతినేని ఎమ్మెల్యేగా గెలిపించడం కోసం మేం ఎంతో కష్టపడ్డాం. అలాంటి మాపై యరపతినేని వ్యవహరించిన తీరు బాధాకరం. మా సోదరుని క్వారీని ఎమ్మెల్యే అనుచరులు ఆక్రమించారని ఆయన వద్దకు వెళ్లి చెబితే ఎంతోకొంత డబ్బులు తీసుకోమని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కొడుకులమైన మాకే ఇలా జరిగితే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోండి. అలాగే మా బావమరిదిని కూడా బెదిరించి క్వారీని స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడిన తరువాతే మా తమ్ముడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యరపతినేని వల్ల మా కుటుంబానికి ప్రాణ హాని ఉంది. మాకు ఏం జరిగినా ఆయనదే బాధ్యత. – గడిపూడి కోటేశ్వరరావు, లక్ష్మయ్య(ఆదినారాయణ సోదరులు) -
అక్రమ మైనింగ్‌కు అడ్డాగా కొత్తగూడెం జిల్లా