Ministry of Jal Shakti
-
కాళేశ్వరం బ్యారేజీలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు!
సాక్షి, హైదరాబాద్: వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరింత నష్టం కలగకుండా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇటీ వల సమర్పించిన మధ్యంతర నివేదికలో సిఫారసు చేసిన అత్యవసర మరమ్మతులు, తదుపరి పరీక్షలను ఏకకాలంలో చేపట్టాలని అధికారులను ఆదే శించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఆ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. వర్షాలు ప్రారంభం కాకముందే వీలైనవన్నీ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పనుల పురోగతిపై రోజువారీగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి నివేదిక సమర్పించాలని ఆ శాఖను కోరింది. కమిటీ సిఫారసు చేసిన మేరకు సీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్, సీడబ్ల్యూపీఆర్ఎస్, ఎన్జీఆర్ఐ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో బ్యారేజీల్లోని లోపాలపై తదుపరి పరీక్షలు (ఇన్వెస్టిగేషన్లు) జరిపించాలని సూచించింది. జియో టెక్నికల్, జియోఫిజికల్ పరీక్షల నిర్వహణ కోసం ఒక్కో సంస్థకు ఒక్కో బ్యారేజీ బాధ్యతలను అప్పగించనుంది. మరమ్మతులు, పరీక్షలు ఏకకాలంలో నిర్వహించాలని ఆదేశించింది. మేడిగడ్డలో ఆ గేట్లు ముందే ఎత్తేయండిమేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయిన ఏడో నంబర్ బ్లాక్‌లోని గేట్లన్నింటినీ వర్షాకాలం ప్రారంభానికి ముందే ఎత్తివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పియర్లు కుంగిపోవడంతో 20, 21వ నంబర్ గేట్లను ఎత్తడం సాధ్యం కాదని, వాటి విడిభాగాలను విడదీసి తొలగిస్తామని ఇంజనీర్లు వివరించారు. ఆ ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు!బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులను సొంత బాధ్యతతో నిర్వహించడానికి నిర్మాణ సంస్థలు ముందు వస్తే సరి.. లేకుంటే ఒప్పందంలోని నిబంధనల ప్రకారం వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆ తర్వాత అవసరమైన నిధులు ఇస్తామని తెలిపారు. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తికాకపోయినా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేసినట్టు ధ్రువీకరిస్తూ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ చేసిన ఇంజనీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ చేసిన ఒక సూపరింటెండింగ్ ఇంజనీర్, మరో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌పై సస్పెన్షన్ వేటు వేసేందుకు నీటిపారుదల శాఖ సిద్ధమైనట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వ ఆమోదంతో ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. నిర్లక్ష్యం వహించిన ఇతర అధికారులపై కూడా..ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ సమర్పించిన మధ్యంతర నివేదికల ఆధారంగా బ్యారేజీల నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, నిర్వహణ, పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన ఇతర అధికారులపై సైతం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కోరినట్టు తెలిసింది. సుందిళ్ల బ్యారేజీకి మరమ్మతుల నిర్వహణకు ఇంకా ముందుకు రాని నిర్మాణ సంస్థను రప్పించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్నారం, సుందిళ్ల నుంచి సాగునీరుమేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ ఇప్పట్లో సాధ్యం అయ్యే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో దానికి ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి నీళ్లను ఎత్తిపోసి వచ్చే వానాకాలంలో రైతులకు సాగునీరు సరఫరా చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కోరింది. -
ఎండుతున్న జలకళ
అనుకున్నంతా అయింది. విశ్లేషకులు భయపడుతున్నట్టే జరిగింది. మొన్న మార్చిలోనే దేశంలోని ప్రధాన జలాశయాలన్నీ అయిదేళ్ళలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి అడుగంటినట్టు వార్తలు వచ్చి నప్పుడు వేసవిలో ఇంకెంత గడ్డుగా ఉంటుందో అని భయపడ్డారు. సరిగ్గా అప్పుడనుకున్నట్టే ఇప్పుడు దేశం నీటికొరత సంక్షోభంలోకి జారిపోతోంది. ఏప్రిల్ 25 నాటికి దేశవ్యాప్తంగా రిజర్వాయర్లలో నీటిమట్టం ఆందోళనకర స్థాయికి పడిపోయినట్టు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజా లెక్కలు వెల్లడించాయి. ముఖ్యంగా, దక్షిణాదిలో పదేళ్ళలో ఎప్పుడూ లేనంత కనిష్ఠస్థాయికి జలాశ యాల్లో నీటి నిల్వలు పడిపోయాయి. సాగునీటికీ, తాగునీటికీ, జలవిద్యుత్ ఉత్పత్తికీ తిప్పలు తప్పేలా లేవు. ఆ సవాళ్ళకు సంసిద్ధం కావాల్సిన అవసరాన్ని గణాంకాలు గుర్తు చేస్తున్నాయి.దేశం మొత్తం మీద రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యంలో కేవలం 30 శాతం వరకే ప్రస్తుతం నీళ్ళున్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఇది గత ఏడాది కన్నా తక్కువ. అందుకే ఇప్పుడింతగా ఆందోళన. వర్షాకాలంలో 2018 తర్వాత అతి తక్కువ వర్షాలు పడింది గత ఏడాదే. దానికి తోడు ఎల్‌నినో వాతావరణ పరిస్థితి వల్ల గత వందేళ్ళ పైచిలుకులో ఎన్నడూ లేనంతగా నిరుడు ఆగస్టు గడిచి పోయింది. వర్షాలు కురిసినా, కొన్నిచోట్ల అతివృష్టి, మరికొన్నిచోట్ల అనావృష్టి. ఇవన్నీ కలిసి దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. దీర్ఘకాలంగా వర్షాలు కొరవడడంతో నీటి నిల్వలు తగ్గి, అనేక ప్రాంతాలు గొంతు తడుపుకొనేందుకు నోళ్ళు తెరుస్తున్నాయి. హెచ్చిన ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాడ్పులు సైతం నీటిమట్టాలు వేగంగా పడిపోవడానికి కారణమయ్యాయి. దేశంలో తూర్పు ప్రాంతంలోని అస్సామ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో నీటి నిల్వలు కొంత మెరుగ్గా ఉన్నాయి కానీ, మిగతా ప్రాంతాల్లో పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ప్రధానంగా తూర్పు, దక్షిణ భారత ప్రాంతాల్లో ఈ ప్రభావం అమితంగా కనిపిస్తోంది. కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు తెలుగు రాష్ట్రాలకూ తిప్పలు తప్పడం లేదు. దక్షిణాదిలో దాదాపు 42 జలాశయాలను సీడబ్ల్యూసీ పర్యవేక్షిస్తుంటుంది. గత ఏడాది ఇదే సమయానికి వాటిలో 29 శాతం దాకా నీళ్ళున్నాయి. దశాబ్ద కాలపు సగటు గమనిస్తే, ఈ సమయానికి కనీసం 23 శాతమన్నా నీళ్ళుండేవి. కానీ, ఈ ఏడాది కేవలం 17 శాతానికి తగ్గిపోయాయి. దాన్నిబట్టి ప్రస్తుత గడ్డు పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గుజరాత్, మహారాష్ట్రలున్న పశ్చిమ భారతావనిలోనూ అదే పరిస్థితి. అక్కడ సీడబ్ల్యూసీ పర్యవేక్షించే 49 రిజర్వాయర్లలో పదేళ్ళ సగటు 32.1 శాతం కాగా, నిరుడు నీటినిల్వలు 38 శాతం ఉండేవి. కానీ, ఈసారి అది 31.7 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది మధ్య, ఉత్తర భారతావనుల్లోనూ జలాశయాల్లో నీళ్ళు అంతంత మాత్రమే. అక్కడ చారిత్రక సగటు నిల్వలతో పోలిస్తే, ఈసారి బాగా తక్కువగా ఉన్నాయట. మొత్తం మీద దేశంలోని ప్రధాన నదీపరివాహక ప్రాంతాల రీత్యా చూస్తే... నర్మద, బ్రహ్మపుత్ర, తాపీ నదీపరివాహక ప్రాంతాల్లో పరిస్థితి మాత్రం సాధారణ నిల్వస్థాయుల కన్నా మెరుగ్గా ఉంది. అయితే, కావేరీ నదీ పరివాహక ప్రాంతం, అలాగే మహానది, పెన్నా నదులకు మధ్యన తూర్పు దిశగా ప్రవహించే పలు నదీ క్షేత్రాలు తీవ్రమైన లోటును ఎదుర్కొంటున్నాయి. ఎండలు ముదిరి, వేసవి తీవ్రత హెచ్చనున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత గడ్డుగా మారే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే ఇవన్నీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. బెంగళూరు కొద్ది వారాలుగా తీవ్ర నీటి ఎద్దడి సమస్యలో కూరుకుపోయింది. విషయం జాతీయ వార్తగా పరిణమించింది. ఇక, తమిళనాట పలు ప్రాంతాల్లో నెర్రెలు విచ్చిన భూములు, ఎండిన జలాశయాలు, తాగునీటి కొరతతో బిందెడు నీళ్ళ కోసం ప్రజలు నిత్యం ఇబ్బంది పడుతున్న దృశ్యాలు ప్రత్యక్షమవుతున్నాయి. సహజంగానే నిత్యజీవితంతో పాటు వ్యవసాయ కార్యకలాపాలనూ ఈ నీటి నిల్వల కొరత బాధిస్తోంది. తగిన నీటి వసతి లేక వివిధ రకాల పంటలు, తోటలు దెబ్బతింటున్నాయి. ఇవాళ్టికీ భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం కీలకం. జలాశయాల్లో తగ్గిన నీటితో అది పెను సవాళ్ళను ఎదుర్కొంటోంది. ఇప్పటికీ మన దేశంలోని సేద్యపు భూముల్లో దాదాపు సగం వర్షపు నీటిపైనే ఆధారపడ్డాయి. రానున్న వర్షాకాలంలో సాధారణ స్థాయికి మించి వర్షపాతం నమోదవుతుందని అంచనా వెలువడింది. ఫలితంగా, ఋతుపవనాలు ఇప్పుడున్న చిక్కులను తొలగిస్తాయన్నది ఆశ. నిజానికి, దేశంలో జలవిద్యుదుత్పత్తి సైతం తగ్గుతూ వస్తోంది. విద్యుచ్ఛక్తి గిరాకీ విపరీతంగా ఉన్నప్పటికీ, గత ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో హైడ్రోపవర్ జనరేషన్ 17 శాతం పడిపోయింది. ఆ మాటకొస్తే, తగ్గుతున్న జలాశయాల నిల్వలు, పెరుగుతున్న ప్రజల నీటి అవసరాల రీత్యా గత కొన్ని దశాబ్దాలుగా ఆసియాలో, ప్రధానంగా చైనా, భారత్‌లలో జలవిద్యుదుత్పత్తి తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో జలసంరక్షణ కీలకం. ప్రభుత్వాలు, పాలకులు తక్షణం స్పందించి, దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే కష్టం. గృహవినియోగం మొదలు వ్యవసాయ పద్ధతులు, పారిశ్రామిక కార్యకలాపాల దాకా అన్ని స్థాయుల్లోనూ నీటి వృథాను తగ్గించి, ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టుకోవడం ముఖ్యం. నీటి నిల్వ, పంపిణీలు సమర్థంగా సాగేలా చూడాలి. సుస్థిర వ్యవసాయ విధానాలు, పంటల వైవి ధ్యంతో నీటి వినియోగాన్ని తగ్గించాలి. ఎప్పుడైనా వర్షాలు లేక, దుర్భిక్షం నెలకొన్నా తట్టుకొనే సామర్థ్యం పెంపొందించుకోవాలి. నీటి పొదుపు, ఇంకుడు గుంతల ఆవశ్యకత నుంచి వర్షపునీటి నిల్వల దాకా అన్నిటిపై ప్రజా చైతన్యం కలిగించాలి. గడ్డుకాలం కొనసాగితే, భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో సత్వరమే మేలుకోవాలి. -
నేటి నుంచి శ్రీశైలం, సాగర్‌లో ఎన్డీఎస్ఏ తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నేతృత్వంలోని నిపుణుల బృందం తనిఖీ చేయనుంది. మంగళవారం నుంచి 8వ తేదీ వరకు శ్రీశైలం ప్రాజెక్టును, 13–15 తేదీల్లో నాగార్జునసాగర్‌ను ఎన్డీఎస్ఏ బృందం సందర్శించనుంది. గత నెల 9న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో తెలంగాణ, ఏపీతో సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టనుంది. ఎన్డీఎస్ఏ సభ్యుడు (డిజాస్టర్, రిసిలియన్స్) వివేక్ త్రిపాఠి నేతృత్వంలోని బృందం శ్రీశైలం ప్రాజెక్ట్‌ను, ఎన్డీఎస్ఏ సాంకేతిక సభ్యుడు రాకేశ్ కశ్యప్ నేతృత్వంలోని బృందం సాగర్ ప్రాజెక్టును తనిఖీ చేయనుంది. ఈ బృందంలో ఎన్డీఎస్ఏ నుంచి ముగ్గురు, సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ, ఏపీ, సీఎస్ఎంఆర్ఎస్, తెలంగాణ నుంచి చెరో అధికారి కలిపి మొత్తం ఎని మిది మంది సభ్యులు ఉండనున్నారు. శ్రీశైలం ప్రా జెక్టు నుంచి భారీగా వరద విడుదల చేస్తుండటంతో దిగువ భాగంలో 40 మీటర్లలోతు గుంత (ప్లజ్ పూల్) ఏర్పడింది. దిగువ భాగంలో రక్షణ చర్యలతోపాటు కాంక్రీట్ వాల్ నిర్మాణం, స్పిల్ వేకు అత్యవసర మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుందని, దీనికి రూ. 800 కోట్లు అవసరమని కేఆర్ఎంబీ గతంలో అంచనా వేసింది. ఇక నాగార్జునసాగర్ స్పిల్‌వే ఓగీలో కాంక్రీట్ పనులు, సీపేజీ గుంతలకు మరమ్మతులు, కుడికాలువ హెడ్ రెగ్యూలేటరీ గేట్లకు మరమ్మతులు, పూడికను బయటకు పంపే గేటు మారి్పడి వంటి పనులు చేయాల్సి ఉందని కేఆర్ఎంబీ ఇప్పటికే గుర్తించింది. ఇందుకు రూ. 20 వేల కోట్లు అవసరం కానున్నాయి. ఎన్డీఎస్ఏ బృందం తనిఖీల అనంతరం రెండు ప్రాజెక్టుల మరమ్మతులపై కేఆర్ఎంబీ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. -
కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కులను పోరాడి పరిరక్షించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో సీఎం వైఎస్ జగన్ విజయం సాధించారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణకు నాలుగున్నరేళ్లుగా ఆయన చేసిన పోరాటం, కృషి ఫలించాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ అంగీకరించింది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ గతనెల 17న ఢిల్లీలో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం అమలుకు గురువారం హైదరాబాద్‌లోని కృష్ణాబోర్డు కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశమైంది. ఈ రెండు ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. అందుకు సంబంధించిన విధివిధానాలను ఈ సమావేశంలో రూపొందించారు. వాటిని కృష్ణాబోర్డు ఛైర్మన్ శివ్‌నందన్‌కుమార్ కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రాజెక్టుల అప్పగింత విధివిధానాలపై రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శులతో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి సమీక్షించనున్నారు. ఆ తర్వాత ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కృష్ణాబోర్డుకు అప్పగించనున్నారు. కృష్ణానదీజలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య తరచు విభేదాలు తలెత్తడానికి కారణమైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణాబోర్డుకు అప్పగించడం ద్వారా వివాదాలకు చెక్ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే గతనెల 17న రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ఉన్నతాధికారులతో ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు ఆ సమావేశంలో అంగీకరించాయి. ప్రాజెక్టుల అప్పగింత విధివిధానాలను వారంలో ఖరారు చేయాలని త్రిసభ్య కమిటీని కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి ఆదేశించారు. కానీ.. హైదరాబాద్‌కు వచ్చాక తెలంగాణ సర్కార్ అడ్డం తిరిగింది. కృష్ణాజలాల వాటాలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తేల్చేవరకు ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఇదే అంశంపై బుధవారం కేంద్రానికి లేఖ కూడా రాసింది. అడ్డంతిరిగి.. దారికొచ్చిన తెలంగాణ కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆదేశాల మేరకు కృష్ణాబోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే నేతృత్వంలో గురువారం త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు సి.నారాయణరెడ్డి, మురళీధర్ హాజరయ్యారు. కృష్ణాజలాల్లో తెలంగాణ వాటాను ట్రిబ్యునల్ తేల్చేవరకు ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించబోమని తెలంగాణ ఈఎన్సీ పాతపాట పాడటంతో ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటి వాటాలు తేల్చేది ట్రిబ్యునల్ మాత్రమేనని.. త్రిసభ్య కమిటీ, కృష్ణాబోర్డు, అపెక్స్ కౌన్సిల్‌కు ఆ అధికారం లేదని గుర్తుచేశారు. ప్రాజెక్టుల అప్పగింతకే త్రిసభ్య కమిటీ పరిమితం కావాలని సూచించారు. ఉమ్మడి ప్రాజెక్టుల్లో తమ భూభాగంలోని ఆరు అవుట్లెట్లను బోర్డుకు అప్పగిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీచేశామని, తెలంగాణ తన భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్ల అప్పగింతపై ఇప్పటికీ తేల్చలేదని ఎత్తిచూపారు. దీంతో తమ భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను అప్పగించడానికి తెలంగాణ ఈఎన్సీ అంగీకరించారు. బోర్డు, ఏపీ, తెలంగాణ ప్రతినిధుల నేతృత్వంలో.. ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కృష్ణాబోర్డుకు అప్పగిస్తూనే.. ఒక్కో అవుట్లెట్ వద్ద బోర్డు, ఏపీ, తెలంగాణ అధికారులు ఒక్కొక్కరిని నియమించి, నీటి విడుదలను పర్యవేక్షించాలని ఇద్దరు ఈఎన్సీలు చేసిన సూచనకు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే అంగీకరించారు. ఇందుకు రెండు రాష్ట్రాలు సిబ్బందిని సమకూర్చాలని సభ్య కార్యదర్శి చేసిన ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ప్రతి నీటి సంవత్సరంలో ఎప్పటికప్పుడు త్రిసభ్య కమిటీ సమావేశమై.. రెండు రాష్ట్రాల అవసరాలపై చర్చించి, నీటివిడుదలకు చేసే సిఫార్సు మేరకు బోర్డు ఉత్తర్వులు జారీచేయాలనే ప్రతిపాదనపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. తాగునీటి అవసరాల కోసం తక్షణమే సాగర్ ఎడమకాలువ కింద ఏపీకి రెండు టీఎంసీల విడుదలకు త్రిసభ్య కమిటీ అంగీకరించింది. కుడికాలువకు మార్చిలో 3, ఏప్రిల్‌లో 5 టీఎంసీల విడుదలకు ఆమోదం తెలిపింది. హక్కుల పరిరక్షణ కోసం సీఎం జగన్ రాజీలేని పోరాటం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. కృష్ణాపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను నిలిపేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చడం కోసం తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌లోకి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టారు. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి 2020 అక్టోబర్ 6న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి హక్కుగా దక్కిన నీటిని వినియోగించుకోవడం కోసమే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను నిలిపేసేలా తెలంగాణ సర్కార్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 2021లో శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం ప్రారంభం కాకుండానే తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి ప్రారంభించింది. ఇక్కడి నుంచి నీటిని సాగర్‌కు తరలించింది. ఇలా శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తుండటంతో సీఎం జగన్ న్యాయపోరాటానికి దిగారు. కృష్ణాబోర్డు పరిధిని నోటిఫై చేయడం ద్వారా అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడిచేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కృష్ణాబోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జల్‌శక్తి శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది. శ్రీశైలం, సాగర్‌లో రాష్ట్ర భూభాగం పరిధిలోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనా.. తెలంగాణ సర్కారు తన భూభాగంలోని ప్రాజెక్టులను అప్పగించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వే 13 గేట్లతోపాటు కుడికాలువ హెడ్ రెగ్యులేటర్‌ను రాష్ట్రానికి అప్పగించాలని, లేదంటే ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గతేడాది అక్టోబర్ 6న కృష్ణాబోర్డు రాష్ట్రానికి కేటాయించిన 30 టీఎంసీల్లో 17 టీఎంసీలను ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు తెలంగాణ సర్కార్ తరలించింది. ఆ 17 టీఎంసీలను గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడికాలువ ద్వారా విడుదల చేయాలన్న రాష్ట్ర అధికారుల విజ్ఞ్ఞప్తులను తెలంగాణ పట్టించుకోలేదు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తే.. తమ భూభాగంలో ఉందని ఎడమగట్టు విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ సర్కార్ తన ఆధీనంలోకి తీసుకుందని.. అదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ స్పిల్ వే 13 గేట్లతోసహా కుడికాలువ హెడ్ రెగ్యులేటర్‌ను ఆధీనంలోకి తీసుకుని, నీటిని విడుదల చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. దీంతో నవంబర్ 30న తెల్లవారుజామున సీఈ మురళీనాథ్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు, జలవనరులశాఖ అధికారులు రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగాన్ని, కుడికాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాగునీటి అవసరాల కోసం కుడికాలువకు 2,300 క్యూసెక్కులు విడుదల చేశారు. దీనిపై తెలంగాణ సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీంతో సీఎం జగన్ ఆది నుంచి చేస్తున్న డిమాండ్ మేరకు ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. ఏకాభిప్రాయంతో ప్రాజెక్టుల అప్పగింత త్రిసభ్య కమిటీ సమావేశంలో ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతకు ఏకాభిప్రాయం కుదిరింది. ఏపీ భూభాగంలోని ఆరు అవుట్లెట్లను బోర్డుకు అప్పగింతకు సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశాం. తెలంగాణ భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను అప్పగించడానికి ఆ రాష్ట్రం అంగీకరించింది. త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు బోర్డు నీటి కేటాయింపులు చేస్తుంది. వాటిని బోర్డే విడుదల చేస్తుంది. – సి.నారాయణరెడ్డి, ఈఎన్సీ, ఏపీ జలవనరులశాఖ త్రిసభ్య కమిటీ సిఫార్సులే కీలకం శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఏటా నీటి అవసరాలపై త్రిసభ్య కమిటీ చర్చించి.. కేటాయింపులపై బోర్డుకు సిఫార్సు చేస్తుంది. ఆ ప్రకారమే బోర్డు నీటిని విడుదల చేస్తుంది. మా భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను కృష్ణాబోర్డుకు అప్పగిస్తాం. కృష్ణాజలాల్లో 50 శాతం వాటా కోసం కేంద్ర జల్‌శక్తి శాఖకు లేఖ రాశాం. – మురళీధర్, ఈఎన్సీ, తెలంగాణ నీటిపారుదలశాఖ -
జాతీయ హోదా చాన్స్ లేదు
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాలపై ఆధారపడి చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ ప్రాజెక్టుకు మరో రకంగా సాయం అందిస్తామని పేర్కొంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో కూడిన రాష్ట్ర బృందానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఏఐసీసీ నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల సన్నాహక భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన రేవంత్, ఉత్తమ్.. గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లతో విడివిడిగా భేటీ అయ్యారు. షెకావత్‌తో సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, సీఎస్ శాంతికుమారి, సాగునీటి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్, సీఈ హమీద్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ హోదా పరిశీలనే లేదు.. పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదాతో పాటు వివిధ అనుమతులకు సంబంధించిన రెండు వినతిపత్రాలను రాష్ట్ర బృందం షెకావత్‌కు అందజేసింది. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి.. ‘‘ప్రస్తుతం దేశంలో సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చే విషయాన్ని కేంద్రం పరిశీలించడంగానీ, పరిగణనలోకి తీసుకోవడంగానీ లేదు. జాతీయ హోదా అంశాన్ని కేంద్రం పక్కనపెట్టింది. పోలవరం తర్వాత కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు ఇచ్చిన జాతీయ హోదానే వెనక్కి తీసుకోవాలనే యోచన ఉంది. అయితే జాతీయ హోదాకు బదులు పాలమూరు ప్రాజెక్టుకు మరో రకంగా సాయం చేస్తాం. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60ః40 నిష్పత్తిన నిధులు ఇచ్చేందుకు కృషి చేస్తాం. ఈ పథకం ద్వారా గరిష్ట సాయం అందేందుకు ఆస్కారం ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. అనుమతులు ఇప్పించండి పాలమూరు ప్రాజెక్టును మిగులు జలాల ఆధారంగా చేపట్టినా.. తర్వాత ప్రభుత్వం 75శాతం డిపెండబులిటీ ఆధారంగా ప్రాజెక్టుకు 90 టీఎంసీల నీటిని కేటాయించిందని కేంద్ర మంత్రికి రాష్ట్ర బృందం తెలిపింది. ఇందులో మైనర్ ఇరిగేషన్ కింద వినియోగించుకోలేని 45 టీఎంసీలు, గోదావరి మళ్లింపు జలాల ఆధారంగా రాష్ట్రానికి దక్కే వాటా 45 టీఎంసీలు ఉన్నాయని వివరించింది. రూ.55,086 కోట్ల వ్యయఅంచనాతో చేపట్టిన ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్ర జల సంంఘం పరిశీలనకు పంపామని వెల్లడించింది. ప్రాజెక్టుకు ఇప్పటివరకు అటవీ, పర్యావరణ, వైల్డ్‌లైఫ్ వంటి అనుమతులు వచ్చాయని.. హైడ్రాలజీ, ఇరిగేషన్ ప్లానింగ్, కాస్ట్ ఎస్టిమేట్, అంతర్రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన అనుమతులు రావాల్సి ఉందని తెలిపింది. ఈ అనుమతులు వీలైనంత త్వరగా ఇప్పించేలా చొరవ చూపాలని కోరింది. సానుకూలంగా స్పందించారు: ఉత్తమ్ ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా విధానం లేదని కేంద్ర‡ మంత్రి షెకావత్ చెప్పారని భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాకు తెలిపారు. ఇతర పథకాల కింద పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సాయం చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ప్రాజెక్టుకు ఇంకా రావాల్సిన అనుమతులు ఇప్పించే అంశంపై సానుకూలంగా స్పందించారని వివరించారు. కేంద్రం వేరే విధంగా సాయం చేస్తామన్న కేంద్ర మంత్రి హామీకి రాష్ట్రం ఓకే చెప్పిందా? అని ప్రశ్నించగా.. దీనిపై సీఎం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ‘విభజన’ను పూర్తి చేయండి తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు కేవలం 76 మంది ఐపీఎస్‌లనే కేటాయించారని తెలిపారు. జిల్లాల విభజన, వివిధ శాఖల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్రానికి అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు ఇవ్వాలని కోరారు. దీనిపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు. 2024లో కొత్తగా వచ్చే ఐపీఎస్ బ్యాచ్ నుంచి తెలంగాణకు అధికారులను అదనంగా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక రేవంత్ తొలిసారిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఢిల్లీ నార్త్‌బ్లాక్‌లోని అమిత్ షా కార్యాలయంలో గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వినతిపత్రం ఇచ్చారు. ‘‘రాష్ట్ర పునర్విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల విభజనను పూర్తి చేయాలి. పదో షెడ్యూల్ పరిధిలోని సంస్థల వివాదాన్ని పరిష్కరించాలి. ఢిల్లీలోని ఉమ్మడి రాష్ట్ర భవన్ విభజనను సాఫీగా పూర్తి చేయాలి. చట్టంలో ఎక్కడా పేర్కొనకుండా ఉన్న సంస్థలను ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకుంటున్న విషయంపై దృష్టి సారించాలి. తెలంగాణలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బలోపేతానికి రూ.88 కోట్లు, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో బలోపేతానికి రూ.90 కోట్లు అదనంగా కేటాయించాలి. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్, హైకోర్టు భవనం, లోకాయుక్త, ఎస్హెచ్ఆర్సీ వంటి భవనాలను వినియోగించుకున్నందున.. ఆ రాష్ట్రం నుంచి వడ్డీతో కలిపి మొత్తం రూ.408 కోట్లు ఇప్పించాలి..’’ అని వినతిపత్రంలో కోరారు. ‘మెట్రో’ సవరణలను ఆమోదించండి కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీతో భేటీ అయిన సీఎం రేవంత్ బృందం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రం సమర్పించింది. ‘‘హైదరాబాద్ మెట్రో రెండో దశ సవరించిన ప్రతిపాదనలు ఆమోదించండి. సవరించిన ప్రతిపాదనల ప్రకారం ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే విషయాన్ని పరిశీలించండి. హైదరాబాద్‌లోని మూసీ రివర్ ఫ్రంట్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. అమ్యూజ్మెంట్ పార్కులు, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్స్ వాటర్ స్పోర్ట్స్, బిజినెస్ ఏరియా, దుకాణ సముదాయాలతో బహుళ విధాలా ఉపయోగపడేలా చేయాలని నిర్ణయించాం. ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. అవసరమైన మద్దతు ఇవ్వాలి. రాష్ట్రంలో పేదలకు నిర్మించి ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరు చేసేలా అనుమతి ఇవ్వాలి. తెలంగాణకు ఇళ్లు మంజూరు చేయడంతోపాటు పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలి..’’ అని రాష్ట్ర బృందం కోరింది. నేడు యూపీఎస్సీ చైర్మన్‌తో భేటీ సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ శుక్రవారం ఉదయం ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనితో భేటీ కానున్నారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని రూపొందించాలన్న ఉద్దేశంతో ఈ భేటీ జరగనుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. గత ప్రభుత్వం పేపర్ లీక్‌లతో టీఎస్పీఎస్సీని భ్రష్టు పట్టించిందని.. దానిని ప్రక్షాళన చేసే దిశగా అవసరమైన చర్యలపై యూపీఎస్సీ చైర్మన్‌తో చర్చిస్తామని వెల్లడించారు. -
పోలవరంపై 20న ఢిల్లీలో కీలక భేటీ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తిచేయడానికి ప్రస్తుత సీజన్ (2023–24)లో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్ ప్లాన్), సవరించిన అంచనా వ్యయం (తొలిదశ పూర్తి) ఖరారే అజెండాగా ఈనెల 20న ఢిల్లీలో కేంద్రం కీలక సమావేశం నిర్వహిస్తోంది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా, జల్‌శక్తి శాఖ సలహాదారు శ్రీరాం వెదిరె, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో శివ్‌నందన్‌కుమార్, సభ్య కార్యదర్శి రఘురాం, రాష్ట్ర జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు పాల్గొంటారు. ప్రాజెక్టు పనుల పురోగతిని పీపీఏ సభ్య కార్యదర్శి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల సీపేజీకి అడ్డుకట్ట వేయడం, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్తది నిర్మించాలా? పాతదానికే మరమ్మతు చేయాలా? వంటి అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేయడానికి వీలుగా ప్రస్తుత సీజన్లో చేపట్టాల్సిన పనులను, అందుకు కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనా వ్యయాన్ని రూ.31,625.38 కోట్లుగా సీడబ్ల్యూసీ ఖరారు చేసింది. ఇందులో ఇప్పటికే రూ.16,119.57 కోట్ల పనులు పూర్తయ్యాయి. మిగతా పనులకు రూ.15,505.81 కోట్లు అవసరమని కేంద్ర జల్‌శక్తి శాఖకు నివేదిక ఇచ్చింది. సవరించిన అంచనా వ్యయాన్ని ఖరారు చేసేందుకు కేంద్ర ఆర్థికశాఖ రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్సీసీ)ని నియమించింది. ఆ కమిటీ అడిగిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పంపింది. ఈనెల 20న జరిగే సమావేశంలో తొలిదశ సవరించిన అంచనా వ్యయంపై చర్చించనున్నారు. -
‘పోలవరం’పై మరో ముందడుగు
సాక్షి, అమరావతి: పోలవరం జాతీయ ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించే ప్రక్రియలో కేంద్రం మరో అడుగు ముందుకేసింది. ఈ వ్యయాన్ని రూ.31,625.38 కోట్లుగా ఖరారుచేస్తూ కేంద్ర జలసంఘం (సీడబ్యూసీ) పంపిన ప్రతిపాదనను మదింపు చేసేందుకు ఆర్సీసీ (రివైజ్డ్ కాస్ట్ కమిటీ–సవరించిన వ్యయ కమిటీ)ని ఏర్పాటుచేస్తూ గురువారం కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఉత్తర్వులు జారీచేశారు. కేంద్ర జల్‌శక్తి శాఖ కమిషనర్ (ఎస్పీర్) ఏఎస్ గోయల్ అధ్యక్షతన సీడబ్ల్యూసీ (పీపీఓ) పుష్కర్‌సింగ్ కుతియాల్, కేంద్ర ఆర్థిక శాఖ (వ్యయ విభాగం) ప్రధాన సలహాదారు రిచామిశ్రా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సభ్య కార్యదర్శి రఘురాం సభ్యులుగా ఏర్పాటైన ఆర్సీసీకి సీడబ్ల్యూసీ సీఈ (పీఏఓ) యోగేష్ పైతంకర్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. సీడబ్ల్యూసీ ఖరారుచేసిన సవరించిన అంచనా వ్యయాన్ని మదింపు చేసి రెండు వారాల్లోగా అంటే నవంబర్ 2లోగా నివేదిక ఇవ్వాలని ఆర్‌సీసీని ఆదేశించారు. ఈ నివేదికను ప్రధాని మోదీ అధ్యక్షతన ఏర్పాటైన ప్రాజెక్టు ఇన్వెస్ట్మెంట్ బోర్డు (పీఐబీ)కి కేంద్ర జల్‌శక్తి శాఖ పంపనుంది. పీఐబీ ఆమోదముద్ర వేస్తే సవరించిన అంచనా వ్యయం మేరకు పోలవరం తొలిదశ పనులకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది. కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో 2016, సెప్టెంబరు 7 అర్ధరాత్రి 2013–14 ధరల ప్రకారం కేవలం రూ.20,398.61 కోట్లతోనే ప్రాజెక్టును పూర్తిచేస్తానని అప్పటి సీఎం చంద్రబాబు అంగీకరించారు. కానీ, 2013, భూసేకరణ చట్టం ప్రకారం ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33,168.23 కోట్లు అవసరం. అలాంటిది.. కేవలం రూ.20,398.61 కోట్లకే ప్రాజెక్టును పూర్తిచేస్తానని చంద్రబాబు అంగీకరించడంలో ఆంతర్యం కమీషన్లు దండుకోవడమే. 2016, సెప్టెంబరు 7 నుంచి 2019, మే 29 వరకూ చంద్రబాబు అదే చేశారు. ఇదే అంశాన్ని ప్రధానికి సీఎం వైఎస్ జగన్ వివరించి.. తాజా ధరల మేరకు నిధులిచ్చి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ప్రధాని సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలోనే పోలవరం తొలిదశ సవరించిన వ్యయాన్ని రూ.31,625.38 కోట్లుగా సీడబ్ల్యూసీ ఖరారుచేస్తూ ఈనెల 13న కేంద్ర జల్‌శక్తి శాఖకు ప్రతిపాదన పంపింది. జాతీయ ప్రాజెక్టుల సవరించిన అంచనా వ్యయాన్ని మదింపు చేసి, పీఐబీకి నివేదిక ఇచ్చేందుకు ఆర్థిక శాఖ, సంబంధిత ప్రాజెక్టును ప్రతిపాదించే శాఖ అధికారులతో ఆర్‌సీసీని ఏర్పాటుచేయాలని 2016, సెప్టెంబరు 5న కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఆర్సీసీ ఇచ్చే నివేదికే అత్యంత కీలకం. దీనిని యథాతథంగా పీఐబీ ఆమోదించనుంది. తొలిదశ పూర్తికాగానే రెండో దశ.. పోలవరం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 41.15 మీటర్లు (119.4 టీఎంసీలు) స్థాయిలో నీటిని నిల్వచేయాలంటే.. ఇటీవల లైడార్ సర్వేలో వెల్లడైన అంశాలను పరిగణలోకి తీసుకుంటే 90 గ్రామాల పరిధిలోని 171 ఆవాసాల్లోని 37,568 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఇందులో ఇప్పటికే 12,658 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించారు. మరో 24,910 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. తొలిదశ సవరించిన అంచనా వ్యయం మేరకు కేంద్రం నిధులు ఇవ్వగానే ఆ కుటుంబాలకు పునరావాసం కల్పిస్తారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 45.72 మీటర్లు (194.6 టీఎంసీలు). పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేయాలంటే 137గ్రామాల పరిధిలోని 200 ఆవాసాల్లో 64,155 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. తొలిదశలో, రెండో దశలో నీటిని నిల్వచేయాలంటే ముంపునకు గురయ్యే 1,10,879 హెకార్ల భూమిని సేకరించాలి. మరోవైపు.. తొలిదశలో 41.15 మీటర్లలో నీటిని నిల్వచేశాక.. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకే ఏవైనా లోపాలుంటే సరిదిద్దుతూ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ 45.72 మీటర్ల వరకూ 194.6 టీఎంసీలను రాష్ట్ర ప్రభుత్వం నిల్వచేయనుంది. రెండో దశలో 45.72 మీటర్ల వరకు నీటిని నిల్వ చేయడానికి సవరించిన అంచనా వ్యయాన్ని తొలిదశ పనులు పూర్తయ్యే నాటికి కేంద్రం ఆమోదించనుంది. -
కృష్ణాజలాల పంపిణీపై న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కృష్ణా జలాల పంపిణీ కోసం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ–2)కు కేంద్ర జల్ శక్తి శాఖ ఈనెల 6న జారీ చేసిన కొత్త విధి విధానాలపై న్యాయపోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆ విధి విధానాల అమలును నిలిపేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఎప్పుడు విచారించాలన్నది సుప్రీం కోర్టు నిర్ణయించనుంది. కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా 2,130 టీఎంసీల లభ్యత ఉందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ 1976లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించింది. ఈ ట్రిబ్యునల్ అవార్డు గడువు ముగియడంతో 2004లో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. ఈ ట్రిబ్యునల్ కృష్ణా జలాల పంపిణీపై 2010 డిసెంబర్ 30న ఓ నివేదికను, 2013 నవంబర్ 29న తదుపరి నివేదికను అందజేసింది. బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం లభ్యత ఆధారంగా చేసిన కేటాయింపుల జోలికి వెళ్లని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్.. 65 శాతం సగటు లభ్యత ఆధారంగా 194 టీఎంసీల మిగులు జలాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. ఈ నివేదికలను సవాల్ చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, బేసిన్‌లోని రాష్ట్రాలు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్సెల్పీ)లను దాఖలు చేశాయి. దీంతో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి రాలేదు. రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను విభజన చట్టంలో సెక్షన్–89 ప్రకారం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కే కేంద్రం అప్పగించింది. ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయని ప్రాజెక్టులకు నీటిని కేటాయించి, నీటి లభ్యత తక్కువ ఉన్న సంవత్సరాల్లో ప్రాజెక్టులవారీగా జలాల విడుదలకు నిర్వహణ నియమావళి (ఆపరేషన్ ప్రోటోకాల్)ని రూపొందించాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు విభజన చట్టం నిర్దేశించింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులకు రెండు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలని కూడా ట్రిబ్యునల్‌కు స్పష్టం చేసింది. దీని ప్రకారం 2016 అక్టోబర్ నుంచి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ చేస్తోంది. విభజన చట్టం ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాల పునఃపంపిణీ కుదరని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇప్పటికే తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో కృష్ణా జలాలను సెక్షన్–3 ప్రకారం పంపిణీ చేయాలని తెలంగాణ చేసిన ఫిర్యాదు ఆధారంగా.. కృష్ణా జలాల పంపిణీకి కొత్త విధి విధానాలను ఈనెల 4న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఆ మేరకు కొత్త విధి విధానాలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు ఈనెల 6న కేంద్ర జల్ శక్తి శాఖ జారీ చేసింది. ఈ విధి విధానాల ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలతోపాటు అదనంగా కేటాయించిన జలాలను ప్రాజెక్టులవారీగా పంపిణీ చేసి, రెండు రాష్ట్రాల వాటాలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తేల్చాలి. విభజన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులకూ విస్తృతార్థం ఇస్తూ.. పూర్తయిన, నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులుగా కూడా వర్గీకరించింది. ఈ విధివిధానాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. -
Fact Check: గురివింద కలగన్నారు..!
రాష్ట్రంలో ఏం జరిగినా, రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ ఏ అంశం చర్చకు వచి్చనా.. వెంటనే అందులో లోపాలంటూ దుష్ప్రచారం చేయడం, వాటిని సీఎం జగన్‌కు అంటగట్టడం ఈనాడు రామోజీకి నిత్యకృత్యమైపోయింది. తమ ఇషు్టడైన చంద్రబాబు అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిపోవడంతో సదరు రామోజీకి ఈ ప్రభుత్వంపై మరింత అక్కసు పెరిగిపోయింది. ఇది ప్రతిరోజూ ఈనాడులో కనిపిస్తూనే ఉంది. ఎలాగైనా సరే ప్రజలను తప్పుదోవ పట్టించి, ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలన్నదే ధ్యేయంగా రామోజీ ముందుకు వెళుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా కృష్ణా జలాల పంపిణీ అంశాన్ని భుజానికెత్తుకున్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదించిన అంశాలను తానే దగ్గరుండి స్వయంగా చూసినట్లు కలగని ఓ తప్పుడు కథనాన్ని అచ్చేశారు. సాక్షి, అమరావతి: ఎద్దు ఈనిందంటే దూడను గాటికి కట్టేయమన్నట్లుగా ఉన్నాయి రామోజీరావు తెలివితేటలు. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ఒకటైతే.. మరొకటిగా ఊహించుకుని.. అభూత కల్పనలతో సీఎం వైఎస్ జగన్‌పై బురదజల్లుతూ నీతి మాలిన రోత రాతలను యథావిధిగా అచ్చేశారు. రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాలను పంపిణీ చేయడానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదించిన మరిన్ని విధి విధానాలను కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. ఆ విధి విధానాలపై ఇప్పటిదాకా స్పష్టత లేదు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను పునః సమీక్షించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించినట్లుగా కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ కూడా బుధవారం వెల్లడించలేదు. కానీ.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను పునఃసమీక్షించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని.. దీని వల్ల దశాబ్దాల తరబడి రాష్ట్రానికి ఉన్న హక్కులను మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. దీనిపై ఏ వేదికపై కూడా సీఎం జగన్ నోరు మెదపక పోవడం వల్ల రాష్ట్ర హక్కులకు విఘాతం కలుగుతోందంటూ ‘కృష్ణా జలాలపై పునఃసమీక్ష’ శీర్షికతో ‘ఈనాడు’లో కథనాన్ని అచ్చేశారు. ఆ కథనంలో సీఎం జగన్‌పై రామోజీరావు అక్కసు తప్ప.. వీసమెత్తు నిజం లేదు. అసలు నిజం ఏమిటంటే.. ► విభజన తర్వాత 2014 జూలై 14న అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూఏ)–1956లో సెక్షన్–3 ప్రకారం కృష్ణా జలాలను పంపిణీ చేయడానికి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ కేంద్రాన్ని కోరింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ 545/2015ను దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు విని్పంచడంతో ఎలాంటి ప్రయోజనం ఉండదని గ్రహించిన తెలంగాణ సర్కార్ ఆ రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. ► తెలంగాణ కోరిన విధంగా సెక్షన్–3 కింద కృష్ణా జలాలను పంపిణీ చేస్తే.. అది చట్టవిరుద్ధమని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తేల్చిచెబుతూ 2021 ఆగస్టు 17న.. 2022 జూన్ 25న సీఎం వైఎస్ జగన్ లేఖలు రాశారు. ► ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్‌లతో సీఎం వైఎస్ జగన్ సమావేశమైన ప్రతి సందర్భంలోనూ.. తెలంగాణ సర్కార్ కోరిన విధంగా సెక్షన్–3 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన కృష్ణా జలాలను పునఃసమీక్షించడానికి అవకాశమే లేదని స్పష్టం చేస్తూ వస్తున్నారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానమని గుర్తు చేస్తూ.. దాన్ని పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని తేల్చిచెబుతూ వస్తున్నారు. ► రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి కేడబ్ల్యూడీటీ–2కు కేంద్ర మంత్రివర్గం ప్రతిపాదించిన మరిన్ని విధి విధానాలపై ఇప్పటిదాకా స్పష్టత లేదు. వాటిపై స్పష్టత వచ్చాక.. రాష్ట్ర హక్కులను పరిరక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ► కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రిని కోరేందుకు సీఎం వైఎస్ జగన్ గురువారం ఢిల్లీకి వెళ్లారు. -
నీళ్లు ఊరికే రావు!
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రస్తుతం నీటికి భారీగా డిమాండ్ పెరుగుతోంది...అయితే నీటి లభ్యత పరిమితంగా ఉన్న దృష్ట్యా ఉచితంగా సరఫరా చేయొద్దు. గృహ, సాగు, పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేసే నీటికి ధరలు ఖరారు చేయాలి. కనీసం సాగునీటి ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడితోపాటు నిర్వహణ, పర్యవేక్షణ(ఓఅండ్ఎం) వ్యయాలు రాబట్టుకునే విధంగా నీటి ధరలు ఉండాలి’’...అని కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అన్ని రాష్ట్రాలకు సిఫారసు చేసింది. ‘ప్రైసింగ్ ఆఫ్ వాటర్ ఇన్ పబ్లిక్ సిస్టమ్ ఇన్ ఇండియా–2022’పేరుతో రూపొందించిన పంచవర్ష నివేదికలో నీటికి చార్జీలు వసూలు చేయాల్సిందేనని నొక్కి చెప్పింది. నీటి ధరలపై ప్రతి ఐదేళ్లకోసారి ఈ నివేదిక విడుదల చేస్తుండగా, గతేడాది రావాల్సిన నివేదిక తాజాగా బయటకొచ్చింది. ఉచితంగా/తక్కువ ధరలకు నీరు సరఫరా చేస్తే దుర్వినియోగం అవుతుందని, ఆదాయం రాక ప్రభుత్వంపై పెనుభారం పడుతుందని ఆ నివేదికలో స్పష్టం చేసింది. రాష్ట్రాలకు సరైన పాలసీ ఉండాలి పన్నులు, ఇతర మార్గాల్లో ప్రజల నుంచి వసూలు చేస్తున్న డబ్బు ద్వారా ప్రభుత్వాలు మధ్యతరహా, భారీ సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయి. దీంతో ఆయకట్టు రైతులు భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ ప్రాజెక్టుల పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవడానికి రాష్ట్రాలు సరైన పాలసీలు కలిగి ఉండాలి. తిరిగి వచ్చిన రాబడులతో కొత్త ప్రాజెక్టులు చేపట్టి సమాజంలోని ఇతర వర్గాలకు లబ్ధి చేకూర్చాలి. సాగునీటి చార్జీలు... రెండు రకాల వ్యయాలు పంట రకాలు, విస్తీర్ణం, తడుల సంఖ్య, మొత్తం నీటి పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకొని సాగునీటి ధరలు ఖరారు చేయాలి. నీటి టారీఫ్ ఖరారు విధానాన్ని అన్ని రాష్ట్రాలు హేతుబద్దీకరించాలి. పంట దిగుబడి విలువ ఆధారంగా సాగునీటి చార్జీలు వసూలు చేయాలని ఇరిగేషన్ కమిషన్(1972) కోరింది. ప్రాజెక్టుల పెట్టుబడి వ్యయంలో కొంత భాగంతోపాటు పూర్తిగా నిర్వహణ వ్యయం రాబట్టుకోవాలని వైద్యనాథన్ కమిటీ కోరింది. ► సాగునీటి చార్జీల వసూళ్లతో ప్రాజెక్టుల మొత్తం నిర్వహణ వ్యయాన్ని రాబట్టుకోవాల్సిందే. దీనికి అదనంగా.. ఆహార పంటలైతే హెక్టారులో వచ్చిన దిగుబడుల విలువలో కనీసం ఒక శాతం, వాణిజ్య పంటలైతే ఇంకా ఎక్కువ శాతాన్ని వసూలు చేయాలి. ఈ మేరకు సాగునీటి వినియోగానికి సంబంధించి రెండు రకాల చార్జీలు విధించాలి. నిర్వహణ చార్జీలతో ప్రాజెక్టుల నిర్వహణకు, దిగుబడుల విలువ ఆధారిత చార్జీలను ప్రాజెక్టుల ఆధునికీకరణకు వినియోగించాలి. నీటి లభ్యత లెక్కల ఆధారంగా 75శాతం, ఆపై లభ్యత ఉన్న ప్రాజెక్టుల కింద పూర్తిస్థాయిలో సాగునీటి చార్జీలు వసూలు చేయాలి.75 శాతానికి తక్కువ లభ్యత ఉన్న ప్రాజెక్టుల కింద 50 శాతం మేరకు చార్జీలు తగ్గించాలి. ఎత్తిపోతల పథకాల నీటిచార్జీలు ఎక్కువే.. ఎత్తిపోతల పథకాలతో సరఫరా చేసే నీటికి చార్జీలు ఆయా ప్రాజెక్టుల పెట్టుబడి, నిర్వహణ వ్యయాల ఆధారంగా ఖరారు చేయాలి. ఎత్తిపోతల పథకాల ద్వారా సరఫరా చేసే నీటికి కచ్చితమైన లెక్కలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎంత నీరు సరఫరా చేస్తే ఆ మేరకు చార్జీలు వాల్యూమెట్రిక్ (నీటి పరిమాణం) ఆధారంగా వసూలు చేయాలి. ఎత్తిపోతల పథకాల నిర్వహణ వ్యయం ఎక్కువే కాబట్టి గ్రావిటీ ప్రాజెక్టుల నీటిచార్జీల కంటే వీటి ద్వారా సరఫరా చేసే నీటి చార్జీలు అధికంగా ఉంటాయి. నీటి ధరల ఖరారుకు రెగ్యులేటరీ కమిషన్ తాగు, పారిశుద్ధ్యం, సాగు, పారిశ్రామిక, ఇతర అవసరాలకు సరఫరా చేసే నీటికి సరైన ధరలు ఖరారు చేసేందుకు ప్రతి రాష్ట్రంలో చట్టబద్ధంగా స్వయంప్రతిపత్తి గల వాటర్ రెగ్యులేటరీ ఆథారిటీని ఏర్పాటు చేయాలి. నీటి పరిమాణం ఆధారంగా చార్జీలు వసూలు చేయడానికి 100 శాతం ఇళ్లలోని నల్లాలకు మీటర్లు, కాల్వలకు నీటిని కొలిచే యంత్రాలు బిగించాలి. పేదలకు రాయితీపై నీరు సరఫరా చేయవచ్చు. పూర్తి నిర్వహణ వ్యయంతోపాటు పెట్టుబడిలో కొంత భాగం వసూలు చేసేలా నీటిచార్జీలు ఉండాలి. వీటితో పాటుగా పెట్టుబడి రుణాల తిరిగి చెల్లింపులు, ఇతర అవసరాలకు నిధులు నిల్వ ఉండేలా చార్జీలు ఖరారు చేయాలి. సాగునీటి ప్రాజెక్టుల నీటిని వినియోగిస్తే హెక్టారుకు రూ.600, వినియోగించని పక్షంలో హెక్టారుకు రూ.300 చొప్పున నిర్వహణ చార్జీలు వసూలు చేయాలని జల వనరుల 11వ పణ్రాళిక సిఫారసు చేసింది. పేద, బలహీనవర్గాలకు రాయితీ కొనసాగాలి. నిర్వహణ, పెట్టుబడి రాబట్టుకోవాలి దేశంలో ప్రస్తుతం వసూలు చేస్తున్న నీటి ధరలు భారీ రాయితీతో ఉన్నాయి. దీంతో ఆదాయానికి గండిపడుతోంది. రైతుల శక్తిసామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని నీటి ధరలు రాష్ట్రాలు ఖరారు చేస్తున్నాయి. కనీసం సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ వ్యయం కూడా రావడం లేదు. దీంతో నిర్వహణ సరిగా ఉండడం లేదు. పూర్తి నిర్వహణ వ్యయంతో పాటు పాక్షికంగా పెట్టుబడి ఖర్చు రాబట్టుకునేలా నీటి ధరలు ఉండాలి. సెకండ్ ఇరిగేషన్ కమిషన్(1972), డాక్టర్ వైద్యనాథన్ కమిటీ(1991), వివిధ ఫైనాన్స్ కమిషన్లు, ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్–2016 నిబంధనలు సైతం సరైనరీతిలో నీటి ధరలు ఖరారు చేసి నీటిపారుదల చార్జీల రూపంలో కనీసం నిర్వహణ వ్యయం వసూలు చేసుకోవాలని సిఫారసులు చేశాయి. -
నేడు జల్ శక్తి శాఖ ప్రత్యేక కార్యదర్శి సమావేశం
-
Polavaram Project: కొత్త డయాఫ్రమ్ వాల్!
సాక్షి, అమరావతి: పోలవరం ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ గ్యాప్–2లో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి కేంద్ర జల్ శక్తి శాఖ ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ అంశంపై సమగ్రంగా చర్చించి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఆవశ్యకతపై నివేదిక సమర్పించడమే అజెండాగా కేంద్ర జల్ శక్తి శాఖ ప్రత్యేక కార్యదర్శి పంకజ్‌కుమార్ సోమవారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఆ నివేదిక ఆధారంగా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. పోలవరం నిర్మాణ ప్రాంతంలో భౌగోళిక పరిస్థితుల కారణంగా వరద ప్రవాహాన్ని దిగువకు పంపే స్పిల్ వేను గోదావరి కుడి గట్టుకు అవతల రాతి నేలపై.. 194.6 టీఎంసీలను నిల్వ చేసేలా 2,454 మీటర్ల పొడవున ఈసీఆర్ఎఫ్ డ్యామ్‌ను మూడు భాగాలుగా (గ్యాప్–1లో 564, గ్యాప్–2లో 1,750, గ్యాప్–3లో 140 మీటర్లు) గోదావరి గర్భంలో ఇసుక తిన్నెలపై నిర్మించేలా సీడబ్ల్యూసీ డిజైన్‌ను రూపొందించింది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–3లో కాంక్రీట్ డ్యామ్‌ను నిర్మించారు. గ్యాప్–1, గ్యాప్–2లో పునాది డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించాలని సీడబ్ల్యూసీ పేర్కొంది. కమీషన్ల కోసం చంద్రబాబు ఘోర తప్పిదం.. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను తొలుత పూర్తి చేసి ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు కట్టాలి. వాటి మధ్యన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–1, గ్యాప్–2లలో డయాఫ్రమ్ వాల్ నిర్మించాలి. కానీ చంద్రబాబు కమీషన్ల దాహంతో స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేయకుండానే గ్యాప్–2లో 1,396 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని 2018 జూన్ 11 నాటికి పూర్తి చేసి ఘోర తప్పిదానికి పాల్పడ్డారు. ఎగువ కాఫర్ డ్యామ్‌లో ఇరువైపులా 800 మీటర్ల పొడవున ఖాళీ ప్రదేశాలను వదిలేసి చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో గోదావరికి 2019 అక్టోబర్‌లో భారీ వరద వచ్చింది. 2,454 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి.. ఎగువ కాఫర్ డ్యామ్ అడ్డంకిగా మారడంతో 800 మీటర్లకు కుచించుకుపోయింది. దీంతో వరద ఉద్ధృతి పెరిగి డయాఫ్రమ్ వాల్ కోతకు గురై దెబ్బతింది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై నాలుగు చోట్ల భారీ అగాధాలు ఏర్పడ్డాయి. చంద్రబాబు నిర్వాకాల కారణంగా పోలవరం నిర్మాణంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. ఆ తప్పిదాలను సరిదిద్దేందుకు రూ.2,020 కోట్లకుపైగా వ్యయం అవుతుందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. ► సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేశారు. గోదావరి వరదను మళ్లించాక ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–1లో 393 మీటర్ల పొడవుతో డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించారు. వరద ఉద్ధృతికి గ్యాప్–1లో డయాఫ్రమ్ వాల్‌కు ఏమాత్రం నష్టం వాటిల్లలేదు. ► వరదల ఉద్ధృతికి గ్యాప్–2లో జి.కొండ కుడివైపున 89 మీటర్ల నుంచి 1,485 మీటర్ల వరకూ 1,396 మీటర్ల పొడవున నిర్మించిన డయాఫ్రమ్ వాల్ గత సర్కారు నిర్వాకాలతో దెబ్బతింది. ► దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పటిష్టతపై ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) నిపుణులు పలు రకాల పరీక్షలు నిర్వహించి 175 మీటర్ల నుంచి 360 మీటర్ల వరకూ 185 మీటర్ల మేర డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైనట్లు తేల్చారు. ► 480 నుంచి 510 మీటర్ల మధ్య 30 మీటర్ల మేర డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. 950 – 1,020 మధ్య 70 మీటర్ల మేర దెబ్బతినగా 1,170 నుంచి 1,370 మీటర్ల వరకూ 200 మీటర్ల మేర పూర్తిగా దెబ్బతిన్నట్లు తేల్చారు. అంటే 1,396 మీటర్ల పొడవున నిర్మించిన డయాఫ్రమ్ వాల్లో 485 మీటర్ల మేర పూర్తిగా దెబ్బతిన్నట్లు నిర్ధారించారు. ► 363 మీటర్ల నుంచి 1,035 మీటర్ల వరకూ 672 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్ పైభాగంలో ఐదు మీటర్ల మేర దెబ్బతిన్నట్లు ఎన్‌హెచ్‌పీసీ స్పష్టం చేసింది. డ్యామ్ భద్రత దృష్ట్యా.. దెబ్బతిన్న చోట్ల సమాంతరంగా ‘యూ’ ఆకారంలో కొత్తగా డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించి పాత దానితో అనుసంధానం చేస్తే సరిపోతుందని తొలుత సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ, ఎన్‌హెచ్‌పీసీ నిపుణులు ప్రతిపాదించారు. అయితే ఈ పనులు చేసేందుకు చాలా సమయం పడుతుంది. ఒకవేళ అలా చేసినా కూడా డయాఫ్రమ్ వాల్ పూర్తి సామర్థ్యం మేరకు ఊట నీటికి అడ్డుకట్ట వేయలేదు. అంతిమంగా ఇది డ్యామ్ భద్రతకే ప్రమాదకరమని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈనెల 3న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నిర్వహించిన సమావేశంలో ఆ శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పాత డయాఫ్రమ్ వాల్లో దెబ్బతిన్న చోట్ల సమాంతరంగా డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించడం కంటే డ్యామ్ భద్రత దృష్ట్యా 1,396 మీటర్ల పొడవునా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికే జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మొగ్గు చూపారు. దీనిపై సమగ్రంగా చర్చించి నివేదిక ఇవ్వాలని జల్ శక్తి శాఖ ప్రత్యేక కార్యదర్శిని ఆదేశించడంతో నేడు ఢిల్లీలో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పోలవరం వద్ద 498.07 టీఎంసీల లభ్యత పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరిలో 75 శాతం (నికర జలాలు) లభ్యత ఆధారంగా ఏటా సగటున 498.07 టీఎంసీల లభ్యత ఉంటుందని కేంద్ర జలసంఘం తాజాగా తేల్చింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా 484.7 టీఎంసీలను వినియోగించుకోవడానికి గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) మన రాష్ట్రానికి అనుమతి ఇచ్చింది. అంటే ట్రిబ్యునల్ అనుమతించిన దాని కంటే పోలవరం వద్ద గోదావరిలో నికర జలాల లభ్యత 13.37 టీఎంసీలు అధికంగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ అంచనా వేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిధిలో సబ్ బేసిన్ల వారీగా గోదావరిలో నీటి లభ్యతను తేల్చాకే రెండు రాష్ట్రాలు కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని గోదావరి బోర్డును ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కోరాయి. దీంతో గోదావరి బోర్డు ఆ బాధ్యతను సీడబ్ల్యూసీకి అప్పగించింది. పోలవరానికి సగటున 1,198.35 టీఎంసీలు తెలుగు రాష్ట్రాల పరిధిలో పెన్‌గంగా (జీ–7), ప్రాణహిత (జీ–9), దిగువ గోదావరి (జీ–10), ఇంద్రావతి(జీ–11), శబరి (జీ–12) పరీవాహక ప్రాంతాలలో 1971–72 నుంచి 2011–12 మధ్య 41 ఏళ్లలో కురిసిన వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా గోదావరిలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిధిలో గోదావరిలో ఏటా 1,435 టీఎంసీల నికర జలాల లభ్యత ఉంటుందని తేల్చింది. పోలవరం వద్దకు ఏటా సగటున 1,198.35 టీఎంసీల ప్రవాహం వస్తుందని అంచనా వేసింది. 75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే 498.07 టీఎంసీల లభ్యత ఉంటుందని తేల్చింది. పోలవరం, ధవళేశ్వరం బ్యారేజీల మధ్య ఏటా సగటున 778.39 టీఎంసీల ప్రవాహం ఉంటుందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. ఇందులో 75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే 45.83 టీఎంసీల లభ్యత ఉంటుందని తేల్చింది. -
పోలవరానికి రూ.17,148 కోట్లు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు తొలిదశ పూర్తికి అవసరమైన రూ.17,148 కోట్లు మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర కేబినెట్‌కు పంపాల్సిన ప్రతిపాదన (మెమొరాండం)ను ఈనెల 31లోగా సిద్ధంచేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖ, సీడబ్ల్యూసీ, పీపీఏ అధికారులకు ఆ శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ దిశానిర్దేశం చేశారు. ఢిల్లీలో ప్రాజెక్టు పనుల పురోగతిని సోమవారం ఆయన సమీక్షించారు. రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి. నారాయణరెడ్డి, పీపీఏ సీఈఓ శివ్‌నందన్‌కుమార్‌లు ఆ వివరాలను తెలిపారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో వరదల ఉధృతికి ఏర్పడిన అగాథాలలో ఇసుక పూడ్చివేత పనులు పూర్తయ్యాయని.. వైబ్రో కాంపాక్షన్ ద్వారా యథాస్థితికి తెచ్చే పనులు చేస్తున్నామని అధికారులు చెప్పారు. షెడ్యూలు ప్రకారమే పనులు చేస్తుండటంతో మంత్రి షెకావత్ సంతృప్తి వ్యక్తంచేశారు. 36 గ్రామాలకు పునరావాసం కల్పించడానికి ఓకే.. ప్రాజెక్టు తొలిదశ పూర్తికి రూ.12,911.15 కోట్లను మంజూరు చేసేందుకు కేంద్ర ఆర్థికశాఖ అంగీకరించిందని.. కానీ, 41.15 మీటర్ల కాంటూరు పరిధిలోకి మరో 36 గ్రామాలు వస్తాయని.. అక్కడి నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని శశిభూషణ్‌కుమార్ చెప్పారు. ఈ వ్యయాన్ని కలుపుకుంటే.. తొలిదశ పూర్తికి రూ.17,148 కోట్లు అవసరమని వివరించారు. ఇందుకు మంత్రి షెకావత్ అంగీకరించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ఈనెల 15లోగా సీడబ్ల్యూసీకి పీపీఏ పంపాలని.. అనంతరం ఈనెల 31లోగా కేంద్ర జల్‌శక్తి శాఖకు పంపాలని ఆదేశించారు. ఆ మెమొరాండాన్ని కేంద్ర కేబినెట్లో ప్రవేశపెట్టి, ఆమోదం తీసుకుని, ప్రాజెక్టుకు నిధులు విడుదల చేస్తామని షెకావత్ చెప్పారు. డయాఫ్రమ్‌వాల్‌పై మేధోమథనం.. మరోవైపు.. ఈసీఆర్ఎఫ్ గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న చోట్ల.. దానికి సమాంతరంగా ‘యూ’ ఆకారంలో కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించి.. పాత దానితో అనుసంధానం చేసే పనులపై నిర్మాణ సంస్థ మేఘా అనుమానాలు వ్యక్తంచేస్తోందని మంత్రి షెకావత్‌కు కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం చెప్పారు. మంత్రి స్పందిస్తూ.. పాత డయాఫ్రమ్ వాల్లో దెబ్బతిన్న 30 శాతం చోట్ల కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఎంత వ్యయమవుతుంది? గ్యాప్–2లో మొత్తం 1,396 మీటర్ల పొడవునా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందని ప్రశ్నించారు. దీనిపై సీడబ్ల్యూసీ చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా స్పందిస్తూ.. పాత దానిలో దెబ్బతిన్న 30 శాతం చోట్ల కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి రూ.400 కోట్లు.. మొత్తం 1,396 మీటర్ల పొడవున కొత్తగా డయాఫ్రమ్ వాల్ వేయడానికి రూ.600 కోట్లు వ్యయం అవుతుందని చెప్పారు. దీనిపై షెకావత్ స్పందిస్తూ.. ఇందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ అంశాలపై సోమవారంలోగా తుది నిర్ణయాన్ని తనకు వెల్లడించాలని సీడబ్ల్యూసీ చైర్మన్ వోరాకు మంత్రి షెకావత్ కోరారు. పోలవరం పనులకు లైన్ క్లియర్ స్టాప్‌వర్క్ ఆర్డర్‌ను మరో ఏడాదిపాటు నిలిపివేస్తూ కేంద్రం ఉత్తర్వులు 2024 జులై లేదా సుప్రీంకోర్టులో కేంద్ర జల్‌శక్తి అఫిడవిట్ దాఖలు చేసేదాకా ఈ ఉత్తర్వులు అమలులోనే.. పోలవరం ప్రాజెక్టు పనులను నిర్విఘ్నంగా కొనసాగించడానికి కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపేయాలంటూ జారీచేసిన ‘స్టాప్‌వర్క్ ఆర్డర్’ అమలును మరో ఏడాదిపాటు నిలుపుదల చేస్తూ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ శాస్త్రవేత్త యోగేంద్రపాల్ సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు ఈనెల నుంచి 2024, జులై వరకూ లేదా సుప్రీంకోర్టులో కేంద్ర జల్‌శక్తి శాఖ అఫిడవిట్ దాఖలు చేసేవరకూ అమల్లో ఉంటాయని అందులో పేర్కొన్నారు. తద్వారా పోలవరం పనులకు కేంద్ర లైన్‌క్లియర్ చేసింది. బహుళార్థక సాధక పోలవరం ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ సహా అన్ని అనుమతులను మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చాకే ఆ ప్రాజెక్టు పనులను జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించారు. వీటివల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతోందంటూ ఒడిశా సర్కార్ 2007లో సుప్రీంకోర్టులో ఎస్సెల్పీ (స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేసింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు.. పోలవరం ప్రాజెక్టు పనులను ఆపేయాలంటూ 2011, ఫిబ్రవరి 8న కేంద్రాన్ని ఆదేశించింది. దాంతో ప్రాజెక్టు పనులను ఆపేయాలంటూ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ స్టాప్‌వర్క్ ఆర్డర్‌ను జారీచేసింది. ప్రాజెక్టు పనులను చేపట్టాలంటే.. స్టాప్‌వర్క్ ఆర్డర్‌ను నిలుపుదల చేయడం లేదా ఎత్తేయడం తప్పినిసరి. ఈ కేసును సుప్రీంకోర్టు విచారిస్తున్న నేపథ్యంలో స్టాప్‌వర్క్ ఆర్డర్‌ను ఎత్తేయడం న్యాయ ఉల్లంఘన కిందకు వస్తుంది. దీంతో ప్రాజెక్టు పనులు చేసుకోవడానికి వీలుగా స్టాప్‌వర్క్ ఆర్డర్ అమలును నిలుపుదల (అబయన్స్‌లో పెట్టాలని) చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం 2012 నుంచి కేంద్రానికి ప్రతిపాదన పంపుతోంది. నిజానికి.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక.. పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా చేయడానికి వీలుగా రెండేళ్లపాటు స్టాప్‌వర్క్ ఆర్డర్ అమలును నిలిపేయాలని కేంద్రాన్ని కోరారు. దీంతో కేంద్రం 2019 నుంచి స్టాప్‌వర్క్ ఆర్డర్ నుంచి రెండేళ్లపాటు నిలుపుదల చేస్తూ వస్తోంది. ఈ గడువు ఈ నెలతో పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో మరో రెండేళ్లపాటు నిలుపుదల చేయాలని కోరగా జులై 2024 వరకు లేదా సుప్రీంకోర్టులో కేంద్ర జలశక్తి శాఖ అఫిడవిట్ దాఖలుచేసే వరకూ స్టాప్‌వర్క్ ఆర్డర్‌ను నిలుపుదల చేసింది. -
నేడు పోలవరంపై కీలక భేటీ..
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు రూ.12,911.15 కోట్ల విడుదలకు సంబంధించి కేంద్ర మంత్రిమండలికి పంపాల్సిన ప్రతిపాదనను ఖరారు చేయడమే అజెండాగా సోమవారం ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో శివ్‌నందన్‌కుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గొననున్నారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తిచేయడానికి రూ.పదివేల కోట్లను అడ్‌హక్ (ముందస్తు)గా విడుదల చేయాలని ప్రధాని నరేంద్రమోదీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలుమార్లు కోరారు. దీనికి స్పందించిన ప్రధాని నరేంద్రమోదీ పోలవరం ప్రాజెక్టుకు నిధుల సమస్య లేకుండా చూడాలని కేంద్ర ఆర్థికశాఖను ఆదేశించారు. దీంతో ప్రాజెక్టు తొలిదశను సత్వరమే పూర్తిచేయడానికి వీలుగా రూ.12,911.15 కోట్లు విడుదల చేసేందుకు జూన్ 5న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అంగీకరించారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో 2013–14 ధరలతోనే ప్రాజెక్టును పూర్తిచేస్తామని 2016లో నాటి సీఎం చంద్రబాబు అంగీకరించారు. 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం కంటే ఇప్పటికే అధికంగా ఖర్చుచేసిన నేపథ్యంలో అదనంగా నిధుల విడుదలకు అడ్డంకిగా మారింది. అదనంగా నిధులు మంజూరు చేయాలంటే కేంద్ర మంత్రిమండలి ఆమోదం తప్పినిసరి. ఆ క్రమంలోనే రూ.12,911.15 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిమండలికి ప్రతిపాదన పంపాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మిలాసీతారామన్ కేంద్ర జల్‌శక్తి శాఖకు సూచించారు. మంత్రిమండలి ఆమోదముద్ర వేసిన వెంటనే నిధులు విడుదల చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు నిధులు విడుదలకు సంబంధించిన ప్రతిపాదనను పీపీఏ ద్వారా కేంద్ర జల్‌శక్తి శాఖకు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు పంపారు. దీనిపై కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమీక్షించి.. కేంద్ర మంత్రిమండలికి పంపాల్సిన ప్రతిపాదనను ఖరారు చేయనున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించి, సత్వరమే పూర్తిచేయడానికి చేపట్టాల్సిన చర్యలపై సీడబ్ల్యూసీ, పీపీఏ, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. -
ఫలించిన సీఎం జగన్ కృషి.. పోలవరం తొలిదశకు రూ.12,911 కోట్లు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ కృషి ఫలించింది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదలపై కేంద్రం శుభవార్త చెప్పింది. రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. బిల్లుల చెల్లింపులో విభాగాల వారీగా పెట్టిన పరిమితులను తొలగించడానికి కూడా ఓకే చెప్పింది. అలాగే, ప్రాజెక్టుకు 2013–14 ధరలతో కాకుండా తాజా ధరలతో నిధులిచ్చేందుకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ (వ్యయ విభాగం) డైరెక్టర్ ఎల్కే త్రివేది సోమవారం రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్‌కు లేఖ రాశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇందుకు ఆమోదం తెలిపారని ఆ లేఖలో పేర్కొన్నారు. 2013–14 ధరల ప్రకారం పోలవరానికి నిధులిచ్చేందుకు గతంలో కేంద్రమంత్రిమండలి ఆమోదించిన నేపథ్యంలో ఈ నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదన పంపాలని కోరామన్నారు. కేంద్ర మంత్రిమండలి ఆమోదం తీసుకుని నిధులు విడుదల చేస్తామని లేఖలో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తిచేసి తొలిదశలో ముందస్తుగా ఫలాలను రైతులకు అందించేందుకు వీలుగా రూ.10,000 కోట్లను అడ్‌హాక్‌గా (ముందస్తుగా) ఇవ్వాలని ప్రధాని మోదీని గత ఏడాది జనవరి 3న ఢిల్లీలో సీఎం జగన్ ప్రతిపాదించారు. 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లేనని కానీ, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూ సేకరణ, నిర్వాసితుల పునారావాసానికే రూ.33,168.23 కోట్లని, ఈ నేపథ్యంలో ప్రాజెక్టును పూర్తిచేయడానికి సాధ్యపడదని ప్రధాని మోదీకి సీఎం వివరించారు. 2017–18 ధరల ప్రకారం కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఖరారుచేసిన రూ.55,656.87 కోట్లను ఆమోదించి, ఆ మేరకు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీయింబర్స్మెంట్ చేసేటప్పుడు విభాగాల వారీగా పరిమితులు విధిస్తున్నారని, దాన్ని తొలగించి ప్రాజెక్టు అంచనా వ్యయం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని రీయింబర్స్మెంట్ చేయాలని కూడా కోరారు. వీటిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కేంద్ర జలశక్తి శాఖను ఆదేశించారు. రూ.10,911.15 కోట్లు ఇవ్వాలని సీడబ్ల్యూసీ సిఫారసు ఫలితంగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ దీనిపై స్పందించి ప్రాజెక్టు తొలిదశలో ప్రధాన డ్యామ్, కాలువల పనుల పూర్తికి, 41.15 మీటర్ల కాంటూరు పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి ఎన్ని నిధులు అవసరమో ప్రతిపాదనలను పంపాలని రాష్ట్ర జలవనరుల శాఖాధికారులను కోరారు. పోలవరం తొలిదశ పూర్తికి రూ.15వేల కోట్లు మంజూరు చేయాలని పీపీఏ ద్వారా కేంద్ర జలశక్తి శాఖకు గత ఏడాది జనవరి 10న రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. పంకజ్‌కుమార్ మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు పరిశీలించిన కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుస్వీందర్ సింఘ వోరా రూ.10,911.15 కోట్లను ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేశారు. బిల్లుల చెల్లింపుల్లో విభాగాల వారీగా విధించిన పరిమితులను తొలగించాలని సూచించారు. ఈ క్రమంలోనే గత ఏడాది మార్చి 4న సీఎం జగన్‌తో కలిసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు చేసిన తప్పిదంవల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుకు తిన్నెలు కోతకు ఏర్పడ్డ భారీ అగాధాలను పరిశీలించారు. ఆ సమయంలో డయాఫ్రం వాల్ మరమ్మతులు, భారీ అగాధాలను పూడ్చివేసి యధాస్థితికి తేవడానికి చేపట్టే పనులకు అయ్యే వ్యయాన్ని కేంద్రమే భరించాలని సీఎం జగన్ చేసిన ప్రతిపాదనపై కేంద్రమంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారు. ఈయన ఆదేశాల మేరకు ఈ ఏడాది మార్చి 4, 5 తేదీల్లో సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ, ఎన్‌హెచ్‌పీసీ, సీడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణుల బృందం డయాఫ్రమ్ వాల్, అగాధాలను పూడ్చివేసి యథాస్థితికి తెచ్చే విధానాన్ని ఖరారు చేశాయి. ఇందుకు రూ.2,020.05 కోట్ల వ్యయమవుతుందని తేలుస్తూ కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక సమర్పించాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న పంకజ్‌కుమార్ తొలిదశ పూర్తికి రూ.10,911.15 కోట్లు, డయాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులు చేపట్టడానికి రూ.2,000 కోట్లు వెరసి రూ.12,911.15 కోట్లు పోలవరానికి మంజూరు చేయాలని చేసిన సిఫార్సును కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించింది. దశల వారీగా పోలవరంలో నీటినిల్వ.. పోలవరం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు. గరిష్ట నీటినిల్వ 194.6 టీఎంసీలు. కొత్తగా నిర్మించే ఏ ప్రాజెక్టులోనైనా సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం ఆ ప్రాజెక్టు పూర్తయిన తొలిఏడాది దాని పూర్తి నిల్వ సామర్థ్యంలో 1/3వ వంతు.. మరుసటి ఏడాది 2/3వ వంతు, ఆ తరువాత పూర్తిస్థాయిలో నీటి నిల్వచేయాలి. ఈ సమయంలో ఏవైనా లీకేజీలుంటే వాటికి అడ్డుకట్ట వేసి ప్రాజెక్టుకు భద్రత చేకూర్చాలన్న ఉద్దేశంలోనే సీడబ్ల్యూసీ ఈ మార్గదర్శకాలను రూపొందించింది. వాటి ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక తొలి ఏడాది 41.15 మీటర్లలో నీటిని నిల్వచేస్తారు. ఆ తరువాత దశల వారీగా నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ గరిష్ట నీటి మట్టం 45.74 మీటర్లలో నీటి నిల్వచేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. -
పునరావాసం కల్పించాకే.. పోలవరంలో నీటి నిల్వ
సాక్షి, అమరావతి: నిర్వాసితులకు పునరావాసం కల్పించాకే పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర కమిటీ దిశానిర్దేశం చేసింది. తొలి దశలో 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో లైడార్ సర్వే ప్రకారం ముంపునకు గురయ్యే గ్రామాల్లోని నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసంపై ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శి అనిల్‌కుమార్ ఝా అధ్యక్షతన కేంద్ర జల్ శక్తి శాఖ, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖల కార్యదర్శులు పంకజ్‌కుమార్, సౌరబ్గార్గ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, పీపీఏ సీఈవో, రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శ్రీధర్ సభ్యులుగా కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమావేశాన్ని బుధవారం వర్చువల్‌గా చైర్మన్ అనిల్‌కుమార్ ఝా నిర్వహించారు. నిధులిస్తే మరింత త్వరితగతిన పునరావాసం పోలవరం తొలి దశ పనుల పూర్తికి సంబంధించి సవరించిన అంచనా వ్యయం రూ.16,952.07 కోట్లకు సంబంధించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని.. ఆ మేరకు నిధులిస్తే మరింత త్వరితగతిన పునరావాసం కల్పిస్తామని రాష్ట్ర అధికారులు కేంద్ర కమిటీకి వివరించారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించాకే పోలవరం జలాశయంలో నీటిని నిల్వ చేస్తామని స్పష్టం చేశారు. ప్రాజెక్టులో 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో తొలుత 123 గ్రామాలు ముంపునకు గురవుతాయని గుర్తించామని.. వాటిలోని 20,946 కుటుంబాలకుగానూ ఇప్పటికే 12,060 కుటుంబాలకు పునరావాసం కల్పించామని రాష్ట్ర అధికారులు వివరించారు. ఇటీవల నిర్వహించిన లైడార్ సర్వేలో వాటితోపాటు మరో 36 గ్రామాలు 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోకి వస్తాయని తేలిందని.. ఆ గ్రామాల్లోని 16,642 కుటుంబాలకు తొలి దశలోనే పునరావాసం కల్పించాల్సి ఉంటుందన్నారు. వెరసి మొత్తం 25,528 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉందని.. ఇందుకు రూ.7,304 కోట్లు అవసరమని.. ఇటీవల కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదించామని చెప్పారు. వాటిని ఆమోదించి నిధులిస్తే పునరావాసాన్ని త్వరితగతిన కల్పిస్తామని చెప్పారు. దీనిపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ స్పందిస్తూ.. తొలి దశ సవరించిన అంచనా వ్యయాన్ని ఖరారు చేసే ప్రక్రియ తుది దశలో ఉందని.. ఆ మేరకు నిధులు ఇస్తామని చెప్పారు. ఈ క్రమంలో 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పనపై యాక్షన్ ప్లాన్ రూపొందించి ఇవ్వాలని అధికారులను కేంద్ర కమిటీ ఆదేశించింది. నిర్వాసితుల జీవనోపాధులను మెరుగుపరిచేలా వారికి వివిధ చేతి వృత్తుల్లో శిక్షణ ఇస్తున్నామని, విద్యార్హత ఆధారంగా వివిధ పరిశ్రమల్లో ఉపాధి కల్పించడానికి వీలుగా నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి శిక్షణ ఇస్తున్నామని రాష్ట్ర అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇచ్చిన వివరణకు కేంద్ర కమిటీకి సంతృప్తి వ్యక్తం చేసింది. పునరావాసం కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో పనిచేస్తోందని ప్రశంసించింది. అనుమానాల నివృత్తిపై సంప్రదింపులు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల ముంపుపై వ్యక్తం చేస్తున్న అనుమానాలను నివృత్తి చేయాలని రాష్ట్ర అధికారులకు కేంద్ర కమిటీ ఛైర్మన్ అనిల్‌కుమార్ ఝా సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ వ్యవహారంపై కేంద్ర జల్ శక్తి శాఖ నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతోందన్నారు. దీనిపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ స్పందిస్తూ.. పోలవరం ముంపుపై మూడు రాష్ట్రాల అనుమానాలను నివృత్తి చేసి, సుప్రీం కోర్టుకు నివేదిక ఇస్తామని చెప్పారు. -
కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం జగన్ భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం నిధులు సహా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని సీఎం కోరారు. సుమారు అరగంటపాటు సమావేశం కొనసాగగా.. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ సానుకూలంగా స్పందించారు. అంతకుముందు నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశంలో సీఎం జగన్ పాల్గొన్నారు. సమావేశానుద్దేశించి ప్రసంగించిన సీఎం.. ఆరోగ్యకరమైన పెట్టుబడుల ద్వారా మౌలిక సదుపాయాలను బలోపేతంచేయాలని తద్వారా ఆర్థికవ్యవస్థ శ్రీఘ్రగతిన పురోగమిస్తుందన్నారు. అలాగే నీతి ఆయోగ్ చర్చించే వివిధ అంశాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించేలా నోట్‌ను సమావేశానికి సమర్పించారు. కాగా, మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం శుక్రవారం నాడు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సుమారు 40 నిమిషాలు భేటీ అయ్యారు. నాడు–నేడు పథకం ద్వారా విద్య, ఆరోగ్య రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (మూలధన పెట్టుబడి)గా భావించి ప్రత్యేక సాయం వర్తింప చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఈ కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. చదవండి: ఎన్టీఆర్ పెట్టిన ఒక్క పథకమైనా చంద్రబాబు కొనసాగించారా? -
జలపథంలో... తొలి పదం
దేశచరిత్రలోనే ఇది తొట్టతొలి ప్రయత్నం. మనిషికి ప్రాణావసరమైన జల వనరులు ఎక్కడెక్కడ, ఎంతెంత, ఎలా ఉన్నాయని లెక్కలు తేల్చిన ఘట్టం. మానవ తప్పిదాల వల్ల క్షీణిస్తున్న నీటి వసతులను ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో మరోసారి గుర్తు చేసిన జలగణన యజ్ఞం. కేంద్ర జలశక్తి శాఖ ఇటీవల విడుదల చేసిన భారత జలవనరుల తొలి గణన అనేక విధాల కీలకమైనది అందుకే. దేశంలో అటు ప్రకృతి సహజమైన, ఇటు మానవ కల్పితమైన చెరువులు, సరస్సులు, నీటి కుంటల సమగ్ర సమాచారాన్ని ఈ లెక్కలు తొలిసారిగా ముందుకు తెచ్చాయి. దేశంలో ఈ జల వనరులు ఏ మేరకు ఆక్రమణకు గురైనదీ తేల్చాయి. సమస్త జీవరాశి మనుగడ కొనసాగాలంటే... ప్రతి నీటి చుక్కా కీలక సమకాలీన సందర్భంలో కేంద్రశాఖ నిర్వహించిన ఈ జలవనరుల గణన ఆహ్వానించదగ్గ యత్నం. ప్రతి ఇంటికీ సురక్షిత మంచి నీటిని అందిస్తామని పాలకులు పదే పదే సంకల్పం చెప్పుకుంటున్న వేళ ఈ నీటి వసతుల సమగ్ర సమాచారం ప్రాధాన్యం సంతరించుకుంది. చెరువులు, రిజర్వా యర్లు, సరస్సులు – ఇలా జలవనరులు వివిధ రకాలు. కాగా, వాగులు, నీటి చెలమలు, గృహ సము దాయాలు – ఇతర ప్రాంతాల నుంచి చేరిన వర్షపునీళ్ళు, ఏదైనా నది – వాగుల నుంచి దారి మళ్ళించడం ద్వారా నిల్వచేసిన నీళ్ళు, మంచు కరగడంతో ఏర్పడ్డ నీటి వసతి... ఇలాంటివన్నీ కూడా నీటి వనరులేనని ఈ తొలి జలగణన నివేదిక నిర్వచించింది. వ్యవసాయం, చేపల పెంపకం, ఆధ్యాత్మికత – ఇలా రకరకాల ప్రయోజనాల కోసం నీటిని నిల్వ చేసినవాటిని జాబితాకు ఎక్కించింది. 2018– 19లో చేసిన ఈ గణన దేశం మొత్తం మీద 24 లక్షలకు పైగా జలవనరులు ఉన్నాయని తేల్చింది. వీటిలో 97.1 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే, 2.9 శాతమే పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. నీటి వస తుల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న భారీ అంతరాలను ఈ జల నివేదిక ఎత్తిచూపింది. ఈ లెక్కల్లో దేశంలోకెల్లా అత్యధికంగా 7.47 లక్షల జలవనరులతో పశ్చిమ బెంగాల్ ప్రథమ స్థానం దక్కించుకోగా, దేశంలోనే అత్యధిక జనాభాకు నిలయమైన ఉత్తర ప్రదేశ్ కేవలం 2.5 లక్షల నీటివనరులతో రెండో స్థానంలో నిలిచింది. బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా ఏకంగా 3.55 లక్షల నీటి వనరులతో దేశంలోనే ముందుంది. అలాగే, దేశంలోని నీటి వనరుల్లో దాదాపు 63 శాతం పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో నెలకొన్నాయి. బెంగాల్లో నీటి మడుగులు, రిజర్వాయర్లు, ఆంధ్రప్రదేశ్‌లో చెరువులు, తమిళనాట సరస్సులు ఎక్కువని ఈ నివేదిక తేల్చింది. అదే సమయంలో దాదాపు 1.6 శాతం మేర, అంటే 38 వేలకు పైగా వనరులు కబ్జాకు గురయ్యాయట. ఈ కబ్దాలో 40 శాతం వాటా యూపీదే అన్నది నివేదిక సారాంశం. నిజానికి, 1986 నుంచి అయిదేళ్ళకోసారి కేవలం చిన్న నీటిపారుదల వసతుల లెక్కలను కేంద్రం చేపడుతూ వచ్చింది. అందులో ప్రధానంగా ప్రభుత్వ సంస్థల జనాభా లెక్కల నుంచి సేకరించిన డేటాను సంకలనం చేస్తూ వచ్చింది. అయితే, ప్రభుత్వాలు ఒకప్పుడు నీటి వసతులను కేవలం వ్యవసాయ, ఆర్థిక ప్రయోజనాల్లో భాగంగానే చూస్తూ వచ్చాయి. ఆ దృక్కోణం గత రెండు దశాబ్దాల్లో మారింది. మానవ, పర్యావరణ సంక్షేమానికి జలవనరుల ప్రాధాన్యాన్ని గ్రహించి, పాత తప్పును సరిదిద్దుకొనే పనిలో ప్రభుత్వాలు పడ్డాయి. 2005లోనే కాంగ్రెస్ సారథ్యంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం ‘జలవనరుల మరమ్మతులు, నవీకరణ, పునరుద్ధరణ పథకం’ చేపట్టింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చెరువుల లాంటి సాంప్రదాయిక నీటివసతులకు మళ్ళీ ఊపిరిపోసే పని చేపట్టింది. అయితే, సమగ్ర సమాచార లేమి వల్ల ఈ పథకాల లక్ష్యాలు ఏ మేరకు సిద్ధించాయో చెప్పలేని పరిస్థితి. తాజా జలగణన ముఖ్యత్వం సంపాదించుకున్నది అక్కడే. ఆఖరుసారి 2013–14లో చేసిన చిన్న నీటిపారుదల వసతుల సర్వేతో పోలిస్తే, తాజా గణనలో నీటి వసతుల సంఖ్య 5 రెట్లు పెరగడం విశేషం. పట్టణప్రాంత చెరువులు, కుంటల వివరాలపై పౌరసంస్థలు, విద్యాకేంద్రాలే గళమెత్తేవి. వాటి క్రియాశీలత వల్లే చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, శ్రీనగర్, అహ్మదాబాద్ లాంటి నగరాల్లో చెరువులు కనుమరుగవుతున్న తీరు కొంతైనా జనం దృష్టికి వచ్చింది. ఇప్పుడు నేరుగా ప్రభుత్వమే జలగణనతో రంగంలోకి వచ్చింది గనక పరిస్థితులు మరింత మెరుగవుతాయని చిన్న ఆశ. గమనిస్తే, ఒకప్పుడు పుష్కలంగా నీళ్ళున్న భారతావని ఇవాళ అధిక జనాభా, పట్టణీకరణతో నీటి కొరత దిశగా జారిపోతోంది. దీనికి తక్షణం పగ్గం వేయాలి. ప్రపంచంలో 18 శాతం జనాభాకు నెలవైన మన దేశంలో ఉన్న నీటి వనరులు 4 శాతమే. అవసరాలు ఎక్కువ, అందుబాటులో ఉన్న నీరు తక్కువ గనక నీటి కోసం ఒత్తిడీ అధికమే. దానికి తోడు పర్యావరణ మార్పుల ప్రభావం నీటి వసతులు, వాటి నాణ్యత, నిర్వహణ పైన గణనీయంగా పడుతోంది. ఈ పరిస్థితుల్లో జనగణన లాగానే క్రమం తప్పకుండా జల వనరుల గణన చేయడం అవసరం. పదేళ్ళకోసారి చేసే జనాభా లెక్కల లాగా కాక, వీలైనంత తరచుగా ఈ నీటి లెక్కలు తీయాలి. ప్రతి సుస్థిర అభివృద్ధి లక్ష్యానికీ, నీటికీ లంకె ఉంది గనక దీంతో నీటి నిర్వహణను మెరుగుపరుచుకొనే వీలు చిక్కుతుంది. అలాగే పట్టణ నిర్మాణం, విస్తరణల్లో పాలకులు సరైన నిర్ణయాలు చేయడానికీ నీటి వసతుల వివరాలు దోహదపడతాయి. స్థానిక సంస్థలను, పౌరసమాజ బృందాలను కూడా ఈ జలగణనలో భాగస్థుల్ని చేస్తే మెరుగైన ఫలితాలొస్తాయి. ఆ దిశగా ఈ నివేదిక తొలి అడుగు. మేలైన ముందడుగు. -
పోలవరం పనులు భేష్..
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు బాగా జరుగుతున్నాయని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ అధికారులను అభినందించారు. షెడ్యూల్ ప్రకారం ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్, అప్రోచ్ ఛానల్, స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఫైలెట్ ఛానల్ పూర్తి చేసి గోదావరి వరదను సమర్ధంగా మళ్లించారని రాష్ట్ర జలవనరుల అధికారులను, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ని అభినందించారు. కాఫర్ డ్యామ్‌ల మధ్య పడిన అగాధాలను మళ్లీ వరద వచ్చేలోగా పూడ్చివేయాలని ఆదేశించారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా ‘యు’ ఆకారంలో కొత్త డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించి పాత దానితో అనుసంధానించాలని చెప్పారు. తద్వారా వరదల్లోనూ ప్రధాన (ఎర్త్ కమ్ రాక్‌ఫిల్) డ్యామ్ పనులను పూర్తి చేయొచ్చని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతి, ముంపు ప్రభావంపై సోమవారం ఢిల్లీలో పంకజ్ కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణ రెడ్డి, పీపీఏ సీఈవో శివనందన్ కుమార్, కేంద్ర జల సంఘం (సీడబ్యూసీ) చైర్మన్ కుష్వీందర్ వోరా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని పీపీఏ, రాష్ట్ర జల వనరులు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సవరించిన అంచనాలకు సానుకూలం ప్రాజెక్టును పూర్తి చేయాలంటే సీడబ్యూసీ ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను విడుదల చేయాలని రాష్ట్ర అధికారులు కోరారు. ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ 45.72 మీటర్ల వరకు ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో 8 మండలాల్లోని 373 గ్రామాలు ముంపునకు గురవుతాయని, 1,06,006 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని 2017–18 సవరించిన అంచనాల్లో పేర్కొన్నామని చెప్పారు. కానీ మరో 36 గ్రామాలు కూడా ముంపు పరిధిలోకి వస్తాయని, ఆ గ్రామాల్లో నిర్వాసితులకూ పునరావాసం కల్పించాలని కోరారు. దీనిపై పంకజ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. నిర్వాసితులందరికీ పునరావాసం కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. 45.72 మీటర్ల పరిధిలోకి వచ్చే ముంపు గ్రామాల్లో లైడార్ సర్వే చేసి, నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి సహకరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లకు వినతి పత్రాలు ఇచ్చారన్నారు. తొలుత 41.15 మీటర్ల వరకు, ఆ తరువాత 45.72 మీటర్ల వరకు ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఎంతెంత నిధులు అవసరమో నివేదిక ఇవ్వాలని సీడబ్యూసీ చైర్మన్ వోరాను ఆదేశించారు. ప్రాజెక్టు సత్వర పూర్తికి అడ్‌హాక్‌గా రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని సీఎం జగన్ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని నివేదిక ఇవ్వాలని చెప్పారు. ఈ నిధులు ఎంత అవసరమో తేల్చడానికి పీపీఏ, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో నాలుగు రోజుల్లో సీడబ్యూసీ చైర్మన్ వోరా సమావేశం కానున్నారు. బ్యాక్ వాటర్ ప్రభావం ఉండదు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల తమ రాష్ట్రాల్లో భూమి ముంపునకు గురవుతోందని సుప్రీం కోర్టులో తెలంగాణ, ఒడిశా, చతీస్‌గఢ్ రాష్ట్రాలు దాఖలు చేసిన కేసుపై సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందన్న అంచనాతో సీడబ్యూసీ సర్వే చేసిందని, అందులో బ్యాక్ వాటర్ ప్రభావం ఏ మాత్రం ఉండదని వెల్లడైందని అధికారులు వివరించారు. సుప్రీం కోర్టు నియమించిన గోపాలకృష్షన్ కమిటీ కూడా ఇదే చెప్పిందన్నారు. సీడబ్యూసీ ఆమోదించిన డిజైన్ మేరకే ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్పారు. దీనిపై పంకజ్‌కుమార్ స్పందిస్తూ సుప్రీం కోర్టుకు కేంద్రం తరపున చెప్పాల్సిన అంశాలను స్పష్టం చేస్తామన్నారు. ఈ నెలాఖరులోగా పోలవరానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు ఈ నెలాఖరులోగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పోలవరం వస్తారని వెదిరె శ్రీరాం చెప్పారు. ప్రాజెక్టుకు అవసరమైన నిధులను ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందన్నారు. దీనిపై పంకజ్‌కుమార్ స్పందిస్తూ విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టులో నీటి పారుదల విభాగం వ్యయం మొత్తాన్ని భరించాల్సిన బాధ్యత కేం‘ద్రానిదేనని పునరుద్ఘాటించారు. ఆ మేరకు నిధులు విడుదల చేస్తామని చెప్పారు. -
ఇంకెన్నాళ్లీ ‘కలం’ కూట విషం?
తప్పు ఎవరు చేసినా దాన్ని ఎత్తిచూపడం నిఖార్సయిన జర్నలిజం. అస్మదీయుడైన చంద్రబాబు చేసిన తప్పును తస్మదీయుడైన సీఎం వైఎస్ జగన్‌పై నెట్టేసి.. అదే నిజమని ప్రజలను నమ్మించడానికి పదే పదే విషం చిమ్మడం ‘ఈనాడు’ రామోజీరావు మార్క్ పాత్రికేయం. కమీషన్ల కక్కుర్తితో కేంద్రమే కట్టాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను 2016లో దక్కించుకున్న తక్షణమే... రామోజీ వియ్యంకుడి సంస్థ నవయుగకు రూ.2,917.78 కోట్లు విలువైన పనులను నామినేషన్‌పై కట్టబెట్టేశారు చంద్రబాబు. మిగిలిన కొన్ని పనులను యనమల బావమరిది సుధాకర్ యాదవ్‌కు పంచేశారు. దేశ చరిత్రలో ఇదో రికార్డు. సులభంగా చేయగలిగి... త్వరగా అధిక లాభాలు మిగిలే పనులనే చేపట్టిన చంద్రబాబు... రామోజీరావు, ఆయన వియ్యంకుడితో కలిసి ప్రజాధనాన్ని డీపీటీ(దోచుకో పంచుకో తినుకో) విధానంలో కాజేశారు. పోలవరం చంద్రబాబుకు ఏటీఎంగా మారిపోయిందని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీయే అన్నారంటే.. వీళ్లెంతకు బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. ఈ దోపిడీ వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో నాలుగు చోట్ల భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ఇదే పోలవరం పనుల్లో తీవ్ర జాప్యం జరగడానికి కారణమైంది. మానవతప్పిదం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని సాక్షాత్తూ ఎన్‌హెచ్‌పీసీ, ఐఐటీ, డీడీఆర్పీ నిపుణులే తేల్చి చెప్పారు. ఆ మానవుడు చంద్రబాబేనని కూడా అందరికీ తెలుసు. కానీ రామోజీరావు మాత్రం ఒక్క ముక్క కూడా రాయరు. ఎందుకంటే తన వియ్యంకుడి పేరు బయటికొస్తుంది కాబట్టి!!. పైపెచ్చు తప్పంతా వైఎస్ జగన్ ప్రభుత్వానిదేనన్నట్లుగా పదే పదే విషపు రాతలు!!.మరీ ఇంత దుర్మార్గమా? చంద్రబాబు పాపాల వల్ల ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ.. ప్రణాళికాయుతంగా పోలవరాన్ని పూర్తి చేయడానికి వడివడిగా అడుగులేస్తున్న సీఎం వైఎస్ జగన్‌ను పనిగట్టుకుని మరీ విమర్శిస్తున్న ‘ఈనాడు’ కథనంలో డొల్లతనం ఇదిగో... రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చుక్కానిలా నిలిచే పోలవరం బహుళార్ధక సాధక జాతీయ ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కావు. ప్రాజెక్టు పూర్తి చేయటంకన్నా జేబులు నింపుకోవటం పైనే దృష్టిపెట్టిన బాబు గ్యాంగ్ వైఖరితో ప్రాజెక్టు అస్తవ్యస్తమయింది. పరిస్థితిని చక్కదిద్దుతూ... ఆ సవాళ్లను అధిగమిస్తూ ప్రణాళికాబద్ధంగా సీఎం వైఎస్ జగన్ అడుగులేస్తుండటం రామోజీరావుకు మింగుడుపడటం లేదు. అభూత కల్పనలు, అవాస్తవాలతో పదే పదే ‘కలం’కూట విషం చిమ్ముతున్నారు. నిజానికి ఈ రాతలను జాగ్రత్తగా చూస్తే... తమ డీపీటీ విధానానికి విఘాతం కలిగిందనే అక్కసు తప్ప మరోటి కన్పించదు. చంద్రబాబు చేసిన పాపాల వల్ల పోలవరం పనుల్లో జాప్యం చోటుచేసుకున్న వైనాన్ని ఇటీవల శాసనసభలో ఆధారాలతో సహా సీఎం జగన్ వివరించారు. చంద్రబాబు పాపాల వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్‌వాల్‌ను సరిదిద్దడం, ఎన్‌హెచ్‌పీసీ, డీడీఆర్పీ మార్గదర్శకాల మేరకు అగాధాలను పూడ్చడానికి రూ.2,022 కోట్లు వ్యయమవుతుందని.. ఇదంతా ప్రాజెక్టుపై అదనపు భారమేనని స్పష్టం చేశారు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్న చంద్రబాబు ► విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మించాలి. కానీ.. నాటి టీడీపీ ఎంపీ రాయపాటిని అడ్డంపెట్టుకుని పోలవరంలో ప్రజాధనాన్ని దోచేయడానికి స్కెచ్ వేసిన చంద్రబాబు, నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించాలని కోరుతూ వచ్చారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేందుకు సిద్ధపడటంతో 2016, సెప్టెంబరు 7న అర్ధరాత్రి పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అప్పగించింది. ► ఆ వెంటనే పోలవరం హెడ్ వర్క్స్‌లో రాయపాటికి చెందిన ట్రాన్స్ట్రాయ్ సంస్థ కాంట్రాక్టు ఒప్పంద విలువ రూ.4,054 కోట్లను.. ఈపీసీ నిబంధనలకు విరుద్ధంగా రూ.5,386 కోట్లకు పెంచేసి.. అనుచితంగా రూ.1,332 కోట్ల ప్రయోజనం చేకూర్చారు చంద్రబాబు. ఆ తర్వాత 2016, డిసెంబర్ 30న పనులు ప్రారంభించారు. ట్రాన్స్‌ట్రాయ్‌ని అడ్డుపెట్టుకుని పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి.. ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చుకుని చంద్రబాబు కమీషన్లు వసూలు చేసుకున్నారు. ► ఈ క్రమంలో ట్రాన్స్ట్రాయ్ నుంచి రూ.2917.78 కోట్ల పనులను తప్పించి.. నిబంధలనకు విరుద్ధంగా లంప్సమ్ విధానంలో వాటిని నామినేషన్ పద్ధతిపై రామోజీ వియ్యంకుడికి చెందిన నవయుగకు కట్టబెట్టారు. సులభంగా చేయగలిగి.. అధికంగా లాభాలు వచ్చే స్పిల్ వే పునాది, స్పిల్ ఛానల్ కాంక్రీట్ వంటి మాస్ కాంక్రీట్ పనులను చేపట్టి.. నవయుగకు రూ.1675 కోట్ల బిల్లులు చెల్లించేసి.. భారీ ఎత్తున కమీషన్లు పంచుకు తిన్నారు. ► పోలవరం ఎడమ కాలువ ఐదో ప్యాకేజీలో రూ.71 కోట్ల విలువైన పనుల వ్యయాన్ని రూ.182 కోట్లకు పెంచేసి... దాన్ని యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌కు నామినేషన్‌పై ఇచ్చేశారు చంద్రబాబు. ఇదీ కథ. జీవచ్ఛవంగా మార్చిన చంద్రబాబు.. జీవనాడిగా రూపునిస్తోన్న వైఎస్ జగన్ స్పిల్ వే సాధారణంగా ఏ నీటిపారుదల ప్రాజెక్టులోనైనా... వరద నీటిని దిగువకు విడుదల చేసే స్పిల్ వేను నదికి అడ్డంగా కడతారు. నీటిని నిల్వ చేసే మట్టికట్టను నదికి ఆవల నిర్మిస్తారు. కానీ.. పోలవరం అలా కాదు. దీని నిర్మాణ ప్రాంతంలో ఉన్న భూభౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)... 194.6 టీఎంసీలను నిల్వచేసే ప్రధాన డ్యామ్ అయిన రాతిమట్టికట్ట(ఎర్త్ కమ్ రాక్ ఫిల్– ఈసీఆర్ఎఫ్ డ్యామ్)ను నదికి అడ్డంగానూ.... నదీ తీరానికి ఆవల కుడి వైపున స్పిల్ వేను నిర్మించేలా డిజైన్‌ను రూపొందించింది. మరి ఈ ప్రాజెక్టును ఎలా నిర్మించాలి? కానీ చంద్రబాబు ఎలా నిర్మించారు? దానివల్ల జరిగిన నష్టమేంటి? ఆ నష్టాన్ని పూడుస్తూ ప్రాజెక్టును పూర్తి చేయడానికి సీఎం వైఎస్ జగన్ ఏం చేస్తున్నారు? అనేవి ఒకసారి చూద్దాం... గోదావరికి అడ్డంగా ప్రధాన డ్యామ్ నిర్మించాలంటే తొలుత గోదావరి తీరానికి ఆవల కుడి వైపున 45.72 మీటర్ల గరిష్ఠ నీటి మట్టంతో స్పిల్ వే నిర్మించాలి. 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో 48 గేట్లను దానికి ఏర్పాటుచేయాలి. 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్ వ్యవస్థను గేట్లకు ఏర్పాటు చేయాలి. తొలుత ఈ పనులు పూర్తి చేయాలి. అలా చేస్తే ఎంత వరద వచ్చినా ఇబ్బంది ఉండేది కాదు. కానీ.. 2016, డిసెంబర్ నుంచి 2019, మే మధ్య కేవలం పునాది స్థాయికి మాత్రమే చంద్రబాబు దీని పనులు చేశారు. ఇందులో ఎక్కువ కమీషన్లు రావని... అక్కడితో వదిలేసి, సులువుగా పూర్తయ్యే... ఎక్కువ కమీషన్లు వచ్చే మిగతా పనులపై ఫోకస్ పెట్టారు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ.. కేంద్రం నిధులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నా... రాష్ట్ర ఖజానా నుంచే ఖర్చు చేసి 2021, జూన్ నాటికి 48 గేట్లతో సహా స్పిల్ వేను నూరుశాతం పూర్తి చేశారు. స్పిల్ చానెల్ స్పిల్ వే నుంచి దిగువకు విడుదలయ్యే వరద నీటికి నదిలోకి కలపడానికి 2.764 కి.మీ.ల పొడవున.. 1100 మీటర్ల వెడల్పుతో స్పిల్ చానెల్‌ను నిర్మించాలి. స్పిల్ వే పూర్తయ్యేలోగా ఈ పనులు కూడా పూర్తి చేయాలి. 2016, డిసెంబర్ నుంచి 2019, మే మధ్య స్పిల్ చానెల్లో కాంక్రీట్‌ను కుప్పగా పోసే పనులను చంద్రబాబు చేపట్టారు. కాంక్రీట్ పోసినందుకు ఘనపుటడుగుల చొప్పున కాంట్రాక్టరుకు బిల్లు చెల్లించవచ్చు కనక ఎక్కువ కమీషన్లొస్తాయి. ఈజీ ప్లస్ లాభాలెక్కువ. అందుకే కాంక్రీట్ పోశారు తప్ప... ఇందులో కష్టతరమైన డౌన్‌స్ట్రీమ్ కటాఫ్ వంటి పనులు వదిలేశారు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక స్పిల్ చానెల్‌ను నూరుశాతం పూర్తి చేశారు. అప్రోచ్ చానెల్ నదీ ప్రవాహాన్ని స్పిల్ వే వైపు మళ్లించేలా 550 మీటర్ల వెడల్పుతో 2.310 కిమీల పొడవున అప్రోచ్ చానెల్ తవ్వాలి. స్పిల్ వే, స్పిల్ చానెల్ పూర్తయ్యే నాటికి ఈ పనులు పూర్తి చేయాలి. కానీ.. ఐదేళ్లలో అప్రోచ్ చానెల్ పనుల్లో చంద్రబాబు తట్టెడు మట్టి కూడా ఎత్తించలేదు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఈ పనులు నూరుశాతం పూర్తి చేశారు. పైలట్ చానెల్ స్పిల్ చానెల్ మీదుగా వచ్చే వరద జలాలను నదిలోకి మళ్లించేందుకు 1.026 కిమీల పొడవున పైలట్ చానెల్ తవ్వాలి. ఈ పనులు కూడా చంద్రబాబు ముట్టుకోలేదు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక అప్రోచ్ చానెల్, స్పిల్ వే, స్పిల్ చానెల్, ఫైలట్ చానెల్లను పూర్తి చేసి.. 2021, జూన్ 11న 6.1 కిమీల పొడవున గోదావరి ప్రవాహాన్ని మళ్లించారు. ప్రపంచ చరిత్రలో నదీ సహజ ప్రవాహ దిశను ఇంత భారీ ఎత్తున మళ్లించడం ఇదే తొలి సారి. ఎగువ కాఫర్ డ్యామ్ ప్రధాన డ్యామ్‌ను నిర్మించడానికి వీలుగా దానికి ఎగువన గోదావరికి అడ్డంగా 2480 మీటర్ల పొడవు, 42.5 మీటర్ల ఎత్తుతో కాఫర్ డ్యామ్ (మట్టి కట్ట) నిర్మించాలి. ఇది నిర్మిస్తే నీరు నిలుస్తుంది. ఇలా నిలవటం వల్ల పలు గ్రామాలు మునిగిపోతాయి. అందుకే ఈ ఎగువ కాఫర్ డ్యామ్ పూర్తయ్యేలోగా 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని ముంపు గ్రామాల నిర్వాసితులైన 20,946 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. 2018లో ఎగువ కాఫర్ డ్యామ్ పనులు చేపట్టిన చంద్రబాబు... కేవలం రూ.484 కోట్లతో 3,110 కుటుంబాలకే పునరావాసం కల్పించారు. మిగతా 17,836 కుటుంబాలకు పునరావాసం కల్పించలేక.. ఈ మట్టికట్టకు కుడి వైపున 400 మీటర్లు, ఎడమ వైపున 400 మీటర్లు గ్యాప్‌లు వదిలేశారు. అలా... ఎగువ కాఫర్ డ్యామ్‌ను గాలికొదిలేశారు. అయితే సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 8,567 కుటుంబాలకు రూ.1,677 కోట్లతో పునరావాసం కల్పించి.. 2021 నాటికే ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేశారు. ప్రధాన డ్యామ్ నిర్మాణానికి వీలుగా స్పిల్ వే నుంచి దిగువకు విడుదల చేసిన వరద నీరు ఎగదన్నకుండా అడ్డుకోవడానికి.. ప్రధాన డ్యామ్ నిర్మాణానికి దిగువన 1,655 మీటర్ల పొడవు... 30.5 మీటర్ల ఎత్తుతో లోయర్ కాఫర్ డ్యామ్ నిర్మించాలి. 2018లో చేపట్టిన చంద్రబాబు.. కుడి వైపు 680 మీటర్ల వెడల్పున ఖాళీ వదిలేశారు. 2019లో ఎగువ కాఫర్ డ్యామ్ గ్యాప్‌ల గుండా అధిక ఉద్ధృతితో గోదావరి ప్రవహించడం వల్ల దిగువ కాఫర్ డ్యామ్‌లో 0 నుంచి 680 మీటర్ల మధ్య ప్రాంతం కోతకు గురై 36 మీటర్ల లోతున భారీ అగాధం ఏర్పడింది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక.. సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ మార్గదర్శకాల మేరకు జియోమెంబ్రేన్ బ్యాగ్‌లలో ఇసుకను నింపి.. వాటిని అగాధంలో వేసి పూడ్చుతూ వైబ్రో కాంపాక్షన్ ద్వారా యధాస్థితికి తెచ్చి.. ఫిబ్రవరి 15 నాటికి దిగువ కాఫర్ డ్యామ్ పనులను పూర్తి చేశారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ (ప్రధాన డ్యామ్) దీన్ని మూడు భాగాలుగా... 2474.5 మీటర్ల పొడవున (గ్యాప్–1లో 584.5 మీటర్లు, గ్యాప్–2లో 1750 మీటర్లు, గ్యాప్–3లో 140 మీటర్ల పొడవు) 45.72 మీటర్ల గరిష్ఠ నీటి మట్టంతో నిర్మించాలి. దీన్ని నిర్మించాలంటే గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా అంటే.. అప్రోచ్ చానెల్, స్పిల్ వే, స్పిల్ చానెల్, పైలట్ చానెల్.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేశాక... డ్యామ్‌కు పునాది అయిన డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించాలి. దానిపై ప్రధాన డ్యామ్ పనులు చేపట్టాలి. కానీ.. చంద్రబాబు వరదను మళ్లించే పనులు పూర్తి చేయకుండా గ్యాప్–2లో 1396 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించే పనులను బావర్ సంస్థకు నామినేషన్‌పై అప్పగించి... 2018 నాటికే పూర్తి చేసేశారు. 2019లో గోదావరికి భారీ వరదలు రావడం.. 2400 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి ఎగువ కాఫర్ డ్యామ్ అడ్డంకిగా మారడం వల్ల.. దాని గ్యాప్‌ల గుండా 800 మీటర్లకు కుంచించుకుపోయి ప్రవహించడం వల్ల వరద ఉద్ధృతి పెరిగింది. ఆ ఉద్ధృతికి గోదావరి గర్భం కోతకు గురై.. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో నాలుగు చోట్ల గరిష్ఠంగా 35 మీటర్లు.. కనిష్ఠంగా 22 మీటర్ల లోతుతో భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ప్రపంచంలో ఎక్కడా డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న దాఖలాలు లేవు. చంద్రబాబు కక్కుర్తి కారణంగా తొలిసారి ఈ దారుణం చోటుచేసుకుంది. దీంతో డయాఫ్రమ్ వాల్ నష్టాన్ని పూడ్చడానికి నిపుణుల అధ్యయనం అవసరమైంది. ఒక వైపు డయాఫ్రమ్ వాల్‌ను సరిదిద్దడం, అగాధాలను పూడ్చడంపై సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ, ఎన్‌హెచ్‌పీసీ, ఐఐటీలతో సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మేధోమథనం జరుపుతూనే... గ్యాప్–2లో 393 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్‌ను పూర్తి చేసింది. గ్యాప్–3లో 140 మీటర్ల పొడవున కాంక్రీట్ డ్యామ్‌ను సైతం పూర్తి చేసింది. గతనెల (మార్చి) 5న డయాఫ్రమ్‌వాల్‌ను సరిదిద్దడం, అగాధాలను పూడ్చటంపై డీడీఆర్పీ, సీడబ్ల్యూసీ కొన్ని మార్గదర్శకాలివ్వటంతో... వాటి ప్రకారం పనులు ఆరంభించి, ప్రధాన డ్యామ్‌ను పూర్తి చేసే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రూ.20,398.61 కోట్లతోనే పూర్తి చేయడం ఎలా? ► పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్న క్రమంలో చంద్రబాబు చేసిన ఇంకో ఘోరమైన తప్పిదమేంటంటే... 2013–14 నాటి ధరల ప్రకారం నిధులిస్తే చాలని 2016, సెప్టెంబరు 7న అంగీకరించడం. ► 2016, సెప్టెంబరు 26న పోలవరానికి నాబార్డు నుంచి రూ.1981.54 కోట్ల రుణాన్ని విడుదల చేస్తూ.. ఇకపై బడ్జెట్ ద్వారా కాకుండా నాబార్డు రుణం రూపంలోనే నిధులు విడుదల చేస్తామని కేంద్రం పెట్టిన మెలికకు తల ఊపింది కూడా చంద్రబాబే. ► 2016, సెప్టెంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ.. కేంద్ర జలశక్తి శాఖకు పంపిన మెమోరాండంలో 2014, ఏప్రిల్ 1 నాటికి నాటికి పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకయ్యే వ్యయాన్ని మాత్రమే చెల్లిస్తామని పునరుద్ఘాటించింది. పునరావాసాన్ని గాలికొదిలేసింది. ఈ నిర్ణయం తీసుకున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో టీడీపీకి చెందిన మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి కూడా ఉన్నా నోరు మెదపలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ► ఇదే విషయాన్ని 2017, మే 8న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్ శక్తి శాఖ లేఖ ద్వారా తెలిపింది. కానీ దానికి చంద్రబాబు స్పందించలేదు. ► 2013–14 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ ఆమోదించిన నీటిపారుదల విభాగం వ్యయం రూ.20,398.61 కోట్లు. ఇందులో ఏప్రిల్ 1, 2014 నాటికి చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లను మినహాయిస్తే కేవలం రూ.15,667 కోట్లే ఇస్తామని కేంద్రం స్పష్టం చేసినా.. చంద్రబాబు దానికి అంగీకరించారు. 2017–18 ధరల ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయమే రూ.33,168.23 ఓట్లు. అలాంటిది కమీషన్ల మాయలో పడి కేవలం రూ.20,398 కోట్లిస్తే పూర్తి చేస్తామని చంద్రబాబు అంగీకరించటమే ప్రాజెక్టుకు శాపంగా మారింది. ► నిజానికి ఏ ప్రాజెక్టయినా కాలం గడుస్తున్న కొద్దీ ముందుగా అంచనా వేసిన వ్యయం పెరుగుతుంది. అది నాగార్జున సాగర్‌కైనా.. శ్రీశైలానికైనా కూడా!!. పోలవరానికీ అంతే. 2013–14లో ఉన్న ధరలు ఇప్పుడెందుకు ఉంటాయి? అన్నిరకాల సామగ్రి, లేబర్ చార్జీలు అప్పటితో పోలిస్తే రెట్టింపుకన్నా ఎక్కువే పెరిగాయి. కానీ చంద్రబాబు నాటి ధరల ప్రకారం నిధులిస్తే చాలని ఏకంగా లేఖ రాసేయటంతో... ఇప్పుడు తాజా ధరల ప్రకారం నిధులడిగిన ప్రతిసారీ కేంద్రం నాటి లేఖ ప్రస్తావనే తెస్తోంది. సవాలక్ష కొర్రీలు పెడుతోంది. ఇలా చంద్రబాబు చేసిన ద్రోహాన్ని... ‘ఈనాడు’ ఏనాడూ ప్రస్తావించకపోవటం అంతకన్నా పెద్ద ద్రోహం కాదా రామోజీ? ► 2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చి.. నిధులు విడుదల చేయాలని గత 45 నెలలుగా ప్రధాని మోదీని, కేంద్ర ఆర్థిక శాఖ, జల్ శక్తి శాఖ మంత్రులను సీఎం వైఎస్ జగన్ కోరుతూ వస్తున్నారు. -
పోలవరం నావిగేషన్ కెనాల్‌పై కదలిక
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నావిగేషన్ కెనాల్‌పై కేంద్రం కదిలింది. కేంద్ర షిప్పింగ్, పోర్టుల శాఖ కార్యదర్శి సుదాన్‡్షపంత్, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) చైర్మన్ సంజయ్ బందోపాధ్యాయ, సీడబ్య్లూసీ (కేంద్ర జలసంఘం) చైర్మన్ కుశ్వీందర్ వోరా, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈఓ శివ్‌నందన్ కుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి. నారాయణరెడ్డిలతో గురువారం కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ జలమార్గం–4లో పేర్కొన్న క్లాస్–3 ప్రమాణాలతో పోలవరం నావిగేషన్ కెనాల్‌ను అభివృద్ధి చేయాలంటే రూ.876.38 కోట్ల వరకు ఖర్చవుతుందని సమావేశంలో రాష్ట్ర అధికారులు వివరించారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ ప్రకారం ఇప్పటికే నావిగేషన్ కెనాల్, మూడు లాక్‌లు, టన్నెల్ నిర్మాణ పనులు చేపట్టామన్నారు. ప్రస్తుతం చేపట్టిన నావిగేషన్ కెనాల్‌ను చిన్న పడవల రవాణాకు ఉపయోగించుకుని.. దానికి సమాంతరంగా క్లాస్–3 ప్రమాణాలతో మరో నావిగేషన్ కెనాల్ తవ్వి, దాన్ని భారీ నౌకల రవాణాకు వాడుకోవాలని ప్రతిపాదించారు. దీనిపై కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ స్పందిస్తూ.. ఈ ప్రతిపాదనపై అధ్యయనానికి కేంద్ర షిప్పింగ్, ఐడబ్ల్యూఏఐ, సీడబ్ల్యూసీ, పీపీఏ, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో కమిటీ వేస్తామన్నారు. రెండు నెలల్లోగా అధ్యయనం చేసి ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా పోలవరం నావిగేషన్ కెనాల్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అప్పటివరకూ నావిగేషన్ కెనాల్ పనులు ఆపేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. 2016 నుంచి ఉలుకూ పలుకులేని ఐడబ్ల్యూఏఐ నిజానికి.. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులను 2004–05లోనే కేంద్రం ఇచ్చింది. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ మేరకు ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరిపై ఎగువకు, దిగువకు నౌకయానానికి వీలుగా 36.6 మీటర్ల వెడల్పు.. 9.6 మీటర్ల పూర్తి ప్రవాహ లోతు (ఎఫ్ఎస్డీ)తో 1.423 కి.మీల పొడవుతో అప్రోచ్ చానల్.. దానికి కొనసాగింపుగా 40 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల ఎత్తు గేటుతో మూడు నావిగేషన్ లాక్‌లు.. 12 మీటర్ల వెడల్పు, 3.81 మీటర్ల ఎఫ్‌ఎస్‌డీతో 3.84 కి.మీల పొడవున నావిగేషన్ కెనాల్.. 12 మీటర్ల వెడల్పు, 3.66 మీటర్ల ఎఫ్ఎస్డీ, 2.34 మీటర్ల నిలువుతో 890 మీటర్ల పొడవున నావిగేషన్ టన్నెల్ పనులను చేపట్టింది. ఇందులో 2014 నాటికే నావిగేషన్ లాక్‌ల పనులు దాదాపుగా పూర్తిచేసింది. నావిగేషన్ టన్నెల్ పనులు 90 శాతం పూర్తిచేసింది. అలాగే.. ► 2013–14 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన వ్యయం మేరకు నావిగేషన్ కెనాల్ పనుల అంచనా వ్యయం రూ.261.62 కోట్లు. ఇందులో రూ.137.93 కోట్ల విలువైన పనులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేసింది. ► ఈ క్రమంలో 2016లో ఐడబ్ల్యూఏఐ గోదావరి, కృష్ణా నదులను జాతీయ జలమార్గం–4గా ప్రకటించి.. అందులో భాగంగానే ధవళేశ్వరం నుంచి భద్రాచలం స్ట్రెచ్‌ను చేర్చింది. ఈ జలమార్గాన్ని క్లాస్–3 ప్రమాణాలతో చేపట్టాలని నిర్ణయించింది. ► క్లాస్–3 ప్రమాణాలతో పోలవరం నావిగేషన్ కెనాల్‌ను నిర్మించాలంటే.. 1.423 కి.మీల పొడవున అప్రోచ్ ఛానల్‌ను 40 మీటర్ల వెడల్పు, 2.20 ఎఫ్‌ఎస్‌డీతోనూ.. దానికి కొనసాగింపుగా 70 మీటర్ల వెడల్పు, 15 మీటర్ల ఎత్తు గేటుతో మూడు నావిగేషన్ లాక్‌లు.. 40 మీటర్ల వెడల్పు, 2.20 మీటర్ల ఎఫ్‌ఎస్‌డీతో 3.84 కి.మీల పొడవున నావిగేషన్ కెనాల్.. 20 మీటర్ల వెడల్పు, 2.20 మీటర్ల ఎఫ్ఎస్డీ, 7 మీటర్ల నిలువుతో 890 మీటర్ల పొడవున నావిగేషన్ టన్నెల్ పనులను చేపట్టాలి. ► ఈ పనులకు రూ.876.38 కోట్ల వ్యయమవుతుందని.. ఆ మేరకు నిధులు విడుదలచేస్తే పనులు చేపడతామని ఐడబ్ల్యూఏఐకి అనేకమార్లు రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు ప్రతిపాదించారు. కానీ, ఐడబ్ల్యూఏఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. జలాశయం పూర్తవుతుండటంతో.. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పూర్తిచేస్తోంది. ప్రాజెక్టు పూర్తయితే నావిగేషన్ కెనాల్, టన్నెల్ పనులు చేపట్టడం చాలా కష్టం. ఈ నేపథ్యంలోనే కేంద్ర జల్‌శక్తి శాఖ రంగంలోకి దిగింది. జాతీయ జలమార్గం ప్రమాణాలతో పోలవరం నావిగేషన్ పనులను చేపట్టాలని ఐడబ్ల్యూఏఐకు సూచించింది. ఈ క్రమంలోనే గురువారం కేంద్ర జల్‌శక్తి శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేసింది. -
గంగమ్మకే పెద్దమ్మ.. మన కృష్ణమ్మ!.. దేశంలోనే అగ్రగామిగా..
సాక్షి, అమరావతి: దేశంలో నీటి నిల్వ సామర్థ్యం అత్యధికంగా ఉన్న జలాశయాలతో కృష్ణా నది అగ్రగామిగా అవతరించింది. అతి పెద్ద నది అయిన గంగా, రెండో అతి పెద్ద నది అయిన గోదావరి కన్నా నీటి నిల్వ సామర్థ్యం ఉన్న జలాశయాల్లో అగ్రగామిగా కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) రికార్డుల్లోకి ‘కృష్ణా నది చేరింది. దేశంలో హిమాలయ, ద్వీపకల్ప నదులతో పాటు అన్ని నదీ పరివాహక ప్రాంతాల(బేసిన్)లో నిర్మాణం పూర్తయిన జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 9,105.92 టీఎంసీలు. ఇందులో 1,788.99 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లతో కృష్ణా నది ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 589.67 టీఎంసీలు కావడం గమనార్హం. అంటే.. దేశంలో అన్ని బేసిన్లలోని రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం కృష్ణా బేసిన్ రిజర్వాయర్ల సామర్థ్యంలో 19.65 శాతమన్నమాట. అత్యంత దిగువన బ్రహ్మపుత్ర హిమాలయ పర్వతాల్లో హిమానీనదాల్లో జన్మించి దేశంలో ప్రవహించే గంగా నది అతి పెద్దది. గంగా బేసిన్లో ఉన్న జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 1,718.91 టీఎంసీలు. పశ్చిమ కనుమల్లో నాసిక్ వద్ద జన్మించి ద్వీపకల్పంలో ప్రవహించే గోదావరి రెండో అతి పెద్ద నది. ఈ బేసిన్లో రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 1,237.61 టీఎంసీలు. వీటిని పరిశీలిస్తే.. నీటి నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లలో గంగా, గోదావరి కంటే కృష్ణా నదే మిన్న అని స్పష్టమవుతోంది. రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యంలో గంగా, గోదావరి రెండు, మూడు స్థానాల్లో నిలవగా.. దేశంలో పశ్చిమం వైపు ప్రవహించే నర్మదా నది నాలుగో స్థానంలో నిలిచింది. ఇక దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే వర్షఛాయ ప్రాంతంలో పుట్టి, ప్రవహించే పెన్నా బేసిన్లో 239.59 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లున్నాయి. రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యంలో పెన్నా బేసిన్ దేశంలో తొమ్మిదో స్థానంలో నిలవడం గమనార్హం. హిమాలయ నది అయిన బ్రహ్మపుత్ర బేసిన్లో రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 88.65 టీఎంసీలే కావడం గమనార్హం. -
అనుసంధానికి ఆ ఐదు అంశాలే ఆటంకం!
సాక్షి, అమరావతి: రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు సంప్రదింపులు జరపకపోవడం వల్లే గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి, దామన్‌గంగా–పింజాల్, పర్–తాపి–నర్మద సహా దేశంలో ప్రాధాన్య నదుల అనుసంధానం ప్రక్రియలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తేల్చిచెప్పింది. కేవలం ఐదు అంశాలు మాత్రమే దీనికి ప్రధాన కారణమని తేల్చింది. సంప్రదింపుల ద్వారా ఏకాభిప్రాయాన్ని సాధించి.. నదులను అనుసంధానం చేయడం ద్వారా సముద్రంలో కలుస్తున్న జలాలను మళ్లించి దుర్భిక్ష ప్రాంతాల్లో సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని సూచిస్తూ ఇటీవల కేంద్రానికి నివేదిక ఇచ్చింది. దీనిపై కేంద్ర జల్ శక్తి శాఖ స్పందిస్తూ.. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు సంప్రదింపుల ప్రక్రియను వేగవంతం చేశామని.. కెన్–బెట్వా తరహాలోనే మిగతా ప్రాధాన్యత నదుల అనుసంధానం ప్రక్రియను చేపడతామని తెలిపింది. ఎంపీ పర్‌భాత్‌భాయ్ సవాభాయ్ పటేల్ అధ్యక్షతన జల వనరుల విభాగంపై 31 మంది లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బడ్జెట్ కేటాయింపులు, వినియోగం, పనుల ప్రగతిని సమీక్షించి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇటీవల నివేదిక ఇచ్చింది. కెన్–బెట్వా తరహాలోనే చేస్తాం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సుల అమలుపై కేంద్ర జల్‌శక్తి శాఖ సానుకూలంగా స్పందించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మధ్య ఏకాభిప్రాయంతోనే కెన్–బెట్వా నదుల అనుసంధానం చేపట్టామని పేర్కొంది. ఆ నదుల అనుసంధానం తొలి దశ పనులకు 2020–21 ధరల ప్రకారం రూ.44,605 కోట్లు వ్యయం అవుతుందని, ఇందులో 90 శాతం అంటే రూ.39,317 కోట్లు కేంద్రం సమకూర్చుతోందని వెల్లడించింది. మిగతా 10శాతం నిధులను ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు సమకూర్చుతాయంది. ఇదే రీతిలో ప్రాధాన్యత నదుల అనుసంధానం పనులను చేపడతామని హామీ ఇచ్చింది. నివేదికలోని ప్రధానాంశాలివీ.. ► కేంద్రం ప్రాధాన్యతగా ప్రకటించిన గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి, దామన్‌గంగా–పింజాల్, పర్–తాపి–నర్మదా నదుల అనుసంధానానికి ప్రధానంగా ఐదు అంశాలు అడ్డంకిగా మారాయి. ► రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించకపోవడం, ఏకాభిప్రాయ సాధనకు సంప్రదింపులు జరపకపోవడం, నిధుల కొరత, అటవీ పర్యావరణ అనుమతులు, భూసేకరణ–నిర్వాసితులకు పునరావాసం కల్పన అంశాలు నదుల అనుసంధానం ప్రక్రియ ముందుకు సాగకపోవడానికి ప్రధాన కారణాలు. ► ప్రయోజనం పొందే రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించి ఏకాభిప్రాయ సాధనపై కేంద్రం దృష్టి కేంద్రీకరిస్తే నదుల అనుసంధానానికి మార్గం సుగమం అవుతుంది. ► నిధుల్లో సింహభాగం వాటాను కేంద్రం ఇవ్వడం, పన్ను రాయితీలను ఇవ్వడం ద్వారా రాష్ట్రాలను నదుల అనుసంధానానికి ఒప్పించవచ్చు. గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి అనుసంధానంపై పీఠముడి ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీల గోదావరి జలాలను నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా) నదుల్లోకి ఎత్తిపోసి అక్కడి నుంచి గ్రాండ్ ఆనకట్ట(కావేరి)కి తరలించేలా ఎన్‌డబ్ల్యూడీఏ (జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) తొలుత ప్రతిపాదించింది. ఆవిరి నష్టాలు పోనూ మూడు రాష్ట్రాలకు 80 టీఎంసీల చొప్పున ఇచ్చేలా ప్రతిపాదనలో పేర్కొంది. ఈ పనులకు రూ.85 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఈ ప్రతిపాదనపై ఛత్తీస్‌గఢ్, ఏపీ, తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. గోదావరిలో 75 శాతం లభ్యత ఆధారంగా మిగులు జలాలే లేవని.. అలాంటప్పుడు నీటిని ఎలా తరలిస్తారని ఎన్‌డబ్ల్యూడీఏను నిలదీశాయి. దాంతో ఇచ్చంపల్లి నుంచి ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141 టీఎంసీల గోదావరి జలాలను తరలించి ఏపీ, తెలంగాణ, కర్ణాటకలకు 40 టీఎంసీల చొప్పున, కర్ణాటకకు 9.8 టీఎంసీలు ఇచ్చేలా ప్రత్యామ్నాయ ప్రతిపాదనను ఎన్‌డబ్ల్యూడీఏ చేసింది. ఈ పనులకు రూ.45 వేల కోట్ల వ్యయం అవుతుందని లెక్కకట్టింది. దీన్ని కూడా బేసిన్ పరిధిలోని రాష్ట్రాలు వ్యతిరేకించాయి. గోదావరిలో నీటి లభ్యత శాస్త్రీయంగా తేల్చాకే గోదావరి–కావేరి అనుసంధానంపై సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించాలని కేంద్రానికి తేల్చి చెప్పాయి. -
పాత పద్ధతిలోనే కృష్ణా జలాల పంపిణీ
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలను 2022–23 సంవత్సరంలోనూ ఏపీ, తెలంగాణకు పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలని కృష్ణా బోర్డుకు కేంద్ర జల్ శక్తి శాఖ తేల్చిచెప్పింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో పాత విధానంలోనే నీటి పంపిణీకి అంగీకరించిన తెలంగాణ సర్కారు.. ఆ తర్వాత అడ్డం తిరిగి సగం వాటా కావాలని డిమాండ్ చేయడంతో కేంద్ర జల్ శక్తి శాఖ ఈ స్పష్టతనిచ్చింది. 2015 జూన్ 19న రెండు రాష్ట్రాల అంగీకారంతో ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలు పంపిణీ చేసేలా తాత్కాలిక సర్దుబాటు చేశామని పేర్కొంది. 2016–17లో ఇదే విధానానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయని తెలిపింది. 2017 నుంచి 2022 వరకు ఇదే విధానంలో నీటిని వినియోగించుకున్నాయని గుర్తు చేసింది. ఈ నీటి సంవత్సరంలోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలని పేర్కొంది. ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసే వరకూ ఈ విధానంలోనే రెండు రాష్ట్రాలకు జలాలను పంపిణీ చేయాలని కృష్ణా బోర్డుకు కేంద్ర జల్ శక్తి శాఖ స్పష్టం చేసినట్లు బోర్డు అధికారవర్గాలు తెలిపాయి. -
పోలవరం పరిహారం నేరుగా నిర్వాసితులకే
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలకు పరిహారం నేరుగా వారికే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది. వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ ప్రశ్నకు జలశక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ గురువారం లోక్‌సభలో ఈ మేరకు సమా«దానమిచ్చారు. 2016లో కేంద్ర ఆర్థిక శాఖ ఆఫీస్ మెమోరాండం 1.4.2014 నాటి ధరలకే ఇరిగేషన్ కాంపొనెంట్ మిగతా మొత్తం ఇవ్వాలని చెబుతోందన్నారు. ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం చేసిన ఖర్చులను రీయింబర్స్ చేస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 2014 నుంచి డిసెంబర్ 2022 వరకు ఏపీ సర్కారు రూ.3,779.5 కోట్లు రీయింబర్స్ చేయాలని బిల్లులిచ్చిందని దీని నిమిత్తం రూ.3,431. 59 కోట్లు రీయింబర్స్ చేశామన్నారు. 2014 నుంచి 2022 వరకూ ఆర్‌అండ్‌ఆర్‌కు ఇచ్చిన రూ.2,267.29 కోట్ల బిల్లుకుగాను రూ.2,110.23 కోట్లు రీయింబర్స్ చేశామన్నారు. పాత ప్రాజెక్టుల పునరుద్ధరణ ప్రతిపాదనల్లేవు పాత ప్రాజెక్టుల విస్తరణ, ఆధునీకరణ, పునరుద్ధరణల నిమిత్తం ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు లేవని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీకి ఐదు సోలార్ ప్రాజెక్టుల అనుమతి 4,100 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఐదు సోలార్ పార్కులు ఏపీకి అనుమతించామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీలు వల్లభనేని బాలశౌరి, మాగుంట శ్రీనివాసులురెడ్డిల ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. స్మార్ట్ సిటీ అడ్వైజరీ ఫోరంలో స్థానిక యువత స్మార్ట్ సిటీ మిషన్ నిబంధనల మేరకు స్మార్ట్ సిటీ అడ్వైజరీ ఫోరంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ మేయర్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ల ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు ఇతర భాగస్వాములతోపాటు స్థానిక యువత ఉంటారని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీలు పోచ బ్రహ్మానందరెడ్డి, గురుమూర్తిల ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. కాగా, విశాఖ మెట్రో నిమిత్తం 42.55 కి.మీ పొడవున రూ.8,300 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ ప్రభుత్వం 2018లో ప్రతిపాదన ఇచ్చిందని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ తెలిపారు. ఈ మొత్తం కొరియాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ఆర్థిక సాయం చేస్తుందని అప్పుడు ఏపీ ప్రభుత్వం తెలిపిందని.. కానీ ఆ తర్వాత కొరియా బ్యాంకు సాయానికి నిరాకరించిందని వైఎస్సార్సీపీ ఎంపీలు బీవీ సత్యవతి, ఎంవీవీ సత్యనారా యణల ప్రశ్నకు జవాబిచ్చారు. విశాఖ మెట్రోకు సంబంధించి అధ్యయనం నిమిత్తం కేంద్రం రూ.3.5 కోట్లు విడుదల చేసిందన్నారు.